సాగిపోతూ ఉంది ఈజనసందోహం
విషాదాల వరదల్లోంచి సాగిపోతూనే ఉంది
సాగిపోతూ ఉంది ఈ జనసందోహం
కష్టాల నిప్పుటెండల్లోంచి సాగిపోతూనే ఉంది
సాగిపోతూ ఉంది ఈ జనసందోహం
ఆనందాల స్వాతిచినుకుల్లోంచి సాగిపోతూనే ఉంది
నిరంతరయానంలా చీకటివెలుగుల గమనికలా
సాగిపోతూనే ఉంది ఈ జనసందోహం
సాగిపోతూనే ఉంది చీకటివెలుగుల గమనికలా
ఈ జనసందోహం నిరంతరయానంలా
సాగిపోతూనే ఉంది ఈ జనసందోహం
నదుల్లో నీళ్ళాగిపోయాయి
చెరువుల్లో నీళ్ళెండిపోయాయి
బావుల్లో నీళ్ళోట్టిపోయాయి
చెలమల్లో నీళ్ళుడిగిపోయాయి
వేడికి ఒంగిన ఇనపపెనంలా ఆకాశం
రెల్లుపువ్వులా పాలిపోయిన చెమ్మలేని మేఘాలు
వేడెక్కిన అభ్రకపు మేలిముసుగేసుకున్న కొండలు
భూమి లోంచి మొలుచుకొచ్చిన అస్థిపంజరాల్లా ఆకుల్లేని చెట్లు
దుమ్ముకొట్టుకుపోయిన నిప్పుబంతిలా భూగోళం
మొక్కలకి నీళ్ళు లేవు
స్నానాలకి నీళ్ళు లేవు
తాగటానికి నీళ్ళు లేవు
డబ్బుక్కూడా నీళ్ళు లేవు
రేయింబవళ్ళు నల్లనితెల్లని సెగలపొగలు
ఈ వేడికి
అయ్యో పాపం సూర్యుడు కూడా
మైనంముద్దలా కరిగివుడికిపోయాడు
పెదాలైనా తడిచెయ్యలేని పొడినాలుకలు
చెట్లమోడుల్లాంటి కళ్ళచూపులు
అగ్నిసరస్సులు ఆవిరయ్యి
ఆ ఆవిరి గాలయ్యి
ఆ గాలి వడగాడ్పయ్యి
దారి పక్క చెట్ల కింద
స్పృహతప్పిన శ్వాసాగిన మనుషులు
దాహం
సెగసెగగా దాహం
పైకెగిసిన మంటలకొసల్లా దాహం
రెక్కలు కదపలేని పక్షుల గొంతుల్లో దాహం
దుమ్మురంగు పచ్చికబయలు నిండా దాహం
పంటల్లేవు
పనుల్లేవు
తిండిగింజల్లేవు
ఇంకా నాలుగు రోజులిలాగే ఉంటే
తిండిగింజల అవసరమూ ఉండదు
నీళ్ళులేక తిండిలేక
నీళ్ళూతిండీ లేక చచ్చిపోయిన
పశువుల కళేబరాలు
కుళ్ళటాని క్కూడా చెమ్మలేక
ఎండిపోయిన కళేబరాలు
ఎండిపోయాయి
మొక్కలెండిపోయాయి
పశువులెండిపోయాయి
శరీరాలెండిపోయాయి
మనసులెండిపోయాయి
ఒక్క గుక్కెడు నీళ్ళు
గొంతు తడుపుకోను
ఒక్క గుక్కెడు నీళ్ళు
సహారా ఎడారి
ఒంటరి ఒంటె కడుపులోంచైనా
నాలుగు నీటిబొట్లు తెండి
దేవతలారా రాక్షసులారా
నాలుగు కన్నీటిబొట్లైనా రాల్చండి
నూనెలో ఊరిన నీలం కంబళిలా
మత్తుగా మందంగా బరువుగా ఆకాశం
తేమగా బరువుగా బలంగా సుడులు తిరిగే మేఘాలు
తెల్లలోహపు కొరాడాల్లాంటి మెరుపులు
మృత్యురథచక్రాల్లా డబడబా దొర్లుతున్నట్లు ఉరుములు
సూర్యగోళాలు చిట్లి దభీమని కిందకి పడుతున్నట్లు పిడుగులు
నింగి నుంచీ నేలకి
బలంగా బరువుగా వర్షపుధారలు
ధారాపాతంగా వర్షపుధారల వర్షం
శిలాగర్భంలో క్కూడా చొరబడగల ధారాపాతం
నింగినీ నేలనీ చుట్టేసే గాలి
మహావృక్షాల్ని కూకటివేళ్ళతో పెకిలించే పెనుగాలి
ఆకాశంలోకీ భూగర్భంలోకీ విస్తరించిన భవనాలను కూల్చే పెనుగాలి
రాత్రీపగలూ పగలూరాత్రీ
ధారలుధారలుగా వర్షపుధార
తెరలుతెరలుగా గాలివేగం
రాత్రీ చీకటి పగలూ చీకటి
అటు వరద ఇటు ఉప్పెన
వానాగాలీ గాలీవానా
హోరు తుఫాను హోరు
కూలిపోతున్న ఇళ్ళూ చెట్లూ
కొట్టుకుపోతున్న పశువులూ మనుషులూ
పైరులూపంటలూ ఊళ్ళూవాడలూ
సమస్తమూ
కొట్టుకుపోయి తుడిచిపెట్టుకుపోతున్నాయి
నీటిగాలిలో పిచ్చెక్కిన నీటిగాలిలో
గాలినీటిలో పిచ్చెక్కిన గాలినీటిలో
ఈ వానకి
అయ్యో పాపం సూర్యుడు కూడా
పిండిముద్దలా తడిసిచీకిపోయాడు
ఇంతాచేసి ఎంతసేపు
ముప్పూటలు
ఉప్పెనవరద వరద ఉప్పెన
ముప్ఫయ్యేళ్ళ దాకా కోలుకోకుండా
చావుదెబ్బ కొట్టి
గాలి వెళ్ళిపోయింది
వానా వెళ్ళిపోయింది
ఆ గాలీవానల గుర్తుగా
నీళ్ళున్నాయి
పడిపోయిన ఇళ్ళున్నాయి
పర్వతాల మీద నీళ్ళు
నదుల్లో నీళ్ళు కాలవల్లో నీళ్ళు
బావుల్లో నీళ్ళు చెరువుల్లో నీళ్ళు
వీధుల్లో నీళ్ళు ఇళ్ళల్లో నీళ్ళు
నీళ్ళలో పర్వతాలు
నీళ్ళలో నదులు నీళ్ళలో కాల్వలు
నీళ్ళలో బావులు నీళ్ళలో చెరువులు
నీళ్ళలో వీధులు నీళ్ళలో ఇళ్ళు
నీళ్ళలో నీళ్ళు నీళ్ళేనీళ్ళు
కానీ
తాగటానికి
కనీసం పుక్కిలించటానికి
పనికిరాని నీళ్ళు
కళ్ళునీళ్ళు చుప్పనాతి కుళ్ళునీళ్ళు
నీళ్ళలో నానిన చీకిన పంటధాన్యాల రాసులు
నీళ్ళలో నానిన కుళ్ళిన కళేబరాల గుట్టలు
నీళ్ళలో నానిన కుళ్ళిన శవాల దొంతరలు
ముట్టుకుంటే కుష్టు వొళ్ళులా ఊడొచ్చే ఉబ్బిన కుళ్ళిన కండరాలు
ముక్కుపుటాలను బద్దలగొట్టే
హృదయాన్ని పిండిపిప్పిచేసే
భయానక వికారం వాసన
చెదిరిపోయిన సంసారాలు
మొగుడుంటే పెళ్ళాంలేదు
పెళ్ళాం ఉంటే మొగుడులేడు
ఇద్దరూ ఉంటే పిల్లల్లేరు
పిల్లలుంటే తల్లితండ్రుల్లేరు
తినటానికి
చీకిన కుళ్ళిన తిండిగింజలు
తాగటానికి
చెత్తాచెదారపు కలరానీళ్ళు
ఇళ్ళులేవు సామానుల్లేవు
కూరల్లేవు బట్టల్లేవు
నోట్లులేవు రోడ్లులేవు
చెట్లులేవు వంతెనల్లేవు
పశువుల్లేవు పనిముట్లులేవు
మరేమున్నాయి
నీళ్ళున్నాయి
చెత్తాచెదారపు కలరానీళ్ళు
ఈనీళ్ళని ఆకాశంలోకి మళ్ళించండి
ఈ నీళ్ళను సముద్రంలోకి మళ్ళించండి
ఈ నీళ్ళను నిప్పుల్లోకి ఎండబెట్టండి
దేవతలారా రాక్షసులారా చాతైతే
ఈ నీళ్ళను ఔపాసన పట్టండి
ఎప్పుడన్నా అప్పుడప్పుడు
సమంగా ఉండే ఎండావానలకి
ఈ జీవితాలు తెప్పరిల్లుతూ ఉంటాయి
సాగిపోతూ ఉంది ఈజనసందోహం
విషాదాల వరదల్లోంచి సాగిపోతూనే ఉంది
సాగిపోతూ ఉంది ఈ జనసందోహం
కష్టాల నిప్పుటెండల్లోంచి సాగిపోతూనే ఉంది
సాగిపోతూ ఉంది ఈ జనసందోహం
ఆనందాల స్వాతిచినుకుల్లోంచి సాగిపోతూనే ఉంది
నిరంతరయానంలా చీకటివెలుగుల గమనికలా
సాగిపోతూనే ఉంది ఈ జనసందోహం
సాగిపోతూనే ఉంది చీకటివెలుగుల గమనికలా
ఈ జనసందోహం నిరంతరయానంలా
సాగిపోతూనే ఉంది ఈ జనసందోహం