శిశిర గీతం

అన్నీ రాల్చి
మధ్యాన్న వృక్షాలు
వేళ్ళకొమ్మలతో
అలవోకగా
నల్లబడని నీడలను
సమర్పించుకొంటాయి
వేసారని సూర్యునికి
నన్నే అనుకరిస్తూ

గుబురు తగ్గని చెట్లు
ఖాళీ పాత్రల్లా
ఆకాశాన్ని ప్రశ్నిస్తాయి
నా కవితల్లా

(శ్వాస లా
ప్రాస నన్ను
మోసగిస్తుందా)

ఆవరిస్తుందిఎండ
అవలీలగా
పలుచని పలుకరింపు
వెలుతురులో

అద్దంలో కనిపించే
పెద్ద కొమ్మలు
నా ప్రతిబింబమే
అపరిచితమా?

దువ్వెనలో చిక్కిన వెంట్రుక
దుఃఖం ,దురపిల్లుతాను!!

కుంటి సాలీడు
ఒంటి చేతితో
చేదుకొంటోంది
వేదనగా దారాన్ని

ఆవాలు జల్లినట్టు
కువకువమని…
నీడలను వెంటబెట్టుకొని
దాడికి బయల్దేరిన పిట్టలు

అలసట ,ఆకలితో
కలసిన వెన్నెల తావులు
బలిసిన పున్నమి ఆవులు
అలవాటు మైదానాల్లో

అన్నీ వదిలిన రూపం
సన్నిపాత జ్వరం
ఓదార్పు,ఉపశమనం
ఎదురు చూసిన క్షణం

ఆగాలికి ఎగిరిన రెక్క
దాగిన వంకీ స్వరం

పసుపు శిశిరం
బోదె,నల్లని బెరడు
ఏదో పక్షి అరుపు

శుష్కించిన దేహం
స్థూలంగా మోహం
శూలంలో లోహం!

కళేబరాన్ని నిలదీసే
కళంకారీ కోరిక
తామర తూడులా
తేమగా తేలుతూ..

అసహ్యం
విమానాన్ని
విసర్జించాను
నమూనాని..

సగం కాలిన
సిగరెట్‌చివరినిప్పు
తగరం చప్పుడుతో
పగబట్టిన అలోచనలు

కొనగోట
కనుగీటి
మొనదేలి
మృత్యువు

ఎండిన ఆకు
గుండెను చుట్టుకొని
ఎడబాటు
ఒక కన్నీటి చుక్క
ఎకరాలను
తడుపుతుంది!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...