బహుశా ఇంకో నిజం

(కన్నెగంటి చంద్రశేఖర్‌ డల్లాస్‌ వాసులు. కవిగా, కథకుడిగా అందరికీ చిరపరిచితులు. కొత్త తీరాల్లో సరికొత్త ద్వారాలు తెరుస్తున్నారు తన రచనల్తో!)

“మంచి సినిమా వస్తుంది ఇవాళ చూడవా?”
తిని, ప్లేట్‌ కడిగి వాషర్‌ లో పడేసి లైబ్రరీ రూంకేసి పోబోతుంటే అడిగింది వసు.
“ఇప్పుడే వస్తా.. కాస్త మెయిల్‌ చెక్‌ చేసుకుని..”
“రోజూ అంతే చెప్తావు.సరే పో నీ ఇష్టం” నిష్టూరంగా అంది.
“ఇవాళ అట్లా కాదు.. చూస్తావుగా! ఇప్పుడే వచ్చేస్తా!”
అంత ఆగలేకపోయేంత ఇదేం లేదు..అయినా ఒకసారి మెయిల్‌ చూసుకునొస్తే అదో తృప్తి.
రెణ్ణిమషాల్లో కంప్యూటర్‌ ఆన్‌ కావటం, మరో నిముషంలో గరగర శబ్దాలూ, ఊళలూ వేసుకుంటూ మోడెం తో ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ కావటం.. అదో గొప్ప సంగీతంలా..మరో ప్రపంచం.. మాయాప్రపంచంలోకి ఓపెన్‌ సెసేం..మహాద్వారం..కాదూ దొడ్డిదారి తెరుచుకుంది. హోంపేజి నుంచి ఇంకో వెబ్‌ సైట్‌ నుంచి ఇంకో సైట్‌కు.. దీనికి మొదలెక్కడో చివరెక్కడో కూడా తెలీదు. తీగలు తీగలుగా అల్లుకుని..ఇదో పెద్ద వల.. వల వేయడం ఎలా? వశపర్చుకోవడం ఎలా? వదిలించుకోవడం ఎలా? వదలదు.. ఇదో ఊబి..నెమ్మదిగా తెలీకుండానే.. తెలిసీ సుఖంగా మెత్తగా కూరుకుపోతూనో.. వదలటం ఎలా?
ఇదో స్వేచ్ఛాప్రపంచం.. క్లిక్‌.క్లిక్‌. అన్నీ తలుపులు లేని వాకిళ్ళే.. రండి.. మాయింటికి రండి అంటూ సమ్మోహనపరుస్తూ.. ఇదిగో నేను.. ఇవి మావాళ్ళ ఫొటోలు.. ఇదీ నాజీవితం.. అన్నీ తెరిచిన పుస్తకాలే.. ఒక విచ్చలవిడి నిర్మొహమాటం.. కాస్త సంతకం చేసిపోదురూ.. ఇంకా ఏం కావాలి మీకు.. ఏదైయినా చిటికెలో తెర మీద ప్రత్యక్షం..
నాలుగు చోట్ల ఈ మెయిల్‌ ఎకౌంట్లు.. ఒకోటీ ఒక్కో పేరుతో.. ఒక్కో పర్పస్‌ కోసం.. ఎన్ని రకాల జీవితాలు గడిపేయొచ్చిక్కడ? కొత్త మెయిలేం లేదు.. వచ్చిందంతా జంక్‌. ఏదో పోర్నో సైట్‌ నుంచి ఆహ్వానమూ.. ఏదో బిజినెస్‌ అయిడియా.. ఇంకో చెయిన్‌ ఉత్తరమూ..
తర్వాత వార్తల సైట్లు.. అన్నీ మామూలు గొడవలే.. రాజకీయాలూ, ఆరోపణలూ, హత్యలూ, సమ్మెలూ, అవినీతీ అన్నీ యథాతథం. వీటన్నిటి మధ్యా మెరిసే వొళ్ళూ కళ్ళతో సినిమా తారలూ.. ఈ కబుర్లే నయం కాస్త రసవత్తరంగా ఉంటాయి..
“సినిమా అయిపోయింది. నేను పడుకుంటున్నాను, నువు రావా?” వసు మళ్ళీ. అప్పుడేనా?
“సర్లే నువు పడుకో వస్తున్నాగా!”
“నిదర్రావడం లేదా?”
“రేపు ఆదివారమేగా, ఫర్లేదులే!”
ఒక నిట్టూర్పుతో వెళ్ళి పోయింది. హమ్మయ్య.. ఇంకా నయం ఇవాళ ఏం గొడవ పెట్టుకోలేదు. కాసేపు కంప్యూటర్‌ ముందు కూచుంటే కొంపలేవో కూలిపోతున్నట్టు.
ఫ్రిజ్‌లో బీరుందా? నాలుగు డబ్బాలు.. ఈ రాత్రికి చాలు!
ఇంకా కొత్త సినిమాలేం వొస్తున్నాయో.. ఏది బాగా ఆడుతుందో ఇప్పుడు..ఏమిటో ఇంత దూరంగా ఉండీ అక్కడి విషయాల మీద ఎందుకింత ఆసక్తి? అవును.. వచ్చేవారం ఏదయినా ఇంటర్నెట్‌ కంపెనీ IPO కి వెళుతుందా? ఏ కంపెనీల ఎర్నింగ్స్‌ రిపోర్స్ట్‌ రాబోతున్నాయి? ప్చ్‌ పెద్ద ఉత్సాహజనకంగా ఏం లేవు. అసలిదంతా చెత్త.. రంగం ఇది కాదు.. గమ్యం ఛాట్‌ రూమే!
బీర్‌ చల్లగా గొంతు దిగుతోంది. ఇదీ మజా అంటే.
అవును ఇవాళ ఏం అవతారం ఎత్తాలి.. ప్రిన్స్‌ అవును, బావుంది..లాగిన్‌ అయి చూస్తే అప్పటికే జనం క్రిక్కిరిసి ఉన్నారు.. దాదాపు ఇరవై మంది దాకా.
“హలో ప్రిన్స్‌ మామా!” సన్నీ.
“హలో సన్నీ మామా!
“ఎక్కణ్ణుంచి?”
అవునెక్కణ్ణుంచి ఇవాళ? “న్యూ యార్క్‌.. మరి నువ్వో?”
“హైడ్‌. ”
గదిలో ఉన్న వాళ్ళ పేర్ల లిస్ట్‌ కుడివైపు ఉంది. అపర్ణ, అరుణ్‌, డ్రీమర్‌, కిరణ్‌, న్యూబీ, పోకీమన్‌, స్టడ్‌ ఇంకా ఎవరెవరో..తెలిసిన పేర్లేం లేవు. తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఏం లేరు. పేర్లు మార్చుకునైనా ఉండొచ్చు.. చెప్పలేం..
“అపర్ణా నాతో మాట్లాడవా?” స్టడ్‌.
“హాయ్‌ కిరణ్‌”
“హాయ్‌ ప్రిన్స్‌ నువు తెలుసా నాకు?” కిరణ్‌.
“బహుశా!”
“ఏ రాజ్యానికి ప్రిన్స్‌వి నువ్వు?” అరుణ్‌.
“సైబర్‌ రాజ్యానికి ;)”
“సిస్కో కిడ్‌ వా నువ్వు?” కిరణ్‌.
“కాదులే!”
ఎవడో వచ్చి చేరాడు..చిరు.
“చిరంజీవి ఫానువా నువ్వు?” కిరణ్‌.
“నువ్వు భలే తెలివైనవాడివిలే!” చిరు.
“ముసలాడయ్యేడు వదిలిపెట్టెయ్‌ చిరూని!” కిరణ్‌.
“రేయ్‌. చిరూని ఒక్క మాటన్నావంటేనా?” చిరు.
“ఇక్కడెవరయినా అమ్మాయిలున్నారా?” లవర్‌ బాయ్‌.
“ప్రీతి వచ్చిందా ఇవాళ?” సన్నీ.
“ఇక్కడ నాతో ప్రైవేట్‌ గా మాట్లాడే అమ్మాయిలెవరైనా ఉన్నారా?” లవెర్‌ బాయ్‌.
“నాలుగ్గంటల్నించీ ఇక్కడే ఉన్నా..ఇంతవరకూ రాలేదు” పొకేమన్‌.
“ఓ పోకీ..నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఇదే నీ పర్మనెంట్‌ ఎడ్రసా?” సన్నీ.
“ఇంతకీ ప్రీతి ఎవరు?” డ్రీమర్‌.
“నా ఆన్‌లైన్‌ గర్ల్‌ ఫ్రండ్‌ తనొస్తే నేను హాయ్‌ చెప్పానని చెప్పరా ప్లీజ్‌ ”
” అట్లాగే!” పోకేమన్‌.
“చాయ్‌.చాయ్‌.చాయ్‌.గర్మాగరం చాయ్‌” చాయ్‌వాలా.
“ఒక స్పెషల్‌ కొట్టవోయ్‌ ఇటు” అరుణ్‌.
“నిన్న డబ్బులెగ్గొట్టావు. లేవు పో!” చాయ్‌వాలా.
“నేను సారీ చెప్పినట్టు కూడా చెప్తావా పోకీ?” సన్నీ.
“ఏమిటి కథ?” పోకేమన్‌.
“మీరంతా ఇక్కడికి రెగ్యులర్‌గా వస్తుంటారా గురువులూ?” న్యూబీ.
“ప్రీతి స్టుపిడ్‌. దాని సంగతి మర్చిపో సన్నీ!” ఆపిల్‌ సింగ్‌.
“ఏయ్‌ నాప్రీతినేం అనొద్దు. నాదే తప్పు. నేనే తనకి కోపం తెప్పించాను!” సన్నీ.
“అవున్నిజమే. ప్రీతి మంచి పిల్లే.. చక్కటిదో కాదో నాకు తెలీదు కానీ :)”
వేళ్ళు కీస్‌ మీద చకచక కదలాలి. ఆలోచించే వ్యవధీ ఉండదు.
“థాంక్స్‌ ప్రిన్స్‌ తను చక్కటిది కూడా. నాకో ఫొటో స్కాన్‌ చేసి పంపింది” సన్నీ.
ప్రయివేట్‌ మెస్సేజ్‌ విండో తెరుచుకుంది. “హలో” అంటూ ఆపిల్‌సింగ్‌. వీడికి నాతో ఏం పని. ప్రొఫైల్‌ తెరిచి చూస్తే పెద్ద విశేషాలేం లేవు. ఇండియానించి అని మాత్రం తెలుస్తుంది. సరే చూద్దాం!
“హలో!”
“నేను ప్రీతిని. సన్నీని ఏడిపించటానికి ఇట్లా వచ్చా!”
“అవునా? lol !”
” lol ”
“అయినా పాపం ఎందుకూ?”
” ఏదో గొడవ..నన్నేడిపించాడు నిన్న. ఇప్పుడు తమాషా పట్టిస్తా చూడు”
“ఓకే”
“బై!”
వెళ్ళిపోయింది. విండో మూసేసి మెయిన్‌ విండో లోకి..
“ప్రీతి అసలు అమ్మాయే కాదు.. వాడి పేరు నవీన్‌” ఆపిల్‌సింగ్‌.
“నీ మొహం..నాకు ఫొటో పంపింది మొర్రో అంటుంటే!” సన్నీ.
“ఆ ఫొటో ఎవరిది పంపాడో.. నాకు వాడు తెలుసు, అడ్రస్‌ కావాలా?” ఆపిల్‌సింగ్‌.
“ఆపిల్‌ చెప్పేది నిజమే సన్నీ! ఇంకెవరో కూడా అన్నారు ఇంతకు మునుపు”
“ఏయ్‌ ప్రిన్స్‌ నువ్వు కూడా మొదలెట్టావూ.. నేను నీకు తెలుసా?” సన్నీ.
“తెలుసో లేదో తెలీదు”
“నేనెప్పుడూ సన్నీనే. నువ్వో?” సన్నీ.
“నేనప్పుడప్పుడూ సన్నీని 🙂 ”
” lol ప్రిన్స్‌” సన్నీ.
” lol అంటే ఏమిటో చెప్పరా?” న్యూబీ.
“లాఫింగ్‌ అవుట్‌ లౌడ్‌” ఆపిల్‌సింగ్‌.
“థాంక్స్‌ ఆపిల్‌” న్యూబీ.
“ఏయ్‌ పోకీ నిన్నేమిటి అందర్నీ తిక్కతిక్కగా తిడుతున్నావు?” హీరో.
“నేనా.. నిన్నసలు నేను లాగిన్‌ చేయందే?” పోకేమన్‌.
“నిన్న అందరి మూడూ ఖరాబు చేసిందెవరు?” హీరో.
“నేను కాదు భాయ్‌ ఎవడో నాపేరు చెడగొట్టాలని చూస్తున్నట్లుంది 🙁 ” పోకేమన్‌.
“నీకేదో అంత మంచిపేరున్నట్లు 🙂 ” సన్నీ.
“ప్రీతి పెద్ద ఫూల్‌. వదిలిపెట్టెయ్‌ సన్నీ” ఆపిల్‌సింగ్‌.
“నీకేమిటి అంత బాధ.. నువ్వెగరేసుకుపోదామనే?” సన్నీ.
” lol ఆపిల్‌”
” lol ప్రిన్స్‌” ఆపిల్‌సింగ్‌.
“నేను వెళ్ళిపోతున్నా.. పోకీ ప్రీతికి చెప్పటం మర్చిపోవద్దేం?” సన్నీ.
“తప్పకుండా.. బై!” పోకేమన్‌.
“ఇక్కడెవరైనా అమ్మయిలున్నారా?” స్టడ్‌.
వీడొదల్డు. అయినా ముసుగులన్నీ తీసుకుని ఎంత నిర్మొహమాటంగా అడిగేస్తున్నాడు! ఎవరూ తనను గుర్తించలేరన్న తెగింపు. ఇది సరికొత్త ముసుగు.
“ఏదన్న పోర్న్‌ సైటుకు పోరాదూ? ఇదేమన్నా బ్రోతల్‌ హౌసనుకున్నావా స్టడ్‌?”
“కాదా? I had cybersex three times last week at thaays site! ” స్టడ్‌.
వీడి మొహం.. అప్పటికి వీడొక్కడికే ఆ ఛాన్స్‌ దక్కినట్లు..
“దానికి మార్గం ఇది కాదు”
“అంతా బోర్‌. ఎవరైనా అంత్యాక్షరి ఆడటానికి రెడీయా?” అరుణ్‌.
“హై!” వీనస్‌.
“హై వీనస్‌ a/s/l ?” స్టడ్‌.
“హై వీనస్‌!”
“హై వీనస్‌!” పోకేమన్‌.
ఒక్క అమ్మాయొస్తే చాలు అందరూ హై హైలే.
“వీనస్‌ a/s/l please ?” స్టడ్‌.
“ఈ a/s/l అంటే ఏమిటో చెప్పరా? ముందే థాంక్స్‌ “న్యూబీ.
” age/sex/location. ఈ పొడిమాటలకు అర్థాలూ, రకరకాల స్మైలీల గురించీ వివరించే వెబ్‌ సైట్‌ ఉంది వెతుక్కో ” పోకేమన్‌.
“99/l²¨*t±vp²d+ :-)” అరుణ్‌.
” lol అరుణ్‌” వీనస్‌.
“వీనస్‌ a/s/l please ?” స్టడ్‌.
“వీనస్‌ a/s/l please ?” స్టడ్‌.
“వీనస్‌ a/s/l please ?” స్టడ్‌.
“వీనస్‌ a/s/l please ?” స్టడ్‌.
“ఏయ్‌ స్టడ్‌. ఈ ఫ్లడింగ్‌ ఆపుతావా?” చిరు.
“నీ సొమ్మేం పోయింది? నోర్మూసుకో బే!” స్టడ్‌.
“రఫ్ఫాడిస్తానొరేయ్‌! mannerless brute !” చిరు.
“మరి నిన్న రాత్రి నీ చెల్లి చాలా మెచ్చుకుంది కదరా బామ్మర్దీ నన్ను?” స్టడ్‌.
“లంజాకొడకా! మాటలు సరిగ్గా రానీ!” చిరు.
“లైట్‌ తీసుకో చిరూ! వాణ్ణి ignore చెయ్యి” పోకేమన్‌.
“నిన్నంటే నువ్వూరుకుంటావేమిటీ?” చిరు.
“చల్లబడు చిరూ.. ignore చేయటమంటే కుడివైపు లిస్ట్‌ లో వాడి పేరు సెలక్ట్‌ చేసుకుని కింద ignore అన్న బటన్‌ నొక్కు. వాడి మెస్సేజ్‌లు నీకింక కనపడవు.” పొకేమన్‌.
“థాంక్స్‌ పోకీ! అయినా వాడి అంతు చూసిందాకా నేను వదలను!”
ఇద్దరూ ఇప్పుడు బూతుల పురాణం విప్పుతారు. ఇద్దర్నీ ignore చేయడం ఉత్తమం.
ప్రయివేట్‌ మెస్సేజ్‌ విండో మళ్ళీ తెరుచుకుంది. “హలో!” అంటూ డెడ్‌మేన్‌వాకింగ్‌. రోజూ చూసే పేరే.
“హలో! ఎలా ఉన్నావు?”
“అంత బాగాలేను” డెడ్‌మేన్‌వాకింగ్‌.
“ఏమయింది?”
“నా లవర్‌కి నిన్నరాత్రే పెళ్ళయింది”
“సారీ!”
“ఇవాళ సూయిసైడ్‌ చేసుకుందామనుకుంటున్నా”
“ఛ! అట్లాంటి పిచ్చి పని చేయకు!”
“నాకెంత దుఃఖంగా ఉందో చెప్పలేను”
“కొంతకాలం గడిస్తే అంతా సర్దుకుంటుంది. తొందరపడకు”
“అంతేనంటావా? నా ప్రేమ అంత చవకరకందంటావా?”
“ఇంకో అమ్మాయి దొరక్కపోదు. ఇంతకీ ఈ అమ్మాయెవరు.. నీ క్లాస్‌మేటా?”
“కాదు.. కస్తూరి”
“ఏ కస్తూరి?”
“సినిమా నటి!”
తలమాసిన వెధవ .. టైం వేస్ట్‌ గాడు.
“దొరికావులే!.. lol..lol.. సారీ ఊరికే సరదాకి.. ప్రేమా నా మొహమా? ఎగ్జామ్స్‌కి చదివీ చదివీ బోర్‌ కొట్టి ఇటు వచ్చా.. చిన్న గేం ఆడదామని బుద్ధి పుట్టి..”
“స్టుపిడ్‌”
విసుగ్గా విండో మూసి మెయిన్‌ రూమ్‌లోకి.
“ఇవాళ పొద్దున్నే యాక్సిడెంట్‌. కారు టోటలయ్యింది. ఏదో బతికిబయటపడ్డా” కంగారూ.
“అయ్యో పాపం కంగారూ! ఇవిగో hugs , అంతా చక్కబడుతుందిలే” వీనస్‌.
“వీనస్‌ నాకు లాస్టియర్‌ యాక్సిడెంటయింది. నాకివ్వవా హగ్‌?” శ్రీ.
“వీనస్‌ నాకేమయితే ముద్దిస్తావు 😉 ” కనిష్క.
“లింగమార్పిడి ఆపరేషనయ్యాక కనిపించు 🙂 ” వీనస్‌.
” lol వీనస్‌!” భలే దెబ్బ తీసింది.
” lol ప్రిన్స్‌” వీనస్‌
మళ్ళీ ప్రయివేట్‌ మెస్సేజ్‌. డెడ్‌మేన్‌వాకింగ్‌.
“మళ్ళీ ఏమిటి?”
“సారీ.. ఇందాక నేను చెప్పింది అబద్ధం!”
“చెప్పావుగా!”
“అది కాదు.. నా లవర్‌కి నిజంగానే పెళ్ళి. కస్తూరి కాదు కస్తూరిలా ఉంటుంది కావేరి.. నా క్లాస్‌మేట్‌. నాకేడుపొస్తుంది”
“ఏడ్చెయ్‌. అదే మంచిది. మరిందాక అట్లా ఎందుకు చెప్పావ్‌”
“నీ ముందు ఎక్కడ చులకనవుతానోననీ..నీ జాలి భరించలేక..”
“ఏమో ఏది నమ్మాలో నాకు తెలీటం లేదు.. నిజమే అయితే మనసు తీరా ఏడువు..”
“నా బాధ ఎవరితోటయినా చెప్పుకుందామని వొచ్చానిక్కడికి”
“నాకు తెలీదు నన్నొదిలెయ్‌”
“భలే తెలివయినవాడివిలే మామా నువ్వు? ఈసారి మళ్ళీ బుట్టలో పడతావనుకున్నా!”
చటుక్కున విండో మూసి మెయిన్‌ విండోలో..
“డెడ్‌మేన్‌వాకింగ్‌ పెద్ద అబద్ధాలకోరు. అతని మాటలు నమ్మకండి”
ఏం రోగం వీడికివాళ?
“ఏం మాటలు? ఏం చేశాడేమిటి?” శ్రీ.
“తన లవర్‌కి పెళ్ళయిందనీ, తను సూయిసైడ్‌ చేసుకుంటాడనీ”
“ఏడీ వెళ్ళిపోయాడుగా!” కనిష్క.
“మళ్ళీ వస్తాడు వేరే వేషంలో. కనిపెట్టి ఉండండి”
“ప్రిన్‌సెస్‌ ప్రిన్‌సెస్‌ వచ్చింది తప్పుకోండి!” శ్రీ.
“హై ప్రిన్‌సెస్‌ నా కోసమేనా వెతుకుతుంది నువ్వు?”
“అబ్బ ఆశ!”
“ప్రిన్‌సెస్‌ a/s/l please ” లవర్‌బాయ్‌.
” 17/f/Hyd ” ప్రిన్‌సెస్‌.
“ఏ కాలేజ్‌?” శ్రీ.
“చెప్పను” ప్రిన్‌సెస్‌.
“అందరికీ బై! రేపు ఎగ్జామ్‌కి చదువుకోవాలి” వీనస్‌
“బై వీనస్‌, బెస్టాఫ్‌ లక్‌!” కంగారూ.
“బై వీనస్‌!” ప్రిన్‌సెస్‌.
“బై వీనస్‌!”
“ఇవాళ నా బర్త్‌డే.. ఒంటరిగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు..” భరత్‌.
” happy birthday Bharat! ” ప్రిన్‌సెస్‌.
” happy birthday Bharat ఇదిగో గులాబీ నీకు <@ " కనిష్క. "గులాబీ అబ్బాయిలకా ఇచ్చేది?" శ్రీ. "అవును మరి sex change అయిపోయినట్లుంది" " lol ప్రిన్స్‌" శ్రీ. "అందరూ కాకుల్లా పొడుస్తారేమిటి ప్రయివేట్‌ మెస్సేజ్‌ కోసమ్‌" ప్రిన్‌సెస్‌. "అందుకే ప్రిన్స్‌ని తోడుగా ఉంచుకోవాలి." ప్రయివేట్‌ మెస్సేజ్‌ ప్రిన్‌సెస్‌కి.. వొప్పుకుంటుందా? "ప్రిన్‌సెస్‌ ఇదే మన రాజమహల్‌. ఇదే ఆహ్వానం!" "భలే తమాషాగా మాట్లాడతావు" "ఏదో మీలాంటి వాళ్ళకోసం నేర్చుకోవలసివచ్చింది" "ఇంకా ఎంత మంది ప్రిన్‌సెస్‌లు ఉన్నారేమిటి?" "ప్రిన్‌సెస్‌ అంత తేలికగా దొరుకుతుందా?" "నిజమే, ఇంతకీ నువ్వెక్కడినుంచి? ఏం చేస్తావు?" "ఇవాళ న్యూయర్క్‌. పని చేపలు పట్టటం" " lol .. నాలాంటి చేపల్నా?" "అవును బంగారు చేపల్ని.. డిగ్రీ అయ్యకా రావూ ఇక్కడికి?" "బహుశా వస్తానేమో.. మా అన్నయ్య అక్కడే ఉన్నాడు." "ఓ.. ప్రోగ్రామింగ్‌ చేస్తూనా?" "అబ్బ ఎంత తెలివో!" " lol " వేళ్ళు కీబోర్డు మీద చకచకా కదుకుతున్నాయి. ఇష్టాలూ, అయిష్టాలూ.. అలవాట్లూ.. దారిలో పడుతూంది. ఆఖరి డబ్బాలో బీరు అంత చల్లగా లేదు. "ఇప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా?" "ఉహు! ఇంత టైం వేస్ట్‌ చేశాకా?" "నా చేయి నీ మెత్తటి చెంపమీదగా జారి,నీ ఎర్రటి పెదాలమీదికి నా చూపుడు వేలు చేరింది." "నా పెదాలు వణుకుతున్నాయి" "అక్కణ్ణుంచి నా చేయి నెమ్మదిగా కిందికి జరుగుతుంది.." "నా ఊపిరి వేడెక్కి బరువవుతోంది" "ఒక్కో హుక్కూ ఊడదీస్తూ నాచేయి.." "ఇంకా ముద్దుకోసం ఎదురుచూస్తూ నేను.." ఎంతసేపయిందో తెలీదు. ఆఖరిసారిగా ఒక ముద్దిచ్చి.. వీడ్కోలు చెప్పి.. బయటికి.. పూర్తిగా బయటికి.. ఆఫీసు గదిలోంచి బయటికి. బీరుడబ్బాలన్నీ ట్రాష్‌లో పడేసి..మంచం మీద శరీరమెప్పుడు వాలిందో.. 000 000 000 హఠాత్తుగా మెలకువ వచ్చింది ఎప్పుడో వేకువజాము వేళ..కడుపు బరువెక్కువయి.. ఎన్ని బీర్లు తాగిందీ గుర్తు లేదు.. బాత్‌రూమ్‌లో బరువు దించుకుని మళ్ళీ పడక మీదికి.. పక్కనే వెచ్చగా ఊపిరి వదుల్తూ వసు..రాత్రి వసును వాటేసుకు పడుకున్నట్లే గుర్తు.. కానీ తను నిద్రపోతోంది అప్పుడు..మరి రాత్రి సెక్స్‌. వసుతో కాదా.. అవును చాట్‌ రూమ్‌లో పదిహేడేళ్ళ ప్రిన్‌సెస్‌తో.. కానీ అది ప్రిన్స్‌ కదా.. చాలా బాగుంది. even better than the real thaaymg పాట రింగుమంటూంది.. ప్రతి ఈ మెయిల్లో ఆ సీడీ ఎవరి చేతనయినా పంపించమని చెల్లి గొడవ.. దానికి బాగా ఇష్టం ఆపాట.. ఆదివారం కదా ఫోన్‌ చేసి ఉండవలసింది ఇవాళ.. పోయినవారమూ ఎన్ని సార్లు చేసినా ఎంగేజ్‌ టోన్‌. దానికి కంప్యూటర్‌ కొనటం తప్పయింది.. ఎప్పుడూ ఇంటర్నెట్‌ మీదే అని అమ్మ కంప్లెయింట్‌. ఒక్కసారిగా వొళ్ళు జలదరించి.. దిగ్గున లేచి కూచుని.. చెమట్లు కారుతున్నాయి.. వొళ్ళంతా వొణుకు.. కాదు.. పదిహేడేళ్ళ పిల్లలు ఎంతమంది లేరు హైద్రాబాదులో.. కాదు చెల్లి ప్రిన్‌సెస్‌ కాదు.. కానేకాదు.. చెల్లి అట్లా చేయదు.. 000 000 000


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...