చంద్రరేఖావిలాపము

పెద్దల నెరుగడు మాటల
పద్దులు పచరించు గర్వి భామ కురతిలో
ఎద్దు వలె మెలగు నీకా
బుద్ధి వలదు మానుమమ్మ పుత్తడిబొమ్మా

ఖలుడైన నీలనృపు డీ
యిలపై నిన్నాళ్ళు బ్రతుకునే నరసాంబా
గళ కలిత కనకమయ మం
గళసూత్రోత్కృష్ట మహిమ గాక కుమారీ

రొక్కమిచ్చెడు విటు జూచి దక్కినట్లు
తక్కుచును బొల్లిమాటల తనుపు; కాని
నిక్కముగ మానసంబీయ నిశ్చయించి
వారకన్యక యీరీతి వలచు నటవె?

ఎక్కడి నీలాద్రినృపుం
డెక్కడి యడియాస వలపు లివి కూడ వికం
గ్రుక్కినపేను తెరంగున
కిక్కురుమనకుండ చనుము గేహంబునకున్‌

అని వినయ విస్రంభ గంభీర సంరంభంబులు గుంభింప పలుక, నచ్చిలుకలకొలికి కంతకంతకు వింతవింతలుగ దురంత నితాంత విప్రలంభ వేదనాభరంబు భరింపరాకుండ కరంబు దళంబుగా పరవశత్వంబు నొంది మారుమాటాడ నోడి, ఓడిన కోడి చందంబున తల వ్రేలవైచుకొని, కదల మెదల నేరక కన్నులు మూసికొని, ఊరక శరీరంబు నీరు విడువ శయ్య నొయ్యన వ్రాలి తూలం కనుంగొని బెంగను లొంగి దుఃఖాంభోధి మధ్యంబున మునింగి కన్నీరు లేరులై పారి వెల్లివిరియ డిల్లపడి తల్లడంబున నుల్లంబవియ మెల్లమెల్లన నప్పల్లవ మనోభూతంబున కాతతగతి చల్లనిపనులు సేయందలంచి తన దాసికాజనంబులుం దానును దాని నిజశయ్యాతలంబునం జేరి

భగమధ్యమున మంచిచిగు రుప్పు కూరించి
పై కొండనల్లేరు ప్రస్తరించి
లంబ స్తన ప్రదేశంబున రేవడి
దూలగొండి చిగుళ్ళు గీలుకొలిపి
కన్నులలోన నర్కక్షీరములు నించి
ముక్కుగూండ్లను ఆవముద్దలుంచి
వీనులలోపల వేడినూనియ పోసి
నాలుక జెముడుపాల్‌ చాల పొడిచి

మేన రాసున్న మెంతయు మెత్తి, నెత్తి
గొరిగి, నిమ్మపులుసు గంట్ల గ్రుమ్మి, లోని
కిముడ నేపాళము లొసంగి యిట్లు శిశిర
కృత్యములు సేయ, అప్పు డక్కితవ వనిత

బడబడ పిత్తులు పిత్తుచు
బడిబడి బహుభంగి మీర పారుచు మరి తా
నొడలెరుగక పెనుమూర్ఛం
కడు సోలగ తల్లి కాంచి కటకటపడుచున్‌

వేంకటసోమయాజి కిది వేగమెరుంగగ చెప్పకుండినన్‌
కింకవహించి దుఃఖపడు కేవల మాతడె దీని కన్నవా
డింకిట నుండనేల యని యేడ్చుచు నాతని చేరి యంతయున్‌
జంకక చెప్ప నాతడును సంభ్రమ దుఃఖ భయార్ద్ర చిత్తుడై

వెర్రిలంజెవు, కాకున్న విషమబుద్ధి
శిశిరకృత్యము లీరీతి చేతు వటవె?
చల్లయును అన్నమును బెట్టి నల్లమందు
లోనికిప్పించి చేయింపు తానమిపుడె

ఈచందంబున చేసిన
ఈ చిన్నది బ్రతుకు నిపుడు నిక్కము దానిం
చూచెదనన క్రతు వూనితి
ఈ చోటుం దరలిరాగ నిది చెడునుకదా

చన్నుల చందనం బలది జానులనంటి చిగుళ్ళు కప్పి వా
ల్గన్నుల కప్పురంపు కలికంబిడి బాహువులందు పొందుగా
తిన్నని తూండ్లు చుట్టి నునుదేనియ మోవిని చిల్క వేగమే
చిన్నది తెల్వినొందు నిక చిత్తములో వగబూన నేటికిన్‌

అది లెస్సగ నున్నంతట
ముదమున నీలాద్రిరాజు మోహంబున నీ
సదనమున కరుగుదెంచును
పదపడి మన కిరువురకును భాగ్యము లిచ్చున్‌

వస్తాడు నీలభూపతి
తెస్తాడు ధనంబు నీ కతిప్రమదముగా
నిస్తాడు విరహవేదన
చస్తాడా? నమ్ము మదిని సందియ మేలా?

అనుచు తెలియజెప్ప నామోదహృదయయై
సరగ నరిగి యట్లు సలుప చంద్ర
రేఖ రేగుబువ్వు వైఖరి తెల్విచే
వలపు గులకరింప నలరుచుండె

నీలాద్రి నృపుండచ్చో
సోలుచు విరహానలార్తి స్రుక్కి వగచుచున్‌
జాలింబొందుచు నేడ్చుచు
వాలారుచు నింక నేటి వలపనుకొంచున్‌

దాని జానగు యోనిలో నటింపని మహో
ద్దండ దర్పిత కామదండమేల?
దాని కోమల సుధాధరము గ్రోలని మధు
రసరుచి వ్యాలోల రసనయేల?
దాని లంబస్తన తాడనం బబ్బని
వర కవాటోపమ వక్షమేల?
దాని జానుయుగ మర్దనము సేయని దీర్ఘ
దర్వీసమాన హస్తంబులేల?

దాని నిర్భర మధు మదాహీన దేహ
గాఢ పరిరంభ సంభోగ కలన లేని
భూరి విస్తార శాల్మలీభూజ తుల్య
పుష్టియుత ఘన మద్దేహ యష్టి యేల?

దానిని మక్కువ తొడపై
పూని కనుంగొనని రాజబోగం బేలా?
యీ నెరవయసేలా? యని
మానని చింతాభరమున మరుగుచు మరియున్‌