దీపావళి అనగా దీపముల వరుస, ఆ రోజు పెందలకడనే లేచి…
అంటూ పరీక్షల్లో వ్యాసాలు రాసేస్తావే గానీ, నిజంగా దీపావళి గురించి రాయాలంటే బోల్డుంది. దానికేమో ఫది మార్కులిచ్చి, రెండు పుటలకు మించకుండా వ్రాయునది, అనటం ఎంత అన్యాయం! “దశమ గ్రహం” పాఠంలోంచి సందర్భం రాస్తే దానికీ ఫది మార్కులే, దీనికీ ఫది మార్కులే..ఈ పేపర్లిచ్చేవాళ్ళెప్పుడూ దీపావళి జరుపుకోరేమో, రెండు పుటలట, రెం..డు..
వళ్ళు మండేది. సుబ్భరంగా పేపరు నిండా “ఢాం..ఢాం..ఢాం” అని రాసేసి, ఇదే వస్తుంది మీరిచ్చిన మార్కులకి..అనెయ్యాలనిపించేది. పైగా పేపరు చివర్లోనే ఇస్తారు వ్యాసాలన్నీ. గేపకం తెచ్చుకుని రాయాలికదా, ఒకటా రెండా, ఏకంగా నెల ముందు నించీ మొదలెడితేనేగాని అవదు కదా..
దసరాలు అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతాయి, తొమ్మిదిరోజులూను. అయినా అవి అమ్మాయిల పండగలు కదా, అందుకే, మనకి అంత పని వుండదు. సాయంత్రం కామాక్షీ పీఠానికి వెళితే అక్కడ తెల్లగెడ్డం తాతగారు పంచామృతాలు, పరవాన్నం ప్రసాదం ఇస్తారు, మన ఆటలయ్యాకా ఓమాటు అటెళ్ళి, దేవుడికి దణ్ణం పెట్టేసుకుని, ప్రసాదం తిని వచ్చెయ్యడమే. ఆ తరవాత వచ్చే ఆది వారం, నాన్నగారితో కలిసి భాస్కర్రావు కొట్టుకెళితే వాడు బీడు, సూరేకారం, గంధకం ఇస్తాడు, ఇంకా అదేదో నీలంరంగు పొడి కూడా ఇస్తాడు. అవి తెచ్చుకుని, నాలుగు చాటల్లో పోసి, ఎండబెట్టుకోవాలి. ఒక రోజు అన్నకీ, ఒక రోజు నాకు కాపలా డ్యూటీ. బీడేమో స్టీలు గిన్నెలా మెరుస్తూ భలే ఉంటుంది. రెండు రోజుల తరవాత కుండలమ్మే తాత వస్తాడు కదా, వాడి దగ్గిర డజను పెద్ద ప్రమిదలూ, నాలుగు డజన్ల చిన్న ప్రమిదలూ కొనేది అమ్మ.
పెదనాన్నగారేమో తెల్ల వెంట్రుక ఒక్కోదానికీ ఐదు పైసల చొప్పున ఇచ్చి, నన్నూ అన్నయ్యనీ తియ్యమనే వారు, అలా వచ్చిన డబ్బులతో, కిష్ణారావు వీధిలో కొట్టు కెళ్ళి సిసింద్రీలు కొనుక్కొచ్చే వాళ్ళం. వాటి తోకగిల్లి ఆ రోజు రాత్రే వేసే వాళ్ళం. సరిగ్గా వెళ్ళేవి కావు. వీడు మోసం చేసేసాడ్రా, నేను మాతంసెట్టి గాణ్ణి అడిగి కనుక్కుంటానుండు, పెద్ద సైజు సిసింద్రీలు ఎక్కడ దొరుకుతాయో అనేవాడు అన్న.
మర్నాడు అన్న సీతాఫలం బొమ్మలో దాచుకున్న నాణేలు జాగర్తగా తీసి, నారాయణపేట కి వెళ్ళి అక్కడనించి కొనుక్కొచ్చే వాళ్ళం. అవి భలే వెళ్ళేవి, అంతే వెంఠనే వాడిదెగ్గిరకెళ్ళి మాకు మూడువందలు కావాలి, ఎలా ఇస్తావు?అడిగేవాడు అన్న. మూడువందలైతే ముప్ఫై రూపాయలు బాబు, ఐదువందలు తీసుకుంటే నలభై ఐదు కిస్తాను అనేవాడు కొట్టు వాడు. సరే, సరేఅనేవాణ్ణి నేను. అన్న కాసేపు అలోచించి, వద్దులే అనేవాడు. నేను కూడా కాసేపు ఆలోచించి, పోనీ, ఈసారి పాం బిళ్ళలు, తాళ్ళూ మానేద్దాం అనేవాణ్ణి, ఎలాగైనా సిసింద్రీలు తగ్గించకూడదని అలోచిస్తూ. సరేలే, అమ్మకి అప్పుడే చెప్పకుఅనేసి, వాణ్ణి పురమాయించేసి వచ్చేసేవాడు అన్న, వెనకాలే నేను.
పెదనాన్న గారు బళ్ళో హాజరుపట్టీ చేసేప్పుడు వాడతారు, ఆ రూళ్ళ కర్ర తెచ్చి, మతాబా గుల్లలు చేసేవారు నాన్నగారు. అమ్మ మైదాపిండి వుడికిస్తే అన్న మైలతుత్తం వేసేవాడు. నేను గుల్లలు ఎండ బెట్టేవాణ్ణి. నాన్నగారు మొబర్లీ పేట వెళ్ళి చిచ్చుబుడ్ల కుండీలు తెచ్చేవారు, రెండు డజన్లు పెద్దవీ, నాలుగు డజన్లు చిన్నవీని. ఇంక వారం రోజుల్లో దీపావళనగా, ఆ ఆదివారం మాయింట్లో పేద్ద కార్ఖానా. అమ్మ ఎండబెట్టిన మందులన్నీ వేయించేది. ఆవదం కలిపేది. నాన్నగారేమో, అన్నీ సరైన పాళ్ళల్లో కలిపేవారు, ఒకటి మతాబా మందు, ఒకటి చిచ్చుబుడ్ల మందు. అన్నీ ఓపికగా, జాగ్రత్తగా కూరేవారు నాన్నగారూ, అన్నా. నేను మతాబా గుల్లల్లో ఇసకపోసి అందిస్తూ వుండే వాణ్ణి. కేపులూ, రీళ్ళూ, తుపాకీలు చిన్నప్పుడు కాల్చేవాళ్ళం గాని, తరవాత మానేసాం, సిసింద్రీలు వేసే వయసులో కేపులేంటీ?, చామర్తాడు చూస్తే స్కూల్లో అందరికీ చెప్పేస్తాడు కూడా, అందుకనే.
అద్దివాటాలో వుండే ఏ.సీ.టీ.వో తాతగారేమో అన్నయ్యకి జువ్వ వెయ్యడం నేర్పించారు ఓసారి. జువ్వ గేట్టిగా పట్టుకుని, అంటించి పది అంకెలు లెక్కపెట్టాలిరా రామం, ఏవైనా సరే ఈలోపల వదలకూడదుఅనేవారు.
అన్న అడిగాడు తరవాత?
వదిలెయ్యడవేతాతగారి జవాబు.
అంతే, అన్న వదిలేసాడు. ఆ జువ్వ కాస్తా వెళ్ళి బాచి మావయ్య గదిలో పడింది, ఓ రెండు నిమిషాల సేపు ఇంట్లో అందరినీ తెగ పరిగెత్తించింది. అందరూ ఒకటే నవ్వు. ఆ తరవాత అన్న జువ్వలు, పేలుడు జువ్వలూ కూడా వెయ్యడం నేర్చుకున్నాడు బాచి మావయ్య దగ్గర, నాకూ నేర్పాడు.వారం రోజులు ఎలా గడిచిపోయేవో తెలిసేది కాదు, దీపావళి వచ్చేసేది. ఆరోజు నిజంగానే పొద్దున్నే లేచి, తలంటు పోయించేసుకుని, జిలేబీల డిజైను ఉన్న పాలిష్టరు చొక్కా నీలం లాగూ వేసేసుకుని ఎప్పుడు చీకటి పడుతుందా అని చూసే వాళ్ళం. నాన్నగారేమో మధ్యానం వెళ్ళి భూచక్రాలూ, విష్ణు చక్రాలూ, కాకరపువ్వత్తులూ, వెన్నముద్దలూ, అగ్గిపెట్లూకొనుక్కొచ్చేవాళ్ళూ, తాళ్ళూ, పాంబిళ్ళలూ కూడా. వాటిల్లోంచి కొన్ని తీసి అమ్మ సత్తెమ్మ కిచ్చేది, అదిఅంట్లుతోమడానికొచ్చినప్పుడు.
మధ్యాన్నం పెదనాన్నగారితో సైకిలు మీద నేనూ అన్నా షికారుకెళ్ళే వాళ్ళం. సిసింద్రీలు పెదనాన్నగారి ఖాతాలో అన్నమాట, అందుకే వచ్చేప్పుడు నారాయణపేటలో ఆగి, అవి తీసుకుని, మళ్ళీ గాంధీ బొమ్మ దెగ్గిర ఆగి, సీమటపాకాయ గుత్తులు తీసుకుని వచ్చే వాళ్ళం.
చీకటి పడుతూండగానే అమ్మ దివిటీ పట్టించేది. గోంగూరకాడలకి అవేవో తెల్లటి మూటలు కట్టి, నూనిలో ముంచి వాటిని కాల్చి, అవి ఆరే దాకా పట్టుకోవాలి. అవి ఓ పట్టాన ఆరేవి కావు. ఈలోపలే వీధి చివర వుండే గన్నవరపు వాడు వేసిన నేలబారు జువ్వలూ, సిసింద్రీలూ మమ్మల్ని పలకరించి వెళ్ళేవి. సరే దివిటీలు వో గంట తరవాత ఆరేవి. ” దిబ్బూ దిబ్బూ దీపావళీ మళ్ళీ వచ్చే నాగుల చవితీ” అనేసి, వెంఠనే కాళ్ళు కడిగేసుకుని, బాదుషా తినేసి, బైటకొచ్చేవాళ్ళం. అన్న రెండు చాంతాడు ముక్కలు వెలిగించి తెచ్చేవాడు. వాటిని వూదుకుంటూ సిసింద్రీలతో మొదలెట్టేవాళ్ళం.నోటితో సిసింద్రీ తోకలు కోస్తుంటే అన్న తిట్టి, వాడే గిల్లి ఇచ్చేవాడు. వీధి వీధంతా సందడి. అందరూ మతాబాలు, కాకర పువ్వత్తులూ, చిచ్చుబుడ్లూ కాల్చేవారు. బాచెమ్మామ్మా వాళ్ళ మనవరాలు అరుణ, బియ్యం డ్రమ్ము మూతమీద పాంబిళ్ళలూ, వెన్నముద్దలూ కాల్చేది, దానికి మరి కాకర పువ్వత్తి అన్నా భయమే కదా. మతాబా ఇస్తే, గెట్టిగా కళ్ళు మూసుకుని పట్టుకునేది. మేవేమో, పేలుతోంది, పేలుతోందిఅని భయపెట్టేసరికి అది కాస్తా వదిలేసి పరుగు, మళ్ళీ పాంబిళ్ళల దగ్గరికి.ఇంతలో అమ్మ లక్ష్మీ పూజ చేసి, ప్రమిదల్లో దీపాలు వెలిగించి, ఇంటి చుట్టూ పెట్టేది, అన్ని దీపాలుకూడా సరిపోయేవి కావు, ఒకపక్క నించి మావీ, ఇంకో పక్క నించి యే సీ టీ వో అమ్మమ్మగారివీ.
మూడు గంటలు కాల్చి కాల్చి చేతులు నొప్పెట్టేవి. సిసింద్రీలూ, సీమటపాసులూ అయిపోయేవి. జువ్వలు కొన్ని మిగిలేవి. అవి నాగుల చవితికి అని చెప్పి దాచేది అమ్మ. అటు గన్నవరపాడూ, వాళ్ళూ ఇంకా జువ్వ లేసే వారు. అన్నకి వళ్ళుమంది వో ఉపాయం చెప్పాడు. అంతే, వెంఠనే నేను, మా చీపురు కట్టని తిరగేసి బాల్చీలో పెట్టి మా ప్రహారీ గోడమిద పెట్టి, చూసుకో, మాకింకా వంద జువ్వలున్నాయి, కానీ మేము నాగుల చతివికి దాచుకుంటాము అనేసి, వాళ్ళు సరిగ్గా చూసేలోపు, బాల్చీ లోపల పెట్టేసే వాణ్ణి.వాళ్ళు నిజంగానే భయపడి, కాల్చడం అపేసేవారు. అప్పుడు అన్న నవ్వి, చూసావా.. అనేవాడు. అంతే, ఇంక అంతా అలిసిపోయి, లోపలికొచ్చి కాళ్ళూ చేతులూ కడుక్కుని భోజనాలు చేసే వాళ్ళం. అప్పుడు పేలేది దుర్గా సిల్కు హౌసు వాళ్ళ సీమటపాసు గుత్తి. ఫదివేలో ఎన్నో వుండేవి.
ఒక ఫదినిముషాల సేపు చెవులు గళ్ళు పడిపోయేవి. అది పూర్తవడంతో దీపావళి పూర్తయ్యేది మావూళ్ళో.
ఒక్కోయేడాది, నరేంద్ర పురంనించి గోపాలం పెదనాన్నగారు వచ్చేవారు, ఆయనకి తాటాకు టపాకాయలు కట్టడం వచ్చు. అందుకే వస్తూ వస్తూ ఒక వందో, రెండొందలో టపాకాయలు తెచ్చేవారు. తాటేకు టపాకాయని చూస్తే, గ్రోమోర్‌ప్రకటనలో, తలపాగా కట్టుకున్న రైతులా, భలేగా వుంటుంది. పెటేపు కాయలన్నా, ఎలక్ట్రిక్‌కాయలన్నా తాటేకు టపాకాయలే. అవి పేల్చేవాళ్ళం. కానీ ఓ సారి వత్తి అంటించి పడేసాకా, అంటుకుందో లేదో చూడ్డానికి దగ్గిరికెళ్ళకూడదు, అంతగా అంటుకోపోతే మర్నాడు తీసుకోవడమే..అన్న చెప్పాడుగానీ నేనువినలేదు ఓ సారి. ఆ తరవాత నాకెవ్వరూ చెప్పాల్సిన అవసరం రాలేదు.
హైదరాబాదొచ్చేసాకా కూడా దీపావళి బాగా చేసుకునే వాళ్ళం. అయితే, ఇంట్లో చేసేవస్తువులు తగ్గిపోయాయి, చిచ్చుబుడ్లు కొనేసే వాళ్ళం, తాటకు టపాకాయలకి బదులు హైడ్రోజను బాంబులు కాల్చే వాళ్ళం, కొన్నాళ్ళు జువ్వలు చేసాం గానీ, ఆనక అవి కూడా కొనేవాళ్ళం. సిసింద్రీల సంగతి మర్చే పోయాం..దొరికేవికావు. పేకెట్లో లెఖ్ఖపెట్టి సరిగ్గా పదో పన్నెండొ చిచ్చుబుడ్లిస్తాడు, అవి కాలినవి కాలతాయి, పేలినవి పేలతాయి, ఎంత శివకాశీ వైనా, మేం చేసుకున్న చిచ్చుబుడ్లకు సాటికాదు కదా. ఇంక రాకెట్లని చూస్తే నవ్వొస్తుంది. పైగా వాటిని సీసాల్లో పెట్టి కాల్చాలిట, బడాయికాకపోతే. ఇంతా హడావిడి చేసి అవి కరెంటు స్తంభవంత ఎత్తెళ్ళేవేమో, మా జువ్వలైతే చంద్రుణ్ణి పలకరించి వచ్చేవా, అనిపించేది. సీమటపాసు గుత్తుల్ని హెదరాబాదులో లడీ అంటారు. చివర్లో, మా సేథియాగారూ వాళ్ళూ కాల్చిన లడీ సుమారు అరగంట సేపు అందరినీ పలకరించి, దీపావళిని పట్నం పొలిమేరలదాకా వెళ్ళి సాదరంగా సాగనంపుతుంది.
అల్లాంటి దీపావళి అందరిలోనూ ఆనందం నింపుతుంది, మనమంతా ఒక కుటుంబం వాళ్ళమే అనే భావన కలిగిస్తుంది. గోడమీద పేర్చిన దీపాలు గుండెల్లో వెలుగుతాయి. మతాబాల పూలన్నీ మనసు కొమ్మల్లో పూస్తాయి. కాకరపువ్వత్తులు కళ్ళలో కోటి నక్షత్రాలు నింపుతాయి. ఆ అనుభూతులన్నీ, ఈ శీతల దేశాల్లో ఘనీభవించి, మన గుండెలో ఏదో మూల దాంకుంటాయి. ఇలాంటి పండగ రోజుల్లో వాటిని వెతికి పట్టుకుని, వేడి చేసుకుని, ఆ వెచ్చదనాన్ని, ఆనందాన్ని అనుభవించినన్నాళ్ళూ, మన దీపావళి బతికివున్నట్టే.