చంద్రరేఖావిలాపము

దిగ్గునలేచి దండమిడి ధీవర యజ్ఞము చేసినావు మున్‌
పగ్గెగ మేము మన్మథవిపద్దశ నుండి తొలంగ నిప్పుడీ
సిగ్గరికన్నె తార్చితివి చెప్పగ శక్యమె నీప్రభావ మీ
వగ్గివి గాక బాపడవె ఆరయ వేంకటసోమపీథిరో

యెద్దుమానసుడవు యేదాంతుగుడవు సో
మాదుగుడువు నీవు మామవైతి
మాకు పున్నె మెలమి చేకూరె నౌ చంద్ర
రేఖ మీరు చంద్రరేఖ వలన

నావుడు నత డిట్లనియెను
దేవా తావక కటాక్షదృష్టి వలన నే
కావించితి క్రతువిపు డిది
నీ వన్నియ చూచి వలచె నీలనృపాలా

కైశ్యంబు కందంబు ఘన గోధి చంద్రమః
ఖండంబు భ్రూ ద్వంద్వకము ధనుస్సు
చక్షుస్సులు చకోరపక్షు లోష్ఠంబు పీ
యూషసరస్సు పయోధరములు
మాతంగకుంభముల్‌ మలినరోమాళి పి
పీలికాశ్రేణి గంభీరనాభి
విషనిధి కటి మహావిపుల సువేది ప
త్తామరసంబు మదనసదనము

పాండు రాశ్వత్థభూరుహ పత్ర మిట్టి
సరస సౌందర్యవతియగు చంద్రరేఖ
నీకు దొరకెను సంభోగ నిహితలీల
దక్క నేలుము నీలాద్రి ధరణిపాల

దీనితల్లి యీమె నా నేస్తురాలు మే
మిరువురమును నీకు హితుల మెట్లు
సాకెదవొ యటంచు చంద్రి హస్తము తెచ్చి
అతనిచేత నుంచి అప్పగించి

ముప్పదియారేండ్లది ముం
దెప్పుడు నొక్కరుని పొందదేలాగున నీ
విప్పుడు దిద్దుకొనియెదో
మొప్పెతనము మాన్పవలయు ముందర పనిలో

అని మరియును

కం పేపారెడు మంచిగంధమును బుక్కా క్రొత్తపన్నీరు క
ప్రంపున్‌ వక్కలు నాకులున్‌ దబుకుతో పర్యంకమం దుంచి తా
దంపత్యో శ్చరకాల భోగ్యమను వృత్తంబుల్‌ మహాపస్వరం
బింపారన్‌ పఠియించి వేంకట మనీషీంద్రుండు మోదంబునన్‌

తారామార్గము చూచి మంగళముహూర్తం బిప్పు డేతెంచెగా
ఓ రాజాగ్రణి పుస్తెకట్టుమిక జాగూనంగ నేలా ధ్రువం
తే రాజా వరుణో యటంచు నుడువన్‌ తేజంబు దీపింప త
న్నారీకంఠమునన్‌ ఘటించెను సువర్ణప్రస్ఫురత్‌ సూత్రమున్‌

తలబ్రాలువోయ నవి జిల
జిల జాల్కొని మదనసదన స్నిగ్ధస్థలిపై
పొలిచెను భావి సురత సం
కలితేంద్రియ మిట్లు పైని కప్పునను గతిన్‌

అనంతరంబున వేంకటశాస్త్రి యిట్లనియె

యభస్వ పుష్పిణీం చంద్రరే ఖామల మఖీమిమాం
చంద్రరేఖాం భగవతీం త్వం నీలాద్రి ప్రజాపతే

త్వన్మందిరే బహుళ కాంచన సిద్ధిరస్తు
వంశాభివృద్ధి రధికాస్తు శివారవోస్తు
బాలార్కకోటిరచిరస్తు మలేతరాస్య
నీలాద్రి పుణ్యజనవర్య హరిప్రసాదాత్‌

అని యాశీర్వదించి యిట్లనియె

స్మరమంది రాంగణంబున
కర దంత క్షతములుంచి గాఢరతుల భీ
కరభంగి చేయ కిప్పుడు
తురతుర న వ్వెనుక మెల్ల త్రోయగ వలయున్‌

ఆకు పోక వెట్టి లోకువగా బట్టి
పూకు మెల్ల నిమిరి నూకవలయు
డాక చేసి వేగ తాకంగపోవద్దు
నీకు దక్కె చంద్రి నీలభూప

అప్పుడు వేంకటసాని యిట్లనియె

బాల సుమీ గోల సుమీ
బేల సుమీ గాఢరతుల పెంపేద కడున్‌
సోలింపక తూలింపక
పాలింపుము చంద్రి నీదు పాలయ్యె నికన్‌

డాసిండు విడెము మరుచే
గాసిం డగ్గరక మున్నుగా మచ్చికగా
చేసిండు సొమ్ము పిదపన్‌
నీసేతలకెల్ల నోర్చు నీలనృపాలా

అని చంద్రరేఖం జూచి యిట్లనియె

సచ్చోడా పబువీతడు
యెచ్చమునకు పచ్చమునకు యిచ్చలయిడిగా
యిచ్చును హెచ్చుగ కొలువుము
సచ్చు యిటుల సేరబోక సందర లేకా

దేవేరి కేరెదవు స
ద్వావంబున నితడు చేతబట్టిన నీ వో
పూవుంబోడిరొ విట సం
భావనపై తలపువిడిచి బత్తి కొలువుమా