చంద్రరేఖావిలాపము

ఇందు తా వెల్వడి యెందు వేంచేసెనో
మాసామి చూపరే మ్రాకులార
సన్నకసన్న నే సకి గూడియుండెనో
మా రేని చూపరే మద్దులార
వేపుల పట్టుక వేటకు పోయెనో
మా దొర చూపరే మడుగులార
ఇందర భ్రమియించి యేటికి పోయెనో
మా రాజు చూపరే జారులార

మమ్ము నేలిన నీలాద్రిమనుజవిభుడు
పూలపాన్పున పెనునిద్ర పోయిపోయి
లేచి ఒక్కరుడును మాకగోచరముగ
ఎచ్చట నడంగె చెప్పరే పచ్చులార

ఎల్లీ మల్లీ పల్లీ
పుల్లీ మా రాజుకూసుపోవక మీమీ
గొల్లెనకై రాడుకదా
కల్లలు వలదింక చెప్పగదరే వేగన్‌

నేలరేడులార మంచినేస్తులార విక్రమా
భీల శూరులార పిన్నపెద్దలార గుప్పునన్‌
పూలపాన్పుడిగ్గి యేడ బోయినాడొ చూడరే
నీల కాశ్యపీవరుండు నిన్నరేయి ఒక్కడున్‌

అని గగ్గోలుగ వారు రోదనము సేయన్‌ నాయకుల్‌ గాయకుల్‌
చనవర్లున్‌ గణికాజనంబు లనుజుల్‌ సామంతులున్‌ మంత్రులున్‌
విని శోకాకులచిత్తులై కదిసి తద్వృత్తాంతమాలించి ఆ
యన నన్వేషము సేయబోయిరి సమీపారణ్యమధ్యంబునన్‌

గట్టుల దరి పుట్టల కడ
చెట్టుల చెంగటను చెరువు చెంతల బలు పె
న్గుట్టల సందుల గొందుల
పట్టుగ ప్రవహించు ఏటిపల్లములందున్‌

రోయుచు హో యని కూకలు
వేయుచు హా నీలభూప విస్మయముగ నీ
వేయెడ కేగితొ వెస రా
వే యనుచును మోదుకొనుచు విహ్వలులగుచున్‌

మూగి అరయంగ ఆతని
తో కూడంజనిన వేట తోరపుకుక్కల్‌
సైగలు సేయుచు సాగగ
ఆ గతి కని చనిరి వారలందరు వెంటన్‌

చని కనిరి చంద్రరేఖా
తనురూపవిలాస వహ్ని దగ్ధశరీరున్‌
ఘన చింతాభారున్‌ నూ
తన జనిత దశావికారు తన్నృపమారున్‌

ఇట్లు కనుంగొని సకలపరివారంబు లతనిం జుట్టుకొని యాక్రందనంబు సేయుచు నాశ్చర్య ధుర్య మానసంబుతో నిట్లనిరి

వాతము పట్టెనొ వని పెను
భూతము కొట్టెనొ మరెట్టి పొడ కుట్టెనొ హా
హా తెలియ దేమి మాయయొ
ఈతడు పడియున్న చంద మెంచి కనంగన్‌

బహుళ ద్విజద్రవ్య భక్షణోద్భవ మహా
పాతకంబున నోరుపడియె నొక్కొ
కవిమాన్యహరణ దుష్కర్మ ప్రభూతాతి
కలుషంబుచే జిహ్వ పలుకదొక్కొ
పరసతీవ్రత భంగకరణప్రభవ పంక
గతి దుర్బలాంగంబు కదలదొక్కొ
సుజనుల చెడజూచు చూడ్కి చుట్టిన కొల
గడు కనుంగవ మూతవడియె నొక్కొ

నిరత నిజదాసికాజన నికరములను
బలిమిమై పట్టపగ లింట పట్టి మిగుల
సమరతుల తేల పొడము దోసమున నొక్కొ
నీలనరనాథు డిట్లొంటి కూలినాడు

అని మహాదుఃఖావేశంబున అందరు నిట్లనిరి

కొలువు తీర్పవదేమి గురుతర తరుసార
భాసుర లక్ష్మీవిలాసమునను
కూర్చుండవదియేమి ఘుమ ఘుమామోద గుం
భిత సుచందన కాష్ఠపీఠమునను
తేరిచూడవదేమి దృఢతర లావణ్య
గణ్య పణ్యస్త్రీ నికాయములను
పలుకరింపవదేమి బహువేష భాషాతి
బంధురాశ్రిత బాలభాగవతుల

నకట నీలాద్రిరాజ భోగానురక్తి
మాని ఈ ఘోర కాంతారమహిని పండ
కారణంబేమి ఏరిపై కాకపూని
తెగి యిటకు వచ్చి యిట్లు నిద్రించెదిపుడు

కేళీభవనాంతర పరి
కీలిత మల్లీ లతాంత కేవల శయ్యా
లోలుడవై యుండక ఈ
నేలపయిం పండనేల నీలనృపాలా

విజయరామ క్షమావిభుడు పిల్వగ పంచె
రాచిరాజ కుమార లేచిరమ్ము
ఎరుకువాడిదె పందినేసి మాంసము తెచ్చి
కాచుకయున్నాడు లేచిరమ్ము
వేటకుక్కల కాన్కవెట్టి పంపిరి దొరల్‌
చూచివత్తువుగాని లేచిరమ్ము
కొత్త పారావారు కొలువంగవచ్చిరి
రాచయేనుగుగున్న లేచిరమ్ము