చంద్రరేఖావిలాపము

పందీ నీ గాత్ర సదృక్‌
సౌందర్య కళావిలాస చంచన్మురజి
న్నందన మందిర యగు ఆ
ఇందీవరపత్రనేత్రి నిటు చూపగదే

నీతీరు కలుగు రూపము
చేతన్‌ విటకోటి నవయజేయుచు కడకన్‌
పాతరలాడెడి పడుపుం
గోతిని వీక్షించినావె కోతీ ప్రీతిన్‌

కల్లు కడు త్రావి ప్రేలుచు
హల్లీసకమాడుకొనుచు అది ఇచ్చటి కు
ద్యల్లీల రాదె బల్లీ
పిల్లీ కడుముద్దుజిలుకు పిల్లలతల్లీ

నీలాద్రిరాజ నాముడ
వాలెంబున దానిజూచి వలచితి నేడా
స్థూలోపస్థాన్విత గణి
కా లలనన్‌ చంద్రరేఖ గంటివె ఖరమా

అని మరియును

మనసిజమాయలం దగిలి మ్రాకుల తుప్పల పక్షిజాతులన్‌
వన మృగకోటులం దలచి వారక యీగతి వేడి వేడినీ
రు నయనపాళి జాలుకొన రోదనమెంతయు చేసికొంచు పూ
చిన విషముష్టి భూరుహము చెంగట నీలశిలా తలంబునన్‌

చేరి కళేబర మచ్చో
చేరిచి హా చంద్రి నాకు చెప్పక పరవం
కారణమేమి మరెవ్వని
కోరిక తీర్పంగ తలచుకొంటివొ చెపుమా

కోకలు రూకలు ఆకులు
పోకలు మేకలును పట్టుబొందులు సొమ్ముల్‌
నాకంటె మిక్కిలీగల
రాకొమరుడు కలడె ఈ ధరావలయమునన్‌

చక్కనివాడ రభసమున
కుక్కుట మార్జాల శునక కూర్మ రతులచే
చొక్కింపంగల వాడను
చిక్కులువెట్టంగ నీకు చెల్లునె చంద్రీ

రమ్మా నా యభిమత మిపు
డిమ్మా యిమ్మాడ్కి నేచనేటికి హొన్నుల్‌
కొమ్మా సమ్మతినిచ్చెద
కొమ్మా వెలముద్దుగుమ్మ గుబ్బలగుమ్మా

జాలముచేసి మారశరజాలము పాలుగజేయ నాయమా
తాళగజాల నీవిరహతాపభరంబు కరంబు హెచ్చె నీ
తాళఫలోపమాన సముదగ్ర కుచద్వయ మక్కుజేర్చి లీ
లా లలితోపగూహన కళాకలనన్‌ సుఖియింపజేయుమా

శోషించెన్‌ మదనోపతాపమున అక్షుద్రోన్నత స్థూల ని
ర్దోషోద్యత్‌ తనుయష్టి పుష్టిగను మందుల్‌ చేసినన్‌ కాదహో
రోషంబూనక నే డపారకరుణా రూఢాత్మ పంకేజవై
యోషిద్రత్నమ చంద్రి నీ అధరపీయూషంబు నాకీయవే

పెక్కుతెరంగుల నీకున్‌
మ్రొక్కెద చలమేల నాదుమోహము తీరన్‌
చక్కెరవిల్తుని కూటమి
మిక్కుటముగ తేల్చి ఏలుమీ దాసునిగాన్‌

మేలెంచెద సామ్రాజ్యం
బేలించెద తొంటిసతుల యెల్లరకంటెన్‌
లాలించెద పాలించెద
తేలింపుము రతుల నన్ను తేకువ మీరన్‌

చక్కెరవిల్తుని బారిన్‌
చిక్కితి నీ పాదయుగ కుశేశయములకున్‌
మ్రొక్కితి దక్కితినిక నీ
తక్కులు దిగద్రొక్కి నన్ను దయచూడగదే

గంధ మత్తరు జవ్వాది కస్తురియును
దొడ్డయొడ్డాణమును కమ్మదోయి క్రొత్త
పట్టుచీరలు కుచ్చులు బావిలీలు
రొక్కమిదె కొమ్ము నీ లంజెటక్కు మాని

తాళజాలను నీవింత జాలమేల
చేసెదవు నన్ను మిక్కిలిచెలిమి రతుల
నేలుమీ వేగ మాటాడి ఫాలలసిత
సరస నవచంద్రరేఖ ఓ చంద్రరేఖ

తియ్యని మొద్దుమాటలును తేనియగారెడు బొల్లిమోవియున్‌
పయ్యెదకొంగులో పొదలు బల్‌చనుగుబ్బలు మంగలంబుతో
కయ్యముసేయు మోము నులికన్నులు తోరపుకౌను నాకు చూ
పియ్యడ మారుకేళి కడు నేలుము జాలముసేయ కింతయున్‌

అమలంబై తరుణారుణ ద్యుతిసమేతాశ్వత్థపత్రాభమై
రమణీయ స్ఫుట దీర్ఘ లింగయుతమై రంగద్ద్రవోపేతమై
సమమై రోమవిహీనమై వెడదయై జానొప్పు నీ మారగే
హము నా కర్మిలి చూపి ప్రౌఢరతి నోల్లాడించు చంద్రీ దయన్‌

అని మరియును

హా యను చంచరీక నిచయాంచిత కుంచిత రోమ కామగే
హా యను దాన మానిత మహాద్విప మోహన మోహనైక బా
హా యను కంక కాక మహిషాశిత దుర్భర నిర్భరాతి దే
హా యను చంద్రి తాళనహహా యను భీతశిరోరుహా యనున్‌

డా యగరాకు నన్ను మరుడా యను ఏచగనేల రిక్కరే
డా యను వద్దువద్దు చనుడా యను సోకకపొమ్ము గాలిపీ
డా యను చంద్రితల్లి వరడా యను వేంకటశాస్త్రి నేడు రా
డా యను కూతు కూర్ప తగడా యను ఏగతి దేవుడా యనున్‌