వ్రాయాలని ఉంది…
కలం ముందుకు పారదు!
కవిత సాగేదెలా?
ఆలోచన ఉంది…
అక్షరంగా మారదు!
ఆశ దాగేదెలా?
చుట్టూ ప్రేరేపించే ప్రకృతి ఉంది…
వ్రాసే దారే కనబడకుంది!
ఝంఝ రేగేదెలా?
మనసు వేచి చూస్తోంది…
జగతి పొంచి వింటోంది!
మౌనం వీగేదెలా?
కలల లోకం కనుల దాగింది…
మగత మనసును మూసి వేస్తోంది!
నిదుర ఆగేదెలా?
తపన దారి తప్పుతోంది…
మనసు నోరు విప్పకుంది!
మధువు త్రాగేదెలా?
…
కోర్కె పలచబడుతోంది…
కల కరిగిపోతోంది!
రాత్రి వేగేదెలా?
భావం చుట్టుకుపోతోంది…
కవిత కొట్టుకుపోతోంది!
గుండె మ్రోగేదెలా?