చంద్రరేఖావిలాపము:ద్వితీయాశ్వాసము

శ్రీరహితగేహ! చంద్రీ
వారవధూ మదనసదన వర్ధిత సుఖరో
గారూఢిత మృదుదేహ! వ
నీరంగ విహారసాంద్ర! నీలనరేంద్రా!

ఆకర్ణింపుము తావకీన కథావిధానంబు యథార్థంబుగా దొల్లి శ్రీశివబ్రాహ్మణ వర్ణాగ్రగణ్యుండైన వీరభద్రభట్టారునకు శ్రీమద్వైఖానస వంశోత్తముండగు నంబి నరసింహాచార్యుం డవ్వలికథ యిట్లని చెప్పందొడంగె

అక్కమలేక్షణ యది గని
చిక్కెంబో వీడు నాదు చేతికటంచున్‌
నిక్కుచు తల్లికడకు చని
మక్కువ నక్కథ యెరుంగ మరువున తెలుపన్‌

ఇట్లు దెలుప వేంకటసాని యిట్లనియె

నీ తండ్రి క్రతువు కనుగొన
నాతతగతి నీలనృపతి యరుదెంచి నినున్‌
రాతిరి గని మోహించుట
లాతులలో తేనెపుట్టినట్లయ్యె కదే

ఏమేమి, నీలభూపతి
నీమీదం కన్నువైచి నిష్టురజవవ
త్కామ శరజాల నిర్దళి
తామేయ స్వాంతుడయ్యెనా మేలుభళీ

కూతుర, యాతుర పడి నీ
వాతని చేరంగబోకు, మటుతాళుము, వా
డేతెంచు సంచులను ధన
మాతతగతి నించుకొంచు వ్యామోహమునన్‌

వలపెంత నీకు కలిగిన
కులధర్మము తప్పరాదు కుమ్మరపురువుం
బలె తిరిగి పొట్టపెంపగ
వలె జుమ్మా ముద్దుగుమ్మ వగ నాయమ్మా

అని యనేకప్రకారంబుల లాలించి మేలెంచి తనకాలంబునాటి నాటకంబులు బూటకంబులు బోటిదనంబులు నీటులు కూటంబులమాటలు చాటుమాటులేక తేటతెల్లంబుగా నబ్బోటితో చాటందొడంగె

వేంకటశాస్త్రులవంటి ని
రంకుశులను మరులు కొల్పి యర్థము చాలన్‌
లంకించి నాకు నమ్మిన
కింకరులుగ చేసికొంటి కిమ్మనకుండన్‌

మున్నెంతవాడు వేడిన
కన్నెరికంబీక మీదుగట్టితి నీకై
మన్నన గైకొమ్మని విటు
లన్నిత్యము మాయచేసి లంకింతు వరాల్‌

ఒకడు కానకుండ నొక్కని రావించి
ఒకనిచెంత కేగుచుండి నడిమి
దారి నొకని కూడి తబ్బిబ్బు గావించి
ధనము కొల్లగొందు తవిలి ముందు

మందుల మంత్రంబులచే
విందులచే పూతచేత వీడెంబులచే
తందనపదముల ఆటల
మందులకావించి విటుల మానక దోతున్‌

అందలముల్‌ శతాంగములు అశ్వచయంబులు పాలకీలునున్‌
మందరశైలరాజనిభ మత్తగజంబులు వెంటనంటి రా
ముందర పొందుగా ధనముమూటలు మేటులు కాన్కలంపి నా
మందిరసీమ గాతు రసమాన నృపాలకుమారు లెప్పుడున్‌

నీకేమి చెప్పవలయును
లోకులెరుంగుదురు నాటిలో మదనుడహా
నాకనుసన్నల మెలగును
కాకుండిన నింతసొమ్ము గడియింతునటే

అప్పారాయని సభలో
మెప్పొందితి సాటి సానిమేళంబులలో
చెప్పిన పగ్గెగ నీమది
కిప్పుడు తోచును, మరెవ్వరిచ్చట సాక్షుల్‌

చెలమకు పిట్టలు చేరెడు
పొలుపున నా యింటిచుట్టు భోగాభిరతిన్‌
పలుగు గులాములు తురకలు
వలగొని కానుకలు కొనుచు వత్తురు సుమ్మీ

కట్టినకోకలు కట్టక
పెట్టిన మణిభూషణములు పెట్టక సిరులం
దొట్టి విటకోటి కొలువగ
దిట్టతనంబునను కొలువుదీర్తు కడంకన్‌

జూదంబుల పటువీణా
నాదంబుల దండలాస్యనటనముల మతుల్‌
భేదించి విటజనంబుల
చే దండుగ కొందు ధనము చెప్పగ నేలా

వలిప చెంగావి పావడ కటిస్థలి తాల్చి
జిలుగైన సరిగంచుచీర కట్టి
కులుకుగుబ్బల మీద మలయజాతము పూసి
కట్టువాపని కంచుకంబు తొడిగి
లీలగా సిగవేసి పూలదండలు చుట్టి
ముత్యాలతాటంకములు ధరించి
కడియాలు కుంటేళ్ళు గంట లొడ్డాణంబు
బవిరలు బావిలీల్‌ బన్నసరులు

ఉంగరంబులు కెంపులు ముంగరయును
మొదలుగల సొమ్ములను దాల్చి మురిపెమమర
తిరుగుచును విటకోటుల ధృతి కలంచి
హొన్నులు గడింతు మరునాన చిన్నదాన

నా వగ నా యొసపరినడ
నా వాలుంజూపుకోపు నా మాటలతీ
రావంతయు నీ వెరుగ వ
హా వన్నెలకానికూతురా యిది మేరా

చండ్లు పడె పండ్లు కదలెను
కండ్లకు చత్వార మొదవె కాయము ముదిసెన్‌
గోండ్లును భగమును బిగిచెడి
దిండ్ల తిరుగు నేర్పు తప్పె ధృతి మరపూనెన్‌

వృద్ధత్వ మివ్విధంబున
సిద్ధించెను కాని యిపుడు చిల్లరవిటులన్‌
బద్ధానురాగులుగ అని
రుద్ధజనకు కేళి తేల్చి రో వెల కొననే

కాన నీవును నావలె కాముకులను
వంచనము చేసి విత్తమార్జించవలయు
కాక యాతనిపై మోహకాంక్ష పూన
జనునె వాడెంత సౌందర్యశాలి యైన

అసదృక్కాముకుడౌటచే తను తదీయాంగంబు నందెంతయున్‌
రసపొక్కు ల్బలుబిళ్ళలు న్బహుళ ఘోర స్ఫార జాగ్రత్ప్ర మే
హసుఖవ్యాధులు మానకుండును సదా హా వాని పొందూనినన్‌
వెస నంటుంగద నీ భగస్థితి భయావిర్భూత భావంబునన్‌

అది చెడుట నీవు చెడుటయె
కద యెవ్వరు నిన్ను తేరి కనుగొనకయె న
వ్వుదు రొక కాసు నొసంగరు
తుది నీ బ్రతుకేమి యగునొ తోచదు నాకున్‌

అనుచు బోధసేయునట్టి మాయలమల్లి
బేసబెల్లి వగలవేసవెల్లి
ఉలికితెగులు బొల్లి నుల్లసిల్లెడు తల్లి
చూచి యా బొజుంగుజోటి పల్కె

అమ్మా నా మానస మిపు
డమ్మానిసిరేని మీద అంటి వదల దిం
కిమ్మాడ్కి చెప్ప నేటికి
బొమ్మా మరుచేతికీలుబొమ్మా సరగన్‌

ధనమేమి ప్రాతి నా కది
ఘనమే ఘనమేచక ప్రకట కచ వాడే
పెనుమేటి పెనిమిటి కదా
వినుమే నిక్కంబు విన్నవించెద తల్లీ

పెల్లు కల్లలల్లి బొల్లిమాటల చల్లి
మెల్లమెల్ల ఇల్లు గుల్లసేయు
తల్లికలుగు లంజె నుల్లోలమతి చేరు
పల్లవులకు సౌఖ్య మిల్ల జగతి

రమ్మంచును నమ్మించును
పొమ్మంచుం కోక లాకు పోకల్‌ రూకల్‌
క్రొమ్మించు సొమ్ము లెమ్మిం
తెమ్మంచును లాగు లంజె తెగి విటవరులన్‌

లఘువర్ణ గురువర్ణ లక్షణం బరయక
సరసపదార్థముల్‌ సంగ్రహించి
వృత్తభంగమునకు వెరపింతయును లేక
గణనిర్ణయనిరూఢి ఘనత కనక
అపశబ్దములకు రోయక సంధివిగ్రహ
ప్రాణహాని విచారపరత దక్కి
భావం బెరుంగక పండితోత్తములతో
కలయ నొల్లక మహాకపటమూని

యతుల పోనాడి మూర్ఖసంగతి వహించి
తిరుగు వెలబోటి జీవనస్థితి గణింప
కుకవి కృత కావ్య రూపానుగుణత పూని
అరసి చూచిన నిస్సారమగును పిదప

లంజెయును బీరకాయయు
ముంజెయు బాల్యమున చాల మోహము గొలుపున్‌
రంజనచెడి ముదిసిన వెను
కం చూడరు ముట్టబోరుగద నరులెందున్‌

పలువలు చెంతజేరి యొక పాతిక నేబులు చేతికిచ్చి ఛీ
మొలగల బట్టవిప్పి తగ ముందుగ పాన్పున నుండి వార లే
పలుగుదనంపు గూటముల బాధలు వెట్టిన నోర్చి పూనికన్‌
కులుకుచునుండు అప్పడుపుకూటి వెలంది కొలంబుపెద్దయే

పరధనాకర్షణప్రాంతంబు స్వాంతంబు
వ్యర్థమాయా వచోవ్యసన రసన
శఠవిటోచ్ఛిష్టాది సదనంబు వదనంబు
పలు బొజుంగుల చొంగబావి మోవి
పల్లవభయద కృపాణులు పాణులు
కుటిలాఘవితతుల కోపు చూపు
కృత్రిమగుణగణ గేహంబు దేహంబు
షిద్గసంఘంబుల సెజ్జ బొజ్జ

పంచసాయక రోగ ప్రపంచ ఘోర
యాతనా దూయమాన ప్రయాత విటప
మదసలిల యుక్తమగు దోని మలపుయోని
కనుగొనగ వేశ్య హేయభాజనము కాదె

ఇట్టి వేశ్యాకులంబున దిట్టవైన
నీకు జనియించి యిన్నా ళ్ళనేక విటుల
పలుతెరంగుల బాధించి బహుధనంబు
గూర్చితిక నిప్పడుపుగూడు కుడువ నొల్ల

పట్టినని నన్ను దయ చే
పట్టి యతని తెచ్చి కూర్చి బహుభాగ్యంబుల్‌
గట్టిగ కొన నొల్లవయో
కట్టడివి కదమ్మ లేచి కడ కటు పొమ్మా

మాతా జామాత పయిన్‌
బూతులపాతరలు తీసిపోయుదు రటవే
ఖ్యాతా సద్గుణగణ సం
ఘాతా పూతా విలాస కలనోపేతా

చతురున్‌ పుణ్యజనున్‌ సదాగుణయుతున్‌ సౌందర్య శోభా సమ
న్వితునిన్‌ చింతలపాటి వంశ భవునిన్‌ నీలాద్రినామ ప్రజా
పతి నిట్లూరక నిందసేసెదవు నాపట్టూనలే కయ్యయో
మతితప్పంగద నేడు నీకు జననీ మాయామయోద్యోగినీ

ఏలాగున నైనను నే
నీలాద్రినృపాలు చేరి నెయ్యమెలర్పన్‌
లీలాలోలత నుండుదు
చాలును నీలంజెజాతి సంబంధ మికన్‌

అని తల్లిమీద కనలుచు
కనుగొనలను బాష్పవారి కడు వడి జారన్‌
చని నిజ శయ్యాతలమున
తను వొయ్యన చేర్చి యతని తలచుచు నుండెన్‌

అత్తరి చంద్రిని చిత్తజు
డత్తి మహోన్మత్త సాయకావళి క్రోధా
యత్తమతి నింప పెంపరి
పత్తచిరిగి సిండవిరిగి పడి మూర్ఛిల్లెన్‌

ఆర్చి పేర్చి మారు డారీతి నేచంగ
కూర్చి కూర్చి సాడు కార్చుకొనుచు
మూర్ఛ తెలిసి తనదు ముంజేయి యోనిలో
దూర్చి యతనిగూర్చి దుఃఖపడుచు

హా అతిసార సుందర తరాంచిత విగ్రహ! నిన్ను చూచి నే
నాయత మోహపాశ వశనైతిని సన్నకసన్న నిప్పుడే
డాయగ వచ్చి నా భగ తట స్ఫుట ఘట్టిత పంచసాయకా
మేయ శిలీముఖచ్ఛటల మీటి రమింపుము నీలభూవరా

వారస్త్రీలకు మెచ్చగు
మారుండ వటంచు జనులు మరిమరి యెన్నం
గా రూఢిగ వినియుందు ను
దార విరహతాప మార్చతగదే నీకున్‌

చూచినయప్పుడె పైబడ
చూచి మరులుకొంటి వారసుందరినగుటన్‌
నీ చతుర కార్యపద్ధతు
లేచొప్పున నొప్పు ననుచు ఎంతయు ప్రేమన్‌

వాచె మొగంబు భగంబును
నీ చరణము లాన యింక నీవిట నాకున్‌
గోచరుడవు కమ్ము వెసన్‌
రాచినృప కుమార వారరమణీ మారా

వలరాజు చేత యాతన
బలువయ్యెను తాళజాల ప్రత్యక్షుడవై
చెలిమిని రమింపు మిందున్‌
కులుకుచు నీలాద్రిభూప కోమలరూపా

చలమేటికి రాకొమరులు
బలువుగ చూడంగ నాదు పజ్జను వేగన్‌
కులుకొప్ప వచ్చి భగము ప
గల దెంగుము చండ్లుపట్టి కసి తీరంగన్‌

సొమ్ములు కోకలు రూకలు
తెమ్మని నిను చిక్కుసేయ; దీకొని ఖరబం
ధమ్మున దెంగుము వడిగా
నమ్ముము పెక్కేల వారనారీ లోలా

చలమేటికి రమ్మిక కో
మలరూప పిశంగనేత్ర మన్మథబాధల్‌
తలగంగ మనసు తీరగ
బలువుగ దెంగంగ నాదు పజ్జకు వేగన్‌

అని మహోన్మాదావస్థచే దేహస్వాస్య్థంబు లేక చీకాకు పడుచు దుర్గంధబంధురంబై గొర్రెముక్కు వలె అనవరతంబు ద్రవించు తన యుపస్థం జూచి యుపస్థతో నిట్లనియె

పమ్మినవేడ్క వ్రాతపని పావడ పైకెగదీసివైచి చొ
క్కమ్ముగ గుద్దక్రింద నొక కమ్ములదుప్పటి నెత్తు వెట్టి మే
ఢ్రమ్ము నిగుడ్చి లోనికి దడాలున అంచులుమోయ దూర్చి నీ
తిమ్మిరితీర వాడెపుడు తీకొని తాకునొ యో త్రికోణమా

ఎందరు పొందుగూడి విషయించిన నిర్ద్రవమై నితాంతమున్‌
కెందలిరాకు డాల్‌హొయలు కీల్కొన పొంగుచు దెంగుమంచు లో
కందక తీటతీరక వికాసతనొందెడు నీకు తృప్తిగా
మందుడు నీలరాజెపుడు మగ్గమువెట్టునో యో త్రికోణమా

ఆకా? పోకా? రూకా?
కోకా? మేకా? మరేమి కొనియిచ్చెను తా
నీకాతనితో నేపని
పూకా! యీకరణి నేల పొరలెద వయయో!

తురకల మొడ్డలు దూదేకు మొడ్డలు
గుల్లాపు మొడ్డలు గొల్ల మొడ్డ
లా బోయ మొడ్డలు అల కాపు మొడ్డలు
చాకలి మొడ్డలు సాలె మొడ్డ
లబిసీల మొడ్డలు పబువుల మొడ్డలు
బాపన మొడ్డలు భట్ల మొడ్డ
లింగిలీజుల మొడ్డ లీడిగ మొడ్డలు
పీంజారి మొడ్డలు బేస్త మొడ్డ

లెన్ని దూరించి దెంగిన నించుకైన
జడియకుండెడి దాన వాశ్చర్యమిపుడు
నీలనరపతి చచ్చుమొడ్డేల నీకు
కాంక్ష గైకోకుమో దోసకారి పూక!

త్రుళ్ళిపడియెదేల చిల్లిలోపల వాని
చుల్లవెట్టి నిన్ను గిల్లికొనుచు
అల్లిబిల్లి దెంగ నుల్లసిల్లెదవు నీ
రుల్లిపాయ చాయ గొల్లికాయ

అని మరియు మనోజాత నిశాత చూతసాయకవ్రాత ఘాత యాతనాధూత చేతోరవిందయై, కంది కుందుచు, కొందలంబందుచు, వైవర్య్ణంబు చెందుచు, పాన్పుపయి పడుచు, పొరలుచు, లేచుచు, వంగుండుచు, తొంగుండుచు, దెంగుండు దెంగుండనుచు, వ్రాలుచు, సోలుచు, ఉపస్థం జరచుకొనుచు, వ్రేలిడుకొనుచు, వెక్కివెక్కియేడ్చుచు, వెడవెడం గన్నులు తేలవేయుచు, విహ్వలించుచు, విసువుచు, విన్నంబోవుచు, వీణం బాణుల ముట్టక, బట్టకట్టక, బోనంబు మెసవక, సురాపానంబు సేయక, ప్రాతబొజుంగులం బలుకరింపక, సుడివడుచు, స్రుక్కుచు, అసురుసురనుచు, నడునెత్తి మొత్తుకొనుచు, ఆయాసంబు పొందుచు, ఆరాటంబునం గుందుచు, చింతించుచు, చేతులు పిసికికొనుచు, చిన్నబోవుచు, సీత్కారంబు సేయుచు, చిడిముడి వడుచు, చీకాకు నొందుచు, చెమ్మటలం దోగుచు, పలవరించుచు, పండ్లు కొరుకుచు, బైలు కౌగిలించుచు, పరవశం బగుచు, బెంగ కొనుచు, బిసరుహాంబకుం దిట్టుచు, బిరబిర శరీరం బెరుంగక మరుమందిరంబునం గిరికొని గాఢంబులై వంకరలై వరలు నిడుదసోగ హొరంగు మెరుంగు వెండ్రుకలు తెగలాగి పారవైచుచు, నలుదిక్కులు కలయం జూచుచు, నవ్వుచు “హా! నీలాద్రి నరపాలపుంగవా! వచ్చితే!” యని లేచి “నాకురువు పయిం గూర్చుండు” మనుచు, పరిపరివిధంబుల మతిదప్పి, వెర్రిగొనిన వేపి తెరంగున, ఆలి సాలెపురువు చందంబున, మగ్గంబులో నాడెడి నాడె కైవడి, మధుపానంబు చేసిన వానరంబు పోలిక, మావి కరుచు నక్క టెక్కున, పిడుగు మొత్తిన జనుని చందంబున, మూగ లాగున, ముల్లెపోయి పొరలు ముండ విధంబున, ముక్కుచు, మూల్గుచు, మురికిపిత్తులు పిత్తుచు, మూకుడువంటి మూత్రద్వారంబు మొగివిప్పుచు, ముడుచుచు, మొగంబు దిగవైచుచు, మూర్ఛిల్లుచు, తెలియుచు, మోహ దాహాతితాపంబునం దల్లడిల్లుచుండె; నయ్యవసరంబున

వేంకటసాని కిదంతయు
కింకరు లెరిగింప, దుఃఖకీలితమతియై
కొంకుచు కూతురి నును ప
ర్యంకము చేరంగబోయి హా హా యనుచున్‌

బిడ్దరో నీకు మునుపుండు అడ్డగరలు
పెక్కుమారులు తగిలిన స్రుక్కకీవె
మాన్పుకొంటివి యిటువంటి మమత నాడు
కలుగదయ్యెను వట్టి దుష్కర్మమొదవె

ఆరయ నీలనృపాలుని
పేరును పెంపేమి? అతని పెద్దలు మున్నే
తీరున నుండిరి? యీ సిరి
వీరాగ్రణి విజయరామవిభు డొసగె గదా!

ఇంతెకాని, జమీందారుడే యతండు?
పరమమూర్ఖుండు బహులోభి పాపచిత్తు
డాత్మదాసీ రతుడు వాని కాస చెంద
ఇహపరసుఖంబు లేదు నీదేటి వలపు

ఎదురువెట్టి వేడ్క చదరంగమాడెడు
పగిది నీకుగల్గు పడుపుగూటి
సొమ్మొసంగి చేరరమ్మన్న గైకొను
నట్టివాడు ముద్దుపట్టి వినుము

పండ్లు తోమడు గుదప్రక్షాళనము సేయ
డమవస నాడైన హరిదినంబు
నందైన కడు నూరపంది మాంసము లేక
కూడు భుజింపడు గురుముఖంబు
కాడు తమ్ముల చేరనీడు సత్కవులకు
వైశ్యుల పెండ్లిండ్ల వలన వచ్చు
కట్నముల్‌ తా దురాగ్రహమున లంకించి
లంజెల కిచ్చును లజ్జమాలి

వినయమున తండ్రి తద్దినమునను విప్రు
పిలిచి ఒక కాసు తవ్వెడు బియ్య మీడు
పతితుడును లోభి చింతలపాటి నీల
రాజు, ఛీ ఛీ అతనిమీద మోజదేల?

పూచిన శాల్మలీద్రుమము పోలిన లోహిత దీర్ఘ దేహమున్‌
కాచసమాన పీత రచి గ్రాలెడు కొంచెపు కన్నుదోయి జ్యే
ష్టా చపలాక్షి వ్రేలుడు విశాలతరాస్యము కల్గు వాని సం
కోచములేక చూచి వలగొంటివె వారవధూశిరోమణీ

సానులకు గబ్బిబెబ్బులి
పూని కనుంగొనిన వాడు పోనీడు గదే
హాని యొనరించు హా! రతి
కూన! సరగ పారిపొమ్ము కొట్టామునకున్‌

నల్లమందును గంజాయి కల్లు పోతు
పిచ్చుకల మెక్కి నిను వాడు పిత్త దెంగు
పత్త చినిగిన విడువడే పాపి వాని
దుడ్డువలెనుండు మొడ్డపై దుంగలెత్త!

కుత్తయు పత్తయు చినగగ
మొత్తును మత్తిల్లి నీదు మొడ్డకు దండం
బొత్తకుమని వేడిన విన
డత్తులువబొజుంగు వాని కాసింతురటే?

పాపి విను వట్టియాసలు
చూపియ్యడు డబ్బు లంజెసొమ్ము భుజించున్‌
పాపాత్ముడు పశుకర్ముడు
మాపని రేపని భ్రమించి మగ్గము వెట్టున్‌

పిచ్చలు వడివడి రాయగ
కుచ్చులు మెయ్యంగ వాడు గొనకొని తాకున్‌
గచ్చంత పగిలి సలుపుచు
చచ్చేవే చంద్రరేఖ సాంద్రసురేఖా

పెద్దల నెరుగడు మాటల
పద్దులు పచరించు గర్వి భామ కురతిలో
ఎద్దు వలె మెలగు నీకా
బుద్ధి వలదు మానుమమ్మ పుత్తడిబొమ్మా

ఖలుడైన నీలనృపు డీ
యిలపై నిన్నాళ్ళు బ్రతుకునే నరసాంబా
గళ కలిత కనకమయ మం
గళసూత్రోత్కృష్ట మహిమ గాక కుమారీ

రొక్కమిచ్చెడు విటు జూచి దక్కినట్లు
తక్కుచును బొల్లిమాటల తనుపు; కాని
నిక్కముగ మానసంబీయ నిశ్చయించి
వారకన్యక యీరీతి వలచు నటవె?

ఎక్కడి నీలాద్రినృపుం
డెక్కడి యడియాస వలపు లివి కూడ వికం
గ్రుక్కినపేను తెరంగున
కిక్కురుమనకుండ చనుము గేహంబునకున్‌

అని వినయ విస్రంభ గంభీర సంరంభంబులు గుంభింప పలుక, నచ్చిలుకలకొలికి కంతకంతకు వింతవింతలుగ దురంత నితాంత విప్రలంభ వేదనాభరంబు భరింపరాకుండ కరంబు దళంబుగా పరవశత్వంబు నొంది మారుమాటాడ నోడి, ఓడిన కోడి చందంబున తల వ్రేలవైచుకొని, కదల మెదల నేరక కన్నులు మూసికొని, ఊరక శరీరంబు నీరు విడువ శయ్య నొయ్యన వ్రాలి తూలం కనుంగొని బెంగను లొంగి దుఃఖాంభోధి మధ్యంబున మునింగి కన్నీరు లేరులై పారి వెల్లివిరియ డిల్లపడి తల్లడంబున నుల్లంబవియ మెల్లమెల్లన నప్పల్లవ మనోభూతంబున కాతతగతి చల్లనిపనులు సేయందలంచి తన దాసికాజనంబులుం దానును దాని నిజశయ్యాతలంబునం జేరి

భగమధ్యమున మంచిచిగు రుప్పు కూరించి
పై కొండనల్లేరు ప్రస్తరించి
లంబ స్తన ప్రదేశంబున రేవడి
దూలగొండి చిగుళ్ళు గీలుకొలిపి
కన్నులలోన నర్కక్షీరములు నించి
ముక్కుగూండ్లను ఆవముద్దలుంచి
వీనులలోపల వేడినూనియ పోసి
నాలుక జెముడుపాల్‌ చాల పొడిచి

మేన రాసున్న మెంతయు మెత్తి, నెత్తి
గొరిగి, నిమ్మపులుసు గంట్ల గ్రుమ్మి, లోని
కిముడ నేపాళము లొసంగి యిట్లు శిశిర
కృత్యములు సేయ, అప్పు డక్కితవ వనిత

బడబడ పిత్తులు పిత్తుచు
బడిబడి బహుభంగి మీర పారుచు మరి తా
నొడలెరుగక పెనుమూర్ఛం
కడు సోలగ తల్లి కాంచి కటకటపడుచున్‌

వేంకటసోమయాజి కిది వేగమెరుంగగ చెప్పకుండినన్‌
కింకవహించి దుఃఖపడు కేవల మాతడె దీని కన్నవా
డింకిట నుండనేల యని యేడ్చుచు నాతని చేరి యంతయున్‌
జంకక చెప్ప నాతడును సంభ్రమ దుఃఖ భయార్ద్ర చిత్తుడై

వెర్రిలంజెవు, కాకున్న విషమబుద్ధి
శిశిరకృత్యము లీరీతి చేతు వటవె?
చల్లయును అన్నమును బెట్టి నల్లమందు
లోనికిప్పించి చేయింపు తానమిపుడె

ఈచందంబున చేసిన
ఈ చిన్నది బ్రతుకు నిపుడు నిక్కము దానిం
చూచెదనన క్రతు వూనితి
ఈ చోటుం దరలిరాగ నిది చెడునుకదా

చన్నుల చందనం బలది జానులనంటి చిగుళ్ళు కప్పి వా
ల్గన్నుల కప్పురంపు కలికంబిడి బాహువులందు పొందుగా
తిన్నని తూండ్లు చుట్టి నునుదేనియ మోవిని చిల్క వేగమే
చిన్నది తెల్వినొందు నిక చిత్తములో వగబూన నేటికిన్‌

అది లెస్సగ నున్నంతట
ముదమున నీలాద్రిరాజు మోహంబున నీ
సదనమున కరుగుదెంచును
పదపడి మన కిరువురకును భాగ్యము లిచ్చున్‌

వస్తాడు నీలభూపతి
తెస్తాడు ధనంబు నీ కతిప్రమదముగా
నిస్తాడు విరహవేదన
చస్తాడా? నమ్ము మదిని సందియ మేలా?

అనుచు తెలియజెప్ప నామోదహృదయయై
సరగ నరిగి యట్లు సలుప చంద్ర
రేఖ రేగుబువ్వు వైఖరి తెల్విచే
వలపు గులకరింప నలరుచుండె

నీలాద్రి నృపుండచ్చో
సోలుచు విరహానలార్తి స్రుక్కి వగచుచున్‌
జాలింబొందుచు నేడ్చుచు
వాలారుచు నింక నేటి వలపనుకొంచున్‌

దాని జానగు యోనిలో నటింపని మహో
ద్దండ దర్పిత కామదండమేల?
దాని కోమల సుధాధరము గ్రోలని మధు
రసరుచి వ్యాలోల రసనయేల?
దాని లంబస్తన తాడనం బబ్బని
వర కవాటోపమ వక్షమేల?
దాని జానుయుగ మర్దనము సేయని దీర్ఘ
దర్వీసమాన హస్తంబులేల?

దాని నిర్భర మధు మదాహీన దేహ
గాఢ పరిరంభ సంభోగ కలన లేని
భూరి విస్తార శాల్మలీభూజ తుల్య
పుష్టియుత ఘన మద్దేహ యష్టి యేల?

దానిని మక్కువ తొడపై
పూని కనుంగొనని రాజబోగం బేలా?
యీ నెరవయసేలా? యని
మానని చింతాభరమున మరుగుచు మరియున్‌

చందురుకావి పావడయు సైకపుబంగరువ్రాత చీరయున్‌
ముందల కుచ్చుగచ్చు తెలిమొగ్గల కంచెలమించు చేమపూ
గుందనపుం గడేలు వగగుల్కెడి క్రొమ్ముడి పట్టుబొందు సొం
పందెడు దాని మేని సొబగద్దిర నామది కొల్లలాడెడిన్‌

అని దురంత చింతాక్రాంత స్వాంతుండై

గ్రుడ్లు త్రిప్పును పండ్లు కొరుకును మూల్గును
నీల్గును మిగుల కన్నీరు నించు
అసురుసురను పింగుపిసికికొనును నోరు
మోదుకొనున్‌ లంజెముండ యిచటి
కేల వచ్చెను దాని నేలచూచి విరాళి
చెందితి ననుకొను చెడితి పడితి
నెవ్వరి పంపుదు నేరీతినదివచ్చు
యేమి సేయుదు దైవమిట్లు వెతల

పాలుగా జేసె సాటి నృపాలకోటి
లోన నగుబాటులయ్యె కాలూనరాని
విరహ పరితాప భరమున వేగ తరమె
అంచు పలవించు తలవంచు నార్తిగాంచు

తములంబు తినడు బోగమువారి నాడింప
డన్నంబు కుడువడు సన్నవన్నె
కోకలు కట్టడు కొలువు కూర్చుండడు
జలకమాడడు గందమలదుకొనడు
వేపులతో తాను వేటకు పోవడు
నడుపుకత్తెల కూడి నవ్వుకొనడు
వేంకటమఖి యజ్ఞవిధి కనుంగొనడు భా
గవతుల వేషవైఖరులు కనడు

కటకటా చంద్రరేఖా వికట కటాక్ష
వీక్షణాక్షీణ వాతూల విజిత దేహ
బాలభూరుహు డగుచున్న నీలనృపుడు
పరవశత లేచి వన లతా తరుల చూచి

కమ్మవిలుకాని తూపన
అమ్మఖశాలాంగణమున అగపడి చనె నో
యుమ్మెత్తకొమ్మ! నీవా
క్రొమ్మెత్తనిమేని సానికొమ్మం గనవే

వింటివొ లేదో శునకపు
దంటెము వలె బిర్రబిగిసి తలగని వలపుం
గొంటిని కనినది మొదలుగ
తంటెపుమోకా! యిదేమి తబ్బిబ్బో కా?

కప్పువిప్పు కలుగు గొప్ప కొప్పలరారు
అప్పొలంతి చొప్పు త్రిప్పు కిప్పు
డొప్పుమీర మీరు చెప్పరే గుప్పున
మెప్పులిత్తు నుప్పితిప్పలార!

మీరింద రొకటియై పొలు
పారం దిటమూన పల్కి యతిరయమున నో
కోరింద డొంకలారా
సారేందుముఖీలలామ జాడ తెలుపరే

మారార్తి నెంత వేడిన
మా రాకడ తెలియజెప్పి మారాడక యో
జోరీగలార మీరా
నారీరత్నమును తెచ్చి నాకొసగరుగా

చింతలనాటి కులీనుడ
చింతాసంతాప చలితచిత్తుడ నిను నే
చింతామణిగా నెన్నెద
చింతా! అక్కాంత తెరువు చెప్పుము నాకున్‌

వ్రణకిణాంకిత యోని గణికాలలామ నా
లోకింపరే తుమ్మ మ్రాకులార
తుంబీఫలసమాన లంబమానోరోజ
పొడగానరే పట్టకడుములార
యింగాళకంబళ శృంగారతర కేశ
పాశ నీక్షింపరే పాశలార
క్రకచదంష్ట్రాంకురాగ్ర మృదుత్వ సంయుక్త
దేహ కానరె తిప్పతీగలార

ఉష్ట్ర రదన చ్ఛదోపమానోష్టబింబ
నీడ చూడరె మీరు జిల్లేడులార
మర్దళసమాన విపరీతమధ్య చంద్రి
కాంచరే నిక్కముగ నేడు కారలార

పోడులమ్రోడులార కడు పూచిన పీతిరితుమ్మలార బల్‌
బాడిదచెట్టులార ఫలభాగ్‌ విషముష్టికుజంబులార ఆ
వేడుకకత్తె చిత్తమున వేడుకమీరగ వేగిరంబు మీ
నీడకు నీడకొక్కసరణిం పరతెంచదుగా వచింపరే

బెండా మూర్కొండా యా
దొండా మీ అండకిపుడు తోరముమీరన్‌
తాండవమాడుచు మేలిప
సిండందెలచంద్రి రాదె చెచ్చెర చెపుడా

నాకెదలోపల విరహము
చీకాగుగ చేయజొచ్చె చెచ్చెర నిపుడో
కాకీ ఘూకీ కేకీ
పూ కీదగుమేనిసాని పొడ చూపరుగా

కృకవాకులార మాద్య
త్కృకలాపములార గవయ కిశ శశ శునీ
వృకజాతులార బోగపు
సకియ లతల మిన్న చంద్రిసానిం కనరే

ఉరు తాప కరణ కారణ
వర తామరసాశుగములు వైచి మరుడు వి
స్ఫురితాంగి చూపుమిపు డో
యురుతా మామాట సేయనొప్పిన కొరతా

పందీ నీ గాత్ర సదృక్‌
సౌందర్య కళావిలాస చంచన్మురజి
న్నందన మందిర యగు ఆ
ఇందీవరపత్రనేత్రి నిటు చూపగదే

నీతీరు కలుగు రూపము
చేతన్‌ విటకోటి నవయజేయుచు కడకన్‌
పాతరలాడెడి పడుపుం
గోతిని వీక్షించినావె కోతీ ప్రీతిన్‌

కల్లు కడు త్రావి ప్రేలుచు
హల్లీసకమాడుకొనుచు అది ఇచ్చటి కు
ద్యల్లీల రాదె బల్లీ
పిల్లీ కడుముద్దుజిలుకు పిల్లలతల్లీ

నీలాద్రిరాజ నాముడ
వాలెంబున దానిజూచి వలచితి నేడా
స్థూలోపస్థాన్విత గణి
కా లలనన్‌ చంద్రరేఖ గంటివె ఖరమా

అని మరియును

మనసిజమాయలం దగిలి మ్రాకుల తుప్పల పక్షిజాతులన్‌
వన మృగకోటులం దలచి వారక యీగతి వేడి వేడినీ
రు నయనపాళి జాలుకొన రోదనమెంతయు చేసికొంచు పూ
చిన విషముష్టి భూరుహము చెంగట నీలశిలా తలంబునన్‌

చేరి కళేబర మచ్చో
చేరిచి హా చంద్రి నాకు చెప్పక పరవం
కారణమేమి మరెవ్వని
కోరిక తీర్పంగ తలచుకొంటివొ చెపుమా

కోకలు రూకలు ఆకులు
పోకలు మేకలును పట్టుబొందులు సొమ్ముల్‌
నాకంటె మిక్కిలీగల
రాకొమరుడు కలడె ఈ ధరావలయమునన్‌

చక్కనివాడ రభసమున
కుక్కుట మార్జాల శునక కూర్మ రతులచే
చొక్కింపంగల వాడను
చిక్కులువెట్టంగ నీకు చెల్లునె చంద్రీ

రమ్మా నా యభిమత మిపు
డిమ్మా యిమ్మాడ్కి నేచనేటికి హొన్నుల్‌
కొమ్మా సమ్మతినిచ్చెద
కొమ్మా వెలముద్దుగుమ్మ గుబ్బలగుమ్మా

జాలముచేసి మారశరజాలము పాలుగజేయ నాయమా
తాళగజాల నీవిరహతాపభరంబు కరంబు హెచ్చె నీ
తాళఫలోపమాన సముదగ్ర కుచద్వయ మక్కుజేర్చి లీ
లా లలితోపగూహన కళాకలనన్‌ సుఖియింపజేయుమా

శోషించెన్‌ మదనోపతాపమున అక్షుద్రోన్నత స్థూల ని
ర్దోషోద్యత్‌ తనుయష్టి పుష్టిగను మందుల్‌ చేసినన్‌ కాదహో
రోషంబూనక నే డపారకరుణా రూఢాత్మ పంకేజవై
యోషిద్రత్నమ చంద్రి నీ అధరపీయూషంబు నాకీయవే

పెక్కుతెరంగుల నీకున్‌
మ్రొక్కెద చలమేల నాదుమోహము తీరన్‌
చక్కెరవిల్తుని కూటమి
మిక్కుటముగ తేల్చి ఏలుమీ దాసునిగాన్‌

మేలెంచెద సామ్రాజ్యం
బేలించెద తొంటిసతుల యెల్లరకంటెన్‌
లాలించెద పాలించెద
తేలింపుము రతుల నన్ను తేకువ మీరన్‌

చక్కెరవిల్తుని బారిన్‌
చిక్కితి నీ పాదయుగ కుశేశయములకున్‌
మ్రొక్కితి దక్కితినిక నీ
తక్కులు దిగద్రొక్కి నన్ను దయచూడగదే

గంధ మత్తరు జవ్వాది కస్తురియును
దొడ్డయొడ్డాణమును కమ్మదోయి క్రొత్త
పట్టుచీరలు కుచ్చులు బావిలీలు
రొక్కమిదె కొమ్ము నీ లంజెటక్కు మాని

తాళజాలను నీవింత జాలమేల
చేసెదవు నన్ను మిక్కిలిచెలిమి రతుల
నేలుమీ వేగ మాటాడి ఫాలలసిత
సరస నవచంద్రరేఖ ఓ చంద్రరేఖ

తియ్యని మొద్దుమాటలును తేనియగారెడు బొల్లిమోవియున్‌
పయ్యెదకొంగులో పొదలు బల్‌చనుగుబ్బలు మంగలంబుతో
కయ్యముసేయు మోము నులికన్నులు తోరపుకౌను నాకు చూ
పియ్యడ మారుకేళి కడు నేలుము జాలముసేయ కింతయున్‌

అమలంబై తరుణారుణ ద్యుతిసమేతాశ్వత్థపత్రాభమై
రమణీయ స్ఫుట దీర్ఘ లింగయుతమై రంగద్ద్రవోపేతమై
సమమై రోమవిహీనమై వెడదయై జానొప్పు నీ మారగే
హము నా కర్మిలి చూపి ప్రౌఢరతి నోల్లాడించు చంద్రీ దయన్‌

అని మరియును

హా యను చంచరీక నిచయాంచిత కుంచిత రోమ కామగే
హా యను దాన మానిత మహాద్విప మోహన మోహనైక బా
హా యను కంక కాక మహిషాశిత దుర్భర నిర్భరాతి దే
హా యను చంద్రి తాళనహహా యను భీతశిరోరుహా యనున్‌

డాయగరాకు నన్ను మరుడా యను ఏచగనేల రిక్కరే
డా యను వద్దువద్దు చనుడా యను సోకకపొమ్ము గాలిపీ
డా యను చంద్రితల్లి వరడా యను వేంకటశాస్త్రి నేడు రా
డా యను కూతు కూర్ప తగడా యను ఏగతి దేవుడా యనున్‌

ఆకరణి నుడివి డేరా
మేకువలెన్‌ బిర్రబిగిసి మిట్టిపడు నిజా
స్తోక సుమకామదండము
చేకొని చీకుచును బుద్ధి చెప్ప దొడంగెన్‌

చాపలమోపు చంద్రి నిను చక్కగ చక్కెరవింటిదంట పెన్‌
కాపురపింటిలోపలికి గ్రక్కున దూరి సుఖింపకుండ సం
తాపమొనర్చి యేగెనటు తాళుమటన్నను తాళకేల యు
ద్యాపనశక్తి చూపెదవు దండము నీకు మనోజదండమా

గచ్చులు మచ్చు లచ్చెరువుగా కడలన్‌ వెదజల్లు చంద్రి బల్‌
పచ్చని రెక్కదోయిగల పక్కిహుమాయివజీరునింటిలో
చొచ్చుచు వచ్చుచున్‌ మిగుల చొక్కుచు క్రీడ యొనర్చుచుండగా
నిచ్చలు తృప్తిచేసెదను నిల్వవె కొంచెముసేపు దండమా

పెక్కుతెరంగులం కరనిపీడన మే నొనరించి వంచినన్‌
స్రుక్కక మిట్టిమిట్టి తలజూపుచు సన్ననిపంచె చించుచున్‌
మొక్కలపాటు చూపెదవు మున్ను త్రికోణము లెన్ని చూపితిన్‌
మ్రొక్కెద నిక్కుమాను మతిమూర్ఖ మనోభవదీర్ఘదండమా

కాయలుకాచె నీదు తలకాయ యహా సుకుమార వార క
న్యాయత కచ్ఛపోపమ భగాంతర నిత్యగతాగత క్రమో
ఛ్రేయ సమగ్ర ఘట్టన విశేషతరాపద నైన నింక నో
కాయజదండమా విసువుగైకొని యూరకనుండ లేవుగా

పంకములంటె నాకు బహుభంగుల నీకతనన్‌ విలాసవత్‌
పంకజపత్రనేత్రలను బల్మిని పట్టగ తద్విశాల మీ
నాంకగృహాంతరాళ భరితాత్మజల ప్లుత పాంశు సమ్మిళత్‌
పంకము నీకు నంటె గద పాపపుమేఢ్రమ యిట్లుసేతురే

ఎందరి వేడుకొంటి మరియెందరి పాదములంటుకొంటి ము
దెందరినాశ్రయించితి నికెందరికిన్‌ ప్రణమిల్లజేసెదో
కొందలమందెడిన్‌ మనసు గొబ్బున నా మనవాలకించి యా
బందెలమారి చంద్రి భగభాగ్యము కోరకు మారదండమా

కమలపత్రస్ఫూర్తి కనుపట్టు భగములు
మించుటద్దమ్ముల మించు భగము
లశ్వత్థ పాండుదళాకార భగములు
పనసతొనల పోలు ఘనభగములు
దింటెనపూవులవంటి భగంబులు
ఈతగింజలరీతి నెసగు భగము
లల పందిముట్టెలవలె నుండు భగములు
కాకిపిల్లలనోళ్ళగతి భగములు

పెక్కుజూపితి నీవును నిక్కుకొనుచు
అన్ని లొడవెట్టి వెడలితివకట యిపుడు
చంద్రిభగమేమి భాగ్యమా సైపుమా ము
డుంగులింగమా చాలపొడుంగు మాని

తులువలు వడివడి తాకగ
లలి చినిగిన పూకు దెంగులకు వెరచునె నీ
తల బ్రద్దలగును దానిం
తలచి నిగుడబోకు మదనదండమ యింకన్‌

కొంకేది బానిసగుడిసెలు దూరుట
పరికించి చూడ నీకొరకు కాదె
బత్తిని దొమ్మరితొత్తుల నిల్పుట
గొనకొనియున్న నీకొరకు కాదె
గోడిగలను గొనిగూడుల కట్టుట
కొంచకెంచంగ నీకొరకు కాదె
బాలవిధవలకు నోలి మాన్యములిచ్చు
టరసి చూడంగ నీకొరకు కాదె

వారకన్యకలకు నే నవారితముగ
కోకలును రూకలిడుట నీకొరకు కాదె
కూళతనమూనుటెల్ల నీకొరకు కాదె
ఓ మకారోత్వమా శాంతమూనుకొనుమ

తేనియకంపు పెంపు గల తేజము ఝల్లున పెల్లువారగా
గోనెలలీల తేరు చనుగొండలు సిండయు తాండవింపగా
గానుగరోలు పోలు మెయి కంపిల పైకొని మేఢ్రదండమా
దాని పకారగొమ్ము వెడ తాకగ వ్రక్కలుసేయు టెన్నడో

కుక్కుట చూళికా భగనగొల్లి నఖంబులగిల్లి మెల్లనే
చొక్కపు మన్మథాలయము చుంబనమెంతయు చేసి దానిలో
గ్రక్కున మోవి దూర్చి వగ గైకొని పీల్చిన చంద్రి మిక్కిలిం
జొక్కి రమింపనిచ్చు గద సొంపుగ నో లవడా తడాలునన్‌

ఆ భూతాకృతి చంద్రి సాంద్రతర రోమాంచత్రికోణంబులో
ఆభోగ స్ఫుట చండ తాండవ మహావ్యాపార కేళీకలా
లాభంబందెద నంచు నిక్కి ననునేలా సారె గారించెదో
శేభస్తంభమ దాని పొందెటువలెన్‌ సిద్ధించు నీకిత్తరిన్‌

గొల్లెనకంభమంత నిడుగొల్లి చొకారపు నల్లతీగెల
ట్లల్లికగొన్న రోమములు అద్రిగుహోపమమౌ బిలంబునన్‌
తెల్లని కొర్రగంజి పస మించు ద్రవంబును కల్గు చంద్రి మా
రిల్లెపుడీవు సొచ్చెదవొ హెచ్చరికన్‌ బహుదీర్ఘశిశ్నమా

నీచతకోర్చి బంధుజననిందకు రోయక తొల్లి గార్దభిన్‌
చూచియు నీవు మిట్టిపడజొచ్చిన నీ చపలంబు తీర్పగా
లోచితవృత్తి గైకొనియు ఒద్దికమీరగ దాని యోని దూ
రించినవాడ కాదె నిను రిత్తగజేయక నాదు మేఢ్రమా

వినువిను వద్దువద్దు అవివేకము పూనకు చంద్రిపూకుపై
మనసిడకంచు చెప్పినను మానక మిట్టిపడేవు చొచ్చినన్‌
ఘనమగు పుండ్లునున్‌ సెగయు గడ్డలు నంటి చెడేవు మానుమీ
అనుపమరూపనిర్జిత మహాగజదండమ మారదండమా

ఇట్లనేక ప్రకారంబుల మనోవికారంబుచేతం చేతనాచేతన జ్ఞాన విహీనుండై యా నీలాద్రిరాజన్యశతమన్యుం డుద్దండంబుగ దండనుండి గండుకొనివచ్చు కుసుమాయుధవిధు మలయాచలసమాగతవాత పోత మధువ్రత పరభృత కీర శారికావారంబుల గురించి దూషింపం దొడంగె

మదనా మదనాశుగచయ
మదనా చెలరేగి యేయ నాతత శశభృ
ద్వదనా మృదులోపస్థా
సదనా యెద నాటెనిపుడు శంబరమథనా

సకలపూరుష హృదయార్తి సంఘటించు
సాని నీ చంద్రరేఖాభిధానమూని
కేరుచున్నది దానిపై కినుకమాని
తద్విరహి నన్ను నేచంగదగునె చంద్ర

ఫణిరోమరేఖ యగు న
గ్గణికాంగన మీద పోవగావెరచి సమీ
రణమా మము నేచగ కా
రణమేమి తలంగు సత్వరత సద్బుద్ధిన్‌

మిమ్ము జయించు మించుగల మేలి నునుం బెనుగొప్పుచేత నే
మమ్ము మనోభవ ప్రకట మార్గణజాలము పాలుచేసి తా
కిమ్మనకేగె దానిదరి గేరరు చంపకగంధి యంచునో
తుమ్మెదలార మీరిచట త్రుళ్ళెదరక్కట శౌర్యహీనులై

ఆ వెలపొలంతి కని నే
కేవల విరహార్తిచేత కృశియించెడిచో
నీవు చెవుల్‌ చిందరగొన
కోవెల కూయకుము నిన్ను కొరుతన్‌ వేయన్‌

పరపురుషార్థం బంతయు
హరియించును నేచు చంద్రి అంచితబింబా
ధరమాని సుఖింపక త
త్పరవశు నను నేచనేమి ఫలమగు చిలుకా

అని అనివార్యమాన మదనాపదచే సకలప్రపంచమున్‌
తనువును పేరునున్‌ మరచి తన్మహనీయ వియోగవార్ధిలో
మునుగుచు తేలుచున్‌ పరమమూర్ఖతచే పలవించుకొంచు అ
జ్జనవరపుంగవుండు కడు సత్వ్తము పెంపుదొరంగి మూర్ఛిలెన్‌

అనుచు శ్రీ నంబి నారసింహార్యవర్యు
డానతిచ్చిన శివభూసురాగ్రగణ్యు
డైన వీరన విని అద్భుతాత్ముడగుచు
పిదప కథ చెప్పు డతులిత ప్రీతి ననుడు

మారాకారా కారా
గారాంతర విహరణోగ్రకర్మఠ పారా
వారావృత ధరణీతల
వారవధూజాల నిత్యవర్ణితశీలా

హరిగుణగణఖేలా అంగజవ్యాధిలోలా
పరిచితవిటజాలా బాలరండానుకూలా
నిరత రచితజాలా నీచదాసేయపాలా
దురితచయవిశాలా దుర్గుణౌఘాలవాలా

ఇది శ్రీమజ్జగన్నాథదేవ కరుణాకటాక్ష వీక్ష ణానుక్షణ సంలబ్ధ సరసకవితా విచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల పవిత్ర గంగనామాత్యపుత్త్ర మానితానూన సమాన నానావిధరంగ త్రిలింగదేశభాషా విశేష భూషితాశేషకవితా విలాసభాసు రాఖర్వ సర్వలక్షణసార సంగ్రహోద్దామ శుద్ధాంధ్ర రామాయణప్రముఖ బహుళప్రబంధ నిబంధనబంధురవిధాన నవీనశబ్దశాసన బిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశోమేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథనామధేయ ప్రణీతంబైన చంద్రరేఖావిలాపంబను హాస్యరసప్రబంధరాజంబునం ద్వితీయాశ్వాసంబు సంపూర్ణము