గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం

సిన్సినాటి తానా మహాసభ లో జయప్రభ చేసిన ప్రసంగ వ్యాసం.
(జయప్రభ గారు ఈ వ్యాసానికి శీర్షిక ఇవ్వలేదు. సందర్భం తెలియటంకోసం మేమే ఈ పై శీర్షిక నుంచాం.)

తెలుగులో స్త్రీవాద సాహిత్యాన్ని గురించి నేను మాట్లాడటం అంటే ఒక రణరంగపు చిత్రపటానికి తెరతీయటమే! మానుపట్టని గాయాలని మళ్ళీ కెలుక్కోవటమూ…. బాధల భరిణి తెరిచి సంఘర్షణ సెగలని వెలికి తీయటమూనూ!!

ముఖ్యంగా స్త్రీల నించి 1986-1993 మధ్యకాలంలో వచ్చిన సాహిత్యం మీదే ఎక్కువగా చర్చలు జరిగాయి. వివాదాలు చెలరేగాయి. ఇదివరకటికన్నా భిన్నమైన కవిత్వం రాసిన కారణానికి, పురుష సాహిత్య సమాజం నించి కవయిత్రులు నిందలని, కుతర్కాలని, అపవాదులనీ కూడా భరించవలచి వచ్చింది.

ఏమిటి ఇంత రచ్చకి కారణం…. ఏమిటా సాహిత్యం… అన్న కుతూహలం మీకు సహజంగానే కలుగుతుంది. నాకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సాహిత్యాన్ని… దీనిమీద వచ్చిన విమర్శలని… ఈ సాహిత్యం సాధించిన ఫలితాన్నీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

మొదటగా, స్త్రీవాద సాహిత్యంలో వ్యక్తమైన నిరసనగాని, అసహనం గాని పురుషాధిక్య సమాజం మీదనే గాని… వ్యక్తులుగా పురుషుల మీద కాదని నేను చెప్పవలసి ఉంది. వ్యక్తులుగా ఆడ మగ లో అన్నిరకాల మనస్తత్వాలున్న వాళ్ళూ ఉంటారు. వారి వారి ఆలోచనలనీ తద్వారా వారి జీవితాలనీ నిర్దేశించే భావజాలం ఏదైతే ఉందో … దాని ప్రభావం దృష్య్టానే మనం మన కాలంనాటి సమాజాన్ని… అందులోని విలువల్ని అంచనావేస్తాం.

సమాజంలోని అన్నిరంగాలల్లోనూ నిరాఘాటంగా చెలామణి అవుతోన్న పురుషుల అధికార స్వభావాన్ని ప్రశ్నిస్తూ… దాన్ని మార్చే దిశగా ఆడవాళ్ళనీ… మగవాళ్ళనీ కూడా చైతన్యవంతులని చేసి ఒక మంచి మానవ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా నడవాలన్నదే అంతిమంగా ఫెమినిజం ఆశయం!

అమెరికాలో ఉంటున్న మీకు ఫెమినిజపు ఆవిర్భావం గురించిగానీ, దాని పూర్వాపరాలను గురించి గానీ నేను పునరుద్ఘాటించ పని లేదు. ఫెమినిజం ప్రభావంతో డెబ్భై దశకంలో ఇండియాలో కూడా, చదువుకున్న స్త్రీల ఆలోచనావిధానంలోనూ…. రాజకీయ పరిజ్ఞానంలోనూ మార్పులొచ్చాయి. వాటి చాయలు తెలుగుదేశంలోని ఆడవారిమీద కూడా కొద్దోగొప్పో ప్రసరించి… అవి క్రమేపీ విస్తరించి ఎనభైయవ దశకం చివరికొచ్చేసరికి ఏ రూపాన్ని సంతరించుకున్నదీ నా వ్యాసం తెలియజేస్తుంది.

సమాజంలోని స్త్రీల సమస్యలకి సంబంధించిన విశ్లేషణలతో ఎమర్జన్సీ తరవాత ఐదారేళ్ళ కాలంలో తెలుగులో ఒక రెండు పుస్తకాలొచ్చాయి. అందులో ఒకటి 1977 అక్టొబర్‌ లో అచ్చయిన స్నేహలతారెడ్డి స్మృతి సంచిక. స్నేహలతా రెడ్డి తెలుగులో ముఖ్యమైన కవి పఠాభి భార్య. నృత్యకారిణి, నటి, రచయిత్రి, రాజకీయంగా లోహియా అనుచరురాలు. ఈవిడ ఎమర్జన్సీ కాలంలో అరెస్టయి, జైలులో అనారోగ్యం పాలయినందువల్ల చనిపోయారు. స్నేహలతారెడ్డి స్మారక సంచికగా లోహియా విజ్ఞాన సమితి స్నేహలతని గురించిన వ్యాసాలతో పాటు స్త్రీల పరిస్థితిమీద కూడా కొన్ని వ్యాసాలు ప్రచురించింది. ఈ వ్యాసాలు రాసిన ఆడవాళ్ళలో స్నేహలతతో సహా బయటి భాషల వారే ఎక్కువ. కమలాదేవి చటొపాధ్యాయ, ఇందుమతీ కేల్కర్‌, ఉష మెహతా, చంపాలిమాయే, రీమా కాశ్యప్‌ ఇలా! కారణాలేమయినాగానీ ఈ వ్యాసకర్తల అభిప్రాయాల మీద ఎవరూ వివాదాలు లేవదీసినట్టుగానీ, చర్చలు చేసినట్టుగానీ కనబడదు.

అలాగే 1981 లో ఖమ్మం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళు ” సాహిత్యంలో స్త్రీ ” అని ఒక చిన్న పుస్తకం ప్రచురించారు. ప్రాచీనకాలం నించి ఈ నాటికాలం దాకా స్త్రీల పరిస్థితి వివిధ రంగాలలో ఎలా ఉందో సమీక్షించే పని ఈ పుస్తకం చేసింది. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని మినహాయిస్తే ఈ పుస్తకంలో స్త్రీని గురించిన వ్యాసాలు రాసినవారు ఎక్కువగా మగవాళ్ళే! కానీ, ఈ పుస్తకం కూడా ఎవరినీ పెద్దగా ఇబ్బంది పెట్టినట్టు లేదు.

ఏదో అడపాదడపా కవిసమ్మేళనాలలో ఆడవాళ్ళ స్థానాలు భర్తీ చేయటం కోసం రాసే కవయిత్రులు ఒకరిద్దరున్నా వారి భావాలు కూడా ఎవరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ప్రధానంగా అప్పటిదాకా వచ్చిన వీరి పుస్తకాలలో అప్పటికే తయారై ఉన్న ఒక frame ని ఒప్పుకుని అప్పటిదాకా అమలులో ఉన్న సూత్రాలననుసరించి రచనలు చేయడమే కన్పిస్తుంది. వీళ్ళలో సంఘర్షణ లేదని అనలేం! వాళ్ళు తమ రాతల్లో వాటికి చోటివ్వ లేకపోయారు.

విలువలలోని ద్వంద్వాన్ని మొదటిసారిగా బయటపెడుతూ స్త్రీల సాంఘిక చరిత్రని….. రికార్డు చేసిన ప్రయత్నం 1986 లో జరిగింది. సమాజం తరపున యుద్ధాలు చేసిన వాళ్ళూ… సమాజం కోసం త్యాగాలు చేసిన వాళ్ళూ ఆడవాళ్ళెందరు లేరూ? కానీ వాళ్ళెవ్వరిగురించీ మనకి తెలిసింది తక్కువ! తెలిసినా, అందులో కల్పనకి ఉన్న విలువ ” చరిత్రకి ” ఉండదు. ఆయా స్త్రీల భావాలకి గానీ… అనుభవాలకి గానీ…. ఈ కల్పనల్లో పెద్ద చోటుండదు. ‘ రుద్రమ దేవి ‘, ‘ ఝాన్సీ రాణి ‘, ‘ రాణీ చన్నమ్మ ‘, ‘ చాంద్‌ బీబీ ‘, ‘ మేడం కామా ‘ ఇలా అస్పష్టమైన కొన్ని పేర్లుగా తప్ప… వీరి వ్యక్తిత్వం గురించిన వివరాలని చరిత్ర పొందుపరచదు.

రామ్మోహన్రాయ్‌ కి ఉన్న ప్రాధ్యాన్యత పండిత రమాబాయికి ఉండదు. ఆది శంకరాచార్యులకున్న ప్రచారం అక్క మాహాదేవికి రాదు! తమ చెరిపేసిన రూపాల ఆనవాళ్ళని వెతికిపట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఎనభైలలో స్త్రీల సాంఘిక చరిత్రని ఒక ఉద్యమాన్ని నేపథ్యంగా తీసుకుని రాయడం జరిగింది. స్త్రీశక్తి సంఘటన అనే స్త్రీవాద సంస్థ ఒకటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్ళ అనుభవాలని ” మనకు తెలియని మన చరిత్ర ” అనే పేర పుస్తక రూపంగా ప్రకటించింది! 1940 లలో తెలంగాణా జిల్లాలలో కమ్యూనిస్టుపార్టీ నేతృత్వంలో జరిగిన ఆయుధ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్ళని కలిసి వాళ్ళ అనుభవాలని వారి మాటల్లోనే అచ్చువేశారు స్త్రీశక్తి సంఘటన వాళ్ళు! ఒకనాటికి తమ ఉద్యమంలో భాగస్వాములైన స్త్రీలంతా ఆ ఉద్యమం గురించి తామేమి అనుకున్నదీ చెప్పగలరని బహుశా కమ్యూనిస్టుపార్టీ కనీసంగా కూడా ఊహించి ఉండదు.

తమసేవలనీ… సహకారాన్నీ తీసుకోవడంలో చూపిన శ్రద్ధ… కుటుంబపు ఆధీనంనించి … ఫ్యూడల్‌ భావజాలంనించీ ఆడవాళ్ళని తప్పించటం కోసం ఏ ఆలోచనలు చేయకుండా ఉన్నవిలువలని ఉన్నట్టుగానే అట్టేపెట్టాలని చూసిందనీ తెలియజేశారు. పార్టీకి స్త్రీల విషయంలో ఒక అవగాహన గానీ…. ఒక ప్రణాళిక గానీ లేవని వీళ్ళు అభిప్రాయపడ్డారు. ఎంతగా పుచ్చలపల్లి సుందరయ్యగారు గానీ, చండ్ర రాజేశ్వరరావు గారుగానీ స్త్రీల విషయంలో పార్టీ ఒకలాంటి తేడాని పాటించిందని ఒప్పుకున్నా… స్త్రీల విషయానికి సంబంధించి పార్టీకూడా పురాణకాలం నాటి ప్రమాణాలనే ఎందుకు ఆచరించిందీ అన్న ప్రశ్నకి స్పష్టమైన జవాబు చెప్పలేదు. కుటుంబమే స్త్రీలకి జీవిత పరమావధి అని చూపించటమూ ఆడవాళ్ళకి ” శీల ” పరీక్షలు పెట్టడమూ కమ్యూనిష్టులు కూడా చేశారు.

ఉద్యమంలో పాల్గొన్న ఆడవాళ్ళ కలలన్నీ కోడిగుడ్డు చిదిమితే చిదిమినట్లయిపోయాయని అంటుంది ప్రియంవద. మగవాళ్ళు తమని వాడుకునే ప్రయత్నాలని తప్పించుకుందికని ఇష్టం లేకపోయినా ” రక్షణ కోసం ” ఎవరినో ఒకరిని పెళ్ళిళ్ళు చేసుకోవలసి వచ్చిందని చెబుతుంది సుగుణమ్మ. పార్టీకోసం ఎంతగానో శ్రమించి…. వైద్యసేవలందించిన అచ్చమాంబ అనే ఆవిడని ” శీలం ” సరైనది కాదని పార్టీలోని మగవాళ్ళు సృష్టించిన పుకార్ల ఆధారంగా పార్టీనించి బహిష్కరించడానికి కూడా పార్టీ నాయకులు వెనుకాడలేదు. కన్న తరవాత అడవుల్లో తిరగడానికి ఇబ్బందిగా ఉంటుందని కొడుకుని వదిలేయమని చెప్పినపుడు కమలమ్మ కన్నీళ్ళు పెట్టుకుని బాధపడితే ఆమెకి కార్మిక వర్గ దృక్పథం కొరవడిందని నింద వేస్తుంది పార్టీ. ఉద్యమం నిలిపేసేక కుటుంబాలనించి విడివడి వచ్చిన ఆడవాళ్ళని తిరిగి ఇంటికి వెళ్ళిపొమ్మని పార్టీ నిర్ణయించి నప్పుడు చాలామంది స్త్రీలు ఆ నిర్ణయాన్ని ప్రశ్నించారు. దానికి, బసవ పున్నయ్య లాంటి నాయకుడు ” మేమే ఏమీ చేయలేక ఊరుకున్నాం! మీరేం చేస్తారు, ఇంటికెళ్ళిపో ” అంటాడు సుగుణమ్మతో!

” మనకు తెలియని మన చరిత్ర ” పుస్తకం ఒక పక్క స్త్రీల దృక్పథం ఎందుకు అవసరమో తెలియజెప్పి, ఈ పుస్తకం ద్వారా మరో పక్క ” ప్రజాస్వామ్య దృక్పథమూ సర్వమానవ సమానత్వమూ ” అంటూ మాట్లాడే రాజకీయ పార్టీల వైఖరి నిజానికి ఆడవాళ్ళ పట్ల ఆచరికంలో ఎంత అప్రజాస్వామికంగా…. ఎంత అసమానత్వంగా ఉంటుందో కూడా తెలియజెప్పింది. దీనితో దాదాపు మరి నలభై సంవత్సరాల తరవాతనే అయినా స్త్రీల విషయంలో తమ పార్టీ అనుసరించిన విధానానికి వారు జవాబులు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకరకంగా ఇది వారు ఎవరూ ఊహించని దెబ్బ! ఐతే, మార్క్సిస్టులు ఈ పుస్తకం తరవాత తమ వైఖరిని పునః పరిశీలించుకోవలసింది పోయి…. అసలు ఫెమినిజాన్నే తమ ఉనికికి ప్రమాదంగా భావించే మానసిక స్థితిలో పడిపోయారు. అటు తర్వాత వచ్చిన స్త్రీవాద సాహిత్యాన్ని దుయ్యబట్టిన వారంతా మార్క్సిస్టు సంస్థలకు చెందిన మగవాళ్ళే కావటం యాదృచ్ఛికం ఏమీ కాదు.

స్త్రీల సామాజిక పరిస్థితి మీద విశ్లేషణ ఒక గాంధీనో, మార్క్సో, మావో లేదా లెనినో, ఒక రామ్మనోహర్‌ లోహియానో… ఒక రామస్వామి నాయకరో చేయాలి గానీ ఆడవాళ్ళు చేస్తే ఎలా? అలాగే సాహిత్యంలో కూడా ఆడదాని దీన స్థితి గురించి ఒక ఠాగోరో, ప్రేం చందో, శరశ్చంద్రో, ఒక గురజాడో, చలమో మాట్లాడాలి గానీ ఆడవాళ్ళూ మాట్లాడితే ఎలా?

” యుద్ధోన్ముఖంగా ” అనే నా కవితా సంకలనం కూడా 1986 లోనే వచ్చింది. 1988 లో నేను రాసిన ” వామనుడి మూడో పాదం ” అన్న కవిత్వ పుస్తకం అచ్చయింది. 1988 లోనే భావకవిత్వంలో స్త్రీని గురించి నేను చేసిన విశ్లేషణ కూడా అచ్చులో వచ్చింది. వెంటవెంటనే ఈ పుస్తకాలన్నింటి మీదా పత్రికలలో రివ్యూలు వచ్చాయి. అందులో అధిక శాతం రివ్యూలు, ఈ పుస్తకాలలోని నాభావాలని ఎలా తీసుకోవాలో తెలియని ఒక గాభరాతోనీ…. అయోమయంతోనీ కన్పిస్తాయి. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు భావ కవిత్వంలో స్త్రీని గురించి ఆంధ్రజ్యోతి వారపత్రికలోని తాను రాసే కాలం ” ఫిడేలు రాగాలు ” లో ఒక మూడువారాల పాటు చేసిన సమీక్ష దీనికి ఉదాహరణ.

వ్యక్తిగత సంబంధాలు వేరు, సామాజిక సంబంధాలు వేరుగా వుండవు. వ్యక్తిగత సంబంధాలు బాగుపడకుండా వ్యక్తులకి సమాజంతో ఏర్పడే ఇతర సంబంధాలు శుభ్రంగా ఉండే వీలుండదు. అందువల్ల ఆడవాళ్ళ విషయాలన్నీ ప్రైవేట్‌ విషయాలని తోసిపుచ్చే సమాజపు దృష్టిని తిరస్కరించి… ఇన్నేళ్ళ మౌనాలకి గండి కొట్టాల్సిన సామాజిక చారిత్రక అవసరం ఒకటి ఆడవాళ్ళ ముందు అనివార్యంగా వచ్చిపడింది. ఆ అనివార్యత మొదటగా సాహిత్యరూపంలో వ్యక్తమయింది. ఈ సాహిత్యానికి ఆరంభం నేను రాసిన ” వామనుడి మూడో పాదం ” కవితా సంకలనం!

పుట్టిన ఆడపిల్లని గృహిణిగా తయారుచేసే క్రమం ఒకటి మాటల ద్వారా పాటల ద్వారా పెంపకంలో … ఆమె ఆలోచనాసరళిలో చొప్పించడానికే మగసాహిత్య కారులు బోలెడంత సాహిత్యాన్ని సృష్టించారు! ఆడవాళ్ళలో దీనికన్నా భిన్నంగా ఆలోచించే అవకాశాన్ని చాతనైనంత వరకు తీసివేయాలని చూశారు వాళ్ళు! అయినా ఆడవాళ్ళు మౌఖిక సాహిత్యంలో కుటుంబ జీవనంలోని క్లిష్టతని గురించి… వత్తిడిని గురించి… తామేమనుకుంటున్నదీ పాటలు కట్టి పాడుకున్నారు. ఆడవాళ్ళకి చరిత్ర ఎలా ఉండదో… వాళ్ళ సాహిత్యానికి కర్తృత్వమూ అలాగే ఉండదు. అలాంటి ఒక పాట ఏ తరంలోదో… మా అమ్మ గొంతునించి నా దాకా వచ్చించి.

“శ్రీరాంపురమే కూతుర కూతుర / చీపురుకట్టే కూతుర కూతుర
ఏడు పిడకలే కూతుర కూతుర / ఎద్దడినీళ్ళే కూతుర కూతుర
మారటి బిడ్డలె కూతుర కూతుర / మనువు దక్కదే కూతుర కూతుర
ముసలి మొగుడె కూతుర కూతుర / ముచ్చట తీరదె కూతుర కూతుర”

1984 లో సావిత్రి ” బంది పోట్లు ” అనే కవిత రాసింది!

” పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని
పంతులు గారన్నప్పుడే భయమేసింది !
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమొచ్చినా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే అనుమాన మేసింది!

వాడికేం ? మగమహారాజని
ఆడా, మగా వాగినప్పుడే అర్థమై పోయింది
పెళ్ళంటే పెద్ద శిక్ష అని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని

మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని! ”

సావిత్రి రాసిన ఈ పద్యం కన్నా ముందొచ్చిన రేవతీ దేవి కవిత్వంలో ఈ రకమైన గొంతు లేదు. ఒక అశాంతీ, దిగులు… అంతర్మథనం… చెప్పుకోలేని అసహనం… ఇవీ కన్పిస్తాయి ” శిలాలోలిత ” పుస్తకంలో! రేవతీదేవి ఇలారాస్తుంది….

” దిగులు
దిగులు దిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పే వీలుంటే
దిగులెందుకు ” అని

సావిత్రి ” బందిపోట్లు ” లో ఈ గుంజాటన పడటం మరిలేదు. ఎందుకో చెప్పే వీలుంటే అన్న ఊగిసలాట లేదు. అదెందుకో చెప్పెయ్యటమే తప్ప!!

ఆశ్చర్యం ఏమిటంటే చేకూరి రామారావు గారు ప్రస్తావించేదాకా సావిత్రి రాసిన ” బంది పోట్లు ” విశేషంగా ఎవరి దృష్టినీ పడలేదు. ఇలా ఎంత మంది రాసినవి మరుగున పడిపోయినా వింత కూడా లేదు. సావిత్రి ” బందిపోట్లు ” అలాకాకుండా సాహిత్యానికి మిగలటం అదృష్టమే మరి!!

స్త్రీల అనుభవంలో ఉన్న హింస నెమ్మదిగా వాళ్ళు రాసే అక్షరాలలో వ్యక్తం కావడం శిలాలోలిత పుస్తకంలోనే కన్పిస్తుంది. ” ఈ రాత్రిని ” రేవతి ఎలా వర్ణిస్తుందో చూడండి.

“ఈ రాత్రి గడిస్తే
నిద్ర మాత్రలక్కూడా లొంగని ఈ రాత్రి గడిస్తే
మనిషితో రాజీ పడలేక పోయినందుకు
నా వీపు కింద అంపశయ్యలా పరుచుకున్న
ఈ రాత్రి గడిస్తే
దైవంతో రాజీపడలేక పోయినందుకు
నా నరాలలో ఈతముళ్ళ నెత్తురై ప్రవహిస్తున్న
ఈ రాత్రి గడిస్తే…. ” అంటుంది రేవతి.

ఈ వ్యధ ఎంతమంది ఆడవాళ్ళదై వుంటుందీ??

రేవతికి చెప్పవలసిందేదో ఉంది సమాజానికి! కానీ ఆడదానిగా తన మాటలని వాళ్ళు వింటారో… వినరో… చెప్పడం ఎందుకన్న సందేహం!!

” ఇన్నాళ్ళూ గలగలా మాట్లాడితే
నే చెప్పాల్సిందేమీ లేనందున
నేనేం చెప్పినా విన్నారు
ఇప్పుడేమో నాకూ
చెప్పాల్సిందేదో ఉంది
చాలా గాఢమైంది
చాలా ఇష్టమైంది
చాలా స్వచ్ఛమైంది
చెప్పాల్సిందేదో ఉంది
మాట్లాడబోతే ఎవరూ వినిపించుకోరు
అందుకో మరందుకో ఈ గొంతు మూగబోయింది
తాదాత్మ్యపు మత్తువల్లనో
మాధుర్యపు తీపి వల్లనో
లేదూ మీరెలాగూ వినిపించు కోరనో
మూగవోయింది ఈ గొంతు ”

ఈ కవిత రాసి రేవతి ఒక మహోపకారం చేసింది. విషయాలెన్నో ఉన్నాయి మాట్లాడేందుకు. కానీ, ఆడవాళ్ళు మాట్లాడడం లేదు. తన మాటలని వినదలుచుకోని వర్గం ముందు తన గొంతు విడదు. తన నిశ్శబ్దం గాఢమైనది, మధురమైనది, కల్లోల మైనది కూడా కావచ్చు. కానీ ఉత్త శూన్యం మాత్రం కాదు!!

స్పష్టంగా ఒక రాజకీయదృక్పథంతో తాను ఆడదానిగా తన స్పందనలని రికార్డు చేస్తున్నానని చెప్పిన పుస్తకం మాత్రం తెలుగు కవిత్వంలోనే తొలిసారిగా నా వామనుడి మూడో పాదం! ఈ పుస్తకంలో వ్యక్తమైన ఏ భావంలోనూ మరింక సంశయాలూ, సందిగ్థతలూ, శషభిషలూ లేవు. ఎవరైనా వింటారో వినరో నన్న సందేహం… ఎదురుచూపూ లేవు. నేను చెప్పదలుచుకున్నది చెప్పే తీరతాను. మీరు ఒప్పినా… మానినా… అన్న ధోరణే ఈ సంకలనానిది! ఈ కయ్యాన్ని నా ముందటి తరం కవులు గుర్తించక పోలేదు. ” ఇది కదన కుతూహల రాగం ” అన్నారు పఠాభి వామనుడి మూడో పాదానికి పరిచయ వాక్యాలు రాస్తూ! ఈ పుస్తకంలో చాలా కవితలు తొలినాళ్ళలో వివాదాస్పద మైనాయి. తమ ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండా ప్రతీవాళ్ళు వినక తప్పని విషయాలని కవిత్వాంశాలుగా చేపట్టిన పుస్తకం ఇది. ఇందులో చాలా కవితలున్నా జెండర్‌ డిస్క్రిమినేషన్‌ కి సంబంధించిన కవితలకే ఎక్కువ ప్రచారం వచ్చింది. తీసుకున్న వస్తువులోనూ, అది వ్యక్తమైన విధానంలోనూ ఈ కవితలు ప్రత్యేకమైనవి కావటం ఒక కారణం కాగా ఈ సంకలనం లోని చూపులు, పైటని తగలెయ్యాలి, స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ లాంటి పద్యాలకి మాత్రమే ఎక్కువ గుర్తింపు రావటానికి ఇంకో కారణం కూడా ఉంది.

అది, వేల్చేరు నారాయణరావు ఆంధ్రజ్యోతి వారపత్రికలో వామనుడి మూడోపాదం పుస్తకాన్ని రివ్యూ చేస్తూ పై మూడు కవితలనీ తీసుకుని విశ్లేషించిన పద్ధతి వల్లనే ఈ కవితలు ఎక్కువ చర్చకి కారణం అయ్యాయి అన్నది! బహుశా నారాయణరావు గారు వామనుడి మూడోపాదాన్ని పునస్సమీక్షిస్తే తప్ప ఈ దోషం పోదనుకుంటాను. ఆ పుస్తకంలో ఇంకా ముఖ్యమైన కవితలున్నా రివ్యూదారులని ప్రధానంగా ఆకర్షించిన కవితలు పైన నేను చెప్పినవే! ఇందులో ” చూపులు ” అన్న పద్యం sexist వైఖరితో ఆడదాన్ని గాయపరచగల మగవాడి చూపులెలా ఉంటాయో… అవి ఆడవాళ్ళని ఎంతగా హింస పెడతాయో చెబుతుంది. ఈ కవితకి ఆడవాళ్ళు వయసులో చాలా పెద్ద వాళ్ళయిన ఆడవాళ్ళతో సహా, చాలా లీనమై స్పందించారు. ఇది ఇతర భాషలలోకి అనువాదమైంది.

” రెండు కళ్ళనించి చూపులు సూదుల్లా వచ్చి
మాంసపు ముద్దలపై విచ్చల విడిగా తిరుగుతుంటాయి
చూపులెప్పుడూ ముఖంలోకి చూడవు
మాట ఎప్పుడూ మనసు నించి పుట్టదు
కనిపించి నప్పుడల్లా కంపరం పుట్టేలా
వంటిమీద చూపులు చెదల్లా పాకుతూ ఉంటాయి

ఆ కళ్ళల్లో లక్ష వర్గాలున్నాయి
కానీ చూపులకి మాత్రం వర్గ విభేదాలు లేవు
ఆ చూపుల్లో ఎప్పుడూ ఒక్కటే సంకేతం ఉంటుంది
చొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది
వికృతమయిన భల్లూకపు పట్టులాంటిదేదో విడవక
కలల్లో సైతం వెంటాడుతుంది

చిక్కని ఈ అడివిలో వెలుగుకీ చీకటికీ తేడానే ఉండదు.
చూపుల నించి దాటుకోవడానికి స్థలమనేదే ఉండదు.
రోడ్డుమీద… బస్సులోనూ…. క్లాసులోనూ
వేసే ప్రతి అడుగు వెనకా

శరీరంలోని ఏదో ఒక భాగాన్ని గాయం చేస్తూ
విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి
ఒక్కోసారి భయమేసి
సుదూర ఆకాశంలోకి శూన్యంలోకి
మాయమయి పోవాలనిపిస్తుంది
కానీ,
పలాయనం పరిష్కారం కాదని
విషపు చూపుల నెదుర్కొనే ముళ్ళలాంటి తీక్షణతని
కళ్ళకి నేర్పటం మొదలెట్టాను
ఇప్పుడు ఆ కళ్ళని వెంటాడటానికి
కళ్ళతోనే యుద్ధం చేస్తాను
సూటిగా రెండు క్షణాలు కళ్ళలోకి చూడలేని
పిరికి చూపులు
పాతాళం లోకి పారిపోతాయి

అప్పుడనుకుంటాను
కళ్ళకే కాదు
ఈ దేశంలోని ఆడదానికి
వళ్ళంతా ముళ్ళుండే రోజు
ఎప్పుడొస్తుందా అని!

ఆంధ్రజ్యోతి దినపత్రికలో స్త్రీశక్తి అనే పేజీ కొన్నాళ్ళు వచ్చింది. అందులో వసంతా కన్నాభిరానే వారం వారం ఒక కాలం రాసేవారు. 1990 లో ఇందులోని విషయాలనే ” కఠోర షడ్జమాలు ” అన్న పుస్తకంగా ప్రచురించారు. స్త్రీవాద సాహిత్యానికి సంబంధించి చెప్పుకోవలసిన పుస్తకాలలో ఇదొకటి! అలాగే 8990 మధ్యకాలంలో నా సంపాదకత్వంలో ” లోహిత ” అన్న కరపత్రిక వచ్చేది. అందులో నేను రాసిన సంపాదకీయాలూ, ఇతర వ్యాసాలూ కూడా చర్చలకి కారణమయ్యేవి.

1988 లో కొండేపూడి నిర్మల కవిత్వం ” సందిగ్ధ సంధ్య ” గా వచ్చినా, 90లో అచ్చయిన ” నడిచే గాయాలు ” అన్న కవితా సంపుటిలోని పద్యాలే ఆమె భావ తీవ్రతకి అద్దం పట్టాయి. ఇదే సమయంలో, అంటే 1990 లోనే త్రిపురనేని శ్రీనివాస్‌ కవయిత్రుల కవితా సంకలనాన్ని ” గురిచూసి పాడే పాట ” ప్రచురించాడు. మొత్తంగా ఇవన్నీ ఆడవాళ్ళ ఆలోచనల్లోని మార్పుని చూపెట్టాయి. ఆడవాళ్ళు తమ సమస్యల పట్ల తటస్థంగానూ… నిశ్శబ్దంగానూ ఉండేటటువంటి పరిస్థితి మారుతూ వచ్చింది.

అప్పటికి గాని, పాత విలువలు బీటలు వారుతున్న వైనాన్ని, కుటుంబం నాలుగ్గోడల మధ్య తొక్కిపట్టిన గొంతులు ఆ గోడల్ని దాటి ఖంగుమనటంలోని ప్రమాదాన్ని, పితృస్వామ్యాన్ని అది రూపొందించిన కుటుంబాన్ని ఆడవాళ్ళ భుజాల మీదికెక్కించి నిరంతరం కాపలా కాసే అన్ని వర్గాల పురుష పుంగవులూ గుర్తించలేక పోయారు.

గుర్తించిందే తడవుగా దాడి మొదలు పెట్టారు. ఇలాంటి వారిలో దిగంబర/మార్క్సిస్టు కవినని చెప్పుకునే జ్వాలాముఖి మొదటివాడు. ఈయన ఆడవాళ్ళ కవితలని “నీలి కవితలని” “వార కవితలని” పిలిచాడు. ఈయన ధోరణిలోనే మరి కొందరు ముందుకు పోయి “వళ్ళు బలిసిన కవితలని” కూడా వ్యాఖ్యానించారు. కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా తాము కల్పించుకునే పనే లేకుండా తమ కన్నా ఉధృతంగా ఆడవాళ్ళని తిడుతున్న ఈ కమ్యూనిస్టులని చూసి మరి హిందూ మత తత్వ వాదులు ఏమి మాట్లాడే పని లేక పోయింది. స్త్రీల విషయంలో కాషాయధారులకీ, కమ్యూనిస్టులకీ, కేప్టలిస్టులకీ ప్రధాన విభేదాలేవీ ఉండవని ఆచరణలో వీరంతా రుజువు చేసారు.

ఆడవాళ్ళ మనస్సులోని అగ్ని పర్వతాలెన్నో అక్షరాలుగా బద్దలవటాన్ని చూడటం ఆధిక్య భావాన్ని వదులుకోలేని మగ వారికి ఏమీ సుఖకరమైన విషయం కాదు కదా!

గతంలో భావకవుల దాకా ఆడది శృంగార దేవత, ప్రేయసి, మాతృమూర్తి !! ఈ చిత్రణ మగవాడికి హాయినీ … ఆనందాన్ని … జీవిత భద్రతనీ కల్గిస్తుంది! భావ కవుల కాలంలో నాలుగు పద్యాలు రాసిన అప్పటి ఆడవాళ్ళూ ఇవే భావాలు తు.చ. తప్పకుండా రాసి వాళ్ళ మగవాళ్ళ మెప్పు పొందారు. ఉదాహరణకి దొప్పలపూడి అనసూయాదేవి రాసిన “మాతృ హృదయము” అన్న ఛందో పద్యాలు చదివితే … కొండేపూడి నిర్మల రాసిన “లేబర్‌ రూం” అన్న కవిత ఈనాటి వీళ్ళ కెందుకు ఇంత కోపం తెప్పించిందో మనకి తెలుస్తుంది!

“ముద్దు బిడ్డను గొంతునన్‌ మోజునందు
సైఁప గల్గుదునే యను జంకు నందు
హస్తి మశకములకుఁ గల్గు నంతరంబు
తోఁచుచున్నది స్థైర్యంబు తూలకుండ

అలసి పోయితి నంతలోఁ గలఁత దీఱ
క్యారు క్యారని గుండెలో మాఱుమ్రోగె
విస్మరించితిఁ బొందిన వేదనంబు
నవతరించిన నవ్య భాగ్యమ్ము వలన

చీదరయే లేదు బిడ్డని సేవఁజేయఁ
బ్రేమ ప్రతిఫలమిచ్చుచు స్వామి నన్నుఁ
బెంచు నుద్యోగిగా నియమించినాడు
ఎదురు చెప్పక శిరసావహించు కొంటి.”

పురిటి నొప్పుల మీది బెదురు ఈ పద్యాలలో ఉన్నా, పిల్లాడిని పెంచటంలో ఉండే బాధ్యత శిరసావహించటం మీదే దృష్టి ఎక్కువగా ఉంది! కొండేపూడి నిర్మల లేబర్‌రూం కవితలో పిల్లల్ని కని పెంచటం గురించిన మాట ఏదీ లేదు. ప్రసవ బాధలో ఆడవాళ్ళ శారీరక స్థితి ఎలాంటిదో … ఎంత కష్టమైనదో మాత్రమే చెబుతుంది నిర్మల పద్యమైనా!

“ప్రపంచంలోని నరకమో
నరకంలోని ప్రపంచమో
త్రీడీ లో చూస్తున్నట్టే వుంటుంది
లేబర్‌రూం లో అడుగు పెడితే చాలు …

బల్ల కొక బాధల నది
కాయితప్పడవలా చివికి చీలిపోతున్న రోదనల గది

కాళ్ళనలా ఎడంచేసి దీనంగా హీనంగా నీచాతి నీచంగా
ఒక హింసాతల పరాకాష్ఠ కోసం ఎదురు చూడ్డమంటే
రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ
కలపను చెక్కుతున్న రంపం కింది పొట్టులా
ఉండ చుట్టుకున్న బాధ

అప్పుడే ఏమయింది … ఉధృతి కొద్దీ విముక్తి
ముల్లుకు గుచ్చి నిప్పులో కాలుస్తున్న చేప
ఇలాగే ఏడుస్తుందా ?
మూతి బిగించిన గోతాల్లో మూగ జంతువిలాగే రోదిస్తుందా?
ఆగాలి, ఆగాలి చిన్న ముల్లింకా రెండంకెలు దాటాలి
అటు చూడు అది నిన్నటి కేసు నాడీ జారిపోతుంది
ఇటు చూడు పిండం అడ్డం తిరిగింది. బీ.పీ. రెచ్చిపోతోంది
ఆలోచించే చోటు లేదు
చావుకీ బతుక్కీ మధ్య పిసరంత గీటు లేదు.
టాక్సీ చప్పుడు, స్కూటర్‌ చప్పుడు, రిక్షా చప్పుడు, నడచిన చప్పుడు
తల క్రిందులుగా వ్రేలాడదీసిన సెలేన్‌ బాటిల్లా
నిండు నెల్ల గర్భిణి
ఒక్కో బొట్టు చొప్పున మొత్తం ప్రాణం ఇచ్చుకోవడానికి వస్తోంది
అడ్డు తప్పుకోండి అడ్డు తప్పుకోండి”

అయితే, అనసూయాదేవి పద్యంలో మగజాతికిచ్చిన హామీ ఒప్పుదల అలాంటిదేదో నిర్మల గొంతులో లోపించినట్టుగా అనుమానంగా ఉంటుంది! ఈ అనుమానం పెనుభూతమై చివరికి దీన్ని “నీలికవిత” “బూతుకవిత” అని నిషేధాజ్ఞలు జారీ చేశాడు జ్వాలాముఖి! ఈ కోవలోనే పాటిబండ్ల రజని రాసిన “అబార్షన్‌ స్టేట్మెంట్‌,” ఘంటసాల నిర్మల రాసిన “ఎ కాల్‌గళ్స్‌ మోనోలోగ్‌,” ఇంకా “జుగల్‌ బందీ” అన్న కవితలు, కొండేపూడి నిర్మలది మరో కవిత “హృదయానికి బహువచనం,” నేను రాసిన “పైటను తగలెయ్యాలి” … ఇంకా “సవాలక్ష సందేహాలే” అన్న శీర్షికలతో ఉన్న కవితలు వీళ్ళకి కంటగింపుగా తోచాయి. పురిటి నొప్పుల మీద కవిత్వం ఏమిటీ? అనీనూ, శారీరక ధర్మాలనిలా ఏకరువు పెట్టుకోవడంలో సామాజిక ప్రయోజనం ఏమిటనీనూ వీళ్ళు అభ్యంతరం చూపెట్టారు.

“మేం ఎందుకు మా శరీరాల గురించి మాట్లాడుతున్నది చెబ్తాం మీరు వింటారా ?” అన్న ఎదురు ప్రశ్నతో వివరంగా జవాబు చెప్పారు వసంతా కన్నభిరాన్‌.

“స్త్రీలు పురుషుల దృష్టిలో లైంగిక సుఖాన్నిచ్చే వస్తువులై తమకసలు ఆ అనుభూతులే లేవనీ నటించాల్సిన స్థితి అలా నటించేవరకూ ఆమెపై నిరంతరం జరిగే “పోలీసింగ్‌” ఇవన్నీ వాళ్ళను అయోమయానికి గురి చేస్తాయి. ఈ నటన వాళ్ళను కుంగదీస్తుంటుంది. మొత్తానికి తమ శరీరాలని ద్వేషించడమో, గందరగోళ పడటమో చేసి తమకు తామే పరాయి వాళ్ళవుతారు. అప్పుడు ఆ స్త్రీలను కంట్రోల్‌ చేయ్యడం సమాజానికి సులభమవుతుంది. అదొక కుట్ర.” అంది ఓల్గా.

“పురుషానుకూల విలువల విధ్వంసానికి కవయిత్రుల రచనలు కారణమవుతాయన్న భయం వల్ల కాకపోతే నిజానికి ఇంత ఆందోళన చెలరేగాల్సిన అవసరం లేదు. విప్లవ సాహిత్యాలన్నిటా ఇంకా పాతివ్రత్యాన్ని పొగుడుతూనూ, వేశ్యాత్వాన్ని అసహ్యించు కుంటూనూ మాతృత్వాన్ని గొప్పచేస్తూ, గొడ్రాలితనాన్ని ఈసడించుకుంటూనూ, ఇంకా కవిత్వాలు వస్తూనే ఉండగా స్త్రీలుగా ఈ దౌర్జన్యాలని కవయిత్రులు అడ్డుకుంటున్నారు” “ఇన్నేళ్ళూ తాము ఏం రాసినా మగవాళ్ళకి ఒప్పుదలగా ఉన్న విషయాలనే రాశారు ఆడవాళ్ళు. ఇవాళ తమ జీవితంలోని అసమానతలకి కారణమైన మూలాంశాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలో స్త్రీలని అణిచివేస్తున్న దుర్మార్గాలన్నింటినీ కవిత్వ వస్తువులుగా తీసుకున్నారు”

“ప్రపంచంలో ఇన్ని వేల సంవత్సరాలుగా ఏ కవీ కూడా విమర్శకుల కోసమని కవిత్వం రాయలేదు” అని పద్మలత పేరుతో అచ్చయిన నా జవాబు ఆ రోజుల్లో ఎక్కువ మందిని ఆలోచింప చేసింది. ఇవాళ్టికి అది నేను రాసిన జవాబని ఎవరికీ తెలియదు. నన్ను positiveగా కోట్‌ చేయని సాహిత్యంలోని నా ప్రత్యర్థులు కూడా అందుకనే నిరభ్యంతరంగా మెచ్చుకోగలిగారు దాన్ని!

ఆ వివాదాల సమయంలోనే వాళ్ళ అవకతవక మాటలకి జవాబుగా:

“అభ్యుదయం ముసుగు కింద
అణా కాని బుద్ధులు
ఏ విప్లవాల్‌ తెస్తారో
ఈ ఫ్యూడల్‌ ప్రబుద్ధులు

ముడుచుకొన్న మెదళ్ళు మీవి
కొత్త చూపు చూస్తాయా
విరిగిన మీ పాళీల్లోంచి
విప్లవాలు పూస్తాయా … లాంటివీ

ఆడవాళ్ళనాడవాళ్ళు దోస్తున్నారన్న దిగంబరా
అవగాహనలో నీకన్నా మా నాయనమ్మ నయంరా!

వేశ్యా వృత్తికి మూలం వేశ్యలన్న నీ వాదం
ఏ గురువు నేర్పాడురా నీకు మార్క్సు వేదం?

ఆడదానికాడదాన్ని శతృవన్న భడవా
పేదవాడికి పేదవాణ్ణి శతృవనగలవా?

బోరవిరిచి రాజకీయం నువ్వా మాకు చెప్పేది
పోరంబోకు మనిషివి నీకు వ్యవస్థేం తెలిసేది

ఫెమినిస్ట్‌ సిద్ధాంతమేమో విదేశీ కుట్రట!
వీరు చైనాకి చక్కర్లు కొడితే అది విప్లవ సమైక్యతా ?!

అపవాదులు అంటగట్టి హతమార్చగలమనుకోకు
సీతా సావిత్రులం కాము స్త్రీ వాద కవయిత్రులం మేం!

లాంటి వెటకారపు పద్యాలు చాలా ఆ రోజుల్లో రాశాను నేను. అందులో కొన్ని మాత్రమే ఇప్పుడు చదివినవి. ఇవి కూడా ఇప్పటిదాకా ఎక్కడా అచ్చు కాలేదు.

స్త్రీల కవిత్వాన్ని సమర్థించి వ్యాసాలు రాసిన చేకూరి రామారావు గారి లాంటి వాళ్ళని కూడా జ్వాలాముఖి, యశ్వీ లాంటి వాళ్ళు దుయ్యబట్టారు. జ్వాలాముఖికి చేరా ఇలా జబాబు చెప్పారు.

“కవి సమయాలు, రస నిష్పత్తీ … జ్వాలాముఖి పరిభాషా. “మేజువాణి,” “శీల రాహిత్యం” ఈయన డిక్షన్‌. జ్వాలాముఖి ఫ్యూడల్‌ సామ్రాజ్య వాద సంస్కృతికి వ్యతిరేకం. కానీ, ఆయన ఫ్యూడల్‌ భావజాలంలో ఎట్లా ఇరుక్కు పోయాడో ఆయన వాడిన భాష చూస్తేనే తెలుస్తుంది. భాషనట్లా ఉంచి ఆయన చెప్పదలచుకున్న దేమిటి? తెలుగు సాహిత్యంలో శీల రక్షణకు జ్వాలాముఖి కంకణం కట్టుకున్నాడా? నాకు తెలిసినంత వరకు, ఏ ప్రసిద్ధ కవయిత్రీ రుతుధర్మాలకు పరిమితం కాలేదు. స్త్రీల సమస్యలనెన్నో తీసుకుని రచించారు. వాటిల్లో భాగం గానే రుతు, శరీర ధర్మాలను లేక అవి కల్గించే భావాలను ధైర్యంగా వ్యక్తీకరిస్తున్నారు. ఇందులో నెత్తీ నోరు బాదుకోవాల్సిన ప్రమాదం ఏం జరిగిందో అర్థం కావడం లేదు” అన్నారు చేరా!

జ్వాలాముఖి ధోరణి పట్ల తన నిరసనని వ్యక్తం చేస్తూ “హీనత్వం రస హీనత్వం” అన్న కవిత రాశాడు వేగుంట మోహన ప్రసాద్‌!

కొండేపూడి నిర్మల “లేబర్‌ రూం ని” వెక్కిరిస్తూ, ఆడవాళ్ళకి ప్రసవ వేదన చాలా సుఖకరమైన భావన అనే అర్థంలో “లేబర్‌డ్రీం” అని తానే ఒక రాతని ప్రచురించాడు జ్వాలాముఖి! అలాగే “సోమిదేవమ్మలు సాహిత్యంలో మరి కన్పించరని” అన్న నా కవితకి తట్టుకోలేకనే నా చావుని ఆశిస్తూ “డాలరు ప్రభ” అనే పేరుతో ఒక చవకబారు రాతని మరొక దానిని కూడా ఆ రోజుల్లోనే రాశాడు జ్వాలాముఖి!

అస్మిత సంస్థ తరపున ఓల్గా సంకలనం చేసిన “నీలిమేఘాలు” పుస్తకంలో తమ కవితల ద్వారా జ్వాలాముఖులెందరికో, ఆడవాళ్ళు చాలా ఖచ్చితంగానే జవాబులు చెప్పారు. బోలెడన్ని వాద, ప్రతివాదాలతో, ఇలా, 9193 మధ్య కాలంలో దాదాపు పత్రికల్లోని సాహిత్యపు పేజీలన్నీ స్త్రీ వాద సాహిత్యానికి సంబంధించిన అంశాలతోనే కనిపిస్తాయి. ఏ issue దొరకక, స్తబ్దుగా ఉన్న పత్రికల వాళ్ళకి ఈ చర్చలు బాగా పనికొచ్చాయి. వీలైనంత వివాదాస్పదం చేయాలన్న ఒక అత్యుత్సాహంలో పత్రికలు చెత్తని కూడా బాగానే ప్రచురించాయి. స్త్రీవాద సాహిత్యాన్ని అలా ఒక అమ్మకపు సరకుగా పత్రికలు మార్చి వేశాయి. ఆనాడు స్త్రీ వాదా సాహిత్యం మీద మగవాడి అభిప్రాయాలను చదివితే అందులో contructive crticism తక్కువగానూ, destructive criticism ఎక్కువగానూ కనిపిస్తుంది.

మేం ఆశించే పద్ధతిలో, మేం భుజం తట్టి ప్రోత్సహించే పద్ధతిలో మీ రాతలూ ప్రవర్తనా ఉండాలి. మమ్మల్ని ఖాతరు చేయకపోతే మిమ్మల్ని బూతులు తిడతాం! ఏ మాటల్లో చెప్పినా మొత్తానికి మగ దురహంకారం, వారు చేసిన విమర్శల్లో ఈ తీరులోనే బయటికొచ్చింది.

మార్పుకి నడుంకట్టిన వాళ్ళు ఇలాంటి దాడిని ఎదుర్కోకుండా అడుగువేయటం సాధ్యం కాదు. ప్రపంచ సాహిత్యరంగాలలో అప్పటిదాకా ఉన్న మార్గం నించి కొత్త మార్గంలోకి మళ్ళిన అందరూ ఇలాంటి దాడులకి గురైన వాళ్ళే! అందులోనూ ఆడవాళ్ళంటే వాళ్ళని మధ్య తరగతి నీతుల కొలబద్దతో బూతులులంకించుకుని భయపెట్టటం తేలిక కూడా! అయితే, వీళ్ళ నీతి సూత్రాలకీ, బూతు తిట్ల భయాలకీ, నిందలకీ, ఆడవాళ్ళు లొంగిరాక మానరన్న పురుష పుంగవుల అంచనాని మొదటిసారిగా తారుమారు చేసింది మా సాహిత్యం! మరింత ఖచ్చితంగా రాయటమే మా జవాబుగా చెప్పాం, వీళ్ళందరికీ !!

ఈ సందర్భంగానే రావిశాస్త్రి “పనిపాటా లేక సమానత్వము, హక్కులు అని మాట్లాడే వాళ్ళుగా” ఫెమినిస్టులని ఎద్దేవా చేసి, కన్యాశుల్కం లోని మధురవాణి పాత్ర మాత్రం “మధురం” అని మెచ్చుకున్నారు. ఆశ్చర్యమేమిటంటే, ఈ విప్లవ రచయితల కన్నా వందేళ్ళ ముందుగానే గురజాడ అప్పారావు గారు “Modern women will rewrite history” అని ప్రకటించినా, వీళ్ళకి మధురవాణే కన్పించింది గాని, అప్పారావు గారి ముందు చూపు మాత్రం అర్థం కాలేదు. అటు తరువాత నేను “మధురవాణి ఎందుకు మారింది?” అన్న వ్యాసంలో అప్పారావు గారు ఆ నాటకంలో మధురవాణి పాత్రని ముగించిన తీరుమీద విడిగా వ్యాసం రాసేను.

అలాగే రంగనాయకమ్మ ఆంధ్రభూమి (Daily) “ఆమె” అన్న పేజీలో “ఫెమినిస్టులందరూ వ్యభిచారులే” అని ఒక స్టేట్మెంట్‌ చేసింది. దానిమీద మల్లాది సుబ్బమ్మ గారు అంత దూకుడుగా మాట్లాడవద్దని రంగనాయకమ్మను మందలించ వలసి వచ్చింది.

ఇదే సమయంలో దిగంబర కవిత్వం మీద నేను వివరంగా రాసిన వ్యాసం చాలా విస్తృతంగా చర్చించబడింది. దిగంబర కవిత్వాన్ని వెనుకేసుకొచ్చిన విమర్శక కవులనీ, కవి విమర్శకులనీ, సాహిత్య సంస్థలనీ కూడా నా వ్యాసంలో భాగం చేసి వాళ్ళ ధోరణిని ప్రశ్నించడంతో అప్పటి దాకా నిశ్శబ్దంగా ఊరుకున్న విరసం మరి నోరు విప్పక తప్పలేదు. ఈ నేపథ్యంలో వరవరరావు, ఆంధ్రప్రభ daily సాహిత్యపు పేజీకి వివరంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు (1993 డిసెంబర్లో!). అందులో వరవరరావు “స్త్రీ వాదుల పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రావిశాస్త్రి, జ్వాలాముఖి, అద్దేపల్లి రామ్మోహన్రావు, రంగనాయకమ్మ, యశ్వీ, కాత్యాయనిల అవగాహనకు భిన్నమైనది, కొన్ని సందర్భాలలో వ్యతిరేకమైనదీ” అని తన దృక్పథాన్ని (బహుశా విరసం దృక్పథం కూడా కాబోలు) తెలియజేసాడు.

చేస్తూ, మరొక మాట అన్నాడు. అదేమిటంటే, అసలు స్త్రీవాద కవిత్వం రావడానికి నేపథ్యం విరసం వాతావరణమే గనక స్త్రీ వాదులు ఆ రకంగా విప్లవ సంస్థల వారసులేనంటూ తేల్చి చెప్పేశాడు కూడా!

అయితే కనీసం ’89 తర్వాత ఊపందుకుని, వివాదాస్పదమై సాహిత్య రంగాన్ని ఒక కుదుపు కుదిపిన స్త్రీ వాద కవిత్వం మీద మాట్లాడటానికి, వరవరరావు ’93 దాకా ఎందుకు ఆగాల్సి వచ్చిందన్న ప్రశ్నకి మార్క్సిస్టు వర్గాల మధ్యనున్న వైరుధ్యాలు, లౌక్యం, జాగ్రత్త తప్ప ఇంకే జవాబు దొరకదు.

అయితే, వరవరరావు ప్రకటించినట్టుగా విరసం ప్రభావంగా లేదా విరసం వారసత్వంగా స్త్రీవాద కవిత్వం ఉద్భవించగల వీలు లేదనీ, ఆడవాళ్ళ కోసం మార్క్సిస్టు వర్గాలు ఏనాడూ ఏ ఆలోచనలూ విడిగా చేసి స్త్రీలను ఆకట్టుకొన్న ఏ దాఖలా కూడా లేదనీ చెప్పడానికి మనకు తెలంగాణా సాయుధ పోరాటం నుంచి, శ్రీకాకుళ సాయుధ పోరాటం దాకా సరిపడా ఉదాహరణలున్నాయి!

నిజానికి స్త్రీ వాద కవిత్వం వల్లనే, స్త్రీల ఆలోచనా సరళిలో వచ్చిన మార్పులకి అనుగుణంగా విప్లవ సంస్థలే తమని తాము సరిదిద్దుకోక తప్పని స్థితిలో పడ్డాయి. ఒక పక్క దళితులు, మరొక పక్క ఆడవాళ్ళూ వాళ్ళ నాయకత్వానికి సవాలుగా తయారయ్యారు. ఆచరణలో వాళ్ళు వీళ్ళిద్దరికీ వ్యతిరేకం కాదని చెప్పుకోవలసి వచ్చింది! వీళ్ళకోసం పార్టీలో దిద్దుబాటు ధోరణులు తప్పనిసరి అయ్యాయి. కొండపల్లి సీతారామయ్య మగవారికి స్త్రీల జీవితాల మీద ఉన్న అదుపుని ఒప్పుకుంటూ, స్త్రీల ఉద్యమ ఆవశ్యకతకి అనుకూలంగానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అటు తరువాత విరసం, పీపుల్స్‌వార్‌ స్త్రీ వాద ఉద్యమం మీద సానుభూతి మాటలే మాట్లాడారు.

ఇది జరిగిన దాదాపు ఆరేళ్ళకి మొన్న ఏప్రిల్‌ 99 న్యూస్‌ ఐటెం ప్రకారం పీపుల్స్‌వార్‌ స్త్రీ ల కోసం ఉద్యమం చేపట్టాలన్న ఆలోచనలో ఉందనీ, పీపుల్స్‌వార్‌ దళాలలో స్త్రీల సంఖ్య పెంచాలని, స్త్రీ మీద అధిక భారాన్ని మోపే “ప్రాచీన సంప్రదాయం అలాంటి సాంస్కృతిక భావజాలం లాంటి వాటి మీద యుద్ధమేదో ప్రకటించాలనీ, ఆస్తిహక్కు సమానంగా వర్తింపజేసేలా చూడటం, భూమి పట్టాలని స్త్రీల పేరు మీదిగానే పంపిణీ జరిగేలా చూడటం, వగైరా నిర్ణయాలేవో పీపుల్స్‌వార్‌ చేసిందని ఇంటలిజెన్స్‌ వర్గాల కథనం. ఈ విషయం మీద వచ్చిన పత్రికల్లోని వార్తలే తప్ప ఇంకా ఈ విషయం మీద పీపుల్స్‌వార్‌ బహిరంగంగా ఏమీ ప్రకటన చేయలేదనుకుంటాను.

స్త్రీల సమస్యలకి సంబంధించి ఒక awareness ని స్త్రీ వాద సాహిత్యం పాఠకులలోనూ, సాహిత్య వర్గాలలోనూ, వెరసి సమాజం తాలూకు (సమాజం అంటే మధ్య తరగతి సమాజం అనే నా ఉద్ధేశ్యం) ధోరణిలోనూ బలంగానే కల్గించింది.

ఇలా స్త్రీలని అణచి ఉంచే అన్ని అంశాల మీద చర్చలూ, ప్రతిఘటన, పోరాటాలు, జరగటం వలన స్త్రీల సమస్యలన్నీ అదాటుగా ఒక్కసారిగా మాయమైపోతాయని, సమసిపోతాయని, భ్రమలు మాకెవరికీ లేవు గాని బహిరంగంగా జరిగిన ఈ చర్చల వల్ల ఎవరెవరి ధృక్పథాలు ఎటువంటివో తెలుసుకొని జాగ్రత్తగా అడుగువేయటం కొంతవరకు సాధ్యపడుతుందని మాత్రం చెప్పగలను.

సాహిత్యానికి సంబంధించి ఈ సందర్భంలో చాలా రకాల పనులు చేయాల్సివచ్చింది నేను. ఒకటి స్త్రీల అనుభవాలకి, అలోచనలకి నా కవిత్వంలో ఎక్కువ చోటు కల్పించడం; రెండు స్త్రీల జీవితాలను శాసించే పురాణ కాలం నాటి నమ్మకాలని తిరిగీ ప్రశ్నించటం; ప్రాచీన సాహిత్యాన్ని స్త్రీ వాద దృక్పథంతో తిరిగీ విశ్లేషణ చేయటం; ఆ సరికే అలవాటయిన నిర్వచనాలని పునర్నిర్వచించటం; ప్రఖ్యాత స్త్రీల పాత్ర చిత్రణని ప్రతీకలు తీసుకుని కవిత్వం రాయటం; ఇలా చాలా కోణాలనించి సాహిత్య సృజన చేశాను.

విమర్శనా రంగంలో నేను రాసిన వ్యాసాలు అప్పట్లో చాలా చర్చలకి కారణమయ్యాయి. వీటి వల్ల సాహిత్య విమర్శలో స్త్రీవాద దృక్పథం ఎందుకు అవసరమో, ఎందుకు ముఖ్యమో బుద్ధిమంతులందరికీ అవగతమయ్యింది.

మంచన కేయూర బాహు చరిత్ర ప్రబంధం నుంచి రెండు నీతి కథలని తీసుకుని వాటిని నేను విశ్లేషించిన తీరు ఒక దృష్టితో చెప్పబడిన కథలు మరొక కాలంలో రూపొందిన విలువల దృష్య్టా ఎలా తిరిగి చదివే వీలుందో చెబుతుంది. అలాగే అప్పారావు గారి మధురవాణి, నాటకం చివరలో ఎందుకు మారిందని నేను వ్రాసిన వ్యాసం; చలం మైదానాన్ని, విశ్వనాథ చెలియలికట్టని పోల్చి రెండు పుస్తకాలు ఆడవాళ్ళని చూసిన తీరుని గురించి రాసిన వ్యాసం; బుచ్చిబాబు కథ “నిరంతరత్రయం” మీద రాసిన వ్యాసం; ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి నవల “మాలపల్లి” ఎలాంటి సంప్రదాయాలకి అనుగుణంగా ఉన్నదీ వివరిస్తూ వ్యాఖ్యానించిన వ్యాసం; భాగవతంలో క్రిష్ణుడిని గురించి విశ్లేషించిన వ్యాసం ఇవన్నీ 9394 లో నేను రాసినవి!

ద్రౌపదిని రాసిన వ్యాసుడినీ, యశోధరని విడిచిన బుద్ధుడిని నా కవితలలో ఎలా భాగం చేశానో మీకు తెలిసేందుకు ఆ కవితల్ని చదువుతాను. “అందుకేగా వాళ్ళు రుషులు” అన్నది మొదటి కవిత; “యశోధరా ఈ వగపెందుకే” అన్నది రెండోది!

ఒక్కొక్క పొర వొలిచేస్తున్నప్పుడు
ఖచ్చితంగా ద్రౌపది మనసులో ఏం జరిగిందో
భారతం చెప్పదు.

ఏ కీచకుడో జుట్టు పట్టి ఈడ్చినప్పుడు
కణకణ మండిన ఆమె నిలువెత్తు శరీరం
ఐదుగురిని పెళ్ళాడి ఎంత మోసపోయిందో
వ్యాసుడికి సరిగ్గా అంతుపట్టదు.

ఏం రాస్తే ఏం మునుగుతుందో
పాతివ్రత్యం ఎక్కడ చెదురుతుందో
కథని ధర్మరాజు వేపు నడిపించేస్తే సరి
మహా రాజకీయవేత్త, మహా భారత కర్త
వ్యాసుల వారికి మలుపు తిప్పటం కష్టమా?

అందుకేగా వాళ్ళంతా రుషులు
వాళ్ళకి పెళ్ళాలుండరు
వాళ్ళకి కూతుళ్ళుండరు
కుండల్లోంచి పుడతారుకదా
వాళ్ళకి తల్లులూ ఉండరు!

రెండో కవిత ఇది!

యశోధరా ఈ వగపెందుకే!
వారు బౌద్ధులు తాపసులు
చింతలంటవు వారిని
జరా మృత్యు భయాలుండవు
సరిగ్గా బోధివృక్షం కిందే జ్ఞానోదయం అవుతుందని
వారికి ముందే తెలుసు!

ఆ అర్ధరాత్రి అనంతయాత్రకి ఆరంభం
తెలియనిది నీకేనే
యశోధరా ఈ వగపెందుకే
అతుక్కుని గవాక్షానికి అలా దిగులు చూపెందుకే
నీకు సూర్యోదయమంటేనే అసలు భయమెందుకే

ఫరవా లేదులే
నీ ఎదురు చూపు వృధా పోదులే
ఎప్పుడో ఓనాడు దీక్షబూనిన కాషాయ ధారి
భిక్షాపాత్రతో
నీ ఇంటి ముంగిట కూడ
చెయిజాచి వస్తాడటలే
శిధిల దేహంబుతో
నువ్వు దీన వదనంబుతో
ఎదురు వస్తావని
ఏ ప్రాణమో భిక్ష వేస్తావని
అతని మనసులో ఎక్కడో ఉంటుంది కాబోలు
యశోధరా ఇంక వగపెందుకే
వారు బౌద్ధులు తాపసులు
చింతలంటవు వారిని
జరా మృత్యు భయాలుండవు
అష్టాంగ మార్గాన నువ్వు మాత్రం
అలా చుక్కలని చూడకే
యశోధర!
నువ్వింక త్యాగాలు చేయకే!

ఈ కాలంలోనే “స్త్రీ వాద నిఘంటువు” పేర కొన్ని పదాలకి నిర్వచనాలని ఇలా ఇచ్చాను. వీటిల్లో ఎగతాళి బయటకి కన్పిస్తుంది. అయితే ఈ ఎగతాళి వెనక ఉన్న కోపమే ప్రధానమైనది. ఇవి ఎక్కడా ఇంకా అచ్చులో రాలేదు.

1. వంశాంకురం: అయ్య చూపించిన మగాడికే ప్రామిస్‌ చేసి, కన్న పిల్లాడు.
2. మనుధర్మ శాస్త్రం: రూప్‌కన్వార్‌ అత్తింటి చూరులోని తాటాకుల పుస్తకం.
3. ఆపస్తంబుడు: తోమడం మరచిపోయిన ఇత్తడి చెంబు.
4. మగసిరి: తామరా, గజ్జి వంటి ఒక వ్యాధి.
5. తెలుగు సినిమా: మాటిమాటికి మెళ్ళోని మూర్చ బిళ్ళలనో …
మగవాడి మురికి పాదాలనో …
కళ్ళకద్దుకుంటున్నట్టు చూపించే ఆడదాని ఏడుపు కథ
6. పతివ్రత: దాక్టర్‌ దగ్గరికి వెళ్ళకుండా మొగుడి జబ్బులన్నీ తన శరీరంలో … చచ్చేదాకా మోసే పవిత్ర మతగ్రంథం!
7. పతిత, కులట: ఆధునిక తెలుగు నాటకంలో ప్రతి రెండో సంభాషణలోనూ కన్పించే జంట పదాలు.
8. అబల: తను తినాల్సిన విటమిన్లు కూడా తన మొగుడికే తినిపించే సాధ్వి!

స్త్రీవాద కవిత్వంలో విరసం సభ్యురాలు విమల రాసిన “వంటిల్లు”; “సౌందర్యాత్మక హింస” అన్న కవితలు రెండూ కూడా చాలా ముఖ్యంగా చెప్పవలసినవి!

సౌందర్యపు భ్రమల్లో ఆడవాళ్ళు పెట్టుబడిదారీ విధానాలకి సహకరించి తమనెలా హింసించుకుంటూ బతుకుతున్నారో రాస్తుంది విమల. అలాగే ఆడవాళ్ళ కలల్లో సైతం “వంటిల్లు” అవిభాజ్యమైన బంధంగా ఎలా భాగమైపోతుందో చాలా బలంగా వ్యక్తీకరించిన కవిత “వంటిల్లు”! ఈ రెండూ నిడివిలో బాగా పెద్దవి కావటం వలన వీటిల్లోంచి కొన్ని కొన్ని భాగాలని మాత్రం చదువుతాను.

“భయం భయంగా నిశ్శబ్దంగా నిరాశగా
మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ
అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది.
… ఆమెను చూస్తే ఒక గరిటె గానో … పెనం లానో …
మా వంటింటిని అలంకరించిన ఒక పరికరంలానో ఉంటుంది!

ఒక్కోసారి ఆమె
మండుతున్న పొయ్యి లాగా కూడా వుంటుంది.
అప్పుడు బందీ అయిన పులిలా
ఆమె, వంటగదిలో అశాంతిగా తిరుగుతుంది
నిస్సహాయతతో గిన్నెలు ధడాలున ఎత్తేస్తుంది
ఎంత తేలికో గరిటె తిప్పితే చాలు
వంట సిద్ధం అంటారంతా!
తినేందుకు తప్ప ఇటుకేసి రారు ఎవ్వరూ
ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయినా, చివరకు వంటింటి గిన్నెలన్నిటి పైనా
మా నాన్న పేరే!

అదృష్టవశాత్తూ నేనో మంచి వంటింట్లో పడ్డానన్నారంతా!
గ్యాసు, గ్రైండర్లు, సింకులు, టైల్సు …
అమ్మలా గారెలూ, అరిసెలూ కాక
ఇప్పుడు కేకులు, పుడ్డింగులు చేస్తున్నాను నేను.
ఇంకా గిన్నెలపై పేర్లు మాత్రం నా భర్తవే!

… కడిగిందే కడిగి, ఏళ్ళ తరబడి వండీ, వండీ
వండిస్తూ … ఎంగిళ్ళెత్తేసుకుంటూ …
చివరకు నా కలల్లోనూ వంటిల్లే
కళాత్మకమైన వంటింటి కలలు
మల్లె పూవుల్లోనూ పోపువాసనలే!
ఈ వంటింటిని తగలెయ్య
ఎంత అమానుషమైందీ వంటగది!
మన రక్తం పీల్చేసి, మన ఆశల్నీ, కలల్నీ కాజేసి
కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న
రాకాశి గద్ద ఈ వంటిల్లు.
మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం
“గరిట తిప్పటం”గా చేసిన ఈ వంటిళ్ళను
ధ్వంసం చేద్దాం రండి” అంటుంది.

అలాగే విమల రాసిన “సౌందర్యాత్మక హింస” కూడా మంచి కవిత. ఇందులోంచి కొన్ని పంక్తులు.

“మనమంటే 32, 24, 35 కొలతలమైన చోట
మొటిమలు మొలవడం, జుట్టు రాలడం
నడుం సన్నగా లేకపోవడమే
మన నిరంతరాందోళనలైన చోట
ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా!
…. నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా
ఒక కృత్రిమ సౌందర్యంకై వెంపర్లాడుతూ …
మూసలోకి ఒదిగి ఒదిగి
ఈ “స్వఛ్ఛంద” సౌందర్య హింస
మన సహజాతమని నమ్ముతూ …
మనల్ని చూసుకున్నప్పుడల్లా
గడ్డీ గాదం కూరి పంటచేలో నిలబెట్టిన
దిష్టిబొమ్మ గుర్తొస్తుంది.
మనలోంచి మనసంతా తీసేసి, డొల్ల చేసిన
“ఈజిప్షియన్‌” మమ్మీలాగుంటాం!”

… అని రాసి

“మన మనుగడకు అందం అనివార్యమైన చోట
మనల్ని వెల్లవేసి, పటాల్ని తగించిన గోడల్ని చేసి
మనల్ని అలంకృత గంగిరెద్దులని చేసి
నిర్బంధ “సౌందర్యాత్మక హింస”లో
గాయపరచిన చోట
మిత్రులారా!
నగ్నంగా, తల్లి గర్భం నుంచి బయటపడ్డట్టు
జీవితాన్ని పిలుద్దాం!
రంగులద్దుకోలేని, అంకెల మధ్య శరీరాన్ని ఇముడ్చుకోలేని
నిరంతర శ్రమలో పెదవులు పగిలి
చేతులు కాయలు కాచి
రేగిన జుట్టుతో, అలిసిన కళ్ళతో …
చింకిపాతలతో
అందాన్ని “ఖరీదు చేయలేని”
కోట్లాదిమంది స్త్రీల
అందహీనతని మనం ప్రేమిద్దాం” అంటుంది.

అందం; ఆరోగ్యం ఇవి ప్రతి మనిషి మానసికోల్లాసానికి అవసరం. కానీ అందం అంటె ఫలానా ఫలానాగా ఎవరో గిరిగీసిపెట్టిన సూత్రాలకి అనుగుణంగా శరీరాలని కుదించుకుని, అలా బతుకుల్ని ఇరుకు చేసుకోవడం కాదన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం! ఇది అర్థమైతే ఆరోగ్యం కోసం ఎవరైనా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేగానీ, అనవసరంగా నల్లగా ఉన్నవాళ్ళు తెల్లబడడానికి, లావుగా ఉన్నవాళ్ళు సన్నబడడానికీ ఊరికే అగచాట్లు పడరు. ఐతే, వ్యాపారప్రకటనల ద్వారా ఆడవాళ్ళ శరీరాలని వస్తువులు చేసి అమ్ముకునే పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ రకమైన భావాలన్నింటినీ నిజమని నమ్మేలాగా చేస్తుంది.

అందంగా ఉండవలసిన అవసరం ఆడదానిదే! మగవాడికి అందం లేదు. అందం అఖ్ఖర లేదు. వాడు మగాడైతే చాలు అన్నది సమాజ దృక్పథం! ఇందువల్ల అందంగా కన్పించడం కోసం .. అధికంగా శ్రమ పడే పని మగవాడికి తప్పిపోయింది! ఆడది అందంగా కన్పించడానికి అన్నిరకాల ఇబ్బందులూ పడాల్సివస్తోంది! ఈ రకమైన సౌందర్యపుటెల్లలని చెరిపేయమని చెబుతుంది విమల. అందాన్ని గురించి నేను వ్రాసిన ఒక వ్యాసంలో కూడా “అందం” అనే భావన చుట్టూ ఉన్న భావజాలాన్ని గురించి విపులంగా చర్చించాను.

స్త్రీవాద కవిత్వంతో పోలిస్తే స్త్రీవాద కథాసాహిత్యం కల్గించిన ప్రభావం తక్కువనే చెప్పాలి. ఓల్గా నవలిక “స్వేఛ్ఛ” మీద కాబోలు మార్క్సిస్టు సాహిత్య సంస్థలే ఏవో కొంత రచ్చ జరిపాయి. ఓల్గా కథ “అయోని” లాంటివి కూడా కొంత చర్చకు కారణమయ్యాయి. స్త్రీ వాద దృక్పథంతో కాకపోయినా స్త్రీల అంతరంగ మథనాన్ని తమ కథల్లో చిత్రించిన అబ్బూరి ఛాయాదేవి, పి. సత్యవతి గారల కథలున్నాయి. పి. సత్యవతి గారి “మాఘ సూర్యకాంతి” అలాంటి ఒక మంచి కథ!

’93 తరవాత స్త్రీవాద సాహిత్యానికి వంకలు పెట్టగల శక్తి మరింక స్త్రీవాద సాహిత్య విమర్శకులకి లేకపోయింది! ’93 లోనే దాదాపుగా ఈ వివాదం సద్దుమణిగిపోయింది. ’94 నించి స్త్రీవాద సాహిత్యానికొక గుర్తింపు, పత్రికల పేజీలలో ప్రత్యేకంగా చోటూ దొరికాయి. “ఈ వారం కథ” లాంటి పేర్లతో పేజీ నిడివి కథలని దినపత్రికలు కూడా ప్రచురించేవి. ఈ పేజీల్లోని కథలలో స్త్రీల జీవితాలలోని అణచివేతకి సంబంధించిన అంశాలతో వచ్చిన కథలు చాలానే కన్పిస్తాయి. ఆడవాళ్ళూ .. ఆడపేర్లు పెట్టుకున్న మగవాళ్ళూ, మగవాళ్ళూ కూడా ఎక్కువగా ఈ తరహా కథలు రాయడంలో ఉత్సాహం చూపించారు. పత్రికలు ఇలాంటి రచనలకి తమ ప్రోత్సాహాన్నందించాయి. సాహిత్యపు పేజీలు నిర్ణయించిన నిడివికి లోబడి తయారైన కథలైనందువల్ల కాబోలు ఈ పేజీల్లో వచ్చిన కథల్లో “కథనం” కన్పించదు. అసలు వీటిని కథలని అనొచ్చా? అన్నదింకా నాకు సందేహమే! “గల్పికలనో” అలా ఇంకేదైనా అనాలేమో!? ఓల్గా “రాజకీయ కథలు”, కొండేపూడి నిర్మల “శతృస్పర్శ” వంటి వాటిల్లో కూడా కథాంశం మీదనున్న శ్రద్ధ కథాకథనం మీద కన్పించదు.

’94 తరవాత స్త్రీవాద ధోరణి సాహిత్యరంగంలో స్థిరపడిపోయాకా ఇతివృత్తానికి కూడా ఒక “మూస” తయారై పోవటం కన్పిస్తుంది. ఫెమినిస్ట్‌ తరహాలో రాయటం ఒక ఫాషన్‌గా మారిపోయిందన్న మాట! ఈ సమయంలో వచ్చిన కథల్లో చాలా వరకు మన ఊహాశక్తికి పని పెట్టేవి తక్కువ. ఒక frameకి లోబడే నడుస్తాయి కథలు. ’93కి ముందొచ్చిన కవిత్వం కల్గించిన ప్రభావాన్ని కథలు కల్గించలేకపోవడానికి కథనం లోని లోపమే ప్రధానంగా చెప్పాలి! కథ చెప్పే తీరు చాలా ముఖ్యం! కథ ఏమేం చెబుతుందో … ఎలా ముగుస్తుందో ముందే మనకి తెలిసిపోయేలాగా ఉండే రచనలు “సృజన రీత్యా” ప్రత్యేకమైనవిగా పరిగణింపబడవు!

అయితే స్త్రీవాద సాహిత్యం వల్ల జరిగిన ప్రయోజనం ఏమిటంటే … సాహిత్యరంగంలో “అబ్బే! మేం ఫెమినిస్టులం కాము బాబూ!” అంటూ ’90లకి ముందు మాట్లాడిన ఆడవాళ్ళు … ’94 తరవాత తాము ఫెమినిస్టులమేనని చెప్పడానికి ఇష్టం చూపించడం! మగవాళ్ళు కూడా తాము ఫెమినిస్టులమని చెప్పడానికి ఉత్సాహపడడం!

వివాదానంతరం వచ్చిన స్త్రీవాద కథాసాహిత్యంలో కూడా చెప్పుకోదగ్గ కథలు రాసిన వారు పి. సత్యవతి గారే! అలాగే, బమ్మిడి జగదీశ్వరరావు కథ “రెక్కల గూడు” స్త్రీ జీవితంలోని హింసని చిత్రించిన బలమైన రచన! నా కథలు “రసఝరీయోగం”; “ప్రొఫెసర్‌ గారి కల” ఇవి, వస్తువు వర్ణన కథనం వీటి దృష్య్టా మిగతా స్త్రీవాద కథల కన్నా భిన్నమైనవి! వీటిలో “రసఝరీయోగం” కథ, అన్ని తరహాల పాఠకులకీ నచ్చిన కథ!

స్త్రీవాద సాహిత్యం మీద వివాదాలన్నీ మాసిపోయిన తరువాత ఈ ధోరణిలో వచ్చిన సాహిత్యంలో పదునుగా పలికిన పలుకు కొంచెం సన్నగిల్లింది! ఒక ఊపులో కొన్ని మంచి కవితలని రాసిన కవయిత్రులు ఏ కారణం వల్లనో కొంచెం నెమ్మదించినట్టు కన్పిస్తుంది!

ఫెమినిస్టు ధోరణిలో ఇటీవల కథలు రాస్తున్న కుప్పిలి పద్మ, కవిత్వం రాస్తున్న మెహెజబీన్‌ లాంటి వాళ్ళున్నారు. అలాగే, స్త్రీవాద సాహిత్యధోరణితో “భూమిక” అన్న పత్రిక వస్తోంది!

ఇది స్త్రీవాద సాహిత్య సమీక్షావ్యాసం గనక, ఆ సాహిత్యంలోని మేలు కలిగిన అంశాలతో పాటు, మేలు కలగని ధోరణిని కూడా చెప్పవలసి ఉంటుంది నాకు!

“నీలిమేఘాలు” స్త్రీల కవితా సంకలనంలో అంతకుముందు త్రిపురనేని శ్రీనివాస్‌ ప్రచురించిన “గురి చూసి పాడే పాట” సంకలనం నించి పునర్ముద్రించినవి మినహాయిస్తే విడిగా, నీలిమేఘాలు సంకలనం కోసం ఎంపిక చేసిన చాలా కవితల్లో “కవిత్వపు పాలు” తక్కువగా కన్పిస్తుంది! కొంతమందివి, అదే తొలిరచనా తుదిరచనా కూడా అనుకుంటాను! అందులో కొందరు కవయిత్రులు చెప్పుకోదగ్గ మరో కవిత రాసిన వాళ్ళు లేరు! ఆ పుస్తకం తెలుగు సాహిత్యంలో సమాంతరంగా స్త్రీల కవిత్వం ఒక ఉద్యమంలాగా సాగిన భ్రమని కల్గిస్తుంది! అది భ్రమ మాత్రమే! నిజం కాదు!!

అలాగే, నీలిమేఘాలు పుస్తకం ఆనాడు జరిగిన వివాదాల నేపథ్యంలో అచ్చయిన పుస్తకం. దాన్ని గురించి ఓల్గా ఆ పుస్తకం లోని తన తొలిమలి మాటలలో వివరంగా చెప్పుకొచ్చింది. ఎప్పుడైనా ఒక కాలంలో జరిగిన సంఘటనలని రికార్డు చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకి భిన్నంగా ఎవరు నిర్వహించిన పాత్రనైనా పేర్కొనవలసి ఉంటుంది! ఆ దృష్టి కొరవడితే … ఆ పనికి సంపూర్ణత సిద్ధించదు. ఓల్గా తొలిమలి పలుకులలో తానూ, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని వీరిచ్చిన జవాబులతోనే స్త్రీవాద సాహిత్యం మీద దాడికి పూనుకున్నవాళ్ళు వెనక్కి తగ్గినట్టు అభిప్రాయం వచ్చేలాగా రాస్తుంది! ఆమె వాక్యాలలో ఎక్కడా ఎంతగానో చర్చింపబడిన నా వ్యాసం దిగంబర కవిత్వాన్ని విశ్లేషించినది దాని గురించి గానీ, నీలిమేఘాలు కవితాసంకలనం కన్నా ముందుగానే స్త్రీవాద సాహిత్య కువిమర్శకులకి జవాబుగా నేను అచ్చువేసి ఎంతో ప్రేమగా “తమ ధిక్కార స్వరాలతో ఈ దశాబ్దాన్ని స్త్రీల పరం చేసిన కవయిత్రులకి” అంటూ అంకితమిచ్చిన నా “యశోధరా ఈ వగపెందుకే” కవిత్వ పుస్తకాన్ని గురించి గానీ ఒక్క మాట కూడా ఉండదు! స్త్రీవాద సాహిత్యంలో నా రచనలూ నా విమర్శనా వ్యాసాలూ … ముఖ్యమైన contribution కాగా, వాటిని ప్రస్తావించకుండా … ఆనాటి సంఘటనలని రికార్డు చేయబోవడం పాక్షిక ధోరణి తప్ప వేరు కాదు! స్త్రీవాద ఉద్యమానికి గానీ, స్త్రీవాద సాహిత్యానికి గానీ ఇలాంటి ధోరణుల వల్ల ఒనగూరే లాభం కన్నా నష్టమే ఎక్కువ! స్త్రీవాద సాహిత్యంలో సైతం “గ్రూపిజం”; “సాహిత్య రాజకీయాలూ” ప్రవేశించాయని తెలుసుకుందికి మాత్రమే ఇలాంటివి ఉపయోగపడతాయి!

స్త్రీవాద కవిత్వం మీద సాహిత్య విమర్శ పరిధిని దాటిపోయి జ్వాలాముఖులెందరో … దెబ్బకొట్టబోయినప్పుడు … సంఘర్షణలో హింస పడిన కవయిత్రులకి నైతిక వత్తాసు నిచ్చే ఒక్క మాటైనా మాట్లాడని స్త్రీవాద సంస్థలు “స్త్రీ శక్తి సంఘటన”; “అన్వేషి” లాంటివీ ఉన్నాయి! వీళ్ళెవరూ, కవయిత్రుల మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా ఒక్క statement కూడా ఆ కాలంలో చెయ్యలేదు. పైగా “అన్వేషి” లాంటి స్త్రీవాద సంస్థ అటు తర్వాత తాము ఇంగ్లీషులో ప్రచురించిన స్త్రీల సాహిత్యం పుస్తకం కోసం స్త్రీవాద కవయిత్రుల రచనలని మాత్రం అడిగి మరీ అచ్చువేసుకుంది! మా పట్ల ఆ సమయంలో వాళ్ళు solidarityని చూపించకపోవడం వాళ్ళు నమ్మే సిద్ధాంతాల పట్ల ద్వంద్వ ప్రమాణాలని పాటించడమే అవుతుంది!

అలాగే ఆనాడు మా సాటి కవులు, రచయితలూ కూడా బాహాటంగా మాపట్ల పురుష సాహిత్య విమర్శకులు చూపిన అప్రజాస్వామిక ధోరణుల పట్ల ఏ నిరసనా వ్యక్తం చేయలేదు.

ముఖ్యంగా మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘింపబడినా గాని తాను ముందుగా ప్రతిస్పందించే APCLC లాంటి సంస్థ కూడా కవయిత్రుల మీది దాడిని ఏమీ ఖండించలేదు. స్త్రీల మీద జరిగే హింసని మానవ హక్కుల ఉల్లంఘనగా వారు తీసుకోకపోవడమే దీనికి కారణం! ప్రధానంగా చేకూరి రామారావు గారే స్థూలంగా కవయిత్రుల్ని సమర్థించుకొచ్చారు! మళ్ళీ ఇందులో ఆయనకున్న రిజర్వేషన్లకీ … ఇష్టాయిష్టాలకీ అనుగుణంగా కొందరి రచనల పట్ల కొంత ప్రేమని, కొందరి రచనల పట్ల కొంచెం తక్కువ ప్రేమనీ, ఇంకొందరి రచనల పట్ల ఓల్గా ప్రదర్శించినట్లుగానే అలక్ష్య భావాన్నీ … ఒక్కోసారి ఎకసెక్కెపు మాటలనీ కూడా మాట్లాడుతూ వచ్చారు! ఒక దశలో స్త్రీవాద కవిత్వాన్ని శాసించే వైఖరిని కూడా ఆయన ప్రదర్శించారు!

అయితే స్త్రీవాద సాహిత్యానికి స్త్రీవాదాన్ని విమర్శిస్తూ … మాట్లాడిన వారో .. సమర్థిస్తూ మాట్లాడిన వారో … వీరెవ్వరూ కాదు బలాన్నిచ్చింది! పాఠకులు!! ఔను. పేపర్లలో తమ ముఖం కన్పించే అవకాశమే లేని వందలాది పాఠకులు!! వీరూ … నిశ్శబ్దంగా తమ వత్తాసు నందించారు! వీరిలో అన్ని వర్గాల వారూ ఉన్నారు! అన్ని వయసుల వారూ ఉన్నారు! ఆడా మగా అందరితో కలిపి!!

మైనారిటీ దళిత వర్గాల నించి వచ్చిన ఒకరో ఇద్దరో ఆడవాళ్ళు ఇటీవల కొంచెంగా రాయడం మొదలుపెట్టారు. దళిత స్త్రీల తరుపున ప్రస్తుతానికి ఎక్కువగా దళితుల మగవాళ్ళే రాసేస్తున్నారు! అవి సహజంగానే పురుషదృక్పథాన్నే ప్రదర్శిస్తున్నాయి!!

నేను గమనించినంత మటుకు స్త్రీల రచనల్లో ఇటీవల వస్తు వైవిధ్యం గానీ, ప్రయోగ శీలత్వం గానీ పెద్దగా కన్పించలేదు. కారణాలని పరిశీలించడానికి గానీ వ్యాఖ్యా నించడానికి గానీ ఇంకా వ్యవధి అవసరమవుతుంది ఎవరికైనా!!

సిద్ధాంతం నమ్మకం మారకుండా కూడా కవులూ … రచయితలూ అయిన ఆడవాళ్ళు తమ ప్రాపంచిక అనుభవాలనీ రచనా పరిధినీ కథనవిధానాన్నీ విస్తృత పరుచుకోవలసి ఉంటుంది! అది జరగక పోతే, రచనల్లో వైవిధ్యం కొరవడితే రచనల్లో “పస” తగ్గే ప్రమాదమూ అందువల్ల ఒక మూస ధోరణిలో రచనలు తయారయే ప్రమాదమూ హెచ్చుగా ఉంటాయి! ఇక్కడే రచయిత్రులు ఆగి, నిమ్మళంగా ఆలోచించుకోవాలి. నిజానికీ విషయం స్త్రీల కనే కాదు ఒక ధోరణిలో పడిపోయే ఏ రచయితల కైనా వర్తిస్తుంది! అలవాటైపోయిన శైలి ఏ ఉద్యమ సాహిత్యానికైనా … నష్టాన్నే కల్గిస్తుంది!

అయితే, ఈ విషయంలో నేను నిరాశావాదిని కాను. బహుశా ఒక ఉద్ధృతి తరవాత మరొకింత విశ్రాంతి; ఒక “కవన విరామం” వారికి కావాల్సి ఉండొచ్చు! లేదూ, రేపు మరొక తరం స్త్రీల నించి మరింత వైవిధ్య భరితమైన రచనలూ రావొచ్చు! అందాకా ఓర్పుగా వేచిచూదాం! అనుకుంటాను.

ఈ వ్యాసంలో ఇంతకు ముందు నేను చదివిన కవితలే కాక; ఇంకా అనేకమైన అంశాల మీద కవయిత్రులు కవితలు రాశారు. ప్రేమ శృంగారం స్నేహం లాంటి జీవితానికి సంబంధించిన అనుకూల విలువలూ వీటిల్లో ఉన్నాయి!

ఒక alternative culture కోసం alternative system కోసం ఆడవాళ్ళు సంఘర్షణ పడుతున్నారన్న విషయాన్ని స్త్రీవాద సాహిత్యం తనలో ప్రతిఫలించింది! ప్రజాస్వామ్య దృక్పథం కల్గిన వాళ్ళంతా రావాల్సిన ఈ మార్పుల కోసం ఆలోచనలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది!

ప్రస్తుతం పరమ కల్లోలంగా కొనసాగుతూ ఉన్న కుటుంబ వ్యవస్థ రూపురేఖలు మారనిదే ఆడవాళ్ళకి హింస నించి, నిజంగా విముక్తి సాధ్యం కాదు! దీని గురించిన నా ఆలోచనలని “కొన్ని చేదు మాటలు” అన్న వ్యాసంగా రాశాను!

కుటుంబంలోని ఆడవాళ్ళ మీద అనేక రకాల వత్తిడులు సంప్రదాయ పరమైనవి, డబ్బు పరమైనవి, చాకిరీ పరమైనవి చాలా ఉన్నాయి! వీటిని గురించి బయటికి చర్చించకుండా యధాస్థితిని అట్టే పెడుతూ … అంతా బాగానే ఉందని నటించడం వల్ల ఎవరైనా సమస్యని ఎక్కువ కాలం దాచిపెట్టలేరు. ఈ పరిస్థితికి ఎక్కువగా హింసపడుతున్నవాళ్ళు కుటుంబంలో ముఖ్యంగా పిల్లలు! అసమ మానవసంబంధాలని ఆదర్శంగా మనం వారికి చూపకూడదు! అందుకోసం మనం, ఆడవాళ్ళం మగవాళ్ళం అందరమూ మారాలి!! బానిస జీవితానికి ఆడవాళ్ళూ … అధికారయుతమైన ఆలోచనా విధానానికి మగవాళ్ళూ స్వస్తి చెప్పాలి!! ఈ నా మాటలకి ముగింపుగా ఇటీవల వచ్చిన నా కవితా సంకలనం “చింతల నెమలి” నించి స్త్రీవాద దృక్పథంలోనిదే, మరొక తరహా పద్యం మీకు చదివి విన్పిస్తాను!

ఆడపిల్లల్ని “ప్రేమతో” పెంచమంటూ తెలుగింట అమ్మానాన్నలకీ … ఆబాలగోపాలానికీ కానుకగా ఈ పద్యం!

పాపాయి జోల

పంటమడి గట్టున
పారిజాతపు వాన
గోరింట గుబురులో
కోరి పట్టిన తేనె

పూచి కాచిన సెనగ
పొన్న పున్నాగ
మరు మల్లె చామంతి
మనసైన బంతి

రాత్రి కొన కొమ్మపై
నక్షత్ర మాలిక
ఊయెలా డోలిక
పసి గోరువంక

చిలికి తీసిన వెన్న
మావిళ్ళ గున్న
చిన్నారి పాపాయి
జాజుల్ల దిన్నె

పొగమంచు తొలిఝాము
చలిమంట వాకిలి
పొదరింట నిదురించు
నెలవంక జాబిలి

అన్నిటా మిన్నగా
ఆటలుప్పొంగ
అమ్మవడి చేరింది
ఆకాశ గంగ!