(టి. శ్రీవల్లీ రాధిక హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నలభైకి పైగా కథలు ప్రచురించారు. “రేవు చూడని నావ” అనే కవితాసంపుటి కూడా. “నా స్నేహితుడు” అనే కథకి “కథ” ఎవార్డ్ వచ్చింది. )
నిప్పులా ప్రజ్వరిల్లడం కాదు
నీరులా పరుగులు తీయడం
నేటి జీవనవిధానం
పక్షిలా పైకి ఎగరడం కాదు
ఎలుకలా త్రవ్విపోయడం
ఈనాటి వివేకం
మనిషికో ధ్యేయం
మేధకో వ్యాపకం
గుర్తించి తీరాలి మనం
ఒక్కొక్కరిదీ అద్వితీయమైన
నైపుణ్యం
శస్త్రచికిత్సలూ శల్యపరీక్షలూ
ఒకరి ఉద్యోగ ధర్మం
నక్షత్రాలూ పాలపుంతలూ
మరికొందరికి ఇష్టమైన రంగం
వాళ్ళకి అరుంధతీ ధ్రువుడూ
తెలియాల్సిన అవసరం లేదు
వీళ్ళని మనిషికి ఎన్ని గుండెలు అంటే
మూడని చెప్పినా ఆశ్చర్యం లేదు
వారికీ వీరికీ కూడా
కళలూ కావ్యాలూ నిరర్ధకమైన పదాలు
అందమూ మాధుర్యమూ
పాతరాతియుగం నాటి శకలాలు
తెల్లనివన్నీ పాలు
నల్లనివన్నీ నీళ్ళు కాకపోయినా
మెల్ల్లనివన్నీ వీరికి ముళ్ళు
మెదలనివన్నీ వట్టి రాళ్ళు
అనూహ్యంగా ఎదిగిన
మనిషినుంచి అంతకన్నా
ఆశించడం అవివేకం
అంబరాన్ని తన్నినవాడి ముందు
ఆనందంగా
తలవంచడమే ఉత్తమం
చంద్రుడిని తాకివచ్చినవాడికి
వెన్నెలపై మోజు ఉండకపోవడం సహజం
మట్టినే సరిగా చూడనివాడిని
మల్లెపూల రంగు అడగడం అసంబద్ధం
అరక్షణాన్ని అరవై లక్షల
పనులకు కేటాయించుకున్నవాడిని
అయిదునిమిషాలు నిలబడి
మాట్లాడమనడం అన్యాయం
మైక్రోసెకండ్ల్లు పీకోసెకండ్లు
మాత్రమే తెలిసినవాడికి
మొక్క ఎదిగే తీరు
బద్ధకంగా తోచడమే
మరి న్యాయం
అరచేయంత స్థలంలో
అరవైవేల పరికరాలు వుంచగలవాడు
అతివిలువైన హృదయాన్ని
అరువిస్తాడనుకోవడం అమాయకత్వం
గుండుసూది మోపే స్థలమైనా
వృధాపోనీయనివాడి గుండెలలో
గులాబీలు పూయించే ప్రయత్నం
అసలు అనవసరం
రోజుకొక యంత్రాన్ని
కనిపెట్టగల సమర్ధుడికి
గుండెలయలు వినే తీరిక
లేకపోవడం క్షమార్హం
పూటకొక యంత్రభాష
నేర్వగల నేర్పరికి
మనుషులతో మాట్లాడే తీరు
తెలియకపోవడమే కాస్త చిత్రం
అన్ని సాధనాలనూ ఆమడదూరంనుంచి
ఆపరేట్ చేయాలనుకునేవాడికి
ఆలింగనంలోని మాధుర్యం అర్ధంచేయడం కష్టం
ఆర్టిఫిషియల్ యింటెలిజెన్స్
ఆపాదించగలిగినవాడికి
ఆలోచనామృతం అందచేయాలనుకోవడం
అర్ధరహితం
అణువును కనుగొన్నవాడికి
ఆకలిబాధ తెలియకపోవడమే నయం
పరమాణువును శాసించేవాడికి
పాడిఆవును పరిచయం చేసినా ప్రమాదం
కాగితాలుండని కార్యాలయం
అతని ప్రస్తుత లక్ష్యం
మనుషులుండని కర్మాగారం
భవిష్యత్ స్వప్నం
మన్నూ మిన్నూ ఏకం చేసే
ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగనిద్దాం
ప్రగతిని అడ్డుకునే
మూఢత్వం మనం ప్రదర్శించకుండా వుందాం
మరమనుషులపై పెత్తనం చేసే
ఆరాటాన్ని మౌనంగా గమనిద్దాం
మనసు గూర్చి మాట్లాడే నేరం
మనం చేయకుండానే వుందాం