చంద్రికాపరిణయము – 6. చతుర్థాశ్వాసము

వ. వెండియు నాపండువెన్నెలదండం బఖండకాండజారిమండల మాయామౌక్తికమయ భద్రాసన సమా సీన నీలాంక లంకావరా హితపట్టాభిషేచనావరసమయ మహర్షిరాజాభిషిక్త గంగాదిపుణ్యతరంగిణీవిశద జలప్రవాహంబులపోలికం బ్రవహించుచు, నస్తాచలసంగతాహిమాంశుకిరణకూటతృణాంకురనికరంబుల నన్నింటి మేసి దర్పించి రథాంగజనంబులకు వైకల్యంబు చేకూర్చి సముజ్జృంభమాణ సత్ప్రభావాప్తిం జెలరేఁగు నిశానైచికిం బట్టి చకోరవత్సంబులు గుడువం జేఁపు తారాధవోధస్థల పరిదృశ్యమాన నవాంశుక స్తనంబుల ధరిత్రీపాత్రి దిష్టగోపాలకుండు పిదికిన నవీనపయఃపరంపరలదారిం జూపట్టుచు, దినాంత పర్యంతం బొక్కప్రొద్దుండి యతికాంత కాసారసోపానోపాంత శశికాంతసంతానమరీచికా వీచికావతీవీచికా జాతంబులం జొచ్చి యెడలి వికసితారుణశరజపీఠి వసించి కమలాహితధ్యానకలితాంతరంగంబున నున్న చకోరసువాసినీజనంబుల కవ్రతఘ్నంబు లగువిశదాపూపంబులు సమకూర్పఁ దత్ప్రియశ్యామా ప్రకాం డంబు పూర్వదిశావదాతశోభాచ్ఛాదనంబుపైఁ జంద్రఘరట్టంబు వెట్టి యొయ్యననొయ్యనం దారాసుభద్రా పటలంబులు వైచి విసరం బ్రసరించు తదీయపిష్టధట్టంబుల చందంబునం బెంపొందుచు, నెట్టుకొని గట్టు గములతటంబులం బొడకట్టు నెలచట్టులం గరంగి మట్టుమీరం గురియు పెన్నీటి బలురొద యభంగ తరంగనినాదంబును ముందుముందుగ మందగతిం దోఁతెంచు చందనాచలపవనకందళిం దరళితంబులై నిండార విరిసిన బొండుమల్లియవిరులపిండులు పాండురడిండీరఖండమండలంబులును మదిఁ గదురు ముదమునఁ దమతమసుదతుల గవఁగూడి యెదుర్కొను రేపులుఁగుకొలము లెదురెక్కు సమానవతీక మీనవితానంబులునుం గాఁగ ననూనపథికమానినీమానసాల మూలసమున్మూలనంబు సేయం బరఁగి దినాంతవిలయకాలమ్మున వేలాతిగం బైన పాలవెల్లిపొడవునం బొడసూపుచుఁ, గోకనదపరాగమహో దయరాగవిలసనంబునం గోరకితనీరజతారకాసమున్మేషంబునం గోమలశ్యామలేతర కుముదవలయ సుధాకరధామ విశేషంబునం గొమరొంది తద్రజనీసమయ భాసమాన పయోధరపథంబున కన్న మున్ను మున్న కన్నులకు వెగ్గలంబై దొలంకుకొలంకుగమిం బాసి సన్నంపు వెన్నెలమిన్న చొరరాని లతానివా సంబుల దాఁగం బోవుచుఁ దదంతర సంఫుల్ల్యమాన మల్లికావల్లికామతల్లికా ప్రసవ ధవళద్యుతి ప్రకాండం బులు నిండి రేయెండ మెండు కొనఁజేయ దాఁగ వచ్చిన చోటన్ దలవరు లున్నతెఱం గొయ్యనఁ గని ఖేదించు రోదరతలోదరీవారమ్ముల నయనమ్ముల జాలుగా జాఱు ననావిలజలమాలికలతో మేలంబు లాడుచుఁ, దళతళమను నెలచలుపగిన్నెలయెడలం గలయ నించిన యతిబంధురసౌగంధిక సుగంధ ధురంధర గంధోత్తమారసంబు దమతమరమణుల కెమ్మోవిపండు లుపదంశమ్ములుగా నాదారం గ్రోలి తదీయమాహాత్మ్య కల్పితమానసవిభ్రమంబునఁ దత్పాత్రల సరగ నెఱమించు నిగనిగల మఱలన్ సలి లంబు లూర మదిర నించి నారని గైకొని యచటం బ్రతిఫలించు పల్దెరవాసనకు నిడిన కెందలిరుటాకని దివిచియు విలోచనమాలికలువానితావికిం జేరు తుమ్మెద లని గదిమియు ముదంబునఁ బ్రియుల కందీ యంబోవు మందగామినీబృందమ్ముల హస్తారవింద సందీపిత హీరకటక శోభాధట్టంబులం జెట్టవట్టుచు, ననూనపానశాలాచత్వరంబుల విమలాసవంబు లాలస మెచ్చం ద్రావి నిర్మితహర్మ్యరాజంబులఁ జేరం బోవు నెడఁ జంద్రికాహాలాపానలీలాగతి నంబరంబునం జరించుచుఁ దత్సమర్పిత మదఘూర్ణితంబులగు చకోరకోరకకుచా నిచయంబుల కటాక్షతారళ్యంబులు నెఱమించులై కోకనదకోటరకోటి లీనమధుకర ఝంకారంబులు గర్జనంబులై నిగుడం బొడసూపు వెన్నెల జడివానగాఁ దలంచి యౌదలలఁ బయ్యెదలు గప్పి నెచ్చెలికేలు కైలాగుఁ బూని బుడిబుడి రయం బడర నడచు పడఁతిమిన్నల యున్నతస్తనాంతర విలంబమాన ముక్తా హార గౌరరుక్తతిం బునరుక్తం బగుచు, వెగ్గలమై నెమ్మదిఁ గ్రమ్ము సిగ్గు వెనుకకుఁ దివియ నగ్గలిక మరుండు వైచు మొగ్గములికిగములు ముంగలికి నూకం గరంబు మదంబున దూఁగి యాడు వలదొరపట్టంపుటేనుంగురంగునఁ జూపట్టుచు నెచ్చెలుల కుశలత్వంబున మందమందకలనం బునఁ గేళికామందిరంబులు చేరి యధిపుఁడు కరంబు పట్టి శయ్య నుంచి ముత్తియంపుపేరు లంటుపేరఁ జన్నులు ముట్టుచు మురిపెంపు నెమ్మోమున మడుపు నందిచ్చుదారిఁ గెమ్మోవి నొక్కుచు దమి రేఁచి బంధురబంధవిశేషసంబంధంబున ననవిల్తుకయ్యంబునఁ జొక్కించి చొక్కంపుఁగళల యిక్కువ లెఱింగి మిక్కిలి గలయ గ్రక్కున వెక్కసంబై తనువునఁ జెమటలు గ్రిక్కిఱిసిన మదనమాయావిలసనంబునం బొడమిన ప్రోడతనంబున నెంతగమ్మంబు గ్రమ్మెనని పతులకుఁ దెలియకుండం బలుకుచుఁ జేలచెఱంగున విసరికొను నవోఢానికరంబుల ధవళాంబరాంచల విభాతరంగంబులం బొంగి పొరలుచుఁ, దొలుతటి కల యికల మన మలరఁ గలసిన చెలువరతనంబులఁ దలఁపునం దలఁచుచు నలమరాని విరాళిం గొని నెల వొడుపు వెనుక నలరువాల్దొరకలికిఁ జెలరేఁగన్ దమి నేతెంచినపతు లపుడు తమయెడఁ బొడముమమత నిదుర గదియమిఁ గెంజిగిం గదురుకొను కనుతుదలును దనుతలమ్మునఁ దొలఁకు గురువిరహజ్వర భరంబున విరిపాన్పునం బొరలఁ జిక్కువడు మణిసరంబులును మరుని యిరువాఁడికైదువు పేరెదం జుఱు చుఱుక్కున నాటఁ దాళక నెఱపు నిట్టూర్పులునుం బరయువతితిలకసంపర్కప్రకారంబు తోరంబుగా నెఱింగింప నలివి యవలిమొగంబై శయనించి మాటిమాటికి బోటికత్తెలపలుకుల నిజప్రేమాతిశయజనిత వియోగవేదనాకార్యంబులుగాఁ దెలిసి యినుమడికూటముల నలమి రతిబడలిక వాయఁ గరం బురం బులఁ జల్లులాడు పువ్వుబోఁడుల శయకుశేశయసమాక్షిప్తఘనసారక్షోదంబులం బక్షీకరించుచు, నలరు మల్లియవిరిసరులు దుఱిమి యమలమౌక్తికదామంబులు దాల్చి కపురంపుబొట్టులు దీర్చి కమనీయమల యజకర్దమం బలంది కలికి తెలిచలువ లూని వెన్నెలం దలవరులు గనకుండ సంకేతనికేతంబులకుఁ బోవు త్రోవం బొంచి కమలకలికాసంలగ్నమధుపనినాదవలయ ఘీంకారసంకలితమృణాళయష్టికరం బూని యడ్డమ్ము పఱతెంచువా రెవ్వ రెవ్వరనఁ దలంగు మనంబున ఘట్టకుటికం బ్రభాతంబగు దారియయ్యె నని మాఱు వలుక నేరక మూలమూలల నొదుఁగుచుఁ దలంకునెడఁ గిలకిల నవ్వుచుఁ దమ్మెఱుఁగఁ జేయ నొక్కింత చిగిరించు నలుక నభిసారికా జనంబులు ప్రియులపై రువ్వు మవ్వంపు విరిగుత్తులం జివ్వకుఁ బిలుచుచు, వన్నె గల వెన్నెలబయిట నెన్నరానివేడుక పన్నిదంబులు వన్ని సుహృన్నికరంబులతోఁ బెన్నేర్పున జూదంబు లాడుచున్నకతం బునఁ గొంతదడ వగుటఁ బటుతరమహానట మనస్తట నానటద్ధైర్య విపాటనాటోప సముత్కట శంబరప్రతిభట కృపీటజకోరక శరపటలధారా దోధూయమాన మానసంబుతో విచ్చలవిడిం బెచ్చుపెరుఁగుతాపంబున వెచ్చనూర్చుచు నెమ్మదిం గ్రచ్చుకొని హెచ్చుమోహంబున నెచ్చెలిచేతికి నచ్చంపుగుఱుతిచ్చి మచ్చికల వల్లభుం దోడ్కొని రమ్మంచు నంచి యంచిత బహిరంగణ ప్రదేశంబుల నిలిచి పతిరాక కెదురుచూచునదియును నెయ్యంపుఁబొదలతూఁగుటుయ్యెలపై నొయ్యారం బునం గూర్చుండి ప్రియుండు పసిండిదండియ బూని సుతి మీట విభునిచెంత వసియించి చిన్నికిన్నెరం బూని పంచశరదేవతా విజయప్రపంచసమంచితంబు లగు నూతనగీతంబులు పలికించి చెలులఁ జొక్కించు నదియు నడుగు లొరయం గొనసాగ నల్లిన జడకుఁ జుట్టిన మొల్లవిరితావి యెల్లెడలకుం బరవ మంజుల చరణకంజ సంజిత కంజరాగ మంజీర శింజా రవంబులు కర్ణగ్లాని మాన్ప నొఱ దొఱపిన వలదొరపరు వంపుఁగైదువుతెఱఁగున నిండార దువ్వలువ గప్పి కాంతునిశాంతంబునకుఁ బోటులవెంటం జనునదియును దనమనం బలరఁ గలసి కళలఁ దేలించి మేలుంచి యేలిననాయకునియెడ నెడయని ప్రియమ్మునఁ దఱిసి విరిసరులు దుఱిమి చలువ వెదచల్లుకలపం బలఁది యంతంతం బొడము మోహమ్ముల నలమి కెమ్మోవి నొక్కి పునారతులకు వేడుక రేఁచి పైకొనునదియును నై వెలయు వెలయువిదల గలితచందనచర్చాపాలి కలం గనత్తరదరహాసవిభారింఛోళికలం గర్ణావతంసిత కైరవపత్త్రమంజరికావిభాళికలం గబరికాభివేష్టిత లతాంతమాలికలం గలసి మెలఁగుచు, మహోత్పలమండల త్రాణైకవిహారవిలాసితం బయ్యును మహో త్పలమండలహరణైకవిలాసాంచితంబై యసమకాండ చండప్రతాపనాశకనిజోదయంబయ్యును నసమ కాండచండ ప్రతాపసంవృద్ధికరనిజోదయంబై, దివ్యచక్ర చిత్తానందసంధాయకం బయ్యును దివ్యచక్రచిత్తా నందభేదకం బై రాజిల్లుచు ద్రుహిణాండకరండంబునకు వెండి జలపోసనంబుదారిం బ్రకాశించె నయ్యవస రంబున. 107

టీక: వెండియున్=మఱియు; ఆపండువెన్నెలదండంబు = ఆనిండువెన్నెలయొక్క పరంపర; అఖండకాండజారిమండల మాయామౌక్తికమయ భద్రాసన సమాసీన నీలాంక లంకావరాహిత పట్టాభిషేచనావరసమయ మహర్షిరాజాభిషిక్త గంగాది పుణ్యతరంగిణీ విశదజలప్రవాహంబులపోలికన్ – అఖండ=అవిచ్ఛిన్నమగు, కాండజారిమండల=చంద్రమండలమనెడు, కాండ మనఁగా నీరు, కాండజ మనఁగా పద్మము, ఆ పద్మమునకు అరి=వైరి చంద్రుఁడని భావము, మాయా=నెపముగల, మౌక్తికమయ =ముత్యములవికారమైన, భద్రాసన=సింహాసనమందు, సమాసీన=కూర్చుండిన, నీలాంక =నల్లని కళంక మనెడు, లంకావరాహిత=రావణవైరి యైన శ్రీరామునియొక్క, పట్టాభిషేచనావరసమయ=పట్టాభిషేకముఖ్యసమయమందు, మహర్షిరాజ=ఋషిశ్రేష్ఠులచేత, అభిషిక్త=అభిషేకము చేయఁబడిన, గంగాదిపుణ్యతరంగిణీ =జాహ్నవి మున్నగు పవిత్రనదుల యొక్క, విశదజల=శుభ్రమగు నీటియొక్క, ప్రవాహంబులపోలికన్=వఱదలభంగిని; ప్రవహించుచున్=పాఱుచు; అనఁగాఁ జంద్రుఁడను మౌక్తికసింహాసనమందుఁ గళంకమనెడు శ్రీరామమూర్తి గూర్చుండి యుండఁగాఁ దత్పట్టాభిషేకమహోత్సవసమ యమున మహర్షులు తెచ్చి యభిషేకము చేయు గంగాదిపుణ్యనదీజలప్రవాహముభంగి నాపండువెన్నెలపిండు రాజిల్లె నని భావము; అస్తాచల సంగతాహిమాంశుకిరణ కూట తృణాంకుర నికరంబులన్ – అస్తాచల=చరమాద్రిని, సంగత=సంబంధించినట్టి, అహిమాంశుకిరణ=సూర్యకిరణము లనెడు, కూట=కపటము గల, తృణాంకుర=లేఁగసవులయొక్క, నికరంబులన్= గుంపు లను; అన్నింటిన్; మేసి=భక్షించి; దర్పించి=గర్వించి; రథాంగజనంబులకున్ = చక్రవాకము లనెడి ప్రజలకు; వైకల్యంబు చేకూర్చి = వికలత్వము ఘటిల్లఁజేసి; సముజ్జృంభమాణ సత్ప్రభావాప్తిన్=మించినమంచిసామర్థ్యముయొక్క ప్రాప్తిచేత; సత్ = రిక్కలయొక్క, ప్రభా=కాంతియొక్క, అవాప్తిన్=ప్రాప్తిచేత అని స్వభావార్థము; చెల రేఁగు నిశానై చికిన్ =విజృంభించు రాత్రి యనెడు మంచియావును, ‘ఉత్తమా గోషు నైచికీ’ అని యమరుఁడు; పట్టి=బంధించి; చకోరవత్సంబులు=వెన్నెలపుల్గు లనెడు దూడలు; కుడువన్=చీకుటకు; చేఁపు తారాధవోధస్థల పరిదృశ్యమాన నవాంశుక స్తనంబులన్ – చేఁపు=పాలు ద్రవించుచున్న, తారాధవోధస్థల=చంద్రుఁడను పొదుఁగునందు, పరిదృశ్యమాన=చూడఁబడుచున్న, నవాంశుక స్తనంబులన్ = క్రొత్తకిరణంబు లనెడు చన్నులనుండి; ధరిత్రీపాత్రిన్ = భూమి యనెడు పాత్రమునందు; దిష్టగోపాలకుండు – దిష్ట=సమయమనెడు, గోపాల కుండు=ఆవులకాపరి; పిదికిన నవీనపయఃపరంపరలదారిన్=పిండినట్టి క్రొత్త క్షీరధారలవలె; చూపట్టుచున్ = అగపడుచు; అనఁగాఁ గాలమనెడు గోపాలుఁడు రాత్రియనెడు గోవు చరమాచలమందు సూర్యకిరణములనెడు కసవు మేసి, గర్వించి, చక్ర వాకములనెడు ప్రజకు వ్యాకులత గలుగఁజేయుచుండ దానిఁ బట్టి తెచ్చి, చకోరములనెడు దూడలు త్రాగుటకు చంద్రమండల మను పొదుఁగునందు కిరణములనెడు చన్నులనుండి పిదికిన క్షీరపూరమును బోలి వెన్నెల యున్న దని భావము.

దినాంతపర్యంతంబు=సంధ్యాకాలమువఱకు; ఒక్కప్రొద్దుండి =ఉపవసించి; అతికాంత కాసార సోపా నోపాంత శశికాంత సంతాన మరీచికా వీచికావతీ వీచికాజాతంబులన్ – అతికాంత =మిగులమనోజ్ఞమగు, కాసార=కొలఁకులయొక్క, సోపాన= మెట్లయొక్క, ఉపాంత=సమీపమందలి, శశికాంత =చంద్రకాంతమణులయొక్క, సంతాన=సమూహములయొక్క, మరీచికా =కాంతియనెడు, వీచికావతీ=నదియొక్క, వీచికాజాతంబులన్=అలలసమూహమును; చొచ్చి=ప్రవేశించి; అనఁగా నానదిలో స్నానము చేసి యనుట; ఎడలి=బయలుదేఱి; వికసితారుణశరజపీఠిన్ = వికసించిన యెఱ్ఱగలువయనెడు పీఠమునందు; వసించి = ఉండి; కమలాహిత ధ్యాన కలి తాంతరంగంబునన్ – కమలాహిత=చంద్రుఁడనెడు కమలకు హితుఁడైన విష్ణుమూర్తి యొక్క (చంద్రుని కి కమలా+అహిత అనియు, విష్ణువునకు కమలా+హిత అనియు అన్వయము), ధ్యాన=చింతతోడ, కలిత =కూడుకొన్నట్టి, అంతరంగంబునన్=చిత్తముచేత; ఉన్న=ఉన్నట్టి; చకోరసువాసినీజనంబులకున్ = చక్రవాకస్త్రీలకు; అవ్రత ఘ్నంబు=వ్రతదూషకములు గానట్టివి; అగు=ఐన; విశదాపూపంబులు = తెల్లనియపూపములను; సమకూర్పన్= చేకూర్చు టకు; తత్ప్రియశ్యామాప్రకాండంబు = ఆచకోరసువాసినులకు హితలైన రాత్రు లనెడు స్త్రీల కదంబము; పూర్వదిశావదాతశోభా చ్ఛాదనంబుపైన్ =తూర్పుదిక్కనెడు తెల్లనివస్త్రముమీఁద; చంద్రఘరట్టంబు = చంద్రుం డనెడు తిరుగలిని; పెట్టి=ఉంచి; ఒయ్యన నొయ్యనన్=తిన్నతిన్నగా; తారాసుభద్రాపటలంబులు=నక్షత్రములనెడు గుమ్మడి విత్తులగుంపులను; వైచి=వేసి; విసరన్= త్రిప్పఁగా; ప్రసరించు తదీయపిష్టధట్టంబుల చందంబునన్=ప్రసరించుచున్న ఆవిత్తుల యొక్క పిండియొక్కరాశి రీతిగా; పెం పొందుచున్=వృద్ధిఁబొందుచు; అనఁగాఁ జకోరస్త్రీ ప్రదోషమువఱకు నుపవాసముండి సూర్యాస్తానంతరము కొలఁకులసోపాన ముల నున్న చంద్రకాంతమణిమరీచి యనెడు నదియందు స్నానము చేసి యెఱ్ఱగలువ యను నాసనముపైఁ గూర్చుండియుండఁ గా, నామె యుపవాసవ్రతమున కుచితమైన తెల్లనియాపూపములుసేయ రాత్రులనెడు తదీయప్రియస్త్రీజనంబు తూర్పనెడు తెల్లని వస్త్రముపైఁ జంద్రుఁడనెడుతిరుగలిని బెట్టి రిక్కలనెడు గుమ్మడివిత్తులు వోసి విసరఁగాఁ బ్రసరించు వానిపిండియొక్క రాశినిఁబోలి వెన్నెల యుల్లసిల్లె ననుట.

నెట్టుకొని=త్రోసికొని; గట్టుగములతటంబులన్=పర్వతసంఘములదరులయందు; పొడకట్టు నెలచట్టులన్ = చూపట్టుచున్న చంద్రకాంతములవలన; కరంగి=ద్రవించి; మట్టుమీఱన్=మితిమీఱునట్లుగా; కురియు పెన్నీటి బలురొద=కురియుచున్నఅధిక మగు జలముయొక్కబలిష్ఠమగుధ్వని; అభంగతరంగనినాదంబును =అధికమైనయలలధ్వనియు;ముందుముందుగన్=తొలు దొలుతనె; మందగతిన్=తిన్ననిగమనముచేత; తోఁతెంచు చందనాచలపవనకందళిన్=వీచు మలయమారుతాంకురమువల్ల; తరళితంబు లై =చలింపఁజేయఁబడినవై;నిండార విరిసిన బొండుమల్లియవిరులపిండులు – నిండార విరిసిన =బాగుగ వికసిం చిన, బొండుమల్లియవిరుల=బొండుమల్లెపూలయొక్క, పిండులు =గుంపులు; పాండురడిండీరఖండమండలంబులును = తెల్లని నురుఁగుతున్కలగుంపును; మదిన్=చిత్తమందు;కదురు ముదమునన్=కలుగునట్టి సంతసముచేత; తమతమసుదతులన్ = తమతమప్రియురాండ్రను; కవకూడి =జతగాఁ గలిసి; ఎదుర్కొను రేపులుఁగుకొలములు=ఎదురుగఁబోవు చకోరసంఘము; ఎదురెక్కు సమానవతీకమీనవితానంబులునున్= ఎదురెక్కుచున్నవియు, మానవతులతోఁ గూడినవియు నగు మీనముల గుంపులును; కాఁగన్=అగుచుండఁగా; అనూన పథికమానినీ మాన సాల మూలసమున్మూలనంబు – అనూన=అధిక మగు, పథికమానినీ=పథికస్త్రీలయొక్క, మాన=ఈర్ష్యయనెడు, సాల=చెట్లయొక్క, మూలసమున్మూలనంబు = మూలోచ్ఛేదన మును; చేయన్=చేయుటకు; పరఁగి=ఒప్పి; దినాంతవిలయకాలమ్మునన్=సాయంకాలమనెడు ప్రళయకాలమున; వేలాతిగం బైన పాలవెల్లిపొడవునన్ = వేలమీఱిన క్షీరసముద్రముభంగిని; పొడసూపుచున్=అగపడుచు; అనఁగా నావెన్నెల ప్రళయకాల మందు వేలమీఱి సాలసమున్మూలనము గావించుచు మించు క్షీరాంబురాశిని బోలి, సంధ్యాకాలమున మానినీమానస సమున్మూ లనము గావించుచు మించినదనియు, దానియందు వెన్నెలవలనఁ బర్వతంబులనుండి గరఁగి పడు చంద్రకాంతజలప్రవాహము రొదలు తరంగధ్వనులుగా నుండెననియు, మలయమారుతాంకురమున నిండార విరిసిన బొండుమల్లెలపిండులు నురుఁగు తునియలను బోలియుండె ననియు, సంతసమునఁ దమతమప్రియురాండ్రతోఁ గూడి యెదురెక్కుచకోరములు జతగూడి యెదు రెక్కు మీలఁ బోలియుండె ననియు భావము.

కోకనదపరాగ మహోదయరాగవిలసనంబునన్ – కోకనదపరాగ=రక్తోత్పలములయొక్కపుప్పొడియనెడు, మహత్=అధిక మైన, ఉదయరాగ=ఉదయకాలికారుణ్యముయొక్క, విలసనంబునన్=ప్రకాశముచేత; కోరకితనీరజతారకాసమున్మేషంబునన్ – కోరకిత = ముగిడినట్టి, నీరజ=పద్మములనెడు, తారకా = నక్షత్రములయొక్క, సమున్మేషంబునన్ = ప్రకాశముచేత; కోమల శ్యామలేతర కుముదవలయ సుధాకర ధామవిశేషంబునన్ – కోమల=మృదులమై, శ్యామలేతర=శుభ్రమగు, కుముదవలయ= కలువలగుంపనెడు, సుధాకర=చంద్రునియొక్క,ధామవిశేషంబునన్ =కాంతివిశేషము చేత; కొమరొంది=అందము గాంచి; తద్ర జనీసమయ భాసమాన పయోధరపథంబున కన్నన్ =ఆరాత్రియందు విలసిల్లు నాకసముకన్నను; మున్నుమున్న=ముందు ముందుగనె; కన్నులకున్; వెగ్గలంబై =మిక్కుటమై; తొలంకుకొలంకుగమిన్=చెలఁగునట్టి కాసారసంఘమును; పాసి=వదలి; సన్నంపు వెన్నెలమిన్న=లేఁతరేయెండమిన్న; చొరరానిలతానివాసంబులన్=చొరఁబాఱ నలవిగాని లతాగృహములయందు; దాఁగన్=దాఁగుటకు; పోవుచున్=ఏగుచు; తదంతరసంఫుల్ల్యమానమల్లికావల్లికామతల్లికా ప్రసవధవళద్యుతిప్రకాండంబులు—తదంతర=ఆలతాగృహములందు, సంఫుల్ల్యమాన=మిగుల వికసిల్లిన, మల్లికావల్లికామతల్లికా= ప్రశస్తమైన మల్లెతీవలయొక్క, ప్రసవ=పూవులయొక్క, ధవళద్యుతి=తెల్లనికాంతియొక్క, ప్రకాండంబులు =గుంపులు; నిండి=ఆవరించి; రేయెండ మెండు కొనన్ =చంద్రాతపము మిక్కుటమగునట్లు; చేయన్=చేయఁగా; దాఁగన్ వచ్చిన చోటన్ = దాఁచుకొనుటకై వచ్చినట్టి తావున; తలవరులు=తలారివాండ్లు; ఉన్నతెఱంగు=ఉన్నరీతిని; ఒయ్యనన్=తిన్నగా; కని = చూచి; ఖేదించు రోదరతలోదరీ వార మ్ముల నయనమ్ములన్ – ఖేదించు=దుఃఖించుచున్న, రోదరతలోదరీ=చక్రవాకస్త్రీలయొక్క, వారమ్ముల=గుంపులయొక్క, నయనమ్ములన్=కనులయందు; జాలుగాన్=ప్రవాహముగా; జాఱు =కారుచున్నట్టి; అనావిల జలమాలికలతోన్= అకులుష మైన జలపరంపరలతోడ; మేలంబులు=పరిహాసములు; ఆడుచున్=సల్పుచు; అనఁగాఁ జక్రవాకస్త్రీలకు కొలఁకులు రక్తోత్పల రాగ మనెడు సంధ్యారాగముచేతను, పద్మముకుళము లనెడు రిక్కలచేతను, తెల్లగల్వపూలగమికాంతి యనెడు వెన్నెలపిండు చేతను వెలసి యట్లుదయరాగనక్షత్రచంద్రకాంతులతోఁ గూడిన యాకసమునకన్నమున్నకన్నులకు వెగ్గలంబులు గాఁగా, వానిం బాసి సన్నవెన్నెల చొరరాని లతానికుంజములకు నవి దాఁగం బోయిన వనియు, నందును మల్లికాకుసుమధవళద్యు తులు నిండి వెన్నెల మెండుకొన్నట్లు సేయఁగా, దాఁగఁబోయినచోట తలవరు లున్నరీతి నిట గూడ సుఖము లేకపోయెఁగదా యని ఖేదించు చున్న వనియు, నట్టి చక్రవాకస్త్రీలనిర్మలనయనాంబువులతో మేలములాడుచు వెన్నెల చెలంగిన దనియు భావము.
తళతళమను నెలచలుపగిన్నెలయెడలన్=ప్రకాశించుచున్న చంద్రకాంతపుగిన్నెలయందు; కలయన్=అంతటను; నించిన అతిబంధుర సౌగంధిక సుగంధధురంధర గంధోత్తమారసంబు – నించిన=పూరించినట్టి, అతిబంధుర=మిగులదట్టమయిన, సౌగంధిక సుగంధ=కల్హారముల మంచిగంధముయొక్క, ధురంధర=భారము వహించిన, తద్గంధము గలవి యనుట, గంధోత్త మారసంబు=మద్యముయొక్కరసమును; తమతమరమణుల కెమ్మోవిపండులు =తమతమప్రియులయధరము లనెడు పండ్లను; ఉపదంశమ్ములు గాన్=నంచుకొను భోజనసాధకవిశేషములు గాఁగా ననుట; నాదారన్=తనివితీరునట్లుగ; క్రోలి = పానముచేసి; తదీయమాహాత్మ్య కల్పితమానసవిభ్రమంబునన్ – తదీయమాహాత్మ్య=ఆమద్యసంబంధియగు ప్రభావముచేత, కల్పిత=చేయఁబడిన,మానస= మనస్సంబంధియగు, విభ్రమంబునన్=భ్రాంతిచేత; తత్పాత్రలన్=ఆచంద్రకాంతపుగిన్నెలందు; సరగన్=వేగముగా; నెఱమించు నిగనిగలన్=మిగుల నతిశయించు ప్రకాశముచేత; మఱలన్; సలిలంబులు=జలంబులు; ఊరన్=ఊరఁగా; మదిరన్=మద్యమును; నించినారని=పూరించినారని; కైకొని =తీసికొని; అచటన్=ఆనీటియందు; ప్రతి ఫలించు పల్దెరన్=ప్రతిబింబించిన యధరమును; వాసనకున్=పరిమళమునకు; ఇడిన =ఉంచినట్టి; కెందలిరుటాకని = రక్త పల్లవమని; తివిచియున్=లాగియు; విలోచన మాలికలు=నయనపంక్తులు; వానితావికిన్=వానిపరిమళమునకు; చేరు తుమ్మెద లని =చేరుచున్న తుమ్మెదలని; గదిమియున్ =భర్త్సనము చేసియు; ముదంబునన్=సంతసముతోడ; ప్రియులకున్=భర్తలకు; అందీయన్=అందిచ్చుటకు; పోవు మందగామినీబృందమ్ముల హస్తారవింద సందీపిత హీరకటకశోభాధట్టంబులన్ – పోవు= పోవుచున్న, మందగామినీబృందమ్ముల = స్త్రీసంఘములయొక్క, హస్తారవింద=కరకమలములయందు, సందీపిత=మిగులఁ బ్రకాశింపఁజేయఁబడిన, హీరకటక= వజ్రమయములగు కడియములయొక్క, శోభాధట్టంబులన్=కాంతిపుంజములను; చెట్ట వట్టుచున్=హస్తావలంబనము సేయుచు; అనఁగా నపుడు స్త్రీలు చంద్రకాంతమణిపాత్రలలో మద్యము పోసికొని వల్లభాధరము లుపదంశములుగా నాదారం గ్రోలి, తదనుగుణగణసాంగత్యమున విలసిల్లుచు వెన్నెల కాపాత్రలయం దూరుచున్ననీరు చూచి మద్యమని భ్రమించి, మఱలఁ దత్పానమునకై వానిం గైకొని యందుఁ బ్రతిఫలించిన తమ యధరములను పల్లవము లనియు, నేత్రములను తుమ్మెద లనియు నెంచి, వానిని దివియుచు, నా మద్యమును తమప్రియుల కందీయ హస్తము లెత్తియుండఁగా నాహస్తములయం దున్న వజ్రమణిమయములగు వలయముల కాంతిసంతతిని వెన్నెల హస్తావలంబముగాఁ జేయునట్లు విల సిల్లె ననుట. వజ్రకటకకాంతి వెన్నెలకాంతితో ధావళ్యసామ్యమునఁ దెలియరాకుండఁ గలిసినదని ఫలితము.
అనూనపానశాలాచత్వరంబులన్ – అనూన=అధికమగు, పానశాలా=ప్రపలయొక్క, చత్వరంబులన్=ముంగిటిభూముల యందు; విమలాసవంబు=ప్రశస్తమైన మద్యమును; లాలస మెచ్చన్=వాంఛావిశేష మతిశయింపఁగా; త్రావి=పానముచేసి; నిర్మిత హర్మ్యరాజంబులన్ = నిర్మింపఁబడిన ప్రాసాదములను; చేరన్=చేరుటకు; పోవునెడన్ = పోవునప్పుడు; చంద్రికాహాలా పాన లీలాగతిన్=వెన్నెలయను మద్యముయొక్క పానముచేనైన విలాసగమనముచేత;అంబరంబునన్=ఆకసమందు; చరించు చున్ =తిరుగుచు; తత్సమర్పిత మదఘూర్ణితంబులు – తత్సమర్పిత=ఆమద్యముచేతఁ జేయఁబడిన, మద=దర్పముచేత, ఘూర్ణితంబులు=త్రిప్పఁబడినవి; అగు చకోరకోరకకుచానిచయంబుల కటాక్షతారళ్యంబులు – అగు=అయినట్టి, చకోరకోరక కుచా =చకోరస్త్రీలయొక్క, నిచయంబుల=గుంపులయొక్క, కటాక్ష=క్రేగంటిచూపులయొక్క, తారళ్యంబులు=చాంచల్య ములు; నెఱమించులై=అధికములగు మెఱపులై; కోకనదకోటరకోటిలీనమధుకరఝంకారంబులు – కోకనదకోటరకోటి = ఎఱ్ఱగల్వల తొఱ్ఱగుంపులయందు, లీన=దాఁగియున్న, మధుకర=తుమ్మెదలయొక్క,ఝంకారంబులు =నాదములు; గర్జనం బులై =ఉఱుములై; నిగుడన్=ఒప్పఁగా; పొడసూపు వెన్నెలన్= పొల్చునట్టి చంద్రికను; జడివానగాన్=జడివాన యని; తలంచి =భావించి; ఔదలలన్=తలలమీఁద; పయ్యెదలు=పైఁటవస్త్రములను; కప్పి=ఆచ్ఛాదించి; నెచ్చెలికేలు=సకియలహస్తము లను; కైలాగున్=ఆలంబనమునుగా; పూని=వహించి; బుడిబుడి రయంబు=అతిత్వరతోఁ గూడిన వేగము, బుడిబుడి యను నది నడకలోఁగల యనుకరణశబ్దము; అడరన్=ఒప్పఁగా; నడచు పడఁతిమిన్నల యున్నత స్తనాంతర విలంబమాన ముక్తా హార గౌరరుక్తతిన్ – నడచు=గమనము సేయుచున్న, పడఁతిమిన్నల=స్త్రీరత్నములయొక్క, ఉన్నతస్తనాంతర =మిట్టలగు స్తనముల మధ్యభాగమందు, విలంబమాన=వ్రేలాడుచున్న, ముక్తాహార=ముత్యంపుపేరులయొక్క, గౌరరుక్తతిన్=శుభ్రకాంతి పుంజముచేత; పునరుక్తం బగుచున్ = ఇనుమడి యైన దగుచు; అనఁగా నపుడుత్తమస్త్రీలు పానశాలలచెంత విమలాసవమును గ్రోలి మేడలు చేరఁ బోవుచుండఁగా, వెన్నెల యను మద్యము ద్రావి గగనమందుఁ జరించు చకోరస్త్రీలకటాక్షతారళ్యములు మెఱ పులుగాను, ఎఱ్ఱగల్వలలో దాఁగిన తుమ్మెదలమ్రోఁత లుఱుములుగాను , వెన్నెల జడివానగాను వారలకుఁ దోఁచి పయ్యెదలు తలలపైఁ గప్పికొని చెలియల కైలాగుఁ బూని వడిగ బుడిబుడి బోవుచున్నా రనియు, వారల యున్నతస్తనాంతరముల నున్న ముత్తెపుపేరుల తెల్లనికాంతిసంతతితో వెన్నెల రెట్టించి వెలింగె ననియు భావము.