చంద్రికాపరిణయము – 6. చతుర్థాశ్వాసము

చ. లలన సమీరధార పొద◊లన్ బొదలన్ వడిఁ దూఱు శారికా
కులములు మ్రోయఁ జాలఁ గలఁ◊గుం గలఁగుండువడన్ మనంబు గో
ర్కు లెడయ హా యటంచుఁ బలు◊కుం బలుకుందపుమొగ్గచిల్కుట
మ్ములు మరుఁ డేయఁ బూనుఁ దర◊ముం దరముం జెలి చెంతఁ జేరినన్. 125

టీక: లలన=చంద్రిక; సమీరధార=మలయమారుతపరంపర; పొదలన్=ఏపుమీఱఁగా; పొదలన్=నికుంజములను; వడిన్ = వేగముగా; తూఱున్=చొచ్చును; శారికాకులములు=గోరువంకలగుంపులు; మ్రోయన్=కూయఁగా; మనంబు =మనస్సు; కలఁగుండువడన్=ఆకులతనొందఁగా; చాలన్=మిక్కిలి; కలఁగున్=కలఁతనొందును; కోర్కులు=మనోరథములు; ఎడయన్ =ఎడఁబాయఁగా; హా అటంచున్ పలుకున్ = హాయని వచించును; బలుకుందపుమొగ్గచిల్కుటమ్ములు – బలు=అధికము లగు, కుందపుమొగ్గ=మొల్లమొగ్గలను, చిల్కుటమ్ములు=అలుఁగుతోఁ గూడినబాణములు; మరుఁడు=మన్మథుఁడు; ఏయన్ = ప్రయోగింపఁగా; చెలి = సఖి; చెంతన్ చేరినన్=సమీపించినను; తరమున్=వేగిరపాటును; దరమున్=భయమును; పూనున్.

వ. ఇట్లు పంచబాణపంచకప్రపంచితవిరహసంతాపంబునం భ్రమించు నమ్మించుఁబోఁడిం దోడ్తెచ్చి మచ్చిక గ్రచ్చుకొన నెచ్చెలిచెలువపిండు లచ్చంపుఁజలువ వెదచల్లు మొల్లవిరిసజ్జ నుంచి ప్రియకథానులాపంబులం బ్రొద్దు గడుపు నవసరంబున. 126

టీక: ఇట్లు=ఈరీతిగ; పంచబాణపంచకప్రపంచితవిరహసంతాపంబునన్ – పంచబాణపంచక=కామశరపంచకముచేత, ప్రపం చిత=విస్తరింపఁజేయఁ బడిన, విరహసంతాపంబునన్=వియోగవేదనచేత; భ్రమించు నమ్మించుఁబోఁడిన్= భ్రమనొందు నా మెఱపుతీఁగవంటి శరీరముగల చంద్రికను; తోడ్తెచ్చి=తీసికొనివచ్చి; మచ్చిక గ్రచ్చుకొనన్=ప్రేమమీఱునట్లుగా; నెచ్చెలిచెలువ పిండులు=ప్రయసఖీవర్గములు; అచ్చంపుఁజలువన్=మంచిచల్లఁదనమును; వెదచల్లు మొల్లవిరిసజ్జన్=వ్యాపింపఁజేయు మొల్ల పూవుల పాన్పునందు; ఉంచి; ప్రియకథానులాపంబులన్=ప్రీతికరమగు కథలను చెప్పుటవలన; ప్రొద్దు గడుపు నవసరంబున = ప్రొద్దుపుచ్చునపుడు. దీనికి ముందుపద్యముతో నన్వయము.

చ. కనికర మింతలే కసమ◊కాండుఁడు శ్యామ నలంప వేడ్కఁ జ
క్కని కరహేతిధారఁ గలఁ◊గన్ ఘటియింపఁగఁ బాడి గాదు మా
కని కర మాత్మఁ దత్పరత ◊నందుచుఁ జయ్యన నేగె నప్డు లో
కనికరతాపహారి యుడు◊కాంతుఁడు వారిధినేతఁ జేరఁగన్. 127

టీక: అసమకాండుఁడు=మన్మథుఁ డనుసూర్యుఁడు; శ్యామన్=చంద్రిక యనురాత్రిని; కనికరము=దయ; ఇంతలేక=ఇంచు కైన లేక; వేడ్కన్=సంతసముచేత; అలంపన్=శ్రమపెట్టఁగా; చక్కనికరహేతిధారన్=మంచికిరణము లనెడుఖడ్గధారచేత; కలఁగన్ = కలఁతఁబాఱునట్లు; ఘటియింపఁగన్=చేయుటకు; మాకున్; పాడి గాదు = ధర్మము గాదు; అని = ఇట్లు తలంచి; కరము = మిక్కిలి; ఆత్మన్ = చిత్తమందు; తత్పరతన్=ఆసక్తిని; అందుచున్=పొందుచు; అప్డు=అప్పుడు; లోక నికర తాపహారి = లోక ములసమూహమునకు తాపము శమింపఁజేయునట్టి; ఉడుకాంతుఁడు=చంద్రుఁడు; వారిధినేతన్=సముద్రరాజును; చేరఁగన్= చేరుటకు; చయ్యనన్=శీఘ్రముగా; ఏగెన్=పోయెను.
సూర్యుఁడు రాత్రిని బాధించినట్లు మరుఁడు చంద్రికను బాధించుచుండఁగా మనముసైతము బాధించుట ధర్మము గాదని చంద్రుఁడు లోకతాపమును బోఁగొట్టువాఁడు గాన దయఁ దలఁచి పశ్చిమసముద్రమును జేరఁబోయె నని భావము. చంద్రుఁ డస్త మించె నని ఫలితము. గమ్యోత్ప్రేక్షాలంకారము.

క. ఆరామ కపుడు శుభవా,గ్ధారాగతిఁ దెలిపె నొక్క◊తరుణి వరకళా
వారనిశాంత మితవు నలు,వార నిశాంతమితిరహిత◊హారివిభవమున్. 128

టీక: అపుడు; ఆరామకున్=ఆచంద్రికకు; వర కళా వార నిశాంతము – వర=శ్రేష్ఠములగు, కళా=విద్యలయొక్క, వార=సంఘ మునకు, నిశాంతము=నెలవగు; ఒక్కతరుణి = ఒకస్త్రీ; ఇతవు=కూర్మి; నలువారన్=ఒప్పఁగా; నిశాంత మితిరహిత హారివిభవ మున్ – నిశాంత=ప్రాతఃకాలముయొక్క, మితిరహిత=అమితమగు, హారివిభవమున్=మనోజ్ఞమగు సమృద్ధిని; శుభవాగ్ధారా గతిన్ = మంచిమాటలవరుసచేత; తెలిపెన్=చెప్పెను. ఇటనుండి సూర్యోదయవర్ణన మారంభింపఁబడుచున్నది.

సూర్యోదయవర్ణనము

చ. వెలసెఁ బదాయుధార్భటులు ◊వింటివె యోయధరానులిప్తనా
విలసిత పుష్కరారి పృథి◊వీపతి పాంథపరాళి గెల్చి తా
విలసితపుష్కరాధిపన◊వీనపురేశముఁ జేరఁగాఁ జనన్
దొలుత నుషోభటధ్వనిత◊దుస్తరకాహళికాధ్వనుల్ బలెన్. 129

టీక: ఓఅధరానులిప్తనావిలసిత=అధరమందుఁ బూయఁబడిన యకలుషమగు చక్కెర గల యోచంద్రికా! చక్కెరవంటిపెదవి గలదానా యనుట; పుష్కరారి పృథివీపతి =చంద్రుఁడనెడు రాజు; పాంథపరాళిన్=విరహు లనెడు శత్రువులపంక్తిని; గెల్చి = జయించి; తాన్; విలసితపుష్కరాధిపనవీనపురేశమున్ – విలసిత=ప్రకాశించుచున్న, పుష్కరాధిప=సముద్రమనెడు, నవీన= నూతనమగు, పురేశమున్=నగరశ్రేష్ఠమును; చేరఁగాన్=పొందుటకు; చనన్=పోవుచుండఁగా; తొలుతన్=మొదల; ఉషోభట ధ్వనిత దుస్తర కాహళికాధ్వనుల్ బలెన్ —ఉషోభట=ప్రభాతమనెడు భటునిచేత, ధ్వనిత=మ్రోఁగింపఁబడిన, దుస్తర=అధిక మైన, కాహళికాధ్వనుల్ బలెన్ =బూరగలధ్వనులవలె; పదాయుధార్భటులు =కుక్కుటధ్వనులు; వెలసెన్=విలసిల్లెను; వింటివె = ఆకర్ణించితవా? అనఁగా నొకరాజు శత్రువులను గెలిచి నూతనపురప్రవేశముఁ జేయుచుండఁగా భటులు సేయుకాహళీధ్వనులు వెలయు విధమునఁ, జంద్రుఁడు పాంథులను గుందించి పశ్చిమాంబురాశిఁ జేరఁబోవుచుండఁగాఁ గుక్కుటధ్వనులు వెలసె నని భావము. రూపకాలంకారము.

మ. స్ఫురదాజాండఘటి న్నిశాతపపయ◊స్సుల్ పేరఁ బూర్వావనీ
ధరగోపాలతనూజమౌళి గని దో◊డ్తం జంద్రమండంబు వా
పి రహిం దద్దధిఖండ మూనె నన నొ◊ప్పెం గంటివే ప్రాగ్దిశా
ధర గోపాలతనూజ వాసవహరి◊త్పద్మావిలాసాబ్జమై. 130

టీక: స్ఫురదాజాండఘటిన్ – స్ఫురత్=ప్రకాశించుచున్న, ఆజాండ=బ్రహ్మాండమనెడు, ఘటిన్=ఘటమందు; నిశాతప పయస్సుల్=వెన్నెల యనెడు పాలు; పేరన్=ఘనీభవింపఁగా; పూర్వావనీధరగోపాలతనూజమౌళి – పూర్వావనీధర= తూర్పుకొండ యనెడు, గోపాలతనూజమౌళి= శ్రీకృష్ణుండు; కని=చూచి; తోడ్తన్=వెంటనే; చంద్రమండంబు=చంద్రుఁడను మీఁగడను, ‘మణ్డం దధిభవ మ్మస్తు’ అని యమరుఁడు; పాపి=కాఁజేసి; రహిన్=ఆసక్తిచేత; తద్దధిఖండము=ఆపెరుగుగడ్డను; ఊనెన్ అనన్=వహించెనన్నట్లు; ప్రాగ్దిశాధర=పూర్వదిక్సీమ, కర్త్రి; వాసవహరిత్పద్మావిలాసాబ్జమై – వాసవహరిత్పద్మా= ప్రాచీలక్ష్మికి, విలాసాబ్జమై=లీలారవిందమై; ఒప్పెన్=ప్రకాశించెను; గోపాలతనూజ=రాజపుత్త్రివగు చంద్రికా! కంటివే?

అనఁగా బ్రహ్మాండ మనెడు ఘటమందు వెన్నెల యనుపాలు పేరి చంద్రుండు దానిపై మీఁగడవలె నుండఁగా నుదయశైల మనెడు శ్రీకృష్ణుండు చంద్రుఁడను నామీఁగడను మ్రింగి చేతఁ బుచ్చుకొన్న యాపేరిన పెరుఁగుగడ్డను బోలియు, పూర్వదిక్క నెడు లక్ష్మికి విలాసార్థమైన పద్మమును బోలియుఁ, బ్రాగ్దిశావని విలసిల్లెనని భావము. తూర్పున సూర్యోదయసంబంధియైన తెలిచాయ తోఁచె నని ఫలితార్థము. రూపకసంకీర్ణస్వరూపోత్ప్రేక్షాలంకారము.

మ. ఘనమిత్త్రైకవసుప్రతానముల రా◊గశ్రీ గొనం గజ్జలా
భ నఘవ్రాతము చేర గేహకుముదా◊ప్తగ్రావధామద్యుధా
మనదీపాళికఁ దాన మంద శుచితం ◊బాటిల్లె నాఁ బాండిమల్
మన దీపాళిక దా నమందగుణసీ◊మా మించె నీక్షింపవే. 131

టీక: అమందగుణసీమా=అధికములైన గుణములకు మేరయైనదానా! దీపాళిక=దీపములచాలు; ఘన మిత్త్రైక వసుప్రతాన ములన్ – ఘన=శ్రేష్ఠములగు, మిత్త్ర=సఖునియొక్క, సూర్యునియొక్క, ఏక=ముఖ్యమగు, వసుప్రతానములన్=ధనముల గుంపులను, కిరణసమూహముల నని యర్థాంతరము; రాగశ్రీన్=లోభసమృద్ధిచేత, శోణకాంతిచేత; కొనన్=హరింపఁగా; కజ్జలాభన్=కాటుక కాంతిచేత; అఘవ్రాతము=పాపసంఘము; చేరన్=పొందఁగా; గేహ కుముదాప్తగ్రావ ధామ ద్యుధామనదీ పాళికన్ – గేహ= గృహసంబంధులగు, కుముదాప్తగ్రావ=చంద్రకాంతమణులయొక్క,ధామ=కాంతియనెడు, ద్యుధామనదీ= స్వర్గంగయొక్క, పాళికన్=ప్రదేశమందు, ‘పాళి స్త్ర్యశ్య్రఙ్క పఙ్త్కయః’ అని యమరుఁడు; తానము=అవగాహనము; అందన్ =పొందఁగా; శుచితన్=శుద్ధతచేత; పాటిల్లె నాన్=ఒప్పెననునట్లు; పాండిమల్=తెల్లఁదనములు;మనన్=వర్ధిల్లఁగా; తాన్; మించెన్=అతిశయించెను; ఈక్షింపవే=చూడుమా.

అనఁగా సూర్యుఁ డనుమిత్రునికిరణములనెడు ధనములను హరించినందున, మషీరూపముగాఁ దత్పాపము గలుగఁగా గృహచంద్రకాంతధామస్తోమ మనుగంగాప్రవాహములో దీపావళి స్నానము చేయఁగా గతకల్మషయై వర్తించి నట్లు తెల్లని కాంతులతో రాజిల్లె నని భావము. ప్రభాతమున దీపములు కాంతిహీనము లయ్యె నని ఫలితము. స్వర్ణస్తేయాదులు చేసినవారు గంగాస్నానము చేయఁగాఁ దత్పాపమోచన మగుట ప్రసిద్ధము. సూర్యుండు దనకాంతిని రాత్రి యగ్నియం దుంచి పోవు నని యాగమప్రసిద్ధము. ‘రుచిధామ్ని భర్తరి భృశం విమలాః పరలోక మభ్యుపగతే వివిశుః|జ్వలనం త్విషః కథమి వేతరధా సుల భోఽన్యజన్మని స ఏవ పతిః’ అని మాఘకావ్యమున వర్ణింపఁబడినది.

మ. తనుమధ్యా గను రోదసిం గముచుజ్యో◊త్స్నావల్లికల్ కల్యవా
తనికాయాహతిఁ దూలఁ ద్రెళ్ళెఁ దొలుతం ◊దారప్రసూనవ్రజం
బనవద్యామృతపూరపూరితనవో◊దారప్రసూనవ్రజం
బున డిందెన్ శశి పత్త్రిమండలరవం◊బుల్ గ్రమ్మె నల్దిక్కులన్. 132

టీక: తనుమధ్యా=సన్నని నడుముగల ఓ చంద్రికా! రోదసిన్=ద్యావాభూములయందు; కముచు జ్యోత్స్నావల్లికల్= క్రమ్మిన వెన్నెల యను తీవలు; కల్య వాత నికాయాహతిన్ – కల్య=ప్రభాతమందలి, వాత=వాయువులయొక్క, నికాయ=సంఘము యొక్క, ఆహతిన్=కొట్టుటచేత; తూలన్=నేలఁ బడఁగా; తొలుతన్=మొదలనే; తార ప్రసూనవ్రజంబు=నక్షత్రము లనెడుపూల గుంపులు; త్రెళ్ళెన్=వ్రాలెను; శశి=చంద్రుఁడు; అనవ ద్యామృత పూర పూరిత నవోదార ప్రసూనవ్రజంబు – అనవద్య=శ్రేష్ఠమగు, అమృత=సుధయొక్క, పూర=ప్రవాహముచేత, పూరిత=నింపఁబడినట్టి,నవ=క్రొత్తనైన, ఉదార=ఉత్కృష్టమైన, ప్రసూన=ఫల ములయొక్క, వ్రజంబు= సమూహము, ‘ప్రసూనం పుష్ప ఫలయోః’ అని నామలింగానుశాసనము; అనన్=అనునట్లుగా; డిందెన్=పడెను; పత్త్రిమండలరవంబుల్=పక్షిసంఘముల కూజితములు; నల్దిక్కులన్=చతుర్దిశలందు; క్రమ్మెన్=ఆవరించెను; కను =చూడుము. అనఁగా వెన్నెల యను లతలు ప్రభాత మను వాతముచేఁ దూలఁగా రిక్క లను పువ్వులు, చంద్రుఁ డను పండ్ల గుంపు వ్రాలి పోయె ననియు, ఖగకూజితములు నల్దెసల వ్యాపించె ననియు భావము. అపుడు వెన్నెలయు, రిక్కలును, చంద్రుఁ డును పోయె నని ఫలితము.

మ. అల పెన్వేగురుఁజుక్కపేరియతి దీ◊వ్యత్పాండుభాభూతి మైఁ
జెలువారంగఁ దరోర్జితస్థితి వియ◊త్సీమం జనం గంటివే
చెలువా రంగదరోర్జితస్థితిదినా◊స్యీయైకసంధ్యాంశుకూ
టలసచ్ఛాటిక తన్మనుస్ఫురణ వెం◊టన్ బర్వెఁ జిత్రంబుగన్. 133

టీక: చెలువా =చంద్రికా! అల పెన్వేగురుఁజుక్కపేరియతి=ఆ పెద్దవేగుఁజుక్క యనెడు సన్యాసి; దీవ్యత్పాండుభాభూతి = ప్రకా శించుచున్నతెల్లనికాంతి యనెడు భస్మము;మైన్=దేహమందు; చెలువారంగన్=ఒప్పఁగా; తరోర్జితస్థితిన్ – తరః=వేగముచేత, అర్జిత=ఆర్జింపఁబడిన, స్థితిన్=సత్తచేత; వియత్సీమన్=గగనప్రదేశమందు; చనన్=పోఁగా; తన్మనుస్ఫురణన్ – ఆయన మంత్ర సామర్థ్యముచేత; రంగ దరోర్జితస్థితి దినాస్యీ యైక సంధ్యాంశు కూట లసచ్ఛాటిక–రంగత్ = ఒప్పుచున్న, అర = చెఱఁగుల యొక్క, అంచులయొక్క యనుట, ఊర్జితస్థితి=అధికస్థితిగల, ఇది శాటికయం దన్వయించును, దినాస్యీయ= దినాస్యమనగ ప్రభాతము, దినాస్యీయ మనఁగా నాప్రభాతమునకు సంబంధించినదని యర్థము, ఏక=ముఖ్యమగు, సంధ్యాంశు=సంధ్యాకాంతు లనెడు, కూట=నెపముగల, లసత్=ఒప్పుచున్న, శాటిక=కాషాయవస్త్రము; చిత్రంబుగన్ =ఆశ్చర్యకరముగ; వెంటన్ = ఆ సన్యాసి వెంటనే; పర్వెన్ = వ్యాపించెను; కంటివే=చూచితివా?

అనఁగా వేగుఁజుక్క యనెడుయతి తెల్లనికాంతి యనెడు భస్మము పూసికొని, వేగముగఁ బోఁగా, నాయనమంత్రసామర్థ్య మునఁ దదీయశాటివలె నెఱ్ఱనికాంతిపుంజము ప్రసరించె నని భావము. సూర్యోదయమునకు ముందు వేగుఁజుక్క పోయిన వెనుక నెఱ్ఱనికాంతి ప్రసరించె నని ఫలితము.