చంద్రికాపరిణయము – 6. చతుర్థాశ్వాసము

చ. నిరుపమకేళికావనుల ◊నీటుగ నామని తోఁచునంతలో
విరహిమృదుప్రవాళపద ◊వీవలితావి లతాపరాగముల్
వెరవిఁడిఁ జేయఁ జిత్తపద◊వీవలితావిలతాపరాగముల్
గరము వహించి దూఱె రతి◊కాంతునిఁ దూఱ మదిన్ స్మరాస్త్రముల్. 31

టీక: నిరుపమకేళికావనులన్ – నిరుపమ=నిస్సమానములైన, కేళికావనులన్ = విహారవనములయందు; నీటుగన్=అందము గా; ఆమని = వసంతము; తోఁచునంతలోన్=ఉదయించినక్షణమందె; విరహిమృదుప్రవాళపద—విరహి=వియోగముగల, మృదుప్రవాళపద = మృదువులును చిగురుటాకులను బోలినవియు నగు పాదములు గల స్త్రీ; వీవలితావి = వాయుసౌరభ్యము; లతాపరాగముల్=లతలసంబంధులైన పుప్పొడులు; వెరవిఁడిన్= జీవనోపాయములేనిదానిఁగా; చేయన్=చేయఁగా; చిత్తపదవీ వలితావిల తాపరాగముల్ – చిత్తపదవీ=మనోమార్గమందు, వలిత=సంచరించుచున్న, ఆవిల=కలుషములైన, తాపరాగముల్ = సంజ్వరానురాగములు; కరము = మిక్కిలి; వహించి =పొంది; మదిన్=చిత్తమందు; స్మరాస్త్రముల్=మదనబాణములు; తూఱన్=నాటఁగా; రతికాంతునిన్=మన్మథుని; దూఱెన్=నిందించెను. అనఁగా వసంతోదయమైనతోడనె విరహిణికి వాయు సౌరభ్యమువలనను, లతాపరాగములవలనను, మిక్కిలి బాధ కలిగె ననియు, దానంజేసి చిత్తమందు సంతాపానురాగములు మిక్కుటములై స్మరాస్త్రములు మది నాటినట్లు తోఁచిన దనియు, అందు వలనఁ దత్ప్రయోజకుండైన మరుని దూషించె ననియు భావము. వసంతోదయమున విరహిణులకు సంతాపోద్రేకమైన దని ఫలితార్థము.

మ. ధరఁ బాంథుల్ బెగడొందఁ ద్రిమ్మరియె భ◊ద్రశ్రీమహీభృన్మృషా
సరసాలాన వసత్యశృంఖలిత చం◊చన్మారుతేభంబు కే
సరసాలానవపత్త్రముల్ తులుముచున్ ◊జైత్రాహజాగ్రద్విలా
సరసాలానవధిప్రసూనరజముల్ ◊సారెన్ బయిన్ రువ్వుచున్. 32

టీక: ధరన్=భూమియందు; పాంథుల్=పథికులు; బెగడొందన్=భయపడునట్లుగా; భద్రశ్రీ మహీభృ న్మృషా సరసాలాన వస త్యశృంఖలిత చంచ న్మారుతేభంబు – భద్రశ్రీ=శుభలక్ష్మితోఁగూడిన, భద్రజాతితోఁ గూడిన – ఇది యిభవిశేషణము, మహీ భృత్=మలయపర్వత మనెడు, మృషా=నెపముగల, సరసాలాన=మంచికట్టుకంబముయొక్క, వసతి=స్థానమునుండి, అశృంఖలిత=విడిచిపెట్టఁబడిన, చంచత్=ప్రకాశించుచున్న, మారుత=వాయువనెడు; ఇభంబు=గజము; కేసర సాలానవ పత్త్ర ముల్– కేసర=పొన్నలయు, సాల=ఏపెలయు, అనవపత్త్రముల్=కారాకులను; తులుముచున్=రాల్చుచు; చైత్రాహ జాగ్ర ద్విలాస రసాలానవధి ప్రసూన రజముల్—చైత్రాహ=వసంతదినములయందు, జాగ్రత్=నిస్తంద్రములైన, విలాస=ఒప్పిదము గల, రసాల=తియ్యమావులయొక్క, అనవధి=మేరలేని, ప్రసూనరజముల్=పుష్పపరాగములు; సారెన్=మాటిమాటికి;
పయిన్=మీఁదను; రువ్వుచున్=వెదచల్లుచు; త్రిమ్మరియెన్=చరించెను.

అనఁగా నొకగజము కట్టుకంబమునుండి విడువఁబడినదియై మ్రాఁకులయొక్క యాకులు రాల్చుచు, పరాగములు రువ్వుచు, తెరవరులు బెగడొందునట్లు ద్రిమ్మరుచందంబున, మందమారుతము మలయపర్వతమునుండి వెడలి, కారాకులు రాల్చుచు, పుప్పొడులు సారెకు రువ్వుచు, విరహిజనులు బెగడొందునట్లు ద్రిమ్మరియె ననుట. రూపకకైతవాహ్నుతులు.

చ. వనచరపాళికా నినద◊వారము మించఁగఁ గాననంబులన్
వనచరపాళికాప్త కుహ◊నాశబరాగ్రణి నిల్చి యాశుగా
ళి నలమ సాలసంతతి చ◊లించుచు నంత శుచిచ్ఛదావళుల్
చననిభయాప్తి వైచె నన ◊జాఱె ననంత శుచిచ్ఛదావళుల్. 33

టీక: వనచరపాళికానినదవారము – వనచరపాళికా=కోకిలసంఘమనెడు కిరాతకులగుంపుయొక్క, నినదవారము = ధ్వని సమూహము; మించఁగన్=అతిశయించుచుండఁగా; కాననంబులన్=అరణ్యములందు; వనచరపాళికాప్తకుహనాశబరాగ్రణి – వనచరపాళిక=మీనకేతనునియొక్క, ‘జీవనం భువనం వనమ్’ అనియు, ‘పాళిః కేతు ర్ధ్వజో లిఙ్గమ్’ అనియు నమరుఁడు, ఆప్త = చెలియైన వసంతుఁడనెడు; కుహనా=నెపముగల, శబరాగ్రణి=కిరాతపతి; నిల్చి; ఆశుగాళిన్=వాయువు లనెడు బాణముల యొక్క చాలుచేత; అలమన్=ఆక్రమింపఁగా; సాలసంతతి = వృక్షసమూహము, తెరువరులగుంపని ధ్వనితార్థము; చలించు చున్ = కదలుచు, భయముచేత వడఁకుచు; అంతన్=తదుపరి; శుచిచ్ఛదావళుల్=శుభ్రమైన వస్త్రముల పంక్తులను; చనని భయాప్తిన్ = తొలఁగని భయప్రాప్తిచేత; వైచెన్=విడిచెను; అనన్ = అనునట్లు; అనంతన్=భూమియందు; శుచిచ్ఛదావళుల్= కారాకుల గుంపులు; జాఱెన్=వ్రాలెను.

అనఁగా నడవిలో నొకశబరాగ్రణి తనపరివారకిరాతకు లెల్లఁ జుట్టి ధ్వనులు సేయుచుండఁగా బాణము లేయ, నత్తఱి తెరు వరులు మిగుల భీతిచేత శుభ్రము లగు తమవస్త్రములు విప్పియిచ్చిన యట్లు కోయిలలు రొదసేయుచుండఁగా వసంతము కాన నములందు వ్యాపించి మందమారుతమును వీవఁజేయఁగా మ్రాఁకులపండుటాకులు భూమిని రాలె నని తాత్పర్యము.

సీ. మధుయంత విటపిసా◊మజకటమ్ముల వ్రాయ, నలరు గైరికరేఖి◊కాళు లనఁగ,
హరివిదారితపత్త్ర◊యగు నగశ్రేణిపై, నడరు గైరికరేఖి◊కాళు లనఁగ,
నళిధూమకందళి ◊యలమఁ గన్పడు దవాం,గణవిరోచనమయూ◊ఖము లనంగ,
మును మ్రింగి వెగటైన◊వనతమస్తతి గ్రక్కు, ఘనవిరోచనమయూ◊ఖము లనంగ,

తే. నహహ యవ్వేళ పత్త్రతో◊యధితటస్థ,లకనదతిరోహితప్రవా◊ళము లనంగ,
నమరె నతిరోహితప్రవా◊ళముల నంగ,కనకకరవాలికాప్రమా◊కరము లగుచు. 34

టీక: మధుయంత =వసంతమనెడు మావటివాఁడు; విటపిసామజకటమ్ములన్=మ్రాఁకులను నేనుఁగులయొక్క గండస్థలముల యందు; వ్రాయన్=లిఖింపఁగా; అలరు గైరికరేఖికాళులు=ఒప్పుచున్న సిందూరరేఖాపంక్తులు; అనఁగన్=అనునట్లుగా. దీనికి ‘ప్రవాళము లమరె’ నను దానితో నన్వయము. హరివిదారితపత్త్ర – హరి=వాయువనెడు నింద్రునిచేత, విదారిత=ఖండింపఁబడిన, పత్త్ర = ఆకులను ఱెక్కలు గలది; అగు = ఐ నట్టి; నగశ్రేణిపైన్ = వృక్షములనెడు కొండలయొక్కచాలున; అడరు గైరికరేఖికాళులు = ఒప్పుచున్న జేగుఱురేఖలయొక్క చాలులు; అనఁగన్= అనునట్లుగా; అళిధూమకందళి = తుమ్మెదలనెడు ధూమాంకురము; అలమన్=ఆక్రమింపఁగా; కన్పడు =చూపట్టుచున్న; దవాంగణవిరో చనమయూఖములు – దవాంగణ=వనాంతరమనెడు, విరోచన=అగ్నియొక్క, మయూఖములు=జ్వాలలు; అనంగన్ = అనునట్లుగా; మును =తొలుత; మ్రింగి = కబళించి; వెగటైనన్=వెక్కసము కాఁగా; వనతమస్తతి = వనములనెడు రాహులగుంపు; క్రక్కు ఘన విరోచనమయూఖములు – క్రక్కు= వమనముసేయు, ఘన=అధికమైన, విరోచన=సూర్యునియొక్క,మయూఖములు=కిర ణములు; అనంగన్=అనునట్లుగా; పత్త్రతోయధి తటస్థల కన దతిరోహిత ప్రవాళములు – పత్త్రతోయధి=ఆకులనెడు సముద్రముయొక్క, తటస్థల=దరియందు, కనత్=ఒప్పుచున్న, అతిరోహిత=మిగుల నెఱ్ఱనైన, ప్రవాళములు=పవడములు; అనంగన్= అనునట్లుగా; అతిరోహిత ప్రవాళములు – అతిరోహిత=తిరోహితములు గాని, అనఁగా స్ఫుటముగా బయల్పడిన, ప్రవాళములు=పల్లవములు; అనంగ కనక కరవాలికా ప్రమాకరములు – అనంగ=మదనునియొక్క, కనకకరవాలికా=బంగరుకత్తియొక్క, ప్రమా=యథార్థజ్ఞానమునకు, కరములు= చేయునవి; అగుచున్ = అయినవయి; అవ్వేళన్=అపుడు; అమరెన్=ఒప్పెను; అహహ=ఆశ్చర్యము!
నవపల్లవములు పైఁజెప్పినరీతిగా విలసిల్లె నని తాత్పర్యము.

చ. కలికల రంగదుజ్జ్వలతఁ గన్పడెఁ గాననసీమ ముత్తెముల్
కలి కలరంగ నొంచి నిజ◊గౌరిమచే, నడఁగించి చంద్రమః
కలికల, రంగమై నవసు◊గంధపరంపర కెల్లఁ, జాల ను
త్కలికలరం గనారతముఁ ◊గాంచిన చూపఱచూడ్కి కుంచుచున్. 35

టీక: కలికలరంగదుజ్జ్వలత – కలికల=కోరకములయొక్క, రంగత్=ఒప్పుచున్న, ఉజ్జ్వలత=ప్రకాశము; కాననసీమన్ = అరణ్యప్రదేశమందు; ముత్తెముల్=మౌక్తికములు; కలికిన్=కలహమునకు; అలరంగన్=ఒప్పఁగా; నొంచి =నొప్పించి; నిజ గౌరిమచేన్ = తనపాండిమచేత; చంద్రమఃకలికలన్=శశికళలను; అడఁగించి=అడఁగఁజేసి; నవసుగంధపరంపర కెల్లన్—నవ=నూతనమగు, సుగంధ=పరిమళముయొక్క, పరంపర కెల్లన్= సముదయమున కంతయు; రంగమై = ఆశ్రయమై; అనారతమున్ = ఎల్లప్పుడును; కాంచిన చూపఱచూడ్కికిన్ =అవలోకించిన చూచువారియొక్క దృష్టికి; చాలన్=మిక్కిలి; ఉత్కలికలరంగు=వేడుకలయొప్పిదమును; ఉంచుచున్=చేయుచు; కన్పడెన్=అగపడెను. అనఁగాఁ గలికలు కాననసీమ లందుఁ దమపాండిమచే ముత్యములను, శశికలలను మించుచు నపూర్వపరిమళమును దాల్చుచు, చూపఱుల చూడ్కుల కింపులు నించుచుఁ గాన్పించె ననుట.

చ. విరిగమి వొల్చె సర్వవన◊వీథులఁ, దారకదీధితి చ్ఛిదా
పర మహిమానివారణము, ◊పాంథవధూజన దృష్టిమాలికా
పరమహి, మానితాళికుల◊భవ్యవిహారనివాస, ముజ్జ్వల
త్పరమ హిమానికాజయజ ◊భాసుర చైత్రికకీర్తి యత్తఱిన్. 36

టీక: అత్తఱిన్=అప్పుడు; సర్వవనవీథులన్=ఎల్లయడవులపట్టులందు; తారక దీధితి చ్ఛిదాపర మహిమానివారణము –తారక = నక్షత్రములయొక్క, దీధితి=కాంతులయొక్క, ఛిదా=ఛేదనమందు, పర=ఆసక్తమైన, మహిమ=సామర్థ్యముచేత, అనివారణము=అడ్డులేనిదియు; పాంథవధూజన దృష్టిమాలికా పరమహి – పాంథవధూజన=వియోగిస్త్రీలయొక్క, దృష్టి మాలికా = చూపుచాలులకు, పరమహి = శత్రుభూమిరూప మైనదియు; మానితాళికుల భవ్య విహారనివాసము – మానిత= శ్రేష్ఠములగు, అళికుల=తుమ్మెదగుంపులకు, భవ్య=మనోజ్ఞమగు, విహారనివాసము = విహారస్థానరూపమైనదియు; ఉజ్జ్వల త్పరమ హిమానికాజయ జ భాసుర చైత్రికకీర్తి – ఉజ్జ్వలత్=ప్రకాశించుచున్న, పరమ=ఉత్కృష్టమగు, హిమానికా=మంచు గమియొక్క, ‘హిమానీ హిమసంహతిః’ అని యమరుఁడు, జయ=గెలుపువలన, జ=పుట్టినట్టి, భాసుర=ప్రకాశించుచున్న, చైత్రికకీర్తి =వసంతునియొక్క కీర్తిరూపమైనదియు నగు; విరిగమి = పువ్వులగుంపు; పొల్చెన్= ప్రకాశించెను. సర్వవనస్థలులందు నక్షత్రకాంతి నడంచునంత ప్రకాశము గలదై, విరహిస్త్రీలచూపులకు శత్రుప్రాయం బగుచు, మంచును జయించి పొందిన చైత్రునికీర్తియో యనునట్లు విరిగమి పొల్చె ననుట. వసంతమందు హిమము నివృత్త మగుట ప్రసిద్ధంబ.

సీ. ఫలియించెఁ దిలకముల్ ◊భసలేక్షణమ్ముల, సురసాలతా సము◊త్కరము గాంచఁ,
జివురించె నునుఁబొన్న ◊నవసూనసంతతి, సురసాలవల్లరుల్ ◊ సరస నవ్వ,
ననఁజూపె బొగడచాల్ ◊నవమధుచ్ఛట నింద్ర,సురసా లలితశాఖ ◊కరము నుమియఁ,
గుసుమించె లేఁగ్రోవి ◊కొమరు వీవలి విభా, సుర సాలవల్లికల్ ◊సొరిది నలమ,

తే. సితవసు రసాల చారుమా◊రుత ముఖాప్త,వరులు మెచ్చంగ మధు వల◊ర్పకయ మున్నె
యలరి సురసాలవైఖరిఁ ◊జెలువు గాంచె, నపు డగశ్రేణి యిట్లు దో◊హదనిరూఢి. 37

టీక: తిలకముల్ = బొట్టుగులు; సురసాలతా సముత్కరము – సురసాలతా=సర్పాక్షితీవలయొక్క, సముత్కరము=సమూ హము; భసలేక్షణమ్ములన్=తేటిచూపులచేత; కాంచన్= చూడఁగా; ఫలియించెన్ = పండెను.నునుఁబొన్న=సుందరమగు పొన్నచెట్టు; సురసాలవల్లరుల్ =లెస్సయిన మావిపువ్వుగుత్తులు; సరసన్=సమీపమందు; నవ్వన్ = నవ్వఁగా; చివురించెన్=పల్లవించెను. పొగడచాల్=పొగడచెట్లవరుస; ఇంద్రసురసాలలితశాఖ – ఇంద్రసురసా=వావిలియొక్క, లలిత=మనోజ్ఞమగు, శాఖ=కొమ్మ; కరమున్=మిక్కిలియు; నవమధుచ్ఛటన్—నవ=నూతనమైన, మధు=మరందముయొక్క, ఛటన్=పరంపరను, ఉమియన్ = ఉమియఁగా; ననఁజూపెన్=కుసుమించెననుట, లేఁగ్రోవి = లేఁత కురవకము; కొమరువీవలిన్ – కొమరు = అందమైన, వీవలిన్=వాయువుచేత, విభాసురసాలవల్లికల్ – విభా సుర=ప్రకాశించుచున్న, సాలవల్లికల్=ఏపెమ్రాఁకుతీవెలు, అనఁగా లేఁతకొమ్మలు; సొరిదిన్=వరుసగా; అలమన్=కౌఁగిలిం చుటచేత; కుసుమించెన్= పుష్పించెను. మధువు=వసంతము; సితవసు రసాల చారుమారుత ముఖాప్తవరులు – సితవసు=శుభ్రాంశువైన చంద్రుఁడు, రసాల=తియ్య మావులు, చారుమారుత=మనోజ్ఞమైన వాయువు, ముఖ=మొదలైన, ఆప్తవరులు=కూర్మిచెలులు; మెచ్చంగన్=ప్రశంసించు నట్లుగా; అలర్పకయ మున్నె = వికసింపఁజేయక ముందె; అగశ్రేణి=మ్రాఁకులచాలు; ఇట్లు=పైఁజెప్పినవిధముగా; దోహద నిరూఢిన్ = దోహదముయొక్క యతిశయముచేత; అలరి=ప్రకాశించి; అపుడు= ఆసమయమందు; సురసాలవైఖరిన్ = కల్ప వృక్షములవలె; చెలువు గాంచెన్= అందము నొందెను.

అనఁగా తిలకములకు స్త్రీవీక్షణము, పొన్నలకు స్త్రీలనవ్వు, పొగడలకు స్త్రీముఖశీధువు, కురవకములకు స్త్రీయాలింగనము దోహదముగావున ఈదోహదములచే వసంతోదయమునకు మున్నె పుష్పఫలాదిభరితములై వేల్పుమ్రాఁకులవలె చెలువొందె ననుట. ఇట నాల్గుచరణములయందు సురసాలతా, సురసాలవల్లరీ, ఇంద్రసురసా, సాలవల్లికలయందు స్త్రీలింగమహిమచే స్త్రీత్వారోపముఁ జేసి తదీయభసలేక్షణాదులచే దోహదనిర్వాహము.

చ. తలిరులు దోఁచెఁ గోకిలవి◊తానము వేడుకఁ గాంచ, సూనముల్
వొలిచె మిళింద ముబ్బి కడుఁ ◊బూన నవాంగము, మారుతాంకురం
బొలికెఁ బరాగముల్ వని ల◊తోత్కర మాకులపాటు నందగన్,
దొలుదొలుతన్ వియోగిసుద◊తుల్ కర మాకులపాటు నందఁగన్. 38

టీక: వనిన్=వనమునందు; కోకిలవితానము =కోకిలలగుంపు; వేడుకన్=సంతసమును; కాంచన్= పొందఁగా; తలిరులు = పల్లవములు; తోఁచెన్ = ఉదయించెను; మిళిందము=తుమ్మెద; కడున్ = మిక్కిలి; ఉబ్బి=ఉప్పొంగి; నవాంగము=క్రొత్తశరీ రమును; పూనన్=వహింపఁగా, అనఁగా సంతోషాతిశయముచే నుప్పొంగి క్రొత్తదేహమును దాల్చినట్లుండఁగా ననుట; సూన ముల్=పుష్పములు; పొలిచెన్=ఉదయించెను; లతోత్కరము=తీవలగుంపు; ఆకులపాటునన్ = కారాకులు రాలుటచేతను; తగన్=ఒప్పునట్లు; పరాగముల్=పుప్పొడులను; మారుతాంకురంబు = మందమారుతము; ఒలికెన్=చల్లెను;తొలుదొలుతన్ =తొల్తనే; వియోగిసుదతుల్=విరహిస్త్రీలు; కరము=మిక్కిలి; ఆకులపాటున్= వ్యాకులత్వమును; అందఁగన్=పొందఁగా, ఇది యన్నిక్రియలతోను నన్వయించును. అనఁగా వృక్షలతాదులు తొలుతఁ గారాకులు రాలఁగాఁ జిగిరించి, కుసుమించి, పుప్పొడులు రాలె ననుట.