చ. అనుపమరాజహంసభర◊ణాదరణాత్మతఁ దత్సరోవరం
బున నలరాజహంససుత◊బోటులు మించిరి పూర్వవైరముల్
సన భృతరాజహంసత నె◊సంగుదివాక్షణదాధిదేవు లౌ
నని వనరాజహంసగమ◊నాళి మనంబున సన్నుతింపఁగన్. 74
టీక: అలరాజహంససుతబోటులు = రాజశ్రేష్ఠుఁడగు క్షణదోదయుని పుత్త్రికయగు చంద్రికయొక్క చెలులు; తత్సరోవరంబు నన్ = ఆసరస్సునందు; అనుపమరాజహంసభరణాదరణాత్మతన్ – అనుపమ=సాటిలేని, రాజహంస=పక్షివిశేషముయొక్క, ‘రాజహంసాస్తు తే చఞ్చుచరణై ర్లోహితై స్సితాః’ అని యమరుడు. అనఁగా ముక్కు, కాళ్ళు ఎఱ్ఱగను, శరీరము తెల్ల గను నుండు హంసములకు రాజహంసము లని పేరు. రాజహంసశబ్దమునకు చంద్రసూర్యు లను నర్థాంతరము దోఁచును, భరణ= భరించుట యందు, ఆదరణ=ఆసక్తిగల, ఆత్మతన్=చిత్తము గల్గుటచేత; పూర్వవైరముల్=మునుపటి ద్వేషములు; చనన్= పోఁగా; భృత రాజహంసతన్ = భరింపఁబడిన చంద్రసూర్యులు గల్గుటచేత; ఎసంగు దివాక్షణదాధిదేవులు=ఒప్పుచున్న దిన రాత్ర్యధిదేవతలు; ఔన్=నిశ్చయము, అని=ఇట్లని; వనరాజహంసగమనాళి =వనమందలి స్త్రీలచాలు, వనపాలికామండలి యనుట; మనంబునన్ =చిత్తములందు; సన్నుతింపఁగన్ = కొనియాడఁగా; మించిరి =అతిశయించిరి. అనఁగాఁ జంద్రికాసఖీ జనము సరోవరమున రాజహంసభరణాదరణముతోఁ జెలఁగుచుండఁగా, దివారాత్ర్యధిదేవతలు తమ తొల్లిటివైరము మాని సూర్యచంద్రులను బట్టుకొని యుండినట్లు వనపాలికల మనంబులకుఁ దోఁచిన దనుట. శ్లిష్టరూపకోత్థాపితోత్ప్రేక్షాలంకారము.
సీ. వాసంతి యనఘాళి◊వరరసంబునఁ గప్పి,వాసంతి యన సము◊జ్జ్వలతఁ బొల్చె,
సారంగి యనపాయ◊జలజాంబుతతి నాని, సారంగి యనఁ జాల ◊సంభ్రమించె,
శశిలేఖ యనసార◊చక్రాళి నలయించి, శశిలేఖ యన శుభ◊చ్ఛాయఁ దోఁచె,
చక్రాంగి యనవద్య◊చారూర్మికల నూఁగి, చక్రాంగి యన హృద్య◊చర్య మసలె,
తే. చూతకళిక యనర్ఘ్యర◊జోవృతిఁ గని, చూతకళిక యనం గడుఁ ◊జూడ నొప్పె,
హరిణి యనరాళకమలైక◊పరిచితిఁ గని, హరిణి యన నవ్వనాస్థాని ◊నప్పు డలరె. 75
టీక: వాసంతి = వాసంతి యనుపేరుగల చెలి; అనఘాళిన్=అనఘయైన చెలిని, ఒచ్చెము లేని తుమ్మెదను, శ్లిష్టరూపకము; వరరసంబునన్=శ్రేష్ఠమగు ప్రీతిచేత, శ్రేష్ఠమగు పుష్పరసముచేత; కప్పి;వాసంతి యనన్=బండిగురివెందలత యనఁగా, వాసంతినామము గలది యనఁగా; సముజ్జ్వలతన్=ప్రకాశముచేత; పొల్చెన్=ఒప్పెను. మాధవీలతవలె ననఘాళిని రసమునఁ గప్పుటం జేసి వాసంతీనామము దాని కమరిన దనుట. సారంగి=సారంగి యను పడుచు; అనపాయజలజాంబుతతిన్ – అనపాయ=చ్యుతిలేనట్టి, జలజాంబు=పూఁదేనియయొక్క, తతిన్ =రాశిని; ఆని=త్రావి; సారంగియనన్=ఆఁడుతుమ్మెదయనఁగా, సారంగి యను నామము గలది యనఁగా; చాలన్ = మిక్కిలి; సంభ్రమించెన్ =సంతసించెను. భృంగివలెఁ బూఁదేనియ నానుటంజేసి సారంగి యను నామము దాని కొప్పె ననుట.శశిలేఖ = శశిలేఖ యను కాంత; అనసారచక్రాళిన్ – అనసార-శ్రేష్ఠములైన, చక్రాళిన్=చక్రవాకములచాలును; అలయించి = అలఁతపెట్టి; శశిలేఖ యనన్ = చంద్రరేఖ యనఁగా, శశిలేఖ యను నామము గలదనఁగా; శుభచ్ఛాయన్=మంచికాంతిచేత; తోఁచెన్=పొల్చెను. చంద్రరేఖవలె జక్కవలచాలు నలయించుటంజేసి శశిలేఖ యను పేరు దాని కబ్బె ననుట. చక్రాంగి = చక్రాంగి యను పేరుగల బోటి; అనవద్యచారూర్మికలన్ – అనవద్య=దూష్యములు గాని, చారు=మనోహరము లైన, ఊర్మికలన్=తరంగములయందు; ఊఁగి; చక్రాంగి యనన్ = హంసస్త్రీ యనఁగా, చక్రాంగి యను నామము గలదనఁగా; హృద్యచర్యన్=మనోజ్ఞమైన వృత్తిచేత; మసలెన్=ఒప్పెను. హంసస్త్రీవలెఁ దరంగములయందు నూఁగుటం జేసి చక్రాంగి యను నామము దాని కొప్పె ననుట. చూతకళిక = చూతకళిక యను పేరుగల నాతి; అనర్ఘ్యరజోవృతిన్ – అనర్ఘ్య=అమూల్యమైన, రజోవృతిన్=పరాగవ్యాప్తిని; కని = పొంది; చూతకళిక యనన్ = మావిమొగ్గ యనఁగా, చూతకళిక యనుపేరుగల దనఁగా; కడున్=మిక్కిలి; చూడన్ ఒప్పెన్ = చూచుటకు నందమయ్యెను. చూతకళికవలె రజోవృతిని గనుటంజేసి చూతకళికయను పేరు దాని కొదవె ననుట. హరిణి = హరిణి యను పేరుగల వనిత; అనరాళకమలైకపరిచితిన్ – అనరాళ=ఋజువులైన, కమల=పద్మములయొక్క, ఏక =ముఖ్యమగు; పరిచితిన్=పరిచయమును; కని=పొంది; హరిణి యనన్ = మృగస్త్రీ యనఁగా, హరిణి యను పేరుగలదనఁగా; అవ్వనాస్థానిన్ = ఆసరోజలమను నాస్థానమందు; అప్పుడు; అలరెన్=ఒప్పెను. అనఁగా మృగస్త్రీవలెఁ గమలపరిచయముం గనుటంజేసి హరిణి యను నామము దాని కెసఁగె ననుట. శ్లిష్టరూపకము.
అనఁగా జలక్రీడకై కొలను సొచ్చిన వాసంతి, సారంగి, శశిలేఖ, చక్రాంగి, చూతకలిక, హరిణి యను నామములు గల స్త్రీలు పైఁజెప్పిన చర్యల నొనరించిరని భావము. రాజాస్థానికలయందు దాసీవర్గమునకు వాసంత్యాదినామము లుండుట ప్రసిద్ధము.
క. నలి నాకరజితకిసలల్
నలినాకరకేళి యిటు లొ◊నర్చి జలార్ద్రాం
గలతాళులు హిమవృతకుం
దలతాభం దోఁప నపుడు ◊దఱిసిరి తటమున్. 76
టీక: అపుడు=ఆసమయమందు; ఆకరజితకిసలల్= కరములచే గెలువఁబడిన పల్లవములు గల యా స్త్రీలు; నలిన్=మిక్కిలి; నలినాకరకేళి=జలక్రీడను; ఇటులు=పైవిధముగ; ఒనర్చి=చేసి;జలార్ద్రాంగలతాళులు – జల=నీటచే, ఆర్ద్ర=తడిసిన, అంగ లతాళులు = లతలవంటి తనుపంక్తులు; హిమవృతకుందలతాభన్ = మంచుచే నావరింపఁబడిన మొల్లతీవలకాంతివంటి కాంతి చేత; తోఁపన్=ప్రకాశింపఁగా; తటమున్=తీరమును; దఱిసిరి=సమీపించిరి. అనఁగా నాస్త్రీలు జలక్రీడసలిపి యొడ్డుఁ జేరి నీటిచేఁ దడిసిన తనులతలతో మంచుచే నావరింపఁబడిన కుందలతలభంగి నొప్పి రనుట. కుందలతలకు, స్త్రీతనువులకు నుపమానోప మేయభావము. హిమమునకు జలమునకు బింబప్రతిబింబభావము.
చ. లలనలు వాఃప్లుతాంశుకము◊లన్ సడలించి తగం భరించి మేల్
చలువల నైకజాతిసుమ◊జాలసరంబులు వేణిఁ దాల్చి ని
చ్చలు వలనై కనంబడుల◊సన్మణిమాలిక లూని పూసి మై
చలువల నైకమత్యగతిఁ ◊జాలిన తావుల నొప్పు గంధముల్. 77
టీక: లలనలు=స్త్రీలు; వాఃప్లుతాంశుకములన్=నీటిచేఁ దడుపఁబడిన వస్త్రములను; సడలించి=విడిచి; మేల్ చలువలన్ = మంచి వస్త్రములను; తగన్= తగునట్లుగా; భరించి=ధరించి; నైకజాతిసుమజాలసరంబులు – నైకజాతి=నానాజాతులు గల, సుమ జాల= పుష్పసంఘములయొక్క, సరంబులు=దండలు; వేణిన్=జడయందు; తాల్చి=ధరించి; నిచ్చలున్=ఎల్లపుడు; వలనై = అనుకూలమై; కనంబడు=అగపడుచున్న; లసన్మణిమాలికలు=ప్రకాశించుచున్నమణిమయహారములను; ఊని=వహించి; మైచలువలన్=దేహములయొక్క చల్లదనములతో; ఐకమత్యగతిన్=ఐకమత్యముయొక్క పొందికచేతను; చాలిన తావులన్ = సమృద్ధమైన పరిమళములచేతను; జలక్రీడ లాడిన వారిదేహము లంతటి చల్లఁదనముతోను, అధికమైన పరిమళముతోను ననుట; ఒప్పు గంధముల్=ఒప్పుచున్న గంధములను; పూసి=లేపనము చేసి. దీనికి ‘గందంబు వెట్టి’ రను ముందరిపద్యముతో నన్వయము. ముందు నాల్గుపద్యములకు నందె అన్వయము. ఆఱు పద్యములకు నిట నేకక్రియాన్వయము గదితంబయ్యె. దీనికిఁ గుళక మని కవిసంకేతము. ‘ద్వాభ్యాం యుగ్మ మితి ప్రోక్తం త్రిభి శ్శ్లోకై ర్విశేషకమ్| కలాపకం చతుర్భి స్స్యాత్, తదూర్ధ్వం కుళకం స్మృతమ్||’ అని తల్లక్షణము.
క. అతిపావనచాతురి నా,క్షితిపాలకపుత్త్రిక గయి◊సేసి యలవనిన్
రతినాయకదేవార్చన,రతి నాయక లపుడు పూని ◊రమ్యోత్కలికన్. 78
టీక: అతిపావనచాతురిన్=మిగులఁ బ్రశస్తమగు నేర్పుచేత; ఆక్షితిపాలకపుత్త్రికన్ = రాకుమారియగు నాచంద్రికను; కయిసేసి =అలంకరించి; అలవనిన్=ఆయుద్యానమందు; రతినాయకదేవార్చనరతిన్=స్మరదేవపూజాసక్తిచేత; ఆయకలు=ఆస్త్రీలు; అపుడు=ఆసమయమున; రమ్యోత్కలికన్=రమ్యమైన యుత్కంఠను; పూని=వహించి. ఇది ముందు కన్వయించును.
సీ. మాకందములు మహి◊మాకందములు కొన్ని, యింపైన ఫలముల ◊నిచ్చుచోట,
సురసౌఘము లుదార◊సురసౌఘములు కొన్ని, యురుమకరందంబు ◊గురియుచోట,
సుమనంబు లభిరామ◊సుమనంబు లొకకొన్ని, క్రొన్ననల్ చాలఁ జే◊కూర్చుచోట,
రాగంబులు గళత్ప◊రాగంబు లొకకొన్ని, పుప్పొడిధూపముల్ ◊పూన్చుచోట,
తే. నెట్టన యశోకకిసలము ◊ల్మట్టుమీఱి, యుట్టివడఁ గాయు లేయెండఁ ◊బుట్టి యెలసి
నట్టి చెలువునఁ జూపట్టు ◊మెట్టదమ్మి,తీవెగమి తమ్మియారతుల్ ◊దీర్చుచోట. 79
టీక: మహిమాకున్=భూలక్ష్మికి; అందములు=అందములైన; మాకందములు కొన్ని = కొన్నితియ్యమావులు; ఇంపైన = ఇష్టమైన; ఫలములన్=పండ్లను; ఇచ్చుచోటన్=ఒసంగుస్థలమునందు; ఉదారసురసౌఘములు = అధికమై శ్రేష్ఠమైన మకరందసమూహము గల; సురసౌఘములు కొన్ని=కొన్నిసర్పాక్షితీవల యొక్కగుంపులు; ఉరుమకరందంబు = అధికమైన పూఁదేనియను; కురియుచోటన్ = వర్షించుచోట; అభిరామసుమనంబులు=ఒప్పుచున్న పువ్వులు గల్గిన; ఒకకొన్ని సుమనంబులు=కొన్ని జాజులు; చాలన్=మిక్కిలి; క్రొన్ననల్ =క్రొత్తపూవులను; చేకూర్చుచోటన్= ఘటిల్లఁజేయుచోట; గళత్పరాగంబులు=జాఱుచున్న పుప్పొడులు గల; ఒకకొన్నిరాగంబులు =కొన్ని దాడిమీవృక్షములు; పుప్పొడిధూపముల్ =పుష్పరజమనెడు ధూపములను; పూన్చుచోటన్=వహించు చోటను; నెట్టన=అనివార్యముగ; అశోకకిసలముల్= అశోకపల్లవములు; మట్టుమీఱి = మర్యాద నతిక్రమించి; ఉట్టిపడన్=అతిశయిం పఁగా; కాయు లేయెండన్=కాయుచున్న తరుణాతపముచేత; పుట్టి=ఉదయించి; ఎలసినట్టి చెలువునన్ = ఉదయించినట్టి యందముచేత; చూపట్టు మెట్టదమ్మితీవెగమి = అగపడుచున్న స్థలపద్మినీలతలసముదాయము; తమ్మియారతుల్= పద్మము లను నారతులను; తీర్చుచోటన్= చక్కఁబఱచుచోటను. దీనికి దిగువ కన్వయము.
చ. అలఘుమరందవర్షమహి◊మాతిశయమ్మున సప్తలాద్యమం
దలతల మంచుపొన్నగమి ◊దార్కొనుపందిరిక్రింద వేదికం
దలతల మంచు మించుసుమ◊నవ్యరజంబులఁ దార్చి తారలం
దలతల మంచు నొప్పెడుక◊నత్కలికాతతి మ్రుగ్గువెట్టుచున్. 80
టీక: అలఘుమరందవర్షమహిమాతిశయమ్మునన్ – అలఘు=అధికమైన, మరందవర్ష=పూఁదేనియవానయొక్క, మహి మాతిశయమ్మునన్ =సామర్థ్యాతిశయమున; సప్తలాద్యమందలతలన్ = విరజాజి మున్నగు నుత్కృష్టలతలను, ‘సప్తలా నవమాలికా’ అని యమరుఁడు; మంచుపొన్నగమిన్ = పోషించుచున్న పొన్నలగుంపును; తార్కొనుపందిరిక్రిందన్ = సమీ పించిన పందిరియొక్క దిగువను; వేదికన్=తిన్నెపైని; తలతల మంచున్=తళుక్కుతళుక్కు మనుచు; మించు సుమనవ్యరజం బులన్ = అతిశయించుచున్న నూతనమైన పుష్పపరాగములను; తార్చి=ఉంచి; తారలన్=నక్షత్రములను; తలతల మంచున్ = తొలఁగుతొలఁగుమనుచు; ఒప్పెడుకనత్కలికాతతిన్ = ఒప్పుచున్న ప్రకాశించు మొగ్గలగుంపుచేత; మ్రుగ్గు వెట్టుచున్ = రంగ వల్లిక యుంచుచు. దీనికి ముందు కన్వయము. అనఁగా విరజాజి మొదలగు తీవెలతోఁ జుట్టఁబడిన పొన్నచెట్టునొద్దఁ బందిరిక్రింద నొకతిన్నెమీఁదఁ బుప్పొడి చల్లి, నక్షత్రములవలెఁ బ్రకాశించు మొగ్గలతో మ్రుగ్గువెట్టి యని తాత్పర్యము.
ఉ. జవ్వను లెల్ల సమ్మదము ◊చాల రహింపఁగ నందు వెన్నెలం
జివ్వకుఁ బిల్చుపాండుపటిఁ ◊జిక్కనికస్తురినీట రాణితో
నవ్వలరాజు నాశుగశ◊రాసనయుక్తుని వ్రాసి నేర్పుతో
నవ్వల రాజు నాశుగసు◊మాకరముఖ్యుల నిల్పి యత్తఱిన్. 81
టీక: జవ్వను లెల్లన్=స్త్రీలందఱు; సమ్మదము = సంతోషము; చాలన్= మిగులను; రహింపఁగన్=ఒప్పఁగా; అందున్= ఆ వేదికయందు; వెన్నెలన్=జ్యోత్స్నను; చివ్వకున్=కలహమునకు; పిల్చుపాండుపటిన్= పిల్చునట్టి తెల్లనివస్త్రమందు; చిక్కనికస్తురినీటన్=చిక్కనైనకస్తూరీనీరముచేత; రాణితోన్=రతీదేవితోడ; అవ్వలరాజున్=ఆమన్మథుని; ఆశుగశరాసన యుక్తునిన్=బాణధనువులతోఁ గూడినవానిని; వ్రాసి=లిఖించి; నేర్పుతోన్=చాతుర్యముచేత; అవ్వలన్=ఆతర్వాత; రాజున్ = చంద్రుని; ఆశుగసుమాకరముఖ్యులన్ = మందమారుతవసంతాదులను; అత్తఱిన్=ఆసమయమునందు; నిల్పి=స్థాపించి. పై పద్యముతో నన్వయము.
సీ. గందంబు వెట్టి రు◊త్కటనీలశరజాత,శరజాతహృతహర◊స్వాంతధృతికి,
విరిచాలు నించిరి ◊పరియోజితనయాన్య,తనయాన్యమితమోహ◊ధాతృమతికి,
ధూప మర్పించి ర◊ద్భుతసంపదబలాప,దబలాపహృతవిష్ణు◊దర్పగతికి,
దీప మెత్తిరి నైజ◊తేజోలహరిభావ,హరిభావయుక్తఘ◊స్రాధిపతికి,
తే. తళియ వట్టిరి నిత్యస◊త్కాంతమధుప,కాంతమధుపవనాద్యాప్త◊కాండవృతికి,
వినతి సల్పిరి శృంగార◊జనికి ‘రతిప,తే నమో భవతే’యంచుఁ ◊దెఱవ లపుడు. 82
టీక: ఉత్కటనీలశరజాతశరజాతహృతహరస్వాంతధృతికిన్ – ఉత్కట=అధికమైన, నీలశరజాత=నీలోత్పలము లనెడు, శర =బాణములయొక్క, జాత=సమూహముచేత, హృత=హరింపఁబడిన, హర=శివునియొక్క, స్వాంత=చిత్తముయొక్క, ధృతికిన్=ధైర్యము గలవానికి; గందంబు వెట్టిరి = చందన మలందిరి. పరియోజితనయాన్యతనయాన్యమితమోహధాతృమతికిన్ – పరియోజిత=కూర్పఁబడిన, నయాన్య=నీతివిరుద్ధమైన, ఇది మోహమునకు విశేషణము, తనయా=కూఁతునందలి, న్యమిత=అత్యధికమైన, మోహ=మోహము గల, ధాతృమతికిన్ = బ్రహ్మబుద్ధి గలవానికి; విరిచాలు=పుష్పపంక్తులను; నించిరి = నిండించిరి. అద్భుతసంపదబలాపదపలాపహృతవిష్ణుదర్పగతికిన్ – అద్భుత=ఆశ్చర్యకరమగు, సంపదబలా=లక్ష్మి యనెడు, పద= పదము గల, పేరుగల యనుట, బల=సామర్థ్యముచేత, అపహృత=హరింపఁబడిన, విష్ణుదర్పగతికిన్=విష్ణుమూర్తియొక్క గర్వగతి గల వానికి; ధూప మర్పించిరి = ధూపమును సమర్పించిరి. నైజతేజోలహరిభావహరిభావయుక్తఘస్రాధిపతికిన్ – నైజతేజోలహరిభావ=స్వీయమగు ప్రతాపప్రవాహసత్తచేత, హరిభావ =అశ్వత్వముతోడ, యుక్త=కూడిన, ఘస్రాధిపతికిన్=సూర్యుఁడు గలవానికి, ఛాయాదేవి సూర్యునివేఁడికిఁ దాళలేక రథము నుండి డిగ్గి యశ్వరూపయై పాఱిపోవుచుండఁగా సూర్యుఁడు కామార్తుఁడై తాను నశ్వరూపమును దాల్చి వెంబడి పరు గెత్తె నని పురాణప్రసిద్ధంబు, దీప మెత్తిరి= హారతి నెత్తిరి. నిత్యసత్కాంతమధుపకాంతమధుపవనాద్యాప్తకాండవృతికిన్ – నిత్య=శాశ్వతమైన, సత్కాంత=చంద్రుఁడు, మధుపకాంత= అళిశ్రేష్ఠములు, మధు=వసంతుఁడు, పవన=వాయువు, ఆది=మొదలుగాఁ గల, ఆప్తకాండ=సుహృద్గణముయొక్క, వృతికిన్ = వ్యాప్తిగలవానికి;తళియ=బోజనపాత్రమును; పట్టిరి=ఉంచిరి.
శృంగారజనికిన్ = శృంగారరసమువలనఁ బుట్టుక గలవానికి; అపుడు; రతిపతే=రతీశుఁడా; భవతే=నీకొఱకు; నమః=నమ స్కారము; అంచున్=ఇట్లనుచు; తెఱవలు=స్త్రీలు; వినతి సల్పిరి = నమస్కరించిరి.
క. కమలాప్రియసుత, కరుణా
కమలాధిప, కలితకార్ము◊కత్కుసుమ, కన
త్కమలాశుగ, యని భక్తిన్
గమలాక్షులు పొగడిరిట్లు ◊కలరవఫణితిన్. 83
టీక: కమలాప్రియసుత=లక్ష్మికిఁ బ్రియకుమారుఁడా! కరుణాకమలాధిప =దయాసముద్రుఁడా! కలితకార్ముకత్కుసుమ = ధరింపఁబడిన ధనువగుచున్న పుష్పముగలవాఁడా! కనత్కమలాశుగ =ఒప్పెడు తమ్ము లమ్ములుగాఁ గలవాఁడా; ఇట్లు=ఈ ప్రకారముగ; అని = అనుచు; కలరవఫణితిన్=అవ్యక్తమధురమగు ధ్వనిగల వాక్కుచేత; కమలాక్షులు =స్త్రీలు; భక్తిన్ =భక్తి తోడ; పొగడిరి = నుతించిరి.
చ. కరము మహాబలావళులు ◊గాఢతరోవిచరద్ధరీశ్వరో
త్కరము మహాబలావృతవి◊ఖండహితాళులు గొల్వ మించుచున్
సిరి గలసామికిం బొడమి ◊చెన్నగు నీకు సుమంబు లూన్చుటల్
స్థిరకృప మాధవస్య తుల◊సీదళ మంచు వహింపు మంగజా! 84
టీక: అంగజా=మన్మథుఁడా! కరము=మిక్కిలి; మహాబలావళులు=పూజ్యములైన వాయుపరంపర లనెడు గొప్ప సేనా వళులు; గాఢతరోవిచరద్ధరీశ్వరోత్కరము – గాఢ=దృఢమైన, తరః=వేగముచేత, విచరత్=సంచరించుచున్న, హరీశ్వరో త్కరము=శుకశ్రేష్ఠముల గుంపనెడు నశ్వశ్రేష్ఠములగుంపు; మహాబలావృతవిఖండహితాళులు – మహాబలా=అధికలైన స్త్రీల చేత, ఆవృత=కూడుకొన్న, విఖండ=అఖండములైన, హిత=ఇష్టములైన, అళులు= తుమ్మెద లనెడు మహాసామర్థ్యముతోఁ గూడుకొన్న యఖండాప్తసంఘములు; కొల్వన్=సేవించుచుండఁగా; మించుచున్=అతిశయించుచు; సిరి గలసామికిన్ = విష్ణు మూర్తికి; పొడమి =పుట్టి; చెన్నగు నీకున్ = ఒప్పుచున్న నీకు; సుమంబులు=పూవులను; ఊన్చుటల్=ఉంచుటలు; స్థిరకృప = శాశ్వతకరుణగలవాఁడా! మాధవస్య తులసీదళ మంచున్ = మాధవునకు తులసీపత్త్ర మని; వహింపుము = తాల్పుము. అనఁగా దొడ్డవానికడుపునఁ బుట్టి గొప్పస్థితిలో నుండి వెలయు నీ కిది మేము సేయు నుపచారము స్వల్పమైనది యైనను దయా మతితోడ గ్రహింపు మనుట.