చంద్రికాపరిణయము – 8. షష్ఠాశ్వాసము

శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము

షష్ఠాశ్వాసము

క. శ్రీమజ్జటప్రోలుపురీ
ధామ! సుధాధామతిగ్మ◊ధామస్ఫూర్జ
త్కోమలనయనద్వయ! యు
ద్దామగుణాభీల! శ్రీమ◊దనగోపాలా! 1

టీక: శ్రీమజ్జటప్రోలుపురీధామ—శ్రీమత్=సంపద్యుక్తమగు, జటప్రోలుపురీ=జటప్రో లనెడు నగరము, ధామ=నివాసముగాఁ గలవాఁడా! సుధాధామ తిగ్మధామ స్ఫూర్జ త్కోమల నయనద్వయ – సుధాధామ=చంద్రుఁడును, తిగ్మధామ=సూర్యుఁడును, స్ఫూర్జత్=ప్రకాశించుచున్న, కోమల=సుందరమైన, నయనద్వయ=కనుదోయిగాఁ గలవాఁడా!ఉద్దామగుణాభీల – ఉద్దామ= ప్రౌఢమైన, గుణ=శౌర్యాదిగుణములచేత, ఆభీల=భయంకరుఁడైనవాఁడా! శ్రీమదనగోపాలా= లక్ష్మీయుక్తుఁడవగు మదన గోపాలస్వామీ! ఈకృతిపతి సంబోధనమునకు ‘చిత్త గింపు’మను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

తే. చిత్తగింపుము శౌనకా ◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ◊ర్షణతనూజుఁ
డలనృపతి రేయి శుభలగ్న ◊మనువుపఱిచి
పురము గయిసేయ శిల్పికో◊త్కరముఁ బనుప. 2

టీక: చిత్తగింపుము = ఆకర్ణింపుము;శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలగు శ్రేష్ఠులగు మునిసంఘమునకు; రోమ హర్షణతనూజుఁడు=సూతుఁడు; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగా; అనున్= పలికెను; అలనృపతి=ఆక్షణదోదయుఁడు; రేయి =రాత్రియందు; శుభలగ్నము=శుభముహూర్తమును; అనువుపఱిచి=అనుకూలింపఁజేసి;పురము=నగరమును; కయిసేయన్ =అలంకరించుటకు;శిల్పికోత్కరమున్=శిల్పిసంఘమును; పనుపన్=ఆజ్ఞాపింపఁగా; దీని కుత్తరపద్యముతో నన్వయము. అనఁగా క్షణదోదయుఁ డారాత్రియందు శుభలగ్నము నిర్ణయించి, పురము నలంకరింప శిల్పుల కాజ్ఞాపించె నని తాత్పర్యము.

సీ. చంద్రవితానముల్ ◊చక్కఁగాఁ దార్చి రా,స్థానాజిరముల సౌ◊ధవ్రజముల,
రామాకృతిశ్రేణిఁ ◊బ్రబలఁ జిత్రించిరి, కురుఁజుల నవమణి◊కుడ్యతటుల,
హరిణకేతుచయంబు ◊వరుసఁ బొందించిరి, సాలాగ్రముల గృహ◊స్తంభతతులఁ,
దోడ్తో నమేరు ల◊ద్భుతముగా నిల్పిరి, రాజవీథికల ద్వా◊రప్రతతుల,
తే. విలసితచ్ఛదగుచ్ఛమం◊డలముఁ బూన్చి, రంగడులఁ దోరణస్రగ్ల◊తాంతరముల
నప్పురంబున సకలదే◊శాధిరాజ,శేఖరులు మెచ్చ నవ్వేళ ◊శిల్పివరులు. 3

టీక: అప్పురంబునన్=ఆనగరమందు; సకలదేశాధిరాజశేఖరులు=సమస్తదేశముల రాజశ్రేష్ఠులు; మెచ్చన్=మెచ్చునటులు; అవ్వేళన్=ఆసమయమందు; శిల్పివరులు=చిత్తరు వ్రాయువారు; చంద్రవితానముల్ – చంద్ర=కర్పూరముయొక్క, వితాన ముల్=సమూహములను; చంద్ర=బంగరుయొక్క,వితానముల్=మేలుకట్లను; వరుసన్=క్రమముగా; ఆస్థానాజిరములన్ = రాజసభలయొక్క చత్వరములందును; సౌధవ్రజములన్= మేడలగుంపులయందును; చక్కఁగాన్=సుందరముగా; తార్చిరి = పొందించిరి; రామాకృతిశ్రేణిన్ – రామాకృతి=స్త్రీప్రతిమలయొక్క, శ్రేణిన్=బంతిని; రామాకృతి=శ్రీరాముని ప్రతిమలయొక్క, శ్రేణిన్= వరు సను; కురుఁజులన్=దూలములమీఁది గుజ్జులయందును; నవమణికుడ్యతటులన్=నవ్యమగు రతనాలగోడలయందును; ప్రబలన్= అతిశయించునటులు; చిత్రించిరి=వ్రాసిరి; హరిణకేతుచయంబు=చంద్రసమూహమును, తెల్లనిటెక్కెములను;వరుసన్=క్రమముగ;సాలాగ్రములన్ – సాల=ప్రాకార ములయొక్క, అగ్రములన్=అగ్రభాగములందును; గృహస్తంభతతులన్ – గృహ=సదనములయొక్క, స్తంభతతులన్= కంబముల గుంపులయందును; పొందించిరి; తోడ్తోన్=వెంటనె; నమేరులు=సురపొన్నలను; తోడ్తోన మేరువులు అనియు విభాగము, మేరువులు=శిఖరమణులను; రాజ వీథికలన్=రాజమార్గములయందును; ద్వారప్రతతులన్=ద్వారములయొక్క సమూహములందును; అద్భుతముగాన్ = వింతగా; నిల్పిరి=ఉంచిరి; విలసితచ్ఛదగుచ్ఛమండలమున్—విలసిత=ప్రకాశించుచున్న, ఛద=వస్త్రములయొక్క,గుచ్ఛ=గుత్తులయొక్క, మండల మున్=సమూహమును; వరుసన్=క్రమముగా; అంగడులన్=మళిగలయందు; తోరణస్రగ్లతాంతరములన్ – తోరణ= బహి ర్ద్వారముయొక్క, స్రగ్లతా=తీవెలవంటిదండలయొక్క, అంతరములన్=మధ్యప్రదేశములయందు; పూన్చిరి= ఉంచిరి.

అనఁగా నాస్థానాజిరములయందు రంగవల్లీరూపముగా కర్పూరచూర్ణమును, సౌధములయందు బంగరుమేలుకట్లను ఉంచి రనియు, కురుఁజులయందు, కుడ్యములయందు స్త్రీప్రతిమలను, దాశరథిప్రతిమలను క్రమముగ వ్రాసిరనియు, కోటగోడల యందును, కంబములయందును చంద్రబింబములను, తెల్లనిటెక్కెములను క్రమముగ నుంచి రనియు, రాజవీథులయందు సుర పొన్నలను, ద్వారములయందు మేరువులను నుంచి రనియు, మలిగలయందు వస్త్రములను, తోరణములయందు పర్ణగుచ్ఛ ములను గట్టి రనియుఁ, జూపఱులెల్ల మెచ్చునట్లు అలంకరించి రనియు భావము.

మ. అలఘుస్వర్ణసుచేలకాప్తి ఘనము◊క్తాళీసమాసక్తి ను
జ్జ్వలపద్మోద్ధృతి వైజయంత్యభియుతిన్ ◊సంధించి యప్పట్టునన్
బలునేర్పు ల్మన శిల్పిరాజి ఘటియిం◊పం బొల్చె నెంతేఁ గురుం
జులచా లచ్యుతరూపవైభవమునన్ ◊సొంపొంది తద్వీథులన్. 4

టీక: అప్పట్టునన్=ఆకాలమునందు; తద్వీథులన్=ఆనగరవీథులయందు; కురుంజులచాలు=గుజ్జులబంతి; శిల్పిరాజి = చిత్తరువు వ్రాయువారియొక్క శ్రేణి; అలఘుస్వర్ణసుచేలకాప్తిన్ – అలఘు=అధికములగు, స్వర్ణ=బంగరుయొక్క, సుచేలక= సమీచీనమగు వలిపెములయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; పీతాంబరముయొక్క యని విష్ణుపరమైన యర్థము; ఘనముక్తావళీ సమాసక్తిన్ –ఘన= గొప్పవయిన, ముక్తా=ముత్యములయొక్క, ఆళీ=శ్రేణియొక్క, సమాసక్తిన్=సంబంధముచేతను; గొప్పవారలగు ముక్తులయొక్క సమూహముయొక్క సంబంధముచేత నని విష్ణుపరమైన యర్థము; ఉజ్జ్వలపద్మో ద్ధృతిన్ –ఉజ్జ్వలపద్మా=శృంగారలక్ష్మియొక్క, ఉద్ధృతిన్=ధారణముచేతను, ప్రసిద్ధశ్రీదేవీధారణముచేత నని విష్ణుపరమైన యర్థము; వైజయంత్యభియుతిన్ – వైజయంతీ=టెక్కె ములయొక్క, అభియుతిన్= సంబంధముచేతను; వైజయంతీ=వనమాలయొక్క, అభియుతిన్ = సంబంధముచేత నని విష్ణుపర మైన యర్థము; సంధించి=కలిగించి; పలునేర్పుల్ =పలువిధములైన జాణతన ములు; మనన్= అతిశయిల్లునట్లు; ఘటియింపన్= నిర్మింపఁగా; అచ్యుతరూపవైభవమునన్ –అచ్యుత=నాశములేని, రూప= శుక్లాదిరూపములయొక్క, వైభవమునన్=అతిశయము చేత; అచ్యుతరూప= విష్ణుమూర్తిస్వరూపముయొక్క, వైభవముచేత నని యర్థాంతరము; సొంపొంది=చెలువు వహించి; ఎంతేన్= మిక్కిలి; పొల్చెన్= ప్రకాశించెను.

అనఁగా నీకురుఁజులచాలు స్వర్ణసుచేలకాదులచే నచ్యుతునిరూపవైభవము నంది విలసిల్లె నని భావము.

చ. సరససుధాప్లుతంబు లగు ◊చక్కనిగోడల శిల్పిరాజి భా
స్వరకనకద్రవప్రతతి ◊వ్రాసినచిత్రపుబొమ్మ లొప్పెఁ ద
త్పరిణయరీతిఁ గాంచ వడిఁ ◊బాటులఁ జేరి వధూటికాసము
త్కరశుభగీతిఁ జొక్కి సుర◊కాంతలు నైశ్చలి నిల్చిరో యనన్. 5

టీక: శిల్పిరాజి =శిల్పకారసమూహము; సరససుధాప్లుతంబులు – సరస=శ్రేష్ఠమైన, సుధా=సున్నముచేత, ఆప్లుతంబులు = తడుపఁబడినవి; అగు చక్కనిగోడలన్=అయినట్టి సుందరములగు కుడ్యములయందు; భాస్వర కనకద్రవ ప్రతతిన్ – భాస్వర= ప్రకాశించుచున్న,కనకద్రవ=బంగరునీరుయొక్క,ప్రతతిన్=సమూహముచే; వ్రాసినచిత్రపుబొమ్మలు= లిఖించిన విచిత్రములగు బొమ్మలు; తత్పరిణయరీతిన్ – తత్=ఆచంద్రికాసుచంద్రులయొక్క, పరిణయరీతిన్=వివాహభంగిని; కాంచన్=చూచుటకు; వడిన్=వేగముచేత; పాటులన్=శ్రమములచే; చేరి=వచ్చి; వధూటికాసముత్కరశుభగీతిన్ – వధూటికా=స్త్రీలయొక్క, సము త్కర =సమూహముయొక్క, శుభగీతిన్=మంగళకరమగు గానముచేత; చొక్కి= పర వశించి; సురకాంతలు=దేవాంగనలు; నైశ్చలిన్ =నిశ్చలత్వముచేత; నిల్చిరో యనన్=నిలుచుండిరో యనునట్లు; ఒప్పెన్ =ప్రకాశించెను.

అనఁగా సున్నముఁ బూసి యున్నగోడలయందుఁ జిత్తరువు వ్రాయువారు బంగరునీటితో వ్రాసినబొమ్మలు, ఆవివాహ మహోత్సవమును జూచుటకై యతివేగముతోఁ జేరుటచే శ్రమనొంది, అచ్చటి యైదువల మంగళగానముచేఁ బరవశించి చలన రహితులై నిల్చియున్న దేవాంగనలో యన్నటులు ప్రకాశించె నని భావము. చిత్తరువునం దుండుబొమ్మలను సురకాంతలుగా నుత్ప్రేక్షించుటచే నుత్ప్రేక్షాలంకారము.

మ. తళుకుం బంగరుకుచ్చుడాలు నవసం◊ధ్య న్నీలగుచ్ఛప్రభా
వళి యిర్లన్ సుమదామదీధితి యుడు◊వ్రాతంబుల న్వజ్రకుం
భలసచ్ఛాయ సితాంశుదీప్తి నిగిడిం◊ప న్శిల్పికు ల్దార్చు మే
రులు ధాత్రిం గన నద్భుతంబె క్షణదా◊రూఢి న్విజృంభించుటల్. 6

టీక: శిల్పికులు=శిల్పులు; తార్చుమేరులు –తార్చు=కదియించునట్టి, మేరులు=ద్వారములమీఁద నుండుకలశములు; ధాత్రిన్= భూమియందు; కనన్=చూడఁగా; తళుకుంబంగరుకుచ్చుడాలు=ప్రకాశించుచున్న బంగరుగుత్తులకాంతి; నవ సంధ్యన్ – నవ= నూతనమగు, సంధ్యన్=సంజను; నీల గుచ్ఛ ప్రభావళి – నీల=ఇంద్రనీలమణులయొక్క, గుచ్ఛ= స్తబక ములయొక్క, ప్రభావళి= కాంతిశ్రేణి; ఇర్లన్=చీఁకట్లను; సుమదామదీధితి=పూసరములయొక్క కాంతి; ఉడువ్రాతంబులన్= రిక్కలగుంపులను; వజ్రకుంభ లసచ్ఛాయ – వజ్రకుంభ=రవలకుండలయొక్క,లసచ్ఛాయ=ప్రకాశించుకాంతి; సితాంశుదీప్తిన్ =చంద్రకాంతిని, వెన్నెల ననుట; నిగిడింపన్=విజృంభింపఁజేయఁగా; క్షణదారూఢిన్—క్షణ=ఉత్సవములను, ద= ఇచ్చునట్టి, ఆరూఢిన్= రూఢిచేత; రాత్రి యొక్క రూఢిచేత నని దోఁచుచున్నది; విజృంభించుటల్=అతిశయించుటలు; అద్భుతంబె= ఆశ్చర్యమా? కాదనుట. అనఁగా బంగరుగుచ్ఛములయొక్క ఎఱ్ఱనికాంతి సంధ్యాకాలమును జేయఁగా, ఇంద్రనీలమణికాంతి తిమిరకదంబమును జేయుచుండఁగా, పూదండలకాంతి నక్షత్రపుంజములను జేయుచుండఁగా, వజ్రకుంభకాంతి వెన్నెలను జేయుచుండఁగా, నీ శిల్పులు రచియించిన మేరులు క్షణదారూఢిచే విజృంభించుట చిత్రము గాదని తాత్పర్యము.

చ. కువలయరాజచక్రములకుం ◊బెనువేడుక సంఘటించుకాం
తివితతి మించ శిల్పికులు ◊దీర్చిన నూతనచంద్రసూర్యకో
టి వెలిఁగె ధూపకైతవప◊టిష్ఠతమస్తతి గాంచి యోర్వ మం
చవనికిఁ జేరు నైకవపు◊రాత్తతమీశదినేశులో యనన్. 7

టీక: కువలయరాజచక్రములకున్ – కువలయ=భూవలయమందుండు, రాజచక్రములకున్=నృపసంఘములకు; కువలయ= కలువలకు, రాజ=ఒప్పుచున్న,చక్రములకున్=చక్రవాకములకు; పెనువేడుకన్=మిక్కిలి సంతసమును; సంఘటించు కాంతి వితతిన్ – సంఘటించు=ఘటిల్లఁజేయునట్టి, కాంతివితతిన్=కాంతిపుంజముచేత; మించన్= అతిశయించునట్లు; శిల్పికులు = శిల్పకారులు; తీర్చిన నూతనచంద్రసూర్యకోటి – తీర్చిన=దిద్దిన, నూతన=నవీనమైన, చంద్రసూర్య=చంద్రసూర్యులయొక్క, కోటి=సమూహము; ధూపకైతవపటిష్ఠతమస్తతిన్ – ధూప=అగరుధూపమనెడు, కైతవ =వ్యాజముగల, పటిష్ఠ=అధికమైన, తమస్తతిన్=చీఁకటిగుంపును; కాంచి=చూచి; ఓర్వ మంచున్=సహింప మనుచు; అవనికిన్=భూమికి; చేరు నైకవపు రాత్త తమీశ దినేశులో యనన్ – చేరు=సమీపించిన, నైకవపుః=అనేకశరీరములను, ఇచట నశబ్దముతో సమాసము అని తెలియ వలెను, ఆత్త =పొందిన, తమీశ దినేశులో=చంద్రసూర్యులో యనునట్లు; వెలిఁగెన్ =ప్రకాశించెను.

శిల్పకారులు చిత్తరువందు వ్రాసిన చంద్రసూర్యులు, ఈపురమందు అగరుధూప మనెడి గాంఢాంధకారమును చూచి సహిం పక పుడమిఁ జేరినట్టి ప్రసిద్ధచంద్రసూర్యులో యనునట్లు ప్రకాశించిరని భావము. చిత్రగతచంద్రసూర్యబింబములను ప్రసిద్ధచంద్ర సూర్యులనుగా నుత్ప్రేక్షించుటచే నుత్ప్రేక్షాలంకారము.

చ. ధరణిజనంబు మెచ్చఁగ ము◊దంబున శిల్పికులంబు చిత్రవై
ఖరిఁ గయిసేయ నప్డలరెఁ ◊గన్గొన నంచితవైజయంతయై
పరిభృతచిత్రరేఖయయి ◊భవ్యమహాసుమనోవితానభా
స్వరయయి దృశ్యరంభయయి ◊చక్కఁగ నప్పురి వేల్పువీఁ డనన్. 8

టీక: ధరణిన్=భూమియందు; జనంబు=లోకము; మెచ్చఁగన్=పొగడునటులు; ముదంబునన్=సంతసముచేత; శిల్పికులంబు = శిల్పకారుల బృందము; చిత్రవైఖరిన్=విచిత్రరీతిగా; కయిసేయన్=అలంకరింపఁగా; అప్డు=ఆసమయమందు; అప్పురి= ఆపత్తనము; అంచిత వైజయంత యై – అంచిత=ఒప్పుచున్న, వైజయంతయై=ఇంద్రునిమేడగలదై; ధ్వజములు గలదై యని స్వభావా ర్థము; పరిభృత చిత్రరేఖ యయి=భరింపఁబడిన చిత్రరేఖ యను దేవాంగన గలదియై, విచిత్రమగు గీఱలు గలదియై యని స్వభావార్థము; భవ్య మహా సుమనోవితాన భాస్వర యయి – భవ్య=మనోజ్ఞమగు, మహత్=అధిక మగు, సుమనో వితాన=దేవసంఘముచేత, భాస్వర యయి =ప్రకాశించినదియై; సుమనోవితాన=పుష్పసమూహముచేతఁ గాని, లేదా, విద్వ ద్బృందముచేతఁ గాని, అని స్వభావార్థము; దృశ్య రంభ యయి – దృశ్య=కనఁబడుచున్న, రంభ యయి = రంభయను దేవాంగన గలదియై, అనటులు గలదై యని స్వభావార్థము; కన్గొనన్=చూడఁగా; చక్కఁగన్= బాగుగా; వేల్పువీఁడనన్= స్వర్గపురియగు నమరావతియో యను నటులు; అలరెన్=ప్రకాశించెను. శిల్పు లలంకరింపఁగా నీపురము వైజయంతరంభా చిత్రరేఖాదులతోఁ గూడి యున్నందున నమరావతి యనునట్లు ప్రకాశించె నని భావము.

మ. ప్రసవస్రక్పరివీతయై పరికన◊త్పాటీరకాశ్మీరగం
ధసముల్లిప్తపయోధరాధ్వయయి నూ◊త్నస్వర్ణచేలాప్తయై
పొసఁగెం దన్నగరీలలామ యపు డొ◊ప్పు ల్మీఱఁ దన్గాంచుమా
త్ర సముత్థాతనుసంభ్రమస్ఫురణ గో◊త్రాలోకము ల్దోపఁగన్. 9

టీక: ప్రసవస్రక్పరివీతయై – ప్రసవస్రక్=పుష్పమాలికలచేత, పరివీతయై=చుట్టఁబడినదియై; పరికన త్పాటీర కాశ్మీర గంధ సముల్లిప్త పయోధ రాధ్వ యయి – పరికనత్=ప్రకాశించుచున్న,పాటీర=చందనముయొక్క, కాశ్మీర=కుంకుమముయొక్క, గంధ=పరిమళముచేత, సముల్లిప్త=పూయఁబడిన,పయోధరాధ్వయయి=ఆకాశముగలదై, స్తనమార్గము గలది యై యని యర్థాంతరము; నూత్న స్వర్ణచే లాప్తయై – నూత్న=నవీనమైన, స్వర్ణచేల=బంగారువస్త్రమును, ఆప్తయై=కూడినదియై; తన్న గరీలలామ=ఆపురవరము, ఇందు స్త్రీత్వనిర్దేశముచేత నొకస్త్రీ యని తోఁచుచున్నది; అపుడు=ఆవేళయందు; ఒప్పుల్మీఱన్ = ఒప్పిదములు మీఱునటులు; తన్గాంచుమాత్రన్=తన్నుఁ జూచినంతమాత్రముననే; సము త్థాతను సంభ్రమ స్ఫురణన్ – సముత్థ= ఉదయించిన, అతను=అధికమైన,సంభ్రమ=సంతోషముయొక్క,స్ఫురణన్=ఆవిర్భావముచేత; అతను=మన్మథునియొక్క, సంభ్రమ=వేగముయొక్క,స్ఫురణన్=ఆవిర్భావముచేత అని తోఁచుచున్నది; గోత్రాలోకముల్=భూమియందలి జనులు; తోపఁగన్=తోఁచుచుండఁగా; పొసఁగెన్=ఒప్పెను. అనఁగా నగరీలలామ హారములచేఁ జుట్టఁబడినదనియు, పాటీరకాశ్మీరాది పరిమళద్రవ్యములయొక్క గంధముచేఁ బూయఁ బడిన గగనమార్గము గలదనియుఁ, దన్నుఁ జూచినమాత్రమున అధికసంభ్రమ మును గలిగించుచున్న దనియు భావము. పటీరాదు లచేఁ బూయఁబడిన స్తనమార్గముగలది యనియు, మన్మథసంభ్రమమును నుత్పాదించుచున్నదనియు స్త్రీపరమైనయర్థమందు భావము.