సీ. భాస్వద్ధరిక్రమో◊పరిగతాంబుధితటో,జ్జ్వలరక్తకవనీర◊జము లనంగ,
నభ్రబింబితచర◊మాగపద్మాకరా,స్థానరోహితనీర◊జము లనంగ,
వనజిని కర్కవ◊ర్తన దెల్ప నెగసి బ,ల్వడి వచ్చు చక్రవా◊లము లనంగ,
రవి నక్రపదముఁ జే◊రఁగ శ్యామఁ బూన్చు ను,త్తమదీపచక్రవా◊లము లనంగ,
తే. తమి నినుఁడు చేర వరకలా◊పము లనంగ, సీమ వారుణి దాల్ప రా◊జిలు తదీయ
విమలమణికావిభాకలా◊పము లనంగ, నహహ నవసాంధ్యరాగమ్ము ◊లపుడు పొలిచె. 95
టీక: అపుడు=సూర్యుఁడు గ్రుంకినసమయమందు; నవసాంధ్యరాగమ్ములు=నూతనములగు సంధ్యాకాలికారుణ్యములు; భాస్వద్ధరిక్రమోపరిగతాంబుధి తటోజ్జ్వల రక్తకవనీ రజములు – భాస్వత్=సూర్యునియొక్క, హరి=గుఱ్ఱములయొక్క, క్రమ = పాదవిక్షేపముచేత, ఉపరిగత=మిన్నందినట్టి, ఇది రజమునకు విశేషణము, అంబుధితటోజ్జ్వల=సముద్రతీరమున వెలయు, రక్తక=మంకెనలయొక్క, వనీ=వనములయొక్క, రజములు=పరాగములు; అనంగన్ = అనునట్లుగా; అభ్రబింబిత చరమాగ పద్మాకరాస్థాన రోహితనీరజములు –అభ్ర=ఆకసమందు, బింబిత=ప్రతిబింబించిన, ఇది నీరజములకు విశేషణము, చరమాగ=అస్తాద్రియందలి, పద్మాకర=కొలనియందు, ఆస్థాన=స్థితిగల, రోహితనీరజములు=ఎఱ్ఱదామరలు; అనంగన్ = అనునట్లుగా; వనజినికి=పద్మలతకు; అర్కవర్తను= సూర్యుని వృత్తాంతమును; తెల్పన్=తెలియఁజేయుటకు; ఎగసి =పైకెగసి, బల్వడిన్ = అతివేగముచే; వచ్చు చక్రవాలములు = వచ్చునట్టి జక్కవలగుంపులు, రేఫలకారముల కభేదముచే వాల మనుచో వారమని భావింపఁ బడియె; అనంగన్ = అనునట్లుగా;రవి నక్రపదముఁ జేరఁగ శ్యామఁ బూన్చు నుత్తమదీపచక్రవాలములు – రవి=సూర్యుఁడు, నక్రపదమున్=సాగరమును; చేరఁగన్ =పొందఁగా, శ్యామ=రాత్రి యనెడు స్త్రీ, పూన్చు=ఉంచునట్టి, ఉత్తమ=శ్రేష్ఠములైన, దీప=దీపములయొక్క, చక్రవాలములు = మండలములు; అనంగన్ = అనునట్లుగా; తమిన్=ఆసక్తిచేత; ఇనుఁడు =సూర్యుఁడను నాయకుఁడు; చేరన్=పొందఁగా; వరకలాపములు=చక్కనిసొమ్ములు; వారుణి = ప్రతీచి, స్త్రీత్వనిర్దేశముచేత నొక స్త్రీ యని తోఁచుచున్నది; అంగసీమన్=దేహప్రదేశమందు; తాల్పన్=ధరింపఁగా; రాజిలు = ప్రకాశించుచున్న; తదీయవిమలమణికావిభాకలాపములు – తదీయ=ఆసొమ్ములకు సంబంధించిన, విమల=స్వచ్ఛములైన, మణికా =మణులయొక్క, విభా=కాంతులయొక్క, కలాపములు=సమూహములు; అనంగన్ = అనునట్లుగా; పొలిచెన్ = ప్రకాశించెను; అహహ= అద్భుతము! అనఁగా సాంధ్యరాగములు సూర్యాశ్వగతివలన గగనతలమంటిన సముద్రతీరపు మంకెనవనములందలి పుప్పొడులవలె నున్నవనియు, చరమాద్రియందలి కొలఁకులందుండి గగనతలమందుఁ బ్రతిఫలించిన యెఱ్ఱదామర లట్లున్నవనియు, సూర్యుఁ డస్తమించె నని పద్మినికిఁ జెప్ప గగనతలమున కెగసి వచ్చుచున్న చక్రవాకముల గుంపులవలె నున్నవనియు, సూర్యుం డస్త మింపఁగా రాత్రి యను స్త్రీ యమర్చిన దీపమండలిని బోలి యున్న వనియు, సూర్యుఁ డను భర్తను జేరఁ బ్రతీచి యను కాంత తాల్చిన సొమ్ములయొక్క స్వచ్ఛమైన మణికాంతులభంగి నొప్పిన వనియు భావము. ఉత్ప్రేక్షాలంకారముల సంసృష్టి.
చ. ఘనకమలోదయం బెడయఁ ◊గాలగతి న్వన మందుచు న్రథాం
గ నలగవాధినేత సనఁ◊గాఁ గడుఁ దత్సతి యాత్మఁ జింత పొం
గ నలఁగ వారి కన్నుఁగవఁ ◊గ్రమ్మఁ దనూస్థలి తాపభోగిచేఁ
గనలఁగ వాడుచు న్నెమకెఁ ◊గాంతునిఁ గాననమండలంబునన్. 96
టీక: ఇందు జక్కవపరమైన యర్థము, నలచక్రవర్తిపరమైన యర్థము గలుగుచున్నవి. ఘనకమలోదయంబు – ఘన=అధిక మగు, కమల=పద్మములయొక్క, లక్ష్మియొక్కయని యర్థాంతరము, ఉదయంబు=ఆవిర్భావము; కాలగతిన్=సంధ్యా వశముచేత; కాల=కలిజన్యమైన,గతిన్=దశావిశేషముచేత నని యర్థాంతరము;ఎడయన్=పాయఁగా;వనము=నీటిని, అడవిని; అందుచున్ = పొందుచు; రథాంగనలగవాధినేత =చక్రవాక మనెడు నలరాజు; చనఁగాన్=పోఁగా; కడున్=మిక్కిలి; తత్సతి= దానిపెంటి, దమయంతి యని యర్థాంతరము; ఆత్మన్=చిత్తమందు; చింత =ఆధ్యానము; పొంగన్=మించఁగా; నలఁగన్ = నలఁతనొందఁ గా; కన్నుఁగవన్=కనుదోయియందు; వారి =అశ్రులు; క్రమ్మన్=పైకుబుకఁగా; తనూస్థలి=దేహప్రదేశము; తాప భోగిచేన్ = సర్పమువంటి సంతాపముచేత; కనలఁగన్=మండుచుండఁగా; వాడుచున్=మ్లానమగుచు; కాననమండలంబునన్ =అరణ్యప్రదేశమునందు; కాంతునిన్=భర్తను; నెమకెన్=వెదకెను. నలార్థమందు, తనూస్థలి, తాపభోగిచేన్=సంతాపకరమగు సర్పముచేత, కనలఁగన్=మండఁగా, వాడుచున్=మ్లానుఁ డగుచు, నలగవాధినేత సనఁగ నని యోజింపవలెను. కానిచో దమ యంతియందుఁ దాపభోగిచేఁ గనలుట సంభవింపక యసంగత మగును.
ఉ. మక్కువ సారసాకరస◊మాజము చేరుచుఁ బట్టఁబూనుఁ బో
జక్కవనాతి మానితని◊జప్రతిబింబము గాంచి భర్తయం
చక్కట పిల్చుఁబో పతి వ◊నావళి కుంజచయంబు దూఱుచున్
జక్కవనాతి మానితత◊సమ్మదసంపద లెల్ల నత్తఱిన్. 97
టీక: జక్కవనాతి =చక్రవాకస్త్రీ; మక్కువన్=ప్రేమచేత; సారసాకరసమాజము=పద్మాకరసమూహము; చేరుచున్=పొందుచు; చక్కన్=బాగుగా; వనాతిమానితనిజప్రతిబింబము – వన=జలమందు, అతిమానిత=మిక్కిలి యొప్పుచున్న,నిజప్రతిబింబము = తనప్రతిబింబమును; కాంచి = చూచి;భర్తయంచున్=తనప్రియుఁ డనుచు; పట్టన్=పట్టుకొనుటకు; పూనుఁబో = యత్నించు జుమీ; అక్కట=ఖేదము (అయ్యో!); వనావళిన్=అరణ్యపంక్తియందు; కుంజచయంబు =పొదరిండ్లగుంపును;తూఱుచున్ = చొచ్చుచు; తతసమ్మదసంపద లెల్లన్—తత=విస్తృతములగు, సమ్మదసంపద లెల్లన్=సంతోషసమృద్ధులన్నింటిని; అత్తఱిన్ = అపుడు; మాని=త్యజించి; పతిన్=ప్రియుని; పిల్చుఁబో=ఆహ్వానము చేయును జుమా!
సూర్యాస్తానంతరమునఁ జక్రవాకస్త్రీ కాసారములచెంతకుఁ బోయి తన ప్రతిబింబమును జూచి భర్తయను తలంపునఁ బట్టఁ బూను ననియు, అరణ్యప్రదేశములయందు పొదలు దూఱుచు సంతోషమును మాని పతిని బిల్చుచుండు ననియు భావము.
సీ. చక్రభయాపాది◊సమయఘనాఘనా,లిసుతనూవ్యక్తమా◊లిన్య మనఁగ,
పరినటచ్ఛివకటీ◊భ్రష్టఘనాఘనా,త్మకదానవాజినాం◊శుక మనంగ,
ద్యుమణిరథాంగహ◊త్యుత్థఘనఘనా,శ్మమయాస్తగిరినితం◊బరజ మనఁగ,
నిశ్శేషబంధకీ◊నికరఘనాఘనా,శ రతీశసృష్టశాం◊బరిక యనఁగఁ,
తే. బ్రకటదివసాత్యయాఖ్యన◊భస్యకాల,కలితసాంద్రఘనాఘన◊కళిక యనఁగ,
నౌర యతినీలదీప్తిజా◊లానుపూర్తి, నమరె నవ్వేళ నిర్వేల◊తిమిరరాశి. 98
టీక: చక్రభయాపాది సమయ ఘనాఘనాలి సుతనూ వ్యక్త మాలిన్యము – చక్ర=చక్రవాక మనెడు రాష్ట్రమునకు, భయాపాది = భయసంపాదకమైన, సమయ=సంధ్యాకాల మనెడు, ఘనాఘనాలి=ఘాతుకపంక్తియొక్క, సుతనూ=దేహములయందు, వ్యక్త=బయలుపడిన, మాలిన్యము =మలినత; అనఁగన్ = అనునట్లుగా; పరినట చ్ఛివకటీ భ్రష్టఘనాఘనాత్మకదాన వాజినాంశుకము – పరినటత్=మిక్కిలి నటించుచున్న, శివ=ఈశ్వరునియొక్క, కటీ = కటిప్రదేశమువలన, భ్రష్ట=జాఱిన, ఘనాఘనాత్మకదానవ=గజాసురునియొక్క, అజిన=చర్మ మనెడు, అంశుకము= వస్త్రము; అనంగన్ = అనునట్లుగా; శివుఁడు ప్రదోషసమయమునఁ దాండవము సల్పుట ప్రసిద్ధము. ద్యుమణి రథాంగ హత్యుత్థ ఘనఘనాశ్మమ యాస్తగిరినితంబ రజము – ద్యుమణి=సూర్యునియొక్క, రథాంగ=రథచక్ర ములచే నైన, హతి=కొట్టుటచేత, ఉత్థ=పుట్టిన, ఇది రజమునకు విశేషణము, ఘనఘనాశ్మమయ=మిగుల గొప్పనైన పాషాణ ములచేత ప్రచురమగు, అస్తగిరినితంబ=అస్తాచలకటకముయొక్క, నితంబ మనఁగా పర్వతముపై చదునుగానుండు ప్రదేశము, ‘కటకో స్త్రీ నితమ్బోద్రేః’ అని యమరుఁడు, రజము =ధూళి; అనఁగన్ = అనునట్లుగా; నిశ్శేషబంధకీ నికర ఘనాఘ నాశ రతీశసృష్ట శాంబరిక అనఁగన్ – నిశ్శేషబంధకీ=అశేషజారిణులయొక్క, నికర=సమూ హముయొక్క, ఘన=అధికమైన, అఘ=పాపముయొక్క, నాశ=నాశముకొఱకు, రతీశసృష్ట=మరునిచే సృజింపఁబడిన, శాంబరిక =మాయ; అనఁగన్ =అనునట్లుగా;ప్రకట దివసాత్యయాఖ్య నభస్యకాల కలిత సాంద్ర ఘనాఘన కళిక – ప్రకట=వ్యక్తమైన, దివసాత్యయాఖ్య=దివసావసానమను పేరు గల, నభస్యకాల=భాద్రపదసమయమందు, వర్షర్తుసమయమం దనుట, కలిత=ఒప్పుచున్న, సాంద్ర=దట్టములగు, ఘనాఘన=వర్షుకాబ్దములయొక్క, కళిక=కాంతి; అనఁగన్ = అనునట్లుగా, ‘ఘనాఘనో ఘాతుకమత్తదన్తినోః నిరన్తరే దానవ వర్షుకాబ్దయోః’ అని విశ్వము; అవ్వేళన్=ఆసమయమునందు; నిర్వేలతిమిరరాశి =అడ్డము లేని చీఁకటిగుంపు; అతినీలదీప్తిజాలానుపూర్తిన్ = మిక్కిలినల్ల నగు కాంతిజాలముయొక్క పరిపూర్ణతచేత; అమరెన్=ఒప్పెను; ఔర=ఆశ్చర్యము!
అనఁగా నప్పుడు చీఁకటులగుంపు చక్రములకు భయముగలిగించునట్టి సంధ్యాకాలమనెడు ఘాతుకసమూహముయొక్క దేహనైల్యమో అనునట్లును, శివుఁడు ప్రదోషసమయమునఁ దాండవము సేయఁగా జాఱిన యతని గజచర్మోత్తరీయమో యను నట్లును, సూర్యరథచక్రంబుల తాఁకుడుచే నస్తాద్రిశిలలు పొడియై రేఁగిన ధూళిపుంజమో యనునట్లును, జారిణుల పాపము పాయుటకై మన్మథుఁడు కల్పించిన మాయయో యనునట్లును, సాయంకాల మనెడు వర్షాకాలమందుఁ దోఁచు మేఘశ్రేణియో యనునట్లును, వెలసె నని తాత్పర్యము.
చ. ఇనుఁ డతిదూరదేశమున ◊కేగఁ దదాగమనంబుఁ గోరి పా
వనజలతాళితాంగపరి◊వారితపంకనికాయయై తమిన్
వనజలతాళి గప్పుఁగలు◊వన్ మధుసూదని నావహించి స
ద్వనజలతాళిగాత్రి కథ ◊వల్కఁగ మోడ్చెఁ బయోజహస్తముల్. 99
టీక: వనజలతాళి=తామరతీవలగుంపు, స్త్రీత్వనిర్దేశమున నొకస్త్రీ యని తోఁచుచున్నది; ఇనుఁడు=సూర్యుం డనెడు భర్త; అతి దూరదేశమునకున్ = మిగుల దూరదేశమునకు; ఏగన్=పోఁగా; తదాగమనంబున్ = ఆ యినునియొక్క రాకను; కోరి = ఇచ్ఛించి; పావన జల తాళితాంగపరివారిత పంకనికాయయై – పావన=పవిత్రమగు, జల=నీటిచేత, తాళిత=తాడిత= కొట్టఁ బడినదై, ఇది పంకమునకు విశేషణము. లడల కభేదమును బట్టి తాళి తాడిత యను యర్థములో వాడఁబడినది, అంగపరివారిత = శరీరమునకుఁ బరివారమువలె నావరించుచున్న, పంకనికాయయై = కర్దమచయ మనెడుపాపసంఘము గలదై; తమిన్ = రాత్రియందు, ఆసక్తిచేత, శ్లిష్టరూపకము; కప్పుఁగలువన్=నల్లకలువయందు; మధుసూదనిన్=లక్ష్మీదేవిని; ఆవహించి = ఆవాహనము చేసి; సద్వనజలతాళిగాత్రి – సత్=శ్రేష్ఠమైన, వనజలతా=వనమందుఁ బుట్టిన లతలయందలి, అళిగాత్రి =భృంగ మను గాయకురాలు; కథ పల్కఁగన్=కథఁ జెప్పఁగా; పయోజహస్తముల్=కమలము లనెడు హస్తములను, పయోజముల వంటి హస్తము లని ప్రోషితపతికాపరమైన యర్థము; మోడ్చెన్=ముకుళించెను.
అనఁగాఁ బ్రోషితభర్తృక దేశాంతరమున నుండు తనభర్తరాకను గోరి పుణ్యతీర్థస్నానముచే గతకల్మషయై, యాసక్తిచేత నొకపద్మమందు లక్ష్మీదేవి నావహించి పూజించి, యొక పుణ్యాంగన కథ చెప్పుచుండఁగాఁ గేలు మోడ్చియుండునట్లు తామర తీవ సూర్యుఁ డస్తమింపఁగా నిర్మలజలముచేఁ గర్దమచయము పోఁగొట్టికొనినదై, రాత్రియందు నల్లగలువయందు శ్రీ నావహించి, తుమ్మెదలు పాడుచుండఁగా పద్మములనెడు హస్తముల మోడ్చె ననుట. సూర్యుఁ డస్తమించినపిదపఁ గమలములు ముకుళించె ననియు, కలువలు సిరి యొప్పార రాజిల్లె ననియు, వానిచెంగట తుమ్మెదలు మ్రోయుచుండె ననియు ఫలితార్థము.
సీ. నటదీశమౌళి ది◊ఙ్నారులు చల్లు మం,గళసితాక్షతజాల◊కంబు లనఁగ,
నచలావపతనవే◊ళాభ్రలగ్నతమఃక,దంబాపగాజాల◊కంబు లనఁగ,
వనరాశి రవి మాధ◊వతఁ దోఁప నంబరా,గమునఁ బొల్చినజాల◊కంబు లనఁగఁ,
దఱి రా శుభము వేల్పు◊తెఱవచాల్ గన నాక,ఘనకుడ్యకృతజాల◊కంబు లనఁగ,
తే. గురుసరశ్శ్రేణిరాజీవ◊కులము నడఁచి, యంబరస్థలి నాఱ ది◊ష్టాఖ్య మైని
కతతి పఱచిన వరజాల◊కంబు లనఁగఁ, జొక్క మగు మింటఁ గనుపట్టె ◊ రిక్క లపుడు. 100
టీక: నటదీశమౌళిన్– నటత్=నటించుచున్న,ఈశ=శివునియొక్క, మౌళిన్=శిరస్సునందు; దిఙ్నారులు=దిక్కులనెడుస్త్రీలు; చల్లు మంగళ సితాక్షత జాలకంబులు – చల్లు=చల్లునట్టి, మంగళ=శుభకరములైన, సితాక్షత=తెల్లని యక్షతలయొక్క, జాల కంబులు=సంఘములు; అనఁగన్=అనునట్లుగా; అచలావపతనవేళాభ్ర లగ్నతమఃకదంబాపగా జాలకంబులు – అచలా=భూమియందు, అవపతనవేళా=పడుటయొక్క సమయమందు, అభ్ర=ఆకసమునందు, లగ్న=సంబంధించిన, తమఃకదంబాపగా=తిమిరసంఘ మనెడు నదియొక్క, జాలకంబులు = బిందువులు; అనఁగన్=అనునట్లుగా; వనరాశిన్=సముద్రమను నరణ్యకదంబమందు, రవి=సూర్యుఁడు, మాధవతన్=విష్ణుత్వ మనెడు వసంతభావముచే, సంధ్య యందు సూర్యుఁడు విష్ణురూపు డనుట యాగమప్రసిద్ధము; తోఁపన్=తోఁపఁగా; అంబరాగమునన్ = అంతరిక్షమనెడు వృక్ష మందు; పొల్చిన=ఉదయించిన, జాలకంబులు =మొగ్గలు; అనఁగన్=అనునట్లుగా; తఱి =సంధ్యాసమయము; రాన్=రాఁగా; వేల్పుతెఱవచాల్=దేవతాస్త్రీసంఘము; శుభము =రాఁబోవు శుభమును; కనన్ = చూచుటకు; నాక ఘనకుడ్య కృత జాలకంబులు – నాక=అంతరిక్షమనెడు, ఘనకుడ్య=గొప్పగోడయందు, కృత=చేయఁ బడిన, జాలకంబులు=గవాక్షములు; అనఁగన్=అనునట్లుగా; గురుసరశ్శ్రేణిన్=గొప్పలగు కాసారముల సంఘమందు; రాజీవకులమున్=పద్మసమూహమను చేపలగుంపును; అడఁచి= అడఁగించి; అంబరస్థలిన్=ఆకాశప్రదేశమందు; ఆఱన్=తడి యాఱుటకు; దిష్టాఖ్య మైనికతతి = కాలమను పేరుగల మత్స్య ఘాతుకులయొక్కగుంపు, మీనశబ్దముపై ‘పక్షిమత్స్యమృగా న్హన్తి’ అను సూత్రముచే ఠక్ప్రత్యయము వచ్చి మైనిక శబ్దమైనది; పఱచిన వరజాలకంబులు= పఱచినట్టి మేలైన వలలు; అనఁగన్=అనునట్లుగా; అపుడు=ఆసమయమున;చొక్కమగు మింటన్ = నిర్మలమగు నాకాశమునందు; రిక్కలు=నక్షత్రములు; కనుపట్టెన్=చూపట్టెను. అనఁగా నపుడు నక్షత్రము లుదయించినవై, సంధ్యాకాలమున నాట్యము సేయుచుండు శివునిశిరమున దిగంగనలు చల్లిన తెల్లనియక్షత లనునట్లును, అంధకారమనెడు నది యాకసమునుండి దిగువఁ బడునపుడు గగనలగ్నములగు జలబిందువు లనునట్లును, వనరాశియందు సూర్యుఁడను వసం తుఁడు తోఁపఁగా గగన మను వృక్షమందుఁ బుట్టిన మొగ్గ లనునట్లును, దేవాం గనలు సంధ్యాసమయము రాఁగాఁ గలిగెడు శుభ మును గన్గొనుటకు గగన మనుకుడ్యమందుఁ జేయఁబడిన గవాక్షము లను నట్లును, సంధ్యాకాల మనెడు మీనఘాతుకతతి సర స్సులయందు రాజీవము లనెడు మత్స్యములఁ బట్టి గగనమం దాఱవేసినవల యన్నట్లును భాసిల్లె నని భావము.