చంద్రికాపరిణయము – 5. తృతీయాశ్వాసము

శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము

తృతీయాశ్వాసము

క. విలసత్కమలాపదయుగ
లలితానుపమానదివ్య◊లాక్షాలక్ష్మో
జ్జ్వలతరకౌస్తుభమణిపి
చ్ఛిలరుచివక్షోవిశాల శ్రీగోపాలా! 1

టీక: విలసత్కమలాపదయుగ లలితానుపమాన దివ్యలాక్షా లక్ష్మోజ్జ్వలతర కౌస్తుభమణి పిచ్ఛిల రుచి వక్షోవిశాల – విలసత్ = ప్రకాశించుచున్న, కమలాపదయుగ =లక్ష్మీపాదయుగళముయొక్క, లలిత=మనోజ్ఞము, అనుపమాన=సాటిలేనిది యగు, దివ్యలాక్షా=లోకోత్తరమగు లత్తుకయొక్క, లక్ష్మ=చిహ్నముచేత, ఉజ్జ్వలతర=మిక్కిలి ప్రకాశమానమగు, కౌస్తుభమణి = కౌస్తుభమను మణివిశేషముచేత, పిచ్ఛిల=దట్టమైన, రుచి=కాంతిగల, వక్షః=ఎదచేత, విశాల=గొప్పవాఁడ వగు, అనఁగా, విశాలవక్షస్స్థలముగల; శ్రీగోపాలా=శ్రీమదనగోపాలస్వామీ! అని కృతిపతిసంబోధనము. దీనికిఁ జిత్తగింపు మను నుత్తరపద్యస్థ క్రియతో నన్వయము.

తే. చిత్తగింపుము శౌనకా◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ◊ర్షణతనూజుఁ
డప్పు డామోద మూని య◊క్షాధిపతి మ
హీంద్రుఁ దిలకించి వెండియు ◊నిట్టు లనియె. 2

టీక: చిత్తగింపుము = అవధరింపుము; శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలుగాఁ గల మహర్షిసంఘమునకు; ఇట్లు =వక్ష్యమాణప్రకారముగ; రోమహర్షణతనూజుఁడు=సూతుఁడు; అనున్=వచించును ;అప్పుడు= ఆ సమయమందు; యక్షాధి పతి=యక్షశ్రేష్ఠుఁడగు కుముదుఁడు;ఆమోదము=సంతసమును, ‘ప్రమో దామోద సమ్మదాః’అని యమరుఁడు;ఊని=వహించి; మహీంద్రున్=సుచంద్రుని; తిలకించి =వీక్షించి; వెండియున్=మఱియు; ఇట్టులు=ఈప్రకారముగ; అనియెన్=పలికెను.

చ. ఇరఁ గల పద్మినీతతుల◊యింపును సొంపు నడంచు మంపునం
గరముఁ బొసంగు చంద్రిక య◊ఖండవిలాసము సన్నుతింపఁగాఁ
దరమె తదీయదీధితివి◊తానము గన్గొనుమాత్రఁ బెంపు దు
ష్కరగతి మించు భూర్యసమ◊కాండగవోదితతాపమండలిన్. 3

టీక: ఇటఁ బ్రస్తుతచంద్రికాఖ్యనాయికాపరమైనయర్థమును, జ్యోత్స్నాపరమైనయర్థమును గలుగుచున్నది.

ఇరన్=భూమియందు, జలమందని వెన్నెలపర మైనయర్థము, ‘ఇరా భూ వాక్సురాప్సు స్యాత్’అని యమరుఁడు; కల పద్మినీ తతులయింపును=కలిగినట్టి పద్మినీజాతిస్త్రీలయొక్క యానందమును, తామరతీవలయొక్క యానందము నని జ్యోత్స్నాపర మైనయర్థము; సొంపును=సౌందర్యమును; అడంచు మంపునన్=అడఁగించు మదముచే; కరమున్=మిక్కిలి; పొసంగు చంద్రిక అఖండవిలాసము =ఒప్పుచున్న చంద్రికయొక్క యవిచ్ఛిన్నమైన విలాసము, వెన్నెలయొక్క యఖండ విలాస మని యర్థాంత రము; సన్నుతింపఁగాన్=కొనియాడఁగా; తరమె =శక్యమా? తదీయదీధితివితానము – తదీయ = ఆ చంద్రికయొక్కయు, వెన్నెలయొక్కయు, దీధితివితానము=కాంతిపుంజము; కన్గొనుమాత్రన్ =అవలోకించునంతనే; దుష్కర గతిన్=అశక్యమగు రీతిచే; మించు=అతిశయించునట్టి; భూర్యసమకాండగవోదితతాపమండలిన్ – భూరి=అధికమయిన, అసమకాండ=విషమ బాణుఁడైన (అనఁగా, బేసిసంఖ్యగల బాణములు గల) మరునియొక్క, సప్తాశ్వుఁడైన సూర్యునియొక్క యని యర్థాంతరము, ‘కాణ్డో స్త్రీ దణ్డ బాణార్వ’ యని యమరుఁడు, గో=బాణములచేతను, కిరణములచేత నని యర్థాంతరము, ‘స్వర్గేషు పశు వా గ్వజ్రదిఙ్నేత్ర ఘృణి భూ జలే, లక్ష్య దృష్ట్యా స్త్రియాం పుంసి గౌః’ అని యమరుఁడు. గో+ఉదిత యనుచోట గోశబ్దముమీఁది ఓకారమునకు అవఙాదేశము వచ్చి ‘గవోదిత’ అని యయ్యె, ఉదిత=ఉదయించిన, తాపమండలిన్ =సంతాపాతిశయమును, వేఁడియొక్క యతిశయము నని వెన్నెలపరమైనయర్థము; పెంపున్=పోషించును, నశింపఁజేయు నని యర్థాంతరము.

అనఁగాఁ జంద్రికాఖ్యనాయిక భూమియందుఁ గలపద్మినీజాతిస్త్రీలలో నుత్తమురా లనియు, ఆమె దేహకాంతి యవలో కించినంతనే స్మరోద్దీపన మగుననియుఁ దాత్పర్యము. వెన్నెల జలమందున్న తామరతీవల యింపుసొంపుల నడంచుననియు, ఆతపబాధ శమింపఁజేయు ననియు నర్థాంతరమందుఁ దాత్పర్యము. ప్రకృతాప్రకృతార్థముల కౌపమ్యము గమ్యము.

సీ. నెలఁత చన్గవదారి ◊నెఱికొప్పు కటియొప్పు, ఘనచక్రవైఖరి ◊నని నడంచుఁ,
గొమ్మ కన్నులరాణ ◊నెమ్మోము మెడగోము, కలితాబ్జమహిమంబుఁ ◊దలఁగఁ జేయు,
సకి నుందొడలరీతి ◊చికురాళి నఖపాళి, సుకలభోర్జితజయ◊స్ఫూర్తి నలరుఁ,
జెలి వలగ్నాభ ప◊ల్కులతీరు నూఁగారు, హరిమదాపహవృత్తి ◊నతిశయిల్లు,

తే. నహహ! త్రైలోక్యవర్ణనీ◊యాజరాంగ, నావతారవిలాసాప్తి ◊నడరు కతన
మహిప! పాంచాలరాట్సుతా◊మంజులాంగ,కాంతి చిత్రకరస్థేమఁ ◊గాంచు టరుదె? 4

టీక: నెలఁత చన్గవదారి – నెలఁత=చంద్రికయొక్క, చన్గవ=స్తనయుగ్మముయొక్క, దారి=పద్ధతి; నెఱికొప్పు =అందమైన కేశబం ధము; కటియొప్పు=పిఱుందులయందము; ఘనచక్రవైఖరిన్ = గొప్పవి యైన జక్కవలరీతిని, మేఘసంఘముయొక్కరీతిని; ఘనచక్రవైఖరిన్—ఘన=గొప్పవియైన, చక్ర=బండికండ్లయొక్క, వైఖరిన్=రీతిని; అనిన్=పోరునందు; అడంచున్=అడఁగఁ జేయును. అనఁగాఁ జంద్రికయొక్క చన్గవదారి ఘనములైన జక్కవలరీతిని, కొప్పు మేఘసంఘపురీతిని, పిఱుందులు గొప్పవగు బండికండ్లరీతిని జయించు నని యథాసంఖ్యముగా నన్వయము. కొమ్మ కన్నులరాణ =చంద్రికయొక్క నేత్రములయొప్పిదము; నెమ్మోము =అందమగు ముఖము; మెడగోము =కంఠసౌకు మార్యము; కలితాబ్జమహిమంబున్ – కలిత=ఒప్పుచున్న, అబ్జ=కమలముయొక్క, చంద్రునియొక్క, శంఖముయొక్క, మహిమంబున్ =అతిశయమును; తలఁగన్=తొలఁగునట్లుగా; చేయున్. ఆమె కన్నులు కమలముయొక్కయు, మోము చంద్రునియొక్కయు, కంఠము శంఖముయొక్కయు మహిమను దలఁగఁజేయు నని తాత్పర్యము. సకి=చంద్రికయొక్క, నుందొడలరీతి=నునుపగు తొడలవైఖరి; చికురాళి=కుంతలపంక్తి; నఖపాళి=నఖములయొక్క పంక్తి; సుకలభోర్జితజయస్ఫూర్తిన్ – సు=లెస్సయైన, కలభ=కరబహిర్భాగముయొక్క, తుమ్మెదలయొక్క, ‘కలభః కరపార్శ్వే స్యా ద్భ్రమరే కరిశాబకే’అని విశ్వము, సుకల=మంచిప్రకాశము గల, భ=నక్షత్రములయొక్క, ‘నక్షత్ర మృక్ష భం తారా’ అని యమరుఁడు, ఊర్జిత=అతిశయించిన, జయ=గెలుపుయొక్క, స్ఫూర్తిన్ =ప్రకాశముచేత; అలరున్=ఒప్పును. ఆమెతొడలు కరబహిర్భాగముయొక్కయు, కేశములు తుమ్మెదలయొక్కయు, గోళ్ళు నక్షత్రములయొక్కయు గెలుపుచేత నమరుచున్న వని తాత్పర్యము. చెలి =చంద్రికయొక్క; వలగ్నాభ=మధ్యప్రదేశముయొక్కకాంతి; పల్కులతీరు =వచనభంగి; నూఁగారు=రోమావళి; హరి మదాపహవృత్తి న్ – హరి=సింహముయొక్కయు, చిలుకయొక్కయు, సర్పముయొక్కయు, మదాపహవృత్తి న్ =గర్వము నడంచు వర్తనచేత; అతిశయిల్లున్ =మించును. ఆమెనడుము సింహమును, పలుకు చిలుకను, నూఁగారు సర్పమును, బోలిన దనుట. అహహ=ఆశ్చర్యము! మహిప=సుచంద్రుఁడా! పాంచాలరాట్సుతామంజులాంగకాంతి =పాంచాలరాజపుత్త్రియైన చంద్రిక యొక్క మనోజ్ఞమగు దేహకాంతి; త్రైలోక్య వర్ణనీయాజరాంగనావతార విలాసాప్తి న్ – త్రైలోక్య=లోకత్రయముచేత, వర్ణ నీయ= కొనియాడఁదగిన, అజరాంగనావతార=దేవాంగనావతారముయొక్క, విలాస=విలాసముయొక్క, ఆప్తిన్=పొందిక చేత; అడరు కతన =ఒప్పుటవలన; చిత్రకరస్థేమన్=ఆశ్చర్యమగు స్థితిని; కాంచుట=పొందుట; అరుదె=ఆశ్చర్యమా?

అనఁగాఁ జంద్రిక ముల్లోకములచేత వర్ణనీయమైన విలాసమును బొందినది గావున నామెకు ఘనచక్రాదిజయము గల స్తన యుగ్మ కేశపాశ కటిస్థలాదులు మూఁడేసి యవయవములు గలిగియుండుట యాశ్చర్యము గాదని తాత్పర్యము. ఇట మంజు లాంగకాంతి యనుచోట ‘శోభైవ కాన్తి రాఖ్యాతా మన్మథాప్యాయితోజ్జ్వలా, సా శోభా రూపభోగాద్యై ర్యత్స్యాదఙ్గవిభూషణ’ మ్మని కాన్తి లక్షణమును, మెడగోము అనుచోట ‘యత్స్పర్శాసహతాఙ్గేషు కోమలస్యాపి వస్తునః, తత్సౌకుమార్యమ్’ అని సౌకుమార్యలక్షణమును దెలియవలయు.

చ. సమరహితాత్మమై యతను◊సాయకశక్తి భరించు నాసుదే
హమెఱుఁగుమేనితోఁ గడు ఘ◊నాళి సహాయముఁ గన్న చంచలౌ
ఘము పగ లొందిన న్విగత◊కాంతిక మౌ ననఁ దద్విహీనతా
క్రమమున మించు చంపకము ◊గాంచునె సొంపు విరోధ మూనినన్. 5

టీక: సమరహితాత్మమై = యుద్ధమునకు హితమయిన స్వరూపము కలదై, సమరహిత= సమమైనదానిచే రహితమైన, అనఁగా సాటిలేని, ఆత్మమై = స్వరూపము గలదై యని యర్థాంతరము; అతనుసాయకశక్తిన్ = అధికములగు బాణములయొక్క శక్తిని, మరునితూపనెడు శక్తిని నని యర్థాంతరము, ‘రమ్యం హర్మ్యతలం నవాస్సునయనా గుఞ్జద్విరేఫా లతాః ప్రోన్మీల న్నవ మల్లికాసురభయో వాతా స్సచన్ద్రాః క్షపాః, యద్యేతాని జయన్తి హన్త పరిత శ్శస్త్రా ణ్యమోఘాని మే’ అని మరునికి వనితయు సాయకముగాఁ జెప్పఁబడినది; భరించు నాసుదేహమెఱుఁగుమేనితోన్ = ధరించునట్టి యాచంద్రికయొక్క ప్రకాశించునంగము తోడ, దీనికిఁ బగలొందిన ననుదానితో నన్వయము; కడున్=మిక్కిలి; ఘనాళిన్ – ఘన=గొప్పవారలయొక్క, మేఘముల యొక్క యని యర్థాంతరము, ఆళిన్=సమూహమును; సహాయమున్=తోడునుగా; కన్నచంచలౌఘము = పొందిన విద్యు త్సమూహము; పగ లొందినన్=వైరముల నొందినచో, దివసము నొందినచో నని యర్థాంతరము; విగతకాంతికము ఔన్ అనన్ = కాంతిహీనమగు ననఁగా; తద్విహీనతాక్రమమున మించు చంపకము –తత్=ఆఘనాళిచేత, అనఁగా గొప్పదైన తుమ్మెదచేత, విహీనతా=రాహిత్యముయొక్క, క్రమమునన్=రీతిచేత, మించు = గర్వించు, చంపకము =సంపెఁగతీవ; విరోధము=వైరము; ఊనినన్ = పొందినచో; సొంపున్=అందమును; కాంచునె=వహించునా?

అనఁగా సమరసన్నద్ధమై యనేకబాణసంత్తితోఁ గూడుకొన్న యామెదేహముతో ఘనాళిసాహాయ్యము నొందిన మెఱుపే పగలొందినచో గెలువనపుడు అట్టి ఘనాళి సాహాయ్యము లేనిచంపకము విరోధ మూనినయెడల గెలువఁజాలదని చెప్పవలసి నది లేదనుట. ఆమె దేహము సాటిలేని దనియు, మదనోద్దీపకమనియు, మెఱుపుఁదీవయు సంపెంగతీవయు సాటి యనుట సంభావింపఁ దగదనియు భావము. ఇందుఁ జంద్రిక యొక్క దేహలత వర్ణింపఁబడియె. ఇట్లు చెప్పుటచేత లోకోత్తరలావణ్యాతి శయము చంద్రికాదేహమునందుఁ జెప్పఁబడినది. ‘ముక్తాఫలేషు చ్ఛాయాయా స్తరళత్వ మివాన్తరా, ప్రతిభాతి యదఙ్గేన లావణ్యం తదిహోచ్యతే’ అని లావణ్యలక్షణము దెలియవలయు.

మ. జగతీనాయక కన్యపాదనఖముల్ ◊సజ్జాలకత్రాణమా
న్యగతిం జేకొని లోకవర్ణ్యవిధుకాం◊తాకారసంపత్తి మిం
చఁగ ముత్యంబులు శుక్తికాతటిఁ దప◊శ్చర్య న్విజృంభించి హె
చ్చగు తాద్రూప్యముఁ బొందెఁ గానియెడ ము◊క్తాభిఖ్య యెట్లబ్బెడిన్. 6

టీక: జగతీనాయక=సుచంద్రుఁడా! కన్యపాదనఖముల్=చంద్రికయొక్క పాదములయొక్క గోరులు; సజ్జాలకత్రాణమాన్య గతిన్ – సజ్జాలక=సత్పురుషుల సమూహముయొక్క, శ్రేష్ఠములైన మొగ్గలయొక్క యని యర్థాంతరము, త్రాణ=రక్షణము చేత, మాన్య =పూజ్యమగు, గతిన్ =స్థితిని; చేకొని =గ్రహించి;లోకవర్ణ్యవిధుకాంతాకారసంపత్తిన్ – లోకవర్ణ్య=లోకముచేఁ గొని యాడఁ దగిన, విధు=విష్ణుమూర్తియొక్క, కాంత=మనోహరమైన, ఆకార=ఆకృతియొక్క, సంపత్తిన్=సంపదచేత, ‘విధు ర్విష్ణౌ చంద్రమసి’ అని యమరుఁడు; విధుకాంతా=నక్షత్రములయొక్క, ఆకారసంపత్తిన్=ఆకృతిసంపత్తుచేత నని యర్థాంత రము;మించఁగన్=అతిశయింపఁగా; ముత్యంబులు=మౌక్తికములు;శుక్తికాతటిన్ =శుక్తికయను నదియొడ్డున, ముత్యపు చిప్పలదరి నని యర్థాంతరము; తపశ్చర్యన్=తపముఁజేయుటచేత; విజృంభించి =అతిశయించి; హెచ్చగు తాద్రూప్యమున్= ఉత్కృష్టమగు తత్ (ఆగోరులయొక్క)రూపము కల్గియుండుటను;పొందెన్=పొందెను; కాని యెడన్ = అటుగానిచో; ముక్తా భిఖ్య=మోక్షమును బొందినవను పేరు; ఎట్లబ్బెడిన్ = ఏవిధముగ లభించును?

అనఁగా ముత్యములు శుక్తికానదీతీరమునఁ దపముఁ జేసి చంద్రికానఖసారూప్యముక్తిని గాంచినవి గావుననే ముక్తాఖ్య నొందినవి, కానిచో నొందఁజాల వనుట. చంద్రికాపాదనఖములు మొగ్గలను, నక్షత్రములను బోలియున్నవని భావము. ఇట నఖములు వర్ణితంబు లయ్యె. చిత్రరేఖావతారరూప యగుటం జేసి చంద్రిక దేవతాత్మ గావున ‘మానవా మౌళతో వర్ణ్యా దేవా శ్చరణతః పునః’ అను కవికులనియమము ననుసరించి నఖాదిగా వర్ణించుట యని తెలియవలయు.

చ. అనిశవిభాసితాత్మమృదు◊తారుణతాజితపల్లవాభ యై
తనరువెలందిపాదరుచిఁ ◊దమ్ము లిరం గమలాప్తుగోక్రమం
బునఁ గని మించఁగాదె సిరి ◊పూని కరమ్ములఁ జక్క నొత్తు లో
చనములు గంతుకేళివిధి◊జక్లమదారణదంభధీగతిన్. 7

టీక: అనిశ విభాసి తాత్మ మృదుతారుణతా జిత పల్లవాభ యై – అనిశ=ఎల్లపుడును, విభాసిత=ప్రకాశించుచున్న, ఆత్మ=తన సంబంధి యగు, అనఁగా పాదసంబంధి యగు, మృదుతా=మార్దవముచేతను, అరుణతా=ఎఱ్ఱఁదనముచేతను, జిత=జయింపఁ బడిన, పల్లవ=చిగురుటాకులయొక్క, ఆభ యై =కాంతి గలదై, అనఁగాఁ బల్లవములందు మ్రదిమారుణ్యములు సర్వకాలము నందు నుండునవి గావు కావునఁ బాదరుచిచే నవి యోడింపఁబడిన వనుట. ఇట్లు చెప్పుటచేఁ జంద్రికాపాదములయందు మార్ద వాతిశయము గదితం బయ్యె. ‘స్పృష్టం యత్రాఙ్గ మస్పృష్ట మివ స్యా న్మార్దవం హి తత్’ అని తల్లక్షణంబు. ఆరుణ్యోక్తిచే ద్వితీయయౌవనము గదిత మగు. ‘స్తనౌ పీనౌ తను ర్మధ్యః పాణౌ పాదే చ రక్తిమా, ఊరూ కరికరాకారావఙ్గం వ్యక్తాఙ్గసన్ధికమ్| నితమ్బో విపులో నాభి ర్గభీరా జఘనం ఘనమ్, వ్యక్తా రోమావళి స్స్నైగ్ధ్య మఙ్గకే లలితాక్షిణీ| ద్వితీయే యౌవనే’ అని రసార్ణవ సుధాకరమందుఁ దల్లక్షణం బెఱుంగునది; తనరువెలందిపాదరుచిన్ =ప్రకాశించునట్టి చంద్రికయొక్క పాదకాంతిని; తమ్ములు = తోఁబుట్టువులు, పద్మములని యర్థాంతరము; ఇరన్=భూమియందు, ఉదకమందు; కమలాప్తుగోక్రమంబునన్ =విష్ణుమూర్తి యొక్క వచనక్రమముచేత, విష్ణువుయొక్కవరప్రదానముచేత ననుట, సూర్యకిరణసంచారముచేత నని యర్థాంతరము; కని = పొంది; మించన్ కాదె = మించుటచేతఁగదా! సిరి =లక్ష్మి; కరమ్ములన్=హస్తములయందు; పూని=వహించి; లోచనములు = నేత్రములను; కంతు కేళివిధి జ క్లమ దారణ దంభధీ గతిన్ – కంతుకేళివిధి=అనంగక్రీడావిధానమువల్ల, జ=పుట్టినట్టి, క్లమ= శ్రమముయొక్క, దారణ= పోఁగొట్టుటయొక్క, దంభధీ=వ్యాజబుద్ధియొక్క, గతిన్ =ప్రాప్తిచేత; చక్కన్=బాగుగా; ఒత్తున్= ఒత్తుకొనును.

అనఁగా నెల్లపుడు రాజిల్లు తనమార్దవారుణ్యములచేఁ బల్లవకాంతి నోడించిన చంద్రికాపాదరుచిని, తమ్ములు అనఁగాలక్ష్మీ సహోదరములగు తామరసములు విష్ణుమూర్తివరముచేత గ్రహించెనని సిరి సంతసించుచుఁ గంతుకేళిపరిశ్రమాపనోదనవ్యాజ మునఁ గన్ను లొత్తుకొనుచున్న దనుట. చంద్రికాపాదములు పల్లవములకన్న మార్దవారణ్యములు గల వనియు, పద్మములు సూర్యకిరణప్రచారముచే నట్టివానికాంతిని బొందిన వనియు భావము. లక్ష్మీదేవి పద్మహస్త యగుట, ‘నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాఙ్గళ్యయుక్తా’ యని ప్రసిద్ధము. ఇట్లు సిరి పద్మహస్త యగుటకు, పద్మములు చంద్రికాపాదమ్రది మారుణ్యములను బొందుట హేతువు గాకున్నను, హేతువుగాఁ జెప్పుటవలన హేతూత్ప్రేక్షాలంకారము. ఆమ్రదిమారుణ్యము లకు భగవత్ప్రసాదైకలభ్యత చెప్పుట లోకోత్తరత్వానితరసాధ్యత్వాదిప్రతీత్యర్థ మని తెలియునది.