చంద్రికాపరిణయము – 6. చతుర్థాశ్వాసము

మ. అలరెన్ జైత్రబలాధినేత మదసా◊రంగాళి సద్వాజిమం
డలి రాగంబున మించుక్రొందళములన్ ◊రమ్యాత్మఁ జేకూర్పఁగాఁ
గలనాదారి తమీన మారుతయుతిన్ ◊గంజాస్త్రుఁ డుద్యత్సహః
కలనా దారిత మీనదృక్పురుష జా◊గ్రద్ధైర్యుఁడై యయ్యెడన్. 39

టీక: అయ్యెడన్=అపుడు; చైత్రబలాధినేత= వసంతుఁడనెడు పడవాలు; మదసారంగాళిసద్వాజిమండలి – మదసారంగాళి= మదించిన తుమ్మెద లనెడు మదపుటేనుఁగులయొక్క, ఆళిన్=పంక్తిని; సద్వాజిమండలిన్=శ్రేష్ఠములగు పక్షులనెడు గుఱ్ఱముల గుంపును; రాగంబునన్=రక్తిమ యనెడు క్రోధముచేత; మించుక్రొందళములన్ = అతిశయించు చిగురాకులనెడు క్రొత్త సైన్యము లను; రమ్యాత్మన్=మంచిమనస్సుచేత; చేకూర్పఁగాన్=ఘటిల్లఁజేయఁగా; కంజాస్త్రుఁడు=మరుఁడు; కలనాదారితమీనమా రుతయుతిన్ – గలనాద=కోయిలలయొక్కయు, అరి=జక్కవలయొక్కయు, తమీన=చంద్రునియొక్కయు, మారుత= మలయవాతముయొక్కయు, యుతిన్=ప్రాప్తిచేత; ఉద్యత్సహఃకలనాదారితమీనదృక్పురుషజాగ్రద్ధైర్యుఁడు ఐ – ఉద్యత్= పుట్టుచున్న, సహః=బలముయొక్క, ‘సహో బల శౌర్యాణి స్థామ శుష్మం చ’ అని యమరుఁడు, కలనా=ప్రాప్తిచేత, దారిత= చీల్పఁబడిన, మీనదృక్=స్త్రీలయొక్కయు, పురుష=పురుషులయొక్కయు,జాగ్రత్=నిస్తంద్రమైన, ధైర్యుఁడు ఐ = దైర్యము గల వాఁడై; అలరెన్ = ఒప్పెను.
అనఁగా మరుఁడు తనసేనాధిపతియగు వసంతుఁడు సారంగరాజిని, క్రొందళములను గూర్పఁగా దాను మలయానిల చంద్రాదులతోఁ గూడి స్త్రీపురుషుల ధీరత్వము నుడిగించె ననుట.

మ. కలకంఠీకులపంచమస్వరగృహ◊త్కాంతారవారంబులన్
దలిరా కాకమలేశ్వరాత్మజ మహ◊స్త్వంబున్ సుమచ్ఛాయకం
దలి రాకాకమలేశ్వరాత్మజ మహ◊స్త్వంబున్ గడుం బూని క
న్నుల కుద్వేలభయంబు గూర్ప మఱి పాం◊థుల్ గుంది రప్పట్టునన్. 40

టీక: అప్పట్టునన్=ఆసమయమందు; కలకంఠీకులపంచమస్వరగృహత్కాంతారవారంబులన్ – కలకంఠీకుల=కోకిలస్త్రీల గుంపులయొక్క, పంచమస్వర=తజ్జాతినియత మగు పంచమరాగమునకు, గృహత్=గృహమువలె నాచరించుచున్న, ఆశ్రయ మైన యనుట, కాంతారవారంబులన్=అరణ్యసమూహములయందు; తలిరాకు=చిగురుటాకు; ఆకమలేశ్వరాత్మజ మహస్త్వంబున్ – ఆకమలేశ్వరాత్మజ=ఆలక్ష్మీపతియైన విష్ణువుయొక్క తనూజుఁడైన మన్మథునియొక్క, మహస్త్వంబున్= ప్రతాపభావమును; సుమచ్ఛాయకందలి –సుమ=కుసుమములయొక్క, ఛాయ=కాంతులయొక్క,కందలి=మొలక, ఇట ‘ఛాయా బాహుల్యే’ అను సూత్రముచేత ఛాయాశబ్దమునకు నపుంసకత్వము; రాకాకమలేశ్వరాత్మజమహస్త్వంబున్ = పూర్ణిమాచంద్ర ప్రకాశభావమును, కమలేశ్వరుఁడనగా జలాధిపతియగు సముద్రుడు, అతని యాత్మజుఁడు చంద్రుఁడు,‘సలిలం కమలం జలమ్’ అనియు, ‘పూర్ణే రాకా నిశాకరే’ అనియు నమరుఁడు; కడున్=మిక్కిలి; పూని=వహించి; కన్నులకున్= చూపులకు; ఉద్వేలభయంబున్=అధికమైన వెఱపును; కూర్పన్=ఘటిల్లఁజేయఁగా; పాంథుల్=తెరువరులు; మఱి=మిగు లను; కుందిరి= దుఃఖిం చిరి. అడవులయందుఁ గోకిలాలాపములు, నవపల్లవములు, కుసుమస్తోమకాంతియుఁ బాంథులకు దుస్సహములై ప్రియావియోగదుఃఖము నతిశయింపఁ జేసె ననుట.

తే. అలవసంతంబున రహించెఁ ◊దిలక భాస
మాన హిందోళగీత ని◊స్వాన, మహిమ
దీప్త్యుదయకాల గాయికా◊తిలక గీయ,
మాన హిందోళగీత ని◊స్వానమహిమ. 41

టీక: అలవసంతంబునన్=ఆవసంతర్తువునందు; తిలకభాసమానహిందోళగీతనిస్వానము – తిలక=బొట్టుగులయందు, భాస మాన=ప్రకాశించుచున్న, హిందోళ=తేఁటులయొక్క, గీత=పాటలయొక్క,నిస్వానము=ధ్వని; అహిమదీప్త్యుదయకాల గాయికాతిలక గీయమానహిందోళగీతనిస్వానమహిమన్ – అహిమదీప్తి = సూర్యునియొక్క, ఉదయకాల=ఉదయించు కాలమందు, గాయికాతిలక=మంచిపాట నేర్చిన స్త్రీలచేత, గీయమాన=పాడఁబడుచున్న, హిందోళ=హిందోళమను రాగ విశేషముయొక్క, ‘హిందోళౌ రాగ మధుపౌ’ అని విశ్వము, గీత=గానములసంబంధియగు, నిస్వాన=ఆలాపముయొక్క, మహిమన్ = అతిశయముచేత, రహించెన్=ఒప్పెను. ఈపద్యమున నిస్వానపదము పునరుక్తమైనను దోషంబు కాదు. ఇందులకు ‘యమకాది ష్వదుష్టం స్యాన్నిహతార్థ న్నిరర్థకమ్,నదుష్టః పునరుక్తశ్చ విశేషావగమో యది’ అని సాహిత్య చింతామణి చూడవలయు.

చ. నెలవున రాగసంపద వ◊నీరమ చారుపికారవంబునన్
దెలిసి వసంతురాక, సుమ◊నీర మహోర్మికఁ దాన మూన్చి, పూ
ని లలితసుచ్ఛదాళి, నళి◊నీరమణీయసరంబు లూని, మేల్
నెలవునఁ బొల్చెఁ, గుంజభవ◊నీరమమాణశుకీసఖీవృతిన్. 42

టీక: వనీరమ=వనలక్ష్మి; చారుపికారవంబునన్ – చారు=మనోజ్ఞమగు, పికారవంబునన్=కోకిలస్వనమువలన; వసంతురాక = వసంతుఁడను ప్రియునియొక్క రాకను; తెలిసి=తెలిసికొని; నెలవునన్=పరిచయముచేత; రాగసంపదన్=రక్తిమ యనెడు ననురాగముయొక్క సమృద్ధిచేత; సుమనీర మహోర్మికన్ – సుమనీర=పుష్పరసముయొక్క, మహోర్మికన్=నదియందు; తానము ఊన్చి = స్నానముఁజేసి; లలితసుచ్ఛద=మంచియాకు లనెడు వస్త్రములయొక్క, ఆళిన్=పంక్తిని; పూని=ధరించి;
అళినీరమణీయసరంబులు – అళినీ=ఆఁడుతుమ్మెదలనెడు, రమణీయ=అందమైన,సరంబులు=పేరులు; ఊని=ధరించి; కుంజభవనీ రమమాణ శుకీసఖీ వృతిన్ – కుంజభవనీ=పొదరిండ్లయందు, రమమాణ=విహరించుచున్న, శుకీ=ఆఁడుచిల్క లనెడు, సఖీ=చెలియలయొక్క, వృతిన్=వ్యాప్తిచేత; మేల్ నెలవునన్=మంచినివాసస్థానమునందు; పొల్చెన్= ప్రకాశించెను.

ఇచట వనలక్ష్మి యనెడు స్త్రీ పికారవములచే వసంతుఁడను ప్రియునిరాక తెలిసికొని స్నానముఁ జేసి, శుభ్రవస్త్రములను, రమణీయమగు హారములను దాల్చి, సఖీజనముతోఁ గూడి, కేళీగృహమున విలసిల్లె నని చెప్పుటచేత వనలక్ష్మియందు వాసక సజ్జాధర్మము వ్యక్తం బగుచున్నది. ‘ప్రియాగమనవేళాయాం మణ్డయన్తీ ముహుర్ముహుః, కేళీగృహం తథాత్మానం సా స్యా ద్వాసకసజ్జికా’ అని వాసకసజ్జాలక్షణము.

సీ. రమ్యపున్నాగోర్వ◊రాజాతిసౌరభా,రూఢి పై నలమ మా◊రుతము నిగుడ,
రసఁ బల్లవరుచిధా◊రాజాతిసౌరభా,గారితవంజులా◊గములు దోఁపఁ,
బ్రబలు సంభ్రమ మెచ్చ ◊రాజాతిసౌరభా,వలినివాసి శుకౌఘ◊ములు నటింప,
రాజత్పికాబ్జక◊రాజాతిసౌరభా,నేహోర్పితారావ◊నియతి మెఱయ,

తే. నధ్వగులు గుంది రధికతా◊పార్చి పఱవఁ, గాననంబుల నపుడు చ◊క్కనిప్రియాళి
కాననంబులఁ గాంచు మో◊హంబు లాత్మ,కాన నంబుల మారుఁ డుద్ధతి నటింప. 43

టీక: రమ్యపున్నాగోర్వరాజాతిసౌరభారూఢి – రమ్య=మనోజ్ఞములగు,పున్నాగోర్వరాజ=పున్నాగవృక్షములయొక్క, ‘ఉర్వరాజ’ మనఁగా వృక్షమని యర్థము. ‘ఉర్వరా సర్వసస్యాఢ్యా’ అని యమరుఁడు. అందుచే, ఉర్వరా యనఁగా భూమి, ఉర్వరాజ మనఁగా భూమిజము = వృక్షమని యర్థము, అతిసౌరభ=అధికపరిమళముయొక్క, ఆరూఢి=అతిశయము; పైన్=మీఁదికి; అలమన్=కవియునట్లు; మారుతము = సమీరము; నిగుడన్=వీవఁగా, రసన్ = భూమియందు, ‘రసా విశ్వమ్భరా స్థిరా’ అని యమరుఁడు; పల్లవ రుచిధారా జాతి సౌరభాగారిత వంజులాగములు – పల్లవ=చిగురులయొక్క, రుచిధారా=కాంతిపరంపరలయొక్క, జాతి=సామాన్యమనెడు, సౌర=సూర్యసంబంధి యైన, భా= కాంతికి, ఆగారిత=గృహమువలె నాచరించుచున్న, వంజులాగములు=వకుళవృక్షములు; తోఁపన్=చూపట్టఁగా, ప్రబలుసంభ్రమము=అధికమైనసంతోషము; ఎచ్చన్=అతిశయింపఁగా; రాజాతిసౌర భావలి నివాసి శుకౌఘములు – రాజ = రేలపూవులయొక్క, అతిసౌరభ=అధికపరిమళముయొక్క, ఆవలి=పంక్తియందు, నివాసి=నివసించుచున్న,శుకౌఘములు = చిలుకలగుంపులు; నటింపన్ = నాట్యము సేయఁగా; రాజత్పికాబ్జకరాజాతి – రాజత్=ప్రకాశించుచున్న, పికాబ్జకరా=ఆఁడుకోకిలలయొక్క, జాతి=కులము; సౌరభానేహోర్పితా రావనియతి – సౌరభానేహ=వసంతకాలముచేత,అర్పిత=అర్పింపఁబడిన,ఆరావనియతిన్=ధ్వనినియమముచేత; మెఱయన్ = ప్రకాశింపఁగా, అధ్వగులు =పాంథులు; అపుడు=ఆసమయమున; అధికతాపార్చి=ఎక్కుడుసంతాపజ్వాల; పఱవన్=వ్యాపింపఁగా; కాన నంబులన్=అడవులందు; చక్కని ప్రియాళికాననంబులఁ గాంచు మోహంబులు – చక్కని=అందమైన, ప్రియాళికాననంబులన్ =ప్రియాసమూహములముఖములను, కాంచు మోహంబులు = చూడవలెనను కోరికలు; ఆత్మకున్ = మదికి; ఆనన్=నాటఁ గా; మారుఁడు=మదనుఁడు; అంబులన్=బాణములచే; ఉద్ధతిన్=దర్పముచేత; నటింప = నటింపఁగా; కుందిరి=దుఃఖించిరి. అనఁగా పున్నాగపుష్పరజములతోఁ గూడిన మందమారుతము, రక్తపల్లవములతోఁ గూడిన వకుళవృక్షములు, నటించు చున్న చిలుకగములు, కోకిలస్త్రీనినాదములు పాంథులకుఁ గామోద్రేకజనకము లయ్యె ననుట.

చ. సరససమీరపోతములు ◊చక్కఁ జరింపఁగఁ జొచ్చె నప్డు సుం
దరవకుళాగకేసరల◊తాసుమనోరసవీచిఁ దేలుచున్
దరుణనమేరుకేసరల◊తాసుమనోనరజంబు లాగుచున్
దరముగ నాగకేసరల◊తాసుమనోరమగంధ మానుచున్. 44

టీక: సరససమీరపోతములు – సరస=శ్రేష్ఠములైన, సమీరపోతములు=మందమారుతములు; సుందర వకుళాగ కేసర లతా సుమనోరసవీచిన్—సుందర=అందమైన, వకుళాగ=పొగడవృక్షములయొక్కయు, కేసర=పొన్నలయొక్కయు, లతా= కొమ్మలయందలి, సుమనః=పుష్పములయొక్క, రస=మకరందముయొక్క, వీచిన్= తరంగములయందు, ఇది జాత్యేక వచనము; తేలుచున్ =తేలాడుచు; తరుణ నమేరు కేసర లతా సుమనోనరజంబులు – తరుణ=నూతనములైన, నమేరు=సుర పొన్నలయొక్క, కేసర=కింజల్కములయొక్క, లతా=బండిగురివెందలయొక్క, ‘లతాగోవిన్దినీ గున్ద్రా’ అని యమరుఁడు, సుమ=పువ్వులయొక్క, నోన (న+ఊన) = అధికమైన, ఇచట నైకధేత్యాదులయందువలె నశబ్దముతో ఊనశబ్దమునకు ‘సు ప్సుపా’ అని సమాసము, రజంబు=పుప్పొడులను; లాగుచున్=ఆకర్షించుచు; తరముగన్=క్రమముగ; నాగకేసరలతా సుమ నోరమ గంధము – నాగకేసరలతా=నాగకేసరపుతీవలయొక్క, సుమనోరమ=మిక్కిలి మనోజ్ఞమైన, గంధము=పరిమళ మును; ఆనుచున్=పానముఁ జేయుచు;అప్డు=ఆసమయమందు; చక్కన్=బాగుగా; చరింపఁగఁ జొచ్చెన్= సంచరింపసాగెను. ఇట బాలపవనములు వకుళాదిపుష్పనీరమునఁ దేలుచు, సురపొన్నలు మున్నగువాని పుప్పొడి లాగుచు, నాగకేసరాది గంధము నానుచుఁ జరింపసాగె నని బాలవృత్తము సమీరపోతములందు వర్ణితం బయ్యె.

సీ. శ్యామోదయము కొంచి◊యము చేయ నేతెంచి, శ్యామోదయంబు హె◊చ్చగఁ దనర్చె,
సుమనోవిలాసంబు ◊చూఱపుచ్చఁగఁ జేరి, సుమనోవిలాసంబు ◊లమరఁ జేసెఁ,
దుంగకదంబాభ ◊దూల్పంగఁ బొడకట్టి, తుంగకదంబాభ ◊పొంగఁ దార్చె,
హైమజాలకరూఢి ◊నపహరింపఁగఁ బొల్చి, హైమజాలకరూఢి ◊యడర నూన్చె,

తే. శుచిపలాశాళిహృతిఁ గూర్ప ◊నచల వెలసి, శుచిపలాశాళివర్ధక◊స్ఫూర్తిఁ బొదలె,
నహహ కమలేశ్వరాత్మజా◊తైకమైత్త్రి,కతనఁ జైత్రుండు సమ్మదా◊కలన నొంది. 45

టీక: శ్యామోదయము =రాత్రియొక్క యావిర్భావమును; కొంచియము=అల్పమునుగా; చేయన్=చేయుటకు; ఏతెంచి= వచ్చి; శ్యామోదయంబు= ప్రేంకణవృక్షములయొక్కవృద్ధి; హెచ్చగన్=అధికమగునట్లుగా; తనర్చెన్=చేసెను. సుమనోవిలాసంబు=జాజులయొక్క విలాసమును; చూఱపుచ్చఁగన్=కొల్లవెట్టుటకు; చేరి=పొంది (వచ్చి), సుమనోవిలాసంబు = పువ్వులయొక్క యొప్పిదములను; అమరన్=అమరునట్లు (పొసగునట్లు); చేసెన్=ఒనరించెను. తుంగకదంబాభ – తుంగ=ఉన్నతములగు,కదంబ= కడిమిచెట్లయొక్క, ఆభ=కాంతిని; తూల్పంగన్=తూల్చుటకు; పొడ కట్టి=ఆవిర్భవించి; తుంగకదంబాభ – తుంగ=పున్నాగములయొక్క, ‘పున్నాగే పురుష స్తుంగః’ అని యమరుఁడు, కదంబ
=గుంపులయొక్క, ఆభ=కాంతిని; పొంగన్=అతిశయించునట్లు; తార్చెన్=చేసెను. హైమజాలకరూఢిన్ = హిమసంబంధులగు బిందువులయొక్క రూఢిని; అపహరింపఁగన్=దోఁచుకొనుటకు; పొల్చి=ఉదయించి; హైమజాలకరూఢి = చంపకసంబంధులగు మొగ్గల రూఢిని; అడరన్=ఒప్పునట్లుగా; ఊన్చెన్=చేసెను.
శుచిపలాశాళిహృతిన్ – శుచిపలాశ=కారాకులయొక్క, ఆళి=పరంపరలయొక్క, హృతిన్=హరణమును; కూర్పన్= చేయుటకు; అచలన్=భూమియందు; వెలసి=ప్రకాశించి; శుచిపలాశాళివర్ధకస్ఫూర్తిన్ – శుచిపలాశ=నిర్మలములగు మోదు గులయొక్క, ఆళి=పంక్తియొక్క, వర్ధక=వృద్ధిఁజేయుటయందలి, స్ఫూర్తిన్=ప్రకాశముచేత; పొదలెన్=ఒప్పెను.
అహహ=ఆశ్చర్యము! కమలేశ్వరాత్మజాతైకమైత్త్రికతనన్ – కమలేశ్వర=లక్ష్మీపతియైన విష్ణువుయొక్క, ఆత్మజాత=పుత్త్రుఁ డగు మన్మథునియొక్క, ఏక=ముఖ్యమగు, మైత్త్రికతనన్ =స్నేహమునుబట్టి; చైత్రుండు=వసంతుఁడు; సమ్మదాకలనన్ = సంతోషసంబంధమును; ఒంది =పొంది, పైఁ జెప్పిన విధముగఁ జేసె నని క్రింది కన్వయము.

వసంతము శ్యామోదయము కొంచెము సేయుటకు, సుమనోవికాసంబు చూరపుచ్చుటకు, తుంగకదంబాభ దూల్చుటకు, హైమజాలకరూఢి నపహరించుటకు, శుచిపలాశాళి హృతిఁ గూర్చుటకు పుడమిఁ జేరియు, తద్విరుద్ధములైన శ్యామోదయ మును హెచ్చు సేయుట, సుమనోవిలాసంబు లమరఁ జేయుట లోనగుకార్యము లొనరించుటవలన, ‘శ్లో. అన్య త్కర్తు మ్ప్రవృ త్తస్య తద్విరుద్ధకృతి శ్చసా, గోత్రోద్ధారప్రవృత్తోపి గోత్రోద్భేద మ్పురా కరోః’ ఇత్యాదులయందువలె, శ్లేషోత్థాపితాసంగత్యలం కారము. ఇట్లు శ్యామోదయ, సుమనోవిలాస, తుంగకదంబాభ , హైమజాలకరూఢి, శుచిపలాశాళులకు విరోధము సేయ సమ కట్టి వసంతుఁడు తద్విపరీతవర్తనమునఁ జెలంగుట చిత్రము. ఇట్టి దుర్నయమందుఁ బ్రవర్తించిన వసంతుఁడు శ్రీమన్నారాయణ సూనుం డగు మీనకేతనుని సాంగత్యమహిమచే నది మానినాఁ డనుటవలన, ‘సారూప్యమపి కార్యస్య కారణేన సమం విదుః’ అను సమాలంకారభేదమును గలుగును. వసంతవాసరమందు రాత్రి తక్కువగుటయు, లతలు వృద్ధిఁబొందుటయు, జాజులు విలసిల్లకుండుటయు, పువ్వులు సమృద్ధ మగుటయు, కదంబములు పుష్పింపకుండుటయు, పొన్నలు ప్రకాశించుటయు, మంచుపిండు ముడుఁగుటయు, కొన్ని లోకప్రసిద్ధంబులు, కొన్ని కవిసమయసిద్ధములు. దీనిం గూర్చి కవికల్పలతయందు, ‘అసతోపి నిబన్ధేనా నిబన్ధేన సతోపి చ| నియమేన చ జాత్యాదేః కవీనాం సమయ స్త్రిధా| అసతోపి నిబన్ధో యథా| రత్నాని యత్ర కుత్రాద్రౌ హంసా స్స్వల్పజలాశయే| జలేభాద్యన్నభో నద్యా మమ్భోజాద్య న్నదీష్వపి| తిమిరస్య తథా ముష్టిగ్రాహ్యత్వం సూచిభేద్యతా| అఞ్జలిగ్రాహ్యతా కుమ్భోపవాహ్యత్వం విధుత్విషః| శుక్లత్వం కీర్తిహాసాదౌ కార్ష్ణ్యంచాకీర్త్యఘాదిషు| ప్రతాపే రక్తతోష్ణత్వే రక్తత్వం క్రోధరాగయోః| విభావర్యాం భిన్నతయా వర్తనం చక్రవాకయోః| జ్యోత్స్నాపానం చకోరాణా ఞ్చతుష్క ఞ్చ పయోనిధేః| సతో ప్యనిబన్ధో యథా – వసన్తే మాలతీపుష్ప మ్ఫలపుష్పే చ చన్దనే| అశోకే చ ఫలం జ్యోత్స్నా ధ్వాన్తే కృష్ణాన్యపక్షయోః| కామిదన్తేషు కున్దానా ఙ్కుట్మలేషు చ రక్తతామ్| హరితత్వ న్దివా నీలోత్పలానా ఞ్చ వికాసితమ్| వర్ణయే న్నసదప్యేత న్నియమోఽథ ప్రకాశ్యతే| భూర్జత్వ గ్ఘిమవత్యేవ మలయేష్వేవ చన్దనమ్| రక్తత్వం రక్తబన్ధూకబిమ్బామ్భోజవివ స్వతామ్| తథా వసన్త ఏవాన్యపుష్టానా ఙ్కలకూజితమ్| వర్షాస్వేవ మయూరాణాం రుత న్నృత్యంచ వర్ణయేత్| నియమస్య విశేషోథ పునః కశ్చి త్ప్రకాశ్యతే|’ ఇత్యాదిగాఁ జెప్పఁబడినది. వసంతాదులను గూర్చియు నందె యిట్లున్నది. ‘సురభే దోలా కోకిల మారుత సూర్యగతి తరుదలోద్భేదాః| జాతీతరపుష్పచయామ్రమఞ్జరీ భ్రమరఝఙ్కారాః| గ్రీష్మే పాటల మల్లీ తాపసరః పథిక శోషవాతోష్ణాః| సక్తుః ప్రపాచ తృష్ణా మృగతృష్ణామ్రాదిఫలపాకాః| వర్షాసు ఘన శిఖి సదనసమాగమాః పఙ్క కన్దలో ద్భేదౌ| జాతీ కదమ్బ కేతక ఝంఝానిల నిమ్నగా హలిప్రీతిః| శరదీన్దు రవిపటుత్వం జలాచ్ఛతాగస్త్య హంస వృషదర్పాః| సప్తచ్ఛద స్సితాభ్రం ధాన్యం శిఖిపక్షమదపాతాః| హేమన్తే దినలఘుతా శీత యవ స్తమ్బ మరువక హిమాని| శిశిరే కరీషధూమ మాః కున్దామ్బుజ దాహ హిమజలోత్కర్షాః|’ ఇత్యాదిగా నున్నది. ఇందు వసంతమున సూర్యగతిమాంద్యమున రాత్రి కొంచె మగుటయు, జాజులు వికసిల్లకుండుటయు, కదంబములు వర్షర్తువునందే చెప్పఁదగిన వనుటచే నవి లేకుండుటయు, జాతీతర సర్వకుసుమము లని చెప్పుటచేఁ జంపకాదిపుష్పసమృద్ధి, తరుదలోద్భేదము చెప్పుటచేఁ గారాకులు రాలుటయు లోనగునవి తెలియవలయు.