శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము
చతుర్థాశ్వాసము
క. కమలాకుచకలశతటీ
విమలాంచితమృగమదాభి◊విలసన్ముద్రా
కమలామతికృల్లాంఛన
విమలాలసరిపువిభేద◊విధ గోపాలా! 1
టీక: కమలాకుచకలశతటీవిమలాంచితమృగమదాభివిలసన్ముద్రాకమలామతికృల్లాంఛన – కమలా=లక్ష్మీదేవియొక్క, కుచ కలశతటీ = కలశములవంటి కుచములతటమందలి, విమల=నిర్మలమై, అంచిత=ఒప్పుచున్నదియైన, మృగమద=కస్తూరి యొక్క, అభివిలసత్=ప్రకాశమానమగు, ముద్రా=గుర్తుయొక్క,కమలా=సంపత్తియొక్క,మతి=బుద్ధిని, కృత్=చేయుచున్న, లాంఛన = శ్రీవత్సము గలవాఁడా! విమలాలసరిపువిభేదవిధ – విమల=విశేషపాపముగల, అలస=ధర్మమునందలసులైన, రిపు = శత్రువులయొక్క, విభేద=భేదనము,విధ =రీతిగాఁగలవాడా! గోపాలా= శ్రీమదనగోపాలస్వామీ! ఈకృతిపతి సంబోధనము నకు ‘చిత్తగింపు’మను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.
తే. చిత్తగింపుము శౌనకా ◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ ◊ర్షణతనూజుఁ
డంత రంగద్వధూమోహ ◊మన్నృపాలు
డంతరంగస్థలంబున ◊నతిశయిల్ల. 2
టీక: చిత్తగింపుము = ఆకర్ణింపుము; శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలగు శ్రేష్ఠులగు మునిసంఘమునకు; రోమ హర్షణతనూజుఁడు = సూతుఁడు; ఇట్లనున్=వక్ష్యమాణప్రకారముగాఁ బలుకును; అంతన్=అటుతరువాత; రంగద్వధూమో హము – రంగత్=ఒప్పుచున్న, వధూ=చంద్రికయందలి, మోహము=అభిలాషము; అంతరంగస్థలంబునన్ =మనస్సునందు; అతిశయిల్లన్=మించఁగా; అన్నృపాలుఁడు=ఆరాజు. దీనికి ‘అనుచుఁ దలపోయుచుండు’ నను నుత్తరపద్యస్థక్రియతో నన్వ యము. ఈపద్యమందు యమకాలంకారము. ఇట్లీయాశ్వాసమం దంతటను యమకాలంకారంబు ప్రధానంబుగ నగును. ‘స్వర వ్యఞ్జనసముదాయ పౌనరుక్త్యం యమకమ్’ అని వాత్స్యాయనసూత్రము.
సీ. వరియించు టెన్నఁడో ◊వరమనోమోదంబు, నలువార రాజక◊న్యాలలామ,
విహరించు టెన్నఁడో ◊గృహవన్య నాతిమి,న్నలు వారక భజింపఁ ◊గలికిఁ గూడి,
నెలకొల్పు టెన్నఁడో ◊నిశితపాణిరుహాంక,నలు వారణేంద్రయా ◊నాకుచములను,
దేలించు టెన్నఁడో ◊హాళిఁ గ్రొంజెమటసో,నలు వాఱ నెలఁతఁ గం◊దర్పకేళిఁ,
తే. జెలువ మరుపోరు వెనుక సొ ◊మ్ముల నలర్చి, చెలు వమరురక్తి నెన్నఁడో ◊కలిసియుండు
టనుచుఁ దలపోయుచుండుఁ దా ◊నాత్తచంద్రి,కాభిలాషానుగుంభిత◊స్వాంతుఁ డగుచు. 3
టీక: రాజకన్యాలలామన్=చంద్రికను; వరమనోమోదంబు=శ్రేష్ఠమగు మనస్సంతోషము; నలువారన్=ఒప్పఁగా; వరియించు టెన్నఁడో = వివాహమాడుట యెన్నఁడో?
గృహవన్యన్=సదనోద్యానమందు; నాతిమిన్నలు = స్త్రీరత్నములు; వారక =ఎడదెగక; భజింపన్ = కొలుచుచుండఁగా; కలికిన్ కూడి = చంద్రికను గూడి; విహరించు టెన్నఁడో = క్రీడించు టెన్నఁడో? వారణేంద్రయానాకుచములను = గజేంద్రగమన యగు చంద్రికయొక్క స్తనములయందు, నిశితపాణిరుహాంకనలు—నిశిత= తీక్ష్ణములగు, పాణిరుహ=గోళ్ళయొక్క, అంకనలు = చిహ్నములను, నెలకొల్పు టెన్నఁడో = చేయు టెన్నఁడో? నెలఁతన్ = చంద్రికను; కందర్పకేళిన్ = అనంగక్రీడయందు; హాళిన్=ప్రీతిచేత; క్రొంజెమటసోనలు = నూతనస్వేదాసారములు; పాఱన్=ప్రవహింపఁగా, ఇట సంధివశమున పకారమునకు వకారము వచ్చినది. అలఘురేఫమైనను యమకమునకు బాధ లేదు; తేలించు టెన్నఁడో = తృప్తిపొందించు టెన్నఁడో? చెలువన్=చంద్రికను; మరుపోరు వెనుకన్ = సురతానంతరమందు; సొమ్ములన్=ఆభరణములచేతను; అలర్చి=సంతోషింపఁ జేసి; చెలువు అమరురక్తిన్ = ఒప్పిదమగు ప్రీతిచేత; కలిసియుండుట = కూడియుండుట; ఎన్నఁడో = ఏనాఁడో? అనుచున్ = ఇట్లనుచు; తాన్ = సుచంద్రుఁడు; ఆత్తచంద్రికాభిలాషానుగుంభితస్వాంతుఁడు – ఆత్త=పొందఁబడిన, చంద్రికాభిలాష=చంద్రికా విషయమైన యనురాగముచేత, అనుగుంభిత=కూర్పఁబడిన, స్వాంతుఁడు = చిత్తముగలవాఁడు; అగుచున్; తలపోయు చుండున్ = చింతించుచుండును.
ఇచటఁ జింత యను ననంగదశావిశేషము గదితంబయ్యె. ‘శ్లో. కే నోపాయేన సంసిద్ధ్యే త్కదా తేన సమాగమః, దూతీ ముఖేన కింవాచ్య మిత్యాద్యూహస్తు చిన్తనమ్’ అని తల్లక్షణంబు. ఇట ‘కదా వారాణస్యా మమరతటనీరోధసి వసన్, వసానః కౌపీనం శిరసి నిదధానోఞ్జలిపుటమ్’ అనుచోట శాంతమునకువలె శృంగారరసమునకు ఎన్నఁడో అను పదములచే సూచిత మగు చింతాఖ్యవ్యభిచారభావమంగ మగుటంజేసి ప్రేయోలంకారమగును. ఇదియే భావాలంకార మనఁబడును.
చ. లలి మదిఁ జాల మించ నవ◊లా! నవలాలితకంతుకల్యనా
విలగతిఁ బ్రోవ కున్కి దగ◊వే తగ వేమరు కౌఁగిలింతచేన్
గలయక యున్నఁదాళఁ గల◊నా కలనాద! యటంచుఁ బల్కు భూ
తలపతిమారశారపవి◊తాపవితానము మేనఁ గూరఁగన్. 4
టీక: మదిన్=చిత్తమందు; లలి=ప్రేమము; చాలన్=మిక్కిలి; మించన్=అతిశయింపఁగా; నవలా=ఓతరుణీ! నవలాలితకంతు కల్యనావిలగతిన్ – నవ=నూతనమైన, లాలిత=ఆదరింపఁబడిన, కంతుకలి=సురతమందలి, అనావిలగతిన్=అకలుషస్థితి చేత; ప్రోవకున్కి=రక్షింపకుండుట; తగవే= న్యాయమా? న్యాయము గాదనుట; తగన్=ఒప్పునట్లుగా; వేమరున్=సారెకు; కౌఁగిలింతచేన్=ఆలింగనముచే; కలయక యున్నన్ = కూడకయున్నయెడ; కలనాద = అవ్యక్తమధురస్వనముగలదానా! తాళఁ గలనా = ఓర్వఁగలనా? అటంచున్ = అట్లనుచు; భూతలపతి= రాజగు సుచంద్రుఁడు; మారశారపవితాపవితానము – మార=మన్మథునియొక్క, శారపవి=వజ్రమువంటి శరసంఘముచేతనైన, తాపవితానము= తాపపరంపర; మేనన్=శరీరమున; కూరఁగన్=ఘటిల్లఁగా; పల్కున్=వచించును.
సీ. అహిరోమలతికపొం◊దందినఁ గాని నొం,పఁగ రాదు మలయాగ◊మారుతములఁ,
గనకాంగికౌఁగిలి ◊యెనసినఁ గాని పెం,పఁగ రాదు మధుపభా◊మారుతముల,
ఘనవేణిఁ గూడి మిం◊చినఁ గాని రూపుదూ,ల్పఁగ రాదు శశభృన్న◊వప్రకరముల,
వనజారివదనఁ జే◊రినఁ గాని సిరు లడం,పఁగ రాదు వనసంభ◊వప్రకరముల,
తే. ననుచు రాజీవనేత్రమో◊హంబు చాల
ననుచు రాజీవసాయకా◊నల్పభయము
మలయ గాహితచింతమైఁ ◊గలఁగఁ జిత్త
మల యగాహితనిభుఁడు తా◊పాప్తి నడల. 5
టీక: అహిరోమలతికపొందు =సర్పతుల్యమగు నూఁగారు గల చంద్రికయొక్కసాంగత్యమును; అందినఁ గాని = పొందిననే గాని; మలయాగమారుతముల = మలయాచలసంబంధులగు గాడ్పులను; నొంపఁగ రాదు = నొప్పించుట కలవిగాదు. అనఁగా చంద్రిక సర్పతుల్యమైన రోమావళి గలది గావున తత్సాంగత్యమున వాయువును గెలువ వచ్చు ననుట. సర్పములు వాతాశనము లగుట ప్రసిద్ధము. కనకాంగికౌఁగిలి = సంపెఁగనుబోలు నంగములు గలదానియొక్క యాలింగనమును; ఎనసినఁ గాని = పొందినఁగాని; మధుప భామారుతములన్ = ఆఁడుతుమ్మెదలయొక్క రొదలను; పెంపఁగరాదు = నశింపఁజేయుట కలవి గాదు. చంద్రిక చంపకాంగి గావున దానికౌఁగిటఁ జేరినచో తేంట్ల నడఁపవచ్చు ననుట. సంపెఁగకు తేంట్లకు గల విరోధము ప్రసిద్ధము. ఘనవేణిన్= మేఘమువంటి జడగలదానిని; కూడి = పొంది; మించినన్ కాని = అతిశయించిననే కాని; శశభృన్నవప్రకరములన్ = చంద్రునియొక్క నూతనమగు ప్రకృష్టకిరణములను; రూపుదూల్పఁగ రాదు = రూపుమాప నలవిగాదు. చంద్రిక జలదము వంటివేణి గలదిగావున దానిసాంగత్యమునఁ జంద్రకిరణములఁ గప్పవచ్చు ననుట. వనజారివదనన్=చంద్రునిఁబోలు మోముగలదానిని; చేరినన్ కాని=పొందిననేకాని; వనసంభవప్రకరములన్=తమ్ములయొక్క సమూహములయందు; సిరులడంపఁగ రాదు =కాంతుల నడఁచుటకు నలవిగాదు. చంద్రిక చంద్రునివంటి మోముగలది గావున దానిఁ జేరి కమలముల సిరుల నడంప వచ్చు ననుట. అనుచున్=ఇట్లు వచించుచు; రాజీవనేత్రమోహంబు = చంద్రికయందలి యనురాగము; చాలన్=మిక్కిలి; ననుచు రాజీవసాయ కానల్పభయము – ననుచు = వృద్ధిఁబొందించుచున్న, రాజీవసాయక=మరునివలననైన, అనల్పభయము=అధికమైన భీతి; మలయన్=ఉద్రేకింపఁగా; గాహితచింతమైన్ = పొందఁబడినచింతచేత; చిత్తము=హృదయము; కలఁగన్=కలఁతపాఱఁగా; అల యగాహితనిభుఁడు= ఇంద్రతుల్యుఁడైన యాసుచంద్రుఁడు; తాపాప్తిన్=సంతాపప్రాప్తిచేత; అడలన్=తపింపఁగా. దీనికి ‘తనర్చెన్’ అను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.
చ. నరపతిధైర్యభంగము ద◊నర్చె నవీనరతీశధాటిఁ గై
కరభసలీల చందనన◊గచ్యుతమారుతపాళి చాంద్రదు
ష్కరభ సలీలకోకిలని◊కాయశుకవ్రజశారికాసము
త్కరభసలీలసద్ధ్వనివి◊ధానము లత్తఱిఁ జిత్రవర్తనన్. 6
టీక: అత్తఱిన్=ఆసమయమున; చిత్రవర్తనన్= ఆశ్చర్యకరమగు రీతిచేత; నవీనరతీశధాటిన్ = నూతనమైన మరుని జైత్ర యాత్రయందు; కైకరభసలీల – కైక=కేకిసంబంధియగు, కేకిశబ్దముమీఁద సంబంధార్థమందణ్ప్రత్యయము, రభసలీల = హర్షక్రియ, ‘రభసో వేగ హర్షయోః’, ‘లీలా విలాస క్రియయోః’ అని విశ్వము; చందననగచ్యుతమారుతపాళి – చందననగ =మలయపర్వతమునుండి, చ్యుత=జాఱిన, వెడలిన యనుట, మారుతపాళి=తెమ్మెరలగుంపు; చాంద్రదుష్కరభ = చంద్రుని సంబంధియగు ననివార్యమైన కాంతి; సలీలకోకిలనికాయశుకవ్రజశారికాసముత్కరభసలీలసద్ధ్వనివిధానములు – సలీల= విలా సముతోఁ గూడినదగు, కోకిలనికాయ=పికసముదాయముయొక్కయు, శుకవ్రజ=చిలుకలగుంపుయొక్కయు, శారికాసము త్కర =గోరువంకలగుంపుయొక్కయు, భసలీ=తుమ్మెదలయొక్కయు,లసత్=ఒప్పుచున్న, ధ్వనివిధానములు = ధ్వని యొనర్చుటలు; నరపతిధైర్యభంగము = రాజుయొక్క ధైర్యముడుగుటను; తనర్చెన్=చేసెను.
రాజున కుదయించిన చంద్రికావిషయక మైనయనురాగము మలయానిలచంద్రికాకోకిలాలాపాది సహకారి కారణ సమవ ధానమున మిగుల నుద్దీపిత మయ్యె ననుట. ‘తటస్థా శ్చన్ద్రికాధారా గృహచన్ద్రోదయా వపి, కోకిలాలాప మాకన్ద మన్దమారుత షట్పదాః, లతామణ్డప భూ గేహదీర్ఘికా జలదారవాః, ప్రాసాదగర్భసంగీత క్రీడాద్రి సరిదాదయః’ అని తటస్థోద్దీపనవిభావములు గదితంబు లయ్యె. ‘ఉద్దీపనవిభావాస్తు రసముద్దీపయన్తి యే’ అని యుద్దీపనవిభావలక్షణము. ‘విభావః కథ్యతే తత్త్ర రసోత్పా దనకారణమ్’ అని విభావలక్షణములోనగునవి వెనుక సవిస్తరముగ వ్రాయంబడియె.
సీ. ఘనసింహగతికి స్రు◊క్కనిదిట్ట హంసవీ,క్షణదారకవ్రాత◊గతికి బెదరు,
దనుజాస్త్రకీలి కో◊ర్చినమేటి పూర్ణిమా,క్షణదారమణహేతి◊జాతి కడలుఁ,
గలిరవాళికిఁ గలం◊గనిదంట కిసలభ,క్షణదారనిస్వన◊చ్ఛటకుఁ దెరలుఁ,
దామిస్రశస్త్రిఁ గుం◊దనిసామి విరహిహృ,త్క్షణదారయుతమార◊శస్త్రి నొదుఁగు,
తే. నఖిలలేఖావగీర్ణన◊వాజిరాజి,తాజరారిధనుర్ముక్త◊వాజిరాజి
దోడ్త మయి నాట నలఁగని◊దొర యనలగు,రూత్కరము గాత్రసీమయం◊ దొరయ నలఁగు. 7
టీక: ఘనసింహగతికిన్=గొప్పనైన సింహముయొక్క గమనమునకు; స్రుక్కనిదిట్ట = వెనుదీయని ధైర్యముగలవాఁడు; హంసవీక్షణదారకవ్రాతగతికిన్ – హంస=హంసలయొక్క, వీక్షణదారక=దృష్టిభేదకమగు, వ్రాత=సంఘములయొక్క, గతికిన్ =గమనమునకు; బెదరున్ =భయపడును.దనుజాస్త్రకీలికిన్ =రాక్షసబాణవహ్నికి; ఓర్చినమేటి = సహించిన యధిపుఁడు; పూర్ణిమాక్షణదారమణహేతిజాతికిన్ – పూర్ణిమా=పున్నమయందలి, క్షణదారమణ=చంద్రునియొక్క, హేతిజాతికిన్ = కాంతిపుంజమునకు; అడలున్=వెఱచును. కలిరవాళికిన్ = రణసంబంధియగు ధ్వనిపరంపరకు; కలంగనిదంట = కలఁతనొందని దిట్టతనముగలవాఁడు; కిసలభక్షణదార నిస్వనచ్ఛటకున్ – కిసలభక్షణదార=ఆఁడుకోయిలలయొక్క, నిస్వనచ్ఛటకున్=నాదపరంపరకు; తెరలున్=చలించును. తామిస్రశస్త్రిన్ = తమిస్రాసురసంబంధియగు చురకత్తికి; కుందనిసామి =దుఃఖింపనిభూపతి; విరహిహృత్క్షణదారయుతమార
శస్త్రిన్ – విరహిహృత్=విరహవంతులహృదయముయొక్క, క్షణ=ఉత్సవములను, ద=ఖండించెడు, అర=వేగముతో, యుత =కూడియున్న, మారశస్త్రిన్=మన్మథుని ఆయుధముచేత; ఒదుఁగున్=తొలఁగును. అఖిలలేఖావగీర్ణనవాజిరాజితాజరారిధనుర్ముక్తవాజిరాజి – అఖిలలేఖ=సమస్తదేవతలచేత, అవగీర్ణ=పొగడఁబడిన, నవ= నూతనమైన, ఆజి=యుద్ధమందు, రాజిత=విలసిల్లునట్టి, అజరారి=రాక్షసులయొక్క, ధనుః=ధనుస్సులచేత, ముక్త=విడువఁ బడిన, వాజి=బాణములయొక్క, రాజి=పరంపర; తోడ్తన్=వెంటనే; మయిన్=శరీరమందు; నాటన్=నాటఁగా; నలఁగనిదొర =శ్రమపడని రాజు;అనలగురూత్కరము=వాయుసంఘము, అగ్ని వాయువువలనఁ బుట్టినట్లు శ్రుతిప్రసిద్ధమగుటవలన వాయు వనలగురు వని చెప్పఁబడియె; గాత్రసీమయందున్=శరీరప్రదేశమందు; ఒరయన్=ఒరసికొనఁగా; నలఁగున్=శ్రమపడును.
చ. నిరతము వ్రాయు నాహరిణ◊నేత్రతలంబు నవామలాలస
స్ఫురణ విభుండు దృగ్యుగళ◊ముం గరముం గురులున్ మొగంబునున్
వెర దొరయింప నాహరిణ◊నేత్రతలంబున వామలాలస
త్సరసిజమందిరాతనయ◊శాంబరికాకృతమోహరేఖనాన్. 8
టీక: విభుండు = సుచంద్రుఁడు; ఆహరిణనేత్రతలంబునన్ = మిగులశుభ్రమైనవస్త్రతలమునందు; నవామలాలసస్ఫురణన్ – నవ=నూతనమైన, అమల=స్వచ్ఛమైన, అలసస్ఫురణన్ = ఆలస్యస్ఫురణముచేత; ఆహరిణనేత్రతలంబు = హరిణాక్షి యగు నాచంద్రికయొక్క స్వరూపమును, ‘తలం స్వరూపాధరయోః’ అని విశ్వము; దృగ్యుగళమున్ = కన్నుఁగవయు; కరమున్=హస్తమును; కురులున్=వెండ్రుకలును; మొగంబునున్=ముఖమును; వెర దొరయింపన్ = విరహదుఃఖము పుట్టిం పఁగా; వామలాలసత్సరసిజమందిరాతనయశాంబరికాకృతమోహరేఖనాన్ – వామ=ప్రతికూలమైన, లాలసత్=మిగులఁ బ్రకా శించుచున్న, సరసిజమందిరాతనయ = శ్రీపుత్త్రుఁడైన మరునియొక్క,శాంబరికా=మాయచేత, కృత= చేయఁబడిన, మోహ రేఖనాన్ = మోహపరంపర యనఁగా; నిరతము = ఎల్లప్పుడు; వ్రాయున్=లిఖించును. అనఁగాఁ గాలక్షేపార్థము ప్రియురాలిని వ్రాయఁగాఁ, దదంగములు, కన్నులు కలువలను బోలినవి కరములు చిగురులను బోలినవి కురులు తుమ్మెదలను బోలినవి ముఖము పద్మమును బోలినది యగుటంజేసి, మదనమాయాప్రాతికూల్యముచేత భయావహము లయ్యె ననుట.
చ. ఎనసినరాగసంపద న◊రేశిత తా హితచంద్రికావధూ
తనురుచిఁ గాంచి మోహభృతిఁ ◊దాల్చిన నాయెడనుండి కీరభూ
రినినదభంగిఁ గుందు, బళి◊రే! సితతాహితచంద్రికావధూ
తనిజధృతిన్ భ్రమించు, మదిఁ ◊దార్కొనుచింతఁ గలంగు నెంతయున్. 9
టీక: నరేశిత=రాజు; ఎనసినరాగసంపదన్=పొందిన రాగాతిశయముచేత; తాన్=తాను; హితచంద్రికావధూతనురుచిన్ = హిత మైన చంద్రికావధువుయొక్క తనుకాంతిని; కాంచి=చూచి; మోహభృతిన్=మోహపరిపోషణమును; తాల్చిన నాయెడనుండి = వహించినప్పటినుండి; కీరభూరినినదభంగిన్ – కీర=శుకములయొక్క, భూరి=అధికమైన, నినదభంగిన్=ధ్వనిప్రకారము చేత; కుందున్=దుఃఖించును; బళిరే = ఆశ్చర్యము! సితతాహితచంద్రికావధూతనిజధృతిన్ – సితతా=శుభ్రత్వముచేత, హిత= మనోజ్ఞమైన, చంద్రికా=వెన్నెలచేత, అవధూత=పోఁగొట్టఁబడిన, నిజధృతిన్= తనయొక్క ధైర్యముచేత; భ్రమించున్=తిర్గును; మదిన్ = చిత్తమునందు; తార్కొనుచింతన్ = పొందునట్టి చింతచేత; ఎంతయున్=మిక్కిలి; కలంగున్=కలఁతపడును. అనఁగా సుచంద్రుఁడు చంద్రికయందలి యనురాగము దాల్చిననాటనుండి శుకధ్వనులు లోనగువానికిఁ గుందుచుండు ననుట.
సీ. తనువేల తావకో◊దార స్తనవసుధా,ధర పాళిఁ గౌఁగిటఁ ◊దార్పకున్న,
శ్రుతు లేల భవదుదం◊చితగాన నవసుధా,ద్వీపికోర్మిరుతముల్ ◊వినక యున్నఁ,
గనుదోయి యేల నీ◊గాత్రాంచన వసు ధా,లంధల్య విభవముల్ ◊గాంచ కున్న,
ఘ్రాణ మేల త్వదాస్య◊రాకార్జునవసు ధా,మక సుగంధ శ్రేణి ◊ మరగ కున్న,
తే. రసన యిది యేల నీయోష్ఠ◊రమ్య మధుర
సోత్కరము వేడ్కఁ గ్రోలక ◊యున్న మధుర
వాణి యని పల్కుఁ బతి యాత్మ ◊వఱల మధు ర
మాధిపసుతోత్థ తాపజా◊తాసమధుర. 10
టీక: పతి=భూపతి యగు సుచంద్రుఁడు; మధురవాణి=తీయనిపలుకులగలదానా! తావకోదారస్తనవసుధాధరపాళిన్ – తావక = నీసంబంధియగు, ఉదార=ఉత్కృష్టములగు, స్తనవసుధాధర=గిరులవంటి స్తనములయొక్క, పాళిన్=ప్రదేశమును; కౌఁగిటన్ = భుజాంతరమందు; తార్పకున్నన్= చేర్పకున్నయెడ; తనువేల = శరీరమేల?
భవదుదంచితగాననవసుధాద్వీపికోర్మిరుతముల్—భవత్= నీయొక్క, ఉదంచిత=ఉత్కృష్టమైన, గాన=గీతములనెడు, నవ= అపూర్వమైన, సుధాద్వీపికోర్మి= అమృతనదీతరంగములయొక్క,రుతముల్=ధ్వనులను; వినక యున్నన్= విననియెడల; శ్రుతు లేల =కర్ణములేల? భవచ్ఛబ్దము సర్వనామము గాన ‘సర్వనామ్నో వృత్తిమాత్రే పుంవద్భావః’ అని పుంవద్భావము. ద్వీపిక యనుచోట ద్వీపశబ్దముపై ఠన్ ప్రత్యయము ఇకాదేశము. నీగాత్రాంచనవసు ధాలంధల్యవిభవముల్ – నీగాత్ర=నీశరీరమునకు, అంచన= అలంకారమైన, వసు=బంగరుయొక్క, ధాలం ధల్య= ధళధళమను మను ప్రకాశముయొక్క, విభవముల్=అతిశయములు; కాంచకున్నన్=చూడకున్నయెడల; కనుదోయి యేల = నేత్రయుగ్మ మెందుకు? త్వదాస్యరాకార్జునవసుధామకసుగంధశ్రేణిన్ – రాకా= నిండుచంద్రునియొక్క, అర్జునవసు = తెల్లనికాంతికి, ధామక= ఆశ్రయ మైన, త్వత్=నీయొక్క, ఆస్య= ముఖముయొక్క; సుగంధశ్రేణిన్=పరిమళపరంపరను; మరగ కున్నన్=పరిచయముచేయ కున్నయెడల; ఘ్రాణ మేల = నాసికయేల? నీయోష్ఠరమ్యమధురసోత్కరము = నీయధరముయొక్క రమ్యమగు మధురరసరాశిని; వేడ్కన్=సంతోషముచేత; క్రోలక యున్నన్ = పానముఁ జేయకున్నయెడల; రసన యిది యేల = ఈనాలుక యేల? అని = ఇట్లనుచు; మధురమాధిపసుతోత్థతాపజాతాసమధుర – మధురమాధిపసుత=వసంతమన్మథులవలన, ఉత్థ=పుట్టిన,తాపజాత=సంతాప పుంజముయొక్క, అసమధుర = సాటిలేని భారము; ఆత్మన్=చిత్తమందు; వఱలన్=ఒప్పగా; పల్కున్=వచించును.
చ. అలయవిరాజమానకుచ ◊నాయవనీపతి చిత్తవీథిలో
నలయవిరాజమానరతి ◊నంది దలంపఁగ నొందు మేనునం
బులక లుషంబునన్ మధువుఁ◊బోలెఁ బరిస్ఫుటపద్మసీమ నం
బు లకలుషంబు లెప్పుడును ◊బొల్పుగ నుబ్బు విలోచనంబులన్. 11
టీక: ఆయవనీపతి=ఆసుచంద్రుఁడు; చిత్తవీథిలోన్=హృదయదేశమందు; అలయవిరాజమానరతిన్ – అలయ=నాశరహి తమై, విరాజమాన=ఒప్పుచున్న, రతిన్=ఆసక్తిని; అంది=పొంది; అలయవిరాజమానకుచన్ –అల = ఆ, అవిరాజ =పర్వత శ్రేష్ఠముయొక్క, మాన=పరిమాణముగల, కుచన్=స్తనములుగల చంద్రికను; తలంపఁగన్=స్మరింపఁగా; మేనునన్=దేహము నందు; పులకలు = రోమాంచములు; ఒందున్=కల్గును; విలోచనంబులన్ =నేత్రములందు; ఉషంబునన్=ఉషఃకాలమందు; పరి స్ఫుటపద్మసీమన్ = వికచకమలస్థలియందు; మధువుఁ బోలెన్=మకరందమువలె; అకలుషంబులు=నిర్మలములగు; అంబులు = అశ్రువులు; ఎప్పుడును = ఎల్లపుడు; పొల్పుగన్=ఒప్పుగా; ఉబ్బున్ = అతిశయించును. ఆరాజు చంద్రికను అనురాగముచేత స్మరింపఁగా దేహమందుఁ బులకలు, లోచనములం దశ్రువులు గలిగె ననుట.
మ. వరపాంచాలకుమారికాతిలక భ◊వ్యధ్యాన సంపత్తిచే
నరుదారన్ భరియించె హృత్సరణిలో ◊నశ్శ్యామలాభాయతిన్
హరిసంభేది తదీర్ష్యనో కనియె మే◊ నశ్శ్యామలాభాయతిన్
సరసీజాస్త్రుఁడు మున్నె చేకొన నదా◊నశ్శ్యామలాభాయతిన్. 12
టీక: వరపాంచాలకుమారికాతిలకభవ్యధ్యానసంపత్తిచేన్ – వర=శ్రేష్ఠమగు, పాంచాలకుమారికాతిలక=చంద్రికయొక్క, భవ్య =మనోజ్ఞమగు, ధ్యానసంపత్తిచేన్=స్మరణసమృద్ధిచేత; హరిసంభేది = సుచంద్రుఁడు; హృత్సరణిలోన్ = చిత్తవీథియందు; అశ్శ్యామలాభాయతిన్ – అశ్శ్యామ=ఆతరుణియొక్క, లాభ=ప్రాప్తి యనెడు, ఆయతిన్=ఉత్తరకాలమును; అరుదారన్ = ఆశ్చర్యము కలుగునట్లు; భరియించెన్ = భరించెను; తదీర్ష్యనో – తత్=ఆహృదయమందలి, ఈర్ష్యనో = అసూయచేతనో; సరసీజాస్త్రుఁడు = మన్మథుఁడు; మున్నె=అంతకుపూర్వమె; అదానశ్శ్యామలాభాయతిన్ – అదాన=అమ్లానమగు, నూతన మగు ననుట, శ్యామ=ప్రేంకణపుష్పమును, శ్యామాశబ్దముమీఁద వికారార్థమం దణ్ ప్రత్యయము వచ్చి శ్యామ అని అయినది. ‘పుష్పమూలేషు బహుళం’ అని బహుళగ్రహణముచేత ప్రత్యయమునకు లుక్కు లేదు,ల=గ్రహించెడు, ఆభా=అతిసామర్థ్య మందలి, ‘భా ప్రభావే తేజసి’ అని విశ్వము, యతిన్=నియమమును; చేకొనన్=గ్రహింపఁగా; మేను=సుచంద్రునిదేహము; అశ్శ్యామలాభాయతిన్ – అశ్శ్యామల=శుభ్రమయిన,ఆభా=కాంతియొక్క, ఆయతిన్=సాంగత్యమును; కనియెన్=పొందెను.
అనఁగా సుచంద్రునిచిత్తము అశ్శ్యామలాభాయతిని ధరింపఁగా తదీర్ష్యచే నతనిమేనును అశ్శ్యామలాభాయతిని బొందిన దనియు, మరుఁడంతకన్న మున్నె అశ్శ్యామలాభాయతిని బొందె ననియు భావము.
చ. అలనరపాలచంద్రుహృద◊యాంబురుహం బితరప్రవృత్తిచేఁ
జెలఁగక యుండ నూన్చి చెలిఁ ◊జేర్చెఁ గడున్ సితపక్షరాజమం
డల మధు పాళికాభ్రచర◊నాథ మరు త్సితపక్షరాజమం
డల మధుపాళికల్ గొలువ ◊నవ్యభవోన్నతిఁ గంతుఁడయ్యెడన్. 13
టీక: అయ్యెడన్=ఆసమయమందు; కంతుఁడు=మన్మథుఁడు; సితపక్షరాజమండలమధుపాళికాభ్రచరనాథమరుత్సితపక్ష రాజమండలమధుపాళికల్ – సితపక్షరాజమండల=శుక్లపక్షమునందలి చంద్రబింబము, మధు=వసంతము, పాళికా= గుంపు లైన, అభ్రచరనాథ=పక్షిశ్రేష్ఠములు, శుకపికశారికాదు లనుట, మరుత్=మలయమారుతము, సితపక్షరాజమండల= రాజ హంసలగుంపు, మధుపాళికల్= తుమ్మెదలబారులు; నవ్యభవోన్నతిన్ = క్రొత్తపుట్టువుయొక్క యతిశయముచేత; కొలువన్ = సేవించుచుండఁగా; అలనరపాలచంద్రుహృదయాంబురుహంబు = ఆసుచంద్రునియొక్క హృదయకమలము; ఇతరప్రవృ త్తిచేన్ = విషయాంతరవ్యాపారముచేత; చెలఁగక యుండన్=ఒప్పకయుండునట్లు; ఊన్చి=చేసి; చెలిన్=చంద్రికను; కడున్= మిక్కిలి; చేర్చెన్= ఆహృదయాంబురుహమునం దుంచెను.
అనఁగా మలయానిల చంద్ర శుక పిక భ్రమర ఝంకారాదులచే ఆరాజుచిత్తము విషయాంతరవ్యాపార ముడిగి చంద్రిక యందె నిలిచి యుండె ననుట. ఈకార్యము స్మరసామర్థ్యలభ్య మగుట కవిసమయపరిపాటీసిద్ధము. ఇం దరతి యను స్మరా వస్థపరిపూర్తి గదితం బయ్యె. అరతి యనఁగా విషయాంతర పరిత్యాగపూర్వక తదేకాయత్తచిత్తత యని వ్రాయఁబడియె.
తే. పతిహృదయ మిట్లు నిజశౌర్య◊పటిమ నంబు,నామకచఁ జేర్చి యెనయించె ◊నలి మనం బు
రద్విషద్వైరి శితశర◊ప్రథిమ నంబు,జహితకులుపైఁ దదేణలో◊చనమనంబు. 14
టీక: పురద్విషద్వైరి=మన్మథుఁడు; నిజశౌర్యపటిమన్=తనయొక్కశౌర్యసామర్థ్యముచేత; ఇట్లు=ఈప్రకారము; పతిహృద యము= సుచంద్రుని మనస్సును; అంబునామకచన్ = కురువేరువంటి వెండ్రుకలు గల చంద్రికను, అంబునామ మనఁగా కురువే రనుటకు ‘ఉదీచ్య కేశామ్బునామచ’ అని వెనుక వ్రాయఁబడె; చేర్చి=పొందించి; శితశరప్రథిమన్=తీక్ష్ణములైన తూపులయొక్క అతిశయముచేత; తదేణలోచనమనంబు = లేడికన్నులవంటి కన్నులు గల యాచంద్రికయొక్క మనస్సును; అంబుజహిత కులుపైన్ = సూర్యవంశ్యుఁడైన సుచంద్రునిపై; నలిన్=మిక్కిలి; మనన్=వర్తించునట్లు; ఎనయించెన్=పొందించెను.
చ. అలవిరివింటిదంట తది◊లాధిపమోహము నెమ్మనంబునన్
గల వలమానభేదిమణి◊కైశికఁ గెందలిరాకుముల్కులన్
గలవల మాన నూన్చె నలు◊కన్ నవసంగరముద్ర నిల్చి మం
గలవలమాన మీనతిల◊క ధ్వజశోభి మరుద్రథంబునన్. 15
టీక: అలవిరివింటిదంట = దిట్టతనము గల యాకుసుమసాయకుండు; తదిలాధిపమోహము = ఆసుచంద్రునియందలి యను రాగము; నెమ్మనంబునన్=మంచిమనస్సునందు; కలవలమానభేదిమణికైశికన్ – కల=కలిగినట్టి, వలమానభేదిమణి=ఇంద్ర నీలమణులవంటి, కైశికన్=కొప్పుగల చంద్రికను; మంగలవలమానమీనతిలకధ్వజశోభిమరుద్రథంబునన్ – మంగల=శుభా వహమైన, వలమాన=బెళఁకుచున్న, మీనతిలక=మత్స్యశ్రేష్ఠ మనెడు, ధ్వజ=పతాకచేత,శోభి=ప్రకాశించుచున్న, మరుద్రథం బునన్=మందమారుత మనెడు రథముమీఁద; నవసంగరముద్రన్=నూతనమైన యుద్ధస్థితిచేత; నిల్చి = ఉండి; అలుకన్=కోప ముచేత; కెందలిరాకుముల్కులన్=ఎఱ్ఱని పల్లవములను బాణములచేత;కలవలము=ఆకులతను; ఆనన్ = పొందునట్లు; ఊన్చెన్= చేసెను. సుచంద్రునిపై మోహము దాల్చిన చంద్రికకు నవపల్లవాద్యుద్దీపకదర్శనమువలన నాకులత గలిగె ననుట.
మ. జననాథస్మర చింతనా పరవశ ◊స్వాంతంబునం బొల్చుకో
కనదామోద రయంబుచేఁ గమిచి పొం◊గంజేసెఁ దాపంబుఁ జ
క్కన దామోదరసూను ఘోటపటలీ ◊గాఢధ్వనిశ్రేణి యా
కనదామోదరసాప్త భృంగకుల ఝం◊కారంబు లప్పట్టునన్. 16
టీక: అప్పట్టునన్=ఆసమయమందు; దామోదరసూనుఘోటపటలీగాఢధ్వనిశ్రేణి – దామోదరసూను=మరునికి, ఘోట= అశ్వములగు చిల్కలయొక్క, పటలీ=గుంపుయొక్క, గాఢధ్వనిశ్రేణి = తీవ్రమైన ధ్వనిపరంపర; ఆకనదామోదరసాప్తభృంగ కులఝంకారంబులు – ఆకనత్=మిగులఁ బ్రకాశించుచున్న, ఆమోదరస=సంతోషరసమును, ఆప్త=పొందిన, భృంగకుల= తేఁటిగుంపులయొక్క, ఝంకారంబులు= మ్రోఁతలు; జననాథస్మరచింతనాపరవశస్వాంతంబునన్ – జననాథస్మర= మరునిఁ బోలు సుచంద్రునియొక్క, చింతనా=ధ్యానమునకు, పరవశ=ఆయత్తమైన, స్వాంతంబునన్=మనస్సుచేత; పొల్చు కోకనదా మోదన్ = ఒప్పుచున్న పద్మగంధియగు చంద్రికను, కోకనదము లనఁగా రక్తోత్పలములు, వానియామోదమువంటి యామో దము (గంధము) గలది కోకనదామోద ; రయంబుచేన్=వేగముచేత; కమిచి=పట్టుకొని; తాపంబున్=సంతాపమును;చక్కనన్ = బాగుగను; పొంగంజేసెన్ = ఉప్పొంగునట్లు చేసెను. శుకకూజిత భ్రమరఝంకారములచేఁ జంద్రికసంతాపము మిక్కిలి యుప్పొంగె ననుట.
సీ. వినఁ గొంకు శుకపిక◊ధ్వని మనోభవ మాన,రాగ కాతనుబలా◊రభటి యనుచు,
నంట భీతిలుఁ బల్ల◊వాళి హృద్భవ మాన,నీయ ధామశిఖాని◊కాయ మనుచు,
నెనయ నోడు విలాస◊వనవాటి భవమాన,హర భూరిదుర్గచ◊యం బటంచుఁ,
గన స్రుక్కునవకోర◊కచ్ఛటాభ వమాన,కారి కందర్పాసి◊ధార యనుచు,
తే. నిటులు వలవంతఁ గుందు నా◊నృపతిరూప,ఘనవిభవ మానరానియు◊త్కలికఁ గాంచి
నట్టితఱినుండి క్షణదోద◊యావనీశ్వ,రాత్మభవ మానసంబు తా◊పార్చిఁ గలఁగ. 17
టీక: క్షణదోదయావనీశ్వరాత్మభవ=క్షణదోదయరాజపుత్త్రికయైన చంద్రిక; ఆనృపతిరూపఘనవిభవము = ఆసుచంద్రుని యొక్క సౌందర్యాతిశయమును; ఆనరానియుత్కలికన్ = పట్టఁజాలని సంతసముచేత; కాంచినట్టితఱినుండి = చూచినట్టి సమయమునుండి; మానసంబు = చిత్తము; తాపార్చిన్=సంతాపజ్వాలచేత; కలఁగన్ = కలఁతపాఱఁగా; శుకపికధ్వనిన్ = చిలుకలయొక్కయు, కోయిలలయొక్కయు పలుకులు; మనోభవమానరాగకాతనుబలారభటి – మనోభవ=మనస్సునందుఁ బుట్టిన, మానరాగక=గర్వమాత్సర్యములు గల,అతనుబల=మన్మథసైన్యముయొక్క, ఆరభటి యనుచున్=ధ్వని యనుచు; వినన్ = వినుటకు; కొంకున్ = కొతుకును. పల్లవాళిన్= చిగురుటాకులగుంపును; హృద్భవమాననీయధామశిఖానికాయ మనుచున్ – హృద్భవ=మరునియొక్క, మాన నీయ = పూజనీయమగు, ధామ=ప్రతాపముయొక్క, శిఖా=జ్వాలలయొక్క, నికాయ మనుచున్= గుంపనుచు; అంటన్ = ముట్టుటకు; భీతిలున్=వెఱచును. ప్రతాప మెఱ్ఱని దనుట కవిసమయప్రసిద్ధము. విలాసవనవాటిన్=ఉద్యానవనవీథిని; భవమానహరభూరిదుర్గచయంబు అటంచున్ – భవమానహర=కామునియొక్క, భూరి =అధికమగు, దుర్గచయంబు = దుర్గముల సంఘము, అటంచున్=అనుచు;ఎనయన్=పొందుటకు; ఓడున్=వెనుదీయును.
నవకోరకచ్ఛటాభన్ = క్రొతమొగ్గలగుంపులయొక్క కాంతిని; వమానకారికందర్పాసిధార యనుచున్ – వమానకారి= అవమా నము చేసెడు, అవశబ్దాకార మిచట లోపించినది, కందర్ప=మరునియొక్క, అసిధార = ఖడ్గముయొక్క అంచు, అనుచున్ ; కనన్ = చూచుటకు; స్రుక్కున్ = భయపడును. ఇటులు=ఈప్రకారముగ; వలవంతన్=మన్మథవ్యథచేత; కుందున్=దుఃఖిం చును. ఇట సంతాపాతిశయముచే శుకధ్వని మొదలగువాని యందరతి వ్యజ్యమాన మగును.
చ. ఉదుటున మోహనాదిక మ◊హోగ్రతరాస్త్ర నిరూఢిఁ దత్తమి
స్రదనుజభేదిపై నెడయఁ◊జాలనికోరిక నానవీనతో
యదకచ కొందఁజేయ నభ◊వారి శయమ్ములఁ గంకణావళుల్
వదలెఁ దొలంకెఁబో నయన◊వారిశయమ్ములఁ గంకణావళుల్. 18
టీక: అభవారి = మన్మథుఁడు; ఆనవీనతోయదకచకున్ = నవజలదమునుబోలు వెండ్రుకలు గల యాచంద్రికకు; ఉదుటునన్ = ఔద్ధత్యముచేత; మోహనాదికమహోగ్రతరాస్త్రనిరూఢిన్ – మోహనాదిక=మోహనము మొదలుగాఁగల, మహోగ్రతర=మిగుల భయంకరమగు, అస్త్ర=బాణములయొక్క, నిరూఢిన్= ప్రసిద్ధిచేత; తత్తమిస్రదనుజభేదిపైన్ = తమిస్రాసురవిరోధి యగు సుచం ద్రునిమీఁద; ఎడయఁజాలనికోరికన్ = తొలఁగనివాంఛను; ఒందఁజేయన్=పొందఁజేయఁగా; శయమ్ములన్=హస్తములందు; కంకణావళుల్=వలయములగుంపులు; వదలెన్=జాఱెను; నయనవారిశయమ్ములన్ = వారిజములఁబోలు నేత్రములయందు; కంకణావళుల్=జలబిందువులగుంపులు; తొలంకెఁబో = చిందెనుబో. కార్శ్యముచేతఁ గరకంకణములు, దైన్యముచేత నయనాశ్రువులు చంద్రికకు జాఱె ననుట. కార్శ్య మనునది యనంగదశా విశేషము. దైన్యము తత్సంచారి యగును. అశ్రువు దైన్యానుభావరూప మగు సాత్త్వికభావము. విరహోత్కర్షము దీనియందు గదితం బయ్యె.
చ. కనుదొవదోయి నిర్నిమిష◊గౌరవ మందఁగ నబ్బురంబుతో
ననుపమరక్తితోఁ బ్రియమ◊హాఫలకాలసమానరూపమున్
గనుఁగొను నెప్పు డెప్పు డల◊కామిని యాతఱి యెల్ల నెన్నఁగా
ననువుగఁ బొల్చెఁ బూనియ మ◊హాఫలకాలసమానరూపమున్. 19
టీక: అలకామిని = ఆచంద్రిక; ప్రియమహాఫలకాలసమానరూపమున్ – ప్రియ=ప్రియుఁడగు సుచంద్రునియొక్క, మహాఫలక = గొప్పపలకయందు, ఆలసమాన=మిగులఁ బ్రకాశించుచున్న, రూపమున్=స్వరూపమును; అబ్బురంబుతోన్ = ఆశ్చర్యము తోను; అనుపమరక్తితోన్ = సాటిలేని యనురాగముతోను; కనుదొవదోయి = కలువలవంటికన్నుఁగవ; నిర్నిమిష గౌరవము = ఱెప్పపాటిలేమియొక్క యాధిక్యమును; అందఁగన్=పొందునట్లుగా; ఎప్పుడెప్పుడు=ఏయేసమయమునందు; కనుఁగొనున్ = చూచునో; ఆతఱి యెల్లన్ = ఆసమయమంతయు; ఎన్నఁగాన్=పరికింపఁగా; మహాఫలకాల సమానరూపమున్ – మహత్ = గొప్పదియైన, ఫలకాల=ప్రియసమాగమకాలమునకు, సమానరూపమున్=తుల్యరూపమును; పూనియ =పొందియే; అనువుగన్=అనుకూలముగా;పొల్చెన్=ఒప్పెను. ఆచంద్రిక కాలక్షేపార్థము పలకయందు వ్రాయఁబడిన తన ప్రియునిరూపము నెప్పు డెప్పు డనురాగాతిశయమున నవలోకించునో అప్పుడు ప్రత్యక్షప్రియసంగమువలె నామెకు భాసిల్లు నని భావము.
సీ. కన నింపుఁ గూర్చు చ◊క్కనిమోమువలిమిన్న, మనసార ముద్దు గై◊కొనఁగఁ దివురు,
నేల వే లనుచుఁ గ◊పోలలవలి మిన్న,కయ పునర్భవపాళిఁ ◊గరము మీటుఁ,
గలికిచన్గుబ్బలి◊కవ యాన వలిమిన్న, వాసక్తిఁ గౌఁగిట ◊నందఁ జూచు,
లలితాధరోష్ఠప◊ల్లవసుధావలి మిన్న,లము సమ్మదమునఁ గ్రో◊లంగఁ దలఁచుఁ,
తే. జెలఁగి యాశీతకరకళా◊జేతృఫాల,ఫలక రమణీయమోహసం◊భ్రాంత యగుచు
ఫలక రమణీయరూపంబు ◊ప్రౌఢి వ్రాసి, యంబురుహబాణకేళికా◊శాప్తి నపుడు. 20
టీక: అపుడు=ఆసమయమున; ఆశీతకరకళాజేతృఫాలఫలక =చంద్రకళను గెలిచెడు నుదురుగల యాచంద్రిక; రమణీయ మోహసంభ్రాంత = మనోజ్ఞమగు మోహముచేత సంభ్రమించునది; అగుచున్; ఫలక = పలకయందు; రమణీయ=మనోజ్ఞ మగు, రూపంబు=ప్రియస్వరూపమును; ప్రౌఢిన్=నేర్పుచేత; వ్రాసి=లిఖించి; అంబురుహబాణకేళికాశాప్తిన్ – అంబురుహ బాణ=మన్మథునియొక్క, కేళికా=క్రీడయందలి, ఆశాప్తిన్ = ఆశాప్రాప్తిచేత; చెలఁగి=ఒప్పి; కనన్=చూచుటకు; ఇంపున్ = సొంపును; కూర్చు చక్కనిమోమువలిమిన్నన్ = ఘటిల్లఁజేయు నందమైన ముఖచంద్రుని; మనసారన్ = ముచ్చటదీఱునట్లు; ముద్దు గైకొనఁగన్ = ముద్దుపెట్టుకొనుటకు; తివురున్ = ప్రయత్నించును; ఏలవు ఏల అనుచు = ఎందుకు రక్షింపవనుచు; కపోలలవలిన్=తమలపాకువంటి చెక్కిలిని; మిన్నకయ = ఊరకయే; పునర్భవపాళిన్ = నఖరాజిచేత; కరము = మిక్కిలి; మీటున్ = గీఱును; కలికిచన్గుబ్బలికవ – కలికి=అందమైన, చన్గుబ్బలి=పర్వతములఁబోలు స్తనములయొక్క,కవ=యుగము; ఆనన్=ఒరయునట్లు;వలిమిన్=బలాత్కారముచేత, ‘వబయో రభేదః’ అనుచొప్పున బలిమి వలిమిగా వాడఁబడినది; నవాసక్తిన్ = అపూర్వానురాగముచేత; కౌఁగిటన్ = భుజాంతరమందు; అందన్ చూచున్ = పొందఁ జూచును; లలితాధరోష్ఠపల్లవసుధా వలి – లలిత=మనోజ్ఞమైన, అధరోష్ఠపల్లవ = పల్లవమునుబోలు నధరోష్ఠముయొక్క, సుధావలి = అమృతపరంపరను; మిన్ను +అలము=మిన్నలము=ఆకాశము నంటునట్టి, అధికమైన యనుట; సమ్మదమునన్=సంతసముచేత; క్రోలంగన్=పానముఁ జేయుటకు; తలఁచున్ = తలంచును. పూర్వపద్యోక్తమైన సాక్షాత్సంగమవద్భావన మిందు వివరింపఁ బడియె.
చ. చలనముఁ బొందసాగెఁ జెలి◊స్వాంత మరాళమరాళవృత్తికిన్
విలయకృశానుహేతి తుల◊నీయ నిశాత నిశాతపాళికిన్
ఫలనిభవాయుకీర్ణ మధు◊పాదప రాగ పరాగ పాళికిన్
లలిత రసాల సంగత క◊లస్వనవీన నవీన గీతికిన్. 21
టీక: చెలిస్వాంతము=చంద్రికయొక్క మనస్సు; అరాళమరాళవృత్తికిన్=కుటిలమైన హంసవర్తనమునకు; విలయకృశాను హేతితులనీయనిశాతనిశాతపాళికిన్—విలయకృశాను=ప్రళయకాలాగ్నియొక్క, హేతి=జ్వాలలతోడ, తులనీయ =పోల్పఁ దగిన, నిశాత=తీక్ష్ణమైన, నిశాతప=వెన్నెలలయొక్క, ఆళికిన్=సమూహమునకు; ఫలనిభవాయుకీర్ణమధుపాదపరాగపరాగ పాళికిన్ – ఫలనిభ=బాణపుములుకులకు సరియైన, వాయు=దక్షిణమారుతముచే, కీర్ణ=చెదరినట్టి, మధుపాదప=ఇప్పచెట్ల యొక్క, రాగ=దాడిమములయొక్క, పరాగ=పుప్పొడులయొక్క, పాళికిన్=గుంపునకు; లలితరసాలసంగతకలస్వనవీన నవీనగీతికిన్ – లలిత=మనోజ్ఞములగు, రసాల=తీయమావులయందు, సంగత=సంబంధించినట్టి, కలస్వన=అవ్యక్తమధుర ధ్వనులు గల కోకిలములు మొదలుగాఁ గల, వీన (వి+ఇన) = పక్షిశ్రేష్ఠములయొక్క, నవీన=క్రొత్తనైన, గీతికిన్=గానమునకు; చలనముఁ బొందన్=చాంచల్యమును పొందుటకు; సాగెన్=ఆరంభించెను. ఇట నుద్వేగ మను స్మరదశ గదితం బగును. ‘మానసః కంప ఉద్వేగః కథిత స్తత్ర విక్రియాః, చిత్తసంతాపనిశ్వాసౌ ద్వేషః శయ్యాసనాదిషు| స్తమ్భ చిన్తాశ్రు వైవర్ణ్యదీనత్వాదయ ఈరితాః’ అని తల్లక్షణ తత్కార్యంబులు తెలియవలయు.
మ. జనరాట్కన్య స్వసంగతి న్మను మహా◊చక్రాంగనాళీకలో
చన పొందున్ నిజజీవబంధురతిరా◊ట్చక్రాంగనాళీకయో
జనమున్ నిర్మలభాస్వదాప్తమతిమ◊చ్చక్రాంగనాళీకన
ద్ఘనసంసర్గము నొంద లేదుగ సుచం◊ద్రవ్యక్తలోభంబునన్. 22
టీక: జనరాట్కన్య=రాజపుత్త్రికయగు చంద్రిక; స్వసంగతిన్=తనసాంగత్యముచేత, తనమంచినడకచేత నని దోఁచును; మను మహాచక్రాంగనాళీకలోచన పొందున్ – మను=బ్రతుకుచున్న, మహత్=అధికమైన, చక్రాంగ=హంసలయొక్క, నాళీకలోచన = పద్మనయనలయొక్క, హంసస్త్రీలయొక్క యనుట, పొందున్=సాంగత్యమును; నిజజీవబంధురతిరాట్చక్రాంగనాళీకయోజ నమున్ – నిజ=తనయొక్క, జీవబంధు=ప్రాణవాయువులకుఁజుట్టమగు, ప్రాణస్నేహితుఁడని తోఁచును, రతిరాట్చక్రాంగ= రతి పతియైన మన్మథునియొక్క రథమగు మందమారుతముయొక్క, నాళీక (న+అళీక) = సత్యమైన, యోజనమున్=సంబంధ మును; నిర్మలభాస్వదాప్తమతిమచ్చక్రాంగనాళీకనద్ఘనసంసర్గమున్ – నిర్మల=నిర్మలుఁడైన, భాస్వత్=సూర్యునికి, ఆప్తమతి మత్=హితబుద్ధిగల, చక్రాంగనా=ఆఁడుజక్కవలయొక్క, ఆళీ=పరంపరయొక్క, కనత్=ఒప్పుచున్న, ఘనసంసర్గమున్ = గొప్పసంబంధమును; సుచంద్రవ్యక్తలోభంబునన్ = సుచంద్రునియందు వ్యక్తమైన ఆసక్తిచేత, మంచిబంగారమందు వ్యక్తమైన యాసక్తిచేత నని యర్థాంతరము దోఁచును; ఒంద లేదుగ = పొందదుగదా! ధనాశగలవా రాప్తులను వదలునట్లు, చంద్రిక సుచంద్రునిమీఁది యనురాగముచే స్వసంగత్యాదులు గలవైనను హంసప్రభృతులను వదలె ననుట.
సీ. కొమిరె యాయీశుకూ◊టమి గోరుఁ బో యాత్మ,కరవాలశిఖిహేతిఁ ◊గంతుఁ డేచ,
నువిద యాఘనునిపొం◊దూహించుఁ బో చైత్రి,కరవాలపనసూచి ◊గాఁడి పాఱఁ,
దెఱవ యాకనకమూ◊ర్తిఁ దలంచుఁ బో మధు,కరవాలకచ లెల్లఁ ◊గలఁగఁ జేయ,
మగువ యాభోగిపై ◊మన ముంచుఁ బో సుదు,ష్కరవాలపవనంబు ◊గాసి వెట్ట,
తే. నినుని వినుతించుఁబో మదిఁ ◊గనలి నారి,క నలినారిమరీచిసం◊ఘాత మలమ,
నారమణి నిత్య మిటులు హృ◊త్సారసంబు, సారసంబుద్ధతాపసం◊సక్తి నెనయు. 23
టీక: కంతుఁడు=మరుఁడు; ఆత్మకరవాలశిఖిహేతిన్ – ఆత్మ=తనయొక్క, కరవాల=ఖడ్గమనెడు, శిఖి=అగ్నియొక్క, హేతిన్ = జ్వాలచేత; ఏఁచన్=బాధింపఁగా; కొమిరె = చంద్రిక; ఆయీశుకూటమిన్=ఆసుచంద్రునియొక్క సంగమమును; కోరుఁ బో = కాంక్షించును బో, ప్రసిద్ధుఁడగు శివునియొక్క సాంగత్యమును గోరునని యర్థాంతరము దోఁచును. శివుఁడు స్మర
హరుండు గావున నతని సాంగత్యమున స్మరబాధ శమించు నని యతనిసంగతిని గోరు ననుట. చైత్రికరవాలపనసూచి – చైత్రికరవ=చైత్రమాసమందుఁ బుట్టిన ధ్వని గల కోయిలలయొక్క, ఆలపన=ధ్వని యనెడు, సూచి = సూది; గాఁడి పాఱన్= తూఱిపాఱఁగా; ఉవిద=చంద్రిక; ఆఘనునిపొందు = ఆసుచంద్రుని సంగమమును, మేఘముయొక్క సంగము నని యర్థాంతరము దోఁచును ; ఊహించుఁబో = ఆలోచించును బో, అనఁగా మేఘకాలమందు పికములు ధ్వని సేయ వని కవిసమయము కావున నాఘనసాంగత్యముచేత పికరుతివలన నైన బాధను శమింపఁజేయ వచ్చునని ఘనుని పొందూ హించె ననుట. సుచంద్రుని పొందువలనఁ దద్బాధోపశమనము సహజము. మధుకరవాలకచలు – మధుకర=తుమ్మెదలయొక్క, వాలకచలు=వాల మనఁగా కురువేరు, దానింబోలు వెండ్రుకలు గలవారు వాలకచలు, స్త్రీలు, ఆఁడుతుమ్మెదలనుట,‘వాలం హ్రీబేర బర్హి ష్ఠోదీచ్య కేశామ్బునామచ’అని అమరశేషము;ఎల్లన్=అన్నియు; కలఁగఁ జేయన్ = కలఁతపడునట్లు చేయఁగా; తెఱవ = చంద్రిక; ఆకనకమూర్తిన్ = బంగరువంటి దేహముగలవాఁడగు సుచం ద్రుని, సంపెంగ నని యర్థాంతరము దోఁచును; తలంచుఁబో = స్మరించును బో. అనఁగా సంపెంగ తుమ్మెదలకు విరోధి గావున తత్సాహాయ్యమునఁ దుమ్మెదలబాధ శమించు నని దానిఁదలంచు ననుట. సుచంద్రుని సాహాయ్యమునఁ దేఁటులబాధయొక్క యుపశమనము సహజము. సుదుష్కరవాలపవనంబు = మిక్కిలి యనివార్యమైన లేఁతగాడ్పు, ‘శసయోర్బవయో స్తథా’ అనుటచే నిట వకారబకారముల కభేదము చెప్పఁబడియె; గాసి వెట్టన్= బాధింపఁగా; మగువ = చంద్రిక; ఆభోగిపైన్= ఆరాజుపైని, ఆసర్పముపై నని యర్థాంత రము దోఁచును; మన ముంచుఁబో= మనస్సు నిల్పునుబో. అనఁగా సర్పములు పవనవిరోధులు గావునఁ దత్సాహాయ్యమున మందమారుతబాధను శమింపఁజేయ వచ్చునని భోగిపై మనముంచు ననుట. సుచంద్రసంగమమువలన తత్బాధోపశమనము సహజము. నలినారిమరీచిసంఘాతము = చంద్రతేజఃపరంపర; అలమన్=ఆక్రమింపఁగా; నారిక=చంద్రిక; మదిన్ =చిత్తమందు; కనలి= తపించి; ఇనునిన్=సుచంద్రరాజును, సూర్యుని నని యర్థాంతరము దోఁచును; వినుతించుఁబో=ప్రశంసించునుబో; అనఁగా చంద్ర తేజఃపుంజము సూర్యప్రకాశమువలన శమించును గావున చంద్రికాబాధోపశమనమునకై సూర్యుని నుతించె ననుట. సుచంద్ర సంగమమువలన తత్బాధోపశమనము సహజము.
ఆరమణి = ఆచంద్రిక;నిత్యము=ఎల్లపుడు; హృత్సారసంబు సారసంబుద్ధతాపసంసక్తిన్ – హృత్సారసంబు = మనోంబుజము యొక్క, సార=చేగబాఱిన, సంబుద్ధ=స్ఫుటమైన, తాప=సంతాపముయొక్క, సంసక్తిన్=సంబంధమును; ఇటులు = ఈప్రకా రముగా; ఎనయున్ = పొందును.
చ. సతతము తీవ్ర హేతిధర◊ సార సమాన వరాజసూను సం
జిత విరహోగ్ర తాప తతి◊చేఁ జలియించు నిజాంతరంగకం
జతలము తన్ముఖేందుజిత◊సారస మానవరాజసూనుసం
గతముగ నూన్చి కూర్చె నవి◊ఖండితసమ్మదవార్ధివీచికన్. 24
టీక: తన్ముఖేందుజితసారస – తత్=ఆ, ముఖేందుజితసారస = ముఖచంద్రునిచే గెలువఁబడిన తమ్మి గల చంద్రిక; సతతము = ఎల్లప్పుడు; తీవ్రహేతిధరసారసమానవరాజసూనుసంజితవిరహోగ్రతాపతతిచేన్ – తీవ్ర=గాఢమైన, హేతిధర=అగ్నివలె, సార = అధికమైన, సమాన=గర్వముతోఁ గూడిన, వర=శ్రేష్ఠమైన, అజసూను=మరునిచేత, ‘అజో హరౌ హరే కామే’ అని విశ్వము, సంజిత=కూర్పఁబడిన, విరహోగ్రతాపతతిచేన్ = విరహసంబంధమైన తీవ్రమైన సంతాపపరంపరచేత; కాదేని, హేతిధరసార = అగ్నిబలముతో, సమ=తుల్యమగు, అనవర=కొదువగాని, అజసూను=మరునిచేత నని యర్థము; చలియించు నిజాంతరంగ కంజతలము – చలియించు=కంపించుచున్న, నిజ=తనయొక్క, అంతరంగకంజతలము = మనఃపద్మతలమును; అవిఖండిత సమ్మదవార్ధివీచికన్ = అవిచ్ఛిన్నమగు సంతోషసముద్రతరంగములను, సముద్రతరంగములవలె నవిచ్ఛిన్నముగ నుదయించు సంతసము ననుట, జాత్యేకవచనము; ఊన్చి=వహింపఁజేసి; మానవరాజసూనుసంగతముగన్ = రాజపుత్త్రుండగు సుచంద్రు నితోఁ గూడినదానిఁగా; కూర్చెన్=ఘటిల్లఁజేసెను.
అనఁగాఁ జంద్రిక కామాగ్నిసంతప్తమగు తనమనంబు సుచంద్రునిపై నిలిపి ప్రమోదవార్ధిలో మునుఁగఁజేసె ననుట.
చ. నలినసమాననా ధృతిఘ◊నత్వ మడంచె రుషార్చి నెమ్మదిన్
మలయ సమీరణాళికుసు◊మవ్రజబోధిత భృంగశింజినిన్
నలి నసమాన నాల సుమ◊న శ్శర మండలిఁ గూర్చి నొంచుచున్
మలయసమీరణాఖ్యరథ◊మధ్యగుఁడై ననవిల్తుఁ డుద్ధతిన్. 25
టీక: ననవిల్తుఁడు=పుష్పధన్వి యగు మరుఁడు; ఉద్ధతిన్=దర్పముచేత; మలయసమీరణాఖ్యరథమధ్యగుఁడై =మలయ మారుత మను పేరిటితేరి నుడుమ నుండినవాఁడై; సమీరణాళికుసుమవ్రజబోధిత భృంగశింజినిన్ –సమీరణాళి=మరువపుచాలు యొక్క, కుసుమవ్రజ=పూమొత్తములచేత, బోధిత=మేల్కొల్పఁబడిన, భృంగ=తుమ్మెదలనెడు, శింజినిన్=అల్లెత్రాటియందు; నలిన్ = మిక్కిలి; అసమాననాలసుమనశ్శరమండలిన్= సాటిలేని కాఁడలుగల పూవుటమ్ములయొక్కగుంపును; కూర్చి= సంధించి; నొంచుచున్=నొవ్వఁజేయుచు; రుషార్చి =రోషజ్వాల; నెమ్మదిన్=నిండుమనమునందు; మలయన్=వ్యాపింపఁగ; నలినసమాననాధృతిఘనత్వము – నలినసమాననా = తమ్మినిఁబోలు మోముగల చంద్రికయొక్క, ధృతి=ధైర్యముయొక్క, ఘనత్వము = ఆధిక్యమును; అడంచెన్=అడఁగఁజేసెను. అనఁగామలయమారుతభ్రమరఝంకారాదులచేఁ జంద్రికకు సంతాప మెక్కుడై యాసుచంద్రనరేంద్రునిపొందు లేక నిలువఁజాల నను నధైర్య ముదిత మయ్యె ననుట.
తే. అంత వలఱేనికి సహాయ◊మగుచు హితఫ,లాభికాంక్షి శుకత్రిద◊శాళిసురభి
జగతి గనుపట్టె నవసూన◊శాలి సురభి,లామ్రతిలకైకసంగమా◊శాలి సురభి. 26
టీక: అంతన్=తదనంతరమునందు; హితఫలాభికాంక్షి శుకత్రిదశాళి సురభి – హిత=ప్రియములైన, ఫల=పండ్లనెడు లాభము లను, అభికాంక్షి=కోరుచున్న,శుకత్రిదశ=చిలుకలను దేవతలయొక్క, ఆళి=గుంపునకు, సురభి=కామధేనువైనది, అనఁగా దేవతలకుఁ గామధేనువు కోరినలాభము లిచ్చునట్లు శుకవ్రజమునకుఁ గోరినపండ్లను వసంత మిచ్చు ననుట; నవసూనశాలి సురభిలామ్రతిలకైకసంగమాశాలి సురభి – నవ=నూతనములైన, సూన=కుసుమములచేత, శాలి=ఒప్పుచున్న, సురభిల= పరి మళించుచున్న, ఆమ్ర=మావులయొక్క, తిలక=బొట్టుగులయొక్క, ఏక=ముఖ్యమగు, సంగమ=సంపర్కమందు, ఆశ= ఆసక్తి కల్గిన, అలి=తుమ్మెదలు గలదియునగు, సురభి=వసంతము; వలఱేనికిన్=కామునికి; సహాయమగుచున్=తోడగుచు; జగతిన్=భూమియందు; కనుపట్టెన్=అగపడెను. అనఁగా వసంతోదయ మాయె ననుట. ఇటనుండి వసంతవర్ణన మారంభింపఁ బడుచున్నది.
సీ. సుమనోగసమ చూత◊ సుమనోగణ పరీత, సుమనోగణిత సార◊ శోభితాళి,
కలనాదసంతాన◊ కలనాద సమనూన, కలనా దలిత మాన◊బల వియోగి,
లతికాంతరిత రాగ◊ లతికాంతసపరాగ, లతికాంతపరియోగ◊లక్ష్యకాళి,
కమలాలయాస్తోక◊ కమలాలయదనేక, కమలాలసితపాక◊కలితకోకి,
తే. జాలకవితానకవితాన◊పాళిభూత, చారుహరిజాతహరిజాత◊తోరణోల్ల
సద్వ్రతతికావ్రతతికావ్ర◊జక్షయాతి,భాసురము పొల్చె వాసంత◊వాసరంబు. 27
టీక: సుమనోగ సమ చూత సుమనోగణ పరీత సుమనోగణిత సార శోభితాళి – సుమనోగ=కల్పవృక్షముతోడ, సమ=తుల్య మగు, చూత=మావులయొక్క, సుమనోగణ=కుసుమకదంబముచేత, పరీత=వ్యాప్తమైన, ఇది అళివిశేషణము, సుమనః = మంచిమనస్సులయందలి, అగణిత=అధికమైన, సార=సామర్థ్యముచేత, శోభిత=ప్రకాశించుచున్న, అళి=తుమ్మెదలు గలది. అనఁగా రసాలకుసుమముల నాశ్రయించినవి మనస్సులయం దగణితసామర్థ్యము గలవి యగు తుమ్మెదలు గల దనుట, ఇది వాసంతవాసరమునకు విశేషణము. ముందు నిట్లె తెలియవలయు. కలనాదసంతాన కల నాద సమనూన కలనా దలిత మానబల వియోగి – కలనాదసంతాన =కోయిలగుంపుయొక్క, కల= అవ్యక్త మధురమైన, నాద=ధ్వనియొక్క, సమనూన = మిగుల నధికమైన, కలనా=ఆకలనముచేత, అనఁగా వినికిచేత, దలిత = పోఁగొట్టఁబడిన, మానబల=కోపసామర్థ్యము గల, వియోగి=విరహులు గలది. అనఁగా కోకిలాలాపసమాకలనముచేత విరహిజన మానబలము పోయిన దనుట. లతికాంతరిత రాగ లతికాంత సపరాగ లతికాంత పరియోగ లక్ష్య కాళి – లతికాంతరిత=తీవెలచేతఁ గప్పఁబడిన, రాగ=దాడి మలయొక్క, లతికా=కొమ్మలయొక్క, అంత=మనోజ్ఞమగు, సపరాగ=పుప్పొడితోఁ గూడిన, లతికాంత=పువ్వులయొక్క, పరియోగ = సంపర్కముచేత, లక్ష్య=చూడఁదగిన, క=ఉదకముయొక్క, ఆళి=శ్రేణులు గలది. అనఁగా వసంతవాసరమున జలహ్రదాదులు పుప్పొడితోఁ గూడి వ్రాలినదాడిమీకుసుమములచేఁ జూడ సొంపుగా నుండు ననుట. కమలాల యాస్తోక కమలాలయ దనేక కమలాలసిత పాక కలిత కోకి – కమలాలయ=పద్మాకరములయొక్క, అస్తోక= అధికములగు, ఇది కమలములకు విశేషణము, కమలా=లక్ష్మీదేవికి, ఆలయత్=గృహమువలె నాచరించుచున్న, అనేక= అసంఖ్యాకములైన, కమలా=పద్మములయందు, ఆలసిత=మిగులఁ బ్రకాశించుచున్న, పాక=పిల్లలతోడ,‘పోతః పాకోర్భకో డిమ్భః’ అని యమరుఁడు, కలిత=కూడుకొనిన, కోకి=ఆఁడుజక్కవలు గలది. ఈసమాసముమీఁద సమాసాంతవిధి యనిత్య మగుటఁ జేసి ‘నద్యృతశ్చ’ అని కప్ప్రత్యయము లేదు. కొలఁకులయందు వసంతవాసరమున చక్రవాకస్త్రీలు బిడ్డలతో నివసించి రాజిల్లుచుందు రనుట.
జాలక వితానక వితాన పాళిభూత చారు హరిజాత హరిజాత తోరణోల్లసద్వ్రతతి కావ్రతతికా వ్రజ క్షయాతిభాసురము – జాలక= మొగ్గలయొక్క, వితానక=సమూహమనెడు, వితాన=మేలుకట్టుచేతను, పాళిభూత= బారులుగా నున్న, చారు= మనోజ్ఞములైన, హరిజాత=మన్మథునికి, హరిజాత=వాహనములైన చిలుకలగుంపనెడు, తోరణ=తోరణముచేతను, ఉల్లసత్ =ప్రకాశించుచున్న, వ్రతతి=తీవెలయొక్క, కావ్రతతికా=ఈషల్లతలయొక్క, పక్కకొమ్మలయొక్క యనుట, ‘ఈషదర్థేచ’ అను సూత్రముచేత కుశబ్దమునకు కాదేశము, వ్రజ=సంఘములనెడు, క్షయ=గృహములచేత, ‘నివేశః శరణం క్షయః’ అని యమరుఁడు, అతి భాసురము = మిగులఁ బ్రకాశమాన మైనది. అనఁగా వసంతవాసరమున లతాగృహములు మొగ్గలగుంపు లనెడు మేలుకట్లచేతను, చిల్కలబారు లనెడు తోరణములచేతను విలసిల్లుచుండు ననుట; వాసంతవాసరంబు=వసంతదినము; పొల్చెన్=ఒప్పెను.
సీ. కిసలార్పితానంద◊రసలాభకపికాళి, కామనం బబలాప్త◊కామనంబు,
సుమభావిధాన్యోన్య◊సమభావయుతరాగ,పర్ణకం బాపత◊త్పర్ణకంబు,
నవపారిజాతప్ర◊సవపాళిపుష్టాళి,దారకంబు వియోగి◊దారకంబు,
కురువామితపరాగ◊గురువాసనాకీర్ణ,పుష్కరం బుద్దీప్త◊పుష్కరంబు,
తే. సారమాకందఫలలగ◊త్కీరమాని, నీక్షణంబు క్షరద్యామి◊నీక్షణంబు
మంజులానేకకుసుమవ◊ద్వంజులాది,కాగమమువొల్చె నిలఁ జైత్రి◊కాగమంబు. 28
టీక: కిస లార్పి తానందరస లాభక పికాళికా మనం బబలాప్త కామనంబు – కిసల=చిగురులచేత, అర్పిత=ఉంపఁబడిన, ఆనందరస = ప్రమోదరస మనెడు, లాభక=ఆదాయము గల్గిన, పికాళికా=కోకిలపంక్తులయొక్క, మనంబు=మనస్సుగలది, అబల = స్త్రీలచేత, ఆప్త=పొందఁబడిన, కామనంబు=కాముకులు గలది. ‘కమనః కామనోభికః’ అని యమరుఁడు. అనఁగా వసంతము రాఁగానే స్త్రీలు త్యక్తమత్సరులై కాముకులైన ప్రియులతోఁ గలియుదు రనుట. సుమభావి ధాన్యోన్యసమభావ యుత రాగ పర్ణకం బాపత త్పర్ణకంబు – సుమభావిధా=కుసుమకాంతిప్రకారముచేత, అన్యోన్య సమభావ=పరస్పరతుల్యతతోడ, యుత=కూడిన, రాగ=దాడిములును, పర్ణకంబు=మోదుగులును గలది, ఆపతత్= రాలు చున్న, పర్ణకంబు = కారాకులు గలది. నవ పారిజాత ప్రసవపాళి పుష్టాళిదారకంబు వియోగి దారకంబు – నవ=నూతనములగు, పారిజాత=పారిజాతములయొక్క, ప్రసవపాళి=పువ్వులగుములచేత, పుష్ట=పోషింపఁబడిన, అళిదారకంబు = తుమ్మెదలపిల్లలు గలది, వియోగి= విరహులకు, దారకంబు = (హృదయ)భేదకమయినది.
కురువామిత పరాగ గురు వాసనాకీర్ణ పుష్కరం బుద్దీప్త పుష్కరంబు – కురువ=గోరంటలయొక్క, అమిత=అధికమైన, పరాగ= పుప్పొడులయొక్క, గురు=అధికమైన, వాసనా=పరిమళములచే, ఆకీర్ణ=వ్యాపింపఁబడిన, పుష్కరంబు=ఆకాశము గలది, ఉద్దీప్త=ప్రకాశించుచున్న, పుష్కరంబు= పద్మములు గలది. సార మాకందఫల లగత్కీరమానినీక్షణంబు క్షరద్యామినీ క్షణంబు – సార=శ్రేష్ఠములైన, మాకంద=తియ్యమావులయొక్క, ఫల=పండ్లయందు, లగత్=లగ్నములగుచున్న, కీరమానినీ=ఆఁడుచిలుకలయొక్క, ఈక్షణంబు = దృష్టులు గలది, క్షరత్ = తగ్గుచున్న, యామినీ=రాత్రియొక్క, క్షణంబు= క్షణములు గలది. రాత్రి తగ్గుట, పగలు హెచ్చుట వసంతమున సహజము. మంజు లానేక కుసుమవ ద్వంజులాది కాగమము – మంజుల=మనోజ్ఞమగు, అనేక=అసంఖ్యాకములగు, కుసుమవత్= పుష్ప ములు గల్గిన, వంజుల=అశోకవృక్షము, ఆదిక=మొదలుగాఁగల, ఆగమము = వృక్షములు గలదియు నగు; చైత్రికాగమంబు = చైత్ర మాసము రాక, ‘ స్యాచ్చైత్రే చైత్రికో మధుః’ అని యమరుఁడు; ఇలన్=భూమియందు; పొల్చెన్= ప్రకాశించెను.
చ. వరపురుషోత్తమాప్తి నని◊వారితసైంధవరత్నయుక్తి ని
ర్భరవసుకూటలబ్ధిఁ దన◊రారి నభోబ్ధిఁ జరించు నుజ్జ్వల
త్తరణి యనంగహారిసఖ◊ధామపథంబును బొందె నయ్యెడన్
దరణి యనంగ హారియమ◊నాథదిశానిలజాలధారచేన్. 29
టీక: వరపురుషోత్తమాప్తిన్ – వర=శ్రేష్ఠమగు,పురుషోత్తమ=నారాయణమూర్తియొక్క, పురుషశ్రేష్ఠులయొక్క యని యర్థాంత రము,ఆప్తిన్=ప్రాప్తిచేత; అనివారితసైంధవరత్నయుక్తిన్ – అనివారిత=అడ్డగింపఁబడని,సైంధవరత్న=అశ్వశ్రేష్ఠములయొక్క, సముద్రసంబంధులగు మణులయొక్క యని యర్థాంతరము, యుక్తిన్=కూడికచేత;నిర్భరవసుకూటలబ్ధిన్ – నిర్భర=మిగుల నధికములైన, వసు=కిరణములయొక్క, ధనములయొక్క యని యర్థాంతరము, కూట=రాశియొక్క, లబ్ధిన్=ప్రాప్తిచేత; తన రారి= ఒప్పారి; చరించు =సంచరించుచున్న; ఉజ్జ్వలత్తరణి = ప్రకాశమానుఁడగు సూర్యుఁడు; అనంగహారిసఖధామపథం బును – అనంగహారిసఖ=శివునిచెలికాఁడైన కుబేరునియొక్క, ధామ=నివాసస్థానముయొక్క, అలకాపురియొక్క యనుట, పథంబును = త్రోవను; హారియమనాథదిశానిలజాలధారచేన్ – హారి=మనోజ్ఞమగు, యమనాథ=యముఁడు ప్రభువుగాఁగల, దిశా=దిక్కునందలి, అనిలజాలధారచేన్= వాతజాలపరంపరచేత; తరణి యనంగన్=ఓడయట్లు; అయ్యెడన్=ఆకాలమందు; నభోబ్ధిన్= ఆకాశమను సముద్రమును; పొందెన్=పొందెను.
అనఁగా నారాయణమూర్తిచేతను, ఉత్తమాశ్వములచేతను, అమూల్యకిరణసంఘముచేతను దనరారు సూర్యుఁడు మల యానిలముతోడ నాకాశమందు దక్షిణదిశనుండి యుత్తరదిశకుఁ జేరెననియు, నట్లు చేరుట యుత్తమపురుషులచే నధిష్ఠితమై, యమూల్యరత్నములచేతను, ధనములచేతను ఒప్పియున్న యోడ సముద్రమందు అనిలజాలపరంపరచేత దక్షిణదిశనుండి యుత్తరదిశకుఁ జేరిన యట్లున్నదనియు భావము. వసంతర్తువునందు సూర్యుండు దక్షిణదిశనుండి యుత్తరదిశకుఁ జేరుట ప్రసిద్ధము.
చ. మొనచిగురాకుమోవిపస ◊మున్ మగతుమ్మెద చూపుకోపు పెం
పునఁ గలికాకుచోజ్జ్వలత◊పొందున నావనలక్ష్మి పొల్చినన్
గని యతనుప్రతాపపరి◊కల్పితమోహనిరూఢిమైఁ దలం
గని యతనుప్రతాపగతిఁ ◊గైకొనె భానుఁడు మందవర్తనన్. 30
టీక: భానుఁడు = సూర్యుఁడు; మున్=తన యెదుట; ఆవనలక్ష్మి=ఆవనసంపద, స్త్రీలింగస్వారస్యమున నొకస్త్రీ యని తోఁచును; మొనచిగురాకుమోవిపసన్ – మొనచిగురాకు=చివరయందలి చిగురుటాకనెడు, మోవి=అధరముయొక్క, పసన్=అందము చేతను; మగతుమ్మెద చూపుకోపు పెంపునన్ – మగతుమ్మెద=పురుషభృంగమనెడు, చూపు=దృష్టియొక్క,కోపు =అందము యొక్క, పెంపునన్=అతిశయముచేతను; కలికా కుచోజ్జ్వలత పొందునన్ – కలికా=మొగ్గలనెడు, కుచ=స్తనములయొక్క, ఉజ్జ్వలత పొందునన్ = ప్రకాశసంబంధముచేతను; పొల్చినన్=ఒప్పగా; కని=చూచి; అతనుప్రతాపపరికల్పితమోహనిరూఢి మైన్ – అతనుప్రతాప=మదనుని పరాక్రమముచేత, పరికల్పిత=నిర్మింపఁబడిన, మోహనిరూఢిమైన్=మోహాతిశయముచేత; తలంగని అతనుప్రతాపగతిన్ – తలంగని=తొలఁగిపోనట్టి, అతను=అధికమైన, ప్రతాప=వేఁడియనెడు సంతాపముయొక్క, గతిన్=ప్రాప్తిని; మందవర్తనన్=మెల్లనిగతిచేత, తెలివిచాలనివారిరీతిచేత నని యర్థాంతరము దోఁచు; కైకొనెన్=స్వీకరించెను.
అనఁగాచిగురాకువంటి మోవి, తుమ్మెదలవంటి చూపులు, మొగ్గలవంటి స్తనములు గల యొకస్త్రీ కనఁబడఁగా మందులైన వారు మదనపరికల్పితమోహాతిశయముచేత సంతాపము నొందునట్లు వనలక్ష్మి వసంతసమయసముదిత పల్లవకలికాభ్రమరాది సంపదచే మెలఁగఁగా సూర్యుఁడు మందవర్తనచేత మిగుల వేఁడిమిని దాల్చె ననుట. వసంతప్రాదుర్భావము కాఁగా సూర్యుని గతి మందమై, వేఁడిమి యతిశయిల్లె నని భావము. సమాసోక్త్యలంకారము. ‘విశేషణానాం సామ్యేన యత్ర ప్రస్తుతవర్తినామ్, అప్రస్తుతస్య గమ్యత్వం సా సమాసోక్తి రుచ్యతే’ అని తల్లక్షణము.
చ. నిరుపమకేళికావనుల ◊నీటుగ నామని తోఁచునంతలో
విరహిమృదుప్రవాళపద ◊వీవలితావి లతాపరాగముల్
వెరవిఁడిఁ జేయఁ జిత్తపద◊వీవలితావిలతాపరాగముల్
గరము వహించి దూఱె రతి◊కాంతునిఁ దూఱ మదిన్ స్మరాస్త్రముల్. 31
టీక: నిరుపమకేళికావనులన్ – నిరుపమ=నిస్సమానములైన, కేళికావనులన్ = విహారవనములయందు; నీటుగన్=అందము గా; ఆమని = వసంతము; తోఁచునంతలోన్=ఉదయించినక్షణమందె; విరహిమృదుప్రవాళపద—విరహి=వియోగముగల, మృదుప్రవాళపద = మృదువులును చిగురుటాకులను బోలినవియు నగు పాదములు గల స్త్రీ; వీవలితావి = వాయుసౌరభ్యము; లతాపరాగముల్=లతలసంబంధులైన పుప్పొడులు; వెరవిఁడిన్= జీవనోపాయములేనిదానిఁగా; చేయన్=చేయఁగా; చిత్తపదవీ వలితావిల తాపరాగముల్ – చిత్తపదవీ=మనోమార్గమందు, వలిత=సంచరించుచున్న, ఆవిల=కలుషములైన, తాపరాగముల్ = సంజ్వరానురాగములు; కరము = మిక్కిలి; వహించి =పొంది; మదిన్=చిత్తమందు; స్మరాస్త్రముల్=మదనబాణములు; తూఱన్=నాటఁగా; రతికాంతునిన్=మన్మథుని; దూఱెన్=నిందించెను. అనఁగా వసంతోదయమైనతోడనె విరహిణికి వాయు సౌరభ్యమువలనను, లతాపరాగములవలనను, మిక్కిలి బాధ కలిగె ననియు, దానంజేసి చిత్తమందు సంతాపానురాగములు మిక్కుటములై స్మరాస్త్రములు మది నాటినట్లు తోఁచిన దనియు, అందు వలనఁ దత్ప్రయోజకుండైన మరుని దూషించె ననియు భావము. వసంతోదయమున విరహిణులకు సంతాపోద్రేకమైన దని ఫలితార్థము.
మ. ధరఁ బాంథుల్ బెగడొందఁ ద్రిమ్మరియె భ◊ద్రశ్రీమహీభృన్మృషా
సరసాలాన వసత్యశృంఖలిత చం◊చన్మారుతేభంబు కే
సరసాలానవపత్త్రముల్ తులుముచున్ ◊జైత్రాహజాగ్రద్విలా
సరసాలానవధిప్రసూనరజముల్ ◊సారెన్ బయిన్ రువ్వుచున్. 32
టీక: ధరన్=భూమియందు; పాంథుల్=పథికులు; బెగడొందన్=భయపడునట్లుగా; భద్రశ్రీ మహీభృ న్మృషా సరసాలాన వస త్యశృంఖలిత చంచ న్మారుతేభంబు – భద్రశ్రీ=శుభలక్ష్మితోఁగూడిన, భద్రజాతితోఁ గూడిన – ఇది యిభవిశేషణము, మహీ భృత్=మలయపర్వత మనెడు, మృషా=నెపముగల, సరసాలాన=మంచికట్టుకంబముయొక్క, వసతి=స్థానమునుండి, అశృంఖలిత=విడిచిపెట్టఁబడిన, చంచత్=ప్రకాశించుచున్న, మారుత=వాయువనెడు; ఇభంబు=గజము; కేసర సాలానవ పత్త్ర ముల్– కేసర=పొన్నలయు, సాల=ఏపెలయు, అనవపత్త్రముల్=కారాకులను; తులుముచున్=రాల్చుచు; చైత్రాహ జాగ్ర ద్విలాస రసాలానవధి ప్రసూన రజముల్—చైత్రాహ=వసంతదినములయందు, జాగ్రత్=నిస్తంద్రములైన, విలాస=ఒప్పిదము గల, రసాల=తియ్యమావులయొక్క, అనవధి=మేరలేని, ప్రసూనరజముల్=పుష్పపరాగములు; సారెన్=మాటిమాటికి;
పయిన్=మీఁదను; రువ్వుచున్=వెదచల్లుచు; త్రిమ్మరియెన్=చరించెను.
అనఁగా నొకగజము కట్టుకంబమునుండి విడువఁబడినదియై మ్రాఁకులయొక్క యాకులు రాల్చుచు, పరాగములు రువ్వుచు, తెరవరులు బెగడొందునట్లు ద్రిమ్మరుచందంబున, మందమారుతము మలయపర్వతమునుండి వెడలి, కారాకులు రాల్చుచు, పుప్పొడులు సారెకు రువ్వుచు, విరహిజనులు బెగడొందునట్లు ద్రిమ్మరియె ననుట. రూపకకైతవాహ్నుతులు.
చ. వనచరపాళికా నినద◊వారము మించఁగఁ గాననంబులన్
వనచరపాళికాప్త కుహ◊నాశబరాగ్రణి నిల్చి యాశుగా
ళి నలమ సాలసంతతి చ◊లించుచు నంత శుచిచ్ఛదావళుల్
చననిభయాప్తి వైచె నన ◊జాఱె ననంత శుచిచ్ఛదావళుల్. 33
టీక: వనచరపాళికానినదవారము – వనచరపాళికా=కోకిలసంఘమనెడు కిరాతకులగుంపుయొక్క, నినదవారము = ధ్వని సమూహము; మించఁగన్=అతిశయించుచుండఁగా; కాననంబులన్=అరణ్యములందు; వనచరపాళికాప్తకుహనాశబరాగ్రణి – వనచరపాళిక=మీనకేతనునియొక్క, ‘జీవనం భువనం వనమ్’ అనియు, ‘పాళిః కేతు ర్ధ్వజో లిఙ్గమ్’ అనియు నమరుఁడు, ఆప్త = చెలియైన వసంతుఁడనెడు; కుహనా=నెపముగల, శబరాగ్రణి=కిరాతపతి; నిల్చి; ఆశుగాళిన్=వాయువు లనెడు బాణముల యొక్క చాలుచేత; అలమన్=ఆక్రమింపఁగా; సాలసంతతి = వృక్షసమూహము, తెరువరులగుంపని ధ్వనితార్థము; చలించు చున్ = కదలుచు, భయముచేత వడఁకుచు; అంతన్=తదుపరి; శుచిచ్ఛదావళుల్=శుభ్రమైన వస్త్రముల పంక్తులను; చనని భయాప్తిన్ = తొలఁగని భయప్రాప్తిచేత; వైచెన్=విడిచెను; అనన్ = అనునట్లు; అనంతన్=భూమియందు; శుచిచ్ఛదావళుల్= కారాకుల గుంపులు; జాఱెన్=వ్రాలెను.
అనఁగా నడవిలో నొకశబరాగ్రణి తనపరివారకిరాతకు లెల్లఁ జుట్టి ధ్వనులు సేయుచుండఁగా బాణము లేయ, నత్తఱి తెరు వరులు మిగుల భీతిచేత శుభ్రము లగు తమవస్త్రములు విప్పియిచ్చిన యట్లు కోయిలలు రొదసేయుచుండఁగా వసంతము కాన నములందు వ్యాపించి మందమారుతమును వీవఁజేయఁగా మ్రాఁకులపండుటాకులు భూమిని రాలె నని తాత్పర్యము.
సీ. మధుయంత విటపిసా◊మజకటమ్ముల వ్రాయ, నలరు గైరికరేఖి◊కాళు లనఁగ,
హరివిదారితపత్త్ర◊యగు నగశ్రేణిపై, నడరు గైరికరేఖి◊కాళు లనఁగ,
నళిధూమకందళి ◊యలమఁ గన్పడు దవాం,గణవిరోచనమయూ◊ఖము లనంగ,
మును మ్రింగి వెగటైన◊వనతమస్తతి గ్రక్కు, ఘనవిరోచనమయూ◊ఖము లనంగ,
తే. నహహ యవ్వేళ పత్త్రతో◊యధితటస్థ,లకనదతిరోహితప్రవా◊ళము లనంగ,
నమరె నతిరోహితప్రవా◊ళముల నంగ,కనకకరవాలికాప్రమా◊కరము లగుచు. 34
టీక: మధుయంత =వసంతమనెడు మావటివాఁడు; విటపిసామజకటమ్ములన్=మ్రాఁకులను నేనుఁగులయొక్క గండస్థలముల యందు; వ్రాయన్=లిఖింపఁగా; అలరు గైరికరేఖికాళులు=ఒప్పుచున్న సిందూరరేఖాపంక్తులు; అనఁగన్=అనునట్లుగా. దీనికి ‘ప్రవాళము లమరె’ నను దానితో నన్వయము. హరివిదారితపత్త్ర – హరి=వాయువనెడు నింద్రునిచేత, విదారిత=ఖండింపఁబడిన, పత్త్ర = ఆకులను ఱెక్కలు గలది; అగు = ఐ నట్టి; నగశ్రేణిపైన్ = వృక్షములనెడు కొండలయొక్కచాలున; అడరు గైరికరేఖికాళులు = ఒప్పుచున్న జేగుఱురేఖలయొక్క చాలులు; అనఁగన్= అనునట్లుగా; అళిధూమకందళి = తుమ్మెదలనెడు ధూమాంకురము; అలమన్=ఆక్రమింపఁగా; కన్పడు =చూపట్టుచున్న; దవాంగణవిరో చనమయూఖములు – దవాంగణ=వనాంతరమనెడు, విరోచన=అగ్నియొక్క, మయూఖములు=జ్వాలలు; అనంగన్ = అనునట్లుగా; మును =తొలుత; మ్రింగి = కబళించి; వెగటైనన్=వెక్కసము కాఁగా; వనతమస్తతి = వనములనెడు రాహులగుంపు; క్రక్కు ఘన విరోచనమయూఖములు – క్రక్కు= వమనముసేయు, ఘన=అధికమైన, విరోచన=సూర్యునియొక్క,మయూఖములు=కిర ణములు; అనంగన్=అనునట్లుగా; పత్త్రతోయధి తటస్థల కన దతిరోహిత ప్రవాళములు – పత్త్రతోయధి=ఆకులనెడు సముద్రముయొక్క, తటస్థల=దరియందు, కనత్=ఒప్పుచున్న, అతిరోహిత=మిగుల నెఱ్ఱనైన, ప్రవాళములు=పవడములు; అనంగన్= అనునట్లుగా; అతిరోహిత ప్రవాళములు – అతిరోహిత=తిరోహితములు గాని, అనఁగా స్ఫుటముగా బయల్పడిన, ప్రవాళములు=పల్లవములు; అనంగ కనక కరవాలికా ప్రమాకరములు – అనంగ=మదనునియొక్క, కనకకరవాలికా=బంగరుకత్తియొక్క, ప్రమా=యథార్థజ్ఞానమునకు, కరములు= చేయునవి; అగుచున్ = అయినవయి; అవ్వేళన్=అపుడు; అమరెన్=ఒప్పెను; అహహ=ఆశ్చర్యము!
నవపల్లవములు పైఁజెప్పినరీతిగా విలసిల్లె నని తాత్పర్యము.
చ. కలికల రంగదుజ్జ్వలతఁ గన్పడెఁ గాననసీమ ముత్తెముల్
కలి కలరంగ నొంచి నిజ◊గౌరిమచే, నడఁగించి చంద్రమః
కలికల, రంగమై నవసు◊గంధపరంపర కెల్లఁ, జాల ను
త్కలికలరం గనారతముఁ ◊గాంచిన చూపఱచూడ్కి కుంచుచున్. 35
టీక: కలికలరంగదుజ్జ్వలత – కలికల=కోరకములయొక్క, రంగత్=ఒప్పుచున్న, ఉజ్జ్వలత=ప్రకాశము; కాననసీమన్ = అరణ్యప్రదేశమందు; ముత్తెముల్=మౌక్తికములు; కలికిన్=కలహమునకు; అలరంగన్=ఒప్పఁగా; నొంచి =నొప్పించి; నిజ గౌరిమచేన్ = తనపాండిమచేత; చంద్రమఃకలికలన్=శశికళలను; అడఁగించి=అడఁగఁజేసి; నవసుగంధపరంపర కెల్లన్—నవ=నూతనమగు, సుగంధ=పరిమళముయొక్క, పరంపర కెల్లన్= సముదయమున కంతయు; రంగమై = ఆశ్రయమై; అనారతమున్ = ఎల్లప్పుడును; కాంచిన చూపఱచూడ్కికిన్ =అవలోకించిన చూచువారియొక్క దృష్టికి; చాలన్=మిక్కిలి; ఉత్కలికలరంగు=వేడుకలయొప్పిదమును; ఉంచుచున్=చేయుచు; కన్పడెన్=అగపడెను. అనఁగాఁ గలికలు కాననసీమ లందుఁ దమపాండిమచే ముత్యములను, శశికలలను మించుచు నపూర్వపరిమళమును దాల్చుచు, చూపఱుల చూడ్కుల కింపులు నించుచుఁ గాన్పించె ననుట.
చ. విరిగమి వొల్చె సర్వవన◊వీథులఁ, దారకదీధితి చ్ఛిదా
పర మహిమానివారణము, ◊పాంథవధూజన దృష్టిమాలికా
పరమహి, మానితాళికుల◊భవ్యవిహారనివాస, ముజ్జ్వల
త్పరమ హిమానికాజయజ ◊భాసుర చైత్రికకీర్తి యత్తఱిన్. 36
టీక: అత్తఱిన్=అప్పుడు; సర్వవనవీథులన్=ఎల్లయడవులపట్టులందు; తారక దీధితి చ్ఛిదాపర మహిమానివారణము –తారక = నక్షత్రములయొక్క, దీధితి=కాంతులయొక్క, ఛిదా=ఛేదనమందు, పర=ఆసక్తమైన, మహిమ=సామర్థ్యముచేత, అనివారణము=అడ్డులేనిదియు; పాంథవధూజన దృష్టిమాలికా పరమహి – పాంథవధూజన=వియోగిస్త్రీలయొక్క, దృష్టి మాలికా = చూపుచాలులకు, పరమహి = శత్రుభూమిరూప మైనదియు; మానితాళికుల భవ్య విహారనివాసము – మానిత= శ్రేష్ఠములగు, అళికుల=తుమ్మెదగుంపులకు, భవ్య=మనోజ్ఞమగు, విహారనివాసము = విహారస్థానరూపమైనదియు; ఉజ్జ్వల త్పరమ హిమానికాజయ జ భాసుర చైత్రికకీర్తి – ఉజ్జ్వలత్=ప్రకాశించుచున్న, పరమ=ఉత్కృష్టమగు, హిమానికా=మంచు గమియొక్క, ‘హిమానీ హిమసంహతిః’ అని యమరుఁడు, జయ=గెలుపువలన, జ=పుట్టినట్టి, భాసుర=ప్రకాశించుచున్న, చైత్రికకీర్తి =వసంతునియొక్క కీర్తిరూపమైనదియు నగు; విరిగమి = పువ్వులగుంపు; పొల్చెన్= ప్రకాశించెను. సర్వవనస్థలులందు నక్షత్రకాంతి నడంచునంత ప్రకాశము గలదై, విరహిస్త్రీలచూపులకు శత్రుప్రాయం బగుచు, మంచును జయించి పొందిన చైత్రునికీర్తియో యనునట్లు విరిగమి పొల్చె ననుట. వసంతమందు హిమము నివృత్త మగుట ప్రసిద్ధంబ.
సీ. ఫలియించెఁ దిలకముల్ ◊భసలేక్షణమ్ముల, సురసాలతా సము◊త్కరము గాంచఁ,
జివురించె నునుఁబొన్న ◊నవసూనసంతతి, సురసాలవల్లరుల్ ◊ సరస నవ్వ,
ననఁజూపె బొగడచాల్ ◊నవమధుచ్ఛట నింద్ర,సురసా లలితశాఖ ◊కరము నుమియఁ,
గుసుమించె లేఁగ్రోవి ◊కొమరు వీవలి విభా, సుర సాలవల్లికల్ ◊సొరిది నలమ,
తే. సితవసు రసాల చారుమా◊రుత ముఖాప్త,వరులు మెచ్చంగ మధు వల◊ర్పకయ మున్నె
యలరి సురసాలవైఖరిఁ ◊జెలువు గాంచె, నపు డగశ్రేణి యిట్లు దో◊హదనిరూఢి. 37
టీక: తిలకముల్ = బొట్టుగులు; సురసాలతా సముత్కరము – సురసాలతా=సర్పాక్షితీవలయొక్క, సముత్కరము=సమూ హము; భసలేక్షణమ్ములన్=తేటిచూపులచేత; కాంచన్= చూడఁగా; ఫలియించెన్ = పండెను.నునుఁబొన్న=సుందరమగు పొన్నచెట్టు; సురసాలవల్లరుల్ =లెస్సయిన మావిపువ్వుగుత్తులు; సరసన్=సమీపమందు; నవ్వన్ = నవ్వఁగా; చివురించెన్=పల్లవించెను. పొగడచాల్=పొగడచెట్లవరుస; ఇంద్రసురసాలలితశాఖ – ఇంద్రసురసా=వావిలియొక్క, లలిత=మనోజ్ఞమగు, శాఖ=కొమ్మ; కరమున్=మిక్కిలియు; నవమధుచ్ఛటన్—నవ=నూతనమైన, మధు=మరందముయొక్క, ఛటన్=పరంపరను, ఉమియన్ = ఉమియఁగా; ననఁజూపెన్=కుసుమించెననుట, లేఁగ్రోవి = లేఁత కురవకము; కొమరువీవలిన్ – కొమరు = అందమైన, వీవలిన్=వాయువుచేత, విభాసురసాలవల్లికల్ – విభా సుర=ప్రకాశించుచున్న, సాలవల్లికల్=ఏపెమ్రాఁకుతీవెలు, అనఁగా లేఁతకొమ్మలు; సొరిదిన్=వరుసగా; అలమన్=కౌఁగిలిం చుటచేత; కుసుమించెన్= పుష్పించెను. మధువు=వసంతము; సితవసు రసాల చారుమారుత ముఖాప్తవరులు – సితవసు=శుభ్రాంశువైన చంద్రుఁడు, రసాల=తియ్య మావులు, చారుమారుత=మనోజ్ఞమైన వాయువు, ముఖ=మొదలైన, ఆప్తవరులు=కూర్మిచెలులు; మెచ్చంగన్=ప్రశంసించు నట్లుగా; అలర్పకయ మున్నె = వికసింపఁజేయక ముందె; అగశ్రేణి=మ్రాఁకులచాలు; ఇట్లు=పైఁజెప్పినవిధముగా; దోహద నిరూఢిన్ = దోహదముయొక్క యతిశయముచేత; అలరి=ప్రకాశించి; అపుడు= ఆసమయమందు; సురసాలవైఖరిన్ = కల్ప వృక్షములవలె; చెలువు గాంచెన్= అందము నొందెను.
అనఁగా తిలకములకు స్త్రీవీక్షణము, పొన్నలకు స్త్రీలనవ్వు, పొగడలకు స్త్రీముఖశీధువు, కురవకములకు స్త్రీయాలింగనము దోహదముగావున ఈదోహదములచే వసంతోదయమునకు మున్నె పుష్పఫలాదిభరితములై వేల్పుమ్రాఁకులవలె చెలువొందె ననుట. ఇట నాల్గుచరణములయందు సురసాలతా, సురసాలవల్లరీ, ఇంద్రసురసా, సాలవల్లికలయందు స్త్రీలింగమహిమచే స్త్రీత్వారోపముఁ జేసి తదీయభసలేక్షణాదులచే దోహదనిర్వాహము.
చ. తలిరులు దోఁచెఁ గోకిలవి◊తానము వేడుకఁ గాంచ, సూనముల్
వొలిచె మిళింద ముబ్బి కడుఁ ◊బూన నవాంగము, మారుతాంకురం
బొలికెఁ బరాగముల్ వని ల◊తోత్కర మాకులపాటు నందగన్,
దొలుదొలుతన్ వియోగిసుద◊తుల్ కర మాకులపాటు నందఁగన్. 38
టీక: వనిన్=వనమునందు; కోకిలవితానము =కోకిలలగుంపు; వేడుకన్=సంతసమును; కాంచన్= పొందఁగా; తలిరులు = పల్లవములు; తోఁచెన్ = ఉదయించెను; మిళిందము=తుమ్మెద; కడున్ = మిక్కిలి; ఉబ్బి=ఉప్పొంగి; నవాంగము=క్రొత్తశరీ రమును; పూనన్=వహింపఁగా, అనఁగా సంతోషాతిశయముచే నుప్పొంగి క్రొత్తదేహమును దాల్చినట్లుండఁగా ననుట; సూన ముల్=పుష్పములు; పొలిచెన్=ఉదయించెను; లతోత్కరము=తీవలగుంపు; ఆకులపాటునన్ = కారాకులు రాలుటచేతను; తగన్=ఒప్పునట్లు; పరాగముల్=పుప్పొడులను; మారుతాంకురంబు = మందమారుతము; ఒలికెన్=చల్లెను;తొలుదొలుతన్ =తొల్తనే; వియోగిసుదతుల్=విరహిస్త్రీలు; కరము=మిక్కిలి; ఆకులపాటున్= వ్యాకులత్వమును; అందఁగన్=పొందఁగా, ఇది యన్నిక్రియలతోను నన్వయించును. అనఁగా వృక్షలతాదులు తొలుతఁ గారాకులు రాలఁగాఁ జిగిరించి, కుసుమించి, పుప్పొడులు రాలె ననుట.
మ. అలరెన్ జైత్రబలాధినేత మదసా◊రంగాళి సద్వాజిమం
డలి రాగంబున మించుక్రొందళములన్ ◊రమ్యాత్మఁ జేకూర్పఁగాఁ
గలనాదారి తమీన మారుతయుతిన్ ◊గంజాస్త్రుఁ డుద్యత్సహః
కలనా దారిత మీనదృక్పురుష జా◊గ్రద్ధైర్యుఁడై యయ్యెడన్. 39
టీక: అయ్యెడన్=అపుడు; చైత్రబలాధినేత= వసంతుఁడనెడు పడవాలు; మదసారంగాళిసద్వాజిమండలి – మదసారంగాళి= మదించిన తుమ్మెద లనెడు మదపుటేనుఁగులయొక్క, ఆళిన్=పంక్తిని; సద్వాజిమండలిన్=శ్రేష్ఠములగు పక్షులనెడు గుఱ్ఱముల గుంపును; రాగంబునన్=రక్తిమ యనెడు క్రోధముచేత; మించుక్రొందళములన్ = అతిశయించు చిగురాకులనెడు క్రొత్త సైన్యము లను; రమ్యాత్మన్=మంచిమనస్సుచేత; చేకూర్పఁగాన్=ఘటిల్లఁజేయఁగా; కంజాస్త్రుఁడు=మరుఁడు; కలనాదారితమీనమా రుతయుతిన్ – గలనాద=కోయిలలయొక్కయు, అరి=జక్కవలయొక్కయు, తమీన=చంద్రునియొక్కయు, మారుత= మలయవాతముయొక్కయు, యుతిన్=ప్రాప్తిచేత; ఉద్యత్సహఃకలనాదారితమీనదృక్పురుషజాగ్రద్ధైర్యుఁడు ఐ – ఉద్యత్= పుట్టుచున్న, సహః=బలముయొక్క, ‘సహో బల శౌర్యాణి స్థామ శుష్మం చ’ అని యమరుఁడు, కలనా=ప్రాప్తిచేత, దారిత= చీల్పఁబడిన, మీనదృక్=స్త్రీలయొక్కయు, పురుష=పురుషులయొక్కయు,జాగ్రత్=నిస్తంద్రమైన, ధైర్యుఁడు ఐ = దైర్యము గల వాఁడై; అలరెన్ = ఒప్పెను.
అనఁగా మరుఁడు తనసేనాధిపతియగు వసంతుఁడు సారంగరాజిని, క్రొందళములను గూర్పఁగా దాను మలయానిల చంద్రాదులతోఁ గూడి స్త్రీపురుషుల ధీరత్వము నుడిగించె ననుట.
మ. కలకంఠీకులపంచమస్వరగృహ◊త్కాంతారవారంబులన్
దలిరా కాకమలేశ్వరాత్మజ మహ◊స్త్వంబున్ సుమచ్ఛాయకం
దలి రాకాకమలేశ్వరాత్మజ మహ◊స్త్వంబున్ గడుం బూని క
న్నుల కుద్వేలభయంబు గూర్ప మఱి పాం◊థుల్ గుంది రప్పట్టునన్. 40
టీక: అప్పట్టునన్=ఆసమయమందు; కలకంఠీకులపంచమస్వరగృహత్కాంతారవారంబులన్ – కలకంఠీకుల=కోకిలస్త్రీల గుంపులయొక్క, పంచమస్వర=తజ్జాతినియత మగు పంచమరాగమునకు, గృహత్=గృహమువలె నాచరించుచున్న, ఆశ్రయ మైన యనుట, కాంతారవారంబులన్=అరణ్యసమూహములయందు; తలిరాకు=చిగురుటాకు; ఆకమలేశ్వరాత్మజ మహస్త్వంబున్ – ఆకమలేశ్వరాత్మజ=ఆలక్ష్మీపతియైన విష్ణువుయొక్క తనూజుఁడైన మన్మథునియొక్క, మహస్త్వంబున్= ప్రతాపభావమును; సుమచ్ఛాయకందలి –సుమ=కుసుమములయొక్క, ఛాయ=కాంతులయొక్క,కందలి=మొలక, ఇట ‘ఛాయా బాహుల్యే’ అను సూత్రముచేత ఛాయాశబ్దమునకు నపుంసకత్వము; రాకాకమలేశ్వరాత్మజమహస్త్వంబున్ = పూర్ణిమాచంద్ర ప్రకాశభావమును, కమలేశ్వరుఁడనగా జలాధిపతియగు సముద్రుడు, అతని యాత్మజుఁడు చంద్రుఁడు,‘సలిలం కమలం జలమ్’ అనియు, ‘పూర్ణే రాకా నిశాకరే’ అనియు నమరుఁడు; కడున్=మిక్కిలి; పూని=వహించి; కన్నులకున్= చూపులకు; ఉద్వేలభయంబున్=అధికమైన వెఱపును; కూర్పన్=ఘటిల్లఁజేయఁగా; పాంథుల్=తెరువరులు; మఱి=మిగు లను; కుందిరి= దుఃఖిం చిరి. అడవులయందుఁ గోకిలాలాపములు, నవపల్లవములు, కుసుమస్తోమకాంతియుఁ బాంథులకు దుస్సహములై ప్రియావియోగదుఃఖము నతిశయింపఁ జేసె ననుట.
తే. అలవసంతంబున రహించెఁ ◊దిలక భాస
మాన హిందోళగీత ని◊స్వాన, మహిమ
దీప్త్యుదయకాల గాయికా◊తిలక గీయ,
మాన హిందోళగీత ని◊స్వానమహిమ. 41
టీక: అలవసంతంబునన్=ఆవసంతర్తువునందు; తిలకభాసమానహిందోళగీతనిస్వానము – తిలక=బొట్టుగులయందు, భాస మాన=ప్రకాశించుచున్న, హిందోళ=తేఁటులయొక్క, గీత=పాటలయొక్క,నిస్వానము=ధ్వని; అహిమదీప్త్యుదయకాల గాయికాతిలక గీయమానహిందోళగీతనిస్వానమహిమన్ – అహిమదీప్తి = సూర్యునియొక్క, ఉదయకాల=ఉదయించు కాలమందు, గాయికాతిలక=మంచిపాట నేర్చిన స్త్రీలచేత, గీయమాన=పాడఁబడుచున్న, హిందోళ=హిందోళమను రాగ విశేషముయొక్క, ‘హిందోళౌ రాగ మధుపౌ’ అని విశ్వము, గీత=గానములసంబంధియగు, నిస్వాన=ఆలాపముయొక్క, మహిమన్ = అతిశయముచేత, రహించెన్=ఒప్పెను. ఈపద్యమున నిస్వానపదము పునరుక్తమైనను దోషంబు కాదు. ఇందులకు ‘యమకాది ష్వదుష్టం స్యాన్నిహతార్థ న్నిరర్థకమ్,నదుష్టః పునరుక్తశ్చ విశేషావగమో యది’ అని సాహిత్య చింతామణి చూడవలయు.
చ. నెలవున రాగసంపద వ◊నీరమ చారుపికారవంబునన్
దెలిసి వసంతురాక, సుమ◊నీర మహోర్మికఁ దాన మూన్చి, పూ
ని లలితసుచ్ఛదాళి, నళి◊నీరమణీయసరంబు లూని, మేల్
నెలవునఁ బొల్చెఁ, గుంజభవ◊నీరమమాణశుకీసఖీవృతిన్. 42
టీక: వనీరమ=వనలక్ష్మి; చారుపికారవంబునన్ – చారు=మనోజ్ఞమగు, పికారవంబునన్=కోకిలస్వనమువలన; వసంతురాక = వసంతుఁడను ప్రియునియొక్క రాకను; తెలిసి=తెలిసికొని; నెలవునన్=పరిచయముచేత; రాగసంపదన్=రక్తిమ యనెడు ననురాగముయొక్క సమృద్ధిచేత; సుమనీర మహోర్మికన్ – సుమనీర=పుష్పరసముయొక్క, మహోర్మికన్=నదియందు; తానము ఊన్చి = స్నానముఁజేసి; లలితసుచ్ఛద=మంచియాకు లనెడు వస్త్రములయొక్క, ఆళిన్=పంక్తిని; పూని=ధరించి;
అళినీరమణీయసరంబులు – అళినీ=ఆఁడుతుమ్మెదలనెడు, రమణీయ=అందమైన,సరంబులు=పేరులు; ఊని=ధరించి; కుంజభవనీ రమమాణ శుకీసఖీ వృతిన్ – కుంజభవనీ=పొదరిండ్లయందు, రమమాణ=విహరించుచున్న, శుకీ=ఆఁడుచిల్క లనెడు, సఖీ=చెలియలయొక్క, వృతిన్=వ్యాప్తిచేత; మేల్ నెలవునన్=మంచినివాసస్థానమునందు; పొల్చెన్= ప్రకాశించెను.
ఇచట వనలక్ష్మి యనెడు స్త్రీ పికారవములచే వసంతుఁడను ప్రియునిరాక తెలిసికొని స్నానముఁ జేసి, శుభ్రవస్త్రములను, రమణీయమగు హారములను దాల్చి, సఖీజనముతోఁ గూడి, కేళీగృహమున విలసిల్లె నని చెప్పుటచేత వనలక్ష్మియందు వాసక సజ్జాధర్మము వ్యక్తం బగుచున్నది. ‘ప్రియాగమనవేళాయాం మణ్డయన్తీ ముహుర్ముహుః, కేళీగృహం తథాత్మానం సా స్యా ద్వాసకసజ్జికా’ అని వాసకసజ్జాలక్షణము.
సీ. రమ్యపున్నాగోర్వ◊రాజాతిసౌరభా,రూఢి పై నలమ మా◊రుతము నిగుడ,
రసఁ బల్లవరుచిధా◊రాజాతిసౌరభా,గారితవంజులా◊గములు దోఁపఁ,
బ్రబలు సంభ్రమ మెచ్చ ◊రాజాతిసౌరభా,వలినివాసి శుకౌఘ◊ములు నటింప,
రాజత్పికాబ్జక◊రాజాతిసౌరభా,నేహోర్పితారావ◊నియతి మెఱయ,
తే. నధ్వగులు గుంది రధికతా◊పార్చి పఱవఁ, గాననంబుల నపుడు చ◊క్కనిప్రియాళి
కాననంబులఁ గాంచు మో◊హంబు లాత్మ,కాన నంబుల మారుఁ డుద్ధతి నటింప. 43
టీక: రమ్యపున్నాగోర్వరాజాతిసౌరభారూఢి – రమ్య=మనోజ్ఞములగు,పున్నాగోర్వరాజ=పున్నాగవృక్షములయొక్క, ‘ఉర్వరాజ’ మనఁగా వృక్షమని యర్థము. ‘ఉర్వరా సర్వసస్యాఢ్యా’ అని యమరుఁడు. అందుచే, ఉర్వరా యనఁగా భూమి, ఉర్వరాజ మనఁగా భూమిజము = వృక్షమని యర్థము, అతిసౌరభ=అధికపరిమళముయొక్క, ఆరూఢి=అతిశయము; పైన్=మీఁదికి; అలమన్=కవియునట్లు; మారుతము = సమీరము; నిగుడన్=వీవఁగా, రసన్ = భూమియందు, ‘రసా విశ్వమ్భరా స్థిరా’ అని యమరుఁడు; పల్లవ రుచిధారా జాతి సౌరభాగారిత వంజులాగములు – పల్లవ=చిగురులయొక్క, రుచిధారా=కాంతిపరంపరలయొక్క, జాతి=సామాన్యమనెడు, సౌర=సూర్యసంబంధి యైన, భా= కాంతికి, ఆగారిత=గృహమువలె నాచరించుచున్న, వంజులాగములు=వకుళవృక్షములు; తోఁపన్=చూపట్టఁగా, ప్రబలుసంభ్రమము=అధికమైనసంతోషము; ఎచ్చన్=అతిశయింపఁగా; రాజాతిసౌర భావలి నివాసి శుకౌఘములు – రాజ = రేలపూవులయొక్క, అతిసౌరభ=అధికపరిమళముయొక్క, ఆవలి=పంక్తియందు, నివాసి=నివసించుచున్న,శుకౌఘములు = చిలుకలగుంపులు; నటింపన్ = నాట్యము సేయఁగా; రాజత్పికాబ్జకరాజాతి – రాజత్=ప్రకాశించుచున్న, పికాబ్జకరా=ఆఁడుకోకిలలయొక్క, జాతి=కులము; సౌరభానేహోర్పితా రావనియతి – సౌరభానేహ=వసంతకాలముచేత,అర్పిత=అర్పింపఁబడిన,ఆరావనియతిన్=ధ్వనినియమముచేత; మెఱయన్ = ప్రకాశింపఁగా, అధ్వగులు =పాంథులు; అపుడు=ఆసమయమున; అధికతాపార్చి=ఎక్కుడుసంతాపజ్వాల; పఱవన్=వ్యాపింపఁగా; కాన నంబులన్=అడవులందు; చక్కని ప్రియాళికాననంబులఁ గాంచు మోహంబులు – చక్కని=అందమైన, ప్రియాళికాననంబులన్ =ప్రియాసమూహములముఖములను, కాంచు మోహంబులు = చూడవలెనను కోరికలు; ఆత్మకున్ = మదికి; ఆనన్=నాటఁ గా; మారుఁడు=మదనుఁడు; అంబులన్=బాణములచే; ఉద్ధతిన్=దర్పముచేత; నటింప = నటింపఁగా; కుందిరి=దుఃఖించిరి. అనఁగా పున్నాగపుష్పరజములతోఁ గూడిన మందమారుతము, రక్తపల్లవములతోఁ గూడిన వకుళవృక్షములు, నటించు చున్న చిలుకగములు, కోకిలస్త్రీనినాదములు పాంథులకుఁ గామోద్రేకజనకము లయ్యె ననుట.
చ. సరససమీరపోతములు ◊చక్కఁ జరింపఁగఁ జొచ్చె నప్డు సుం
దరవకుళాగకేసరల◊తాసుమనోరసవీచిఁ దేలుచున్
దరుణనమేరుకేసరల◊తాసుమనోనరజంబు లాగుచున్
దరముగ నాగకేసరల◊తాసుమనోరమగంధ మానుచున్. 44
టీక: సరససమీరపోతములు – సరస=శ్రేష్ఠములైన, సమీరపోతములు=మందమారుతములు; సుందర వకుళాగ కేసర లతా సుమనోరసవీచిన్—సుందర=అందమైన, వకుళాగ=పొగడవృక్షములయొక్కయు, కేసర=పొన్నలయొక్కయు, లతా= కొమ్మలయందలి, సుమనః=పుష్పములయొక్క, రస=మకరందముయొక్క, వీచిన్= తరంగములయందు, ఇది జాత్యేక వచనము; తేలుచున్ =తేలాడుచు; తరుణ నమేరు కేసర లతా సుమనోనరజంబులు – తరుణ=నూతనములైన, నమేరు=సుర పొన్నలయొక్క, కేసర=కింజల్కములయొక్క, లతా=బండిగురివెందలయొక్క, ‘లతాగోవిన్దినీ గున్ద్రా’ అని యమరుఁడు, సుమ=పువ్వులయొక్క, నోన (న+ఊన) = అధికమైన, ఇచట నైకధేత్యాదులయందువలె నశబ్దముతో ఊనశబ్దమునకు ‘సు ప్సుపా’ అని సమాసము, రజంబు=పుప్పొడులను; లాగుచున్=ఆకర్షించుచు; తరముగన్=క్రమముగ; నాగకేసరలతా సుమ నోరమ గంధము – నాగకేసరలతా=నాగకేసరపుతీవలయొక్క, సుమనోరమ=మిక్కిలి మనోజ్ఞమైన, గంధము=పరిమళ మును; ఆనుచున్=పానముఁ జేయుచు;అప్డు=ఆసమయమందు; చక్కన్=బాగుగా; చరింపఁగఁ జొచ్చెన్= సంచరింపసాగెను. ఇట బాలపవనములు వకుళాదిపుష్పనీరమునఁ దేలుచు, సురపొన్నలు మున్నగువాని పుప్పొడి లాగుచు, నాగకేసరాది గంధము నానుచుఁ జరింపసాగె నని బాలవృత్తము సమీరపోతములందు వర్ణితం బయ్యె.
సీ. శ్యామోదయము కొంచి◊యము చేయ నేతెంచి, శ్యామోదయంబు హె◊చ్చగఁ దనర్చె,
సుమనోవిలాసంబు ◊చూఱపుచ్చఁగఁ జేరి, సుమనోవిలాసంబు ◊లమరఁ జేసెఁ,
దుంగకదంబాభ ◊దూల్పంగఁ బొడకట్టి, తుంగకదంబాభ ◊పొంగఁ దార్చె,
హైమజాలకరూఢి ◊నపహరింపఁగఁ బొల్చి, హైమజాలకరూఢి ◊యడర నూన్చె,
తే. శుచిపలాశాళిహృతిఁ గూర్ప ◊నచల వెలసి, శుచిపలాశాళివర్ధక◊స్ఫూర్తిఁ బొదలె,
నహహ కమలేశ్వరాత్మజా◊తైకమైత్త్రి,కతనఁ జైత్రుండు సమ్మదా◊కలన నొంది. 45
టీక: శ్యామోదయము =రాత్రియొక్క యావిర్భావమును; కొంచియము=అల్పమునుగా; చేయన్=చేయుటకు; ఏతెంచి= వచ్చి; శ్యామోదయంబు= ప్రేంకణవృక్షములయొక్కవృద్ధి; హెచ్చగన్=అధికమగునట్లుగా; తనర్చెన్=చేసెను. సుమనోవిలాసంబు=జాజులయొక్క విలాసమును; చూఱపుచ్చఁగన్=కొల్లవెట్టుటకు; చేరి=పొంది (వచ్చి), సుమనోవిలాసంబు = పువ్వులయొక్క యొప్పిదములను; అమరన్=అమరునట్లు (పొసగునట్లు); చేసెన్=ఒనరించెను. తుంగకదంబాభ – తుంగ=ఉన్నతములగు,కదంబ= కడిమిచెట్లయొక్క, ఆభ=కాంతిని; తూల్పంగన్=తూల్చుటకు; పొడ కట్టి=ఆవిర్భవించి; తుంగకదంబాభ – తుంగ=పున్నాగములయొక్క, ‘పున్నాగే పురుష స్తుంగః’ అని యమరుఁడు, కదంబ
=గుంపులయొక్క, ఆభ=కాంతిని; పొంగన్=అతిశయించునట్లు; తార్చెన్=చేసెను. హైమజాలకరూఢిన్ = హిమసంబంధులగు బిందువులయొక్క రూఢిని; అపహరింపఁగన్=దోఁచుకొనుటకు; పొల్చి=ఉదయించి; హైమజాలకరూఢి = చంపకసంబంధులగు మొగ్గల రూఢిని; అడరన్=ఒప్పునట్లుగా; ఊన్చెన్=చేసెను.
శుచిపలాశాళిహృతిన్ – శుచిపలాశ=కారాకులయొక్క, ఆళి=పరంపరలయొక్క, హృతిన్=హరణమును; కూర్పన్= చేయుటకు; అచలన్=భూమియందు; వెలసి=ప్రకాశించి; శుచిపలాశాళివర్ధకస్ఫూర్తిన్ – శుచిపలాశ=నిర్మలములగు మోదు గులయొక్క, ఆళి=పంక్తియొక్క, వర్ధక=వృద్ధిఁజేయుటయందలి, స్ఫూర్తిన్=ప్రకాశముచేత; పొదలెన్=ఒప్పెను.
అహహ=ఆశ్చర్యము! కమలేశ్వరాత్మజాతైకమైత్త్రికతనన్ – కమలేశ్వర=లక్ష్మీపతియైన విష్ణువుయొక్క, ఆత్మజాత=పుత్త్రుఁ డగు మన్మథునియొక్క, ఏక=ముఖ్యమగు, మైత్త్రికతనన్ =స్నేహమునుబట్టి; చైత్రుండు=వసంతుఁడు; సమ్మదాకలనన్ = సంతోషసంబంధమును; ఒంది =పొంది, పైఁ జెప్పిన విధముగఁ జేసె నని క్రింది కన్వయము.
వసంతము శ్యామోదయము కొంచెము సేయుటకు, సుమనోవికాసంబు చూరపుచ్చుటకు, తుంగకదంబాభ దూల్చుటకు, హైమజాలకరూఢి నపహరించుటకు, శుచిపలాశాళి హృతిఁ గూర్చుటకు పుడమిఁ జేరియు, తద్విరుద్ధములైన శ్యామోదయ మును హెచ్చు సేయుట, సుమనోవిలాసంబు లమరఁ జేయుట లోనగుకార్యము లొనరించుటవలన, ‘శ్లో. అన్య త్కర్తు మ్ప్రవృ త్తస్య తద్విరుద్ధకృతి శ్చసా, గోత్రోద్ధారప్రవృత్తోపి గోత్రోద్భేద మ్పురా కరోః’ ఇత్యాదులయందువలె, శ్లేషోత్థాపితాసంగత్యలం కారము. ఇట్లు శ్యామోదయ, సుమనోవిలాస, తుంగకదంబాభ , హైమజాలకరూఢి, శుచిపలాశాళులకు విరోధము సేయ సమ కట్టి వసంతుఁడు తద్విపరీతవర్తనమునఁ జెలంగుట చిత్రము. ఇట్టి దుర్నయమందుఁ బ్రవర్తించిన వసంతుఁడు శ్రీమన్నారాయణ సూనుం డగు మీనకేతనుని సాంగత్యమహిమచే నది మానినాఁ డనుటవలన, ‘సారూప్యమపి కార్యస్య కారణేన సమం విదుః’ అను సమాలంకారభేదమును గలుగును. వసంతవాసరమందు రాత్రి తక్కువగుటయు, లతలు వృద్ధిఁబొందుటయు, జాజులు విలసిల్లకుండుటయు, పువ్వులు సమృద్ధ మగుటయు, కదంబములు పుష్పింపకుండుటయు, పొన్నలు ప్రకాశించుటయు, మంచుపిండు ముడుఁగుటయు, కొన్ని లోకప్రసిద్ధంబులు, కొన్ని కవిసమయసిద్ధములు. దీనిం గూర్చి కవికల్పలతయందు, ‘అసతోపి నిబన్ధేనా నిబన్ధేన సతోపి చ| నియమేన చ జాత్యాదేః కవీనాం సమయ స్త్రిధా| అసతోపి నిబన్ధో యథా| రత్నాని యత్ర కుత్రాద్రౌ హంసా స్స్వల్పజలాశయే| జలేభాద్యన్నభో నద్యా మమ్భోజాద్య న్నదీష్వపి| తిమిరస్య తథా ముష్టిగ్రాహ్యత్వం సూచిభేద్యతా| అఞ్జలిగ్రాహ్యతా కుమ్భోపవాహ్యత్వం విధుత్విషః| శుక్లత్వం కీర్తిహాసాదౌ కార్ష్ణ్యంచాకీర్త్యఘాదిషు| ప్రతాపే రక్తతోష్ణత్వే రక్తత్వం క్రోధరాగయోః| విభావర్యాం భిన్నతయా వర్తనం చక్రవాకయోః| జ్యోత్స్నాపానం చకోరాణా ఞ్చతుష్క ఞ్చ పయోనిధేః| సతో ప్యనిబన్ధో యథా – వసన్తే మాలతీపుష్ప మ్ఫలపుష్పే చ చన్దనే| అశోకే చ ఫలం జ్యోత్స్నా ధ్వాన్తే కృష్ణాన్యపక్షయోః| కామిదన్తేషు కున్దానా ఙ్కుట్మలేషు చ రక్తతామ్| హరితత్వ న్దివా నీలోత్పలానా ఞ్చ వికాసితమ్| వర్ణయే న్నసదప్యేత న్నియమోఽథ ప్రకాశ్యతే| భూర్జత్వ గ్ఘిమవత్యేవ మలయేష్వేవ చన్దనమ్| రక్తత్వం రక్తబన్ధూకబిమ్బామ్భోజవివ స్వతామ్| తథా వసన్త ఏవాన్యపుష్టానా ఙ్కలకూజితమ్| వర్షాస్వేవ మయూరాణాం రుత న్నృత్యంచ వర్ణయేత్| నియమస్య విశేషోథ పునః కశ్చి త్ప్రకాశ్యతే|’ ఇత్యాదిగాఁ జెప్పఁబడినది. వసంతాదులను గూర్చియు నందె యిట్లున్నది. ‘సురభే దోలా కోకిల మారుత సూర్యగతి తరుదలోద్భేదాః| జాతీతరపుష్పచయామ్రమఞ్జరీ భ్రమరఝఙ్కారాః| గ్రీష్మే పాటల మల్లీ తాపసరః పథిక శోషవాతోష్ణాః| సక్తుః ప్రపాచ తృష్ణా మృగతృష్ణామ్రాదిఫలపాకాః| వర్షాసు ఘన శిఖి సదనసమాగమాః పఙ్క కన్దలో ద్భేదౌ| జాతీ కదమ్బ కేతక ఝంఝానిల నిమ్నగా హలిప్రీతిః| శరదీన్దు రవిపటుత్వం జలాచ్ఛతాగస్త్య హంస వృషదర్పాః| సప్తచ్ఛద స్సితాభ్రం ధాన్యం శిఖిపక్షమదపాతాః| హేమన్తే దినలఘుతా శీత యవ స్తమ్బ మరువక హిమాని| శిశిరే కరీషధూమ మాః కున్దామ్బుజ దాహ హిమజలోత్కర్షాః|’ ఇత్యాదిగా నున్నది. ఇందు వసంతమున సూర్యగతిమాంద్యమున రాత్రి కొంచె మగుటయు, జాజులు వికసిల్లకుండుటయు, కదంబములు వర్షర్తువునందే చెప్పఁదగిన వనుటచే నవి లేకుండుటయు, జాతీతర సర్వకుసుమము లని చెప్పుటచేఁ జంపకాదిపుష్పసమృద్ధి, తరుదలోద్భేదము చెప్పుటచేఁ గారాకులు రాలుటయు లోనగునవి తెలియవలయు.
చ. అలమధువేళఁ దీవ్రవిర◊హాగ్నిశిఖాపరితప్తగాత్రి యౌ
నలినవిరోధివంశజన◊నాయకపుత్త్రి దలంక సాగె న
త్యలఘుసువర్ణకాననవి◊హార్యసమాశుగకాండధారకున్
హలహలధారిదర్పపరి◊హార్యసమాశుగకాండధారకున్. 46
టీక: అలమధువేళన్=ఆవసంతసమయమందు; తీవ్రవిరహాగ్నిశిఖాపరితప్తగాత్రి – తీవ్ర=గాఢమైన, విరహాగ్ని=వియోగ మనెడు వహ్నియొక్క, శిఖా=జ్వాలలచేత, పరితప్త=మిక్కిలి తపింపఁజేయఁబడిన, గాత్రి=దేహము గలది; ఔ నలినవిరోధి వంశజననాయకపుత్త్రి – ఔ=అగునట్టి, నలినవిరోధివంశజననాయకపుత్త్రి =చంద్రవంశరాజకుమారి యగు చంద్రిక; అత్యలఘు సువర్ణకానన విహార్యసమాశుగకాండ ధారకున్ – అత్యలఘు=మిగులనధికమైన, సువర్ణకానన=సంపెంగతోఁటలయందు, విహారి=సంచరించుచున్న, అసమ=సాటిలేని, ఆశుగకాండ=మందమారుతసందోహముయొక్క, ధారకున్=పరంపరకు; హలహలధారి దర్ప పరిహార్యసమాశుగ కాండ ధారకున్ – హలహలధారి=రుద్రునియొక్క, ‘హాలాహలం హలహలం హలహాలం హలాహలం’ అని ద్విరూపకోశము, దర్ప=గర్వమును, పరిహారి= అడఁగించినట్టి మన్మథునియొక్క, అసమ= సాటి లేని, ఆశుగ=బాణములయొక్క, కాండ=సంఘముయొక్క, ధారకున్=అంచునకు; తలంక సాగెన్ = వడఁకసాగెను.
తే. బాల యీలీల మదనరో◊పాలికల క
రాలవర్తనచే మనః◊పాలిఁ గలఁకఁ
జెంది కుందంగఁ దన్నేత్ర◊జితచకోరి,
చేరి యిట్లను సూక్తిరా◊జితచకోరి. 47
టీక: బాల = చంద్రిక; ఈలీలన్=ఈతీరున; మదనరోపాలికల కరాలవర్తనచేన్ – మదన=మన్మథునియొక్క, రోపాలికల = శరపరంపరలయొక్క, ‘పత్త్రీ రోప ఇషు ర్ద్వయోః’ అని యమరుఁడు, కరాలవర్తనచేన్=తీక్ష్ణవర్తనచేత; మనఃపాలిన్=హృదయ సీమయందు; కలఁకఁ జెంది = కలఁతపాఱి; కుందంగన్=దుఃఖింపఁగా; తన్నేత్రజితచకోరిన్=కన్నులచే గెలువఁబడిన యాఁడు చకోరములు గల యాచంద్రికను; సూక్తిరాజిత=సూక్తులచేత ప్రకాశించుచున్న;చకోరి=చకోరియనెడు ప్రియసఖి; చేరి=పొంది; ఇట్లనున్=వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.
చ. తలఁకెదవేల కీరవని◊తాజనవృత్తికిఁ, దేఁటిరానెలం
తల, కెద వేల మీఱునిజ◊ధైర్యము పాయఁగఁ గుందె దేల, కో
యిలనవలాలసారరుతి, ◊కింతి, మనోజుఁడు సంఘటించుఁ బో
యిల నవలాలసాప్రచయ, ◊మీయెడఁ ద న్భజియింప సత్కృపన్. 48
టీక: ఇంతి=చంద్రికా! కీరవనితాజనవృత్తికిన్=శుకాంగనాజనవర్తనమునకు; తేఁటిరానెలంతలకున్=మధుపరాజస్త్రీలకు; తలఁ కెద వేల = భయపడెదవేల? కోయిలనవలాలసారరుతికిన్ =కోకిలస్త్రీలయొక్క శ్రేష్ఠమగు ధ్వనికి; ఎదన్=హృదయమునందు; వేల మీఱునిజధైర్యము = మితిమీఱిన నీధీరత్వము; పాయఁగన్=తొలఁగఁగా; కుందెదు ఏల = దుఃఖింతువేల? ఇలన్=భూమి యందు; మనోజుఁడు=మన్మథుఁడు; ఈయెడన్=ఇపుడు; తన్=తన్ను; భజియింపన్=సేవింపఁగా; సత్కృపన్ =మంచిదయ చేత; నవలాలసాప్రచయము – నవ=నూతనమైన, లాలసా=వేడుకయొక్క, ప్రచయము=ఉత్తరోత్తరాభివృద్ధిని; సంఘటించుఁ బో = కూర్చునుబో. అనఁగా మరుఁడు తన్నుఁ బూజించినవారికి ఉత్తరోత్తరాభివృద్ధిని ఘటిల్లఁజేయును గావున కుందఁ బని లేదని తాత్పర్యము.
తే. కాన నమ్ము నటద్భక్తి◊కలనమునఁ గ
రమ్ము నలినాశుగునిఁ గొల్వ ◊రమ్యకేళి
కాననమ్మున కోనీల◊కంజనయన!
రమ్ము నలి నాశుగతి యిప్డు ◊ప్రబల ననుచు. 49
టీక: కానన్=ఆహేతువువలన; నమ్ము=విశ్వసింపుము; నలినాశుగునిన్ = మన్మథుని; కరమ్ము=మిక్కిలి; నటద్భక్తికలన మునన్ = ప్రకాశించుచున్న భక్తియుక్తిచేత; కొల్వన్=సేవించుటకు; రమ్యకేళికాననమ్మునకున్=మనోజ్ఞమగు క్రీడావనము నకు; ఓనీలకంజనయన=ఓనీలోత్పలాక్షీ! నలిన్=మిక్కిలి; ఆశుగతి=శీఘ్రగమనము; ప్రబలన్=అతిశయింపఁగా; ఇప్డు=ఈ సమయమున; రమ్ము; అనుచున్=అని పలుకుచు. దీనికి నుత్తరపద్యముతో నన్వయము.
మ. చెలి కేలందిన మాఱు పల్కక మన◊శ్చింతాకులస్ఫూర్తిఁ ద
త్కలకంఠీర వనంబుఁ జేర నరిగెన్ ◊దత్పద్మినీమౌళి స
త్కలకంఠీరవజాలకంబులు కడున్ ◊గాటంబులై యుజ్జ్వల
త్కలకంఠీరవకామినీనినదరే◊ఖం బల్వెఱన్ గూర్పఁగన్. 50
టీక: చెలి=సఖియగు చకోరి; కేలందినన్=చేయిఁ బట్టఁగా; మాఱు పల్కక=బదులు మాటాడక; మనశ్చింతాకులస్ఫూర్తిన్ – మనశ్చింతా=మనోగతమైన ప్రియవిషయకధ్యానముచేత, ఆకులస్ఫూర్తిన్ = వ్యాకులత్వప్రకాశముచేత; తత్కలకంఠీరన్ – తత్ = ఆ, కలకంఠీ=చకోరియొక్క, ఇరన్=వాక్యముచేత; తత్పద్మినీమౌళి = ఆపద్మినీజాతిస్త్రీరత్నమగు చంద్రిక; సత్కల కంఠీరవజాలకంబులు – సత్=శ్రేష్ఠములైన, కలకంఠీ=కోకిలస్త్రీలయొక్క,రవజాలకంబులు = ధ్వనికదంబములు; కడున్= మిక్కిలి; గాటంబులై=దృఢములై; ఉజ్జ్వలత్=ప్రకాశించుచున్న,కల=కాంతిగల,కంఠీరవ=సింహములయొక్క, కామినీ=స్త్రీల యొక్క, నినదరేఖన్=ధ్వనిరీతిని; బల్వెఱన్=గొప్పభయమును;కూర్పఁగన్=ఘటిల్లఁజేయుచుండఁగా; వనంబు=ఉద్యాన వనమును; చేరన్=పొందునట్లుగా; అరిగెన్ =పోయెను. ఆచంద్రిక తననెచ్చిలియగు చకోరివాక్యమునకు మాఱు మాటాడక దానిచే యూఁతగాఁ గొని యుద్యానమునకు వెడలు చుండఁగా కోకిలస్త్రీస్వరములు సింహనాదములభంగిని భయము గలుగఁ జేసె ననుట. అవి యామె కు మిగుల రాగోద్దీపకము లాయె నని ఫలితము.
శా. భ్రాజద్భక్తి నెదుర్కొనంగ వనగో◊పస్త్రీజనం బాప్తనీ
రేజాస్యానికరంబు తన్ గొలువఁ జే◊రెన్ గేళికారామ మా
రాజీవాంబక శింజినీనికరగ◊ర్జల్ హంసి నేర్వ న్మహా
రాజీవాంబక శింజినీవిరుతిఁ బ◊ర్వన్ వేఁడి నిట్టూర్పులున్. 51
టీక: ఆ రాజీవాంబక =కమలనయన యగు నాచంద్రిక; వనగోపస్త్రీజనంబు – వనగోప=ఉద్యానవనపాలికలగు, స్త్రీజనంబు = స్త్రీలు; భ్రాజద్భక్తిన్=ఒప్పుచున్నభక్తిచేత; ఎదుర్కొనంగన్=ఎదురు రాఁగా; ఆప్తనీరేజాస్యానికరంబు – ఆప్త=హితలైన, నీరే జాస్యానికరంబు =స్త్రీసమూహము; తన్=తన్ను; కొలువన్=సేవింపఁగా; శింజినీనికరగర్జల్ – శింజినీ=అందెలయొక్క, నికర = గుంపుయొక్క, గర్జల్=ధ్వనులను; హంసి=హంసస్త్రీ; నేర్వన్=అభ్యసింపఁగా; మహారాజీవాంబకశింజినీవిరుతిన్ – మహత్ = అధికమైన, రాజీవాంబక=మరునియొక్క, శింజినీ=అల్లెత్రాటియొక్క, తుమ్మెదబారుయొక్కయనుట, విరుతిన్= ఝంకృతి చేత, ‘శింజినీ నూపురజ్యాయోః’ అని రత్నమాల; వేఁడి నిట్టూర్పులున్=ఉష్ణమైన దీర్ఘనిశ్వాసములు; పర్వన్= వ్యాపింపఁగా; కేళికారామము=క్రీడోద్యానమును; చేరెన్=పొందెను. అనఁగా నాచంద్రిక వనపాలికలు భక్తితో నెదుర్కొనఁగా సఖీవర్గము కొలుచుచుండఁగా హంసపలుకులంబోలు నందెలచప్పుడుతోఁ గూడి, తుమ్మెదఝంకారములచేఁ గుంది, వేఁడి నిట్టూర్పులు విడుచుచుఁ గేళికావనముం జేరె ననుట.
క. కువలాస్త్రరుజాగతిఁ బొ,క్కు వలాహకకచకు వనిక◊కొమ రయ్యెడఁ ద
త్కువలాంబకాళి సుధ తేఁ,కువ లార్చుశుభోక్తిఁ దెల్పెఁ ◊గూరిమి పొదలన్. 52
టీక: అయ్యెడన్=ఆసమయమందు; కువలాస్త్రరుజాగతిన్=మదనజ్వరప్రాప్తిచేత; పొక్కు వలాహకకచకున్ = తపించుచున్న చంద్రికకు, వలాహక మనఁగా మేఘము. దానివంటి వెండ్రుకలు గలది వలాహకకచ; తత్కువలాంబకాళి – తత్=ఆ, కువలాంబ కాళి=స్త్రీసమూహము; సుధతేఁకువలు – సుధ=అమృతముయొక్క, తేఁకువలు=ధైర్యములను; ఆర్చుశుభోక్తిన్ = శమింపఁ జేయు శుభమైనవాక్యముచేత; వనికకొమరు=ఉద్యానముయొక్క యందమును; కూరిమి=ప్రేమము;పొదలన్ = వృద్ధిపొందు నట్లుగా; తెల్పెన్=తెలిపెను.
కామజ్వరముచే వ్రేఁగుచున్నచంద్రికతో నాస్త్రీలు సుధకన్న మధురమైన పల్కులతో నుద్యానవన సౌందర్యమును దెల్పి రనుట.
సీ. బాలాంబుజతమాల◊మాలాభినవజాల,జాలామృతోల్లోల◊షట్పదౌఘ,
రాగాదిపరమాగ◊మాగాంతసుపరాగ,రాగావరణభాగ◊రాళపవన,
కేలీగృహన్మౌలి◊మౌలిస్థితపికాలి,కాలీనరవలోలి◊తాధ్వగాత్మ,
రాజీవశరవాజి◊వాజీననిరతాజి,తాజీజనకరాజి◊తామ్రఫలిక,
తే. భవ్యఋతుకాంతకాంతతా◊త్పర్యసృష్ట,ఘనవిషమబాణబాణసం◊ఘాతకలిత
తిలకమధుగంధగంధసం◊చులుకితాశ,కనదచిరధామధామ యి◊వ్వనిక గంటె. 53
టీక: బాలాంబుజ తమాలమాలాభినవ జాలజా లామృ తోల్లోల షట్ప దౌఘ – బాల=లేఁతనైన, అంబుజ=తమ్ములయొక్క యు, తమాలమాలా=కానుగపంక్తులయొక్కయు, అభినవ=క్రొత్తనగు, జాలజాల=మొగ్గలగుంపుయొక్క, అమృత=పూఁ దేనియయందు, ఉల్లోల=మిక్కిలి యాసక్తములైన, షట్పద=తుమ్మెదలయొక్క,ఓఘ=సమూహము గలది;
రాగాది పరమాగ మాగాంత సుపరాగ రాగావరణభా గరాళ పవన – రాగాది=దాడిమీవృక్షము మొదలుగాఁగల, పరమ= శ్రేష్ఠము లైన, అగమ=వృక్షములయొక్క, అగాంత=పుష్పములయొక్క,సుపరాగ=మంచిపుప్పొడియొక్క, రాగ=రక్తిమ యొక్క, ఆవరణ=ఆచ్ఛాదనమును, భాక్=పొందిన, అరాళ=కుటిలములగు, పవన=వాయువులు గలది;
కేళీగృహ న్మౌలి మౌలి స్థిత పికాలికాలీన రవ లోలి తాధ్వగాత్మ – కేళీగృహత్=విహారగృహములగుచున్న, మౌలి=అశోక వృక్షములయొక్క, మౌలి=అగ్రములయందు, స్థిత=ఉండిన, పికాలికా=కోకిలపంక్తులయొక్క, అలీన=స్ఫుటమైన, రవ= ధ్వనిచేత, లోలిత=చలింపఁజేయఁబడిన, అధ్వగ=పాంథులయొక్క, ఆత్మ=మనములు గలది;
రాజీవశర వాజి వాజీన నిరతాజి తాజీ జనక రాజి తామ్రఫలిక – రాజీవశర=మన్మథునికి, వాజి=అశ్వములైన, వాజీన=పక్షి శ్రేష్ఠములయొక్క, నిరతాజిత = ఎల్లప్పుడు నోటువడని, ఆజీ=కలహములకు, జనక=హేతువైన, రాజిత=ఒప్పుచున్న, ఆమ్ర ఫలిక = మావిపండ్లు గలది; భవ్య ఋతుకాంత కాంతతాత్పర్య సృష్ట ఘన విషమబాణబాణ సంఘాత కలిత తిలక మధు గంధ గంధ సంచులుకితాశ – భవ్య= మనోజ్ఞమైన, ఋతుకాంత=వసంతునిచేత, కాంతతాత్పర్య=మంచియాసక్తిచేత, సృష్ట=సృజింపఁబడిన, ఘన=అధి కములైన, విషమబాణబాణ= మన్మథుని బాణములైన పుష్పములయొక్క, సంఘాత=సముదాయముతో, కలిత=కూడు కొన్న, తిలక= బొట్టుగుచెట్లయొక్క, మధు=మకరందముయొక్క, గంధ=పరిమళముయొక్క, గంధ=లేశముచేత, ‘గన్ధో గన్ధక ఆమోదే లేశే సంబంధ గర్వయోః’ అని విశ్వము, సంచులుకిత=పుడిసిలింపఁబడిన, ఆశ=దిక్కులు గలదియు నగు; ఇవ్వనిక=ఈయుద్యానవనము; కనదచిరధామధామ – కనత్=ఒప్పుచున్న, అచిరధామధామ=మెఱపువంటికాంతిగలదానా! కంటె=చూచితివా? నవాంభోజతమాలజాలకములపూఁదేనియయం దాసక్తము లగు తుమ్మెదలు గలదియు, దాడిమి మున్నగు మ్రాఁకుల పుష్పరేణువులచేత వ్యాప్తములగు తెమ్మెరలు గలదియు, బాటసారుల చిత్తమును జలింపఁజేయు నశోకవృక్షవాసి కోకిలల ధ్వనులు గలదియు, ఎల్లపుడు చిలుకలకు జగడము గలుగఁజేయు మావిపండ్లు గలదియు, వసంతోదయమున నుదయించిన బొట్టుగులపువ్వుల వాసనాలేశముచేఁ బుడిసిలింపఁబడిన దిక్కులు గలదియు నగు నీవనమును జూడు మనుట.
చ. తలిరుమెఱుంగుచాయ శుక◊దారరవస్తనితంబు లెచ్చ ని
స్తులతిలకాభ్రముల్ గురియఁ ◊జొచ్చెఁ బయోజదళాక్షి గాడ్పుచాల్
గలయ మరందదంభమున ◊గాటపువర్షము గంటె సాంద్రము
త్కల యమరం దదంభమున◊కై యళిచాతకకోటి పర్వఁగన్. 54
టీక: పయోజదళాక్షి=పద్మపత్రములఁబోలు కన్నులుగలదానా! నిస్తులతిలకాభ్రముల్= సాటిలేని తిలకవృక్షము లనెడు మేఘ ములు; తలిరుమెఱుంగుచాయ=చిగురులనెడు మెఱపుడాలు; శుకదారరవస్తనితంబులు – శుకదార=ఆఁడుచిల్కలయొక్క, రవ=ధ్వను లనెడు, స్తనితంబులు = ఉఱుములు; ఎచ్చన్=మించఁగా; గాడ్పుచాల్=వాయుపరంపర; కలయన్ = కూడఁగా; సాంద్రముత్కల = దట్టమైన సంతోషకళ; అమరన్=ఒప్పఁగా; తదంభమునకై = ఆమకరందమనెడు జలమునకై; అళిచాతక కోటి =తుమ్మెదలను చాతకములగుంపు; పర్వఁగన్=వ్యాపింపఁగా; మరందదంభమునన్ = మకరందవ్యాజముచేత; గాటపు వర్షము=గాఢమైన వర్షమును; కురియన్ చొచ్చెన్=కురియసాగెను; కంటె=చూచితివా? రూపకకైతవాపహ్నుతులు.
చ. హితమహిలాలలామ వరి◊యింపఁగ నిప్డు నిరస్తహీరభా
తతికరదీ! పికాళివని◊తాశుభగీతి సువర్ణజాలసం
తతికరదీపికాళి వని ◊దార్కొన నామని రాఁగఁ దుంగసౌ
ధతలము లెక్కెఁ గన్గొన ము◊దంబునఁ జిల్కలరాణివాసముల్. 55
టీక: నిరస్తహీరభాతతికరదీ – నిరస్త=తిరస్కరింపఁబడిన, హీరభాతతిక=వజ్రకాంతిపరంపర గల్గిన, రదీ=దంతములు గల దానా! ఇది చంద్రికాసంబోధనము; పికాళివనితాశుభగీతిన్ – పిక=కోకిలలయొక్కయు, అళి=తుమ్మెదలయొక్కయు, వనితా = స్త్రీ లనెడు స్త్రీలయొక్క, శుభగీతిన్=మంగళమైన పాటతోను; సువర్ణజాలసంతతికరదీపికాళిన్ – సువర్ణజాల=సంపెఁగమొగ్గల యొక్క, సంతతి=సమూహమనెడు, కరదీపికా=చేతిదీపములయొక్క, ఆళిన్ =పంక్తితోను; వని=వనమనెడు స్త్రీ; తార్కొనన్ = సమీపింపఁగా; ఆమని=వసంతము; హితమహిలాలలామన్ – హిత=ఇష్టమైన, మహిలాలలామన్=ప్రేంకణమనెడు స్త్రీరత్న మును, ‘శ్యామా తు మహిలాహ్వయా’ అని యమరుఁడు; వరియింపఁగన్=వరించుటకు; రాఁగన్=వచ్చుచుండఁగా; ఇప్డు = ఈసమయమందు; చిల్కలరాణివాసముల్ = శుకాంగన లనెడు రాజస్త్రీలు; ముదంబునన్=సంతసముచేత; తుంగసౌధతల ములు = పొన్నలయు, మోరటిచెట్లగుంపులయు ప్రదేశము లనెడు ఉన్నతసౌధప్రదేశములను; కన్గొనన్=చూచుటకై; ఎక్కెన్= అధిష్ఠించెను. అనఁగా ఆఁడుకోయిలలయొక్కయు, తుమ్మెదలయొక్కయు పాటలతోడను, సంపెంగమొగ్గ లనెడు కరదీపి కలతోడను, వని యెదుర్కొన మహోత్సవముగా వసంతుం డను నొకవరుండు ప్రేంకణ మనెడు స్త్రీరత్నమును వరించుటకై వచ్చిన యట్లున్నదనియు, వానిం గాంచ ముదంబున శుకాంగనలు తుంగసౌధము లెక్కిన యట్లున్నదనియు భావము.
చ. నలువుగ మొగ్గగుబ్బ లెద◊నాటఁగఁ గౌఁగిటఁ జేర్చి నేర్పుతో
మలయధరాధరానిలకు◊మారవిటుండు లతాప్రసూనకో
మలయధరాధరాసవము ◊మాటికి నానుచుఁ జొక్కె మోదముల్
మలయ ధరాధరాగ్రణికు◊మారిక! చూపటు నిల్వఁ జేయవే. 56
టీక: ధరాధరాగ్రణికుమారిక=రాజపుత్త్రికయగు చంద్రికా! మలయధరాధరానిలకుమారవిటుండు – మలయధరాధర = మలయపర్వతముయొక్క, అనిలకుమార=మందమారుతమనెడు, విటుండు=జారుఁడు; నలువుగన్=ఒప్పిదముగా; మొగ్గ గుబ్బలు =మొగ్గలనెడు స్తనములు;ఎదన్=హృదయమునందు; నాటఁగన్=తాఁకునట్లు; కౌఁగిటన్=భుజాంతరమున; నేర్పు తోన్=చాతుర్యముతో; చేర్చి=కదియించి; లతాప్రసూనకోమలయధరాధరాసవము – లతా=లతయనెడు, ప్రసూనకోమల=స్త్రీ యొక్క, అధరాధర=అధరోష్ఠస్థానీయమైన, ఆసవము=మద్యమును; మాటికిన్=సారెకు; ఆనుచున్=పానము చేయుచు; మోదముల్=సంతసములు; మలయన్=వ్యాపింపఁగా; చొక్కెన్=సుఖపరవశుఁడయ్యెను; చూపు=దృష్టిని ; అటు=ఆవైపు; నిల్వన్ చేయవే = నిగిడింపవే. మలయమారుతము సేయు విటచరితంబు నాలోకింపు మనుట.
శా. స్ఫీతాళ్యావృతిభూర్యయోవలయల◊క్ష్మిం బూని పాంథాంగనా
జాతాసృక్పరిషిక్తరీతి నరుణ◊చ్ఛాయల్ మనం బొల్చు నీ
శాతప్రాససమూహజాలకుల మె◊చ్చన్ జేసెఁ బో చిత్తభూ
శాతప్రాససమూహ జాలజవిభా◊సంజేతృవక్త్రేందుకా! 57
టీక: జాలజవిభాసంజేతృవక్త్రేందుకా—జాలజ=పద్మసంబంధిని యగు, విభా=కాంతిని, సంజేతృ=జయించిన,వక్త్రేందుకా = చంద్రునివంటి మోముగలదానా! స్ఫీతాళ్యావృతిభూర్యయోవలయలక్ష్మిన్ – స్ఫీత=అధికమైన, అళి=తుమ్మెదలయొక్క, ఆవృతి=ఆవరణ మనెడు, భూరి=అధికమైన, అయోవలయ=ఇనుముతొడుపుయొక్క,లక్ష్మిన్=సంపదను;పూని=వహించి; పాంథాంగనాజాతాసృక్పరిషిక్తరీతిన్ – పాంథాంగనా=విరహిస్త్రీలయొక్క, జాత=సమూహముయొక్క, అసృక్=రక్తము చేత, పరిషిక్తరీతిన్=తడుపఁబడినదాని రీతిచేత; అరుణచ్ఛాయల్=ఎఱ్ఱనికాంతులు; మనన్=కలుగఁగా; పొల్చు నీశాతప్రాస సమూహజాలకులము – పొల్చు=ఉదయించిన, ఈశాతప్రాస=ఈయెఱ్ఱగన్నెరుల సంబంధియైన, సమూహ=సముదాయము యొక్క, జాలకులము=మొగ్గలగుంపు; చిత్తభూశాతప్రాససమూహన్ – చిత్తభూ=మన్మథునియొక్క, శాత=తీక్ష్ణమైన, ప్రాస = ప్రాసమను ఆయుధవిశేషము లనెడు; సమూహన్ = మంచియూహను; ఎచ్చన్ జేసెఁ బో = హెచ్చునట్లు చేసెనుగదా!
అనఁగా నెఱ్ఱగన్నేరుమొగ్గలకు తుమ్మెదలు చుట్టుకొని యుండఁగానవి యినుపతొడుపుతోఁ గూడి పాంథస్త్రీరక్తసిక్తమైన మన్మథుని తీక్ష్ణప్రాసాయుధములను బోలియుండె ననుట.
చ. వలదొర మెచ్చఁగా ఘనసు◊వర్ణపలాశకవాసనాగతిన్
గలసి రజస్స్ఫులింగములు ◊గ్రక్కుచు వీవలి వేగ చేరి రా
నలిని భయానఁ దాఱె నసి◊యాడెడు నెమ్మది పూని కంటివే
నలి నిభయాన దా రెనసి ◊నవ్వ లతల్ తెలిపూలచాలుచేన్. 58
టీక: వీవలి = వాయువు; వలదొర = మరుఁడు; మెచ్చఁగాన్=శ్లాఘింపఁగా; ఘనసువర్ణపలాశకవాసనాగతిన్—ఘన=అధిక మైన, సువర్ణ=చంపకములయొక్కయు, పలాశక=మోదుగులయొక్కయు, వాసనాగతిన్=సౌరభప్రాప్తిచేత; ఘన=మేఘము యొక్క, సువర్ణ=మంచిరంగువంటి రంగుగల, పలాశక=రక్కసులయొక్క, వాసనాగతిన్=సంస్కారప్రాప్తిచేత నని యర్థాంత రము; రెంటికి నభేదాధ్యవసాయముచేత, వాసనాప్రాప్తి యనెడు వాసనాప్రాప్తిచేత నని యర్థము; కలసి=కూడి; రజస్స్ఫులింగ ములు = పరాగము లనెడు మిణుఁగుఱులను; క్రక్కుచున్=వమనముఁ జేయుచు; వేగ =శీఘ్రముగా; చేరిరాన్=సమీపమునకు రాఁగా; అలిని=ఆఁడుతుమ్మెద, భీరువని తోఁచుచున్నది; లతల్=తీవలు;తారు=తాము; ఎనసి=కూడుకొని;నలిన్=మిగులను; తెలిపూలచాలుచేన్=తెల్లనిపూబంతిచేత; నవ్వన్=హసింపఁగా; అసియాడెడు నెమ్మదిన్ = కదలుచున్న నిండుమనస్సును;
పూని =వహించి; తాఱెన్=దాఁగెను; ఇభయాన=ఓ గజగమనవైన చంద్రికా! కంటివే = చూచితివా?
అనఁగా వీవలి పలాశచంపకవాసనావాసితమై రజస్సనెడు మిణుఁగుఱులను గ్రక్కుచు వచ్చుచున్న దనియు, దానివలన నాఁడుతుమ్మెద వెఱచి డాఁగిన దనియు, పూచినలతలు దానిం జూచి నవ్వునట్లున్న వనియు భావము. చంపకమునకు తుమ్మెద వెఱచుట ప్రసిద్ధము.
మ. అలరెం గొల్వయి కీరభూపతి రసా◊లాస్థానదేశంబునన్
లలితోఁ దాఱనిసొంపు మించ నళిబా◊లారత్నలాస్యైకలీ
ల లితోదారపికాళిగీతవిహృతుల్ ◊రాజిల్లఁ గన్గొంటివే
లలితోదారనగప్రసూనరసజా◊లద్వేషిదంతాంశుకా! 59
టీక: లలితోదారనగప్రసూనరసజాలద్వేషిదంతాంశుకా – లలిత=మనోజ్ఞమైన, ఉదార=అధికమగు, నగ=వృక్షములయొక్క, ప్రసూనరస=పూఁదేనియయొక్క, జాల=రాశికి, ద్వేషి=పగయైన, దంతాంశుకా=పెదవిగలదానా! అనఁగాఁ దేనియ లొలుకు మోవిగలదానా యనుట; కీరభూపతి=చిలుకయను రాజు; రసాలాస్థానదేశంబునన్ – రసాలాస్థానదేశంబునన్=తియ్యమావి యను కొలువుకూటపు ప్రదేశమందు; కొల్వయి=కూర్చుండి యనుట; లలితోన్=ప్రీతితోడ; తాఱనిసొంపు = ఉడివోనిసొంపు; మించన్=అతిశయింపఁగా; అళిబాలారత్నలాస్యైకలీలలు – అళిబాలారత్న=భృంగబాలికారత్నములయొక్క, లాస్య= నాట్యమందలి, ఏక=ముఖ్యమైన, లీలలు=విలాసములు; ఇతోదారపికాళిగీతవిహృతుల్ – ఇత=పొందఁబడిన, ఉదార=అధిక మైన, పికాళి=కోకిలల సమూహముయొక్క, గీత=గానముయొక్క, విహృతుల్=విహారములు; రాజిల్లన్=ప్రకాశింపఁగా; అలరెన్=ఒప్పెను; కన్గొంటివే =చూచితివా?
అనఁగా రసాలమందున్న కీరము సభామందిరమందుఁ గూర్చుండిన భూపతిని బోలి యున్నదనియు, తుమ్మెదలయాట లును, గోయిలలపాటలును వనితల లాస్యగానంబులవలె నుండిన వనియు భావము.
చ. అళినికరాందుకాప్తిఁ గిస◊లావళిరాంకవవస్త్రలబ్ధి ను
జ్జ్వలసుమపద్మయుక్తి మధు◊సాతిరసాప్లుతి నొప్పి చైత్రభూ
తలవరకుంజరాజితవి◊ధానముఁ గైకొనెఁ గాంచు నీలకుం
తల! వరకుంజరాజి వెఱ ◊దార్చుచుఁ బాంథజనాక్షివీథికిన్. 60
టీక: నీలకుంతల=ఓనీలవేణీ! వరకుంజరాజి – వర=శ్రేష్ఠమగు,కుంజ=పొదరిండ్లయొక్క,రాజి =చాలు;అళినికరాందుకాప్తిన్ – అళినికర=తుమ్మెదలగుంపనెడు, అందుక=నిగళములయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; కిసలావళి రాంకవవస్త్రలబ్ధిన్ – కిసలా వళి=చిగురాకులగుంపనెడు, రాంకవ=మృగరోమసంబంధియైన,వస్త్ర=వస్త్రముయొక్క, లబ్ధిన్=ప్రాప్తిచేత; ఉజ్జ్వలసుమపద్మ యుక్తిన్ – ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, సుమ=పువ్వులనెడు, పద్మ=బిందువులయొక్క, ‘పద్మకం బిన్దుజాలకమ్’ అని యమ రుఁడు, యుక్తిన్=సంబంధముచేత; మధుసాతిరసాప్లుతిన్ – మధు=మకరందమనెడు, సాతిరస=దానోదకమందు, ఆప్లుతిన్= మునుకచేతను; ఒప్పి; పాంథజనాక్షివీథికిన్—పాంథజన=పథికులయొక్క, అక్షివీథికిన్= దృక్ప్రదేశమునకు; వెఱ= వెఱ పును; తార్చుచున్=కలిగించుచు; చైత్రభూతల వరకుంజరాజితవిధానమున్ – చైత్ర=వసంతుఁడనెడు, భూతలవర=భూపతి యొక్క, కుంజర=ఏనుఁగుయొక్క, అజిత=ఓటు వడని, విధానమున్=విధిని; కైకొనెన్=స్వీకరించెను; కాంచు =చూడుము.
అనఁగా నికుంజములు తుమ్మెదలను నిగళములతోను, చిగురాకులనెడు రాంకవములతోను, పువ్వులనెడు సిబ్బెపు బొట్టులతోను, పూఁదేనియ యనెడు మదోదకముతోను విలసిల్లి పాంథులచూపులకు వెఱపు గొల్పుచు వసంతుఁడను రాజు యొక్క గజములచాలువలె రాజిల్లె ననుట.
మ. సరసం గాంచవె, రూపదర్శనవిధా◊జాతాత్మవైచిత్ర్యవ
త్సుర! సారంగము లొందెఁ జెంత విగళ◊త్సూనాసవప్రోజ్జ్వల
త్సురసారంగము లధ్వగాంతరసరః◊క్షోభావహోద్వృత్తి భా
సురసారంగము లంగజానలశిఖా◊స్తోకాన్యధూమాకృతుల్. 61
టీక: రూపదర్శనవిధాజాతాత్మవైచిత్ర్యవత్సుర – రూప=సౌందర్యముయొక్క, దర్శనవిధా=దర్శనముయొక్క ప్రకారము వలన, జాత=పుట్టిన, ఆత్మ=చిత్తములయొక్క, వైచిత్ర్యవత్=ఆశ్చర్యము గల్గిన, సుర=దేవతలుగలదానా! సరసన్=చెంగట; అధ్వగాంతరసరఃక్షోభావహోద్వృత్తి భాసురసారంగములు – అధ్వగ=పాంథులయొక్క, అంతర=హృదయములనెడు, సరః =కొలఁకులకు, క్షోభావహ=క్షోభకరమైన, ఉత్=అధికమైన,వృత్తి =వ్యాపారముచేత, భాసుర=ప్రకాశించుచున్న, సారంగ ములు = గజములును; అంగజానలశిఖాస్తోకాన్యధూమాకృతుల్ – అంగజానల=మదనాగ్నియొక్క,శిఖా=జ్వాలలయొక్క, స్తోకాన్య=అధికమైన, ధూమ=పొగలయొక్క, ఆకృతుల్=ఆకారములు గల్గినవి యగు; సారంగములు=తుమ్మెదలు; చెంతన్ = సమీపమందు; విగళత్సూనాసవప్రోజ్జ్వలత్సురసారంగములు – విగళత్=జాఱుచున్న, సూనాసవ=మకరందముచేత, ప్రో జ్జ్వలత్ = మిక్కిలి ప్రకాశించుచున్న, సురసా = సర్పాక్షితీవలయొక్క, రంగములు = స్థానములను; ఒందెన్ = పొందెను; కాంచవె=చూడుమా. అనఁగా సర్పాక్షితీఁగలందుఁ బూఁదేనియ జాఱుచుండఁగా నందుఁ దుమ్మెదలు వసించిన వనియు, అవి పాంథుల యంత రంగంబు లనెడు కొలఁకులను క్షోభపెట్టుటయం దేనుఁగులుగాను కామాగ్నిశిఖలధూమంబులుగాను నున్న వనియు భావము.
క. అని వారణయానామణి
కనివారణ వాణిఁ దెలిపి ◊యవ్వనిసిరి యొ
య్యన సారసగంధివితతి
యనసారసుమప్రతాన◊హరణోత్సుకతన్. 62
టీక: అని = ఉక్తప్రకారముచేత;వారణయానామణికిన్ = గజగమనరత్నమగు చంద్రికకు; అనివారణ వాణిన్ = అడ్డములేని ఫణితిచేత; అవ్వనిసిరిన్=ఆవనసంపదను; తెలిపి=బోధించి; ఒయ్యనన్=తిన్నగా; సారసగంధివితతి = పద్మగంధులైన స్త్రీల సమూహము; అనసారసుమప్రతానహరణోత్సుకతన్ – అనసార=అసారముగాని, అనఁగా శ్రేష్ఠమైన, సుమప్రతాన=పుష్ప సంఘముయొక్క, హరణ=కోయుటయందు; ఉత్సుకతన్=కుతూహలముచేత. దీనికి ముందున్న రగడతో నన్వయము.
వృషభగతి రగడ.చెలువ చెలువపుమొగ్గచా ల్కొని ◊చేరు చేరుగఁ గూర్తు విచ్చట
నలిని నలినిభకుంతలామణి ◊నన్ను నన్నులు వేఁడ ముచ్చట
తిలకతిలకకులంబు గన్గొన ◊దివ్యదివ్యాగముల పోలిక
నలరు నలరుల నెనయు రోలం◊బాళి బాళి చిగుర్ప బాలిక
యింతి యింతిటఁ జేరఁ దగదె సు◊మేర మేరయె వకుళపాళిని
కాంతకాంతవశరము లల్లవె ◊కాంత కాంతమె చాల హాళిని
నారి నారికెడంబుచాయల ◊నవ్వ నవ్వలిపొన్న పూచెను
కోరకోరసిజ రతి నది నేఁ◊గోర గోరఁట లజ్జ నాఁచెను
రాగరాగపరాగ మిచ్చ న◊రంగురంగునఁ బొల్చె నెక్కవె
రాఁగ రాగతఁ బట్టుకొనఁ గల◊రవమురవములు దెరల దక్కవె
పొదలుపొదలును దఱిసి నెలఁతలు ◊బొగడఁ బొగడలమీఁద మాటికి
మదిర మది రహి మించ నుమిసిన ◊ మధురమధురస మెనపుఁ బోటికి
కొమ్మ కొమ్మలఁ గోసి విరులు చ◊కోరి కోరినపొదలు దూఱుచు
నిమ్ము నిమ్ముదితగమి వేఁడిన ◊నీక నీకనకాళిఁ దాఱుచు
నాస నాసవ మాన నీలల◊నాళి నాళిక పిలుచుఁ బెంపున
వాసవాసమదీప్తి గల నన ◊ వనిత వని తగె గోఁగు సొంపునఁ
గేలి గేలి యొనర్ప నలకం◊కేలి కేలిడి యూఁచు హావళి
సాలసాలపనశుకపికమధు◊పాలిపాలిటి కూర్మికావళి
రామ రామవినీలవంజుల◊రాజి రాజిలు నంఘ్రి చేర్పవె
శ్యామ శ్యామల కోరకమ్ములను ◊సరససరసముదయము గూర్పవె
యక్క యక్కనకమున మనె నీ◊యాన యానవకళిక యిత్తఱి
నిక్క నిక్కము ద్రుంచి యొసఁగుదు ◊నీవు నీవు లొసంగ బిత్తరి
ప్రమద ప్రమదతఁ గేల నంటఁగ ◊రమ్మ రమ్మమరంగఁ జూతము
కొమరె కొమరె సఁగించు నవసుమ◊కులముకులముల భృంగజాతము
అప్ప యప్పల్లవకదంబక◊మాఁగు మా గురుజవము నెగడఁగ
నిప్ప నిప్పద్మాననావ్రజ ◊మించుమించుపలుకులఁ బొగడఁగ
నలమ నలమదిరాక్షి గొరవిఫ◊లాలి లాలితమైన డాయుచు
కలికి కలికిఁ గడంగె సారస◊కాండకాండచయంబు మ్రోయుచు
వేఁడు వేడుక నిత్తు నీ కి◊వ్వేళ వే లతికాంతవారము
దాడి దాడిమగమికిఁ జేరఁగఁ ◊దగునె దగునెడ కరిగెఁ గీరము
తరుణి తరుణికఁ జేరు నెచ్చెలి ◊దరము దరమున నూర్పు వీవలి
పరువఁ బరువముఁ బొందె వావిలి ◊బాల బాలచ్ఛదసుమావళి
యీవ యీవరకిసలసంతతి ◊కేవ కేవలరయతఁ జేరకు
మావి మావిభు సూను సేనకు◊మహిమ మహి మనుటెంకి దూఱకు
లతిక లతికమనీయపక్వఫ◊లమ్ము లమ్మును మున్నె హెచ్చఁగ
రతిని రతినిభ పాటఁబాడఁగ◊రా ధరాధరకుచలు మెచ్చఁగ
యలసి యలసితపత్ర మెనసె ఘ◊నాత్మ నాత్మకు హితము చేకొన
నలికె నలి కెరలంగ వల దిభ◊యాన యానగమౌళిఁ బైకొన
నెలమి నెలమి న్నలము నెమ్మొగ◊మెత్త మెత్తనికుసుమజాలము
లలినిలలిని నడంచెఁ గనుమో ◊యతివ యతివరకనకసాలము
నలఁచె నలచెలి నతులకీరపి◊కాళికాళిధ్వనుల బలువగ
వలయు వలయుతిఁ జిత్రగతి దై◊వాఱువారుహబాణుఁ గొలువఁగ. 63
టీక: చెలువ =ఓకొమ్మ యని సంబోధనము; చెలువపుమొగ్గచాల్= అందమైన మొగ్గలచాలును; కొని=తీసికొని; చేరు=రమ్ము; ఇచ్చటన్=ఈప్రదేశమునందు; చేరుగన్=సరముగాను; కూర్తువు=గ్రధింతువు; నలినిన్=మిక్కిలి; అలినిభకుంతలామణి= తుమ్మెదలఁబోలు కురులుగల స్త్రీరత్నమా! అన్నులు=స్త్రీలు; వేఁడన్=ప్రార్థింపఁగా; ముచ్చటన్=అందముచేత; నన్నున్ = నను; చేరు అని వెనుక కన్వయము. బాలిక = ఓచిన్నదానా! తిలకతిలకకులంబు = తిలకతరుశ్రేష్ఠములగుంపు; కన్గొనన్=చూడఁగా; దివ్యదివ్యాగముల పోలికన్ –
దివ్య=సుందరములైన,దివ్యాగముల =కల్పవృక్షములయొక్క, పోలికన్=సామ్యముచేత; అలరున్=ఒప్పును; రోలంబాళి = భృంగపంక్తి; అలరులన్=పువ్వులను; బాళి =ఆసక్తి; చిగుర్పన్=చిగిరించునట్లు; ఎనయున్=పొందును. ఇంతి=ఓనారీ! ఇంత=ఇంచుక; ఇటన్=ఇచట; చేరఁన్ తగదె=చేరఁగూడదా? వకుళపాళిని = వకుళపుష్పములచాలునందు; సుమేర (సుమ+ఇర)=పుష్పరసమునకు, ‘ఇరా భూ వాక్సురాప్సు స్యాత్’ అని యమరుఁడు; మేరయె = అవధి కలదా? కాంత=ఓయింతీ! కాంత=మనోజ్ఞములైన, కాంతవ=స్మరసంబంధులైన, ‘కంతు’శబ్దముమీఁద అణ్ప్రత్యయము వచ్చి కాంతవ యని యైనది, శరములు = బాణములు, అనఁగా పువ్వు లనుట, అల్లవె = అవిగో; చాల హాళిని =అధికమగు ప్రీతితో; కాంతమె = చూతమా! నారి = ఓచెలీ! నారికెడంబుచాయలన్=టెంకాయచెట్లవైపులను; నవ్వన్=నవ్వఁగా; అవ్వలిపొన్న=అటువైపు నున్న పున్నాగ వృక్షము; పూచెను=కుసుమించెను; కోరకోరసిజ (కోరక+ఉరసిజ) = మొగ్గలవంటి చన్నులుగలదానా! అని సంబుద్ధి; రతిన్= ఆసక్తిచేత; నేన్=నేను; కోరన్= వాంఛింపఁగా; అది=ఆస్త్రీ; గోరఁటలు=కురవకములను; నాఁచెను=అపహరించెను; అజ్జ = ఆశ్చర్యము! రాగరాగపరాగము=రాగప్రధానమైన దాడిమీపుష్పరజము; అరంగురంగునన్=వేదిసొబగున; పొల్చెన్=ఒప్పెను; ఇచ్చన్ = యథేచ్ఛగా; ఎక్కవె=అధిష్ఠింపుమా! రాఁగన్=వచ్చుచుండఁగా; రాగతన్=అనురాగము గల్గుటచేత; పట్టుకొనన్=పట్టుకొనఁగా; కలరవము=కోకిల; రవములు తెరలదు= కూఁతల నుడుగదు; అక్కవె=స్త్రీనిగూర్చి యను ననునయవచనము; పొదలుపొదలును = ఏపుమీఱిన నికుంజములను; తఱిసి=సమీపించి; నెలఁతలు=స్త్రీలు; పొగడన్=మెచ్చఁగా; పొగడలమీఁదన్ = పొగడచెట్లమీఁద; మాటికిన్=సారెకు; మదిరన్=మద్యమును; మదిన్=హృదయమందు; రహి=ప్రీతి; మించన్=అతిశయిం పఁగా; ఉమిసినన్=నిష్ఠీవనము సేయఁగా; పోటికిన్=బదులుగా ననుట; మధురమధురసము=తీయనిమకరందరసమును; ఎనపున్=పొందించును; అనఁగాఁ బొగడలమీఁద స్త్రీలు మద్యము నుమియఁగా నవి పోటికి మధురసము నిచ్చు ననుట. పొగడ లకు స్త్రీముఖశీధువు దోహదము గావున స్త్రీలు మద్యము నుమియఁగానే యవి పుష్పించి, పూఁదేనియ లొలికె నని భావము.
కొమ్మ=ఓ యింతీ! కొమ్మలన్=శాఖలందు; విరులు =పూవులు; కోసి; చకోరి=చంద్రికయొక్క చెలి; కోరినపొదలు = ఇష్టమైన నికుంజములను; తూఱుచున్=చొరఁబాఱుచు; ఇమ్మున్=నెలవును; ఇమ్ముదితగమి=ఈస్త్రీసంఘము; వేఁడినన్=ప్రార్థించినను; ఈకన్ = ఒసంగకయు; ఈకనకాళిన్=ఈసంపెంగచాలునందు; తాఱుచున్=దాఁచును.
ఆసన్=ఆశచేత; ఆసవము=మద్యమును; ఆనన్=పానముచేయుటకు; ఈలలనాళి=ఈస్త్రీసమూహము; ఆళికన్=చెలిని; పెంపునన్=అతిశయముచేత; పిలుచున్=ఆహ్వానము చేయును;
వనిత=ఓలలనా! వాసవాసమదీప్తి – వాసవ=రత్నసంబంధియగు, ‘వసూ రత్నే ధనే వసు’ అని యమరుఁడు, అసమ=సాటి లేని, దీప్తి= కాంతి; కల=కలిగినట్టి; ననన్=చిగురుచేత; వని=వనము; గోఁగుసొంపునన్=గోఁగుచెట్టుయొక్క అందముచేత; తగెన్= ఒప్పెను. కేలిన్=క్రీడయందు; గేలి యొనర్పన్=నవ్వులాడినందునకు; అలకంకేలిన్=ఆయశోకమునందు; కేలిడి=హస్తము నూని; ఊఁచు హావళి = ఊఁచునట్టి యుపద్రవము; సాలసాలపన (స+అలస+ఆలపన)=అలసమైన యాలాపములతోఁ గూడిన; శుకపికమధుపాళి పాలిటికి – శుక=చిలుకల యొక్క, పిక=కోకిలలయొక్క, మధుప=తుమ్మెదలయొక్క, ఆలి పాలిటికి = పంక్తిపాలిటికి; ఊర్మికావళి=షడూర్ములచాలు;
రామ=ఓనారీ! రామవినీలవంజులరాజిన్ – రామ=ఒప్పుచున్న, వినీలవంజుల=నీలాశోకములయొక్క, రాజిన్=పంక్తియందు; రాజిలు నంఘ్రిన్ = ఒప్పుచున్న చరణమును; చేర్పవె = నిలుపవె. శ్యామ = ఓచెలీ! శ్యామలకోరకమ్ములను = ప్రేంకణములయొక్క మొగ్గలచేత; సరస సర సముదయము – సరస=శ్రేష్ఠమైన, సర = దండలయొక్క, సముదయము = సమూహమును; కూర్పవె = రచింపవె. అక్క=ఓతల్లీ! అక్కనకమునన్=ఆసంపెంగయందు; ఆనవకళిక = ఆక్రొత్తమొగ్గ; ఇత్తఱిన్=ఇపుడు; మనెన్=వర్ధిల్లెను; నీయాన = నీ ఒట్టు!
బిత్తరి=ఓకలికీ! నిక్కన్=నిక్కునట్లు; నీవు; నీవులు=మూలధనములను; ఒసంగన్=ఈయఁగా; త్రుంచి=కోసి; ఒసఁగుదున్ = ఇత్తును; నిక్కము = నిశ్చయము!
ప్రమద=ఓవనితా! ప్రమదతన్=సంతోషము గల్గుటచేత; కేలన్ అంటఁగన్=చేతఁ దాఁకుటకు; అరమ్ము=వేగము; అమరంగన్= అమరునట్లుగా; రమ్ము; చూతము = అవలోకింతము. కొమరె=అమ్మాయీ! సంబుద్ధి; నవసుమకులముకులములన్ – నవ=క్రొత్తనైన, సుమకుల=పుష్పకులములయందు, ముకుల ములన్ =మొగ్గలయందు; భృంగజాతము=అళికులము; కొమరెసఁగించున్ (కొమరు+ఎసఁగించున్)=అందము నతిశయింపఁ జేయును. అప్ప=ఓవనితా! అప్పల్లవకదంబకము=ఆచివురుజొంపమును; ఇప్పన్=ఇప్పచెట్టునందు; గురుజవము =అధికమగు వేగము; నెగడఁగన్=వృద్ధిఁబొందఁగా; ఇప్పద్మాననావ్రజము=ఈస్త్రీలసమూహము; ఇంచున్= చెఱకును; మించుపలుకులన్ = అతిశయించిన వాక్కుల చేత; పొగడఁగన్=కొనియాడఁగా; ఆఁగుమా=నిలువుమా! అనియన్వయము. కొరవిఫలాలి=కొరవిచెట్లయొక్క ఫలరాశి; లాలితము ఐనన్ = ఒప్పిదము కాఁగా; అలమదిరాక్షి=ఆస్త్రీ; డాయుచున్=సమీపిం చుచు; అలమన్=ఆక్రమింపఁగా; కలికి=ఓపడఁతీ! సారసకాండకాండచయంబు – సారసకాండ=మన్మథునియొక్క, కాండ= అశ్వములగు చిలుకలయొక్క, చయంబు= గుంపు; మ్రోయుచున్=రొదసేయుచు; కలికిన్=జగడమునకు; కడంగెన్=దొర కొనెను. వేఁడు=ప్రార్థింపుము; వేడుకన్=సంతసముతో; నీకున్; ఇవ్వేళన్=ఇప్పుడు; వే=శీఘ్రముగా; లతికాంతవారము=పుష్పసమూ హమును; ఇత్తున్ = ఒసంగుదును. దాడి =ఉపద్రవము; దాడిమగమికిన్=దాడిమీసందోహమునకు; చేరఁగఁ దగునె= పొందఁదగదు; తగునెడకున్= యోగ్యమైన ప్రదేశమునకు; కీరము=చిలుక; అరిగెన్ =చనెను. తరుణి=పడుచా! నెచ్చెలి =ప్రియసఖి – ఇది కర్త; తరుణికన్=పిన్నగోరంటను; దరముదరమునన్=కొంచెముభయముచేత; చేరున్=పొందును; బాల=చిన్నదానా! ఊర్పు వీవలిన్=నిశ్వాసమారుతముచేత; వావిలి=వానీరము; బాలచ్ఛదసుమావళి=లేఁతయాకులయు, పుష్పములయొక్కయు గుంపు; పరువన్=వ్యాపింపఁగా; పరువమున్=ప్రాయమును; పొందెన్ = పొందెను. ఈవ =నీవే; ఈవరకిసలసంతతికిన్= ఈశ్రేష్ఠములగు చిగురుటాకులగుంపునకు; ఏవ=రోఁత; కేవలరయతన్=అధికవేగము చేత; చేరకు=పొందకు; మావి=ఆమ్రము; మావిభుసూనుసేనకున్—మావిభుసూను=లక్ష్మీపతియైన విష్ణువుయొక్క పుత్త్రుఁడైన మదనునియొక్క, సేనకున్=సేనయగు శుకాదులకు; మహిమన్=ఉత్కర్షచేత; మహిన్=భూమియందు; మనుటెంకి=బ్రతుకుచోటు; తూఱకు = చొరఁబడకు. చొరఁబాఱినచో నా శుకపికాదులకు బాధ కలుగు ననుట. లతికలు=తీవలు; అతికమనీయపక్వఫలమ్ములు = మిగుల మనోజ్ఞములు, పండినవి యగు పండ్లను; మున్నె=పూర్వమె; హెచ్చఁగన్=మించఁగా; అమ్మున్= విక్రయించును, ఇచ్చు ననుట.
రతినిభ=రతీదేవితోఁదుల్యయగుదానా! రతిని =ఆసక్తిచేత; ధరాధరకుచలు=ఉన్నతస్తనులగు స్త్రీలు; మెచ్చఁగన్=శ్లాఘింపఁగ; పాటఁబాడఁగన్ = పాట పాడుటకు; రా =రమ్ము.
అలసితపత్రము = ఆహంసము, ‘హంసాస్తు శ్వేతగరుతః’ అని యమరుఁడు; అలి=తుమ్మెద; కెరలంగన్=రేఁగఁగా; ఘనాత్మన్ = మేఘమనెడు బుద్ధిచేత; అలసి=బడలి; ఆత్మకున్=మనమునకు; హితము=ఇష్టమును; చేకొనన్= గ్రహించుటకు; అలికెన్ = వెఱచెను. ఇభయాన=ఓగజగమనా! ఆనగమౌళిన్=ఆవృక్షశ్రేష్ఠమును; పైకొనన్; వలదు=కూడదు.
ఎలమిన్=సంతసముచేత; నెలమిన్ను అలము నెమ్మొగము = చంద్రునియొక్క యుత్కర్షమును ఆక్రమించునట్టి (వహించునట్టి) అందమైన మోమును; ఎత్తన్=ఎత్తఁగా; మెత్తనికుసుమజాలములు= మృదువులైన కుసుమపుంజములు; అలిని లలినిన్ = ఆఁడు తుమ్మెదయొక్క వేడుకను; అడంచెన్ = అడఁగించెను; అతివరకనకసాలమున్=మిక్కిలి శ్రేష్ఠమగు సంపెంగవృక్షమును; ఓయతివ= ఓపడఁతీ! కనుము=చూడుము. ‘ముఖరాగేణ చమ్పకః’ అను దోహదక్రియద్వారా అతివయొక్క ముఖవికాసము చేత సంపెంగ పుష్పించిన దనియు, సంపెఁగలకు తుమ్మెదలకు గల వైరముచే అట్టి సంపెంగపూలగములు తుమ్మెదల వేడుక నడఁగించె ననియు భావము. అలచెలిన్=ఆచంద్రికను; అతులకీరపికాళికాళిధ్వనుల బలువగ – అతుల=అధికములగు, కీర=చిలుకలయొక్కయు, పిక= కోయిలలయొక్కయు, ఆళికా= సంఘములయొక్కయు, అళి= తుమ్మెదలయొక్కయు, ధ్వనుల=శబ్దములయొక్క, బలు వగ=అధికమైనయుందము; అలఁచెన్=శ్రమపఱిచెను; వలయుతిన్=బలయుతిన్=బలముతోడ; చిత్రగతిన్=ఆశ్చర్యవర్తన చేత; దైవాఱువారురుహబాణున్ =ఒప్పుచున్న పద్మబాణుని; కొలువఁగన్ వలయు= సేవింపఁగా వలెను.
చ. అని వనకేళికల్ సలిపి ◊యమ్మహిళాతిలకాళిరాగపు
ష్ట్యనువలితాత్మ చాల వెల◊య న్మహిళాతిలకాళి రాగపు
ష్పనికర మప్డు గైకొనియెఁ ◊బద్మకరాప్తసుతాపహారిశో
భనగతిఁ బూని మించ నల◊పద్మకరాప్తసుతార్హణేహచేన్. 64
టీక: అని = ఈప్రకారముగ; వనకేళికల్=వనవిహారములను; సలిపి=చేసి; అమ్మహిళాతిలకాళి = ఆస్త్రీరత్నములచాలు; రాగ పుష్ట్యనువలితాత్మ – రాగపుష్టి=అనురాగపూర్తితో, అనువలిత=కూడుకొన్న, ఆత్మ=చిత్తము; చాలన్=మిక్కిలి; వెలయన్ = ప్రకాశింపఁగా; పద్మకరాప్తసుతాపహారిశోభనగతిన్ –పద్మకరా=పద్మములనుబోలు కరములుగల చంద్రికచేత, ఆప్త= పొందఁ బడిన, సుతాప=అధికసంతాపమును, హారి=హరించెడు, శోభనగతిన్=మంగళగతిని; పూని=వహించి; మించన్= అతిశయిం పఁగా; అలపద్మకరాప్తసుతార్హణేహచేన్ – అలపద్మకరా=ఆలక్ష్మీదేవికి, ఆప్తసుత=కూర్మిపుత్త్రుఁడగు మన్మథునియొక్క, అర్హణ=పూజయందలి, ఈహచేన్ =వాంఛచేత; మహిళాతిలకాళి రాగపుష్పనికరము – మహిళా=ప్రేంకణములయొక్క, తిల కాళి=బొట్టుగుచాలుయొక్క, రాగ=దాడిమములయొక్క, పుష్పనికరము=పూలసమూహమును; అప్డు =ఆవేళ; కైకొనియెన్ =స్వీకరించెను. ఆస్త్రీనికరము వనవిహారానంతరము చంద్రికాసంతాపశాంతిని గోరి స్మరపూజనమునకై యనురాగముతోఁ బ్రేంకణతిలకాదిపుష్పచయాపచయమును జేసె ననుట.
సీ. తలిరాకు ద్రుంపరే ◊కలకంఠసమవాయ, దర్పంబు దఱుఁగనీ ◊తరుణులార,
విరిదుమ్ము దూల్పరే ◊విస్ఫుటాసమవాయ,వీయాభ దెఱలనీ ◊వెలఁదులార,
యలరులు దునుమరే ◊యళి విలాసమ వాయఁ, గలఁకచే బ్రమయనీ ◊చెలువలార,
ఫలకాళి గోయరే ◊చిలుకచాల్ సమవాయ, గతిఁ జాల నడలనీ ◊యతివలార,
తే. యని మనోంబుజవీథిఁ బా◊యని మదాప్తి, మారబలరాజ్యవష్టంభ◊మారకప్ర
చార మూనుచు నపు డనీ◊చారలీల, రామ లందఱు వెడలి రా◊రామపదవి. 65
టీక: తరుణులార! కలకంఠసమవాయదర్పంబు – కలకంఠసమవాయ=కోయిలగుంపులయొక్క, దర్పంబు =గర్వము; తఱుఁగనీ =ఉడుగనీ; తలిరాకున్=చిగురాకును; త్రుంపరే=కోయరే. కోయిలలు చిగురాకులఁదినును గాన, నాచిగురాకులను గోసిన వానిదర్ప ముడుగు ననుట. వెలఁదులార! విస్ఫుటాసమవాయవీయాభ – విస్ఫుట=మిగుల వ్యక్తమైన, అసమ=సాటిలేని, వాయవీయ=వాయుసంబంధి యగు, వాయుశబ్దముమీఁద ఛప్రత్యయము, ఆభ=కాంతి; తెఱలనీ=తొలఁగనీ; విరిదుమ్ము=పుప్పొడి; తూల్పరే=రాల్పరె. విరిదుమ్ముచేతఁ గూడిన వాయువునకు తొల్లిటి విస్ఫుటాసమకాంతి తొలఁగు ననుట. చెలువలార! అళి=తుమ్మెద; విలాసమ= తనయొక్క విలాసమె; పాయన్=పోఁగా; కలఁకచేన్=కలఁతచేత; బ్రమయనీ =భ్రమ నొందనీ; అలరులు = పూవులు; తునుమరే=కోయరె. అళి పుష్పలిహము గావున నవి కోసినచో దాని విలాస ముడుగు ననుట. అతివలార! చిలుకచాల్=చిలుకలబారు; సమవాయగతిన్ = నిత్యసంబంధప్రాప్తిచేత; చాలన్=మిక్కిలి; అడలనీ=దుఃఖింపనీ; ఫలకాళిన్=పండ్లచాలును; కోయరే =ఛేదింపరే. చిలుకలు ఫలములను భక్షించునవి గనుక నాఫలములను గోసినయెడల నవి దుఃఖించు ననుట. అని=ఇట్లనుచు; మనోంబుజవీథిన్=హృదయపద్మప్రదేశమును; పాయని మదాప్తి=ఎడయని దర్పప్రాప్తిచేత; మారబలరాజ్య వష్టంభమారకప్రచారము – మార=మన్మథునియొక్క, బల=సైన్యములగు శుకపికాదులయొక్క, రాజి=పంక్తియొక్క, అవ ష్టంభ=గర్వమునకు, మారక=సంహారకమైన, ప్రచారము=వ్యాపారమును; ఊనుచున్=వహించుచు; అనీచారలీలన్ – అనీచ =అధికమైన, అరలీలన్=వేగక్రియచేత; రామ లందఱు =స్త్రీలందఱు; ఆరామపదవిన్=ఉద్యానప్రదేశమందు; వెడలిరి=పైనుడి విన పనులు చేయుటకు బయలుదేఱిరి.
క. వరవనకేళీభవదు,స్తరఘనచూళీతనూత◊తశ్రమ ముడిపెన్
సరళలతాసరళలతా,విరళలతాంతాప్తపవన◊విసరము లంతన్. 66
టీక: అంతన్=అటుపిమ్మట; సరళ లతా సరళ లతావిరళ లతాంతాప్త పవనవిసరము – సరళ=దేవదారువృక్షములయొక్క, లతా=కొమ్మలయొక్క, సరళ=ఋజువులైన, లతా=బండిగురివెందతీవలయొక్క, అవిరళ=సాంద్రములైన, లతాంత=పూవు లను, ఆప్త=పొందినట్టి, పవనవిసరము=వాయుసమూహములు; వర వనకేళీ భవ దుస్తర ఘనచూళీ తనూ తత శ్రమము—వర= శ్రేష్ఠమైన, వనకేళీ=వనవిహారముచేత, భవ=ఉదయించిన,దుస్తర=తరింపరాని, ఈరెండు శ్రమమునకు విశేషణములు, ఘనచూళీ=మేఘములఁబోలు కచములు గల స్త్రీలయొక్క, తనూ=శరీరములయందు, తత=విస్తృతమైన,శ్రమము=ఆయాస మును; ఉడిపెన్=పోఁగొట్టెను.
ఉ. ఆరమణీలలామనివ◊హంబు గనుంగొనెఁ జెంత నున్నమ
త్సారముదారసాభియుత◊జాలపదార్భకదోలదూర్మికా
సారము దారసావరణ◊సారసశోభితతీర మొక్క కా
సార ముదారసారసని◊శాపవృతాసితఫేనతారమున్. 67
టీక: ఆరమణీలలామనివహంబు=ఆస్త్రీరత్నములసమూహము; చెంతన్=సమీపమందు; ఉన్నమ త్సార ముదారసాభియుత జాలపదార్భక దోలదూర్మికాసారము – ఉన్నమత్=పెరుఁగుచున్న, సార=శ్రేష్ఠమైన, ముదారస=సంతోషరసముతో, అభి యుత=కూడుకొన్న, జాలపదార్భక=హంసపోతములకు, దోలత్=ఉయ్యెల లగుచున్న, ఊర్మికా=తరఁగలయొక్క, ఆసా రము = పరంపరలు గలది; దార సావరణ సారస శోభిత తీరము – దార=పెంటిపిట్టలచేత,సావరణ=ఆవరణముతోఁ గూడిన, సారస=బెగ్గురులచేత, శోభిత=ప్రకాశింపఁజేయఁబడిన, తీరము=ఒడ్డు గలదియు; ఉదార సారస నిశాప వృతాసిత ఫేన తార మున్ – ఉదార=అధికములగు, సారస=కమలములనెడు, నిశాప=చంద్రుని, వృత=ఆవరించిన, అసితఫేన=మిగుల తెల్లనగు నురుఁగు లనెడు, తారమున్=రిక్కలు గలదియు నగు; ఒక్క కాసారము=ఒకసరస్సును; కనుంగొనెన్ =చూచెను.
వ. కనుంగొని యభంగపదాంగదనిస్వానభంగిం దాము వచ్చుతెఱం గెఱింగి యుప్పొంగుచుం దటకటక కాననదేవతాజనంబులు దార్చిన విడిఁదిపిండులవడువునం గమనీయకళికాముక్తావళికావితానంబులం గమ్రసమీరసమాగమ గళత్కంకేళిపాళికా ప్రసవధూళికా రింఛోళికా రాంకవాస్తరణవితానంబులం గనక కక్ష్యామార్గ భాసమాన పరిపక్వ ఫలాభిరామ రంభాపూగంబులం గనత్సుగంధ మరందరసగంధ తైల బంధుర బంధుజీవకోరకదీపకళికాపూగంబులం గనుపట్టుచు రంగుమీఱు కూలరంగ రంగత్కుడుంగంబు లంతరంగంబునకు వేడుక రంగలింప మరాళమందయానా ధవళవర్ణ పరిపూరితంబై యొప్పుమీఱు ప్రతీర శోభనభవనంబున నిస్తులస్థలపద్మవివాహపీఠికాసీమం గూర్చున్న బెగ్గురుపెండ్లికొడుకునకు సుంకులు చల్ల ఘనవేణికాసమాజంబు విరంజిత కింజల్కకలమపుంజ సంజిత దరవికసితశోణకంజోదూఖలంబునన్ దంచు ముసలంబుల సొంపునఁ దదంతరంబునం బతనోత్పనంబు సలుపు మత్తమధుపమాలికలు లోచ నానులాసంబు చాలం బొందింపఁ గాసారకళిందనందినీహ్రదప్రదేశంబు చయ్యనం జొరఁబాఱి కాలకమల లతాకాళియకాకోదరపర్యంకంబు మెట్టి తన్మృణాలభోగంబు వలఱెక్కకేలి సందునం బొందుపడ నిందీ వరపలాశఫణాముఖంబుల మరందవిషపరంపరలు వెడల న్నిజకృష్ణమూర్తిభావంబు సార్థకంబై వర్తిల్ల నర్తనంబు సలుపు కలహంసకులావతంసంబులు ప్రశంసనీయంబులై చూపట్టఁ జందనాచలపవమాన కందళీసముద్గత లోహితారవిందరజోవ్రజ సమావృతగగనభాగకల్పిత సంధ్యాసమయ ముకుళితపుండరీ కాంతరసంవస దమందహిందోలఝంకారంబు లుపాంగంబులుగా నఖిలజగజ్జయసముజ్జృంభితశంబ రారిబిరుదగద్యపద్యజిగాసా కలితమానస జలాధిదేవతాజనంబులు పూనిన పసిండికాయలదండియల దండిఁ దిర్యక్ప్రసారి తైకైకనాళకైకైకకోకరాజంబులు హర్షోత్కర్షంబు పచరింప మిత్రమండలసంయోజిత మహోత్సవంబు నవంబుగా నొంది యాత్మప్రియకామినీయుక్తంబై సారసచారులోచనాశుభగానంబు లనూనంబై తనరఁ గుశేశయనిజనివేశనూతనప్రవేశమంగళ మంగీకరింప నొయ్యనొయ్యన నరుదెంచు రథాంగవంశరత్నంబున కెత్త హల్లకినీపల్లవాధరామతల్లికలు పూనిన జాళువాకదలారతిపళ్ళెరంబుల సొంపున హరిత్పరాగ హరిద్రాచూర్ణ సంవ్యాప్త తత్ప్రసవరసపూరాంతర దృశ్యమాన మానితకేసర భక్తాభిరామంబు లగు హల్లకస్తోమంబు లుల్లాసంబు పల్లవింపఁజేయ నిజాంతరంగఖేదకర నిరర్గళఘనా ఘనైకప్రకారం బెల్లకాలంబు నెనయకుండం గోరి కమలకాండభక్షణంబు సలుపుచుఁ గమలాసనాధీనమాన సంబునం గరంబు స్వకీయహంసత్వంబు ప్రసిద్ధిం బొందఁ దపంబుసలుపుపొలుపున నస్తోకకోకనదాశ్రమ మధ్యంబున నుదాత్తతత్పత్త్రవీతిహోత్రకీలంబులు చుట్టు వలగొన నఖండానందంబున నక్షియుగం బర మోడ్చి యచలితస్ఫురణంబు వహించి రహించు రాయంచలు హృదయాంచలంబున కంచితాద్భుతంబు మించం గావింప నిజవిలోచనసౌందర్య సమాలోకనజనితత్రపాభరంబున ముడింగియున్న కుముదంబులం గాంచి యుబ్బునఁ దద్విలాసదిదృక్షాగరిమంబు పక్షీకరించి యక్షుద్రస్యదంబున నెగసి తద్విభవంబునకు వెఱచి మరలం దాఱుతీరున నుద్వర్తనాపవర్తంబులం బరంగు బేడిసమీల మిట్టిపాటు లతికౌతుకంబు వుట్టింప నతిసమీపసంచరచ్చిత్రభానుహేతిజాలంబులఁ బరితాపంబు నొంది మందపవనసందోహాందోళిత నవీనేందీవరబృందమధుబిందు సేచనంబు గోరి వారిజాతాంతరంబున లీనంబైన యంభోధరపథంబున రోధోదేశవలయిత మనోజ్ఞ మాలతీ మాధవీ మహిలా మల్లికా ముఖ్యవల్లికాకీర్ణ నీరంధ్రపలాశ పాండిత్యం బునం బ్రద్యోతనద్యోతప్రభావంబు పాయం గనుపట్టు తారకావారంబుల మురువున నరవిందమందిరా ళిందనివాసి సానందమిళిందసుందరీ సుందరాపఘనఘనప్రభాక్రాంతజలంబులపయిం బొడకట్టు పాండుర డిండీరఖండమండలంబులు సంబరంబులు పొదలింప నమరియు నక్కొలంకు మహితాబ్జకామినీజాలపరి భ్రాజితంబు గావున నళిమిథునమీనకుళీరమకరాదిసంయుతంబై మంజులహర్యన్వితార్యమలసద్విహార భాసురంబు గావునఁ గమనీయ కాదంబసుమనోవికసనవిరాజితంబై మనోజ్ఞహంసకులాధిరాజరామాభి రామప్రస్థానవిశేషంబు గావున నకుంఠతరతరోవిజృంభమాణనానాప్లవగవీ రారాజత్కోలాహలలీలాచుళి కితదిశాంతంబై యొప్పుమీఱి చెప్పరాని మోదంబు ముప్పిరిగొనఁజేయ నప్పడంతు లప్పద్మాలయజల విహారదోహదంబునఁ జిలుఁగుపుత్తడివలువలు సడల్చి పావడలు దాల్చి శృంగంబులు గైకొని యొయ్య నొయ్యన నొయ్యారంబు మించ డిగ్గి యపుడు. 68
టీక: కనుంగొని – దీనికి ‘డిగ్గి’యను వచనాంతక్రియతో నన్వయము. అభంగపదాంగదనిస్వానభంగిన్ – అభంగ=కొట్టు పాటు లేని, పదాంగద=కాలియందెలయొక్క,నిస్వానభంగిన్ =ధ్వనిరీతిచేత; తాము; వచ్చుతెఱంగు=వచ్చువిధమును; ఎఱింగి = తెలిసికొని, దీనికి ‘కాననదేవతాజనంబులు’ కర్తలు; ఉప్పొంగుచున్=విజృంభించుచు; తట కటక కాననదేవతా జనంబులు – తట=తీరమనెడు, కటక=రాజధానియందలి, కాననదేవతాజనంబులు =వనదేవతాజనములు; తార్చిన విడిఁదిపిండులవడువునన్ – తార్చిన=ఒనరించినట్టి, విడిఁది= నివేశస్థానములయొక్క, పిండులవడువునన్=సమూహ ములవలె; కమనీయకళికా ముక్తావళికా వితానంబులన్ – కమనీయ =మనోజ్ఞములగు, కళికా=మొగ్గలనెడు, ముక్తావళికా =ముత్యపుచాలులయొక్క, వితానంబులన్=మేలుకట్లచేతను; కమ్ర సమీర సమాగమ గళత్కంకేళిపాళికా ప్రసవధూళికా రింఛోళికా రాంకవాస్తరణ వితా నంబులన్ – కమ్ర=ఇంపైన, సమీర= వాయువుయొక్క,సమాగమ=చక్కనిరాకచేత, గళత్= జాఱుచున్న, కంకేళిపాళికా = అశోకవృక్షముల పంక్తులయొక్క, ప్రసవ=పూవులయొక్క, ధూళికారింఛోళికా=పరాగపటల మనెడు, రాంకవాస్తరణ=రత్నకంబళములయొక్క, వితానంబులన్=సమూహములచేతను; కనకకక్ష్యా మార్గ భాసమాన పరిపక్వఫ లాభిరామ రంభా పూగంబులన్ – కనకకక్ష్యా=సంపెఁగలచాలనెడు బంగరుహర్మ్యప్రకోష్ఠములయొక్క, మార్గ= దారులందు, భాసమాన= ప్రకాశించుచున్న, పరిపక్వఫల=మాఁగినపండ్లచేత, అభిరామ=ఒప్పుచున్న, రంభా=అనఁటుల చేతను, పూగంబులన్= పోక చెట్లచేతను; కన త్సుగంధ మరందరస గంధతైల బంధుర బంధుజీవకోరకదీపకళికా పూగంబులన్ – కనత్=ప్రకాశించుచున్న, సుగంధ=పరిమళగంధము గల్గిన, మరందరస=మకరందరసమనెడు, గంధతైల=గందపునూనె చేత, బంధుర=దట్టములైన, బంధుజీవకోరకదీపకళికా= దాసానమొగ్గలనెడు కలికలవంటి దీపములయొక్క, పూగంబులన్= సమూహములచేతను; కను పట్టుచు = చూపట్టుచు; రంగుమీఱు కూలరంగ రంగత్కుడుంగంబులు – రంగుమీఱు=అతిశ యించుచున్న, కూలరంగ= తీరప్రదేశమునందు, రంగత్ = ఒప్పుచున్న, కుడుంగంబులు =పొదరిండ్లు; అంతరంగంబునకున్ =చిత్తమునకు; వేడుకన్= ఉత్సవమును; రంగలింపన్ = కలయ మెదపఁగా ననుట; మరాళమందయానా ధవళవర్ణ పరిపూరి తంబై – మరాళమందయానా =హంసస్త్రీ లనెడు స్త్రీలయొక్క , ధవళవర్ణ=శుభ్రకాంతి యనెడు ధవళమను గీతముల వర్ణముచేత, పరిపూరితంబై =నిండినదియై; ఒప్పుమీఱు ప్రతీర శోభనభవనంబునన్ – ఒప్పుమీఱు=ఒప్పిదముచేత మించునట్టి, ప్రతీరశోభన భవనంబునన్ =తీరమనెడు కల్యాణగృహమందు; నిస్తుల స్థలపద్మ వివాహపీఠికా సీమన్ – నిస్తుల=సాటిలేని, స్థలపద్మ=మెట్ట దామర యనెడు, వివాహపీఠికా=పెండ్లిపీఁటయొక్క, సీమన్=ప్రదేశమందు; కూర్చున్న బెగ్గురుపెండ్లికొడుకునకున్ = కూర్చుండిన బెగ్గురుపక్షియను పెండ్లికొడుకునకు; సుంకులు =వివాహకాలమందు వధూవరులపైఁ జల్లెడువడ్లు; చల్లన్=చల్లు టకు; ఘన వేణికాసమాజంబు – ఘనవేణికా=గొప్పకాల్వలనెడు స్త్రీలయొక్క, సమాజంబు = సంఘము; విరంజిత కింజల్క కలమపుంజ సంజిత దరవికసిత శోణకం జోదూఖలంబునన్ – విరంజిత=మిక్కిలి ప్రకాశించుచున్న, కింజల్క=కేసరము లనెడు, కలమ పుంజ=వడ్లరాశిచేత, సంజిత=కూడుకొన్న, దరవికసిత= కొంచెము విరిసిన, శోణకంజ=రక్తోత్పల మనెడు, ఉదూఖలంబునన్ =ఱోలునందు; దంచు ముసలంబుల సొంపునన్= దంచు నట్టి రోఁకళ్ళ యందంబున; తదంతరంబునన్ = ఆకమలమధ్యమున; పతనోత్పనంబున్ = పడుట యెగయుటలను; సలుపు మత్తమధుపమాలికలు = చేయుచున్న మదించిన తుమ్మెదబారులు; లోచనానులాసంబు = నయనానందమును; చాలన్= మిక్కిలి; పొందింపన్=కూర్పఁగా; కాసార కళింద నందినీ హ్రదప్రదేశంబు – కాసార=సరస్సనెడు, కళిందనందినీ=యమునానదియొక్క, హ్రదప్రదేశంబు=అగాధజలప్రదేశ మును; చయ్యనన్=శీఘ్రము గా; చొరఁబాఱి = చొచ్చి; కాలకమల లతా కాళియకాకోదర పర్యంకంబు – కాలకమల=నీలో త్పలసంబంధియగు, లతా=తీవ యనెడు,కాళియకాకోదర=కాళియుఁడనెడు సర్పముయొక్క, పర్యంకంబు =చుట్టను; మెట్టి =త్రొక్కి; తన్మృణాలభోగంబు – తత్=ఆకాలకమలసంబంధియగు, మృణాల=తూఁడనెడు, భోగంబు=సర్పశరీర మును, ‘భోగ స్సుఖే స్త్ర్యాదిభృతావహేశ్చ ఫణకాయయోః’ అని యమరుఁడు; వలఱెక్కకేలి సందునన్ = కుడిఱెక్క యనెడు హస్తమధ్యమందు; పొందుపడన్=అమరు నట్లు; ఇందీవరపలాశఫణాముఖంబులన్ – ఇందీవర= నీలోత్పలములయొక్క, పలాశ=దళములనెడు, ఫణాముఖంబులన్= పడగలయొక్కయగ్రభాగములవలన; మరందవిషపరంపరలు=మకరంద మనెడు విషముయొక్కధారలు; వెడలన్=బయలు దేఱునట్లు; నిజకృష్ణమూర్తిభావంబు=తన నల్లని దేహము గలుగుట యనెడు శ్రీకృష్ణత్వము; సార్థకంబై=అర్థవంతమై; వర్తిల్లన్ =వర్తించునట్లు; నర్తనంబున్=నాట్యమును; సలుపు కలహంస కులావతంసంబులు =చేయుచున్న ధార్తరాష్ట్రశ్రేష్ఠంబు లనుట; ప్రశంసనీయంబులై=శ్లాఘింపఁదగినవై; చూపట్టన్ = అగ పడఁగా; చందనాచలపవమాన కందళీ సముద్గత లోహితారవింద రజోవ్రజ సమావృత గగనభాగ కల్పిత సంధ్యా సమయ ముకుళిత పుండరీకాంతర సంవస దమంద హిందోల ఝంకారం బులు – చందనాచలపవమాన=మలయమారుతముయొక్క, కందళీ=మోసులచేత, సముద్గత=మీఁదికి వెడలిన, లోహితార వింద=ఎఱ్ఱదామరలయొక్క,రజోవ్రజ =పుప్పొడి మొత్తముచేత, సమావృత=వ్యాప్తమైన, గగనభాగ=ఆకాశప్రదేశముచేత, కల్పిత=కల్పింపఁబడిన, సంధ్యాసమయ =సాయంకాలముచేత, ముకుళిత=మోడ్పునొందిన, పుండరీక=తెల్లఁదామరల యొక్క, అంతర=మధ్యప్రదేశమందు, సంవసత్ =వసించిన, అమంద =అధికములగు, హిందోల=తుమ్మెదలయొక్క, ఝం కారంబులు=మ్రోఁతలు; ఉపాంగంబులు కాన్ = సుతులు కాఁగా; అఖిల జగజ్జయ సముజ్జృంభిత శంబరారి బిరుద గద్యపద్య జిగాసాకలిత మానస జలాధిదేవతాజనంబులు – అఖిల= సమస్తమగు, జగత్=లోకములయొక్క, జయ=గెలుపుచేత, సము జ్జృంభిత=మిగుల నుప్పొంగిన, శంబరారి= మన్మథునియొక్క, బిరుద =జయచిహ్నములతోఁగూడిన, గద్యపద్య=గద్య ములయొక్కయు పద్యములయొక్కయు, జిగాసా= గానేచ్ఛతోడ, ఆకలిత=మిగుల సంబంధించిన, మానస=చిత్తములు గల, జలాధిదేవతాజనంబులు = జలాదిష్ఠానదేవతలు; పూనిన పసిండి కాయల దండియలదండిన్ – పూనిన=వహించినట్టి, పసిండికాయల=బంగరుకాయలు గల, దండియల దండిన్= వీణా దండముల విధమున; తిర్యక్ప్రసారి తైకైకనాళ కైకైక కోక రాజంబులు – తిర్యక్ప్రసారిత= అడ్డముగఁ జాపఁబడిన, ఏకైక నాళక=ఒక్కొకతామరతూఁడుగల, ఏకైకకోకరాజంబులు= ఒక్కొక చక్రవాకశ్రేష్ఠములు; హర్షోత్కర్షంబు = సంతసంబు నతిశ యమును; పచరింపన్=చేయఁగా; అనఁగా మలయమారు తాంకురములచే నెఱ్ఱదామరలపుప్పొడులు గగన భాగము నిండి సంధ్యాకాలమును దోఁపించుచున్నవనియు, అపుడు సంధ్యా సమయభ్రాంతిచేఁ దెల్లదామరలలోఁ జేరినతేఁటులు రొదసేయు చున్నవనియు, ఆరొదలు జక్కవ లొక్కొక్కటి యొక్కొక్క మృణాళమును బూని, మదనబిరుద గద్యపద్యములు గానము సేయు తలంపున జలాధిదేవతలు పూనిన పసిండిదండియలఁ బోలియుండఁగాఁ, దద్దేవతాగానంబులకు సుతులుగా నుండె ననియు భావము.
మిత్రమండలసంయోజిత మహోత్సవంబు – మిత్రమండల=సూర్యమండల మనెడు సుహృన్మండలముచేత, సంయోజిత = కూర్పఁబడిన, మహోత్సవంబు =ఎక్కుడైన వేడుక; నవంబుగాన్=అపూర్వమగు రీతిగా; ఒంది =పొంది; ఆత్మప్రియకామినీ యుక్తంబై – ఆత్మ=తనయొక్క,ప్రియకామినీ=ప్రియస్త్రీతోడ,యుక్తంబై=కూడుకొన్నదై, సారసచారులోచనాశుభగానంబులు – సారసచారులోచనా=ఆఁడుబెగ్గురులయొక్క, శుభగానంబులు=మంగళమైనపాటలు; అనూనంబై = అధికమై; తనరన్ = ఒప్పుచుండఁగా; కుశేశయ నిజనివేశ నూతనప్రవేశ మంగళము – కుశేశయ=శతపత్రమనెడు, నిజనివేశ=తనగృహమందు, నూతనప్రవేశ=క్రొత్తగాఁ బ్రవేశించుటయొక్క, మంగళము= శుభమును; అంగీకరింపన్=పొందుటకు; ఒయ్యనొయ్యనన్ = తిన్నతిన్నగా; అరుదెంచు రథాంగవంశరత్నంబునకున్ – అరుదెంచు =వచ్చుచున్న,రథాంగవంశరత్నంబునకున్=చక్రవాక కులశ్రేష్ఠమునకు; ఎత్తన్=ఆరతి నెత్తుటకు; హల్లకినీ పల్లవాధరామతల్లికలు – హల్లకినీ=చెంగల్వలతలనెడు, పల్లవాధరామత ల్లికలు= ప్రశస్తాంగనలు; పూనిన=వహించినట్టి; జాళువా=స్వర్ణమయములగు, కదలారతిపళ్ళెరంబులసొంపున =ఒకవిధమైన యారతితట్టలయొక్క విధమున, వివాహాదిశుభసమయములందు వధూవరులు ప్రవేశించు నెడ హరిద్రాజలాదులతో నెత్తు నార తికి కదలారతి యని ప్రసిద్ధి; హరిత్పరాగ హరిద్రాచూర్ణ సంవ్యాప్త తత్ప్రసవరసపూ రాంతర దృశ్యమాన మానితకేసరభక్తాభి రామంబులు – హరిత్పరాగ=పచ్చనిపుప్పొడి యనెడు, హరిద్రాచూర్ణ=పసుపుపొడిచేత, సంవ్యాప్త=పొందఁబడిన, తత్ప్రసవ రసపూర=ఆచెంగల్వపూఁదేనియయొక్క వఱదయొక్క, అంతర=మధ్యభాగమందు, దృశ్యమాన=చూడఁబడుచున్న, మానిత=శ్రేష్ఠములగు, కేసర=కింజల్కము లనెడు, భక్త=ఓదనముచేత, అభిరామంబులు =ఒప్పుచున్నవి; అగు హల్లకస్తోమం బులు = అయినట్టి ఎఱ్ఱగలువలగుంపులు; ఉల్లాసంబు = సంతసమును; పల్లవింపఁజేయన్=చిగిరింపఁజేయగా; అనఁగా చక్ర వాకశ్రేష్ఠము నిజకామినీసమేతంబై సూర్యోదయపరికల్పితంబగు మహోత్సవంబున కుశేశయమును బ్రవేశించుచుండఁగా నూతనగృహప్రవేశమును మిత్రమండలకృతమహోత్సవం బెనసి చేయుచున్నట్లుండె ననియు, అపు డాఁడుబెగ్గురులు ధ్వని సేయుచుండఁగా స్త్రీలు పాట పాడుచున్నట్లుండె ననియు, చెంగల్వతీవెలు పచ్చనిపరాగముతోఁ గూడి మకరందభరితములై కేసరయుక్తంబు లగు చెంగల్వలతోఁ గూడి యుండఁగా నూతనగృహప్రవేశ మొనరించు రథాంగదంపతులకు మంగళస్త్రీలు గదలార తెత్తుటకు బంగరుపళ్ళెరములు పూని వానిలోఁ బసుపునీరు, అన్నపుమెతుకులు వేసికొని యెదురుగ నిల్చినట్లుండె ననియు భావము.
నిజాంతరంగ ఖేదకర నిరర్గళ ఘనాఘ నైక ప్రకారంబులు – నిజాంతరంగ=తనచిత్తమునకు, ఖేదకర=దుఃఖకరమైన, నిరర్గళ = ఆటంకములేని, ఘనాఘన=మత్తగజము లనెడు ఘాతుకులయొక్క, ఏక=ముఖ్యమైన, ప్రకారంబులు=రీతులు; ఎల్ల కాలంబు = కలకాలము; ఎనయకుండన్=పొందకుండఁగా; కోరి =వాంఛించి; కమలకాండభక్షణంబు – కమలకాండ=బిసమనెడు నుదకపూరముయొక్క, భక్షణంబు=మెసవుటను; సలుపుచున్=చేయుచు; కమలాసనాధీనమానసంబునన్ – కమలాసన = పద్మాసన మనెడు బ్రహ్మకు, అధీన=వశంవదమైన, మానసంబునన్=మనసుచేత; కరంబు=మిక్కిలి; స్వకీయహంసత్వంబు = తన యంచతనమనెడు యతిత్వము; ప్రసిద్ధిన్ పొందన్=ఖ్యాతి గాంచునట్లు; తపంబుసలుపుపొలుపునన్= తప మొనరించు నట్లుగ; అస్తోకకోకనదాశ్రమమధ్యంబునన్ – అస్తోక=అధికమైన, కోకనద=రక్తోత్పలమనెడు, ఆశ్రమ=ఆశ్రమముయొక్క, మధ్యంబునన్ = మధ్యభాగమందు; ఉదాత్త తత్పత్ర వీతిహోత్రకీలంబులు – ఉదాత్త=ఉత్కృష్టములగు, తత్పత్ర=ఆకోకనద దళము లనెడు, వీతిహోత్రకీలంబులు = అగ్నిజ్వాలలు; చుట్టు వలగొనన్=చుట్టుకొనఁగా; అఖండానందంబునన్=అవిచ్ఛిన్నా నందముచేత; అక్షియుగంబు=నేత్రద్వయము; అర మోడ్చి=సగము మూసికొని; అచలితస్ఫురణంబు=కదలకుండుటను; వహించి = పూని; రహించు రాయంచలు = వర్తించుచున్న రాజహంసలు; హృదయాంచలంబునకున్ = మనోదేశమునకు; అంచితాద్భుతంబు =ఒప్పుచున్న యాశ్చర్యమును; మించన్=మించునట్లు; కావింపన్=చేయఁగా; అనఁగా నాకొలఁకునందు రాయంచలు రక్తోత్పలమధ్యమునఁ బద్మములపైఁ గూర్చుండి కమలకాండభక్షణము సేయుచుఁ గన్ను లరమోడ్చికొని కదల కుండఁగా, మేఘము లనెడు దుష్టులవలనఁ దమకుఁ గలకాల మపాయము రాకుండుటకై కోకనద మను నాశ్రమమధ్యమున జల భక్షణము సేయుచు బ్రహ్మను గూర్చి తపం బాచరించుచు నానందమునఁ గన్ను లరమోడ్చి కదలకుండఁ దమహంసత్వముఁ బ్రసిద్ధినొందించుచున్న ట్లుండె ననియు, రక్తోత్పలదళములు చుట్టుముట్టి యుండఁగా నవి యగ్నిశిఖలను బోలి యాహంసలు పంచాగ్నిమధ్యమునఁ గూర్చుండినట్లు తోఁపించుచుండె ననియు భావము.
నిజవిలోచన సౌందర్య సమాలోకన జనిత త్రపాభరంబునన్ – నిజ=స్వకీయ మగు, ఈనిజపదము చంద్రికాసఖీగణపరము, విలోచన=కన్నులయొక్క, సౌందర్య=అందముయొక్క, సమాలోకన=సందర్శనముచేత,జనిత=కల్గిన, త్రపాభరంబునన్ = లజ్జాతిశయముచేత; ముడింగియున్న కుముదంబులన్ = ముకుళించియున్న కలువలను; కాంచి=చూచి; ఉబ్బునన్ = సంతో షముచేత; తద్విలాసదిదృక్షాగరిమంబు – తద్విలాస=ఆస్త్రీనయనవిలాసముయొక్క, దిదృక్షా=దర్శనేచ్ఛయొక్క, గరిమంబు = అతిశయమును; పక్షీకరించి =స్వీకరించి; అనఁగా నయనసౌందర్యము చూడవలె నని వాంఛాతిశయము నొంది యనుట; అక్షుద్రస్యదంబునన్=అతివేగముచేత, ‘రయ స్స్యదః’ అని యమరుఁడు; ఎగసి =పైకెగిరి; తద్విభవంబునకున్=ఆ స్త్రీనయన విభవమునకు; వెఱచి=భయపడి; మరలన్; తాఱుతీరునన్=మఱుఁగుపడురీతిగా; ఉద్వర్తనాపవర్తంబులన్ = ఎగ యుట మఱ లుటలచేత; పరఁగు బేడిసమీల మిట్టిపాటులు = ఒప్పుచున్న మత్స్యవిశేషములయొక్క యెగిరిపడుటలు; అతి కౌతుకంబు = మిక్కిలిసంతోషమును; పుట్టింపన్=కలిగింపఁగా; అనఁగా నాకొలఁకునం గలువలు ముకుళించి మత్స్యము లెగిరి పడుచుండఁ గా ఆస్త్రీనయనసౌందర్యమును జూచి సిగ్గుచేతఁ గలువలు ముగిడినట్లుండె ననియు, మత్స్యము లా కుముదములను జూచి తామును దన్నయనసౌందర్యము గాంచఁ జెంగున నెగిరి తన్నేత్రసౌందర్యమునకు వెఱచి మఱలఁ దాఱుచున్నట్లుండె ననియు భావము; అతిసమీప సంచర చ్చిత్రభాను హేతిజాలంబులన్ – అతిసమీప=మిక్కిలి సమీపదేశమునందు, సంచరత్=సంచరించుచున్న, చిత్రభాను=సూర్యునియొక్క, హేతిజాలంబులన్=కిరణసమూహమువలన; పరితాపంబున్=మిక్కిలి తాపమును; ఒంది = పొంది; మందపవన సందోహాందోళిత నవీనేందీవరబృంద మధుబిందు సేచనంబున్ –మందపవన=మందమారుతముయొక్క, సందోహ=సమూహముచేత, ఆందోళిత=చలింపఁజేయఁబడిన, నవీన=క్రొత్తనైన, ఇందీవరబృంద=నల్లగలువలసమూహము యొక్క, మధుబిందు = మకరందబిందువులచేత, సేచనంబున్=తడుపుటను; కోరి =ఇచ్ఛించి; వారిజాతాంతరంబునన్ = పద్మ మధ్యమందు; లీనంబైన యంభోధరపథంబునన్=దాఁగియున్న యాకాశమందు; రోధోదేశ వలయిత మనోజ్ఞ మాలతీ మాధవీ మహిలా మల్లికా ముఖ్య వల్లికా కీర్ణ నీరంధ్ర పలాశ పాండిత్యంబునన్ – రోధోదేశ=తీరప్రదేశమందు, వలయిత=చుట్టుకొన్న, మనోజ్ఞ = అందమైన, మాలతీ=జాజి, మాధవీ=బండిగురివెంద, మహిలా=ప్రేంకణము, మల్లికా=మల్లె, ముఖ్య=మొదలుగాఁ గల, వల్లికా=తీవలచేత, కీర్ణ=వ్యాప్తములైన, నీరంధ్ర=దట్టమైన, పలాశ=మోదుగులయొక్క, పాండిత్యంబునన్=అతిశయము చేత; ప్రద్యోతనద్యోతప్రభావంబు – ప్రద్యోతన=సూర్యునియొక్క, ద్యోత=ప్రకాశముయొక్క, ప్రభావంబు=మహిమ; పాయన్ = పోఁగా; కనుపట్టు తారకావారంబుల మురువునన్ – కనుపట్టు =అగపడునట్టి, తారకావారంబుల = నక్షత్రసంఘముయొక్క, మురువునన్=సౌందర్యముచేత, దీనికి ‘పొడకట్టు’ నను క్రియతో నన్వయము;అరవిందమందిరాళింద నివాసి సానంద మిళింద సుందరీ సుందరాపఘన ఘనప్రభాక్రాంత జలంబులపయిన్–అరవిందమందిర=పద్మము లనెడు గృహములయొక్క, అళింద =చత్వరములందు, నివాసి=నివసించి యున్న, సానంద=సంతసముతోఁ గూడిన, మిళిందసుందరీ=ఆఁడుతుమ్మెదలయొక్క, సుందరాపఘన=చక్కనిదేహములయొక్క, ఘనప్రభా=అధికకాంతిచేత, ఆక్రాంత=వ్యాప్తమైన, జలంబులపయిన్=నీటిపైని; పొడకట్టు పాండుర డిండీరఖండ మండలంబులు – పొడకట్టు =అగపడుచున్న, పాండుర=తెల్లనైన, డిండీరఖండ=ఫేనఖండ ములయొక్క, మండలంబులు=సమూహములు; సంబరంబులు=సంతోషములను; పొదలింపన్=వృద్ధిఁజేయఁగా; అనఁగా నాకొలఁకునందలిజలము తుమ్మెదలదేహకాంతిచేత తటద్రుమచ్ఛాయావృతమై నల్లనై యుండఁగా నందుండు ఫేనఖండములు, సూర్యుండు చెంత నుండుటం జేసి కలిగిన తాపాతిశయముచేత నాకసము నీలోత్పలమరందబిందుసేకముం గోరి కాసారమును జేరి తటద్రుమసందోహముచేత సూర్యప్రకాశము నెంతయు నొందకుండఁగా, నందుఁ జూపట్టు రిక్కలగుంపువలె నుండె ననుట;
అమరియున్=ఒప్పియు; అక్కొలంకు=ఆకాసారము; మహితాబ్జకామినీజాలపరిభ్రాజితంబు – మహిత=ఒప్పుచున్న, అబ్జ కామినీ=చంద్రునిభార్యలగు నక్షత్రములయొక్క, జాల=సమూహముచేత, పరిభ్రాజితంబు =ప్రకాశించుచున్నది; కావునన్ = అగుటవలన; అళి మిథున మీన కుళీర మకరాది సంయుతంబై – అళి=వృశ్చికము, మిథున=మిథునము, మీన=మీనము, కుళీర =కర్కాటకము, మకర=మకరము, ఆది=మొదలగు రాసులతో, సంయుతంబై =కూడినదై, అనఁగా మహితములైన అబ్జము లనఁగా పద్మములు, కామిని యనఁగా నాఁడుజక్కవలు, వీనిసంఘములతోడఁ గూడి యళిమిథునములు, మత్స్య ములు, ఎండ్రకాయలు, మొసళ్ళు లోనగువానితోఁ గూడియున్నదని వాస్తవార్థము;
మంజుల హర్యన్వితార్యమ లసద్విహార భాసురంబు – మంజుల=మనోజ్ఞమగు, హరి=సింహరాశితో, అన్విత=కూడిన, అర్యమ=సూర్యునియొక్క, లసద్విహార=ప్రకాశించు విహారముచేత, భాసురంబు=ప్రకాశించునది; కావునన్=అగుటచేత; కమనీయ కాదంబసుమనో వికసన విరాజితంబై – కమనీయ = మనోజ్ఞమగు, కాదంబ=కదంబవృక్షసంబంధియైన, సుమనః= పువ్వులయొక్క, వికసన=విరియుటచేత, విరాజితంబై =ప్రకాశమానమై; అనఁగా సరస్సు, మంజు=మనోజ్ఞమగు, లహరీ= ప్రవాహమును, అన్విత=పొందినట్టి, అరి=జక్కవలయొక్క, అమల=నిర్మలమైన, సద్విహార=ప్రకాశించు విహారముచేత, భాసురంబు=ప్రకాశించునదై, కమనీయ = మనోజ్ఞమగు, కాదంబ =బెగ్గురులయొక్క,సు=లె స్సైన, మనః=మనస్సుయొక్క, వికసన=విరియుటచేత,విరాజితంబై =ప్రకాశమానమై అని వాస్తవార్థము;
మనోజ్ఞ హంసకులాధిరాజ రామాభిరామ ప్రస్థానవిశేషంబు – మనోజ్ఞ=మనోహరమైన, హంసకులాధిరాజ=సూర్యవంశ స్వామి యైన, రామ=రామునియొక్క, అభిరామ=హృద్యమగు, ప్రస్థానవిశేషంబు = యాత్రావిశేషము; కావునన్=కాఁబట్టి; అకుంఠతర తరో విజృంభమాణ నానా ప్లవగవీ రారాజ త్కోలాహల లీలా చుళికిత దిశాంతంబై – అకుంఠతర=మిగుల నడ్డములేని, తరః =వేగముచేత, విజృంభమాణ=విజృంభించుచున్న, నానా=అనేకప్రకారులగు, ప్లవగవీర=వానరవీరుల యొక్క, ఆరాజత్= మిగుల నొప్పుచున్న, కోలాహల=కలకలధ్వనియొక్క, లీలా=విలాసముచేత, చులుకిత=పుడిసిలింపఁ బడిన, దిశాంతంబై = దిగంతములు గలదై; అనఁగా నా కొలను, మనోజ్ఞమైన, హంసకులాధిరాజరామా=రాజహంసస్త్రీలచేత, అభిరామ=ఒప్పు చున్న, ప్రస్థానవిశేషంబు = ప్రకృష్టమైన స్థానవిశేషము గలది కావున, అకుంఠతరతరోవిజృంభమాణములైన నానా=అనేకప్రకారములైన, ప్లవ=తెప్పలయొక్క, గో=కాంతులచేత, ‘గోరతద్ధితలుకి’ అని టచ్ ప్రత్యయము ఞీప్పు వచ్చిన పైని ప్లవగవీ యను రూపము సిద్ధించు చున్నది, రారాజత్=మిక్కిలి యొప్పుచున్న, కోలాహలములయొక్క లీలచేత చుళికిత దిశాంతంబై న దని వాస్తవార్థము; ఒప్పుమీఱి=అతిశయించి; చెప్పరాని మోదంబు=చెప్ప నలవిగాని సంతోషము; ముప్పిరిగొనన్=మూఁడుమడుఁగులగునట్లు; చేయన్ = చేయఁగా; అప్పడంతులు=ఆస్త్రీలు; అప్పద్మాలయ జలవిహార దోహదంబునన్ – అప్పద్మాలయ=ఆకొలనులోన, జలవిహార=జలక్రీడయందలి, దోహదంబునన్=వాంఛచేత, ‘అథ దోహదమ్, ఇచ్ఛా కాంక్షా’ అని యమరుఁడు; జిలుఁగు పుత్తడి వలువలు = సూక్ష్మములైన కనకాంబరములను; సడల్చి=విడిచి; పావడలు=పరికిణీలను; తాల్చి=ధరించి; శృంగం బులు = కొమ్ములను; కైకొని=స్వీకరించి; ఒయ్యనొయ్యనన్=తిన్నతిన్నఁగా; ఒయ్యారంబు =విలాసము; మించన్=అతిశ యింపఁగా; డిగ్గి=కొలనియందుఁ బ్రవేశించి; అపుడు=ఆసమయమున. దీని కుత్తరపద్యమందున్న ‘ఈఁదిరి’ అను క్రియతో నన్వయము.
ఉ. తమ్ములఁ జేరి రోదరశ◊తమ్ములఁ గైకొని తావి భృంగపో
తమ్ముల కుంచి యౌవతయు◊తమ్ముల మత్తమరాళరాజజా
తమ్ముల మించి చిత్రచరి◊తమ్ముల నీఁదిరి కొమ్మ లెల్లఁ జి
త్తమ్ముల వారిదేవతలు ◊తమ్ము లలిన్ వినుతింప నయ్యెడన్. 69
టీక: అయ్యెడన్=ఆసమయమునందు; కొమ్మ లెల్లన్=స్త్రీలందఱు; తమ్ములన్=పద్మములను; చేరి=పొంది; రోదరశత మ్ములన్ = చక్రవాకశతములను; కైకొని=స్వీకరించి; తావిన్=పరిమళమును; భృంగపోతమ్ములకున్ =తుమ్మెదబిడ్డలకు; ఉంచి = నిల్పి; యౌవత=యువతీసమూహముతో; యుతమ్ములన్=కూడియుండినట్టి; మత్తమరాళరాజజాతమ్ములన్ – మత్త=మదించిన, మరాళరాజ=రాజహంసశ్రేష్ఠములయొక్క, జాతమ్ములన్=సమూహములను; మించి=అతిశయించి; వారిదేవతలు =జలాధిదేవతలు; చిత్తమ్ములన్=మనస్సులయందు; తమ్మున్=తమను; లలిన్=ప్రేమతో; వినుతింపన్=కొని యాడఁగా; చిత్రచరితమ్ములన్ = ఆశ్చర్యకరమైన వ్యాపారములచేత; ఈఁదిరి=జలక్రీడ సల్పిరి. అనఁగా నాస్త్రీలు కొలను ప్రవేశించి తమ్ము జలాధిదేవతలు కొనియాడునట్లు పైఁజెప్పిన విధముగ నీఁది రనుట.
మ. తరుణాంభోరుహపీఠిఁ బొల్చి సుమనో◊దంతుల్ నవాంభఃపరం
పర పైపైఁ గడుఁ జల్ల సారసము ప్రే◊మన్ గేలునన్ బట్టి క
ర్బురసంహారిసుగాత్రికాతిసమతా◊స్ఫూర్తిన్ గర మ్మొక్క క
ర్బురసంహారిసుగాత్రికాతిలక మిం◊పుల్ గూర్చెఁ ద న్గన్గొనన్. 70
టీక: ఒక్క కర్బురసంహారిసుగాత్రికాతిలకము – ఒకస్త్రీరత్నము, కర్బుర మనఁగా సువర్ణము. దానిని సంహరించెడు ననఁగా తిరస్కరించెడు దేహము గలవారు స్త్రీలు. అట్టివారిలో తిలకరూపయైన స్త్రీ యనుట; తరుణాంభోరుహపీఠిన్ = నవాంబుజమను పీఠమందు; పొల్చి=ఒప్పి; సుమనోదంతుల్=స్త్రీలనెడు దివ్యగజములు; నవాంభఃపరంపరన్=నూతనమైన జలధారలను; పై పైన్=మీఁదమీఁదను; కడున్=మిక్కిలి; చల్లన్=చల్లుచుండఁగా; సారసమున్=పద్మమును; ప్రేమన్=ప్రేమచేత; కేలునన్=చేతి చేత; పట్టి=ధరించి; కర్బురసంహారిసుగాత్రికాతిసమతాస్ఫూర్తిన్ – కర్బురసంహారి=రాక్షసాంతకుఁడైన విష్ణుమూర్తియొక్క, సుగాత్రికా=భార్య యైన లక్ష్మీదేవియొక్క, అతిసమతా=అత్యంతసామ్యముయొక్క, స్ఫూర్తిన్=ప్రకాశముచేత; తన్గన్గొనన్ = తన్నుఁ జూడఁగా; కరమ్ము=మిక్కిలి; ఇంపుల్ గూర్చెన్ = ఆనందముల నొందించెను. అనఁగా జలవిహారసమయమున నొక స్త్రీరత్నము తమ్మిపైఁ గూర్చుండి కేలఁ గమలమును దాల్చియుండఁగా ఇతరస్త్రీలు దానిపై జలపరంపరలు చల్లుచుండి రనియు, దానిం జూడఁగాఁ బద్మహస్తయై, పద్మాసనయై దేవదంతులచే జలాభిషేకము పొందు లక్ష్మీదేవిని బోలి యుండె ననియు భావము. పూర్ణోపమాలంకారము.
చ. అలరుమృణాళవల్లరి స్వ◊యంవరసూనసరాభ వ్రేలఁగా
నలనికటంబుఁ జేరఁగ జ◊నన్ రతిఁ గైకొనె నొక్క పుష్పకో
మల దమయంతికావనిత◊మాడ్కి మరాళనృపుల్ స్వచిత్తసీ
మలఁ దమయంతికావనిఁ గ్ర◊మంబున నొందిన సంభ్రమింపఁగాన్. 71
టీక: ఒక్క పుష్పకోమల=పుష్పములవలె మృదువైన దేహముగల యొక్క స్త్రీ; అలరు=ఒప్పారుచున్న; మృణాళవల్లరి =తీగవంటి తామరతూఁడు; స్వయంవరసూనసరాభన్=స్వయంవరార్థమైన పుష్పమాలికవలె; వ్రేలఁగాన్=వ్రేలాడఁగా; మరాళనృపుల్=రాజహంసలనెడు రాజులు; స్వచిత్తసీమలన్=తమమనఃప్రదేశములయందు; తమయంతికావనిన్= తమ సమీపప్రదేశమును; క్రమంబునన్=వరుసఁగా; ఒందినన్=పొందఁగా; సంభ్రమింపఁగాన్=సంతసము నొందఁగా, వేగిరపాటు నొందఁగా; దమయంతికావనితమాడ్కిన్ = దమయంతివలె; నలనికటంబున్=పద్మనికట మనెడు నలరాజుసమీపమును; చేరఁగన్ చనన్=చేరఁబోవుటకు; రతిన్=ప్రీతిని; కైకొనెన్=స్వీకరించెను, చేరె ననుట.
అనఁగా నొకస్త్రీ మృణాలవల్లరి చేతఁ బుచ్చుకొని పద్మమును గ్రహించుటకుఁ బోవుచుండఁగా దమయంతి నలుని వరించు టకుఁ బుష్పహారము తీసికొని పోవుచున్నట్లుండె ననియు, నపుడు మధ్యమార్గమున నున్న మరాళములు ఆస్త్రీ తమచెంతకు వచ్చె నని సంభ్రమించుట నలేతరరాజులు దమయంతి తమయంతికమునకు వచ్చె నని సంభ్రమించినట్లుండె ననియు భావము. రూపకసంకీర్ణోపమాలంకారము.
సీ. రతిఁ బట్టుకొనఁ జేరె ◊రాజీవరామాని,కరము సద్గుణజాల◊కలిత యొకతె.
రహి వ్రాల్చె నవదాత◊రాజీవరాజిత,రజము పావనవిహా◊రయుత యొకతె,
యడలించె వడిఁ బుష్క◊రాజీవరాజహం,సముల శంపాలోక◊సక్త యొకతె,
ప్రౌఢి నొంచె రథాంగ◊రాజీవరామోద,పటిమ సత్కాంతిసం◊భరిత యొకతె,
తే. వనజగృహవీథి నిట్టు లా◊వర్తనాభి,కాజనంబులు సముచితగతి నెసంగె
వారిదేవత లపుడు త◊ద్వర్తనాభి,దర్శనస్ఫూర్తి నవ్యహా◊ర్దంబు గాంచ. 72
టీక: సద్గుణజాలకలిత ఒకతె =శ్రేష్ఠమగు గుణగణములతోఁ గూడినట్టి ఒకస్త్రీ, మంచి సూత్రములు గల వలతోఁ గూడిన యొక స్త్రీ యని తోఁచుచున్నది; రాజీవరామానికరము=మత్స్యస్త్రీగణమును, ‘రాజీవ శ్శకుల స్తిమిః’ అని యమరుఁడు; రతిన్=ప్రీతిచేత; పట్టుకొనన్ = స్వీకరించుటకు; చేరెన్=సమీపమునకుఁ బోయెను. మంచిసూత్రములతోఁ (రజ్జువులతో) గూడిన వల గలది గావున మత్స్యములఁ బట్టుకొనఁబోవుట తగునని భావము. పావనవిహారయుత ఒకతె = మంచిప్రచారముతోఁ గూడిన యొకస్త్రీ, పవనసంబంధిప్రచారముతోఁ గూడిన యొకస్త్రీ యని తోఁచు చున్నది; అవదాతరాజీవరాజితరజము – అవదాతరాజీవ=తెల్లదామరలయందు, రాజిత=ఒప్పుచున్న, రజము=పరాగమును; రహిన్=ప్రీతితో; వ్రాల్చెన్=తూల్చెను. పవనసంబంధిప్రచారముతోఁ గూడినది గావున పరాగమును వ్రాల్చుట తగునని భావము; శంపాలోకసక్త ఒకతె = మెఱపులవంటి చూపులతోఁ గూడిన యొకస్త్రీ, తటిత్కాంతితోఁ గూడిన యొకస్త్రీ యని తోఁచుచున్నది; పుష్కరాజీవరాజహంసములన్ – పుష్కర=పద్మములు, ఆజీవ=జీవికగాఁగల, రాజహంసములన్ =రాజహంసలను; వడిన్ = వేగముచేత; అడలించెన్ = భయపెట్టెను. తటిత్కాంతియుత గావున పుష్కరాజీవము లగు రాజహంసల వెఱపించుట తగు నని భావము. తటిత్ప్రకాశములు గల వర్షాకాలమందుఁ గొలఁకులు నిండి పద్మములకుఁ గీడు గల్గును గాన నపుడు హంసలు ఎడలి పోవు నని కవిసమయము.
సత్కాంతిసంభరిత ఒకతె = మంచికాంతితో నింపఁబడిన యొకస్త్రీ, నక్షత్రములకాంతితోఁ గూడిన యొకస్త్రీ యని తోఁచుచున్నది; రథాంగరాజీవరామోదపటిమన్ – రథాంగరాజీ=చక్రవాకపంక్తియొక్క, వర=శ్రేష్ఠమైన,ఆమోదపటిమన్=సంతోషాతిశయ మును; ప్రౌఢిన్=నేర్పుచేత; నొంచెన్=నొవ్వఁజేసెను. నక్షత్రకాంతిభరిత గావున రథాంగరాజీసంతోషపటిమ నొంచుట తగు నని భావము. నక్షత్రప్రకాశము గల రాత్రికాలమందు రథాంగదంపతు లెడఁబాసి ఖేదించు నని కవి సమయము.
ఇట్టులు=ఈప్రకారము; వనజగృహవీథిన్=కమలాకరమైన కాసారముయొక్క సీమయందు; ఆవర్తనాభికాజనంబులు = స్త్రీ జనములు, ఆవర్తనాభిక లనఁగా నీటిసుడినిబోలు పొక్కిలిగల స్త్రీలని యర్థము; అపుడు=ఆసమయమందు; వారిదేవతలు= జలాధిష్ఠాన దేవతలు; తద్వర్తనాభిదర్శనస్ఫూర్తి న్ – తద్వర్తన=ఆస్త్రీలవృత్తియొక్క, అభిదర్శనస్ఫూర్తి న్=చూచుటయందు; నవ్యహార్దంబు =నూతనప్రీతిని; కాంచన్=పొందఁగా; సముచితగతిన్=పైఁజెప్పినట్టు లుచితప్రకారముగ; ఎసంగెన్=ఒప్పెను. సద్గుణజాలకలితేత్యాదిసాభిప్రాయవిశేష్యములచేఁ బరికురాలంకారము.
చ. స్మరమదదంతి నా నొకమ◊సారసముల్లసితప్రవేణి త
త్సరమున నత్తఱిం బవన◊సారసముల్లలదూర్మిజాతముల్
సరగునఁ జొచ్చి పాదముల ◊సారసముల్ గర మించె మెట్టుచున్
సరసకలారవాకలన◊సారసముల్లహరిన్ హరించుచున్. 73
టీక: అత్తఱిన్=ఆసమయమందు; ఒకమసారసముల్లసితప్రవేణి =నీలములభంగి ప్రకాశించుచున్న జడగల యొకస్త్రీ; తత్సరము నన్ = ఆకొలంకునందు; పవనసారసముల్లలదూర్మిజాతముల్ – పవనసార=వాయుసామర్థ్యముచేత, సముల్లలత్= మిక్కిలి చలించుచున్న, ఊర్మిజాతముల్=తరంగతతులను; సరగునన్=వడిగా; చొచ్చి=ప్రవేశించి; పాదములన్=చరణములచేత; సారసముల్=పద్మములను; మెట్టుచున్ =త్రొక్కుచు; సరసకలారవాకలనన్ – సరస=శ్రేష్ఠమైన,కల=అవ్యక్తమధురమైన, గజ పక్షమున, కర=తొండముయొక్క యని యర్థము, ఆరవ=ధ్వనియొక్క, ఆకలనన్=సంబంధముచేత; సారసముల్లహరిన్ – సారస=బెగ్గురులయొక్క, ముత్=సంతోషముయొక్క, లహరిన్=పరంపరను;హరించుచున్=పోఁగొట్టుచు; స్మరమదదంతి నాన్ = మన్మథుని మదపుటేనుఁగో యనునట్లు; కరము = మిక్కిలి; ఇంచెన్= ఇంపయ్యెను. అనఁగా నొకనీలవేణి యాకొలఁకు నందు వీవలివేగమునఁ జలించుచున్న తరఁగలఁ జొచ్చి, కమలములను బాదముల మెట్టుచు సరసకలస్వనములచేత బెగ్గురుల సంతసమును హరించుచు, మదనుని మదపుటేనుఁగో యనునట్లు భాసిల్లె నని భావము. గజము సరస్సులు సొచ్చి, కమలములు మెట్టుచు, బెగ్గురులు లోనగు జలపక్షులమోదము హరించుట ప్రసిద్ధము. ఉత్ప్రేక్షాలంకారము.
చ. అనుపమరాజహంసభర◊ణాదరణాత్మతఁ దత్సరోవరం
బున నలరాజహంససుత◊బోటులు మించిరి పూర్వవైరముల్
సన భృతరాజహంసత నె◊సంగుదివాక్షణదాధిదేవు లౌ
నని వనరాజహంసగమ◊నాళి మనంబున సన్నుతింపఁగన్. 74
టీక: అలరాజహంససుతబోటులు = రాజశ్రేష్ఠుఁడగు క్షణదోదయుని పుత్త్రికయగు చంద్రికయొక్క చెలులు; తత్సరోవరంబు నన్ = ఆసరస్సునందు; అనుపమరాజహంసభరణాదరణాత్మతన్ – అనుపమ=సాటిలేని, రాజహంస=పక్షివిశేషముయొక్క, ‘రాజహంసాస్తు తే చఞ్చుచరణై ర్లోహితై స్సితాః’ అని యమరుడు. అనఁగా ముక్కు, కాళ్ళు ఎఱ్ఱగను, శరీరము తెల్ల గను నుండు హంసములకు రాజహంసము లని పేరు. రాజహంసశబ్దమునకు చంద్రసూర్యు లను నర్థాంతరము దోఁచును, భరణ= భరించుట యందు, ఆదరణ=ఆసక్తిగల, ఆత్మతన్=చిత్తము గల్గుటచేత; పూర్వవైరముల్=మునుపటి ద్వేషములు; చనన్= పోఁగా; భృత రాజహంసతన్ = భరింపఁబడిన చంద్రసూర్యులు గల్గుటచేత; ఎసంగు దివాక్షణదాధిదేవులు=ఒప్పుచున్న దిన రాత్ర్యధిదేవతలు; ఔన్=నిశ్చయము, అని=ఇట్లని; వనరాజహంసగమనాళి =వనమందలి స్త్రీలచాలు, వనపాలికామండలి యనుట; మనంబునన్ =చిత్తములందు; సన్నుతింపఁగన్ = కొనియాడఁగా; మించిరి =అతిశయించిరి. అనఁగాఁ జంద్రికాసఖీ జనము సరోవరమున రాజహంసభరణాదరణముతోఁ జెలఁగుచుండఁగా, దివారాత్ర్యధిదేవతలు తమ తొల్లిటివైరము మాని సూర్యచంద్రులను బట్టుకొని యుండినట్లు వనపాలికల మనంబులకుఁ దోఁచిన దనుట. శ్లిష్టరూపకోత్థాపితోత్ప్రేక్షాలంకారము.
సీ. వాసంతి యనఘాళి◊వరరసంబునఁ గప్పి,వాసంతి యన సము◊జ్జ్వలతఁ బొల్చె,
సారంగి యనపాయ◊జలజాంబుతతి నాని, సారంగి యనఁ జాల ◊సంభ్రమించె,
శశిలేఖ యనసార◊చక్రాళి నలయించి, శశిలేఖ యన శుభ◊చ్ఛాయఁ దోఁచె,
చక్రాంగి యనవద్య◊చారూర్మికల నూఁగి, చక్రాంగి యన హృద్య◊చర్య మసలె,
తే. చూతకళిక యనర్ఘ్యర◊జోవృతిఁ గని, చూతకళిక యనం గడుఁ ◊జూడ నొప్పె,
హరిణి యనరాళకమలైక◊పరిచితిఁ గని, హరిణి యన నవ్వనాస్థాని ◊నప్పు డలరె. 75
టీక: వాసంతి = వాసంతి యనుపేరుగల చెలి; అనఘాళిన్=అనఘయైన చెలిని, ఒచ్చెము లేని తుమ్మెదను, శ్లిష్టరూపకము; వరరసంబునన్=శ్రేష్ఠమగు ప్రీతిచేత, శ్రేష్ఠమగు పుష్పరసముచేత; కప్పి;వాసంతి యనన్=బండిగురివెందలత యనఁగా, వాసంతినామము గలది యనఁగా; సముజ్జ్వలతన్=ప్రకాశముచేత; పొల్చెన్=ఒప్పెను. మాధవీలతవలె ననఘాళిని రసమునఁ గప్పుటం జేసి వాసంతీనామము దాని కమరిన దనుట. సారంగి=సారంగి యను పడుచు; అనపాయజలజాంబుతతిన్ – అనపాయ=చ్యుతిలేనట్టి, జలజాంబు=పూఁదేనియయొక్క, తతిన్ =రాశిని; ఆని=త్రావి; సారంగియనన్=ఆఁడుతుమ్మెదయనఁగా, సారంగి యను నామము గలది యనఁగా; చాలన్ = మిక్కిలి; సంభ్రమించెన్ =సంతసించెను. భృంగివలెఁ బూఁదేనియ నానుటంజేసి సారంగి యను నామము దాని కొప్పె ననుట.శశిలేఖ = శశిలేఖ యను కాంత; అనసారచక్రాళిన్ – అనసార-శ్రేష్ఠములైన, చక్రాళిన్=చక్రవాకములచాలును; అలయించి = అలఁతపెట్టి; శశిలేఖ యనన్ = చంద్రరేఖ యనఁగా, శశిలేఖ యను నామము గలదనఁగా; శుభచ్ఛాయన్=మంచికాంతిచేత; తోఁచెన్=పొల్చెను. చంద్రరేఖవలె జక్కవలచాలు నలయించుటంజేసి శశిలేఖ యను పేరు దాని కబ్బె ననుట. చక్రాంగి = చక్రాంగి యను పేరుగల బోటి; అనవద్యచారూర్మికలన్ – అనవద్య=దూష్యములు గాని, చారు=మనోహరము లైన, ఊర్మికలన్=తరంగములయందు; ఊఁగి; చక్రాంగి యనన్ = హంసస్త్రీ యనఁగా, చక్రాంగి యను నామము గలదనఁగా; హృద్యచర్యన్=మనోజ్ఞమైన వృత్తిచేత; మసలెన్=ఒప్పెను. హంసస్త్రీవలెఁ దరంగములయందు నూఁగుటం జేసి చక్రాంగి యను నామము దాని కొప్పె ననుట. చూతకళిక = చూతకళిక యను పేరుగల నాతి; అనర్ఘ్యరజోవృతిన్ – అనర్ఘ్య=అమూల్యమైన, రజోవృతిన్=పరాగవ్యాప్తిని; కని = పొంది; చూతకళిక యనన్ = మావిమొగ్గ యనఁగా, చూతకళిక యనుపేరుగల దనఁగా; కడున్=మిక్కిలి; చూడన్ ఒప్పెన్ = చూచుటకు నందమయ్యెను. చూతకళికవలె రజోవృతిని గనుటంజేసి చూతకళికయను పేరు దాని కొదవె ననుట. హరిణి = హరిణి యను పేరుగల వనిత; అనరాళకమలైకపరిచితిన్ – అనరాళ=ఋజువులైన, కమల=పద్మములయొక్క, ఏక =ముఖ్యమగు; పరిచితిన్=పరిచయమును; కని=పొంది; హరిణి యనన్ = మృగస్త్రీ యనఁగా, హరిణి యను పేరుగలదనఁగా; అవ్వనాస్థానిన్ = ఆసరోజలమను నాస్థానమందు; అప్పుడు; అలరెన్=ఒప్పెను. అనఁగా మృగస్త్రీవలెఁ గమలపరిచయముం గనుటంజేసి హరిణి యను నామము దాని కెసఁగె ననుట. శ్లిష్టరూపకము.
అనఁగా జలక్రీడకై కొలను సొచ్చిన వాసంతి, సారంగి, శశిలేఖ, చక్రాంగి, చూతకలిక, హరిణి యను నామములు గల స్త్రీలు పైఁజెప్పిన చర్యల నొనరించిరని భావము. రాజాస్థానికలయందు దాసీవర్గమునకు వాసంత్యాదినామము లుండుట ప్రసిద్ధము.
క. నలి నాకరజితకిసలల్
నలినాకరకేళి యిటు లొ◊నర్చి జలార్ద్రాం
గలతాళులు హిమవృతకుం
దలతాభం దోఁప నపుడు ◊దఱిసిరి తటమున్. 76
టీక: అపుడు=ఆసమయమందు; ఆకరజితకిసలల్= కరములచే గెలువఁబడిన పల్లవములు గల యా స్త్రీలు; నలిన్=మిక్కిలి; నలినాకరకేళి=జలక్రీడను; ఇటులు=పైవిధముగ; ఒనర్చి=చేసి;జలార్ద్రాంగలతాళులు – జల=నీటచే, ఆర్ద్ర=తడిసిన, అంగ లతాళులు = లతలవంటి తనుపంక్తులు; హిమవృతకుందలతాభన్ = మంచుచే నావరింపఁబడిన మొల్లతీవలకాంతివంటి కాంతి చేత; తోఁపన్=ప్రకాశింపఁగా; తటమున్=తీరమును; దఱిసిరి=సమీపించిరి. అనఁగా నాస్త్రీలు జలక్రీడసలిపి యొడ్డుఁ జేరి నీటిచేఁ దడిసిన తనులతలతో మంచుచే నావరింపఁబడిన కుందలతలభంగి నొప్పి రనుట. కుందలతలకు, స్త్రీతనువులకు నుపమానోప మేయభావము. హిమమునకు జలమునకు బింబప్రతిబింబభావము.
చ. లలనలు వాఃప్లుతాంశుకము◊లన్ సడలించి తగం భరించి మేల్
చలువల నైకజాతిసుమ◊జాలసరంబులు వేణిఁ దాల్చి ని
చ్చలు వలనై కనంబడుల◊సన్మణిమాలిక లూని పూసి మై
చలువల నైకమత్యగతిఁ ◊జాలిన తావుల నొప్పు గంధముల్. 77
టీక: లలనలు=స్త్రీలు; వాఃప్లుతాంశుకములన్=నీటిచేఁ దడుపఁబడిన వస్త్రములను; సడలించి=విడిచి; మేల్ చలువలన్ = మంచి వస్త్రములను; తగన్= తగునట్లుగా; భరించి=ధరించి; నైకజాతిసుమజాలసరంబులు – నైకజాతి=నానాజాతులు గల, సుమ జాల= పుష్పసంఘములయొక్క, సరంబులు=దండలు; వేణిన్=జడయందు; తాల్చి=ధరించి; నిచ్చలున్=ఎల్లపుడు; వలనై = అనుకూలమై; కనంబడు=అగపడుచున్న; లసన్మణిమాలికలు=ప్రకాశించుచున్నమణిమయహారములను; ఊని=వహించి; మైచలువలన్=దేహములయొక్క చల్లదనములతో; ఐకమత్యగతిన్=ఐకమత్యముయొక్క పొందికచేతను; చాలిన తావులన్ = సమృద్ధమైన పరిమళములచేతను; జలక్రీడ లాడిన వారిదేహము లంతటి చల్లఁదనముతోను, అధికమైన పరిమళముతోను ననుట; ఒప్పు గంధముల్=ఒప్పుచున్న గంధములను; పూసి=లేపనము చేసి. దీనికి ‘గందంబు వెట్టి’ రను ముందరిపద్యముతో నన్వయము. ముందు నాల్గుపద్యములకు నందె అన్వయము. ఆఱు పద్యములకు నిట నేకక్రియాన్వయము గదితంబయ్యె. దీనికిఁ గుళక మని కవిసంకేతము. ‘ద్వాభ్యాం యుగ్మ మితి ప్రోక్తం త్రిభి శ్శ్లోకై ర్విశేషకమ్| కలాపకం చతుర్భి స్స్యాత్, తదూర్ధ్వం కుళకం స్మృతమ్||’ అని తల్లక్షణము.
క. అతిపావనచాతురి నా,క్షితిపాలకపుత్త్రిక గయి◊సేసి యలవనిన్
రతినాయకదేవార్చన,రతి నాయక లపుడు పూని ◊రమ్యోత్కలికన్. 78
టీక: అతిపావనచాతురిన్=మిగులఁ బ్రశస్తమగు నేర్పుచేత; ఆక్షితిపాలకపుత్త్రికన్ = రాకుమారియగు నాచంద్రికను; కయిసేసి =అలంకరించి; అలవనిన్=ఆయుద్యానమందు; రతినాయకదేవార్చనరతిన్=స్మరదేవపూజాసక్తిచేత; ఆయకలు=ఆస్త్రీలు; అపుడు=ఆసమయమున; రమ్యోత్కలికన్=రమ్యమైన యుత్కంఠను; పూని=వహించి. ఇది ముందు కన్వయించును.
సీ. మాకందములు మహి◊మాకందములు కొన్ని, యింపైన ఫలముల ◊నిచ్చుచోట,
సురసౌఘము లుదార◊సురసౌఘములు కొన్ని, యురుమకరందంబు ◊గురియుచోట,
సుమనంబు లభిరామ◊సుమనంబు లొకకొన్ని, క్రొన్ననల్ చాలఁ జే◊కూర్చుచోట,
రాగంబులు గళత్ప◊రాగంబు లొకకొన్ని, పుప్పొడిధూపముల్ ◊పూన్చుచోట,
తే. నెట్టన యశోకకిసలము ◊ల్మట్టుమీఱి, యుట్టివడఁ గాయు లేయెండఁ ◊బుట్టి యెలసి
నట్టి చెలువునఁ జూపట్టు ◊మెట్టదమ్మి,తీవెగమి తమ్మియారతుల్ ◊దీర్చుచోట. 79
టీక: మహిమాకున్=భూలక్ష్మికి; అందములు=అందములైన; మాకందములు కొన్ని = కొన్నితియ్యమావులు; ఇంపైన = ఇష్టమైన; ఫలములన్=పండ్లను; ఇచ్చుచోటన్=ఒసంగుస్థలమునందు; ఉదారసురసౌఘములు = అధికమై శ్రేష్ఠమైన మకరందసమూహము గల; సురసౌఘములు కొన్ని=కొన్నిసర్పాక్షితీవల యొక్కగుంపులు; ఉరుమకరందంబు = అధికమైన పూఁదేనియను; కురియుచోటన్ = వర్షించుచోట; అభిరామసుమనంబులు=ఒప్పుచున్న పువ్వులు గల్గిన; ఒకకొన్ని సుమనంబులు=కొన్ని జాజులు; చాలన్=మిక్కిలి; క్రొన్ననల్ =క్రొత్తపూవులను; చేకూర్చుచోటన్= ఘటిల్లఁజేయుచోట; గళత్పరాగంబులు=జాఱుచున్న పుప్పొడులు గల; ఒకకొన్నిరాగంబులు =కొన్ని దాడిమీవృక్షములు; పుప్పొడిధూపముల్ =పుష్పరజమనెడు ధూపములను; పూన్చుచోటన్=వహించు చోటను; నెట్టన=అనివార్యముగ; అశోకకిసలముల్= అశోకపల్లవములు; మట్టుమీఱి = మర్యాద నతిక్రమించి; ఉట్టిపడన్=అతిశయిం పఁగా; కాయు లేయెండన్=కాయుచున్న తరుణాతపముచేత; పుట్టి=ఉదయించి; ఎలసినట్టి చెలువునన్ = ఉదయించినట్టి యందముచేత; చూపట్టు మెట్టదమ్మితీవెగమి = అగపడుచున్న స్థలపద్మినీలతలసముదాయము; తమ్మియారతుల్= పద్మము లను నారతులను; తీర్చుచోటన్= చక్కఁబఱచుచోటను. దీనికి దిగువ కన్వయము.
చ. అలఘుమరందవర్షమహి◊మాతిశయమ్మున సప్తలాద్యమం
దలతల మంచుపొన్నగమి ◊దార్కొనుపందిరిక్రింద వేదికం
దలతల మంచు మించుసుమ◊నవ్యరజంబులఁ దార్చి తారలం
దలతల మంచు నొప్పెడుక◊నత్కలికాతతి మ్రుగ్గువెట్టుచున్. 80
టీక: అలఘుమరందవర్షమహిమాతిశయమ్మునన్ – అలఘు=అధికమైన, మరందవర్ష=పూఁదేనియవానయొక్క, మహి మాతిశయమ్మునన్ =సామర్థ్యాతిశయమున; సప్తలాద్యమందలతలన్ = విరజాజి మున్నగు నుత్కృష్టలతలను, ‘సప్తలా నవమాలికా’ అని యమరుఁడు; మంచుపొన్నగమిన్ = పోషించుచున్న పొన్నలగుంపును; తార్కొనుపందిరిక్రిందన్ = సమీ పించిన పందిరియొక్క దిగువను; వేదికన్=తిన్నెపైని; తలతల మంచున్=తళుక్కుతళుక్కు మనుచు; మించు సుమనవ్యరజం బులన్ = అతిశయించుచున్న నూతనమైన పుష్పపరాగములను; తార్చి=ఉంచి; తారలన్=నక్షత్రములను; తలతల మంచున్ = తొలఁగుతొలఁగుమనుచు; ఒప్పెడుకనత్కలికాతతిన్ = ఒప్పుచున్న ప్రకాశించు మొగ్గలగుంపుచేత; మ్రుగ్గు వెట్టుచున్ = రంగ వల్లిక యుంచుచు. దీనికి ముందు కన్వయము. అనఁగా విరజాజి మొదలగు తీవెలతోఁ జుట్టఁబడిన పొన్నచెట్టునొద్దఁ బందిరిక్రింద నొకతిన్నెమీఁదఁ బుప్పొడి చల్లి, నక్షత్రములవలెఁ బ్రకాశించు మొగ్గలతో మ్రుగ్గువెట్టి యని తాత్పర్యము.
ఉ. జవ్వను లెల్ల సమ్మదము ◊చాల రహింపఁగ నందు వెన్నెలం
జివ్వకుఁ బిల్చుపాండుపటిఁ ◊జిక్కనికస్తురినీట రాణితో
నవ్వలరాజు నాశుగశ◊రాసనయుక్తుని వ్రాసి నేర్పుతో
నవ్వల రాజు నాశుగసు◊మాకరముఖ్యుల నిల్పి యత్తఱిన్. 81
టీక: జవ్వను లెల్లన్=స్త్రీలందఱు; సమ్మదము = సంతోషము; చాలన్= మిగులను; రహింపఁగన్=ఒప్పఁగా; అందున్= ఆ వేదికయందు; వెన్నెలన్=జ్యోత్స్నను; చివ్వకున్=కలహమునకు; పిల్చుపాండుపటిన్= పిల్చునట్టి తెల్లనివస్త్రమందు; చిక్కనికస్తురినీటన్=చిక్కనైనకస్తూరీనీరముచేత; రాణితోన్=రతీదేవితోడ; అవ్వలరాజున్=ఆమన్మథుని; ఆశుగశరాసన యుక్తునిన్=బాణధనువులతోఁ గూడినవానిని; వ్రాసి=లిఖించి; నేర్పుతోన్=చాతుర్యముచేత; అవ్వలన్=ఆతర్వాత; రాజున్ = చంద్రుని; ఆశుగసుమాకరముఖ్యులన్ = మందమారుతవసంతాదులను; అత్తఱిన్=ఆసమయమునందు; నిల్పి=స్థాపించి. పై పద్యముతో నన్వయము.
సీ. గందంబు వెట్టి రు◊త్కటనీలశరజాత,శరజాతహృతహర◊స్వాంతధృతికి,
విరిచాలు నించిరి ◊పరియోజితనయాన్య,తనయాన్యమితమోహ◊ధాతృమతికి,
ధూప మర్పించి ర◊ద్భుతసంపదబలాప,దబలాపహృతవిష్ణు◊దర్పగతికి,
దీప మెత్తిరి నైజ◊తేజోలహరిభావ,హరిభావయుక్తఘ◊స్రాధిపతికి,
తే. తళియ వట్టిరి నిత్యస◊త్కాంతమధుప,కాంతమధుపవనాద్యాప్త◊కాండవృతికి,
వినతి సల్పిరి శృంగార◊జనికి ‘రతిప,తే నమో భవతే’యంచుఁ ◊దెఱవ లపుడు. 82
టీక: ఉత్కటనీలశరజాతశరజాతహృతహరస్వాంతధృతికిన్ – ఉత్కట=అధికమైన, నీలశరజాత=నీలోత్పలము లనెడు, శర =బాణములయొక్క, జాత=సమూహముచేత, హృత=హరింపఁబడిన, హర=శివునియొక్క, స్వాంత=చిత్తముయొక్క, ధృతికిన్=ధైర్యము గలవానికి; గందంబు వెట్టిరి = చందన మలందిరి. పరియోజితనయాన్యతనయాన్యమితమోహధాతృమతికిన్ – పరియోజిత=కూర్పఁబడిన, నయాన్య=నీతివిరుద్ధమైన, ఇది మోహమునకు విశేషణము, తనయా=కూఁతునందలి, న్యమిత=అత్యధికమైన, మోహ=మోహము గల, ధాతృమతికిన్ = బ్రహ్మబుద్ధి గలవానికి; విరిచాలు=పుష్పపంక్తులను; నించిరి = నిండించిరి. అద్భుతసంపదబలాపదపలాపహృతవిష్ణుదర్పగతికిన్ – అద్భుత=ఆశ్చర్యకరమగు, సంపదబలా=లక్ష్మి యనెడు, పద= పదము గల, పేరుగల యనుట, బల=సామర్థ్యముచేత, అపహృత=హరింపఁబడిన, విష్ణుదర్పగతికిన్=విష్ణుమూర్తియొక్క గర్వగతి గల వానికి; ధూప మర్పించిరి = ధూపమును సమర్పించిరి. నైజతేజోలహరిభావహరిభావయుక్తఘస్రాధిపతికిన్ – నైజతేజోలహరిభావ=స్వీయమగు ప్రతాపప్రవాహసత్తచేత, హరిభావ =అశ్వత్వముతోడ, యుక్త=కూడిన, ఘస్రాధిపతికిన్=సూర్యుఁడు గలవానికి, ఛాయాదేవి సూర్యునివేఁడికిఁ దాళలేక రథము నుండి డిగ్గి యశ్వరూపయై పాఱిపోవుచుండఁగా సూర్యుఁడు కామార్తుఁడై తాను నశ్వరూపమును దాల్చి వెంబడి పరు గెత్తె నని పురాణప్రసిద్ధంబు, దీప మెత్తిరి= హారతి నెత్తిరి. నిత్యసత్కాంతమధుపకాంతమధుపవనాద్యాప్తకాండవృతికిన్ – నిత్య=శాశ్వతమైన, సత్కాంత=చంద్రుఁడు, మధుపకాంత= అళిశ్రేష్ఠములు, మధు=వసంతుఁడు, పవన=వాయువు, ఆది=మొదలుగాఁ గల, ఆప్తకాండ=సుహృద్గణముయొక్క, వృతికిన్ = వ్యాప్తిగలవానికి;తళియ=బోజనపాత్రమును; పట్టిరి=ఉంచిరి.
శృంగారజనికిన్ = శృంగారరసమువలనఁ బుట్టుక గలవానికి; అపుడు; రతిపతే=రతీశుఁడా; భవతే=నీకొఱకు; నమః=నమ స్కారము; అంచున్=ఇట్లనుచు; తెఱవలు=స్త్రీలు; వినతి సల్పిరి = నమస్కరించిరి.
క. కమలాప్రియసుత, కరుణా
కమలాధిప, కలితకార్ము◊కత్కుసుమ, కన
త్కమలాశుగ, యని భక్తిన్
గమలాక్షులు పొగడిరిట్లు ◊కలరవఫణితిన్. 83
టీక: కమలాప్రియసుత=లక్ష్మికిఁ బ్రియకుమారుఁడా! కరుణాకమలాధిప =దయాసముద్రుఁడా! కలితకార్ముకత్కుసుమ = ధరింపఁబడిన ధనువగుచున్న పుష్పముగలవాఁడా! కనత్కమలాశుగ =ఒప్పెడు తమ్ము లమ్ములుగాఁ గలవాఁడా; ఇట్లు=ఈ ప్రకారముగ; అని = అనుచు; కలరవఫణితిన్=అవ్యక్తమధురమగు ధ్వనిగల వాక్కుచేత; కమలాక్షులు =స్త్రీలు; భక్తిన్ =భక్తి తోడ; పొగడిరి = నుతించిరి.
చ. కరము మహాబలావళులు ◊గాఢతరోవిచరద్ధరీశ్వరో
త్కరము మహాబలావృతవి◊ఖండహితాళులు గొల్వ మించుచున్
సిరి గలసామికిం బొడమి ◊చెన్నగు నీకు సుమంబు లూన్చుటల్
స్థిరకృప మాధవస్య తుల◊సీదళ మంచు వహింపు మంగజా! 84
టీక: అంగజా=మన్మథుఁడా! కరము=మిక్కిలి; మహాబలావళులు=పూజ్యములైన వాయుపరంపర లనెడు గొప్ప సేనా వళులు; గాఢతరోవిచరద్ధరీశ్వరోత్కరము – గాఢ=దృఢమైన, తరః=వేగముచేత, విచరత్=సంచరించుచున్న, హరీశ్వరో త్కరము=శుకశ్రేష్ఠముల గుంపనెడు నశ్వశ్రేష్ఠములగుంపు; మహాబలావృతవిఖండహితాళులు – మహాబలా=అధికలైన స్త్రీల చేత, ఆవృత=కూడుకొన్న, విఖండ=అఖండములైన, హిత=ఇష్టములైన, అళులు= తుమ్మెద లనెడు మహాసామర్థ్యముతోఁ గూడుకొన్న యఖండాప్తసంఘములు; కొల్వన్=సేవించుచుండఁగా; మించుచున్=అతిశయించుచు; సిరి గలసామికిన్ = విష్ణు మూర్తికి; పొడమి =పుట్టి; చెన్నగు నీకున్ = ఒప్పుచున్న నీకు; సుమంబులు=పూవులను; ఊన్చుటల్=ఉంచుటలు; స్థిరకృప = శాశ్వతకరుణగలవాఁడా! మాధవస్య తులసీదళ మంచున్ = మాధవునకు తులసీపత్త్ర మని; వహింపుము = తాల్పుము. అనఁగా దొడ్డవానికడుపునఁ బుట్టి గొప్పస్థితిలో నుండి వెలయు నీ కిది మేము సేయు నుపచారము స్వల్పమైనది యైనను దయా మతితోడ గ్రహింపు మనుట.
చ. కలరవమూన్చు నల్లపజ◊ కప్పుక రా వెనువెంట రాజమం
డలి నడతేరఁ జైత్రబల◊నాథునిఁ గూడి నిలింపజాలకం
బలరుచు సన్నుతింప విష◊మాంబకమానసశోభిరాగతా
హళహళిఁ గూర్చి తౌర విష◊మాంబక మానసమాజవైఖరిన్. 85
టీక: విషమాంబక = పంచబాణుఁడా! కలరవము=అవ్యక్తమధురస్వనమును; ఊన్చు =చేయునట్టి; నల్లపజ=కోయిలల మూఁక యనుట; కప్పుక రాన్ =ఆవరించికొని రాఁగా; వెనువెంటన్=వెంబడిగ; రాజమండలి =చంద్రమండల మనెడు నృప మండలము; నడతేరన్ =నడచిరాఁగా; చైత్రబలనాథునిన్=వసంతుఁడనెడు పడవాలును; కూడి=చేరి; నిలింపజాలకంబు =దేవ బృందము; అలరుచున్=సంతసించుచు; సన్నుతింపన్=కొనియాడుచుండఁగా; విషమాంబకమానసశోభిరాగతాహళహళిన్ – విషమాంబక=విషమలోచనుఁడైన శివునియొక్క, మానస=చిత్తమందు, శోభి=ప్రకాశించు (వ్యక్తమగు) నట్టి, రాగతా= అను రాగము గలుగుటయొక్క, హళహళిన్=సమ్మర్దమును, ఇది యనుకరణవచనము; మానసమాజవైఖరిన్ =గర్వసముదాయ విధానముచేత, అనఁగా గర్వాతిశయముచేత; కూర్చితి=ఘటిల్లఁజేసితివి; ఔర = ఆశ్చర్యము! అట్లు ప్రసిద్ధుండగుమహేశ్వరునకుఁ గూడ రాగము గల్గించితివి గావున నీశక్తి యమేయ మనుట.
చ. దళమయి చిత్తవీథి సము◊దారరుషారస మెచ్చ నీ వయో
యలహరిదంబరాసహన◊మై తగు గేదఁగిఱేకువంకిచా
యల హరిదంబరావనుల ◊నన్నిటిఁ గప్పుక పర్వుతేరిమా
యల హరిదంబరాత్మజ మృ◊గాక్షుల నొంపఁదలంపు గాంతురే. 86
టీక: అయో=అయ్యో! హరిదంబరాత్మజ=పీతాంబరుఁడగు విష్ణువుయొక్క పుత్త్రుఁడా! దళమయి =దట్టమయి; చిత్తవీథిన్= మనోదేశమందు; సముదారరుషారసము=మిక్కిలి యధికమగు రౌద్రరసము; ఎచ్చన్=అతిశయింపఁగా; నీవు; అలహరిదంబ రాసహనము ఐ = ఆదిగంబరుఁడగు శివునకు సహింపరానిదై, శివవిరోధియై యనుట; తగు గేదఁగిఱేకువంకిచాయలన్ – తగు =ఒప్పునట్టి, గేదఁగిఱేకువంకి = పచ్చని కేతకిఱేకనెడు కత్తియొక్క; చాయలన్=కాంతు లనెడు చాయలచేత; అలహరిదంబ రావనులన్ = ఆ దిగాకాశభూములను; అన్నిటిన్ = ఎల్లను; కప్పుక = ఆవరించికొని; పర్వుతేరిమాయలన్ = వ్యాపించునట్టి వాయురూపరథముయొక్క మాయలచేత; మృగాక్షులన్=స్త్రీలను; నొంపన్ తలంపున్ = నొప్పించుటకు వాంఛను; కాంతురే = పొందుదురా, పొందుట తగునా యనుట; అనఁగ, మన్మథా! నీవు రుద్రునంతటివాని జయించుట కుపయోగించినట్టి సాధనములచే స్త్రీలను బాధింపఁ దలఁచుట యుక్తము గాదని తాత్పర్యము.
క. కలికాకులకరకుచ కు
త్కలికాకుల మిమ్ము రాగ◊కలఁ గీరమణీ
కలగీరమణీయోన్నతి
కలగీరమణీలలామ ◊కలఁగు ననంగా. 87
టీక: అనంగా = మన్మథుఁడా! కలికాకులకరకుచకున్—కలికా=మొగ్గలను, ఆకులకర=వ్యాకులములుగాఁ జేయునట్టి, కుచకున్=స్తనములు గల చంద్రికకు; ఉత్కలికాకులము=సమ్మదసంఘమును; రాగకలన్ =అనురాగకలచేత; ఇమ్ము= ఒసంగుము; కీరమణీకలగీర మణీయోన్నతి – కీరమణీ=శుకశ్రేష్ఠముయొక్క, కల=అవ్యక్తమధురమగు, గీ=వాక్కుల యొక్క, రమణీయ=మనోజ్ఞమగు, ఉన్నతి=అతిశయమువంటి యతిశయము; కలగీరమణీలలామ = కలిగినట్టి సరస్వతి యను నుత్తమస్త్రీవంటి దగు చంద్రిక; కలఁగున్=కలఁత నొందును.
చ. అని వనజాతబాణుఁ గొని◊యాడి వధూమణు లాదరంబుతో
ననలసమానతీవ్రవిర◊హాఖ్యమహాజ్వరరేఖ మించ మే
న నలసమానసం బెనయు◊నాతికిఁ గంతున కూన్చినట్టి క్రొ
న్నన లసమానహార్దకల◊నంబులు దార్ప గ్రహించి రందఱున్. 88
టీక: అని=ఈప్రకారముగ; అందఱున్=ఎల్లరును; వనజాతబాణున్=మన్మథుని; కొనియాడి=స్తుతించి; వధూమణులు = స్త్రీ రత్నములు; ఆదరంబుతోన్=ప్రీతితోడ; అనలసమానతీవ్రవిరహాఖ్యమహాజ్వరరేఖ – అనలసమాన=అగ్నితో సాటియగు, తీవ్ర=గాఢమైన, విరహాఖ్య=విరహమను పేరు గల,మహాజ్వర=గొప్పజ్వరముయొక్క,రేఖ=పరంపర;మేనన్=దేహమందు; మించన్=అతిశయింపఁగా; అలసమానసంబు = బడలిన మనస్సును; ఎనయునాతికిన్ = పొందునట్టి చంద్రికకు; కంతునకున్ = మన్మథునకు; ఊన్చినట్టి క్రొన్ననలు = వహింపఁజేసినట్టి క్రొత్త పుష్పములను; అసమానహార్దకలనంబులు – అసమాన = సాటిలేని, హార్దకలనంబులు=స్నేహసంబంధములను; తార్పన్=కలిగించుటకు; గ్రహించిరి=తీసికొనిరి.
చ. చెలువ మెసంగినట్టి యల◊చిత్తభవార్పితసూనపాళికల్
బలుమరునారసా లనుచుఁ ◊బాయనినివ్వెఱ యాత్మ మించఁగన్
బలుమఱు నారసాధిపకు◊మారిక వింతలె దాల్పకుండుటల్
నలి నవి మారయుక్తి గని◊నన్ సుమనస్తతి యంటఁ బాత్రమే. 89
టీక: చెలువము=అందము; ఎసంగినట్టి యలచిత్తభవార్పితసూనపాళికల్– ఎసంగినట్టి =అతిశయించినట్టి, అలచిత్తభవ=ఆ మన్మథునికొఱకు; అర్పిత = సమర్పింపఁబడిన, సూనపాళికల్= కుసుమపరంపరలు; బలుమరునారసాలు – బలు = అధిక మగు, మరు=మన్మథునియొక్క, నారసాలు=నారాచములు; అనుచున్; పాయనినివ్వెఱ =తొలంగని యధికభయము; ఆత్మన్=చిత్తమందు; మించఁగన్ = అతిశయింపఁగా; పలుమఱున్=మాటిమాటికి; ఆరసాధిపకుమారిక=ఆరాజపుత్త్రిక యగు చంద్రిక; నలిన్=మిక్కిలి; అవి తాల్పకుండుటల్=ఆసూనపాళిని ధరింపకుండుటలు; వింతలె=ఆశ్చర్యమా? వింతలు గావ నుట; మారయుక్తిన్=హింసక సాంగత్యమును, మరునితోఁ గూడియుండుటను; కనినన్=పొందినమీఁద; సుమనస్తతి=పండి తులమండలి, కుసుమగణము; అంటన్=స్పృశించుటకు; పాత్రమే=యోగ్యమా? యోగ్యము కాదనుట.
అనఁగా మరునిప్రసాద మగు పువ్వులు చంద్రికకు బలిష్ఠమగు మన్మథబాణములుగాఁ దోఁచుటచే వానిని దాల్పకుండుట యరిదిగా దనుట. సుమనస్సులగువారు మారకసాంగత్యము నొందినచో ముట్టుటకు బాత్రులు గారని యర్థాంతరన్యాసము.
చ. నలినకరాలలామక మ◊నస్థభయంబు తలంగఁ జేసి వే
నలి నకరాలసత్ప్రియము◊నం జలజాస్త్రుప్రసాద ముంచి చా
న లినకరాలఘుక్రమము◊నన్ దొవతీవియ నా స్మరాశుగా
వలులఁ దలంకుకొమ్మ గొని ◊వచ్చిరి కేళినిశాంతసీమకున్. 90
టీక: నలినకరాలలామకమనస్థభయంబు – నలినకరాలలామక=పద్మములవంటి కరములుగల స్త్రీలయందు శ్రేష్ఠురాలైన చంద్రిక యొక్క, మనస్థభయంబు=మనోగతమైనభీతి; తలంగన్ చేసి =తొలఁగునట్లు చేసి; వేనలిన్ =కొప్పునందు; అకరాలసత్ప్రియ మునన్ =అకుటిలమై శ్రేష్ఠమైన ప్రీతిచేత; జలజాస్త్రుప్రసాదము=మన్మథుని ప్రసాదమును; ఉంచి = నిల్పి; చానలు=స్త్రీలు; ఇనక రాలఘుక్రమమునన్ – ఇనకర=సూర్యకిరణములయొక్క, అలఘుక్రమమునన్=అధికప్రసరణముచేత; తొవతీవియ నాన్ = కలువతీవయో యనునట్లు; స్మరాశుగావలులన్= మదనబాణపరంపరలచేత; తలంకుకొమ్మన్=భయపడుచున్నచంద్రికను; కేళినిశాంతసీమకున్=కేళీగృహప్రదేశమునకు; కొనివచ్చిరి = తెచ్చిరి. అనఁగా నాస్త్రీలు చంద్రిక నూఱడించి, యామె మనోగత భీతిని దొలంగఁజేసి, ప్రీతితోడ స్మరప్రసాదమును నామెతుఱుమునం దుఱిమి, తీవ్రసూర్యకిరణప్రసరణమునకుఁ గలువతీఁగెవోలె స్మరాస్త్రములకు భీతిల్లు నామెను కేళీగృహమునకుఁ దోడి తెచ్చి రనుట.
తే. వాసవోపలకచ కేళి◊వాస మెనసి
యంత విరిశయ్య మయిఁ జేర్చి ◊యంతరమున
నరతి రాజిల్లఁ గటువర్త◊న రతికామ
నుం డెడయ కుబ్బ విరహాప్తి ◊నుండె నపుడు. 91
టీక: వాసవోపలకచ = ఇంద్రనీలమణులఁ బోలు కురులుగల చంద్రిక; కేళివాసము=కేళీగృహమును; ఎనసి=పొంది; అంతన్ = అటుపిమ్మట; విరిశయ్యన్=పూలపాన్పునందు; మయిన్=దేహమును; చేర్చి=ఉంచి; అంతరమునన్=చిత్తమందు; అరతి = విషయనివృత్తి యను మన్మథావస్థ; రాజిల్లన్=ఒప్పుచుండఁగా; కటువర్తనన్=తీక్ష్ణవృత్తిని; రతికామనుండు=మన్మథుఁడు; ఎడ యక = ఎడఁబాయక; ఉబ్బన్=విజృంభించుచుండఁగా; విరహాప్తిన్= విరహదుఃఖప్రాప్తిచేత; అపుడు; ఉండెన్.
ఆచంద్రిక కేళీగృహమును చేరి విరిపాన్పుపైఁ బవ్వళించి అరతి యను మన్మథావస్థచేఁ గుందుచుండె ననుట.
చ. జవగతి మిత్రుఁ డబ్ధిపతి◊సన్నిధిఁ జేరఁగ నేగె నత్తఱిన్
రవరవ సంతతత్వగతి ◊రాజిల మారుఁడు మారుతాళికీ
రవరవసంతముఖ్యబల◊రాజియుతిన్ దగి రిత్త యాకలా
రవరవ సంతతంబుఁ బ్రద◊రమ్ముల నేఁచఁగ గాంచ నోపమిన్. 92
టీక: మారుఁడు=మన్మథుఁడు; రవరవ=ఆగ్రహము; సంతతత్వగతిన్ = సాతత్యవర్తనచేత; రాజిలన్=ఒప్పఁగా; మారుతాళి కీరవర వసంత ముఖ్యబలరాజియుతిన్ –మారుతాళి=మందమారుతపరంపరయొక్కయు,కీరవర=శుకశ్రేష్ఠములయొక్క యు, వసంతముఖ్య=వసంతుఁడు మొదలుగాఁ గల, బలరాజి=సైన్యసంఘముయొక్కయు, యుతిన్=సంబంధముచేత; తగి =ఒప్పి; రిత్త =వ్యర్థముగా; ఆకలారవరవన్=ఆకోకిలవాణి యగు చంద్రికను; సంతతంబున్=నిరంతరముగా; ప్రదరమ్ములన్ = సాయకములచే; ఏచఁగన్=బాధించుచుండఁగా; కాంచన్ ఓపమిన్ = చూడఁజాలమిచేత; అత్తఱిన్=అప్పుడు; జవగతిన్= శీఘ్రగమనముచేత; మిత్రుఁడు= సూర్యుఁడు, స్నేహితుఁ డనియుఁ దోఁచును; అబ్ధిపతిసన్నిధిన్=పశ్చిమసముద్రసమీపము నకు; చేరఁగన్ ఏగెన్ = చేరుటకుఁ బోయెను.
అనఁగా నాచంద్రికను మదనుం డాగ్రహముచే మందమారుత కీర వసంతాదులతోఁ జేరి వృధా బాధించుచుండఁగా, నామె దైన్యమును చూడఁజాలక సూర్యుఁడు పశ్చిమాంబురాశి చెంత కేగె నని భావము. మిత్రుఁడు స్వమిత్త్రునిహింసఁ జూడఁజాలక తొలఁగిపోవుట సహజ మని మిత్త్రశబ్దమును బట్టి యర్థాంతరము ధ్వనించుచున్నది. సూర్యుఁ డస్తంగతుఁ డాయె నని ఫలితా ర్థము. హేతూత్ప్రేక్షాలంకారము.
తే. అమితనిజధామగరిమ పా◊య వనజాత,హితుఁడు గాలైకగతిఁ దూల ◊నిల యనినత
నంద నభివృద్ధిచేఁ బొల్చు ◊యవనజాత,బలములో యన నీడచాల్ ◊ప్రబలె నపుడు. 93
టీక: అమితనిజధామగరిమ—అమిత=అధికమైన, నిజధామ=తనదీప్తి యనెడు ప్రతాపముయొక్క, గరిమ= అతిశయము; పాయన్=తొలఁగఁగా; వనజాతహితుఁడు=సూర్యుఁడు; కాలైకగతిన్=సంధ్యాకాలప్రాప్తి యనెడు దైవగతిచేత; తూలన్=పడి పోఁగా; ఇల=భూమి; అనినతన్=సూర్యుఁడను రాజులేని దగుటను; అందన్=పొందఁగా; అభివృద్ధిచేన్=అభ్యుదయముచేత; పొల్చు యవనజాత బలములోయనన్ =ఒప్పునట్టి యవనులగుంపులో యనునట్లు; నీడచాల్=ఛాయాపరంపర; అపుడు=ఆ సమయమున; ప్రబలెన్=అతిశయించెను. అనఁగా మిగుల ప్రతాపశాలి యైన యొకభూపతి కాలగతివలనఁ గడచి పోఁగా ప్రవృ ద్ధులై యవనులు వ్యాపించునట్లు మిగులఁ దేజశ్శాలి యగు సూర్యుండు సంధ్యాసమయప్రాప్తిచేతఁ దూలఁగా ఛాయాపరంపర మిగుల వృద్ధినొందుచు ప్రబలె ననుట. స్వరూపోత్ప్రేక్ష.
చ. ఉరుతిమిరేభభేదనచ◊ణోగ్రకనత్కరజాతశాలి యౌ
హరి యనివారితాస్తకుధ◊రాధిపశృంగముఁ జేరి యత్తఱిన్
హరి యని వారితాత్మతను◊హార్యనుబింబము గాంచి రాగవై
ఖరి వడి గుప్పునం దుముకు◊కైవడిఁ గ్రుంకెఁ బయోనిధిస్థలిన్. 94
టీక: ఉరుతిమిరేభభేదనచణోగ్రకనత్కరజాతశాలి – ఉరు=గొప్పదైన,తిమిరేభ=అంధకార మనెడు నేనుంగుయొక్క, భేదన = భేదించుటయందు, చణ=నేర్పరియైన, ఉగ్ర=భయంకరమగునట్లుగా, కనత్=ఒప్పుచున్న, కరజాత=కిరణసంఘ మనెడునఖ ములచేత, ‘పునర్భవః కరరుహః’ అని యమరుఁడు, శాలి=ఒప్పుచున్నవాఁడు; ఔ హరి=అగునట్టి సూర్యుఁడనెడు సింహము; అనివారితాస్తకుధరాధిపశృంగమున్ – అనివారిత=నివారింపరాని,అస్తకుధరాధిప=అస్త మనెడు నగరాజుయొక్క,శృంగమున్ = శిఖరమును; చేరి=పొంది; అత్తఱిన్=ఆసమయమందు; వారితాత్మతనుహార్యనుబింబము – వాః=ఉదకమును, ఇత=పొంది నట్టి, ఆత్మతను=తనశరీరముయొక్క, హారి=మనోహరమగు, అనుబింబము=ప్రతిబింబమును; కాంచి=చూచి; హరి యని = ప్రతిసింహమని;రాగవైఖరిన్=రక్తిమ యనెడు క్రోధముయొక్కరీతిచేత;వడిన్=వేగముగా; గుప్పునం దుముకుకైవడిన్= గుప్పున దుముకునట్లు; పయోనిధిస్థలిన్=సముద్రప్రదేశమందు; క్రుంకెన్=మునిఁగెను.
అనఁగా గజభేదనసమర్థము లైన నఖరములతో రాజిల్లు నొకసింహము పర్వతశిఖరమందుండి నీటిలోఁ బ్రతిఫలించిన తన యంగమును ప్రతిసింహముగా నెంచి కోపముచేత గుప్పున దుమికినట్లు తిమిరవిదారణచణములగు కిరణములతోఁ గూడిన సూర్యుండు చరమాద్రినుండి రక్తిమతోఁ గూడి పయోబ్ధిని గ్రుంకె ననుట. రూపకోపమాలంకారముల సంకరము.
సీ. భాస్వద్ధరిక్రమో◊పరిగతాంబుధితటో,జ్జ్వలరక్తకవనీర◊జము లనంగ,
నభ్రబింబితచర◊మాగపద్మాకరా,స్థానరోహితనీర◊జము లనంగ,
వనజిని కర్కవ◊ర్తన దెల్ప నెగసి బ,ల్వడి వచ్చు చక్రవా◊లము లనంగ,
రవి నక్రపదముఁ జే◊రఁగ శ్యామఁ బూన్చు ను,త్తమదీపచక్రవా◊లము లనంగ,
తే. తమి నినుఁడు చేర వరకలా◊పము లనంగ, సీమ వారుణి దాల్ప రా◊జిలు తదీయ
విమలమణికావిభాకలా◊పము లనంగ, నహహ నవసాంధ్యరాగమ్ము ◊లపుడు పొలిచె. 95
టీక: అపుడు=సూర్యుఁడు గ్రుంకినసమయమందు; నవసాంధ్యరాగమ్ములు=నూతనములగు సంధ్యాకాలికారుణ్యములు; భాస్వద్ధరిక్రమోపరిగతాంబుధి తటోజ్జ్వల రక్తకవనీ రజములు – భాస్వత్=సూర్యునియొక్క, హరి=గుఱ్ఱములయొక్క, క్రమ = పాదవిక్షేపముచేత, ఉపరిగత=మిన్నందినట్టి, ఇది రజమునకు విశేషణము, అంబుధితటోజ్జ్వల=సముద్రతీరమున వెలయు, రక్తక=మంకెనలయొక్క, వనీ=వనములయొక్క, రజములు=పరాగములు; అనంగన్ = అనునట్లుగా; అభ్రబింబిత చరమాగ పద్మాకరాస్థాన రోహితనీరజములు –అభ్ర=ఆకసమందు, బింబిత=ప్రతిబింబించిన, ఇది నీరజములకు విశేషణము, చరమాగ=అస్తాద్రియందలి, పద్మాకర=కొలనియందు, ఆస్థాన=స్థితిగల, రోహితనీరజములు=ఎఱ్ఱదామరలు; అనంగన్ = అనునట్లుగా; వనజినికి=పద్మలతకు; అర్కవర్తను= సూర్యుని వృత్తాంతమును; తెల్పన్=తెలియఁజేయుటకు; ఎగసి =పైకెగసి, బల్వడిన్ = అతివేగముచే; వచ్చు చక్రవాలములు = వచ్చునట్టి జక్కవలగుంపులు, రేఫలకారముల కభేదముచే వాల మనుచో వారమని భావింపఁ బడియె; అనంగన్ = అనునట్లుగా;రవి నక్రపదముఁ జేరఁగ శ్యామఁ బూన్చు నుత్తమదీపచక్రవాలములు – రవి=సూర్యుఁడు, నక్రపదమున్=సాగరమును; చేరఁగన్ =పొందఁగా, శ్యామ=రాత్రి యనెడు స్త్రీ, పూన్చు=ఉంచునట్టి, ఉత్తమ=శ్రేష్ఠములైన, దీప=దీపములయొక్క, చక్రవాలములు = మండలములు; అనంగన్ = అనునట్లుగా; తమిన్=ఆసక్తిచేత; ఇనుఁడు =సూర్యుఁడను నాయకుఁడు; చేరన్=పొందఁగా; వరకలాపములు=చక్కనిసొమ్ములు; వారుణి = ప్రతీచి, స్త్రీత్వనిర్దేశముచేత నొక స్త్రీ యని తోఁచుచున్నది; అంగసీమన్=దేహప్రదేశమందు; తాల్పన్=ధరింపఁగా; రాజిలు = ప్రకాశించుచున్న; తదీయవిమలమణికావిభాకలాపములు – తదీయ=ఆసొమ్ములకు సంబంధించిన, విమల=స్వచ్ఛములైన, మణికా =మణులయొక్క, విభా=కాంతులయొక్క, కలాపములు=సమూహములు; అనంగన్ = అనునట్లుగా; పొలిచెన్ = ప్రకాశించెను; అహహ= అద్భుతము! అనఁగా సాంధ్యరాగములు సూర్యాశ్వగతివలన గగనతలమంటిన సముద్రతీరపు మంకెనవనములందలి పుప్పొడులవలె నున్నవనియు, చరమాద్రియందలి కొలఁకులందుండి గగనతలమందుఁ బ్రతిఫలించిన యెఱ్ఱదామర లట్లున్నవనియు, సూర్యుఁ డస్తమించె నని పద్మినికిఁ జెప్ప గగనతలమున కెగసి వచ్చుచున్న చక్రవాకముల గుంపులవలె నున్నవనియు, సూర్యుం డస్త మింపఁగా రాత్రి యను స్త్రీ యమర్చిన దీపమండలిని బోలి యున్న వనియు, సూర్యుఁ డను భర్తను జేరఁ బ్రతీచి యను కాంత తాల్చిన సొమ్ములయొక్క స్వచ్ఛమైన మణికాంతులభంగి నొప్పిన వనియు భావము. ఉత్ప్రేక్షాలంకారముల సంసృష్టి.
చ. ఘనకమలోదయం బెడయఁ ◊గాలగతి న్వన మందుచు న్రథాం
గ నలగవాధినేత సనఁ◊గాఁ గడుఁ దత్సతి యాత్మఁ జింత పొం
గ నలఁగ వారి కన్నుఁగవఁ ◊గ్రమ్మఁ దనూస్థలి తాపభోగిచేఁ
గనలఁగ వాడుచు న్నెమకెఁ ◊గాంతునిఁ గాననమండలంబునన్. 96
టీక: ఇందు జక్కవపరమైన యర్థము, నలచక్రవర్తిపరమైన యర్థము గలుగుచున్నవి. ఘనకమలోదయంబు – ఘన=అధిక మగు, కమల=పద్మములయొక్క, లక్ష్మియొక్కయని యర్థాంతరము, ఉదయంబు=ఆవిర్భావము; కాలగతిన్=సంధ్యా వశముచేత; కాల=కలిజన్యమైన,గతిన్=దశావిశేషముచేత నని యర్థాంతరము;ఎడయన్=పాయఁగా;వనము=నీటిని, అడవిని; అందుచున్ = పొందుచు; రథాంగనలగవాధినేత =చక్రవాక మనెడు నలరాజు; చనఁగాన్=పోఁగా; కడున్=మిక్కిలి; తత్సతి= దానిపెంటి, దమయంతి యని యర్థాంతరము; ఆత్మన్=చిత్తమందు; చింత =ఆధ్యానము; పొంగన్=మించఁగా; నలఁగన్ = నలఁతనొందఁ గా; కన్నుఁగవన్=కనుదోయియందు; వారి =అశ్రులు; క్రమ్మన్=పైకుబుకఁగా; తనూస్థలి=దేహప్రదేశము; తాప భోగిచేన్ = సర్పమువంటి సంతాపముచేత; కనలఁగన్=మండుచుండఁగా; వాడుచున్=మ్లానమగుచు; కాననమండలంబునన్ =అరణ్యప్రదేశమునందు; కాంతునిన్=భర్తను; నెమకెన్=వెదకెను. నలార్థమందు, తనూస్థలి, తాపభోగిచేన్=సంతాపకరమగు సర్పముచేత, కనలఁగన్=మండఁగా, వాడుచున్=మ్లానుఁ డగుచు, నలగవాధినేత సనఁగ నని యోజింపవలెను. కానిచో దమ యంతియందుఁ దాపభోగిచేఁ గనలుట సంభవింపక యసంగత మగును.
ఉ. మక్కువ సారసాకరస◊మాజము చేరుచుఁ బట్టఁబూనుఁ బో
జక్కవనాతి మానితని◊జప్రతిబింబము గాంచి భర్తయం
చక్కట పిల్చుఁబో పతి వ◊నావళి కుంజచయంబు దూఱుచున్
జక్కవనాతి మానితత◊సమ్మదసంపద లెల్ల నత్తఱిన్. 97
టీక: జక్కవనాతి =చక్రవాకస్త్రీ; మక్కువన్=ప్రేమచేత; సారసాకరసమాజము=పద్మాకరసమూహము; చేరుచున్=పొందుచు; చక్కన్=బాగుగా; వనాతిమానితనిజప్రతిబింబము – వన=జలమందు, అతిమానిత=మిక్కిలి యొప్పుచున్న,నిజప్రతిబింబము = తనప్రతిబింబమును; కాంచి = చూచి;భర్తయంచున్=తనప్రియుఁ డనుచు; పట్టన్=పట్టుకొనుటకు; పూనుఁబో = యత్నించు జుమీ; అక్కట=ఖేదము (అయ్యో!); వనావళిన్=అరణ్యపంక్తియందు; కుంజచయంబు =పొదరిండ్లగుంపును;తూఱుచున్ = చొచ్చుచు; తతసమ్మదసంపద లెల్లన్—తత=విస్తృతములగు, సమ్మదసంపద లెల్లన్=సంతోషసమృద్ధులన్నింటిని; అత్తఱిన్ = అపుడు; మాని=త్యజించి; పతిన్=ప్రియుని; పిల్చుఁబో=ఆహ్వానము చేయును జుమా!
సూర్యాస్తానంతరమునఁ జక్రవాకస్త్రీ కాసారములచెంతకుఁ బోయి తన ప్రతిబింబమును జూచి భర్తయను తలంపునఁ బట్టఁ బూను ననియు, అరణ్యప్రదేశములయందు పొదలు దూఱుచు సంతోషమును మాని పతిని బిల్చుచుండు ననియు భావము.
సీ. చక్రభయాపాది◊సమయఘనాఘనా,లిసుతనూవ్యక్తమా◊లిన్య మనఁగ,
పరినటచ్ఛివకటీ◊భ్రష్టఘనాఘనా,త్మకదానవాజినాం◊శుక మనంగ,
ద్యుమణిరథాంగహ◊త్యుత్థఘనఘనా,శ్మమయాస్తగిరినితం◊బరజ మనఁగ,
నిశ్శేషబంధకీ◊నికరఘనాఘనా,శ రతీశసృష్టశాం◊బరిక యనఁగఁ,
తే. బ్రకటదివసాత్యయాఖ్యన◊భస్యకాల,కలితసాంద్రఘనాఘన◊కళిక యనఁగ,
నౌర యతినీలదీప్తిజా◊లానుపూర్తి, నమరె నవ్వేళ నిర్వేల◊తిమిరరాశి. 98
టీక: చక్రభయాపాది సమయ ఘనాఘనాలి సుతనూ వ్యక్త మాలిన్యము – చక్ర=చక్రవాక మనెడు రాష్ట్రమునకు, భయాపాది = భయసంపాదకమైన, సమయ=సంధ్యాకాల మనెడు, ఘనాఘనాలి=ఘాతుకపంక్తియొక్క, సుతనూ=దేహములయందు, వ్యక్త=బయలుపడిన, మాలిన్యము =మలినత; అనఁగన్ = అనునట్లుగా; పరినట చ్ఛివకటీ భ్రష్టఘనాఘనాత్మకదాన వాజినాంశుకము – పరినటత్=మిక్కిలి నటించుచున్న, శివ=ఈశ్వరునియొక్క, కటీ = కటిప్రదేశమువలన, భ్రష్ట=జాఱిన, ఘనాఘనాత్మకదానవ=గజాసురునియొక్క, అజిన=చర్మ మనెడు, అంశుకము= వస్త్రము; అనంగన్ = అనునట్లుగా; శివుఁడు ప్రదోషసమయమునఁ దాండవము సల్పుట ప్రసిద్ధము. ద్యుమణి రథాంగ హత్యుత్థ ఘనఘనాశ్మమ యాస్తగిరినితంబ రజము – ద్యుమణి=సూర్యునియొక్క, రథాంగ=రథచక్ర ములచే నైన, హతి=కొట్టుటచేత, ఉత్థ=పుట్టిన, ఇది రజమునకు విశేషణము, ఘనఘనాశ్మమయ=మిగుల గొప్పనైన పాషాణ ములచేత ప్రచురమగు, అస్తగిరినితంబ=అస్తాచలకటకముయొక్క, నితంబ మనఁగా పర్వతముపై చదునుగానుండు ప్రదేశము, ‘కటకో స్త్రీ నితమ్బోద్రేః’ అని యమరుఁడు, రజము =ధూళి; అనఁగన్ = అనునట్లుగా; నిశ్శేషబంధకీ నికర ఘనాఘ నాశ రతీశసృష్ట శాంబరిక అనఁగన్ – నిశ్శేషబంధకీ=అశేషజారిణులయొక్క, నికర=సమూ హముయొక్క, ఘన=అధికమైన, అఘ=పాపముయొక్క, నాశ=నాశముకొఱకు, రతీశసృష్ట=మరునిచే సృజింపఁబడిన, శాంబరిక =మాయ; అనఁగన్ =అనునట్లుగా;ప్రకట దివసాత్యయాఖ్య నభస్యకాల కలిత సాంద్ర ఘనాఘన కళిక – ప్రకట=వ్యక్తమైన, దివసాత్యయాఖ్య=దివసావసానమను పేరు గల, నభస్యకాల=భాద్రపదసమయమందు, వర్షర్తుసమయమం దనుట, కలిత=ఒప్పుచున్న, సాంద్ర=దట్టములగు, ఘనాఘన=వర్షుకాబ్దములయొక్క, కళిక=కాంతి; అనఁగన్ = అనునట్లుగా, ‘ఘనాఘనో ఘాతుకమత్తదన్తినోః నిరన్తరే దానవ వర్షుకాబ్దయోః’ అని విశ్వము; అవ్వేళన్=ఆసమయమునందు; నిర్వేలతిమిరరాశి =అడ్డము లేని చీఁకటిగుంపు; అతినీలదీప్తిజాలానుపూర్తిన్ = మిక్కిలినల్ల నగు కాంతిజాలముయొక్క పరిపూర్ణతచేత; అమరెన్=ఒప్పెను; ఔర=ఆశ్చర్యము!
అనఁగా నప్పుడు చీఁకటులగుంపు చక్రములకు భయముగలిగించునట్టి సంధ్యాకాలమనెడు ఘాతుకసమూహముయొక్క దేహనైల్యమో అనునట్లును, శివుఁడు ప్రదోషసమయమునఁ దాండవము సేయఁగా జాఱిన యతని గజచర్మోత్తరీయమో యను నట్లును, సూర్యరథచక్రంబుల తాఁకుడుచే నస్తాద్రిశిలలు పొడియై రేఁగిన ధూళిపుంజమో యనునట్లును, జారిణుల పాపము పాయుటకై మన్మథుఁడు కల్పించిన మాయయో యనునట్లును, సాయంకాల మనెడు వర్షాకాలమందుఁ దోఁచు మేఘశ్రేణియో యనునట్లును, వెలసె నని తాత్పర్యము.
చ. ఇనుఁ డతిదూరదేశమున ◊కేగఁ దదాగమనంబుఁ గోరి పా
వనజలతాళితాంగపరి◊వారితపంకనికాయయై తమిన్
వనజలతాళి గప్పుఁగలు◊వన్ మధుసూదని నావహించి స
ద్వనజలతాళిగాత్రి కథ ◊వల్కఁగ మోడ్చెఁ బయోజహస్తముల్. 99
టీక: వనజలతాళి=తామరతీవలగుంపు, స్త్రీత్వనిర్దేశమున నొకస్త్రీ యని తోఁచుచున్నది; ఇనుఁడు=సూర్యుం డనెడు భర్త; అతి దూరదేశమునకున్ = మిగుల దూరదేశమునకు; ఏగన్=పోఁగా; తదాగమనంబున్ = ఆ యినునియొక్క రాకను; కోరి = ఇచ్ఛించి; పావన జల తాళితాంగపరివారిత పంకనికాయయై – పావన=పవిత్రమగు, జల=నీటిచేత, తాళిత=తాడిత= కొట్టఁ బడినదై, ఇది పంకమునకు విశేషణము. లడల కభేదమును బట్టి తాళి తాడిత యను యర్థములో వాడఁబడినది, అంగపరివారిత = శరీరమునకుఁ బరివారమువలె నావరించుచున్న, పంకనికాయయై = కర్దమచయ మనెడుపాపసంఘము గలదై; తమిన్ = రాత్రియందు, ఆసక్తిచేత, శ్లిష్టరూపకము; కప్పుఁగలువన్=నల్లకలువయందు; మధుసూదనిన్=లక్ష్మీదేవిని; ఆవహించి = ఆవాహనము చేసి; సద్వనజలతాళిగాత్రి – సత్=శ్రేష్ఠమైన, వనజలతా=వనమందుఁ బుట్టిన లతలయందలి, అళిగాత్రి =భృంగ మను గాయకురాలు; కథ పల్కఁగన్=కథఁ జెప్పఁగా; పయోజహస్తముల్=కమలము లనెడు హస్తములను, పయోజముల వంటి హస్తము లని ప్రోషితపతికాపరమైన యర్థము; మోడ్చెన్=ముకుళించెను.
అనఁగాఁ బ్రోషితభర్తృక దేశాంతరమున నుండు తనభర్తరాకను గోరి పుణ్యతీర్థస్నానముచే గతకల్మషయై, యాసక్తిచేత నొకపద్మమందు లక్ష్మీదేవి నావహించి పూజించి, యొక పుణ్యాంగన కథ చెప్పుచుండఁగాఁ గేలు మోడ్చియుండునట్లు తామర తీవ సూర్యుఁ డస్తమింపఁగా నిర్మలజలముచేఁ గర్దమచయము పోఁగొట్టికొనినదై, రాత్రియందు నల్లగలువయందు శ్రీ నావహించి, తుమ్మెదలు పాడుచుండఁగా పద్మములనెడు హస్తముల మోడ్చె ననుట. సూర్యుఁ డస్తమించినపిదపఁ గమలములు ముకుళించె ననియు, కలువలు సిరి యొప్పార రాజిల్లె ననియు, వానిచెంగట తుమ్మెదలు మ్రోయుచుండె ననియు ఫలితార్థము.
సీ. నటదీశమౌళి ది◊ఙ్నారులు చల్లు మం,గళసితాక్షతజాల◊కంబు లనఁగ,
నచలావపతనవే◊ళాభ్రలగ్నతమఃక,దంబాపగాజాల◊కంబు లనఁగ,
వనరాశి రవి మాధ◊వతఁ దోఁప నంబరా,గమునఁ బొల్చినజాల◊కంబు లనఁగఁ,
దఱి రా శుభము వేల్పు◊తెఱవచాల్ గన నాక,ఘనకుడ్యకృతజాల◊కంబు లనఁగ,
తే. గురుసరశ్శ్రేణిరాజీవ◊కులము నడఁచి, యంబరస్థలి నాఱ ది◊ష్టాఖ్య మైని
కతతి పఱచిన వరజాల◊కంబు లనఁగఁ, జొక్క మగు మింటఁ గనుపట్టె ◊ రిక్క లపుడు. 100
టీక: నటదీశమౌళిన్– నటత్=నటించుచున్న,ఈశ=శివునియొక్క, మౌళిన్=శిరస్సునందు; దిఙ్నారులు=దిక్కులనెడుస్త్రీలు; చల్లు మంగళ సితాక్షత జాలకంబులు – చల్లు=చల్లునట్టి, మంగళ=శుభకరములైన, సితాక్షత=తెల్లని యక్షతలయొక్క, జాల కంబులు=సంఘములు; అనఁగన్=అనునట్లుగా; అచలావపతనవేళాభ్ర లగ్నతమఃకదంబాపగా జాలకంబులు – అచలా=భూమియందు, అవపతనవేళా=పడుటయొక్క సమయమందు, అభ్ర=ఆకసమునందు, లగ్న=సంబంధించిన, తమఃకదంబాపగా=తిమిరసంఘ మనెడు నదియొక్క, జాలకంబులు = బిందువులు; అనఁగన్=అనునట్లుగా; వనరాశిన్=సముద్రమను నరణ్యకదంబమందు, రవి=సూర్యుఁడు, మాధవతన్=విష్ణుత్వ మనెడు వసంతభావముచే, సంధ్య యందు సూర్యుఁడు విష్ణురూపు డనుట యాగమప్రసిద్ధము; తోఁపన్=తోఁపఁగా; అంబరాగమునన్ = అంతరిక్షమనెడు వృక్ష మందు; పొల్చిన=ఉదయించిన, జాలకంబులు =మొగ్గలు; అనఁగన్=అనునట్లుగా; తఱి =సంధ్యాసమయము; రాన్=రాఁగా; వేల్పుతెఱవచాల్=దేవతాస్త్రీసంఘము; శుభము =రాఁబోవు శుభమును; కనన్ = చూచుటకు; నాక ఘనకుడ్య కృత జాలకంబులు – నాక=అంతరిక్షమనెడు, ఘనకుడ్య=గొప్పగోడయందు, కృత=చేయఁ బడిన, జాలకంబులు=గవాక్షములు; అనఁగన్=అనునట్లుగా; గురుసరశ్శ్రేణిన్=గొప్పలగు కాసారముల సంఘమందు; రాజీవకులమున్=పద్మసమూహమను చేపలగుంపును; అడఁచి= అడఁగించి; అంబరస్థలిన్=ఆకాశప్రదేశమందు; ఆఱన్=తడి యాఱుటకు; దిష్టాఖ్య మైనికతతి = కాలమను పేరుగల మత్స్య ఘాతుకులయొక్కగుంపు, మీనశబ్దముపై ‘పక్షిమత్స్యమృగా న్హన్తి’ అను సూత్రముచే ఠక్ప్రత్యయము వచ్చి మైనిక శబ్దమైనది; పఱచిన వరజాలకంబులు= పఱచినట్టి మేలైన వలలు; అనఁగన్=అనునట్లుగా; అపుడు=ఆసమయమున;చొక్కమగు మింటన్ = నిర్మలమగు నాకాశమునందు; రిక్కలు=నక్షత్రములు; కనుపట్టెన్=చూపట్టెను. అనఁగా నపుడు నక్షత్రము లుదయించినవై, సంధ్యాకాలమున నాట్యము సేయుచుండు శివునిశిరమున దిగంగనలు చల్లిన తెల్లనియక్షత లనునట్లును, అంధకారమనెడు నది యాకసమునుండి దిగువఁ బడునపుడు గగనలగ్నములగు జలబిందువు లనునట్లును, వనరాశియందు సూర్యుఁడను వసం తుఁడు తోఁపఁగా గగన మను వృక్షమందుఁ బుట్టిన మొగ్గ లనునట్లును, దేవాం గనలు సంధ్యాసమయము రాఁగాఁ గలిగెడు శుభ మును గన్గొనుటకు గగన మనుకుడ్యమందుఁ జేయఁబడిన గవాక్షము లను నట్లును, సంధ్యాకాల మనెడు మీనఘాతుకతతి సర స్సులయందు రాజీవము లనెడు మత్స్యములఁ బట్టి గగనమం దాఱవేసినవల యన్నట్లును భాసిల్లె నని భావము.
మ. శరజద్వేషి నిశావధూటివరణే◊చ్ఛన్ రాఁగ మున్మున్నె బల్
త్వరఁ గాలోపధికారు లూనునవచం◊ద్రజ్యోతిరాళీలస
త్పరివర్ణ్యస్వకవర్ణనిర్ణిహతచం◊ద్రజ్యోతిరాళీలస
ద్గరిమం బెంపయి దోఁచెఁ బ్రాచి నవదా◊తత్విట్కులం బయ్యెడన్. 101
టీక: శరజద్వేషి=పద్మవిరోధి యగు చంద్రుఁడు; నిశావధూటివరణేచ్ఛన్=రాత్రియను స్త్రీని వరించు కోర్కెచే; రాఁగన్=వచ్చు చుండఁగా; మున్మున్నె=ముందుముందే; బల్ త్వరన్=అతివేగముచేత; కాలోపధికారులు = కాలమనెడు నెపముగల శిల్పులు; ఊను నవ చంద్రజ్యోతిరాళీ లస త్పరివర్ణ్య స్వక వర్ణ నిర్ణిహత చంద్రజ్యోతిరాళీ లస ద్గరిమన్ – ఊను=వహించునట్టి, నవ= నూతనములైన, చంద్రజ్యోతిః=కర్పూరదీపములయొక్క, ‘ఘనసార శ్చంద్రసంజ్ఞః’ అని యమరుఁడు, ఆళీ=పంక్తులవలె, లసత్ = ప్రకాశించుచున్న, పరివర్ణ్య=వర్ణింపఁదగిన, స్వక=స్వకీయమైన, వర్ణ=కాంతిచేత, నిర్ణిహత=అఖండితమైన, చంద్ర జ్యోతిరాళీ= పగలువత్తులపంక్తులయొక్క, లసత్=ఒప్పుచున్న, గరిమన్=అతిశయముచేత; అవదాతత్విట్కులంబు=శుభ్ర కాంతిపుంజము; అయ్యెడన్=అపుడు; ప్రాచిన్=తూర్పున; పెంపయి=అధికమై; తోఁచెన్=అగపడెను.
అనఁగా చంద్రు డనునాయకుఁడు నిశ యను స్త్రీని వరింప వచ్చుచుండఁగా, ముందుముందే శిల్పకారులు పట్టినపగలు వత్తులవలెఁ దూర్పునఁ దెల్లనికాంతిపుంజము దోఁచె ననుట. తూర్పునఁ జంద్రకిరణపుంజము గనిపించె నని ఫలితార్థము.
సీ. గగనబాలుం డూర్ధ్వ◊గతరశ్మి దివియఁ బైఁ,జక్కఁ జేర్చుపసిండి◊చక్ర మనఁగఁ,
బాంథభీకరలీలఁ ◊బ్రబలునిశాభూత,సతి గొన్న యాలాత◊చక్ర మనఁగ,
చీఁకటిపొలదిండి◊మూఁక గూల్పఁగఁ గాల,శౌరి చే నెత్తిన◊చక్ర మనఁగ,
నినుఁడు వోయినదారిఁ ◊గనఁ బూర్వగిరిశిఖా,స్థల మెక్కి నిల్చిన◊చక్ర మనఁగఁ,
తే. బ్రాచి తెలిచాయ యనుమంచు ◊ప్రబల భాస్వ,దంశుకవిహీన గానఁ దా◊నందు కోర్వఁ
జాల కూన్చిననవకీలి◊చక్ర మనఁగ, నపుడు దొలికెంపుతో సార◊సారి వొలిచె. 102
టీక: గగనబాలుండు=ఆకసమను చిన్నవాఁడు; ఊర్ధ్వగతరశ్మిన్ – ఊర్ధ్వగత=ఉపరిగతమగు,రశ్మిన్ =కిరణమను త్రాటిని; తివియన్=ఆకర్షించుటకు; పైన్=ఉపరిభాగమందు; చక్కన్ =బాగుగా; చేర్చుపసిండిచక్రము=చేర్చునట్టి బంగరుచక్రము; అనఁగన్ = అనునట్లుగా; పాంథభీకరలీలన్=పథికులకు భయము గొల్పు క్రియచేత; ప్రబలునిశాభూతసతి = ప్రబలుచున్నరాత్రియనెడు పిశాచాంగన; కొన్న యాలాతచక్రము – కొన్న=కొనినట్టి, ఆలాత=కొఱవిసంబంధియైన, చక్రము=భ్రమణము; అనఁగన్ = అనునట్లుగా;
చీఁకటిపొలదిండిమూఁకన్=అంధకారమనెడు రాక్షసులగుంపును; కూల్పఁగన్=కూల్చుటకు; కాలశౌరి=కాలమనెడు విష్ణు మూర్తి; చేన్=హస్తముచేత; ఎత్తినచక్రము=పైకెత్తిన చక్రాయుధము; అనఁగన్ = అనునట్లుగా; ఇనుఁడు=సూర్యుఁడు; పోయినదారిన్=పోయినట్టి మార్గమును; కనన్=చూచుటకు; పూర్వగిరిశిఖాస్థలము=ఉదయపర్వ తాగ్రప్రదేశమును; ఎక్కి=అధిష్ఠించి; నిల్చిన=నిలిచియుండిన; చక్రము=చక్రవాకము; అనఁగన్ = అనునట్లుగా; ప్రాచి=తూర్పుదిక్కనెడు స్త్రీ; తెలిచాయ యనుమంచు = తెల్లనికాంతి యనెడు హిమము; ప్రబలన్=సమృద్ధము కాఁగా; భాస్వ దంశుకవిహీన – భాస్వదంశుక=సూర్యకిరణములనెడు ప్రకాశించుచున్న వస్త్రముచేత, విహీన=హీనురాలు (లేనిది); కానన్= అగుటచేత; తాను; అందుకున్=ఆహిమమునకు; ఓర్వఁజాలక=సహింపఁజాలక; ఊన్చిన నవకీలిచక్రము= పూన్చినట్టి క్రొత్త నైన అగ్నిసమూహము; అనఁగన్ = అనునట్లుగా; అపుడు=ఆసమయమందు; సారసారి=పద్మవైరియైన చంద్రుఁడు; తొలి కెంపుతోన్ = తొలుతటియారుణ్యముతోడ; పొలిచెన్=ఉదయించెను.
అనఁగాఁ జంద్రబింబము, గగన మను బాలుఁ డుపరిగతమైన కిరణమను త్రాటి నాకర్షింపఁ జేర్చిన సువర్ణచక్రమును బోలియు, నిశ యను పిశాచాంగన పాంథులు భీతిల్లునట్లు త్రిప్పుచున్న కొఱవిని బోలియు, కాలమనెడు విష్ణుమూర్తి చీఁకటి యను రాక్షసులగుంపును సంహరింపఁ బైకెత్తిన చక్రాయుధమును బోలియు, సూర్యుఁడు పోయినదారిని గన నుదయగిరిశిఖ రము నెక్కిన చక్రవాకమును బోలియు, తెలిచాయ యనెడు మంచు ప్రబలఁగా భాస్వదంశుకవిహీనయగు ప్రాగ్దిగంగన దాని కోర్వఁజాలక పెట్టిన మంటను బోలియు, ప్రాథమికమైన యరుణకాంతితోఁ గూడి యుదయించె ననుట. చంద్రోదయ మయ్యె నని ఫలితార్థము. ‘శ్లో. ప్రథమ మరుణచ్ఛాయ స్తావ త్తతః కనకప్రభ స్తదను విరహోత్తామ్యత్తన్వీకపోలతలద్యుతిః, ఉదయతి తతో ధ్వాంతధ్వంసక్షమః క్షణదాముఖే సరసబిసినీకందచ్ఛేదచ్ఛవి ర్మృగలాఞ్ఛనః’ ఇత్యాదికవివ్యవహారములచే నుదయ కాల మందుఁ జంద్రున కారుణ్యముండు నని తెలియవలయు.
చ. ఒనరఁగ రాజ వయ్యు నిర ◊నుంచితి తమ్ముల సాధుచక్రమో
దనహృదయంబు నంది తని ◊దార్కొన దుస్తరచింతనాధునిం
దనహృదయంబు నందితని◊తాంతబుధాత్మకలాకుఁ డాసుధా
జని కడు వెల్లఁబాఱె నను◊చాడ్పునఁ బాండిమ నొప్పె నయ్యెడన్. 103
టీక: నందితనితాంతబుధాత్మకలాకుఁడు – నందిత=సంతోషపెట్టఁబడిన, నితాంత=గాఢమైన, బుధాత్మ=దేవతలచిత్తము గల, కలాకుఁడు=కళలుగలవాఁడు, సంతోషపెట్టఁబడిన విద్వాంసులచిత్తములు గల విద్యలు గలవాఁడని యర్థాంతరము దోఁచును; ఆసుధాజని = ఆచంద్రుఁడు; ఒనరఁగన్=ఒప్పునట్లు; రాజ వయ్యున్=ప్రభువ వయ్యును, రాజనామము గలవాఁడ వయ్యును నని యర్థాంతరము; ఇరన్=జలమందు; తమ్ములన్=సోదరులను, పద్మములను; ఉంచితి=అడంచితివి; సాధుచక్రమోదన హృదయంబున్ – సాధుచక్ర=సత్పురుషులసంఘముయొక్క, మంచిచక్రవాకములయొక్క, మోదన=సంతసమును, హృత్= హరించెడు, అయంబున్=శుభావహవిధిని; అందితి=పొందితివి; అని=అని తలఁచి – ఇచటఁ జంద్రుఁడు తన్నుఁదాను సంబో ధించుకొనుచుఁ బలికెనని గ్రహింపవలయు; తనహృదయంబు =తనచిత్తము; దుస్తరచింతనాధునిన్=తరింపరానిచింతయనెడు నదిని; తార్కొనన్=ప్రవేశింపఁగా; కడున్=మిక్కిలి; వెల్లఁబాఱె ననుచాడ్పునన్ = వైవర్ణ్యమొందె నను రీతిచేత; పాండిమన్ = శుభ్రత్వముచేత; అయ్యెడన్=అప్పుడు; ఒప్పెన్=ఒప్పెను.
ఒకప్రాజ్ఞుఁ డైనవాఁడు తాను రా జయ్యును దనసహోదరులను, సత్పురుషసంఘమోదమును హరించి వెనుక నాచింతచే సంతప్తహృదయుఁడై వెలవెలఁబాఱునట్లు కళానిధి యైనచంద్రుఁడు తాను రాజశబ్దమును బొందియుఁ, దమ్ముల నొంచుటను, సాధుచక్రమోదమును హరించుటను దలఁచి చింతాక్రాంతుఁడై వెలవెలఁబాఱెనా యనునట్లు పాండిమ నొందె ననుట. చంద్రుఁ డుద యించి ధావళ్యము నొందె ననియు, పద్మములు ముకుళించె ననియుఁ జక్రవాకములకు సంతోషము దొఱంగె ననియు ఫలితా ర్థము. ఉత్ప్రేక్షాలంకారము.
మ. మునుమున్ చంద్రఘటిన్ భరించి యమృత◊మ్ముల్ నించె వేళా ప్రపా
వనశాలాక్షి తిరోహితాన్యహితభావ◊శ్రీ మరుత్త్వద్దిశా
వనశాలాక్షి తిరోహితాంశుసురభి◊వ్యాపారముల్ దూల నూ
తనసంధ్యాతపశక్తి డప్పిగొను జ్యో◊త్స్నాపాయిపాంథాళికిన్. 104
టీక: వేళా ప్రపావనశాలాక్షి – వేళా=సమయమనెడు, ప్రపా=చలిపందిరియొక్క, అవన=రక్షించెడు, శాలాక్షి =మీననేత్ర, ‘రోహితో మద్గుర శ్శాలో రాజీవ శ్శకుల స్తిమిః’ అని యమరుఁడు; తిరోహితాన్యహితభావశ్రీన్ – తిరోహితాన్య= అతిరోహిత మైన, అనఁగాఁ దిరోహితము కానట్టి, అనఁగా ప్రత్యక్షమైన, హితభావ=ఆప్తత్వముయొక్క, శ్రీన్=సంపదచేత; మరుత్త్వద్దిశా వనశాలాక్షి – మరుత్త్వద్దిశా=తూర్పుదిక్కనెడు, ‘ఇన్ద్రో మరుత్వాన్ మఘవః’ అని యమరుఁడు, మరుత్త్వద్దిశ యనఁగా ఇంద్రుఁడు అధిపతిగాఁ గల దిశ -తూర్పుదిశ, వనశాలాక్షితిన్=అటవీగృహప్రదేశమునందు; రోహితాంశుసురభివ్యాపారముల్ – రోహితాంశు=సూర్యుఁ డనెడు, సురభి=వసంతముయొక్క, వ్యాపారముల్=క్రియలు;తూలన్=నశింపఁగా; నూతనసంధ్యా తపశక్తిన్ – నూతన=క్రొత్త దైన, సంధ్యా=సంధ్యాకాల మనెడు, తప=గ్రీష్మర్తువుయొక్క, శక్తిన్=సామర్థ్యముచేత; డప్పి గొను జ్యోత్స్నాపాయిపాంథాళికిన్ – డప్పిగొను=తృష్ణగొను, జ్యోత్స్నాపాయి=వెన్నెలపుల్గులనెడు, పాంథాళికిన్=బాటసారుల గుంపునకు; మునుమున్= ముందుముందుగనె; చంద్రఘటిన్=చంద్రుఁడనెడు ఘటమును; భరించి=పోషించి; అమృతమ్ముల్= సుధ యనెడు జలములను; నించెన్ =పూరించెను.
అనఁగా వేళ యనెడు ప్రపాపాలిక సూర్యుఁడను వసంత ముడిఁగిపోఁగా సంధ్యయను గ్రీష్మర్తువున తూర్పుదిక్కనెడు వనశాలాప్రదేశమునందు తృష్ణనొందిన చకోరము లనుపాంథగణముకొఱకు ముందుగనే చంద్రుఁడను ఘటమం దమృత మను జలమును నించి యుంచె ననుట. అనఁగా ప్రాగ్దిగంగన చకోరములకై నించి యుంచిన యమృతఘటమువలెఁ జంద్రుఁడు రాజిల్లె నని భావము.
మ. తనరెన్ వెన్నెల దిష్టవిష్ణుకృప స◊ద్బాలోదయాసక్తమై
తనయాశాబలమెల్లఁ జేకుఱ శశి◊స్థాలి న్మనోజ్ఞాదితీ
తనయాశాబల మెల్లమెల్లనె ముదా◊త్మం బొంగలి న్బెట్టఁ జా
ల నవీనోదయరాగకీలధరకీ◊లం బొంగుదుగ్ధాళి నాన్. 105
టీక: మనోజ్ఞాదితీతనయాశాబల – మనోజ్ఞ=హృద్యమైన, అదితీతనయ=ఇంద్రునియొక్క, ఆశా=దిక్కనెడు, అబల=స్త్రీ; దిష్టవిష్ణుకృపన్=కాల మనెడు విష్ణుమూర్తియొక్క దయచేత; సద్బాలోదయాసక్తమై – సద్బాల=చుక్కలనెడు శ్రేష్ఠమగు శిశువులయొక్క, ఉదయ=ఆవిర్భావమందు, ఆసక్తమై=ఆసక్తికలదై; తనయాశాబలము=తనకోరికయొక్క సామర్థ్యము; ఎల్లన్=అంతయు; చేకుఱన్=సిద్ధింపఁగా; శశిస్థాలిన్=చంద్రుఁడను పాత్రయందు; మెల్లమెల్లనె = తిన్నతిన్నగా; ముదాత్మన్ = సంతోషించిన మనస్సుచేత; పొంగలిన్=పొంగలిని; పెట్టన్=పెట్టఁగా; నవీనోదయరాగకీలధరకీలన్ – నవీన=నూతన మైన, ఉదయరాగ=చంద్రోదయకాలికారుణ్యమనెడు, కీలధర=అగ్నియొక్క, కీలన్=జ్వాలచేత; చాలన్=మిక్కిలి; పొంగు దుగ్ధాళి నాన్ = ఉప్పొంగు క్షీరపరంపరయో యనుట్లుగా; వెన్నెల=చంద్రిక; తనరెన్=ఒప్పెను.
అనఁగా తూర్పుదిక్కనెడు స్త్రీ కాలమనెడు విష్ణువుయొక్క ప్రసాదముచే సత్సంతానమును గోరి చుక్కలనెడు శిశువులు గలిగి, తనయిష్టము ఫలించె నని చంద్రుఁడను పాత్రయందు పొంగలి పెట్టఁగా నుదయరాగమనెడు నగ్నిజ్వాలచే పొంగలి వెలిఁ బరవిన క్షీరపూరమువలె వెన్నెల విలసిల్లె ననుట. రూపకసంకీర్ణోత్ప్రేక్షాలంకారము.
సీ. మలినాన్యశిఖిహరి◊న్నలినాంచితాక్షీజ,ఘనసారసనహీర◊కాంతి నెగడి,
సుకరాశరాశాసి◊తకరాననోరోజ, ఘనసారహారయో◊గము భజించి,
వరవాయుకకుబంబు◊ధరవాలికావక్త్ర, ఘనసారతిలకస◊ఖ్యము వహించి,
యతికాంతశివదిశా◊లతికాతనూవేణి, ఘనసారసుమపాళి ◊గౌఁగిలించి,
తే. మేదినీదేశపాటలా◊మోదినీభృ,తాతిఘనసారసావతం◊సాభఁ బెంచి
యపుడు పొడసూపెఁ బథికభ◊యప్రదసుమ,హాదినేంద్రాతపంబు చం◊ద్రాతపంబు. 106
టీక: మలినాన్య శిఖిహరి న్నలినాంచితాక్షీ జఘనసారసన హీరకాంతిన్—మలినాన్య= నిర్మలమగు, ఇది హీరకాంతికి విశేష ణము, శిఖిహరిత్=అగ్నిదిక్కనెడు, నలినాంచితాక్షీ= స్త్రీయొక్క, జఘన=కటిప్రదేశమందలి, సారసన=మొలనూలియొక్క, హీర=వజ్రములయొక్క, కాంతిన్=ప్రభచేత; నెగడి=వృద్ధిఁబొంది; సుకరాశరాశా సితకరాననోరోజ ఘనసార హార యోగమున్ – సుకర=మంచిప్రకాశము గల, ఇది హారమునకు విశేషణము, ఆశరాశా=నిరృతిదిశ యనెడు, సితకరాననా= స్త్రీయొక్క, ఉరోజఘన=తాళపుచిప్పలవంటి స్తనములయందలి, ‘కాంస్యం తాలాదికం ఘనమ్’ అని యమరుఁడు, సార=బలిష్ఠములగు, హార=ముత్యంపుపేరులయొక్క, ‘హారో ముక్తావళీ’యని నామ లిఙ్గానుశాసనము, యోగము=సంబంధమును, భజించి=పొంది; వర వాయుకకుబంబుధరవాలికావక్త్ర ఘనసారతిలక సఖ్యమున్ – వర=శ్రేష్ఠమైన, వాయుకకుప్= వాయువుదిక్కనెడు, అంబు ధరవాలికా = మేఘమునుబోలు కచములుగల స్త్రీయొక్క, వక్త్ర=ముఖమందలి, ఘనసారతిలక = కర్పూరతిలకముతోడి, సఖ్యమున్=మైత్రిని; వహించి=తాల్చి; అతికాంత శివదిశా లతికాతనూ వేణిఘన సార సుమపాళి – అతికాంత=మిగుల మనోజ్ఞమైన, శివదిశా=ఈశానదిక్కనెడు, లతికాతనూ= స్త్రీయొక్క, వేణిఘన=మేఘమును బోలు జడయందలి, సార=శ్రేష్ఠములగు, సుమపాళి=కుసుమచయమును; కౌఁగిలించి=ఆలింగనముఁజేసి; మేదినీదేశ పాటలామోదినీ భృతాతిఘన సారసావతంసాభన్ – మేదినీదేశ =భూస్థలియనెడు, పాటలామోదినీ=స్త్రీచేత, భృత =భరింపఁబడిన, అతిఘన=మిగుల నధికమగు, సారసావతంస=కుముదరూపమైన కర్ణాభరణముయొక్క, ఆభన్=కాంతిని; పెంచి=వృద్ధినొందించి; పథిక భయప్రద సుమహాదినేంద్రాతపంబు – పథిక=తెరువరులకు, విరహుల కనుట, భయప్రద=భయము గొల్పెడు, సుమ హత్ = అత్యధికమగు, దినేంద్రాతపంబు=సూర్యాతపరూపమైన; చంద్రాతపంబు =వెన్నెల; అపుడు; పొడసూపెన్=పొల్చెను.
అగ్నిదిగంగనాజఘన సారసనహీరకాంతిచేఁ బోషింపఁబడి, నిరృతిదిగంగనాస్తనతటమందలి ముక్తాహారముతోఁ గలసి, వాయవ్యదిగ్వనితయొక్క ముఖమందలి కర్పూరతిలకముతో మైత్రినొంది, యీశాన్యదిశాకాంత తుఱుమునం దుఱిమినట్టి పుష్పములను గౌఁగిటఁ జేర్చి, భూమి యనెడు స్త్రీచేత భరింపఁబడిన సారసావతంసంబులం బోషించి, విరహులకు మహాత పమువలె భయము గలిగించుచు, వెన్నెల విలసిల్లె నని భావము. వెన్నెల సర్వదిక్కులు వ్యాపించి విలసిల్లె నని ఫలితము.
వ. వెండియు నాపండువెన్నెలదండం బఖండకాండజారిమండల మాయామౌక్తికమయ భద్రాసన సమా సీన నీలాంక లంకావరా హితపట్టాభిషేచనావరసమయ మహర్షిరాజాభిషిక్త గంగాదిపుణ్యతరంగిణీవిశద జలప్రవాహంబులపోలికం బ్రవహించుచు, నస్తాచలసంగతాహిమాంశుకిరణకూటతృణాంకురనికరంబుల నన్నింటి మేసి దర్పించి రథాంగజనంబులకు వైకల్యంబు చేకూర్చి సముజ్జృంభమాణ సత్ప్రభావాప్తిం జెలరేఁగు నిశానైచికిం బట్టి చకోరవత్సంబులు గుడువం జేఁపు తారాధవోధస్థల పరిదృశ్యమాన నవాంశుక స్తనంబుల ధరిత్రీపాత్రి దిష్టగోపాలకుండు పిదికిన నవీనపయఃపరంపరలదారిం జూపట్టుచు, దినాంత పర్యంతం బొక్కప్రొద్దుండి యతికాంత కాసారసోపానోపాంత శశికాంతసంతానమరీచికా వీచికావతీవీచికా జాతంబులం జొచ్చి యెడలి వికసితారుణశరజపీఠి వసించి కమలాహితధ్యానకలితాంతరంగంబున నున్న చకోరసువాసినీజనంబుల కవ్రతఘ్నంబు లగువిశదాపూపంబులు సమకూర్పఁ దత్ప్రియశ్యామా ప్రకాం డంబు పూర్వదిశావదాతశోభాచ్ఛాదనంబుపైఁ జంద్రఘరట్టంబు వెట్టి యొయ్యననొయ్యనం దారాసుభద్రా పటలంబులు వైచి విసరం బ్రసరించు తదీయపిష్టధట్టంబుల చందంబునం బెంపొందుచు, నెట్టుకొని గట్టు గములతటంబులం బొడకట్టు నెలచట్టులం గరంగి మట్టుమీరం గురియు పెన్నీటి బలురొద యభంగ తరంగనినాదంబును ముందుముందుగ మందగతిం దోఁతెంచు చందనాచలపవనకందళిం దరళితంబులై నిండార విరిసిన బొండుమల్లియవిరులపిండులు పాండురడిండీరఖండమండలంబులును మదిఁ గదురు ముదమునఁ దమతమసుదతుల గవఁగూడి యెదుర్కొను రేపులుఁగుకొలము లెదురెక్కు సమానవతీక మీనవితానంబులునుం గాఁగ ననూనపథికమానినీమానసాల మూలసమున్మూలనంబు సేయం బరఁగి దినాంతవిలయకాలమ్మున వేలాతిగం బైన పాలవెల్లిపొడవునం బొడసూపుచుఁ, గోకనదపరాగమహో దయరాగవిలసనంబునం గోరకితనీరజతారకాసమున్మేషంబునం గోమలశ్యామలేతర కుముదవలయ సుధాకరధామ విశేషంబునం గొమరొంది తద్రజనీసమయ భాసమాన పయోధరపథంబున కన్న మున్ను మున్న కన్నులకు వెగ్గలంబై దొలంకుకొలంకుగమిం బాసి సన్నంపు వెన్నెలమిన్న చొరరాని లతానివా సంబుల దాఁగం బోవుచుఁ దదంతర సంఫుల్ల్యమాన మల్లికావల్లికామతల్లికా ప్రసవ ధవళద్యుతి ప్రకాండం బులు నిండి రేయెండ మెండు కొనఁజేయ దాఁగ వచ్చిన చోటన్ దలవరు లున్నతెఱం గొయ్యనఁ గని ఖేదించు రోదరతలోదరీవారమ్ముల నయనమ్ముల జాలుగా జాఱు ననావిలజలమాలికలతో మేలంబు లాడుచుఁ, దళతళమను నెలచలుపగిన్నెలయెడలం గలయ నించిన యతిబంధురసౌగంధిక సుగంధ ధురంధర గంధోత్తమారసంబు దమతమరమణుల కెమ్మోవిపండు లుపదంశమ్ములుగా నాదారం గ్రోలి తదీయమాహాత్మ్య కల్పితమానసవిభ్రమంబునఁ దత్పాత్రల సరగ నెఱమించు నిగనిగల మఱలన్ సలి లంబు లూర మదిర నించి నారని గైకొని యచటం బ్రతిఫలించు పల్దెరవాసనకు నిడిన కెందలిరుటాకని దివిచియు విలోచనమాలికలువానితావికిం జేరు తుమ్మెద లని గదిమియు ముదంబునఁ బ్రియుల కందీ యంబోవు మందగామినీబృందమ్ముల హస్తారవింద సందీపిత హీరకటక శోభాధట్టంబులం జెట్టవట్టుచు, ననూనపానశాలాచత్వరంబుల విమలాసవంబు లాలస మెచ్చం ద్రావి నిర్మితహర్మ్యరాజంబులఁ జేరం బోవు నెడఁ జంద్రికాహాలాపానలీలాగతి నంబరంబునం జరించుచుఁ దత్సమర్పిత మదఘూర్ణితంబులగు చకోరకోరకకుచా నిచయంబుల కటాక్షతారళ్యంబులు నెఱమించులై కోకనదకోటరకోటి లీనమధుకర ఝంకారంబులు గర్జనంబులై నిగుడం బొడసూపు వెన్నెల జడివానగాఁ దలంచి యౌదలలఁ బయ్యెదలు గప్పి నెచ్చెలికేలు కైలాగుఁ బూని బుడిబుడి రయం బడర నడచు పడఁతిమిన్నల యున్నతస్తనాంతర విలంబమాన ముక్తా హార గౌరరుక్తతిం బునరుక్తం బగుచు, వెగ్గలమై నెమ్మదిఁ గ్రమ్ము సిగ్గు వెనుకకుఁ దివియ నగ్గలిక మరుండు వైచు మొగ్గములికిగములు ముంగలికి నూకం గరంబు మదంబున దూఁగి యాడు వలదొరపట్టంపుటేనుంగురంగునఁ జూపట్టుచు నెచ్చెలుల కుశలత్వంబున మందమందకలనం బునఁ గేళికామందిరంబులు చేరి యధిపుఁడు కరంబు పట్టి శయ్య నుంచి ముత్తియంపుపేరు లంటుపేరఁ జన్నులు ముట్టుచు మురిపెంపు నెమ్మోమున మడుపు నందిచ్చుదారిఁ గెమ్మోవి నొక్కుచు దమి రేఁచి బంధురబంధవిశేషసంబంధంబున ననవిల్తుకయ్యంబునఁ జొక్కించి చొక్కంపుఁగళల యిక్కువ లెఱింగి మిక్కిలి గలయ గ్రక్కున వెక్కసంబై తనువునఁ జెమటలు గ్రిక్కిఱిసిన మదనమాయావిలసనంబునం బొడమిన ప్రోడతనంబున నెంతగమ్మంబు గ్రమ్మెనని పతులకుఁ దెలియకుండం బలుకుచుఁ జేలచెఱంగున విసరికొను నవోఢానికరంబుల ధవళాంబరాంచల విభాతరంగంబులం బొంగి పొరలుచుఁ, దొలుతటి కల యికల మన మలరఁ గలసిన చెలువరతనంబులఁ దలఁపునం దలఁచుచు నలమరాని విరాళిం గొని నెల వొడుపు వెనుక నలరువాల్దొరకలికిఁ జెలరేఁగన్ దమి నేతెంచినపతు లపుడు తమయెడఁ బొడముమమత నిదుర గదియమిఁ గెంజిగిం గదురుకొను కనుతుదలును దనుతలమ్మునఁ దొలఁకు గురువిరహజ్వర భరంబున విరిపాన్పునం బొరలఁ జిక్కువడు మణిసరంబులును మరుని యిరువాఁడికైదువు పేరెదం జుఱు చుఱుక్కున నాటఁ దాళక నెఱపు నిట్టూర్పులునుం బరయువతితిలకసంపర్కప్రకారంబు తోరంబుగా నెఱింగింప నలివి యవలిమొగంబై శయనించి మాటిమాటికి బోటికత్తెలపలుకుల నిజప్రేమాతిశయజనిత వియోగవేదనాకార్యంబులుగాఁ దెలిసి యినుమడికూటముల నలమి రతిబడలిక వాయఁ గరం బురం బులఁ జల్లులాడు పువ్వుబోఁడుల శయకుశేశయసమాక్షిప్తఘనసారక్షోదంబులం బక్షీకరించుచు, నలరు మల్లియవిరిసరులు దుఱిమి యమలమౌక్తికదామంబులు దాల్చి కపురంపుబొట్టులు దీర్చి కమనీయమల యజకర్దమం బలంది కలికి తెలిచలువ లూని వెన్నెలం దలవరులు గనకుండ సంకేతనికేతంబులకుఁ బోవు త్రోవం బొంచి కమలకలికాసంలగ్నమధుపనినాదవలయ ఘీంకారసంకలితమృణాళయష్టికరం బూని యడ్డమ్ము పఱతెంచువా రెవ్వ రెవ్వరనఁ దలంగు మనంబున ఘట్టకుటికం బ్రభాతంబగు దారియయ్యె నని మాఱు వలుక నేరక మూలమూలల నొదుఁగుచుఁ దలంకునెడఁ గిలకిల నవ్వుచుఁ దమ్మెఱుఁగఁ జేయ నొక్కింత చిగిరించు నలుక నభిసారికా జనంబులు ప్రియులపై రువ్వు మవ్వంపు విరిగుత్తులం జివ్వకుఁ బిలుచుచు, వన్నె గల వెన్నెలబయిట నెన్నరానివేడుక పన్నిదంబులు వన్ని సుహృన్నికరంబులతోఁ బెన్నేర్పున జూదంబు లాడుచున్నకతం బునఁ గొంతదడ వగుటఁ బటుతరమహానట మనస్తట నానటద్ధైర్య విపాటనాటోప సముత్కట శంబరప్రతిభట కృపీటజకోరక శరపటలధారా దోధూయమాన మానసంబుతో విచ్చలవిడిం బెచ్చుపెరుఁగుతాపంబున వెచ్చనూర్చుచు నెమ్మదిం గ్రచ్చుకొని హెచ్చుమోహంబున నెచ్చెలిచేతికి నచ్చంపుగుఱుతిచ్చి మచ్చికల వల్లభుం దోడ్కొని రమ్మంచు నంచి యంచిత బహిరంగణ ప్రదేశంబుల నిలిచి పతిరాక కెదురుచూచునదియును నెయ్యంపుఁబొదలతూఁగుటుయ్యెలపై నొయ్యారం బునం గూర్చుండి ప్రియుండు పసిండిదండియ బూని సుతి మీట విభునిచెంత వసియించి చిన్నికిన్నెరం బూని పంచశరదేవతా విజయప్రపంచసమంచితంబు లగు నూతనగీతంబులు పలికించి చెలులఁ జొక్కించు నదియు నడుగు లొరయం గొనసాగ నల్లిన జడకుఁ జుట్టిన మొల్లవిరితావి యెల్లెడలకుం బరవ మంజుల చరణకంజ సంజిత కంజరాగ మంజీర శింజా రవంబులు కర్ణగ్లాని మాన్ప నొఱ దొఱపిన వలదొరపరు వంపుఁగైదువుతెఱఁగున నిండార దువ్వలువ గప్పి కాంతునిశాంతంబునకుఁ బోటులవెంటం జనునదియును దనమనం బలరఁ గలసి కళలఁ దేలించి మేలుంచి యేలిననాయకునియెడ నెడయని ప్రియమ్మునఁ దఱిసి విరిసరులు దుఱిమి చలువ వెదచల్లుకలపం బలఁది యంతంతం బొడము మోహమ్ముల నలమి కెమ్మోవి నొక్కి పునారతులకు వేడుక రేఁచి పైకొనునదియును నై వెలయు వెలయువిదల గలితచందనచర్చాపాలి కలం గనత్తరదరహాసవిభారింఛోళికలం గర్ణావతంసిత కైరవపత్త్రమంజరికావిభాళికలం గబరికాభివేష్టిత లతాంతమాలికలం గలసి మెలఁగుచు, మహోత్పలమండల త్రాణైకవిహారవిలాసితం బయ్యును మహో త్పలమండలహరణైకవిలాసాంచితంబై యసమకాండ చండప్రతాపనాశకనిజోదయంబయ్యును నసమ కాండచండ ప్రతాపసంవృద్ధికరనిజోదయంబై, దివ్యచక్ర చిత్తానందసంధాయకం బయ్యును దివ్యచక్రచిత్తా నందభేదకం బై రాజిల్లుచు ద్రుహిణాండకరండంబునకు వెండి జలపోసనంబుదారిం బ్రకాశించె నయ్యవస రంబున. 107
టీక: వెండియున్=మఱియు; ఆపండువెన్నెలదండంబు = ఆనిండువెన్నెలయొక్క పరంపర; అఖండకాండజారిమండల మాయామౌక్తికమయ భద్రాసన సమాసీన నీలాంక లంకావరాహిత పట్టాభిషేచనావరసమయ మహర్షిరాజాభిషిక్త గంగాది పుణ్యతరంగిణీ విశదజలప్రవాహంబులపోలికన్ – అఖండ=అవిచ్ఛిన్నమగు, కాండజారిమండల=చంద్రమండలమనెడు, కాండ మనఁగా నీరు, కాండజ మనఁగా పద్మము, ఆ పద్మమునకు అరి=వైరి చంద్రుఁడని భావము, మాయా=నెపముగల, మౌక్తికమయ =ముత్యములవికారమైన, భద్రాసన=సింహాసనమందు, సమాసీన=కూర్చుండిన, నీలాంక =నల్లని కళంక మనెడు, లంకావరాహిత=రావణవైరి యైన శ్రీరామునియొక్క, పట్టాభిషేచనావరసమయ=పట్టాభిషేకముఖ్యసమయమందు, మహర్షిరాజ=ఋషిశ్రేష్ఠులచేత, అభిషిక్త=అభిషేకము చేయఁబడిన, గంగాదిపుణ్యతరంగిణీ =జాహ్నవి మున్నగు పవిత్రనదుల యొక్క, విశదజల=శుభ్రమగు నీటియొక్క, ప్రవాహంబులపోలికన్=వఱదలభంగిని; ప్రవహించుచున్=పాఱుచు; అనఁగాఁ జంద్రుఁడను మౌక్తికసింహాసనమందుఁ గళంకమనెడు శ్రీరామమూర్తి గూర్చుండి యుండఁగాఁ దత్పట్టాభిషేకమహోత్సవసమ యమున మహర్షులు తెచ్చి యభిషేకము చేయు గంగాదిపుణ్యనదీజలప్రవాహముభంగి నాపండువెన్నెలపిండు రాజిల్లె నని భావము; అస్తాచల సంగతాహిమాంశుకిరణ కూట తృణాంకుర నికరంబులన్ – అస్తాచల=చరమాద్రిని, సంగత=సంబంధించినట్టి, అహిమాంశుకిరణ=సూర్యకిరణము లనెడు, కూట=కపటము గల, తృణాంకుర=లేఁగసవులయొక్క, నికరంబులన్= గుంపు లను; అన్నింటిన్; మేసి=భక్షించి; దర్పించి=గర్వించి; రథాంగజనంబులకున్ = చక్రవాకము లనెడి ప్రజలకు; వైకల్యంబు చేకూర్చి = వికలత్వము ఘటిల్లఁజేసి; సముజ్జృంభమాణ సత్ప్రభావాప్తిన్=మించినమంచిసామర్థ్యముయొక్క ప్రాప్తిచేత; సత్ = రిక్కలయొక్క, ప్రభా=కాంతియొక్క, అవాప్తిన్=ప్రాప్తిచేత అని స్వభావార్థము; చెల రేఁగు నిశానై చికిన్ =విజృంభించు రాత్రి యనెడు మంచియావును, ‘ఉత్తమా గోషు నైచికీ’ అని యమరుఁడు; పట్టి=బంధించి; చకోరవత్సంబులు=వెన్నెలపుల్గు లనెడు దూడలు; కుడువన్=చీకుటకు; చేఁపు తారాధవోధస్థల పరిదృశ్యమాన నవాంశుక స్తనంబులన్ – చేఁపు=పాలు ద్రవించుచున్న, తారాధవోధస్థల=చంద్రుఁడను పొదుఁగునందు, పరిదృశ్యమాన=చూడఁబడుచున్న, నవాంశుక స్తనంబులన్ = క్రొత్తకిరణంబు లనెడు చన్నులనుండి; ధరిత్రీపాత్రిన్ = భూమి యనెడు పాత్రమునందు; దిష్టగోపాలకుండు – దిష్ట=సమయమనెడు, గోపాల కుండు=ఆవులకాపరి; పిదికిన నవీనపయఃపరంపరలదారిన్=పిండినట్టి క్రొత్త క్షీరధారలవలె; చూపట్టుచున్ = అగపడుచు; అనఁగాఁ గాలమనెడు గోపాలుఁడు రాత్రియనెడు గోవు చరమాచలమందు సూర్యకిరణములనెడు కసవు మేసి, గర్వించి, చక్ర వాకములనెడు ప్రజకు వ్యాకులత గలుగఁజేయుచుండ దానిఁ బట్టి తెచ్చి, చకోరములనెడు దూడలు త్రాగుటకు చంద్రమండల మను పొదుఁగునందు కిరణములనెడు చన్నులనుండి పిదికిన క్షీరపూరమును బోలి వెన్నెల యున్న దని భావము.
దినాంతపర్యంతంబు=సంధ్యాకాలమువఱకు; ఒక్కప్రొద్దుండి =ఉపవసించి; అతికాంత కాసార సోపా నోపాంత శశికాంత సంతాన మరీచికా వీచికావతీ వీచికాజాతంబులన్ – అతికాంత =మిగులమనోజ్ఞమగు, కాసార=కొలఁకులయొక్క, సోపాన= మెట్లయొక్క, ఉపాంత=సమీపమందలి, శశికాంత =చంద్రకాంతమణులయొక్క, సంతాన=సమూహములయొక్క, మరీచికా =కాంతియనెడు, వీచికావతీ=నదియొక్క, వీచికాజాతంబులన్=అలలసమూహమును; చొచ్చి=ప్రవేశించి; అనఁగా నానదిలో స్నానము చేసి యనుట; ఎడలి=బయలుదేఱి; వికసితారుణశరజపీఠిన్ = వికసించిన యెఱ్ఱగలువయనెడు పీఠమునందు; వసించి = ఉండి; కమలాహిత ధ్యాన కలి తాంతరంగంబునన్ – కమలాహిత=చంద్రుఁడనెడు కమలకు హితుఁడైన విష్ణుమూర్తి యొక్క (చంద్రుని కి కమలా+అహిత అనియు, విష్ణువునకు కమలా+హిత అనియు అన్వయము), ధ్యాన=చింతతోడ, కలిత =కూడుకొన్నట్టి, అంతరంగంబునన్=చిత్తముచేత; ఉన్న=ఉన్నట్టి; చకోరసువాసినీజనంబులకున్ = చక్రవాకస్త్రీలకు; అవ్రత ఘ్నంబు=వ్రతదూషకములు గానట్టివి; అగు=ఐన; విశదాపూపంబులు = తెల్లనియపూపములను; సమకూర్పన్= చేకూర్చు టకు; తత్ప్రియశ్యామాప్రకాండంబు = ఆచకోరసువాసినులకు హితలైన రాత్రు లనెడు స్త్రీల కదంబము; పూర్వదిశావదాతశోభా చ్ఛాదనంబుపైన్ =తూర్పుదిక్కనెడు తెల్లనివస్త్రముమీఁద; చంద్రఘరట్టంబు = చంద్రుం డనెడు తిరుగలిని; పెట్టి=ఉంచి; ఒయ్యన నొయ్యనన్=తిన్నతిన్నగా; తారాసుభద్రాపటలంబులు=నక్షత్రములనెడు గుమ్మడి విత్తులగుంపులను; వైచి=వేసి; విసరన్= త్రిప్పఁగా; ప్రసరించు తదీయపిష్టధట్టంబుల చందంబునన్=ప్రసరించుచున్న ఆవిత్తుల యొక్క పిండియొక్కరాశి రీతిగా; పెం పొందుచున్=వృద్ధిఁబొందుచు; అనఁగాఁ జకోరస్త్రీ ప్రదోషమువఱకు నుపవాసముండి సూర్యాస్తానంతరము కొలఁకులసోపాన ముల నున్న చంద్రకాంతమణిమరీచి యనెడు నదియందు స్నానము చేసి యెఱ్ఱగలువ యను నాసనముపైఁ గూర్చుండియుండఁ గా, నామె యుపవాసవ్రతమున కుచితమైన తెల్లనియాపూపములుసేయ రాత్రులనెడు తదీయప్రియస్త్రీజనంబు తూర్పనెడు తెల్లని వస్త్రముపైఁ జంద్రుఁడనెడుతిరుగలిని బెట్టి రిక్కలనెడు గుమ్మడివిత్తులు వోసి విసరఁగాఁ బ్రసరించు వానిపిండియొక్క రాశినిఁబోలి వెన్నెల యుల్లసిల్లె ననుట.
నెట్టుకొని=త్రోసికొని; గట్టుగములతటంబులన్=పర్వతసంఘములదరులయందు; పొడకట్టు నెలచట్టులన్ = చూపట్టుచున్న చంద్రకాంతములవలన; కరంగి=ద్రవించి; మట్టుమీఱన్=మితిమీఱునట్లుగా; కురియు పెన్నీటి బలురొద=కురియుచున్నఅధిక మగు జలముయొక్కబలిష్ఠమగుధ్వని; అభంగతరంగనినాదంబును =అధికమైనయలలధ్వనియు;ముందుముందుగన్=తొలు దొలుతనె; మందగతిన్=తిన్ననిగమనముచేత; తోఁతెంచు చందనాచలపవనకందళిన్=వీచు మలయమారుతాంకురమువల్ల; తరళితంబు లై =చలింపఁజేయఁబడినవై;నిండార విరిసిన బొండుమల్లియవిరులపిండులు – నిండార విరిసిన =బాగుగ వికసిం చిన, బొండుమల్లియవిరుల=బొండుమల్లెపూలయొక్క, పిండులు =గుంపులు; పాండురడిండీరఖండమండలంబులును = తెల్లని నురుఁగుతున్కలగుంపును; మదిన్=చిత్తమందు;కదురు ముదమునన్=కలుగునట్టి సంతసముచేత; తమతమసుదతులన్ = తమతమప్రియురాండ్రను; కవకూడి =జతగాఁ గలిసి; ఎదుర్కొను రేపులుఁగుకొలములు=ఎదురుగఁబోవు చకోరసంఘము; ఎదురెక్కు సమానవతీకమీనవితానంబులునున్= ఎదురెక్కుచున్నవియు, మానవతులతోఁ గూడినవియు నగు మీనముల గుంపులును; కాఁగన్=అగుచుండఁగా; అనూన పథికమానినీ మాన సాల మూలసమున్మూలనంబు – అనూన=అధిక మగు, పథికమానినీ=పథికస్త్రీలయొక్క, మాన=ఈర్ష్యయనెడు, సాల=చెట్లయొక్క, మూలసమున్మూలనంబు = మూలోచ్ఛేదన మును; చేయన్=చేయుటకు; పరఁగి=ఒప్పి; దినాంతవిలయకాలమ్మునన్=సాయంకాలమనెడు ప్రళయకాలమున; వేలాతిగం బైన పాలవెల్లిపొడవునన్ = వేలమీఱిన క్షీరసముద్రముభంగిని; పొడసూపుచున్=అగపడుచు; అనఁగా నావెన్నెల ప్రళయకాల మందు వేలమీఱి సాలసమున్మూలనము గావించుచు మించు క్షీరాంబురాశిని బోలి, సంధ్యాకాలమున మానినీమానస సమున్మూ లనము గావించుచు మించినదనియు, దానియందు వెన్నెలవలనఁ బర్వతంబులనుండి గరఁగి పడు చంద్రకాంతజలప్రవాహము రొదలు తరంగధ్వనులుగా నుండెననియు, మలయమారుతాంకురమున నిండార విరిసిన బొండుమల్లెలపిండులు నురుఁగు తునియలను బోలియుండె ననియు, సంతసమునఁ దమతమప్రియురాండ్రతోఁ గూడి యెదురెక్కుచకోరములు జతగూడి యెదు రెక్కు మీలఁ బోలియుండె ననియు భావము.
కోకనదపరాగ మహోదయరాగవిలసనంబునన్ – కోకనదపరాగ=రక్తోత్పలములయొక్కపుప్పొడియనెడు, మహత్=అధిక మైన, ఉదయరాగ=ఉదయకాలికారుణ్యముయొక్క, విలసనంబునన్=ప్రకాశముచేత; కోరకితనీరజతారకాసమున్మేషంబునన్ – కోరకిత = ముగిడినట్టి, నీరజ=పద్మములనెడు, తారకా = నక్షత్రములయొక్క, సమున్మేషంబునన్ = ప్రకాశముచేత; కోమల శ్యామలేతర కుముదవలయ సుధాకర ధామవిశేషంబునన్ – కోమల=మృదులమై, శ్యామలేతర=శుభ్రమగు, కుముదవలయ= కలువలగుంపనెడు, సుధాకర=చంద్రునియొక్క,ధామవిశేషంబునన్ =కాంతివిశేషము చేత; కొమరొంది=అందము గాంచి; తద్ర జనీసమయ భాసమాన పయోధరపథంబున కన్నన్ =ఆరాత్రియందు విలసిల్లు నాకసముకన్నను; మున్నుమున్న=ముందు ముందుగనె; కన్నులకున్; వెగ్గలంబై =మిక్కుటమై; తొలంకుకొలంకుగమిన్=చెలఁగునట్టి కాసారసంఘమును; పాసి=వదలి; సన్నంపు వెన్నెలమిన్న=లేఁతరేయెండమిన్న; చొరరానిలతానివాసంబులన్=చొరఁబాఱ నలవిగాని లతాగృహములయందు; దాఁగన్=దాఁగుటకు; పోవుచున్=ఏగుచు; తదంతరసంఫుల్ల్యమానమల్లికావల్లికామతల్లికా ప్రసవధవళద్యుతిప్రకాండంబులు—తదంతర=ఆలతాగృహములందు, సంఫుల్ల్యమాన=మిగుల వికసిల్లిన, మల్లికావల్లికామతల్లికా= ప్రశస్తమైన మల్లెతీవలయొక్క, ప్రసవ=పూవులయొక్క, ధవళద్యుతి=తెల్లనికాంతియొక్క, ప్రకాండంబులు =గుంపులు; నిండి=ఆవరించి; రేయెండ మెండు కొనన్ =చంద్రాతపము మిక్కుటమగునట్లు; చేయన్=చేయఁగా; దాఁగన్ వచ్చిన చోటన్ = దాఁచుకొనుటకై వచ్చినట్టి తావున; తలవరులు=తలారివాండ్లు; ఉన్నతెఱంగు=ఉన్నరీతిని; ఒయ్యనన్=తిన్నగా; కని = చూచి; ఖేదించు రోదరతలోదరీ వార మ్ముల నయనమ్ములన్ – ఖేదించు=దుఃఖించుచున్న, రోదరతలోదరీ=చక్రవాకస్త్రీలయొక్క, వారమ్ముల=గుంపులయొక్క, నయనమ్ములన్=కనులయందు; జాలుగాన్=ప్రవాహముగా; జాఱు =కారుచున్నట్టి; అనావిల జలమాలికలతోన్= అకులుష మైన జలపరంపరలతోడ; మేలంబులు=పరిహాసములు; ఆడుచున్=సల్పుచు; అనఁగాఁ జక్రవాకస్త్రీలకు కొలఁకులు రక్తోత్పల రాగ మనెడు సంధ్యారాగముచేతను, పద్మముకుళము లనెడు రిక్కలచేతను, తెల్లగల్వపూలగమికాంతి యనెడు వెన్నెలపిండు చేతను వెలసి యట్లుదయరాగనక్షత్రచంద్రకాంతులతోఁ గూడిన యాకసమునకన్నమున్నకన్నులకు వెగ్గలంబులు గాఁగా, వానిం బాసి సన్నవెన్నెల చొరరాని లతానికుంజములకు నవి దాఁగం బోయిన వనియు, నందును మల్లికాకుసుమధవళద్యు తులు నిండి వెన్నెల మెండుకొన్నట్లు సేయఁగా, దాఁగఁబోయినచోట తలవరు లున్నరీతి నిట గూడ సుఖము లేకపోయెఁగదా యని ఖేదించు చున్న వనియు, నట్టి చక్రవాకస్త్రీలనిర్మలనయనాంబువులతో మేలములాడుచు వెన్నెల చెలంగిన దనియు భావము.
తళతళమను నెలచలుపగిన్నెలయెడలన్=ప్రకాశించుచున్న చంద్రకాంతపుగిన్నెలయందు; కలయన్=అంతటను; నించిన అతిబంధుర సౌగంధిక సుగంధధురంధర గంధోత్తమారసంబు – నించిన=పూరించినట్టి, అతిబంధుర=మిగులదట్టమయిన, సౌగంధిక సుగంధ=కల్హారముల మంచిగంధముయొక్క, ధురంధర=భారము వహించిన, తద్గంధము గలవి యనుట, గంధోత్త మారసంబు=మద్యముయొక్కరసమును; తమతమరమణుల కెమ్మోవిపండులు =తమతమప్రియులయధరము లనెడు పండ్లను; ఉపదంశమ్ములు గాన్=నంచుకొను భోజనసాధకవిశేషములు గాఁగా ననుట; నాదారన్=తనివితీరునట్లుగ; క్రోలి = పానముచేసి; తదీయమాహాత్మ్య కల్పితమానసవిభ్రమంబునన్ – తదీయమాహాత్మ్య=ఆమద్యసంబంధియగు ప్రభావముచేత, కల్పిత=చేయఁబడిన,మానస= మనస్సంబంధియగు, విభ్రమంబునన్=భ్రాంతిచేత; తత్పాత్రలన్=ఆచంద్రకాంతపుగిన్నెలందు; సరగన్=వేగముగా; నెఱమించు నిగనిగలన్=మిగుల నతిశయించు ప్రకాశముచేత; మఱలన్; సలిలంబులు=జలంబులు; ఊరన్=ఊరఁగా; మదిరన్=మద్యమును; నించినారని=పూరించినారని; కైకొని =తీసికొని; అచటన్=ఆనీటియందు; ప్రతి ఫలించు పల్దెరన్=ప్రతిబింబించిన యధరమును; వాసనకున్=పరిమళమునకు; ఇడిన =ఉంచినట్టి; కెందలిరుటాకని = రక్త పల్లవమని; తివిచియున్=లాగియు; విలోచన మాలికలు=నయనపంక్తులు; వానితావికిన్=వానిపరిమళమునకు; చేరు తుమ్మెద లని =చేరుచున్న తుమ్మెదలని; గదిమియున్ =భర్త్సనము చేసియు; ముదంబునన్=సంతసముతోడ; ప్రియులకున్=భర్తలకు; అందీయన్=అందిచ్చుటకు; పోవు మందగామినీబృందమ్ముల హస్తారవింద సందీపిత హీరకటకశోభాధట్టంబులన్ – పోవు= పోవుచున్న, మందగామినీబృందమ్ముల = స్త్రీసంఘములయొక్క, హస్తారవింద=కరకమలములయందు, సందీపిత=మిగులఁ బ్రకాశింపఁజేయఁబడిన, హీరకటక= వజ్రమయములగు కడియములయొక్క, శోభాధట్టంబులన్=కాంతిపుంజములను; చెట్ట వట్టుచున్=హస్తావలంబనము సేయుచు; అనఁగా నపుడు స్త్రీలు చంద్రకాంతమణిపాత్రలలో మద్యము పోసికొని వల్లభాధరము లుపదంశములుగా నాదారం గ్రోలి, తదనుగుణగణసాంగత్యమున విలసిల్లుచు వెన్నెల కాపాత్రలయం దూరుచున్ననీరు చూచి మద్యమని భ్రమించి, మఱలఁ దత్పానమునకై వానిం గైకొని యందుఁ బ్రతిఫలించిన తమ యధరములను పల్లవము లనియు, నేత్రములను తుమ్మెద లనియు నెంచి, వానిని దివియుచు, నా మద్యమును తమప్రియుల కందీయ హస్తము లెత్తియుండఁగా నాహస్తములయం దున్న వజ్రమణిమయములగు వలయముల కాంతిసంతతిని వెన్నెల హస్తావలంబముగాఁ జేయునట్లు విల సిల్లె ననుట. వజ్రకటకకాంతి వెన్నెలకాంతితో ధావళ్యసామ్యమునఁ దెలియరాకుండఁ గలిసినదని ఫలితము.
అనూనపానశాలాచత్వరంబులన్ – అనూన=అధికమగు, పానశాలా=ప్రపలయొక్క, చత్వరంబులన్=ముంగిటిభూముల యందు; విమలాసవంబు=ప్రశస్తమైన మద్యమును; లాలస మెచ్చన్=వాంఛావిశేష మతిశయింపఁగా; త్రావి=పానముచేసి; నిర్మిత హర్మ్యరాజంబులన్ = నిర్మింపఁబడిన ప్రాసాదములను; చేరన్=చేరుటకు; పోవునెడన్ = పోవునప్పుడు; చంద్రికాహాలా పాన లీలాగతిన్=వెన్నెలయను మద్యముయొక్క పానముచేనైన విలాసగమనముచేత;అంబరంబునన్=ఆకసమందు; చరించు చున్ =తిరుగుచు; తత్సమర్పిత మదఘూర్ణితంబులు – తత్సమర్పిత=ఆమద్యముచేతఁ జేయఁబడిన, మద=దర్పముచేత, ఘూర్ణితంబులు=త్రిప్పఁబడినవి; అగు చకోరకోరకకుచానిచయంబుల కటాక్షతారళ్యంబులు – అగు=అయినట్టి, చకోరకోరక కుచా =చకోరస్త్రీలయొక్క, నిచయంబుల=గుంపులయొక్క, కటాక్ష=క్రేగంటిచూపులయొక్క, తారళ్యంబులు=చాంచల్య ములు; నెఱమించులై=అధికములగు మెఱపులై; కోకనదకోటరకోటిలీనమధుకరఝంకారంబులు – కోకనదకోటరకోటి = ఎఱ్ఱగల్వల తొఱ్ఱగుంపులయందు, లీన=దాఁగియున్న, మధుకర=తుమ్మెదలయొక్క,ఝంకారంబులు =నాదములు; గర్జనం బులై =ఉఱుములై; నిగుడన్=ఒప్పఁగా; పొడసూపు వెన్నెలన్= పొల్చునట్టి చంద్రికను; జడివానగాన్=జడివాన యని; తలంచి =భావించి; ఔదలలన్=తలలమీఁద; పయ్యెదలు=పైఁటవస్త్రములను; కప్పి=ఆచ్ఛాదించి; నెచ్చెలికేలు=సకియలహస్తము లను; కైలాగున్=ఆలంబనమునుగా; పూని=వహించి; బుడిబుడి రయంబు=అతిత్వరతోఁ గూడిన వేగము, బుడిబుడి యను నది నడకలోఁగల యనుకరణశబ్దము; అడరన్=ఒప్పఁగా; నడచు పడఁతిమిన్నల యున్నత స్తనాంతర విలంబమాన ముక్తా హార గౌరరుక్తతిన్ – నడచు=గమనము సేయుచున్న, పడఁతిమిన్నల=స్త్రీరత్నములయొక్క, ఉన్నతస్తనాంతర =మిట్టలగు స్తనముల మధ్యభాగమందు, విలంబమాన=వ్రేలాడుచున్న, ముక్తాహార=ముత్యంపుపేరులయొక్క, గౌరరుక్తతిన్=శుభ్రకాంతి పుంజముచేత; పునరుక్తం బగుచున్ = ఇనుమడి యైన దగుచు; అనఁగా నపుడుత్తమస్త్రీలు పానశాలలచెంత విమలాసవమును గ్రోలి మేడలు చేరఁ బోవుచుండఁగా, వెన్నెల యను మద్యము ద్రావి గగనమందుఁ జరించు చకోరస్త్రీలకటాక్షతారళ్యములు మెఱ పులుగాను, ఎఱ్ఱగల్వలలో దాఁగిన తుమ్మెదలమ్రోఁత లుఱుములుగాను , వెన్నెల జడివానగాను వారలకుఁ దోఁచి పయ్యెదలు తలలపైఁ గప్పికొని చెలియల కైలాగుఁ బూని వడిగ బుడిబుడి బోవుచున్నా రనియు, వారల యున్నతస్తనాంతరముల నున్న ముత్తెపుపేరుల తెల్లనికాంతిసంతతితో వెన్నెల రెట్టించి వెలింగె ననియు భావము.
వెగ్గలమై=అధికమై; నెమ్మదిన్=నిండుమనస్సునందు; క్రమ్ము సిగ్గు=ఆవరించెడు లజ్జ; వెనుకకున్ తివియన్ = వెనుక కాకర్షిం పఁగా; అగ్గలికన్=శౌర్యముచేత; మరుండు=కాముఁడు; వైచు మొగ్గములికిగములు = ప్రయోగించు మొగ్గలనెడు బాణముల గుంపులు; ముంగలికిన్=ముందునకు; నూకన్ = త్రోయఁగా; కరంబు=మిక్కిలి; మదంబునన్=మదముచేత; తూఁగియాడు వలదొరపట్టంపుటేనుంగురంగునన్=తూఁగుచున్న మదనుని పట్టపుటేనుఁగుతీరున; చూపట్టుచున్=అగపడుచు; ఇది నవోఢా నికరంబులకు విశేషణము; నెచ్చెలుల కుశలత్వంబునన్ = ప్రియసఖీజనములయొక్క నేర్పుచేత; మందమందకలనంబునన్ = మెల్లమెల్లని క్రియలతో; కేళికామందిరంబులు =క్రీడామందిరంబులను;చేరి=పొంది;అధిపుఁడు=ప్రియుఁడు; కరంబుపట్టి= చేయి పట్టుకొని; శయ్యన్=పాన్పునందు; ఉంచి=ఉండఁజేసి; ముత్తియంపుపేరులు=మౌక్తికహారములను; అంటుపేరన్ =ముట్టు నెప మున; చన్నులు=స్తనములను; ముట్టుచున్=స్పృశించుచు; మురిపెంపు నెమ్మోమునన్=కులుకుమోమునందు; మడుపున్= విడెమును; అందిచ్చుదారిన్= అందియిచ్చు తీరున; కెమ్మోవి నొక్కుచున్= ఎఱ్ఱనిపెదవినిఁ గొఱుకుచు; తమి రేఁచి = రాగో ద్రేకము గలిగించి; బంధురబంధవిశేషసంబంధంబునన్=దట్టమగు బంధభేదముల సంబంధముచేత; ననవిల్తుకయ్యంబునన్ = సురతమందు; చొక్కించి =సుఖపారవశ్యము నొందించి; చొక్కంపుఁగళల యిక్కువలు=మంచికళాస్థానములను; ఎఱింగి = తెలిసి; మిక్కిలి=అధికముగ; కలయన్=కూడఁగా; గ్రక్కునన్=వేగముగ; వెక్కసంబై=వెగటై; తనువునన్=శరీరమందు; చెమ టలు=స్వేదములు; క్రిక్కిఱిసినన్=నిబిడము కాఁగా; మదనమాయావిలసనంబునన్ = మన్మథుని మాయాప్రకాశముచేత; పొడ మిన ప్రోడతనంబునన్=ఉదయించిన ప్రౌఢత్వముచేత; ఎంత గమ్మంబు=ఎంత స్వేదము; క్రమ్మెన్ అని =కలిగెనని; పతులకున్ = ప్రియులకు; తెలియకుండన్=బయల్పడుకుండునట్లు; పలుకుచున్=వచించుచు; చేలచెఱంగునన్=వస్త్రాంచలముచేత; విసరికొను నవోఢానికరంబుల ధవళాంబరాంచల విభాతరంగంబులన్ – విసరికొను=విసరికొనుచున్న, నవోఢానికరంబుల = క్రొత్తపెండ్లికూఁతుల సమూహముయొక్క, ధవళ=శుభ్రమగు, అంబర=వస్త్రములయొక్క, అంచల=అగ్రములయొక్క, విభా= కాంతులయొక్క, తరంగంబులన్=పరంపరలచేత; పొంగి=ఉప్పొంగి; పొరలుచున్=వెలిపర్వుచు; అనఁగా నపుడు నవోఢలు తమతమప్రియులయొద్దకుఁ బోవుసమయమున లజ్జావశమున వెనుదీయుచు, కామవశమున ముందున కడుగిడుచుండఁగా, వారు వలదొరపట్టంపుటేనుఁగుచందంబున నుండి రనియు, నెచ్చెలులు తమనేర్పుచేతఁ దిన్నతిన్నగాఁ గేళిగృహమునకు గొని పోఁగా నటకుఁ బోయి ప్రియులు తమ నేర్పున నొనరించు బాహ్యాంభ్యంతరరతులచేఁ జొక్కి కలాస్థానము లెఱింగి పతులు మిగులం గలయ మిక్కుటంబై తనువు నిండార స్వేదంబు వొడమ నెంత చెమ్మట గ్రమ్మె నని తిన్నగఁ బలుకుచు తెల్లని వస్త్రాంచ లములచే విసరికొనుచుండి రనియు, అట్లు విసిరికొను వారి శుభ్రాంశుకప్రభాజాలంబులతోఁ బండువెన్నెలలు పొంగి పొరలిన ట్లుండె ననియు భావము. నవోఢలు ముగ్ధావాంతరభేదములోఁ జేరిన నాయికలు. దీనిం గూర్చి రసమంజరియందు, ‘తత్రాఙ్కు రితయౌవనా ముగ్ధా సాచ ద్వివిధా జ్ఞాతయౌవనా అజ్ఞాతయౌవనా చేతి, సైవ క్రమశో లజ్జాభయపరాధీనరతి ర్నవోఢా సైవ సప్ర శ్రయా విస్రబ్ధనవోఢా’ యని వ్రాయఁబడినది. ‘ఆదౌ రతం బాహ్య మిహ ప్రయోజ్యం తత్రాపి చాలిఙ్గనపూర్వ మేవ’ అని రతిరహ స్యోక్తప్రకారమున నిటఁ దొలుత నాలింగనాధరచుంబనాది బాహ్యరతియు, వెనుక సురతరూపాభ్యంతరరతియు వర్ణితమైనది, స్తనసంస్పర్శనోక్తిచే నాలింగనమే చెప్పఁబడిన దని యెఱుంగవలెను. ‘అఙ్గుష్ఠే పదగుల్ఫజానుజఘనే నాభౌచ వక్షస్స్థలే కక్షే కంఠ కపోల దన్తవసనే నేత్రాలకే మూర్ధని, శుక్లాశుక్లవిభాగతో మృగదృశా మఙ్గేష్వనఙ్గస్థితీ రూర్ధ్వాధో గమనేన వామవదనాః పక్ష ద్వయే లక్షయేత్’ అని కళాస్థానములు రతిరహస్యముననె చెప్పఁబడినయవి.
తొలుతటికలయికలన్=ప్రథమసమాగమములయందు; మన మలరన్=మనస్సు సంతసించునట్లు; కలసిన చెలువరతనం బులన్ = కూడినట్టి స్త్రీరత్నములను; తలఁపునన్=అంతరంగమందు; తలఁచుచున్=స్మరించుచు; అలమరాని విరాళిన్ = ఆక్రమింపరాని విరహమును; కొని=వహించి; నెలపొడుపు వెనుకన్ = చంద్రోదయానంతరమున; అలరువాల్దొరకలికిన్ = రతికి; చెలరేఁగన్=విజృంభించుటకు; తమిన్=ఆసక్తిచేత; ఏతెంచినపతులు = వచ్చినట్టి ప్రియులు; అపుడు; తమయెడన్ = తమయందలి; పొడముమమతన్=ఉదయించిన యనురాగముచేత; నిదుర గదియమిన్=నిద్ర రాకపోవుటచేత; కెంజిగిన్ = అరుణకాంతిచేత; కదురుకొను కనుతుదలును = అతిశయించుచున్న నేత్రాంతములును; తనుతలమ్మునన్=శరీరప్రదేశమున; తొలఁకు గురువిరహజ్వరభరంబునన్ = నిండిన యధికమైన వియోగజ్వరాతిశయముచేత; విరిపాన్పునన్=పూపాన్పుపై; పొరలన్=పరివర్తనము సేయఁగా; చిక్కువడు మణిసరంబులును = చిక్కువడిన మణిహారములును; మరుని యిరువాఁడి కైదువు=మన్మథునియొక్క రెండుప్రక్కలను పదునుగల యాయుధము; పేరెదన్=విశాలవక్షమునందు;చుఱుకుచుఱుక్కు నన్ =ఇట్టి ధ్వని కల్గునట్లుగా;నాటన్=గ్రుచ్చుకొనఁగా; తాళక=ఓర్వఁజాలక; నెఱపు నిట్టూర్పులునున్ =వ్యాపింపఁజేయు నిశ్వాసములును; పరయువతితిలకసంపర్కప్రకారంబు = ఇతరస్త్రీసాంగత్యభంగిని; తోరంబుగాన్=అధికముగా; ఎఱింగింపన్ =తెలు పఁగా; అలివి=కోపించి; అవలిమొగంబై=పెడమొగమై; శయనించి =పరుండి; మాటి మాటికిన్=సారెసారెకు; బోటికత్తెల పలుకులన్=చెలికత్తెలమాటలచేత; నిజప్రేమాతిశయజనిత వియోగవేదనాకార్యంబులుగాన్ – నిజ=తమయందలి, ప్రేమాతి శయ=అనురాగాతిశయముచేత, జనిత=పుట్టినట్టి, వియోగవేదనా=విరహవేదనయొక్క, కార్యంబులుగాన్=కార్యములని; తెలిసి = తెలిసికొని; ఇనుమడికూటములన్=ద్విగుణితమగు సురతములచేత; అలమి=ఆక్రమించి; రతి బడలిక = రతివలనఁ గల్గిన శ్రమ, పాయన్=పోవుటకు; కరంబు=మిక్కిలి; ఉరంబులన్=ఱొమ్ములమీఁద; చల్లులాడు పువ్వుబోఁడుల శయకుశేశయ సమాక్షిప్తఘనసారక్షోదంబులన్ – చల్లులాడు=చల్లుచున్న, పువ్వుబోఁడుల=స్త్రీలయొక్క, శయకుశేశయ=పద్మములఁబోలు హస్త ములచేత, ‘పంచశాఖ శ్శయః పాణిః’ అని యమరుఁడు, సమాక్షిప్త=వెదచల్లఁబడిన, ఘనసార=కర్పూరముయొక్క, క్షోదంబులన్=చూర్ణములను; పక్షీకరించుచున్ = ఆత్మీయముగాఁ జేసికొనుచు; అనఁగా నపుడు పురుషులు స్మరార్తులై నిద్రా భావమున నెఱ్ఱనికన్నులు, విరహజ్వరభరమున విరిశయ్యపైఁ బొరలుటచేఁ జిక్కువడిన మణిహారములు, స్మరవరాయుధా హతిచేతఁ గల్గిన నిట్టూర్పులుగలవారై, స్త్రీలచెంతకుఁ బోఁగా వారు చూచి పరయువతిసాంగత్యము చేసి వచ్చినారని యలిగి యవ్వలి మొగములుగలవారై శయనించి యుండి, మాటిమాటికి బోటికత్తెలు చెప్పుటచేత స్వవిషయకానురాగముననె యట్లు న్నారని నిశ్చయించి, యినుమడికూటముల నలమి రతిశ్రమాపనోదనమునకై వారిఱొమ్ములమీఁదఁ జల్లు కర్పూరచూర్ణ ముతోఁ బండు వెన్నెలదండము మెలఁగి విరాజిల్లె నని భావము.
అలరుమల్లియవిరిసరులు – అలరు=ప్రకాశించునట్టి, మల్లియవిరిసరులు=మల్లెపూదండలు; తుఱిమి=కొప్పులలోఁ దుఱిమి కొని; అమలమౌక్తికదామంబులు =నిర్మలములైన ముత్యంపుపేరులను; తాల్చి=ధరించి; కపురంపుబొట్టులు=కర్పూరతిలక ములను; తీర్చి =దిద్ది; కమనీయమలయజకర్దమంబు=మనోజ్ఞమగు శ్రీచందనపంకమును; అలంది=పూసికొని; కలికి తెలిచలు వలు=అందమైన శుభ్రవస్త్రములను; ఊని=ధరించి; వెన్నెలన్=వెన్నెలయందు; తలవరులు=తలారులు; కనకుండన్=తమ్ము చూడకుండ; సంకేతనికేతంబులకున్=సంకేతస్థానములకు; పోవుత్రోవన్=పోవునట్టి మార్గమును; పొంచి=కనిపెట్టి; కమలకలికా సంలగ్న మధుపనినాద వలయఘీంకార సంకలిత మృణాళయష్టి – కమలకలికా=పద్మముకుళమునందు, సంలగ్న= సంబం ధించినట్టి, మధుప=తుమ్మెదలయొక్క, నినాద=ధ్వనులనెడు, వలయఘీంకార=కడియములయొక్క ఘీం అను శబ్దముల తోడ, సంకలిత=కూడుకొన్న, మృణాళయష్టి=తామరతూఁడనెడు దండమును; కరంబు=మిక్కిలి; ఊని=వహించి; అడ్డమ్ము పఱతెంచువారు = తమ కడ్డముగ వచ్చువారు; ఎవ్వ రెవ్వరనన్= మీ రెవ్వరెవ్వ రనఁగా; తలంకు మనంబునన్=చలించుచున్న మనస్సునందు; ఘట్టకుటికం బ్రభాతంబగు దారి =సుంకరకట్టయందు వేకువ యయ్యె నను రీతి, అనఁగా నొకసరకుఁ దెచ్చు వర్తకుండు సుంకరకట్ట దప్పించుకొని పోవలయునని రాత్రి పోవుచుండఁగా సుంకరకట్ట దగ్గఱకుఁ బోవువఱకె తెల్లవాఱినదని తదర్థము; అయ్యెన్ అని; మాఱు పలుకన్ నేరక = బదులుమాట చెప్పఁజాలక; మూలమూలల =ప్రతిమూలయందు; ఒదుఁ గుచున్=చొచ్చుచు; తలంకునెడన్=భయపడు సమయమున; కిలకిల నవ్వుచున్=కిలకిలయనునట్లు నవ్వుచు; తమ్మెఱుఁగఁ జేయన్=తమ్ము తెలుపఁగా; ఒక్కింత చిగిరించు నలుకన్=కొంచెమంకురించుకోపముచేత; అభిసారికాజనంబులు=జ్యోత్స్నా భిసారకలు; ప్రియులపైన్=తమవల్లభులపైని; రువ్వు మవ్వంపు విరిగుత్తులన్= విసరివైచు మనోహరములైన పూగుత్తులను; చివ్వకున్=జగడమునకు; పిల్చుచున్=ఆహ్వానము చేయుచు; అనఁగా నపు డభిసారికలు జ్యోత్స్నానురూపములైన తెల్లని మల్లికామాల్య మౌక్తికదామ కర్పూరతిలక చందనచర్చికాదులు పూని తలవరుల కగపడఁగూడదని పోవుచుండఁగా ప్రియులు వారు పోవుదారిం గాచి కమలముకుళమున వసించిన తుమ్మెదనాదము లనెడు కడియములచప్పుడుతోఁ గూడిన మృణాళయష్టి నిం బూని యడ్డముగావచ్చు వారెవ్వరని యడిగి, వారేమియుఁ జెప్పఁజాలక మూలమూల నొదుఁగుచు భయపడునెడఁ గిల కిల నవ్వఁగా నాస్త్రీలకుఁ గొంచెము కోప మంకురించి మవ్వంపువిరిగుత్తులు వారిపై రువ్వినా రనియు, నాగుత్తులఁ బండువెన్నెల జగడమునకు బిల్చిన దనఁగాఁ దత్తుల్యమై పొల్చె నని భావము. ‘మదనానలసంతప్తా యాభిసారయతి ప్రియమ్, జ్యోత్స్నీ తమ స్వినీ యానయోగ్యాంబరవిభూషణా, స్వయం వాభిసరే ద్యాతు సా భవే దభిసారికా,కాన్తాభిసరణే స్వీయా లజ్జానాశా దిశఙ్క యా, వ్యాఘ్రహుఙ్కార సంత్రస్త మృగశాబవిలోచనా, నీలాదిరక్తవసనరచిఙ్గాగావగుణ్ఠనా, స్వాఙ్గే విలీనావయవా నిశ్శబ్ద పద చారిణీ, సుస్నిగ్ధైకసఖీమాత్రయుక్తాయాతి సముత్సుకా’ అని యభిసారికాసామాన్యవిశేషలక్షణములు తెలియవలయు.
వన్నె గల వెన్నెలన్=ప్రకాశమానమగు వెన్నెలయందు; బయటన్=నిరావరణప్రదేశమున; ఎన్నరానివేడుక పన్నిదంబులు = అగణితంబులగు వేడుకపందెములను; పన్ని=చేసి; సుహృన్నికరంబులతోన్=మిత్రబృందములతోడ; పెన్నేర్పునన్=మిగుల చాతుర్యముచేత; జూదంబులు=ద్యూతములను; ఆడుచున్నకతంబునన్=ఆడుచున్నకారణమున; కొంతదడవగుటన్ =కొంత విలంబ మగుటవలన; పటుతర మహానట మనస్తట నానట ద్ధైర్య విపాటనాటోప సముత్కట శంబరప్రతిభట కృపీటజకోరకశర పటలధారా దోధూయమాన మానసంబుతోన్ – పటుతర=సమర్థుఁడగు, మహానట=శివునియొక్క, మనస్తట=హృత్ప్రదేశ మందు, నానటత్=మిక్కిలి నటించుచున్న, ధైర్య=ధీరత్వముయొక్క, విపాటనాటోప=భేదనాతిశయముచేత, సముత్కట= మిగుల విజృంభించినట్టి, శంబరప్రతిభట=శంబరాసురవైరి యగు మన్మథునియొక్క, కృపీటజకోరకశర=తమ్మిమొగ్గలనెడు బాణములయొక్క, పటల=సమూహముయొక్క, ధారా=అంచులచేత, దోధూయమాన=మిగులఁగంపించునట్టి, మానసంబు తోన్=చిత్తముతోడ; విచ్చలవిడిన్=యథేచ్ఛముగా; పెచ్చుపెరుఁగుతాపంబునన్=అధికముగా వృద్ధిఁబొందు సంతాపముచేత; వెచ్చన్ = వేఁడిగా; ఊర్చుచున్=ఊర్పులు పుచ్చుచు; నెమ్మదిన్ =మంచిమనమునందు; క్రచ్చుకొని=దట్టమై; హెచ్చు మో హంబునన్ =అతిశయించు వలపుచేత; నెచ్చెలిచేతికిన్=ప్రియసఖీహస్తమునకు; అచ్చంపుగుఱుతు=మంచియానవాలును; ఇచ్చి; మచ్చికలన్=ప్రేమలచేత; వల్లభున్=ప్రియుని; తోడ్కొని రమ్ము అంచున్= తోడితెమ్మనుచు; అంచి=పంపి; అంచిత బహిరంగణప్రదేశంబులన్ =ఒప్పుచున్న ముంగలిభూములయందు; నిలిచి=ఉండి; పతిరాకకున్=ప్రియునిరాకకు; ఎదురు చూచునదియును =నిరీక్షించుచున్నదియును, ఇది వెలయువిదలకు విశేషణము; నెయ్యంపుఁబొదల తూఁగుటుయ్యెలపైన్ =మనోహరమగు నికుంజములందలి తూఁగుచున్న డోలికపై; ఒయ్యారంబునన్=శృంగారగర్వముచేత; కూర్చుండి; ప్రియుండు =వల్లభుఁడు; పసిండిదండియన్=బంగారువీణాదండమును; పూని=వహించి; సుతి మీటన్=సుతిచేయఁగా; విభునిచెంతన్=ప్రియునొద్ద; వసియించి=ఉండి; చిన్నికిన్నెరన్=చిన్నివీణియను; పూని=చేకొని; పంచశరదేవతా విజయ ప్రపంచ సమంచితంబులు – పంచశరదేవతా=అనంగునియొక్క, విజయ=గెలుపుయొక్క, ప్రపంచ=విస్తారముచేత, సమంచి తంబులు = ఒప్పుచున్నవి, అనఁగా శృంగారరసప్రతిపాదకము లగునవి; అగు నూతనగీతంబులు = ఐనట్టి క్రొత్తపాటలను; పలికించి=కిన్నెరపై వాయించి; చెలులన్= సకియలను; చొక్కించునదియును=సుఖపారవశ్యమునందించునదియును; అడుగు లొరయన్ = పాదములు దాఁకునట్లుగా; కొన సాగ=తుదిముట్టునట్లు; అల్లినజడకున్=అల్లినట్టి వేణికి; చుట్టిన మొల్ల విరితావి=పరివేష్టించిన మొల్లపూవులపరిమళము; ఎల్లెడలకున్=అంతటను; పరవన్=ప్రసరింపఁగా; మంజుల చరణకంజ సంజిత కంజరాగ మంజీర శింజారవంబులు—మంజుల= అందమగు, చరణకంజ = పాదపద్మములందు, సంజిత=కూర్పఁ బడిన, కంజరాగ=పద్మరాగమణులయొక్క, మంజీర= అందెలయొక్క, శింజారవంబులు = గజ్జెలచప్పుడులు; కర్ణగ్లానిన్= చెవులయొక్కహర్షాభావమును; మాన్పన్=పోఁగొట్టఁగా, కర్ణసుఖసంపాదకములు కాఁగా ననుట; ఒఱ దొఱపిన వలదొర పరువంపుఁగైదువు తెఱఁగునన్ – ఒఱ దొఱపిన = కోశమునందు దోఁపిన, వలదొర=మరునియొక్క, పరువంపు=తరుణమైన, కైదువుతెఱఁగునన్=ఆయుధమురీతిచేత; నిండారన్=నిండుగా; దువ్వలువన్=దుప్పడమును; కప్పి=కప్పికొని; కాంతునిశాం తంబునకున్=ప్రియునిగృహమునకు; బోటులవెంటన్= చెలియల వెంట; చనునదియును =పోవునదియును; తనమనంబు= తనచిత్తము; అలరన్=సంతసించునట్లు; కలసి=కూడి; కళలన్ =కామశాస్త్రప్రసిద్ధమగు ననంగకళలయందు; తేలించి=సుఖపెట్టి యనుట; మేలుంచి=శుభము కల్గించి; ఏలిననాయకుని యెడన్ =పోషించిన ప్రియునిమీఁద; ఎడయని=తొలగని; ప్రియమ్ము నన్=ప్రీతిచేత; తఱిసి=సమీపించి; విరిసరులు=పుష్పహారములు; తుఱిమి=చెరివి; చలువన్=శైత్యమును; వెదచల్లుకలపంబు =వ్యాపింపఁజేయునట్టి గందమును; అలంది=పూసి; అంతంతన్ = అంతకంతకు; పొడము మోహమ్ములన్ = ఉదయించు ననురాగములతోడ; అలమి=ఆక్రమించి; కెమ్మోవి=ఎఱ్ఱనిపెదవిని; నొక్కి= కొఱికి; పునారతులకున్=ద్వితీయసురతములకు, పునఃరతులు అనుచోట సంస్కృతసంధివశమున విసర్గలోపము, పునశ్శ బ్దాంతిమా కారమునకు దీర్ఘమును గలిగినది; వేడుక= ఉత్సాహమును; రేఁచి=అతిశయింపఁజేసి; పైకొనునదియును= ప్రియుని పైకిఁ గ్రమ్మునదియును; ఐ వెలయు వెలయువిదల గలితచందనచర్చాపాలికలన్ – ఐ=అయి, వెలయు=ఒప్పునట్టి, వెలయువిదల =వెలయాండ్రయొక్క, గలిత=పడిపోవు చున్న, చందనచర్చాపాలికలన్=గందపుఁబూతల పరంపరలతోను; కనత్తర దరహాసవిభా రింఛోళికలన్=ఒప్పుచున్న మంద హాసముల కాంతిపుంజములతోను, కర్ణావతంసిత కైరవపత్త్ర మంజరికా విభాళికలన్= కర్ణభూషణములుగాఁ జేయఁబడిన కలువ ఱేకుల తేజఃపరంపరలతోను, కబరికాభివేష్టిత లతాంతమాలికలన్= కొప్పులందుఁ జుట్టిన పూలదండలతోను; కలసి=కూడి; మెలఁగుచున్=ఒప్పుచు; అనఁగా నపుడు వెలయాండ్రలో నొకతె తన ప్రియుఁడు వెన్నెల బయట మిత్త్రమండలితో జూదము లాడుచుఁ దడవుసేయఁగా మదనశరములచే బాధితయై నెచ్చెలిచేతి కచ్చంపునానవా లిచ్చి, ప్రియుని దోడితెమ్మని యంపి, ముంగిటఁ గూర్చుండి పతిరాక కెదురుచూచునదియు, నొకతె పొదరింటిలో దూఁగుటుయ్యెల పైఁ గూర్చుండి ప్రియుఁడు పసిండిదండియఁబూని సుతి మీటఁగా సంభోగసమయసముచితములైన క్రొత్తపాటలు పాడి చెలులఁ జొక్కించునదియు, నొకతె జాఱ విడిచిన జడ నల్లిన మొల్లలవాసన నలుదెసలఁ గ్రమ్మఁగా బద్మరాగ మణిమయము లగు కాలియందెలఁ బొందుపఱిచిన గజ్జెలచప్పుడులఁ గర్ణానందము లగుచుండఁగా నిండార దువ్వలువ గప్పి చెలియలఁ గూడి ప్రియుని నికేతనమునకుం బోవు నదియు, నొకతె తన్ను వివిధరత్నములతో సంతసింపఁ జేసిన నాయకు నొద్దఁ బ్రీతితోఁ జేరి పూదండలు కొప్పునం దుఱిమి మిగులఁ జలువ యైనకలపంబుఁబూసి యంతంత కుదయించు రాగమున మఱల రతమునకై పైకొనునదియు నై యుండఁగా, వారలు పూసికొన్నగంధపరంపరలతోను, వారి మందహాసకాంతిసంతతితోను, కర్ణాభరణముగా నుంచికొన్న తెలికలువఱే కుల తేజఃపుంజముతోను, కొప్పుల నొప్పుగ నుంచికొన్న కుసుమముల దీధితివితానముతోను కలసి మెలసి యా వెన్నెల చెన్నారె నని భావము. ఇందు వన్నెగలవెన్నెల యను తొలుతటివాక్యమున విరహోత్కం ఠితయు, రెండవదానియందు, నాల్గవదానియందును స్వాధీనపతికయు, మూఁడవదానియం దభిసారికయు నగును. ‘అనాగసి ప్రియతమే చిరయత్యుత్సు కాతు యా, విరహోత్కంఠితా భావవేదిభి స్సముదాహృతా| ఆసన్నాయత్తరమణా హృష్టాస్వాధీన వల్లభా’ అని విరహోత్కం ఠికా, స్వాధీనపతికల లక్షణములు. అభిసారికాలక్షణము వ్రాయఁబడినదె యైనను వేశ్యాభిసారికను గూర్చి విశేషము – ‘వేశ్యాభిసారికా త్వేతి హృష్టా వైశికనాయకమ్| ఆవిర్భూత స్మితముఖీ మదఘూర్ణితలోచనా| అనులిప్తాఖిలాఙ్గీ చ విచిత్రాభర ణాన్వితా| స్నేహాఙ్కురితరోమాఞ్చ స్ఫుటీభూతమనోభవా| సంవేష్టితా పరిజనై ర్భోగోపకరణాన్వితైః| రశనారావమాధుర్య దీపితానఙ్గవైభవా| చరణామ్బుజసంలగ్నమఞ్జుమఞ్జీరమఞ్జుళా||’ అని రసార్ణవసుధాకరమున లక్షణము వ్రాయఁబడినది.
మహోత్పలమండలత్రాణైకవిహారవిలాసాంచితంబు అయ్యును – మహత్=అధికమగు, ఉత్పలమండల=కలువలగుంపు యొక్క, త్రాణ=రక్షణమందు, ఏక=ముఖ్యమైన, విహారవిలాస=విహరణప్రకాశముచేత,అంచితంబయ్యును = ఒప్పుచున్న దైనను; మహోత్పలమండలామోదహరణైక విలాసాంచితంబు ఐ – మహోత్పల=అరవిందములయొక్క, ‘అరవిన్దం మహో త్పలమ్’ అని యమరుఁడు, మండల= సమూ హముయొక్క,ఆమోద=సంతసముయొక్క,హరణ=హరించుటయొక్క, ఏక=ముఖ్యమగు, విలాసాంచితంబు ఐ = విలా సముచేత నొప్పుచున్నదై; రాత్రి కలువలు వికసించుటయుఁ బద్మములు ముడు గుటయుఁ బ్రసిద్ధము;
అసమకాండ చండప్రతాప నాశకనిజోదయంబయ్యును – అసమకాండ=సూర్యునియొక్క, చండప్రతాప=తీవ్రమగు వేఁడికి, నాశక=ద్వంసముచేయునది యగు, నిజోదయంబు = తన యుదయము గలది, అయ్యును; అసమకాండచండప్రతాపసం వృద్ధికరనిజోదయంబై – అసమకాండ=మన్మథునియొక్క,చండప్రతాప=ఉగ్రప్రతాపముయొక్క,సంవృద్ధికర=రక్షకమగు, నిజోదయంబై=తన యావిర్భావము గలదై; వెన్నెల ఉదయించి నపుడు సూర్యతాప ముడిఁగి మదనతాపము మించు ననుట. దివ్యచక్రచిత్తానందసంధాయకం బయ్యును – దివ్యచక్ర=సురనికరముయొక్క, చిత్తానంద=మనస్సంతోషమునకు, సంధాయ కం బయ్యును =జనకమయ్యును; దివ్యచక్రచిత్తానందభేదకంబై – దివ్యచక్రచిత్తానందభేదకంబై =సుందరములైన చక్రవాకముల మనోనందమునకు భేదకమై; సురలు సుధఁ గ్రోలువారు గాన వెన్నెల వారి కానందప్రదమగుటయు, చక్రవాకమోదభేదకమగు టయు ప్రసిద్ధము; రాజిల్లుచున్=పైఁజెప్పిన భంగి విలసిల్లుచు; ద్రుహిణాండకరండంబునకున్=బ్రహ్మాండమనెడుబరణికి; వెండి జలపోసనంబు దారిన్=వెండినీరుయొక్క పైపూఁతవలె; ప్రకాశించెన్=విలసిల్లెను; అయ్యవసరంబునన్ –ఇది ముందు కన్వయము.
మ. అలపాంచాలకుమారి యేపఱి సువ◊ర్ణాంచత్పరాగాళికిన్
నెలవై రా నలకాండధామగతి కెం◊తేఁ దోఁచి పెల్లేఁచ వె
న్నెల వై రానలకాండధామనయనో◊న్మేషస్ఫురత్కోకిలా
బల మ్రోయన్ వెఱ నూని మున్ సితరుచిన్ ◊బల్కున్ విరోధోక్తులన్. 108
టీక: అలపాంచాలకుమారి=ఆచంద్రిక; సువర్ణాంచత్పరాగాళికిన్ – సువర్ణ=సంపెంగపూవులయొక్క, అంచత్=ఒప్పుచున్న, పరాగాళికిన్=పుప్పొడిచాలునకు; ఏపఱి=ఏపు+అఱి=డస్సి; వెన్నెల=జ్యోత్స్న; ఎంతేన్=మిక్కిలి; తోఁచి=పొల్చి; నలకాండధామగతికిన్ – నలకాండ=పద్మబాణుడగు మన్మథునియొక్క, ధామ=ప్రతాపముయొక్క, గతికిన్=వ్యాప్తికి; నెలవై =
స్థానమై; పెల్లు=మిక్కిలి; ఏఁచన్=బాధించుటకు; రాన్=రాఁగా; వై ర=విరోధమనెడు, అనలకాండ=అగ్నిపుంజమునకు, ధామ =ఆశ్రయమగుచున్న, నయనోన్మేష=నేత్రవికాసముచేత, స్ఫురత్=ప్రకాశించుచున్న,కోకిలాబల=ఆఁడుకోకిల, కోయిలకుఁ గన్ను లెఱ్ఱగ నుండుట స్వాభావికము; మ్రోయన్=కూయఁగా; వెఱన్=భయమును; ఊని=వహించి; మున్=తొలుత; సిత రుచిన్=చంద్రునిగూర్చి; విరోధోక్తులన్=విరోధవాక్యములను; పల్కున్=వచించును.
అనఁగా నట్లు వెన్నెల గాయుచుఁ జంద్రికను మిక్కిలి బాధించె ననియుఁ, గోకిలారవము మిక్కిలి దుస్సహమైన దనియు, దాని వలనఁ జంద్రిక చంద్రాదులను దూషింపఁ దొడంగె ననియు భావము.
చ. కమలక యౌర్వహేతితతి ◊గాఢనవోదయరాగకీలిచేఁ
దెమలక రాహువక్త్రసము◊దీర్ణవిషాగ్ని నడంగ కున్నమ
త్కమలకరాళికాధికశి◊ఖాహతిఁ దూలక పొల్చి తక్కటా
కమలకరాళికాధిగత◊కాలుషి నేమన వచ్చుజాబిలీ. 109
టీక: జాబిలీ=చంద్రుఁడా! ఔర్వహేతితతిన్=బడబాగ్నిజ్వాలాసమూహముచే; కమలక=కందక; గాఢనవోదయరాగకీలిచేన్ –గాఢ=దట్టమైనట్టి, నవ=నూతనమైన, ఉదయరాగ=ఉదయకాలికారుణ్య మనెడు, కీలిచేన్=జ్వాలచేత; తెమలక=చలింపక; రాహువక్త్రసముదీర్ణవిషాగ్నిన్ – రాహువక్త్ర=రాహువునోటియందలి, సముదీర్ణ=అత్యుత్కటమైన, విషాగ్నిన్=విష మనెడు వహ్నిచేత; అడంగక=నశింపక; ఉన్నమత్కమలకరాళికాధికశిఖాహతిన్ – ఉన్నమత్=పైకెగయుచున్న, ఇది అగ్నికి విశేషణము, కమలకర= లేడిహస్తమునందుఁగల శివునియొక్క, అళిక=ఫాలమునందలి, అధిక=అధికమగు,శిఖా=జ్వాలయొక్క, హతిన్=కొట్టుటచేత; తూలక=పడిపోవక; పొల్చితి=ఉదయించితివి; అక్కటా=అయ్యో (ఖేదము), కమలకరాళికాధిగత కాలుషిన్ – కమలకరా=స్త్రీలయొక్క, ఆళికా=శ్రేణిచేత, అధిగత=పొందఁబడిన,కాలుషిన్=పాపమును; ఏమన వచ్చున్= ఏమి యని చెప్పవచ్చును. అనఁగా బడబాగ్న్యుదయరాగాగ్ని, రాహువక్త్రవిషాగ్ని, హరఫాలనేత్రాగ్నిశిఖలచేతఁ జంద్రుఁడు నశిం పక యుదయించుట స్త్రీలు చేసినపాపముచేతనే గాని వేఱు గా దనుట.
శా. స్వచ్ఛాయన్ వనితాళిఁ దూల్చుటలు, దీ◊వ్యచ్చక్రమోదచ్ఛిదా
స్వచ్ఛందోహ! యనూనధామహృతచం◊చత్తావకోజోఖిల
స్వచ్ఛందోహయమాన మేఁచుటలొ యు◊ష్మద్భేదనాఢ్యాంఘ్రిభా
స్వచ్ఛందోహయమాన మేఁచుటలొ ని◊చ్చల్ దల్పుమా హృత్స్థలిన్. 110
టీక: దీవ్య చ్చక్ర మోద చ్ఛిదా స్వచ్ఛందోహ – దీవ్యత్=ఒప్పుచున్న, చక్ర=చక్రవాకములయొక్క, రాష్ట్రములయొక్క యని యర్థాంతరము దోఁచుచున్నది, మోద=సంతోషముయొక్క, ఛిదా=ఛేదనమందు,స్వచ్ఛంద=స్వాభీష్టమగు, ఊహ=తలఁపు గలవాఁడా! ఇది చంద్రసంబోధనము; స్వచ్ఛాయన్=నిజకాంతిచేత, వనితాళిన్=అబలాకదంబమును; తూల్చుటలు=తూలఁ జేయుటలు; అనూన ధామ హృత చంచ త్తావ కోజోఖిలస్వ చ్ఛందో హయ మానము – అనూన=అధికమగు, ధామ=ప్రతా పముచేత, హృత=హరింపఁబడిన, చంచత్=ఒప్పుచున్న, తావక=నీసంబంధియైన, ఓజః=తేజస్సనెడు, అఖిలస్వ=సకల ధనము గలవానియొక్క, అనఁగా సూర్యునియొక్క యని గాని, రాహువుయొక్క యని గాని భావము. ఈపదము నేయార్థ మైనను ‘యమకాది ష్వదుష్టం స్యా న్నిహతార్థం నిరర్థకం’ ఇత్యాదిగా వెనుక వ్రాయఁబడిన ప్రమాణముచేఁ గావ్యదోషము ప్రస రింపదని తెలియవలయు, ఛందః= అభిప్రాయముయొక్క,హయ=వేగముయొక్క,మానము=మర్యాదను; ఏఁచుటలొ=భంగ పఱచుటలొ; యుష్మ ద్భేదనాఢ్యాంఘ్రి భాస్వ చ్ఛందోహయమానము – యుష్మత్=నీయొక్క, నిందయందు బహువచనము, భేదన= భేదించుటయందు,ఆఢ్య=సమర్థమైన, అంఘ్రి=పాదములచేత, భాస్వత్=ఒప్పుచున్న,ఛందోహయ= శివుని యొక్క, మానము =గర్వము; ఏఁచుటలొ=భంగపఱచుటలో;నిచ్చల్=ఎల్లపుడు; హృత్స్థలిన్=హృదయసీమయందు; తల్పుమా=చింతింపుమా.
అనఁగా నీసర్వస్వము హరించునట్టి సూర్యునిజోలికిఁ బోక నిన్నుఁ గాలితోఁ దన్నిన శివు నేమియుఁ జేయఁజాలక నీవు చక్రసంతోషమును బోఁగొట్టినవాఁడవు కావున యబలల బాధించుచున్నావు. ఇది నీకు యుక్తము గాదని తాత్పర్యము. శివుఁడు దక్షయాగధ్వంసమునఁ జంద్రుని కాలితోఁ దన్నినట్లు పురాణప్రసిద్ధము.
సీ. అనురక్తి పొదల ది◊వ్యాచార్యునవలా ల,లితకంతుకేళికా◊గతిఁ దెమల్చి,
మాతంగసఖ్య మే◊మఱక గన్నవలాల,నేలు మారునిచెల్మి ◊నెడయ మాని,
చక్రవిప్రవరతే◊జం బెల్ల నవలాల,సారూఢిఁ గరశక్తి ◊నపహరించి,
పరమలింగాప్తిఁ జూ◊పట్టు తా నవలాల,సద్దీప్తిఁ బాషండ◊సరణిఁ దాల్చి,
తే. మలినతరకీర్తిజాతంబు◊లిల నలర్చి, ప్రోది గను నిన్నుఁ దిలకింప ◊రోహితాంక
పతి కడుపు మండకుండునే ◊బాడబాగ్ని,రూఢ కీలాపరంపర ◊రోహితాంక. 111
టీక: రోహితాంక =చంద్రుఁడా! దివ్యాచార్యునవలాన్ = అమానుషుఁడగు నుపాధ్యాయుని స్త్రీని, బృహస్పతిపత్ని నని వాస్తవా ర్థము, లలితకంతుకేళికాగతిన్ – లలిత=మనోజ్ఞమైన, కంతుకేళికా=కామక్రీడయొక్క, గతిన్=ప్రాప్తిచేత; అనురక్తి పొదలన్ = అనురాగ మొప్పునట్లు, తెమల్చి=చలింపఁజేసి; మాతంగసఖ్యము=చండాలసాంగత్యము, గజసాంగత్య మని వాస్తవార్థము, ఏమఱక=పొరపడక; కన్నవలాలన్ = పొందినట్టి బలములను, తుమ్మెదల ననుట; తుమ్మెదలు కామసైన్యములోఁ జేరినవగుట ప్రసిద్ధము; ఏలు మారునిచెల్మిన్ =పోషించు ఘాతుకునియొక్క స్నేహమును, మరునియొక్క సఖ్యము నని వాస్తవార్థము; ఎడయ మాని =ఎడఁబాయకుండుట మానివైచి; చక్రవిప్రవరతేజంబు – చక్ర=రాష్ట్రములయందలి, విప్రవర=బ్రాహ్మణశ్రేష్ఠులయొక్క, చక్రవాకములనెడు పక్షిశ్రేష్ఠములయొక్క యని వాస్తవార్థము, తేజంబు=తేజస్సును; ఎల్లన్=అంతను; నవలాలసారూఢిన్ – నవ=నూతనమైన, లాలసారూఢిన్=ఔత్సు క్యాతిశయముచేత; కరశక్తిన్=హస్తసామర్థ్యముచేత, కిరణసామర్థ్యముచేత నని వాస్తవార్థము; అపహరించి=పోఁగొట్టి; పరమలింగాప్తిన్ – పరమ=ఉత్కృష్టమైన, లింగాప్తిన్= లింగధారణముచేత ననుట, ఉత్కృష్టమైన చిహ్నమును పొందుటచేత నని వాస్తవార్థము; చూపట్టు తానవ లాలస ద్దీప్తిన్ – చూపట్టు=అగపడుచున్న, తానవ=తనుసంబంధియైన, లాలసత్ = మిగులఁ బ్రకాశించుచున్న, దీప్తిన్=కాంతిచేత; పాషండసరణిన్=పాషండునిదారిని; తాల్చి=వహించి; మలినతరకీర్తిజాతంబులు – మలినతరకీర్తి=అపకీర్తులయొక్క, జాతంబులు=సమూహములను, నల్లగల్వల నని వాస్తవార్థము. ‘కీర్తి ర్యశసి కర్దమే’ అని విశ్వము; ఇలన్=భూమియందు; అలర్చి=వికసింపఁజేసి; ప్రోది గను నిన్నున్ =వృద్ధినందెడు నిన్ను; తిలకింపన్=చూడఁగా; రోహితాంకపతికడుపు =సముద్రుని యుదరము;బాడబాగ్నిరూఢకీలాపరంపరన్=బడబాగ్నియొక్క యధికమైన జ్వాలా సంతతిచేత; మండకుండునే=ఎరియకుండునా?
అనఁగా రాగాతిశయముచేత గురుపత్నీగమనము చేసి, మాతంగసఖ్యము గన్న సైన్యము నేలు ఘాతుకునికి చెలివై, లింగ ధారణము చేసి పాషండుఁడవై, లోక మెల్ల నపకీర్తి నెఱపిన నిన్నుఁ జూచి నీతండ్రి యగు సముద్రునకు బడబాగ్నిజ్వాలలచేతఁ గడుపు మండు ననుట. చంద్రుఁడు బృహస్పతిభార్యను పొందుట, గజములఁ బొందు తుమ్మెదల నేలుమారునిచెలి యగుట, తనదేహకాంతిచేత చక్రవాకమోద మపహరించుట, కళంకమును దాల్చుట, నల్లగలువల వికసింపఁజేయుట, సముద్రోదరము బడబానలమును గల్గియుండుట, స్వభావములు.
మ. అలరం గామవిమోహనైకవిహృతుల్ ◊ప్రాంచన్నలశ్రీగతుల్
దలఁగన్ రాజిలునీమహాభ్యుదయ మా◊త్మం జూడఁగా విస్ఫుర
త్కలికాలాభ మనంగఁ జెందునె సుదృ◊గ్వ్రాతంబు చాల న్నవో
త్కలికాలాభ మనంగశత్రునిటలో◊గ్రజ్వాలితుల్యద్యుతీ! 112
టీక: అనంగశత్రు నిట లోగ్రజ్వాలి తుల్యద్యుతీ – అనంగశత్రు=శివునియొక్క, నిటల=ఫాలమునందున్న, ఉగ్రజ్వాలి= భయం కరమగు నగ్నితోడను, తుల్యద్యుతీ=సమానమైన కాంతిగలవాఁడా! ఇది చంద్రునికి సంబోధనము; కామ విమోహ నైక విహృ తుల్ —కామ=మన్మథునియొక్క, విమోహన=మోహింపఁజేసెడు, ఏక=ముఖ్యమగు, విహృతుల్=విహారములు; కామ= మిక్కిలి, వి=పక్షియొక్క, మోహన=మోహింపఁజేసెడు, ఏక=ముఖ్యమగు, విహృతుల్=విహారములుఅని యర్థాంతరము దోఁచును; అలరన్=ఒప్పఁగా; ప్రాంచ న్నల శ్రీగతుల్—ప్రాంచత్=ఒప్పుచున్న, నల=పద్మములయొక్క, నలరాజుయొక్క యని యర్థాంతరము, శ్రీగతుల్=కాంతిగతులు, సంపద్గతులు; తలఁగన్=తొలఁగిపోఁగా; రాజిలు నీమహాభ్యుదయము – రాజిలు=ప్రకాశించుచున్న, నీమహాభ్యుదయము=నీయొక్క గొప్పయావిర్భావము, సమృద్ధి; ఆత్మన్=చిత్తమందు; చూడఁ గాన్ =భావింపఁగా; విస్ఫుర త్కలికాలాభన్ – విస్ఫురత్=ప్రకాశించుచున్న, కలికాల=కలియుగముయొక్క, కలిపురుషుని యొక్క యనుట, ఆభన్=కాంతిచేత; మనంగన్=వృద్ధిఁ జెందఁగా; సుదృగ్వ్రాతంబు=స్త్రీచయము, పండితమండలి యని యర్థాంతరము; చాలన్= మిక్కిలి; నవోత్కలికాలాభము – నవ=నూతనమగు, ఉత్కలికా=వేడుకలయొక్క, లాభము= ప్రాప్తిని; చెందునె=పొందునా? అనఁగా కలిపురుషుఁడు పక్షియొక్క వ్యామోహవిహారములచే నలచక్రవర్తిసిరులు తొలఁగఁజేసి విరాజిల్లుచుండఁగా సజ్జనులు సంతసింపనట్లు, నీవు మరుని భ్రామకవిహారము లలరుచుండఁగాఁ, బద్మములసిరులు తొలఁగు చుండఁగా, రాజిల్లుటకు స్త్రీలు సంతసింప రనుట.
సీ. కల సూపి తొలుదొల్త ◊గాంచితో మేషవా,హలసమానార్చిశ్చ◊యస్ఫురణము,
వెనువెంటఁ జనుచుఁ జ◊య్యన లాగితో సదో,హలసమాన్యహయోత్క◊టాంశుమహిమ,
జడల నడుమనుండి ◊పడసితో కందర్ప,హలసమాతతనిట◊లాగ్నిశక్తి,
ననుజుండ ననుచుఁ బా◊లందితో ఘనహలా,హలసమాభీలకీ◊లాలిరూఢి,
తే. నకట చల్లనిరాజ వీ◊వట్టినీకుఁ,బొసఁగె నేదారి నీసర్వ◊భువనజాత
సుఖదతేజంబు సన నిట్లు ◊శుంభదౌర్వ,పుంజనిభధామ మవధూత◊భువనజాత. 113
టీక: అవధూతభువనజాత=తిరస్కరింపఁబడిన లోకసమూహము గలవాఁడా! తిరస్కరింపఁబడిన జలజాతములు గలవాఁడా యని వాస్తవార్థము; తొలుదొల్తన్=మొట్టమొదట; కల సూపి =విద్య మెఱయించి, కల నిచ్చి యని వాస్తవార్థము, ‘ప్రథమాం పిబతే వహ్నిః’ అని యాగమప్రసిద్ధము; మేషవాహ లసమా నార్చిశ్చయ స్ఫురణము – మేషవాహ=అగ్నియొక్క, లసమాన =ప్రకాశించుచున్న, అర్చిశ్చయ=తేజస్సమూహముయొక్క, స్ఫురణము=స్ఫూర్తిని; కాంచితో=పొందితివో, వెనువెంటన్=వెంటవెంటనె; చనుచున్=పోవుచు; సదోహల సమాన్యహ యోత్కటాంశుమహిమన్ – సదోహల=ఉత్సాహ ముతోఁ గూడిన, సమాన్యహయ=సప్తాశ్వుఁడగు సూర్యునియొక్క, ఉత్కట=అధికములైన, అంశు=కిరణములయొక్క, మహిమన్=అతిశయమును;చయ్యనన్=శీఘ్రముగా, లాగితో=ఆకర్షించితివో, జడలనడుమన్=జటామధ్యమునందు, ఉండి=వసించి; కందర్పహల సమాతత నిటలాగ్నిశక్తిన్ – కందర్పహల=శంకరుని యొక్క, రేఫలకారముల కభేదమునుబట్టి హలశబ్దమునకు హరశబ్దము గ్రాహ్యము, సమాతత=మిగుల నధికమైన, నిటలాగ్ని శక్తిన్=ఫాలాగ్నిసామర్థ్యమును; పడసితో=పొందితివో,
అనుజుండ ననుచున్=తమ్ముండ ననుచు; ఘన హలాహల సమాభీల కీలాలి రూఢిన్ – ఘన=అధికమైన, హలాహల=కాల కూటముయొక్క, సమాభీల=మిగుల భయంకరమగు, కీలాలి=జ్వాలాసమూహముయొక్క,రూఢిన్=అతిశయమునందు; పాలందితో=భాగమందితివో, ఈవు=నీవు; చల్లనిరాజవు=చల్లనిదొరవు;అట్టి నీకున్=అటువంటివాఁడవైన నీకు; ఈసర్వభువనజాతసుఖదతేజంబు – ఈ సర్వ=ఈసమస్తమైన, భువనజాత=లోకసమూహమునకు, సుఖద=సుఖము నిచ్చెడు,తేజంబు=కాంతి; చనన్=పోఁగా; ఇట్లు=ఈప్రకారముగ; శుంభ దౌర్వపుంజ నిభ ధామము – శుంభత్=ప్రకాశించుచున్న, ఔర్వపుంజ = బడబాగ్నికదంబము తోడ, నిభ = సదృశమైన,ధామము = తేజస్సు; ఏదారిన్=ఏరీతి; పొసఁగెన్=కలిగెను; అకట=ఆశ్చర్యము!
అనఁగా చల్లనిరాజ వగునీకు బడబాగ్నిపుంజసమాన మగు నిట్టి తేజస్సు, అగ్నికిఁ దొలుత కలఁ జూపి అతని తేజస్తతిని గాంచుట వల్లనా? సూర్యునివెంటఁ బోవుచు నాతని యుత్కటతేజోమహిమను లాగికొనుటవల్లనా? శివుని జటామధ్యమునుండి తన్నిట లాగ్నిశక్తిని బడయుటచేతనా? కాలకూటమున కనుజన్ముఁడవై దాని యాభీలకీలారూఢి పాలందుటచేతనా? వీనిలో దేనివల్లఁ గలిగె ననుట. ఇటఁ జంద్రతేజఃపుంజమునందు అగ్న్యాద్యన్యతమసంబంధిత్వప్రశ్నవ్యాజముచే తత్తాదాత్మ్యదృఢీకరణము వల్లను బూర్వావస్థకన్న నుత్కర్షాపకర్షములు చెప్పమివలనను ‘చంద్రజ్యోత్స్నావిశదపులినే సైక తేస్మి న్సరయ్వాః’ ఇత్యాదు లందువలె ననుభయతాదాత్మ్యరూపకము. ‘విషయ్యభేద తాద్రూప్యరఞ్జనం విషయస్య యత్, రూపకం తత్త్రిధాధిక్య న్యూన త్వానుభయోక్తిభిః’ అని తల్లక్షణము.
క. ఈలీలఁ జంద్రు నని, ల
క్ష్మీలలనాతనయుఁ బలికెఁ ◊గినుక మధుపరా
జాలక శరభవజాలక
జాలకశరభవదురంత◊సంతాపికయై. 114
టీక: ఈలీలన్=ఈప్రకారముగ; చంద్రున్=చంద్రునిగూర్చి; అని=పలికి; మధుపరాజాలక – మధుపరాజ=తుమ్మెదమిన్నలను బోలు, అలక=ముంగురులు గల చంద్రిక; శరభవ జాలక జాలక శరభవ దురంతసంతాపికయై–శరభవ=కమలములయొక్క, జాలక=మొగ్గలయొక్క, జాలక=సమూహములు, శర=బాణములుగాఁ గల మన్మథునివలన, భవ=పుట్టిన, దురంత=అపారమైన, సంతాపికయై=సంతాపము కలదై; కినుకన్=కోపముచేత; లక్ష్మీలలనాతనయున్=మన్మథునిగూర్చి; పలికెన్=అనెను.
చ. కలుగునె నీకు సద్యశ మ◊ఖండరుషాగతి నిస్వనద్గుణో
జ్జ్వలవిశిఖాసముక్తశిత◊సాయకధారఁ గృపీటజాంబకా
వలిఁ గర మేఁచఁ ద్వద్బలని◊వారకసారకృపీటజాంబకా
తులితభుజాసహోమహిమఁ ◊దూల్చినఁ గాక కృపీటజాంబకా! 115
టీక: కృపీటజాంబకా=ఓపద్మబాణుఁడవైన మదనా! త్వద్బల నివారక సార కృపీటజాంబ కాతులిత భుజాసహోమహిమన్ – త్వత్=నీయొక్క, బల=సామర్థ్యమునకు, నివారక=వారించునది యైన, సార=శ్రేష్ఠమైన, కృపీటజాంబక=వహ్నినేత్రుఁడైన శివునియొక్క, అతులిత=సాటిలేని, భుజాసహః=బాహుబలముయొక్క, ‘సహో బల శౌర్యాణి’ అని యమరుఁడు,మహిమన్ =అతిశయమును; తూల్చినన్ కాక=తూలఁజేసిననే కాని; అఖండరుషాగతిన్=అవిచ్ఛిన్నరోషప్రాప్తిచేత; నిస్వన ద్గుణోజ్జ్వల విశిఖాస ముక్త శితసాయక ధారన్ – నిస్వనత్=మ్రోయుచున్న, గుణ=అల్లెత్రాటిచేత, ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, విశిఖాస= ధనుస్సుచేత, ముక్త=విడువఁబడిన, శితసాయక=తీక్ష్ణమగు బాణములయొక్క, ధారన్=అంచుచేత; కృపీటజాంబకావలిన్ – కృపీటజ=జలజములవంటి, అంబకా=నేత్రములు గల స్త్రీలయొక్క, ఆవలిన్=సమూహమును; కరము=మిక్కిలి; ఏఁచన్= బాధింపఁగా; నీకున్; సద్యశము = మంచిఖ్యాతి; కలుగునె=జనించునా? నిన్ను దహించిన శివుని జయించిననే నీకు యశస్సు కల్గును గాని, యట్లుగాక, స్త్రీలను బాధించుచున్నచోఁగలుగ దనుట.
సీ. తరుణతురంగాయి◊తశుకాండజాతము,ల్పంజరకారలోఁ ◊బడక యున్న,
సతతనారాచిత◊సితకాండజాతముల్, కడు నిశాతత్వంబుఁ ◊గాంచి యున్న,
మది ఘనభయరేఖ ◊మధుకాండజాత ము,ల్లలితపత్రిబలంబు ◊ గలఁగ కున్నఁ,
జక్కఁ దే రైనపృ◊షత్కాండజాతముల్, పొదలుచాంచలి మూల ◊నొదుఁగ కున్న,
తే. సారకాంతాలసాయకా◊సన మఖండ,తాగతి భజించి యున్న నీ◊ధాత్రి నవమ
సారకాంతాలకాపాళి ◊ఘోరతావ,కీనధాటికి బ్రతుకునే ◊సూనబాణ! 116
టీక: సూనబాణ=ఓకుసుమాయుధుఁడా! తరుణతురంగాయితశుకాండజాతముల్ – తరుణ=నూతనములైన, తురంగాయిత =అశ్వములవలెనాచరించుచున్న, శుకాండజాతముల్=చిలుకలను పక్షులు; పంజరకారలోన్=పంజరమను కారాగృహము లో; పడక యున్నన్ = పడినవి కాకుండినయెడ, దీనికి గీతిలో నున్న ‘బ్రతుకునే’ యను క్రియతో నన్వయము. ముందుచరణ ములయందును నిట్లే తెలియవలయు. సతతనారాచితసితకాండజాతముల్—సతత=ఎల్లపుడు, నారాచిత=బాణములుగాఁ జేయఁబడిన, సిత=తెల్లనయిన, కాండ జాతముల్=జలజములు, అనఁగాఁ బుండరీకములు; కడున్=మిక్కిలి; నిశాతత్వంబున్=తీక్ష్ణత్వమును, రాత్రియొక్క స్వరూపము నని వాస్తవార్థము; కాంచి యున్నన్=పొందియున్నయెడ; మధుకాండజాతముల్లలితపత్రిబలంబు – మధుకాండ=వసంతసమయమందు,జాత=ఉదయించిన,ముత్=ముదముచేత, లలిత
=ఒప్పుచున్న, పత్రి=పక్షులనెడు, అనఁగా కోయిలలనెడు, బలంబు=సైన్యము; మదిన్=మనస్సునందు; ఘనభయరేఖన్ = అధికభయపరంపరచేత, మేఘమువలన నైన భీతిపరంపరచేత నని వాస్తవార్థము; కలఁగ కున్నన్= కలఁతపడకున్నయెడ; తేరైన పృషత్కాండజాతముల్=రథమైన వాయుసమూహములు; చక్కన్=బాగుగా; పొదలుచాంచలిన్=ఒప్పుచున్న చాంచ ల్యముచేత; మూలన్=గొందిని, విదిక్కునందని వాస్తవార్థము; ఒదుఁగ కున్నన్=దాఁగకున్నయెడ; సారకాంతాలసాయకాసనము – సార=శ్రేష్ఠమైన, కాంతాల=చెఱకనెడు, రేఫలకారంబుల కభేదతనుబట్టి కాంతారశబ్దము గ్రహింపవలయు, సాయకాసనము=ధనుస్సు; అఖండతాగతిన్=అభంగత్వమును,ఖండములు కాకుండుటను; భజించి యున్నన్=పొందియున్నయెడల; ఈధాత్రిన్=ఈభూమియందు; నవమసారకాంతాలకాపాళి – నవ=క్రొత్తనైన, మసార=నీల మణులభంగి, కాంత=ఒప్పుచున్న, అలకా=ముంగురులుగలవారియొక్క,అనఁగా స్త్రీలయొక్క, పాళి=సమూహము; ఘోర= భయంకరమైన, తావకీన=నీయొక్క, ధాటికిన్=దాడికి; బ్రతుకునే = జీవించునా?
అనఁగా నీగుఱ్ఱములైన చిలుకలు పంజరము లను కారాగృహములందు బడకయుండి, నీబాణము లైన తెల్లదామరలు నిశాతత్వము గాంచియుండి, నీకోయిల లను సైన్యములు చిత్తమందు ఘనభయమును బొందకుండి, నీరథమైన మందమారు తము ఒకమూల నొదుఁగకుండి, నీచెఱకువిల్లు తునియలు కాకుండినచో, లోకమందు స్త్రీజనము బ్రదుక దనుట. చిలుకలు పంజరబంధమును బొందుటయుఁ, దెల్లదామరలు రాత్రిత్వము నెఱుంగకుండుటయుఁ, గోయిలలు మేఘమువలన భీతిల్లు టయు, వాయువు చంచలమై వాయవ్యమూలయం దొదిఁగి యుండుటయు, నిక్షువు ఖండము లగుటయుఁ బ్రసిద్ధము.
క. మదనానాపికకలగతి, మదనాహతనాదరేఖ ◊మసల నిటులు మ
మ్మదనా యేఁచఁగ నీయెడ, మదనావిలవినుతి నలరి ◊మన్పవె మదనా! 117
టీక: మదనా=మన్మథుఁడ! మద నానాపిక కలగతిమ దనాహత నాదరేఖ – మద=మదప్రధానములగు, నానాపిక= అనేక విధము లైన కోకిలలయొక్క, కలగతిమత్=అవ్యక్తమధురప్రకారము గల, అనాహత=అప్రతిహతమగు, నాదరేఖ=ధ్వనిపరం పర; మసలన్=ఒప్పగా; ఇటులు=ఈప్రకారముగ; మమ్మున్ ఏఁచన్= మమ్ములను బాధించుటకు; అదనా=సమయమా? కాదని కాకువు; ఈయెడన్=ఇపుడు; మ దనావిల వినుతిన్—మత్=నాయొక్క, అనావిల=అకలుషమగు, వినుతిన్=స్తోత్రము చేత; అలరి =సంతసించి; మన్పవె = రక్షింపుమా!
సీ. పరమరుత్పరమారి◊పరమారిధర్తయై, కర్తయై వెలయు శ్రీ◊భర్తయుండఁ,
బరిణతాసురరాజ◊సురరాజపాళియై, శీలియై తగు తమ్మి◊చూలి యుండ,
సముదారశమనాత్మ◊శమనాత్మభారియై, హారియై మించు ద◊క్షారి యుండ,
దళితోగ్రబలమాన◊బలమానవాదియై, మోదియై మనుశైల◊భేది యుండ,
తే. నకటకట సత్కదంబవై◊రాప్తిఁ బొల్చి, చెలఁగుచైత్రికుతోఁ జెల్మి ◊నలరు టెల్ల
ధరణి నార్యాళిమథనవ◊ర్తనకుఁ గాదె, వారి నెవ్వారిఁ గానవే ◊వారిజాస్త్ర!
టీక: పర మరుత్పర మారి పరమారి ధర్తయై – పర=శత్రువులగు, మరుత్పర=దేవవిరోధులగు రాక్షసులకు, మారి=సంహరించెడు, పరమ=శ్రేష్ఠమగు, అరి=చక్రముయొక్క, ధర్తయై=ధారకుఁడై; కర్తయై=జగత్కర్తయై; వెలయు శ్రీభర్త=ఒప్పుచున్న నారాయణుఁడు; ఉండన్=ఉండఁగా;పరిణ తాసుర రాజ సురరాజ పాళియై – పరిణత=మిగులనమ్రులైన, అసుర=రక్కసులు, రాజ=యక్షులు, సురరాజ=దేవ శ్రేష్ఠులు, వీరియొక్క, పాళియై=పరంపరగలవాఁడై; శీలియై=సద్వృత్తము గలవాఁడై; తగు తమ్మిచూలి = ఒప్పునట్టి బ్రహ్మ; ఉండన్=ఉండఁగా; సముదార శమనాత్మ శమ నాత్మ భారియై – సముదార=మిక్కిలి యధికమగు, శమన=యమునియొక్క,ఆత్మ=ధైర్యము నకు, ‘ఆత్మా దేహ మనో బ్రహ్మ స్వభావ ధృతి బుద్ధిషు’ అని విశ్వము, శమన=నాశకమగు,ఆత్మ=బుద్ధిని, భారియై=భరించు చున్నవాఁడై; హారియై=మనోహరుఁడై; మించు దక్షారి=అతిశయించునట్టి శివుఁడు; ఉండన్=ఉండఁగా;
దళి తోగ్ర బల మాన బలమానవాదియై – దళిత=నఱకఁబడిన, ఉగ్ర=తీక్ష్ణమగు, బల=సామర్థ్యమును, మాన=గర్వమును గల, బలమానవాదియై =బలాసురుఁడు గలవాఁడై; మోదియై=సంతసము గలవాఁడై; మనుశైలభేది=ఒప్పుచున్న ఇంద్రుఁడు; ఉండన్ =ఉండఁగా; సత్కదంబ వైరాప్తిన్ – సత్కదంబ=మంచి కడిమిచెట్లనెడు సత్పురుషగణములయొక్క, వైరాప్తిన్=విరోధప్రాప్తిచేత; పొల్చి = ఉదయించి; చెలఁగు చైత్రికుతోన్ = ఒప్పుచున్న వసంతుఁడనెడు చిత్తరువువ్రాయువానితో; చెల్మిన్=సఖ్యముతోడ; అలరు టెల్లన్ = ఒప్పుటంతయు; ధరణిన్=భూమియందు; నార్యాళిమథనవర్తనకున్ – నార్యాళి = నార్యాళి, ఆర్యాళి యని రెండు విధముల పదవిభాగము. ఆర్యాళి=ఆర్యుల సమూహముయొక్క, నార్యాళి= స్త్రీసమూహముయొక్క, మథనవర్తనకున్=మథించు వృత్తి కయి; కాదె=కాదా! వారి నెవ్వారిఁ గానవే =వారి నెవరిని జూడవా? అకటకట=అయ్యో కష్టము! వారిజాస్త్ర=మన్మథుఁడా!
అనఁగా నసురసంహారి యగు విష్ణుమూర్తియు, సురాసురాదిసేవితుఁ డగు బ్రహ్మయు, కాలాంతకుఁడగు రుద్రుఁడును, బలవైరి యగునింద్రుఁడు నుండఁగా వారితో జెలిమిఁ గాంచక సత్కదంబవైరి యగు చైత్రికునితోఁ జెల్మి గాంచుట భూమియందు నార్యాళిమథనకే గద యనుట. సత్కులసంపన్నుఁడుగాని చిత్తరువుపనివానితోఁజెలిమి గాంచుట ఆర్యాళిమథనమునకే యని ధ్వని. వసంతమందు కదంబములు వికసిల్లమి వెనుక వ్రాయఁబడియె.
వ. అని యానారి శంబరారిం దూఱి యమ్మారున కెక్కుడై పైఁ జేరు సమీరు నిట్లనియె.
టీక: అని =ఇట్లని; ఆనారి=ఆచంద్రిక; శంబరారిన్=మన్మథుని; దూఱి=దూషించి; అమ్మారునకున్=ఆమన్మథునికి; ఎక్కుడై =వాహనమై; పైఁ జేరు సమీరున్=మీఁదికివచ్చు వాయువునుగుఱించి; ఇట్లనియెన్=వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.
ఆ. మలయఁ జెంత నీవు ◊మహి నొప్పుపటుతరుల్, సారె వడఁక నెంత ◊భీరు లనఁగ
నలఁప రాఁగ వల ద◊నిల విజృంభితశోణ,నలపరాగవలద◊నలకణాళి. 120
టీక: అనిల=మారుతమా! నీవు; చెంతన్=సమీపమందు; మలయన్=తిరుగుచుండఁగా; మహిన్=భూమియందు; ఒప్పు పటు తరుల్=ఒప్పుచున్న వృక్షములనెడు మిక్కిలి సమర్థులు; సారెన్=మాటిమాటికి; వడఁకన్=కంపించుచుండఁగా; భీరులు = స్త్రీలనెడు భయస్థులు; అనఁగన్=అనఁగా; ఎంత=ఎంతటివారు? విజృంభిత శోణనల పరాగ వల దనలకణాళిన్ – విజృంభిత= వికసించినట్టి, శోణనల=ఎఱ్ఱగలువలయొక్క, పరాగ=పుప్పొడి యనెడు, వలత్=తిరుగుచున్న, అనలకణాళిన్=స్ఫులింగ పరంపరలచేత; నలఁపన్=నలఁతపొందించుటకు; రాఁగన్ వలదు = రాఁగూడదు.
అనఁగా నీవు సమీపమున సంచరించుటచేత సమర్థులైనవారే వడఁకునపుడు మాబోఁటి భీరువు లెంతవారు? కావునఁ గోక నదపరాగ మనెడు నగ్నికణాళితో నలఁత పొందించుటకు రాఁగూడ దనుట. ఇట దైన్య మను సంచారిభావము వ్యజ్యమాన మగు చున్నది. ‘సత్త్వత్యాగా దనౌద్ధత్యం దైన్యం కార్పణ్య సంభవమ్’ అని తల్లక్షణము.
సీ. గురుకలకంఠికా◊పరిరక్తి మాధవా,శయము రాజిలుట గాం◊చంగ లేదొ,
విప్రయోగుల నొంచు◊విధ మూను మాధవా,పత్యహృద్రీతి చూ◊పట్ట లేదొ,
యనవద్యవసుహారి ◊యగుచు శ్యామాధవా,త్మ రహించుటల్ చాలఁ◊దలఁప లేదొ,
యఖిలభృంగాంతర◊వ్యాపృతి మాధవా,దృతి నిచ్చ చెలరేఁగు◊టెఱుఁగ లేదొ,
తే. కటకటా యట్టివారితోఁ ◊గరము నంటు, గని మలినపంకజాతవా◊సన చిగుర్ప
ధర సుదృక్పాళి దూలింపఁ ◊దగవె పవన, కడు ననఘవృత్తిఁ దగుసదా◊గతికి నీకు. 121
టీక: పవన=ఓమారుతమా! మాధవాశయము=వసంతునిహృదయము; గురుకలకంఠికా పరిరక్తిన్ – గురుకలకంఠికా = గురుపత్నియందలి, పరిరక్తిన్=ఆసక్తిచేత, అధికములగు కోకిలస్త్రీలయందలి అనురాగముచేత నని వాస్తవార్థము; రాజిలుట = ప్రకాశించుట; కాంచంగ లేదొ=చూడలేదో, విప్రయోగులన్=బ్రాహ్మణతాపసులను, విరహిజనుల నని వాస్తవార్థము; నొంచువిధము =అడంచురీతిని; ఊను మాధవాపత్య హృద్రీతి – ఊను=వహించునట్టి, మాధవాపత్య=కామునియొక్క, హృద్రీతి=హృదయవైఖరి; చూపట్ట లేదొ=అగపడలేదో,
శ్యామాధవాత్మ—శ్యామాధవ=చంద్రునియొక్క, ఆత్మ=బుద్ధి, శరీరమని యర్థాంతరము; అనవద్యవసుహారి – అనవద్య= నిర్దుష్టమైన, వసు=సువర్ణమును, హారి=హరించునది, అనవద్యములైన కిరణములచేత మనోహరమైనదని శరీరపరమైన యర్థము; అగుచున్; చాలన్=మిక్కిలి; రహించుటల్=ఒప్పుటలు; తలఁప లేదొ=స్మరింప లేదో,
అఖిలభృంగాంతరవ్యాపృతి = సమస్తములైన తుమ్మెదలయొక్క హృదయవ్యాపారము; మాధవాదృతిన్ – మాధవ=మద్య సంబంధియైన, ఆదృతిన్=ఆదరముచేత, పుష్పరససంబంధియైన యని వాస్తవార్థము, ‘మధు మద్యే పుష్పరసే’ అని యమ రుఁడు; నిచ్చ=ఎల్లపుడు; చెలరేఁగుట=విజృంభించుట; ఎఱుఁగ లేదొ=తెలియ లేదో, కటకటా=అయ్యో (కష్టము)! ఇట్టివారితోన్= ఇటువంటి వసంతాదులతో; అంటుగని=సంపర్కము గాంచి; మలినపంకజాత వాసన – మలినమైన పాపకదంబముయొక్క సంస్కారము, నీలోత్పలపరిమళ మని వాస్తవార్థము; చిగుర్పన్=పల్లవింపఁగా; ధరన్=భూమియందు; సుదృక్పాళిన్=పండితసంఘమును, స్త్రీకదంబము నని యర్థాంతరము; కరము=మిక్కిలి; తూలింపన్ =తూలఁజేయఁగా; కడున్అనఘవృత్తిన్=మిక్కిలి పాపరహితవృత్తిచేత, మిక్కిలి నిర్మలవృత్తిచేత, వాయువు నిర్మలమగుట స్వభావము; తగు సదాగతికిన్=ఒప్పునట్టి సజ్జనగతి యగు,ఒప్పునట్టి సదాగమనము గలవానికి, వాయు వెల్లపుడు చరించునది యగుట ప్రసిద్ధము; నీకున్; తగునె=యుక్తమా?
అనఁగాఁ బాపరహితుఁడ వగునీకు గురుదారగమనము సేయువసంతుఁడు, బ్రహ్మహత్య చేయు మరుఁడు, స్వర్ణస్తేయి యగు చంద్రుఁడు, మద్యపాయి యగుభృంగము, వీరితో సహవాసముమంచిదికా దనుట. ‘బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వఙ్గ నాగమః’ అని చెప్పఁబడిన మహాపాతకములుగలవారితో సాంగత్యము చేసిన నీకు, ‘తత్సంయోగీ చ పఞ్చమః’ అని మహా పాతకులలోఁ జేరిక గలుగుఁ గానఁ దత్సహవాసము మాని సుదృక్పాళిని రక్షింపు మని హృదయము.
తే. అంతరమున నటించు పే◊రాస మీఱఁ, దోడ్త భజియింతు మాకు సం◊తోస మీర
సారెఁ బయిఁ గ్రమ్మి యిప్పు డేఁ◊చకు సమీర,ణాంకురాభాంగ మింపుఁ బా◊యఁగ సమీర! 122
టీక: సమీర=ఓపవనా! అంతరమునన్=ఆత్మయందు; నటించు పేరాస=ఉప్పొంగుచున్న పెద్దయాశ; మీఱన్=మించఁగా;
తోడ్తన్=వెంటనే; భజియింతున్=కొల్తును; మాకు సంతోసమీర= మాకు సంతస మిమ్మురా; సారెన్=మాటికి; పయిన్ = మీఁదను; క్రమ్మి=ఆక్రమించి; సమీరణాంకురాభాంగము – సమీరణాంకుర=మరువపుమొలకయొక్క, ఆభ=కాంతివంటి కాంతిగల, అంగము=శరీరము; ఇంపున్ పాయఁగన్= సొంపు వీడునట్లు; ఇప్పుడు; ఏఁచకు=బాధింపకుము.
అనఁగా నా మనోరథసిద్ధి కాఁగానే నిను భజియించెద, నిపుడు మాత్రము బాధింప కనుట.
క. అని యాజలజేక్షణ యి,ట్లనిలాదులఁ జాల దూఱి ◊యపుడు కిసలజీ
వనగోవిభుసూను మధుప,వనగోవిభుసూను మధుప◊వారము లేఁచన్. 123
టీక: అని=ఇట్లని; ఆజలజేక్షణ=ఆచంద్రిక; ఇట్లు=ఈప్రకారముగ; అనిలాదులన్=మలయపవనాదులను; చాలన్=మిక్కిలి; దూఱి=దూషించి; అపుడు; కిసలజీవన గోవిభుసూను మధు పవన గోవిభుసూను మధుపవారములు – కిసలజీవన=కోకిలలు, గోవిభుసూను=భూభర్తయైన విష్ణువుయొక్క పుత్త్రుఁడైన మన్మథుడు, మధు=వసంతుఁడు, పవన=మలయానిలము, గోవిభు సూను=సముద్రపుత్త్రుఁడైన చంద్రుఁడు, మధుపవారములు=తుమ్మెదలగుంపులు; ఏఁచన్=బాధింపఁగా. దీనికి ముందుపద్యము నందలి ‘చొరఁబాఱు’లోనగు క్రియలతో నన్వయము.
సీ. వకులాగనవపల్ల◊వకులాలిఁ జొరఁబాఱు, గఱకుకైదువులపై ◊నుఱుకుపగిది,
సుమనోజ్ఞచాంపేయ◊సుమనోరజముఁ దూఱు, ఘోరాగ్నిమండలిఁ ◊జేరుపగిది,
మధుపాదపానూన◊మధుపాళిఁ దిలకించు, ఘనవిషోదక మానఁ ◊గాంచుపగిది,
లతికానికరగౌర◊లతికాంతతతి మున్గు, మించుపెన్నదిఁ బ్రవే◊శించుపగిది,
తే. దోడ్తఁ బలుమాఱు బలుమారు◊దోర్బలమున, నాత్మ వలవంత వలవంత◊మగుచు నిగుడఁ
జటులకలనాదకలనాద◊పటలి కలికి, బడలి యారామ యారామ◊పదవి నెనసి. 124
టీక: ఆరామ=ఆచంద్రిక; తోడ్తన్=వెంటనే; పలుమాఱు=సారెకు;బలుమారుదోర్బలమునన్=అధికమగు మదనుని భుజ బలముచేత; ఆత్మన్=హృదయమందు; వలవంత=దుఃఖము; వలవంత మగుచున్=బలవంతమగుచు, ఇట వబల కభేదము; నిగుడన్=అతిశయింపగా; చటుల కలనాద కల నాదపటలికిన్ – చటుల=చంచలమగు, కలనాద=కోకిలలయొక్క, కల = అవ్యక్తమధురమగు, నాదపటలికిన్=ధ్వనిపరంపరకు;అలికి=భయపడి; బడలి=అలసి; ఆరామపదవిన్=తానున్న కేళీమంది రమునుండి యుద్యానవనవీథిని; ఎనసి=చేరి;
వకులాగ నవ పల్లవకు లాలిన్ – వకులాగ=పొగడచెట్లయొక్క, నవ=నూతనమగు, పల్లవకుల=చిగురుజొంపములయొక్క, ఆలిన్=పంక్తిని; కఱకుకైదువులపైన్=తీక్ష్ణములగు శస్త్రములపైని; ఉఱుకుపగిది=ఉఱికెడుతీరున; చొరఁబాఱున్=ప్రవేశించును; సుమనోజ్ఞచాంపేయసుమనోరజమున్ –సు=మిక్కిలి, మనోజ్ఞ=మనోహరమగు,చాంపేయ=నాగకేసరములయొక్క, సుమనో రజమున్= పుప్పొడిని; ఘోరాగ్నిమండలిన్=భయంకరమైన నిప్పులకుప్పను; చేరుపగిదిన్=చొచ్చువిధమున; తూఱున్ = ప్రవేశించును; మధుపాద పానూన మధు పాళిన్—మధుపాదప=ఇప్పచెట్లయొక్క, అనూన=అధికమగు, మధు=మకరందముయొక్క, పాళిన్=సమూహమును; ఘనవిషోదకము =అధికమైన విషజలమును; ఆనన్=త్రాగుటకు; కాంచుపగిదిన్=చూచునట్లు; తిలకించున్=వీక్షించును; లతికానికర గౌర లతికాంతతతిన్ – లతికానికర=బండిగురివెందతీవెగుంపులయొక్క, గౌర=శుభ్రములగు,లతికాంతతతిన్ =పుష్పసమూహమునందు; మించుపెన్నదిన్=అతిశయించు పెద్దయేటిని; ప్రవేశించుపగిదిన్=చొచ్చురీతిగా; మున్గున్= మునుకవేయును.
అనఁగా నాచంద్రిక యట్లు విరహానలసంతప్తయై, మనోరథసిద్ధిగామిచే సంతాప మంతంతకు మిక్కుటము కాఁగాఁ దాళఁ జాలక తనశరీరమందు విసువు పుట్టి ప్రాణత్యాగమునకై యాయుధప్రాయముగఁ దోఁచు వకుళపల్లవాళిఁ బ్రవేశించుటయు, నిప్పులకుప్పగాఁదోఁచు నాగకేసరముల పుప్పొడితిప్పలు చేరుటయు, విషజలముగఁ దోఁచు నిప్పపూదేనియ నానఁ జూచు టయుఁ, బెన్నదిగాఁ దోఁచు బండిగురివెందలపూజొంపముల మున్గుటయు నొనరించె నని భావము. అపు డామె కవన్నియు ప్రాణాపాయము సేయఁగల్గు నన్నంత దుస్సహము లైనవని ఫలితార్థము. అవస్థాదశకములోని మరణావస్థ యిందు గదితం బయ్యె. తల్లక్షణతత్కార్యము లిట్లు. ‘తై స్తైః కృతైః ప్రతీకారై ర్యది న స్యా త్సమాగమః| మరణ మ్మరణోద్యోగః కామాగ్నే స్తత్ర విక్రియాః| లీలాశుకచకోరాదిన్యాస స్స్నిగ్ధసఖీకరే| కలకణ్ఠకలాలాపశ్రుతి ర్మన్దానిలాశ్రయః| జ్యోత్స్నాప్రవేశమాకన్దమఞ్జరీ వీక్షణాదయః’ – అని తెలియవలయు.
చ. లలన సమీరధార పొద◊లన్ బొదలన్ వడిఁ దూఱు శారికా
కులములు మ్రోయఁ జాలఁ గలఁ◊గుం గలఁగుండువడన్ మనంబు గో
ర్కు లెడయ హా యటంచుఁ బలు◊కుం బలుకుందపుమొగ్గచిల్కుట
మ్ములు మరుఁ డేయఁ బూనుఁ దర◊ముం దరముం జెలి చెంతఁ జేరినన్. 125
టీక: లలన=చంద్రిక; సమీరధార=మలయమారుతపరంపర; పొదలన్=ఏపుమీఱఁగా; పొదలన్=నికుంజములను; వడిన్ = వేగముగా; తూఱున్=చొచ్చును; శారికాకులములు=గోరువంకలగుంపులు; మ్రోయన్=కూయఁగా; మనంబు =మనస్సు; కలఁగుండువడన్=ఆకులతనొందఁగా; చాలన్=మిక్కిలి; కలఁగున్=కలఁతనొందును; కోర్కులు=మనోరథములు; ఎడయన్ =ఎడఁబాయఁగా; హా అటంచున్ పలుకున్ = హాయని వచించును; బలుకుందపుమొగ్గచిల్కుటమ్ములు – బలు=అధికము లగు, కుందపుమొగ్గ=మొల్లమొగ్గలను, చిల్కుటమ్ములు=అలుఁగుతోఁ గూడినబాణములు; మరుఁడు=మన్మథుఁడు; ఏయన్ = ప్రయోగింపఁగా; చెలి = సఖి; చెంతన్ చేరినన్=సమీపించినను; తరమున్=వేగిరపాటును; దరమున్=భయమును; పూనున్.
వ. ఇట్లు పంచబాణపంచకప్రపంచితవిరహసంతాపంబునం భ్రమించు నమ్మించుఁబోఁడిం దోడ్తెచ్చి మచ్చిక గ్రచ్చుకొన నెచ్చెలిచెలువపిండు లచ్చంపుఁజలువ వెదచల్లు మొల్లవిరిసజ్జ నుంచి ప్రియకథానులాపంబులం బ్రొద్దు గడుపు నవసరంబున. 126
టీక: ఇట్లు=ఈరీతిగ; పంచబాణపంచకప్రపంచితవిరహసంతాపంబునన్ – పంచబాణపంచక=కామశరపంచకముచేత, ప్రపం చిత=విస్తరింపఁజేయఁ బడిన, విరహసంతాపంబునన్=వియోగవేదనచేత; భ్రమించు నమ్మించుఁబోఁడిన్= భ్రమనొందు నా మెఱపుతీఁగవంటి శరీరముగల చంద్రికను; తోడ్తెచ్చి=తీసికొనివచ్చి; మచ్చిక గ్రచ్చుకొనన్=ప్రేమమీఱునట్లుగా; నెచ్చెలిచెలువ పిండులు=ప్రయసఖీవర్గములు; అచ్చంపుఁజలువన్=మంచిచల్లఁదనమును; వెదచల్లు మొల్లవిరిసజ్జన్=వ్యాపింపఁజేయు మొల్ల పూవుల పాన్పునందు; ఉంచి; ప్రియకథానులాపంబులన్=ప్రీతికరమగు కథలను చెప్పుటవలన; ప్రొద్దు గడుపు నవసరంబున = ప్రొద్దుపుచ్చునపుడు. దీనికి ముందుపద్యముతో నన్వయము.
చ. కనికర మింతలే కసమ◊కాండుఁడు శ్యామ నలంప వేడ్కఁ జ
క్కని కరహేతిధారఁ గలఁ◊గన్ ఘటియింపఁగఁ బాడి గాదు మా
కని కర మాత్మఁ దత్పరత ◊నందుచుఁ జయ్యన నేగె నప్డు లో
కనికరతాపహారి యుడు◊కాంతుఁడు వారిధినేతఁ జేరఁగన్. 127
టీక: అసమకాండుఁడు=మన్మథుఁ డనుసూర్యుఁడు; శ్యామన్=చంద్రిక యనురాత్రిని; కనికరము=దయ; ఇంతలేక=ఇంచు కైన లేక; వేడ్కన్=సంతసముచేత; అలంపన్=శ్రమపెట్టఁగా; చక్కనికరహేతిధారన్=మంచికిరణము లనెడుఖడ్గధారచేత; కలఁగన్ = కలఁతఁబాఱునట్లు; ఘటియింపఁగన్=చేయుటకు; మాకున్; పాడి గాదు = ధర్మము గాదు; అని = ఇట్లు తలంచి; కరము = మిక్కిలి; ఆత్మన్ = చిత్తమందు; తత్పరతన్=ఆసక్తిని; అందుచున్=పొందుచు; అప్డు=అప్పుడు; లోక నికర తాపహారి = లోక ములసమూహమునకు తాపము శమింపఁజేయునట్టి; ఉడుకాంతుఁడు=చంద్రుఁడు; వారిధినేతన్=సముద్రరాజును; చేరఁగన్= చేరుటకు; చయ్యనన్=శీఘ్రముగా; ఏగెన్=పోయెను.
సూర్యుఁడు రాత్రిని బాధించినట్లు మరుఁడు చంద్రికను బాధించుచుండఁగా మనముసైతము బాధించుట ధర్మము గాదని చంద్రుఁడు లోకతాపమును బోఁగొట్టువాఁడు గాన దయఁ దలఁచి పశ్చిమసముద్రమును జేరఁబోయె నని భావము. చంద్రుఁ డస్త మించె నని ఫలితము. గమ్యోత్ప్రేక్షాలంకారము.
క. ఆరామ కపుడు శుభవా,గ్ధారాగతిఁ దెలిపె నొక్క◊తరుణి వరకళా
వారనిశాంత మితవు నలు,వార నిశాంతమితిరహిత◊హారివిభవమున్. 128
టీక: అపుడు; ఆరామకున్=ఆచంద్రికకు; వర కళా వార నిశాంతము – వర=శ్రేష్ఠములగు, కళా=విద్యలయొక్క, వార=సంఘ మునకు, నిశాంతము=నెలవగు; ఒక్కతరుణి = ఒకస్త్రీ; ఇతవు=కూర్మి; నలువారన్=ఒప్పఁగా; నిశాంత మితిరహిత హారివిభవ మున్ – నిశాంత=ప్రాతఃకాలముయొక్క, మితిరహిత=అమితమగు, హారివిభవమున్=మనోజ్ఞమగు సమృద్ధిని; శుభవాగ్ధారా గతిన్ = మంచిమాటలవరుసచేత; తెలిపెన్=చెప్పెను. ఇటనుండి సూర్యోదయవర్ణన మారంభింపఁబడుచున్నది.
సూర్యోదయవర్ణనము
చ. వెలసెఁ బదాయుధార్భటులు ◊వింటివె యోయధరానులిప్తనా
విలసిత పుష్కరారి పృథి◊వీపతి పాంథపరాళి గెల్చి తా
విలసితపుష్కరాధిపన◊వీనపురేశముఁ జేరఁగాఁ జనన్
దొలుత నుషోభటధ్వనిత◊దుస్తరకాహళికాధ్వనుల్ బలెన్. 129
టీక: ఓఅధరానులిప్తనావిలసిత=అధరమందుఁ బూయఁబడిన యకలుషమగు చక్కెర గల యోచంద్రికా! చక్కెరవంటిపెదవి గలదానా యనుట; పుష్కరారి పృథివీపతి =చంద్రుఁడనెడు రాజు; పాంథపరాళిన్=విరహు లనెడు శత్రువులపంక్తిని; గెల్చి = జయించి; తాన్; విలసితపుష్కరాధిపనవీనపురేశమున్ – విలసిత=ప్రకాశించుచున్న, పుష్కరాధిప=సముద్రమనెడు, నవీన= నూతనమగు, పురేశమున్=నగరశ్రేష్ఠమును; చేరఁగాన్=పొందుటకు; చనన్=పోవుచుండఁగా; తొలుతన్=మొదల; ఉషోభట ధ్వనిత దుస్తర కాహళికాధ్వనుల్ బలెన్ —ఉషోభట=ప్రభాతమనెడు భటునిచేత, ధ్వనిత=మ్రోఁగింపఁబడిన, దుస్తర=అధిక మైన, కాహళికాధ్వనుల్ బలెన్ =బూరగలధ్వనులవలె; పదాయుధార్భటులు =కుక్కుటధ్వనులు; వెలసెన్=విలసిల్లెను; వింటివె = ఆకర్ణించితవా? అనఁగా నొకరాజు శత్రువులను గెలిచి నూతనపురప్రవేశముఁ జేయుచుండఁగా భటులు సేయుకాహళీధ్వనులు వెలయు విధమునఁ, జంద్రుఁడు పాంథులను గుందించి పశ్చిమాంబురాశిఁ జేరఁబోవుచుండఁగాఁ గుక్కుటధ్వనులు వెలసె నని భావము. రూపకాలంకారము.
మ. స్ఫురదాజాండఘటి న్నిశాతపపయ◊స్సుల్ పేరఁ బూర్వావనీ
ధరగోపాలతనూజమౌళి గని దో◊డ్తం జంద్రమండంబు వా
పి రహిం దద్దధిఖండ మూనె నన నొ◊ప్పెం గంటివే ప్రాగ్దిశా
ధర గోపాలతనూజ వాసవహరి◊త్పద్మావిలాసాబ్జమై. 130
టీక: స్ఫురదాజాండఘటిన్ – స్ఫురత్=ప్రకాశించుచున్న, ఆజాండ=బ్రహ్మాండమనెడు, ఘటిన్=ఘటమందు; నిశాతప పయస్సుల్=వెన్నెల యనెడు పాలు; పేరన్=ఘనీభవింపఁగా; పూర్వావనీధరగోపాలతనూజమౌళి – పూర్వావనీధర= తూర్పుకొండ యనెడు, గోపాలతనూజమౌళి= శ్రీకృష్ణుండు; కని=చూచి; తోడ్తన్=వెంటనే; చంద్రమండంబు=చంద్రుఁడను మీఁగడను, ‘మణ్డం దధిభవ మ్మస్తు’ అని యమరుఁడు; పాపి=కాఁజేసి; రహిన్=ఆసక్తిచేత; తద్దధిఖండము=ఆపెరుగుగడ్డను; ఊనెన్ అనన్=వహించెనన్నట్లు; ప్రాగ్దిశాధర=పూర్వదిక్సీమ, కర్త్రి; వాసవహరిత్పద్మావిలాసాబ్జమై – వాసవహరిత్పద్మా= ప్రాచీలక్ష్మికి, విలాసాబ్జమై=లీలారవిందమై; ఒప్పెన్=ప్రకాశించెను; గోపాలతనూజ=రాజపుత్త్రివగు చంద్రికా! కంటివే?
అనఁగా బ్రహ్మాండ మనెడు ఘటమందు వెన్నెల యనుపాలు పేరి చంద్రుండు దానిపై మీఁగడవలె నుండఁగా నుదయశైల మనెడు శ్రీకృష్ణుండు చంద్రుఁడను నామీఁగడను మ్రింగి చేతఁ బుచ్చుకొన్న యాపేరిన పెరుఁగుగడ్డను బోలియు, పూర్వదిక్క నెడు లక్ష్మికి విలాసార్థమైన పద్మమును బోలియుఁ, బ్రాగ్దిశావని విలసిల్లెనని భావము. తూర్పున సూర్యోదయసంబంధియైన తెలిచాయ తోఁచె నని ఫలితార్థము. రూపకసంకీర్ణస్వరూపోత్ప్రేక్షాలంకారము.
మ. ఘనమిత్త్రైకవసుప్రతానముల రా◊గశ్రీ గొనం గజ్జలా
భ నఘవ్రాతము చేర గేహకుముదా◊ప్తగ్రావధామద్యుధా
మనదీపాళికఁ దాన మంద శుచితం ◊బాటిల్లె నాఁ బాండిమల్
మన దీపాళిక దా నమందగుణసీ◊మా మించె నీక్షింపవే. 131
టీక: అమందగుణసీమా=అధికములైన గుణములకు మేరయైనదానా! దీపాళిక=దీపములచాలు; ఘన మిత్త్రైక వసుప్రతాన ములన్ – ఘన=శ్రేష్ఠములగు, మిత్త్ర=సఖునియొక్క, సూర్యునియొక్క, ఏక=ముఖ్యమగు, వసుప్రతానములన్=ధనముల గుంపులను, కిరణసమూహముల నని యర్థాంతరము; రాగశ్రీన్=లోభసమృద్ధిచేత, శోణకాంతిచేత; కొనన్=హరింపఁగా; కజ్జలాభన్=కాటుక కాంతిచేత; అఘవ్రాతము=పాపసంఘము; చేరన్=పొందఁగా; గేహ కుముదాప్తగ్రావ ధామ ద్యుధామనదీ పాళికన్ – గేహ= గృహసంబంధులగు, కుముదాప్తగ్రావ=చంద్రకాంతమణులయొక్క,ధామ=కాంతియనెడు, ద్యుధామనదీ= స్వర్గంగయొక్క, పాళికన్=ప్రదేశమందు, ‘పాళి స్త్ర్యశ్య్రఙ్క పఙ్త్కయః’ అని యమరుఁడు; తానము=అవగాహనము; అందన్ =పొందఁగా; శుచితన్=శుద్ధతచేత; పాటిల్లె నాన్=ఒప్పెననునట్లు; పాండిమల్=తెల్లఁదనములు;మనన్=వర్ధిల్లఁగా; తాన్; మించెన్=అతిశయించెను; ఈక్షింపవే=చూడుమా.
అనఁగా సూర్యుఁ డనుమిత్రునికిరణములనెడు ధనములను హరించినందున, మషీరూపముగాఁ దత్పాపము గలుగఁగా గృహచంద్రకాంతధామస్తోమ మనుగంగాప్రవాహములో దీపావళి స్నానము చేయఁగా గతకల్మషయై వర్తించి నట్లు తెల్లని కాంతులతో రాజిల్లె నని భావము. ప్రభాతమున దీపములు కాంతిహీనము లయ్యె నని ఫలితము. స్వర్ణస్తేయాదులు చేసినవారు గంగాస్నానము చేయఁగాఁ దత్పాపమోచన మగుట ప్రసిద్ధము. సూర్యుండు దనకాంతిని రాత్రి యగ్నియం దుంచి పోవు నని యాగమప్రసిద్ధము. ‘రుచిధామ్ని భర్తరి భృశం విమలాః పరలోక మభ్యుపగతే వివిశుః|జ్వలనం త్విషః కథమి వేతరధా సుల భోఽన్యజన్మని స ఏవ పతిః’ అని మాఘకావ్యమున వర్ణింపఁబడినది.
మ. తనుమధ్యా గను రోదసిం గముచుజ్యో◊త్స్నావల్లికల్ కల్యవా
తనికాయాహతిఁ దూలఁ ద్రెళ్ళెఁ దొలుతం ◊దారప్రసూనవ్రజం
బనవద్యామృతపూరపూరితనవో◊దారప్రసూనవ్రజం
బున డిందెన్ శశి పత్త్రిమండలరవం◊బుల్ గ్రమ్మె నల్దిక్కులన్. 132
టీక: తనుమధ్యా=సన్నని నడుముగల ఓ చంద్రికా! రోదసిన్=ద్యావాభూములయందు; కముచు జ్యోత్స్నావల్లికల్= క్రమ్మిన వెన్నెల యను తీవలు; కల్య వాత నికాయాహతిన్ – కల్య=ప్రభాతమందలి, వాత=వాయువులయొక్క, నికాయ=సంఘము యొక్క, ఆహతిన్=కొట్టుటచేత; తూలన్=నేలఁ బడఁగా; తొలుతన్=మొదలనే; తార ప్రసూనవ్రజంబు=నక్షత్రము లనెడుపూల గుంపులు; త్రెళ్ళెన్=వ్రాలెను; శశి=చంద్రుఁడు; అనవ ద్యామృత పూర పూరిత నవోదార ప్రసూనవ్రజంబు – అనవద్య=శ్రేష్ఠమగు, అమృత=సుధయొక్క, పూర=ప్రవాహముచేత, పూరిత=నింపఁబడినట్టి,నవ=క్రొత్తనైన, ఉదార=ఉత్కృష్టమైన, ప్రసూన=ఫల ములయొక్క, వ్రజంబు= సమూహము, ‘ప్రసూనం పుష్ప ఫలయోః’ అని నామలింగానుశాసనము; అనన్=అనునట్లుగా; డిందెన్=పడెను; పత్త్రిమండలరవంబుల్=పక్షిసంఘముల కూజితములు; నల్దిక్కులన్=చతుర్దిశలందు; క్రమ్మెన్=ఆవరించెను; కను =చూడుము. అనఁగా వెన్నెల యను లతలు ప్రభాత మను వాతముచేఁ దూలఁగా రిక్క లను పువ్వులు, చంద్రుఁ డను పండ్ల గుంపు వ్రాలి పోయె ననియు, ఖగకూజితములు నల్దెసల వ్యాపించె ననియు భావము. అపుడు వెన్నెలయు, రిక్కలును, చంద్రుఁ డును పోయె నని ఫలితము.
మ. అల పెన్వేగురుఁజుక్కపేరియతి దీ◊వ్యత్పాండుభాభూతి మైఁ
జెలువారంగఁ దరోర్జితస్థితి వియ◊త్సీమం జనం గంటివే
చెలువా రంగదరోర్జితస్థితిదినా◊స్యీయైకసంధ్యాంశుకూ
టలసచ్ఛాటిక తన్మనుస్ఫురణ వెం◊టన్ బర్వెఁ జిత్రంబుగన్. 133
టీక: చెలువా =చంద్రికా! అల పెన్వేగురుఁజుక్కపేరియతి=ఆ పెద్దవేగుఁజుక్క యనెడు సన్యాసి; దీవ్యత్పాండుభాభూతి = ప్రకా శించుచున్నతెల్లనికాంతి యనెడు భస్మము;మైన్=దేహమందు; చెలువారంగన్=ఒప్పఁగా; తరోర్జితస్థితిన్ – తరః=వేగముచేత, అర్జిత=ఆర్జింపఁబడిన, స్థితిన్=సత్తచేత; వియత్సీమన్=గగనప్రదేశమందు; చనన్=పోఁగా; తన్మనుస్ఫురణన్ – ఆయన మంత్ర సామర్థ్యముచేత; రంగ దరోర్జితస్థితి దినాస్యీ యైక సంధ్యాంశు కూట లసచ్ఛాటిక–రంగత్ = ఒప్పుచున్న, అర = చెఱఁగుల యొక్క, అంచులయొక్క యనుట, ఊర్జితస్థితి=అధికస్థితిగల, ఇది శాటికయం దన్వయించును, దినాస్యీయ= దినాస్యమనగ ప్రభాతము, దినాస్యీయ మనఁగా నాప్రభాతమునకు సంబంధించినదని యర్థము, ఏక=ముఖ్యమగు, సంధ్యాంశు=సంధ్యాకాంతు లనెడు, కూట=నెపముగల, లసత్=ఒప్పుచున్న, శాటిక=కాషాయవస్త్రము; చిత్రంబుగన్ =ఆశ్చర్యకరముగ; వెంటన్ = ఆ సన్యాసి వెంటనే; పర్వెన్ = వ్యాపించెను; కంటివే=చూచితివా?
అనఁగా వేగుఁజుక్క యనెడుయతి తెల్లనికాంతి యనెడు భస్మము పూసికొని, వేగముగఁ బోఁగా, నాయనమంత్రసామర్థ్య మునఁ దదీయశాటివలె నెఱ్ఱనికాంతిపుంజము ప్రసరించె నని భావము. సూర్యోదయమునకు ముందు వేగుఁజుక్క పోయిన వెనుక నెఱ్ఱనికాంతి ప్రసరించె నని ఫలితము.
మ. ననుచున్ మోదము కోకవిప్రతతి చం◊ద్రద్యోతరాజీవలో
కన మెల్లన్ జన జోడు గూడి నిలువం ◊గంగొమ్ము రాజీవలో
కనికారేక్షణ నాళభూమివరసం◊ఘాతంబు రాజీవలో
కనమౌకుళ్యము జాఱ మేలుకనియెన్ ◊గాసారశయ్యాస్థలిన్. 134
టీక: రాజీవలోకనికారేక్షణ – రాజీవలోక=మత్స్యగణమును, నికార=తిరస్కరించు, ఈక్షణ=చూపులుగలదానా! కోకవిప్రతతి = చక్రవాకము లను బ్రాహ్మణులగుంపు; చంద్రద్యోతరాజీవలోకనము – చంద్రద్యోత=వెన్నెలయొక్క, రాజీ=పంక్తియొక్క, వలోకనము=దర్శనము;ఎల్లన్=అంతయు; చనన్=పోఁగా; జోడుగూడి=జతగూడి; నిలువన్=నిలిచియుండఁగా; నాళభూమి వరసంఘాతంబు =బిసము లను రాజులగుంపు; రాజీవలోకనమౌకుళ్యము =పద్మము లనెడు లోచనములయొక్క నిమీలనము; జాఱన్=పోఁగా; కాసారశయ్యాస్థలిన్=కొలఁ కనెడు పాన్పుపైని; మేలుకనియెన్=మేల్కాంచెను; కన్ గొమ్ము = కాంచుము; మోదము =సంతసమును; ననుచున్=వృద్ధిఁ బొందించును.
అనఁగా విప్రులు జతగూడి యెదుట నిలిచియుండఁగా రాజబృందము పాన్పుపై నిద్ర లేచి కన్నులు దెఱచినట్లు కొలఁకుల యందుఁ జక్రవాకములు జతగూడి యెదుట నుండఁగా బిసములు పద్మములను వికసింపఁ జేసె ననుట. అపుడు పద్మములు వికసిల్లె ననియు, వాని యెదుటఁ జక్రవాకమిథునము లుండె ననియు భావము. ‘కన్యాగౌ ర్భేరి శఙ్ఖం దధి ఫల కుసుమం పావకం దీప్యమానం యానంవా విప్రయుగ్మమ్’ అనుటచేత విప్రయుగ్మదర్శనము మంగళ మని రాజు లట్లొనరించుట ప్రసిద్ధము.
మ. అమలాంగీమణి కాంచు వేళ యనునై◊జాప్తాళి మేల్ నేర్పునం
గమలాగారముఁ దా రయాత్మ నలరం◊గావింపఁ గా నచ్చటం
గమలాగార ముదారసంబు మదిఁ బొం◊గం గొల్వు గూర్చుండె ను
త్తమభృంగీమిషగాయికావితతి గీ◊తవ్రాతముల్ వాడఁగన్. 135
టీక: అమలాంగీమణి = స్వచ్ఛమైన తనువుగలవారిలో శ్రేష్ఠురాలవైన ఓచంద్రికా! కమలాగార=పద్మాలయ యగులక్ష్మీదేవి; వేళ యనునైజాప్తాళి –వేళ యను=ప్రభాతసమయ మను, నైజ=స్వీయమగు, ఆప్తాళి=సఖీవర్గము; మేల్ నేర్పునన్=మంచి చాతు ర్యముచేత; కమలాగారమున్ = పద్మమను గృహమును; తాన్; రయాత్మన్=వేగిరపడు చిత్తముచేత; అలరన్=ఒప్పునట్లు; కావింపఁగాన్=చేయఁగా; అచ్చటన్=అచ్చోట; ఉత్తమభృంగీమిషగాయికావితతి = శ్రేష్ఠమగు నాఁడుతుమ్మెదలనెడు నెపము గల గానము చేయు స్త్రీసమూహము; గీతవ్రాతముల్= అనేకములగు పాటలను; పాడఁగన్ = పాడుచుండఁగా; ముదారసంబు = సంతోషరసము; మదిన్=మనమందు; పొంగన్=ఉప్పొంగఁగా;కొల్వుగూర్చుండెన్=కొలువై యుండెను; కాంచు=చూడుము.
అనఁగాఁ బ్రభాతవేళ యనెడు చెలియ కమలమనెడు గృహము నొప్పునట్లొనరింపఁగా నందు లక్ష్మీదేవి కొలువై యుండె ననియు, నచట నాఁడుతుమ్మెదలు మ్రోయుచుండఁగా గాయకస్త్రీలు గానము సేయునట్లుండె ననియు భావము. కమలములు వికసింపఁగానె యందు సిరి యొప్పారు ననుట తెల్లము.
చ. హరినిలయంబు తూర్పుదెస◊యై మనుటన్ సమయాఢ్యమౌళి వి
స్ఫురితతదంతికోచ్చతర◊పూర్వబలాహకకూట భూరిగో
పురమునఁ గైశ్యగుప్తసమ◊పూర్వబలాహకకూటభూరిగో
వరమిషరీతి నిల్పె నని◊వార్యమణీకలశంబుఁ గాంచితే. 136
టీక: కైశ్యగుప్తసమపూర్వబలాహకకూట = కొప్పుచే రక్షింపఁబడిన క్రొత్తమబ్బుగమిగలదానా! మబ్బుకన్న మిన్నయగు నీలిమగల కొప్పుగలదానా యనుట; హరినిలయంబు = ఇంద్రనివాసస్థానమైన పురము; తూర్పుదెసయై=తూర్పుదిక్కయి; మనుటన్=వర్ధిల్లుటచేత; సమయాఢ్యమౌళి =ప్రాతఃకాలమనెడు ప్రధానశ్రేష్ఠుఁడు; విస్ఫురితతదంతికోచ్చతరపూర్వబలాహక కూట భూరిగోపురమునన్ – విస్ఫురిత=ప్రకాశించుచున్న, తదంతిక=ఆనగరసమీపమందలి, ఉచ్చతర=మిగుల గొప్పది యైన, పూర్వబలాహక=తూర్పుకొండయొక్క, కూట=శిఖరమనెడు, భూరి=స్వర్ణమయమగు,గోపురమునన్=ఊరివాకిటి యందు, ‘పురద్వారంతు గోపురమ్’ అని యమరుఁడు; భూరిగోవరమిషరీతిన్ – భూరి=అధికమగు, గోవర=సూర్యుఁడ నెడు, మిషరీతిన్=నెపముచొప్పున; అనివార్యమణీకలశంబున్—అనివార్య=నివారింప నలవికాని, అధికమైన యనుట, మణీ కలశంబున్=మణిమయమగు కలశమును; నిల్పెన్=ఉంచెను; కాంచితే=చూచితివా?
అనఁగా సూర్యఁ డుదయించె ననియు, నతఁ డుదయగిరిశిఖరమున నుండినవాఁడై తూర్పున నున్న యింద్రపురిద్వార ముపైఁ బ్రాతఃకాల మనెడుప్రధానునిచే నిలుపఁబడిన మణికలశమునుబోలి యుండె ననియు భావము.
తే. అనుచుఁ జెలి విన్నవింప న◊య్యంబుజాక్షి, చారుసుమశయ్య డిగ్గి త◊త్సమయకృత్య
మెల్లఁ గావించి, గురు భజి◊యించి రవికు,లోత్తము వరించుతఱిఁ గోరు◊చుండె నంత. 137
టీక: అనుచున్=ఇట్లనుచు; చెలి=సఖి; విన్నవింపన్=విజ్ఞాపింపఁగా; అయ్యంబుజాక్షి=ఆచంద్రిక; చారుసుమశయ్యన్ = మనోహరమగు విరిసెజ్జను; డిగ్గి=దిగి; తత్సమయకృత్యము=ఆప్రాతఃకాలోచితమగు కార్యమును; ఎల్లన్=అంతయును; కావించి=చేసి; గురున్ భజియించి = గురుసేవ చేసి; రవికులోత్తమున్=సూర్యవంశతిలకుఁడైన సుచంద్రుని; వరించుతఱిన్ =పెండ్లియాడుసమయమును; కోరుచున్ ఉండెన్= అది యెపుడు ఘటిల్లునో యని ప్రార్థించుచుండె ననుట; అంతన్ – దీనికి ముందరి కన్వయము.
ఆశ్వాసాంతపద్యములు
మ. సతతానందితనంద! నందనవనీ◊సంచారజాగ్రత్ప్రియో
ద్ధతకౌతూహలకంద! కందసుషమో◊దారాంగసాక్షాత్క్రియా
రతినందన్ముచికుంద! కుందరదనా◊రత్నాంఘ్రిలాక్షాంకగుం
భితవక్షస్త్విడమంద! మందరధరా◊భృద్భూరిభారాంచితా! 138
టీక: సతతానందితనంద=ఎల్లప్పుడు సంతసింపఁజేయఁబడిన నందుఁడు గలవాఁడా! నందనవనీసంచారజాగ్రత్ప్రియోద్ధత కౌతూహలకంద – నందనవనీ=నందనవనముయొక్క, సంచార=సంచారముచేత, జాగ్రత్=నిస్తంద్రమైన, ప్రియా=సత్య భామయొక్క, ఉద్ధత=మిక్కుటమగు, కౌతూహల=సంతసమునకు, కంద=కారణమగువాఁడా! కందసుషమోదారాంగ సాక్షాత్క్రియారతినందన్ముచికుంద—కంద=మేఘముయొక్క, సుషమా=పరమశోభవంటి శోభచేత, ఉదార=ఉత్కృష్ట మగు, అంగ=శరీరముయొక్క, సాక్షాత్క్రియా=ప్రత్యక్షకరణమందలి, రతి=ఆసక్తిచేత, నందత్=సంతసించుచున్న, ముచి కుంద=ముచికుందుఁడను భక్తుఁడుగలవాఁడా! కుందరదనారత్నాంఘ్రిలాక్షాంకగుంభితవక్షస్త్విడమంద – కుందరదనారత్న= స్త్రీరత్నమగు లక్ష్మీదేవియొక్క, అంఘ్రిలాక్షాంక=పాదములందలి లత్తుకగుర్తులచేత, గుంభిత=కూర్పఁబడిన, వక్షః=ఉరము యొక్క, త్విట్=కాంతిచేత, అమంద=అధికుఁడయినవాఁడా! మందరధరాభృద్భూరిభారాంచితా – మందరధరాభృత్= మందరపర్వతముయొక్క, భూరి=అధికమైన, భార=భారముచేత, అంచితా=ఒప్పెడివాఁడా! ఈకృతిపతి సంబోధనములకు నుత్తరపద్యములందలి తత్సంబోధనములకు నాశ్వాసాంతగద్యముతో నన్వయము. ముక్తపదగ్రస్తాలంకారము.
క. చక్రప్రహరణ! రక్ష,శ్చక్రప్రహరణవిహార! ◊సారంగద్వి
ణ్ణక్రప్రమథన! జ్ఞానా,వక్రప్రమథనతశంభు◊వర్ణితవిభవా! 139
టీక: చక్రప్రహరణ=చక్రమే యాయుధముగాఁ గలవాఁడా! రక్షశ్చక్రప్రహరణవిహార = రాక్షసులసమూహముయొక్క సంహా రమే విహారముగాఁ గలవాఁడా! సారంగద్విణ్ణక్ర ప్రమథన – సారంగద్విట్ = గజద్వేషి యగు, నక్ర = మొసలికి, ప్రమథన = సంహర్త యగువాఁడా! జ్ఞానావక్ర ప్రమథ నత శంభు వర్ణిత విభవా – జ్ఞాన=జ్ఞానముచేత, అవక్ర=సరళులగు, ప్రమథ=ప్రమథుల చేత, నత = మ్రొక్కఁబడిన, శంభు=శివునిచేత, వర్ణిత=వర్ణింపఁబడిన, విభవా=వైభవముగలవాఁడా! శివుఁడు విష్ణువల్లభుఁడు గానఁ దద్విభవమును నుతించు ననుట.
ఉత్సాహ. వారణప్రభూతదంత◊వైరిదోర్విసారణా!
సారణాంకమౌనిరాజ◊చక్రతోషకారణా!
కారణప్రభాతిఘోర◊కంసమల్లమారణా!
మారణద్దనుప్రభూత◊మండలీనివారణా! 140
టీక: వారణ ప్రభూత దంత వైరి దోర్విసారణా—వారణ=కువలయాపీడ మను గజముయొక్క, ప్రభూత=గొప్పలగు, దంత = దంతములకు, వైరి=శత్రువులగు, దోర్విసారణా=భుజప్రసారణముగలవాఁడా! సార ణాంక మౌనిరాజచక్ర తోష కారణా – సార= శ్రేష్ఠమగు, ణ=జ్ఞానమే, అంక=చిహ్నముగాఁగల, మౌనిరాజచక్ర=మునిశ్రేష్ఠమండలియొక్క, తోష=సంతసమునకు, కారణా=హేతువైనవాఁడా! ‘ణం సరోజదళే జ్ఞానే నేత్రిషు నిస్తలవస్తుని’అని రత్నమాల; కారణప్రభాతిఘోర కంసమల్ల మారణా –కారణ=కరణసంబంధియగు, ప్రభా=కాంతిచేత, అతిఘోర=మిగుల భయంకరుఁడగు, కంసమల్ల=చాణూరునకు, మారణా =సంహర్త యైనవాఁడా! మా రణ ద్దనుప్రభూత మండలీ నివారణా – మా=లక్ష్మిచేత, రణత్=ధ్వనించుచున్న, సంపత్సమృద్ధు లైన యనుట, దనుప్రభూత=దనుజులయొక్క, మండలీ=గుంపునకు, నివారణా=నివారకుఁడా! పాదసంధియమకవిశేషము.
గద్యము: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.
గద్యము. ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదితసర్వసౌభాగ్యభాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలుసంస్థానప్రాజ్య ప్రాజ్యసకలసామ్రాజ్య శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయసత్పుత్ర సత్సంప్రదాయ శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య సరసవైదుష్య తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచిత శరదాగమసమాఖ్యవ్యాఖ్యయందుఁ జతుర్థాశ్వాసము.