సీ. జాలకమాలికా◊జాలంబు లెత్తుట, నుదుటుముత్యపుఁబేరు ◊ లొసఁగు మనుట,
సరసబంధూకగు◊చ్ఛముఁ జూపి కప్పుట, నలప్రొద్దు గ్రుంకఁగా◊వలయు ననుట,
దళముగాఁ గెందమ్మి◊దళములు గూర్చుట, నీ మీఁద ననురక్తి ◊నెగడె ననుట,
చికిలి సంపెఁగననల్ ◊సెలిమిచే నిచ్చుట, గుఱుతు చంపకలతా◊కుంజ మనుట,
తే. తెలుపకయ తెల్పి, కడునేర్పు ◊దేటపడఁగ, నలరుబొంకులఁ జెలఁగించి, యఖిలకమన
పాళి తమదండకై యాస◊పడఁగఁజేసి, విరులు విల్తురు, కుసుమలా◊వికలు వీట. 105
టీక:వీటన్ = విశాలాపురియందు; కుసుమలావికలు = పువ్వు లమ్మెడు స్త్రీలు; జాలకమాలికాజాలంబులు = మొగ్గలసరముల గుంపులు; ఎత్తుటన్ = ఎత్తుటచేత; ఉదుటుముత్యపుఁబేరులు =గొప్ప ముత్యపుసరులు; ఒసఁగు మనుట= ఇమ్మని చెప్పుట; సరస బంధూక గుచ్ఛమున్ – సరస = శ్రేష్ఠ మగు, బంధూక = మంకెనపువ్వులయొక్క, గుచ్ఛమున్ = గుత్తిని; చూపి కప్పుటన్ = చూపి, మూయుటచేత; అలప్రొద్దు గ్రుంకఁగా వలయు ననుట = ఆప్రొద్దు గ్రుంకవలయు నని చెప్పుట; దళముగాన్ = దట్టమౌ నట్లుగా; కెందమ్మిదళములు = ఎఱ్ఱతామరఱేకులు; కూర్చుటన్ = కూర్చుటచేత; నీమీఁదన్ = నీపై; అనురక్తి = అనురా గము; నెగడెన్ = అతిశయించెను; అనుట = అని చెప్పుట; చికిలి సంపెఁగననల్ = బాగైన సంపెంగపువ్వులు; చెలిమిచేన్ = ప్రేమ చేత; ఇచ్చుటన్ = ఇచ్చుటచేత; చంపకలతాకుంజము = సంపెంగలతలపొద; గుఱుతు = సంకేతస్థానము; అనుట = అని చెప్పుట; తెలుపకయ తెల్పి = ఇట్లు తమ యభిప్రాయమును వాక్కుతోఁ జెప్పకయె వ్యాపారముతోఁ దెల్పి; కడునేర్పు= అధిక మగు చాతుర్యము; తేటపడఁగన్ = వ్యక్తమౌ నట్లుగా; అలరుబొంకులన్ = ఒప్పుచున్న యసత్యోక్తులచేత; అఖిలకమన పాళిన్ = ఎల్ల కాముకకోటిని; చెలఁగించి = సంతోషపెట్టి; తమదండకై = తమపూదండకు, పొందునకు; ఆసపడఁగఁజేసి = ఆశించునట్లు చేసి; విరులు = పూవులు; విల్తురు = విక్రయింతురు.
చ. అలనగరాధిమౌళి సర◊సాగ్రణు లెంచఁ జరించు చల్లవీ
వలి తను భృంగకోటి గొలు◊వన్ విటనేత యనంగ సొంపుమై
నలరెడి పద్మినీతతుల ◊యందపుఁదావులు సెంది, యుబ్బుచుం
గులుకుఁ జిగుర్చుఁ, గన్నెలత◊కూనల మేల్వల పూని చొక్కుచున్. 106
టీక: ఈపద్యమందు మందమారుతమును విటనాయకునిఁగా వర్ణించుటచే నర్థద్వయము కల్గుచున్నది. అలనగరాధిమౌళిన్ = ఆపురవరముపై; సరసాగ్రణు లెంచన్ = రసికశిరోమణులు మెచ్చఁగా; చరించు చల్లవీవలి = వీచుచున్న చల్లనివాయువు; తనున్ = తన్ను; భృంగకోటి=తుమ్మెదలగుంపులు, విటుల గుంపులు, ‘భృఙ్గో ధూమ్యాట షిద్గయోః మధువ్రతే’ అని విశ్వము; కొలువన్ = సేవింపఁగా; విటనేత యనంగన్ = విటశ్రేష్ఠుండనునట్లు; సొంపుమైన్ = మనోహరతచేత; అలరెడి = ఒప్పుచున్న; పద్మినీతతుల = పద్మలతల గుంపులయొక్క, పద్మినీజాతిస్త్రీసమూహముయొక్క; అందపుఁ దావులు =మనోహర మైన పరి మళములను, నివాసస్థానములను; చెంది = పొంది; ఉబ్బుచున్ = అతిశయించుచు; కన్నెలతకూనల మేల్వలపు = కన్నెల వంటి బాల (లేత) లతలయొక్క మేలైన పరిమళమును, బాలలతలవంటి కన్నెల యందు హెచ్చైన మోహమును; ఊని= పూని; చొక్కుచున్ = పరవశ మగుచు; కులుకున్ = అందమును; చిగుర్చున్ = ఆవిర్భవింపఁ జేయును.
సీ. సేసకొప్పుల నమ◊ర్చిన మొల్లమొగడచాల్, సరిగరుమాలపైఁ ◊జక్కఁ దోఁప,
వలెవాటు వైచిన ◊సుళువుఁ జెందిరకావి, వలిపముల్ పదపల్ల◊వముల జీర,
నెలవంక రేఖలు ◊నెలకొన్న పేరుర,ములఁ జిల్కతాళులు ◊తళుకుసూపఁ,
జెలువంబు నెగడఁ దీ◊ర్చిన క్రొత్తకస్తూరి,పట్టెల మేల్తావి ◊మట్టుమీఱఁ,
తే. జెక్కుఁగవ ముత్తియపుటొంట్ల◊జిగి వెలుంగఁ, బలుకుఁగప్రంపువీడెంబు ◊వలపు నిగుడ,
నలరువేడుక వెనువెంటఁ ◊జెలులు నడవ, వేడ్కఁ జరియింతు రనిశంబు ◊విటులు వీట. 107
టీక: వీటన్ = విశాలాపురియందు; విటులు = జారులు; సేసకొప్పులన్ = కొండెసిగలయందు; అమర్చిన = ఉంపఁబడిన; మొల్లమొగడచాల్ = కుందకుట్మములయొక్క బంతులు; సరిగరుమాలపైన్ = జరీరుమాలమీఁద; చక్కన్ = బాగుగా; తోఁపన్ = తోఁచుచుండఁగా; వలెవాటు వైచిన = వల్లెవాటుగా వేసికొన్న; సుళువుఁ జెందిరకావి = లేఁతచంద్రకావివన్నె గల; వలిపముల్ = వస్త్రములు; పద పల్లవములన్ = పల్లవములవంటి పాదములపై; జీరన్ = జీరాడుచుండఁగా; నెలవంక రేఖలు = చంద్రవంకరేకలు; నెలకొన్న= వ్యాపించిన; పేరురములన్ = విశాలమైన వక్షస్థ్సలములయందు; చిల్క తాళులు = తావళము లనెడు హారవిశేషములు; తళుకుసూపన్ = ప్రకాశించుచుండఁగా; చెలువంబు = అందము; నెగడన్ = అతిశయించునట్లు; తీర్చిన క్రొత్తకస్తూరిపట్టెల మేల్తావి = తీర్పఁబడిన నూతనకస్తూరిపట్టెల యొక్క యుత్తమమైన పరిమళము; మట్టుమీఱన్ = అతిశయింపఁగా;
చెక్కుఁగవన్ = గండయుగ్మమందు; ముత్తియపుటొంట్లజిగి = ముత్యములతోఁ గూడిన యంటుపోఁగుల యొక్క కాంతి; వెలుంగన్ = ప్రకాశించుచుండఁగా; పలుకుఁగప్రంపువీడెంబు వలపు = పలుకు కర్పూరముతోఁ జేరిన తాంబూలములయొక్క వాసన; నిగుడన్ = వ్యాపింపఁగా; అలరు వేడుకన్ = అతిశయవిలాసముచేత; వెనువెంటన్ = వెంబడిగా; చెలులు = స్త్రీలు; నడవన్ = నడచుచుండఁగా; అనిశంబున్ = ఎల్లప్పుడు; వేడ్కన్ = వేడుకచేత; చరియింతురు = సంచరింతురు.
మ. అకలంకాంబుజపాళికా సుఖిత భృం◊గాళీ తనూకాంతిదం
భ కళిందప్రభవానుషంగ శిఖిదా◊మా తాండవాపాదనో
దక భంగోత్కర ఘర్షణక్రమ సము◊ద్గచ్ఛ త్పయోబిందు శీ
తకరీభూత పతంగ గంగ, దనరుం ◊దత్ప్రాంతదేశంబునన్. 108
టీక: తత్ప్రాంతదేశంబునన్ = ఆవిశాలాపురిసమీపమందు; అకలంకాంబుజ పాళికా సుఖిత భృంగాళీ తనూ కాంతిదంభ కళిందప్రభ వానుషంగ శిఖిదామా తాండవాపాద నోదక భంగోత్కర ఘర్షణక్రమ సముద్గచ్ఛ త్పయోబిందు శీతకరీభూత పతంగ గంగ– అకలంక = స్వచ్ఛములగు, అంబుజ = పద్మములయొక్క, పాళికా = గుంపులయందు, సుఖిత = సంజాత సుఖములగు, భృంగ = తుమ్మెదలయొక్క, ఆళీ = సమూహముయొక్క, తనూకాంతి = దేహకాంతి యనెడు, దంభ = నెపము గల, కళిందప్రభవా = యమునానదియొక్క, అనుషంగ = సంబంధముచేత, దీని కాపాదనక్రియయం దన్వయము, శిఖిదామా =మయూరసమూహమునకు, తాండవాపాదన = తాండవోత్సవసంపాదక మగు, ఉదక = జలముయొక్క, భంగో త్కర = అలల గుంపులయొక్క, ఘర్షణక్రమ = సంఘర్షణక్రమముచేత, సముద్గచ్ఛత్ = పై కెగురుచున్న, పయోబిందు= ఉదక బిందువులచేత, శీతకరీభూత= చంద్రునివలెఁ జల్లనైన, పతంగ = సూర్యుఁడు గల, గంగ = గంగానది; తనరున్ = ప్రకాశించును. ఈపద్యమందు శిఖిదామా యనుచోట దామన్ శబ్దము ‘డా బుభాభ్యా మన్యతరస్యామ్’ అను సూత్రముచేత డాప్ప్రత్యయము వచ్చుటచే నాకారాంత మైనది. భృంగతనూకాంతి యనెడు యమునాసంగముచేత గంగాతరంగములు మేఘపరంపరలఁ బోలి శిఖితాండవముఁ గలుగఁ జేయుచున్నవనియు, నాతరంగములయొక్క తాఁకుడువలన జలకణములు సూర్యలోకమువఱకు నెగసి సూర్యునిఁ జంద్రునివలెఁ జల్ల నగునట్లు చేయుచున్న వనియు భావము.
మ. విలసత్సారణికానుయాయి విబుధ◊ద్వీపిన్యనర్ఘామృతం
బుల ముక్కారును బండు శాలులు పురీ◊భూదేవపాళీకృతో
జ్జ్వల నానావిధయజ్ఞ తన్నవహవి◊స్సంభుక్తి బర్హిర్ముఖా
వళు లెల్లప్డు నమర్త్యభావ మజర◊త్వం బూని మోదింపఁగన్. 109
టీక: శాలులు = వరిపైరులు; విలసత్సారణికానుయాయి విబుధద్వీపిన్యనర్ఘామృతంబులన్ – విలస త్సారణికా = ప్రకాశించు కాల్వలను, అనుయాయి = అనుసరించిపోవు, విబుధద్వీపినీ = గంగయొక్క, అనర్ఘామృతంబులన్ = అమూల్యములగు నుదకము లను సుధలచేత; ముక్కారును = మూఁడు కార్లును; పండున్ = ఫలించును; పురీ భూదేవపాళీ కృతోజ్జ్వల నానా విధ యజ్ఞ తన్నవహవిస్సంభుక్తి న్ – పురీ = విశాలాపురియందలి, భూదేవపాళీ = బ్రాహ్మణబృందముచేత, కృత = చేయఁ బడిన, ఉజ్జ్వల = ప్రకాశించునట్టి, నానావిధ = అనేకప్రకారము లగు, యజ్ఞ = యజ్ఞములయందు, తన్నవహవిస్సంభుక్తిన్= ఆశాలి సంబంధి యైన నూతనహవిర్భోజనముచేత; బర్హిర్ముఖావళులు = దేవగణములు; ఎల్లప్డున్ = నిరంతరమును; అమర్త్య భావము = మరణము లేకుంటను; అజరత్వంబు = ముసలితనము లేమిని; ఊని = వహించి; మోదింపఁగన్ = సంతసించు చుండఁగా, దీనికి పండు నను సమాపకక్రియతో నన్వయము. అనఁగా బర్హిర్ముఖులకు (గడ్డిదినువారికి) అమృతముతోఁ బండిన లోకోత్తర మైన శాలిహవిస్సు భుజించుటయు, నమర్త్యత్వాజరత్వములుగలుగుటయు, లోకోత్తరానందహేతు వగు నని యాశ యము. గంగానది కాల్వల చేత ముక్కారుపంటలు పండుచుండఁగా విప్రులు యాగము లెప్పుడుఁ జేయుచు దేవతలను సంత సింపఁ జేయుదు రని భావము. ఇచట బర్హిర్ముఖుల నిష్ఠాజరత్వామర్త్యభావములను గూర్చి హేతువు గాని విబుధద్వీపిన్యనర్ఘా మృతఫలితశాలిహవిర్భోజనమును హేతువుగా సంభావన చేయుటవలన హేతూత్ప్రేక్షాలంకారము. అదియు నమృతశబ్దగత రూపకముతో సంకీర్ణంబు.
చ. అనువనసారణీతటయు◊గాంబుజబృందమరందపూరము
ల్గనిమలు నిండి యానదిజ◊లంబులతోఁ బ్రవహింపఁ బై పయిన్
జను నళిపంక్తి బొల్పెసఁగు ◊సాగరనీరముఁ ద్రావి దప్పిచే
ననిశము మేఘమాలిక త◊దంబుకదంబము గ్రోలఁ జేరె నాన్. 110
టీక: అనువన సారణీ తటయుగాంబుజబృంద మరందపూరముల్ – అనువన=వనము ననుసరించిన, సారణీ= కాల్వల యొక్క, తటయుగ = ఇరుప్రక్కలయందున్న, అంబుజబృంద = పద్మముల గుంపుయొక్క, మరందపూరముల్ = మకరంద ప్రవాహములు; గనిమలు నిండి=కయ్యలు నిండి; ఆనదిజలంబులతోన్= ఆ గంగానదిజలములతో; ప్రవహింపన్= ప్రవహించు చుండఁగా; పై పయిన్ = మీఁదమీఁద; చను నళిపంక్తి =పోవు తుమ్మెదలగుంపు; సాగరనీరమున్=సముద్రోదకమును; అనిశము = ఎల్లప్పుడును; త్రావి = పానము చేసి; దప్పిచేన్= తృష్ణచేత; మేఘమాలిక= మబ్బులగుంపు; తదంబుకదంబము = ఆమక రందయుతమైన గంగాజలమును; క్రోలన్ = త్రావుటకు; చేరె నాన్ = చేరినదా యను నట్లు; పొల్పెసఁగున్ = ఒప్పారును; అళిపంక్తిని మేఘముగా సంభావన చేయుటచే స్వరూపోత్ప్రేక్షాలంకారము.
ఉ. పున్నమరేలఁ గాఁపువిరి◊బోఁడులు కాంచనకందుకంబులం
జెన్నగు చంద్రకాంతతట◊సీమల వజ్రపుబిల్లదొంతి నే
య న్నెరయంగఁ జాలినర◊యంబున మార్చి గ్రహింతు రింపుతో
నన్నది నిర్మలోర్మికల ◊నందిన పూర్ణసుధాంశుమూర్తులన్. 111
టీక: పున్నమరేలన్ = పున్నమరాత్రులయందు; కాఁపువిరిబోఁడులు = కాఁపులయాఁడువారు; కాంచన కందుకంబులన్ = బంగారుచెండ్లచేత; చెన్నగు చంద్రకాంతతటసీమలన్ = ప్రకాశించుచున్న చంద్రకాంతమణిఖచిత మగు తీరప్రదేశములయందు; వజ్రపుబిల్లదొంతిన్ = వజ్రములతో గుండ్రముగాఁ జేయఁబడిన బిల్లలయొక్క దొంతి, ననఁగా నొకదానిపై నొకటి వరుసగాఁ బెట్టిన రాశిని; ఏయన్ = ఏయఁగా; నెరయంగన్ = ఆబిల్ల లంతట నెరసికొనఁగా; చాలినరయంబునన్ = మిక్కిలివేగముచేత; అన్నది నిర్మలోర్మికల నందిన పూర్ణసుధాంశుమూర్తులన్ = ఆగంగయొక్క నిర్మలమైన తరంగములయందుఁ బ్రతిఫలించిన పూర్ణచంద్రుని తనువులను; మార్చి = మార్పుచేసి; ఇంపుతోన్ = సంతసముతో; గ్రహింతురు = పట్టుకొందురు. ఇచట వజ్రపు బిల్ల లనెడు భ్రాంతితోఁ గాఁపువిరిబోఁడులు చంద్రబింబములను గ్రహించుటవలన భ్రాంతిమదలంకారము.
సీ. కమనీయకామినీ◊గానంబు కమనీయ,కామినీగానంబు ◊గలిసి మెఱయఁ,
జక్రాంగచక్రని◊స్వనములు చక్రాంగ,చక్రనిస్వనములు ◊చక్క బెరయ,
బహులహర్యాళికా◊ర్భటికలు బహులహ,ర్యాళికార్భటిక లై◊క్యంబు నొంద,
సారంగరాజఘో◊షంబులు సారంగ,రాజఘోషములు మి◊త్రత్వ మూనఁ,
తే. గలితవాహినికాకల◊కలము నిత్య,కలితవాహినికాకల◊కలము బెరయ,
నప్పురపుఁజెల్మిచేఁ బోలె ◊నమరతటిని,చెంత శుచిజీవనస్థితిఁ జెలఁగు నెపుడు. 112
టీక: ఇందు గంగాపర మైన యర్థము, పురపర మైన యర్థమును దోఁచుచున్నది. కమనీయకామినీగానంబు = మనోజ్ఞస్త్రీల గానము; కమనీయకామినీగానంబు = మనోజ్ఞచక్రవాకస్త్రీల గానము, ‘కామీ స్యా త్కాముకే చక్రవాకే పారావతేఽపి చ’ అని విశ్వము; కామియొక్క స్త్రీ కామిని యగును; కలిసి = కూడి; మెఱయన్ = ప్రకా శింపఁగా; చక్రాంగచక్రనిస్వనములు = రథసమూహముల ధ్వనులు; చక్రాంగచక్రనిస్వనములు = హంససమూహముల ధ్వనులు; చక్కన్ = చక్కఁగా; బెరయన్ =కలయఁగా; బహులహర్యాళికార్భటికలు – బహుల = అధికములగు, హర్యాళికార్భటికలు = అశ్వసంఘములయొక్క హేషలు; బహు = అధికములగు, లహరీ = అలలయొక్క, ఆళికా=సమూహములయొక్క, ఆర్భటికలు = ధ్వనులు; ఐక్యంబు నొందన్ = అభేదము నవలంబింపఁగా; సారంగరాజఘోషంబులు = శ్రేష్ఠగజములయొక్క బృంహితములు; సారంగరాజఘోషములు=గండుతుమ్మెదల రుతములు; మిత్రత్వము = సుహృద్భావమును; ఊనన్ = వహింపఁగా; కలితవాహినికాకలకలము= ఒప్పుచున్న సేనలయొక్క కోలాహలములు; నిత్యకలితవాహినికాకలకలము=ఎల్లప్పుడుఁ గూడు కొన్న ప్రవాహకోలాహలధ్వనులు; బెరయన్ = కూడఁగా; అప్పురపుఁజెల్మిచేఁ బోలెన్ = ఆ విశాలాపురియొక్క మైత్రితోఁ బోలె; అమరతటిని = సురనది; చెంతన్ = సమీపమున; శుచిజీవనస్థితిన్ = నిర్మలమైన బ్రదుకుయొక్క స్థితిచేత, నిర్మలోదకస్థితిచేత ననుట; ఎపుడున్ = సర్వకాలములందు; చెలఁగున్ = ఒప్పును. గంగానది తనయం దున్న కమనీయచక్రవాకస్త్రీగానాదులు విశాలాపురియం దున్న కమనీయనారీగానాదులు పరస్పరసామ్య మున మైత్రి నొందఁగాఁ దానును ప్రీతితోఁ బోలె శుచిజీవనస్థితిని దాల్చి శుచిజీవనస్థితి యైన పురముచెంత వసించిన దనఁగా నొండొ రుల ధర్మము లైక్యముగా నున్న వని భావము. పురమం దున్నవారల జీవనముయొక్క నైర్మల్యమును బట్టి లక్షణచే పురము శుచిజీవన మగు నని యెఱుంగునది. పురసమీపమందు గంగాస్థితి కహేతువు లగు కామినీగానైక్యాదులు హేతువులుగాఁ జెప్పు టచే హేతూత్ప్రేక్షాలంకారము.
క. ఆరాజధాని కధిపతి
యై రాజిల్లును సుచంద్రుఁ డను ◊రాజు, మహో
దారగిరీశోరుదరీ
వారవరీవృత్యమాన◊వైరివ్రజుఁ డై. 113
టీక: ఆరాజధానికిన్ = ఆ నగరమునకు; అధిపతి యై = ప్రభు వై; సుచంద్రుఁ డను రాజు = సుచంద్రుఁడను నామము గల రాజు; మహోదార గిరీ శోరుదరీ వార వరీవృత్యమాన వైరివ్రజుఁ డై – మహోదార = మిక్కిలి యధికము లగు, గిరీశ = పర్వతశ్రేష్ఠములయొక్క, ఉరుదరీ = గొప్పదరులయొక్క, వార = సంఘములయందు, వరీవృత్యమాన = మిక్కిలి వసించినట్టి, వైరివ్రజుఁ డై = శత్రుసంఘము గల వాఁ డై; రాజిల్లును = ప్రకాశించును.
సీ. తనచారుకీర్తిసం◊తానవల్లరికి స,జ్జాలముల్ సజ్జాల◊లీల నెనయఁ,
దననిత్యదానాంబు ◊వనజాలయమునకుఁ, బుష్కరం బతినీల◊పుష్కరముగఁ,
దనఖడ్గపుత్ర్యభి◊ధానకాదంబిని, కరిరాజు లరిరాజు ◊లై తలంకఁ,
దననవ్యధామసాం◊ద్రద్యోతమునకు ఖ,ద్యోతుండు ఖద్యోత◊రీతిఁ బూనఁ,
తే. దనభుజాభోగిరాడ్భోగ◊మునకు ధరణి,చక్ర మెంతయుఁ జక్రప్ర◊శస్తి బెరయ,
వెలయు నభిరామసౌందర్య◊విజితమదన,శక్రసుతచంద్రవిభుఁడు సు◊చంద్రవిభుఁడు. 114
టీక: అభిరామ సౌందర్య విజిత మదన శక్రసుత చంద్ర విభుఁడు – అభిరామ = ఒప్పుచున్న, సౌందర్య = చక్కఁదనముచేత, విజిత=జయింపఁబడిన, మదన=మన్మథునియొక్కయు, శక్రసుత= జయంతునియొక్కయు, చంద్ర = చంద్రునియొక్కయు, విభుఁడు = విశేషకాంతి గల వాఁ డైన; సుచంద్రవిభుఁడు= సుచంద్రమహారాజు; తనచారుకీర్తిసంతానవల్లరికిన్ = తనయొక్క కీర్తి యనెడు కల్పవల్లికి; సజ్జాలముల్ = రిక్కలగుంపులు; సజ్జాలలీలన్ = లెస్స యగు మొగ్గలయొక్క లీలవంటి లీలను; ఎనయన్ = పొందఁగా; తన నిత్య దానాంబు వనజాలయమునకున్= తనయొక్క నిరంతరదానోదక మనెడు సముద్రమునకు; పుష్కరంబు = ఆకసము; అతినీలపుష్కరముగన్ = మిక్కిలి నల్లనైన తామర కాఁగా; తన ఖడ్గపుత్ర్యభిధాన కాదంబినికిన్ = తన చురకత్తి యనెడు మేఘమాలకు; అరిరాజులు = శత్రురాజులు; అరిరాజు లై = జక్కవ రాజు లై; తలంకన్ = భయపడఁగా; తన నవ్యధామ సాంద్ర ద్యోతమునకున్ = తన ప్రతాప మనెడు దట్టమైన యెండకు; ఖద్యోతుండు = సూర్యుండు; ఖద్యోతరీతిఁ బూనన్ = మిడుఁగుఱుపురుఁగురీతిని వహింపఁగా; తన భుజా భోగిరా డ్భోగమునకున్ = తన భుజ మనెడు నాదిశేషుని ఫణమునకు; ధరణిచక్రము =భూచక్రము; ఎంతయున్ = అధికముగా; చక్రప్రశస్తిన్ = చక్రాయుధఖ్యాతిని; బెరయన్ = పొందఁగా; వెలయున్ = ప్రకాశించును. ఇచట శ్లేషానుప్రాణిత పరంపరితరూపకములకు సంసృష్టి యగు.