క. అని పల్కన్ నృపతి దయా
ధుని సిల్కం బలుకువాలు◊దొరలం గడుఁ బా
యని యల్కం దూల్చు పలా
దునిఁ జుల్కం జేసి నియమి◊తో నిట్లనియెన్. 146
టీక: అని పల్కన్ = ఇట్లు శాండిల్యుఁడు పల్కఁగా; నృపతి = సుచంద్రుఁడు; దయాధుని =దయానది; చిల్కన్ = చిందునట్లు గా, దీని కిట్లనియెన్ అను క్రియతో నన్వయము; పలుకువాలుదొరలన్ = శాపరూపవాక్కు లాయుధముగాఁ గల ప్రభువులను, అనఁగా మునిశ్రేష్ఠులను; కడున్ = మిక్కిలి; పాయని యల్కన్ = వీడని కోపముచేత; తూల్చు పలాదునిన్ = సంహరించు క్రవ్యాదుని; చుల్కంజేసి = లఘువుగా నెంచి; నియమితోన్ = మునితోడ; ఇట్లనియెన్ = వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.
చ. పుడమినృపాలు రబ్బురముఁ ◊బూన, బలంబులతోడ నీదువెం
బడి నరుదెంచి రాత్రిచర◊బంధునిఁ గూల్చెద, నంత యేల యి
య్యెడ నలదానవుం డనఁగ ◊నెంత, భవత్కృప వాఁడు నా కసా
ధ్యుఁడె, హరి గాచియున్న, హరు◊తో రణమేదిని కేఁగుదెంచినన్. 147
టీక: పుడమిన్ =భూమియందు; నృపాలురు = రాజులు; అబ్బురమున్ = ఆశ్చర్యమును; పూనన్ = వహింపఁగా; బలంబుల తోడ = సైన్యములతోడ; నీదువెంబడిన్ = నీవెంట; అరుదెంచి = వచ్చి; రాత్రిచరబంధునిన్ = రాక్షసబంధు వగు నా తమిస్రుని; ఇయ్యెడన్ = ఇప్పుడు; కూల్చెదన్ = సంహరించె దను; అంత యేల = అంత చెప్పనేల; అలదానవుం డనఁగ నెంత = ఆ రాక్షసుం డనఁగా నెంత; భవత్కృపన్ = మీయొక్క దయచే; హరి గాచియున్నన్ = విష్ణువు రక్షించి యున్నను; హరుతోన్ = శివునితోడ; రణమేదినికిన్ = యుద్ధభూమికి; ఏఁగుదెంచినన్=వచ్చినను; నాకున్, వాఁడు = ఆరాక్షసుండు; అసాధ్యుఁడె= సాధింప నలవి కానివాఁడా?
మ. దనుభూభారవిముక్తి గోతలము సెం◊దన్, గోతలాప్తిన్ సుప
ర్వనికాయం బెనయన్, సుపర్వయుతి శ◊శ్వత్సద్వితానంబులుం
దనరం, బాయని సద్వితానముల నా◊నామౌనిగేహంబు లె
చ్చ, నవాస్త్రావళిఁ గూల్తుఁదత్సురరిపు◊స్వామిన్ రణాస్యంబునన్. 148
టీక: గోతలము=భూతలము; దనుభూ = రాక్షసులయొక్క; భారవిముక్తి న్ = భారమోక్షమును; చెందన్= పొందఁగా; సుపర్వనికాయంబు = దేవతలసమూహము; గోతలాప్తిన్ = స్వర్గతలప్రాప్తిని; ఎనయన్ = పొందఁగా; సుపర్వయుతిన్ = మంచిపర్వముయొక్క యోగముచేత; శశ్వత్సద్వితానంబులున్= సంతతములై శ్రేష్ఠము లగు యజ్ఞములు, ‘వితానో యజ్ఞ విస్తార లోభేషు’ అని విశ్వము; తనరన్ = ఒప్పఁగా; పాయని = ఎడయని; సద్వితానములన్ = విద్వత్కదంబములతోడ; నానామౌనిగేహంబులు = అనేకమునిగృహములు; ఎచ్చన్ = మించఁగా; రణాస్యంబునన్ = యుద్ధముఖమందు; తత్సుర రిపుస్వామిన్ = ఆ దేవారిరాజగు రక్కసుని; నవాస్త్రాళిన్ = నూతనమగు నస్త్రముల గుంపులచేత; కూల్తున్ = సంహరింతును. తాత్పర్యము స్పష్టము. ఏకావళీ, కారణమాలాలంకృతులు. ‘శ్లో. గృహీతముక్తరీత్యార్ధశ్రేణి రేకావళీ మతా, గుమ్ఫః కారణ మాలా స్యా ద్యథా ప్రాక్ప్రాన్తకారణైః’ అని లక్షణము.
తే. యమికులమహేంద్ర! యిది కార్య ◊మనుచు నొక్క
శిష్యుఁ బనిచిన వచ్చి, యా◊శీవిషోప
మాశుగాళి సురారాతి ◊ నవనిఁ గూలి
చెదను, మీ రింతపనికి వి◊చ్చేయఁదగునె. 149
టీక: యమికులమహేంద్ర =మునికులరాజ వైన శాండిల్యుఁడా; ఇది కార్య మనుచున్ = ఇదికర్తవ్యంబని; ఒక్క శిష్యుఁబనిచినన్ =ఒక్క యంతేవాసిని బంపినను; వచ్చి= నేనంతవఱకు వచ్చి; ఆశీవిష=సర్పములకు; ఉపమ=తుల్యము లగు; ఆశుగ=బాణ ములయొక్క; ఆళిన్ = పంక్తులచేత; సురారాతిన్ = దేవతలకు శత్రువైన రక్కసుని; అవనిన్ =భూమియందు; కూలిచెదను = పడవైతును; మీరు = మహర్షి శ్రేష్ఠులైన మీరు; ఇంతపనికిన్=ఇట్టి స్వల్పకార్యమునకు; విచ్చేయన్ = వచ్చుటకు; తగునె= తగి నట్టిదా.
చ. అని విభుఁ డమ్మునీశు విన◊యంబునఁ బూజన మూన్చి, భక్తిచే
ననిచి, నిజాప్తమంత్రిజన◊తైకవచోగతి సమ్మదం బెదం
దనరఁగ, నాత్మదివ్యపృత◊నానికరంబుల రా ఘటించి, తా
నెనపె జయప్రయాణనియ◊తైహికమానసవీథి నంతటన్. 150
టీక: అని = ఈప్రకారము వచించి; విభుఁడు = సుచంద్రుఁడు; అమ్మునీశున్ = ఆశాండిల్యుని; వినయంబునన్ = అడఁకువతోడ; పూజనము = అర్చనము; ఊన్చి=చేసి; భక్తిచేన్ = భక్తిచేత; అనిచి = పంపి; నిజ = తనయొక్క; ఆప్త=హితులయొక్కయు; మంత్రిజనతా=మంత్రిసమూహముయొక్కయు; ఏక=ముఖ్యమగు; వచోగతిన్ = వాగ్రీతిచేత; సమ్మదంబు = సంతసము; ఎదన్ = హృదయమునందు; తనరఁగన్=ఒప్పఁగా; ఆత్మ=తనయొక్క; దివ్యపృతనా =దివ్యసేనలయొక్క; నికరంబులన్=సమూ హములను; రాన్=వచ్చునట్లు; ఘటించి=చేసి; తాన్ = తాను; జయప్రయాణ=విజయయాత్రయందు; నియతైహికన్ = నియతాభిలాషను, ఈహాశబ్దముపై కప్ప్రత్యయము; మానసవీథిన్=మనోవిథిని; అంతటన్=ఎల్లెడల; ఎనపెన్= వ్యాపింపఁ జేసెను. జయప్రయాణమునకు నిశ్చలచిత్తుం డయ్యె ననుట.
మ. గళదర్కంబుఁ, బనీపతత్కుజము, రిం◊ఖద్గోత్రగోత్రంబుఁ, జా
చలదుర్వీవలయంబు, ఫక్కదఖిలా◊శాకంబు, భిద్యన్నభ
స్థ్సలమేఘౌఘము, భ్రశ్యదృక్షము, రణ◊త్పద్మాసనాండంబు నై
యలరెం దన్మహిపాలజైత్రగమబం◊భారావ మప్పట్టునన్. 151
టీక: అప్పట్టునన్ = ఆసమయమందు; తన్మహిపాలజైత్రగమబంభారావము – తన్మహిపాల = ఆసుచంద్రునియొక్క, జైత్ర= జయార్థ మై, గమ=ప్రస్థానసూచక మగు, ‘ప్రస్థానం గమనం గమః’ అని యమరుఁడు, బంభా=భేరియొక్క, ‘బమ్భా భేర్యామ్’ అని అమరశేషము, ఆరావము = ధ్వని; గళత్ అర్కంబున్ = పడుచున్న సూర్యుఁడు గలదియు; పనీపతత్ కుజమున్ = మిక్కిలి కూలుచున్న వృక్షములు గలదియు, పనీపతచ్ఛబ్దము యఙ్లుగంతము; రింఖత్ గోత్రగోత్రంబున్ = ఎగిరిపడుచున్న గిరిసంఘములు గలదియు; చాచలత్ ఉర్వీవలయంబున్ = మిక్కిలి చలించుచున్నభూవలయము గలదియు; ఫక్కత్ అఖి లాశాకంబున్=పగులుచున్నసకలదిక్కులు గలదియు, ఆశాశబ్దాంతబహువ్రీహిమీఁద కప్ప్రత్యయము, ‘ఆపోన్యతరస్యామ్’ అని వికల్పముచేత హ్రస్వము లేదు; భిద్యత్ నభస్థలమేఘౌఘమున్ = చీలుచున్న గగనస్థలమందలి మేఘములగుంపు గలది యు; భ్రశ్యత్ ఋక్షమున్=పుడమిని వ్రాలుచున్న రిక్కలు గలదియు, భ్రంశు అధఃపతనే యనుటచేత భ్రంశుధాతు వధఃపతనార్థ కంబు; రణత్ పద్మాసనాండంబున్=మ్రోఁగుచున్న బ్రహ్మాండంబు గలదియు; ఐ, అలరెన్=ఒప్పెను. అత్యుక్త్యలంకారము.
సీ. సితకాండజాతసం◊గతి విరాజిల్లుటఁ, జక్రాంగ మగుటకు ◊సందియంబె,
చారుసూనవితాన◊సంయుక్తి వెలయుట, స్యందనం బగుటకు సందియంబె,
వరవైజయంతికా◊పరిషక్తి నొప్పుటఁ, జక్రి దా నగుటకు ◊సందియంబె,
సుకరయుగాదికాం◊గకలబ్ధిఁ దనరుట, సద్రథం బగుటకు ◊సందియంబె,
తే. హరిభయంకరభూరిధా◊మాప్తి మనుట, జగతి నిది తార్క్ష్యమగుటకు ◊సందియంబె
యనఁగఁ బొగడొందు రత్నశ◊తాంగ మప్పు, డధిపుకనుసన్నఁదెచ్చె ని◊యంత యొకఁడు. 152
టీక: ఇందు రథము వర్ణింపఁబడుచున్నది. ఎట్లనిన: సితకాండజాతసంగతిన్ – సిత=తెల్లనైన, కాండ=గుఱ్ఱములయొక్క. జాత= గుంపుయొక్క, సంగతిన్ = సంబంధముచేత; సిత= తెల్లనగు, కాండజాత=తామరలయొక్క, సంగతిచేత నని యర్థాంతరము; విరాజిల్లుటన్ = ప్రకాశించుటచేత; చక్రాంగము=రథము, హంసము అని యర్థాంతరము; అగుటకున్, సందియంబె = సందేహము లేదనుట. చారుసూనవితానసంయుక్తిన్ – చారు=మనోజ్ఞము లగు, సూనవితాన=పువ్వులచప్పరముయొక్క, సంయుక్తిన్ =సంబం ధముచేత, మనోజ్ఞకుసుమసంఘముచేత నని యర్థాంతరము; వెలయుటన్ = ప్రకాశించుటచేత; స్యందనం బగుటకున్ = రథ మగుటకు, నెమ్మిచెట్టగుట కని యర్థాంతరము; సందియంబె = సందేహము లేదనుట. వరవైజయంతికాపరిషక్తి నొప్పుటన్ = శ్రేష్ఠము లగు పతాకలయొక్క సంబంధముచేత నొప్పుటచే, శ్రేష్ఠ మగు వనమాలికయొక్క సంబంధముచే నొప్పుటచే నని యర్థాంతరము; తాన్=తాను; చక్రి అగుటకున్ = రథ మగుటకు, విష్ణు వగుటకు; సందియంబె = సందేహమా, సందేహము లే దనుట.సుకరయుగాదికాంగకలబ్ధిన్ తనరుటన్–సుకర=అనుకూలమగు, యుగ=కాఁడి, ఆదిక=మొదలుగాఁగల, అంగక=అంగ ములయొక్క, లబ్ధిన్ = లాభముచేత, తనరుటన్ = ఒప్పుటచేత; సమీచీన మైన హస్త ద్వయము మొదలగు నంగములతోఁ గూడి తనరుటచేత నని యర్థాంతరము; సద్రథంబు = మంచితేరు, మంచి శరీర మని యర్థాంతరము, ‘రథో దేహే స్యందనే చ’ అని రత్నమాల; అగుటకు సందియంబె = అగుటకు సందేహము లేదనుట. హరిభయంకరభూరిధామాప్తిన్ – హరి=సూర్యునకు, భయంకర= భయమును జేయు, భూరి= అధిక మగు, ‘భూరి ప్రాజ్య సువర్ణయోః’ అని విశ్వము, ధామ=తేజముయొక్క, ఆప్తిన్ = కూడికచేత; మనుటన్ = వృద్ధిఁబొందుటచేత; జగతిన్ = లోక మందు; ఇది = ఈరథము; తార్క్ష్యము = అశ్వములు గలది, తార్క్ష్యశబ్దముపై నర్శ ఆద్యచ్ ప్రత్యయము, గరుత్మంతుఁ డని యర్థాంతరము; అగుటకుసందియంబె = అగుటకు సందేహము లేదనుట; అనఁగన్ = ఇట్లని; పొగడొందు = పొగడ్తను గాంచుచున్న; రత్నశతాంగము = రత్నఖచిత మగు రథము; అప్పుడు= ఆ జయ భేరీనినాదావసరమున; అధిపుకనుసన్నన్ = రాజునేత్రసంజ్ఞచేత; నియంత యొకఁడు = ఒక సూతుండు; తెచ్చెన్ = తీసికొని వచ్చెను. ఈపద్యమందు రథము విషయభేదముచే నానారూపముగ లోకముచేత నుల్లేఖింపఁబడుటం జేసి యుల్లేఖాలంకార భేదము. ‘శ్లో. ఏకేన బహుధోల్లేఖే ప్యసౌ విషయభేదతః’ అని తల్లక్షణము. లోకులచేత నని యుల్లేఖకర్తృబహుత్వము వివక్షిత మగు నేని, ‘శ్లో. బహుభి ర్బహుధోల్లేఖాదేకస్యోల్లేఖ ఇష్యతే’ అని యుల్లేఖాలంకారభేద మగును.
చ. తొడవులు మేటిమేనిజిగి◊తో నిగుడం, గుడివంకఁ గెంపురా
పిడియము దోఁప, బంధునృప◊బృందము లందఱు నివ్వటిల్ల వెం
బడి నెడ యీక రాఁ, దళుకు◊బంగరుఁజేల యొకింత జీరఁగా,
వెడలె హజార మానృపతి ◊విప్రయుగంబును దృష్టి నాఁగుచున్. 153
టీక: ఆనృపతి = ఆసుచంద్రుఁడు; తొడవులు =భూషణములు; మేటిమేనిజిగితోన్ = శ్రేష్ఠమగు దేహకాంతితోడ; నిగుడన్ = వ్యాపింపఁగా; కుడివంకన్ = కుడిప్రక్కను; కెంపురాపిడియము = పద్మరాగమణిమయ మగు బాకు; తోఁపన్ = అగపడు చుండఁగా; బంధునృపబృందములు=బంధునృపాలురసముదాయములు; అందఱున్=ఎల్లరు; నివ్వటిల్లన్=అతిశయించు నట్లుగా; వెంబడిన్=వెంట; ఎడ యీక = పిక్కటిల్లునట్లుగా; రాన్ =రాఁగా; తళుకుబంగరుఁజేల =ప్రకాశించు కనకచేలము; ఒకింత జీరఁగాన్=ఇంచుక జీరాడఁగా; విప్రయుగంబును= బ్రాహ్మణద్వయమును; దృష్టిన్=చూపుచే; ఆఁగుచున్=అడ్డగిం చుచు, అనఁగా దృష్టిగోచరముగా బ్రాహ్మణయుగ్మమును జేయుచు నని భావము, ‘శ్లో.కన్యా గౌ ర్భేరి శంఖం దధి ఫల కుసుమం పావకం దీప్యమానం యానం వా విప్రయుగ్మం హయ గజ వృషభం పూర్ణకుమ్భద్వయం చ’ అని మొదలుగా జ్యోతిషశాస్త్రీయశకునాధ్యాయమందు బ్రాహ్మణయుగ్మదర్శనము ప్రస్థితులకు మంగళకర మని చెప్పఁ బడినది; హజారము= కొలువుకూటము; వెడలెన్=బయలుదేఱెను.
చ. కొలు విపు డబ్బె నంచు బలు◊కోర్కి మహీశులు నిల్చి కొల్వుమ్రొ
క్కులు ఘటియించి రప్పతి క◊కుంఠకలధ్వనివేత్రు లంగరా
ట్కులుఁడు పరా కితం డతఁడు ◊కోసలనేత పరా కితండు కే
రలుఁడు పరా కతండు కురు◊రాజు పరా కని యుగ్గడింపఁగన్. 154
టీక: మహీశులు =రాజులు; కొలు విపు డబ్బె నంచున్ = ఇపుడు సుచంద్రుని సేవ ఘటించె ననుచు; నిల్చి = నిల్చుకొని; అప్పతి కిన్=ఆరాజునకు; వేత్రులు=వేత్రధారులు, అనఁగా బెత్తపువారు, వేత్రశబ్దము మీఁద మత్వర్థీయేని ప్రత్యయము; అకుంఠ కల ధ్వనిన్=నిరర్గళమధురశబ్దముతో; ఇతండు=మ్రొక్కుచున్న యీ ప్రభువు; అంగరాట్కులుఁడు=అంగదేశా ధీశ్వరవంశ్యుఁడు; పరాకు=తత్పరుఁడవు గమ్ము; అతఁడు = ప్రణమిల్లువున్న యాతండు; కోసలనేత =కోసలాధీశుఁడు; పరాకు; ఇతండు = నమస్కరించుచున్న యీ రాజు; కేరలుఁడు = కేరళదేశాధీశుఁడు; పరాకు; అతండు = నతి నొనర్చు నా నరపతి; కురురాజు = కురుదేశాధీశుఁడు; పరాకు=హెచ్చరిక పడుము; అని ఉగ్గడింపఁగన్ = అనుచు శబ్దించుచుండఁగా; బలు కోర్కి =మిక్కిలి యాసక్తితో; కొల్వుమ్రొక్కులు =కొలువు ప్రణామములు; ఘటియించిరి=చేసిరి.
మ. నృపరత్నంబు వినీతసూతతిలకా◊నీతప్రియస్యందనం
బపు డిం పెచ్చఁగ నెక్కి యొప్పె మఘవా◊శాద్రిం గనం బొల్చు పూ
ర్ణపయోజారి యనన్, బుధావళి నవా◊నందంబుచేఁ జూడ, న
భ్రపదం బాఁగుచు వాహినీశ్వరమహా◊భంగార్భటుల్ హెచ్చఁగన్. 155
టీక: నృపరత్నంబు = నృపశ్రేష్ఠుండగు సుచంద్రుఁడు; వినీతసూతతిలకానీతప్రియస్యందనంబు – వినీత = వినయవంతుఁడైన, సూతతిలక=ఉత్తమసారథిచేత; ఆనీత=తేబడిన; ప్రియస్యందనంబు = ప్రియమగు రథమును; ఇంపెచ్చఁగన్= ప్రీతి హెచ్చఁగా; ఎక్కి = అధిరోహించి; అపుడు=ఆసమయమున; కనన్= చూడఁగా; మఘవాశాద్రిన్ = ఉదయగిరియందు; పొల్చు=ఒప్పు నట్టి; పూర్ణపయోజారి యనన్= పూర్ణచంద్రుఁడో యన్నట్లుగా, దీనికి ఒప్పె నను క్రియతో నన్వయము; బుధావళి=పండిత మండలి, దేవసంఘ మని యర్థాంతరము; నవానందంబుచేన్=తత్కాలోల్లసితానందముచేత; చూడన్=అవలోకింపఁగా; అభ్ర పదంబు= గగనతలమును; ఆఁగుచున్ = అడ్డగించుచు; వాహినీశ్వరమహాభంగార్భటుల్ – వాహినీశ్వర = సేనాధిపతుల యొక్క, మహత్=అధికమైన, అభంగ = అవిచ్ఛిన్నము లైన, ఆర్భటుల్ = శబ్దములు, అని రాజపరమైన యర్థము; వాహినీ శ్వర= సముద్రముయొక్క, మహాభంగ=పెద్దతరఁగలయొక్క, ఆర్భటుల్ = శబ్దము లని చంద్రపరమైన యర్థము; హెచ్చఁగన్ = అతిశయింపఁగా; ఒప్పెన్=ప్రకాశించెను.
అనఁగా సుచంద్రనృపతి రథారూఢుం డై, బుధులు మోదముతోఁ దన్నవలోకించుచుండఁగా, సేనానాయకార్భటులు హెచ్చుచుండఁగా, నుదయగిరి నధిరోహించి దేవతలు ప్రీతితో దన్నవలోకించుచుండఁగా సముద్రతరంగధ్వను లెచ్చుచుండఁగా మించు పూర్ణచంద్రునివలె భాసించె నని భావము. రూపకాలంకారభేదము. ‘తద్రూపక మభేదోయ ఉపమానోపమేయయోః’ అని కావ్యప్రకాశమందుఁ దల్లక్షణము.