చంద్రికాపరిణయము – 3. ప్రథమాశ్వాసము

క. కమలాసజనకనాభికిఁ
గమలన్మోహాంధతమస◊కమలాంకునకుం
గమలాలయకమలాలయ
కమలాలయశయనభృతికిఁ ◊ గాంతాకృతికిన్. 79

టీక: కమలాస జనక నాభికిన్ – కమలాస = బ్రహ్మకు, జనక = ఉత్పాదకమగు, నాభికిన్ = నాభిగలవానికి; కమలన్మోహాంధ తమస కమలాంకునకున్ – క = ఆత్మకు, మలత్ = పాతకమువలె నాచరించుచున్న, మోహ = అజ్ఞాన మనెడు, అంధతమస = కటికచీఁకటికి, కమలాంకునకున్ = మృగాంకునకు; కమలాలయ కమలాలయ కమలాలయ శయన భృతికిన్ – కమలా = లక్ష్మీదేవికి, ఆలయ =స్థానమగు, కమలాలయ = సముద్రముయొక్క, కమల = ఉదకమందు, అలయ = వినాశములేనట్లు, శయన = శయనముయొక్క, భృతికిన్ = భరణముగలవానికి; కాంతాకృతికిన్ = మనోహరాకారముగలవానికి.

క. శరణాగతపరిరక్షణ
చరణప్రవణాత్మచిత్త◊సరసీజునకున్
నరకాహితనరకాహిత
నరకాహితబాణతతికి ◊నరసారథికిన్. 80

టీక: శరణాగత పరిరక్షణ చరణ ప్రవణాత్మ చిత్త సరసీజునకున్ – శరణాగత= శరణమును బొందినవారియొక్క, పరిరక్షణ = పాలనముయొక్క, చరణ = ఆచరణమందు, ప్రవణ = అభిముఖ మైన, ఆత్మ = తనయొక్క, చిత్త = మానస మనెడు, సరసీ జునకున్ = కమలము గలవానికి; నరకాహిత నరకాహిత నరకాహిత బాణతతికిన్ – నరక = నిరయమునకు, అహిత = శత్రువు లగు, అనఁగాఁ బుణ్యాత్ములగు, నరక = నరులకు,స్వార్థమందు కప్రత్యయము, అహిత = అహితుఁడగు, నరక = నరకాసురు నకు, అహిత = విరోధులగు, బాణతతికిన్ = బాణములయొక్క సముదాయము గలవానికి; నరసారథికిన్ = అర్జునునిసారథి యైనవానికి.

క. శ్రీవాసజ్జటప్రోలీ, భావుకపత్తనవిహార◊పటుశీలునకున్
గోవర్ధనగోవర్ధన, గోవర్ధనవృష్టిహృతికి ◊గోపాలునకున్. 81

టీక: శ్రీవాస జ్జటప్రోలీ భావుక పత్తన విహార పటు శీలునకున్ – శ్రీ = లక్ష్మీదేవికి, వాసత్ = నివాసమువలె నాచరించుచున్న, జటప్రోలీ = జటప్రోలనెడు, భావుక = భవ్యమగు, పత్తన = పురియందు, విహార = విహారమందు, పటు = సమర్థమైన, శీలున కున్ = స్వభావము గలవానికి; గోవర్ధన గోవర్ధన గోవర్ధన వృష్టి హృతికిన్ – గోవర్ధన = ఆవుల వృద్ధి నొందించెడు, గోవర్ధన = గోవర్ధనగిరియొక్క, గో = భూమికి, ‘సమాసాన్తవిధి రనిత్యః’ అనుటచేత సమాసాంతప్రత్యయము రాదయ్యె, వర్ధన = నాశక మగు, వృష్టి = వర్షముయొక్క, హృతికిన్ = హరణము గలవానికి; గోపాలునకున్ = మదనగోపాలస్వామికి.

కథాప్రారంభము

వ. అర్పితంబుగా నాయొనర్పం బూనిన చంద్రికాపరిణయం బను మహాప్రబంధంబునకుం గథాక్రమం బెట్టి దనిన.

ఉ. శ్రీ నిరు వొంది నైమిశము ◊సెన్నగు నందు నిజామలాశయా
లానదృఢావబద్ధకమ◊లావరదంతులు శౌనకాది మౌ
నీనులు సూతజుం బలికి ◊రేనృపుఁ డేలె ధర న్నిరీతిగా
నానృపుఁ దెల్పు మన్ననతఁ ◊డాయతకౌతుకపూరితాత్ముఁ డై. 83

టీక: నైమిశము = నైమిశారణ్యము; శ్రీన్ = శోభావిశేషముచేత; ఇరు వొంది =స్థిరత నొంది; చెన్నగున్ = ప్రకాశించును; అందున్ = ఆయరణ్యమందు; నిజామలాశయాలాన దృఢావబద్ధ కమలావర దంతులు – నిజ = స్వకీయ మైన, అమల = స్వచ్ఛ మైన, ఆశయ = హృదయ మనెడు, ఆలాన = బంధస్తంభమందు, ‘ఆలానం బంధస్తంభే’ అని యమరుఁడు, దృఢ = స్థిరమౌ నట్లు, అవబద్ధ = కట్టఁబడిన, కమలావర = విష్ణుమూర్తి యనెడు, దంతులు = గజము గలవారలు; శౌనకాది మౌనీనులు=శౌన కాదిమునిరాజులు; సూతజున్ = సూతునిఁ గూర్చి; పలికిరి = వచించిరి; ఏనృపుఁడు = ఏరాజు; ధరన్ = భూమిని; నిరీతిగాన్ = ఈతిబాధారహిత మగునట్లుగా; ఏలెను=పాలించెనో; ఆనృపున్=ఆరాజును; తెల్పుమన్నన్, అతఁడు = ఆ సూతుఁడు; ఆయత కౌతుక పూరితాత్ముఁ డై = విస్తార మైన కుతూహలముచే నిండినహృదయము గలవాఁ డై; పలికెన్ అని యుత్తరపద్యస్థక్రియతో నన్వయము. ఇం దశ్లిష్టపరంపరితరూపకము. ‘శ్లో. తత్పరం పరితం శ్లిష్టే వాచకే భేదభాజి వా’ అని కావ్యప్రకాశము నందుఁ దల్లక్షణము.

శా. సారాక్షీణకలాకలాపనిధి యై, ◊చక్రప్రియంభావుక
శ్రీరమ్యాకృతి యై, దినేశకులల◊క్ష్మీమూల మై, యిద్ధరా
భారం బూనె సుచంద్రసంజ్ఞ నొకభూ◊పాలాగ్రగణ్యుండు ద
చ్చారిత్రంబు వచింతు నంచుఁ బలికెన్ ◊జంచద్వచోవైఖరిన్. 84

టీక: ఒకభూపాలాగ్రగణ్యుండు = ఒక రాజశ్రేష్ఠుండు; సారాక్షీణ కలా కలాప నిధి యై – సార = శ్రేష్ఠ మగు, అక్షీణ = తక్కువ గాని, కలా = చతుష్షష్టివిద్యలయొక్క, షోడశకలలయొక్కయని యర్థాంతరము, కలాప = సమూహమునకు, నిధి యై = నివాస మై; చక్ర = రాష్ట్రములకు, జక్కవలకు; ప్రియంభావుక = ప్రియ మగు; శ్రీ = సంపదచేత, కాంతిచేత; రమ్య = రమ్య మగు; ఆకృతి యై = ఆకృతి గలవాఁడై; దినేశ =సూర్యునియొక్క, సూర్యులయొక్క (ద్వాదశాదిత్యులయొక్క యనుట) కుల = వంశముయొక్క, సమూహముయొక్క; లక్ష్మీ = సంపదకు, కాంతికి; మూల మై =ఆధార మై; సుచంద్రసంజ్ఞన్ = సుచంద్రుం డను పేరిచేతను, సమీచీన మైన చంద్రుండను పేరిచేత నని యర్థాంతరము, అనఁగాఁ బ్రసిద్ధచంద్రుండు క్షీణకలా కలాపనిధియు, చక్రవాకాప్రియకారిశ్రీరమ్యుండు, దినేశమూలకలక్ష్మియు నగువాఁడు. మఱి యీరాజో అక్షీణకలాకలాపనిధి, చక్ర ప్రియం భావుక శ్రీరమ్యాకృతి, దినేశకులలక్ష్మీమూలము, కావున (సు)మంచిచంద్రుం డను పేరిచేత నని యాశయము. ఇద్ధరాభారంబు = ఈ భూభారమును; ఊనెన్ = వహించెను; తచ్చారిత్రంబు = ఆ సుచంద్రనరేంద్రుని చరితమును; వచింతు నంచున్ = చెప్పుదు ననుచు; చంచద్వచోవైఖరిన్= ప్రకాశించుచున్న వాగ్వైఖరిచేత; పలికెన్ = వాక్రుచ్చెను. ఇటఁ బ్రసిద్ధచంద్రా ధిక్యము సుచంద్రునియందుఁ దోఁచుచున్నది గాన యుపమేయాధిక్యపర్యవసాయి శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారము. ‘శ్లో. వ్యతిరేకో విశేష శ్చేదుపమానోపమేయయోః’ అని తల్లక్షణము.

సీ. వరగుణసన్మణి◊వ్రాతసంలబ్ధిచే, శ్రితమహీభృద్వర్య◊వితతిచేత,
విచరద్ఘనాఘన◊ప్రచయవిస్ఫూర్తిచే, విమలచక్రిప్రచా◊రములచేతఁ,
బటువేగవన్మహా◊భంగకాండములచే, ఘనవాహినీసము◊త్కరముచేత,
సాంద్రనానావన◊చక్రసంప్రాప్తిచే, నసమరాజీవనే◊త్రాళిచేత,

తే. నలరులచ్చికిఁ బుట్టిని◊ల్లన ననర్ఘ్య,శైలరిపునీలమయసాల◊సామజేంద్ర
కలితసితపద్మకచ్చంద్ర◊కామినీక,లాపరుచిరంబు శ్రీ విశా◊లాపురంబు. 85

టీక: ఈపద్యమందు విశాలాపురవిషయక మైన యర్థము, సముద్రపరమైన యర్థాంతరముం దోఁచుచున్నది. ఏలాగనిన: అనర్ఘ్య శైలరిపునీలమయ సాల సామజేంద్ర కలిత సిత పద్మక చ్చంద్రకామినీ కలాప రుచిరంబు – అనర్ఘ్య = అమూల్యము లగు, శైలరిపునీలమయ = ఇంద్రనీలమణిమయమగు, సాల = ప్రాకారములయందలి, సామజేంద్ర = గజశ్రేష్ఠములందు, కలిత = ఒప్పుచున్న, సిత = తెల్లనైన, పద్మకత్ = బిందుజాలక మనఁగా నేనుఁగులపై నున్న తెల్లనిచుక్కలు, వానివలె నాచరించు చున్న, చంద్రకామినీ = నక్షత్రములయొక్క, కలాప = సంఘముచేత, రుచిరంబు = మనోహరమగు; శ్రీ విశాలాపురంబు = సంప ద్యుక్త మైన విశాలాపురము; వరగుణ సన్మణి వ్రాత సంలబ్ధిచేన్ – వరగుణ = శ్రేష్ఠగుణములు గల, సన్మణి = పండితోత్త ముల యొక్క, వ్రాత = సంఘముయొక్క, సంలబ్ధిచేన్ = ప్రాప్తిచేతను, శ్రేష్ఠములగు గుణములు గల మంచి మణిసంఘములయొక్క ప్రాప్తిచేత నని సముద్రపరమైన యర్థము; శ్రిత మహీభృద్వర్య వితతిచేతన్ – శ్రిత = ఆశ్రయించిన, మహీభృద్వర్య = రాజ శ్రేష్ఠులయొక్క, వితతిచేతన్ = సంఘముచేత, ఆశ్రయించిన పర్వతములయొక్క గుంపుచేత నని సముద్రపరమైన యర్థము;
విచర ద్ఘనాఘన ప్రచయ విస్ఫూర్తిచేన్ – విచరత్ = మిక్కిలి చరించుచున్న, ఘనాఘన = మదపుటేనుఁగులయొక్క, ప్రచయ = సమూహముయొక్క, విస్ఫూర్తిచేన్ = ప్రకాశముచేతను, చరించుచున్న వర్షించునట్టి మేఘముల సమూహములయొక్క విస్ఫూర్తిచేత నని సముద్రపరమైన యర్థము; విమల చక్రి ప్రచారములచేతన్ – విమల = నిర్మలములగు, చక్రి = రథముల యొక్క, ప్రచారములచేతన్ = సంచారములచేతను, నిర్మలమైన విష్ణుమూర్తియొక్క సంచారములచేత నని సముద్రపరమైన యర్థము; పటు వేగవ న్మహాభంగ కాండములచేన్ – పటు = సమర్థములై, వేగవత్ = వేగయుక్తములై, మహత్ = గొప్పలై, అభంగ = అప్రతిహతములైన, కాండములచేన్ = అశ్వములచేత, అతివేగముగల తరంగములగుంపులచేత నని సముద్రపరమైన యర్థము, ‘కాండో స్త్రీ దణ్డ బాణార్వ వర్గావసర వారిషు’ అని యమరుఁడు; ఘన వాహినీ సముత్కరముచేతన్ – ఘన = అధికమైన, వాహినీ = సేనలయొక్క, సముత్కరముచేతన్ = సముదాయముచేత, అధికములైన నదీసంఘములచేత నని సముద్రపరమైన యర్థము; సాంద్ర నానా వన చక్ర సంప్రాప్తిచేన్–సాంద్ర = దట్టములైన, నానా = అనేకప్రకారములగు, వన = ఉద్యానములయొక్క, చక్ర = సంఘములయొక్క, సంప్రాప్తిచేన్ = లాభముచేతను, సాంద్రములై యనేకవిధములైన జలావర్తములయొక్క సంప్రాప్తిచేత నని సముద్రపరమైన యర్థము; అసమ రాజీవనేత్రాళిచేతన్ – అసమ = అసమాన లగు, రాజీవనేత్రా = పద్మనేత్రలయొక్క, ఆళి చేతన్ = సంఘముచేతను, అసమానమైన (రాజీవనేతృ) మీనశ్రేష్ఠములయొక్కగణముచేత నని సముద్రపరమైన యర్థము, ‘రాజీవ శ్శకుల స్తిమిః’ అని యమరము; లచ్చికిన్ = లక్ష్మీదేవికి; పుట్టినిల్లనన్ = జన్మస్థాన మన్నట్లుగా, సముద్ర మన్నట్లుగా; అలరున్ = ఒప్పారును; ఇట సంబం ధాతిశయోక్తి శ్లేషోత్ప్రేక్షాలంకారములు గలుగు.

సీ. వరణాబ్జరాగభా◊వ్యాజబాలాతపా,నిశజృంభితవియద్ధు◊నీసలిలము,
సౌధవజ్రచ్ఛవి◊చ్ఛలచంద్రికావియో,జితలేఖకేళివే◊శ్మతలసరము,
స్వస్తికనీలత్వి◊షామిషఘనదత్త, కేకాస్వనస్వన◊త్కృతకనగము,
రథ్యావలభితార్క్ష్య◊రత్నశోభాకూట,యవసార్పితామోద◊కార్కరథము,

తే. భర్మకేతుపటాంచల◊పవనగళద,నంతకుహనమధురసాఫ◊లాళిఖాద
నాశయోత్పతదతులకీ◊రాభిరామ,గోపురము మించు నిల విశా◊లాపురంబు. 86

టీక: వరణాబ్జరాగ భా వ్యాజ బాలాత పానిశ జృంభిత వియద్ధునీ సలిలము – వరణ = ప్రాకారములయొక్క, ‘ప్రాకారో వరణ స్సాలః’అని యమరుఁడు, అబ్జరాగ =పద్మరాగమణులయొక్క, భా = కాంతి యనెడు, వ్యాజ = నెపము గలిగిన, బాలాతప = లేయెండచేత, అనిశ = ఎల్లప్పుడును, జృంభిత = వికసింపఁజేయఁబడిన, వియద్ధునీ = స్వర్గంగయందలి, సలిలము = జలము గలది, అనఁగా లక్షణచేత సురనదీజలగతపద్మములు బోధితము లగుచున్నవి గాన యెల్లపుడు వికసింపఁజేయఁబడిన వియ ద్ధునీసలిలగతపద్మములు గల దని యాశయము; సౌధ వజ్ర చ్ఛవి చ్ఛల చంద్రికా వియోజిత లేఖ కేళివేశ్మ తల సరము – సౌధ = మేడలయొక్క, వజ్ర = వజ్రములయొక్క, ఛవి = కాంతి యనెడు, ఛల = వ్యాజము గల, చంద్రికా = వెన్నెలచేత, వియోజిత = ఎడఁబాటు గలదిగాఁ జేయఁబడిన, లేఖ = దేవ తలయొక్క,కేళివేశ్మ= క్రీడాగృహములయొక్క, తల = ప్రదేశములయందలి, సరము = సరస్సులు గలది, అనఁగా సరోగత చక్ర వాకములు గల దని లక్షణచేత నర్థము చేయవలయు. స్వస్తిక నీల త్విషా మిష ఘన దత్త కేకాస్వన స్వన త్కృతకనగము – స్వస్తిక = సౌధవిశేషములయొక్క, ‘స్వస్తిక స్సర్వతో భద్రః’ అని యమరుఁడు, నీల = ఇంద్రనీలమణులయొక్క, త్విషా = కాంతి యనెడు, మిష = నెపము గల, ఘన = మేఘము చేత, దత్త = ఇయ్యఁబడిన, కేకాస్వన = కేక యను ధ్వనిచేత, స్వనత్ = ధ్వని చేయుచున్న, అనఁగాఁ గేకాభిన్నస్వనము చేయు చున్నయనుట, కృతకనగము = కృత్రిమపర్వతములు గలది, ఇచటను బూర్వరీతిగఁ గృతకనగస్థమయూరములు గల దని లాక్షణికార్థము చేయవలయు; రథ్యా వలభి తార్క్ష్యరత్నశోభా కూట యవ సార్పి తామోద కార్కరథము – రథ్యా = రాజవీథులయందున్న, వలభి = చంద్ర శాలలయొక్క, తార్క్ష్యరత్న = గరుడపచ్చలయొక్క, శోభా=కాంతి యనెడు, కూట= నెపము గల, యవస=పచ్చికయందు, అర్పిత = ఉంపఁబడిన, ఆమోదక = సంతసము గల, అర్కరథము = సూర్యరథము గలది, అనఁగాఁ బూర్వరీతిగ సూర్యరథా శ్వములు గలదని లాక్షణికార్థము; భర్మ కేతు పటాంచల పవన గళ దనంత కుహన మధురసాఫలాళి ఖాద నాశ యోత్పత దతుల కీరాభిరామ గోపురము –భర్మ = స్వర్ణమయములగు, కేతు = టెక్కెములయొక్క, పటాంచల = వస్త్రాగ్రభాగములయొక్క, పవన = వాయువుచేత, గళత్ = జాఱుచున్న, అనంత = ఆకాశ మనెడు, అనఁగాఁ బూర్వరీతిగా లక్షణచే నాకాశస్థనక్షత్రము లనెడు అని యర్థము, కుహన = కాపట్యము గల, మధురసాఫల = ద్రాక్షాఫలములయొక్క, ఆళి = బంతియొక్క, ఖాదన = భక్షణమందు, ఆశయ = అభిప్రాయముచేత, ఉత్పతత్ = మీఁది కెగయుచున్న, అతుల = సాటిలేని, కీర = చిలుకలచేత, అభిరామ = ఒప్పుచున్న, గోపు రము = పురద్వారము గలదియు నై, విశాలాపురంబు, ఇలన్ = భూమియందు; మించున్ = అతిశయించును.

ఇట వియద్ధునీసలిల లేఖకేళీవేశ్మతలసరఃకృతకనగార్కరథానంతములకు బాలాతపానిశవికసన చంద్రికావియోజన ఘన దత్త కేకాస్వాన యవసార్పితామోద పటాంచలపవనపతనములు సంభవింపమి లక్షణావృత్తి నాశ్రయించి తద్గతములగు పద్మాదులు చెప్పఁబడియె. లక్షణ యనఁగా శబ్దవృత్తులలోనొకటి. శబ్దవృత్తులు శక్తి లక్షణ వ్యంజన యని మూఁడు. వీని స్వరూ పములు భేదములు ‘శ్లో. సామన్తనగరా ణ్యుచ్చై రాక్రోశన్తి సమన్తతః’ ఇది లోనగు లక్ష్యములు ప్రతాపరుద్రీయాదులయందు విస్తరముగ నిర్ణయింపఁబడిన వనియు, నిట వ్రాయుట యనవసర మనియు, సంక్షేపింపఁబడియె. అలంకారము లిందుఁ గైతవా పహ్నుతి సంబంధాతి శయోక్తిభేదములు.

చ. కలిమినెలంతకై నలువ◊గాంచిన మేటివిచిత్రశక్తి రా
జిలఁ బరరాజభీకరతఁ ◊జెన్నలరన్ సృజియించినట్టి యు
జ్జ్వలజలజంబు నాఁగఁ బురి ◊వజ్రమణీవరణం బగడ్త య
న్కొలఁకున నొప్పుఁ దేఁటిసొబ◊గుం గని పైగగనంబు దోఁపఁగన్. 87

టీక: నలువ = బ్రహ్మదేవుఁడు; కాంచినమేటి విచిత్రశక్తి రాజిలన్ = అభ్యసించిన యుత్కృష్టమై యాశ్చర్యకర మగు సామ ర్థ్యము ప్రకాశించునట్లుగా; పరరాజభీకరతన్ = శత్రురాజభీకరతచేత; శ్రేష్ఠమగు చంద్రునకుభీకరతచేత; చెన్నలరన్ = ఒప్పు నట్టుగా; కలిమినెలంతకై = లక్ష్మీదేవికై; సృజియించినట్టి యుజ్జ్వలజలజంబు నాఁగన్ = రచియించిన ప్రకాశమానమగు పద్మ మనునట్లుగా; పురిన్ = పట్టణమునందు; వజ్రమణీవరణంబు = వజ్రమణిరచిత మగు ప్రాకారము; అగడ్త యన్కొలఁకునన్ = అగడ్త యను కొలనియందు; పై గగనంబు = మీఁది యాకాశము; తేఁటిసొబగుం గని = తుమ్మెదయందము నొంది; తోఁపఁగన్ = తోఁచుచుండఁగా; ఒప్పున్ = ఒప్పును. ఉత్ప్రేక్షాలంకారము.

మ. పురసాలంబు నిజాఖ్యపెంపు గననో ◊భూరిప్రవాళాప్తము
న్వరనీలాళిసమావృతంబు పరిఖా◊నవ్యాలవాలామృతాం
తరసందృశ్యము నై చెలంగుఁ బొగ డొం◊దన్ దానిపెంగొమ్మ ల
బ్బుర మై రాజపతంగయోగకలనం◊బుల్ రేవగల్ గాంచుటన్. 88

టీక: పురసాలంబు = విశాలాపురియొక్క కోట; నిజాఖ్యపెంపు గననో = తనపేరుగలదానియొక్క,అనఁగా సాలవృక్షము యొక్క అతిశయము గనుటకో; భూరిప్రవాళాప్తమున్ = అధికమగు చిగురుటాకులను బొందినదియు, అనఁగా సువర్ణమును బగడములను బొందిన దనుట, ‘భూరి ప్రాజ్య సువర్ణయోః’అని విశ్వము; వరనీలాళిసమావృతంబు = శ్రేష్ఠములయి నీలము లయినతుమ్మెదలచేతఁ జుట్టుకొనఁబడినదియు, అనఁగా శ్రేష్ఠములయిన యింద్రనీలమణులగుంపుచేత నావరింపఁబడిన దనుట; పరిఖా నవ్యాలవాలామృతాంతర సందృశ్యము నై – పరిఖా=అగడ్త యనెడు, నవ్య=నూతనమగు,ఆలవాల=పాదుయొక్క, అమృతాంతర=జలాంతరమందు, సందృశ్యము నై =కనిపించునది యై; దానిపెంగొమ్మలు=దాని పెద్దశాఖలు,ఆకోటయొక్క పెద్దకొమ్మ లనుట; రాజపతంగయోగకలనంబుల్ – రాజపతంగ = పక్షిశ్రేష్ఠములయొక్క, యోగకలనంబుల్ = సంబంధము సేయుటలు, చంద్రసూర్యసంబంధము సేయుట లనుట; రేవగల్ గాంచుటన్ = ఎల్లపుడును పొందుచుండుటచేత; అబ్బుర మై = ఆశ్చర్యకరమై; పొగ డొందన్ = శ్లాఘ్యత నొందునట్లుగా; చెలంగున్ =ఒప్పును.

ఇట సూర్యుఁడు రాత్రికాలమందు చంద్రుఁడు పగటియందు నుండమింజేసి సర్వకాలమందు సూర్యచంద్రసంబంధము గలిగి యుండుట యాశ్చర్యకర మని భావము. రాత్రి చంద్రసంబంధమును, పగలు సూర్యసంబంధమును బొందు నని క్రమ ముగా నన్వయం బెఱుంగునది. ఇచటఁ బురసాల మున్నత మగుటకు నిజాఖ్య పెంపు గనుట ఫలము గాక పోయినను దానిని ఫలముగా సంభావన సేయుటంజేసి ఫలోత్ప్రేక్ష యగును. అదియు శ్లేషానుప్రాణితము.