సీ. ముకుళితపాణు లై ◊వికవిక నగువారి, స్వీయాంకసంగతిఁ ◊జెంద నీదు,
తల నిల్పికొనఁ బూని ◊ తహతహపడువారి, ననురాగయుక్తి డా◊యంగఁ బోవ,
దడుగు వెట్టఁగ లేక ◊వడఁకు చుండెడివారి, స్థిరమహాధారాప్తిఁ ◊జేర్పఁ జనదు,
తృణగర్భ మగుమోము ◊దెఱచు చుండెడువారి, నెద మీఱ ముఖమంటఁ ◊గదియ దింత,
తే. మనుపదో మహస్సూనులఁ ◊ బెనుపదో న,వీనకీర్తిసంతాన మి◊వ్విపుల నౌర!
తావకీనాసిలక్ష్మి చి◊త్రప్రశస్తి, వితతగుణసాంద్ర! మాధవ◊క్షితిమహేంద్ర! 71
టీక: ఈపద్యమందు మాధవరాయాసిలక్ష్మిని బుత్రవతిఁగా నధ్యవసించి యర్థద్వయము గలుగఁ జెప్పఁ బడియె. ఏలాగనిన: ముకుళితపాణు లై = మోడ్పుఁగేలులు గలవారై; వికవిక నగువారిన్ = కకవిక నయ్యెడువారిని; స్వీయ = తనసంబంధి యైన; అంక = తొడయొక్క; సంగతిన్ = సంబంధమును; చెంద నీదు = పొందనీయదు; అతిబాల్యము గలవారై పిడికిలి పట్టుకొని వికవిక నగు శిశువుల నెత్తికొని తనతొడ మీఁదఁ గూర్చుండఁ బెట్టుకొన దని పుత్రవతీపరమైన యర్థము. ప్రణమిల్లుచు కకావికలు పడుచుండెడి శత్రువులను తన సమీపము నొందనీదు అనఁగా నట్టివారి దగ్గరకుఁ బోయి వారిని చంపదని ఖడ్గపర మైన యర్థము.తల నిల్పికొనఁ బూని = తల నిల్పుటకుఁ బ్రయత్నించి; తహతహపడువారిన్ = సంతోషపడుచున్న శిశువులను; అనురాగ యుక్తి న్ = ప్రీతితోడ; డాయంగఁబోవదు = సమీపింపఁబోవదు. తల నిల్పఁజాలక తహతహ పడు శిశువుల సమీపమునకుఁ బ్రీతితోఁ బోదని పుత్రవతీపరమైన యర్థము. యుద్ధములో శిరస్సు నిల్పుకొన వలెనని అనఁగా జీవింపవలెనని (తహతహపడు) త్వరపడు శత్రువులను డాయంగఁబోదని అనఁగా నట్టి వారిని సంహరింపదని ఖడ్గపరమైన యర్థము. అడుగు వెట్టఁగలేక వడఁకు చుండెడివారిన్ = నడచునంత వయస్సు లేక నడవఁబోయి వడఁకుచుండెడి బాలురను; స్థిరమహా ధారాప్తిన్ = స్థిరమై గొప్పది యైన స్తంభాద్యాధారముయొక్క ప్రాప్తిని; చేర్పఁ జనదు= చేర్చుటకుఁ బోవదు. నడవనేరక లేచి పడుచున్న శిశువులను స్తంభాద్యాధారములు చేర్పఁ జనదని పుత్రవతీపర మైన యర్థము. యుద్ధకాలమందుఁ బ్రాణభీతితో నడుగువెట్టఁ జాలక అనఁగాఁ బాఱిపో నుద్దేశించియు భీతితోఁ బాఱఁజాలక కంపించువారిని స్థిరమై యధికమైన (ధారా) అంచు యొక్క ఆప్తిని జేర్పంగఁ జనదు, అనఁగా అట్టివారిని తెగనఱక దని ఖడ్గపరమైన యర్థము.తృణగర్భ మగు మోము దెఱచుచుండెడువారిన్ = అజ్ఞానముతో గడ్డిపోఁచలను నోటిలోఁ బెట్టికొని తెఱచుచుండెడు బాలురను;
ఎద మీఱన్ = మనముప్పొంగఁగా; ముఖమంటన్ = ముఖము శోధించుట కనుట; కదియ దింత = ఎంతమాత్రమును చేరదు, అనఁగా కదిసి గడ్డిపోఁచలను దీయదని పుత్రవతీపరమైన యర్థము. భయమతిశయింపఁగా గడ్డి నోటఁ గఱచుకొనిన శత్రువులను సంహరింపదని ఖడ్గపరమైన యర్థము. ఔర! వితతగుణసాంద్ర! మాధవక్షితిమహేంద్ర! ఇవ్విపులన్ = ఈభూమియందు; తావకీనాసిలక్ష్మి= నీ ఖడ్గలక్ష్మి; మహ స్సూనులన్ = ప్రతాపము ప్రధానముగాఁ గల కుమారుల నని పుత్రవతీపరమైన యర్థము. సూర్యునివంటి ప్రతాపముల నని ఖడ్గపరమైన యర్థము. ‘సూనుః పుత్రేఽనుజే రవౌ’ అని అమరశేషము; మనుపదో = పోషింపదో? నవీనకీర్తిసంతానము = క్రొత్తనైన కీర్తి యని స్త్రీత్వనిర్దేశమునఁ గీర్తి యనెడు నాఁడు బిడ్డలయొక్క సంతానము నని పుత్రవతీపరమైన యర్థము, కల్ప వృక్షమువంటి కీర్తి నని ఖడ్గపరమైన యర్థము; పెనుపదో = పెంపదో? చిత్రప్రశస్తి = అతిచిత్రము, అనఁగాఁ దాను పుత్రులను గనుచుఁ బెంచుచు బెఱవారిబాలురు ముకుళితపాణులై వికవిక నగుచుండుట లోనగు వ్యాపారములు సేయునెడ స్వీయాంక సంగత్యాదులను జేయకుంట యాశ్చర్యం బని పుత్రవతీపరమైన భావము. మాధవరాయల ఖడ్గము శరణాగతులను, బ్రాణ త్రాణమునకై తహతహపడువారిని, బరుగెత్తిపోవ నుద్దేశించి పోలేక వడఁకుచుండెడివారిని, గడ్డిపోఁచ నోరఁ బెట్టుకొని శర ణార్థులైనవారిని సంహరింపదు. తక్కిన శత్రువుల నందఱిని ధ్వంసము చేసినదని ఖడ్గపరమైన భావము.
మ. ధరణిన్ మాధవరాయ తావకబలో◊ద్యద్రేణుపాళీకృతో
ద్ధురభావత్కమహోగ్నిబుద్ధి ప్రమ యై ◊తోఁపంగ నాన్వీక్షకీ
వరు లవ్యాప్తము ధూళి తద్బలమునం ◊బాటిల్లు ధూమధ్వజా
కరధీ యప్రమ యంచు నెంచుట లిఁకం ◊గైకొందురే యెంతయున్. 72
టీక: మాధవరాయ, ధరణిన్ =భూమియందు; తావక బలోద్య ద్రేణుపాళీ కృతోద్ధుర భావత్కమహోగ్నిబుద్ధి – తావక = నీ సంబంధియగు, బల = సైన్యమందు, ఉద్యత్ = ఎగయుచున్న, రేణుపాళీ = పరాగపంక్తిచేత, కృత = చేయఁబడిన, ఉద్ధుర = దట్టమైన, భావత్కమహోగ్నిబుద్ధి = నీసంబంధియైన ప్రతాపాగ్నిజ్ఞానము; ప్రమయై = యథార్థనుభవమై; తోఁపంగన్ = తోఁచు చుండఁగా; ఆన్వీక్షకీవరులు = తార్కికులు; ధూళి = పరాగము; అవ్యాప్తము = సాధ్యసమానాధికరణాత్యంతాభావప్రతి యోగి; తద్బలమునన్ = ఆసైన్యమందు; పాటిల్లు = ఉదయించు; ధూమధ్వజాకరధీ = వహ్నివిషయకజ్ఞానము; అప్రమ = అయథార్థజ్ఞానము, అనఁగా భ్రాన్తిరూపజ్ఞానము; అంచున్ = ఇట్లనుచు; ఎంచుటలు = అనుకొనుటలు; ఇఁకన్ = ఇఁకమీఁద; ఎంతయున్ = మిక్కిలి; కైకొందురే = గ్రహింతురా? గ్రహింప రనుట. అతార్కికు లైనవారలు నీ సైన్యరజ స్సున్నచోట నీప్రతా పాగ్ని యుండునన్న విషయము అయథార్థముగాఁ దెలిసికొన్నను, దర్కశాస్త్రపారీణులు తావకబలోద్యద్రేణురూపహేతువు చేత భవత్ప్రతాపాగ్నిజ్ఞానము యథార్థానుభవమై యుండఁగా ధూళి యవ్యాప్తము, ప్రతాపాగ్నిజ్ఞానము భ్రమాత్మక మనుట యంగీకరింపరని తాత్పర్యము. అతిశయోక్తి సంకీర్ణానుమానాలంకారభేదము.
సీ. శారదనారద◊సాదృశ్యము వహించి, హంసమండలి నంద◊మందఁ జేయు,
బుధవరప్రహ్లాద◊బోధకశ్రీఁ బూని, భూరిహరిచ్ఛాయఁ ◊బొలుపు మీఱు,
సామోదపుండరీ◊కాఖండరుచిఁ గాంచి, సర్వజ్ఞమతికి దో◊షము ఘటించు,
ననుపమానఘనార్జు◊నాభిఖ్య నలరారి, పాండురాజవిభూతిఁ◊బరిఢవిల్లు,
తే. నందనందనపాదార◊విందభక్తి, వాసితాశ్రయ శ్రీమాధ◊వక్షితీశ
తావకఖ్యాతికాంత య◊తాంతమగు ని,జానుకూల్యంబు దెల్లమై ◊యతిశయిల్ల. 73
టీక: నందనందనపాదారవింద భక్తివాసితాశ్రయ – నందనందనపాదారవింద= శ్రీకృష్ణపాదపద్మములయొక్క, భక్తివాసిత= భక్తులకనుట, ఆశ్రయ = ఆశ్రయుఁడైన; శ్రీమాధవక్షితీశ = శ్రీమాధవభూపాలుఁడా! తావకఖ్యాతికాంత = నీ కీర్తికాంత; అతాంతమగు నిజానుకూల్యంబు – అతాంతమగు = అమ్లానమగు, అనఁగా ప్రకాశించునది యనుట, నిజానుకూల్యంబు = స్వీయానుకూల్యము; తెల్లమై = వ్యక్తమై, అతిశయిల్లన్ =విజృంభించునట్లుగా; శారదనారదసాదృశ్యము = నూతనమగు నారదమహర్షియొక్క సామ్యమును, ‘ శారదః పీతమన్దే నాప్రత్యగ్రేఽభినవే త్రిషు’ అని హలాయుధము; వహించి=పొంది; హంస = యతులయొక్క; మండలిన్ = సమూహమును, హంస,పరమహంస, కుటీచక, బహూదకు లని యతులలో నాల్గు భేదములు; నందము = ఆనందమును; అందఁ జేయున్ = పొందఁజేయును; నారదమహర్షిసాదృశ్యము నొంది యతుల కానందము గలుగఁజేయు నని యర్థము. శరత్కాలమేఘముయొక్క సాదృశ్యమును వహించి రాయంచలగుంపు నంద మందునట్లు చేయు నని భావము. రాయంచలు వార్షుకమేఘమునకు వెఱచుటయు, శారదమేఘమునకు సంతసించుటయు కవికులప్రసిద్ధంబు. బుధవరప్రహ్లాదబోధకశ్రీఁబూని – బుధవరప్రహ్లాద = బుధశ్రేష్ఠుం డగు ప్రహ్లాదునియొక్క, బోధకశ్రీఁబూని = జ్ఞానసంపదను బూని, ఇట బోధశబ్దముమీఁద స్వార్థమందు కప్రత్యయము; భూరి = అధికమగు; హరిచ్ఛాయన్ = విష్ణుమూర్తియొక్క నీడ చేత, పక్షపాతముచేత ననుట; పొలుపు మీఱున్ = ఒప్పుమీఱును; ప్రహ్లాదుని జ్ఞానసంపదను వహించి విష్ణుమూర్తిచ్ఛాయ నొప్పు నని యర్థము. బుధవరులయొక్క(అనఁగా పండితోత్తములయొక్క) ప్రహ్లాదమును బోధించు శ్రీఁబూని సింహముయొక్క కాంతి చేతఁ బొలుపుమీఱు నని భావము.
సామోదపుండరీకాఖండరుచిన్ = సంతసముతోఁ గూడిన పుండరీకుఁడను నొక విష్ణుభక్తునియొక్క యఖండరుచిని; కాంచి = వహించి; సర్వజ్ఞమతికిన్ తోషము ఘటించున్ =అనఁగా సర్వజ్ఞపదము యోగవృత్తిచే విష్ణుమూర్తిని బోధించును గాన విష్ణు మనస్సున కానందముఁ గలుగఁజేయు నని యర్థము. పరిమళముతోఁ గూడిన తెల్లదామరలకాంతి నొంది యీశ్వరునియొక్క మనస్సున కానందము ఘటించు నని భావము. శివుఁడు పుండరీకప్రియుఁ డగుట స్పష్టము.
అనుపమానఘనార్జునాభిఖ్య నలరారి = అసమానము ఘనమును నైన యర్జునునియొక్క కాంతిచేత నలరారి; పాండురాజ విభూతిఁ బరిఢవిల్లున్ = పాండురాజుయొక్క యైశ్వర్యముతో నొప్పియుండు నని యర్థము. అర్జునాభిఖ్య నలరారినపుడు అతనితండ్రి యగు పాండురాజుయొక్క విభూతితోఁ బరిఢవిల్లుట స్పష్టము. అనుపమానము, ఘనము నగునట్లుగా (అర్జున మనఁగా) శుభ్ర మైనది యని పేరొంది (పాండురాజ) తెల్లనిచంద్రునియొక్క విభూతితోఁ బరిఢవిల్లు నని భావము. ఇట్లు నీవు నందనందనపాదారవిందభక్తివాసితుల కాశ్రయమై యున్నవాఁడవు కాన నీకీర్తియు నారద ప్రహ్లాద పుండరీ కార్జునాది భాగవతో త్తముల భంగి నలరి హంసాదుల కానంద మందఁజేయుచు నీయానుకూల్యవర్తనతో రాజిల్లు నని యభిప్రాయము. నీకీర్తి శర త్కాలమేఘాదులతోఁ దులతూగి యున్నదని ఫలితార్థము. ఇందు శ్లేషసంకీర్ణోపమాలంకారము.
సీ. భూరిప్రకంపన◊స్ఫూర్తి గ్రక్కున లేచి, పటుతరరథచక్ర◊భంగ మూన్చి,
పరమస్తకోద్దేశ◊పదవికి నెగఁబ్రాఁకి, తద్ఘనాఖ్యామృత◊ధారఁ గ్రోలి,
యతనుసంగరమాప్తి ◊యంటువాయఁగఁ జేసి, యాత్మైకచింతనా◊యతిఁ దవిల్చి,
యచలయోగస్థేమ ◊మలవడఁగాఁ దీర్చి, కన్నుల నీరొల్కఁ◊గా ఘటించి,
తే. సురుచిరాహారముల్ మాన్పి, ◊పరమశక్తి
భవదసిభుజంగి జటిలతా◊పదవిహార
విభవములఁ గూర్చెఁ బరహంస◊వితతి కెల్లఁ
దనర మాధవరాయ! స◊త్సాంపరాయ! 74
టీక: సత్సాంపరాయ = న్యాయయుద్ధము గల; మాధవరాయ = మాధవప్రభుపుంగవుఁడా! తనరన్ = ఒప్పునట్లు; పరమశక్తి భవదసిభుజంగి = పరమశక్తిస్వరూప మగు నీఖడ్గ మనెడు కుండలిని; పరహంసవితతి కెల్లన్ = శత్రుశ్రేష్ఠసంఘమున కెల్లను అని ఖడ్గపరమైన యర్థము, శ్రేష్ఠులగు యతులయొక్క సంఘమున కెల్ల నని కుండలినీశక్తిపరమైన యర్థము; భూరి = అధికమైన; ప్రకంపన= చలనముయొక్క; స్ఫూర్తిన్ = ప్రకాశము చేత; గ్రక్కున లేచి = వేగముగ లేచి; పటుతర = దృఢతరములైన; రథ = స్యందనములయొక్క; చక్ర = కండ్లయొక్క; భంగ మూన్చి = భంగము సేసి, అని ఖడ్గపరమైన యర్థము. అధికమగు ప్రాణా యామ నిబద్ధ వాయువుయొక్క స్ఫూర్తిచే గ్రక్కున లేచి దృఢతరదేహసంబంధి మూలాధారాదిచక్రములయొక్క భంగమూన్చి యని శక్తిపరమైన యర్థము. పర = శత్రువులయొక్క; మస్తకోద్దేశపదవికిన్ = శిరస్స్థానమునకు; ఎగఁబ్రాఁకి = ఎక్కి; తద్ఘనాఖ్యామృత ధారన్ – తత్ = ఆ శత్రువులయొక్క, ఘన = అధికమగు, ఆఖ్యా = యశ మనెడు, అమృతధారన్ = సుధారసమును; క్రోలి = పానము సేసి, అని ఖడ్గపరమైన యర్థము. ఉత్కృష్టమగు శిరస్స్థానమున కెక్కి ప్రసిద్ధమగు ఘన మను పేరు గలిగిన సహస్రారసుధను గ్రోలి యని శక్తిపరమైన యర్థము. అతనుసంగరమాప్తి యంటున్ –అతను = అధికమగు; సంగర = యుద్ధసంబంధి యైన; మా = లక్ష్మియొక్క; ఆప్తి = ప్రాప్తి యొక్క; అంటు = సంపర్కమును; పాయఁగఁ జేసి = లేకుండఁజేసి; ఆత్మైకచింతనాయతిన్ – ఆత్మ = తనయొక్క, అనఁగా ఖడ్గముయొక్క, ఏక = ముఖ్యమగు, చింతనా = స్మరణముయొక్క, ఆయతిన్ = అతిశయమును; తవిల్చి = కూర్చి, అని ఖడ్గపరమైన యర్థము. అధికమైన సంగముయొక్క రమయొక్క ఆస్తిని లేకుండఁజేసి బ్రహ్మముయొక్క ముఖ్య మగు ధ్యానాతి శయము ఘటింపఁజేసి యని శక్తి పరమైన యర్థము. అచలయోగస్థేమము –అచల = పర్వతములయొక్క; యోగ = సాంగత్యమందలి; స్థేమము = స్థైర్యమును; అలవడఁగాఁ దీర్చి = తగు నట్లుగాఁ జేసి; కన్నుల నీరొల్కఁగా ఘటించి=దుఃఖముచేతఁ గన్నుల నీ రొల్కునట్లు చేసి యని ఖడ్గ పరమైన యర్థము. చలింపని యోగమందు స్థైర్యమును తగున ట్లొనరించి, యానందముచేతఁ గన్నుల నీ రొల్కునట్లు చేసి యని శక్తిపరమైన యర్థము. సురుచిరాహారముల్ మాన్పి = మనోహరములగు నాహారములు మానునట్లు చేసి, అరణ్యవాసముచేత శత్రురాజులకు, యోగు లకును ఫలమూలాదులే యాహారంబులు గావున నిరుపక్షములయందును నిదే యర్థము. జటిలతాపదవిహారవిభవములన్ – జటి = జువ్విచెట్లయొక్క, ‘ప్లక్షో జటీ పర్కటీ స్యాత్’ అని యమరుఁడు, లతా = తీవెలయొక్క, పద = స్థానములయందలి, విహార = విహరణముయొక్క, విభవములన్ = సంపదలను, కూర్చెన్ అని ఖడ్గపరమైన యర్థము. జటిలతా = జటాధారిత్వ మనెడు, పద = చిహ్నముచేత, విహారవిభవముల నని శక్తిపరమైన యర్థము.
మాధవరాయలవారిఖడ్గము గ్రక్కున లేచి శత్రురాజుల రథచక్రాదులను భంగము చేసి, వారితలపై కెక్కి వారి యశంబును గొని యనఁగా వారి నోడించి ఖ్యాతి గాంచి, వారలు యుద్ధలక్ష్మీచింత పోయి తన (ఖడ్గ)చింతయే ముఖ్యముగాఁ గలిగి యడ వులపాలై దుఃఖముతోఁ గన్నీ రొలుకఁగా మృష్టాన్నాహారము లేక వృక్షలతాగుల్మాదిప్రదేశములలోఁ జేరునట్లు చేసె ననియు, నది చూడఁగా యోగాభ్యాసము సేయువారల మూలాధారనిలయ యగు కుండలిని యను శక్తి ప్రాణాయామనిబద్ధవాయువుచే గ్రక్కున లేచి మూలాధారాదిచక్రభంగ మొనర్చి శిరస్స్థానమందు సహస్రారసుధను గ్రోలి సర్వసంగపరిత్యాగము, బ్రహ్మాను సంధానము గల్గఁ జేయుచు నిశ్చలయోగముతో నానందబాష్పము లొల్కఁగా వార లాహారములు మాని జటాధారు లై యడ వులలో విహరించునట్లు చేసినభంగి నున్న దనియు భావము. ఇందు శ్లిష్టపరంపరితరూపకాలంకారము.
తే. విబుధశిక్షితుఁడవు, శాస్త్ర◊విదుఁడ, వఖిల
కావ్యవేదివి, ఘనతార్కి◊కవ్యవహృతి
నెఱుఁగుదువు, నీ కసాధ్యమే ◊యింపు మీఱఁ
గృతి వినిర్మింపుము మాధవ◊క్షితిప యనిరి. 75
టీక: మాధవక్షితిప, నీవు విబుధశిక్షితుఁడవు, అలంకారాది సర్వశాస్త్రముల నెఱిఁగినవాఁడవు, అఖిలకావ్య వేదివి, ఘనమైన తర్క శాస్త్రసంబంధి యైన వ్యవహారము నెఱుఁగుదువు, నీకుఁ బుండరీకాక్షనిదేశానుసారముగఁ గృతి నిర్మించుట యసాధ్యంబు గాదు కావున నింపుమీఱఁ గృతి నిర్మింపు మని బుధజనంబు లమందానందకందళితహృదయారవిందులై యని రని పూర్వము వ్రాసిన వచనముతో నన్వయము.
వ. అనిన నేను బరమానందకందళితహృదయారవిందుండ నై. 76
షష్ఠ్యంతములు
క. భాషాధిప శేషాహిప
భాషాభూషాయితాత్మ◊పటుగుణతతికిన్
దోషాచరదోషాచర
దోషాచరచక్రకలిత◊దోర్బలభృతికిన్. 77
టీక: భాషాధిప = బ్రహ్మయొక్కయు; శేషాహిప = ఆదిశేషునియొక్కయు; భాషా = వాణికి; భూషాయిత = అలంకారప్రాయ మగు; ఆత్మ = తనయొక్క; పటు = శ్రేష్ఠములగు; గుణ = అనంతకల్యాణగుణములయొక్క; తతికిన్ = సమూహము గల వానికి; దోషాచర దోషాచర దోషాచర చక్ర కలిత దోర్బల భృతికిన్ – దోష = పాపములను, ఆచర = మిక్కిలి ఆచరించు చున్న, దోషాచర = రక్కసులయొక్క, దోషా = భుజములకు, ‘దో ర్దోషా చ భుజా బాహు’ అని హలాయుధనిఘంటువు, చర = ఖండించెడు, చక్ర = సుదర్శనముచేత, కలిత = ఒప్పుచున్న, దోర్బల = బాహుబలముయొక్క, భృతికిన్ = భరణము గల వానికి. దీని కర్పితముగ నొనర్తు నను దానితో నన్వయము. ముందు నిట్లు చూడవలయు.
క. కోపాయితపాపాయత
భూపాయితదనుజమథన◊పూజితమతికిన్
గోపాలనగోపాలన
గోపాలననిబిడరతికి ◊గోహితకృతికిన్. 78
టీక: కోపాయిత పాపాయత భూపాయిత దనుజమథన పూజితమతికిన్ – కోప = కోపముచేత, ఆయిత = పొందఁబడిన, అయ గతౌ’ అను ధాతువుమీఁద క్తప్రత్యయము, పాప = పాపములచేత, ఆయత = అధికులగు, భూపాయిత = రాజులవలె నాచరించుచున్న, దనుజ = రాక్షసులయొక్క, మథన = నాశనముచేత, పూజిత = శ్లాఘ్యమైన, మతికిన్ = బుద్ధిగలవానికి; గోపాలన గోపాలన గోపాలన నిబిడ రతికిన్ – గోప = రాజులకు, గొల్లలకు, ‘గోపాశ్చ గోపాశ్చ గోపాః’ అని యేకశేషము, అలన = అలంకారకరమగు, గోపాలన = భూపాలనమందు, గోపాలన = గోవుల పాలనమందు, నిబిడ = దట్టమైన, రతికిన్ = ఆసక్తిగలవానికి; గోహితకృతికిన్ – గో = స్వర్గమునకు, హిత = అనుకూలమగు, కృతికిన్ = వ్యాపారముగలవానికి, ‘స్వర్గేషు పశు వా గ్వజ్ర దిఙ్నేత్ర ఘృణి భూ జలే, లక్ష్యదృష్ట్యా స్త్రియాం పుంసి గౌః’ అని యమరుఁడు.