వ. ఇట్టు లాలోకమిత్రుం డహీన భూరి ప్రగ్రహ ప్రకాండ పరిస్యూతంబును, నఖిల సన్మణి ప్రకర వర్ణనీయ ప్రభా భాసమా నైక చక్ర సముపేతంబును, నాశుగ మార్గాతి క్రమణ చణ వేగవ దసమావదాత తురంగ సంయోజితంబును, నమర వినుతాభిరామ ధామారుణ సారథి విభ్రాజితంబునునై విరాజిల్లు శతాంగరాజం బారోహించి, యాత్మీయ భక్తిభావ సంసక్త చిత్తంబున నడరు చక్రకాంత చక్రంబులం గటాక్షించుచు నని వార్య రసవిశేష విలసిత పద్మినీ సందోహంబుల కామోదంబుఁ గూర్చుసొంపునం బెంపొందుచు, నఖండ రాజమండల తేజోగౌరవంబు నిజ తేజో మహిమంబున సంపాదించుచు, నక్షీణ దస్యు వీక్షణ సమ్మద విక్షేపకాక్షుద్ర కరకాండ చండిమంబునఁ జూపట్టుచు, నఖర్వ శార్వర మాహాత్మ్య నిర్వాప ణోల్లాసంబున వెడలె నయ్యెడ. 156
టీక: ఇట్టులు=ఈప్రకారముగా; ఆలోకమిత్రుండు = ఆ లోకహితుం డగు సుచంద్రుఁడు, ‘ఖద్యోతో లోకబాన్ధవః’ అనుటచేత సూర్యుఁ డను నర్థాంతరము స్ఫురించును; అహీన = అధికములైన; భూరి=సువర్ణమయము లైన; ప్రగ్రహ=పగ్గములయొక్క; ప్రకాండ =సమూహముచేత; పరిస్యూతంబును=కట్టబడినది యని సుచంద్రపరమైన యర్థము, సర్పశ్రేష్ఠము లనెడు నధికము లైన పగ్గములసమూహముచేఁ గట్టఁబడిన దని సూర్యరథపరమైన యర్థము; అఖిల సన్మణి ప్రకర వర్ణనీయ ప్రభా భాసమా నైక చక్ర సముపేతంబును –అఖిల= సమస్తము లగు, సన్మణి=శ్రేష్ఠములగు మణులయొక్క, సత్పురుషశ్రేష్ఠులయొక్క యని యర్థాంతరము, ప్రకర= గుంపుచేత, వర్ణనీయ=కొనియాడఁ దగిన, ప్రభా =కాంతులచేత, భాసమాన=ప్రకాశమానము లగు, ఏక=ముఖ్య మైన, చక్ర=కండ్లతోడను, సముపేతంబును= యుక్తంబును, భాసమాన మైన యొకకంటితోడ సముపేతంబు అని సూర్యపరమైన యర్థము; ఆశుగ మార్గాతిక్రమణ చణ వేగవదసమావదాత తురంగ సంయోజితంబును—ఆశుగ=బాణము యొక్క, మార్గ=సరణియొక్క, అతిక్రమణ=అతిక్రమించుటచేత, చణ=ప్రసిద్ధము లైన, వేగవత్ = వేగవంతములగు, అసమ =అసమానములైన, అవదాత=తెల్లనైన, తురంగ= గుఱ్ఱములతోడ, సంయోజితంబును = కూడినదియు, సూర్యరథపరమై నపుడు బేసిసంఖ్య గల పచ్చగుఱ్ఱములతోడ నని యర్థము, ‘అవదాత స్సితే పీతే శుద్ధే’ అని విశ్వము; అమరవినుతాభిరామ ధామారుణ సారథి విభ్రాజితంబును – అమరవినుత=దేవతలచేఁ గొనియాడఁబడిన, అభిరామ=మనోహర మగు, ధామ= ప్రతాపముచేత, అరుణ=సూర్యతుల్యుఁడగు, సారథి=సూతునిచేత, విభ్రాజితంబును= ప్రకాశించునది యని సుచంద్రరథ పరమైన యర్థము, అమరవినుతమై యభిరామమైన తేజము గల యనూరుఁ డను సారథిచేత విభ్రాజితం బని సూర్యరథపర మైన యర్థము; ఐ = అగుచు; విరాజిల్లు = ప్రకాశిల్లు; శతాంగరాజంబు=పూర్వోక్తగుణవిశిష్ట మైన యుత్తమరథమును; ఆరో హించి= ఎక్కి; ఆత్మీయ భక్తిభావ సంసక్త చిత్తంబునన్ – ఆత్మీయ = తన సంబంధి యైన, భక్తిభావ = భక్తి యనెడు భావము చేత, స్వవిషయక మైన భక్తిభావముచేత ననుట, సంసక్త= సంబంధించిన, చిత్తంబునన్= మానసముచేత; రసగంగాధరాద్యలం కారగ్రంథములయందు భక్తికి రసత్వముఁ జెప్పినవారి మతఖండనావసరంబున ‘ శ్లో. రతి ర్దేవాదివిషయా వ్యభిచారీతథాఞ్జితః, భావః ప్రోక్తః’ అనుటచేత, భక్తిని, దేవాదివిషయకరతిభావములోఁ జేర్చినందున, నిట భక్తిభావ యని వచింపఁబడియె. మఱియు ఆత్మీయభక్తిభావ యనుచోట ‘శ్లో. జఙ్ఘాకాణ్డోరునాలో నఖకిరణలసత్కేసరాలీకరాలః ప్రత్యగ్రాలక్తకాభాప్రసరకిసలయో మఞ్జు మఞ్జీరభృఙ్గః, భర్తు ర్నృత్తానుకారే జయతి నిజతనుస్వచ్ఛలావణ్యవాపీ సంభూతామ్భోజశోభాం విదధ దభినవోదణ్డ పాదో భవాన్యాః’ అను దానియందు భవానీగతనిజప్రతీతి కావలసియుండఁగా దండపాదగతనిజత్వ ప్రతీతి యగుటనుబట్టి విరుద్ధమతి కారిత్వరూపకావ్యదోషము ప్రసరించు నని కావ్యప్రకాశమునందుఁ జెప్పినరీతిగ సుచంద్రగతాత్మీయత్వప్రతీతి కావలసియుండఁ గాఁ జక్రకాంతగతాత్మీయప్రతీతి యగుటవలనఁ బైఁ జెప్పినదోషము ప్రసరించు నని తోఁచును గాని ‘నత్వా సాంబం శివం బ్రహ్మ నాగేశః కురుతే’ అనుచోట జగన్నిరూపితాంబాత్వప్రతీతివలెఁ బ్రధానభూతక్రియాకర్తృనిరూపితాత్మీయత్వప్రతీతి నవలంబించి నందున నట్టిదోషంబు ప్రసరింప దని యెఱుంగునది. అడరు = ఒప్పునట్టి; చక్రకాంతచక్రంబులన్ = రాష్ట్రాధిపతులయొక్క సంఘములను; చక్ర=చక్రవాకపక్షులయొక్క, కాంత= మనోజ్ఞములగు, చక్రంబులన్=సంఘముల నని యర్థాంతరము; కటా క్షించుచున్=అవలోకించుచు; అనివార్యరసవిశేష విలసితపద్మినీ సందోహంబులకున్ – అనివార్య= అడ్డగింపరాని, రసవిశేష = ఆసక్తివిశేషముచేత, అధికమైన మకరందముచేత నని యర్థాంతరము, విలసిత=ప్రకాశించునట్టి, పద్మినీ= పద్మినీజాతిస్త్రీల యొక్క, తామరతీవలయొక్క యని యర్థాంతరము, సందోహంబులకున్ =గుంపులకు; ఆమోదంబున్ =సంతసమును; కూర్చుసొంపునన్=ఘటింపఁజేయు సౌందర్యమువలన; పెంపొందుచున్ = అతిశయించుచు; అఖండ రాజమండల తేజో గౌరవంబు – అఖండ=అవిచ్ఛిన్నమగు, రాజమండల =నృపసంఘముయొక్క, పూర్ణచంద్రమండలముయొక్క, తేజోగౌర వంబు=ప్రతాపాతిశయము, కాంత్యతిశయము; నిజతేజోమహిమంబునన్ = తనప్రతాపమహిమముచేత; సంపాదించుచున్= కలుగఁజేయుచు; అక్షీణ దస్యు వీక్షణసమ్మదవిక్షేపకాక్షుద్ర కర కాండ చండిమంబునన్ – అక్షీణ = తక్కువ గాని, దస్యు= శత్రువులయొక్క, దొంగలయొక్క, వీక్షణ=చూపులయొక్క, సమ్మద=సంతసమునకు, విక్షేపక = నాశకము లగు , పగలు చోరులకు సందర్భము ఘటింపదు గాన దొంగలసంతసమునకు సూర్యతేజము నాశక మనుట, అక్షుద్ర =అధికము లైన, కర= హస్తమందలి,కాండ=బాణములయొక్క, చండిమంబునన్=ఉగ్రతవలన, కరకాండ=కిరణసమూహముయొక్క చండిమం బున నని సూర్యపర మైన యర్థము; చూపట్టుచున్ = అగపడుచు; అఖర్వ శార్వర మాహాత్మ్య నిర్వాపణోల్లాసంబునన్ – అఖర్వ= అధికమగు, శార్వర = శత్రువు లగు రక్కసులయొక్క, చీకటియొక్క యని సూర్యపర మైన యర్థము, మాహాత్మ్య =గొప్పదనముయొక్క, నిర్వాపణ=ప్రశమనమందు, ఉల్లాసంబునన్ =సంతోషముచేత, ప్రకాశముచేత; వెడలెన్=బయలు దేఱెను; అయ్యెడన్=ఆసమయమున. ఇట సూర్యునకు, సుచంద్రునకు నౌపమ్యము గమ్యము గావున నుపమాలంకారధ్వని.
చ. హరిభయకృద్రయాన్వితము◊లై, యభిరూపకలాపజాతభా
స్వరత వహించి, చూడఁదగు ◊వాజివరంబుల నెక్కి రాజశే
ఖరతనయౌఘ మేఁగె మహి◊కాంతుని వెంబడి దివ్యశక్తితో
నరు దగు తారకాత్మదర◊దాత్మసమాఖ్య బుధుల్ నుతింపఁగన్. 157
టీక: ఈపద్యమందు సుచంద్రపరమైన యర్థముఁ, గుమారస్వామిపరమైన యర్థముఁ గలుగుచున్నది. హరి భయకృ ద్రయాన్వితములు ఐ – హరి=వాయువునకు, సర్పముల కని యర్థాంతరము, భయకృత్ =వెఱపు పుట్టించెడు, రయ=వేగముతోడ, అన్వితములు ఐ =కూడినవై; అభిరూప కలాప జాత భాస్వరతన్ – అభిరూప=మనోజ్ఞము లగు, కలాప =భూషణములయొక్క, మనోజ్ఞ మగు పింఛముయొక్క యని యర్థాంతరము, ‘కలాపో భూషణే బర్హే’ అని యమరుఁడు, జాత=కల్గిన, భాస్వరతన్=ప్రకాశమును; వహించి= ధరించి; చూడఁదగు =చూచుట కింపైన; వాజివరంబులన్ = అశ్వరత్న ములను, కుమారస్వామిపరమై నపుడు పక్షిశ్రేష్ఠములను, నెమ్ముల నని భావము; ఎక్కి =అధిరోహించి; రాజశేఖర తనయౌ ఘము = రాజశ్రేష్ఠుల కుమారసంఘము, చంద్రశేఖరుని కుమారు లైన షణ్ముఖులసంఘ మని ధ్వన్యమానార్థము; దివ్యశక్తితోన్ =అమానుషసామర్థ్యముతో, దివ్య మగు శక్తి యను నాయుధముతో నని స్కందపరమైన యర్థము; అరుదగు తారకాత్మ దర దాత్మసమాఖ్యన్ – అరుదగు =ఆశ్చర్యకరమైన; తారకాత్మ=నక్షత్రదేహములను, దర=శంఖమును, ద=ఖండించెడు, ఆత్మ సమాఖ్యన్=తనకీర్తిని; తారక=తారకాసురునియొక్క, ఆత్మ=చిత్తమునకు, దరద= భయము నిచ్చెడు, ఆత్మసమాఖ్యన్ = తనపేరిని; బుధుల్ = పెద్దలు, దేవతలు అని స్కందపరమైన యర్థము; నుతింపఁగన్ = కొనియాడఁగా; మహికాంతునివెంబడిన్ = సుచంద్రుని వెంబడి; ఏఁగెన్=చనుదెంచెను.
అనఁగా సర్పములకు భయంకర మగు వేగమును వహించి, మనోహరమగు పింఛమును దాల్చిన మయూరము నెక్కి, శక్త్యాయుధముతోఁ గూడి, తారకాసురాత్మభయంకర మగు తన పేరిని దేవతలు నుతించు చుండఁగా స్కందుండు వెడలినట్లు రాజకుమారులు వాయుభయంకరమైన వేగము గల్గి, మనోహరభూషణములు దాల్చి భాసిల్లు నశ్వరత్నముల నెక్కి, యమా నుష మైన బలిమితోఁ గూడి, నక్షత్రశంఖకాంతులను దిరస్కరించు తమకీర్తిని బెద్దలు గొనియాడుచుండఁగా సుచంద్రుని వెంట నేతెంచి రని భావము. ప్రస్తుతాప్రస్తుతోపమాధ్వని యని తెలియునది.
చ. తనుపులకాలిమేలు పయిఁ ◊దార్చిన బంగరుజూలుచాలు చ
క్కనికటిసీమలం దనరు ◊గైరికరేఖలడాలు సాలఁ గ
న్గొన ముద మూన్ప భద్రకరి◊కోటులు వెల్వడె రాజువెంటఁ జ
య్యనఁ బదమేఘగాళితతు ◊లందుకజాలకయుక్తిఁ బూనఁగన్. 158
టీక: భద్రకరికోటులు = భద్రగజసమూహములు; తనుపులకాలిమేలు – తను=శరీరమందలి, పులక = రోమాంచములయొక్క, ఆలి=పంక్తియొక్క, మేలు =అతిశయము; పయిన్=శరీరమందు; తార్చిన బంగరుజూలుచాలు = ఉంచినట్టి బంగరుజూలు యొక్క చాలు; చక్కనికటిసీమలన్ = అందమైన కటిప్రదేశములందు; తనరు గైరికరేఖలడాలు = ఒప్పుచున్న ధాతురేఖల కాంతి; కన్గొనన్ = చూడఁగా; చాలన్=మిక్కిలి; ముదము=సంతసమును; ఊన్పన్=చేయఁగా; చయ్యనన్=వేగముగా; పద = పదములందున్న; మేఘ=మేఘమను మదోదకమును; గాళి(గ+అళి) –గ=పొందినట్టి, అళి=తుమ్మెదలయొక్క; తతులు = గుంపులు; అందుకజాలకయుక్తిన్=నిగళసమూహముయొక్క కూడికను; పూనఁగన్=వహింపఁగా;రాజువెంటన్=సుచంద్రుని వెంబడి; వెల్వడెన్=బయలుదేఱెను.
మ. అమరెం దత్సృతి నేఁగు నీలమయచ◊క్రాంగంబు లింద్రావరో
ధముఁ దప్పించుక ధాత్రిఁ జేరిన సము◊ద్యత్పుష్కలావర్తము
ఖ్యమహామేఘకులంబులో యనఁగఁ జ◊క్కం గాండధారావిశే
షములుం, భూరిమణీశరాసనవిభా◊జాతంబులుం జూడఁగన్. 159
టీక: తత్సృతిన్=ఆ సుచంద్రుఁడు పోవుదారిని; ఏఁగు =పోవుచున్న; నీలమయ=ఇంద్రనీలమణిమయము లగు; చక్రాంగం బులు=రథములు; ఇంద్రావరోధమున్=ఇంద్రుని యడ్డగింతను; తప్పించుక=వదిలించుకొని; ధాత్రిన్=భూమిని; చేరిన = పొందిన; సముద్యత్=ప్రకాశించుచున్న; పుష్కలావర్తముఖ్య =పుష్కలావర్తము మొదలగు; మహామేఘ=గొప్పమేఘముల యొక్క; కులంబులో యనఁగన్=గుంపులోయనునట్లుగా,దీని కమరెన్ అనుక్రియతోనన్వయము; చక్కన్=బాగుగా; కాండ ధారావిశేషములున్ =గుఱ్ఱాలయొక్క గతివిశేషములను, ‘ఆస్కందితం ధౌరితకం రేచితం వల్గితం ప్లుతం గతయోమూః పఞ్చ ధారాః’ అని యమరుఁడు, జలధారల విశేషముల నని మేఘపరమైన యర్థము; భూరిమణీ శరాసన విభా జాతంబులున్ – భూరిమణీ= అధికమణులు గల, శరాసన=ధనువులయొక్క,ఇంద్రధనువులయొక్క, విభా=విశేషకాంతులయొక్క, జాతం బులన్ =సంఘములను; చూడఁగన్ =అవలోకింపఁగా; అమరెన్=ఒప్పెను. ఉత్ప్రేక్షాలంకారము.
చ. అనఘవిసారపాళియుతి, ◊నంచితశుభ్రశరాప్తిఁ, బుండరీ
కనిచయలబ్ధి, నాగవర◊కాండనిషక్తిఁ, గనం బొసంగువా
హిని యల యంశుమత్కులమ◊హీశ్వరు వెంబడి నేఁగఁ జొచ్చె న
భ్రనది భగీరథానుసృతి ◊భవ్యరయస్థితి నేఁగుచాడ్పునన్. 160
టీక: ఈపద్యమున సుచంద్రునివెంటఁ జనుసేన భగీరథునివెంటఁ జనుగంగవలె నున్నదని వర్ణించుటం జేసి సేనాభగీరథుల పర మైన యర్థద్వయము గల్గుచున్నది. అనఘవిసార పాళి యుతిన్ – అనఘ=ఒచ్చెములేని, విసార=ప్రసరణము గల, పాళి=టెక్కెములయొక్క, యుతిన్ = సంబం ధముచేత నని సేనాపరమైన యర్థము, అనఘములైన మత్స్యవిశేషములయొక్కగుంపుల చేత నని గంగాపరమైన యర్థము, ‘విసార శ్శకులార్భకః’ అని యమరుఁడు; అంచిత శుభ్ర శరాప్తిన్ – అంచిత = ఒప్పుచున్న, శుభ్ర=నిర్మలము లైనట్టి, శర= బాణములయొక్క, జలములయొక్కయు,ఆప్తిన్=ప్రాప్తిచేతను; పుండరీకనిచయలబ్ధిన్ = వెల్లగొడుగులగుంపులయొక్క లాభముచేతను, తెల్లతామరల గుంపులయొక్క లాభముచేతను; నాగ వరకాండ నిషక్తిన్ – నాగ=గజములయొక్కయు, వర కాండ= శ్రేష్ఠాశ్వములయొక్కయు, నిషక్తిన్ =సంబంధముచేతను, ‘కాణ్డో స్త్రీ దణ్డ బాణార్వ వర్గావసర వారిషు’ అని యమ రుఁడు; నాగవర=సర్పశ్రేష్ఠములయొక్క, కాండ=సమూహముయొక్క, నిషక్తిన్=సంబంధముచేత నని గంగాపరమైన యర్థము; కనన్=చూచుటకు; పొసంగువాహిని = ఒప్పుచున్న సేన, నది యని యర్థాంతరము దోఁచును; అల యంశుమ త్కుల మహీశ్వరు వెంబడిన్= ఆసూర్యవంశీయుఁడగు సుచంద్రుని వెంబడి; అభ్రనది =ఆకాశగంగ; భగీరథానుసృతి=భగీర థుని ననుసరించినదై; భవ్యరయస్థితిన్=అధికవేగవృత్తిచేత; ఏఁగుచాడ్పునన్ = పోవురీతిగా; ఏఁగఁ జొచ్చెన్=పోవ నారం భించెను; సురనదికి, సేనకు నుపమానోపమేయభావమున నుపమాలంకారము. సుచంద్రునకు, భగీరథునకు బింబప్రతిబింబ భావాదు లూహ్యంబులు. రాజువెంబడి సేన వెడలు చుండఁగా భగీరథచక్రవర్తివెంబడి స్వర్గంగ పోవుచున్నరీతిగా నున్నదని భావము.
చ. కలితమృదంగతుంగరవ◊గర్జ, నటత్త్రిదశీతనుప్రభో
జ్జ్వలచపలాళి యంబుధర◊వర్త్మమునం దగ నాధరేంద్రుపై
నలరెడు మానసంబున మ◊హాశరజాతవినాశ ముర్వరం
దెలుపు ప్రసూనవృష్టి జగ◊తీధరశత్రువు నించె నయ్యెడన్. 161
టీక: కలిత మృదంగ తుంగరవ గర్జ –కలిత=ఒప్పుచున్న, మృదంగ=మృదంగముయొక్క, తుంగరవ= అధికమగు ధ్వని యనెడు, గర్జ=మేఘధ్వనియు; నటత్ త్రిదశీ తనుప్రభోజ్జ్వల చపలాళి – నటత్= నర్తించుచున్న, త్రిదశీ = దేవాంగనలయొక్క, తనుప్రభా=దేహకాంతి యనెడు, ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, చపలా=మెఱుపులయొక్క,ఆళి=పంక్తి; అంబుధర వర్త్మము నన్=ఆకసమునందు; తగన్=ఒప్పఁగా; ఆధరేంద్రుపైన్= ఆ సుచం ద్రునిమీఁద, ఆపర్వతముమీఁద నని యర్థాంతరము స్ఫురిం చును; అలరెడు మానసంబునన్ = ఒప్పుచున్న మనస్సుచేత, అతనిపైఁ బ్రీతిచేత ననుట, మానసమను సరోవరమం దని యర్థాం తరధ్వని; ఉర్వరన్=భూమియందు; మహాశర జాత వినాశము–మహత్=ఉత్కృష్టులైన,ఆశర=రాక్షసులయొక్క, జాత= సంఘముయొక్క, వినాశము=క్షయమును; మహత్=ఉత్కృష్టమగు,శరజాత=పద్మములయొక్క వినాశము నని యర్థాంతర ధ్వని; తెలుపు ప్రసూనవృష్టి= తెలియఁజేయుచున్నపుష్పవృష్టి యను వర్షము; అయ్యెడన్=ఆ సమయమందు; జగతీధర శత్రువు=పర్వతారి యైన యింద్రుఁడు; నించెన్ =పూరించెను. పర్వతములయందు మేఘము జలము వర్షించురీతి నింద్రుఁడు సుచంద్రునిపైఁ బ్రీతితోఁ బుష్పముల వర్షించె నని భావము.
చ. అలయజరాపగన్ రవికు◊లాధిపుపార్శ్వగవాహపాశ్వని
స్తులగతిజైలధూళివిత◊తుల్ విరళోదయ గాఁగ ఘటింపఁ ద
ద్బలవిచరద్గజేశకర◊పాళి నిజామితశీకరాంబుమం
డలిని రసోదయస్థితిఁ బె◊నంగఁగ నెంతయుఁ దార్చెఁ జిత్రతన్. 162
టీక: అల యజరాపగన్ =ఆవిశాలపురి చెంత నున్నగంగను; రవికులాధిపు పార్శ్వ గ వాహపాశ్వ నిస్తులగతి జైల ధూళి వితతుల్– రవికులాధిపు=సుచంద్రునియొక్క, పార్శ్వ=ప్రక్కలను, గ=పొందినట్టి, వాహప = రౌతులయొక్కయు, అశ్వ= గుఱ్ఱములయొక్కయు, నిస్తులగతి =అసమానమైన గమనమువలన, జ= పుట్టిన, ఐల=ఇలాసంబంధ మగు, ఇల యనఁగా భూమి, ‘గౌరిలా కుమ్భినీ క్షమా’ అని యమరుఁడు; ధూళి=పరాగములయొక్క, వితతుల్= గుంపులు; విరళోదయ గాఁగన్ =కొంచ మైన యావిర్భావము గలదానిఁగా, తక్కువగా ననుట; ఘటింపన్ =చేయఁగా; తద్బల విచర ద్గజేశ కరపాళి –తత్= ఆసుచంద్రునియొక్క,బల=సైన్యమందు, విచరత్=సంచరించుచున్న, గజేశ=కరిశ్రేష్ఠములయొక్క,కర=తుండములయొక్క, పాళి=పంక్తి; నిజామిత శీకరాంబు మండలిన్ – నిజ=స్వకీయము లగు, అమిత=అధికము లగు, శీకరాంబు=నీటితుంపరల యొక్క, మండలిన్=సమూహముచేత; రసోదయస్థితిన్—రస=నీటియొక్క, ఉదయ= ఆవిర్భావముయొక్క, స్థితిన్=ఉనికి చేత; పెనంగఁగన్=కూడునట్లు; చిత్రతన్ = ఆశ్చర్యముచేత; ఎంతయున్=మిక్కిలి; తార్చెన్= చేసెను. ఆశ్చర్యకరమగు రీతిగాఁ జేసె ననుట. ఇచట విరళోదయ గాఁగ ఘటింప ననుచోట విగత మైన రేఫము గల లకారము యొక్క యుదయము గల దానిఁగా నని యర్థమువలన అజరాపగ యనుచోట రేఫముపోయి దానిస్థానమందు లకార ముదయించఁగా అజరాపగ అజలాపగ యగు ననియు, అంబుమండలిని రసోదయస్థితి అనుచోట అంబుమండలి నిరసోదయస్థితి యని పదవిభాగము చేసి, నిర్=గతమైన, అ=అకారముగల, స=సకారముయొక్క ఉదయస్థితిచేత నని యర్థము చేయుటవలన అజరాపగశబ్ద ములో అకారము పోయి దాని స్థానమందు సకార ముదయింపఁగా అజరాపగ సజలాపగ అగు ననియు చిత్రత నెఱుంగునది. ఈపద్యమందు ‘శ్లో. రాజం త్సప్తాత్యకూపారా స్త్వత్ప్రతాపాగ్నిశోషితాః, పున స్త్వదరినారీణాం బాష్పపూరేణ పూరితాః’ అను శ్లోకమందుబలె నత్యుక్త్యలంకారము.
చ. అతులితవైజయంతయుతి, ◊నంచితసాగరజాతదంతిసం
గతి, ఘనచక్రిసంభృతి, న◊ఖండితవైభవదేవనాయకా
యతిఁ, దనరారు నానృపబ◊లాళి యెసంగె ధరిత్రి జంగమ
స్థితిఁ జరియించులేఖపురి◊చెల్వునఁ జూపఱ కింపు నింపుచున్. 163
టీక: ఇందు సేనాపరమైన యర్థము, అమరావతీపరమైన యర్థములు గలుగుచున్నవి. అతులితవైజయంతయుతిన్ – అతులిత =సాటిలేని, వైజయంత=టెక్కెములయొక్క, యుతిన్ = సంబంధముచేత నని సేనాపరమైన యర్థము. అతులితమైన యింద్ర నగరుయొక్క సంబంధముచేత నని అమరావతీపరమైన యర్థము. ‘స్యా త్ప్రాసాదో వైజయన్తః’ అని యమరుఁడు; అంచిత సాగరజాత దంతి సంగతిన్ –అంచిత=ఒప్పుచున్న,సాగరజాత=దీవులయందుఁ బుట్టిన,దంతిసంగతిన్=గజసంబంధముచేత, అంచిత మైన సాగరజాతదంతి యనఁగా నైరావతము. దాని సంబంధముచేత నని యర్థాంతరము; ఘనచక్రిసంభృతిన్ – ఘన= గొప్పనైన, చక్రి=రథములయొక్క, సంభృతిన్=భరణముచేతనని సేనాపరమైన యర్థము. ఘనుఁడైన విష్ణువుయొక్క భరణము చేత నని యర్థాంతరము; అఖండితవైభవ దేవ నాయకాయతిన్ – అఖండిత వైభవ=అవిచ్ఛిన్నములైన వైభవములచేత, దేవ= ప్రకాశించుచున్న, ‘దివు క్రీడా వ్యవహార ద్యుతి స్తుతి మోదమద స్వప్న కాన్తి గతిషు’ అని యనుశాసనము, నాయక=రాజుల యొక్క, ఆయతిన్= సమృద్ధిచేత నని సేనాపరమైన యర్థము. అఖండితవైభవము గల సురశ్రేష్ఠుల సమృద్ధిచేత నని యర్థాంత రము; తనరారు = ఒప్పుచున్న; ఆనృపబలాళి = ఆసుచంద్రునియొక్క సేనాకదంబము; ధరిత్రిన్=భూమియందు; జంగమ స్థితిన్ = జంగమవృత్తిచేత; చరియించు=సంచరించుచున్న; లేఖపురిచెల్వునన్ =అమరపురియందమున; చూపఱకున్=అవ లోకించు జనమునకు; ఇంపు నింపుచున్=సుఖముఁజేయుచు; ఎసంగెన్=ఒప్పారెను. శ్లేషభిత్తికాభేదాధ్యవసాయముచేత వైజ యంతికాదిరూపముగా నధ్యవసానము చేయఁబడిన వైజయంతప్రాసాదము మొదలగు వానిచే సేనాకదంబము సురనగరముగా నగపడుచున్నదని తాత్పర్యము. ఉపమాలంకారభేదము.