శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము
ప్రథమాశ్వాసము
శా. శ్రీవక్షోజధరస్ఫురద్వర ముర◊స్సీమం బ్రకాశింప శం
పావృత్తిన్ సరసత్వ మొంది సుమనః◊పాళి ప్రియాత్మీయస
ద్భావస్ఫూర్తిఁ దనర్చు శ్రీమదనగో◊పాలాహ్వయోజ్జృంభితాం
భోవాహంబు సమస్తలోకముల కా◊మోదప్రదం బయ్యెడున్. 1
అవతారిక: శ్రీమదనవద్యవిద్యావిశారదులును, శ్రీమద్భాగ్యనగరదేశమధ్య విద్యోతమాన శ్రీజటప్రోలు సంస్థానాధిపతులును, శ్రీమత్సురభికుల కలశార్ణవ పూర్ణనిశానాథులును, నగు శ్రీమాధవరాయ ప్రభుపుంగవులు ‘శ్లో. కావ్యం యశ సేఽర్థకృతే వ్యవ హారవిదే శివేతరక్షతయే| సద్యః పరనిర్వృతయే కాన్తా సమ్మిత తయోపదేశయుజే’ ఇత్యాది కావ్యప్రకాశాద్యాలంకారికవచన ప్రామాణ్యంబునఁ గావ్యం బతుల శ్రేయస్సాధనం బనియు, ‘శ్లో.కావ్యాలాపాంశ్చ వర్జయేత్’ అను నిషేధశాస్త్రం బసత్కావ్య విషయం బనియు నెంచి, పుణ్యపురుషధౌరేయుం డగు సుచంద్రనరేంద్రుని చరితంబు నవలంబించి, చంద్రికాపరిణయం బను లోకోత్తరశృంగారరసాసేచకం బగు కావ్యరత్నంబు వినిర్మింప నుద్యమించి, తదవిఘ్నపరిసమాప్తి ప్రచారాది పరిపంథి ప్రత్యూహనివహప్రశమంబునకై, ‘శ్లో.ఆశీ ర్నమస్క్రియా వస్తునిర్దేశో వాపి తన్ముఖ’ మ్మనుటవలనఁ ద్రిరూపం బగు మంగళ ములలో శ్రీమదనగోపాలరూపస్వేష్టదేవతా పరమానుగ్రహాభ్యర్థనాత్మకం బైన యాశీరాత్మక మంగళమును శ్రీవక్షోజధరే త్యాది పద్యంబుచే నాచరించుచున్నారు. సమస్తలోకప్రమోదాభ్యర్థనంబుచేఁ దదంతర్గతస్వప్రమోదాభ్యర్థన మర్థసిద్ధం బగు నని యాశయము.
ఈ పద్యమందు మదనగోపాలాహ్వయోజ్జృంభితాంభోవాహంబు, అని భగవంతునియం దంభోవాహత్వ మారోపించి నందున యథాసంభవముగ నర్థద్వయము కల్గుచున్నది. ఏలా గనిన –
టీక: శ్రీవక్షోజధరస్ఫురద్వరము—శ్రీ = లక్ష్మీరూప యగు రుక్మిణీదేవియొక్క ‘శ్లో.రాఘవత్వేభవ త్సీతా, రుక్మిణీ కృష్ణ జన్మని, అన్యేషు చావతారేషు విష్ణో రేషానపాయినీ’యను వచనం బిందుఁ బ్రమాణంబు. వక్షోజధర= పర్వతములవలె నున్న తంబు లగు పాలిండ్లయందు, స్ఫురత్ = ప్రకాశించుచున్న; వరము = కుంకుమము ‘కాశ్మీరజన్మాగ్నిశిఖం వరమ్’ – అని యమరము; ఉరస్సీమన్ = వక్షస్థ్సలమందు; శంపావృత్తిన్ = మెఱపుయొక్క యునికివంటి యునికిచేత; ప్రకాశింపన్ = వెలుంగుచుండఁగా; సరసత్వము=రసికత్వము, మేఘపర మైనపుడు జలవత్త్వము. ‘ఆస్వాదనధ్వని సుధామ్బురసాఖ్యధాతు ష్విష్టో రసః’ –అని రత్నమాల; ఒంది = పొంది; సుమనః పాళి ప్రియ ఆత్మీయ సద్భావస్ఫూర్తిన్ – సుమనఃపాళి = దేవసంఘ మునకు, మేఘపరమైనపుడు జాజిగుమురులకు – ‘సుమనాః పుష్ప మాలత్యోః స్త్రియాం దేవే బుధే చ నా’ – యని నానార్థ రత్నమాల; ప్రియ = హితమగు; ఆత్మీయ = స్వీయమగు; సద్భావ = మంచి స్వభావముయొక్క, సత్తయొక్క – ‘భావ స్స్వభావే సత్తాయామ్’ – అని విశ్వము, స్ఫూర్తిన్ = స్ఫురణమును; తనర్చు = అతిశయింపఁజేయునట్టి; శ్రీమదనగోపాలా హ్వయ ఉజ్జృంభిత అంభోవాహంబు – శ్రీ = శోభాశాలి యగు, మదనగోపాలాహ్వయ = మదనగోపాలుం డను నామంబు గల, ఉజ్జృంభిత = ఉప్పొంగిన యట్టి, అంభోవాహంబు = మేఘము; సమస్తలోకములకున్ = ఎల్లజగంబులకు; ఆమోదప్రదంబు = సంతసమిచ్చునది; అయ్యెడున్ = అగుఁగాత.
మెఱపులతోఁ గూడి యుజ్జృంభితమైనయట్టి సజలజలదం బెట్లు సర్వలోకముల కామోదమును జేయునో, యట్లు రుక్మిణీకుచకుంభకుంకుమాంకితవక్షస్కుఁడై యనఁగా నవాప్తమనోరథుండై యుజ్జృంభితుఁడైన భగవంతుఁడు సమస్తలోకం బులకు సంతసంబుఁ జేయు నని తాత్పర్యము. ‘స్వయం తుష్టః పరాన్ తోషయతి’ – అను న్యాయంబున భగవంతుండు స్వాభీష్టరుక్మిణీపరిరంభతుష్టాంతరంగుఁడైన పిదప స్వాశ్రితసర్వలోకానందప్రదుం డగుట సులభ మని కవిహృదయము. లోకోత్తరశృంగారరసభూయిష్ఠం బగు నీ గ్రంథము నాదిని శృంగారరసాధిదేవత యైన శ్రీకృష్ణమూర్తి సంభోగశృంగారాలంబన విభావముగాఁ బ్రశంసింపఁబడియె.
ఇందు వ్యజ్యమానమగు సంభోగశృంగారంబు మదనగోపాలవిషయక కవిరతి యనెడు భావమునుగూర్చి యంగ మగుటం జేసి రసవదలంకారము. ‘శ్లో. అఙ్గభావం రసో యత్ర భావం ప్రత్యథవారసమ్| భజేత తత్ర రసవదలంకార ఉదీరితః’ – అని తల్లక్షణంబు. ఇట్లు కవీష్టదేవతావిషయకరతిభావంబును, ననుగ్రాహ్య సమస్తలోక విషయక కవిరతిభావమునుగూర్చి యంగ మగుటం బ్రేయోలంకారము. ‘శ్లో. ప్రేయోలఙ్కృతిరఙ్గంచే ద్భావో భావాన్తరం ప్రతి’ – అని తల్లక్షణంబు. భావ మనఁగా దేవతామునిపుత్త్రాది విషయకరతియు, వ్యజ్యమాన నిర్వేదాది త్రయస్త్రింశ దన్యతమంబును, దీనిం గూర్చి కావ్యప్రకాశమందు ‘శ్లో. రతిర్దేవాదివిషయా వ్యభిచారీ తథాఞ్జితః, భావః ప్రోక్తః’ – అని చెప్పఁబడినది.
ఇఁక భగవంతుని మేఘముగ రూపించినందున రూపకాలంకారము. అదియుఁ బరంపరిత మగును. పరంపరితరూపక మనఁగా రూపకాంతరమునకు హేతువగు రూపకంబు. ఇట భగవంతునియం దంభోవాహిత్వరూపణము సుమనఃపాళి యనెడు సుమనఃపాళీత్యాదిరూపకాంతర హేతువైనది గావునఁ బరంపరితం బయ్యె. ‘శ్లో. నియతారోపణోపాయ స్స్యాదా రోపః పరస్య యః, తత్పరంపరితం శ్లిష్టాశ్లిష్టభేదా ద్ద్విధా భవేత్’– అని కావ్యదర్పణమందుఁ దల్లక్షణము. మఱియు నారోపాంతర హేతుకా రోపవిషయ సుమన ఆదిపదములు శ్లిష్టంబు లగుటంజేసి శ్లిష్టపరంపరిత మనఁబడును. కొందఱు దీని నేకదేశవివర్తి రూపక భేద మండ్రు. మఱికొందఱు శ్లేషాలంకారమును బార్థక్యమునఁ జెప్పి శ్లేషసంకీర్ణరూపక మని వక్కాణింతురు. సుమన ఆదిశబ్దములు పర్యాయపరివృత్త్యసహములు గాన నిది శబ్దార్థోభయాలంకార మనియుఁ జెప్పుదురు. ఐన శ్లిష్టపరంపరితరూపక మనుటయే ముఖ్యము. దీనికి వక్షోజధర యనుచోటి యుపమతో సంసృష్టియు, శంపావృత్తిన్ అనుచోటి నిదర్శనతో సంకరము నని యెఱుంగునది.
వక్షోజధరస్ఫురద్వర మురస్సీమన్ అనుచో రేఫమునకుఁ బలుమా ఱావృత్తివలన వృత్త్యనుప్రాస మను శబ్దాలంకారము. ‘శ్లో.వర్ణసామ్య మనుప్రాస శ్చేకవృత్తిగతో ద్విధా| సోనేకస్య సకృత్పూర్వ ఏకస్యాప్యసకృత్పరః’ – అని కావ్యప్రకాశము నందుఁ దల్లక్షణము.
పద్యాదియందు భూదేవతాకంబగు మగణము ప్రయుక్తమగుటంజేసి గ్రంథకర్త్రధ్యేతృవ్యాఖ్యాతృ శ్రోతలకు శుభఫలంబు చేకూరును. ‘శ్లో. మో భూమి స్త్రిగురు శ్శ్రియం వితనుతే’ – అని తత్ప్రమాణము. రెండవదగు సగణంబు దుష్టఫలప్రదం బయ్యును ‘శ్లో. సర్వమూలంతు మగణం ప్రాప్య సర్వేగణాశ్శుభాః’– అను వచనమునుబట్టి మగణముతోఁ జేరుటవలన శుభ ఫలప్రదం బగును. ‘శ్లో. క్షం వినా క్రూర సంయుక్త స్సౌమ్య స్త్యాజ్యో విషాన్నవత్, శేషస్తు కషయో శ్శ్రేయాన్ శుచశ్రావణ యో రివ’ – అనుటవలన శ్రీశబ్దమందు శవర్ణము సౌమ్యమైనను గ్రూరంబగు రేఫంబుతోఁ జేరినందున దూష్యంబని తలంపరాదు. ఏలన, ‘శ్లో. దేవతావాచకా శ్శబ్దా యేచ భద్రాదివాచకాః, తే సర్వే నైవ నిన్ద్యాస్స్యు ర్లిపితో గణతోపి వా’ – అనుటవలన దేవతా వాచకం బగు శ్రీశబ్దమున కట్టిదోషంబు ప్రసరింపదు.
సీ. అశ్రాంతభువనవి◊ఖ్యాతసద్గోత్రుఁ డై, కనుపట్టు నేచాన◊కన్నతండ్రి
యలఘుకలాశాలి◊యై సత్ప్రభుత్వంబు,తో మించు నేయింతి ◊తోడఁబుట్టు
విబుధసంత్రాణప్ర◊వీణుఁ డై నిఖిలైక,నుతిఁ గాంచు నే మాన◊వతిధవుండు
రహి నాత్మసరసధ◊ర్మగుణపాళిస్ఫూర్తి, నలరించు నేకొమ్మ ◊యనుఁగుపట్టి
తే. యరయ సత్యాదికీర్తనీ◊యస్వవృత్తి, నెనయుఁ గల్యాణమూర్తి దా◊నేవధూటి
యట్టిసిరి రుక్మిణీరుచి◊రాభిధాన, చిరతరైశ్వర్యములు గృప◊సేయుఁగాత. 2
ఈపద్యగీతిలో సిరి రుక్మిణీరుచిరాభిధాన యనుచోట రుక్మిణీదేవియందు లక్ష్మీత్వము నారోపించుటం జేసి యర్థ ద్వయము దోఁచుచున్నది.
టీక: ఏచానకన్నతండ్రి = ఏ స్త్రీయొక్క కన్నతండ్రి – భీష్ముఁడును, సముద్రుఁడును; అశ్రాంత భువన విఖ్యాత సద్గోత్రుఁ డై – అశ్రాంత=ఎల్లప్పుడును ‘సతతానారతాశ్రాంత సంతతావిరతానిశమ్’ అని యమరము, భువన = లోకములయందు, విఖ్యాత = ప్రసిద్ధమగు, సద్గోత్రుఁ డై = మంచికులముగలవాఁడై – అని రుక్మిణీపర మగు నర్థము; అశ్రాంత = నాశము లేని; భువన = జల మందు; విఖ్యాత = ప్రసిద్ధమగు; సద్గోత్రుఁ డై = శ్రేష్ఠము లైన మైనాకాదిపర్వతములుగలవాఁడై యని లక్ష్మీపరమైన యర్థము, ‘జీవనం భువనం వనమ్’ – అని యమరము; కనుపట్టున్ = చూపట్టునో; ఏయింతి తోడఁబుట్టు = ఏ సతియొక్క సోదరుఁడు, రుక్మియు, చంద్రుఁడును; అలఘుకలాశాలి ఐ = అధికములగు విద్యల చేత, కాంతులచేత, నొప్పుచున్నవాఁడై; సత్ప్రభుత్వంబుతోన్ = మంచిదొరతనముతోడ, నక్షత్రరాజత్వముతోడ ‘సన్నక్షత్రే విద్యమానేభ్యర్హితే’ – అని విశ్వము; మించున్ = అతిశయించునో; ఏ మానవతిధవుండు = ఏ మానవతియొక్క పతి, కృష్ణుఁడును, నారాయణమూర్తియు; విబుధసంత్రాణప్రవీణుఁడై = పండితుల యొక్క, దేవతలయొక్క రక్షణమందు నిపుణుఁడై; నిఖిలైకనుతిఁ గాంచున్ = ఎల్లవారిలో ముఖ్యమౌనట్లుగా పొగడ్త లందునో, ‘ఏకే ముఖ్యాన్యకేవలాః’ అని యమరము; ఏకొమ్మ యనుఁగుపట్టి = ఏ స్త్రీయొక్క కూరిమిపుత్త్రుఁడు, ప్రద్యుమ్నుఁడును, మన్మథుఁడును; రహిన్ = ఆసక్తిచేత; ఆత్మ సరస ధర్మగుణ పాళి స్ఫూర్తిన్ – ఆత్మ = తనయొక్క,సరస = శ్రేష్ఠములగు,ధర్మగుణ = ధర్మగుణములయొక్క, పాళి = పంక్తులయొక్క, స్ఫూర్తిన్ = ప్రకాశమును; ఆత్మ = తనయొక్క, సరసధర్మ= మధురరసయుక్తమగు చెఱకువింటియొక్క, ‘ధర్మః పుణ్యే యమే న్యాయే స్వభావాచారయోః క్రతౌ| ఉపమాయా మహింసాయాం చాపే చాపనిషద్యపి’ అని విశ్వము; గుణప = అల్లెను పోషించుచున్న, అళిస్ఫూర్తిన్ = తుమ్మెదలయొక్క స్ఫురణమును, అలరించున్ = విస్తరింపఁజేయునో; అరయన్ = విచారింపఁగా; ఏ వధూటి = ఏకొమ్మ; సత్యాదికీర్తనీయస్వవృత్తిన్ – సత్యా = సత్యభామ, ఆది = మొదలగువారి చేత; సతీ = పార్వతీదేవి, ఆది = మొదలగువారిచేత; కీర్తనీయ = కొనియాడఁదగు; స్వవృత్తిన్ = తనదైన సద్వృత్తిని; ఎనయున్ = పొందియుండునో; తాన్ = తాను; కల్యాణమూర్తి = మంగళవిగ్రహము గలదో, సువర్ణరూపిణి యైనదో, ‘చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీమ్’ – అని శ్రుతి; రుక్మిణీరుచిరాభిధాన = రుక్మిణి యను మనోజ్ఞనామము గల; అట్టిసిరి = పూర్వోక్త గుణములు గల లక్ష్మీదేవి; ఇందు సిరియే రుక్మిణీనామము గలదనుటకు ‘ రాఘవత్వే భవత్సీతా’ –యను పూర్వోదాహృత వచనము ప్రమాణము; చిరతరైశ్వర్యములు = అత్యంతచిరకాలస్థాయులగు నైశ్వర్యములు, శాశ్వతైశ్వర్యము లనుట, స్థిరతర యను పాఠము సుకరము; కృపసేయుఁగాతన్ = దయసేయుఁగాత నని యాశీర్వచనము.
రూపకాలంకారభేదము. ఇందు రుక్మిణీదేవి విషయకకవిరతి యనెడు భావము వ్యజ్యమానమగుచున్నది గాన భావధ్వని యగును.
మ. పలుకుందొయ్యలిమోవితేనియలు శుం◊భత్ప్రీతిమైఁ గ్రోలి ముం
గలిమోముం బొలయల్కపేర మరలం ◊గావించి, పశ్చాత్తటో
జ్జ్వలవక్త్రంబున నాని తా నధికహ◊ర్షం బూని యిష్టార్థము
ల్దలకొన్ధాత యొసంగుఁ గాత శుభధీ◊లాభంబు మాకెంతయున్. 3
టీక: పలుకుందొయ్యలిమోవితేనియలు= సరస్వతియధరమధువులను; శుంభత్ప్రీతిమైన్ = అధికమైన ప్రేమచేత; క్రోలి = పానముఁ జేసి; పొలయల్కపేరన్ = ప్రణయమానముయొక్కసాకుచేత; ముంగలిమోమున్ = ఎదుట నున్న ముఖమును; మరలంగావించి = మరల్చి; పశ్చాత్తటోజ్జ్వలవక్త్రంబునన్ = వెనుక వెలయుచున్న మోముచేత; ఆని = పానము చేసి; తాన్, అధికహర్షంబు = అధికసంతోషమును; ఊని = వహించి; ఇష్టార్థముల్ = ఇష్టమైన యాలింగనాద్యర్థములను; తలకొన్ధాత = పొందునట్టి బ్రహ్మ; మాకున్; శుభధీలాభంబు = మంచిబుద్ధియొక్క లాభమును; ఎంతయున్ = మిక్కిలి; ఒసంగుఁ గాతన్ = ఇచ్చుఁగాక; ఇచటఁ దలకొన్ధాత యను చోట ‘పదాంతంబులగు ను లు రు ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగా నగు’ నను బాలవ్యాకరణసూత్రముచేఁ దలకొను అనుదాని కడపటి ఉకారమునకు లోపం బైనది.
ఈపద్యమందు వాణీవిధాతల లోకోత్తర సంభోగ శృంగారము వ్యక్తంబగుచున్నది. ‘శ్లో. అనుకూలౌ నిషేవేతే యత్రాన్యోన్యం విలాసినౌ| స్పర్శనాలిఙ్గనాదీని స సంభోగ ఇతీరితః’ – అని తల్లక్షణము. ఇట్టి శృంగారము విధాతృవిషయకకవిరతినిగూర్చి యంగభావమునొందినందున రసవదలంకార మగును. లక్షణము వ్రాయఁ బడియె.
సీ. రమణీయతరపదా◊ర్థప్రకాశనిదాన, భాస్వత్ప్రసాదసం◊పద వహించి
పటుసారసానంద◊ఘటకైకచాతుర్య, ఘనకృతాలంకార◊కలన మెఱసి
యనుకూలకాలకం◊ఠాకుంఠకలనాద, వలమానమంజుల◊ధ్వనుల నలరి
యతివేలకవిజాల◊కామోదనాపాద, కారణరసభావ◊గరిమనెనసి
తే. పరమయతియోగసంస్థాన◊పదమనోజ్ఞ
వైభవోన్నతిఁ దగు సర◊స్వతి మదీయ
మానసాస్థానమందిర◊మధ్యవీథి
నిండు కొలువుండుఁ గాత ని◊ష్ఖండలీల. 4
ఈపద్యము గీతియందు నదీభారతులను బోధించు సరస్వతీశబ్దము కర్తృపదముగాఁ జేసి యర్థద్వయము కల్పింపఁబడియె.
టీక: రమణీయతరపదార్థప్రకాశనిదానభాస్వత్ప్రసాదసంపదన్ – రమణీయతర = అత్యంతమనోహరములగు, పదార్థ = శబ్దార్థములయొక్క, ముక్తాదిద్రవ్యములయొక్క, ప్రకాశ = ప్రకాశమునకు, నిదాన = ఆదికారణమగు ‘నిదానం త్వాదికార ణమ్’ – అని యమరము, భాస్వత్ = ఒప్పుచున్న, ప్రసాద = ప్రసాదమనెడు కావ్యగుణముయొక్క, ‘యశ్చిత్తం హ్యశ్నుతే హ్నాయ శుష్కేన్ధనమివానలః| సప్రసాదో మత స్సర్వరససాధారణస్థితిః’ – అని సాహిత్యరత్నాకరము, నైర్మల్యముయొక్క ‘ప్రసాదస్తు ప్రసన్నతా’ అని యమరము, ‘గఙ్గారోధః పతనకలుషా గృహ్ణతీవ ప్రసాదమ్’ – అని నైర్మల్యమందు విక్రమోర్వ శీయమునఁ గాళిదాసప్రయోగము, సంపదన్ = సమృద్ధిని; వహించి = పొంది;
పటు సార సానందఘట కైక చాతుర్య ఘనకృ తాలంకార కలనన్ – పటు = సమర్థమగు, సారస = రసికసమూహమునకు, సరసశబ్దముమీఁద సమూహార్థమందణ్ప్రత్యయము, బెగ్గురులకు, ఆనందఘటక = ఆనందము గూర్చునట్టి, ఏక =ముఖ్య మగు, చాతుర్య = నేర్పుచేత, నదీపరమైన యర్థమందు నేర్పుగలయని చాతుర్యశబ్దాంతము బహువ్రీహి చేయవలెను, ఘన = అధికమగునట్లుగా, మేఘములచేత, కృత = చేయఁబడిన; అలంకార = ఉపమాదులయొక్క, ఒప్పిదములయొక్క; కలనన్ = ప్రాప్తిచేత; మెఱసి = విలసిల్లి; అనుకూల కాలకం ఠాకుంఠ కలనాద వలమాన మంజుల ధ్వనులన్ – అనుకూల = అనుకూలములగు, కూలానుసృతము లగు; కాలకంఠ = కలకంఠీసంఘముయొక్క, స్త్రీసమూహముయొక్క యనుట, నెమిళ్ళయొక్క, అకుంఠ = అడ్డము లేని, కలనాద = అవ్యక్తమధురశబ్దములభంగి, కలనాదములతోడను, వలమాన = ఒప్పుచున్న, కూడుకొన్న, మంజుల = మనో జ్ఞములగు, ధ్వనులన్ = వ్యంగ్యార్థములచేతను, తరంగధ్వనులచేతను; అలరి = ఒప్పి, ‘శ్లో. కాన్తా సమ్మితయా యయా సరసతా మాపాద్య కావ్యశ్రియా’ – అని ప్రతాపరుద్రీయమునందుఁ జెప్పుటవలనఁ గావ్యధ్వనులకుఁ గాలకంఠాకుంఠకలనాద వలమానత్వము గలుగునని భావము; అతివేల కవిజాల కామోద నాపాద కారణ రసభావ గరిమన్—అతివేల = అధికమగు, కవిజాలక = పండితమండలియొక్క; క= జలమందుండెడు, వి = పక్షులయొక్క, జాలక = సమూహముయొక్క; ఆమోదన = సంతసముయొక్క, ఆపాద = సంపాదనమునకు, కారణ = హేతువైన, రస = శృంగారాదిరసరూపకములగు, భావ = రత్యాదిస్థాయిభావములయొక్క, ‘శ్లో. విభావై రనుభావై శ్చ సాత్త్వికై ర్వ్యభిచారిభిః| ఆనీయమాన స్స్వాదుత్వం స్థాయీభావో రసస్స్మృతః’ – అని స్థాయి భావమే రసరూప మగునని చెప్పఁబడినది గాన రసరూపము లగు రత్యాదిస్థాయిభావములయొక్క యని వ్యాఖ్యాతం బయ్యె, కాదేని, శృంగారాదిరసములయొక్క వ్యజ్యమాన నిర్వేదాది సంచారభావములయొక్క, నదీపరమగు నపుడు – రసభావ = జలసత్తయొక్క ‘భావ స్స్వభావే సత్తాయామ్’ – అని విశ్వము, గరిమన్ = అతిశయమును; ఎనసి = పొంది; పరమ యతి యోగ సంస్థాన పద మనోజ్ఞ వైభవోన్నతిన్ – పరమ = ఉత్కృష్టమగు, యతి = పదవిచ్ఛేదముయొక్క, ‘యతి ర్విచ్ఛేదసంజ్ఞకః’ అని వృత్తరత్నాకరము, మునులయొక్క, యోగ = సంబంధముయొక్క, ధ్యానమునకు, సంస్థాన = సన్ని వేశము గల ఆశ్రయములగు, పద = పద్యచతుర్థభాగములయొక్క,ఆశ్రమస్థానములయొక్క, మనోజ్ఞ = మనోహరమగు; వైభవోన్నతిన్ = విభవాతిశయముచేత; తగు సరస్వతి = ఒప్పుచున్న వాగ్దేవి, ఒక నది; మదీయమానసాస్థాన మందిరమధ్య వీథిన్ – మదీయ=నా సంబంధియైన, మానస = హృదయ మనెడు, ఆస్థానమందిర = సభామందిరముయొక్క, మధ్యవీథిన్= మధ్యప్రదేశమందు; నిష్ఖండలీలన్ = అఖండవిలాసముచేత; నిండుకొలువుండుఁ గాతన్ = నిండుకొలువునొందుఁ గాత.
ఇందు శబ్దశక్తి ప్రకృతార్థమందు ప్రకరణాదినియంత్రితమైనందున నప్రకృతనదీపరమైన యర్థము వ్యంగ్యమని ప్రాచీనులు. అర్థద్వయము వాచ్యమె కావచ్చుఁగావున శ్లేషాలంకారమని కొందఱు నవీనులు చెప్పుచున్నారు. మతద్వయమునందు నుప మాలంకారము వ్యంగ్యము. మఱియు సరస్వతీదేవివిషయకకవిరతి ధ్వనిత మగుచున్నది గాన భావధ్వని.
చ. పలుచఁదనంబు పూని జడ◊భావము నందినవారి మౌళిపై
నిలిపి స్వవిగ్రహైకగతి ◊నిచ్చలు నార్య మహాగుణోన్నతం
గలయఁగఁ జేసి ధూర్తకశి◊ఖామణి వై తని గౌరి యల్గఁగా
నలఘుమృదూక్తి వేఁడు శివుఁ◊డాయతసౌఖ్యము మాకు నిచ్చుతన్. 5
టీక: పలుచఁదనంబు = లఘుత్వమును; పూని = వహించి; జడభావమును = మూర్ఖతను; ఒందినవారిన్ = పొందినట్టివారిని; మౌళిపై నిలిపి = నెత్తిమీఁద నెక్కించుకొని; స్వవిగ్రహైకగతిన్ – స్వ = తనయొక్క, విగ్రహ = విరోధముయొక్క,ఏకగతిన్ = ముఖ్యప్రాప్తిచేత, దీనికిఁ గలయఁగఁజేసి యను క్రియయం దన్వయము; మహాగుణోన్నతన్ = ఉత్కృష్టములగు సౌశీల్యాది గుణములచే నధిక యగు; ఆర్యన్ = యోగ్యురాలైన నన్ను; కలయఁగఁజేసి = కలత పొందునట్లొనరించి; ధూర్తక శిఖామణి వైతి = మోసకాండ్రయందు మొదటివాఁడ వైతివి; అనఁగా శివుఁడు పలుచఁదనంబు పూని జడభావము నందిన వారి ననఁగా చిక్కనిది గాకుండి, జలరూపము నందియున్నయుదకప్రవాహరూపయైన గంగను శిరస్సునందు ధరించినాఁడనియు, మహా గుణోన్నతయు, నార్యయు నగు పార్వతిని తన శరీరమునం దేకీభావము నొందించినవాఁ డనియు, ధూర్తక మనఁగా దుత్తూర కుసుమము, దానిని శిరోభూషణమున నుంచినాఁ డనియు భావము. వెండియుఁ బలుచఁదనంబు పూని జడభావము నందినవారి లోనగువానిచేత గండస్తనాద్యవయవశైథిల్యము గల్గి జాడ్యము నొందిన ముదుసలిదానిని శిరమునందు నిల్పి, ఉత్తమగుణములు గలదై వెలయు నార్య ననఁగా పదునాఱువర్షములు గల భార్యయం దుదాసీనుఁడవై సర్వకాలముఁ దగవుల పాలై ధూర్తాగ్రేసరుం డని యనిపించుకొన్నాఁడ వని వ్యజ్యమాన మగుచున్నది. అని గౌరి యల్గఁగాన్ = అట్లు గౌరి కోపము వహింపఁగా; అలఘు మృదూక్తి న్ = అధికమై మృదువైన వాక్కుచేత, జాత్యేకవచనము; వేఁడు శివుఁడు = ప్రార్థించు శంభుఁడు; మాకున్; ఆయత సౌఖ్యము = అధికమైన సుఖమును; ఇచ్చుతన్ = ఇచ్చుఁ గాత.
నాయిక యీర్ష్యాకషాయిత యైనపుడు నాయకుండు యథోచితముగ మానతారతమ్యమును గనిపెట్టి యాచరించు నత్యాద్యనునయప్రకారము అలంకారశాస్త్రములలో ‘ హేతుజస్తు శమం యాతి యథాయోగ్య ప్రకల్పితైః| సామ్నా భేదేన దానేన నత్యుపేక్షా రసాన్తరైః’ ఇత్యాదిగాఁ జెప్పఁబడినది. ఇచట సామోపాయము ప్రయోగింపఁబడియె. ఇందు వ్యజ్యమాన మగు విప్రలంభశృంగారము శివవిషయకకవిరతి యను భావముఁ గూర్చి యంగమగుఁ గావున రసవదలంకారము.
చ. హిమధరణీధరాగ్రణికి ◊నెమ్మె చిగుర్ప జనించి స్థాణుసం
గమరతిఁ బొల్చి పత్త్రకని◊కాయవిభూషితయై శ్రుతీష్టవా
క్క్రమశుకముఖ్యసద్ద్విజవి◊రాజిత యయ్యు నపర్ణ నాఁగ ని
స్సమత రహించు కల్పలత ◊సాంద్రఫలంబులు మాకు నిచ్చుతన్. 6
ఇందుఁ బార్వతీదేవియందుఁ గల్పలతాత్వము నారోపించి యర్థద్వయంబు చెప్పఁబడుచున్నది.
టీక: హిమధరణీధరాగ్రణికిన్ = హిమగిరిశ్రేష్ఠమునకు; ఎమ్మె = విలాసము; చిగుర్పన్ = అంకురించునట్లుగా; జనించి = పుట్టి, పల్లవించునట్లు జన్మించి యని కల్పలతాపరమైన యర్థము; స్థాణుసంగమరతిన్ – స్థాణు = శివునియొక్క, ఆధార స్తంభముయొక్క, సంగమరతిన్ = సంగమాభిలాషచేత; పొల్చి = ఒప్పి; పత్త్రక నికాయ విభూషితయై – పత్త్రక = మకరికా పత్త్రములయొక్క, ఆకులయొక్క; నికాయ = సమూహముచేత; విభూషితయై = అలంకృతయై; శ్రుతీష్టవాక్క్రమశుక ముఖ్యసద్ద్విజ విరాజిత అయ్యున్ – శ్రుతి = వేదములకు, వీనులకు, ఇష్ట = హితమగు, వాక్క్రమ = వాక్కులయొక్క రీతి గల, శుకముఖ్య = శుకాచార్యుఁడు మొదలుగాఁ గల, చిలుక మొదలుగాఁ గల, సద్ద్విజ = మంచి విప్రులచేత, శ్రేష్ఠము లైన పక్షులచేత, విరాజిత అయ్యున్ = మిక్కిలి రాజిల్లుచున్నదయ్యును; అపర్ణ = పార్వతి యని, అపర్ణ యని పార్వతికి నామాంతరము, ఆకులు లేనిది; నాఁగన్ = అనఁగా; నిస్సమతన్ = సాటి లేనట్టుగా; రహించు కల్పలత = ఒప్పుచుండెడు కల్పవల్లి; సాంద్ర ఫలంబులు = పూర్ణములైన లాభములను, పండ్లను; మాకున్; ఇచ్చుతన్ = ఇచ్చుఁగాత.
పార్వతీదేవి అఖిలేష్టప్రదాయిని యనియు, గిరియందు జనించుట, స్థాణుసంగమరతిఁ బొల్చుట, పత్త్రనికాయభూషిత యగుట, శుఖముఖద్విజరాజిత యగుట మొదలగు కల్పలతాధర్మములు గల దనియు, అందువలనఁ గల్పలతారూపముగ నధ్యవసిత యయ్యె ననియు నెఱుంగునది. ఇందు విరోధాభాసరూపకములు. ‘శ్లో.ఆభాసత్వే విరోధస్య విరోధాభాస ఇష్యతే’ అనియు, ‘విషయ్యభేదతాద్రూప్యరఞ్జనం విషయస్య యత్ రూపకం తత్’ అనియుఁ దల్లక్షణములు. గౌరీవిషయక కవిరతి వ్యంజితమవుటం జేసి భావధ్వని.
శా. శ్రీగౌరీకుచహైమకుంభకలిత◊క్షీరంబులం గ్రోలి త
ద్భాగాసక్తనిజాననం బపుడు తా ◊భావించి ప్రత్యాపత
న్నాగభ్రాంతిని దూఁటఁగా జనని తా ◊నవ్యానురక్తిన్ నగన్
ద్రాగానందముఁ జెందు నగ్గణపతిన్ ◊బ్రార్థింతు వాక్సిద్ధికిన్. 7
టీక: శ్రీగౌరీకుచహైమకుంభకలితక్షీరంబులన్ – శ్రీ = శోభాసంపన్నురాలైన, గౌరీ = పార్వతీదేవియొక్క,కుచహైమకుంభ = సువర్ణకలశములవలె నుండు స్తనములయందు, కలిత= ఒప్పుచున్న, క్షీరంబులన్= పాలను; క్రోలి = పానము చేసి; తద్భాగా సక్తనిజాననంబు – తద్భాగ = ఆ స్తనప్రదేశమునందు, ఆసక్త = మిక్కిలి సంబంధించినట్టి, ప్రతిబింబించినట్టి యనుట, నిజాన నంబు = తన మోమును; అపుడు = ఆ సమయమునందు; తాన్ = తాను; భావించి = చూచి యనుట; ప్రత్యాపతన్నాగభ్రాంతిన్ = ఎదురించి వచ్చుచుండు నేనుంగను భ్రమముచేత; దూఁటఁగాన్=పొడువఁగా; జనని = తల్లి యగు పార్వతీదేవి; తాన్; నవ్యానురక్తిన్ = తత్కాలోదితమగు ప్రేమచేత; నగన్ = నవ్వఁగా; ద్రాగానందమున్ = శీఘ్రముగా సంతసించుటను; చెందు నగ్గణపతిన్ = పొందునట్టి ప్రసిద్ధుడైన వినాయకుని; వాక్సిద్ధికిన్ = వాక్కు లభించుటకు; ప్రార్థింతున్ = యాచింతును.
యాచించువాఁడు కేలు మోడ్చి, వినయవంతుఁడై వర్తించుట ప్రసిద్ధమైనందునను, స్వావధికోర్ష ప్రకారక జ్ఞానానుకూల కర పుటసంవలనాదిరూపవ్యాపారమే నమశ్శబ్దార్థ మైనందునను, ‘భారతీకవే ర్జయతి’ యనుచోఁ గావ్యప్రకాశములోఁ జెప్పిన విధంబుగ నిందు నమస్కారము వ్యంగ్యము గాన నిది నమస్క్రియారూప మగు మంగళ మని యెఱుంగునది. నాగభ్రాంతిని దూఁటఁగా ననుచో భ్రాన్తిమదలంకారము. గణపతివిషయకకవిరతిరూపభావము వ్యజ్యమానమగుటవలన భావధ్వని.
సీ. వనరాశిభంగంబు ◊గనఁజేసె నెవ్వాఁడు, కరముచేఁ బర్వతో ◊త్కరముచేత
ఘనవలాహకశక్తిఁ ◊గలఁగించె నెవ్వాఁడు, రుతముచే వేగమా◊రుతముచేత
నరిపురవిస్ఫూర్తిఁ ◊బరిమార్చె నెవ్వాఁడు, హేతిచే నిజనఖ◊హేతిచేత
తతమహామిత్త్రవ◊ర్ధన మూన్చె నెవ్వాఁడు, క్షణముచే మధురవీ◊క్షణముచేత
గీ. నవని నెవ్వాఁడు జానకీ◊స్వాత్మసూచ
నాంజనాత్మజవిఖ్యాతి ◊నధిగమించె
నతని మామకకృతిచమ◊త్కృతికిఁ దలఁతు
మహితధీమంతు హనుమంతు ◊మానవంతు. 8
టీక: వనరాశిన్ = ఉద్యానవనసమూహమును, అశోకవనము ననుట, సముద్రమును అని యర్థాంతరము; భంగంబు = నాశ మును, తరంగమును, జాత్యేకవచనము; ఎవ్వాఁడు; కరముచేన్ = హస్తముచేతను; పర్వతోత్కరముచేత = కొండలయొక్క గుంపుచేతను; కనన్ = పొందునట్లుగా; చేసెన్ = ఒనరించెనో; అశోకవనమును హస్తముచేఁ గూల్చెను, సముద్రమును సేతు బంధనసమయమున పర్వతములచేత తరఁగలుగలదానిగాఁ జేసె నని క్రమముగ నన్వయము. ఇట్లు తక్కిన వాక్యములందును జూడవలయు. ‘వనం కానన నీరయోః’ – అని రత్నమాల; ఎవ్వాఁడు =ఎవఁడు; ఘనవలాహకశక్తిన్ – ఘన = గొప్పలయిన, వలాహక = పర్వతములయొక్కయు, మేఘముల యొక్కయు, ‘గిరి మేఘౌ వలాహకౌ’ – అని రత్నమాల, శక్తిన్ = సామర్థ్యమును; రుతముచేన్ = సింహనాదముచేతను, వేగమారుతముచేతన్ = వేగమువలనఁ బుట్టిన చండమారుతముచేతను; కలఁగించెన్ = కలఁతపఱచెనో; అరిపుర = శత్రుపురి యగు లంకయొక్కయు, శత్రుశరీరములయొక్కయు, ‘గేహే దేహే చ నగరే పురం పాటలిపుత్రకే’ – అని శబ్దస్తోమమహానిధి; విస్ఫూర్తిన్ = ప్రకాశమును; ఎవ్వాఁడు =ఎవఁడు; హేతిచేన్ = అగ్నిజ్వాలచేతను, ‘ హేతిర్జ్వాలాయుధాం శుషు’ – అని రత్నమాల; నిజనఖహేతిచేత = తన ఖడ్గమువంటి నఖముచేతను, జాత్యేకవచనము; పరిమార్చెన్ = ఖండించెనో; తత మహామిత్త్ర వర్ధనము – తత = విస్తృతమైనట్టి; మహత్ = అధికమగు, అమిత్త్ర = శత్రువులయొక్కయు, మిత్త్ర=ఆప్తుల యొక్కయు, వర్ధనము = ఛేదనము, అభివృద్ధిని, ‘వర్ధనం ఛేదనేపి స్యాత్’ – అని యమరము; క్షణముచేన్ = అల్పకాలము చేతను; మధురవీక్షణముచేతన్ = ప్రసన్నమగు చూపుచేతను; ఊన్చెన్ = కలుగఁజేసెనో;
అవనిన్ = భూమియందు; ఎవ్వాఁడు =ఎవఁడు; జానకీస్వాత్మసూచనాంజనాత్మజవిఖ్యాతిన్ – జానకీ= సీతాదేవి యనెడు, స్వ = ధనముయొక్క, ఆత్మ= రూపముయొక్క, సూచన = సూచించుటయందు, అంజనాత్మజ = అంజనముయొక్క కొడు కనెడు, చిన్న అంజన మనుట, విఖ్యాతిన్= ప్రసిద్ధిని, సీత యనెడు నిక్షేపధనముఁ దెలుపుటయందు చిన్న అంజన మను ప్రసిద్ధి ననుట, అంజనాపుత్త్రుడను ప్రసిద్ధినని భావము; అధిగమించెన్ = పొందెనో; అతనిన్ = అట్టివానిని; మహితధీమంతున్ = పూజ్యమగు బుద్ధిగలవానిని; మానవంతున్ = అభిమానశాలి యగువానిని; హను మంతున్ = ఆంజనేయుని; మామకకృతిచమత్కృతికిన్ = నా గ్రంథముయొక్క నేర్పునకై; తలఁతున్ = స్మరించెదను. ఆ మహానుభావుని యనుగ్రహమువలన మత్కృతి చమత్కృతి నొందుఁగాత మని భావము గాన నిది యాశీరూపమంగళముగా నెఱుంగునది.
ఈ పద్యమందు వనరాశిభంగం బిత్యాదిపూర్వవాక్యములయందు రెండర్థములు ప్రకృతంబులే కాన ప్రాచీననవీన మతములయందు శ్లేషాలంకారమె కాని యొకయర్థము వాచ్యము మఱియొకటి వ్యంగ్యమను మతభేదము లేదు. ‘నానార్థ సంశ్రయశ్ల్శేషో వర్ణ్యావర్ణ్యోభయాశ్రితః’ – అని లక్షణము. ఇఁకఁ గరముచేఁ బర్వతోత్కరముచేత నిత్యాద్యుత్తరార్థముల యందు కరముచే నిత్యాదుల కావృత్తి కలిగినందున యమకాలంకారము. ‘అనర్థకా వా భిన్నార్థా స్సార్థకానర్థకాశ్చ వా, ఆవర్త్యన్తే క్రమాద్వర్ణా యదా స్యా ద్యమకం తదా’ – అని కావ్యదర్పణమందుఁ దల్లక్షణము. భావధ్వనియుఁ బైపద్యముల యందుంబలె నూహ్యంబు. పూర్వవాక్యార్థములకు, నుత్తర వాక్యార్థములకుఁ గ్రమాన్వయంబుకలిమిం గ్రమాలంకారము.
సీ. సర్వతోముఖచర◊త్సారద్విజాలంబ, వాచానిరూఢిచే ◊వఱలె నెవ్వఁ
డతిపరాశరముదా◊హతిభారతోజ్జ్వల, ప్రక్రియావిస్ఫూర్తిఁ ◊బరఁగె నెవ్వఁ
డభిరూపచక్రచి◊త్తార్హార్థగౌరవ, ప్రతిపాదనప్రౌఢిఁ ◊బ్రబలె నెవ్వఁ
డవిగతఘనరస◊వ్యాయతహృదయంగ, మేరామహోన్నతి ◊నెసఁగె నెవ్వఁ
తే. డతులితాత్మైక్యభావనా◊యత్తవాణి
కావిహృతి మించె నెవ్వఁడా ◊ఘనునిఁ బ్రథమ
కవిని గృష్ణునిఁ బ్రథితభా◊రవి మయూర
కవిని గాలిదాసు నుతింతుఁ ◊గౌతుకమున. 9
ఈ పద్యమందుఁ గవి వాల్మీకి మొదలగు నాదికవులను బ్రహ్మదేవాదివిషయకమైన యర్థాంతరము గలుగునట్లు వర్ణించుచు గీతిలోఁ గ్రమము వచియించెను.
టీక: ఎవ్వఁడు = ఏ మహాపురుషుఁడు; సర్వతోముఖ చర త్సార ద్విజాలంబ వాచా నిరూఢిచేన్ – సర్వతోముఖ = జలము నందు, చరత్ = సంచరించుచున్న, సార = శ్రేష్ఠమైన,ద్విజ = క్రౌంచపక్షులు, ఆలంబ = అవలంబముగాఁ గల, వాచా=వాక్కు యొక్క, ‘శ్లో. మా నిషాద ప్రతిష్ఠాంత్వ మగమ శ్శాశ్వతీ స్సమాః| యత్క్రౌఞ్చమిథునా దేక మవధీః కామమోహితమ్’ ఇత్యేతచ్ల్ఛోకరూపమగు ఛందోమయవాణియొక్క యని భావము, నిరూఢిచేన్=ప్రసిద్ధిచేత నని వాల్మీకి పరమైన యర్థము. అంతటను ముఖములయందుఁ జరించుచున్నట్టివై శ్రేష్ఠవిప్రు లాధారముగాఁ గలవైయున్న వేదరూపములైన వాక్కులప్రసిద్ధిచేత నని బ్రహ్మపరమైన యర్థము; వఱలెన్ = ఒప్పెనో; ఎవ్వఁడు = ఏ మహానుభావుఁడు; అతి పరాశర ముదాహతి భారతోజ్జ్వల ప్రక్రియా విస్ఫూర్తిన్ – అతి = అధిక మైన, పరాశర= పరాశరమునియొక్క, ముదా = సంతసముయొక్క, అహతి = అవిచ్ఛేదముయొక్కయు, పోషణముయొక్కయు ననుట, భారత=భారతముయొక్క, ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, ప్రక్రియా = ప్రకృష్టకరణముయొక్కయు, విస్ఫూర్తిన్ = అతిశయము చేత నని వ్యాసపరమైన యర్థము. అతి = అధిక మైన, పర = శత్రువులగు,ఆశర = రక్కసులయొక్క, ముత్ = సంతోషము యొక్క, ఆహతి = భంగమందలి, భా = సామర్థ్యమందు ‘భాః ప్రభావే చ తేజసి’ అని విశ్వము, రత = ఆసక్తమైన, ఉజ్జ్వలత్ = ప్రకాశించుచున్న, ప్రక్రియా = యుద్ధాది ప్రక్రియలయొక్క, విస్ఫూర్తిన్ = అతిశయముచేత నని విష్ణుమూర్తిపరమైన యర్థము. ముదాశబ్దము వాచా శబ్దమువలె ‘శ్లో. వష్టి భాగురి రల్లోప మవాప్యో రుపసర్గయోః, ఆపం చైవ హలన్తానాం యథా వాచా నిశా దిశా’ యను వచనమునుబట్టి యాకారాంతము; పరఁగెన్ = ఒప్పెనో;
ఎవ్వఁడు = ఏ ఘనుఁడు; అభిరూప చక్ర చిత్తార్హార్థ గౌరవ ప్రతిపాదన ప్రౌఢిన్ – అభిరూప = విద్వాంసులయొక్క, ‘ప్రాప్తరూప సురూపాభిరూపా బుధ మనోజ్ఞయోః’ – అని యమరము, చక్ర = సమూహముయొక్క, చిత్త = హృదయములకు, అర్హ = తగి నట్టి, అర్థ = అభిధేయముయొక్క, గౌరవ = గురుత్వముయొక్క, ‘భారవే రర్థగౌరవమ్’ అని ప్రసిద్ధము, ప్రతిపాదన= చెప్పుట యొక్క, ప్రౌఢిన్ = నేర్పుచేత నని భారవికవిపరమైన యర్థము; అభిరూప = మనోజ్ఞములగు, చక్ర = జక్కవలయొక్క, చిత్తా ర్హార్థ గౌరవ = చిత్తములకు యోగ్యమగు సంఘటనరూప ప్రయోజనాతిశయముయొక్క, ప్రతిపాదన = దానముయొక్క, ‘విశ్రాణనం వితరణం స్పర్శనం ప్రతిపాదనమ్’ అని యమరము, ప్రౌఢిన్ = నేర్పుచేత నని సూర్యపరమైన యర్థము; ప్రబలెన్ = అతిశయిల్లెనో; ఎవ్వఁడు = ఏ మహాత్ముఁడు; అవి గత ఘన రస వ్యాయత హృదయంగ మేరా మహోన్నతిన్ – అవి = సూర్యుని, గత = పొందినట్టి, ఘన = దట్టమైన, రస = శృంగారాదిరసములచేత, కాదేని , అధికరక్తిచేత, వ్యాయత = మిక్కిలి యధికమైనట్టియు, హృదయంగమ = మనోహరమైనట్టి, ఇరా = సూర్యశతకమని ప్రసిద్ధమగు గ్రంథరూపమైన వాక్కుయొక్క, మహోన్నతిన్= మిక్కిలి యతిశయముచేత నని మయూరకవిపరమైన యర్థము; అవిగత = పోవని, కాదేని,అవి= పర్వతములను, ‘అవయ శ్శైలమేషార్కాః’అని యమరము, గత = పొందిన, ఘన = మేఘములయందు, రస =ఆసక్తిచేత, ‘రసోగన్ధరసేస్వాదే’ అని విశ్వము, వ్యాయత = అధికమును, హృదయంగమ = మనోహరమునగు, ఇరా = కేకాధ్వనియొక్క, మహోన్నతిన్ = మిక్కిలి యతిశయముచేత నని నెమ్మి పరమైన యర్థము; ఎసఁగెన్ = అతిశయించెనో;
ఎవ్వఁడు = ఏ యుత్తముండు; అతులి తాత్మైక్యభావనాయత్త వాణికా విహృతిన్ – అతులిత = నిస్సమాన మగు, ఆత్మ = తన తోడి, ఐక్యభావనా = అభేదభావనయందు, ఆయత్త = వశంవదయైన, వాణికా = వాగ్దేవియొక్క; విహృతిన్= విహారముచేత నని కాళిదాసపరమైన యర్థము. సరస్వతి కాళిదాసుఁడు నేనే యనె ననుట ప్రసిద్ధము; అతులిత = నిస్సమానమైన,ఆత్మైక్య భావనా = బ్రహ్మైక్యానుసంధానమందు, ఆయత్త వాణికా =ఆయత్తములైన వేదాంతవాక్యములయొక్క,విహృతిన్=విహారము చేత నని యాత్మజ్ఞాని పరమైన యర్థము; మించెన్ = అతిశయించెనో; ఆఘనులన్ = ఆ శ్రేష్ఠులను; ప్రథమకవిని = వాల్మీకిని, బ్రహ్మనని యర్థాంతరము; కృష్ణునిన్ = వ్యాసుని, కృష్ణమూర్తిని, ‘కృష్ణ స్స్యాత్కేశవే వ్యాసే’ అని విశ్వము; ప్రథితభారవిని = ప్రసిద్ధుఁడగు భారవికవిని; ప్రథిత = ప్రసిద్ధమగు, భా= తేజముతోఁగూడిన, రవిని = సూర్యుని; మయూరకవిని =మయూరుఁడను కవిని, మయూరక = నెమ్మియను, విని = పక్షిని; కాలిదాసునిన్= కాళి దాసుఁడను మహాకవిని, క = మనస్సు నందు, అలి =సమర్థుఁడైన, దాసునిన్ =ఆత్మజ్ఞుని, జితేంద్రియుండగు నాత్మజ్ఞాని ననుట; కౌతుకమునన్ = సంతోషముచేత; నుతింతున్ = ప్రశంసింతును;
ఇందుఁ బ్రకృతవాల్మీకివ్యాసాదిపరమగు నర్థము వాచ్యమనియు, నప్రకృతబ్రహ్మాదిపరమైన యర్థము వ్యంగ్య మనియుఁ గావ్యప్రకాశాదిమతము, ప్రకృతాప్రకృతార్థములు రెండును వాచ్యములుగఁ జెప్పి శ్లేషాలంకార మని చెప్పువారు నవీనులలోఁ గొందఱు. ఉపమాలంకారధ్వని.
ఉ. భారతనామకామృత మ◊భంగురసద్ధ్వనియుక్తి మించ వి
స్ఫారకవిప్రతానముద◊సాంద్రతఁ దాల్పఁగ నాంధ్రవాఙ్మహా
ధార ధరాతలంబున ను◊దారతఁ దాల్చు రసాధరాంచితా
కారవిధారులం ఘనులఁ ◊గాంతవచస్థ్సితికై నుతించెదన్. 10
టీక: భారతనామకామృతము = భారతమను పేరుగల సుధ; అభంగురసద్ధ్వనియుక్తిన్ – అభంగుర = అవిచ్ఛిన్నమైన, సత్ = శ్రేష్ఠమైన, ధ్వని = వ్యంగ్యములయొక్క, గర్జలయొక్క, యుక్తిన్ = సంబంధముచేత; మించన్ = అతిశయింపఁగా; విస్ఫార కవిప్రతానముదసాంద్రతన్ – విస్ఫార = అధికమగు, కవిప్రతాన = కవిసమూహముయొక్క,జలపక్షులగుంపుయొక్క, ముద = హర్షము, సాంద్రతన్ = ఘనతను; తాల్పఁగన్ = వహింపఁగా; ఆంధ్రవాఙ్మహాధారన్ = ఆంధ్రవాక్కనెడు గొప్ప ధారచేత; ధరాతలంబునన్ = భూతలమందు; ఉదారతన్ = గొప్పఁదనమును, దాతృత్వమును, ‘ఉదారోదాతృమహతోః’ అని అమ రము; తాల్చు రసాధరాంచి తాకార విధారులన్ – తాల్చు = వహించునట్టి, రసాధర = రాజులచేత, పర్వతములయందు; అంచిత = పూజింపఁబడిన, ఒప్పినట్టి, ఆకార = ఆకృతులను, విధారులన్ = మిక్కిలి ధరించినవారిని, ఇటఁ గర్మార్థమం దణ్ ప్రత్యయము; ఘనులన్ = గొప్పవారిని, కవిత్రయము ననుట, మేఘముల నని యర్థాంతరము; కాంతవచస్థ్సితికై = మనోజ్ఞవా క్సిద్ధికై; నుతించెదన్ = ప్రశంసించెదను.
ఈ పద్యమందు రూపకాలంకారభేదము. ‘రూపకం పూర్వసంసిద్ధం శ్లేష ముత్థాపయేద్యది, తదా రూపకమేవ స్యా దన్యధా శ్లేష ఇష్యతే’ అను నాలంకారసర్వస్వవ్యాఖ్యాకృదుదాహృతవచనం బిందుఁ బ్రమాణము. నన్నయభట్టును, ఎఱ్ఱా ప్రగడయుఁ, దిక్కనసోమయాజియు నమృతస్వరూపమై లోకోత్తరధ్వనులతోఁ గూడి విద్వాంసుల నానందింపఁజేయు నాంధ్ర భారతమును భూతలమం దపూర్వముగ రచించి రాజపూజ్యత నొందినవారు గాన,యట్టి ఘనుల నుతిచే నాకవితయు ఘనత గాంచునని వారల నుతింతు నని భావము.
చ. లలితరసోపబృంహణము◊లం గనఁబో దరసజ్ఞవృత్తిచే
మెలఁగి పదార్థకత్రయవి◊మేళన మెంచదు కాణరీతిచేఁ
జెలఁగి ప్రసాద మెన్నఁడును ◊జేకొన దంచితదోషరూఢిచే
వెలసినయట్టి దుష్కవిక◊విత్వము నెంతురె ధీరపుంగవుల్?
ఇందుఁ గుకవుల కవిత్వస్వరూపము దుష్పక్షి యగు జలకాకము విషయమై యర్థాంతరము దోఁచునట్లు చెప్పఁబడుచున్నది.
టీక: అరసజ్ఞవృత్తిచేన్ = అరసికుని వృత్తివంటి వృత్తిచేతను, నాలుక లేనివాని వృత్తివంటి వృత్తిచేత నని యర్థాంతరము; మెలఁగి; లలితరసోపబృంహణములన్ – లలిత = మనోజ్ఞములైన, రస = శృంగారాదిరసములయొక్క, మధురాదిరసములయొక్క యని యర్థాంతరము, ఉపబృంహణములన్=అతిశయములను; కనఁబోదు = తెలియఁబోదు, కుత్సితజలపక్షి నాలుక యుండి నను లేనివారిభంగి మధురాదిరసభేదములను గానదని భావము; కాణరీతిచేన్ = అంధునిరీతివంటి రీతిచేత, జ్ఞానాంధుని రీతి చేత ననుట, కాకిరీతిచేత నని యర్థాంతరము,‘వాయసైకాక్షిణోః కాణః’ హలాయుధము; చెలఁగి =ఒప్పి; పదార్థకత్రయవిమేళ నము = వాచ్యలక్ష్యవ్యంగ్యార్థత్రయముయొక్కయోగమును; పదార్థ = పదార్థములకు, క= ప్రకాశకమగు, త్రయ = సూర్యచం ద్రాగ్నిరూపతేజస్త్రయముయొక్క, విమేళనము = యోగమునని కాకపరమైన యర్థము; ఎంచదు = గణింపదు. జలకాకము నీటఁ జరించుచు స్వభావముగ సూర్యాదితేజోవిశేషము తెలియదని భావము; అంచితదోషరూఢిచేన్ – అంచిత = ఒప్పుచున్న, దోష = అవిమృష్టవిధేయాంశాదికావ్యదోషములయొక్క, రూఢిచేన్ = స్ఫూర్తిచేతను, ఒప్పుచున్న పంకము మొదలగు దోష ముల రూఢిచేత నని యర్థాంతరము; ప్రసాదము = ప్రసాదమనెడు కావ్యగుణమును, నైర్మల్యము నని యర్థాంతరము, ఎన్నఁ డును, చేకొనదు = గ్రహింపదు, నీచజలపక్షులు తఱచుగా బురదలోఁ బొరలుచుండుట స్వాభావికము. అందులో ‘కాకః పక్షిషు చణ్డాలః’ అని పక్షులలో నింద్యమగు కాకము నైర్మల్యము నెన్నఁడును గనదనుట; వెలసినయట్టి దుష్కవి కవిత్వమున్ = ఇట్లు వెలయుచున్న కుకవియొక్క కావ్యమును, దుష్టమైన జలపక్షియొక్క జలపక్షిత్వము నని యర్థాంతరము; ధీరపుంగవుల్ = పండితోత్తములు; ఎంతురె = గణింతురా?
శృంగారాదిరసవిశేషములతోఁ గూడక, వాచ్యలక్ష్యవ్యంగ్యార్థభేదములతో మెలఁగక, ప్రసాదాది గుణములు లేక, దోష భూయిష్ఠ మగు కుకవికావ్యమును మధురాదిరసవిశేషముల నెఱుఁగక, సూర్యాది లోకోత్తరవస్తువులఁ దెలియక, బురదలో నుండు నీరుకాకమునుబలెఁ బండితు లంగీకరింప రని భావము. ఇందుపమాలంకారధ్వని.
వ. అని యిష్టదేవతావందనంబును, సుకవిజనాభినందనంబును, గుకవినిందనంబును గావించి, యేనొక్క మహాప్రబంధనిబంధనంబున కుద్యోగించి యున్నఁ దత్పుణ్యరాత్రంబున. 12
దీని యర్థము స్పష్టము. వందనం బనుచోట ‘వది అభివాదనస్తుత్యోః’ అను ధాతువునుబట్టి పై మంగళములలో యథాసంభవ ముగ నతిస్తుతుల గ్రహింపవలయు. పుణ్యరాత్ర మనుచోట ‘అహ స్సర్వైకదేశసంఖ్యాత పుణ్యాచ్చ రాత్రేః’ అను సూత్రముచేత రాత్రిశబ్ద మకా రాంత మైనదని తెలియునది.
సీ. పరువంపుననగుంపు ◊బలితంపుజిగిపెంపుఁ, గని యొప్పు పాణియు◊గ్మములతోడఁ,
జెలువందు నరవింద◊ములయందములు చింద,ననువొందఁ గల కన్నుఁ◊గొనలతోడ,
జగడంబు గనునంబు◊ముగయంబుజగడంబు, మేలంబులాడు నె◊మ్మేనితోడఁ,
దులకించు బలుమించుఁ ◊దలఁకించు నెఱమించు, గమి మించు హేమాంశు◊కంబుతోడ,
తే. మారుఁ బలుమాఱు గేరు మై◊తీరుతోడ,
సోము నలయించు నెమ్మోము◊గోముతోడఁ,
బరఁగు మాపాలిమదనగో◊పాలమూర్తి
యంచితస్ఫూర్తి సాక్షాత్క◊రించి పలికె. 13
టీక: పరువంపు ననగుంపు బలితంపు జిగి పెంపున్ – పరువంపు = నూతనమైన,నన = చిగురులయొక్క, గుంపు = సమూ హముయొక్క, బలితంపు = హెచ్చైన, జిగి = మెఱుఁగులయొక్క, పెంపున్ = అతిశయమును, కని = పొంది, ఒప్పు పాణి యుగ్మములతోడన్ = ఒప్పునట్టి కరద్వయములతోడను, విష్ణుమూర్తి చతుర్భుజుండు గనుక యుగ్మము లని బహువచన ప్రయోగము చేయఁబడినది; చెలువందు నరవిందముల యందములు – చెలువందు = సుందరమగు, అరవిందముల = తామరలయొక్క, అందములు = సౌందర్యములు, చిందన్ = రాలునట్లు, అనువు= వైపును, ఒందన్ కల కన్నుఁగొనలతోడన్=పొందఁగల యట్టి నేత్రాంతముల తోడను; జగడంబు=వివాదమును, కను నంబుముగయంబు జగడంబు – కను=పొందునట్టి,అంబుముక్ =మేఘముయొక్క,అయంబు = శుభవిధిసంబంధమైన, జగ = అధికమగు,డంబు = గర్వమును, మేలంబులాడు = పరిహసించునట్టి, నెమ్మేని తోడన్ = చక్కనిశరీరముతోడను; తులకించు బలుమించున్ = ప్రకాశించునట్టి అధికమైన మెఱపును; తలఁకించు నెఱమించు గమిన్ = భయపఱచునట్టి అధికము లగు కాంతులసమూహముచేత, మించు హేమాంశుకంబుతోడన్ = అతిశయించుచున్న కనకాంబరముతోడను; మారున్= కాముని, పలుమాఱున్ = మాటిమాటికిని, కేరు మైతీరుతోడన్ = పరిహసించునట్టి చక్కఁదనముతోడను; సోమున్ = చంద్రుని, అలయించు నెమ్మోముగోముతోడన్= తిరస్కరించునట్టి సుందరమైన ముఖముయొక్క సౌకుమార్యముతోడను; పరఁగు మాపాలిమదనగోపాలమూర్తి = ఒప్పుచున్న మా భాగధేయమగు మదనగోపాలస్వామి; అంచితస్ఫూర్తిన్ = పూజ్య మైన ప్రకాశముతో, సాక్షాత్కరించి = ప్రత్యక్షమై, పలికెన్.
ఇందుపమాలంకార మర్థాలంకారము. వృత్యనుప్రాసము శబ్దాలంకారము.
చ. అనఘ తటాకముల్ వనచ◊యంబులు భూసురకోటిపాలనం
బును వసుగోపనంబు హరి◊భూరినికేతనముల్ ఘటించి వే
తనయమహోదయంబునను ◊ధన్యత నొందిననీకు సత్కృతిన్
గననికొఱంత యేల యది ◊గ్రక్కునఁ గూర్పుము మాకుఁ బ్రీతిగన్. 14
టీక: అనఘ = పాపములు లేనివాఁడా! గ్రంథకర్త సంబోధనము. తటాకముల్ = చెఱువులు; వనచయంబులు = వనసమూహము లను; భూసురకోటిపాలనంబును = బ్రాహ్మణకోటి పాలనమును; వసుగోపనంబు = ధన నిక్షేపమును; హరిభూరినికేతనముల్ = అనేకవిష్ణ్వాలయములను; ఘటించి = కావించి; వే =శీఘ్రముగా; తనయమహోదయంబునను = పుత్రోత్సవముచేతను; ధన్యతన్ = కృతార్థతను; ఒందిన నీకున్ =కాంచిన నీకు; సత్కృతిన్ = శ్రేష్ఠమగు గ్రంథమును; కననికొఱంత యేల = చేయని లోపమేల? అది= ఆ గ్రంథము; గ్రక్కునన్; మాకుఁ బ్రీతిగన్; కూర్పుము.
సప్తసంతానములలో నాఱింటి నొంది కృతినిర్మాణము సేయకుంట యేల దానిం గూర్పుమని తాత్పర్యము. ‘శ్లో. బ్రహ్మ ప్రతిష్ఠా సన్తానం తటాకో వనమేవ చ, కృతి ర్దేవాలయశ్చైవ నిక్షేప స్సప్తసన్తతిః’ అని సప్తసంతానములు.
తే. వృత్త మే మన్నఁ ద్రేతయం ◊దేము దశర
థాత్మజత్వము గని యున్న◊నమితరక్తిఁ
జాల మెప్పించె ధరణి సు◊చంద్రవృత్త
మతని చరితంబు వివరింపు ◊మనఘచరిత! 15
టీక: వృత్త మే మన్నన్ = గ్రంథములో వర్ణనీయచరిత్ర మేమనఁగా, ‘వృత్తం పద్యే చరిత్రే త్రిషు’ అని యమరము; ఏము = మేము; త్రేతయందున్ = త్రేతాయుగమందు; దశరథ = దశరథునియొక్క; ఆత్మజత్వము = పుత్రత్వమును; కని యున్నన్ = రామావ తార మెత్తియున్న యవసరంబున ననుట; సుచంద్రవృత్తము =సుచంద్రుండను రాజుయొక్క చరిత్ర; అమితరక్తిన్ = అధికమైన రసముచేత; ధరణిన్ = భూమిని; చాల మెప్పించెన్ = మిక్కిలి సంతోషపెట్టెను; అనఘచరిత = పుణ్యచరిత్రుఁడ వైన మాధవ రాయా! అతని చరితంబు; వివరింపుము.
ఇచట ‘విశాలస్య సుతో రామ హేమచన్ద్రో మహాబలః| సుచన్ద్ర ఇతి విఖ్యాతో హేమచన్ద్రాదనన్తరః’ అను శ్రీమద్రామాయణ బాలకాణ్డస్థకథాసంవాదం బనుసంధేయము.
వ. అని యంతర్హితుం డయ్యె, నంతఁ బ్రభాతం బగుటయు నేనును గాల్యకృత్యంబులు నిర్వర్తించి, విద్వ జ్జనంబుల రావించి, పుండరీకాక్షసాక్షాత్కారప్రకారంబు వివరించిన వారు నమందానందులై సత్కులప్రసూ తుండవు, సద్గుణ గరిష్ఠుండవు నగు నీకు నిట్టిమహోత్సవంబు లే మద్భుతంబు లవధరింపుము. 16
టీక: అని యంతర్హితుం డయ్యెన్ = ఇట్లని యంతర్ధానము నొందినవాఁ డయ్యెను. ఈ క్రియయందుఁ బై మదన గోపాలమూర్తి యనునది కర్తృపదముగా నన్వయింపవలయు; అంతన్ = అటు పిమ్మట; ప్రభాతంబు = వేకువ; అగుటయున్ = కాఁగా; నేనును; కాల్యకృత్యంబులు = కాలోచితములగు స్నానాదిక్రియలను; నిర్వర్తించి = నెఱవేర్చి; విద్వజ్జనంబులన్ = పండిత జనులను; రావించి = రప్పించి; పుండరీకాక్షసాక్షాత్కారప్రకారంబు = మదన గోపాలస్వామివారియొక్క ప్రత్యక్షంబగుటను; వివరించినన్ = తెలుపఁగా; వారున్ = పండితులును; అమందానందులై = అధికమైన యానందము గలవారై; సత్కులప్రసూ తుండవు – సత్ = శ్రేష్ఠ మగు; కుల = సర్వజ్ఞ సింగభూపాలుండు మొదలగు మహాశయులచేఁ బ్రకాశించు వంశమందుఁ బుట్టిన వాఁడవు; సద్గుణగరిష్ఠుండవు = శ్రేష్ఠములగు దానక్షాత్త్రపాండిత్యాదిగుణములచేత నుత్కృష్టుండవు; అగు నీకున్; ఇట్టిమహో త్సవంబులు = భగవత్సాక్షా త్కారంబు గ్రంథకరణోపదేశంబు మొదలగు నిట్టి యభ్యుదయంబులు; ఏమద్భుతంబులు= ఎంతమాత్రము నాశ్చర్యంబులు గావనుట; అవధరింపుము = ఎచ్చరిక పడుము.
సీ. పద్మాహితకరప్ర◊భాభాసమానంబు, సురవాహినీభూతి◊శోభితంబు
కవిమండలగవీని◊కాయాతిగేయంబు, జగదేకపావనా◊చారయుక్త
ముజ్జ్వలత్సదనీక◊యోగావలంబంబు, చారుపుష్కరపద◊సంగతంబు
ఘనసర్వమంగళా◊కాంతరూపఖ్యాత, మనుగతానంతర◊త్నాంచితంబు
తే. చెలఁగు నట్టివిష్ణుపదం బ◊శేషభువన
మండలైకాభిపూర్ణతా◊మహిత మగుచు
నింద్రియజ్ఞానవిషయతా◊తీతవృత్తి
యగుచు శ్రుతినివేద్యగుణాశ్ర◊యంబు నగుచు. 17
ఇందుఁ బ్రస్తుతవిష్ణుపదవర్ణనము శబ్దశక్తిమూలవ్యంజనమున నప్రస్తుతగగనవిషయార్థము దోఁచునట్లు చేయఁబడుచున్నది.
టీక: పద్మాహితకరప్రభాభాసమానంబు — పద్మా = లక్ష్మిచేత, ఆహిత = ఉంపఁబడిన, కర = హస్తములయొక్క, పద్మాహిత కర = చంద్రకిరణములయొక్క, ప్రభా = కాంతిచేత, భాసమానంబు = ప్రకాశించుచున్నదియు; సురవాహినీభూతిశోభితంబు —సురవాహినీ = దేవనదియొక్క, భూతి = జన్మముచే, సంపదచే, శోభితంబు = ప్రకాశించునదియు; కవిమండల గవీ నికాయాతిగేయంబు — కవిమండల = పండితమండలముయొక్క, శుక్రమండలముయొక్క, గవీ = వాక్కులయొక్క, కాంతులయొక్క, ‘ స్వర్గేషు పశువాగ్వజ్రదిఙ్నేత్రఘృణిభూజలే’ అని యమరము, గోశబ్దముమీఁద టచ్ ప్రత్యయము ఙీప్ప్రత్యయము వచ్చి గవీ యని రూపమైనది, నికాయ = సమూహముచేత, అతిగేయంబు = మిక్కిలిపాడఁ దగినది, శ్లాఘ్యమైనదని యర్థాంతరము; జగదేకపావనాచార యుక్తము — జగత్ = భువనముయొక్క, ఏక = ముఖ్య మయిన, పావన = పరిశుద్ధము చేయుట యను, జగత్ = జగమందు, ఏక = ముఖ్యమగు, పావన = పవనసమూహము యొక్క, ఆచార = నడవడితోడ, సంచారముతోడ, యుక్తము = కూడినది; ఉజ్జ్వల త్సదనీక యోగావలంబంబు – ఉజ్జ్వలత్ = ప్రకాశించుచున్న, సత్ = సత్పురుషులయొక్క, రిక్కలయొక్క, అనీక = సంఘములయొక్క, యోగ = ధ్యానమునకు, సంబంధమునకు, అవలంబంబు = ఆధారమును; చారుపుష్కరపదసంగతంబు – చారు = ఒప్పుచున్న, పుష్కరపద = పద్మచిహ్నములతోడను, పుష్కరమనెడి పేరుతోడను, సంగతంబు = కూడినది; ఘన సర్వమంగళాకాంత రూప ఖ్యాతము – ఘన = గొప్పది యగు, సర్వమంగళ = సర్వశుభములచేత, ఆకాంత = మిక్కిలి మనోహరమైన, సర్వమంగళాకాంత = శివునియొక్క, రూప = రూపముచేతను, మూర్తివిశేషమని యర్థాంతరము, ఖ్యాతము = ప్రసిద్ధము, ‘ద్యో భూమి చన్ద్ర యజ్వానో మూర్తయోష్టౌ ప్రకీర్తితాః’ అని యీశ్వరుని మూర్త్యష్టకములో నాకాశము చేరిన దని తెలియునది; అనుగతానంతరత్నాంచితంబు = అనుగతములు నధికములునగు రత్నములచేతఁ బూజింపఁబడినది, అనుగతానంతరత్నాంచితంబు = అనుగతశేషఫణామణిపూజితంబు, అనుగతుఁడగు సూర్యునిచేత నొప్పునది; అట్టి = ఐనట్టి,విష్ణుపదంబు = నారాయణుని చరణము,ఆకాశము; అశేష భువనమండలైకాభిపూర్ణతా మహితము — అశేష = సమస్తమైన, భువనమండల = లోకసమూహమందు, ఏకాభిపూర్ణతా = కేవలపరిపూర్ణతచేత, అర్థాంతరమం దాకాశము విభువు గాన యంతట వ్యాపించియుండుటచేత, మహితము = ఒప్పునది, అగుచున్; ఇంద్రియ జ్ఞాన విషయతాతీత వృత్తి — ఇంద్రియ = ఇంద్రియములయొక్క, అనఁగా మనోనేత్రాద్యన్తరబాహ్యేంద్రియంబులయొక్క, జ్ఞాన=జ్ఞానముయొక్క, విషయతా = విషయ మగుటను, అతీత = అతిక్రమించిన, వృత్తి = వర్తనము గలది, అగుచున్; శ్రుతి నివేద్య గుణాశ్ర యంబు — శ్రుతి = వేదములచేతను, కర్ణములచేతను, నివేద్య = బోధింపఁదగిన, ఆకాశపక్షమందుఁ దెలియఁదగిన, గుణ = అనంతకల్యాణగుణ ములకు, శబ్దమునకు, ఆశ్రయంబు = ఉనికిపట్టు,అగుచున్; చెలఁగున్ = ఒప్పును.
ఇందుఁ బ్రస్తుతవిష్ణుచరణపర మైన యర్థమందు శబ్దశక్తి సంయోగాదులవలన నియమిత కాఁగా నప్రస్తుతాకాశవిషయార్థ స్ఫురణము వ్యంజనావృత్తిచేతఁ గలుగుచున్నది. ‘శ్లో. అనేకార్థస్య శబ్దస్య వాచకత్వే నియన్త్రితె, సంయోగాద్యై రవాచ్యార్థధీ కృ ద్వ్యాపృతిరంజనమ్’ అని యిందులకుఁ బ్రమాణము. అనేకార్థములు, ప్రస్తుతములు, అప్రస్తుతములు, ప్రస్తుతాప్రస్తుత ములు నుండును. అందుఁ గేవలప్రస్తుతము లైనప్పుడును గేవలాప్రస్తుతము లైనపుడు నీయర్థమే వాచ్యము తక్కినది కాదనుటకు వినిగమకము లేనందున నర్థద్వయము శబ్దశక్తిగమ్యమే యగును. ఇఁక నొకయర్థము ప్రకృతము మఱియొకటి యప్రకృతము నగునపుడు ప్రకరణాదులవలనఁ బ్రస్తుతార్థము బోధితము కాఁగా నప్రస్తుతమును బోధించు నుపాయము లేక వ్యంజనావృత్తి నాశ్రయింపవలె నని భావము. సంయోగాదులు – ‘శ్లో. సంయోగో విప్రయోగశ్చ సాహచర్యం విరోధితా, అర్థః ప్రకరణం లిఙ్గం శబ్ద స్యాన్యస్య సన్నిధిః| సామర్థ్య మౌచితీ దేశః కాలో వ్యక్తి స్వరాదయః| శబ్దార్థ స్యానవచ్ఛేదే విశేషస్మృతి హేతవః’ అనునవి. ఇట్లు కావ్యప్రకాశకారాదిమతము. ‘శ్లో. నానార్థసంశ్రయ శ్శ్లేషో వర్ణ్యావర్ణ్యోభయాశ్రితః’ అను చంద్రాలోక శ్లోకవ్యాఖ్యయందు ‘శ్లో. ఉచ్చరద్భూరికీలాల శ్శుశుభే వాహినీపతిః’ అనుచోట శబ్దశక్తి యర్థద్వయమందుండి యుభయార్థములు వాచ్యము లగుచుండఁగా నొకటి వాచ్యము నొకటి వ్యంగ్య మగుట దగ దని వ్రాయఁబడియె. ఈ మతద్వయమును విమర్శించి, రసగంగా ధరములో ‘ఏవం స్థితే నానార్థస్థలే ప్యుపమాయాః ప్రాకరణికాప్రకరణికార్థగతాయాః ప్రతిపత్తయే అవశ్యం వాచ్యయా వ్యంజ నయై వాప్రాకరణికార్థ స్యాపి ప్రతిపత్తావలం క్లిష్టకల్పన యే త్యాశయేన ప్రాచీనై రుక్త న్నానార్థవ్యంజకత్వ మపి న దుష్యతి’ అని వ్రాయఁబడినది. కావున ధ్వని యని వ్రాసినచోఁ బ్రాచీనమత మనియు, శ్లేష మని వ్రాసినచో నవీనమత మనియు దెలియునది.
చ. వికలితపంకజాతనవ◊విభ్రమ మై, ఘనగోధ్రతాభిభూ
తకమఠనాథ మై, యరుణ◊ధామవిభాసిత మై, ద్విజోత్తమ
ప్రకటితహార్దయోగభర◊భావుక మై, ధరయందుఁ బద్మనా
యకకుల ముద్భవించె నట◊నాత్మజనుష్పదతుల్యవైఖరిన్. 18
టీక: ధరయందున్ = భూమియందు; వికలిత పంకజాత నవవిభ్రమ మై — వికలిత = వికలము చేయఁబడిన, పంకజాత = పాప కదంబముయొక్క, తామరలయొక్క, నవవిభ్రమ మై= నూతనశోభ గలదై ‘విభ్రమో భ్రంశనే భ్రాన్తౌ శోభాయామ్’ అని విశ్వము; ఘన గోధ్ర తాభిభూత కమఠనాథ మై — ఘన = గొప్పదగు, గోధ్రతా = భూమిని భరించువాఁ డగుటచేత, కాంతిని భరించువాఁ డగుటచేత, అభిభూత = తిరస్కరింపఁబడిన, కమఠనాథ మై = ఆది కూర్మము గలదై, కూర్మశ్రేష్ఠము గలదై; అరుణధామవిభా సిత మై — అరుణ = సూర్యతుల్యమగు, ధామ = ప్రతాపముచేత, ఎఱ్ఱని కాంతిచేత, విభాసిత మై = ప్రకాశించునది యై; ద్విజో త్తమ ప్రకటిత హార్ద యోగ భర భావుక మై —ద్విజోత్తమ = బ్రాహ్మణోత్తములయందు, ప్రకటిత = ప్రకటము చేయఁబడినదగు, హార్ద = స్నేహముయొక్క, యోగ = సంగతియొక్క, భర = అతిశయముచేత, భావుక మై = మంగళము గలదై, విష్ణుపదపక్ష మందు — ద్విజోత్తమప్రకటిత = బ్రాహ్మణోత్తములచేతఁ బ్రకటిత మగు, హార్దయోగ = హృదయసంబంధిధ్యానముయొక్క, భర = అతిశయము గలదై, భావుక మై = మంగళము గలదై, అని యర్థము; అట = ఆ విష్ణుపదమునుండి; పద్మనాయకకులము = పద్మనాయకులవంశము; ఆత్మజనుష్పదతుల్యవైఖరిన్ — ఆ త్మ=తనయొక్క, జనుష్పద=జన్మస్థానమగు విష్ణుపాదము తోడ, తుల్యవైఖరిన్ = సమానమగు రీతిచేత; ఉద్భవించెన్ = ఆవిర్భవించెను.
పద్మనాయకకులము తన కుత్పత్తిహేతువగు విష్ణుపాదముతోఁ దుల్యగుణ మై వర్తించె నని భావము. ఈపద్యమందుఁ దుల్యపద ముపమావాచకము గాన విష్ణుపదమునకుఁ బద్మనాయకకులమునకు సామ్యము వాచ్య మగుటచే నుపమాలం కారము. కావ్యప్రకాశకారాదు లిట్టి యుపమలను శబ్దాలంకారములలోఁ జేర్చి యున్నారు. ఏలన ఇందు సాధారణధర్మము ‘శ్లో. సకలకలంపుర మేత జ్జాతం సంప్రతి సుధాంశుబిమ్బమివ’ ఇత్యాదులయందుంబలె శబ్దసామ్యరూప మైనదె కాని యర్థ సామ్యరూప మైనది కాదు, కావున నిది శబ్దాలంకారం బనవలయు. ‘శ్లో. స్ఫుట మర్థాలంకారా వేతా వుపమాసముచ్చయౌ కింతు, ఆశ్రిత్య శబ్దమాత్రం సాధర్మ్య మిహాపి సంభవతః’ అని రుద్రటుండును వచియించె నని వారి గ్రంథమందు వ్రాయఁబడినది. ‘ఇహాపి’ యనఁగా శబ్దాలంకారప్రకరణమం దని యర్థము. చిత్రమీమాంసయందు శబ్దమాత్రసాధర్మ్య ముండిన నర్థాలంకా రము గావచ్చు నని వ్రాయఁబడినది.
క. ఆ సంతతిఁ జాపకలా,వాసవి సెన్నొందె సింగ◊వసుధేంద్రుఁడు ఘో
రాసిమహోరాశిమహో,ద్భాసిహుతాశావలీఢ◊పరవంశకుఁ డై. 19
టీక: ఆ సంతతిన్ = ఆ పద్మనాయకవంశమందు; చాపకలావాసవి = బాణవిద్యయం దర్జునునితో సమానుఁ డైనట్టి; సింగవసు ధేంద్రుఁడు = సింగభూపాలుండు; ఘోరాసి మహోరాశి మహోద్భాసి హుతా శావలీఢ పరవంశకుఁ డై —ఘోరాసి = భయా వహ మగు కత్తియొక్క, మహోరాశి = తేజఃకదంబ మనెడు, మహోద్భాసి = మిక్కిలి ప్రకాశించుచున్న, హుతాశ = అగ్నిచే, అవలీఢ = కాల్పఁబడిన, పరవంశకుఁ డై = శత్రువంశము లనెడు అధికము లగు వెదుళ్ళుగలవాఁ డై; చెన్నొందెన్ = ప్రకాశించెను. ఇందు రూపకాలంకారము.
సీ. నిజకటకాశ్రిత◊ద్విజపోషణమున నె,వ్వని సార్వభౌమత ◊ఘనత గాంచుఁ
బరమహాహీనస◊ద్బలవిభేదనలీల, రమణ నెవ్వని నరేం◊ద్రత్వ మలరు
గంధాంకకైరవ◊కాండలుంటాకధా,మమున నెవ్వని యిన◊త్వము సెలంగు
జాగ్రద్ఘనాఘన◊సాంద్రమదాపహ,శక్తి నెవ్వని మహే◊శ్వరత వొసఁగు
తే. నతఁడు వొగడొందు జయశాలి, ◊యహితసాల
కీలి, యతిదీప్తినిర్ధూత◊హేళి, యమర
విసరసన్నుతనయకేళి, ◊యసమసుగుణ
విజితభువనాళి, శ్రీసింగ◊వీరమౌళి. 20
టీక: నిజ కట కాశ్రిత ద్విజ పోషణమునన్ — నిజ = స్వకీయమగు, కటక = పురమును, గండస్థలమును, ‘కటకో స్త్రీ రాజ ధానీ’, ‘గండః కటోమదో దానమ్’ అని రెంటికి నమరము, గండస్థలపక్షమందు కటశబ్దముమీఁద స్వార్థమందు కప్రత్యయము వచ్చినది, ఆశ్రిత = ఆశ్రయించిన, ద్విజ= బ్రాహ్మణులయొక్క, తుమ్మెదలయొక్క, పోషణమునన్ = పోషించుటచేత; ఎవ్వని సార్వభౌమత = ఎవ్వని చక్రవర్తిత్వము, దిగ్గజత్వ మని వ్యజ్యమానార్థాంతరము; ఘనత = గొప్పతనమును, కాంచున్ = పొందునో; పర మహాహీన సద్బల విభేదనలీలన్ — పర = శత్రువులయొక్క, మహాహీన = మిగుల నధికమగు, సద్బల = మంచి సైన్య ములయొక్క, విభేదనలీలన్ = భేదనక్రియచేతను, పర = ఉత్కృష్టములగు, మహాహీన = గొప్ప సర్పములయొక్క, సద్బల = మంచి బలముయొక్క, విభేదనలీలన్ = భేదనక్రియచేత నని యర్థాంతరము, ఎవ్వని నరేంద్రత్వము = ఎవని రాజత్వము, విషవైద్యత్వము, ‘విషవైద్యే ధరాధీశే నరేంద్రః’ అని శాశ్వతము, రమణ నలరున్ = ఒప్పారునో; గంధాంక కైరవ కాండ లుంటాక ధామమునన్ — గంధ = గర్వము, పరిమళ మని యర్థాంతరము, ‘గంధో గంధక ఆమోదే లేశే సంబంధ గర్వయోః’ అని విశ్వము, అంక =చిహ్నముగాఁ గల, కైరవ = పిశునులయొక్క, కలువలయొక్క, కాండ = సమూహముయొక్క, లుంటాక = ఛేదక మగు, ధామమునన్ = ప్రతాపముచేత, కాంతిచేత నని యర్థాంతరము, ఎవ్వని ఇన త్వము =ఎవ్వని ప్రభుత్వము, సూర్యత్వము, ‘ఇనస్సూర్యే ప్రభౌ’ అని యమరము, చెలంగున్ = ప్రకాశించునో;జాగ్రద్ఘనాఘన సాంద్రమదాపహశక్తిన్ — జాగ్రద్ఘనాఘన = జాగరూకు లైన ఘాతుకులయొక్క, జాగరూకమైన మత్తగజము యొక్క, అనఁగా గజాసురునియొక్క ‘ ఘనాఘనౌ ఘాతుక మత్తదన్తినౌ’ అని విశ్వము, సాంద్ర మద = ఘనమైన యహంకార మును, ఘన మైన మదమును, ఆపహ = పోఁగొట్టెడి, శక్తిన్ = సామర్థ్యముచేత; ఎవ్వని మహేశ్వరత = ఎవ్వని ప్రభుత్వము, ఈశ్వరత్వము; పొసఁగున్ = ఒప్పునో; అతఁడు; జయశాలి = జయముచే నొప్పువాఁడు; అహితసాలకీలి = శత్రువు లనెడు మ్రాఁకుల కగ్నిరూపుఁడు; అతిదీప్తి నిర్ధూత హేళి = అధికప్రతాపముచేతఁ దిరస్కరింపఁబడిన సూర్యుఁడు గలవాఁడు; అమర విసర సన్నుత నయకేళి = దేవతాసంఘము చేతఁ గొనియాడఁబడిన నీతివిద్యావిహారము గలవాఁడు; అసమ సుగుణ విజిత భువనాళి = అసమానములైన మంచిగుణముల చేత జయింపఁబడిన లోకములు గలవాఁడు; శ్రీసింగవీరమౌళి = శ్రీసింగభూపాలుఁడు; పొగడొందున్ = పొగడ్త గాంచును.
ఇచట సింగభూపాలునందు ద్విజపోషణ, పరబలవిభేదన, కైరవకాండలుంటన, ఘనాఘనమదహరణములచే, దిగ్గజవిశేష, విషవైద్య, రవి, రుద్రుల సామ్యము తోఁచుచున్నది కావున నుపమాలంకారధ్వని. గీతిలో ‘ళి’శబ్దమునకుఁ బలుమా ర్లావృత్తి యగుటవలన వృత్త్యనుప్రాసము.
చ. కరు లరిసంవృతాత్మకట◊కంబులు, విష్ణునిబద్ధవిగ్రహుం
డురగవిభుండు, కూర్మవరుఁ ◊డుద్ధతభూభృదుదీర్ణమూర్తి, భూ
ధరము లరాతికాండగణ◊దారితగాత్రము లంచు మేదినీ
తరుణి వరించె సింగవసు◊ధావరు నప్రతిమానవిక్రమున్. 21
టీక: కరులు = దిగ్గజములు; అరి సంవృ తాత్మ కటకంబులు — అరి = శత్రువులచేత, తుమ్మెదలచేత, ఇచట రేఫలకారము లకు ‘శ్లో. డలయో రలయో శ్చైవ శసయో ర్వబయో స్తథా| వదన్త్యేషాం హి సాధర్మ్య మలంకార విదో జనాః’ అని సావ ర్ణ్యము, సంవృత = వ్యాప్తములగు, ఆత్మ = తమయొక్క, కటకంబులు = పత్తనములు గలవి, గండస్థలములు గలవి; ఉరగవిభుండు = ఆదిశేషుఁడు; విష్ణునిబద్ధవిగ్రహుండు — విష్ణు = వ్యాపకునితోడను, నిబద్ధ = కూర్పఁబడిన, విగ్రహుండు = విరోధము గలవాఁడు, హరితోడఁ గూర్పఁబడిన దేహము గలవాఁడు; కూర్మవరుఁడు = ఆదికూర్మము, ఉద్ధత భూభృ దుదీర్ణ మూర్తి — ఉద్ధత = గర్వించిన, భూభృత్ = రాజులచేత, ఉదీర్ణ = ఉబ్బిన, మూర్తి = శరీరము గలది, ఉద్ధతములగు పర్వత ములచే గొప్పదైన మూర్తి గలది; భూధరములు = కులాచలములు; అరాతి కాండ గణ దారిత గాత్రములు—అరాతి = శత్రు వులయొక్క, కాండ = బాణములయొక్క, గణ = సమూహముచేత, దారితగాత్రములు = భేదింపఁబడిన శరీరములు గలవి, అర = వేగము చేత, అతి = అధికమౌనట్లుగా, కాండగణ = ఉదకసమూహముచేత, దారితగాత్రములు = భేదింపఁబడిన దేహ ములు గలవి యని భావము; అంచున్ = ఇట్లనుచు; మేదినీతరుణి = భూకాంత; అప్రతిమానవిక్రమున్ = అసమాన మగు పరాక్ర మము గల వాఁడగు; సింగవసుధావరున్ = సింగభూపాలుని; వరించెన్ = వరియించెను.
ఇందు, దిక్కరిప్రభృతులందు సామర్థ్యహీనత్వాదిదోషము లుండుటం జేసి, యసమానపరాక్రముఁ డగు సింగభూపా లుని భూరమణి వరించె ననఁగా సర్వభూమిని సింగభూపాలుం డేలె నని భావము. శ్లేష సముత్థాపితవ్యతిరేకాలంకారము.
సీ. అరిపురభేదనా◊యతదోర్బలస్ఫూర్తి, నతరాజవర్ధన◊వితతకీర్తిఁ
గనదహీనాంగద◊కలితబాహాలీల, ఖండితాహితఘనా◊ఘనవిహేల
సద్గణరక్షణ◊క్షమచరణాసక్తిఁ, బటుచంద్రకోటీర◊భానిషక్తిఁ
దతసర్వమంగళాం◊చితగాత్రరుచిపాళి, నచలధర్మోన్నత◊ప్రచయకేళిఁ
తే. బ్రకటదుర్గాధినాయక◊భావభూతి
వైరిదర్పకదాంబక◊వహ్నిహేతి
నవనిఁ బొగడొందె సర్వజ్ఞుఁ ◊డనఁగ సింగ
ధరణిభృన్మౌళి తీవ్రప్ర◊తాపహేళి. 22
టీక: అరిపుర భేద నాయత దోర్బలస్ఫూర్తిన్ — అరిపుర = శత్రుశరీరములయొక్క, త్రిపురములయొక్క యని యర్థాంత రము, భేదన = భేదించుటయందు, ఆయత = విపులమైన, దోర్బలస్ఫూర్తిన్ = భుజబలాతిశయముచేతను; నత రాజ వర్ధన వితత కీర్తిన్ —నత = ప్రణమిల్లిన, రాజ = నరపతులయొక్క, నతరాజ = వంగిన చంద్రునియొక్క, బాలచంద్రునియొక్క యని యర్థాంతరము, వర్ధన = పోషణముచేత, వితత = విస్తీర్ణమగు, కీర్తిన్ = యశస్సుచేతను; కన దహీ నాంగద కలిత బాహాలీలన్ — కనత్ = ప్రకాశించుచున్న, అహీన = అధికమగు,అంగద = భుజకీర్తులతోడను, శివునిపక్షమందు ప్రకాశించుచున్న ఆదిశేషుఁడను భుజకీర్తులతోడ నని యర్థము, కలిత=కూడుకొన్న, బాహాలీలన్=భుజవిలా సముచేతను; ఖండి తాహిత ఘనాఘన విహేలన్ — ఖండిత = ఖండింపఁబడిన, అహిత = శత్రువు లగు, ఘనాఘన = ఘాతు కులయొక్క, శత్రువైన గజాసురునియొక్క యని యర్థాంతరము, విహేలన్ = విశేషవిలాసముచేతను; సద్గణ రక్షణ క్షమ చరణాసక్తిన్ — సద్గణ = సత్పురుషసంఘముయొక్క, రక్షణ = పోషణమందు, క్షమ = సమర్థమైన, చరణ = నడవడియందు, ఆసక్తిన్ = ప్రీతిచేతను, శివునిపక్షమందు శ్రేష్ఠమగు ప్రమథగణముయొక్క రక్షణమునందు సమర్థము లైన పాదములతోడి మిక్కిలి సంబంధముచేత నని యర్థము; పటు చంద్ర కోటీర భా నిషక్తిన్ — పటు = సమర్థమైన, చంద్ర = హిరణ్మయమగు, ‘కల్యాణ మర్జునం భూరి గైరికం వసు చంద్రకం’ అని యమరము, కోటీర = కిరీటముయొక్క, శీతాంశు ఘటితమైన కిరీటముయొక్క యని యర్థాంతరము; భా = కాంతియొక్క, నిషక్తిన్ = సంబంధముచేతను; తత సర్వమంగ ళాంచిత గాత్రరుచి పాళిన్ — తత = విస్తృతమగు, సర్వమంగళ = సమస్తశుభములచేత, సర్వమంగళా = పార్వతిచేత, అంచిత = ఒప్పునట్టి, గాత్రరుచి = దేహకాంతులయొక్క, పాళిన్ = సమూహముచేతను; అచలధర్మోన్నత ప్రచయ కేళిన్ — అచలధర్మ = చెదరని ధర్మములయొక్క, మేరుధనువుయొక్క, ఉన్నతప్రచయ=అధికవృద్ధియందలి, కేళిన్ = క్రీడచేతను;ప్రకట దుర్గాధినాయకభావ భూతిన్ — ప్రకట = వ్యక్తమగు, దుర్గాధినాయకభావ = దుర్గాధ్యక్షత్వముయొక్క, గౌరీవల్లభ త్వముయొక్క, భూతిన్ = సంపదచేతను; వైరి దర్పక దాంబకవహ్ని హేతిన్ — వైరి = శత్రువులయొక్క, దర్పక = గర్వ మును, ద = ఖండించెడు, అంబకవహ్ని = బాణము లనెడు నిప్పుయొక్క, హేతిన్= జ్వాలచేతను, శివునిపక్షమందు, వైరి = శత్రువైన, దర్పక = మన్మథుని, ద = ఖండించెడు, అంబకవహ్నిహేతిన్= నేత్రాగ్నియొక్క జ్వాలచేతను; తీవ్రప్రతాపహేళి = ఉగ్రప్రతాపముచేత సూర్యతుల్యుండైన; సింగధరణిభృన్మౌళి = సింగభూపాలాగ్రణి; అవనిన్ = భూమియందు; సర్వజ్ఞుఁ డనఁగన్ = ఈశ్వరుం డనఁగా, సర్వము దెలిసినవాఁ డనఁగా; పొగడొందెన్ = పొగడ్త గాంచెను.
సింగభూపాలుఁడు విద్యావిశారదుండై, రసార్ణవసుధాకరాదిగ్రంథప్రణేత యై, సర్వజ్ఞుండను బిరుదము గాంచియుండఁ గా, నిచటఁ గవి, యరిపురభేదన, నతరాజవర్ధ, నాహీనాంగదకలన, గజాసురఖండ,నాద్యఖిల జగదీశ్వర కార్యకరణముచే సర్వాంశములయందును నీశ్వరునిం బోలి సర్వజ్ఞుం డను తన్నామమును వహించె నని వర్ణించెను. ఇందు శ్లిష్టరూపకాలం కారము.
తే. అర్థిసాత్కృతసురభి, ప◊రాళిసురభి,
సుగుణవల్లీప్రకాండైక◊సురభి, కీర్తి
జితసురభి, శౌర్యసురభి నా ◊సింగనృపతి
పరఁగఁ దద్వంశమును గాంచె ◊సురభిసంజ్ఞ. 23
టీక: అర్థిసాత్కృత సురభి — అర్థిసాత్కృత = యాచకాధీనముగాఁ జేయఁబడిన, సురభి = సువర్ణము గల వాఁడు; పరాళి సురభి = శత్రువులనెడు తుమ్మెదలకు సంపెఁగ యైన వాఁడు; సుగుణవల్లీప్రకాండైకసురభి — సుగుణ = సద్గుణము లనెడు, వల్లీ = లతలయొక్క,ప్రకాండ= గుమురులకు, ఏక = ముఖ్యమైన, సురభి = వసంతుఁడైనవాఁడు; కీర్తిజితసురభి=కీర్తిచేత జయింపఁ బడిన కామధేనువు గలవాఁడు; శౌర్యసురభి = శౌర్యముచేత మనోజ్ఞు డైనవాఁడు; నాన్ = అనునట్లుగా; సింగనృపతి = సింగ భూపాలుఁడు; పరఁగన్ = ఒప్పఁగా; తద్వంశమును = ఆ సింగభూపతివంశమును; సురభిసంజ్ఞన్ = సురభి అను నామమును; కాంచెన్ = పొందెను. ఇట్టి సింగభూపాలుఁ డుదయించుటచే వారి వంశము సురభివంశ మను నభిఖ్య నొందెనని తాత్పర్యము.
క. ఆరాజదన్వయంబున
ధీరాగ్రణి పెద్దశౌరి ◊దీప్తాసిమహ
స్స్ఫారాహతధారాహత
వీరాహితగోత్రుఁ డగుచు ◊వెలసెన్ ధరణిన్. 24
టీక: ఆరాజదన్వయంబునన్ = ఆ ప్రకాశించుచున్న సురభివంశమందు; ధీరాగ్రణి = ధైర్యవంతులయందు శ్రేష్ఠుం డగు; పెద్ద శౌరి = పెద్దభూపాలుఁడు; దీప్తాసి మహ స్స్ఫా రాహత ధారా హత వీరాహిత గోత్రుఁడగుచున్— దీప్త = ప్రకాశించుచున్న, అసి= ఖడ్గముయొక్క, మహః = కాంతియొక్క, తేజస్సుచేత నని యర్థాంతరము, స్ఫార = అధికమై, మహస్సార అను పాఠమందు తేజస్సారరూపమై యని యర్థము, అహత = అప్రతిహతమగు, ధారా = అలుఁగు చేత, హత = కొట్టఁబడిన, వీరాహిత = వీరు లగు శత్రువులయొక్క; గోత్రుఁడగుచున్ = కులము లనెడు పర్వతములు గలవాఁ డగుచు; ధరణిన్ = భూమి యందు; వెలసెన్ = ప్రకాశించెను.
ఇట వర్ణ్యునియం దింద్రత్వము. ‘శ్లో. శమయ త్యరితేజోగ్నిం ధారయా త్వత్కృపాణికా’ అనుచోట కృపాణికయందు మేఘత్వమువలె నర్థసిద్ధము. కావున నేకదేశవివర్తిరూపకము. ‘శ్లో. శ్రౌతా అర్థాశ్చ తే యస్మి న్నేకదేశవివర్తి తత్’ అని కావ్య ప్రకాశమునందుఁ దల్లక్షణము.
సీ. ఏమాన్యు నతిభీమ◊భీమప్రతాపంబు,తాపంబు శాత్రవ◊తతికిఁ గూర్చు
నేవీరు ఘనసార◊హితకీర్తికాండంబు, కాండంబు నెల్లెడ ◊నలమి పొల్చు
నేరమ్యు నతిభూరి◊భూరినికాయంబు, కాయంబు నర్థుల ◊కబ్బఁ జేయు
నేరాజు నుత్సాహ◊ధీరాంతరంగంబు, రంగంబు నీతిన◊ర్తకికి నెన్న
తే. నతఁడు ధృతిమంతుఁ, డతిదాంతుఁ, ◊డమలకాంతుఁ,
డశ్వరేవంతుఁ, డవితమ◊హాదిశాంతుఁ,
డంగనాత్మాంబురుహభృంగ◊దంగజితజ
యంతుఁ డగు పెద్దవసుమతీ◊కాంతుఁ డెసఁగు. 25
టీక: ఏమాన్యు నతిభీమభీమప్రతాపంబు — ఏమాన్యు = ఏ మాననీయునియొక్క, అతిభీమ = శివుని నతిక్రమించిన, ‘వ్యోమ కేశో భవో భీమః’ అని యమరము, భీమ = భయంకర మగు; ప్రతాపంబు = తేజస్సు; శాత్రవతతికిన్ = శత్రుసంఘమునకు; తాపంబు =సంతాపమును; కూర్చున్ = చేయునో;ఏవీరు ఘనసార హిత కీర్తికాండంబు —ఏవీరు = ఏ వీరునియొక్క, ఘనసార = కర్పూరము పగిది, కాదేని కర్పూరమునకు, హిత = హిత మగు (మిత్త్రమగు) , కీర్తికాండంబు = కీర్తిసమూహము; కాండంబున్ = బ్రహ్మాండంబును; ఎల్లెడన్ = అంతటను; అలమి = ఆక్రమించి; పొల్చున్ = ఒప్పునో;ఏరమ్యు నతిభూరి భూరి నికాయంబు — ఏరమ్యు = ఏ రమణీయునియొక్క, అతిభూరి = మిక్కిలి యధికమగు, భూరి = సువర్ణముయొక్క, ‘భూరి ప్రాజ్య సువర్ణయోః’ అని విశ్వము, నికాయంబు = సమూహము; అర్థులకున్ = యాచకులకు; కాయంబు — క = చిత్తములకు, అయంబు = శుభావహవిధిని, సంతోషముననుట ‘అయశ్శుభావహో విధిః’ అని యమరము; అబ్బఁ జేయున్ = అందఁజేయునో;ఏరాజు ఉత్సాహధీరాంతరంగంబు — ఏరాజు = ఏ రాజుయొక్క, ఉత్సాహ = ఉత్సాహవంతం బగు, అర్శ ఆద్యచ్, ధీర = ధైర్యవంత మగు, అంతరంగంబు = చిత్తము; నీతినర్తకికిన్ = నీతి యనెడు నటికి; ఎన్నన్ = పరికింపఁగా; రంగంబు = నాట్య రంగమో;అతఁడు; ధృతిమంతుఁడు = ధైర్యవంతుఁడు; అతిదాంతుఁడు = మిక్కిలి యింద్రియనిగ్రహము గలవాఁడు; అమలకాంతుఁడు = నిర్మలుఁడును మనోహరుఁడును; అశ్వరేవంతుఁడు=ఆశ్వములయెడ రేవంతతుల్యుఁడు; అవితమహాదిశాంతుఁడు=పాలింపఁ బడిన గొప్ప దిగంతములుగలవాఁడు; అంగనాత్మాంబురుహభృంగదంగజితజయంతుఁడు — అంగనా = స్త్రీలయొక్క, ఆత్మ = మనస్సనెడు, అంబురుహ = కమలమునకు, భృంగత్ = తుమ్మెదవలె నాచరించుచున్న, ఇట ‘సర్వప్రాతిపదికేభ్యః క్వి బ్వా వక్తవ్యః’ అని క్విప్ప్రత్యయము, అంగ = దేహముచేత, జిత = జయింపఁబడిన, జయంతుఁడు = జయంతుఁడు గలవాఁడు; అగు = అయినట్టి; పెద్దవసుమతీకాంతుఁడు = పెద్దరాజు; ఎసఁగున్ = అతిశయించును.
ఇందు తాపంబు తాపంబు లో నగువానియం దనేక వర్ణసముదాయము సామ్యము నొందుటం బట్టి యమకము. ఏరాజునుత్సాహ ధీరాంతరంగంబు రంగంబు నీతి నర్తకికి నెన్ననను వాక్యమం దంతరంగము నందు రంగత్వారోపముఁ జేయుటంజేసి రూపకా లంకారభేదము.
క. రాజులలో శ్రీదాంబుద
రాజులలో నెంచఁగా వి◊రాజిలు బహువీ
రాజులచే, దానకళా
రాజులచేఁ బెద్దనృపతి ◊రహిఁ బెద్ద యనన్. 26
టీక: పెద్దనృపతి = పెద్దభూపాలుఁడు; రాజులలోన్ = దొరలలో; శ్రీదాంబుదరాజులలోన్ = కుబేర మేఘ చంద్రులలో; ఎంచఁ గాన్ = గణింపఁగా; బహువీరాజులచేన్ — బహు = పెక్కులగు, వీర = వీరులయొక్క, ఆజులచేన్ = జగడంబులచేతను; దానకళారాజులచేన్ — దానకళా = వితరణవిద్యలయొక్క, రాజులచేన్ = పరంపరలచేతను; రహిన్ = ఒప్పిదముచే; పెద్ద యనన్ = అధికుఁ డనునట్లుగా; విరాజిలున్ = ప్రకాశించును.
పెద్దరాజు దొరలలో వీరాజులచేతను, కుబేరమేఘచంద్రులలో దానకలారాజులచేతను, బెద్ద యనుట్లు విరాజిల్లె నని తాత్ప ర్యము. త్రిప్రాసకందము. యథాసంఖ్యాలంకారము. ‘యథాసంఖ్యం క్రమేణైవ క్రమికాణాం సమన్వయః’ అని తల్లక్షణము.
తె. అతనిసతి వల్లభాంబ నా ◊నలరుఁ గన్న
యిల్లు తనమన్నయిల్లు భా◊సిల్ల, నగుచు
గన్న యిల్ పల్చఁ జేయుచు ◊మన్న యిల్ మ
హాపకీర్తియుక్తముఁ జేయు ◊నబ్జపాణి. 27
టీక: అతనిసతి = ఆ పెద్దనృపాలుని భార్య; కన్నయిల్లు = తన పుట్టినయిల్లు; తన మన్నయిల్లు = తన యత్తగారియిల్లు; భాసిల్లన్ = ప్రకాశించుచుండఁగా; కన్న యిల్ పల్చఁ జేయుచున్ = పుట్టిన యింటిని పలుచఁదనము నొందినదానిగాఁ జేయుచు, అనగా లఘువైన దానిగాఁ జేయుచు; మన్నయిల్ మహాపకీర్తియుక్తముఁ జేయు నబ్జపాణిన్ — మన్న యిల్ = అత్తయింటిని, మహాపకీర్తి = గొప్ప యపయశస్సుతో, యుక్తమున్ = కూడినదానిగా, చేయు నబ్జపాణిన్ = చేయుచున్న లక్ష్మీదేవిని; నగుచున్ = పరిహసించుచు; వల్లభాంబ నాన్ = వల్లభాంబ యను పేర; అలరున్ = ఒప్పును.
వల్లభాంబ లక్ష్మీదేవివలె పుట్టినింటిని లఘువుగాను, అత్తగారియింటిని మహాపకీర్తిగలదానిగాను జేయక పుట్టినిల్లు నత్తగారియిల్లును, దన సద్వృత్తులచే భాసిల్లునట్లు చేసె నని తాత్పర్యము. లక్ష్మీదేవియొక్క పుట్టి నిల్లగు సముద్రము జల రూపము గావున పలుచగా నున్నదనియు, మన్న యిల్లగు పద్మము మహాపకీర్తి యనగా గొప్ప యుదకముతోఁ గూడిన బురద, దానితోఁ గూడియున్నదనియు భావము. ‘కీర్తి ర్యశసి కర్దమే’ అని విశ్వము. అప్ శబ్దము, ‘ఋక్పూరబ్దూః పథామా నక్షే’ అను పాణినిసూత్రముచే టచ్ప్ర త్యయము చేయఁగా మహాప యని అకారాంతమైనదని తెలియునది. కాదేని, ‘అపాం సమూహ ఆపమ్’ అనఁగా నీటిసమూహము ఆపగా అను శబ్దంబునంబోలె గ్రహించునది.
క. ఆ కాంతయందుఁ బెద్ద
క్ష్మాకాంతుఁడు గాంచె మల్ల◊శౌరిని, విలస
న్నాకాంతరమాకాంతర
సాకాంతరమావిశేషు, ◊సజ్జనపోషున్. 28
టీక: ఆ కాంతయందున్ = ఆ వల్లభాంబయందు; పెద్దక్ష్మాకాంతుఁడు = పెద్దవసుమతీశుఁడు; విలస న్నాకాంతర మాకాంతర సాకాంత రమా విశేషు — విలసత్ = ఒప్పుచున్న, నాక = పాపరహితమగు, ‘అకం పాపేచ దుఃఖే చ’ అని విశ్వము, అంతర = హృదయమందలి, మాకాంతరస = విష్ణుభక్తిచేతను, ఆకాంత = ఒప్పునట్టి, రమా = సంపదయొక్క, కాదేని విష్ణుభక్తియొక్క మనోజ్ఞసంపదయొక్క, అధికమగు విష్ణుభక్తి యొక్క యనుట, ‘శృంగారాదౌ విషే వీర్యే ద్రవే రాగే’ అని యనుటచే రసశబ్దము రాగమందుఁ బ్రయోగింపఁబడినది. ఆరాగము భక్తిరూపమగునని భావము, విశేషున్ = అతిశయము గలవానిని; సజ్జనపోషున్ = విద్వత్పోషకుని; మల్లశౌరిని = మల్లరాయని; కాంచెన్ = కనెను. యమకాలంకారము.
సీ. తన కలావిభవంబు ◊తన కలావిభవంబు,కరణి సుదృగ్జాతి ◊వఱలఁ జేయఁ
దన దానమహిమంబు ◊తన దానమహిమంబు,గతిని బ్రత్యర్థిసం◊ఘములఁ బెంపఁ
దన సుమనోవృత్తి ◊తన సుమనోవృత్తి,లీల సదాసవ◊హేలఁ గూర్పఁ
దన మహామిత్రాళి ◊తన మహామిత్రాళి,పగిది నానావనీ◊భరణ మూనఁ
తే. దనరు విషమాద్రిజిహ్మగ◊స్తబ్ధరోమ
మత్తమాతంగకఠినకూ◊ర్మప్రసంగ
విరసవసుధావధూభోగ◊పరవిహార
శాలిభుజకేళి మల్లభూ◊పాలమౌళి. 29
టీక: తన కలావిభవంబు = తన విద్యలయొక్క వైభవము; తన కలావిభవంబు కరణిన్ = తన దేహకాంతులయొక్క విభవంబు భంగి; సుదృగ్జాతిన్ = విద్వత్సంఘమును, దేహకాంతిపర మైనపుడు స్త్రీసంఘమును ; వఱలఁ జేయన్ = ప్రకాశింపఁజేయు చుండఁగా;తన దానమహిమంబు = తన త్యాగముయొక్క గొప్పఁదనము; తన దానమహిమంబు గతిని = తనయొక్క ఛేదనమహిమంబు వలె; ప్రత్యర్థిసంఘములన్ – ప్రత్యర్థి = ప్రతియాచకులయొక్క, వైరులయొక్క, సంఘములన్ = సమూహములను; పెంపన్ = పోషింపఁగా, సంహరింపఁగా;తన సుమనోవృత్తి = తన మంచి మనోవృత్తి; తన సుమనోవృత్తి లీలన్ = తన పండితవృత్తికరణి; సదాసవహేలన్ – సత్ = సత్పురుషులయొక్క, ఆసవ = ప్రాణసంఘమునకు, అసువులు అనఁగాఁ బ్రాణములు, వాని సంఘము ఆసవ మనఁబడును, సమూహార్థమందు అణ్ప్రత్యయము, హేలన్ = విలాసమును; కూర్పన్ = ఘటిల్లఁ జేయఁగా;తన మహామిత్రాళి = తనయొక్క అధికులైన మిత్రులగుంపు; తన మహామిత్రాళి పగిదిన్ – తన = తనయొక్క, మహత్ = అధికులైన, అమిత్ర = శత్రువులయొక్క, ఆళి పగిదిన్ = గుంపు రీతి; నానావనీభరణము – నానా = అనేకప్రకారమగు, అవనీ భరణము = భూభరణమును, శత్రుపరమైనపుడు, వనీ = అరణ్యములయొక్క భరణము, ఊనన్ = వహింపఁగా;విషమాద్రి జిహ్మగ స్తబ్ధరోమ మత్తమాతంగ కఠినకూర్మ ప్రసంగ విరస వసుధావధూ భోగ పరవిహార శాలి భుజ కేళి – విష మాద్రి = అసహ్యములగు పర్వతములయొక్కయు, విషమసంఖ్య యనఁగా సప్తసంఖ్య గల కులాచలముల యొక్కయనుట, జిహ్మగ = కౌటిల్యము నందిన శేషునియొక్కయు, జిహ్మ యనునది భావప్రధాననిర్దేశము, వక్రస్వభావముగా నడచు శేషుని యొక్క యనుట, ‘జిహ్మః కుటిల వక్రయోః’ అని విశ్వము, స్తబ్ధరోమ =నిక్కిన వెండ్రుకలు గల అనఁగాఁ గురూపి యైన ఆది వరాహముయొక్కయు, వరాహమునకు రోమములు నిగుడుకొని యుండుట సహజ మని భావము, మత్తమాతంగ = మత్తు గొన్ననీచజాతివాండ్రయొక్కయు, మదించిన దిగ్గజములయొక్కయు, కఠినకూర్మ=కఠోరచిత్తుఁడగు నాదికూర్మముయొక్క యు, కూర్మమునకు దేహము కఠినముగా నుండును గాన కఠోరదేహుఁ డగు కూర్మమూర్తియొక్క యని భావము, ప్రసంగ = ప్రకృష్ట మగు సంబంధమందు, విరస = పరాఙ్ముఖి యగు, వసుధావధూ = భూకాంతయొక్క, భోగ = సుఖవిషయకమైన, పర విహార = ఉత్కృష్టక్రీడలచేత, శాలి = ఒప్పుచుండెడు, భుజ = బాహువులయొక్క, కేళి = విలాసముగల వాఁడగు, మల్లభూపాల మౌళి = మల్లభూపాలాగ్రణి, తనరున్ = ఒప్పును.
సాధారణధర్మము సుదృగ్జాతి వఱలఁజేయుట మొదలగునది. ‘శ్లో. సకలకలం పుర మేత జ్జాతం సమ్ప్రతి సుధాంశుబిమ్బ మివ’ అను స్థలమందుబలె నర్థకృతము గాక శ్లేషకృతమై శాబ్ద మైనది గాన, ఇందుఁ దనకలావిభవంబు తనకలావిభవంబుకరణి లోనగువానియం దుపమాలంకారము శబ్దాలంకారములోఁ జేర్పఁదగినది. ఇందుకుఁ బ్రమాణము కావ్యప్రకాశమునందు ‘శ్లో. స్ఫుట మర్థాలఙ్కారా వేతా వుపమా సముచ్చయౌ కింతు, ఆశ్రిత్య శబ్దమాత్రం సాధర్మ్య మిహాపి సమ్భవతః’ అని యున్నది. నానావనీభరణ మనుచోట శబ్దశ్లేషము. వసుధావధూవైరస్యమును గూర్చి సుదృగ్జాతిని వఱలఁజేయుట మొదలగు నవియుఁ గారణములు గాన పదార్థహేతుకకావ్యలింగాలంకారములును యథాసంఖ్యముగా సంభవించును. ‘సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్’ అని తల్లక్షణంబు. విషమాద్రీత్యాదిస్థలములందు శ్లేషోత్థాపితవ్యతిరేకము. తనకలావిభవంబు తనకలా విభవంబు మొదలగు వాని యందు యమకాలంకారము వ్యక్తము.
మ. అరిచక్రిధ్వజఖండనప్రబలబా◊హాభూతి దుశ్శాసనా
తిరయోన్మూలనపాండితీమహిమచే ◊దీవ్యన్మహాభీమసం
గరకౌతూహలవృత్తి మించె లలనా◊కంజాతబాణుండు మ
ల్లరసేంద్రుండు నిజాసిశంబదళితే◊లాభృన్మహాపక్షుఁడై. 30
టీక: లలనాకంజాతబాణుండు = స్త్రీలకు మదనప్రాయుండగు; మల్లరసేంద్రుండు = మల్లభూపాలుండు, ఇంద్రుం డనుటచేత దేవేంద్రవిషయక మగు నర్థాంతరము దోఁచుచున్నది; నిజాసి శంబ దళి తేలాభృ న్మహాపక్షుఁడై – నిజ = స్వకీయమగు, అసి శంబ = వజ్రాయుధతుల్య మగు ఖడ్గముచేత, ఖడ్గమగు వజ్రాయుధముచేత నని ఇంద్రపర మైన యర్థము, దళిత=ఖండింపఁ బడిన, ఇలాభృత్ = రాజులయొక్క, పర్వతములయొక్క, మహాపక్షుఁడై = అధికమైన సైన్యముగలవాఁడై, పర్వతపరమై నపుడు గొప్పఱెక్కలు గలవాఁడై యని అర్థము, ‘పక్ష స్సహాయే గరుతి’ అని విశ్వము; అరి చక్రి ధ్వజ ఖండన ప్రబల బాహా భూతి దుశ్శాసనాతిరయోన్మూలన పాండితీ మహిమచేన్ – అరి = శత్రువులయొక్క, చక్రి = రథములయొక్కయు, ధ్వజ = టెక్కెములయొక్కయు, ఖండన = తునుముటయందు, ప్రబల = బలిష్ఠములగు, బాహా = భుజములయొక్క, భూతి = సంపద యొక్కయు, దుశ్శాసన = దుర్మార్గులయొక్క, అతిరయ = అధికవేగముయొక్క, ఉన్మూలనపాండితీ = నాశవిషయకమైన పాండిత్యముయొక్క, మహిమచేన్ = మహిమచేతను; దీవ్యన్మహాభీమ సంగర కౌతూహలవృత్తిన్ – దీవ్యత్ = ప్రకాశించు చున్న, మహాభీమ = మిక్కిలి భయంకరమగు, సంగర = యుద్ధమందు, కౌతూహలవృత్తిన్ = సంతోషవృత్తి చేతను; ఇట మహా భీమ యనుచోట భీమసేనవిషయార్థాంతర మగును గాన తత్పరమైనపుడు – అరి = శత్రువగు, చక్రిధ్వజ = సర్పధ్వజుఁడగు దుర్యోధనునియొక్క, ఖండన = తునుముటయందు, ప్రబల = ప్రబలమగు, బాహాభూతి = భుజసంపదయొక్కయు, దుశ్శా సన = దుశ్శాసనునియొక్క, అతిరయ = అధికవేగముయొక్క, ఉన్మూలనపాండితీ = నాశముసేయుటయందలి పాండి త్యముయొక్కయు, మహిమచేన్ = మహిమచేతను, దీవ్యత్ = ప్రకాశించుచున్న, మహత్ = అధికమైన, భీమ = భీమసేనుని యొక్క, సంగర = యుద్ధమువంటి యుద్ధమందు, కౌతూహల వృత్తిన్ = కౌతుకవృత్తి చేతను; మించెన్ = అతిశయించెను.
ఇందు భీమేంద్రాదిశబ్దశక్తి ప్రస్తుతార్థపరముగా సంయోగాదులచే నియంత్రితంబైనను వ్యంజనావృత్తిచేత నప్రస్తుతభీమసేన పాకశాసనాద్యర్థములు బోధితము లగుచుండుటచే ప్రకృతాప్రకృతార్థముల కౌపమ్యము ధ్వనితమగును గాన వ్యంగ్యోపమ గాఁ దెలియవలయు. మతాంతరమున, ప్రకృతాప్రకృతగోచరశ్లేషాలంకారము నగును. అసిశంబ యనుచోట రూపకము. ‘శతకోటి స్స్వరు శ్శమ్బో దమ్భోళి రశని ర్ద్వయోః’ అని అమరము.
సీ. తా నెంతపుణ్యజ◊నీనుఁ డైనఁ దనధ,నంబు సూడ మహావ◊రంబ కాదె
తా నెంతరా జైనఁ ◊ దన వసుస్పర్శనా,డంబరం బెంచ జ◊డంబ కాదె
తా నెంతవారికి◊దా పైనఁ దనజీవ,నంబు సంప్రాప్తపం◊కంబ కాదె
తా నెంతఘనవృత్తి ◊ దాల్చి మిన్నందిన, విపులమౌ తనయీగి ◊విషమ కాదె
తే. యనుచు రారాజు రేరాజు ◊నబ్ధిరాజు
నంబుదంబును నిరసించు ◊ననఘదాన
మహిమ నాహిమగిరిసేతు◊మహితకీర్తి
పాళి సుగుణాళి మల్లభూ◊పాలమౌళి. 31
టీక: ఆహిమగిరిసేతుమహితకీర్తిపాళి – ఆహిమగిరిసేతు = ఆసేతుహిమాచలపర్యంతము, మహిత = ఒప్పుచున్న, కీర్తిపాళి = యశస్సమూహముగలవాఁడు; సుగుణాళి = శ్రేష్ఠమైన గుణముల సమూహముగలవాఁడు; మల్లభూపాలమౌళి = మల్లరాజ శ్రేష్ఠుఁడు; రారాజున్ = కుబేరుని; రేరాజున్ = చంద్రుని; అబ్ధిరాజున్ = క్షీరసముద్రమును; అంబుదంబును = మేఘమును; తా నెంతపుణ్యజనీనుఁ డైనన్ = తా నెంతపుణ్యాత్ములకు హితము చేయువాఁ డైనను, పుణ్యజను లనఁగా యక్షులు నగుదురు గనుక యక్షులకు హితముచేయువాఁడైనను అని యర్థాంతరము; తనధనంబు = తనయొక్కవిత్తము; చూడన్=విచారింపఁగా; మహత్ = మిక్కిలి; అవరంబ = నికృష్టమైనదే, మహత్ = అధికమైన, వరంబ = వరమను నిధిరూపమైనదే, ‘వరశ్చ నిధయో నవ’ అని యమరము; కాదె = కదా! తా నెంతరా జైనన్ = తా నెంత దొర యైనను; తన వసుస్పర్శనాడంబరంబు – తన వసు = తన ద్రవ్యముయొక్క, స్పర్శన = వితరణముయొక్క, ఆడంబరంబు = అతిశయము; జడంబ కాదె = జాడ్యసంపాదకమే కదా! చంద్రుని యొక్క వసువులు అనఁగా కిరణములయొక్కస్పర్శనాతిశయము జడం బనఁగా జలమయ మైనది, చల్లని దనుట. కార్యకారణములకు నభేదము నవలంబించి యిట్లు వ్యపదేశము సేయఁబడియె. ‘వసు ర్మయూఖాగ్ని ధరాధిపేషు యో క్త్రేలకే స్యా ద్వసు హాట కేపి వృద్ధ్యౌషధాశ్వీన ధనేషు రత్నే’ అని విశ్వప్రకాశిక. ‘స్పర్శనో మారుతే పుంసి దానేతు స్పర్శన మ్మతమ్’ అని విశ్వము.
తా నెంతవారికిన్ = తా నెంత దొడ్డవారలకు, ఎంత యుదకములకు; దా పైనన్ = ఆధారమైనను; తన జీవనంబు = తన బ్రతుకు, ఉదకము, ‘జీవనం భువనం వనమ్’ అని యమరము; సంప్రాప్తపంకంబ = సంప్రాప్తమగు పాపము కలది, బురద గలది, ‘పఙ్కం పాపే చ కర్దమే’ అని విశ్వము; కాదె = కదా!తా నెంతఘనవృత్తిన్ = తాను ఎంత ఘనమైన వృత్తిని, ఎంత మేఘవృత్తిని; తాల్చి = వహించి; మిన్నందినన్ = అతిశయించి నను, ఆకాశ మందినను; విపులమౌ తనయీగి = అధికమగు తన త్యాగము; విషమ కాదె = గరళమె, జలమె, ‘జీవనీయం కుశం విషమ్’ అని యమరము; కాదె = కదా! అనుచున్ = ఇట్లనుచు; అనఘ దాన మహిమన్ = నిర్దోషమగు దానాతిశయము చేత; నిరసించున్ = నిరాకరించును.
ఇందు నాలుగుచరణములయందుఁ జెప్పిన యర్థము వరుసగా గీతియందున్న రారాజు,రేరాజు, అబ్ధిరాజు, అంబుదము వీనితో నన్వయించుటచే యథాసంఖ్యాలంకారము. ఉపమానభూత కుబేరాదిత్యాగములయందు దోషోద్భావనము చేసి యుపమేయమల్లనృపాలత్యాగమందు నిర్దోషత్వరూపవిశేషము చెప్పుటచే శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారము. యథాసంఖ్య మునకు, వ్యతిరేకమునకును బరస్పర నైరపేక్ష్యము వలన సంసృష్టి.
మ. అలమల్లక్షితిభృద్వతంసము సప◊క్షాభిఖ్యఁ జెన్నొంది రాఁ
జలముల్ మాని ప్రతీపవార్ధిరశనా◊జానీంద్రు లొక్కుమ్మడిం
గలితోద్యచ్ఛతకోటిసాధనబల◊ఖ్యాతుల్ దిగం ద్రోచి స్వ
స్థలసౌఖ్యంబులు గోర కందిరి వన◊స్థానస్థితిం జిత్రతన్. 32
టీక: అలమల్లక్షితిభృద్వతంసము = ఆమల్లభూపాలాగ్రణి, పర్వతశ్రేష్ఠము అని అర్థాంతరము తోఁచుచున్నది; సపక్షాభిఖ్యన్ = శత్రువను పేరి చేతను, పర్వతపరమైనపుడు ఱెక్కలు గలదను ప్రసిద్ధిచేతను, పక్షముతోఁ గూడినది సపక్షము, పక్ష మనఁగా విరోధమును, పత్త్రమును, ‘పక్ష స్సహాయే గరుతి విరోధే బల మిత్రయోః’ అని హలాయుధము; చెన్నొంది = ఒప్పి; రాన్ = రాఁగా; ప్రతీపవార్ధిరశనాజానీంద్రులు – ప్రతీప = శత్రువులగు, వార్ధిరశనాజానీంద్రులు = రాజశ్రేష్ఠులు, వార్ధిరశనాజాని యను చోట ‘వార్ధిరశనా జాయా యేషాం తే’ అని విగ్రహము చేసినపుడు ‘జాయాయా నిఙ్’ అను సూత్రముచేత నిఙాదేశము, ఇచట నింద్రులు అను పదముచేత దేవేంద్రరూపార్థాంతరము దోఁచుచున్నది; చలముల్ =మాత్సర్యములను; మాని = వదలి; ఒక్కు మ్మడిన్ = ఒక మొత్తముగా; కలితోద్యచ్ఛతకోటిసాధనబలఖ్యాతుల్ – కలిత = సంబంధించి యున్నట్టి, ఉద్యత్ = సన్నద్ధ మగుచున్న, శతకోటి = శతకోటిసంఖ్యాకమైన, ఇంద్రపరమైనపుడు వజ్ర మనెడు అని యర్థము, సాధన = యుద్ధసాధనములు గల, బల = సైన్యములు గలవారను, పరాక్రమము గలవారను అని ఇంద్రపరమైన యర్థము, ఖ్యాతుల్ = యశస్సులను; దిగం ద్రోచి = దిగువఁ బడవైచి; స్వస్థలసౌఖ్యంబులు = తమ యునిపట్టునందలి సౌఖ్యములను, స్వర్గస్థలసౌఖ్యముల నని ఇంద్రపర మైన యర్థము; కోరక = ఆశింపక; వనస్థానస్థితిన్ = వనస్థలనివాసమును; చిత్రతన్ = ఆశ్చర్యమగునట్లుగా; అందిరి = పొందిరి. సపక్షమైన యొక పర్వతము రాఁగా నింద్రులు వజ్రముఁ బడవైచి స్వర్గమును వదలి వనములకుఁ బోవుట చిత్రము. మల్ల భూపతి యుద్ధమునకు బయలుదేఱి రాఁగా శత్రురాజు లందఱుఁ దమ నివాసములం గల సర్వవిధసౌఖ్యములను, సమస్తపరి వారమును వదలి యడవుల పాలైరి యని భావము. దీని వలన వర్ణ్యుఁడు లోకోత్తరవీరుఁ డని వ్యంగ్యము. స్వస్థలసౌఖ్య మను చోట నింద్రపరమైనపుడు ‘స్వర్’ అను శబ్దములోని రేఫమునకు ‘ఖరవసానయోర్విసర్జనీయః’ అను సూత్రముచే రేఫమునకు విసర్గము వచ్చి, ‘ఖర్పరే శరి వా విసర్గలోపో వక్తవ్యః’ అను వార్తికముచే విసర్గమునకు లోపము వచ్చినదని యెఱుంగునది.
క. ఆ మల్లనృపతి చెన్నాం,బామానినియందుఁ గాంచె ◊మల్లక్షితిపున్
వ్యోమగవీసోమగవీ, రామగవీశాచ్ఛకీర్తి◊రాజన్మూర్తిన్. 33
టీక: ఆ మల్లనృపతి = ఆ మల్లనృపాలుఁడు; చెన్నాంబామానినియందున్ = చెన్నాంబికయందు; వ్యోమగవీ సోమగవీ రామ గవీశాచ్ఛకీర్తిన్ – వ్యోమగవీ = కామధేనువువలె, సోమగవీ = చంద్రకిరణమువలె, రామ = బలరామునివలె, గో = వజ్రాయు ధమువలె నని కాని సరస్వతివలె నని కాని, ఈశ = శివునివలె, అచ్ఛ = స్వచ్ఛమగు, కీర్తిన్ = యశస్సు గలవాఁడును; రాజ న్మూర్తిన్ = ప్రకాశించుచున్న శరీరము గలవాఁడును, అగు, మల్లక్షితిపున్ = మల్లభూపాలుని; కాంచెన్ = కనెను; వ్యోమగవీసోమగవీ యను చోటుల గోశబ్దము మీఁద సమాసాంతటచ్ప్రత్యయము వచ్చి ఙీప్ప్రత్యయము రాఁగా గవీ యను రూపము సిద్ధించినది. గవీశ యను చోట ‘ గౌశ్చ ఈశశ్చ’ యను ద్వంద్వసమాసమందు అవాదేశము వచ్చి గవీశ యని రూప మైనది.
సీ. తన యశశ్ఛద్మజీ◊వనజాతమునకుఁ దో,యదపథంబు మధుప్రి◊యంబు గాఁగఁ
దన కలాదంభన◊ర్తకికి వేలాగోత్ర,పరివృతాచల చారు◊ఖురళి గాఁగఁ
దన ప్రతాపవ్యాజ◊దావవహ్నికిఁ దార,కాసంతతుల్ స్ఫులిం◊గములు గాఁగఁ
దన ధర్మకైతవ◊ధారాళవల్లికిఁ, గాంచనాచల ముప◊ఘ్నంబు గాఁగఁ
తే. దన మహోదారతోపధి◊వనదతతికిఁ, గాండరుహజాండకోటు ల◊ఖండకరక
కాండములు గాఁగ బింకోలు◊గండబిరుద,కాంతుఁ డిల నేలె మల్లభూ◊కాంతుఁ డెలమి. 34
టీక: తన యశశ్ఛద్మజీవనజాతమునకున్ – తన = తనయొక్క, యశః = కీర్తి యనెడు, ఛద్మ= నెపముగల, జీవనజాతమున కున్=పుండరీకమునకు, ‘జీవనం భువనం వనమ్’ అని అమరము; తోయదపథంబు – తోయద=మేఘములయొక్క, పథంబు = మార్గమగు నాకాశము; మధుప్రియంబు = తుమ్మెద; కాగన్ = అగుచుండఁగా;తన కలాదంభనర్తకికిన్ – తన = తనయొక్క, కలా = విద్య యనెడు, దంభ= వ్యాజముగల, నర్తకికిన్ = నటికి; వేలాగోత్రపరి వృతాచల – వేలాగోత్ర = లోకాలోకపర్వతముచేత, పరివృత = పరివేష్టింపఁబడిన, అచల = భూమి; చారుఖురళి కాఁగన్ = మనోహరమగు గరిడి యగుచుండఁగా; తన ప్రతాపవ్యాజదావవహ్నికిన్ – తన = తనయొక్క; ప్రతాప = ప్రతాప మనెడు; వ్యాజ = కపటము గల; దావవహ్నికిన్ = దావానలనముకు; తారకాసంతతుల్ = నక్షత్రసమూహములు; స్ఫులింగములు = మిడుఁగురులు; కాగన్ = అగుచుండఁగా; తన ధర్మకైతవధారాళవల్లికిన్ – తన = తనయొక్క; ధర్మ= ధర్మమనెడు; కైతవ = దంభము గల; ధారాళ = రూఢమైన; వల్లికిన్ =లతకు; కాంచనాచలము = మేరుపర్వతము; ఉపఘ్నంబు= అంతికాశ్రయము, అనఁగా తీఁగ వాఱుటకు సమీపమునఁ బాఁతిన కొయ్యవంటిది, ‘స్యాదుపఘ్నోన్తికాశ్రయే’ అని అమరము; కాఁగన్ = అగుచుండఁగా; తన మహోదారతోపధివనదతతికిన్ – తన = తనయొక్క; మహోదారతా = ఉత్కృష్టదాతృత్వ మనెడు; ఉపధి=నెపము గల; వనదతతికిన్ = మేఘసంఘమునకు; కాండరుహజాండకోటులు – కాండరుహ = కమలమందు, ‘కాండో స్త్రీ దణ్డ బా ణార్వ వర్గావసర వారిషు’ అని యమరము, జ= పుట్టిన, బ్రహ్మదేవుని సంబంధు లైన, అండకోటులు = బ్రహ్మాండకోటు లనుట; అఖండకరకకాండములు కాఁగన్ = అఖండములగు వర్షోపలము లగుచుండఁగా, ‘వర్షోపలస్తు కరకా’ అని యమరము; బింకోలుగండబిరుదకాంతుఁడు = బింకోలుగండ యను బిరుదముచేత మనోహరుఁడు; మల్లభూకాంతుఁడు = మల్లభూపతి; ఇలన్ = భూమిని; ఎలమిన్ = సంతోషముతో; ఏలెన్ = పాలించెను.
మల్లభూపతి కీర్తి బ్రహ్మాండము నావరించినదనియు, విద్యావిభవము లోకాలోకపర్వతమునకు లోనగు సప్తద్వీపములు వ్యాపించిన దనియు, ప్రతాపాగ్ని మిన్నంది మించుచున్న దనియు, ధర్మము మేరుపర్వతము దాఁక వ్యాపించిన దనియు, త్యాగము బ్రహ్మండకోటుల నతిక్రమించి ప్రసరించిన దనియు భావము.
ఇం దత్యుక్త్యలంకారము. ‘శ్లో.అత్యుక్తి రద్భుతాతథ్య శౌర్యౌదార్యాది వర్ణనమ్’ అని తల్లక్షణము. తోయదపథ వేలాగోత్ర పరివృతాచలా తారకాసంతతి కాంచనాచల బ్రహ్మాండములను మధుప్రియత్వ ఖురళిత్వ స్ఫులింగ త్వోపఘ్నత్వ కరకత్వ రూపముగ రూపించుటచే రూపకాలంకారము. యశశ్ఛద్మ కలాదంభ ప్రతాపవ్యాజ ధర్మకైతవ మహోదారతోపధి యను స్థలములయందుఁ గైతవార్థకపదములచే యశఃప్రభృతుల నిహ్నవవ్యక్తి యగుటంజేసి కైతవాపహ్నుత్యలంకారము. ‘కైతవా పహ్నుతి ర్వ్యక్తౌ వ్యాజాద్యై ర్నిహ్నుతేః పదైః’ అని లక్షణము.
మ. అరు దై మల్లధరాధినాయక సము◊ద్యద్భూరిధారాధరం
బరిరాడాశుగభేదశక్తిఁ బటు మి◊త్రాలోకమోదప్రదో
త్తరలీలావిభవాప్తి శత్రువనితా◊తాపాస్పదస్ఫూర్తిచే
ధరఁ దార్చుం బరవాహినీవితతి కు◊ద్భ్రాజత్కబంధాఢ్యతన్. 35
టీక: ఇచట మల్లభూపతిఖడ్గమును వర్ణింపఁగా మేఘపరమైన యర్థాంతరము దోఁచుచున్నది.
మల్లధరాధినాయక సముద్యద్భూరి ధారాధరంబు – మల్లధరాధినాయక = మల్లభూపాలునియొక్క, సముద్యత్ = పైకి లేచిన, భూరి = సువర్ణమయ మగు, ‘భూరి ప్రాజ్య సువర్ణయోః’ అని విశ్వము, ధారాధరంబు = ఖడ్గము, మేఘ మని యర్థాంతరము, ‘ధారాధర స్తోయధరే కృపాణే’ అని విశ్వము; అరిరాడాశుగభేదశక్తిన్ – అరిరాట్ = శత్రురాజులయొక్క, ఆశుగ = బాణముల యొక్క, శత్రుశ్రేష్ఠ మైన వాయువుయొక్క, ఇచట వాయువు మేఘమునకు శత్రు వనుట ‘ శ్లో. ఉల్లాస్య కాలకరవాల మహామ్బు వాహం దేవేన యేన జరఠోర్జితగర్జితేన| నిర్వాపిత స్సకల ఏవ రణే రిపూణాం ధారాజలై స్త్రిజగతి జ్వలితప్రతాపః’అను దానిలోఁ బర్జన్యుఁడు దావానలమునకు శత్రువను ప్రమాణము కావ్యదర్పణమునందు వ్రాసిన రీతిగఁ దెలియునది, భేద = భంగపఱచుట యందు, శక్తిన్ = సామర్థ్యముచేతను; పటు మిత్రాలోక మోదప్రదోత్తర లీలావిభవాప్తిన్ – పటు = సమర్థమగు, మిత్రాలోక = మిత్రులయొక్క చూపులకు, సూర్యతేజస్సునకు, మోదప్రద = సంతోషకరమగు, ఉత్తర = లోకోత్తరమైన, లీలావిభవ = విలాసా తిశయముయొక్క, ఆప్తిన్ = ప్రాప్తిచేత; శత్రువనితాతాపాస్పదస్ఫూర్తిచేన్ – శత్రువనితా = శత్రుస్త్రీలయొక్క, తాప= సంతాప మునకు, వేఁడిమికి, ఆస్పద=ఆధారమగు, స్ఫూర్తిచేన్=ప్రకాశముచేతను; అరు దై=ఆశ్చర్యకర మై; ధరన్ = భూమియందు; పరవాహినీ వితతికిన్ – పరవాహినీ = శత్రుసైన్యములయొక్క, గొప్పనదులయొక్క, వితతికిన్ = గుంపునకు; ఉద్భ్రాజత్ కబంధాఢ్యతన్ – ఉద్భ్రాజత్ = మిక్కిలి ప్రకాశించుచున్న, కబంధ = మొండెములయొక్క, ఉదకముయొక్క, ఆఢ్యతన్ = పూర్ణతను; తార్చున్ = కలిగించును.
మేఘమునకు స్వభావముగ వాయువుచేతఁ గొట్టఁబడుటయు, సూర్యతేజస్సున కప్రకాశకంబుగ నుండుటయుఁ దాప శాంతిఁ జేయుటయుఁ గలిగి యుండఁగా దానికి విపరీతముగ నాశుగభేదనము, మిత్రాలోకమోదప్రదత్వము, తాపకరణము, నాశ్చర్యకర మని యాశయము.
మల్లభూపతి ఖడ్గముచేత శత్రుల బాణపరంపరల నడఁచి వారిని సేనలతోఁ గూడ బీనుఁగుఁబెంటలు గావించి వారి వనిత లకు సంతాపమును గూర్చి మిత్రులకు నేత్రోత్సవము గావించె నని భావము. ఇట ఖడ్గమునందు వారిదసామ్యము వ్యజ్యమాన మగును. కావున వ్యంగ్యోపమ.
సీ. రాజచంద్రులు గాని ◊రాజచంద్రులు గారు, తర మూన్ప నరిదాన◊దానపటిమ,
నచలేశ్వరులు గాని ◊యచలేశ్వరులు గారు, సరి సేయ ధృతిసంగ◊సంగరముల,
నినకుమారులు గాని ◊యినకుమారులు గారు, కదియింప రుచికాండ◊కాండకలన,
గోపాత్మజులు గాని ◊గోపాత్మజులు గారు, పాటి వాగనుభావ◊భావగరిమ,
తే. ననుచు జగ మెన్నఁ బొగడొందు ◊హారిమండ
లాగ్రఖండితరిపుమండ◊లప్రవీర
కాండనిర్భిన్నమార్తాండ◊మండలాంత
రుండు పెదమల్లనాయకా◊ఖండలుండు. 36
టీక: హారి మండలాగ్ర ఖండిత రిపుమండలప్రవీరకాండ నిర్భిన్న మార్తాండమండలాంతరుండు – హారి = మనోహర మగు, మండలాగ్ర = ఖడ్గముచేత, ఖండిత = నఱకఁబడిన, రిపుమండలప్రవీరకాండ = శత్రువీరుల గుంపుచేత, నిర్భిన్న= భేదింపఁ బడిన, మార్తాండమండలాంతరుండు = సూర్యమండలమధ్యభాగము గల వాఁడగు, ‘శ్లో. ద్వా విమౌ పురుషౌ లోకే సూర్య మండలభేదినౌ, పరివ్రాడ్యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః’ అని మనువు; పెదమల్లనాయకాఖండలుండు = పెదమల్ల భూపాలేంద్రుఁడు; జగము = లోకము; అరిదానపటిమన్ – అరిదాన = పగతుర తురుముటయొక్క, దాన= త్యాగముయొక్క, పటిమన్ = సమర్థతయందు; తర మూన్పన్ = సాటి చేయుటకు; రాజచంద్రులు గాని = ఇంద్రుఁడు, చంద్రుఁడు గాని, రాజ చంద్రులు గారు = నృపశ్రేష్ఠులు గారు, ‘రాజా ప్రభౌ నృపే చన్ద్రే యక్షే క్షత్త్రియ శక్రయోః’ అని విశ్వము; ఇట నరిఖండనమందు నింద్రుఁడు, వితరణమందుఁ జంద్రుఁడు సము లగుదురని క్రమాన్వయము. నాలుగు పాదములం దిట్లే చూడవలెను. ధృతిసంగసంగరములన్ = ధైర్యసంగమునందును, యుద్ధములందును; సరి సేయన్ = పోల్చుటకు; అచలేశ్వరులు గాని = మేరుపర్వతము, రుద్రుండు గాని; అచలేశ్వరులు = భూమిపతులు; కారు = సరిగారు; రుచికాండకాండకలనన్ – రుచికాండ = కాంతిపరంపరలయొక్క, కాండ = బాణములయొక్క, కలనన్ = కూడికయందు; కదియింపన్ = పోల్చుటకు; ఇనకుమా రులు గాని = సూర్య స్కందులు గాని; ఇనకుమారులు గారు = రాజపుత్రులు గారు, ‘ఇన స్సూర్యే ప్రభౌ’ అని యమరము; వాగనుభావభావగరిమన్ – వాగనుభావ = వాక్సామర్థ్యముయొక్క, భావ =విలాసముయొక్క, గరిమన్=అతిశయమునందు; పాటి = సమానులు; గోపాత్మజులు గాని = గీష్పతి మదనులు గాని; గోపాత్మజులు గారు = భూపాలకుమారులు గారు; అనుచున్ = ఇట్లనుచు; ఎన్నన్ = గణింపఁగా; పొగడొందున్ = ఘనత కెక్కును;
ఇందు యథాసంఖ్య మలంకారము. దానదాన, సంగసంగ, లోనగువానియందు ఛేకానుప్రాసము. మండలాగ్రఖండితే త్యాదియందు బిందుపూర్వక డకారము పలు మాఱుఁ గూర్చుటచేత ‘ఏకస్యా ప్యసకృ త్పరః’ అను లక్షణముచే వృత్త్యను ప్రాసము. రాజచంద్రులు మొదలగునవి రెండు మాఱులు వచ్చుటచేత యమకము.
ఉ. పూనిక బాలచాపలముఁ ◊బొందు నిభప్రకరంబు, గుడ్లలోఁ
గూన బిలేశయాధిపుఁడు, ◊గూర్మము సూడ శిరంబు నిల్ప లే,
దానగపాళియున్ నడవ◊నైనను నేర దటంచు మేదినీ
మానిని సేరె నౌర పెద◊మల్లమహీను నహీనయౌవనున్. 37
టీక: ఇభప్రకరంబు = దిగ్గజసమూహము; పూనికన్ = ప్రయత్నముచేత; బాలచాపలమున్ – బాల = బాలునియొక్క, తోఁక యొక్క యని భావము, ‘శసయో ర్వబయో స్తథా’ అనుటచేత నిట బకార,వకార ముల కభేద మవలంబింపఁబడినది, చాప లము = చాంచల్యమును, పొందున్ =పొందును ; బిలేశయాధిపుఁడు = ఆదిశేషుఁడు, గుడ్లలోఁ గూన = మిక్కిలి పసివాఁ డనుట, సర్పము లండజములు గాన గుడ్లలోఁగూన శేషుం డని భావము; కూర్మము = ఆదికూర్మము; చూడన్ = పరికింపఁ గా; శిరంబు నిల్ప లేదు = మెడలు నిలుపఁ జాల నంతటి బాల్యము గల దనుట, కూర్మము స్వభావముగా శిరంబు నిల్ప కుండుట ప్రసిద్ధము; ఆనగపాళియున్ = ఆకులాచలసమూహమును; నడవనైనను నేరదు – నడచుటకు నేరనంత బాల్యము గలది, పర్వతములు నడవకుండుట స్వభావము; అటంచున్ = అట్లనుచు; అహీనయౌవనున్ = పూర్ణయౌవనము గలయట్టి; పెదమల్లమహీను = పెదమల్లభూపాలుని; మేదినీమానిని = భూరమణి; చేరెన్ = పొందెను; ఔర! పెదమల్లభూపాలుం డెల్ల ధరణి నేలె నని భావము. ఇచట నుపమేయాధిక్యపర్యవసాయి యగు శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారము.
శా. ఆమల్లక్షితినాథరత్నకరదీ◊వ్యన్మండలాగ్రాంశుమ
ద్ధామస్థేమ రణాగ్రసీమ నరిగో◊త్రశ్రేణులం దూల్చు ను
ద్దామప్రౌఢిమఁ గేతువుం దునుము ను◊ద్యత్పుండరీకంబులన్
భూమిన్ వ్రాల్చు సురాళి గన్గొనఁ బురా◊భూతేతరప్రక్రియన్. 38
టీక: ఆ మల్లక్షితినాథరత్నకర దీవ్య న్మండలా గ్రాంశుమద్ధామ స్థేమ – ఆ మల్లక్షితినాథరత్న = ఆ మల్లభూపాలుఁ డను రాజ రత్నముయొక్క, కర = హస్తమందు, దీవ్యత్ = ప్రకాశించుచున్న, మండలాగ్ర = ఖడ్గమనెడు, అంశుమద్ధామ = సూర్యతేజము యొక్క, స్థేమ = స్థిరాంశము; రణాగ్రసీమన్ = యుద్ధాగ్రభాగమునందు; సురాళి కన్గొనన్ = దేవసంఘము చూచుచుండఁగా; పురా భూతేతర ప్రక్రియన్ – పురా = పూర్వమందు, భూతేతర = పుట్టనట్టి, ప్రక్రియన్ = వ్యాపారముచేతను, మునుపు తనకు లేని నడవడిచేత ననుట; అరిగోత్రశ్రేణులన్ – అరి =చక్రవాకములయొక్క, గోత్ర=కులములయొక్క, శ్రేణులన్=సంఘములను, శత్రువంశసంఘములనని యర్థాంతరము; తూల్చున్ = తొలఁగించును; ఉద్దామప్రౌఢిమన్ = ఉత్కృష్ట మైన నేర్పుచేతను; కేతువున్ = కేతుగ్రహమును,ధ్వజమును; తునుమున్ = ఖండించును; ఉద్యత్పుండరీకంబులన్ = ప్రకాశించుచున్న తెల్లదామ రలను, గొడుగులను; భూమిన్= భూమియందు; వ్రాల్చున్= పడవైచును.
సూర్యతేజస్సునకు జక్కవలగుంపులు దూల్చుట, తెల్లదామరలను వ్రాల్చుట, స్వభావవిరుద్ధము గాన నపూర్వవ్యాపా రముగా వర్ణితం బయ్యె నని భావింపవలయును. మల్లభూపాలుఁడు ఖడ్గముచే శత్రుసంఘమును దూల్చి వారి పతాకలను, శ్వేత చ్ఛత్రములను భూమికి వ్రాల్చి జయము గాంచె నని భావము. ఇందు శ్లిష్టశబ్దనిబంధనకేవలపరంపరితరూపకాలంకారము.
తే. ఆ ధరాధిపుసతులు లిం◊గాంబ, కొమ్మ
మాంబికయు, నలచిన్నలిం◊గాంబ, వేంక
టాంబ, మల్లాంబ నా మించి ◊రాత్మనాథ
సేవనాయత్తచిత్తతా◊స్థేమ, నందు. 39
టీక: ఆ ధరాధిపుసతులు = ఆ మల్లభూపాలుని భార్యలు; లింగాంబ, కొమ్మమాంబికయు, చిన్నలింగాంబ, వేంకటాంబ, మల్లాంబ, నాన్ = అనఁగ, ఆత్మనాథసేవనాయత్తచిత్తాస్థేమన్ – ఆత్మనాథ =తమ ప్రియునియొక్క, సేవనాయత్త = సేవాపర తంత్రమగు, చిత్తతా = చిత్తము గలుగుటయొక్క, స్థేమన్ = స్థితిచేత, మించిరి = అతిశయించిరి; అందున్ = వారలయందు. దీనికిఁ బాశ్చాత్యజడరాశి యను నగ్రిమపద్యముతో నన్వయము.
సీ. పాశ్చాత్యజడరాశిఁ ◊బ్రాపించి నర్మద, యగుచు వర్తిలు రేవ ◊నతకరించి,
రాగభూయిష్ఠాత్మ ◊రహి సర్వతోముఖ, వర్తన గల సర◊స్వతిని గేరి,
బహులపంకోదిత◊పద్మోదయంబున, మలిన యై తగు నర్య◊మసుత నాడి,
నీచోపసర్పణ◊నియతభంగావాప్తి, వెలవెల నౌ జాహ్న◊విని హసించి,
తే. సాధుభాషానుగతిఁ జారు◊చరితయుక్తి, నిత్యనిర్మలచిత్తత ◊నిరుపమాన
కాంతిసంక్రాంతి నుప్పొంగుఁ ◊గవిజనాంత, రంగరంగద్గుణాలంబ ◊లింగమాంబ. 40
టీక: కవిజనాంతరంగ రంగద్గుణాలంబ – కవిజనాంతరంగ = కవిహృదయములయందు, రంగత్ = నాట్యము చేయుచున్న, గుణ = సౌశీల్యాదిగుణములు, ఆలంబ = ఆలంబముగాఁ గల; లింగమాంబ = లింగాంబిక;
పాశ్చాత్యజడరాశిన్ – పాశ్చాత్య = పశ్చిమదేశమునందుఁ బుట్టిన, ‘దక్షిణా పశ్చా త్పురస స్త్యప్’ అని పశ్చాచ్ఛబ్దముమీఁద భవార్థమున త్యప్ప్రత్యయము, జడరాశిన్ = మూర్ఖసమూహమును, అనఁగా వేదబాహ్యు లగుటచే జడులని చెప్పఁబడు హీనజాతులను; ప్రాపించి = పొంది; నర్మద యగుచున్ = నర్మోక్తుల నిచ్చునది యగుచు; వర్తిలు రేవన్ = వర్తించుచున్న రేవా నదిని, డకారలకారముల కభేదము గనుక పశ్చిమ దేశమునందున్న జలరాశి ననఁగా సముద్రమును ప్రాపించినర్మద యను నామము గలదై వర్తిల్లునట్టి రేవా నది యని భావము ; అతకరించి = తక్కువగాఁ జేసి; రాగభూయిష్ఠాత్మన్ = అనురాగముచేత భూయిష్ఠ మగు మనస్సుచేత; రహిన్ = ఆసక్తితో; సర్వతోముఖవర్తన = నానా ప్రకారమగు వృత్తి; కల సరస్వతిని = కలిగినట్టి సరస్వతీనదిని, రక్తగుణము చేత భూయిష్ఠమగు ఆత్మ యనఁగా దేహము గలిగి సర్వతోముఖవర్తన మనఁగా జలరూపముగా నున్కి గలిగినట్టి సరస్వతీ నది నని భావము, సరస్వతీనదీజలము రక్త మగుట ప్రసిద్ధము; కేరి = పరిహసించి; బహులపంకోదితపద్మోదయంబునన్ – బహుల = అధికమగు, పంక = పాపమువలన, ఉదిత = కలిగినట్టి, పద్మా= సంపద యొక్క, ఉదయంబునన్ = అభివృద్ధిచేత; మలిన యై తగు అర్యమసుతన్ = పాపిష్ఠ యగు యమునను, బహలమగు పంక మనఁగా బురద,అందుజన్మించిన పద్మములయొక్క యుదయమున నొప్పి, మలిన యనఁగా నల్లని స్వరూపము గలదై తగు నర్యమసుత నని భావము; ఆడి = నిందించి; నీచోపసర్పణనియతభంగావాప్తిన్ – నీచోపసర్పణ = క్షుద్రులననువర్తించుటచేత, నియత = నియత మగు, భంగ = మర్యా దాదినాశముయొక్క, అవాప్తిన్ = పొందుటచేత; వెలవెల నౌ = చిన్నపోయిన; జాహ్నవిని = గంగను; హసించి = పరిహా సము చేసి; నిమ్నప్రదేశోన్ముఖి యై నియతము లగు తరఁగలయొక్క ప్రాప్తిచేత మిగులఁదెల్లనౌ జాహ్నవిని హసించి యని భావము. గీతియందు వ్యతిరేకవిశేషణములకుఁ గ్రమము. సాధుభాషానుగతిన్ – సాధుభాష = వేదవిద్య గలవారియొక్క, అనుగతిన్ = అనుసరణముచేతను; చారుచరితయుక్తిన్ = సచ్చరిత్రల యోగముచేతను; నిత్యనిర్మలచిత్తతన్ = నిరంతరము నిర్మల మగు చిత్తము గలిగి యుండుటచేతను; నిరుపమాన కాంతిసంక్రాంతిన్ = అసమాన మగు కాంతితోఁ గూడి యుండుటచేతను; ఉప్పొంగున్ = అతిశయించును.
లింగమాంబ గంగా యమునా సరస్వతీ నర్మదా నదులతోఁ దుల్యమగు నిర్మలస్వభావము గలదని తాత్పర్యము. శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారము.
సీ. ఆ లింగమాంబిక◊యం దరాతిబలప్ర,భేదనచణు మల్ల◊భిదురపాణిఁ,
దారకాత్మభయప్ర◊దప్రభావిస్ఫూర్తి, నతిశక్తియుతు వేంక◊టాద్రిగుహునిఁ,
జినలింగమాంబయం◊దు నవీనపంకజా◊తార్దను లింగనృ◊పాబ్జవైరి,
వేంకటాంబికయందు ◊విపులవనీపాల,నక్షముఁ జినలింగ◊నరపసురభి,
తే. బహుళశార్వరపాటన◊పటువిహారి, నంతరస్థాపితాబ్జనే◊త్రాంచితాను
భావుఁ జినమల్లభూపాల◊పద్మహితుని, గాంచెఁ బెదమల్లమేదినీ◊కాంతుఁ డెలమి. 41
టీక: పెదమల్లమేదినీకాంతుఁడు = పెదమల్లభూపాలుఁడు; ఆ లింగమాంబికయందు = ఆ లింగాంబికయందు; అరాతిబల ప్రభేదనచణున్ – అరాతి = శత్రువగు, బల = బలాసురునియొక్క, ప్రభేదనచణున్ = భేదించుటచేత ప్రఖ్యాతుని; అరాతి =శత్రువులయొక్క, బల =సైన్యముయొక్క, ప్రభేదనచణున్ = భేదించుటచేతఁ బ్రఖ్యాతుఁ డైన; మల్లభిదురపాణిన్ = మల్ల భూపాలుం డనెడు నింద్రుని; తారకాత్మభయప్రదప్రభావిస్ఫూర్తిన్ – తారకాసురుని మదికి భయప్రదమగు తేజోతిశయము గల వానిని; తారకా = నక్షత్ర ములయొక్క, ఆత్మ = స్వరూపములకు, భయప్రదప్రభావిస్ఫూర్తిన్ = భయప్రదమగు కాంత్యతిశయము గలవాని; అతిశక్తి యుతున్ = అధికమగు శక్తి యను నాయుధముతోఁగూడినవాని (కుమారస్వామిని), అతిసామర్థ్యయుక్తుఁడైన వానిని; వేంక టాద్రిగుహునిన్ = వేంకటాద్రినాయకుఁ డను స్కందుని; చినలింగమాంబయందున్ = చినలింగాంబికయందు; నవీనపంకజాతార్దనున్ – నవీన = నూతనమగు, పంకజాత = పద్మము లను, అర్దనున్ = పీడించువానిని, నూతన మగు పాపసంఘనాశకుని ననుట; లింగనృపాబ్జవైరిన్ = లింగరాజనెడు చంద్రుని, వేంకటాంబికయందున్ = వేంకటాంబయందు; విపులవనీపాలనక్షమున్ – విపుల = అధికములగు, వనీ = వనములయొక్క, పాలన = రక్షణమందు, క్షమున్ = సమర్థుని; విపుల = విపులమగు, వనీప = యాచకులయొక్క, ఆలన = అలంకరణ మందు, క్షమున్ = సమర్థుని; చినలింగనరపసురభి = చినలింగభూపాలుఁ డను వసంతుని, బహుళశార్వరపాటనపటువిహారిన్ – బహుళ = అధికమగు, శార్వర = అంధకారముయొక్క, పాటన = భేదించుటయందు, దుర్మార్గులయొక్క భేదనమందు, ‘శార్వరం త్వన్ధతమసే శార్వరో ఘాతుకే స్మృతః’ అని విశ్వము; పటువిహారిన్ = లెస్సగాఁ గ్రీడించువాని; అంతరస్థాపితాబ్జనేత్రాంచితానుభావున్ – అంతరస్థాపిత = హృదయనిహిత మగు, అబ్జనేత్ర = విష్ణువుయొక్క, అంచిత = ఒప్పునట్టి, అనుభావున్ = ప్రభావము గలవానిని, పక్షద్వయమం దిదె యర్థము; చినమల్లభూపాలపద్మహితుని = చినమల్ల భూపాలుఁడను సూర్యుని; కాంచెన్ = కనెను. ఈ పద్యమందు శ్లిష్టశబ్దనిబంధనకేవలపరంపరితరూపకాలంకారము లైదు. వానికిఁ బరస్పర నిరపేక్షతను బట్టి సంసృష్టి.
ఉ. అందును వేంకటాద్రివిభుఁ ◊డచ్యుతసాయకనాయకాగ్రిమ
స్పందనిపాతితారిపుర◊సంతతియై, కమలాధిపాంచితా
మందమహాశయాంకుఁ డయి, ◊మాన్యగణావనలోలచిత్తసం
బంధపరీతుఁడై, జగతి ◊భాసిలె నౌర బుధుల్ నుతింపఁగన్. 42
టీక: అందును =ఆ పుత్రులలో; వేంకటాద్రివిభుఁడు =వెంకటాద్రిరాజు, వేంకటాద్రిశివుఁడు,ఇచట ‘విభు శ్శివే ప్రభౌ నిత్యే’ అను విశ్వనిఘంటువువలన శివరూపార్థము గూడ స్ఫురించుచున్నది;అచ్యుత సాయకనాయ కాగ్రిమస్పంద నిపాతితారిపుర సంతతి యై – అచ్యుత= చెడనట్టి విష్ణుమూర్తి యనెడు, సాయకనాయక = బాణశ్రేష్ఠముయొక్క, అగ్రిమస్పంద = ప్రథమ చలనముచేత, నిపాతిత =నశింపఁజేయఁబడిన,అరిపుర = శత్రుశరీరములయొక్క, శత్రుపురులయొక్క,త్రిపురములయొక్క యనుట, సంతతి యై = వంశము గలవాఁడై, పరంపర గలవాఁడై ; కమలాధి పాంచి తామంద మహాశయాంకుఁడయి – కమలాధిప =విష్ణువుచేత, మృగశ్రేష్ఠముచేతను, అంచిత = ఒప్పెడు, అమంద = అధికమగు, మహాశయ= దొడ్డ హృదయము యొక్క, మహత్ = పూజ్యమగు, శయ =హస్తముయొక్క, ‘పఞ్చశాఖ శ్శయఃపాణిః’ అని అమరము, అంకుఁడయి = చిహ్నము గలవాఁడై; మాన్యగ ణావన లోల చిత్త సంబంధ పరీతుఁడై – మాన్యగణ=ప్రాజ్ఞసంఘముయొక్క, పూజ్యులగు ప్రమథులయొక్క, అవన = రక్షణమందు, లోల = ఆసక్తమైన, చిత్త = చిత్తముయొక్క, సంబంధ = సంబంధముచేత, పరీతుఁడై = వ్యాప్తుఁడై, అట్టి చిత్తము గలవాఁడై యనుట; జగతిన్ =లోకమందు; బుధుల్ నుతింపఁగన్ = పండితులు, దేవతలు స్తుతి చేయఁగా; భాసిలెన్= ప్రకాశించెను; ఔర=ఆశ్చర్యము.
అనఁగా రుద్రుండేరీతిఁ ద్రిపురముల నచ్యుతుఁ డను సాయకాగ్రిమస్పందముచే నాశముఁ జేసి జగములయందు భాసిల్లెనో యారీతి వేంకటాద్రివిభుఁడును సాయకములచే శత్రుశరీరములను దునిమి జగతిని భాసిల్లె నని భావము. ఉపమాలంకారధ్వని.
సీ. పటుపుండరీకసం◊కటగృహశ్రేణికల్, పటుపుండరీకసం◊కటము లయ్యెఁ,
బృథులాచ్ఛభల్లవి◊స్తృతచత్వరమ్ములు, పృథులాచ్ఛభల్లవి◊స్తృతము లయ్యె,
వితతసాలకదంబ◊వృతలసద్వేశ్మముల్, వితతసాలకదంబ◊వృతము లయ్యె,
ఘనచక్రిఖడ్గిసం◊గతరాజవీథులు, ఘనచక్రిఖడ్గిసం◊గతము లయ్యె,
తే. వేంకటాద్రిక్షమానేతృ◊విపులబాహు,దండకోదండనీరదా◊ఖండచండ
శరపరంపరఁ బరహంస◊సముదయంబు, వెఱచి చనునెడఁ దత్పుర◊వితతినెల్ల. 43
టీక: పరహంససముదయంబు – పరహంస = శత్రుశ్రేష్ఠులయొక్క, శ్రేష్ఠములగు రాజహంసలయొక్క, సముదయంబు = గుంపు; వేంకటాద్రిక్షమానేతృ విపుల బాహుదండ కోదండ నీర దాఖండ చండ శరపరంపరన్ –వేంకటాద్రిక్షమానేతృ= వేంక టాద్రిభూపాలునియొక్క, విపుల = విశాలములగు, బాహుదండ = భుజదండముల యందుండెడు, కోదండ = ధను వనెడు, నీరద = మేఘముయొక్క, అఖండ = అవిచ్ఛిన్నమగు, చండ = దుస్సహమైన, శరపరంపరన్ = బాణపరంపర యనెడు జల పరంపరయందు; వెఱచి = భయపడి; చను నెడన్ = పోవు సమయమందు, తత్పురవితతినెల్లన్ = వాని పత్తనసమూహమం దంతటను; పటుపుండరీక సంకటగృహశ్రేణికల్ – పటు = సమర్థమైన, పుండరీక =గొడుగులచేత, సంకట = సమ్మర్దములైన, గృహ శ్రేణికల్ = గృహపరంపరలు; పటుపుండరీకసంకటములు – పటు = సమర్థమైన, పుండరీక = పులులచేత, సంకటములు = సందడించినవి; అయ్యెన్. పృథులాచ్ఛభల్లవిస్తృతచత్వరమ్ములు – పృథుల = విశాలములగు, అచ్ఛ = స్వచ్ఛములగు, భల్ల = బాణములచేత, విస్తృత = వ్యాప్తములైన, చత్వరమ్ములు = అంగణములు; పృథుల = గొప్పలైన, అచ్ఛభల్ల = ఎలుఁగులచేత, విస్తృతములు=విస్తరించినవి; అయ్యెన్. వితత సాల కదంబ వృత లస ద్వేశ్మముల్ – వితత =విశాలము లయిన, సాల = కోటలయొక్క, ‘ప్రాకారో వరణ స్సాలః’ అని అమరము, కదంబ = సమూహముచేత, వృత = ఆవరింపఁబడిన, లసత్ = ప్రకాశించుచున్న, వేశ్మముల్ = గృహములు; వితత = విస్తృతములగు, సాల =ఏపెలచేత, కదంబ = కడుములచేత, వృతములు అయ్యెన్. ఘన చక్రి ఖడ్గి సంగత రాజవీథులు – ఘన =గొప్పలగు, చక్రి = చక్రాయుధులగు వారిచేతను, ఖడ్గి = ఖడ్గాయుధములు గల వారిచేతను, సంగత = కూడుకొన్న, రాజవీథులు= రాజమార్గములు; ఘన = ఘనములైన, చక్రి = సర్పములతోడను, ఖడ్గి = ఖడ్గమృగములతోడను, సంగతము =కూడినవి, అయ్యెన్.
ఈ పద్యమున పట్వాదిశబ్దములు పునరుక్తము లయిన విశిష్టతను భేదమున్నది గాన దుష్టములు గావు. ఇట్టి ప్రయోగ ములు వసుచరిత్రాదులందును గలవు.ఇందు యమకవృత్త్యనుప్రాసములు శబ్దాలంకారములు. రూపకమర్థాలంకారము.
క. ఆతనితమ్ముఁడు లింగ
క్ష్మాతలపతి వొగడు గనియె ◊ సమదారినృప
వ్రాతమనోబ్జాతఘనో
ద్భూతరజస్సైన్యవిజిత◊భువనుం డగుచున్. 44
టీక: ఆతనితమ్ముఁడు = ఆ వేంకటాద్రిభూపాలుని తమ్ముఁడు; లింగక్ష్మాతలపతి = లింగభూపాలుఁడు; సమదారినృప వ్రాత మనోబ్జాత ఘనోద్భూతరజ స్సైన్య విజిత భువనుండు – సమద =మదముతోఁ గూడిన, అరినృప = శత్రురాజులయొక్క, వ్రాత = సంఘముయొక్క, మనః = మనస్సు లనెడు, అబ్జాత = కమలములకు, ఘన = మేఘప్రాయమగు, ఉద్భూతరజః =అధిక పరాగము గల, సైన్య = సైన్యముచేత, విజిత = జయింపఁబడిన, భువనుండు = లోకములు గల వాఁడు; అగుచున్; పొగడు గనియెన్ = స్తుతిగాంచెను. మేఘము కమలములకు హాని గలుగఁజేయునది గాన సైన్యపరాగము మనోబ్జాతములకు ఘన ప్రాయ మనఁబడియె.
మ. పరగోత్రాభృదనీకముం గదిసి, శుం◊భత్సైన్యగర్జాసము
త్కరఘోరాకృతి నంటి, తచ్ఛిరములం ◊గల్పించెఁ గీలాల ము
ద్ధురవేగోగ్రతదాశుగప్రతతికా◊దుర్వార మై, లింగభూ
వరుఖడ్గచ్ఛలవారిదంబు సుమనో◊వర్ణ్యాతిచిత్రక్రియన్. 45
టీక: లింగభూవరుఖడ్గచ్ఛలవారిదంబు – లింగభూవరు = లింగభూపాలునియొక్క, ఖడ్గ = కత్తియనెడు, ఛల = నెపముగల, వారిదంబు = మేఘము; సుమనోవర్ణ్యాతిచిత్రక్రియన్ – సుమనః = జాజులచేత, దేవతలచేత, వర్ణ్య = పొగడఁదగిన, అతిచిత్ర క్రియన్ = అత్యద్భుతవ్యాపారముచేతను; పరగోత్రాభృదనీకమున్ – పర గోత్రాభృత్ = శ్రేష్ఠములగు పర్వతములయొక్క, శత్రురాజులయొక్క, అనీకమున్ = సమూహమును, సేనను; కదిసి = ఆక్రమించి; శుంభత్సైన్యగర్జాసముత్కర ఘోరాకృతిన్ – శుంభత్ = ప్రకాశించుచున్న, సైన్య = సైన్యముయొక్క, గర్జా = సింహనాదము లనెడు మేఘనాదములయొక్క, సముత్కర = సమూహముచేత, ఘోర =భయంకరమగు, ఆకృతిన్ = ఆకారముచేత; తచ్ఛిరములన్ = ఆ పర్వతశిఖరములను, ఆ రాజుల శిరస్సులను; అంటి = చేరి; ఉద్ధురవేగోగ్రతదాశుగప్రతతికాదుర్వారమై – ఉద్ధుర = అతిశయించిన, వేగ = వేగంబుచేత, ఉగ్ర = తీక్ష్ణమైనట్టి, తదాశుగ = ప్రసిద్ధవాయువుయొక్క, వారి బాణములయొక్క, ప్రతతికా = సమూహమునకు, దుర్వారమై = వారింప నలవిగానిదై; కీలాలమున్ =ఉదకమును,రక్తమును, ‘శోణితేమ్భసి కీలాలమ్’ అని అమరము, కల్పించెన్ = చేసెను.
వారిద ముద్ధురవేగోగ్ర మగు మారుతమునకు దుర్వారమై వర్షించుట చిత్రమని యాశయము. శ్లిష్టరూపకము. ఖడ్గచ్ఛల వారిద మనుచో కైతవాపహ్నుతి. రెంటికిని సంకరము.
తే. అతని యనుజుఁడు చిన్నలిం◊గావనీశుఁ
డలరు నైజమహోభానుఁ◊ డఖిల శార్వ
రాళిఁ దూల్చియు, నరివధూ◊పాళి కాత్మ
రమణ విరహంబుఁ జేయఁ జి◊త్రప్రశస్తి. 46
టీక: అతని యనుజుఁడు = ఆ లింగభూపాలుని తమ్ముఁడు; చిన్నలింగావనీశుఁడు = చిన్నలింగ భూపాలుఁడు; నైజమహో భానుఁడు – నైజ = తన సంబంధియైన, మహః = ప్రతాప మనెడు, భానుఁడు = సూర్యుండు; అఖిల శార్వరాళిన్ – అఖిల= సమస్తమగు, శార్వర= అంధకారములయొక్క, ఆళిన్ = గుంపును, సమస్తవైరిసంఘముననుట; తూల్చియున్ = నాశము సేసియు; అరివధూ= ఆఁడుజక్కవలయొక్క; పాళికిన్ = గుంపునకు, శత్రువనితలగుంపుల కనుట; ఆత్మరమణ విరహం బున్ = నిజనాథులయొక్క వియోగమును; చిత్రప్రశస్తిన్ = ఆశ్చర్యకరమగు ప్రసిద్ధితో; చేయన్ = చేయుచుండఁగా; అలరున్ = ప్రకాశించును. సూర్యుండు తమస్సంఘమును దూల్చియు, జక్కవపడఁతులకుఁ బ్రియావియోగంబు ఘటిల్లఁజేయుట చిత్ర మని తాత్పర్యము. చిన్నలింగభూపతి సమస్తవైరులసంహరించి వారి నారులకు విరహము ఘటిల్లఁజేసె నని భావము. విరోధా భాసము. రూపకభేదము.
సీ. లాటాంతరమున కే◊లలితవిగ్రహుగుణ,శ్రేణి వినూతన◊చిత్రరచన,
వంగమండలికి నే ◊వరకలాశాలిప్ర,తాపంబు సూడ ర◊త్నంపుబరణి,
కాశ్మీరమునకు నే◊కల్యాణనిధికీర్తి,వారంబు మహనీయ◊వజ్రపేటి,
యాని చోళమునకు నే ◊యమనశీలునియాజ్ఞ, యలరారు తెలిముత్తి◊యంపుజల్లి,
తే. యతఁడు వొగడొందు జగముల◊నరినృపాల, మకుటతటకోటికాహిత◊మణికలాప
రాజినీరాజితాంఘ్రినీ◊రేజశాలి, చాపజితశూలి చినలింగ◊భూపమౌళి. 47
టీక: లాటాంతరమునకున్=లాటదేశమధ్యమనెడు వస్త్రాభ్యంతరమునకు, ‘లాటో దేశేంఽశుకేపి చ’ అని విశ్వము; ఏ లలిత విగ్రహుగుణశ్రేణి = ఏ మనోహరాంగుని సుగుణముల గుంపు; వినూతనచిత్రరచన = నూతనచిత్రకర్మయో, ఆశ్చర్యకరణ మనుట; వంగమండలికి = వంగదేశ మనెడు కర్పూరకదంబమునకు, ‘వఙ్గః కర్పూర వార్తాక దేశభేదేషు కీర్తితః’ అని విశ్వము; ఏ, వరకలాశాలిప్రతాపంబు – వర= శ్రేష్ఠములగు, కలా = విద్యలచేత, శాలి = ఒప్పుచుండెడువానియొక్క, ప్రతాపంబు = ప్రతా పము; చూడన్ = పరికింపఁగా; రత్నంపుబరణి = రత్ననిర్మిత మగు బరణియో, అనఁగా బరణి కర్పూరము నెట్లు చుట్టి యుండునో అట్లు లింగభూపాలుని ప్రతాపంబు వంగదేశము నావరించి యున్న దనుట, ప్రతాప మెఱ్ఱనిదని కవిసమయము గనుక రతనంపుబరణిగా రూపింపఁబడినది. కాశ్మీరమునకు = కాశ్మీరదేశ మనెడు కుంకుమమునకు; ఏకల్యాణనిధికీర్తివారంబు = ఏ మంగళమూర్తియొక్క యశోరాశి; మహనీయవజ్రపేటి = శ్రేష్ఠమగు వజ్రంపుపెట్టెయో, అనఁగా గుంకుమమును బెట్టె యేలాగున నావరించియుండునో యాలాగున లింగభూపాలునికీర్తి కాశ్మీరదేశము నావరించియున్న దనుట, కీర్తి తెల్లని దని కవిసమయము గాన వజ్రపేటికగా రూపింపఁ బడినది. ఆని = కదిసి; చోళమునకున్ = చోళదేశ మనెడు ప్రసిద్ధమైన ముసుఁగుగుడ్డకు; ఏ యమనశీలుని యాజ్ఞ = ఏ నియంతయొక్క యాజ్ఞ; అలరారు తెలిముత్తియంపుజల్లి = ప్రకాశించునట్టి తెల్లని ముత్తెములచేతఁ జేయఁ బడిన జాల రై యొప్పునో, అనఁగా ముసుఁగుగుడ్డకు ముత్తియంపుజాలరువలె నారాజునాజ్ఞ చోళదేశమున కలంకారమై యభినంద్యముగా నున్న దనుట. అతఁడు = ఆ రాజు; అరినృపాల మకుటతట కోటికాహిత మణికలాప రాజి నీరాజి తాంఘ్రినీరేజ శాలి – అరి నృపాల= శత్రు రాజులయొక్క, మకుటతట = కిరీటతటములయొక్క, కోటికా = అగ్రభాగములందు, ఆహిత = ఉంపఁబడిన, మణికలాప = మణిభూషలయొక్క, రాజి = బంతిచేత, నీరాజిత = నివాళింపఁబడిన, అంఘ్రినీరేజ = పాదపద్మములచే, శాలి = ఒప్పుచున్న వాఁడు; చాపజితశూలి =ధనుర్విద్యయందు జయింపఁబడిన రుద్రుఁడు గలవాఁడు, అంతటి సామర్థ్యము గలవాఁడనుట; చిన లింగభూపమౌళి = చినలింగభూపాలశ్రేష్ఠుఁడు; జగములన్ = లోకములయందు; పొగడొందెన్ = ఖ్యాతిగాంచెను. శ్లిష్టరూప కాలంకారము.
క. అతని యనుజుండుచినమ,ల్లతరుణనీరేజశరుఁడు ◊ లలి నొప్పె మహో
న్నతగాయకనుతసాయక,హతనాయకఘటితసౌర◊హరిణేక్షణుఁ డై. 48
టీక: అతని యనుజుండు = ఆ చినలింగభూపాలుని తమ్ముఁడు; చినమల్లతరుణనీరేజశరుఁడు= చినమల్ల భూపాలుఁడను నవమన్మథుఁడు; మహోన్నతగాయక నుత సాయక హత నాయక ఘటిత సౌరహరిణేక్షణుఁ డై – మహోన్నతగాయక = మిక్కిలి యెక్కువగా శబ్దించునట్టి తుమ్మెదలచేత, మహోన్నతులైన గాయకుల చేత నని రాజపరమైన యర్థము, నుత = కొని యాడఁబడిన, సాయక = సుమబాణములచేత, బాణములచేత నని రాజపరమైన యర్థము, హత = కొట్టఁబడిన, నాయక = శృంగారాలంబనపురుషులతో, రాజులచేతితో, ఘటిత = కూర్పఁబడిన, సౌరహరిణేక్షణుఁడై = సురాంగనలు గలవాఁడై; లలిన్ = ఉత్సాహముచేత; ఒప్పెన్. నీరేజశరుని బాణప్రసరణము యువమిథునసంఘటనసంపాదకము గావునఁ జినమల్ల తరుణ నీరేజశరుని సాయకహతనాయకులు సురాంగనాసంఘటనము నొందిరని భావము. ఇందు రూపకాలంకారము.
సీ. ఈ ధన్యు హేతి ధా◊రాధరం బగుఁ, గాని చో రాజహంసాళి ◊సోలు టెట్టు,
లీ నరేశ్వరుశౌర్య ◊మైనతేజమ, కానిచో లోకతమములు ◊దూలు టెట్టు,
లీ రాజు పాణి మం◊దారశాఖియ, కాని యెడ సుమనశ్శ్రేణు ◊లడరు టెట్టు,
లీ మహేంద్రునికీర్తి ◊కౌముది యగుఁ, గాని యెడఁ గువలయమోద ◊మెసఁగు టెట్టు,
తే. లనుచు విబుధులు నుతియింతు ◊రమరశైల కందరాసంచలద్దేవ◊కామినీజ
నాభిగీతనవీనచౌ◊హస్తిమల్ల బిరుదనిస్తంద్రుఁ జినమల్ల◊ధరణిచంద్రు. 49
టీక: ఈ ధన్యు హేతి = ఈ ధన్యుని ఖడ్గము; ధారాధరం బగున్ = మేఘ మగును, పదును గలదగునని భావము; కానిచోన్ = అటు గాకున్న యెడ; రాజహంసాళి – రాజహంస = హంసపక్షివిశేషములయొక్క, ఆళి = గుంపు, రాజశ్రేష్ఠుల గుంపు; సోలు టెట్టులు = అడలుట యే ప్రకారము, మేఘోదయకాలమందు రాజహంసలు పాఱుట కవిసమయసిద్ధము. ఈ నరేశ్వరుశౌర్యము =ఈ రాజుయొక్క శౌర్యము; ఐనతేజమ = సూర్యసంబంధిప్రభయే; కానిచోన్ = కానియెడల; లోక తమములు = లోకములయందుండు చీకటులు, లోకుల యజ్ఞానములు, అజ్ఞానప్రయుక్త దోషము లన్నింటిని దుష్టనిగ్రహముచే శమింపఁజేయుటంబట్టి యిటు వచించుట; తూలు టెట్టులు = నశించుట యెట్టులు.
ఈ రాజుపాణి = ఈ రాజుయొక్కహస్తము; మందారశాఖియ =కల్పవృక్షమే; కానియెడన్ = కానిచో; సుమనశ్శ్రేణులు = దేవసంఘములు, విద్వత్సంఘములు; అడరు టెట్టులు = ఆనందించుట యెట్లు. ఈ మహేంద్రునికీర్తి = ఈ మహారాజుయొక్క కీర్తి; కౌముది యగున్ = వెన్నెల యగును; కానియెడన్ = కానిచో; కువలయ మోదము = కలువలకు సంతసము, భూవలయమునకు సంతసము; ఎసఁగు టెట్టులు = తనరు టెట్లు. అనుచున్ = ఇట్లనుచు; విబుధులు =దేవతలు, విద్వాంసులు; అమరశైల కందరా సంచల ద్దేవకామినీజనాభిగీత నవీనచౌహస్తి మల్లబిరుద నిస్తంద్రున్ – అమరశైల = మేరుపర్వతముయొక్క, కందరా = గుహలయందు, సంచలత్ = తిరుగుచున్న, దేవ కామినీజన = దేవతాస్త్రీసంఘముచేత, అభిగీత = గానము చేయఁబడిన, నవీన చౌహస్తిమల్లబిరుద=నూతనమగు చౌహస్తిమల్లుఁ డను బిరుదుచేత, నిస్తంద్రున్ = జాగరూకుని; చినమల్ల ధరణిచంద్రున్ = చినమల్లభూపాలుఁ డను భూలోకచంద్రుని; నుతియిం తురు = కొనియాడుదురు. ఇందుఁ బరంపరితశ్లిష్టరూపకాలంకారము.
ఉ. ఆయనుజుల్ భజింప విమలాత్ముఁడు ముమ్మడిమల్లమేదినీ
నాయకుఁడుర్వి నేలెను గ◊నత్పదపీఠమసారసారభా
మేయకలిందజాజలవి◊మిశ్రితపాదపునర్భవప్రభా
వ్యాయతజహ్నుజావినతి◊వారితవిద్విడశేషదోషుఁ డై. 50
టీక: ఆ యనుజుల్ = ఆ తమ్ములు; భజింపన్ = సేవించుచుండఁగా; విమలాత్ముఁడు =నిర్మలచిత్తము గలిగినట్టి; ముమ్మడి మల్లమేదినీనాయకుఁడు = ముమ్మడి మల్లభూపాలుఁడు, వీరి తండ్రియు,తాతయు మల్లభూపాలుం డను పేరిచేతనే రాజి ల్లుటంబట్టి మల్లభూపాలురలో మూఁడవతరమువాఁడగు నీ నృపాలుఁడు ముమ్మడిమల్లమేదినీనాయకుఁ డని చెప్పఁబడియె; కనత్పదపీఠ మసార సార భామేయ కలిందజాజల విమిశ్రిత పాదపునర్భవప్రభా వ్యాయత జహ్నుజా వినతి వారిత విద్వి డశేష దోషుఁ డై – కనత్ = ప్రకాశించుచున్న, పదపీఠ = పాదపీఠమునందలి, మసార = ఇంద్రనీలమణులయొక్క, సార = శ్రేష్ఠ మగు, భా = కాంతి యనెడి, అమేయ = అధిక మైన, కలిందజాజల = కాళిందీజలముచేత, విమిశ్రిత = కలిపినట్టి, పాదపునర్భవ ప్రభా=పాదనఖకాంతి యనెడు, ‘పునర్భువః కరరుహో నఖో స్త్రీ నఖరో స్త్రియామ్’ అని అమరము, వ్యాయత=మిక్కిలి విశాల మైన, జహ్నుజా=గంగానదియందు, వినతి= నమస్కారముచేత, వారిత =పోఁగొట్టఁబడిన, విద్విట్=శత్రువులయొక్క, అశేష = సమస్తములగు, దోషుఁ డై = పాపములు గలవాడై, నేరములు గలవాఁడై, ఉర్విన్ = భూమిని, ఏలెన్ = పాలించెను.
ఇచట పాదపునర్భవప్రభేత్యాదివిశేషణ స్వారస్యముచేత వర్ణ్యుఁడగు ముమ్మడిమల్లభూపాలునియందు విష్ణుత్వము ధ్వనించుచున్నది. అలంకారము రూపకము.
సీ. ఉన్నతకూటసం◊పన్నవర్తన యైన, సంతతేరాధర◊సమితి రోసి,
యెల్లకాలము జిహ్మ◊వృత్తి వర్తిలునట్టి, శేషునిపొం దపే◊క్షింప మాని,
యళిపేయమదయుక్తి ◊కలిమిఁ దూఁగు దిగంత,కరిమూర్తులను డాయ ◊నరుగు టుడిగి,
యలఘుజడాసక్తిఁ ◊దల యెత్త వెఱచు మ,హాకమఠస్వామి◊నంట వెఱచి,
తే. చెందె భూకాంత యాత్మని◊స్సీమభూమ
సకలగుణరత్నభూషితా◊శావధూటి
కాశ్రవణకోటి ఖరతర◊ఖడ్గపాటి
తవిమతకరోటి మల్లభూ◊ధవకిరీటి. 51
టీక: భూకాంత = భూమి యనెడు స్త్రీ; ఉన్నత కూట సంపన్నవర్తన యైన సంతతేరాధరసమితిన్ – ఉన్నత = అధికములగు, కూట = కపటములచేత, సంపన్న = సమృద్ధ మైన, వర్తన యైన = వృత్తి గలది యైనట్టి, సంతతేరాధరసమితిన్ = ఎల్లప్పుడు కల్లుమోయువారియొక్కగుంపును, భూమిని మోయు పర్వతముల గుంపు ననుట, ‘ఇరా భూ వాక్సురాప్సు స్యాత్’ అని అమరము; రోసి = విసుఁగుపడి; ఎల్లకాలము = ఎల్లప్పుడును; జిహ్మవృత్తి న్ = కుటిలస్వభావముచేత, వర్తిలునట్టి శేషుని =వర్తించుచున్న దాసునియొక్క, సేవ్యుఁడు శేషి యనియు, సేవకుఁడు శేషుఁ డనియుఁ బ్రసిద్ధము, వక్రగమనముచేత వర్తించు నట్టి యనంతునియొక్కయనుట; పొందు = సాంగత్యమును; అపేక్షింప మాని = కోరుటను మాని; అళి పేయ మదయుక్తి కలిమిన్ – అళి = సుర యనెడు, పేయ=పానీయముచేత నైన, మదయుక్తి = మదసంబంధముయొక్క, కలిమిన్ = కల్గుటచేత, తుమ్మెదలచేతఁ బానముచేయఁదగిన మదోదకముయొక్క కలిమిచేత ననుట, ‘అళి స్సురా పుష్ప లిహోః’ అని విశ్వము; తూఁగు = తూఁగునట్టి; దిగంత = దిక్కుల కడలయందలి,అనఁగా నప్రసిద్ధమగు నొకచోట నుండు; కరిమూర్తులను = రేఫలకారములకభేదమునుబట్టి కలిమూర్తులను పాపమూర్తుల ననుట, గజమూర్తుల నని భావము; డాయ నరుగు టుడిగి = దగ్గఱఁ బోవుటను వదలి; అలఘు జడాసక్తిన్ – అలఘు = అధికమగు, జడ = మూర్ఖులతోడి, ఆసక్తిన్ = సంబంధముచేతను, లకార డకారముల కభేద మునుబట్టి అధికజలాసక్తిచేతను; తల యెత్తన్ = తల యెత్తుటకు; వెఱచు = భయపడు; మహాకమఠస్వామిన్ – మహత్ = అధికమగు, అక = పాపమునకు, మఠ = ఆశ్రయమగు, స్వామిన్ = ప్రియుని, తలయెత్తని స్వభావము గల ఆదికూర్మస్వామి ననుట; అంటన్ = ముట్టుటకు; వెఱచి = భయపడి; ఆత్మ నిస్సీమ భూమ సకల గుణరత్న భూషి తాశావధూటికా శ్రవణకోటిన్ – ఆత్మ = తనయొక్క, నిస్సీమ = నిరవధిక మగు, భూమ = ఆధిక్యము గల, సకల = సమస్తములగు, గుణరత్న = గుణము లనెడు రత్నములచేత, భూషిత = అలం కృతములగు, ఆశావధూటికా = దిగంగనలయొక్క, శ్రవణకోటిన్ = కర్ణాగ్రభాగములు గల వాని;
ఖరతర ఖడ్గ పాటిత విమత కరోటిన్ – ఖరతర = మిక్కిలి తీక్ష్ణమగు, ఖడ్గ = ఖడ్గముచేత, పాటిత = చీల్పఁబడిన, విమత = శత్రువులయొక్క, కరోటిన్ = పుఱ్ఱెలుగల వాని, ‘ శిరోస్థ్నితు కరోటి స్యాత్’ అని అమరము; మల్లభూధవకిరీటిన్ = కిరీటి తుల్యుఁడగు మల్లభూపాలుని, ఉపమానోత్తరపదకర్మధారయసమాసము; చెందెన్ = పొందెను.
భూభరణధురీణు లగు కులాచల శేష దిక్కరి కమఠస్వాములు కాపట్యసంపత్తి కుటిలస్వభావ సురామత్తతా జడా సక్తులను బొందుటచే వారిని వదలి భూకాంత సకలసుగుణసంపత్తి గల మల్లభూపతి నాశ్రయించెనని భావము. ఇందు శ్లేషో త్థాపితవ్యతిరేకాలంకారము.
మ. ఘనభేరీవరభూరిభాంకృతిజరే◊ఖాసంధి లేఖాలయం
బునకున్ మల్లనృపక్షతక్షితిపరా◊ట్పూగంబు లేఁగన్ ఘనా
యనముం జేరె మహాబిలాఖ్యఁ దురగ◊వ్యావిద్ధయుద్ధోచితా
వని పెంపొందెఁ దదీయరత్నతతి ప◊ర్వన్ రత్నగర్భాభిధన్. 52
టీక: ఘన భేరీ వర భూరి భాంకృతిజ రేఖా సంధిన్ – ఘన = గొప్పలగు, భేరీ = భేరులయొక్క, వర = శ్రేష్ఠము లగు, భూరి = అధికములగు, భాంకృతి = భాంకారమువలన, జ = పుట్టిన, రేఖా = చీలికగీఱయొక్క, సంధిన్ = రంధ్రముచేత; లేఖాలయం బునకున్ = స్వర్గమునకు; మల్లనృప క్షత క్షితిపరా ట్పూగంబులు – మల్లనృప = మల్లభూపాలునిచేత, క్షత = కొట్టఁబడిన, క్షితిపరాట్ = రాజశ్రేష్ఠులయొక్క, పూగంబులు = గుంపులు; ఏఁగన్ = పోవఁగా; ఘనాయనమున్ = ఆకాశమును; మహాబి లాఖ్య = అధికవివరము గలదను పేరు, మహాబిల మను పేరు, చేరెన్ = పొందెను; తురగ వ్యావిద్ధ యుద్ధోచితావని – తురగ = గుఱ్ఱములచేత, వ్యావిద్ధ = కొట్టఁబడిన, యుద్ధోచితావని = యుద్ధార్హమగు భూమి; తదీయరత్నతతి = ఆ రాజులకు సంబంధిం చిన రత్నముల గుంపు; పర్వన్ = ప్రసరింపఁగా; రత్నగర్భాభిధన్ = రత్నగర్భ యను నామముచేత; పెంపొందెన్ = వృద్ధిఁ బొందెను. ఆకాశము మహాబిలమను పేరు వొందుటకు, భూమి రత్నగర్భ యను పేరు వొందుటకు క్షితిపరాట్పూగంబు లేఁగుట, తదీయరత్నతతి పర్వుట హేతువులుగా నుత్ప్రేక్షింపఁబడినవి కావున హేతూత్ప్రేక్షాలంకారము.
సీ. తగ మహావిగ్రహ◊మగు కిరాతశ్రేణిఁ, బ్రత్యగ్రదళితవి◊గ్రహముఁ జేసె,
విప్రమోదాపహ◊వృత్తు లౌయవనుల,విప్రమోదావహ◊విధులఁ జేసె,
ఘనపద్ధతిక్రమ◊గర్హణు లగు శాత్ర,వుల ఘనపద్ధతి ◊మెలఁగఁజేసె,
నిష్ఠురధర్మగ◊రిష్ఠులౌ నహితుల, నతులసుధర్మాభి◊యుతులఁ జేసె,
తే. ననుచు దరవారిపరిదారి◊తారిహస్తి,మస్తనిస్తులనిర్గళ◊న్మౌక్తికముల
సేసఁ జల్లుచు జయలక్ష్మి◊సేరెనౌర, వీరమల్లక్షమాపాలు◊విమలశీలు. 53
టీక: తగన్ = ఒప్పునట్లుగా; మహావిగ్రహ మగు కిరాతశ్రేణిన్ = మహావిరోధము గల కిరాతులగుంపును; ప్రత్యగ్ర దళిత విగ్ర హమున్ = నూతనముగ పోఁగొట్టఁబడిన విరోధములు గల దానిని, ఖండితదేహములు గల దాని ననుట, ‘విరోధే కలహే దేహే విస్తారే విగ్రహః’ అని హలాయుధుఁడు; చేసెన్ = ఒనరించెను. విప్ర మోదాపహ వృత్తులౌ యవనులన్ – విప్ర = బ్రాహ్మణులయొక్క, మోద =సంతసమునకు, ఆపహ = నాశకమగు, వృత్తులౌ యవనులన్ = వ్యాపారము గలతురకలను; విప్రమోదావహవిధులన్ = విప్రులకు ప్రమోదావహమగు విధులు గలవారిని, వి = పక్షులకు, ప్రమోదావహవిధులన్ = సంతోషమును గలుగఁ జేయు విధులు గలవారిని, అనఁగా నిహతులై కంకగృధ్రాదిపక్షులకు సంతసముఁ జేయువారి ననుట; చేసెన్ = ఒనరించెను. ఘన పద్ధతి క్రమ గర్హణు లగు శాత్రవులన్ – ఘన = పెద్దలయొక్క, పద్ధతి = మార్గమందు, క్రమ = సంచరణముయొక్క, గర్హణు లగు = నిందకులగు, సన్మార్గవిరోధులగు ననుట, శాత్రవులన్ =విరోధులను; ఘనపద్ధతిన్ =పెద్దలమార్గమందు, గగనమందు; మెలఁగన్ = వర్తించునట్లు; చేసెన్ = ఒనరించెను. అనఁగాఁ బరిమార్చి వీరస్వర్గమునకు బంపెనని భావము.
నిష్ఠురధర్మ గరిష్ఠులౌ నహితులన్ – నిష్ఠురధర్మ = కఠినధర్మముచేత, కఠినమగు ధనుర్విద్యచేత, గరిష్ఠులౌ అహితులన్ = శ్రేష్ఠులగు పగతురను; అతుల సుధర్మాభియుతులన్ – అతుల = అసమానమగు, సుధ ర్మాభియుతులన్ =మంచిధర్మముతో, దేవసభతో కూడుకొన్నవారినిగా; చేసెన్ = ఒనరించెను. కఠిన ధర్మము గల వారిని మంచిధర్మము గలవారినిగాఁ జేసె నని యర్థము. ధనుర్విద్యయందు దక్షులగు వీరులను దేవసభఁ జేరునట్లు చేసెనని భావము.
ఔర = ఆశ్చర్యము, ఇట నాశ్చర్యము స్పష్టము; అనుచున్, జయలక్ష్మి, తరవారి పరిదారితారిహస్తి మస్త నిస్తుల నిర్గళ న్మౌక్తి కములన్ – తరవారి = ఖడ్గముచేత, పరిదారిత = ఖండింపఁబడిన, అరిహస్తి = శత్రుగజములయొక్క, మస్త = శిరస్సుల వలన, నిస్తుల = అసమానమగునట్లుగా, నిర్గళత్ = జాఱుచున్న, మౌక్తికములన్ = ముత్యములచేత; సేసఁ జల్లుచున్ = తలఁ బ్రాలు చల్లుచు; విమలశీలున్ = నిర్మలస్వభావము గల; వీరమల్లక్షమాపాలున్ = వీరుఁడగు మల్లభూపాలుని; చేరెన్ = పొందెను. ఇందుఁ జరణచతుష్టయమందును విరోధాభాస మలంకారము. ‘ఆభాసత్వే విరోధస్య విరోధాభాస ఉచ్యతే’అని తల్ల క్షణము.
శా. ఆలోచింప దధీచిదానము మహా◊వ్యర్థంబు, దోషాకరుం
డాలేఖావళి కిచ్చు నీగి యొక తో◊యం బై కలామాత్ర మై
చాలం దక్కువ యొక్కపక్షమున, నెం◊చన్ మించుఁ గా మల్లభూ
పాలగ్రామణిసాతి సద్గుణతతిన్ ◊ భావించుచో నెంతయున్. 54
టీక: దధీచిదానము = ‘దధీచి ర్దానవీరోభూ ద్దయావీర శ్శిబిర్నృపః| హమ్మీరో యుద్ధవీరోభూత్’ అని దానవీరుఁడుగాఁ జెప్పఁబడిన దధీచియొక్క దానము; మహావ్యర్థంబు = మిక్కిలి వ్యర్థమైనది; మహావ్యర్థంబు = గొప్పలైన పర్వతములకొఱ కైనదనుట, ‘అవయ శ్శైల మేషార్కాః’ అని యమరుఁడు; దోషాకరుండు = చంద్రుఁడు; ఆ లేఖావళికిన్ = ఆ దేవబృందము నకు; ఇచ్చు నీగి = ఒసంగెడు త్యాగము; ఒక తోయం బై = జలమాత్రమే, మఱియొక వస్తువు లేదనుట; కలామాత్ర మై = పదు నాఱవభాగరూపమై; చాలం దక్కువ = మిక్కిలి అల్పమైనది; ఒక్కపక్షముననె = ఒకపక్షమందె, ఆ యల్పత్యాగము సైతము కృష్ణపక్ష మందే కాని ఉభయపక్షములందుఁ గాదనుట, సుధాంశువు దేవవర్గమునకు నొక జలరూపమగు షోడశతమకలాత్మక మగు నమృతమును కృష్ణపక్షమందే యిచ్చుననుట; ఎంచన్ = చంద్రుని దాతృత్వము వర్ణ్యుఁ డగు మల్లభూపాలుని దాతృత్వ ముతో సరియైనదే కాదు, ఒక పక్షమందైనను సరి యగునా యని విచారింపఁగా, మల్లభూపాలగ్రామణిసాతి = మల్లభూపాల శ్రేష్ఠునియొక్కదానము, ‘సాతి ర్దానావసావయోః’ అని అమరము; సద్గుణతతిన్ = శ్రేష్ఠగుణములయొక్కగుంపుచేత; భావించు చోన్ = తారతమ్యమును పర్యాలోచింపఁగా; ఎంతయున్ = మిక్కిలి; మించుఁ గా= అతిశయించును గదా!
ప్రకృతమల్లభూపాలత్యాగమునకు అప్రకృతదధీచిదోషాకరత్యాగములు దుల్యములు గా వనుటవలన ప్రతీపాలంకార భేదము. ‘ వర్ణ్యేనాన్యస్యోపమాయా అనిష్పత్తివచశ్చ తత్’ అని లక్షణము.
సీ. ద్విజరాజు వెఱఁ గంద ◊వివిధకలాపాలి, పచరించుఁ దత్తఱ◊పాటు లేక,
యలమహానటుఁ డెన్న ◊నతులశృంగారవ,ర్తనఁ జూపు నింతైన ◊శ్రాంతి లేక,
తారాళు లీక్షింపఁ ◊దరుణామృతరసాభి,హరణంబు గావించు ◊నరుచి లేక,
యచలాధిపునిచెంత ◊నధికగహ్వరవిహా,రశ్రీలఁ బూను భా◊రంబు లేక,
తే. మల్లభూపాలు ముమ్మడి◊మల్లశౌరి, కీర్తికాంతామతల్లి పం◊కేజజాండ
కాండగర్భాతిభారసం◊క్రాంత యయ్యుఁ, దత్తదనుకూలఖేలనా◊యత్తవృత్తి. 55
టీక: మల్లభూపాలు ముమ్మడిమల్లశౌరి కీర్తికాంతామతల్లి –మల్లభూపాలు ముమ్మడిమల్లశౌరి = మల్లభూపాలుని పుత్రుఁ డగు ముమ్మడిమల్లవీరాగ్రణియొక్క, కీర్తికాంతామతల్లి = ప్రశస్తమగు కీర్త్యంగన, ‘మతల్లికా మచర్చికా ప్రకాణ్డ ముద్ఘ తల్లజౌ ప్రశస్త వాచకాన్యమూని’ అని యమరుఁడు; పంకేజజాండ కాండ గర్భాతిభార సంక్రాంత యయ్యున్ – పంకేజజాండ = బ్రహ్మాండ ములయొక్క, కాండ = గుంపు లనెడు, గర్భ = గర్భములచేతనైన, అతిభార = అధికభారముచేత, సంక్రాంత యయ్యున్ = కూడుకొన్నదయ్యును, అనఁగా బ్రహ్మాండకాండరూప దుర్వహగర్భఖిన్న యయ్యు ననుట; తత్తదనుకూలఖేలనాయత్త వృత్తిన్ = వారివారి కనుకూల మగు క్రీడనమున కధీనమైన వృత్తిచేత;
ద్విజరాజు = బ్రాహ్మణశ్రేష్ఠుఁడు, విద్వాంసుఁ డనుట; వెఱఁగందన్ = ఆశ్చర్యపడునట్లుగా; వివిధకలాపాలిన్ – వివిధ = నానాప్రకారములగు, కలా = విద్యలయొక్క, పాలిన్ = సమూహమును; తత్తఱపాటు లేక = తొట్రుపాటు లేకుండ; పచ రించున్ = కనఁబఱచును; ద్విజరాజు = చంద్రుఁడు, వెఱఁగందన్ = భయముచేఁ గందునట్లుగా; వివిధకలాపాలిన్=నానాప్రకా రములగు కాంతులగుంపును, తత్తఱపాటు లేక పచరించు నని కీర్తిపరమైన యర్థము;
అల = ప్రసిద్ధుఁడైన; మహానటుఁడు = దొడ్డనట్టువుఁడు, శివుఁడు; ఎన్నన్ = గణించునట్లుగా; అతులశృంగారవర్తనన్ = అసమానమగు నాట్యమును, శృంగారనియమమును; ఇంతైన శ్రాంతి లేక = ఇంచుకైన శ్రమము లేక, చూపున్ = చూపును, ‘శృంగార స్సురతే నాట్యే రసే దిగ్గజమణ్డనే’ అని విశ్వము; తారాళులు = తారు ఆళులు = చెలికత్తెలు తాము; ఈక్షింపన్ = చూచుచుండఁగా; తరుణామృత రసాభిహరణంబు – తరుణ = నూతనములగు, అమృత = అమృతమువంటి, రస = మధురాదిరసములయొక్క, అభిహరణంబు = గ్రహణంబు, ‘అభిహా రోఽభిగ్రహణమ్’ అని అమరము; అరుచి లేక = అసహ్యత లేక, కావించున్ = చేయును. గర్భవతులకుఁ బదార్థములయం దరుచి గలిగి తానెక్కుడు గ్రహింపమి స్వాభావికంబై యుండఁగా నీమె యరుచి లేక రసాభిగ్రహణము గావించు ననుట; తారా ళులు = నక్షత్రసంఘములు; ఈక్షింపన్ = చూచుచుండఁగా; తరుణామృతరస = నవసుధారసముయొక్క; అభిహరణంబు= అభిగ్రహణంబు, గావించు నని కీర్తిపరమైన యర్థము.అచలాధిపుని చెంతన్ = భూపాలుని సన్నిధియందు; అధికగహ్వరవిహారశ్రీలన్ = అధికములగు దాంభికవిహారములయొక్క సంపదలను; భారంబు లేక = గర్భభారముచే నలసట నొందక; పూనున్ = వహించును; అచలాధిపుని చెంతన్ = హిమవంతుని చెంత; అధికగహ్వరవిహారశ్రీలన్ = అతిశయమైన గుహావిహారములయొక్క సంపదలను; భారంబు లేక = సునాయాసము గా; పూనున్ = వహించును, ‘ గహ్వరస్తు గుహా దమ్భ నికుఞ్జ గహనేష్వపి’అని విశ్వము, గర్భవతి గర్భిణీ ధర్మములకు విరుద్ధములైన వ్యాపారములు సేసె నని భావము.
కీర్తికాంత విద్వాంసులచేతఁ బ్రశంసింపఁబడిన దనియు, హిమగిరిగుహాదుల నావరించిన దనియు, చంద్రమండలము నాక్రమించి చంద్రునికన్న మిగులఁ దేజరిల్లిన దనియు, నక్షత్రమండలము నతిక్రమించి కైలాసము దాఁక వ్యాపించిన దనియు, పంకేజజాండ కాండగర్భ యనుటచేత బ్రహ్మాండకోటుల నావరించిన దనియు ఫలితార్థము. ఇందుఁ గీర్తికాంతయందు గర్భాభిభరణరూప పుష్కలకారణ మున్నను అరుచ్యలసతాదికార్యములు గలుగనట్లు వర్ణితంబు లగుటనుబట్టి విశేషోక్త్యలంకారము. ‘కార్యాజని ర్విశేషోక్తి స్సతి పుష్కలకారణే’ అని లక్షణము. కీర్తికాంత యనుచోట రూపకంబు.
తే. ఆధరాధీశసతులు చె◊న్నాంబ, తిరుమ
లాంబ, మల్లాంబిక, యనంత◊మాంబిక యన
నాతతాత్మీయసద్గుణ◊స్యూతసుకవి
సూక్తిముక్తాకదంబ లై ◊యొప్పి రందు. 56
టీక: ఆధరాధీశసతులు = ఆ మల్లభూపాలుని భార్యలు; చెన్నాంబయు, తిరుమలాంబయు, మల్లాంబయు, అనంతమాంబి కయు, అనన్, ఆతతాత్మీయసద్గుణ స్యూత సుకవిసూక్తి ముక్తాకదంబ లై – ఆతత =విశాలము లైన, ఆత్మీయసద్గుణ= తమ లోకోత్తరగుణము లనెడు గుణములచేత, స్యూత = కూర్పఁబడిన, సుకవిసూక్తి = సత్కవుల వాక్కులనెడు, ముక్తాకదంబ లై = ముత్యములగుంపులు గలవారై; ఒప్పిరి; అందున్ = ఆ సతులయందు; దీనికిముందు పద్యముతో నన్వయము. రూపకాలం కారము.
సీ. తాఁ జంచలాత్మ యై ◊తనుగన్న వారికి, బలుసుళ్ళు దెచ్చు న◊బ్జాతపాణిఁ,
దతరజోగుణయుక్తి ◊దానవద్ద్విపముల, నంటు గంధోదగ్ర ◊యైన భూమి,
నొకమూలఁ బడియుండి ◊యుచ్చసింహాసన,మంది తాఁ జండిక ◊యైన గౌరి,
గురుఁడు వాక్రువ్వ న◊క్షరవిగ్రహముఁ బూని, నిక్కి రాజాస్థాని ◊కెక్కు వాణిఁ,
తే. బరిహసించుచు జనయితృ◊భవనకీర్తి,దాయివర్తన సాత్త్విక◊ధర్మనియతి
భర్తృచిత్తానుసృతిఁ బూజ్య◊పటలసేవఁ, జెలఁగు సద్గుణనికురుంబ ◊చెన్నమాంబ. 57
టీక: సద్గుణ నికురుంబ = సద్గుణసమూహము గలది యైన; చెన్నమాంబ = చెన్నమ్మయను సతి; తాన్ = తాను; చంచలాత్మ యై = చపలచిత్త యై; తనుగన్న వారికిన్ = తన పుట్టింటివారికి; పలుసుళ్ళు = అధికోపద్రవములు; తెచ్చు నబ్జాతపాణిన్ = తెచ్చిపెట్టెడు లక్ష్మీదేవిని; తాఁ జంచలాత్మ యై = చలస్వభావము గలదై, స్థిరముగానిదై యనుట; తనుగన్నవారికిన్ = తనను గన్నట్టి యుదకమునకు, సముద్రమున కనుట; బలుసుళ్ళు = అధికావర్తములను దెచ్చు నబ్జాతపాణినని తాత్పర్యము. తతరజోగుణయుక్తి న్ – తత = విపులమైన, రజోగుణ = రాజసగుణముయొక్క,యుక్తి న్ = యోగముచేత; దానవద్ద్విపము లను = రాక్షసశ్రేష్ఠులను; అంటు = ఆశ్రయించు; గంధోదగ్ర యైన భూమిన్ = గర్వముచేత నధికమైన భూమిని; తతరజోగుణ యుక్తి న్ = విస్తృతమగు పరాగగుణముయొక్క సంబంధముచేత; దానవ ద్ద్విపములను – దానవత్ = మదయుక్తములగు, ద్విపములను =గజములను,దిగ్గజముల ననుట, దానవ + ద్విప అనుచోట ‘అనచి చ – అచః పరస్య యరో ద్వేవా స్తో న త్వచి’ అను దానిచే దానవద్ద్విప అని దకారము నకు ద్విత్వము వచ్చినది; గంధోదగ్ర యైన భూమిన్ = ఘ్రాణగ్రాహ్యగుణవిశే షముచేత అధిక యైన భూమిని, పరాగము గలిగి దిగ్గజములతోఁ గూడి గంధవతి యై పృథివి యుండుట స్వభావము; ఒకమూలఁ బడియుండి =ఒక గొందిని బడియుండి; ఉచ్చసింహాసనమంది = ఉన్నత మగు రాజాసనము నొంది; తాఁ జండిక యైన గౌరిన్ = తా నత్యంతకోపవతి యైన గౌరిని; ఒకమూలన్ = మూలగా నున్న ఈశాన్యదిక్కునందు, పడియుండి, ఉచ్చసింహాసనము –ఉచ్చ = ఉన్నతమైన, సింహ = సింహమందు, ఆసనము = ఉపవేశనమును,అంది, తాఁ జండిక యైన గౌరిన్ = తాను చండి యనునామాంతరము గలదైన గౌరి ననుట; గురుఁడు =మామ; వాక్రువ్వన్ = మాటాడఁగా, నోరెత్తఁగా ననుట; అక్షరవిగ్రహమున్ = నశింపని కలహమును; పూని = వహించి; నిక్కి = గర్వించి; రాజాస్థానికిన్ = రాజసభకు; ఎక్కువాణిన్ = ఎక్కెడు సరస్వతిని; గురుఁడు = బృహస్పతి; వాక్రువ్వన్= చెప్పఁగా; అక్షరవిగ్రహముఁ బూని = అకారద్యక్షరస్వరూపమును దాల్చి; నిక్కి = అతిశయించి; రాజాస్థానికిన్ – రాజ = ఇంద్రునియొక్క, ఆస్థానికిన్ = సభకు; ఎక్కువాణిన్, అనఁగా నకారాద్యక్షరరూపిణి యగు సరస్వతి బృహస్పతి చేత నింద్రసభలో బూజింపఁబడినదని యనుట. కాదేని నుపాధ్యాయుండు సెప్పఁగా రాజసభలఁ బూజిత యగు వాణి ననుట; పరిహసించుచున్ = మిక్కిలి హాస్యము చేయుచు; జనయితృభవన కీర్తిదాయి వర్తనన్ –జనయితృభవన= జనకగృహము నకు, కీర్తిదాయి = కీర్తిజనకమగు, వర్తనన్ = వృత్తిచేత, దీనికిఁ దనుఁగన్నవారికిఁ బలుసుళ్ళు దెచ్చు నబ్జాతపాణి నను దానితోఁ బ్రతిద్వంద్విగా నన్వయము. ఇట్లు నాలుగుచరణములయందుఁ జెప్పిన యర్థములకు నన్వయంబు దెలియవలయు. సాత్త్వికధర్మనియతిన్ = సాత్త్వికధర్మములయందు వర్తన చేతను; భర్తృచిత్తానుసృతిన్ = భర్తృచిత్తము ననుసరించుటచేతను; పూజ్యపటలసేవన్ = పూజ్యుల సంఘముయొక్క సేవచేతను; చెలఁగున్ = ఒప్పును. చెన్నమాంబ లక్ష్మీభూమిగౌరీసరస్వతుల కన్న మిన్న యని వ్యంగ్యము. ఇందు యథాసంఖ్యాలంకారము, శ్లేషసముత్థాపితవ్యతిరేకాలంకారమును గలవు.
శా. ఆవామామదనుండు మల్లవసుధా◊ధ్యక్షుండు దచ్చెన్నమాం
బావామేక్షణయందు రామవిభునిన్, ◊మల్లావనీవల్లభున్,
శ్రీవాసేక్షణ నిన్ను మల్లమయెడం ◊గృష్ణాధిపున్ మేదినీ
రావుం గాంచె నచంచలప్రమదసాం◊ద్రా! మాధవక్షోణిపా! 58
టీక: అచంచలప్రమదసాంద్రా = స్థిరమైన సంతోషముచేత సాంద్రుఁడగువాఁడా! మాధవక్షోణిపా! = మాధవరాయా! ఆవామా మదనుండు మల్లవసుధాధ్యక్షుండు = యువతీమనోహరుఁడగు నా మల్లభూపాలుండు; తచ్చెన్నమాంబావామేక్షణయందున్ = ఆ చెన్నమాంబికయందు; రామవిభునిన్ = రామభూపాలుని; మల్లావనీవల్లభున్ =మల్లభూపాలుని; శ్రీవాసేక్షణ = శ్రీనివా సములైన దృష్టులు గలమాధవరాయా! నిన్నున్, మల్లమయెడన్ = మల్లాంబిక యెడ; కృష్ణాధిపున్ = కృష్ణరావును; మేదినీ రావున్ = మేదినీరావును; కాంచెన్ = కనెను.
క. అం దగ్రజుండు యువతీ
కందర్పుఁడు రామధరణి◊కాంతుఁడు వెలసెన్
మందరబలబంధురభుజ
మందరధరమథితవైరి◊మహిపాంబుధి యై. 59
టీక: అందున్ = వారలలో; అగ్రజుండు = జ్యేష్ఠుండును; యువతీకందర్పుఁడు = మానినీమన్మథుఁడు నగు; రామధరణి కాంతుఁడు = రామభూపాలుఁడు; మందర బల బంధుర భుజ మందరధర మథిత వైరిమహిపాంబుధి యై – మందర = బహుళమగు, బల = సామర్థ్యముతోడ, బంధుర = దట్టములైన, భుజ = బాహువు లనెడు, మందరధర = మందరపర్వతము చేత, మథిత = మథింపఁబడిన, వైరిమహిప = శత్రురాజు లనెడు, అంబుధి యై = సముద్రముగలవాఁ డై; వెలసెన్= ప్రకాశించెను.
సీ. ధర్మనిర్మథనంబుఁ ◊దాఁ జేసి జనకజా,పాణౌకృతిక్రీడఁ ◊బ్రబలఁడేని,
నవరజక్షిప్తరా◊జ్యాతిభారుం డయి, వనచరవర్తన ◊వఱలఁడేని,
సతతసుగ్రీవాను◊షక్తాత్ముఁ డై దావ,మున మఖవత్సూనుఁ ◊దునుమఁడేని,
నురుగోవిహారాత్త◊పరజీవననిధి యై, యలపుణ్యజనభర్త ◊నడఁపఁడేని,
తే. సాటి యనవచ్చు రాముఁడు ◊సాధుసుకృత
కేళి సర్వంసహాభార◊శాలి త్రాత
సాగ్నిసంతానపాళిసా◊ధ్వవననిత్య
శీలి యగు రామభూపాల◊మౌళికెపుడు. 60
టీక: ఎపుడున్ = సర్వకాలమందును; సాధుసుకృతకేళి – సాధు = శ్రేష్ఠములగు, సుకృత = పుణ్యవిషయ మైన, కేళి = క్రీడ గలవాఁడును; సర్వంసహాభారశాలి = భూభరణధురీణుఁడును; త్రాత = రక్షకుఁడును; సాగ్ని సంతానపాళి సాధ్వవన నిత్యశీలి – సాగ్ని = అగ్యుపాసనము చేయు సోమయాజులయొక్క, సంతానపాళి = బిడ్డలగుంపుయొక్క,సాధ్వవన = చక్కగఁ బోషించుట, నిత్యశీలి = నిరంతరస్వభావముగాఁ గల వాఁడును; అగు రామ భూపాలమౌళికిన్ = అయినట్టి రామభూపాలా గ్రేసరునకు; రాముఁడు = శ్రీరాముండు; తాన్ = తాను; ధర్మనిర్మథనంబున్ =ధర్మమార్గభంగమును; చేసి = ఒనరించి; జనకజాపాణౌకృతిక్రీడన్ – జనక = తండ్రివలన, జా = పుట్టినదానియొక్క, సహోదరియొక్కయనుట, పాణౌకృతి= వివాహ మందలి, క్రీడన్ = క్రీడచేత; ప్రబలఁడేనిన్ = వృద్ధిఁబొందఁడేని, ‘పాణౌకృతి’ యనుచోట ‘నిత్యం హస్తే పాణా వుపయమనే’ అని యలుక్సమాసము; ధర్మ = ధనువుయొక్క; నిర్మథనంబున్ = భంగమును; తాఁ జేసి = తా నొనరించి; జనకజాపాణౌ క్రీడన్ = జనకచక్రవర్తి కూతురగు సీతాపాణిగ్రహణమందలి క్రీడచేత ప్రబలినాఁడని భావము.గీతిలోఁ జెప్పిన యర్థములకు వీనికిఁ గ్రమముఁ జూడవలయు.
అవరజక్షిప్తరాజ్యాతిభారుండయి – అవరజ = నీచునియందు, క్షిప్త = ఉంపఁబడిన, రాజ్యాతిభారుం డయి = రాజ్యసంబంధి యైన యధికభారము గలవాఁడై; వనచరవర్తనన్ = కిరాతకులవృత్తిచేతను; వఱలఁడేనిన్. అవరజుఁ డనఁగా అనుజుఁడైన భర తుఁడు. అతనియం దుంపఁబడిన రాజ్యభారముగలవాఁడై, వనచరు లగు మున్యాదులయొక్క వర్తనచేత శ్రీరాముఁడు వఱలి నాఁడని భావము.
సతతసుగ్రీవానుషక్తాత్ముఁ డై – సతత = ఎల్లప్పుడును, సుగ్రీవా = మంచికంఠము గలదానియందు, అనుషక్తాత్ముఁ డై = అనురా గము గలవాఁడై; దావమునన్=అరణ్యమున; మఖవత్సూనున్ – మఖవత్ =సోమయాజియొక్క, సూనున్=సుతుని;తునుమఁ డేనిన్ = వధింపఁడేని. సతతము సుగ్రీవునియం దనుషక్తాత్ముఁడై దావమున మఖవత్సూను ననఁగా నింద్రసుతుఁడగు వాలిని శ్రీ రాముఁడు దునిమినవాఁడని భావము. ‘హవి ర్జక్షితి నిశ్శఙ్కో మఖేషు మఖవా నసౌ. తత్రైకో మఖవా నముత్ర బహవః’ ఇత్యాది ప్రయోగములు మతుబంతమైన మఖవచ్ఛబ్దమునకుఁ బ్రమాణములు.
ఉరుగోవిహారాత్తపరజీవననిధియై – ఉరు = అధికమగు, గో = దృష్టులయొక్క, విహార = వ్యాపారముచేత, ఆత్త = పొందఁ బడిన, పర = అన్యులయొక్క, జీవననిధియై = జీవనాస్పద మగు ధనముయొక్కనిధిగలవాఁడై, చూపులచే బెదిరించి పర ద్రవ్యాపహరణముఁ జేసినవాఁడనుట; అలపుణ్యజనభర్తన్ = ఆ ప్రసిద్ధుఁడైన సుకృతిజనశేఖరుని; అడఁపఁడేనిన్ = తునుమఁ డేని; శ్రీరాముని పక్షమున: ఉరు = అధికమగు, గోవిహార = బాణములయొక్క విహారముచేత, ఆత్త = ఆక్రమింపఁబడిన, పర = ఉత్కృష్టమగు, జీవననిధియై = సముద్రము గలవాఁడై; అలపుణ్యజనభర్తన్ = ఆ రాక్షసులకు భర్తయగు రావణుని, అని భావము. పై విధమైన విరుద్ధధర్మములు గలిగియుండఁడేని శ్రీరాముఁడు, సాటియనవచ్చున్=(రామభూపాలునకు) సమానుఁ డన వచ్చును.
ఇందు యథాసంఖ్యాలంకారము. ‘యథాసంఖ్యం క్రమేణైవ క్రమికాణాం సమన్వయః’ అని లక్షణము. మఱియు వర్ణ్యుం డగు రామభూపాలున కవర్ణ్యుండగు రామభద్రుం డౌపమ్యనిష్పత్తి లేనందున సాటి గాఁడని చెప్పుటచే ప్రతీపాలంకారము. ‘వర్ణ్యేనాన్య స్యోపమాయా అనిష్పత్తి వచశ్చ తత్’ అని లక్షణము.
మ. శరజాతంబు దృణీకరించి, రజనీ◊జానిం గలాభంగ మై
పరవం జేసి, యధఃకరించి యలస◊ర్పస్వామి, రామక్షమా
వరుకీర్తిచ్ఛట సత్యలోకమునకున్ ◊వాగ్దేవితోఁ జెల్మికై
కర మేఁగన్ సురధేనువాస్య మటుగాఁ ◊గావించె మధ్యేసృతిన్. 61
టీక: రామక్షమావరుకీర్తిచ్ఛట = రామభూపాలుని యశఃపరంపర; శరజాతంబు = ఱెల్లుగడ్డియొక్క గుంపును; తృణీకరించి = ధిక్కరించి, ఱెల్లు తృణము గానఁ దృణీకరణము సహజము; రజనీజానిన్ = చంద్రుని; కలాభంగ మై పరవంజేసి = తేజో హీనత గలవాఁడై వర్తించునట్లు చేసి, చంద్రుఁడు కృష్ణపక్షమునందు కలాభంగము గలవాఁడై (కలాహీనుఁడై) వర్తిలుట సహ జము; అలసర్పస్వామిన్ = ఆ శేషుని; అధఃకరించి = నికృష్టునిఁగాఁ జేసి, ఆదిశేషుఁడు అధోలోకమునందుండుట సహజము; వాగ్దేవితోన్ = సరస్వతీదేవితో; చెల్మికై = స్నేహమునకై; సత్యలోకమునకున్ = బ్రహ్మలోకమునకు; ఏఁగన్ = పోవుచుండఁగా; మధ్యేసృతిన్ = మార్గమధ్యమందు, ‘పారే మధ్యే షష్ఠ్యా వా’ అని యలుక్సమాసము; సురధేనువు = కామధేనువు; కరము = మిక్కిలి; ఆస్యము = ముఖము; అటుగాఁ గావించెన్ = మరల్చె ననుట. ధేనువు ముఖము నల్లగా నుండును గాన చూపలేక మరల్చుట.
రామభూపాలునికీర్తి స్వర్గమర్త్యపాతాళములు వ్యాపించి సత్యలోకము దాఁకఁ బ్రసరించినదని తాత్పర్యము. ఇందు రామభూపాలకీర్తికర్తృక శేషాద్యధఃకరణాద్యసంబంధ ముండినను తత్సంబంధవర్ణనమును బట్టి సంబంధాతిశయోక్త్యలం కారము. ‘సంబంధాతిశయోక్తి స్స్యా దయోగే యోగకల్పనమ్’ అని లక్షణము. అదియు శ్లిష్టశబ్దనిబంధన యగుటచే శ్లేషో త్థాపిత యగును.
క. ఆ రామునట్లు వెలసెన్,క్ష్మారామారమణుఁ డగుచు ◊మల్లాధిపుఁ డా
సారాయతధీరాశుగ, వారాహతవైరిదాన◊వద్ద్విపకులుఁ డై. 62
టీక: ఇందు మల్లనృపతి శ్రీరామునట్లు అనఁగా తన యన్నయట్లు వెలసెనని చెప్పఁబడియె. మల్లాధిపుఁడు = మల్లనృపాలుఁడు; ఆసారాయత ధీరాశుగ వారాహత వైరి దానవ ద్ద్విపకులుఁ డై – ఆసార = వర్షధారలవలె, ఆయత = విస్తారము లయిన, ధీర = శ్రేష్ఠములైన, ఆశుగ = బాణములయొక్క, వార = సంఘముచేత, ఆహత = కొట్టఁబడిన, వైరిదానవద్ద్విపకులుఁ డై = వైరు లగు రాక్షసకుంజరములు, అనఁగా రాక్షసశ్రేష్ఠులు గలవాఁడై; వైరి =శత్రువులనెడు, దానవత్ = మదయుక్తములైన, ద్విపకులుఁ డై = గజముల గుంపులు గలవాఁడై యని యర్థాంతరము; క్ష్మా రామా రమణుఁ డగుచున్ – క్ష్మా = భూసంబంధిని యగు, అనఁగా భూపుత్రి యగు, రామా = సీత కనుట, రమణుఁ డగుచున్ = వల్లభుఁడగుచు, భూకాంతావల్లభుఁ డగుచు నని యర్థాం తరము, భూపాలుఁ డగుచు నని తాత్పర్యము; ఆ రామునట్లు వెలసెన్ = ప్రసిద్ధుఁడగు దాశరథివలెఁ బ్రకాశించెను. పైని జెప్పిన తన యన్న రామభూపాలునివలెఁ బ్రకాశించెను అని యర్థద్వయముఁ జూడవలయు. ఇందు శ్లేషసంకీర్ణోపమాలంకారము.
సీ. కురులపట్టునకు నే◊యురుకలానిధియాజ్ఞ, దరుణచంపకగర్భ◊దామకంబు,
మధురోపకంఠసీ◊మకు నేమహాభాగు, తతగుణశ్రేణి ము◊క్తాలలంతి,
కరహాటకటకభా◊గమున కేరాజుతీ,వ్రప్రతాపం బబ్జ◊రాగఘటన,
మద్రమధ్యమున కే◊మాన్యుకలాపాళి, గమనీయమేఖలా◊కలకలంబు,
తే. లలవిదేహదేశమున కే◊లలితమూర్తి, కీర్తి గర్పూరచర్చికా◊స్ఫూర్తి, యతఁడు
రాజచేకోలగండాంక◊రాజితుండు, మల్లభూపాలచంద్రుండు ◊మహిఁ జెలంగె. 63
టీక: కురులపట్టునకున్ = కురుదేశప్రదేశ మనెడు కుంతలప్రదేశమునకు; ఏ ఉరుకలానిధియాజ్ఞ = ఏ యధికవిద్యగలవాని యొక్క యాజ్ఞ; తరుణచంపకగర్భదామకంబు = తత్కాలగ్రథిత మగు సంపెంగపూవుల సంబంధి యైన శిరోమాల్యమో, అనఁగాఁ గుంతలములయందుఁ జంపకమాలిక నాదరముతో వహించిన ట్లా రాజునాజ్ఞ కురుదేశపువారిచే శిరసున వహింపఁ బడుచున్న దనుట. ఆ దేశమునీరాజే పాలించుచున్నాఁడని వ్యంగ్యము. ఇట్లన్ని చరణములయందును నూహింపవలెను.మధురోపకంఠసీమకున్ = మధురాపురియొక్క సమీపదేశ మనెడు మనోజ్ఞ మగు నుపకంఠసీమకు అనఁగా కంఠసమీపదేశ మునకు; ఏ మహాభాగు తతగుణశ్రేణి = ఏ మహాభాగ్యశాలియొక్క విపులమైన గుణగణము; ముక్తాలలంతి = వ్రేలాడు ముక్తా హారమో, ‘లమ్బనం స్యాల్లలంతికా’ అని యమరుఁడు. అనఁగా కంఠప్రదేశమునకు ముక్తాలలంతి శోభావహమైనట్లు మధురా పురీపరిసరమునకు నారాజు గుణగణ మలంకార మగు నని యనుట.కరహాటకటకభాగమునకున్ = కరహాటదేశపట్టణభాగ మను కరమందున్న హాటకకటకభాగమునకు అనఁగా సువర్ణమయ మైన కంకణములయొక్క ప్రదేశమునకు; ఏరాజుతీవ్రప్రతాపంబు = ఏరాజుయొక్క యుగ్రప్రతా పంబు; అబ్జరాగఘటన = పద్మ రాగమణిఘటనమో. తాత్పర్యము పైవ్రాసినరీతి నూహ్యంబు.మద్రమధ్యమునకున్ = మద్రదేశమధ్య మనెడు మంగళమగు మధ్యప్రదేశమునకు; ఏమాన్యుకలాపాళి = ఏ మాననీయుని విద్యాసమూహము; కమనీయమేఖలాకలకలంబు = మనోజ్ఞమగు నొడ్డాణముయొక్క కలకలధ్వనియో; అలవిదేహదేశమునకున్ = ప్రసిద్ధమయిన విదేహదేశ మనెడు విశేషమయిన శరీరప్రదేశమునకు; ఏ లలితమూర్తికీర్తి = ఏ కమ నీయశరీరుని కీర్తి; కర్పూరచర్చికాస్ఫూర్తి = కర్పూరలేపనాతిశయరూపమో; అతఁడు = ఆ రాజు; రాజచేకోలగండాంకరాజితుండు = రాజచేకోలగండయను బిరుదముచేఁ బ్రకాశించువాఁడు; మల్లభూపాల చంద్రుండు = చంద్రునివలె నాహ్లాదకుండగు మల్లభూపాలుఁడు; మహిన్ = భూమియందు; చెలంగెన్ = ప్రకాశించెను. మల్ల భూపతి గుణగణము మొదలగునవి భూషావిశేషరూప మయినపు డతఁడు చంద్రునివలె జగదాహ్లాదకరుఁ డగుట స్పష్టము. శ్లిష్టరూపకాలంకారము.
చ. అనుపమమల్లికార్జునయ◊శోంచితుఁ డైన కుమారమల్లనా
వనిపతి డాయఁ బూని రిపు◊వారము లంత నుపాంతవాహినీ
ఘనతరవారులన్ మునిఁగి ◊గ్రక్కునఁ గాంతురు సౌరసుందరీ
జనకుచకుంభకూటతట◊సాంద్రమృగీమదసారసంగతిన్. 64
టీక: అనుపమమల్లికార్జునయశోంచితుఁ డైన కుమారమల్లనావనిపతిన్ – అనుపమ = సాటిలేని, మల్లికా = మల్లికాకుసుమ ములవలె, అర్జున = తెల్లనగు, యశః = కీర్తిచేత, సాటిలేని మల్లికార్జునస్వామియొక్క ఖ్యాతిచేత, అంచితుఁ డైన = ఒప్పిన వాఁడైన (అనఁగా శ్రీశైలములోనున్న సాంబశివునకు మల్లికార్జునస్వామి యని నామంబు గాన ఈ రాజపుంగవుల వంశమున తొల్లింటినుండి యా మహానుభావుని సేవించుటయు, వారి నామంబుతోఁ దమబిడ్డలను బిలుచుటయుఁ గలిగియున్నయవి. దీననే పెదమల్లభూపాలుఁడు, చిన మల్లభూపాలుఁడు, ముమ్మడిమల్లభూపాలుఁడు, కుమారమల్లభూపాలుఁడు, అను నామంబులచే విలసిల్లుట. మఱియు లింగభూపాలుండు, లింగాంబిక లో నైనవియు నిష్టదేవతానామంబులే కాని వేఱు గావు. వెండియు నీ రాజశేఖరులకుఁ గూటస్థుం డగు ననపోతమహారాజు శ్రీశైలమునకు సోపానములు గట్టించినట్లు ‘యశ్చారుసోపాన పథేన చక్రే శ్రీపర్వతం సర్వజనాంఘ్రిగమ్యమ్’ ఇత్యాదిగా సింగభూపాలప్రణీతంబైన రసార్ణవసుధాకరమందు వర్ణింపఁబడినది), కుమారమల్లనావనిపతిన్ = కుమారమల్లభూపాలుని; డాయఁ బూని = చేరఁ గడంగి; రిపువారములు = శత్రుసంఘములు; అంతన్ = అంతట; ఉపాంత వాహినీ ఘన తరవారులన్ – ఉపాంత = సమీపమున నున్న, వాహినీ = సేనలయొక్క, సమీప మున నున్న కృష్ణానదియొక్క, ఘన= గొప్పనైన, తరవారులన్ = ఖడ్గములయందు, ఘనతరవారులన్ = గొప్పనైన జలము లందు; మునిఁగి = క్రుంకి; గ్రక్కునన్ = వేగముగా; సౌరసుందరీ జన కుచకుంభ కూట తట సాంద్ర మృగీమద సార సంగతిన్ – సౌరసుందరీ= సురాంగనలయొక్క, జన = సంఘముయొక్క, కుచకుంభ= కుంభములవంటి కుచములయొక్క, కూట = సమూహముయొక్క, తట = ప్రదేశములయందలి, సాంద్ర = దట్టమగు, మృగీమద = కస్తూరియొక్క, సార = స్థిరాంశము యొక్క, సంగతిన్ = సంబంధమును; కాంతురు = పొందుదురు.
ప్రస్తుతాప్రస్తుతముల కుపమానోపమేయభావము వ్యంగ్యము గాన రాజును సమీపింపఁబూనిన శత్రురాజులు వీరిసేనల ఖడ్గ ములచే నఱకఁబడి సురాంగనాపరిరంభసౌఖ్యమును, మల్లికార్జునస్వామిని జేరఁబూనినవారు కృష్ణానదియందు స్నానము సేసి సురాంగనాసంగసౌఖ్యముఁ బొందినట్లు పొందిరనుట. అలంకారము వ్యంగ్యోపమ.
సీ. శ్రీ నంద దనుచు సా◊మైనమే నూనుఁ జా,యల మెచ్చ దనుచు బ◊ల్వలపు నెఱపుఁ
దనపదంబునఁ జేర◊దనుచు వెల్వెలఁబోవుఁ, జెఱఁగు ముట్టదనుచుఁ ◊జెందు మఱపుఁ
దలముఁ జూడ దనుచుఁ ◊దాఁ గలంగు నిజాప,ఘనము నంట దనుచుఁ ◊గల దొలంగుఁ
గటక మొల్ల దనుచుఁ ◊ఘనదానరతిఁ బూనుఁ, గనుదోయిఁ గప్పుకో◊దనుచు రోఁజు
తే. శూలి సౌరాగ మాశర◊త్కాలఘనము, ముసలి జడధీనుఁ డుగ్రమౌ◊ళి సురవార
ణంబు శేషుండు వారిచం◊దంబుఁ జూచి, గేరు మల్లావనీపాలు◊కీర్తికన్య. 65
టీక: శ్రీ నంద దనుచు నిత్యాదిసీసచరణచతుష్టయమందుఁ జెప్పిన యర్థములకు గీతియందుఁ గ్రమముగా నన్వయంబు. శూలి = శివుఁడు; శ్రీ నంద దనుచు = శ్రీ యనఁగా సంపత్తు, విషము, మల్లావనీనాథుని కీర్తికన్య తన సంపద నొల్లదనుచు; సామైన మే నూనున్ = సగమైన శరీరమును దాల్చినవాఁడు. తన సంపదనె యంగీకరింప నప్పుడు తన్ను వరించుట మిక్కిలి యసంభావనీయమని చింతతో క్షీణించినాఁ డనుట. శివుఁడు తెల్లనివాఁ డైనను విషము నల్లనిది గానఁ దెల్లని స్వభావము గల కీర్తికన్య దానిం జూచి శివునిఁ ద్యజించుననియు, నీశ్వరుండు స్వభావముగా నర్ధాంగుఁ డనియుఁ దెలియవలయు; సౌరాగము = కల్పవృక్షము; చాయలన్ = కాంతులను, నీడలను; మెచ్చ దనుచు = శ్లాఘింపదనుచు; బల్వలపు నెఱపున్ = అధికమైన మోహమును దాల్చును. చాయలనే మెచ్చనిది తన్ను వరించుట దుర్లభ మని వలపు నెఱపు ననుట. కల్పవృక్షము తాను తెల్లనిదైనను దననీడ నల్లనిది గానఁ గీర్తికన్య మెచ్చ దనియు, వలపు అనఁగాఁ బరిమళము నెఱపుట సహజమనియు దెలియవలయు.ఆ శరత్కాలఘనము = ప్రసిద్ధమైన శరన్మేఘము; తనపదంబునఁ జేరదనుచున్ = తనస్థానమునఁ జేర దనుచు; వెల్వెలఁ బోవున్ = వైవర్ణ్యమును దాల్చును, తెల్లఁబోవును; ఘనపద మాకాశము నల్లనిది గావున నచటఁ గీర్తికన్య చేరదనియు, శర త్కాలఘనము తెల్లగా నుండుట సహజమనియుఁ దెలియునది. ముసలి = బలరాముఁడు; చెఱఁగు ముట్టదనుచున్ = వస్త్రమును ముట్టదని; మఱపుఁ జెందున్ = మత్తత నొందును; తన చెఱఁగు ముట్టనిది తన్ను వరించుట దుర్లభ మని మఱపుఁ జెందె ననుట. బలరాముఁడు తెల్లనివాఁడైనను కట్టుగుడ్డ నల్లనిది గానఁ గీర్తి ముట్టదనియు బలరాముఁడు మదిరాపానపరవశచిత్తుం డగుట స్వభావ మనియుఁ దెలియవలయు. ‘ఘూర్ణయన్ మదిరా స్వాదమదపాటలితద్యుతీ| రేవతీవదనోచ్ఛిష్ట పరిపూతపుటేదృశౌ’అని మాఘమందు బలరాముఁడు హాలాపానవివశుఁ డని వర్ణింపఁబడినది.
జడధీనుఁడు = సముద్రశ్రేష్ఠుఁడు; తలముఁ జూడదనుచున్ = అడుగుభాగమును జూడదనుచు; తాన్; కలంగున్ = కలఁగఁ బాఱును. సముద్రతలము పంకమయ మగుటచే నల్లగా నుండుననియు, సముద్రము కలఁగఁబాఱుట సహజ మనియుఁ దెలియునది. ఉగ్రమౌళి = శివుని శిరోలంకార మైన చంద్రుఁడు; నిజాపఘనమున్ = తన శరీరమును, ‘అఙ్గం ప్రతీకోవయవోపఘనోథ కళేబ రమ్’ అని యమరుఁడు; అంటదనుచున్ = ముట్టదనుచు; కల దొలంగున్ = కాంతిహీనుఁ డగును; చంద్రునియందుఁ గలంక మున్నది గాన నతనిశరీరమును ముట్టదనియు, చంద్రుఁడు కలాహీనుఁ డగుట సహజ మనియుఁ దెలియవలయు. సురవారణంబు = ఐరావతము; కటక మొల్లదనుచున్ = తనపురము నొల్లదనుచు; ఘనదానరతిఁ బూనున్= అధికత్యాగరతిని బూనును. ‘కట ఏవ కటః’ అని కటకశబ్దము గండస్థలమును బోధించును గాన నైరావతము గండస్థల మళిమలినమై యుండుట వలనఁ గీర్తి దాని నొల్ల దనియు, దాన మనఁగా మదోదకము దానియందు రతిఁబూనుట స్వభావమనియుఁ దెలియవలయు.శేషుండు = ఆదిశేషుఁడు; కనుదోయిన్ = నేత్రయుగ్మముచేత; కప్పుకోదనుచున్ = ఆదరింపదనుచు; రోఁజున్ = బుసపెట్టును. శేషుని కనుదోయియందు కప్పు అనఁగా నల్లదనము గలదనియు, కోదు అనఁగా నంగీకరింపదనియు, సర్పములకు రోజుట సహజమనియు భావము. శూలి యనఁగా శూలరోగము గలవాఁ డనియు, సౌరాగ మనఁగా సురాసంబంధియైన వృక్ష మనియు, ఆశరత్కాల మనఁగా రాక్షసులవలె నాచరించు కాలమేఘ మనియు, జడధీనుఁ డనఁగా జడమతిగలవారిలో శ్రేష్ఠుఁ డనియు, నుగ్రమౌళి యనఁగా నుగ్రులలో శ్రేష్ఠుఁ డనియు, సురవారణం బనఁగా సురలచే వారింపఁబడిన దనియు, శేషుఁడనఁగా దాసుఁ డనియు నపార్థము తోఁచుచున్నది గాన శివ కల్పతరు శరదంబుద బలభద్ర సముద్ర సురగజ శేషులయొక్క సంపచ్ఛాయాపదాదుల నిరాకరణ మును గీర్తికన్య చేసెననియుఁ దెలియవలయు. వారిచందంబుఁ జూచి = వారిరీతిని జూచి; మల్లావనీపాలు కీర్తికన్య = మల్లభూపా లుని కీర్తి యనెడు కన్య; కేరున్ = హసించును. క్రమాలంకారము. శివాదు లర్ధశరీరము మొదలగువాని నవలంబించుటకు మల్ల మహీపతి కీర్తికన్యాకర్తృకాస్వీకారము నహేతువును హేతువుగాఁ జెప్పుటచే హేతూత్ర్పేక్ష గమ్య మగు.
తే. ఆధరాధీశు పిమ్మట ◊నఖిలభూమి
భరము నీవు ధరించితి ◊కిరికులేంద్ర
కమఠవల్లభకులశైల◊కరటి సంస
దురగనాథులతోడఁ బె◊న్నుద్ది వగుచు. 66
టీక: ఆధరాధీశు పిమ్మటన్ = ఆ కుమారమల్లభూపాలుని పిదప; కిరికులేంద్ర కమఠవల్లభ కులశైల కరటిసంస దురగనాథుల తోడన్ = ఆదివరాహమూర్తి, ఆదికూర్మము, సప్తకులాచలములు, దిగ్గజగణంబు, ఆదిశేషుండు వీరితోడ; పెన్నుద్ది వగుచున్ = పెద్ద యీడగుచు; అఖిలభూమిభరము = సర్వపృథివీభారమును; నీవు; ధరించితి = భరించితివి. ఇందు గుణోత్కృష్టు లగు ఆదివరాహ కమఠనాథ కులశైల దిగ్గజ శేషులతో మాధవరాయలను దుల్యులనుగాఁ జెప్పుటవలనఁ దుల్యయోగితాలంకార భేదము. ‘శ్లో. గుణోత్కృష్టై స్సమీకృత్య వచోన్యా తుల్యయోగితా’ అని తల్లక్షణము.
\
సీ. బంధురవనకదం◊బములపాలుగఁ జేసె, ఘనతరపుండరీ◊కముల నెల్ల,
శిఖరిశిఖాశ్రేణిఁ ◊జేరంగఁ బురికొల్పెఁ, గలితసారంగసం◊ఘముల నెల్ల,
ఘోరమహాబిల◊కోటి నుండఁగఁ జేసెఁ, బ్రబలపరాశుగ◊పటలి నెల్లఁ,
గమలేశ్వరాధీన◊గతిఁ బొసంగఁగఁ జేసెఁ, దతవైజయంతికా◊వితతి నెల్లఁ,
తే. దన్నునవి యెల్ల మఱచినఁ ◊ దాను మఱవ,కాత్మనృపచిహ్నములు దాఁచు ◊నందునందు
శత్రునృపకోటి నీధాటిఁ ◊జకితవృత్తి, పరఁగి చనువేళ మాధవ◊ధరణిపాల. 67
టీక: ఇందు మాధవరాయల శత్రురాజులయొక్క నృపచిహ్నగోపన మర్థద్వయముతోఁ జెప్పఁబడినది. మాధవధరణిపాల = మాధవరాయా; శత్రునృపకోటి = శత్రురాజబృందము; నీధాటిన్ = నీ దండయాత్రయందు, ‘శ్లో. శత్రు సేనావమర్దాయ సద్య స్సుభటఘోటకైః విజిగీషోః ప్రవృత్తి ర్యా సా ధాటీతి నిగద్యతే’ అని ధాటీలక్షణము; చకితవృత్తిన్ = భీత వృత్తితో; పరఁగి = వర్తించి; చనువేళ = పాఱిపోవు నెడ; ఘనతరపుండరీకముల నెల్లన్ = మిక్కిలి గొప్పవైన శ్వేతచ్ఛత్రముల నెల్లను, తెల్లదామరల నెల్ల నని కాని, వ్యాఘ్రముల నెల్ల నని కాని యర్థాంతరము; బంధురవనకదంబముల పాలుగన్ = దట్టము లైన యుదకసంఘముల పాలగునట్లుగా, లేక యరణ్యముల పాలగునట్లుగా; చేసెన్. కలితసారంగసంఘముల నెల్లన్ = ఒప్పుచున్న యేనుఁగుల గుంపుల నన్నింటిని, తుమ్మెదల గుంపుల నన్నింటిని; శిఖరిశిఖా శ్రేణిన్ = పర్వతాగ్రప్రదేశములను, వృక్షాగ్రప్రదేశములను; చేరంగన్ = చేరునట్లు; పురికొల్పెన్ = చేసెను. గజము లడవులు చేరు నట్లు, వానియందున్న తుమ్మెదలు చెట్లు చేరునట్లు చేసెనని భావము.ప్రబలపరాశుగపటలి నెల్లన్ – ప్రబల = మిక్కిలి సామర్థ్యము గల, పర = శ్రేష్ఠములగు, ఆశుగ = బాణములయొక్క, వాయువు యొక్క,పటలి నెల్లన్ = సంఘము నెల్లను; ఘోరమహాబిలకోటిన్ = భయంకర మగు గొప్పబొఱియలగుంపులో, ఘోరమైన మహాబిల యనఁగా నాకాశముయొక్క యగ్రమున, ‘తారాపథోన్త రిక్షంచ మేఘద్వారం మహాబిలమ్’ అని యమరుఁడు; ఉండఁగఁ జేసెన్ = ఉండునట్లు చేసెను. తతవైజయంతికావితతి నెల్లన్ – తత=విస్తృతమగు, వైజయంతికా= టెక్కెములయొక్క , వితతి నెల్లన్ = సముదాయమునెల్లను; కమలేశ్వరాధీనగతిన్ – కమలేశ్వర = సముద్రముయొక్క ( ‘ సలిలం కమలం జలమ్’ అని యమరుఁడు), విష్ణుమూర్తియొక్క, అధీన = స్వాధీనతయొక్క, భావప్రధాననిర్దేశము, గతిన్ = ప్రాప్తిచేత; పొసంగఁగఁ జేసెన్ = ఒప్పునట్లు చేసెను. తన్నున్, అవి యెల్లన్ = ఆ గొడుగులు మున్నగు రాజచిహ్నము లన్నియు; మఱచినన్ = రాజ్యభ్రష్టులై పోవునపుడు తచ్చి హ్నములు తన్ను మఱచుట స్వభావము గాన,అట్లు మఱచినను; తాను మఱవక = తాను మఱచిపోక; ఆత్మనృపచిహ్నములు = తమరాజచిహ్నములు; అందునందు = వానివాని కుచితము లగు నాయా స్థలములయందు; డాఁచున్ = డాఁచిపెట్టును.
అనఁగా మాధవరాయల ధాటియందు భీతులై యరులు పోవునపుడు తమనృపచిహ్నములు యదృచ్ఛగా గొడుగులు నీటిలోను లేక వనములలోను, గజము లడవులలోను, వాని ననుసరించిన తుమ్మెదలు వృక్షాగ్రములలోను, బాణములు బొఱి యలలోను, టెక్కెములు సముద్రములోను వానియంతకు నవి పడిపోయినను శత్రురాజులు బుద్ధిపూర్వకముగాఁ దత్తదుచిత ప్రదేశములయం దుంచిపోయినట్లున్నదని యనుట. పుండరీకములు వనముల నుండుటయు, సారంగములు శిఖరిశిఖా శ్రేణులఁ జేరుటయు, ఆశుగములు గగనముఁ జేరుటయు, వైజయంతులు విష్ణుమూర్తిని జేరుటయు నుచిత మని భావము. ప్రకృతాప్రకృతార్థ ములకు శ్లేషమూలాభేదారోపముఁ జేయఁబడినది. ఇచట పుండరీక సారంగాశుగ వైజయంతులను మాధవ రాయధాటీపలాయితారిమండలి తత్తదుచితస్థానములలో నుంపకపోయినను నుంచిపోయినట్లు చెప్పుట వలన నుత్ప్రేక్షాలంకా రము. మఱియుఁ దత్తదనురూపస్థాననివేశనము శ్లేషమూలముగాఁ దోఁచుచున్నది గాన సమాలంకారము . ‘సమం స్యాద్వ ర్ణనం యత్ర ద్వయో రప్యనురూపయోః’ అని తల్లక్షణము.
చ. అనలమ హీన మై యెసఁగె ◊నౌర త్వదుద్ధతశౌర్యలక్ష్మిచే,
ధనదుఁడు వొందెఁ దా ధర హి◊తస్థితిఁ దావకదానవైఖరిం
గని, యచలవ్రజంబును ము◊ఖస్ఫుటవర్ణవియుక్తిఁ గాంచె నీ
ఘనతరధైర్యవైభవము ◊గన్గొని, మాధవరాయ చిత్రతన్. 68
టీక: మాధవరాయ, త్వదుద్ధతశౌర్యలక్ష్మిచేన్ – త్వత్ = నీయొక్క, ఉద్ధత = అధికమైన, శౌర్యలక్ష్మిచేన్ = ప్రతాపసంపదచేత; అనలమ = అగ్నియే; హీన మై యెసఁగెన్ = హీనమై యొప్పెను; ఔర = ఆశ్చర్యము, శౌర్యలక్ష్మి యగ్నికిని దుస్సహ మగు టచే నాశ్చర్యము; తావకదానవైఖరిన్ =నీదానరీతిని; కని = చూచి;ధనదుఁడు = కుబేరుఁడు; ధరన్ = భూమియందు; తాన్ = తాను; హితస్థితిన్ = హితవృత్తిని; పొందెన్ = పొందెను, ‘శ్లో. భజతే విదేశ మధికేన జిత స్తదనుప్రవేశ మథవా కుశలః’ అను న్యాయము ననుసరించి యీ హితవృత్తి నవలంబించె ననుట; నీ ఘనతరధైర్యవైభవము= ఉత్కృష్టమగు నీ ధైర్యసంపదను; కన్గొని = చూచి; అచలవ్రజంబు = పర్వతసంఘము; ముఖస్ఫుటవర్ణవియుక్తిఁ గాంచెన్ = ముఖమందు స్ఫుటవర్ణ వియోగ మును, అనఁగా కాంతిహీనతను కాదేని గద్గదభాషణమును, కాంచెన్ = పొందెను. చిత్రతన్ అనునది యంతటను సమన్వయిం చును. చిత్ర మెట్లన అనల మహీనమై అనఁగా అకారహీనమై, నలమై అనఁగా గడ్డిపోఁచై యెసఁగెను. ధనదుఁడు ధరహితస్థితిన్, అనఁగా ధకార రహితస్థితిని పొంది నదుఁ డై ‘న దదాతీతి నదః’ అను నిర్వచనప్రకారము ఏమియు నియ్యని వాఁడని పేరు నొందెను. ఇట నశబ్దముతో సమాసము. అచలవ్రజంబు ముఖస్ఫుటవర్ణవియుక్తిన్, అనఁగా ముఖస్ఫుట= ఆదియందు స్ఫుట ముగా నున్న, వర్ణ = ‘అ’వర్ణముయొక్క, వియుక్తిన్ = వియోగముచేత చలవ్రజ మయ్యె నని తాత్పర్యము. మాధవరాయల శౌర్యసంపదకు నగ్ని గడ్డిపోఁచగా నాయె ననఁగా శౌర్యాగ్నిప్రభకు నగ్నితేజ మల్పమై యెసఁగె ననియు, మాధవరాయల త్యాగమునకు విశేషముగ నిచ్చువాఁడై ధనదుఁ డని పేరొందిన కుబేరుండు నియ్యనివాని వలెఁ దోఁచె ననియు, మాధవరాయల ధైర్యసంపదకుఁ గదలకుండి యచల మనిపించుకొన్న పర్వతవ్రజము చలించుదానివలె నాయె ననియు భావము. మాధవరాయ లత్యద్భుతమైన శౌర్యము, దానము, ధైర్యము గలవాఁ డని ఫలితార్థము. అత్యుక్తి యర్థాలంకారము. చిత్రము శబ్దాలంకారము. ‘ఆకారగతిస్వరవ్యంజన స్థాననియమచ్యుతగుప్తాదిభేదై రనేకధా చిత్రమ్’ అని కావ్యానుశాసన మందుఁ జిత్రలక్షణము.
సీ. తాఁ గుంభినీశతఁ ◊దగి ముఖ్యరుచి నెల్లఁ, బరశిలీముఖకోటి◊పాలు చేసెఁ,
దా ధరాధీశతఁ ◊దనరి శృంగము నెల్ల, ఘనగండకాండసం◊కటముఁ జేసెఁ,
దా భోగిరాజతఁ ◊దాల్చి పదం బెల్ల, సాంద్రాహిభీతిజ◊ర్జరముఁ జేసెఁ,
దా భూమిదారత ◊ధరియించి పురమెల్ల, బహుళదుష్కీర్తిదు◊ర్భరముఁ జేసె
తే. ననుచుఁ గరిరాజి గిరిరాజి, నాహరిపతి, గిరిపతి నిరాకరించి యి◊ద్ధరణికాంత
సెందె నరిభేదవైభవాం◊చితు నభీతుఁ, గీర్తిసంపన్నుమాధవ◊క్షితిప నిన్ను. 69
టీక: ఇందు ధరణికాంత దిగ్గజాదుల నిరాకరించి మాధవరాయలను జేరుటకు శ్లేషభంగిచే హేతునిరూపణముఁ జేసి యర్థ ద్వయము గలుగఁ జెప్పఁబడియె. ఏలాగనిన: తాన్ = తాను; కుంభినీశతన్ = భూమీశ్వరత్వము చేత; తగి, ముఖ్యరుచి నెల్లన్ = ప్రధానకాంతి నంతయు; పరశిలీముఖకోటిపాలు చేసెన్ = శత్రువులయొక్క బాణపరంపరలపాలు చేసెను, తాను రాజయ్యుఁ దనరాజశక్తి నంతయు శత్రువుల యధీనము చేసెనని యర్థము. దిగ్గజవర్గము కుంభినీశత ననఁగాఁ గరణీపతిత్వము చేతఁ దనరినదనియు, ముఖ్యరుచి ననఁగా ముఖమందుఁ బుట్టిన చవిని, పరశిలీముఖకోటి యనఁగా శ్రేష్ఠమగు తుమ్మెదల గుంపు, దానియధీనము చేసిన దనియు భావము. తాన్ = తాను; ధరాధీశతన్ = భూపతిత్వముచేత; తనరి, శృంగము నెల్లన్ = దొరతనమునంతయు; ఘనగండకాండసంకట మున్ – ఘన = గొప్పనైన, గండకాండ = ఉపద్రవపరంపరలచేత, సంకటమున్=సమ్మర్ద మైన దానిఁగా; చేసెన్, అని యర్థము. కులాచలవర్గము, ధర = పర్వతములకు, అధీశతన్ = అధిపతిత్వము చేత, తనరి, తనశిఖరము నెల్ల ఘనములయిన (గండ కాండ) స్థూలోపలములయొక్క సంఘములచే సంకటమగు నట్లు చేసె నని భావము. తాన్ = తాను; భోగిరాజతన్ – భోగి = రాజులకు; రాజతన్ = రాజత్వమును, రాజాధీశ్వరత్వము ననుట; తాల్చి, పదం బెల్లన్ = తన నివాసస్థానము నెల్లను; సాంద్రాహిభీతిజర్జరమున్ – సాంద్ర = దట్టమైన, అహిభీతి = శత్రుభీతిచేత, జర్జరమున్ = శిథిల మైనదానిఁగా; చేసెన్ = చేసెను, శేషుండు భోగిరాజతన్ అనఁగా సర్ప రాజతను దాల్చినాఁడనియు, తన పదమైన పాతాళలోక మంతయు అహిభీతిన్ అనఁగా సర్పభీతిచేత జర్జరమైన దనియు భావము. తాన్ = తాను, భూమిదారతన్ = భూపతిత్వమును; ధరియించి = వహించి; పురమెల్లన్ = పట్టణమంతయు; బహుళదు ష్కీర్తిదుర్భరమున్ చేసెన్= అధికమగు నపకీర్తిచేత దుర్భరముగాఁ జేసె నని యర్థము. ఆదివరాహస్వామి భూమిదారమను నామమును వహించినాఁడనియు, తన పురమెల్లన్, అనఁగాఁ దన దేహము నెల్లను బహులమై దుష్టమగు బురదచేత వ్యాప్తము చేసినాఁడనియు భావము. వరాహములు బురదలోఁ దిరుగుట స్వభావము. గీతియందుఁ గ్రమముగా నన్వయము: అనుచున్ = ఇట్లనుచు; ఇద్ధరణికాంత = ఈభూకాంత; కరిరాజిన్ = దిగ్గజసంఘమును; గిరిరాజిన్ = కులాచలసంఘమును; ఆ హరిపతిన్ = ప్రసిద్ధుఁ డగు సర్పరాజైన ఆ యాది శేషుని; కిరిపతిన్ = వరాహాధిపతి యైన యాదివరాహమును; నిరాకరించి=తిరస్కరించి; అరిభేదవైభవాంచితున్ = శత్రువిదారణసంపదచే నొప్పుచున్నవానిని; అభీతున్ = భయరహితుని; కీర్తిసంపన్నున్ = కీర్తి మంతుని; మాధవక్షితిప = మాధవరాయా; నిన్నున్, చెందెన్ = పొందెను. ఇందును గ్రమముగా నన్వయము తెలియం దగినది. ఇందు శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారమును, యథాసంఖ్యాలంకారమును.
మ. భవదీయోగ్రచమూపరాగపటలా◊భ్రశ్రేణి యాదోనిధా
నవిషంబుల్ వడిఁ ద్రావ జన్యవసుధా◊నవ్యోరుడోలాధిరూ
ఢవిపక్షక్షితినాథు నూఁచు బలఝా◊టస్థేమ చిత్రంబు మా
ధవరాయేంద్ర త్వదీయహేతి వెలికిం ◊ దార్చున్ యశఃక్షీరమున్. 70
టీక: మాధవరాయేంద్ర, భవదీయోగ్రచమూ పరాగపటలాభ్రశ్రేణి – భవదీయ = నీకు సంబంధించిన, ఉగ్రచమూ = ఉగ్రమగు సేనయొక్క, పరాగపటల = ధూళీపటల మనెడు, అభ్రశ్రేణి = మేఘపరంపర; యాదోనిధానవిషంబుల్=సముద్రసంబంధి విషములను, జలముల ననుట; వడిన్ = వేగముగా; త్రావన్ = పానము సేయఁగా; బలఝాటస్థేమ = సైన్యసంఘముయొక్క సామర్థ్యము; జన్యవసుధా నవ్యోరు డోలాధిరూఢ విపక్షక్షితినాథున్ – జన్యవసుధా = యుద్ధభూమి యనెడు, నవ్య = నూతన మును, ఉరు = గొప్పదియు నగు, డోలా = ఉయ్యెలను, అధిరూఢ = అధిష్ఠించు, విపక్షక్షితినాథున్ = శత్రురాజును; ఊఁచున్ = ఊఁచును; త్వదీయహేతి = నీఖడ్గము; యశఃక్షీరమున్ = యశస్సనెడు పాలను; వెలికిం దార్చున్ = వమనము చేయును, బయల్పఱచు ననుట; చిత్రంబు = ఆశ్చర్యము. విషము ద్రావినవారిని పాలు ద్రాపి యుయ్యలలోనుంచి యూఁపఁగా వారు విషముతోడి పాలను గ్రక్కుట సహజమై యుండఁగా చమూపరాగము విషము ద్రావుటయు, శత్రురాజు నూఁచుటయు, ఖడ్గము పాలను కక్కుటయు, చిత్రంబని భావము. మాధవ రాయల సేనాపరాగము సముద్రముదాఁక వ్యాపించి జలము నింకు నట్లు చేసిన దనియు, శత్రువు యుద్ధభూమిని బడిపోయినాఁ డనియు, ఖడ్గము మిక్కిలి ఖ్యాతిని ఘటింపఁజేసిన దనియు ఫలితార్థము. అసంగత్యలంకారము. ‘విరుద్ధం భిన్నదేశత్వం కార్య హేత్వో రసంగతిః| విషం జలధరైః పీతం మూర్ఛితాః పథికాఙ్గనాః’ అని చంద్రాలోకలక్ష్యలక్షణంబులు. పరాగ పటలాభ్రశ్రేణి, జన్యవసుధాడోలా, యశఃక్షీరేత్యాదులందు రూపకము.
సీ. ముకుళితపాణు లై ◊వికవిక నగువారి, స్వీయాంకసంగతిఁ ◊జెంద నీదు,
తల నిల్పికొనఁ బూని ◊ తహతహపడువారి, ననురాగయుక్తి డా◊యంగఁ బోవ,
దడుగు వెట్టఁగ లేక ◊వడఁకు చుండెడివారి, స్థిరమహాధారాప్తిఁ ◊జేర్పఁ జనదు,
తృణగర్భ మగుమోము ◊దెఱచు చుండెడువారి, నెద మీఱ ముఖమంటఁ ◊గదియ దింత,
తే. మనుపదో మహస్సూనులఁ ◊ బెనుపదో న,వీనకీర్తిసంతాన మి◊వ్విపుల నౌర!
తావకీనాసిలక్ష్మి చి◊త్రప్రశస్తి, వితతగుణసాంద్ర! మాధవ◊క్షితిమహేంద్ర! 71
టీక: ఈపద్యమందు మాధవరాయాసిలక్ష్మిని బుత్రవతిఁగా నధ్యవసించి యర్థద్వయము గలుగఁ జెప్పఁ బడియె. ఏలాగనిన: ముకుళితపాణు లై = మోడ్పుఁగేలులు గలవారై; వికవిక నగువారిన్ = కకవిక నయ్యెడువారిని; స్వీయ = తనసంబంధి యైన; అంక = తొడయొక్క; సంగతిన్ = సంబంధమును; చెంద నీదు = పొందనీయదు; అతిబాల్యము గలవారై పిడికిలి పట్టుకొని వికవిక నగు శిశువుల నెత్తికొని తనతొడ మీఁదఁ గూర్చుండఁ బెట్టుకొన దని పుత్రవతీపరమైన యర్థము. ప్రణమిల్లుచు కకావికలు పడుచుండెడి శత్రువులను తన సమీపము నొందనీదు అనఁగా నట్టివారి దగ్గరకుఁ బోయి వారిని చంపదని ఖడ్గపర మైన యర్థము.తల నిల్పికొనఁ బూని = తల నిల్పుటకుఁ బ్రయత్నించి; తహతహపడువారిన్ = సంతోషపడుచున్న శిశువులను; అనురాగ యుక్తి న్ = ప్రీతితోడ; డాయంగఁబోవదు = సమీపింపఁబోవదు. తల నిల్పఁజాలక తహతహ పడు శిశువుల సమీపమునకుఁ బ్రీతితోఁ బోదని పుత్రవతీపరమైన యర్థము. యుద్ధములో శిరస్సు నిల్పుకొన వలెనని అనఁగా జీవింపవలెనని (తహతహపడు) త్వరపడు శత్రువులను డాయంగఁబోదని అనఁగా నట్టి వారిని సంహరింపదని ఖడ్గపరమైన యర్థము. అడుగు వెట్టఁగలేక వడఁకు చుండెడివారిన్ = నడచునంత వయస్సు లేక నడవఁబోయి వడఁకుచుండెడి బాలురను; స్థిరమహా ధారాప్తిన్ = స్థిరమై గొప్పది యైన స్తంభాద్యాధారముయొక్క ప్రాప్తిని; చేర్పఁ జనదు= చేర్చుటకుఁ బోవదు. నడవనేరక లేచి పడుచున్న శిశువులను స్తంభాద్యాధారములు చేర్పఁ జనదని పుత్రవతీపర మైన యర్థము. యుద్ధకాలమందుఁ బ్రాణభీతితో నడుగువెట్టఁ జాలక అనఁగాఁ బాఱిపో నుద్దేశించియు భీతితోఁ బాఱఁజాలక కంపించువారిని స్థిరమై యధికమైన (ధారా) అంచు యొక్క ఆప్తిని జేర్పంగఁ జనదు, అనఁగా అట్టివారిని తెగనఱక దని ఖడ్గపరమైన యర్థము.తృణగర్భ మగు మోము దెఱచుచుండెడువారిన్ = అజ్ఞానముతో గడ్డిపోఁచలను నోటిలోఁ బెట్టికొని తెఱచుచుండెడు బాలురను;
ఎద మీఱన్ = మనముప్పొంగఁగా; ముఖమంటన్ = ముఖము శోధించుట కనుట; కదియ దింత = ఎంతమాత్రమును చేరదు, అనఁగా కదిసి గడ్డిపోఁచలను దీయదని పుత్రవతీపరమైన యర్థము. భయమతిశయింపఁగా గడ్డి నోటఁ గఱచుకొనిన శత్రువులను సంహరింపదని ఖడ్గపరమైన యర్థము. ఔర! వితతగుణసాంద్ర! మాధవక్షితిమహేంద్ర! ఇవ్విపులన్ = ఈభూమియందు; తావకీనాసిలక్ష్మి= నీ ఖడ్గలక్ష్మి; మహ స్సూనులన్ = ప్రతాపము ప్రధానముగాఁ గల కుమారుల నని పుత్రవతీపరమైన యర్థము. సూర్యునివంటి ప్రతాపముల నని ఖడ్గపరమైన యర్థము. ‘సూనుః పుత్రేఽనుజే రవౌ’ అని అమరశేషము; మనుపదో = పోషింపదో? నవీనకీర్తిసంతానము = క్రొత్తనైన కీర్తి యని స్త్రీత్వనిర్దేశమునఁ గీర్తి యనెడు నాఁడు బిడ్డలయొక్క సంతానము నని పుత్రవతీపరమైన యర్థము, కల్ప వృక్షమువంటి కీర్తి నని ఖడ్గపరమైన యర్థము; పెనుపదో = పెంపదో? చిత్రప్రశస్తి = అతిచిత్రము, అనఁగాఁ దాను పుత్రులను గనుచుఁ బెంచుచు బెఱవారిబాలురు ముకుళితపాణులై వికవిక నగుచుండుట లోనగు వ్యాపారములు సేయునెడ స్వీయాంక సంగత్యాదులను జేయకుంట యాశ్చర్యం బని పుత్రవతీపరమైన భావము. మాధవరాయల ఖడ్గము శరణాగతులను, బ్రాణ త్రాణమునకై తహతహపడువారిని, బరుగెత్తిపోవ నుద్దేశించి పోలేక వడఁకుచుండెడివారిని, గడ్డిపోఁచ నోరఁ బెట్టుకొని శర ణార్థులైనవారిని సంహరింపదు. తక్కిన శత్రువుల నందఱిని ధ్వంసము చేసినదని ఖడ్గపరమైన భావము.
మ. ధరణిన్ మాధవరాయ తావకబలో◊ద్యద్రేణుపాళీకృతో
ద్ధురభావత్కమహోగ్నిబుద్ధి ప్రమ యై ◊తోఁపంగ నాన్వీక్షకీ
వరు లవ్యాప్తము ధూళి తద్బలమునం ◊బాటిల్లు ధూమధ్వజా
కరధీ యప్రమ యంచు నెంచుట లిఁకం ◊గైకొందురే యెంతయున్. 72
టీక: మాధవరాయ, ధరణిన్ =భూమియందు; తావక బలోద్య ద్రేణుపాళీ కృతోద్ధుర భావత్కమహోగ్నిబుద్ధి – తావక = నీ సంబంధియగు, బల = సైన్యమందు, ఉద్యత్ = ఎగయుచున్న, రేణుపాళీ = పరాగపంక్తిచేత, కృత = చేయఁబడిన, ఉద్ధుర = దట్టమైన, భావత్కమహోగ్నిబుద్ధి = నీసంబంధియైన ప్రతాపాగ్నిజ్ఞానము; ప్రమయై = యథార్థనుభవమై; తోఁపంగన్ = తోఁచు చుండఁగా; ఆన్వీక్షకీవరులు = తార్కికులు; ధూళి = పరాగము; అవ్యాప్తము = సాధ్యసమానాధికరణాత్యంతాభావప్రతి యోగి; తద్బలమునన్ = ఆసైన్యమందు; పాటిల్లు = ఉదయించు; ధూమధ్వజాకరధీ = వహ్నివిషయకజ్ఞానము; అప్రమ = అయథార్థజ్ఞానము, అనఁగా భ్రాన్తిరూపజ్ఞానము; అంచున్ = ఇట్లనుచు; ఎంచుటలు = అనుకొనుటలు; ఇఁకన్ = ఇఁకమీఁద; ఎంతయున్ = మిక్కిలి; కైకొందురే = గ్రహింతురా? గ్రహింప రనుట. అతార్కికు లైనవారలు నీ సైన్యరజ స్సున్నచోట నీప్రతా పాగ్ని యుండునన్న విషయము అయథార్థముగాఁ దెలిసికొన్నను, దర్కశాస్త్రపారీణులు తావకబలోద్యద్రేణురూపహేతువు చేత భవత్ప్రతాపాగ్నిజ్ఞానము యథార్థానుభవమై యుండఁగా ధూళి యవ్యాప్తము, ప్రతాపాగ్నిజ్ఞానము భ్రమాత్మక మనుట యంగీకరింపరని తాత్పర్యము. అతిశయోక్తి సంకీర్ణానుమానాలంకారభేదము.
సీ. శారదనారద◊సాదృశ్యము వహించి, హంసమండలి నంద◊మందఁ జేయు,
బుధవరప్రహ్లాద◊బోధకశ్రీఁ బూని, భూరిహరిచ్ఛాయఁ ◊బొలుపు మీఱు,
సామోదపుండరీ◊కాఖండరుచిఁ గాంచి, సర్వజ్ఞమతికి దో◊షము ఘటించు,
ననుపమానఘనార్జు◊నాభిఖ్య నలరారి, పాండురాజవిభూతిఁ◊బరిఢవిల్లు,
తే. నందనందనపాదార◊విందభక్తి, వాసితాశ్రయ శ్రీమాధ◊వక్షితీశ
తావకఖ్యాతికాంత య◊తాంతమగు ని,జానుకూల్యంబు దెల్లమై ◊యతిశయిల్ల. 73
టీక: నందనందనపాదారవింద భక్తివాసితాశ్రయ – నందనందనపాదారవింద= శ్రీకృష్ణపాదపద్మములయొక్క, భక్తివాసిత= భక్తులకనుట, ఆశ్రయ = ఆశ్రయుఁడైన; శ్రీమాధవక్షితీశ = శ్రీమాధవభూపాలుఁడా! తావకఖ్యాతికాంత = నీ కీర్తికాంత; అతాంతమగు నిజానుకూల్యంబు – అతాంతమగు = అమ్లానమగు, అనఁగా ప్రకాశించునది యనుట, నిజానుకూల్యంబు = స్వీయానుకూల్యము; తెల్లమై = వ్యక్తమై, అతిశయిల్లన్ =విజృంభించునట్లుగా; శారదనారదసాదృశ్యము = నూతనమగు నారదమహర్షియొక్క సామ్యమును, ‘ శారదః పీతమన్దే నాప్రత్యగ్రేఽభినవే త్రిషు’ అని హలాయుధము; వహించి=పొంది; హంస = యతులయొక్క; మండలిన్ = సమూహమును, హంస,పరమహంస, కుటీచక, బహూదకు లని యతులలో నాల్గు భేదములు; నందము = ఆనందమును; అందఁ జేయున్ = పొందఁజేయును; నారదమహర్షిసాదృశ్యము నొంది యతుల కానందము గలుగఁజేయు నని యర్థము. శరత్కాలమేఘముయొక్క సాదృశ్యమును వహించి రాయంచలగుంపు నంద మందునట్లు చేయు నని భావము. రాయంచలు వార్షుకమేఘమునకు వెఱచుటయు, శారదమేఘమునకు సంతసించుటయు కవికులప్రసిద్ధంబు. బుధవరప్రహ్లాదబోధకశ్రీఁబూని – బుధవరప్రహ్లాద = బుధశ్రేష్ఠుం డగు ప్రహ్లాదునియొక్క, బోధకశ్రీఁబూని = జ్ఞానసంపదను బూని, ఇట బోధశబ్దముమీఁద స్వార్థమందు కప్రత్యయము; భూరి = అధికమగు; హరిచ్ఛాయన్ = విష్ణుమూర్తియొక్క నీడ చేత, పక్షపాతముచేత ననుట; పొలుపు మీఱున్ = ఒప్పుమీఱును; ప్రహ్లాదుని జ్ఞానసంపదను వహించి విష్ణుమూర్తిచ్ఛాయ నొప్పు నని యర్థము. బుధవరులయొక్క(అనఁగా పండితోత్తములయొక్క) ప్రహ్లాదమును బోధించు శ్రీఁబూని సింహముయొక్క కాంతి చేతఁ బొలుపుమీఱు నని భావము.
సామోదపుండరీకాఖండరుచిన్ = సంతసముతోఁ గూడిన పుండరీకుఁడను నొక విష్ణుభక్తునియొక్క యఖండరుచిని; కాంచి = వహించి; సర్వజ్ఞమతికిన్ తోషము ఘటించున్ =అనఁగా సర్వజ్ఞపదము యోగవృత్తిచే విష్ణుమూర్తిని బోధించును గాన విష్ణు మనస్సున కానందముఁ గలుగఁజేయు నని యర్థము. పరిమళముతోఁ గూడిన తెల్లదామరలకాంతి నొంది యీశ్వరునియొక్క మనస్సున కానందము ఘటించు నని భావము. శివుఁడు పుండరీకప్రియుఁ డగుట స్పష్టము.
అనుపమానఘనార్జునాభిఖ్య నలరారి = అసమానము ఘనమును నైన యర్జునునియొక్క కాంతిచేత నలరారి; పాండురాజ విభూతిఁ బరిఢవిల్లున్ = పాండురాజుయొక్క యైశ్వర్యముతో నొప్పియుండు నని యర్థము. అర్జునాభిఖ్య నలరారినపుడు అతనితండ్రి యగు పాండురాజుయొక్క విభూతితోఁ బరిఢవిల్లుట స్పష్టము. అనుపమానము, ఘనము నగునట్లుగా (అర్జున మనఁగా) శుభ్ర మైనది యని పేరొంది (పాండురాజ) తెల్లనిచంద్రునియొక్క విభూతితోఁ బరిఢవిల్లు నని భావము. ఇట్లు నీవు నందనందనపాదారవిందభక్తివాసితుల కాశ్రయమై యున్నవాఁడవు కాన నీకీర్తియు నారద ప్రహ్లాద పుండరీ కార్జునాది భాగవతో త్తముల భంగి నలరి హంసాదుల కానంద మందఁజేయుచు నీయానుకూల్యవర్తనతో రాజిల్లు నని యభిప్రాయము. నీకీర్తి శర త్కాలమేఘాదులతోఁ దులతూగి యున్నదని ఫలితార్థము. ఇందు శ్లేషసంకీర్ణోపమాలంకారము.
సీ. భూరిప్రకంపన◊స్ఫూర్తి గ్రక్కున లేచి, పటుతరరథచక్ర◊భంగ మూన్చి,
పరమస్తకోద్దేశ◊పదవికి నెగఁబ్రాఁకి, తద్ఘనాఖ్యామృత◊ధారఁ గ్రోలి,
యతనుసంగరమాప్తి ◊యంటువాయఁగఁ జేసి, యాత్మైకచింతనా◊యతిఁ దవిల్చి,
యచలయోగస్థేమ ◊మలవడఁగాఁ దీర్చి, కన్నుల నీరొల్కఁ◊గా ఘటించి,
తే. సురుచిరాహారముల్ మాన్పి, ◊పరమశక్తి
భవదసిభుజంగి జటిలతా◊పదవిహార
విభవములఁ గూర్చెఁ బరహంస◊వితతి కెల్లఁ
దనర మాధవరాయ! స◊త్సాంపరాయ! 74
టీక: సత్సాంపరాయ = న్యాయయుద్ధము గల; మాధవరాయ = మాధవప్రభుపుంగవుఁడా! తనరన్ = ఒప్పునట్లు; పరమశక్తి భవదసిభుజంగి = పరమశక్తిస్వరూప మగు నీఖడ్గ మనెడు కుండలిని; పరహంసవితతి కెల్లన్ = శత్రుశ్రేష్ఠసంఘమున కెల్లను అని ఖడ్గపరమైన యర్థము, శ్రేష్ఠులగు యతులయొక్క సంఘమున కెల్ల నని కుండలినీశక్తిపరమైన యర్థము; భూరి = అధికమైన; ప్రకంపన= చలనముయొక్క; స్ఫూర్తిన్ = ప్రకాశము చేత; గ్రక్కున లేచి = వేగముగ లేచి; పటుతర = దృఢతరములైన; రథ = స్యందనములయొక్క; చక్ర = కండ్లయొక్క; భంగ మూన్చి = భంగము సేసి, అని ఖడ్గపరమైన యర్థము. అధికమగు ప్రాణా యామ నిబద్ధ వాయువుయొక్క స్ఫూర్తిచే గ్రక్కున లేచి దృఢతరదేహసంబంధి మూలాధారాదిచక్రములయొక్క భంగమూన్చి యని శక్తిపరమైన యర్థము. పర = శత్రువులయొక్క; మస్తకోద్దేశపదవికిన్ = శిరస్స్థానమునకు; ఎగఁబ్రాఁకి = ఎక్కి; తద్ఘనాఖ్యామృత ధారన్ – తత్ = ఆ శత్రువులయొక్క, ఘన = అధికమగు, ఆఖ్యా = యశ మనెడు, అమృతధారన్ = సుధారసమును; క్రోలి = పానము సేసి, అని ఖడ్గపరమైన యర్థము. ఉత్కృష్టమగు శిరస్స్థానమున కెక్కి ప్రసిద్ధమగు ఘన మను పేరు గలిగిన సహస్రారసుధను గ్రోలి యని శక్తిపరమైన యర్థము. అతనుసంగరమాప్తి యంటున్ –అతను = అధికమగు; సంగర = యుద్ధసంబంధి యైన; మా = లక్ష్మియొక్క; ఆప్తి = ప్రాప్తి యొక్క; అంటు = సంపర్కమును; పాయఁగఁ జేసి = లేకుండఁజేసి; ఆత్మైకచింతనాయతిన్ – ఆత్మ = తనయొక్క, అనఁగా ఖడ్గముయొక్క, ఏక = ముఖ్యమగు, చింతనా = స్మరణముయొక్క, ఆయతిన్ = అతిశయమును; తవిల్చి = కూర్చి, అని ఖడ్గపరమైన యర్థము. అధికమైన సంగముయొక్క రమయొక్క ఆస్తిని లేకుండఁజేసి బ్రహ్మముయొక్క ముఖ్య మగు ధ్యానాతి శయము ఘటింపఁజేసి యని శక్తి పరమైన యర్థము. అచలయోగస్థేమము –అచల = పర్వతములయొక్క; యోగ = సాంగత్యమందలి; స్థేమము = స్థైర్యమును; అలవడఁగాఁ దీర్చి = తగు నట్లుగాఁ జేసి; కన్నుల నీరొల్కఁగా ఘటించి=దుఃఖముచేతఁ గన్నుల నీ రొల్కునట్లు చేసి యని ఖడ్గ పరమైన యర్థము. చలింపని యోగమందు స్థైర్యమును తగున ట్లొనరించి, యానందముచేతఁ గన్నుల నీ రొల్కునట్లు చేసి యని శక్తిపరమైన యర్థము. సురుచిరాహారముల్ మాన్పి = మనోహరములగు నాహారములు మానునట్లు చేసి, అరణ్యవాసముచేత శత్రురాజులకు, యోగు లకును ఫలమూలాదులే యాహారంబులు గావున నిరుపక్షములయందును నిదే యర్థము. జటిలతాపదవిహారవిభవములన్ – జటి = జువ్విచెట్లయొక్క, ‘ప్లక్షో జటీ పర్కటీ స్యాత్’ అని యమరుఁడు, లతా = తీవెలయొక్క, పద = స్థానములయందలి, విహార = విహరణముయొక్క, విభవములన్ = సంపదలను, కూర్చెన్ అని ఖడ్గపరమైన యర్థము. జటిలతా = జటాధారిత్వ మనెడు, పద = చిహ్నముచేత, విహారవిభవముల నని శక్తిపరమైన యర్థము.
మాధవరాయలవారిఖడ్గము గ్రక్కున లేచి శత్రురాజుల రథచక్రాదులను భంగము చేసి, వారితలపై కెక్కి వారి యశంబును గొని యనఁగా వారి నోడించి ఖ్యాతి గాంచి, వారలు యుద్ధలక్ష్మీచింత పోయి తన (ఖడ్గ)చింతయే ముఖ్యముగాఁ గలిగి యడ వులపాలై దుఃఖముతోఁ గన్నీ రొలుకఁగా మృష్టాన్నాహారము లేక వృక్షలతాగుల్మాదిప్రదేశములలోఁ జేరునట్లు చేసె ననియు, నది చూడఁగా యోగాభ్యాసము సేయువారల మూలాధారనిలయ యగు కుండలిని యను శక్తి ప్రాణాయామనిబద్ధవాయువుచే గ్రక్కున లేచి మూలాధారాదిచక్రభంగ మొనర్చి శిరస్స్థానమందు సహస్రారసుధను గ్రోలి సర్వసంగపరిత్యాగము, బ్రహ్మాను సంధానము గల్గఁ జేయుచు నిశ్చలయోగముతో నానందబాష్పము లొల్కఁగా వార లాహారములు మాని జటాధారు లై యడ వులలో విహరించునట్లు చేసినభంగి నున్న దనియు భావము. ఇందు శ్లిష్టపరంపరితరూపకాలంకారము.
తే. విబుధశిక్షితుఁడవు, శాస్త్ర◊విదుఁడ, వఖిల
కావ్యవేదివి, ఘనతార్కి◊కవ్యవహృతి
నెఱుఁగుదువు, నీ కసాధ్యమే ◊యింపు మీఱఁ
గృతి వినిర్మింపుము మాధవ◊క్షితిప యనిరి. 75
టీక: మాధవక్షితిప, నీవు విబుధశిక్షితుఁడవు, అలంకారాది సర్వశాస్త్రముల నెఱిఁగినవాఁడవు, అఖిలకావ్య వేదివి, ఘనమైన తర్క శాస్త్రసంబంధి యైన వ్యవహారము నెఱుఁగుదువు, నీకుఁ బుండరీకాక్షనిదేశానుసారముగఁ గృతి నిర్మించుట యసాధ్యంబు గాదు కావున నింపుమీఱఁ గృతి నిర్మింపు మని బుధజనంబు లమందానందకందళితహృదయారవిందులై యని రని పూర్వము వ్రాసిన వచనముతో నన్వయము.
వ. అనిన నేను బరమానందకందళితహృదయారవిందుండ నై. 76
షష్ఠ్యంతములు
క. భాషాధిప శేషాహిప
భాషాభూషాయితాత్మ◊పటుగుణతతికిన్
దోషాచరదోషాచర
దోషాచరచక్రకలిత◊దోర్బలభృతికిన్. 77
టీక: భాషాధిప = బ్రహ్మయొక్కయు; శేషాహిప = ఆదిశేషునియొక్కయు; భాషా = వాణికి; భూషాయిత = అలంకారప్రాయ మగు; ఆత్మ = తనయొక్క; పటు = శ్రేష్ఠములగు; గుణ = అనంతకల్యాణగుణములయొక్క; తతికిన్ = సమూహము గల వానికి; దోషాచర దోషాచర దోషాచర చక్ర కలిత దోర్బల భృతికిన్ – దోష = పాపములను, ఆచర = మిక్కిలి ఆచరించు చున్న, దోషాచర = రక్కసులయొక్క, దోషా = భుజములకు, ‘దో ర్దోషా చ భుజా బాహు’ అని హలాయుధనిఘంటువు, చర = ఖండించెడు, చక్ర = సుదర్శనముచేత, కలిత = ఒప్పుచున్న, దోర్బల = బాహుబలముయొక్క, భృతికిన్ = భరణము గల వానికి. దీని కర్పితముగ నొనర్తు నను దానితో నన్వయము. ముందు నిట్లు చూడవలయు.
క. కోపాయితపాపాయత
భూపాయితదనుజమథన◊పూజితమతికిన్
గోపాలనగోపాలన
గోపాలననిబిడరతికి ◊గోహితకృతికిన్. 78
టీక: కోపాయిత పాపాయత భూపాయిత దనుజమథన పూజితమతికిన్ – కోప = కోపముచేత, ఆయిత = పొందఁబడిన, అయ గతౌ’ అను ధాతువుమీఁద క్తప్రత్యయము, పాప = పాపములచేత, ఆయత = అధికులగు, భూపాయిత = రాజులవలె నాచరించుచున్న, దనుజ = రాక్షసులయొక్క, మథన = నాశనముచేత, పూజిత = శ్లాఘ్యమైన, మతికిన్ = బుద్ధిగలవానికి; గోపాలన గోపాలన గోపాలన నిబిడ రతికిన్ – గోప = రాజులకు, గొల్లలకు, ‘గోపాశ్చ గోపాశ్చ గోపాః’ అని యేకశేషము, అలన = అలంకారకరమగు, గోపాలన = భూపాలనమందు, గోపాలన = గోవుల పాలనమందు, నిబిడ = దట్టమైన, రతికిన్ = ఆసక్తిగలవానికి; గోహితకృతికిన్ – గో = స్వర్గమునకు, హిత = అనుకూలమగు, కృతికిన్ = వ్యాపారముగలవానికి, ‘స్వర్గేషు పశు వా గ్వజ్ర దిఙ్నేత్ర ఘృణి భూ జలే, లక్ష్యదృష్ట్యా స్త్రియాం పుంసి గౌః’ అని యమరుఁడు.
క. కమలాసజనకనాభికిఁ
గమలన్మోహాంధతమస◊కమలాంకునకుం
గమలాలయకమలాలయ
కమలాలయశయనభృతికిఁ ◊ గాంతాకృతికిన్. 79
టీక: కమలాస జనక నాభికిన్ – కమలాస = బ్రహ్మకు, జనక = ఉత్పాదకమగు, నాభికిన్ = నాభిగలవానికి; కమలన్మోహాంధ తమస కమలాంకునకున్ – క = ఆత్మకు, మలత్ = పాతకమువలె నాచరించుచున్న, మోహ = అజ్ఞాన మనెడు, అంధతమస = కటికచీఁకటికి, కమలాంకునకున్ = మృగాంకునకు; కమలాలయ కమలాలయ కమలాలయ శయన భృతికిన్ – కమలా = లక్ష్మీదేవికి, ఆలయ =స్థానమగు, కమలాలయ = సముద్రముయొక్క, కమల = ఉదకమందు, అలయ = వినాశములేనట్లు, శయన = శయనముయొక్క, భృతికిన్ = భరణముగలవానికి; కాంతాకృతికిన్ = మనోహరాకారముగలవానికి.
క. శరణాగతపరిరక్షణ
చరణప్రవణాత్మచిత్త◊సరసీజునకున్
నరకాహితనరకాహిత
నరకాహితబాణతతికి ◊నరసారథికిన్. 80
టీక: శరణాగత పరిరక్షణ చరణ ప్రవణాత్మ చిత్త సరసీజునకున్ – శరణాగత= శరణమును బొందినవారియొక్క, పరిరక్షణ = పాలనముయొక్క, చరణ = ఆచరణమందు, ప్రవణ = అభిముఖ మైన, ఆత్మ = తనయొక్క, చిత్త = మానస మనెడు, సరసీ జునకున్ = కమలము గలవానికి; నరకాహిత నరకాహిత నరకాహిత బాణతతికిన్ – నరక = నిరయమునకు, అహిత = శత్రువు లగు, అనఁగాఁ బుణ్యాత్ములగు, నరక = నరులకు,స్వార్థమందు కప్రత్యయము, అహిత = అహితుఁడగు, నరక = నరకాసురు నకు, అహిత = విరోధులగు, బాణతతికిన్ = బాణములయొక్క సముదాయము గలవానికి; నరసారథికిన్ = అర్జునునిసారథి యైనవానికి.
క. శ్రీవాసజ్జటప్రోలీ, భావుకపత్తనవిహార◊పటుశీలునకున్
గోవర్ధనగోవర్ధన, గోవర్ధనవృష్టిహృతికి ◊గోపాలునకున్. 81
టీక: శ్రీవాస జ్జటప్రోలీ భావుక పత్తన విహార పటు శీలునకున్ – శ్రీ = లక్ష్మీదేవికి, వాసత్ = నివాసమువలె నాచరించుచున్న, జటప్రోలీ = జటప్రోలనెడు, భావుక = భవ్యమగు, పత్తన = పురియందు, విహార = విహారమందు, పటు = సమర్థమైన, శీలున కున్ = స్వభావము గలవానికి; గోవర్ధన గోవర్ధన గోవర్ధన వృష్టి హృతికిన్ – గోవర్ధన = ఆవుల వృద్ధి నొందించెడు, గోవర్ధన = గోవర్ధనగిరియొక్క, గో = భూమికి, ‘సమాసాన్తవిధి రనిత్యః’ అనుటచేత సమాసాంతప్రత్యయము రాదయ్యె, వర్ధన = నాశక మగు, వృష్టి = వర్షముయొక్క, హృతికిన్ = హరణము గలవానికి; గోపాలునకున్ = మదనగోపాలస్వామికి.
కథాప్రారంభము
వ. అర్పితంబుగా నాయొనర్పం బూనిన చంద్రికాపరిణయం బను మహాప్రబంధంబునకుం గథాక్రమం బెట్టి దనిన.
ఉ. శ్రీ నిరు వొంది నైమిశము ◊సెన్నగు నందు నిజామలాశయా
లానదృఢావబద్ధకమ◊లావరదంతులు శౌనకాది మౌ
నీనులు సూతజుం బలికి ◊రేనృపుఁ డేలె ధర న్నిరీతిగా
నానృపుఁ దెల్పు మన్ననతఁ ◊డాయతకౌతుకపూరితాత్ముఁ డై. 83
టీక: నైమిశము = నైమిశారణ్యము; శ్రీన్ = శోభావిశేషముచేత; ఇరు వొంది =స్థిరత నొంది; చెన్నగున్ = ప్రకాశించును; అందున్ = ఆయరణ్యమందు; నిజామలాశయాలాన దృఢావబద్ధ కమలావర దంతులు – నిజ = స్వకీయ మైన, అమల = స్వచ్ఛ మైన, ఆశయ = హృదయ మనెడు, ఆలాన = బంధస్తంభమందు, ‘ఆలానం బంధస్తంభే’ అని యమరుఁడు, దృఢ = స్థిరమౌ నట్లు, అవబద్ధ = కట్టఁబడిన, కమలావర = విష్ణుమూర్తి యనెడు, దంతులు = గజము గలవారలు; శౌనకాది మౌనీనులు=శౌన కాదిమునిరాజులు; సూతజున్ = సూతునిఁ గూర్చి; పలికిరి = వచించిరి; ఏనృపుఁడు = ఏరాజు; ధరన్ = భూమిని; నిరీతిగాన్ = ఈతిబాధారహిత మగునట్లుగా; ఏలెను=పాలించెనో; ఆనృపున్=ఆరాజును; తెల్పుమన్నన్, అతఁడు = ఆ సూతుఁడు; ఆయత కౌతుక పూరితాత్ముఁ డై = విస్తార మైన కుతూహలముచే నిండినహృదయము గలవాఁ డై; పలికెన్ అని యుత్తరపద్యస్థక్రియతో నన్వయము. ఇం దశ్లిష్టపరంపరితరూపకము. ‘శ్లో. తత్పరం పరితం శ్లిష్టే వాచకే భేదభాజి వా’ అని కావ్యప్రకాశము నందుఁ దల్లక్షణము.
శా. సారాక్షీణకలాకలాపనిధి యై, ◊చక్రప్రియంభావుక
శ్రీరమ్యాకృతి యై, దినేశకులల◊క్ష్మీమూల మై, యిద్ధరా
భారం బూనె సుచంద్రసంజ్ఞ నొకభూ◊పాలాగ్రగణ్యుండు ద
చ్చారిత్రంబు వచింతు నంచుఁ బలికెన్ ◊జంచద్వచోవైఖరిన్. 84
టీక: ఒకభూపాలాగ్రగణ్యుండు = ఒక రాజశ్రేష్ఠుండు; సారాక్షీణ కలా కలాప నిధి యై – సార = శ్రేష్ఠ మగు, అక్షీణ = తక్కువ గాని, కలా = చతుష్షష్టివిద్యలయొక్క, షోడశకలలయొక్కయని యర్థాంతరము, కలాప = సమూహమునకు, నిధి యై = నివాస మై; చక్ర = రాష్ట్రములకు, జక్కవలకు; ప్రియంభావుక = ప్రియ మగు; శ్రీ = సంపదచేత, కాంతిచేత; రమ్య = రమ్య మగు; ఆకృతి యై = ఆకృతి గలవాఁడై; దినేశ =సూర్యునియొక్క, సూర్యులయొక్క (ద్వాదశాదిత్యులయొక్క యనుట) కుల = వంశముయొక్క, సమూహముయొక్క; లక్ష్మీ = సంపదకు, కాంతికి; మూల మై =ఆధార మై; సుచంద్రసంజ్ఞన్ = సుచంద్రుం డను పేరిచేతను, సమీచీన మైన చంద్రుండను పేరిచేత నని యర్థాంతరము, అనఁగాఁ బ్రసిద్ధచంద్రుండు క్షీణకలా కలాపనిధియు, చక్రవాకాప్రియకారిశ్రీరమ్యుండు, దినేశమూలకలక్ష్మియు నగువాఁడు. మఱి యీరాజో అక్షీణకలాకలాపనిధి, చక్ర ప్రియం భావుక శ్రీరమ్యాకృతి, దినేశకులలక్ష్మీమూలము, కావున (సు)మంచిచంద్రుం డను పేరిచేత నని యాశయము. ఇద్ధరాభారంబు = ఈ భూభారమును; ఊనెన్ = వహించెను; తచ్చారిత్రంబు = ఆ సుచంద్రనరేంద్రుని చరితమును; వచింతు నంచున్ = చెప్పుదు ననుచు; చంచద్వచోవైఖరిన్= ప్రకాశించుచున్న వాగ్వైఖరిచేత; పలికెన్ = వాక్రుచ్చెను. ఇటఁ బ్రసిద్ధచంద్రా ధిక్యము సుచంద్రునియందుఁ దోఁచుచున్నది గాన యుపమేయాధిక్యపర్యవసాయి శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారము. ‘శ్లో. వ్యతిరేకో విశేష శ్చేదుపమానోపమేయయోః’ అని తల్లక్షణము.
సీ. వరగుణసన్మణి◊వ్రాతసంలబ్ధిచే, శ్రితమహీభృద్వర్య◊వితతిచేత,
విచరద్ఘనాఘన◊ప్రచయవిస్ఫూర్తిచే, విమలచక్రిప్రచా◊రములచేతఁ,
బటువేగవన్మహా◊భంగకాండములచే, ఘనవాహినీసము◊త్కరముచేత,
సాంద్రనానావన◊చక్రసంప్రాప్తిచే, నసమరాజీవనే◊త్రాళిచేత,
తే. నలరులచ్చికిఁ బుట్టిని◊ల్లన ననర్ఘ్య,శైలరిపునీలమయసాల◊సామజేంద్ర
కలితసితపద్మకచ్చంద్ర◊కామినీక,లాపరుచిరంబు శ్రీ విశా◊లాపురంబు. 85
టీక: ఈపద్యమందు విశాలాపురవిషయక మైన యర్థము, సముద్రపరమైన యర్థాంతరముం దోఁచుచున్నది. ఏలాగనిన: అనర్ఘ్య శైలరిపునీలమయ సాల సామజేంద్ర కలిత సిత పద్మక చ్చంద్రకామినీ కలాప రుచిరంబు – అనర్ఘ్య = అమూల్యము లగు, శైలరిపునీలమయ = ఇంద్రనీలమణిమయమగు, సాల = ప్రాకారములయందలి, సామజేంద్ర = గజశ్రేష్ఠములందు, కలిత = ఒప్పుచున్న, సిత = తెల్లనైన, పద్మకత్ = బిందుజాలక మనఁగా నేనుఁగులపై నున్న తెల్లనిచుక్కలు, వానివలె నాచరించు చున్న, చంద్రకామినీ = నక్షత్రములయొక్క, కలాప = సంఘముచేత, రుచిరంబు = మనోహరమగు; శ్రీ విశాలాపురంబు = సంప ద్యుక్త మైన విశాలాపురము; వరగుణ సన్మణి వ్రాత సంలబ్ధిచేన్ – వరగుణ = శ్రేష్ఠగుణములు గల, సన్మణి = పండితోత్త ముల యొక్క, వ్రాత = సంఘముయొక్క, సంలబ్ధిచేన్ = ప్రాప్తిచేతను, శ్రేష్ఠములగు గుణములు గల మంచి మణిసంఘములయొక్క ప్రాప్తిచేత నని సముద్రపరమైన యర్థము; శ్రిత మహీభృద్వర్య వితతిచేతన్ – శ్రిత = ఆశ్రయించిన, మహీభృద్వర్య = రాజ శ్రేష్ఠులయొక్క, వితతిచేతన్ = సంఘముచేత, ఆశ్రయించిన పర్వతములయొక్క గుంపుచేత నని సముద్రపరమైన యర్థము;
విచర ద్ఘనాఘన ప్రచయ విస్ఫూర్తిచేన్ – విచరత్ = మిక్కిలి చరించుచున్న, ఘనాఘన = మదపుటేనుఁగులయొక్క, ప్రచయ = సమూహముయొక్క, విస్ఫూర్తిచేన్ = ప్రకాశముచేతను, చరించుచున్న వర్షించునట్టి మేఘముల సమూహములయొక్క విస్ఫూర్తిచేత నని సముద్రపరమైన యర్థము; విమల చక్రి ప్రచారములచేతన్ – విమల = నిర్మలములగు, చక్రి = రథముల యొక్క, ప్రచారములచేతన్ = సంచారములచేతను, నిర్మలమైన విష్ణుమూర్తియొక్క సంచారములచేత నని సముద్రపరమైన యర్థము; పటు వేగవ న్మహాభంగ కాండములచేన్ – పటు = సమర్థములై, వేగవత్ = వేగయుక్తములై, మహత్ = గొప్పలై, అభంగ = అప్రతిహతములైన, కాండములచేన్ = అశ్వములచేత, అతివేగముగల తరంగములగుంపులచేత నని సముద్రపరమైన యర్థము, ‘కాండో స్త్రీ దణ్డ బాణార్వ వర్గావసర వారిషు’ అని యమరుఁడు; ఘన వాహినీ సముత్కరముచేతన్ – ఘన = అధికమైన, వాహినీ = సేనలయొక్క, సముత్కరముచేతన్ = సముదాయముచేత, అధికములైన నదీసంఘములచేత నని సముద్రపరమైన యర్థము; సాంద్ర నానా వన చక్ర సంప్రాప్తిచేన్–సాంద్ర = దట్టములైన, నానా = అనేకప్రకారములగు, వన = ఉద్యానములయొక్క, చక్ర = సంఘములయొక్క, సంప్రాప్తిచేన్ = లాభముచేతను, సాంద్రములై యనేకవిధములైన జలావర్తములయొక్క సంప్రాప్తిచేత నని సముద్రపరమైన యర్థము; అసమ రాజీవనేత్రాళిచేతన్ – అసమ = అసమాన లగు, రాజీవనేత్రా = పద్మనేత్రలయొక్క, ఆళి చేతన్ = సంఘముచేతను, అసమానమైన (రాజీవనేతృ) మీనశ్రేష్ఠములయొక్కగణముచేత నని సముద్రపరమైన యర్థము, ‘రాజీవ శ్శకుల స్తిమిః’ అని యమరము; లచ్చికిన్ = లక్ష్మీదేవికి; పుట్టినిల్లనన్ = జన్మస్థాన మన్నట్లుగా, సముద్ర మన్నట్లుగా; అలరున్ = ఒప్పారును; ఇట సంబం ధాతిశయోక్తి శ్లేషోత్ప్రేక్షాలంకారములు గలుగు.
సీ. వరణాబ్జరాగభా◊వ్యాజబాలాతపా,నిశజృంభితవియద్ధు◊నీసలిలము,
సౌధవజ్రచ్ఛవి◊చ్ఛలచంద్రికావియో,జితలేఖకేళివే◊శ్మతలసరము,
స్వస్తికనీలత్వి◊షామిషఘనదత్త, కేకాస్వనస్వన◊త్కృతకనగము,
రథ్యావలభితార్క్ష్య◊రత్నశోభాకూట,యవసార్పితామోద◊కార్కరథము,
తే. భర్మకేతుపటాంచల◊పవనగళద,నంతకుహనమధురసాఫ◊లాళిఖాద
నాశయోత్పతదతులకీ◊రాభిరామ,గోపురము మించు నిల విశా◊లాపురంబు. 86
టీక: వరణాబ్జరాగ భా వ్యాజ బాలాత పానిశ జృంభిత వియద్ధునీ సలిలము – వరణ = ప్రాకారములయొక్క, ‘ప్రాకారో వరణ స్సాలః’అని యమరుఁడు, అబ్జరాగ =పద్మరాగమణులయొక్క, భా = కాంతి యనెడు, వ్యాజ = నెపము గలిగిన, బాలాతప = లేయెండచేత, అనిశ = ఎల్లప్పుడును, జృంభిత = వికసింపఁజేయఁబడిన, వియద్ధునీ = స్వర్గంగయందలి, సలిలము = జలము గలది, అనఁగా లక్షణచేత సురనదీజలగతపద్మములు బోధితము లగుచున్నవి గాన యెల్లపుడు వికసింపఁజేయఁబడిన వియ ద్ధునీసలిలగతపద్మములు గల దని యాశయము; సౌధ వజ్ర చ్ఛవి చ్ఛల చంద్రికా వియోజిత లేఖ కేళివేశ్మ తల సరము – సౌధ = మేడలయొక్క, వజ్ర = వజ్రములయొక్క, ఛవి = కాంతి యనెడు, ఛల = వ్యాజము గల, చంద్రికా = వెన్నెలచేత, వియోజిత = ఎడఁబాటు గలదిగాఁ జేయఁబడిన, లేఖ = దేవ తలయొక్క,కేళివేశ్మ= క్రీడాగృహములయొక్క, తల = ప్రదేశములయందలి, సరము = సరస్సులు గలది, అనఁగా సరోగత చక్ర వాకములు గల దని లక్షణచేత నర్థము చేయవలయు. స్వస్తిక నీల త్విషా మిష ఘన దత్త కేకాస్వన స్వన త్కృతకనగము – స్వస్తిక = సౌధవిశేషములయొక్క, ‘స్వస్తిక స్సర్వతో భద్రః’ అని యమరుఁడు, నీల = ఇంద్రనీలమణులయొక్క, త్విషా = కాంతి యనెడు, మిష = నెపము గల, ఘన = మేఘము చేత, దత్త = ఇయ్యఁబడిన, కేకాస్వన = కేక యను ధ్వనిచేత, స్వనత్ = ధ్వని చేయుచున్న, అనఁగాఁ గేకాభిన్నస్వనము చేయు చున్నయనుట, కృతకనగము = కృత్రిమపర్వతములు గలది, ఇచటను బూర్వరీతిగఁ గృతకనగస్థమయూరములు గల దని లాక్షణికార్థము చేయవలయు; రథ్యా వలభి తార్క్ష్యరత్నశోభా కూట యవ సార్పి తామోద కార్కరథము – రథ్యా = రాజవీథులయందున్న, వలభి = చంద్ర శాలలయొక్క, తార్క్ష్యరత్న = గరుడపచ్చలయొక్క, శోభా=కాంతి యనెడు, కూట= నెపము గల, యవస=పచ్చికయందు, అర్పిత = ఉంపఁబడిన, ఆమోదక = సంతసము గల, అర్కరథము = సూర్యరథము గలది, అనఁగాఁ బూర్వరీతిగ సూర్యరథా శ్వములు గలదని లాక్షణికార్థము; భర్మ కేతు పటాంచల పవన గళ దనంత కుహన మధురసాఫలాళి ఖాద నాశ యోత్పత దతుల కీరాభిరామ గోపురము –భర్మ = స్వర్ణమయములగు, కేతు = టెక్కెములయొక్క, పటాంచల = వస్త్రాగ్రభాగములయొక్క, పవన = వాయువుచేత, గళత్ = జాఱుచున్న, అనంత = ఆకాశ మనెడు, అనఁగాఁ బూర్వరీతిగా లక్షణచే నాకాశస్థనక్షత్రము లనెడు అని యర్థము, కుహన = కాపట్యము గల, మధురసాఫల = ద్రాక్షాఫలములయొక్క, ఆళి = బంతియొక్క, ఖాదన = భక్షణమందు, ఆశయ = అభిప్రాయముచేత, ఉత్పతత్ = మీఁది కెగయుచున్న, అతుల = సాటిలేని, కీర = చిలుకలచేత, అభిరామ = ఒప్పుచున్న, గోపు రము = పురద్వారము గలదియు నై, విశాలాపురంబు, ఇలన్ = భూమియందు; మించున్ = అతిశయించును.
ఇట వియద్ధునీసలిల లేఖకేళీవేశ్మతలసరఃకృతకనగార్కరథానంతములకు బాలాతపానిశవికసన చంద్రికావియోజన ఘన దత్త కేకాస్వాన యవసార్పితామోద పటాంచలపవనపతనములు సంభవింపమి లక్షణావృత్తి నాశ్రయించి తద్గతములగు పద్మాదులు చెప్పఁబడియె. లక్షణ యనఁగా శబ్దవృత్తులలోనొకటి. శబ్దవృత్తులు శక్తి లక్షణ వ్యంజన యని మూఁడు. వీని స్వరూ పములు భేదములు ‘శ్లో. సామన్తనగరా ణ్యుచ్చై రాక్రోశన్తి సమన్తతః’ ఇది లోనగు లక్ష్యములు ప్రతాపరుద్రీయాదులయందు విస్తరముగ నిర్ణయింపఁబడిన వనియు, నిట వ్రాయుట యనవసర మనియు, సంక్షేపింపఁబడియె. అలంకారము లిందుఁ గైతవా పహ్నుతి సంబంధాతి శయోక్తిభేదములు.
చ. కలిమినెలంతకై నలువ◊గాంచిన మేటివిచిత్రశక్తి రా
జిలఁ బరరాజభీకరతఁ ◊జెన్నలరన్ సృజియించినట్టి యు
జ్జ్వలజలజంబు నాఁగఁ బురి ◊వజ్రమణీవరణం బగడ్త య
న్కొలఁకున నొప్పుఁ దేఁటిసొబ◊గుం గని పైగగనంబు దోఁపఁగన్. 87
టీక: నలువ = బ్రహ్మదేవుఁడు; కాంచినమేటి విచిత్రశక్తి రాజిలన్ = అభ్యసించిన యుత్కృష్టమై యాశ్చర్యకర మగు సామ ర్థ్యము ప్రకాశించునట్లుగా; పరరాజభీకరతన్ = శత్రురాజభీకరతచేత; శ్రేష్ఠమగు చంద్రునకుభీకరతచేత; చెన్నలరన్ = ఒప్పు నట్టుగా; కలిమినెలంతకై = లక్ష్మీదేవికై; సృజియించినట్టి యుజ్జ్వలజలజంబు నాఁగన్ = రచియించిన ప్రకాశమానమగు పద్మ మనునట్లుగా; పురిన్ = పట్టణమునందు; వజ్రమణీవరణంబు = వజ్రమణిరచిత మగు ప్రాకారము; అగడ్త యన్కొలఁకునన్ = అగడ్త యను కొలనియందు; పై గగనంబు = మీఁది యాకాశము; తేఁటిసొబగుం గని = తుమ్మెదయందము నొంది; తోఁపఁగన్ = తోఁచుచుండఁగా; ఒప్పున్ = ఒప్పును. ఉత్ప్రేక్షాలంకారము.
మ. పురసాలంబు నిజాఖ్యపెంపు గననో ◊భూరిప్రవాళాప్తము
న్వరనీలాళిసమావృతంబు పరిఖా◊నవ్యాలవాలామృతాం
తరసందృశ్యము నై చెలంగుఁ బొగ డొం◊దన్ దానిపెంగొమ్మ ల
బ్బుర మై రాజపతంగయోగకలనం◊బుల్ రేవగల్ గాంచుటన్. 88
టీక: పురసాలంబు = విశాలాపురియొక్క కోట; నిజాఖ్యపెంపు గననో = తనపేరుగలదానియొక్క,అనఁగా సాలవృక్షము యొక్క అతిశయము గనుటకో; భూరిప్రవాళాప్తమున్ = అధికమగు చిగురుటాకులను బొందినదియు, అనఁగా సువర్ణమును బగడములను బొందిన దనుట, ‘భూరి ప్రాజ్య సువర్ణయోః’అని విశ్వము; వరనీలాళిసమావృతంబు = శ్రేష్ఠములయి నీలము లయినతుమ్మెదలచేతఁ జుట్టుకొనఁబడినదియు, అనఁగా శ్రేష్ఠములయిన యింద్రనీలమణులగుంపుచేత నావరింపఁబడిన దనుట; పరిఖా నవ్యాలవాలామృతాంతర సందృశ్యము నై – పరిఖా=అగడ్త యనెడు, నవ్య=నూతనమగు,ఆలవాల=పాదుయొక్క, అమృతాంతర=జలాంతరమందు, సందృశ్యము నై =కనిపించునది యై; దానిపెంగొమ్మలు=దాని పెద్దశాఖలు,ఆకోటయొక్క పెద్దకొమ్మ లనుట; రాజపతంగయోగకలనంబుల్ – రాజపతంగ = పక్షిశ్రేష్ఠములయొక్క, యోగకలనంబుల్ = సంబంధము సేయుటలు, చంద్రసూర్యసంబంధము సేయుట లనుట; రేవగల్ గాంచుటన్ = ఎల్లపుడును పొందుచుండుటచేత; అబ్బుర మై = ఆశ్చర్యకరమై; పొగ డొందన్ = శ్లాఘ్యత నొందునట్లుగా; చెలంగున్ =ఒప్పును.
ఇట సూర్యుఁడు రాత్రికాలమందు చంద్రుఁడు పగటియందు నుండమింజేసి సర్వకాలమందు సూర్యచంద్రసంబంధము గలిగి యుండుట యాశ్చర్యకర మని భావము. రాత్రి చంద్రసంబంధమును, పగలు సూర్యసంబంధమును బొందు నని క్రమ ముగా నన్వయం బెఱుంగునది. ఇచటఁ బురసాల మున్నత మగుటకు నిజాఖ్య పెంపు గనుట ఫలము గాక పోయినను దానిని ఫలముగా సంభావన సేయుటంజేసి ఫలోత్ప్రేక్ష యగును. అదియు శ్లేషానుప్రాణితము.
చ. అనఘహరిప్రతానయుతి ◊ నబ్జకరానికరాప్తి భోగిరా
డ్జనపరిలబ్ధి విప్రవర◊సంతతియుక్తిఁ బురం బనారతం
బును దెలిదీవికన్న సిరిఁ ◊బూని మనం గని రక్తిఁ జేరి ని
ల్చిన కలశాబ్ధి నా విమల◊జీవనఖేయము వొల్చు నెంతయున్. 89
టీక: అనఘహరిప్రతానయుతిన్ – అనఘ= నిర్దోషములైన, హరి =అశ్వములయొక్క, ప్రతాన = సంఘముయొక్క, యుతిన్ = సంబంధముచేతను; అనఘులైన విష్ణువులయొక్క గుంపుల సంబంధముచేతను; అబ్జకరానికరాప్తిన్ = పద్మములవంటి పాణులు గల స్త్రీసంఘముయొక్కకూడికచేత, లక్ష్ములయొక్క నికరమును బొందుటచేత; భోగిరాడ్జనపరిలబ్ధిన్= భోగవంతు లగు రాజులయొక్కబృందము నొందుటచేతను, ఆదిశేషుల సంఘముయొక్క సంలబ్ధిచేతను; విప్రవరసంతతియుక్తిన్ =బ్రాహ్మ ణోత్తముల సముదాయముతోఁ గూడుటచేతను, గరుత్మంతుల బృందముతోఁ జేరుటచేతను; పురంబు=విశాలాపురము; అనార తంబును = ఎల్లప్పుడును; తెలిదీవికన్నన్= శ్వేతద్వీపము కన్నను; సిరిఁ బూని = సంపద నొంది; మనన్ = వృద్ధినొందఁగా; కని = అవలోకించి; రక్తిన్ =అనురక్తిచేత; చేరి = పొంది; నిల్చిన కలశాబ్ధి నాన్ = నిల్చియున్న క్షీరాంబురాశియో యనునట్లు; విమల = నిర్మలమగు; జీవన = జలము గల; ఖేయము = అగడ్త, ‘ఖేయం తు పరిఖాధార స్త్వంభసామ్’ అని అమరము; ఎంతయున్ =మిక్కిలి; పొల్చున్=ఒప్పును.
శ్వేతద్వీపమున నొకహరియు, నొకలక్ష్మియు, నొకశేషుఁడును, నొకగరుడుండు నుండుటయు, నీపుర మందు ననేక హరులు, ననేకలక్ష్ములు, ననేకశేషులు,ననేకగరుడులుఁ గలిగియుండుటయుఁ జూచి క్షీరాంబునిధి శ్వేతద్వీపముకన్న నీపురి సిరిఁబూని మించినదని యెంచి యిచటఁ జేరెనో యనునట్లు విశాలాపురి యగడ్త యొప్పెనని భావము. ఈపద్యమందుఁ బురము శ్వేతద్వీపమునకన్న మించినదనియు, నగడ్త క్షీరాంబురాశివలె నున్నదనియు రెండును వర్ణ్యములే కాన, యుపమేయ మగు పురమం దుపమానమగు శ్వేతద్వీపముకన్న నాధిక్యము శ్లిష్టశబ్దములచేఁ జెప్పుటచే శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారము. అగడ్త కలశాబ్ధి నాఁ బొల్చు నని చెప్పుటచే నుత్ప్రేక్షాలంకారంబును గలుగుచున్నది.
మ. అరు దై చూడఁబడున్ మహీస్థలి విశా◊లాధీశలోకేట్కృత
స్ఫురణం బొల్చుపురోర్వికిం బరిఖ యం◊భోరాశి నాఁ దామ్రర
త్నరుగాలోకనిషక్తి శక్రమణిభా◊ధ్వాంతాళియుక్తిన్ మనో
హరవప్రాంతర మెప్పుడున్ మెఱయ లో◊కాలోకసామ్యంబునన్. 90
టీక: పరిఖ = అగడ్త; విశాలాధీశ = విశాలాపురీనాయకుం డనునట్టి; లోకేట్ = లోకేశుఁడైన బ్రహ్మచేత; కృత =నిర్మింపఁబడిన; స్ఫురణన్ = అతిశయముతో; పొల్చు పురోర్వికిన్ = ప్రకాశించునట్టి విశాలాపుర మనెడు భూమికి; మనోహర వప్రాంతరము = మనోజ్ఞమగు మఱియొకకోట, అనఁగా నొక పిల్లకోట; తామ్రరత్న రుగాలోకనిషక్తి న్ = పద్మరాగమణులయొక్క తేజ స్సని యెడి సూర్యాతపముయొక్క సంబంధముచేతను; శక్రమణిభా ధ్వాంతాళియుక్తిన్ = ఇంద్రనీలమణులకాంతి యను నంధకార పరంపరాసంబంధముచేతను; లోకాలోకసామ్యంబునన్ = లోకాలోకమను పర్వతముయొక్క సాటిచేతను; ఎప్పుడున్=ఎల్లప్పు డును; మెఱయన్ = ప్రకాశించుచుండఁగా; అంభోరాశి నాన్= సముద్రమో యనునట్లుగా; అరుదై =ఆశ్చర్యకరమై; మహీస్థలిన్ = భూమండలమందు; చూడఁబడున్ =అవలోకింపఁబడును; ఉత్ప్రేక్షాలంకారభేదము.
విశాలాపురి యను నుర్వికి నగడ్త సముద్రమువలె నున్నదనియు, దానికి వెలికోట పద్మరాగమణిప్రభా శక్రమణిప్రభ లనెడు తేజస్తిమిరములతో నెప్పుడు మెఱయుటంజేసి లోకాలోకపర్వతమువలె నున్నదనియు భావము.
సీ. వెలయింప నేరఁ డు◊జ్జ్వలచంద్రికారూఢి, రవిప్రభాసంసక్తిఁ ◊బ్రబలుఁ గాని,
కనఁడు కావ్యాశయ◊గౌరవం బగభేది, యురుకల్పతరులబ్ధి ◊ నొనరుఁ గాని,
దఱియ నోపఁడు పక్ష◊ధరవరోద్ధతి శేషుఁ,డసమలోచనయుక్తి ◊ మసలుఁ గాని,
ప్రతిఘటింపఁ గలంగుఁ ◊బ్రాభాకరస్ఫూర్తి, కబ్జారి కౌముది ◊నలరుఁ గాని,
తే. యనుచుఁ దత్సదినత్వగవాధిపత్వ,కుండలిత్వద్విజేశత్వ◊గుంఫనములు
పరిహసింతు ర◊ప్పురి నధీత, సకలసుగ్రంథతతు లగ్ర◊జన్మపతులు. 91
టీక: అప్పురిన్ = ఆవిశాలానగరమందు; అధీత సకల సుగ్రంథ తతులు = అధ్యయనము చేయఁబడిన సమస్తగ్రంథసముదా యము గలవారైన; అగ్రజన్మపతులు = బ్రాహ్మణశ్రేష్ఠులు; రవి = సూర్యుఁడు; ప్రభాసంసక్తిన్ = ప్రభ యను ప్రకరణముయొక్క సంబంధముచేత, కాంతిచేత ననుట; ప్రబలుఁ గాని = అతిశయించును గాని; ఉజ్జ్వల చంద్రికారూఢిన్ = ప్రకాశించుచున్న చంద్రిక యను గ్రంథముయొక్క యతిశయమును; వెలయింప నేరఁడు = ప్రకాశింపఁజేయ నెఱుంగడు. ప్రభ యను ప్రకరణ మాత్రమే కాని, చంద్రిక యను గ్రంథము చదివిన వాఁడు కాదనుట. సూర్యుఁడు తేజస్సుతోఁ గూడియున్నా డనియు, వెన్నెలను జేయఁజాల డనియు భావము.
అగభేది =ఇంద్రుఁడు; ఉరు కల్పతరు లబ్ధి నొనరుఁ గాని = అధికమగు కల్పతరు వనెడు వేదాంతగ్రంథలాభముచే నొప్పును గాని; కావ్యాశయగౌరవంబు = రఘువంశాదికావ్యాభిప్రాయాతిశయమును; కనఁడు = ఎఱుఁగడు; ఇంద్రుండు కల్పవృక్షమును బొందినవాఁడనియు, శుక్రునియొక్క యాశయగౌరవము గనఁ డనియు భావము. శేషుఁడు = ఆదిశేషుఁడు; అసమ లోచన యుక్తి న్ = అసమాన మైన లోచన మను గ్రంథసంబంధముచేత; మసలుఁ గాని = చరిం చును గాని; పక్షధరవరోద్ధతిన్ = పక్షధర మను నామము గల తర్కగ్రంథముయొక్క అతిశయోద్ధతిని; తఱియ నోపఁడు = సమీపింపఁజాలడు. శేషుండు పక్షధరుఁ డనఁగా గరుడుఁడు వానిఁ దఱియ నోపఁ డనియు, అసమానలోచనుఁ డనఁగా శివుఁడు వానితో సంబంధించి యుండు ననియు భావము. శివుఁడు శేషాహిభూషణుం డగుట ప్రసిద్ధము. అబ్జారి = చంద్రుఁడు; కౌముదిన్ = కౌముది యను వ్యాకరణగ్రంథముచేత ; అలరుఁ గాని = ఒప్పును గాని; ప్రాభాకరస్ఫూర్తి = ప్రాభాకర మను మీమాంసాగ్రంథముయొక్క స్ఫూర్తికి; ప్రతిఘటింపన్ = ఎదురింపను; కలంగున్ = కలఁతపడును; చంద్రుండు వెన్నెలచే నలరు ననియు, సూర్యసంబంధిని యైన ప్రభకుఁ బ్రతిఘటింపఁ జాల డనియు భావము. అనుచున్ = ఇట్లనుచు; త త్సదినత్వ గవాధిపత్వ కుండలిత్వ ద్విజేశత్వ గుంఫనములు – తత్ = వారి సంబంధియైన, సది నత్వ (సత్+ఇనత్వ)= పండితరాజత్వముయొక్క, శ్రేష్ఠమగు సూర్యత్వముయొక్క యనుట, గవాధిపత్వ = వాక్పతిత్వము యొక్క, స్వర్గాధిపత్యముయొక్క యనుట, కుండలిత్వ = కుండలవత్వముయొక్క, యనఁగా సోమయాజిత్వముయొక్క, సర్పత్వముయొక్క యనుట, ద్విజేశత్వ = బ్రాహ్మణోత్తమత్వముయొక్క, ద్విజరాజత్వము (చంద్రత్వము)యొక్క, గుంఫ నములు = కూర్పులు; పరిహసింతురు = హాసాస్పదములుగాఁ జేయుదురు. అనఁగా విశాలాపురియం దున్నవిప్రులు సకల విద్యల నభ్యసించిన వారలని భావము. ఉపమానభూతసూర్యాదుల కన్న నుపమేయభూతద్విజోత్తములందు గుణాధిక్యము చెప్పుటచే శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారము, అతిశయోక్యలంకారంబును.
మ. అతులాత్మప్రతిభానిరస్తకమలా◊ధ్యక్షాత్మజుల్ త్రాతచ
క్రతతుల్నిర్మలధర్మహేతులునమ◊స్కారప్రియుల్ నిత్యసం
భృతవిశ్వంభరు లంచితోదయు లదో◊షైకక్రముల్ మింతు రూ
ర్జితతేజోయుతిలోకబంధు లన ధాత్రీనాయకుల్ దత్పురిన్. 92
టీక: ఈ పద్యమునందు రాజపరమైన యర్థము, సూర్యపరమైన యర్థమును దోఁచుచున్నది. తత్పురిన్ = ఆ విశాలాపురియందు; ధాత్రీనాయకుల్ = రాజులు; అతు లాత్మ ప్రతిభా నిరస్త కమలాధ్యక్షాత్మజుల్– అతుల =
అసమానమగు, ఆత్మ = తమయొక్క, ప్రతిభా = కాంతిచేత, నిరస్త = తిరస్కరింపఁబడిన, కమలాధ్యక్షాత్మజుల్ = మన్మథులు గలవారు, సాటిలేని తమ తేజస్సుచేత నిరసింపఁబడిన (కమలాధ్యక్ష యనఁగా) సముద్రముయొక్క ఆత్మజుఁడైన చంద్రులు గలవారని సూర్యపరమైన యర్థము; త్రాత = రక్షింపఁబడిన; చక్ర = రాష్ట్రములయొక్క; తతుల్= సమూహము గలవారు, రక్షింపఁబడిన చక్రవాకసమూహము గలవారని యర్థాంతరము; నిర్మలధర్మహేతులు – నిర్మల = నిర్దోషములగు, ధర్మ హేతులు = ధనువులు, ఖడ్గములు గలవారు, సూర్యుండు కర్మసాక్షి గావునఁ దత్పరమైనపుడు నిర్మలములైన యాగాదులకు హేతువులైనవారని యర్థము; నమస్కారప్రియుల్= ‘నమః కుర్వన్తీతి నమస్కారాః’ అనఁగా నమస్కరించువారు,వారియందుఁ బ్రీతిగలవా రనుట, సూర్యపరమైనపుడు ‘శ్లో. నమస్కారప్రియో భానుః’ అనుటంబట్టి నమస్కారమందుఁ బ్రీతిగలవా రని భావము; నిత్య సంభృత విశ్వంభరులు = ఎల్లపుడుఁ బోషింపఁబడిన భూమిగలవారు, ఎల్లపుడు ధరింపఁబడిన నారాయణ మూర్తి గలవారని సూర్యపరమైన యర్థము, ‘శ్లో. ధ్యేయ స్సవితృమండలమధ్యవర్తీ నారాయణః’ మొదలగు వానిచే నారాయ ణుఁడు సూర్యమండలవాసి యగుట ప్రసిద్ధము, పక్షద్వయమం దీయర్థమే కావచ్చును; అంచితోదయులు = ఒప్పుచున్న యభివృద్ధిగలవారు, పొందబడిన యుదయగిరిగలవారని యర్థాంతరము; అదోషైకక్రముల్ = అదుష్టములై ముఖ్యములైన నడవడికలు గలవారు, సూర్యపరమైనపుడు అదోషైకక్రము లనఁగా దోషైకక్రములు గానివారు, రాత్రిసంచారములేనివా రనుట; ఊర్జితతేజోయుతిన్ = స్థిరమైన ప్రతాపసంబంధముచేత, స్థిరమైన తేజస్సంబంధముచేత నని యర్థాంతరము; లోకబంధులనన్ = లోకహితు లనఁగా, సూర్యులనఁగా, ద్వాదశాదిత్యతాత్పర్యముతో బహువచనము; మింతురు = అతిశయింతురు.
విశాలాపురియందు రాజులు మన్మథులకన్న సుందరు లై, రాష్ట్రముల నేలువా రై, యాగాదిక్రియల నాచరించుచు, శరణాగతత్రాణముఁ జేయుచు, నిర్దోషమైన నడవడికతోఁ బ్రతాపశాలురై మింతు రని భావము.
మ. అలఘుశ్రీయుతి సద్గణావనవిహా◊రారూఢి లేఖస్తుతా
చలధర్మాదృతిఁ బ్రాపితాసమనిధి◊చ్ఛాయాప్రహృష్యత్సుహృ
త్తిలకాసక్తి ననారతంబుఁ బురి నెం◊తే మించు నర్యేశమం
డలి స్వానంతగుణప్రవృద్ధిగరిమ ◊న్రాజిల్లు నౌ నౌ ననన్. 93
టీక: ఈ పద్యమం దర్యేశమండలిశబ్దముచేత వైశ్యోత్తమపరమైన యర్థముఁ జెప్పఁగాఁ దద్ఘటక మగు నీశపదముచే నీశ్వర రూపార్థము గూడఁ దోఁచుచున్నది. పురిన్ = విశాలాపురియందు; అర్యేశమండలి = వైశ్యోత్తమబృందము, ఈశ్వరబృంద మని ధ్వనితార్థము; అలఘుశ్రీయుతిన్ = అధికసంపద్యోగముచేతను, అధికవిషసంబంధముచేత నని యీశ్వరపరమైన యర్థము, ‘శ్రీ ర్వేషరచనార్థ శోభా సమ్పత్సరళశాఖిషు, వాణీ లక్ష్మీ లవఙ్గేషు విషే’ అని రత్నమాల; సద్గణావనవిహారారూఢిన్ – సద్గణ = సత్పురుషసంఘముయొక్క, అవనవిహారారూఢిన్= పాలనక్రీడాతిశయముచేత, శ్రేష్ఠమగు ప్రమథగణముయొక్క పాలనవిహారారూఢిచేత నని శివపరమైన యర్థము; లేఖస్తుతాచలధర్మాదృతిన్ – లేఖ = దేవతలచేత, స్తుత = కొనియాడఁ బడిన, అచల = స్థిరమైన, ధర్మ = యాగాదిసత్క్రియలయొక్క, ఆదృతిన్ = ఆదరణముచేత, దేవతలచేత నుతింపఁబడిన మేరుధనువుయొక్క యాదరణముచేత నని శివపరమైన యర్థము; ప్రాపితాసమనిధిచ్ఛాయాప్రహృష్యత్సుహృత్తిలకాసక్తిన్ – ప్రాపిత = పొందింపఁబడిన, అసమ = సాటిలేని, నిధి = ధననిధులు గలిగినట్టి, ఛాయాప్రహృష్యత్ = తమనీడలయందు సంత సించుచున్న, సుహృత్తిలక = మిత్రరత్నములయందు, ఆసక్తిన్ = ప్రీతిచేత, వైశ్యోత్తములు తమమిత్రులకు సరిలేని ధనము లిచ్చి వారు తమ నీడయందు సంతసించుచుండఁగా వారలయెడఁ బ్రీతిగలవారై యున్నా రనుట; ఈశ్వరపరమైనపుడు – ప్రాపిత = పొందింపఁబడిన, అసమ = విషమములైన, తొమ్మిదైన యనుట, నిధి = మహాపద్మాదినిధులయొక్క, ఛాయా = రక్షణముచేత, ప్రహృష్యత్ = సంతోషించుచున్న, సుహృత్తిలక = కుబేరునియందు, ఆసక్తిన్ = ప్రీతిచేత, నని యన్వయము; అనారతంబున్ = ఎల్లపుడు; స్వానంతగుణప్రవృద్ధిగరిమన్ – స్వ = ధనముయొక్క, అనంతగుణ = అత్యధికమైన, ప్రవృద్ధి = మితిలేని వడ్డి యొక్క, గరిమన్ = అతిశయము చేత,స్వసంబంధి యైన శేషుఁ డనెడు నల్లెత్రాటియొక్కవృద్ధ్యతిశయముచేత నని శివపరమైన యర్థము. ఔ నౌ ననన్ = ప్రశంసించునట్లు; రాజిల్లెన్ = ప్రకాశించెను.ఆ పురియందు వైశ్యులు మిగుల నైశ్వర్యవంతు లై సత్పు రుషులఁ బోషించుచు సత్కర్మముల నాచరించుచుఁ దమ హితు లను ధనవంతులనుగాఁ జేసి యతిశయ మైన వృద్ధిరూప మైన ధనాదాయముతో రాజిల్లు చున్నా రని భావము. ఇచటఁ బ్రస్తుతా ప్రస్తుతముల కౌపమ్యము వ్యంగ్యము.
చ. పురమణి హాలికోత్తములు ◊వూన్చిన ధాన్యపుఁ దిప్ప లర్కభూ
విరుచిశిఖాళిఁ బైపయిని ◊వేఁగఁ దదభ్యుదయాదితంత్రమౌ
హరిపద మంతికస్థలగ◊తాంచితదివ్యధునీతరంగశీ
కరనికరంబులం బొదివి ◊గ్రక్కునఁ జల్వ ఘటించు నిచ్చలున్. 94
టీక: పురమణిన్ = పురశ్రేష్ఠమందు; హాలికోత్తములు = ఉత్తమశూద్రులు; పూన్చిన ధాన్యపుఁ దిప్పలు = కుప్పసేసిన ధాన్య రాశులు; అర్కభూవిరుచిశిఖాళిన్ – అర్కభూ = సూర్యునివలనఁ బుట్టిన, విరుచి = విశేషకాంతియొక్క, శిఖాళిన్ =జ్వాలా సమూహముచేత; పైపయిని = మీఁదమీఁదను; వేఁగన్ = తపింపఁగా; తదభ్యుదయాదితంత్రమౌ హరిపదము – తత్ = ఆ హాలికులయొక్క, అభ్యుదయ = ఉత్పత్తికి, ఆదితంత్రమౌ = ప్రథమకారణ మగుచున్న, హరిపదము = విష్ణుపద మనెడు నాకాశము, ‘శ్లో. తస్య పాదామ్బుజా జ్జాతో వర్ణో విగతకల్మషః’ ఇత్యాదులచే శూద్రులు విష్ణుపాదోద్భవు లగుట ప్రసిద్ధము; అంతికస్థలగ తాంచిత దివ్యధునీ తరంగ శీకర నికరంబులన్ – అంతికస్థలగత = సమీపమును బొందిన, అంచిత = పూజ్య యగు, దివ్యధునీ = స్వర్గంగయొక్క, తరంగ = అలలయొక్క, శీకర = జలకణములయొక్క, నికరంబులన్ = సమూహ ములచేత; పొదివి = కప్పి; గ్రక్కునన్ = వేగముగా; చల్వన్ = శైత్యమును; నిచ్చలున్ = ఎల్లపుడును; ఘటించున్ = పొందిం చును. ఆ పురియందు హాలికులు ధాన్యములను మిక్కిలి పండించుచున్నారని భావము. ధాన్యరాశులకు గగనతలసంబంధము లేక పోయినను దత్సంబంధ మున్నట్లు చెప్పుటచే సంబంధాతిశయో క్త్యలంకారము. ‘శ్లో. సంబంధాతిశయోక్తి స్స్యా దయోగే యోగకల్పనమ్’ అని తల్లక్షణము.
మ. అలితోద్యత్కదళీకలాపములు, మే◊ఘావాప్తపాదాన్వితం
బులు, దంతాంతరశోభిహేమవలయం◊బుల్, ధాతురేఖాసము
జ్జ్వలతావత్కటకాంతముల్, మదగజవ్రాతంబు లవ్వీటిర
థ్యల నిచ్చల్ చరియించు, జంగమకుభృ◊త్సామ్యంబు సంధించుచున్. 95
టీక: ఈ పద్యమందు గజములకుఁ బర్వతసామ్యముఁ జెప్పుటచే నర్థద్వయము దోఁచుచున్నది. మదగజవ్రాతంబులు = మదపుటేనుఁగుల గుంపులు; అలితోద్యత్కదళీకలాపములు – అలిత = అలంకరింపఁబడిన, ‘అల భూషణే’, ఉద్యత్ = ఎత్తఁబడిన, కదళీ = ధ్వజములయొక్క, కలాపములు = గుంపులు గలవై అని గజపరమైన యర్థము. అలంకరింపఁబడి యెగురుచున్నట్టి జింకలయొక్క గుంపులు గల వని పర్వతపరమైనయర్థము; మేఘావాప్తపాదాన్వితంబులు – మేఘ = మదవిశేషముచేత, ‘శ్లో. దానం కపోలయో శ్శీధు రక్ష్ణో శ్శ్రుత్యో స్తు సాగరః, కరాగ్రే శీకర శ్శిక్యం స్తనాగ్రే మేహనే మదః , హృదయే ఘర్మ సలిల మ్మేఘ స్తు చరణవ్రజే, సంజ్ఞయాష్టమదా హ్యేతే జాయన్తే భద్రదన్తినామ్’ అను నమరశేషప్రమా ణము చొప్పున ఏనుఁగు పాదమందుఁ బుట్టిన మదోదకమునకు మేఘ మని పేరు, అవాప్త = పొందఁబడిన, పాద = చరణముల చేత, అన్వితంబులు = కూడినవై, మేఘములచేతఁ గూడుకొన్న ప్రత్యంతపర్వతములు గల వని పర్వతపరమైన యర్థము; దంతాంతరశోభిహేమవలయంబుల్—దంత = విషాణములయొక్క, అంతర = మధ్యభాగమందు, శోభి = ప్రకాశించునట్టి, హేమవలయంబుల్ = బంగారుకడియములు గలవై, పొదరిండ్ల మధ్యమునఁ బ్రకాశించు సంపెఁగితీవలగుమురులు గలవై యని పర్వతపరమైన యర్థము; ధాతురేఖాసముజ్జ్వలతావత్కటకాంతముల్ – ధాతురేఖా = సిందూరరేఖలసంబంధి యైన, దీనికి సముజ్జ్వలతయం దన్వయము, సముజ్జ్వలతావత్ = ప్రకాశము గల, కట = గండస్థలముచేత, కాంతముల్ = మనోజ్ఞములై, గైరికాదిధాతురేఖలచేఁ బ్రకాశించు నితంబప్రదేశము గలవని పర్వతపరమైన యర్థము; అవ్వీటిరథ్యలన్ = ఆవిశాలాపురవీథుల యందు; నిచ్చల్ = ఎల్లపుడు; జంగమకుభృత్సామ్యంబు = చరించుచున్నపర్వతసామ్యమును; సంధించుచున్= పొందుచు; చరియించున్ = సంచరించును; ఆపురియందు గజములు మహోన్నతము లై చరియించుచున్న పర్వతాకారముగ నున్న వని భావము. ఉపమాలంకారము.
చ. ధర హరి కెక్కుడన్న మహి◊తక్రమ మూని, యహీనకాండభా
స్వరగతి నొంచు పెంపుఁ గని, ◊వాజికులేశత నొంది, యెంతయున్
హరిహయమానహారి యగు◊నట్టి తరంబు వహించి, సైంధవో
త్కరము, సెలంగు వీట, నిజ◊తార్క్ష్యసమాఖ్య యథార్థతం దగన్. 96
టీక: ఈపద్యమందు నశ్వపరమైన యర్థము, గరుడపరమైన యర్థముగూడఁ దోఁచుచున్నది. వీటన్ = విశాలాపురియందు; సైంధవోత్కరము = అశ్వసమూహము; ధరన్ = భూమియందు; హరి కెక్కుడన్న మహితక్రమము = వాయువున కన్న నుత్కృష్టము లనెడు మంచివేగమును, విష్ణువునకు వాహనమనెడు పూజ్యక్రమము నని గరుడపరమైన యర్థము; ఊని = వహించి; అహీనకాండభాస్వరగతిన్ – అహీన = అధిక మగు, కాండ = బాణములయొక్క, భాస్వర = ప్రకాశించునట్టి, గతిన్ = గమనమును; నొంచు పెంపుఁ గని = నొప్పించు గౌరవము నంది, అహీనకాండ = సర్పశ్రేష్ఠముల గుంపులయొక్క, భాస్వర గతిన్ = మంచితెలివిని , నొంచు పెంపుఁ గని యని గరుడపరమైన యర్థము; వాజికులేశతన్ = అశ్వశ్రేష్ఠతను, పక్షిరాజత నని యర్థాంతరము, ‘వాజినోఽశ్వేషు పక్షిణః’ అని యమరుఁడు; ఒంది =పొంది, ఎంతయున్ = మిక్కిలి; హరిహయమానహారి యగునట్టి తరంబు వహించి = సూర్యాశ్వముల మానమును హరించునట్టి వేగమును వహించి, ఇంద్రునియొక్క మానమును హరించునట్టి యుత్కర్షమును వహించి యని గరుడపరమైన యర్థము; నిజతార్క్ష్యసమాఖ్య = తమయొక్క తార్క్ష్యము లను పేరు, తార్క్ష్య మనఁగా నశ్వము, గరుత్మంతుఁడును, ‘తురఙ్గ గరుడౌ తార్క్ష్యౌ’ అని యమరుఁడు; యథార్థతన్ = సార్థకతచేత; తగన్ = ఒప్పఁగా; చెలంగున్ = ప్రకాశించును; ఆ పురియందు సూర్యాశ్వబాణవాయువేగములకు మించిన వేగము గలిగిన యుత్తమాశ్వము లున్నవని భావము. ప్రకృతాశ్వములకు నప్రకృతగరుడునకు నౌపమ్యము వ్యంగ్యము. అతిశయోక్త్యలం కారము.
మ. వరవర్ణక్రమభాసివాహయుతి, భా◊స్వచ్చంద్రచక్రాప్తి వీ
టి రథశ్రేణి వహించియున్, గడునఖం◊డీభూతవిస్ఫూర్తిచే
నరుదై పొల్చుట నొక్కొ, కేరు, గిరిక◊న్యాధీశచక్రాంగవై
ఖరి, నుద్యద్వలభీ విలంబిత మణీ◊ఘంటాళి ఘాణంఘణిన్. 97
టీక: ఈపద్యమందు రథశ్రేణిని వర్ణింపఁగా యథాసంభవముగ నీశ్వరరథపరమైన యర్థాంతరముగూడఁ దోఁచుచున్నది. వీటి రథశ్రేణి = పురమందలి రథములయొక్క గుంపు; వరవర్ణక్రమభాసివాహయుతిన్ – వర = శ్రేష్ఠమగు, వర్ణ = రంగుచేతను, జాతిచేత నని కాని, క్రమ = నడుపుచేతను, భాసి = విలసిల్లునట్టి, వాహ = అశ్వములయొక్క, యుతిన్ = సంబంధమును, శ్రేష్ఠము లగు నకారాదివర్ణములచేతను, క్రమపదవాచ్య మగు పాఠవిశేషముచేతను (భాసిల్లు వాహము లనఁగా) వేదరూపాశ్వ ములు, వాని (యుతి) కూడికచేతను నని యీశ్వరరథపరమైన యర్థము; భాస్వచ్చంద్రచక్రాప్తిన్ = ప్రకాశించుచున్న బంగరు కండ్లయొక్క ప్రాప్తిని, ‘గైరికం వసు చంద్రకం’ అని యమరుఁడు, సూర్యచంద్రాత్మకచక్రములయొక్క ప్రాప్తి నని యీశ్వరరథ పర మైన యర్థము, ఈశ్వరునకు త్రిపురహరణకాలమున భూమి రథము, వేదములు వాహములు, మేరువు ధనువు, విష్ణువు సాయకంబు లగుట పురాణప్రసిద్ధ మైనది; వహించియున్ = ధరించియు; కడున్ = మిక్కిలి; అఖండీభూతవిస్ఫూర్తిచేన్ – అఖండీభూత = అవిచ్ఛిన్నమగు, విస్ఫూర్తిచేన్ = ప్రకాశముచేత; అరుదై = ఆశ్చర్యకరమై; పొల్చుట నొక్కొ = ఒప్పుట చేతనో; ఉద్యద్వలభీ విలంబిత మణీఘంటాళి ఘాణంఘణిన్ – ఉద్యత్ = ప్రకాశించుచున్న, వలభీ = కొణిగలయందు, విలం బిత = వ్రేలాడుచుండిన, మణీఘంటా = మణిమయములైన గంటలయొక్క, ఆళి = పంక్తియొక్క, ఘాణంఘణిన్ = ఘణఘణ యను నాదముచేత; గిరికన్యాధీశ చక్రాంగ వైఖరిన్ – గిరికన్యాధీశ=పార్వతీపతియొక్క, చక్రాంగవైఖరిన్ = రథముయొక్క రీతిని; కేరున్ = పరిహసించును. అనఁగా విశాలాపురియం దున్న రథములు రుద్రునిరథమువలె వరవర్ణ క్రమభాసివాహ భాస్వ చ్చంద్రచక్రాప్తిమొదలుగాఁ గలవానినిఁ బొందియు, నఖండీభూతవిస్ఫూర్తిచేఁ బొల్చుటచేత నీశ్వరుని భూమ్యాత్మకరథవైఖరి నవఖండాత్మక మని ఘంటల చప్పుడుచేతఁ గేరుచున్నట్టు లున్నదని భావము. ఇందు వ్యతిరేకోత్ప్రేక్షాశ్లేషాలంకారములు.
చ. స్థిరసుమనోవితానముల◊చే, ననిమేషవిలోలలోచనో
త్కరములచే, ననర్ఘమణి◊కామయకూటచయంబుచే, సిరిం
గరము పొసంగు వీటి నవ◊కాంచనసౌధపరంపరల్, మరు
ద్గిరివరవైఖరిం బొలుచు ◊దివ్యపథం బధరీకృతంబు గాన్. 98
టీక: ఈ పద్యమందు సౌధములు మేరుతుల్యముగ నున్న వనుటచే మేరుపరమైన యర్థాంతరముగూడఁ దోఁచుచున్నది. సిరిన్ = సంపదచే; కరము = మిక్కిలి; పొసంగు వీటి నవకాంచనసౌధపరంపరల్ – పొసంగు = ఒప్పుచున్న, వీటి = పురము యొక్క, నవ = నూతనములగు, కాంచనసౌధ = బంగారుమేడలయొక్క, పరంపరల్= సమూహములు; స్థిరసుమనోవితాన ములచేన్ – స్థిర = తిరమగు, సుమనోవితానములచేన్ = పువ్వుఁజప్పరములచేతను, దేవతాసంఘములచేత నని యర్థాంత రము; అనిమేష విలోల లోచనోత్కరములచేన్ – అనిమేష = మత్స్యములవలె, విలోల = మిక్కిలి చలించుచున్న, లోచనా = కన్నులు గల స్త్రీల యొక్క, ఉత్కరములచేన్ = సమూహములచేతను, దేవతాస్త్రీసంఘముచేత నని యర్థాంతరము; అనర్ఘ మణికామయ కూటచయంబుచేన్ = వెలలేనట్టి మణిమయగృహవిశేషములచేతను, మణిమయశిఖరములచేత నని యర్థాంత రము, ‘కూటో స్త్రీ శిఖరం వాసః కూటో ద్వయోః’ అని యమరుఁడు; దివ్యపథంబు = అంతరిక్షము; అధరీకృతంబు గాన్ = క్రిందు చేయఁబడి నది కాఁగా; మరుద్గిరివరవైఖరిన్ = మేరుపర్వతమువంటి మేలైన భంగితో; పొలుచున్ = ఒప్పును. విశాలాపురియందు మేడలు గగనమండలము క్రిందగునంత యున్నతము లై, మేరుపర్వతము వలెఁ బ్రకాశించె నని భావము. ఉపమాలంకారభేదము.
మ. అవడీనానిల వాసనాజనిత హా◊ర్దాప్తిం, బురిన్ భర్మహ
ర్మ్య వితానాశ్రిత యోషిదాస్యములఁ జే◊రంబోవు దివ్యాపగా
బ్జవస ద్బంభరపాళి, కుద్గమనజ◊శ్రాంతిం దొలంచున్, విలా
స వనీ సాలలతాంతగంధ లహరీ◊సారంబు మధ్యేసృతిన్. 99
టీక:ఇందుఁ బ్రకారాంతరముగ సౌధోన్నత్యము వర్ణింపఁబడుచున్నది. పురిన్ = విశాలాపురియందు; భర్మ హర్మ్య వితానాశ్రిత యోషి దాస్యములన్ – భర్మహర్మ్య = బంగరుమేడలయొక్క, వితాన = సంఘములను, ఆశ్రిత = ఆశ్రయించినట్టి, యోషిత్ = స్త్రీలయొక్క, ఆస్యములన్ = ముఖములను; అవడీ నానిల వాసనా జనిత హార్దాప్తిన్ – అవడీన = క్రిందికి దిగి వచ్చిన, అనిల = వాయువువలన నైన, వాసనా = పరిమళముచేత, జనిత = పుట్టిన, హార్ద = ప్రీతియొక్క, ఆప్తిన్ = ప్రాప్తిచేత; చేరన్= (స్త్రీముఖ ములను) చేరుటకు; పోవు = పోవునట్టి, దీనికి బంభరపాళియం దన్వయము; దివ్యాప గాబ్జ వస ద్బంభరపాళికిన్ – దివ్యాపగా = వ్యోమగంగయందున్న, అబ్జ = కమలములయందు, వసత్ = వసించుచున్న, బంభరపాళికిన్ = తుమ్మెదల గుంపునకు; విలాసవనీ సాల లతాంత గంధలహరీ సారంబు – విలాసవనీ=క్రీడార్థమైన యుద్యానములందలి, సాల=వృక్షములయొక్క, ‘అనోకహః కుట స్సాలః’ అని యమరుఁడు, లతాంత = కుసుమములయొక్క, గంధలహరీ = పరిమళప్రవాహముయొక్క, సారంబు = స్థిరాంశము; ఉద్గమన జ శ్రాంతిన్ – ఉద్గమన = ఊర్ధ్వమునకుఁ బోవుటవలన, జ = పుట్టినట్టి, శ్రాంతిన్ = శ్రమమును; మధ్యేసృతిన్ = మార్గమధ్యమందు, ‘ పారే మధ్యే షష్ఠ్యా వా’ అని యలుక్సమాసము; తొలంచున్ = పోఁగొట్టును.
విశాలాపురి యందు మేడలు స్వర్గమునకన్న నత్యున్నతము లై యున్నవనియు, స్వర్గంగాసరోజములయందున్న తేఁటు లచటి యోషిదాస్యములఁ జేరంబోవుచుండఁగా మార్గమధ్యమందు కలిగిన శ్రమమును విశాలాపురోద్యానతరుప్రసూనపరిమ ళము పోఁగొట్టుచున్న దనుటవలన నుద్యానములును స్వర్గమును మించిన యౌన్నత్యము గలిగియున్నవనియు భావము. అతిశయోక్తిభేదము.
మ. పుర చామీకరసౌధ చత్వర మణీ◊పుత్రీ ముఖాంభోజముల్,
శరజాసాలయ కుడ్యబింబితము లై, ◊చక్కం గనన్, దోఁచు ని
ర్భరదర్శార్కకరాభిచర్విత నిశా◊రాణ్ణిర్మిమిత్సాప్తవా
గ్వర సంయోజిత చంద్రకారణచయ◊వ్యాప్తిన్, విజృంభించుచున్. 100
టీక: పుర చామీకరసౌధ చత్వర మణీపుత్రీ ముఖాంభోజముల్ – పుర = విశాలాపురమందలి, చామీకరసౌధ = బంగరుమేడల యొక్క, చత్వర = ముంగిళ్ళభూములయందలి, మణీపుత్రీ = మణిమయములగు బొమ్మలయొక్క, ముఖాంభోజముల్ = ముఖపద్మములు; శరజాసాలయ కుడ్యబింబితము లై – శరజాస = పద్మాసనుం డగు బ్రహ్మయొక్క, ఆలయ = గృహము యొక్క, కుడ్య = గోడలయందు, బింబితము లై = ప్రతిఫలించిన వై; చక్కం గనన్ =చక్కగాఁ బరిశీలింపఁగా; నిర్భర దర్శార్క కరాభిచర్విత నిశారాణ్ణిర్మిమిత్సాప్త వాగ్వర సంయోజిత చంద్రకారణచయ వ్యాప్తిన్ – నిర్భర= దట్టము లగు, దర్శార్కకర = అమావాస్యయందలి సూర్యునికిరణములచేత, అభిచర్విత = భక్షింపఁబడిన, నిశారాట్ = చంద్రునియొక్క, నిర్మిమిత్సా = నిర్మాణేచ్ఛను, అప్త = పొందినట్టి, వాగ్వర = బ్రహ్మచేత, సంయోజిత = చేర్పఁబడిన, చంద్రకారణచయ = మఱలఁ జంద్రుని నిర్మించుటకు సాధనములైనవానిగుం పనెడు, వ్యాప్తిన్ = ప్రసిద్ధిచేత; విజృంభించుచున్ = అతిశయించుచు; తోఁచున్ = అగ పడును. చంద్రకారణచయ మనున ట్లగపడు ననుట. విశాలాపురి నున్న మేడలు సత్యలోకమువర కున్నతములుగా నున్న వనియు, నా మేడల యంగణభూములందున్న మణులతోఁ జేయఁబడిన బొమ్మలముఖములు బ్రహ్మదేవుని యింటిగోడల మీఁదఁ బ్రతిఫలించి యుండఁగా నవి యమావాస్యల యందు సూర్యకిరణములచే మ్రింగఁబడిన చంద్రులకు మాఱుగా నిర్మించు టకు బ్రహ్మకారణసామగ్రి నొనగూర్చి యుంచినట్లు దోఁచుచున్న వనియు భావము. ఉత్ప్రేక్షాత్యుక్త్యలంకారముల సంకరము.
చ. అతులశుభాగమక్రమము ◊స్వాశ్రిత భూరికలస్వన ద్విజే
శతతులు దెల్ప, వీటిమణి◊సౌధము, లాజిర హర్మ్యలక్ష్మిపైఁ
జతురత నించుసేస, గృహ◊చత్వర వీథిక లొంది, జాలకా
రతిఁ దగుచాన లెల్లఁ దొర◊రాజిల ఱువ్వెడు మొగ్గచాలునన్. 101
టీక: ఈ పద్యమం దంగణభూములయందుఁ జానలు క్రీడించువేళఁ జల్లుకొను మొగ్గలు మణిసౌధాజిరలక్ష్ములయొక్క వైవా హికాక్షతలుగా వర్ణింపఁబడియె. వీటిమణిసౌధములు = పత్తనమందలి మణిమయము లైన మేడలు; స్వాశ్రిత భూరికలస్వన ద్విజేశతతులు – స్వాశ్రిత = తమ్ము నాశ్రయించిన, భూరికలస్వన = అధికము లైన మధురవాక్కులు గల్గిన, ద్విజేశతతులు = పక్షు లనెడు బ్రాహ్మణులయొక్కగుంపులు; అతుల శుభాగమక్రమము – అతులశుభ = సాటిలేని శుభముహూర్తముయొక్క, ఆగమక్రమము = ప్రాప్తి విధమును; తెల్పన్ = తెల్పుచుండఁగా; ఆజిర హర్మ్యలక్ష్మిపైన్ = అంగణహర్మ్యలక్ష్మిపై; గృహ చత్వర వీథికలు = గృహాంగణభూములను; ఒంది =పొంది; జాలకారతిన్ = మొగ్గలు చల్లుకొనెడు క్రీడచేత; తగుచాన లెల్లన్ = ఒప్పునట్టి స్త్రీ లందఱు; తొర రాజిలన్=వేగ మౌనట్లుగా; ఱువ్వెడు మొగ్గచాలునన్=విసరివైచెడు మొగ్గలగుంపుచేత; చతురతన్ = చాతుర్యమున; సేసన్ = అక్షతలను; నించున్ = చల్లును. ఉత్ప్రేక్షాభేదము.
మ. తరుణుల్ వీటిశిరోగృహాళి నిసి ము◊క్తాకంతుకం బాడుచోఁ,
గరకంజంబున జాఱి, బంతి, కడ కేఁ◊గన్, దత్సృతిం జేరు చం
దురుఁ, దద్బుద్ధి గ్రహించి, గోర్పఁగఁ, దద◊స్తోకాహతిన్ గందెఁగా,
కురుమాలిన్యము సత్కులాధిపతి కె◊ట్లొందున్? మదిం జూడఁగన్. 102
టీక: ఇందుఁ బ్రకారాంతరముగ సౌధోన్నత్యము వర్ణింపఁబడియె. వీటిశిరోగృహాళిన్ = పత్తనముయొక్క మేడలయందు; తరుణుల్ = స్త్రీలు; నిసిన్ = రాత్రియందు; ముక్తాకంతుకం బాడుచోన్ = ముత్యములతోఁ గూర్పఁబడినచెం డాడు నెడ; బంతి = చెండు; కరకంజంబునన్ = పాణిపద్మమువలన; జాఱి; కడ కేఁగన్ = దూరమునకుఁ బోఁగా; తత్సృతిన్ = ఆ మార్గమును; చేరు చందురున్ = పొందునట్టి చంద్రుని; తద్బుద్ధిన్ = ఆ చెండను బుద్ధిచేత; గ్రహించి = పట్టుకొని; గోర్పఁగన్ = ఎగవేయఁగా; తదస్తోకాహతిన్ = ఆ గొప్పపాటు చేత; కందెఁగాక = కందెఁ గాని; ఉరుమాలిన్యము = అధికమైన మాలిన్యము; సత్కులాధి పతికిన్ = సత్కులశ్రేష్ఠుఁ డగు వానికి, నక్షత్రరాజున కనుట; మదిన్ = మనస్సునందు; చూడఁగన్ = భావింపఁగా; ఎట్లొందున్? = ఏరీతిఁ జెందును. చంద్రునియందుఁ గలంకము విశాలాపురీసౌధములయం దున్న స్త్రీలు చెండను భ్రమతోఁ బట్టుకొని కొట్టఁగాఁ గలిగినదే కాని మఱియొక విధముగాఁ గలిగినది కాదని భావము. ఇచటఁ జంద్రునియందుఁ గలంకము క్రీడాకాలికసౌధోపరిచర న్నీరజలోచనాస్తోకాహతివలనఁ గలిగినదే కాని యితరమువలన సంభవింప లే దని ‘యెట్లొందు’నను దానిచేఁ జెప్పుటవలన మంథానభూమిధరేత్యాదులయందుఁ గువలయానందమున వ్రాసినరీతిని హేత్వహ్నుతి, భ్రాన్తిమంతమును.
సీ. భవ్యతారారూఢిఁ ◊బదనఖంబులు మించఁ, దొడలు రంభారీతిఁ ◊దొడరి యెంచ,
మేనావరస్ఫూర్తి ◊మెఱుఁగుఁజన్ను లెసంగ, నాసల్ తిలోత్తమో◊న్నతిఁ బొసంగ,
హరిణీవిలాసత ◊నక్షియుగ్మము వొంద, నళికముల్ చంద్రక◊లాత్మఁ జెంద,
నతనూర్వశిస్ఫూర్తి◊ నలరి వేణిక లెచ్చఁ, దనులు హేమైకవ◊ర్తనను మెచ్చ,
తే. నహహ! నిర్జరనీరజా◊స్యావితాన, హారి సౌందర్యసంగతై◊కైకమాని
తావయవకాంతి సంపత్తి, ◊నడరినిల్చు, సిరుల, నలరుదు, రబ్జకం◊ధరలు వీట. 103
టీక: వీటన్=విశాలాపురియందు; అబ్జకంధరలు =శంఖమువంటి కంఠముగల స్త్రీలు,‘అబ్జౌ శఙ్ఖ శశాఙ్కౌ చ’ అని యమరుఁడు; పదనఖంబులు = పాదనఖములు (కాలిగోరులు); భవ్యతారారూఢిన్ – భవ్య= మనోజ్ఞ యగు, తారా = తార యను దేవాంగన యొక్క, రూఢిన్=ప్రసిద్ధివంటి ప్రసిద్ధిచేతను,మనోజ్ఞములగు నక్షత్రములయొక్క ప్రసిద్ధిచేత ననుట;మించన్=అతిశయింపఁగా ; తొడలు = ఊరువులు; రంభారీతిన్ = రంభ యను నప్సరసస్త్ర్సీయొక్క రీతిని, అనఁటులయొక్క రీతి ననుట; తొడరి = పూని; ఎంచన్ = ఎన్నఁగా, అనఁగా పోలుచుండఁగా నని యర్థము. మెఱుఁగుఁజన్నులు = మెఱయుచున్న కుచములు; మేనావరస్ఫూర్తిన్ – మేనా = మేనక యనెడు దివ్యస్త్రీయొక్క, వర = శ్రేష్ఠ మగు, స్ఫూర్తిన్ = ప్రకాశముచేతను, మేనావరుఁ డైన హిమవంతునియొక్క ప్రకాశమువంటి ప్రకాశముచేత ననుట; ఎసంగన్ = అతిశయింపఁగా; నాసల్=నాసికలు; తిలోత్తమోన్నతిన్ – తిలోత్తమా =తిలోత్తమ యను నప్సరస్త్ర్సీయొక్క, ‘ఊర్వశీ మేనకా రంభా ఘృతాచీ చ తిలోత్తమా సుకేశీ మఞ్జుఘోషాద్యాః కథ్యన్తేఽప్సరసో బుధైః’అని యమరుఁడు, ఉన్నతిన్ = ఔన్నత్యము చేతను, తిలకుసుమముయొక్క యౌన్నత్యముచేత ననుట; పొసంగన్ = ఒప్పుచుండఁగా;
అక్షియుగ్మము = నేత్రయుగ్మము, ‘స్తనాదీనాం ద్విత్వవిశిష్టా జాతిః ప్రాయేణ’ అను వామనసూత్రముచేత నిట స్త్రీల నేత్రము లనేకము లయినను యుగ్మమని ప్రయోగింపఁబడినది; హరిణీవిలాసతన్ = హరిణి యను సురాంగనయొక్క విలాసము వంటి విలాసమును, ఇట విలాసశబ్దము అర్శ ఆద్యజంత మైనందున విలాసవిశిష్టమును బోధించును, తద్ధర్మము విలాసత అది విలాసరూపమే యగునని యాశయము, విలాసము నక్షియుగ్మ మను పాఠము సమీచీనముగఁ దోఁచుచున్నది, ఆడుజింక యొక్క విలాసము ననుట; పొందన్ = పొందఁగా; అళికముల్ = ఫాలస్థలములు; చంద్రకలాత్మన్ = చంద్రకల యను దేవాం గనయొక్క రూపమును; చెందన్ = పొందఁగా, చంద్రుని కలారూపమును బొందఁగా ననుట; వేణికలు = జడలు; అతనూర్వశిస్ఫూర్తిన్ = అధిక మగు నూర్వశి యను నప్సరస్త్ర్సీయొక్క ప్రకాశముచేత; అలరి = ఒప్పి, మన్మథునియొక్క గొప్పఖడ్గముయొక్క స్ఫూర్తిచే (అతను+ఉరు+అశి = అతనూర్వశి) నలరారి యనుట, ‘శ్లో. డలయో రలయో శ్చైవ శసయో ర్వబయో స్తథా’ యనుటచేత నిట నూర్వశి యనుచోట శకార సకారములకభేదము చెప్పఁ బడినది; ఎచ్చన్ = అతిశయింపఁగా; తనులు = శరీరములు; హేమైకవర్తనను – హేమా = హేమ యను దేవాంగనయొక్క, ఏక = ముఖ్య మగు, వర్తనన్ = వృత్తిని; మెచ్చన్ = శ్లాఘింపఁగా, సువర్ణమును బోలఁగా ననుట; అహహ = ఔరా! నిర్జర నీరజాస్యా వితాన హారి సౌందర్య సంగ తైకైక మానితావయవ కాంతి సంపత్తిన్ – నిర్జర నీరజాస్యా వితాన = దేవాంగనాకదంబముయొక్క, హారి = మనోజ్ఞ మగు, సౌందర్య = సౌందర్యముతో, సంగత = కూడుకొన్న, ఏకైక మానితావయవ = ఒక్కొక్క పూజితాంగముయొక్క, కాంతి సంపత్తిన్ = తేజస్సంపదచేత; అడరి = ఒప్పి; నిల్చు సిరులన్ = స్థిరమగు సంపదలచే; అలరుదురు = ప్రకాశింతురు. విశాలాపురియందున్న స్త్రీల యవయము లొక్కొక్కటి యొక్కొక రంభాది సురాంగనను బోలియుండఁగా వారి సర్వాయవసౌందర్యమునకు సరియైన యువతి త్రైలోక్యములో దుర్లభ యని భావము.
మ. అనిశాశేషఋతు ప్రసేవిత పురీం◊ద్రారామపంక్తుల్, గళ
ద్ఘన సూనౌఘ పరాగపూగములఁ దో◊డ్తన్ సేతువుల్ దీర్చి, కీ
ర నికాయాస్యనికృత్త పక్వఫలనీ◊రంబుల్ తగ న్నించు, నొ
య్యన పోషింపనొ! నందనాఖ్య మను నాకాక్రీడ మెల్లప్పుడున్. 104
టీక: అనిశాశేష ఋతుప్రసేవిత పురీంద్రారామపంక్తుల్ – అనిశ = ఎల్లప్పుడును, అశేషఋతు = షడ్రుతువులచేత, ఇచట ‘ఋత్యకః’ అను పాణినిసూత్రముచేత నకార ఋకారములకు సంధి లేదు, ప్రసేవిత = బాగుగాసేవింపఁబడిన, పురీంద్రారామ = పురోద్యానములయొక్క, పంక్తుల్ = సమూహములు; గళద్ఘన సూనౌఘ పరాగపూగములన్ – గళత్ = జాఱుచున్న, ఘన = దట్టమైన, సూనౌఘపరాగ = పుప్పొడులయొక్క, పూగములన్ = సమూహములచేత; తోడ్తన్ =వెంటనే; సేతువుల్ = కట్టలు; తీర్చి = చేసి; కీర నికాయాస్యనికృత్త పక్వఫలనీరంబుల్ – కీర = చిలుకలయొక్క, నికాయ = సమూహముయొక్క, ఆస్య = ముఖములచేత, నికృత్త = భేదింపఁబడినట్టియు, పక్వ = పండినట్టియు, ఫల=పండ్లయొక్క, నీరంబుల్ = మకరందముల ననుట; నందనాఖ్యన్ = నందన మను పేరిచేత, కుమారుఁ డను ప్రసిద్ధిచేత; మను = వృద్ధి నొందు; నాకాక్రీడము = స్వర్గోద్యాన మును; ఎల్లప్పుడున్ = సర్వకాలమును; పోషింపనొ = పోషించుటకో యేమో; ఒయ్యన = మెల్లగా; తగన్= ఒప్పునట్లుగా; నించున్ = పూరించును. విశాలాపురియం దున్న యుద్యానములు నందనవనముకన్న నుపరిభాగము నొందియున్న వనియు, నందనవనము పురోద్యానములకు బిడ్డ యనునట్లు అల్పముగా నున్న దనియు భావము. ఉపవనకర్తృక పుష్పరజఃకరణకసేతు కృతియుఁ, దదధికరణక పక్వఫలనీర పూరణమును లేనివే నందనవనపోషణహేతువులుగా వర్ణింపఁబడుటచే నసిద్ధవిషయ
హేతూత్ప్రే క్షాలంకారము. ‘శ్లో. సంభావనా స్యాదుత్ప్రేక్షా వస్తుహేతు ఫలాత్మనా’ యని లక్షణము.
సీ. జాలకమాలికా◊జాలంబు లెత్తుట, నుదుటుముత్యపుఁబేరు ◊ లొసఁగు మనుట,
సరసబంధూకగు◊చ్ఛముఁ జూపి కప్పుట, నలప్రొద్దు గ్రుంకఁగా◊వలయు ననుట,
దళముగాఁ గెందమ్మి◊దళములు గూర్చుట, నీ మీఁద ననురక్తి ◊నెగడె ననుట,
చికిలి సంపెఁగననల్ ◊సెలిమిచే నిచ్చుట, గుఱుతు చంపకలతా◊కుంజ మనుట,
తే. తెలుపకయ తెల్పి, కడునేర్పు ◊దేటపడఁగ, నలరుబొంకులఁ జెలఁగించి, యఖిలకమన
పాళి తమదండకై యాస◊పడఁగఁజేసి, విరులు విల్తురు, కుసుమలా◊వికలు వీట. 105
టీక:వీటన్ = విశాలాపురియందు; కుసుమలావికలు = పువ్వు లమ్మెడు స్త్రీలు; జాలకమాలికాజాలంబులు = మొగ్గలసరముల గుంపులు; ఎత్తుటన్ = ఎత్తుటచేత; ఉదుటుముత్యపుఁబేరులు =గొప్ప ముత్యపుసరులు; ఒసఁగు మనుట= ఇమ్మని చెప్పుట; సరస బంధూక గుచ్ఛమున్ – సరస = శ్రేష్ఠ మగు, బంధూక = మంకెనపువ్వులయొక్క, గుచ్ఛమున్ = గుత్తిని; చూపి కప్పుటన్ = చూపి, మూయుటచేత; అలప్రొద్దు గ్రుంకఁగా వలయు ననుట = ఆప్రొద్దు గ్రుంకవలయు నని చెప్పుట; దళముగాన్ = దట్టమౌ నట్లుగా; కెందమ్మిదళములు = ఎఱ్ఱతామరఱేకులు; కూర్చుటన్ = కూర్చుటచేత; నీమీఁదన్ = నీపై; అనురక్తి = అనురా గము; నెగడెన్ = అతిశయించెను; అనుట = అని చెప్పుట; చికిలి సంపెఁగననల్ = బాగైన సంపెంగపువ్వులు; చెలిమిచేన్ = ప్రేమ చేత; ఇచ్చుటన్ = ఇచ్చుటచేత; చంపకలతాకుంజము = సంపెంగలతలపొద; గుఱుతు = సంకేతస్థానము; అనుట = అని చెప్పుట; తెలుపకయ తెల్పి = ఇట్లు తమ యభిప్రాయమును వాక్కుతోఁ జెప్పకయె వ్యాపారముతోఁ దెల్పి; కడునేర్పు= అధిక మగు చాతుర్యము; తేటపడఁగన్ = వ్యక్తమౌ నట్లుగా; అలరుబొంకులన్ = ఒప్పుచున్న యసత్యోక్తులచేత; అఖిలకమన పాళిన్ = ఎల్ల కాముకకోటిని; చెలఁగించి = సంతోషపెట్టి; తమదండకై = తమపూదండకు, పొందునకు; ఆసపడఁగఁజేసి = ఆశించునట్లు చేసి; విరులు = పూవులు; విల్తురు = విక్రయింతురు.
చ. అలనగరాధిమౌళి సర◊సాగ్రణు లెంచఁ జరించు చల్లవీ
వలి తను భృంగకోటి గొలు◊వన్ విటనేత యనంగ సొంపుమై
నలరెడి పద్మినీతతుల ◊యందపుఁదావులు సెంది, యుబ్బుచుం
గులుకుఁ జిగుర్చుఁ, గన్నెలత◊కూనల మేల్వల పూని చొక్కుచున్. 106
టీక: ఈపద్యమందు మందమారుతమును విటనాయకునిఁగా వర్ణించుటచే నర్థద్వయము కల్గుచున్నది. అలనగరాధిమౌళిన్ = ఆపురవరముపై; సరసాగ్రణు లెంచన్ = రసికశిరోమణులు మెచ్చఁగా; చరించు చల్లవీవలి = వీచుచున్న చల్లనివాయువు; తనున్ = తన్ను; భృంగకోటి=తుమ్మెదలగుంపులు, విటుల గుంపులు, ‘భృఙ్గో ధూమ్యాట షిద్గయోః మధువ్రతే’ అని విశ్వము; కొలువన్ = సేవింపఁగా; విటనేత యనంగన్ = విటశ్రేష్ఠుండనునట్లు; సొంపుమైన్ = మనోహరతచేత; అలరెడి = ఒప్పుచున్న; పద్మినీతతుల = పద్మలతల గుంపులయొక్క, పద్మినీజాతిస్త్రీసమూహముయొక్క; అందపుఁ దావులు =మనోహర మైన పరి మళములను, నివాసస్థానములను; చెంది = పొంది; ఉబ్బుచున్ = అతిశయించుచు; కన్నెలతకూనల మేల్వలపు = కన్నెల వంటి బాల (లేత) లతలయొక్క మేలైన పరిమళమును, బాలలతలవంటి కన్నెల యందు హెచ్చైన మోహమును; ఊని= పూని; చొక్కుచున్ = పరవశ మగుచు; కులుకున్ = అందమును; చిగుర్చున్ = ఆవిర్భవింపఁ జేయును.
సీ. సేసకొప్పుల నమ◊ర్చిన మొల్లమొగడచాల్, సరిగరుమాలపైఁ ◊జక్కఁ దోఁప,
వలెవాటు వైచిన ◊సుళువుఁ జెందిరకావి, వలిపముల్ పదపల్ల◊వముల జీర,
నెలవంక రేఖలు ◊నెలకొన్న పేరుర,ములఁ జిల్కతాళులు ◊తళుకుసూపఁ,
జెలువంబు నెగడఁ దీ◊ర్చిన క్రొత్తకస్తూరి,పట్టెల మేల్తావి ◊మట్టుమీఱఁ,
తే. జెక్కుఁగవ ముత్తియపుటొంట్ల◊జిగి వెలుంగఁ, బలుకుఁగప్రంపువీడెంబు ◊వలపు నిగుడ,
నలరువేడుక వెనువెంటఁ ◊జెలులు నడవ, వేడ్కఁ జరియింతు రనిశంబు ◊విటులు వీట. 107
టీక: వీటన్ = విశాలాపురియందు; విటులు = జారులు; సేసకొప్పులన్ = కొండెసిగలయందు; అమర్చిన = ఉంపఁబడిన; మొల్లమొగడచాల్ = కుందకుట్మములయొక్క బంతులు; సరిగరుమాలపైన్ = జరీరుమాలమీఁద; చక్కన్ = బాగుగా; తోఁపన్ = తోఁచుచుండఁగా; వలెవాటు వైచిన = వల్లెవాటుగా వేసికొన్న; సుళువుఁ జెందిరకావి = లేఁతచంద్రకావివన్నె గల; వలిపముల్ = వస్త్రములు; పద పల్లవములన్ = పల్లవములవంటి పాదములపై; జీరన్ = జీరాడుచుండఁగా; నెలవంక రేఖలు = చంద్రవంకరేకలు; నెలకొన్న= వ్యాపించిన; పేరురములన్ = విశాలమైన వక్షస్థ్సలములయందు; చిల్క తాళులు = తావళము లనెడు హారవిశేషములు; తళుకుసూపన్ = ప్రకాశించుచుండఁగా; చెలువంబు = అందము; నెగడన్ = అతిశయించునట్లు; తీర్చిన క్రొత్తకస్తూరిపట్టెల మేల్తావి = తీర్పఁబడిన నూతనకస్తూరిపట్టెల యొక్క యుత్తమమైన పరిమళము; మట్టుమీఱన్ = అతిశయింపఁగా;
చెక్కుఁగవన్ = గండయుగ్మమందు; ముత్తియపుటొంట్లజిగి = ముత్యములతోఁ గూడిన యంటుపోఁగుల యొక్క కాంతి; వెలుంగన్ = ప్రకాశించుచుండఁగా; పలుకుఁగప్రంపువీడెంబు వలపు = పలుకు కర్పూరముతోఁ జేరిన తాంబూలములయొక్క వాసన; నిగుడన్ = వ్యాపింపఁగా; అలరు వేడుకన్ = అతిశయవిలాసముచేత; వెనువెంటన్ = వెంబడిగా; చెలులు = స్త్రీలు; నడవన్ = నడచుచుండఁగా; అనిశంబున్ = ఎల్లప్పుడు; వేడ్కన్ = వేడుకచేత; చరియింతురు = సంచరింతురు.
మ. అకలంకాంబుజపాళికా సుఖిత భృం◊గాళీ తనూకాంతిదం
భ కళిందప్రభవానుషంగ శిఖిదా◊మా తాండవాపాదనో
దక భంగోత్కర ఘర్షణక్రమ సము◊ద్గచ్ఛ త్పయోబిందు శీ
తకరీభూత పతంగ గంగ, దనరుం ◊దత్ప్రాంతదేశంబునన్. 108
టీక: తత్ప్రాంతదేశంబునన్ = ఆవిశాలాపురిసమీపమందు; అకలంకాంబుజ పాళికా సుఖిత భృంగాళీ తనూ కాంతిదంభ కళిందప్రభ వానుషంగ శిఖిదామా తాండవాపాద నోదక భంగోత్కర ఘర్షణక్రమ సముద్గచ్ఛ త్పయోబిందు శీతకరీభూత పతంగ గంగ– అకలంక = స్వచ్ఛములగు, అంబుజ = పద్మములయొక్క, పాళికా = గుంపులయందు, సుఖిత = సంజాత సుఖములగు, భృంగ = తుమ్మెదలయొక్క, ఆళీ = సమూహముయొక్క, తనూకాంతి = దేహకాంతి యనెడు, దంభ = నెపము గల, కళిందప్రభవా = యమునానదియొక్క, అనుషంగ = సంబంధముచేత, దీని కాపాదనక్రియయం దన్వయము, శిఖిదామా =మయూరసమూహమునకు, తాండవాపాదన = తాండవోత్సవసంపాదక మగు, ఉదక = జలముయొక్క, భంగో త్కర = అలల గుంపులయొక్క, ఘర్షణక్రమ = సంఘర్షణక్రమముచేత, సముద్గచ్ఛత్ = పై కెగురుచున్న, పయోబిందు= ఉదక బిందువులచేత, శీతకరీభూత= చంద్రునివలెఁ జల్లనైన, పతంగ = సూర్యుఁడు గల, గంగ = గంగానది; తనరున్ = ప్రకాశించును. ఈపద్యమందు శిఖిదామా యనుచోట దామన్ శబ్దము ‘డా బుభాభ్యా మన్యతరస్యామ్’ అను సూత్రముచేత డాప్ప్రత్యయము వచ్చుటచే నాకారాంత మైనది. భృంగతనూకాంతి యనెడు యమునాసంగముచేత గంగాతరంగములు మేఘపరంపరలఁ బోలి శిఖితాండవముఁ గలుగఁ జేయుచున్నవనియు, నాతరంగములయొక్క తాఁకుడువలన జలకణములు సూర్యలోకమువఱకు నెగసి సూర్యునిఁ జంద్రునివలెఁ జల్ల నగునట్లు చేయుచున్న వనియు భావము.
మ. విలసత్సారణికానుయాయి విబుధ◊ద్వీపిన్యనర్ఘామృతం
బుల ముక్కారును బండు శాలులు పురీ◊భూదేవపాళీకృతో
జ్జ్వల నానావిధయజ్ఞ తన్నవహవి◊స్సంభుక్తి బర్హిర్ముఖా
వళు లెల్లప్డు నమర్త్యభావ మజర◊త్వం బూని మోదింపఁగన్. 109
టీక: శాలులు = వరిపైరులు; విలసత్సారణికానుయాయి విబుధద్వీపిన్యనర్ఘామృతంబులన్ – విలస త్సారణికా = ప్రకాశించు కాల్వలను, అనుయాయి = అనుసరించిపోవు, విబుధద్వీపినీ = గంగయొక్క, అనర్ఘామృతంబులన్ = అమూల్యములగు నుదకము లను సుధలచేత; ముక్కారును = మూఁడు కార్లును; పండున్ = ఫలించును; పురీ భూదేవపాళీ కృతోజ్జ్వల నానా విధ యజ్ఞ తన్నవహవిస్సంభుక్తి న్ – పురీ = విశాలాపురియందలి, భూదేవపాళీ = బ్రాహ్మణబృందముచేత, కృత = చేయఁ బడిన, ఉజ్జ్వల = ప్రకాశించునట్టి, నానావిధ = అనేకప్రకారము లగు, యజ్ఞ = యజ్ఞములయందు, తన్నవహవిస్సంభుక్తిన్= ఆశాలి సంబంధి యైన నూతనహవిర్భోజనముచేత; బర్హిర్ముఖావళులు = దేవగణములు; ఎల్లప్డున్ = నిరంతరమును; అమర్త్య భావము = మరణము లేకుంటను; అజరత్వంబు = ముసలితనము లేమిని; ఊని = వహించి; మోదింపఁగన్ = సంతసించు చుండఁగా, దీనికి పండు నను సమాపకక్రియతో నన్వయము. అనఁగా బర్హిర్ముఖులకు (గడ్డిదినువారికి) అమృతముతోఁ బండిన లోకోత్తర మైన శాలిహవిస్సు భుజించుటయు, నమర్త్యత్వాజరత్వములుగలుగుటయు, లోకోత్తరానందహేతు వగు నని యాశ యము. గంగానది కాల్వల చేత ముక్కారుపంటలు పండుచుండఁగా విప్రులు యాగము లెప్పుడుఁ జేయుచు దేవతలను సంత సింపఁ జేయుదు రని భావము. ఇచట బర్హిర్ముఖుల నిష్ఠాజరత్వామర్త్యభావములను గూర్చి హేతువు గాని విబుధద్వీపిన్యనర్ఘా మృతఫలితశాలిహవిర్భోజనమును హేతువుగా సంభావన చేయుటవలన హేతూత్ప్రేక్షాలంకారము. అదియు నమృతశబ్దగత రూపకముతో సంకీర్ణంబు.
చ. అనువనసారణీతటయు◊గాంబుజబృందమరందపూరము
ల్గనిమలు నిండి యానదిజ◊లంబులతోఁ బ్రవహింపఁ బై పయిన్
జను నళిపంక్తి బొల్పెసఁగు ◊సాగరనీరముఁ ద్రావి దప్పిచే
ననిశము మేఘమాలిక త◊దంబుకదంబము గ్రోలఁ జేరె నాన్. 110
టీక: అనువన సారణీ తటయుగాంబుజబృంద మరందపూరముల్ – అనువన=వనము ననుసరించిన, సారణీ= కాల్వల యొక్క, తటయుగ = ఇరుప్రక్కలయందున్న, అంబుజబృంద = పద్మముల గుంపుయొక్క, మరందపూరముల్ = మకరంద ప్రవాహములు; గనిమలు నిండి=కయ్యలు నిండి; ఆనదిజలంబులతోన్= ఆ గంగానదిజలములతో; ప్రవహింపన్= ప్రవహించు చుండఁగా; పై పయిన్ = మీఁదమీఁద; చను నళిపంక్తి =పోవు తుమ్మెదలగుంపు; సాగరనీరమున్=సముద్రోదకమును; అనిశము = ఎల్లప్పుడును; త్రావి = పానము చేసి; దప్పిచేన్= తృష్ణచేత; మేఘమాలిక= మబ్బులగుంపు; తదంబుకదంబము = ఆమక రందయుతమైన గంగాజలమును; క్రోలన్ = త్రావుటకు; చేరె నాన్ = చేరినదా యను నట్లు; పొల్పెసఁగున్ = ఒప్పారును; అళిపంక్తిని మేఘముగా సంభావన చేయుటచే స్వరూపోత్ప్రేక్షాలంకారము.
ఉ. పున్నమరేలఁ గాఁపువిరి◊బోఁడులు కాంచనకందుకంబులం
జెన్నగు చంద్రకాంతతట◊సీమల వజ్రపుబిల్లదొంతి నే
య న్నెరయంగఁ జాలినర◊యంబున మార్చి గ్రహింతు రింపుతో
నన్నది నిర్మలోర్మికల ◊నందిన పూర్ణసుధాంశుమూర్తులన్. 111
టీక: పున్నమరేలన్ = పున్నమరాత్రులయందు; కాఁపువిరిబోఁడులు = కాఁపులయాఁడువారు; కాంచన కందుకంబులన్ = బంగారుచెండ్లచేత; చెన్నగు చంద్రకాంతతటసీమలన్ = ప్రకాశించుచున్న చంద్రకాంతమణిఖచిత మగు తీరప్రదేశములయందు; వజ్రపుబిల్లదొంతిన్ = వజ్రములతో గుండ్రముగాఁ జేయఁబడిన బిల్లలయొక్క దొంతి, ననఁగా నొకదానిపై నొకటి వరుసగాఁ బెట్టిన రాశిని; ఏయన్ = ఏయఁగా; నెరయంగన్ = ఆబిల్ల లంతట నెరసికొనఁగా; చాలినరయంబునన్ = మిక్కిలివేగముచేత; అన్నది నిర్మలోర్మికల నందిన పూర్ణసుధాంశుమూర్తులన్ = ఆగంగయొక్క నిర్మలమైన తరంగములయందుఁ బ్రతిఫలించిన పూర్ణచంద్రుని తనువులను; మార్చి = మార్పుచేసి; ఇంపుతోన్ = సంతసముతో; గ్రహింతురు = పట్టుకొందురు. ఇచట వజ్రపు బిల్ల లనెడు భ్రాంతితోఁ గాఁపువిరిబోఁడులు చంద్రబింబములను గ్రహించుటవలన భ్రాంతిమదలంకారము.
సీ. కమనీయకామినీ◊గానంబు కమనీయ,కామినీగానంబు ◊గలిసి మెఱయఁ,
జక్రాంగచక్రని◊స్వనములు చక్రాంగ,చక్రనిస్వనములు ◊చక్క బెరయ,
బహులహర్యాళికా◊ర్భటికలు బహులహ,ర్యాళికార్భటిక లై◊క్యంబు నొంద,
సారంగరాజఘో◊షంబులు సారంగ,రాజఘోషములు మి◊త్రత్వ మూనఁ,
తే. గలితవాహినికాకల◊కలము నిత్య,కలితవాహినికాకల◊కలము బెరయ,
నప్పురపుఁజెల్మిచేఁ బోలె ◊నమరతటిని,చెంత శుచిజీవనస్థితిఁ జెలఁగు నెపుడు. 112
టీక: ఇందు గంగాపర మైన యర్థము, పురపర మైన యర్థమును దోఁచుచున్నది. కమనీయకామినీగానంబు = మనోజ్ఞస్త్రీల గానము; కమనీయకామినీగానంబు = మనోజ్ఞచక్రవాకస్త్రీల గానము, ‘కామీ స్యా త్కాముకే చక్రవాకే పారావతేఽపి చ’ అని విశ్వము; కామియొక్క స్త్రీ కామిని యగును; కలిసి = కూడి; మెఱయన్ = ప్రకా శింపఁగా; చక్రాంగచక్రనిస్వనములు = రథసమూహముల ధ్వనులు; చక్రాంగచక్రనిస్వనములు = హంససమూహముల ధ్వనులు; చక్కన్ = చక్కఁగా; బెరయన్ =కలయఁగా; బహులహర్యాళికార్భటికలు – బహుల = అధికములగు, హర్యాళికార్భటికలు = అశ్వసంఘములయొక్క హేషలు; బహు = అధికములగు, లహరీ = అలలయొక్క, ఆళికా=సమూహములయొక్క, ఆర్భటికలు = ధ్వనులు; ఐక్యంబు నొందన్ = అభేదము నవలంబింపఁగా; సారంగరాజఘోషంబులు = శ్రేష్ఠగజములయొక్క బృంహితములు; సారంగరాజఘోషములు=గండుతుమ్మెదల రుతములు; మిత్రత్వము = సుహృద్భావమును; ఊనన్ = వహింపఁగా; కలితవాహినికాకలకలము= ఒప్పుచున్న సేనలయొక్క కోలాహలములు; నిత్యకలితవాహినికాకలకలము=ఎల్లప్పుడుఁ గూడు కొన్న ప్రవాహకోలాహలధ్వనులు; బెరయన్ = కూడఁగా; అప్పురపుఁజెల్మిచేఁ బోలెన్ = ఆ విశాలాపురియొక్క మైత్రితోఁ బోలె; అమరతటిని = సురనది; చెంతన్ = సమీపమున; శుచిజీవనస్థితిన్ = నిర్మలమైన బ్రదుకుయొక్క స్థితిచేత, నిర్మలోదకస్థితిచేత ననుట; ఎపుడున్ = సర్వకాలములందు; చెలఁగున్ = ఒప్పును. గంగానది తనయం దున్న కమనీయచక్రవాకస్త్రీగానాదులు విశాలాపురియం దున్న కమనీయనారీగానాదులు పరస్పరసామ్య మున మైత్రి నొందఁగాఁ దానును ప్రీతితోఁ బోలె శుచిజీవనస్థితిని దాల్చి శుచిజీవనస్థితి యైన పురముచెంత వసించిన దనఁగా నొండొ రుల ధర్మము లైక్యముగా నున్న వని భావము. పురమం దున్నవారల జీవనముయొక్క నైర్మల్యమును బట్టి లక్షణచే పురము శుచిజీవన మగు నని యెఱుంగునది. పురసమీపమందు గంగాస్థితి కహేతువు లగు కామినీగానైక్యాదులు హేతువులుగాఁ జెప్పు టచే హేతూత్ప్రేక్షాలంకారము.
క. ఆరాజధాని కధిపతి
యై రాజిల్లును సుచంద్రుఁ డను ◊రాజు, మహో
దారగిరీశోరుదరీ
వారవరీవృత్యమాన◊వైరివ్రజుఁ డై. 113
టీక: ఆరాజధానికిన్ = ఆ నగరమునకు; అధిపతి యై = ప్రభు వై; సుచంద్రుఁ డను రాజు = సుచంద్రుఁడను నామము గల రాజు; మహోదార గిరీ శోరుదరీ వార వరీవృత్యమాన వైరివ్రజుఁ డై – మహోదార = మిక్కిలి యధికము లగు, గిరీశ = పర్వతశ్రేష్ఠములయొక్క, ఉరుదరీ = గొప్పదరులయొక్క, వార = సంఘములయందు, వరీవృత్యమాన = మిక్కిలి వసించినట్టి, వైరివ్రజుఁ డై = శత్రుసంఘము గల వాఁ డై; రాజిల్లును = ప్రకాశించును.
సీ. తనచారుకీర్తిసం◊తానవల్లరికి స,జ్జాలముల్ సజ్జాల◊లీల నెనయఁ,
దననిత్యదానాంబు ◊వనజాలయమునకుఁ, బుష్కరం బతినీల◊పుష్కరముగఁ,
దనఖడ్గపుత్ర్యభి◊ధానకాదంబిని, కరిరాజు లరిరాజు ◊లై తలంకఁ,
దననవ్యధామసాం◊ద్రద్యోతమునకు ఖ,ద్యోతుండు ఖద్యోత◊రీతిఁ బూనఁ,
తే. దనభుజాభోగిరాడ్భోగ◊మునకు ధరణి,చక్ర మెంతయుఁ జక్రప్ర◊శస్తి బెరయ,
వెలయు నభిరామసౌందర్య◊విజితమదన,శక్రసుతచంద్రవిభుఁడు సు◊చంద్రవిభుఁడు. 114
టీక: అభిరామ సౌందర్య విజిత మదన శక్రసుత చంద్ర విభుఁడు – అభిరామ = ఒప్పుచున్న, సౌందర్య = చక్కఁదనముచేత, విజిత=జయింపఁబడిన, మదన=మన్మథునియొక్కయు, శక్రసుత= జయంతునియొక్కయు, చంద్ర = చంద్రునియొక్కయు, విభుఁడు = విశేషకాంతి గల వాఁ డైన; సుచంద్రవిభుఁడు= సుచంద్రమహారాజు; తనచారుకీర్తిసంతానవల్లరికిన్ = తనయొక్క కీర్తి యనెడు కల్పవల్లికి; సజ్జాలముల్ = రిక్కలగుంపులు; సజ్జాలలీలన్ = లెస్స యగు మొగ్గలయొక్క లీలవంటి లీలను; ఎనయన్ = పొందఁగా; తన నిత్య దానాంబు వనజాలయమునకున్= తనయొక్క నిరంతరదానోదక మనెడు సముద్రమునకు; పుష్కరంబు = ఆకసము; అతినీలపుష్కరముగన్ = మిక్కిలి నల్లనైన తామర కాఁగా; తన ఖడ్గపుత్ర్యభిధాన కాదంబినికిన్ = తన చురకత్తి యనెడు మేఘమాలకు; అరిరాజులు = శత్రురాజులు; అరిరాజు లై = జక్కవ రాజు లై; తలంకన్ = భయపడఁగా; తన నవ్యధామ సాంద్ర ద్యోతమునకున్ = తన ప్రతాప మనెడు దట్టమైన యెండకు; ఖద్యోతుండు = సూర్యుండు; ఖద్యోతరీతిఁ బూనన్ = మిడుఁగుఱుపురుఁగురీతిని వహింపఁగా; తన భుజా భోగిరా డ్భోగమునకున్ = తన భుజ మనెడు నాదిశేషుని ఫణమునకు; ధరణిచక్రము =భూచక్రము; ఎంతయున్ = అధికముగా; చక్రప్రశస్తిన్ = చక్రాయుధఖ్యాతిని; బెరయన్ = పొందఁగా; వెలయున్ = ప్రకాశించును. ఇచట శ్లేషానుప్రాణిత పరంపరితరూపకములకు సంసృష్టి యగు.
చ. అలఘుమహంబునం, గువల◊యప్రియకారినిజోదయంబున
న్లలితవసుచ్ఛటావితర◊ణంబున, నిస్తులలక్షణంబునం,
గలితచకోరదృఙ్నవసు◊ఖప్రదరూపమునం, గడున్ విరా
జిలు నలరాజు గైకొనఁగఁ ◊జెల్లదె ధాత్రి సుచంద్రనామమున్. 115
టీక: అలఘుమహంబునన్ = అధిక మైన తేజస్సుచేతను, అధిక మైన యుత్సవముచేత నని భావము; కువలయ ప్రియకారి నిజోదయంబునన్ = నల్లకల్వలకుఁ బ్రియమును చేయు తనయావిర్భావముచేత, భూవలయమునకుఁ బ్రియముఁ జేయు తన యభివృద్ధిచేత ననుట; లలిత వసు చ్ఛటా వితరణంబునన్ = మనోజ్ఞమైన కిరణపరంపరయొక్క యీవిచేత, మనోజ్ఞసువర్ణ చ్ఛటాదానముచేత ననుట; నిస్తుల లక్షణంబునన్ = అసమాన మగు కలంకముచేతను, సాటిలేని రాజచిహ్నముచేత ననుట; కలిత చకోరదృ ఙ్నవ సుఖ ప్రద రూపమునన్ – కలిత = ఒప్పుచున్న, చకోర = వెన్నెలపులుగులయొక్క, దృక్ = చూపు లకు, నవ = నూతన మౌనట్టుగా, సుఖప్రద = సుఖము నిచ్చు, రూపమునన్ = స్వరూపముచేత; కలిత = ఒప్పుచున్న, చకోర దృక్కులనఁగా స్త్రీలు, వారి కపూర్వసుఖమునిచ్చు (సుందర) రూపముచే ననుట; కడున్ = మిక్కిలి; విరాజిలు అలరాజు = ప్రకాశించు నా రాజు; సుచంద్రనామమున్ = సమీచీన మైన చంద్రనామమును; ధాత్రిన్ = భూమియందు; కైకొనఁగఁ జెల్లదె = స్వీకరింపఁగఁ జెల్లదా, అనఁగాఁ జంద్రునియం దున్న తేజము, కువలయ ప్రియకారి యగు నుదయము, వసుచ్ఛటావితరణము, సాటిలేని చిహ్నము, చకోరదృఙ్నయనసుఖప్రదరూపము గలిగియుండఁగా జంద్రుఁ డను నామ మతనికిఁ జెల్లు నని భావము. ఇచట వర్ణనీయరాజునందు సమర్థనీయ మగు చంద్రనామమును గూర్చి, యలఘుమహంబున నిత్యాదులను హేతువులుగా సమర్థించినందునఁ గావ్యలింగభేదము.
సీ. పుణ్యజనప్రియ◊మున మించు నేరాజు, ప్రబలు నేరా జవి◊పక్షగుప్తి,
నైకసహస్రాక్ష్య◊వాప్తకుం డేరాజు, సకలాశ లేరాజు ◊చక్కఁ బ్రోచు,
బహువజ్రభూషల ◊ భాసిల్లు నేరాజు, దనరు నేరాజు స◊త్కవిహితాత్మఁ,
బరదేవహరణచా◊తురి నొప్పు నేరాజు, బలయుక్తి నేరాజు ◊ పరిఢవిల్లుఁ,
తే. జెలఁగు నేరాజు నిచ్చ య◊శృంఖలైక,లక్ష్ము లొప్పారఁ దను ఘను ◊ల్భక్తిఁ గొలువ,
నహహ యారాజు దనరు ది◊వ్యప్రణుత్య,మానితగుణాంశపరిజితా◊మర్త్యరాజు. 116
టీక: ఈ పద్యమున సుచంద్రునియం దింద్రునకన్న విశేషము వర్ణితం బయ్యె. ఏ రాజు = ఏ భూమీశుఁడు; పుణ్యజన ప్రియమునన్ = పుణ్యాత్ములయందలి ప్రీతిచేత; మించున్ = అతిశయించునో, ఇంద్రుఁడు పుణ్యజనప్రియుఁడు గాఁడని వ్యతిరేకము, రాక్షసప్రియుఁడు గాఁడని భావము; ఏరాజు, అవిపక్షగుప్తిన్ =శత్రువులు గాని వారి యొక్క రక్షణముచేత, ప్రబలున్ = అతిశ యించునో, ఇంద్రుఁడట్లు కాఁడని వ్యతిరేకము, పర్వతములయొక్క ఱెక్కల గోప నముచేత నింద్రుఁడు ప్రబలువాఁడు కాఁడని భావము; ఏ రాజు = ఏ భూమీశుఁడు; నైక సహస్రాక్ష్యవాప్తకుండు – నైక = అనేకము లైన, సహస్ర = సహస్రసంఖ్యలు గల, అక్షి = రథ ములను, అవాప్తకుండు = పొందినవాఁడు; ఇంద్రుఁడు (ఏకసహస్రాక్ష్యవాప్తకుండు) ఒక వేయి నేత్రములు గలవాఁడని భావము, నైకసహస్ర యనుచోట ‘సుప్సుపా’ యను సూత్రముచేత సమాసము; ఏరాజు, సకలాశలు = అన్నిదిక్కులు; చక్కన్ = చక్క గా; ప్రోచున్ = పాలించునో, ఇంద్రుఁ డొక్క తూర్పు దిక్కునే పాలించు నని భావము. ఏరాజు, బహు వజ్ర భూషలన్ = అనేకహీరమయ మైన భూషణములచేత, భాసిల్లున్ = ప్రకాశించునో, ఇంద్రుఁడు బహువజ్ర భూషలు గలవాఁడు కాఁడు, మఱేమన్న నొక వజ్రాయుధ మనెడు భూషచే రాజుల్లువాఁ డని భావము; ఏరాజు, సత్కవిహితా త్మన్ = మంచి పండితులకు హిత మైన స్వభావముచేత, తనరున్ = ఒప్పునో, ఇంద్రుఁడు సత్కవిహితాత్మచేఁ దనరఁడు, అనఁగా శ్రేష్ఠుఁడైన శుక్రునకు హితుఁడు కాఁడనుట; ఏరాజు, పర దేవ హరణ చాతురిన్ = పరరాజసంహారచాతుర్యముచేత, ఒప్పున్ = అతిశయించునో, ఇంద్రుఁడు పరదేవహరణ చాతురి గలవాఁడు కాఁ డనుట; ఏరాజు, బల = సామర్థ్యముయొక్క, యుక్తి న్ = సంబంధముచేత, పరిఢవిల్లున్ = అతిశయిల్లు నో, ఇంద్రుఁడు బలయుక్తిచేతఁ బరిఢవిల్లడు, అనఁగా బలాసురుని సంబంధము చేయఁ డనుట; ఏరాజు, నిచ్చ = ఎల్లప్పుడును, అశృంఖ లైక లక్ష్ములు = అడ్డములేనట్టి ముఖ్యసంపదలు, ఒప్పారన్ = ఒప్పుచుండఁగా, తనున్ = తన్ను, ఘనుల్ = గొప్పవారు; భక్తిన్ = ప్రీతిచేత; కొలువన్ = సేవింపఁగా; చెలఁగును = ఒప్పునో. ఇంద్రుఁ డశృంఖ లైకలక్ష్ము లొప్పారఁ దన్ను ఘనుల్ గొలువఁ జెలఁగువాఁడు కాఁడు, అనఁగా శృంఖలములతోఁ దగిలియున్న మేఘములతో సేవింపఁబడువాఁడని భావము; దివ్యప్రణుత్య మానితగుణాంశ పరిజితామర్త్యరాజు = దేవతలచేతఁ గొనియాడఁ దగిన పూజ్యము లగు గుణలేశములచేత నోడింపఁబడిన యింద్రుఁడు గలవాఁ డైన; ఆరాజు = ఆ సుచంద్రుఁడు; తనరున్ = ఒప్పును; అహహ = ఆశ్చర్యము; సుచంద్రుఁడు మనుష్యమాత్రుండయ్యు సర్వాతిశయగుణగరిష్ఠుం డగు నింద్రునిఁ దనగుణలేశముచేత జయించుట యాశ్చర్య మని యాశయము. వ్యతిరేకాలంకారము.
మ. పరిసంవర్ధిత చంద్రనాగకులరా◊ట్పద్మామృతం బై నిరం
తరముం బొల్చు తదుర్వరాధిప సము◊ద్యత్కీర్తివారాశి పం
కరుహాజాండము నిండుటల్ నిజ మటుల్ ◊గా కున్నచోఁ బుష్కరా
న్తరసీమం గనుపట్టునే తరణిమ◊ణ్డల్యేకసంచారముల్. 117
టీక: పరిసంవర్ధిత చంద్ర నాగకులరా ట్పద్మామృతం బై – పరిసంవర్ధిత = వృద్ధిఁ బొందింపఁబడిన, చంద్ర = చంద్రుఁడు, నాగ కులరాట్ = ఐరావతము, పద్మా = లక్ష్మి, అమృతం బై = సుధయుఁ గలదై అని సముద్రపర మైన యర్థము, మిక్కిలి ఖండింపఁ బడిన చంద్రుఁడు, ఐరావతము, పద్మములు (అనఁగాఁ దెల్లదామరలు), అమృతమును గలదై యని కీర్తిపరమైన యర్థము; నిరంతరమున్ = ఎల్లప్పుడును; పొల్చు తదుర్వరాధిప సముద్యత్కీర్తివారాశి = ఒప్పుచున్న యారాజుయొక్క ప్రకాశించుకీర్తి యనెడు సాగరము; పంకరుహాజాండము=పద్మమందు నుదయించిన బ్రహ్మసంబంధి యైన అండము, అనఁగా బ్రహ్మాండము ; నిండుటల్ = నిండి యుండుటలు; నిజము = సత్యము; అటుల్ గాకున్నచోన్ = అట్లు కీర్తివారాశి బ్రహ్మాండము నిండకున్నచో; పుష్కర = ఆకాశ మనెడు నీటియొక్క; అన్తరసీమన్ = మధ్యప్రదేశమందు; తరణిమణ్డలి = ఖగపూషహిరణ్యగర్భాదిసూర్య మండలి యనెడు నావలగుంపులయొక్క; ఏక = ముఖ్య మగు; సంచారముల్= సంచరణములు; కనుపట్టునే = చూపట్టునా?
కీర్తివారాశి బ్రహ్మాండము నిండనియెడ నాకాశమధ్యమున నావలు సంచరించుట ఘటింపదు గావునఁ గీర్తివారాశి బ్రహ్మాం డములు నిండినదే నిజ మని యాశయము. సుచంద్రుని కీర్తి చంద్రాదులను తిరస్కరించి యనఁగా వానికన్న నెక్కు డైన శుక్లగుణ మును వహించి, సముద్రమువలె బ్రహ్మాండములు వ్యాపించినదని భావము. ఇచటఁ గీర్తివారాశికర్తృక బ్రహ్మాండవ్యాపనమును పుష్కరాధికరణతరణిమండలీసంచారములతో నూహించినందున నుపమాలంకారము.
చ. అలఘుసమిత్తలంబున మ◊హామహిమంబునఁ బొల్చు నాకుభృ
త్కులమణిదోఃప్రతాపశిఖి◊కూట మిభశ్రుతివీజనానిలం
బులఁ గడుఁ బర్వినం గరఁగుఁ◊బో యని కాదె యజాండసీమకున్
వలగొనఁ జేసె ధాత యని◊వార్యజలావరణంబు నేర్పునన్. 118
టీక: అలఘుసమిత్తలంబునన్ = అతిశయ మగు యుద్ధరంగ మనెడు సమిధల పట్టున; మహామహిమంబునన్ = అతిశయ మైన మహిమచేత; పొల్చు = ఒప్పుచున్న; ఆకుభృత్కులమణి = ఆ రాజశ్రేష్ఠుఁ డనెడు పర్వతశ్రేష్ఠముయొక్క; దోఃప్రతాప శిఖి కూటము = బాహుప్రతాప మనెడు కారుచిచ్చుగుంపు; ఇభ = ఏనుఁగులయొక్క; శ్రుతి = శ్రోత్రము లనెడు; వీజన = విసనకఱ్ఱల యొక్క; అనిలంబులన్ = వాయువులచేత; కడున్ = మిక్కిలి; పర్వినన్ = వ్యాపించినచో; కరఁగుఁ బో యని కాదె=ద్రవించును పో యని కాదా; ధాత = బ్రహ్మదేవుఁడు; అజాండసీమకున్ = బ్రహ్మాండప్రదేశమునకు; అనివార్యజలావరణంబు = నివారింప రాని జలముయొక్క ఆచ్ఛాదనమును, అనఁగా సముద్రములను; నేర్పునన్ = చాతుర్యముచేత; వలగొనన్ = చుట్టుకొనునట్లు; చేసెన్ = ఒనరించెను. అజాండమునకు జలావరణకరణమును గూర్చి హేతువు గాని సుచంద్రప్రతాపవహ్నిద్రావణమును హేతు వుగాఁ జెప్పుటవలన హేతూత్ప్రేక్షాలంకారము. ప్రతాపాదులయందు శిఖిత్వాద్యారోపమున రూపకాలంకారము.
సీ. గురుతరత్వచిసార◊గుల్మోత్కరమ్ములు, సరసవిహారమం◊దిరము లయ్యె,
ఘనకందరాముఖో◊ద్గతఝరీజాలంబు, కేళికాదీర్ఘికా◊పాళి యయ్యెఁ,
గటకశోభితతత◊గ్రావకూటంబు లు,ద్భ్రాజదాస్థానవి◊తర్దు లయ్యె,
నభినవశతపర్వి◊కావృతాధిత్యకల్, కలితప్రసవతల్ప◊కులము లయ్యె,
తే. సంతతము నాటవికవర◊సముదయంబు, లభిమతవయస్యవర్యచ◊యమ్ము లయ్యె,
మలయ నగవీథి నమ్మహీ◊వలయనాథ,చంద్రశాత్రవగోత్రాత◊లేంద్రతతికి. 119
టీక: అమ్మహీవలయనాథచంద్ర శాత్రవగోత్రాతలేంద్రతతికిన్ – అమ్మహీవలయనాథచంద్ర= ఆరాజచంద్రుఁ డగు సుచంద్రుని యొక్క, శాత్రవగోత్రాతలేంద్రతతికిన్ =శత్రురాజబృందమునకు; అగవీథిన్= పర్వతప్రదేశమందు; మలయన్ = తిరుగునట్లుగా; కాదేని, మలయనగవీథిన్ = మలయపర్వతప్రాంతమం దని యర్థము; గురుతర త్వచిసార గుల్మోత్కరమ్ములు – గురుతర = మిక్కిలి గొప్పవైన, త్వచిసారగుల్మ = వేణుగుల్మములయొక్క, ఉత్కరమ్ములు = సమూహములు; సరసవిహారమందిరములు = శ్రేష్ఠము లగు క్రీడాగృహములు; అయ్యెన్ = ఆయెను; ఘన కందరా ముఖోద్గత ఝరీ జాలంబు = గొప్పనైన దరీముఖంబులవలన బయలుదేఱుచున్న సెలయేఱుల గుంపు; కేళికా దీర్ఘికాపాళి = క్రీడావాపీసమూహము; అయ్యెన్ = ఆయెను; కటక శోభిత తత గ్రావ కూటంబులు – కటక = కొండల నడిమిభాగములందు, శోభిత = ప్రకాశించుచున్న; తత = విశాలము లగు, గ్రావ = శిలలయొక్క, కూటంబులు = గుంపులు; ఉద్భ్రాజ దాస్థాన వితర్దులు – ఉద్భ్రాజత్ = ప్రకాశించుచున్న, ఆస్థాన = కొలువుకూటమందలి, వితర్దులు = వేదికలు; అయ్యెన్ = ఆయెను; అభినవ శతపర్వి కా వృతాధిత్యకల్ – అభినవ = నూతన మగు, శతపర్వికా = నల్లగఱికచేత, ‘గోలోమీ శతపర్వికా’ అని యమరుఁడు, ఆవృత = వ్యాప్తము లగు, అధిత్యకల్ = పర్వతోపరిప్రదేశములు, ‘ఉపత్య కాద్రే రాసన్నా భూమి రూర్ధ్వ మధిత్యకా’ అని యమరుఁడు; కలిత ప్రసవ తల్ప కులములు – కలిత = ఒప్పుచున్న, ప్రసవతల్ప = పువ్వులపాన్పులయొక్క, కులములు = సమూహములు; అయ్యెన్ = ఆయెను; సంతతమున్ = ఎల్లప్పుడును; ఆటవికవర సముదయంబులు = ఆరణ్యకు లైన కిరాతకుల గుంపులు; అభిమత వయస్యవర్య చయమ్ములు = అనుకూల మైన మిత్రవరుల సమూహములు; అయ్యెన్ = ఆయెను. సుచంద్రనరేంద్రుని యుగ్రప్రతాపమువలన భీతు లయి యరినృపతు లడవుల పాలై రని భావము. ఇందు రూపకములకు సంసృష్టి.
మ. ఇల సజ్జాలకభాసమాన మగు నా◊పృథ్వీశు కీర్త్యాఖ్య ని
ర్మల హర్మ్యేంద్రమునం దదీయ నవధా◊మ వ్యాజ మార్తాండమం
డల రోచుల్ ప్రసరింప నచ్చటఁ గన ◊న్రాజిల్లు వేధోండమ
ణ్డలు లెంతేఁ ద్రసరేణుబృందసమత ◊న్సంధించి యెల్లప్పుడున్. 120
టీక: ఇలన్ = భూమియందు; సజ్జాలక భాసమాన మగు – సత్ = శ్రేష్ఠము లగు, జాలక = గవాక్షములచేత, భాసమాన మగు = ప్రకాశించునది యని సౌధపరమైన యర్థము, సత్పురుషుల సంఘముచేత భాసమాన మనఁగాఁ గొనియాడఁబడిన దని కాని, సజ్జాలకములవలె ( అనఁగా నక్షత్రముల గుంపులవలె, లేదా శ్రేష్ఠము లగు మొగ్గలవలె) ప్రకాశించునది యని కాని కీర్తి పరమైన యర్థము; ఆ పృథ్వీశు = ఆ రాజుయొక్క; కీర్త్యాఖ్య = కీర్తి యను నామము గల; నిర్మల = స్వచ్ఛ మగు; హర్మ్యేంద్రమునన్ = ఉత్తమసౌధమునందు; తదీయ నవధామ వ్యాజ మార్తాండ మండల రోచుల్ = ఆ రాజు సంబంధి యైన ప్రతాప మనెడు నెపము గల సూర్యమండలకాంతులు; ప్రసరింపన్ = వ్యాపింపఁగా; అచ్చటన్ కనన్ = ఆ మేడలోఁ జూడఁగా; వేధోండ మణ్డలులు = బ్రహ్మాండముల గుంపులు; ఎంతేన్ = మిక్కిలి; త్రసరేణుబృందసమతన్ – త్రసరేణు = త్ర్యణుకములయొక్క; బృంద = గుంపు యొక్క; సమతన్ = సామ్యమును; సంధించి =పొంది; ఎల్లప్పుడున్= సర్వకాలములయందు, ప్రతాపసూర్యప్రభ దివారాత్రము లుడివోవనిది గావున నెల్లప్పుడు ననుట; రాజిల్లున్ = ప్రకాశించును. అనఁగా నొక మేడయందు గవాక్షద్వారముగ సూర్యకిరణ ములు ప్రసరింపఁగా నాతేజస్సునందుఁ బరాగాదుల సూక్ష్మావయవములు గాన్పించిన యట్లు సుచంద్రునికీర్తి యను మేడలో నారాజు ప్రతాపవ్యాజ సూర్యకాంతులు ప్రస రింపఁగా నచట బ్రహ్మాండకోటులు త్ర్యణుకములగుంపులవలెఁ గాన్పించు నని యాశయము. ఇందులకు ‘శ్లో. జాలసూర్యమరీచిస్థం సూక్ష్మం యద్దృశ్యతే రజః, తస్య షష్ఠతమోభాగః పరమాణు స్స ఉచ్యతే’ అని తర్కపరిభాషయందుఁ జెప్పఁబడినది. ఆ పరమాణువు, ద్వ్యణుకమును చక్షుఃప్రత్యక్షగోచరములు గా వనియుఁ, ద్ర్యణుకము మొదలుగఁ బ్రత్యక్షగోచరము లగు ననియు వ్రాయఁబడియె. ఇట్లు చెప్పఁగా సుచంద్రునికీర్తి సమస్తబ్రహ్మాండముల నావరించిన దనియు, నారాజు ప్రతాపము సూర్యప్రభవలె దివారాత్ర ములు వెలుగుచున్న దనియు భావము.
సీ. ఆత్మకిరాతత్వ◊మత్యుత్సవముఁ బూన్ప, వనచరావృతిఁ గూర్మ◊వర్యుఁ డలరు,
ననిశంబు దర్వీక◊రాప్తిఁ జేకొని మహా,ప్రజ్ఞుఁ డై కుండలి◊రాజు దనరుఁ,
బరపద్మినీసుసం◊పర్కంబుఁ జేసి దృ,ప్తుం డయి దిక్కరీం◊ద్రుండు ప్రబలు,
బహ్వబ్దసంగతిఁ ◊బడసి యెచ్చటఁ జరిం◊పఁగ నోపక కులాద్రి◊భర్త నిల్చు,
తే. గహనముల నొక్కఁ డై దంష్ట్రి◊కాంతుఁ డడరు, ననుచు నిరసించి సత్కులు, ◊నమలరూపు,
ననఘగుణు, నాత్తయౌవను, ◊నలఘుసంప,దాఢ్యు రాకొమరునిఁ జెంది ◊యవని యలరు. 121
టీక: కూర్మవర్యుఁడు = ఆదికూర్మము; ఆత్మకిరాతత్వము = తన బోయతనము; అత్యుత్సవమున్ = అతిసంతసమును; పూన్పన్ = వహింపఁజేయఁగా; వనచరావృతిన్ = అరణ్యసంచారుల వ్యాప్తిచేత; అలరున్ = ఒప్పును; ఆత్మకున్, ఇరా తత్వము=ఉదకమందు సంతతసంచారము అత్యుత్సవముఁ బూన్పఁగా , వనచర అనఁగా జలచరములైన మత్స్యాదులయొక్క ఆవృతిచేతఁ గూర్మవర్యుఁ డలరు నని భావము, ‘ఇరా భూ వాక్సురాప్సు స్యాత్’ – అని యమరుఁడు;
కుండలిరాజు = శేషుఁడు; అనిశంబు = ఎల్లపుడు; దర్వీ= తెడ్లవంటి; కర = హస్తములయొక్క; ఆప్తిన్ = కలుగుటను; చేకొని = పొంది; మహాప్రజ్ఞుఁ డై = మిక్కిలి ప్రకృష్టములైన మోకాళ్ళు గలవాఁడై;, ‘ప్రజ్ఞుః ప్రగతజానుకః’ అని యమరుఁడు, ‘ప్రసంభ్యాం జానునోర్జ్ఞుః’ అను సూత్రముచేత జానుశబ్దముపై ‘జ్ఞు’ ఆదేశ మగును. విశేషణద్వయముచేత శేషుఁడు కురూపి యని తోఁచు చున్నది. ఎల్లప్పుడు సర్పసాంగత్యము గలవాఁ డనియు, మహాబుద్ధిశాలి యనియు భావము; తనరున్ = ఒప్పును; దిక్కరీంద్రుండు = దిగ్గజరాజు; పరపద్మినీసుసంపర్కంబున్ = పరస్త్రీసాంగత్యమును; చేసి = కావించి; దృప్తుం డయి = గర్వియై; ప్రబలున్ = అతిశయించును; దిక్కరి గొప్ప యాఁడేనుఁగుతో సంబంధముఁ జేసి మత్తుగొని యుండునని భావము. పద్మియొక్క స్త్రీ పద్మినీ, పద్మి యనఁగా గజము, ‘ఇభ స్తమ్బేరమః పద్మీ’ అని యమరుఁడు. కులాద్రిభర్త = కులాచలశ్రేష్ఠము; బహ్వబ్దసంగతిన్ = అనేకసంవత్సరముల సంబంధమును; పడసి = పొంది; ఎచ్చటఁ జరిం పఁగ నోపక = ఎచ్చటను సంచరింపఁజాలక; నిల్చున్ = నిల్చును; మిక్కిలి వృద్ధత్వము గలవాఁడని తోఁచుచున్నది. కులాద్రి భర్త బహుళమైన యబ్దము లనఁగా మేఘములు, వానితోఁ గూడి చరింపఁగనోపక యనఁగా రేఫలకారముల కభేదము గావునఁ జలింపఁగ నోపక, అచలత్వముచేత నొప్పి నిల్చియుండు నని భావము; దంష్ట్రికాంతుఁడు = వరాహపతి; ఒక్కఁ డై = వెనుక, ముందు లేనివాఁడై; గహనములన్ = దుఃఖములచేత; అడరున్ = అతిశ యించును. వరాహము తా నొక్కటియే యడవులయందుసంచరించు ననుట; అనుచున్ = ఇట్లనుచు; అవని = భూరమణి; నిరసించి = కూర్మరాజు మొదలగువారిని నిరాకరించి; సత్కులున్ = ఉత్తమ కులమువాని, కూర్మరాజువలె నీచజాతివాఁడు గానివాని ననుట. ఇట్లు గీతియందుఁ జెప్పిన వ్యతిరేకవిశేషణములకుఁ గ్రమముగా నన్వయము దెలియునది; అమలరూపున్ = లోకోత్తరసౌందర్యము గలవాని; అనఘగుణున్ = నిష్కల్మషము లైన గుణములు గలవాని; ఆత్తయౌవనున్ = రూఢతారు ణ్యము గలవాని;అలఘు సంపదాఢ్యున్ = అధికమైన పుత్రమిత్రకళత్రాదిసంపదచేఁ బూర్ణుని; రాకొమరునిన్ = రాజపుత్రుం డగు సుచంద్రుని; చెంది =పొంది; అలరున్ = ఒప్పును. సుచంద్రుఁడు సర్వభూమిభరణముఁ జేయుచు, సర్వగుణసంపత్తిచేత రాజిల్లె నని భావము. వ్యతిరేకక్రమాలంకారములు.
మ. కనుఁజాయన్ సిరి వాయ కెప్పుడుఁ జెలం◊గన్, సమ్ముఖం బంది పా
వని వాగ్భామిని యొప్పఁ, గీర్తి శుచిభా◊వం బూని సేవింప, మే
దిని బాహాంతరసంగతిం బొదల, ధా◊త్రీభర్త దాక్షిణ్యవ
ర్తనసత్ప్రీతి వహించి మించు సురవ◊ర్యస్తుత్యనిత్యోన్నతిన్. 122
టీక: సిరి = లక్ష్మి; కనుఁజాయన్ = కన్నులయెదుట ననుట; ఎప్పుడున్ = ఎల్లకాలమును; పాయక = వదలక; చెలంగన్ = ఒప్పఁగా, రాజులకు సిరి కనుఁజాయ ననఁగా నేత్రకాంతియం దుండుననుట ప్రసిద్ధము; పావని = పవిత్ర యగు వాగ్భామిని, వాణి యను స్త్రీ; సమ్ముఖంబు = ఆభిముఖ్యమును; అంది = పొంది; ఒప్పన్ = ఒప్పుచుండఁగా; కీర్తి = కీర్తికాంత; శుచిభావంబు = శుద్ధాంతఃకరణమును, నిర్మలస్వభావము ననుట; పూని = వహించి; సేవింపన్ = కొలుచుచుండఁగా; మేదిని = భూమి; బాహాంతరసంగతిన్ = వక్షఃస్థలము యొక్క సంబంధముచేత, భుజమధ్యసంబంధముచేతననుట, భూదేవి భుజముచేఁ బాలింపఁ బడుట ప్రసిద్ధము; పొదలన్ = ఒప్పఁగా; ధాత్రీభర్త = సుచంద్రుఁడు; దాక్షిణ్యవర్తనన్ = దక్షిణనాయకభావ మనెడు వృత్తిచేత, ‘తుల్యోఽనేకత్ర దక్షిణః’ అని లక్షణము, మొగమోటపునడవడిచేత ననుట; సత్ప్రీతిన్ = మంచి ప్రేమమును, విద్వత్ప్రీతి ననుట; వహించి = పూని; సురవర్యస్తుత్యనిత్యోన్నతిన్ = దేవతోత్తములచేఁ గొనియాడఁ దగిన నిత్యవైభవాతిశయముచేత; మించున్ = అతిశయించును; సుచంద్రనృపతి కటాక్షప్రసరణ మాత్రమున లక్ష్మి గలుగుననియు, నాతండు సర్వవిద్యలు చదివినవాఁ డనియు, నుత్కృష్టకీర్తిశాలి యనియు, సర్వభూమిని పాలించువాఁ డనియు భావము.
వ. సకల జగచ్ఛాసన పాండితీ ధురంధరుం డగు నా రాజశేఖరుం డొక్కనాఁ డాత్మీయసేవా సమాయాత నానాదిశాధినాయక మనోమహోత్పలోల్లాస సంపాదక విభా విభాసిత చంద్రమకుటాలంకృ తోత్తమాంగుం డును, గరుణారస పరిపూరి తాపాంగుండును, నఖిల భువన విజిగీషు ప్రసవేషుయోజిత రసాలశరాస నాంతర దృశ్యమాన కోకనదపలా శాదభ్రవిభ్రమద భ్రూమధ్య విరోచమాన శిఖి శిఖాంచిత విశేషక విశేషుం డును, వదనేందు నిర్గత చంద్రికాయిత దరహాస భూషుండును, మహాభోగ మణిగణ సముపే తాహీనాంగద శోభిత బాహుండును, నతనుభూతి భాసమాన దేహుండును, ననవధి కైక సద్ద్యుతి యుక్త హార విభూషిత గళుండును, శారద ఘన ప్రభా జయకృత్త్యసితాంశుక సంవేష్టిత నితంబతలుండును, హరివిరోచన సంతతి రసాధీశరాజ వరమకుటవాటికా ఘటిత సరోజ రాగమరీచి రాజి నీరాజిత చరణ కుశేశయుండును, ధీరగ ణాలో కామోదదాయి శృంగారాతిశయుండును నగుచుఁ గలిత మహారజతకూట స్తంభవారంబులం, గమ నీయ కాంచన వితాన గుచ్ఛ ప్రభాంకూరంబులం, గలకంఠికాజన గానామృ తాసారంబులం గర మొప్పు కలధౌతాగారారాజ దాస్థానభవనరాజంబునం గనత్తరాహిరిపుమణిమయ భద్రాసనంబున సుఖాసీనుండై, యహిత మహాబల విధ్వంసన శంసనీయ సామర్థ్య ధురీణుండు గావున నిజపరాభూతి కారణ దారుణ సమీరణ సముత్సారణంబు గోరి తనకు విన్నవింపం జేరిన మేఘమండలంబుడంబున నొక్క విబుధ కుధర కుచారత్నంబు వట్టిన మేఘడంబరంబు గనకఝల్లరీ శంపావల్లరీ భాసురం బై యేపు సూప, నరిభేద నోదార కరకాండ మండిత రాజసాహాయ్యంబును, నతిదీప్రతర ప్రకాశాన్విత సదనీక సాంగత్యంబును నధిగమించి విజృంభించు నిశాధిదేవతతో జగడంబు చరింప నోపక పట్టువడిన యంబుజాప్తబింబంబు తీరున నొక్కహరినీలకుంతలావతంసంబు వూనిన యభిరూప జాతరూప హంసరూప ధూప కరండంబు వలనఁ జాలుగా వెడలు సామ్రాణి ధూప ధూమమాలికలు తదంతర సంస్థాయి రమారమణ తనూతల వినిర్య దభిరామ శ్యామ ధామాళికల మోహంబు నివ్వటిల్లఁ జేయ, నిరంకుశ పంకజరాగకంకణ క్రేంకార పూర్వకంబుగా నొక్క రాజకీరవాణీలలామ వీచు ధవళవాల వ్యజనంబు లనుపమాన పవమాన మృదు యాన కలనానద్యమాన గగనగంగా తరంగడోలికావీథి నుయ్యల లూఁగు నవదాతపత్రంబులకు సగోత్రం బులై వైచిత్రిఁ జిత్రింప, విశాల విలోచన శతపత్త్రపత్త్ర విలసనంబును విమలభుజామృణాల సౌందర్యంబును వినీల భ్రమరక సౌష్ఠవంబును విరంజిత కింజల్కమాంజుల్యంబును బూని సరసగణ్యలావణ్య వైభవంబున నలరు పద్మినిపై మోహంబు వూని పౌర్వకాలిక వైరంబు డించి ప్రియంబు వచింపఁ జేరి తత్కరకమల లాలితం బగు శీతాంశుమండలంబుదండి నొక్కభుజంగభుఙ్మందయానామతల్లి దాల్చిన కర్పూర కలా చిక నయనామోదవీచికం జేకూర్ప, మహానంది గోరాజకుమారముఖ్యులు సెంతలం గొలువ నపూర్వ విభవంబునం బేరోలగం బుండు నవసరంబున. 123
టీక: ఈవచనంబున రాజశేఖరుం డను కర్తృపదంబుచే నప్రకృతచంద్రశేఖరపరం బైన యర్థాంతరము స్ఫురించుచున్నది. సకల జగచ్ఛాసనపాండితీ ధురంధరుండు= సర్వజగత్పాలనపాండిత్యభారమును వహించువాఁడు; అగు నా రాజశేఖరుండు = అగునట్టి యా రాజపరమేశ్వరుఁడు; ఒక్కనాఁడు, దీనికిఁ బేరోలగం బుండు నవసరంబున ననుదానితో నన్వయము. సకల లోకశిక్షాదక్షుఁడగు ప్రసిద్ధచంద్రశేఖరుం డని యర్థాంతరము; ఆత్మీయ సేవా సమాయాత నానా దిశాధినాయక మనోమహోత్పలోల్లాస సంపాదక విభా విభాసిత చంద్రమకుటాలంకృతోత్త మాంగుండును – ఆత్మీయ సేవా సమాయాత = తనయొక్క సేవకొఱకువచ్చిన, నానా దిశాధినాయక = నానాదిక్కులందలి రాజులయొక్క, మనోమహోత్పల = హృదయకమలముయొక్క, ‘అరవిందం మహోత్పలమ్’ అని యమరుఁడు, ఉల్లాస సంపాదక =వికసనసంపాదక మగు, విభా = విశేషకాంతిచేత, విభాసిత = మిక్కిలి ప్రకాశించుచున్న, చంద్రమకుట = స్వర్ణ కిరీటముచేత, ‘గైరికం వసు చంద్రకమ్’ అని యమరుఁడు, అలంకృత = అలంకరింపఁబడిన, ఉత్తమాం గుండును = శిరస్సు గల వాఁ డని రాజపరమైన యర్థము; ఆత్మీయసేవాసమాయాత నానా దిశాధినాయక = తనయొక్క సేవార్థము వచ్చిన అష్ట దిక్పాలకులయొక్క, మనః = మనస్సనెడు, మహత్ = గొప్పదగు, ఉత్పల = కల్వలయొక్క, ఉల్లాస సంపాదకవిభా విభాసిత మైన, చంద్రమకుట = చంద్రుఁడను కిరీటముచేత, అలంకృతోత్తమాంగుండును = అలంకరింపఁ బడిన శిరస్సు గల వాఁడని యీశ్వరపర మైన యర్థము;కరుణారస పరిపూరితాపాంగుండును = దయాతిశయముచే పూర్ణమగు కటాక్షముగలవాఁడని రెంట నొక్క యర్థమే. ఇచట రసపదమునకు శృంగారాద్యన్యతమ మర్థము గాదు. కరుణాఖ్యరసము శోకస్థాయిక మై, ప్రకృతాననుగుణము గావునను, రస పర మైనపుడు కరుణపదము స్త్రీలింగము గానందున నని తెలియునది. ఇందలి విస్తరము మావ్రాసిన కావ్యాలంకారసంగ్రహవిమ ర్శనమునఁ దెలియును. అఖిల భువన విజిగీషు ప్రసవేషు యోజిత రసాలశరాసనాంతర దృశ్యమాన కోకనదపలా శాదభ్ర విభ్రమద భ్రూమధ్య విరోచ మాన శిఖి శిఖాంచిత విశేషక విశేషుండును – అఖిల భువన = ఎల్లలోకములను, విజిగీషు = జయింపవలెనను కోరిక గల, ప్రస వేషు = మన్మథునిచేత, యోజిత = ఎక్కుపెట్టఁబడిన, రసాలశరాసన = చెఱకువిల్లుయొక్క,‘రసాలత్విక్షు చూతయోః’ అని విశ్వము, అంతర =మధ్యభాగమునందు, దృశ్యమాన = చూడఁబడుచున్న, కోకనదపలాశ = ఎఱ్ఱతామరఱేకుయొక్క, అదభ్ర విభ్రమద = అధికభ్రాంతి నిచ్చెడు, భ్రూమధ్య విరోచమాన = బొమలనడుమ వెలుంగుచున్న, శిఖిశిఖ = కుంకుమచేత, ‘కాశ్మీర జన్మాగ్నిశిఖమ్’ అని యమరుఁడు, అంచిత = ఒప్పుచున్న, విశేషక విశేషుండును = తిలకవిశేషముగలవాఁడును; ఈశ్వరపర మైనపుడు, శిఖిశిఖా = అగ్నిజ్వాలచేత అని మాత్రము భేదము, తక్కినది సమానము. వదనేందు నిర్గత చంద్రికాయిత దరహాస భూషుండును = ముఖ మనెడు చంద్రునివలన వచ్చుచున్న వెన్నెలవలె నుండు మంద హాసము భూషణముగాఁ గలవాఁడని రెంట సమానము. మహాభోగ మణిగణ సముపే తాహీనాంగద శోభిత బాహుండును – మహత్ = అధికమైన, ఆభోగ =పరిపూర్ణత గల, మణి గణ = మణిసంఘములచేత; సముపేత = కూడుకొన్న, అహీన = గొప్పలైన, అంగద = భుజకీర్తులచేత, శోభిత=ప్రకాశించుచున్న, బాహుండును = భుజములు గలవాఁడును, అని రాజపర మైన యర్థము; మహత్ = గొప్పలైన, భోగ =పడగలయందలి, ‘భోగస్తు ఫణకాయయోః’ అని రత్నమాల, మణిగణ = మణిసంఘములచేత, సముపేత = కూడుకొన్న, అహీన = శేషుండను, అంగద = భుజకీర్తులచేత, శోభిత = ప్రకాశించుచున్న, బాహుండును = భుజములు గలవాఁడని యీశ్వరపరమైన యర్థము. అతను భూతి భాసమాన దేహుండును – అతను = అధిక మైన, భూతి =సంపదచేత, భాసమాన =ప్రకాశమాన మగు, దేహుం డును = శరీరము గలవాఁడును, అని రాజపరమైన యర్థము; మన్మథునియొక్క భస్మముచేతఁ బ్రకాశించు దేహము గలవాఁ డని యీశ్వరపర మైన యర్థము. అనవధి కైక సద్ద్యుతి యుక్త హార విభూషిత గళుండును – అనవధిక = మేరలేని, ఏక =ముఖ్యమైన, సద్ద్యుతి=మంచికాంతితోడ, యుక్త = కూడుకొన్న, హార =ముక్తావళిచేత, విభూషిత = అలంకృత మగు, గళుండును = కంఠము గలవాఁడును, అని రాజ పరమైన యర్థము; అనవధి = మేరలేని, కైకస = కీకససంబంధిని యైన, కీకసము లనఁగా నస్థులు, ‘కీకసం కుల్య మస్థి చ’ అని యమరుఁడు, సద్ద్యుతి = మంచికాంతితోడ, యుక్త = కూడుకొనిన, హార =దండలచేత, విభూషిత = అలంకృత మగు, గళుం డును = కంఠము గలవాఁడును, అని యీశ్వరపరమైన యర్థము, శివుఁడు కపాలమాలాధరుఁ డగుట ప్రసిద్ధము; శారద ఘన ప్రభా జయకృ త్త్యసితాంశుక సంవేష్టిత నితంబతలుండును – శారదఘనప్రభా = శరన్మేఘకాంతి యొక్క, జయ = గెలుపే, కృ త్త్య = ప్రయోజనముగాఁ గల, సితాంశుక = శుభ్రవస్త్రముచేత, సంవేష్టిత = చుట్టఁబడిన, నితంబతలుండును = మధ్య ప్రదేశము గలవాఁడును, అని రాజపరమైన యర్థము; శారద = మేఘసంబంధిని యైన, శరదశబ్దముపై ‘తస్యేద’ మను సూత్రము చే నణ్ప్రత్యయము వచ్చినది, ఘనప్రభా = గొప్పకాంతియొక్క, అనఁగా నల్లనికాంతియొక్క, కాదేని, శారద=నూతన మగు, ‘శారదః పీతమన్దేనా ప్రత్యగ్రే ప్రథితే త్రిషు’ అని వైజయంతి, ఘనప్రభా = మేఘముయొక్కకాంతియొక్క, కాదేని, శారదఘన = సజలజలదముయొక్క, స్వార్థికాణ్ ప్రత్యయము, ప్రభా=కాంతియొక్క, జయ = జయము గల, కృ త్తి = గజచర్మ మనెడు; అసితాంశుక = నీలిదుప్పటముచేత, సంవేష్టిత నితంబతలుం డని యీశ్వరపర మైన యర్థము; కైకసద్ద్యుతి, జయకృత్త్యశబ్ద ములలో ‘అనచిచ’ అను సూత్రముచే దకారతకారములకు ద్విత్వము. హరి విరోచన సంతతి రసాధీశరాజ వరమకుట వాటికా ఘటిత సరోజరాగ మరీచిరాజి నీరాజిత చరణ కుశేశయుండును – హరి = చంద్రునియొక్కయు, విరోచన = సూర్యునియొక్కయు, సంతతి = వంశపువారైన, రసాధీశరాజ = నృపశ్రేష్ఠులయొక్క, వర = శ్రేష్ఠము లగు, మకుట = కిరీటములయొక్క, వాటికా = పరంపరలయందు,ఘటిత = కూర్పఁబడిన, సరోజరాగ=పద్మ రాగములయొక్క, మరీచిరాజి = కిరణసమూహముచేత, నీరాజిత = హారతి యెత్తఁబడిన, చరణకుశేశయుండును= పాద పద్మములు గలవాఁ డని రాజపరమైన యర్థము; హరి = ఇంద్రునియొక్క, విరోచనసంతతి = యమునియొక్క, రసాధీశ = వరుణునియొక్క, ‘ఆస్వాదనధ్వని సుధామ్బు రసాఖ్యధాతుష్విష్టో రసః’ అని రత్నమాల, రాజవర = కుబేరునియొక్క, మకుట = కిరీటములయొక్క, వాటికా = పరంపరలయందు, ఘటిత = కూర్పఁబడిన, సరోజరాగ = పద్మరాగములయొక్క, మరీచిరాజి = కిరణసమూహముచేత, నీరాజిత = హారతి యెత్తఁబడిన, చరణ కుశేశయుండును= పాదపద్మములు గలవాఁ డని యీశ్వరపరమైన యర్థము; ధీరగణాలోకామోదదాయి శృంగారాతిశయుండును – ధీరగణ = పండితసమూహముయొక్క, ఆలోక = చూపులకు, ఆమోదదాయి = సంతసము నిచ్చునది యైన, శృంగార = అలంకారముయొక్క, అతిశయుండును = అతిశయము గల వాఁడును, అనఁగా విద్వదభినందనీయ శృంగారాతిశయము గలవాఁ డనుట; శివునిపర మైనపుడు ధీర మగు ప్రమథగణము యొక్క ఆలోకామోదదాయి యగు శృంగార మనఁగా నాట్యము గలవాఁ డని యర్థము, ‘శృఙ్గార స్సురతే నాట్యే రసే దిగ్గజ మణ్డనే’ అని విశ్వము; అగుచున్; కలిత మహారజత కూట స్తంభ వారంబులన్ – కలిత = ఒప్పునట్టి, మహారజత = సువర్ణవికారము లైన, ‘మహారజత కాఞ్చనే’ అని యమరుఁడు, కూట = గృహవిశేషములయొక్క, స్తంభ వారంబులన్ = స్తంభ సమూహములచేతను, అని రాజపర మైన యర్థము; కలిత = ఒప్పుచున్న, మహత్ = అధికములైన, రజతకూట స్తంభ = స్తంభములవంటి వెండిశిఖరములయొక్క, వారంబులన్ = సమూహములచేతనని శివపర మైన యర్థము; కమనీయ కాంచనవితాన గుచ్ఛ ప్రభాంకూరంబులన్ – కమనీయ = మనోజ్ఞము లగు, కాంచనవితాన = బంగరుమేలుకట్ల యొక్క, గుచ్ఛ = ముక్తాదిగుచ్ఛములయొక్క, ప్రభాంకూరంబులన్ = కాంతులయొక్క అంకురములచేతను, ‘భవే దమర్ష ఆమర్షోప్యఙ్కురోఽఙ్కూర ఏవ చ’ అని ద్విరూపకోశము; కమనీయము లగు సంపెఁగతీవలయొక్క పువ్వుగుత్తుల ప్రభాం కూరములచేత నని శివపర మైన యర్థము; కలకంఠికాజన గానామృ తాసారంబులన్ – కలకంఠికాజన = స్త్రీజనముయొక్క, గానామృత = గాన మనెడు సుధయొక్క, ఆసారంబులన్ = ధారాసంపాతములచేతను, ‘ధారాసంపాత ఆసారః’ అని యమరుఁడు; కలకంఠికాజన = ఆఁడుఁగోయిల గుంపులయొక్క, గానామృతాసారంబులచేత నని శివపర మైన యర్థము; కర మొప్పు = మిక్కిలి యొప్పుచున్న; కలధౌతాగారారాజ దాస్థాన భవనరాజంబునన్ – కలధౌతాగార = బంగరుటిండ్లచేత, ఆరాజత్ = ప్రకాశించుచున్న, ఆస్థానభవనరాజంబునన్ = కొలువుకూటపు గృహశ్రేష్ఠమున నని రాజపర మైన యర్థము; కలధౌతాగ = కైలాసపర్వత మనెడు, ఆరారాజత్ = మిక్కిలి ప్రకాశించుచున్న, ఆఙ్ పూర్వకయఙ్లుగంత రాజధాతువుపై శతృప్రత్యయము, ఆస్థానభవనరాజంబున నని శివపర మైన యర్థము, ‘కలధౌతం రౌప్యహేమ్నోః’ అని యమరుఁడు. కనత్తరాహిరిపు మణిమయ భద్రాసనంబునన్ = ప్రకాశించుచున్న గారుత్మతమణిమయమైన సింహాసనమందు, ఇంద్రనీలమణి మయ మైన సిహాసనమందు అని కాని యర్థము; సుఖాసీనుండై = సుఖోపవేశము గల వాఁడై; హిత మహాబల విధ్వంసన శంసనీయ సామర్థ్య ధురీణుండు గావున – అహిత = శత్రువులయొక్క, మహాబల = అతిసామ ర్థ్యముయొక్క, విధ్వంసన = నాశముచేత, శంసనీయ = శ్లాఘనీయమగు, సామర్థ్య = సామర్థ్యముయొక్క, ధురీణుండు కావునన్ = భారవాహి గావున నని యర్థము; అహిత = శత్రువైన, మహాబల = వాయువుయొక్క, విధ్వంసన శంసనీయ సామర్థ్యధురీణుండు గావున నని యర్థాంతరము; నిజపరాభూతికారణ దారుణ సమీరణ సముత్సారణంబు గోరి = తన పరా భవమునకు గారణ మైన వాయువుయొక్క తిరస్కారమును గోరి యని రెంటను నొక యర్థమే; తనకు విన్నవింపం జేరిన మేఘ మండలంబు డంబునన్ – అర్థము స్పష్టము, దీని కేపుసూప ననుదానియం దన్వయంబు. ఒక్కవిబుధ కుధరకుచారత్నంబు పట్టిన మేఘడంబరంబు – ఒక్క = ఒకానొక, విబుధకుధర = మేరువంటి, కుచా = స్తనములు గల వారలలో, రత్నంబు = శ్రేష్ఠ యగు స్త్రీ, పట్టిన మేఘడంబరంబు = ధరించిన నల్లగొడుగు; శివపర మైనప్పుడు – ఒకానొక, విబుధ = దేవసంబంధిని యగు, కుధరకుచారత్నంబు = స్త్రీరత్నంబు పట్టిన మేఘడంబరం బని యన్వయము;
కనకఝల్లరీ శంపా వల్లరీ భాసురం బై – కనకఝల్లరీ = బంగరుజాల రనెడు, శంపావల్లరీ = మెఱుఁపుదీవ చేత, భాసురం బై = ప్రకాశమాన మై; ఏపు సూపన్ = అతిశయింపఁగా, ‘పుణ్డరీకం సితచ్ఛత్రం నీలం తన్మేఘడంబరమ్, తత్ప్రాన్తలమ్బి హేమాది వస్త్రే స్యాత్ ఝల్లరీ స్త్రియామ్’ అని యమరశేషము.
అరి భేద నోదార కరకాండ మండిత రాజసాహాయ్యంబును – అరి = శత్రువులయొక్క, భేదన = విదారణమందు, ఉదార = ఉత్కృష్టము లైన, కరకాండ = హస్తములయందుండు బాణములచేత, మండిత = అలంకృతు లగు, రాజ = రాజులయొక్క, సాహాయ్యంబును = సహాయమును; అరి = చక్రవాకములయొక్క, భేదన = పాపుటయందు, ఉదార = ఉత్కృష్టము లగు, కర = కిరణములయొక్క, కాండ = సమూహముచేత, మండిత = అలంకృతుఁడైన, రాజ = చంద్రునియొక్క, సాహాయ్యంబును, అని యర్థాంతరము. అతిదీప్రతర ప్రకాశాన్విత సదనీక సాంగత్యంబును – అతిదీప్రతర = మిక్కిలి తేజరిల్లునట్టి, ప్రకాశ = కాంతితోడ, అన్విత = కూడుకొన్న, సత్ = గొప్పవారలయొక్క, అనీక =సమూహముయొక్క, సాంగత్యంబును = మైత్రిని; మిక్కిలి తేజరిల్లు కాంతితోఁ గూడుకొన్న రిక్కలగుంపుల సాంగత్యము నని యర్థాంతరము. అధిగమించి = పొంది; విజృంభించు నిశాధిదేవత తోన్ = ఉజ్జృంభించుచున్నట్టి రాత్ర్యధిష్ఠానదేవతతో; జగడంబు = యుద్ధము; చరింపన్ = చేయుటకు; ఓపక = చాలక; పట్టువడిన యంబుజాప్తబింబంబు తీరునన్ = పట్టువడినట్టి సూర్యబింబమురీతిగా; ఒక్క హరినీలకుంతలావతంసంబు = ఇంద్రనీలమణులవంటి కురులు గలిగిన స్త్రీలలో శ్రేష్ఠయగు నొకతె యని రాజపర మైన యర్థము; విష్ణుసంబంధిని యైన యొక నీలకుంతలావతంసంబు, అనఁగా లక్ష్మీదేవి యని కాని, విష్ణురూపిణి యగు మోహిన్యాత్మిక యగు స్త్రీ యని కాని యీశ్వర పరమైన యర్థము; పూనిన యభిరూప జాతరూప హంసరూప ధూపకరండంబువలనన్ – పూనిన = వహించినట్టి, అభిరూప = మనోజ్ఞ మగు, ‘ప్రాప్తరూప సురూపాభిరూపా బుధమనోజ్ఞయోః’ అని యమరుఁడు, జాతరూప = సువర్ణమయ మైన, ‘ చామీకరం జాత రూపమ్’ అని యమరుఁడు, హంసరూప = సూర్యరూప మైన, ‘భాను ర్హంస స్సహస్రాంశుః’ అని యమరుఁడు, ధూపకరం డంబువలనన్ = పొగ వేసికొను డబ్బివలన; చాలుగాన్ = బంతిగా; వెడలు = బయల్వెడలుచున్న; సామ్రాణిధూప ధూమ మాలికలు = సామ్రాణిధూపసంబంధి యైన ధూమముయొక్క బంతులు; తదంతర సంస్థాయి రమారమణ తనూతల వినిర్య దభిరామ శ్యామధామాళికల మోహంబు నివ్వటిల్లఁ జేయ – తదంతర=ఆ సూర్యబింబమధ్యభాగమునందు, సంస్థాయి = నివసించి యుండు, రమారమణ = నారాయణునియొక్క, తనూతల = శరీరప్రదేశమునుండి, వినిర్యత్=బయలుదేఱుచున్న, అభిరామ = మనోహర మగు, శ్యామధామ = నీలచ్ఛాయయొక్క, ఆళికల =చాలులయొక్క, మోహంబు = భ్రమను, నివ్వ టిల్లఁ జేయన్ = కలుగఁజేయఁగా; అనఁగా నారాజు చెంత నొక నారీరత్నము ధూపకరండమును ధరించి యుండఁగా నా స్త్రీ నిశాధిదేవతను బోలి యున్నదనియు, దాని చేత నున్న బంగరుబరణి ఆ స్త్రీకి శత్రుభేదనపటిష్ఠబాణహస్తు లగు రాజుల సాహా య్యము, మంచి తేజశ్శాలు లగు సత్పురుషుల సాహాయ్యము గలిగియుండుటం జేసి దానితో జగడంబు సేయంజాలక పట్టు వడిన సూర్యబింబమ్మువలె నున్నదనియు, ఆ బరణినుండి వెడలు సామ్రాణిపొగయొక్క ధారలు సూర్యబింబమధ్యమున నున్న నారాయణమూర్తి తనూకాంతిశ్రేణులం బోలి యున్న వనియు భావము. శివపరమైన భావము నిట్లే తెలియునది. ఇట్లు చెప్పఁగా సాంబమూర్తికి సుచంద్రునకు, సుచంద్రుని చెంత నున్ననారీరత్నమునకు శివుని చెంత నున్నలక్ష్మికి లేక హరి యను నారికి సామ్యము దోఁచుచున్నది. ఇట్లన్ని వాక్యములయందు సుచంద్రశివులకుఁ దత్పరము లైన యర్థములకు సామ్యము దోఁచు నని యెఱుంగునది.
నిరంకుశ పంకజరాగ కంకణ క్రేంకార పూర్వకంబుగాన్ – నిరంకుశ = అడ్డములేని, దీనికిఁ గ్రేంకారమం దన్వయము, పంకజ రాగ = పద్మరాగమణిమయ మైన, కంకణ = కంకణములయొక్క, క్రేంకార = క్రేంకరణము, పూర్వకంబుగాన్ = పురస్సర మగునట్లుగా; ఒక్క రాజకీరవాణీలలామ = ఒక్క స్త్రీరత్న మని రాజపర మైన యర్థము, రాజ= యక్షసంబంధిని యగు, కీరవాణీలలామ = స్త్రీరత్న మని శివపర మైన యర్థము; వీచు ధవళవాలవ్యజనంబులు = వీచునట్టి తెల్లని సురటీలు; అనుప మాన పవమాన మృదుయాన కలనానద్యమాన గగనగంగాతరంగ డోలికా వీథిన్ – అనుపమాన = సాటిలేనట్టి, పవమాన మృదుయాన = మారుతము యొక్క మందగమనముచేత,కల = అవ్యక్తమధురముగా,నానద్యమాన = ధ్వనిసేయుచున్న, గగనగంగా = స్వర్గంగయొక్క, తరంగ = అల లనెడు, డోలికావీథిన్ = ఉయ్యెలల వరుసయందు; ఉయ్యల లూఁగు = డోలా విహారము సేయుచున్న; అవదాతపత్రంబులకున్= హంసలకు; సగోత్రంబులు ఐ = బందుగు లై అనఁగాఁ దుల్యము లై యనుట, ఇందులకుఁ గవికల్పలతయందు ‘శ్లో. బన్ధు శ్చౌర స్సుహృ ద్వాదీ కల్పః ప్రఖ్యః ప్రభ స్సమః,దేశీయ దేశ్య రిప్వాభ సోదరాద్యా ఇవార్థకాః| యథేన్దుబన్ధు ర్ముక్తాశ్రీచౌరో హారశ్రియ స్సుహృత్ కున్దవాదీ హంసకల్పః క్షీరప్రఖ్యో హిమప్రభః| గఙ్గాసమోబ్జ దేశీయ శ్శేషదేశ్య స్సుధారిపుః| బిసాభస్తే యశోరాశిః కైలాసోదరసోదరః|’ అని ప్రమాణోదాహరణములు దెలియవలయు; వైచిత్రిన్ = ఆశ్చర్యమును; చి త్రింపన్ = రచియింపఁగా ననుట, అనఁగా సుచంద్రుని యొద్ద నొక స్త్రీ పద్మరాగమణిమయ కంకణక్రేంకారపూర్వకముగా వీచు తెల్లసురటీలు మందమారుతమునకు మధురముగ ధ్వని సేయు గంగానదీతరంగము లనెడు నుయ్యెలలం దూఁగుచున్న హంసలవలె నున్నవని భావము. రాజహంసల ముక్కులు, పాదము లెఱ్ఱగా నుండుట, తక్కిన శరీరము తెల్లగా నుండుట ప్రసిద్ధము గాన స్త్రీహస్తముల నున్న పద్మరాగమణుల కంకణములు ముక్కులవలె నున్నవనియుఁ, దెల్లనిసురటీలు దక్కిన శరీరములవలె నున్నవనియు, నా కంకణధ్వనులు తరంగధ్వనులఁ బోలి యున్నవనియు, హస్తముల గతాగతములు తరంగచలనములవలె నున్నవనియు ఫలితార్థము. శివపరమైనప్డు నిటులే తెలియునది.
విశాల విలోచన శతపత్త్ర పత్త్ర విలసనంబును – విశాల = విపులము లగు, విలోచన = నేత్రము లనెడు, శతపత్త్రపత్త్ర = కమలపత్త్ర ములయొక్క, విలసనంబును = విలాసమును; విమల భుజా మృణాల సౌందర్యంబును – విమల = నిర్మలము లగు, భుజా = బాహువు లనెడు, మృణాల = తామరతూఁడుయొక్క, సౌందర్యంబును = చక్కఁదనంబును; వినీల భ్రమరక సౌష్ఠవంబును –వినీల = మిక్కిలి నల్లనగు, భ్రమరక = ముంగురు లనెడు తుమ్మెదలయొక్క, సౌష్ఠవంబును = అందమును; విరంజిత కింజల్క మాంజుల్యంబును – విరంజిత = మిక్కిలి రంజింపఁజేయుచున్న, ణిజంతరంజధాతువుపై కర్త్రర్థమందు విభక్తసోదరాదిశబ్దముల యందువలె నిష్ఠాప్రత్యయము, కింజల్క=కేసరము లనెడు పుప్పొడిబొట్టుయొక్క, మాంజుల్యంబును = మనోజ్ఞతయు,‘పుష్ప రేణౌ చ కింజల్కః’ అని యమరశేషము; పూని = వహించి; సరస గణ్య లావణ్య వైభవంబునన్ – సరస = మడుఁగులయందు, రసముతోఁ గూడినవి సరసములు, రస మన నుదకము, రసికులచేత నని యర్థాంతరము, గణ్య = గణనీయ మగు, లావణ్య = కాంతివిశేషముయొక్క, ‘శ్లో. ముక్తాఫలేషుచ్ఛాయాయా స్తరళత్వ మివాన్తరా ప్రతిభాతి యదఙ్గేషు లావణ్యం తదిహోచ్యతే’ అని లావణ్యలక్షణము దెలియునది, వైభవంబునన్ = అతిశయముచేత; అలరు పద్మినిపైన్ = ఒప్పుచున్న తామరతీవపై, పద్మినీజాతిస్త్రీ పై నని ధ్వన్యమానార్థము; మోహంబు = వలపును; పూని = వహించి; పౌర్వకాలిక వైరంబు = మొదల నున్న విరోధమును; డించి = వదలి; ప్రియంబు = ప్రియవాక్యమును; వచింపన్ = చెప్పుటకు; చేరి, తత్కరకమల లాలితం బగు శీతాంశుమండలంబు దండిన్ – తత్కరకమల = ఆ పద్మినీపాణిపద్మముచేత, లాలితం బగు = లాలింపఁ బడునట్టి, శీతాంశు = చంద్రునియొక్క, మండలంబు దండిన్ = బింబమురీతిగా; ఒక్కభుజంగభు ఙ్మందయానామతల్లి = విటులను బాలించెడు నొక స్త్రీరత్నము, దాసి యనుట, ‘భుజఙ్గో విట సర్పయోః’ అని విశ్వము, ‘భుజ పాలనాభ్యవహారయోః’ అని పాణిన్యనుశాస నము, ఒకగరుడస్త్రీరత్నమని శివపర మైన యర్థము ; తాల్చిన కర్పూరకలాచిక = ధరియించిన కర్పూరముతో జేయఁబడిన తమ్మపడిగ; నయనామోదవీచికన్ – నయన = నేత్రములకు, ఆమోదవీచికన్ = సంతోషపరంపరను; చేకూర్పన్ = చేయఁగా; అనఁగా సుచంద్రుని చెంత నొక స్త్రీ తన కన్నులనెడు కమలపత్త్రములచేతను, భుజము లనెడు మృణాళములచేతను, ముంగురు లనెడు తుమ్మెదలచేతను, పుప్పొడిబొట్టు లనెడు కింజల్కములచేతను దామరతీవను బోలియున్నదనియు, ఆతామరతీవ యనెడు నొక పద్మినీజాతిస్త్రీయందుఁ జంద్రుఁ డనురక్తుఁ డై వైర ముడిగి ప్రియము చెప్పుటకుఁ బోయి దాని పాణిపద్మముచే లాలింపఁబడుచున్న యట్టు లా స్త్రీ పట్టుకొన్న తమ్మపడిగ యున్న దనియు భావము. శివపరమైనపుడు నిటులే తెలియునది; మహానంది గోరాజ కుమారముఖ్యులు – మహానంది = అతిసంతసము గలిగిన, గోరాజ = భూపతులయొక్క, కుమార ముఖ్యులు = పుత్రవరులు; మహత్ = అధికమగు, నంది = నందికేశ్వరుఁడు, గోరాజ = వృషభము, కుమారముఖ్యులు = కుమారస్వామి మున్నగువారు, అని శివపరమైన యర్థము; చెంతలన్ = సమీపములందు; కొలువన్ = కొలుచుచుండఁగా; అపూర్వవిభవంబునన్ = తొల్లి తనకు లేని విభవంబున, ముందు లోకమందున లేని విభవమ్మున నని యర్థాంతరము; పేరోలగం బుండు నవసరంబునన్ = గొప్ప కొలువు సేరి యున్న సమయంబున, దీనికి శాండిల్యముని యరుదెంచె నను ముందుపద్యమందున్న క్రియతో నన్వయము దెలియునది.
సీ. స్వకటాక్షవిశ్రమ◊స్థానన్నరశ్రేణి,యెడఁబోలె వరభూతి ◊యొడల నొప్పె,
హృదయసారసవీథి ◊యెడఁబోలె నలినాక్ష, సంభృతి కంధరా◊స్థలి నెసంగె,
మహితశిష్యోదితా◊మ్నాయాళియెడఁబోలె, నలఘుజటారేఖ ◊తలఁ జెలంగె,
నాత్మసంరచితాధ్వ◊రావళియెడఁబోలె, సత్త్రాటకస్ఫూర్తి ◊చక్షు లూనె,
తే. ననుచు నెమ్మది నద్భుతం◊బడర నఖిల,జనములు నుతింప నరుదెంచె ◊సమ్మదంబుఁ
బూని సుకలానిరస్తోడు◊జాని సుగుణ,మణినికరఖాని శాండిల్య◊మౌని యపుడు. 124
టీక: సుకలానిరస్తోడుజాని (సుకలా నిరస్త+ఉడుజాని) – మంచితేజముచేతఁ దిరస్కరింపఁబడిన చంద్రుఁడు గల వాఁడు, జాని యనుచోట జాయాశబ్దముమీఁద ‘జాయాయా నిఙ్’ అను సూత్రముచేత నిఙాగమము; సుగుణమణినికరఖాని= సద్గుణము లనెడు మణుల సమూహమునకు గని యైనవాఁడు, ‘ఖనిః ఖాని రపి స్మృతా’అని శబ్దభేదప్రకాశిక; శాండిల్యమౌని= శాండిల్యుఁ డను మహాముని; స్వకటాక్షవిశ్రమస్థానత్ నరశ్రేణి యెడంబోలెన్ – స్వ = తనయొక్క, కటాక్ష = క్రేఁగంటిచూపునకు, విశ్రమ స్థానత్ = విశ్రాంతిస్థానము వలె నాచరించుచున్న, ఇట ‘సర్వప్రాతిపదికేభ్యః క్విబ్వా వక్తవ్యః’ అను సూత్రముచే నాచారార్థ మందు క్విప్ ప్రత్యయము, నరశ్రేణియెడంబోలెన్ =మనుష్యసంఘమందుబలె; ఒడలన్=దేహమందు; వరభూతి=శ్రేష్ఠసంపత్తు, శ్రేష్ఠభస్మ మని యర్థాంతరము,‘భూతి ర్భస్మని సంపది’అని యమరుఁడు; ఒప్పెన్=అమరెను; హృదయసారసవీథి యెడన్ పోలె= హృదయకమలవీథియందుబలె; కంధరాస్థలిన్ = కంఠస్థలమందు; నలినాక్ష= విష్ణు మూర్తియొక్క, తామరపూసలయొక్క యని యర్థాంతరము; సంభృతిన్ = భరణము; ఎసంగెన్ = అతిశయించెను; మహితశిష్యోదితామ్నాయాళి యెడఁబోలెన్ – మహిత = పూజ్యమగు, శిష్య =శిష్యులచేత, ఉదిత = పలుకఁబడిన, ఆమ్నా యాళి యెడన్ పోలెన్ = వేదసమూహమందుబలె; తలన్ = శిరస్సునందు; అలఘు =విస్తారమగు; జటా = పదపాఠవిశేషము యొక్క, జడలయొక్క యని యర్థాంతరము; రేఖ = సమూహము; చెలంగెన్ = ఒప్పారెను; ఆత్మసంరచితాధ్వరావళి యెడన్ పోలెన్– ఆత్మ = తనచేత, సంరచిత = చేయఁబడిన, అధ్వరావళి యెడన్ పోలెన్ = యజ్ఞ సంఘములయందుబలె; చక్షులు = నేత్రములు; సత్త్రాటకస్ఫూర్తి – సత్త్రాటక = ఋత్విజులయొక్క, సత్త్ర మనఁగా యజ్ఞము, దానియందుఁ జరించువారు సత్త్రాటకులు, ‘సత్త్ర మాచ్ఛాదనే యజ్ఞే’ అని యమరుఁడు, స్ఫూర్తి = ప్రకాశమును;సత్ = సత్పు రుషులయొక్క, త్ర=రక్షణమందు, అట = సంతతగతి గల, స్ఫూర్తి = ప్రకాశ మని యర్థాంతరము; ఊనెన్ = వహించెను. అంతఃకరణవృత్తి యగు సత్పురుషరక్షణవ్యాపారము చక్షులందుఁ దోఁచుచున్న దనుట. చక్షు లనుచోట సప్తమ్యర్థమందుఁ బ్రథమ వచ్చినది.
అనుచు = ఇట్లనుచు; నెమ్మదిన్ = మంచిమనస్సునందు; అద్భుతంబు =ఆశ్చర్యము; అడరన్ = ఒప్పుచుండఁగా; అఖిల జనములున్ = ఎల్లమనుజులును; నుతింపన్ = పొగడుచుండఁగా; సమ్మదంబున్ =సంతోషమును; పూని =వహించి; అరు దెంచెన్ = వచ్చెను. అనఁగా సుచంద్రనరేంద్రుఁడు పేరోలగం బుండు నవసరంబున శాండిల్యమునివరుండు తనకటాక్షపాత్రు లగువారలకు సంపదలు గలుఁగఁజేయుచు, శరీరమందు భస్మము దాల్చి, హృదయమందు నారాయణుని ధ్యానించుచుఁ, గంఠమందుఁ దామరపూసల మాలిక దాల్చి, శిష్యులకుఁ జెప్పెడు వేదమందుబలెఁ దలమీఁద జటలు దాల్చి, యజ్ఞములందు ఋత్విక్కులం బలె సత్పురుషు లను రక్షింపవలె నను హృదయాభిప్రాయము కన్నులయందుఁ బ్రకాశింపఁజేయుచు వచ్చె నని భావము. ఉపమాలంకారభేదము.
మ. మునిరా జి ట్లరుదేర ద్వాస్థ్సితజనా◊మూల్యోక్తి వైచిత్రి మే
ల్కని తోడ్తో నెదు రేఁగి, భక్తి వినతుల్ ◊గావించి తోడ్తెచ్చి, నూ
తనచామీకరపీఠి నుంచి, యల గో◊త్రాకామినీకాముకుం
డనువొందన్ ఘటియించె నాదమికిఁ దా ◊నాతిథ్య మప్పట్టునన్. 125
టీక: అల గోత్రాకామినీకాముకుండు = ఆ పృథివీపతి యగు సుచంద్రుఁడు; ఇట్లు = పైఁజెప్పిన విధముగా; మునిరాజు = శాండి ల్యుఁడు; అరుదేరన్ = విచ్చేయఁగా; ద్వాస్థ్సితజ నామూల్యోక్తి వైచిత్రి న్ – ద్వాస్థ్సితజన = ద్వారపాలకులయొక్క, ‘స్త్రీ ర్ద్వా ర్ద్వారమ్’ అని అమరుఁడు; అమూల్యోక్తివైచిత్రి న్ = లోకోత్తరవాగ్వైచిత్రిచేత; మేల్కని = జాగరూకుఁడై; తోడ్తోన్ = వెంటనే; ఎదు రేఁగి = ఎదురుఁగఁబోయి; భక్తిన్ = భక్తితోడ; వినతుల్ = ప్రణామములు; కావించి = చేసి; తోడ్తెచ్చి= తోడుకొని తెచ్చి; నూతన =క్రొత్తదగు; చామీకరపీఠిన్ = బంగరుపీటయందు; ఉంచి= కూర్చుండఁబెట్టి; అనువొందన్ =తగునట్టుగా; ఆ దమికిన్ = ఆమునికి; తాన్ =తాను; అప్పట్టునన్ = ఆసమయమందు; ఆతిథ్యము=అతిథిసత్కారము; ఘటియించెన్ = చేసెను;
క. విమలాసనమునఁ బతి యతి
కమలాసనలసదనుజ్ఞి◊క వసించి, మహా
సుమనోరసారుహోద్య
త్సుమనోరససూక్తిఁ దపసి◊తో నిట్లనియెన్. 126
టీక: పతి = భూపతి యైన సుచంద్రుఁడు; యతికమలాసన లస దనుజ్ఞిక = యతిపుంగవుండైన శాండిల్యునియొక్క ప్రకాశించు చున్న యాజ్ఞచేత, అనుజ్ఞాశబ్దముమీఁద కప్ప్రత్యయము, ఇత్వము వచ్చి అనుజ్ఞిక యైనది; విమలాసనమునన్ = నిర్మల మైన యాసనమందు; వసించి = కూర్చుండి; మహా సుమనో రసారుహోద్యత్సుమనోరస సూక్తిన్ – మహత్ = అధికమైన, దీనికి సుమనోరసమం దన్వయము, సుమనః = అమరులయొక్క, రసారుహ= తరువువలన, ఉద్యత్ =ఉదయించుచున్న, సుమనో రస = పూఁదేనియవంటి,సూక్తిన్ = వాక్కుచేత, అనఁగాఁ గల్పతరుకుసుమమకరంద మొలుకుచున్నవాక్కుచేత ననుట; తపసితోన్ = మునితోడ; ఇట్లనియెన్ = చెప్పఁబోవు రీతిగఁ బలికెను.
శా. మౌనీ సేమమె మీకు, మంగళమె యు◊ష్మచ్ఛాత్రరాట్పాళికిం,
నానాసూననవప్రసూనములు సిం◊దన్ మించునే యాశ్రమా
గానీకంబు, లనంతరాయకలనన్ ◊ యజ్ఞాళు లీడేఱునే,
శ్రీ నొప్పారునె మీ మహోటజము ని◊ర్వేలాసురానీకతన్. 127
టీక: మౌనీ = ఓశాండిల్యమునీ; మీకున్ సేమమె = మీకు కుశలమా! యుష్మచ్ఛాత్రరాట్పాళికిన్ = మీ శిష్యశ్రేష్ఠుల గుంపునకు, మంగళమె = కల్యాణమా! ఆశ్రమాగానీకంబులు = ఆశ్రమద్రుమసమూహములు; నానా = అనేకవిధములగు; సూన = కుసుమ ములు; నవ = క్రొత్తనైన; ప్రసూనములు = ఫలములు, ‘ప్రసూనం పుష్ప ఫలయోః’ అని వైజయంతి; చిందన్ = వ్యాపింపఁగా; మించునే = అతిశయించునా! యజ్ఞాళులు = యజ్ఞములయొక్కసమూహములు; అనంతరాయకలనన్ = నిర్విఘ్నముగా; ఈడేఱునే = సిద్ధించుచున్నవా! మీ మహోటజము = మీయొక్క పూజ్యమగు పర్ణశాల; నిర్వేలాసురానీకతన్ = అడ్డము లేని రాక్షసుల యీతి బాధ లేకుండఁగ; శ్రీ న్ = సంపదచేత; ఒప్పారునె = ఒప్పుచున్నదా! దీని కిట్లనియె యను పూర్వపద్యమందలి క్రియయం దన్వయము.
చ. యతికులచంద్ర! సత్కువల◊యప్రియ మై తగు నీదురాక మ
ద్వితతమనస్థ్సతాపగతి ◊వేగ యలంప గలంప సంతతో
ద్ధతతరపంకజాతములఁ ◊దావకపాదనిషేవణాసమా
దృతి మను నాశుభాళి గనునే ◊ధరఁ దక్కిన రాజచక్రముల్. 128
టీక: యతికులచంద్ర = మునికులచంద్రుండవగు శాండిల్యుఁడా!, చంద్రుడా యని యర్థాంతరము; సత్కువలయ= మంచి భూ వలయమునకు, కల్వలకు నని యర్థాంతరము; ప్రియ మై = హితమై; తగు నీదురాక = ఒప్పుచున్న నీరాక; మద్వితత మనస్థ్స తాపగతిన్ = నాయొక్కమనస్సునం దున్న విపులమైన సంతాపమును, వేఁడి నని యర్థాంతరము; వేగ =వేగముగా; అలంపన్ = అలయింపఁగా; సంతత ఉద్ధతతరపంకజాతములన్ – సంతత = ఎల్లప్పుడును; ఉద్ధతతర =ఉత్కటతరమగు; పంకజాత ములన్=పాపసంఘములను, పద్మముల నని యర్థాంతరము; కలంపన్ = కలఁతపఱుపఁగా; తావక పాద నిషేవణాసమా దృతిన్ – తావక =నీసంబంధు లగు, పాద = చరణములయొక్క, కిరణములయొక్కయని యర్థాంతరము, నిషేవణ = సేవ యందలి, అసమ = సాటి లేని దగు, ఆదృతిన్ = ఆదరమున; మను = వృద్ధిఁబొందెడు; నాశుభాళిన్ = నాయొక్క కల్యాణపరం పరలను; తక్కిన రాజచక్రముల్= ఇతరనృపాలసంఘములు, శ్రేష్ఠచక్రవాకసంఘము లని యర్థాంతరము; ధరన్= లోకమందు; కనునే = పొందునా, పొంద వనుట. ఇచటఁ బ్రస్తుతశాండిల్యవిషయ మైన యర్థముఁ జెప్పఁగాఁ జంద్రకువలయాది నానార్థశబ్ద శక్తిమూలవ్యంజనచేతఁ జంద్రాదివిషయకార్థాంతరము వ్యజ్యమాన మగుఁ గావునఁ జంద్రుఁడు రాఁగా నెట్లు గల్వలకుఁ బ్రీతియు, తాపము శమించుటయుఁ, బద్మములు వికసించుటయు, జక్కవలు సంతస మందకుండుటయు నగునో యట్లు శాండిల్యుఁడు రాఁగా భూవలయమునకుఁ బ్రీతియు, సుచంద్రుని మనస్సంతాపము శమించుటయు, సమస్తపాపకదంబము తత్పాదసేవనమున నశించుటయు నితరరాజదుర్లభమై ఘటించె నని భావము. వస్తుకృతోపమాలంకారధ్వని.
చ. కరము మదీయపుణ్యలతి◊కన్ సఫలత్వముఁ బొందఁ బూన్చి యో
సురభిచరిత్ర! నీ విటకు ◊సొంపుగఁ జేరితి శక్యమే భవ
ద్వరసుమనోహితత్వఘన◊వైఖరి సన్నుతిఁ జేయ నీదయా
పరిణతిఁ గాదె యుత్కలికఁ ◊బాయక భవ్యతరుల్ సెలంగుటల్. 129
టీక: ఓ సురభిచరిత్ర = మనోజ్ఞ మైన నడవడి గల యోమునీ, వసంతుని చరితము గలవాఁడ యని ధ్వని; కరము = మిక్కిలి; మదీయపుణ్యలతికన్ = నాసుకృత మనెడు లతికను; సఫలత్వమున్ = ఫలవత్తను; పొందన్ పూన్చి = ఫలములను బొందింప నుద్యమించి యనుట, ఫలములనఁగా లాభములు, పండ్లును; నీవు ఇటకున్ = నాయొద్దకు; సొంపుగన్ = సంతోషముగా; చేరితి=చేరినవాఁడ వైతివి; భవద్వర సుమనో హితత్వ ఘన వైఖరి సన్నుతిన్ – భవత్ = నీయొక్క, వర = శ్రేష్ఠ మగు, సుమనో హితత్వ = విద్వత్ప్రీతియొక్క, కుసుమప్రీతియొక్క యని యర్థాంతరము, ఘన వైఖరి = గొప్పరీతియొక్క, సన్నుతిన్ = స్తోత్ర మును; చేయన్ = చేయుటకు; శక్యమే =శక్యము గాదనుట; నీదయాపరిణతిన్ కాదె = నీకృపాపరిణామము గదా; భవ్యతరుల్ = మిగులఁ బెద్దలు, ఒప్పుచున్నవృక్షము లని యర్థాంతరము; ఉత్కలికన్ = ఉత్సవమును, మొగ్గల నని యర్థాంత రము; పాయక = తొలంగక; చెలంగుటల్= ప్రకాశించుటలు. ఇచట ఘనవైఖరిశబ్దములో ఘనపదమునకు మేఘపర మైన యర్థాంతరము స్ఫురించినను, దానికిఁ గుసుమహితత్వము లేమిచేతను, సుమనశ్శబ్దమునకు మాలతి యర్థ మైనందునఁ దద్ధి తత్వము మేఘమునకు సంభవించినను ‘శ్లో. జాతీకదమ్బకేతకఝంఝానిల నిమ్నగా హలిప్రీతిః’ అని కవికల్పలతయందు వర్షర్తువునందె జాతీవర్ణనము చెప్పినందునను, సురభియందు మేఘపర మైన యర్థ మననుగుణ మని తలంచి వ్రాయలేదు. వసంతునకు, శాండిల్యునకు నౌపమ్యము గమ్యము.
మ. ఘనతాత్పర్యము నాపయి న్నిలిపి వే◊డ్కన్ వచ్చి తస్మత్పురా
తనభాగ్యంబునఁ జేసి యోతపసి ర◊త్నశ్రేణులో భూమియో
ధనమో ధేనువులో కరీంద్రములొ ర◊థ్యవ్రాతమో యిష్టవ
స్తునికాయం బనివార్యభక్తి ఘటియిం◊తుం దెల్పవే సత్కృపన్. 130
టీక: ఓ తపసి = ఓ మునీ, అస్మత్పురాతనభాగ్యంబునఁ జేసి= నాయొక్క పూర్వపుభాగ్యమువలన, నా పయిన్ = నాయందు, ఘనతాత్పర్యము = గొప్పప్రీతిని, ‘తత్పరే ప్రసితాసక్తౌ’ అని యమరుఁడు; నిలిపి = ఉంచి, వేడ్కన్ = సంతసముతో, వచ్చితి = వచ్చినవాఁడ వైతివి; రత్నశ్రేణులో= నవరత్ననికరములో; భూమియో = వసుంధరయో; ధనమో = ద్రవ్యంబో; ధేనువులో = గోవులో; కరీంద్రములొ= గజోత్తమములో; రథ్యవ్రాతమో = అశ్వములగుంపో; ఇష్టవస్తునికాయంబు = యజ్ఞాదులయందు దేయంబుగా నిష్టవస్తు కదంబము; సత్కృపన్ = మంచిదయతోడ; తెల్పవే = చెప్పుమా; అనివార్యభక్తి న్ = నివారింపరాని భక్తితో, అత్యుత్కట మైన భక్తితో ననుట; ఘటియింతున్= ఘటియింపఁజేయుదును.
మ. అని యాభూపతి వల్క, యోగిమణి చి◊త్తాంకూరితానందుఁ డై
యినవంశోత్తమ! తావకీనకృప మా◊కెల్లప్పుడున్ సేమ, ము
ర్వి నితాంతైకమహోమహోన్నతభవా◊దృఙ్మిత్రసాంగత్యవ
ర్తన నిచ్చ ల్మనుమాకుఁ జేకుఱునె జా◊గ్రద్దుష్టదోషావళుల్? 131
టీక: అని = ఇట్లని; ఆభూపతి = ఆసుచంద్రుఁడు; పల్కన్ = వచింపఁగా; యోగిమణి = యోగిశ్రేష్ఠుం డగు శాండిల్యుఁడు; చిత్తాంకూరితానందుఁ డై = మనస్సునం దంకురించిన యానందము గలవాఁడై; ఇనవంశోత్తమ = సూర్యవంశపురాజులలో నుత్తముఁడైనవాఁడా; తావకీనకృపన్ = నీదయతో; మాకున్ = మముబోఁటి తాపసులకు; ఎల్లప్పుడున్ = సర్వకాలమందును; సేమము = కుశలము; ఉర్విన్ = భూమియందు; నితాం తైక మహోమహోన్నత భవాదృ ఙ్మిత్ర సాంగత్య వర్తనన్ – నితాంత =తీవ్ర మైన, ‘తీవ్రైకాన్త నితాన్తాని’ అని యమరుఁడు, ఏక =ముఖ్యమగు, మహః =ప్రతాపముచేత, మహోన్నత =మిగుల నధికుఁడగు, భవాదృక్ = నినుబోఁటి, మిత్ర=చెలికానితోడ, సాంగత్యవర్తనన్ = సంబంధవృత్తిచేత, తేజస్సుచేత మిగుల నధికుఁ డగు సూర్యునిసాంగత్యవృత్తిచేత నని యర్థాంతరధ్వని; నిచ్చల్ = ఎల్లప్పుడు; మను మాకున్ = వృద్ధిఁ బొందునట్టి మాకు; జాగ్రద్దుష్టదోషావళుల్= జాగరూకు లైన దుర్మార్గులవల్ల నుపద్రవపరంపరలు, రాత్రులపంక్తు లని ధ్వన్యమానార్థము; చేకుఱునె = లభించునా, అనఁగాఁ దీవ్రతేజశ్శాలి యగు సూర్యునిసాంగత్యమువలన రాత్రులయుపద్రవ మెట్లు లభింపదో యట్టు లుగ్ర ప్రతాపశాలి వగు నీసాంగత్యమున మాకు దుర్మార్గులయుపద్రవములు ఘటింప వని భావము. ప్రస్తుతాప్రస్తుతోపమాధ్వని.
తే. అనిశము సమస్తలోకర◊క్షైకదీక్ష, నలరు నీకృప సకలేష్ట◊మంది మించు
మాకుఁ గోరిక యొక్కింత◊మాత్ర యైనఁ, గలదె భవదవలోకనా◊కాంక్ష దక్క. 132
టీక: అనిశము = ఎల్లప్పుడు; సమస్త లోక రక్షైక దీక్షన్ = సర్వలోకరక్షణవిషయ మైన ముఖ్యదీక్షచేత; అలరు = ఒప్పునట్టి; నీకృపన్ = నీయొక్క దయచేత; సకలేష్టము =ఎల్లయిష్టములను; అంది =పొంది; మించు మాకున్ = అతిశయించునట్టి మాకు; ఒక్కింతమాత్ర యైనన్ = ఈషత్తైనను; కోరిక=అభిలాష; భవ దవలోక నాకాంక్ష దక్కన్ = నినుఁజూడవలెనను నిచ్ఛ దక్క; కలదె = కలదా. సమస్తలోకరక్షాదీక్షుండవగు నీదయతో సకలేష్టముల నందిన మాకు నీదర్శనాభిలాష తక్క వేఱొక్క యభి లాష లేదని భావము.
మ. సకలారాతివిదారణంబు, సుమన◊స్త్ర్సాణంబుఁ గావించి, ధా
ర్మికులం దెక్కుడ వై, జగత్ప్రియత ధా◊త్రీకాంత! నీవొప్ప మౌ
నికులశ్రేష్ఠులతో నిరీతి మఘముల్ ◊నెగ్గించుచున్ మేము వే
డుక వర్తిల్లుదు, మాశ్రమాళి సురకో◊టుల్ నిచ్చ హర్షింపఁగన్. 133
టీక: ధాత్రీకాంత = భూనాథుఁడవగు సుచంద్రుఁడా! సకలారాతి విదారణంబున్ = సమస్తశత్రునిబర్హణమును; సుమనస్త్ర్సాణం బున్ = విద్వజ్జనులరక్షణంబును; కావించి = చేసి; ధార్మికులందున్ = విలుకాండ్రలోపల, పుణ్యశీలురలోపల; ఎక్కుడ వై = అధికుఁడవై; జగత్ప్రియతన్ = లోకప్రీతిచేత; నీవొప్పన్ = నీ వతిశయించుచుండఁగా; మేమున్ = మేమును; మౌనికులశ్రేష్ఠు లతో = మునివరులతో; నిరీతిన్ = ఈతిబాధ లేనట్లుగా; మఘముల్ = క్రతువులను; నెగ్గించుచున్ = నెఱవేర్చుచు; సుర కోటుల్ = దేవసంఘములు; నిచ్చ = ఎల్లప్పుడును; హర్షింపఁగన్ = సంతసింపఁగా; వేడుకన్ = సంతసముతో; ఆశ్రమాళిన్ = ఆశ్రమసమూహమందు; వర్తిల్లుదుము = వసింతుము. నీవు శత్రునిబర్హణముఁ జేసి విలుకాండ్రలోను, విద్వజ్జనరక్షణంబుఁ జేసి పుణ్యశీలురలోను, శ్రేష్ఠుండ వయి వర్తింపఁగా, మేమును మునిశ్రేష్ఠులతోఁ గూడి యజ్ఞములు సేయుచు సురకోటులు సంతసిం పఁగా నాశ్రమములందు వేడుకతో వర్తిల్లుదు మని భావము.
మ. జపముల్ సాగఁగ, వేదపాఠములు ని◊ష్ప్రత్యూహతన్ మించఁగాఁ,
దపముల్ పూర్ణత నొంద, జన్నములు ని◊త్యంబుం బ్రకాశింపఁగా,
నృప! యుష్మన్మహిమం జెలంగుదుము ని◊ర్వేలప్రసూనప్రసూ
నపటల్యంచితసాలజాలయుతస◊న్మాన్యాశ్రమాస్థానికన్. 134
టీక: జపముల్ = మంత్రజపములు; సాగఁగన్ = కొనసాగఁగ; వేదపాఠములు = వేదములయొక్క పాఠములు; నిష్ప్రత్యూ హతన్ = నిర్విఘ్నతతో; మించఁగాన్ = అతిశయింపఁగా; తపముల్ = తపస్సులు; పూర్ణతన్ = పరిపూర్ణభావమును; ఒందన్ = పొందఁగా; జన్నములు = యజ్ఞములు; నిత్యంబున్ = ఎల్లప్పుడును; ప్రకాశింపఁగాన్ = తేజరిల్లఁగా; నృప = ఓరాజా! యుష్మన్మహిమన్ = మీమహిమచేత; నిర్వేల ప్రసూన ప్రసూనపటల్యంచిత సాల జాల యుత సన్మాన్యాశ్ర మాస్థానికన్ –నిర్వేల = అనర్గళమగు, ప్రసూన = పుష్పములయొక్కయు, ప్రసూన = ఫలములయొక్కయు, ‘ప్రసూనం పుష్పఫలయోః’ అని విశ్వము, పటలీ = సంఘముచేత, అంచిత = ఒప్పునట్టి, సాల = వృక్షములయొక్క, జాల = సమూహముతో, యుత = కూడుకొన్నట్టి, సత్ = సత్పురు షులచేత, మాన్య = మాననీయ మగు, ఆశ్రమ = ఆశ్రమ మనెడు, ఆస్థానికన్ = సభయందు; చెలంగుదుము= ప్రకాశింతుము.
చ. భవదవలంబనంబున న◊పాయము గానక యిన్నినాళ్ళు మా
నవకులచంద్ర! సౌఖ్యకల◊నం దనరారితి మట్టిమాకు స
త్సవనవినాశకంబు, ముని◊జాలమనఃప్రమదాపహారకం
బవు నొకకార్య మబ్బె నిపు ◊డాదృతిచే నది చిత్తగింపవే. 135
టీక: భవదవలంబనంబునన్ = నీయాశ్రయమున; అపాయము కానక = చ్యుతి గనక; ఇన్నినాళ్ళున్ = ఇన్నిదినములు; మానవ కులచంద్ర = సుచంద్రుఁడా; సౌఖ్యకలనన్ = సౌఖ్యప్రాప్తిచేత; తనరారితిమి = ఒప్పితిమి; అట్టిమాకున్= ఆరీతిగ నున్నమాకు; సత్సవనవినాశకంబు = శ్రేష్ఠములగు యజ్ఞముల నశింపఁజేయునదియు; ముని జాల మనః ప్రమదాపహారకంబు = మునిసంఘ ములయొక్క సంతోషవినాశకమును; అవు నొకకార్యము =అగునట్టి యొక కార్యము; ఇపుడు=ఈకాలమున; అబ్బెన్ = ఘటి ల్లెను; అది = ఆ కార్యము; ఆదృతిచేన్ = ఆదరముచే; చిత్తగింపవే = మనస్కరింపుమా.
వ. అని వెండియు నయ్యతీంద్రుం డాసుచంద్రమహీశచంద్రునితో నిట్లనియె. 136
టీక: అని, వెండియున్ = మఱియును, అయ్యతీంద్రుండు = ఆశాండిల్యుఁడు, ఆసుచంద్రమహీశచంద్రునితోన్ = ఆసుచంద్రుం డను రాజచంద్రునితో, ఇట్లనియె = వక్ష్యమాణప్రకారంబునఁ బలికెను.
సీ. ఘనవైరిమకుటము◊క్తాజయశ్రీకపి,లావాచనాపాది◊లలితశరుఁడు,
భుజబలవ్యాఖ్యాతృ◊భూభృద్భిదాస్యాను,బింబవత్స్వారత్న◊పీఠతటుఁడు,
రణభేరికాభాంక◊రణపరిప్రాపిత, హరిదంష్ట్రిలోకేశ◊పురవరుండు,
ప్రతిదినాభ్యుదితకా◊ర్శ్యజ్ఞాపితప్రతి,మాన్యతాకామరీ◊మహితగృహుఁడు,
తే. ప్రబలు నాత్మచమూప్రతి◊ప్రస్థితీక్ష,ణేహికాప్తిపునఃపున◊రీషదున్న
మన్ముఖసుమేరుకందరా◊క్ష్మావసన్మ,హాసురుండు తమిస్రాభి◊ధాసురుండు. 137
టీక: ఘన వైరి మకుట ముక్తా జయశ్రీ కపిలావాచనాపాది లలిత శరుఁడు – ఘన = గొప్పలగు, వైరి మకుట=శత్రుకిరీటముల యొక్క, ముక్తా = ముత్యములచేత,జయశ్రీ = జయలక్ష్మికి, కపిలావాచన = వివాహమందలి స్వస్తివాచనిక కర్మవిశేషమును, ఆపాది = సంపాదించుచున్న, లలిత శరుఁడు = లలితములైన బాణములుగలవాఁడు, పంచబాణుం డని ధ్వనించును. భుజబల వ్యాఖ్యాతృ భూభృద్భిదాస్యానుబింబవ త్స్వారత్నపీఠతటుఁడు – భుజబల = బాహువిక్రమమునకు, వ్యాఖ్యాతృ = వ్యాఖ్యానించెడు, దీని కాస్యానుబింబమునం దన్వయము, భూభృద్భిత్ = ఇంద్రునియొక్క, ఆస్యానుబింబవత్ = ముఖప్రతి బింబములు గల్గిన, స్వారత్నపీఠ = చింతామణిపీఠముయొక్క, స్వర్ రత్న యని యుండఁగా సంధివశంబునఁ బూర్వ రేఫ మునకు లోపంబును దత్పూర్వాకారంబునకు దీర్ఘంబును గలిగె, తటుఁడు = దరి గలవాఁడు, అనఁగా నతఁడు గూర్చుండు చింతామణిపీఠమున నమస్కరించు నింద్రునిముఖము ప్రతిబింబింపఁగా నతని బాహుబలము దానివలన వ్యాఖ్యాతంబుగా నున్న దనుట. రణభేరికా భాంకరణ పరిప్రాపిత హరి దంష్ట్రి లోకేశ పురవరుండు – రణభేరికా భాంకరణ = యుద్ధభేరీధ్వనిచేత, పరిప్రాపిత = పొందింపఁబడిన, హరి = సింహములు, దంష్ట్రి = పందులు గలిగిన, లోకేశ = రాజులయొక్క, పురవరుండు = పురవరములు (రాజధానులు) గలవాఁడు. అనఁగా వాని భేరీధ్వనివలన రాజులు భయపడి పురములను వదలి పోఁగా నాపురములయందు సింహములు, వరాహములు చేరిన వనుట. ప్రతిదినాభ్యుదిత కార్శ్య జ్ఞాపిత ప్రతిమాన్యతా కామరీ మహితగృహుఁడు – ప్రతిదిన = ప్రతిదినమునందు, అభ్యుదిత = పుట్టిన, కార్శ్య=కృశత్వముచేత, జ్ఞాపిత = ఎఱింగింపఁబడిన, ప్రతిమాన్యతాక = అవమానము గల,ప్రతిమాన్యతాశబ్దాంతబహువ్రీహి మీఁద కప్ప్రత్యయము, ఆమరీ =దేవతాస్త్రీలచేత, మహిత = పొగడబడిన, గృహుఁడు= గృహములు గలవాఁడు. అనఁగా రాక్షసునితో బందీకరింపఁబడితి మని యవమానము చేత దినదినము కృశించుచున్న దేవాంగన లతనియింట నున్నారని భావము.ఆత్మ చమూ ప్రతిప్రస్థితీక్షణేహికాప్తి పునఃపున రీష దున్నమ న్ముఖ సుమేరుకందరా క్ష్మావస న్మహాసురుండు – ఆత్మ = తన యొక్క, చమూ = సేనలయొక్క, ప్రతిప్రస్థితి =మరలిపోవుటయొక్క, ఈక్షణ = చూచుటయందు, ఈహికాప్తి = ఇచ్ఛాప్రాప్తి చేత, పునఃపునః = మాటిమాటికి, ఈషదున్నమత్= ఇంచుక యున్నత మగుచున్న, ముఖ = మోములు గల, సుమేరు=మేరు పర్వతముయొక్క, కందరాక్ష్మా = గుహల భూములయందు, వసన్ = నివసించుచున్న, మహత్ = ఉత్కృష్టులైన, సురుండు = దేవతలు గలవాఁడు. అనఁగా దేవతలు వానిదాడికి వెఱచి మేరుగుహలయందు డాఁగి తమ్ము వెదకి దునుమవచ్చిన తమిస్రా సురుని సైనికులు మరలిపోవుచుండఁగా సారెసారెకు నిక్కిచూచుచున్నా రని భావము. తమిస్రాభిధాసురుండు = తమిస్రుం డని పేర్కొనఁబడు రక్కసుఁడు, ప్రబలున్ = అతిశయించును.
చ. అనుపమధేనుకాహితత ◊నంది చరించు మునివ్రజంబులం
బెనుపుఁ, గడున్ మహాసవకృ◊పీటభవాళులఁ దూలఁజేయుఁ, జ
య్యనఁ గలఁచున్ బహూదకచ◊యంబుల, వ్రాల్చు ధరిత్రి శ్యామలం
జనవర! దానవద్ద్విపము ◊సాంద్రమదస్ఫురణంబు హెచ్చఁగన్. 138
టీక: ఈపద్యమందు రాక్షసపరమైన యర్థము, గజపరమైన యర్థము గలుగును. జనవర = సుచంద్రుఁడా; దానవద్ద్విపము = గజమువంటి దానవుఁడు, మదించిన గజము; సాంద్ర = దట్టమైన; మద = గర్వముయొక్క, మదముయొక్క; స్ఫురణంబు = ప్రకాశము; హెచ్చఁగన్ = అతిశయింపఁగా; అనుపమ = అసమానమైన, ధేనుకా= గోవులకు, అహితతన్ = శత్రుభావమును, ఆఁడేనుఁగులకు హితభావము నని గజపరమైన యర్థము, ‘ధేనుకా కరిణీ వశా’ అని యమరుఁడు; అంది = పొంది; చరించున్ = తిరుగును; మునివ్రజంబులన్ =మునులగుంపులను, అగిసియను మ్రాఁకులగుంపులను; పెనుపున్ = నాశముఁ జేయును; మహాసవకృపీటభవాళులన్ – మహత్ = అధికమైన, సవ=యజ్ఞములయొక్క, కృపీటభవ = అగ్నియొక్క, ఆళులన్ = సమూహములను; మహత్=అధికమగు, ఆసవ=మకరందము గల, కృపీటభవ= తామరలయొక్క, ఆళులన్ = గుంపులను; కడున్ =మిక్కిలి; తూలఁజేయున్ = చలింపఁజేయును; చయ్యనన్ = శీఘ్రముగా; బహూదక= బహూదకు లను సన్న్యాసుల యొక్క, హంస, పరమహంస, కుటీచక, బహూదకు లని సన్న్యాసులలో నాల్గు భేదములు గలవు; చయంబులన్ = గుంపు లను; కలఁచున్ = కలఁతపఱచును; ధరిత్రిన్ = భూమియందు; శ్యామలన్ = యౌవన మధ్యస్థలగు స్త్రీలను; వ్రాల్చున్ = వ్రాలు నట్లు చేయును, ప్రేంకణము మున్నగు వృక్షవిశేషములను భూమిని వ్రాల్చు నని గజ పరమైన యర్థము.
సీ. హరిహయాస్యాతత◊స్ఫురణ దూలఁగఁ దార్చి, శుచిధామమహిమంబుఁ ◊జూఱ వుచ్చి,
చటులమహాకాల◊పటిమంబు దిగఁద్రోచి, నానాశరచ్ఛటా◊శ్రీ నడంచి,
కమలవరప్రభౌ◊ఘంబు మాయఁగఁ జేసి, ఘనమరుత్పురసాల◊గరిమ ముంచి,
ప్రచురసోమావలే◊పం బెల్లఁ గరఁగించి, పంచాస్యశక్తిఁ బో◊పడ నొనర్చి,
తే. యిట్టు లాపూర్వదేవవం◊శేశ్వరుండు, విశ్వ హరిదీశ విజయాప్తి ◊వెలయు నాత్మ
చండదోర్దండమండల◊మండలాగ్ర, జనితసత్కీర్తిదీప్తిప్ర◊చారమూర్తి. 139
టీక: ఈపద్యమందు తమిస్రాసురుని ప్రతాపకీర్తుల పరమైన యర్థద్వయము గలుగును. హరిహయాస్యాతతస్ఫురణన్ – హరిహయ = ఇంద్రునియొక్క, ఆస్య = ముఖముయొక్క, ఆతతస్ఫురణన్ = విపులమైన కాంతిని, తూలఁగఁ దార్చి = తూలఁగఁ జేసి యని ప్రతాపపరమైన యర్థము; హరిహయ = విష్ణువాహనమైన గరుడునియొక్క, ఆస్య=ముఖముయొక్క, ఆతతస్ఫురణన్ = అతిశయప్రకాశమును, తూలఁగఁజేసి, అనఁగా గరుత్మంతుని ముఖకాంతి తెల్లగా నుండును గాన దానిం దూలఁగఁజేసి యని కీర్తిపర మైన యర్థము. ఇట్లు వాక్యాంతరముల నూహ్యంబు; శుచిధామమహిమంబున్ – శుచి= అగ్నియొక్క, ‘శుచి రప్పిత్తమ్’ అని యమరుఁడు,ధామ=తేజముయొక్క, మహిమంబున్ = మహిమను, చూఱ పుచ్చి = కొల్లవెట్టి యని ప్రతాపపరమైన యర్థము; శుచిధామ = చంద్రునియొక్క మహిమంబుఁ జూఱ పుచ్చి యని కీర్తిపరమైన యర్థము. చటులమహాకాలపటిమంబున్ దిగఁ ద్రోచి = చటులమై అధికమైన యమునియొక్క మహిమను దిగఁద్రోచి యని ప్రతాపపర మైన యర్థము; చటులమైన మహాకాల యనఁగా శివునియొక్క మహిమను దిగఁద్రోచి యని కీర్తిపరమైన యర్థము. నానాశరచ్ఛటాశ్రీన్ – నానా = అనేకప్రకారము లగు, ఆశర = నిరృతియొక్క, ఛటా=పరంపరారూప మైన, శ్రీన్ = సంపదను; అడంచి = అడఁగఁజేసి యని ప్రతాపపరమైన యర్థము; అనేకప్రకారము లగు శరములు, అనఁగా ఱెల్లులు, వానిఛటలయొక్క శ్రీని అడంచి యని కీర్తిపరమైన యర్థము.
కమలవరప్రభౌఘంబున్ – కమలవర=జలాధిపతి యైన వరుణునియొక్క, ప్రభౌఘంబున్ = కాంతిపుంజమును, మాయఁగఁ జేసి = నశించునట్లు చేసి యని ప్రతాపపరమైన యర్థము; కమల = పద్మములయొక్క, తెల్లదామరలయొక్క, వర=శ్రేష్ఠమైన, ప్రభా = కాంతియొక్క, ఓఘంబున్ = సంఘమును, మాయఁగఁజేసి యని కీర్తిపరమైన యర్థము. ఘనమరుత్పురసాలగరిమన్ – ఘన=అధికమగు, మరుత్=వాయువుయొక్క, పుర=నగరముయొక్క, సాల=కోటయొక్క, గరిమన్ = అతిశయమును, ముంచి =మునుఁగఁజేసి యని ప్రతాపపరమైన యర్థము; ఘన = గొప్పయగు, మరుత్పుర = స్వర్గ సంబంధి యైన, సాల=వృక్షముయొక్క, కల్పవృక్షముయొక్కయనుట, గరిమన్=అతిశయమును, ముంచి =మునుఁగఁ జేసి యని కీర్తిపరమైన యర్థము. ప్రచురసోమావలేపం బెల్లన్ – ప్రచుర మగు కుబేరునియొక్క గర్వము నంతయు, కరఁగించి=కరఁగఁజేసి యని ప్రతాపపరమైన యర్థము; ప్రచుర మగు కర్పూరముయొక్క దర్పమును గరఁగించి యని కీర్తి పరమైన యర్థము, ‘సోమః కుబేరే కర్పూరే’ యని రత్నమాల; పంచాస్యశక్తిన్ = శివునిసామర్థ్యమును, పోపడన్ = పోవునట్లు, ఒనర్చి = చేసి యని ప్రతాపపరమైన యర్థము. సింహశక్తిని పోపడ నొనర్చి యని కీర్తిపరమైన యర్థము, ‘సింహో మృగేన్ద్రః పంచాస్యః’ అని యమరుఁడు. ఇట్టులు=ఈప్రకారముగ; ఆపూర్వదేవవంశేశ్వరుండు=ఆరాక్షసకులేశ్వరుఁ డైన తమిస్రాసురుఁడు; విశ్వహరిదీశవిజయాప్తిన్ – విశ్వ = సమస్తమగు, హరిదీశ = ఇంద్రాదిదిక్పాలకులయొక్క, విజయాప్తిన్ = విజయముయొక్క లాభముచేత; ఆత్మచండ దోర్దండమండల మండలాగ్ర జనిత సత్కీర్తి దీప్తి ప్రచార మూర్తి – ఆత్మ = తనయొక్క, చండ= ఉగ్రమగు, దోర్దండమండల= భుజదండమండలమందున్న, మండలాగ్ర = ఖడ్గమువలన, జనిత = పుట్టినట్టి, సత్కీర్తి = ఉత్తమయశస్సుయొక్కయు, దీప్తి= ప్రతాపముయొక్కయు, ప్రచార = వ్యాప్తికి, మూర్తి = శరీరప్రాయుఁడై; వెలయున్ = ప్రకాశించును. ఇంద్రాద్యష్టదిక్పాలకుల నడంచు ప్రతాపమును, గరుత్మన్ముఖహిమాంశుప్రభృతుల తేజము నొంచు కీర్తియుఁ గల వాఁడై తేజరిల్లు నని భావము.
మ. నవసంగ్రామధరాహృతంబు లగు నా◊నాలేఖనాగాన్వయే
భవితానమ్ముల సాధ్యరాడ్రథములం ◊ బ్రాంచత్తురంగాస్యర
త్నవిమానంబుల నొప్పఁ జేసి హిమగో◊త్రాభృద్దరీరాజధా
న్యవతంసంబున మించు నాతఁ డసురేం◊ద్రానీకకోటీయుతిన్. 140
టీక: నవసంగ్రామధరాహృతంబు లగు – నవ = నూతన మగు, సంగ్రామధరా = యుద్ధభూమియందు, ఆహృతంబులు = తీసి కొనిరాఁబడినవి యగు; నానా లేఖనాగాన్వయేభ వితానమ్ములన్ – నానా = అనేకప్రకారము లగు, లేఖనాగ = ఐరావతము యొక్క, అన్వయ = వంశీయము లైన, ఇభ= గజములయొక్క, వితానమ్ములన్ = సమూహములను; సాధ్యరాట్ = సాధ్యే శ్వరునియొక్క; రథములన్ = స్యందనములను; ప్రాంచత్ = ఒప్పుచున్న; తురంగాస్యరత్న= కింపురుషరాజుయొక్క; విమా నంబులన్ = పుష్పకములను, కాదేని కింపురుషుల రత్నమయవిమానముల నని యర్థము; ఒప్పఁ జేసి = ఒప్పు నట్లొనరించి; హిమగోత్రాభృద్దరీరాజధాన్యవతంసంబునన్ – హిమగోత్రాభృత్ = హిమవత్పర్వతముయొక్క; దరీ = గుహ యనెడు; రాజ ధాన్యవతంసంబునన్ = పురవరమందు; అసురేంద్రానీక = రాక్షసేంద్రసమూహముయొక్క; కోటీ = అనేకములయొక్క; యుతిన్ = సంబంధముచేత; అతఁడు = ఆ తమిస్రాసురుఁడు; మించున్ =అతిశయించును.
చ. అలదనుజేశ్వరుండు మృగ◊యాపరమానసుఁ డై, నిశాచరా
వళులు భజింప మౌనికుల◊వర్యమహోటజరాజిఁ జేరి దా
బలిమిని దాపసేంద్రతతిఁ ◊బట్టి వధించుఁ, దదూర్జితాధ్వర
జ్వలనము లార్పఁ జేయు నని◊వారితశోణితవారిధారలన్. 141
టీక: అలదనుజేశ్వరుండు = ఆతమిస్రాసురుఁడు; మృగయాపరమానసుఁ డై = వేఁటయం దాసక్త మైన చిత్తము గలవాఁడై; నిశాచరావళులు = రాక్షసులగుంపులు; భజింపన్ = కొలుచుచుండఁగా; మౌనికులవర్య = మునిశ్రేష్ఠులయొక్క; మహోటజ రాజిన్ = గొప్పనైన యాశ్రమసమూహములను; చేరి = పొంది; తాన్ = తాను; తాపసేంద్రతతిన్ = మునీంద్రసంఘములను; బలిమిని = బలాత్కారముచేత; పట్టి = పట్టుకొని; వధించున్ = హింసించును; తత్ = ఆమునీశ్వరులయొక్క; ఊర్జిత = ఉత్కృష్టములగు; అధ్వర=యజ్ఞసంబంధమైన; జ్వలనములు = అగ్నులను; ఆర్పన్ = ఆర్చుటకు; అనివారిత = ఆటం కము లేని; శోణిత = రక్త మనెడు; వారి = నీటియొక్క; ధారలన్ = ధారలను; చేయున్ = కలిగించును.
తే. ధీరచక్రంబుల నడంచు, ◊సారసవన
హననసృతిఁ బొల్చు, భూరిదోషానువృత్తి
నెనసి చెలరేఁగు, నాదాన◊వేంద్రుఁ డవని
నవియ కావె తమిస్రని◊ర్వ్యాజగతులు. 142
టీక: ఇందుఁ దమిస్రాసురపరమైన యర్థము, నంధకారపరమైన యర్థముఁ గలుగును. ఆదానవేంద్రుఁడు = ఆరాక్షసుఁడు; ధీరచక్రంబులన్ = విద్వన్మండలములను, ధీరము లయిన జక్కవల నని యర్థాంతరము; అడంచున్ = అడఁగఁజేయును; సారసవనహననసృతిన్ – సార=శ్రేష్ఠము లగు, సవన= యజ్ఞములయొక్క,హననసృతిన్ = హింసామార్గమందు, పొల్చున్ = ఒప్పును; సారస=పద్మములయొక్క, వన=వనములయొక్క, హననసృతిని బొల్చు నని యర్థాంతరము; భూరిదోషానువృత్తిన్ = అనేక పాతకములయొక్క యనుసరణమును, అధికముగ రాత్రులను గూడుట యని యర్థాంతరము; ఎనసి= పొంది; చెలరేఁగున్ = విజృంభించును; అవనిన్=భూమియందు; తమిస్రనిర్వ్యాజగతులు – తమిస్ర= తమిస్రుఁడను రాక్షసునియొక్క, చీకటియొక్క యని యర్థాంతరము, నిర్వ్యాజగతులు= స్వాభావికవ్యాపారములు; అవియ కావె = అట్టివె కావా, అనఁగా చీకటి యేరీతి చక్రవాకముల నడఁచి, తామరతోఁటలను భంగపఱచి, రాత్రి ననుసరించి యుండునో, యట్లు తమిస్రాసురుఁడును విద్వన్మండలి నడఁచి, శ్రేష్ఠయజ్ఞములను భంగపఱచి, మిక్కిలి పాపమార్గము ననుసరించి యున్నా డని భావము. ప్రస్తుతతమిస్రునకు, అప్రస్తుతాంధకారమునకును నౌపమ్యము గమ్యము. ‘తమిస్రం తిమిరం తమః’ అని యమ రుఁడు.
చ. ధరణిపచంద్ర!తద్దనుజ◊దౌష్ట్యమునన్ సకలర్షినాయకా
ధ్వరములకున్, మహాజపితృ◊వారజపంబులకున్, వ్రతివ్రతో
త్కరములకుం, దపస్విసము◊దాయతపంబులకున్, సురేంద్రదు
స్తరవిఘ్నముల్ వొడమ◊సాగెఁ జుమీ బహుకాల మెంతయున్. 143
టీక: ధరణిపచంద్ర = రాజచంద్రుఁడా, తద్దనుజదౌష్ట్యమునన్ =ఆతమిస్రాసురునిదుష్టత్వముచేత; సకలర్షినాయక= ఎల్ల మునీం ద్రులయొక్క, అధ్వరములకున్ = యజ్ఞములకు, మహత్=అధికమగు, జపితృవార=జపముఁ జేయువారి గుంపులయొక్క, జపంబులకున్ = జపములకు, వ్రతి=బ్రహ్మచారులయొక్క, వ్రతోత్కరములకున్= నియమజాతములకు, తపస్వి=తాపసుల యొక్క, సముదాయ = సమూహముయొక్క, తపంబులకున్ = తపస్సులకు, సురేంద్ర = ఇంద్రునకు, దుస్తరతర = వారింప రాని, విఘ్నముల్ = ఆటంకములు, ఎంతయున్ = మిక్కిలి, బహుకాలము=దీర్ఘకాలము, పొడమసాగెఁ జుమీ = ఉదయింప సాగెఁ జుమా.
చ. అనుపమతైక్ష్ణ్యసంచితగ◊వాళి సురారి హరింతు, మైన మా
యనఘమహాతపోర్జితమ◊హంబు వ్యయం బగు నంచుఁ దన్మతిం
గనము; గవాళి నయ్యసుర◊కాంతు హరింపుము భూప! యైన నీ
యనఘ మహాతపోర్జితమ◊హం బలఘుత్వము నొందుఁ గావునన్. 144
టీక: అనుపమతైక్ష్ణ్యసంచితగవాళిన్ – అనుపమ = నిరుపమాన మైన, తైక్ష్ణ్య = ఉగ్రతచేత, సంచిత = సంపాదింపఁబడిన, గవాళిన్ = వాక్పరంపరలచేత, శాపరూపము లైన వాక్పరంపరలచే ననుట; సురారిన్ = రక్కసుని; హరింతుము = సంహ రింతుము; ఐనన్ = అట్లయినయెడల; మా అనఘమహాతపోర్జితమహంబు – మా = మాయొక్క, అనఘ =నిర్దోష మైన, మహాతపః = అధికతపముచేత, ఆర్జిత=సంపాదింపఁబడిన, మహంబు =తేజస్సు; వ్యయం బగు నంచున్ = నష్టమగు ననుచు; తన్మతిన్ = అట్టి బుద్ధిని; కనము= చూడము, అనఁగా వాని సంహారము చేయుటకు యత్నింప మనుట; గవాళిన్ = బాణపరం పరలచేత; అయ్యసురకాంతున్ = ఆరాక్షసనాథుని; హరింపుము = సంహరింపుము; భూప=సుచంద్రుఁడా; ఐనన్= అట్లైన యెడల; నీ = నీయొక్క; అనఘ = ఒచ్చెము లేని; మహత్ =అధికమైన; ఆతప=ఎండవలె; ఊర్జిత = ఊర్జితమైన; మహంబు = ప్రతాపము; అలఘుత్వమున్= ఆధిక్యమును; ఒందున్ కావునన్=పొందును గాబట్టి, వానిని సంహరింపు మని వెనుక కన్వ యము. యమకాలంకారభేదము.
మ. అఖిలాస్త్రైకవిధానశాలివి, సప◊త్నాధీశమాయాతమి
స్రఖరాంశుండవు, జన్యభూవిహృతి◊సారజ్ఞుండ, వీ వౌట స
ర్వఖలధ్వంసనదక్ష! యాదనుజు సం◊గ్రామోర్వి బాణోద్భవ
చ్ఛిఖిఁ గూల్పం దగు దీవె, పూనుము మన◊స్థ్సేమంబుఁ దద్వృత్తికిన్. 145
టీక: సర్వఖలధ్వంసనదక్ష = సకలదుష్టసంహారమునందు దక్షుండ వగు సుచంద్రుఁడా! అఖిలాస్త్రైకవిధానశాలివి – అఖిలాస్త్ర = సకలవిధాస్త్రములయొక్క,ఏక=ముఖ్య మగు, విధానశాలివి = విధిచే నొప్పువాఁడవు; సపత్నాధీశమాయాతమిస్రఖరాంశుండవు – సపత్నాధీశ = శత్రుశ్రేష్ఠుం డగు; మాయాతమిస్ర = మాయావి యగు తమిస్రాసురు డను చీకటికి, కాదేని శత్రుశ్రేష్ఠునిమాయ యను చీకటికి, ఖరాంశుండవు = సూర్యుండవు; జన్యభూవిహృతిసారజ్ఞుండవు – జన్యభూ =యుద్ధభూమియందలి; విహృతి సారజ్ఞుండవు =విహారముయొక్క సారము నెఱింగినవాఁడవు; ఈ వౌటన్ = నీ వగుటవలన; సంగ్రామోర్విన్=యుద్ధభూమి యందు; బాణోద్భవచ్ఛిఖిన్ = బాణమువలనఁ బుట్టు నగ్నిచేత; ఆదనుజున్ = ఆరాక్షసుని; ఈవె కూల్పం దగుదువు = నీవె సంహరింప సమర్థుఁడవు; తద్వృత్తికిన్ = ఆ యసురసంహారవృత్తికి; మన స్థ్సేమంబున్ = మనస్థ్సైర్యమును; పూనుము = వహింపుము.
క. అని పల్కన్ నృపతి దయా
ధుని సిల్కం బలుకువాలు◊దొరలం గడుఁ బా
యని యల్కం దూల్చు పలా
దునిఁ జుల్కం జేసి నియమి◊తో నిట్లనియెన్. 146
టీక: అని పల్కన్ = ఇట్లు శాండిల్యుఁడు పల్కఁగా; నృపతి = సుచంద్రుఁడు; దయాధుని =దయానది; చిల్కన్ = చిందునట్లు గా, దీని కిట్లనియెన్ అను క్రియతో నన్వయము; పలుకువాలుదొరలన్ = శాపరూపవాక్కు లాయుధముగాఁ గల ప్రభువులను, అనఁగా మునిశ్రేష్ఠులను; కడున్ = మిక్కిలి; పాయని యల్కన్ = వీడని కోపముచేత; తూల్చు పలాదునిన్ = సంహరించు క్రవ్యాదుని; చుల్కంజేసి = లఘువుగా నెంచి; నియమితోన్ = మునితోడ; ఇట్లనియెన్ = వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.
చ. పుడమినృపాలు రబ్బురముఁ ◊బూన, బలంబులతోడ నీదువెం
బడి నరుదెంచి రాత్రిచర◊బంధునిఁ గూల్చెద, నంత యేల యి
య్యెడ నలదానవుం డనఁగ ◊నెంత, భవత్కృప వాఁడు నా కసా
ధ్యుఁడె, హరి గాచియున్న, హరు◊తో రణమేదిని కేఁగుదెంచినన్. 147
టీక: పుడమిన్ =భూమియందు; నృపాలురు = రాజులు; అబ్బురమున్ = ఆశ్చర్యమును; పూనన్ = వహింపఁగా; బలంబుల తోడ = సైన్యములతోడ; నీదువెంబడిన్ = నీవెంట; అరుదెంచి = వచ్చి; రాత్రిచరబంధునిన్ = రాక్షసబంధు వగు నా తమిస్రుని; ఇయ్యెడన్ = ఇప్పుడు; కూల్చెదన్ = సంహరించె దను; అంత యేల = అంత చెప్పనేల; అలదానవుం డనఁగ నెంత = ఆ రాక్షసుం డనఁగా నెంత; భవత్కృపన్ = మీయొక్క దయచే; హరి గాచియున్నన్ = విష్ణువు రక్షించి యున్నను; హరుతోన్ = శివునితోడ; రణమేదినికిన్ = యుద్ధభూమికి; ఏఁగుదెంచినన్=వచ్చినను; నాకున్, వాఁడు = ఆరాక్షసుండు; అసాధ్యుఁడె= సాధింప నలవి కానివాఁడా?
మ. దనుభూభారవిముక్తి గోతలము సెం◊దన్, గోతలాప్తిన్ సుప
ర్వనికాయం బెనయన్, సుపర్వయుతి శ◊శ్వత్సద్వితానంబులుం
దనరం, బాయని సద్వితానముల నా◊నామౌనిగేహంబు లె
చ్చ, నవాస్త్రావళిఁ గూల్తుఁదత్సురరిపు◊స్వామిన్ రణాస్యంబునన్. 148
టీక: గోతలము=భూతలము; దనుభూ = రాక్షసులయొక్క; భారవిముక్తి న్ = భారమోక్షమును; చెందన్= పొందఁగా; సుపర్వనికాయంబు = దేవతలసమూహము; గోతలాప్తిన్ = స్వర్గతలప్రాప్తిని; ఎనయన్ = పొందఁగా; సుపర్వయుతిన్ = మంచిపర్వముయొక్క యోగముచేత; శశ్వత్సద్వితానంబులున్= సంతతములై శ్రేష్ఠము లగు యజ్ఞములు, ‘వితానో యజ్ఞ విస్తార లోభేషు’ అని విశ్వము; తనరన్ = ఒప్పఁగా; పాయని = ఎడయని; సద్వితానములన్ = విద్వత్కదంబములతోడ; నానామౌనిగేహంబులు = అనేకమునిగృహములు; ఎచ్చన్ = మించఁగా; రణాస్యంబునన్ = యుద్ధముఖమందు; తత్సుర రిపుస్వామిన్ = ఆ దేవారిరాజగు రక్కసుని; నవాస్త్రాళిన్ = నూతనమగు నస్త్రముల గుంపులచేత; కూల్తున్ = సంహరింతును. తాత్పర్యము స్పష్టము. ఏకావళీ, కారణమాలాలంకృతులు. ‘శ్లో. గృహీతముక్తరీత్యార్ధశ్రేణి రేకావళీ మతా, గుమ్ఫః కారణ మాలా స్యా ద్యథా ప్రాక్ప్రాన్తకారణైః’ అని లక్షణము.
తే. యమికులమహేంద్ర! యిది కార్య ◊మనుచు నొక్క
శిష్యుఁ బనిచిన వచ్చి, యా◊శీవిషోప
మాశుగాళి సురారాతి ◊ నవనిఁ గూలి
చెదను, మీ రింతపనికి వి◊చ్చేయఁదగునె. 149
టీక: యమికులమహేంద్ర =మునికులరాజ వైన శాండిల్యుఁడా; ఇది కార్య మనుచున్ = ఇదికర్తవ్యంబని; ఒక్క శిష్యుఁబనిచినన్ =ఒక్క యంతేవాసిని బంపినను; వచ్చి= నేనంతవఱకు వచ్చి; ఆశీవిష=సర్పములకు; ఉపమ=తుల్యము లగు; ఆశుగ=బాణ ములయొక్క; ఆళిన్ = పంక్తులచేత; సురారాతిన్ = దేవతలకు శత్రువైన రక్కసుని; అవనిన్ =భూమియందు; కూలిచెదను = పడవైతును; మీరు = మహర్షి శ్రేష్ఠులైన మీరు; ఇంతపనికిన్=ఇట్టి స్వల్పకార్యమునకు; విచ్చేయన్ = వచ్చుటకు; తగునె= తగి నట్టిదా.
చ. అని విభుఁ డమ్మునీశు విన◊యంబునఁ బూజన మూన్చి, భక్తిచే
ననిచి, నిజాప్తమంత్రిజన◊తైకవచోగతి సమ్మదం బెదం
దనరఁగ, నాత్మదివ్యపృత◊నానికరంబుల రా ఘటించి, తా
నెనపె జయప్రయాణనియ◊తైహికమానసవీథి నంతటన్. 150
టీక: అని = ఈప్రకారము వచించి; విభుఁడు = సుచంద్రుఁడు; అమ్మునీశున్ = ఆశాండిల్యుని; వినయంబునన్ = అడఁకువతోడ; పూజనము = అర్చనము; ఊన్చి=చేసి; భక్తిచేన్ = భక్తిచేత; అనిచి = పంపి; నిజ = తనయొక్క; ఆప్త=హితులయొక్కయు; మంత్రిజనతా=మంత్రిసమూహముయొక్కయు; ఏక=ముఖ్యమగు; వచోగతిన్ = వాగ్రీతిచేత; సమ్మదంబు = సంతసము; ఎదన్ = హృదయమునందు; తనరఁగన్=ఒప్పఁగా; ఆత్మ=తనయొక్క; దివ్యపృతనా =దివ్యసేనలయొక్క; నికరంబులన్=సమూ హములను; రాన్=వచ్చునట్లు; ఘటించి=చేసి; తాన్ = తాను; జయప్రయాణ=విజయయాత్రయందు; నియతైహికన్ = నియతాభిలాషను, ఈహాశబ్దముపై కప్ప్రత్యయము; మానసవీథిన్=మనోవిథిని; అంతటన్=ఎల్లెడల; ఎనపెన్= వ్యాపింపఁ జేసెను. జయప్రయాణమునకు నిశ్చలచిత్తుం డయ్యె ననుట.
మ. గళదర్కంబుఁ, బనీపతత్కుజము, రిం◊ఖద్గోత్రగోత్రంబుఁ, జా
చలదుర్వీవలయంబు, ఫక్కదఖిలా◊శాకంబు, భిద్యన్నభ
స్థ్సలమేఘౌఘము, భ్రశ్యదృక్షము, రణ◊త్పద్మాసనాండంబు నై
యలరెం దన్మహిపాలజైత్రగమబం◊భారావ మప్పట్టునన్. 151
టీక: అప్పట్టునన్ = ఆసమయమందు; తన్మహిపాలజైత్రగమబంభారావము – తన్మహిపాల = ఆసుచంద్రునియొక్క, జైత్ర= జయార్థ మై, గమ=ప్రస్థానసూచక మగు, ‘ప్రస్థానం గమనం గమః’ అని యమరుఁడు, బంభా=భేరియొక్క, ‘బమ్భా భేర్యామ్’ అని అమరశేషము, ఆరావము = ధ్వని; గళత్ అర్కంబున్ = పడుచున్న సూర్యుఁడు గలదియు; పనీపతత్ కుజమున్ = మిక్కిలి కూలుచున్న వృక్షములు గలదియు, పనీపతచ్ఛబ్దము యఙ్లుగంతము; రింఖత్ గోత్రగోత్రంబున్ = ఎగిరిపడుచున్న గిరిసంఘములు గలదియు; చాచలత్ ఉర్వీవలయంబున్ = మిక్కిలి చలించుచున్నభూవలయము గలదియు; ఫక్కత్ అఖి లాశాకంబున్=పగులుచున్నసకలదిక్కులు గలదియు, ఆశాశబ్దాంతబహువ్రీహిమీఁద కప్ప్రత్యయము, ‘ఆపోన్యతరస్యామ్’ అని వికల్పముచేత హ్రస్వము లేదు; భిద్యత్ నభస్థలమేఘౌఘమున్ = చీలుచున్న గగనస్థలమందలి మేఘములగుంపు గలది యు; భ్రశ్యత్ ఋక్షమున్=పుడమిని వ్రాలుచున్న రిక్కలు గలదియు, భ్రంశు అధఃపతనే యనుటచేత భ్రంశుధాతు వధఃపతనార్థ కంబు; రణత్ పద్మాసనాండంబున్=మ్రోఁగుచున్న బ్రహ్మాండంబు గలదియు; ఐ, అలరెన్=ఒప్పెను. అత్యుక్త్యలంకారము.
సీ. సితకాండజాతసం◊గతి విరాజిల్లుటఁ, జక్రాంగ మగుటకు ◊సందియంబె,
చారుసూనవితాన◊సంయుక్తి వెలయుట, స్యందనం బగుటకు సందియంబె,
వరవైజయంతికా◊పరిషక్తి నొప్పుటఁ, జక్రి దా నగుటకు ◊సందియంబె,
సుకరయుగాదికాం◊గకలబ్ధిఁ దనరుట, సద్రథం బగుటకు ◊సందియంబె,
తే. హరిభయంకరభూరిధా◊మాప్తి మనుట, జగతి నిది తార్క్ష్యమగుటకు ◊సందియంబె
యనఁగఁ బొగడొందు రత్నశ◊తాంగ మప్పు, డధిపుకనుసన్నఁదెచ్చె ని◊యంత యొకఁడు. 152
టీక: ఇందు రథము వర్ణింపఁబడుచున్నది. ఎట్లనిన: సితకాండజాతసంగతిన్ – సిత=తెల్లనైన, కాండ=గుఱ్ఱములయొక్క. జాత= గుంపుయొక్క, సంగతిన్ = సంబంధముచేత; సిత= తెల్లనగు, కాండజాత=తామరలయొక్క, సంగతిచేత నని యర్థాంతరము; విరాజిల్లుటన్ = ప్రకాశించుటచేత; చక్రాంగము=రథము, హంసము అని యర్థాంతరము; అగుటకున్, సందియంబె = సందేహము లేదనుట. చారుసూనవితానసంయుక్తిన్ – చారు=మనోజ్ఞము లగు, సూనవితాన=పువ్వులచప్పరముయొక్క, సంయుక్తిన్ =సంబం ధముచేత, మనోజ్ఞకుసుమసంఘముచేత నని యర్థాంతరము; వెలయుటన్ = ప్రకాశించుటచేత; స్యందనం బగుటకున్ = రథ మగుటకు, నెమ్మిచెట్టగుట కని యర్థాంతరము; సందియంబె = సందేహము లేదనుట. వరవైజయంతికాపరిషక్తి నొప్పుటన్ = శ్రేష్ఠము లగు పతాకలయొక్క సంబంధముచేత నొప్పుటచే, శ్రేష్ఠ మగు వనమాలికయొక్క సంబంధముచే నొప్పుటచే నని యర్థాంతరము; తాన్=తాను; చక్రి అగుటకున్ = రథ మగుటకు, విష్ణు వగుటకు; సందియంబె = సందేహమా, సందేహము లే దనుట.సుకరయుగాదికాంగకలబ్ధిన్ తనరుటన్–సుకర=అనుకూలమగు, యుగ=కాఁడి, ఆదిక=మొదలుగాఁగల, అంగక=అంగ ములయొక్క, లబ్ధిన్ = లాభముచేత, తనరుటన్ = ఒప్పుటచేత; సమీచీన మైన హస్త ద్వయము మొదలగు నంగములతోఁ గూడి తనరుటచేత నని యర్థాంతరము; సద్రథంబు = మంచితేరు, మంచి శరీర మని యర్థాంతరము, ‘రథో దేహే స్యందనే చ’ అని రత్నమాల; అగుటకు సందియంబె = అగుటకు సందేహము లేదనుట. హరిభయంకరభూరిధామాప్తిన్ – హరి=సూర్యునకు, భయంకర= భయమును జేయు, భూరి= అధిక మగు, ‘భూరి ప్రాజ్య సువర్ణయోః’ అని విశ్వము, ధామ=తేజముయొక్క, ఆప్తిన్ = కూడికచేత; మనుటన్ = వృద్ధిఁబొందుటచేత; జగతిన్ = లోక మందు; ఇది = ఈరథము; తార్క్ష్యము = అశ్వములు గలది, తార్క్ష్యశబ్దముపై నర్శ ఆద్యచ్ ప్రత్యయము, గరుత్మంతుఁ డని యర్థాంతరము; అగుటకుసందియంబె = అగుటకు సందేహము లేదనుట; అనఁగన్ = ఇట్లని; పొగడొందు = పొగడ్తను గాంచుచున్న; రత్నశతాంగము = రత్నఖచిత మగు రథము; అప్పుడు= ఆ జయ భేరీనినాదావసరమున; అధిపుకనుసన్నన్ = రాజునేత్రసంజ్ఞచేత; నియంత యొకఁడు = ఒక సూతుండు; తెచ్చెన్ = తీసికొని వచ్చెను. ఈపద్యమందు రథము విషయభేదముచే నానారూపముగ లోకముచేత నుల్లేఖింపఁబడుటం జేసి యుల్లేఖాలంకార భేదము. ‘శ్లో. ఏకేన బహుధోల్లేఖే ప్యసౌ విషయభేదతః’ అని తల్లక్షణము. లోకులచేత నని యుల్లేఖకర్తృబహుత్వము వివక్షిత మగు నేని, ‘శ్లో. బహుభి ర్బహుధోల్లేఖాదేకస్యోల్లేఖ ఇష్యతే’ అని యుల్లేఖాలంకారభేద మగును.
చ. తొడవులు మేటిమేనిజిగి◊తో నిగుడం, గుడివంకఁ గెంపురా
పిడియము దోఁప, బంధునృప◊బృందము లందఱు నివ్వటిల్ల వెం
బడి నెడ యీక రాఁ, దళుకు◊బంగరుఁజేల యొకింత జీరఁగా,
వెడలె హజార మానృపతి ◊విప్రయుగంబును దృష్టి నాఁగుచున్. 153
టీక: ఆనృపతి = ఆసుచంద్రుఁడు; తొడవులు =భూషణములు; మేటిమేనిజిగితోన్ = శ్రేష్ఠమగు దేహకాంతితోడ; నిగుడన్ = వ్యాపింపఁగా; కుడివంకన్ = కుడిప్రక్కను; కెంపురాపిడియము = పద్మరాగమణిమయ మగు బాకు; తోఁపన్ = అగపడు చుండఁగా; బంధునృపబృందములు=బంధునృపాలురసముదాయములు; అందఱున్=ఎల్లరు; నివ్వటిల్లన్=అతిశయించు నట్లుగా; వెంబడిన్=వెంట; ఎడ యీక = పిక్కటిల్లునట్లుగా; రాన్ =రాఁగా; తళుకుబంగరుఁజేల =ప్రకాశించు కనకచేలము; ఒకింత జీరఁగాన్=ఇంచుక జీరాడఁగా; విప్రయుగంబును= బ్రాహ్మణద్వయమును; దృష్టిన్=చూపుచే; ఆఁగుచున్=అడ్డగిం చుచు, అనఁగా దృష్టిగోచరముగా బ్రాహ్మణయుగ్మమును జేయుచు నని భావము, ‘శ్లో.కన్యా గౌ ర్భేరి శంఖం దధి ఫల కుసుమం పావకం దీప్యమానం యానం వా విప్రయుగ్మం హయ గజ వృషభం పూర్ణకుమ్భద్వయం చ’ అని మొదలుగా జ్యోతిషశాస్త్రీయశకునాధ్యాయమందు బ్రాహ్మణయుగ్మదర్శనము ప్రస్థితులకు మంగళకర మని చెప్పఁ బడినది; హజారము= కొలువుకూటము; వెడలెన్=బయలుదేఱెను.
చ. కొలు విపు డబ్బె నంచు బలు◊కోర్కి మహీశులు నిల్చి కొల్వుమ్రొ
క్కులు ఘటియించి రప్పతి క◊కుంఠకలధ్వనివేత్రు లంగరా
ట్కులుఁడు పరా కితం డతఁడు ◊కోసలనేత పరా కితండు కే
రలుఁడు పరా కతండు కురు◊రాజు పరా కని యుగ్గడింపఁగన్. 154
టీక: మహీశులు =రాజులు; కొలు విపు డబ్బె నంచున్ = ఇపుడు సుచంద్రుని సేవ ఘటించె ననుచు; నిల్చి = నిల్చుకొని; అప్పతి కిన్=ఆరాజునకు; వేత్రులు=వేత్రధారులు, అనఁగా బెత్తపువారు, వేత్రశబ్దము మీఁద మత్వర్థీయేని ప్రత్యయము; అకుంఠ కల ధ్వనిన్=నిరర్గళమధురశబ్దముతో; ఇతండు=మ్రొక్కుచున్న యీ ప్రభువు; అంగరాట్కులుఁడు=అంగదేశా ధీశ్వరవంశ్యుఁడు; పరాకు=తత్పరుఁడవు గమ్ము; అతఁడు = ప్రణమిల్లువున్న యాతండు; కోసలనేత =కోసలాధీశుఁడు; పరాకు; ఇతండు = నమస్కరించుచున్న యీ రాజు; కేరలుఁడు = కేరళదేశాధీశుఁడు; పరాకు; అతండు = నతి నొనర్చు నా నరపతి; కురురాజు = కురుదేశాధీశుఁడు; పరాకు=హెచ్చరిక పడుము; అని ఉగ్గడింపఁగన్ = అనుచు శబ్దించుచుండఁగా; బలు కోర్కి =మిక్కిలి యాసక్తితో; కొల్వుమ్రొక్కులు =కొలువు ప్రణామములు; ఘటియించిరి=చేసిరి.
మ. నృపరత్నంబు వినీతసూతతిలకా◊నీతప్రియస్యందనం
బపు డిం పెచ్చఁగ నెక్కి యొప్పె మఘవా◊శాద్రిం గనం బొల్చు పూ
ర్ణపయోజారి యనన్, బుధావళి నవా◊నందంబుచేఁ జూడ, న
భ్రపదం బాఁగుచు వాహినీశ్వరమహా◊భంగార్భటుల్ హెచ్చఁగన్. 155
టీక: నృపరత్నంబు = నృపశ్రేష్ఠుండగు సుచంద్రుఁడు; వినీతసూతతిలకానీతప్రియస్యందనంబు – వినీత = వినయవంతుఁడైన, సూతతిలక=ఉత్తమసారథిచేత; ఆనీత=తేబడిన; ప్రియస్యందనంబు = ప్రియమగు రథమును; ఇంపెచ్చఁగన్= ప్రీతి హెచ్చఁగా; ఎక్కి = అధిరోహించి; అపుడు=ఆసమయమున; కనన్= చూడఁగా; మఘవాశాద్రిన్ = ఉదయగిరియందు; పొల్చు=ఒప్పు నట్టి; పూర్ణపయోజారి యనన్= పూర్ణచంద్రుఁడో యన్నట్లుగా, దీనికి ఒప్పె నను క్రియతో నన్వయము; బుధావళి=పండిత మండలి, దేవసంఘ మని యర్థాంతరము; నవానందంబుచేన్=తత్కాలోల్లసితానందముచేత; చూడన్=అవలోకింపఁగా; అభ్ర పదంబు= గగనతలమును; ఆఁగుచున్ = అడ్డగించుచు; వాహినీశ్వరమహాభంగార్భటుల్ – వాహినీశ్వర = సేనాధిపతుల యొక్క, మహత్=అధికమైన, అభంగ = అవిచ్ఛిన్నము లైన, ఆర్భటుల్ = శబ్దములు, అని రాజపరమైన యర్థము; వాహినీ శ్వర= సముద్రముయొక్క, మహాభంగ=పెద్దతరఁగలయొక్క, ఆర్భటుల్ = శబ్దము లని చంద్రపరమైన యర్థము; హెచ్చఁగన్ = అతిశయింపఁగా; ఒప్పెన్=ప్రకాశించెను.
అనఁగా సుచంద్రనృపతి రథారూఢుం డై, బుధులు మోదముతోఁ దన్నవలోకించుచుండఁగా, సేనానాయకార్భటులు హెచ్చుచుండఁగా, నుదయగిరి నధిరోహించి దేవతలు ప్రీతితో దన్నవలోకించుచుండఁగా సముద్రతరంగధ్వను లెచ్చుచుండఁగా మించు పూర్ణచంద్రునివలె భాసించె నని భావము. రూపకాలంకారభేదము. ‘తద్రూపక మభేదోయ ఉపమానోపమేయయోః’ అని కావ్యప్రకాశమందుఁ దల్లక్షణము.
వ. ఇట్టు లాలోకమిత్రుం డహీన భూరి ప్రగ్రహ ప్రకాండ పరిస్యూతంబును, నఖిల సన్మణి ప్రకర వర్ణనీయ ప్రభా భాసమా నైక చక్ర సముపేతంబును, నాశుగ మార్గాతి క్రమణ చణ వేగవ దసమావదాత తురంగ సంయోజితంబును, నమర వినుతాభిరామ ధామారుణ సారథి విభ్రాజితంబునునై విరాజిల్లు శతాంగరాజం బారోహించి, యాత్మీయ భక్తిభావ సంసక్త చిత్తంబున నడరు చక్రకాంత చక్రంబులం గటాక్షించుచు నని వార్య రసవిశేష విలసిత పద్మినీ సందోహంబుల కామోదంబుఁ గూర్చుసొంపునం బెంపొందుచు, నఖండ రాజమండల తేజోగౌరవంబు నిజ తేజో మహిమంబున సంపాదించుచు, నక్షీణ దస్యు వీక్షణ సమ్మద విక్షేపకాక్షుద్ర కరకాండ చండిమంబునఁ జూపట్టుచు, నఖర్వ శార్వర మాహాత్మ్య నిర్వాప ణోల్లాసంబున వెడలె నయ్యెడ. 156
టీక: ఇట్టులు=ఈప్రకారముగా; ఆలోకమిత్రుండు = ఆ లోకహితుం డగు సుచంద్రుఁడు, ‘ఖద్యోతో లోకబాన్ధవః’ అనుటచేత సూర్యుఁ డను నర్థాంతరము స్ఫురించును; అహీన = అధికములైన; భూరి=సువర్ణమయము లైన; ప్రగ్రహ=పగ్గములయొక్క; ప్రకాండ =సమూహముచేత; పరిస్యూతంబును=కట్టబడినది యని సుచంద్రపరమైన యర్థము, సర్పశ్రేష్ఠము లనెడు నధికము లైన పగ్గములసమూహముచేఁ గట్టఁబడిన దని సూర్యరథపరమైన యర్థము; అఖిల సన్మణి ప్రకర వర్ణనీయ ప్రభా భాసమా నైక చక్ర సముపేతంబును –అఖిల= సమస్తము లగు, సన్మణి=శ్రేష్ఠములగు మణులయొక్క, సత్పురుషశ్రేష్ఠులయొక్క యని యర్థాంతరము, ప్రకర= గుంపుచేత, వర్ణనీయ=కొనియాడఁ దగిన, ప్రభా =కాంతులచేత, భాసమాన=ప్రకాశమానము లగు, ఏక=ముఖ్య మైన, చక్ర=కండ్లతోడను, సముపేతంబును= యుక్తంబును, భాసమాన మైన యొకకంటితోడ సముపేతంబు అని సూర్యపరమైన యర్థము; ఆశుగ మార్గాతిక్రమణ చణ వేగవదసమావదాత తురంగ సంయోజితంబును—ఆశుగ=బాణము యొక్క, మార్గ=సరణియొక్క, అతిక్రమణ=అతిక్రమించుటచేత, చణ=ప్రసిద్ధము లైన, వేగవత్ = వేగవంతములగు, అసమ =అసమానములైన, అవదాత=తెల్లనైన, తురంగ= గుఱ్ఱములతోడ, సంయోజితంబును = కూడినదియు, సూర్యరథపరమై నపుడు బేసిసంఖ్య గల పచ్చగుఱ్ఱములతోడ నని యర్థము, ‘అవదాత స్సితే పీతే శుద్ధే’ అని విశ్వము; అమరవినుతాభిరామ ధామారుణ సారథి విభ్రాజితంబును – అమరవినుత=దేవతలచేఁ గొనియాడఁబడిన, అభిరామ=మనోహర మగు, ధామ= ప్రతాపముచేత, అరుణ=సూర్యతుల్యుఁడగు, సారథి=సూతునిచేత, విభ్రాజితంబును= ప్రకాశించునది యని సుచంద్రరథ పరమైన యర్థము, అమరవినుతమై యభిరామమైన తేజము గల యనూరుఁ డను సారథిచేత విభ్రాజితం బని సూర్యరథపర మైన యర్థము; ఐ = అగుచు; విరాజిల్లు = ప్రకాశిల్లు; శతాంగరాజంబు=పూర్వోక్తగుణవిశిష్ట మైన యుత్తమరథమును; ఆరో హించి= ఎక్కి; ఆత్మీయ భక్తిభావ సంసక్త చిత్తంబునన్ – ఆత్మీయ = తన సంబంధి యైన, భక్తిభావ = భక్తి యనెడు భావము చేత, స్వవిషయక మైన భక్తిభావముచేత ననుట, సంసక్త= సంబంధించిన, చిత్తంబునన్= మానసముచేత; రసగంగాధరాద్యలం కారగ్రంథములయందు భక్తికి రసత్వముఁ జెప్పినవారి మతఖండనావసరంబున ‘ శ్లో. రతి ర్దేవాదివిషయా వ్యభిచారీతథాఞ్జితః, భావః ప్రోక్తః’ అనుటచేత, భక్తిని, దేవాదివిషయకరతిభావములోఁ జేర్చినందున, నిట భక్తిభావ యని వచింపఁబడియె. మఱియు ఆత్మీయభక్తిభావ యనుచోట ‘శ్లో. జఙ్ఘాకాణ్డోరునాలో నఖకిరణలసత్కేసరాలీకరాలః ప్రత్యగ్రాలక్తకాభాప్రసరకిసలయో మఞ్జు మఞ్జీరభృఙ్గః, భర్తు ర్నృత్తానుకారే జయతి నిజతనుస్వచ్ఛలావణ్యవాపీ సంభూతామ్భోజశోభాం విదధ దభినవోదణ్డ పాదో భవాన్యాః’ అను దానియందు భవానీగతనిజప్రతీతి కావలసియుండఁగా దండపాదగతనిజత్వ ప్రతీతి యగుటనుబట్టి విరుద్ధమతి కారిత్వరూపకావ్యదోషము ప్రసరించు నని కావ్యప్రకాశమునందుఁ జెప్పినరీతిగ సుచంద్రగతాత్మీయత్వప్రతీతి కావలసియుండఁ గాఁ జక్రకాంతగతాత్మీయప్రతీతి యగుటవలనఁ బైఁ జెప్పినదోషము ప్రసరించు నని తోఁచును గాని ‘నత్వా సాంబం శివం బ్రహ్మ నాగేశః కురుతే’ అనుచోట జగన్నిరూపితాంబాత్వప్రతీతివలెఁ బ్రధానభూతక్రియాకర్తృనిరూపితాత్మీయత్వప్రతీతి నవలంబించి నందున నట్టిదోషంబు ప్రసరింప దని యెఱుంగునది. అడరు = ఒప్పునట్టి; చక్రకాంతచక్రంబులన్ = రాష్ట్రాధిపతులయొక్క సంఘములను; చక్ర=చక్రవాకపక్షులయొక్క, కాంత= మనోజ్ఞములగు, చక్రంబులన్=సంఘముల నని యర్థాంతరము; కటా క్షించుచున్=అవలోకించుచు; అనివార్యరసవిశేష విలసితపద్మినీ సందోహంబులకున్ – అనివార్య= అడ్డగింపరాని, రసవిశేష = ఆసక్తివిశేషముచేత, అధికమైన మకరందముచేత నని యర్థాంతరము, విలసిత=ప్రకాశించునట్టి, పద్మినీ= పద్మినీజాతిస్త్రీల యొక్క, తామరతీవలయొక్క యని యర్థాంతరము, సందోహంబులకున్ =గుంపులకు; ఆమోదంబున్ =సంతసమును; కూర్చుసొంపునన్=ఘటింపఁజేయు సౌందర్యమువలన; పెంపొందుచున్ = అతిశయించుచు; అఖండ రాజమండల తేజో గౌరవంబు – అఖండ=అవిచ్ఛిన్నమగు, రాజమండల =నృపసంఘముయొక్క, పూర్ణచంద్రమండలముయొక్క, తేజోగౌర వంబు=ప్రతాపాతిశయము, కాంత్యతిశయము; నిజతేజోమహిమంబునన్ = తనప్రతాపమహిమముచేత; సంపాదించుచున్= కలుగఁజేయుచు; అక్షీణ దస్యు వీక్షణసమ్మదవిక్షేపకాక్షుద్ర కర కాండ చండిమంబునన్ – అక్షీణ = తక్కువ గాని, దస్యు= శత్రువులయొక్క, దొంగలయొక్క, వీక్షణ=చూపులయొక్క, సమ్మద=సంతసమునకు, విక్షేపక = నాశకము లగు , పగలు చోరులకు సందర్భము ఘటింపదు గాన దొంగలసంతసమునకు సూర్యతేజము నాశక మనుట, అక్షుద్ర =అధికము లైన, కర= హస్తమందలి,కాండ=బాణములయొక్క, చండిమంబునన్=ఉగ్రతవలన, కరకాండ=కిరణసమూహముయొక్క చండిమం బున నని సూర్యపర మైన యర్థము; చూపట్టుచున్ = అగపడుచు; అఖర్వ శార్వర మాహాత్మ్య నిర్వాపణోల్లాసంబునన్ – అఖర్వ= అధికమగు, శార్వర = శత్రువు లగు రక్కసులయొక్క, చీకటియొక్క యని సూర్యపర మైన యర్థము, మాహాత్మ్య =గొప్పదనముయొక్క, నిర్వాపణ=ప్రశమనమందు, ఉల్లాసంబునన్ =సంతోషముచేత, ప్రకాశముచేత; వెడలెన్=బయలు దేఱెను; అయ్యెడన్=ఆసమయమున. ఇట సూర్యునకు, సుచంద్రునకు నౌపమ్యము గమ్యము గావున నుపమాలంకారధ్వని.
చ. హరిభయకృద్రయాన్వితము◊లై, యభిరూపకలాపజాతభా
స్వరత వహించి, చూడఁదగు ◊వాజివరంబుల నెక్కి రాజశే
ఖరతనయౌఘ మేఁగె మహి◊కాంతుని వెంబడి దివ్యశక్తితో
నరు దగు తారకాత్మదర◊దాత్మసమాఖ్య బుధుల్ నుతింపఁగన్. 157
టీక: ఈపద్యమందు సుచంద్రపరమైన యర్థముఁ, గుమారస్వామిపరమైన యర్థముఁ గలుగుచున్నది. హరి భయకృ ద్రయాన్వితములు ఐ – హరి=వాయువునకు, సర్పముల కని యర్థాంతరము, భయకృత్ =వెఱపు పుట్టించెడు, రయ=వేగముతోడ, అన్వితములు ఐ =కూడినవై; అభిరూప కలాప జాత భాస్వరతన్ – అభిరూప=మనోజ్ఞము లగు, కలాప =భూషణములయొక్క, మనోజ్ఞ మగు పింఛముయొక్క యని యర్థాంతరము, ‘కలాపో భూషణే బర్హే’ అని యమరుఁడు, జాత=కల్గిన, భాస్వరతన్=ప్రకాశమును; వహించి= ధరించి; చూడఁదగు =చూచుట కింపైన; వాజివరంబులన్ = అశ్వరత్న ములను, కుమారస్వామిపరమై నపుడు పక్షిశ్రేష్ఠములను, నెమ్ముల నని భావము; ఎక్కి =అధిరోహించి; రాజశేఖర తనయౌ ఘము = రాజశ్రేష్ఠుల కుమారసంఘము, చంద్రశేఖరుని కుమారు లైన షణ్ముఖులసంఘ మని ధ్వన్యమానార్థము; దివ్యశక్తితోన్ =అమానుషసామర్థ్యముతో, దివ్య మగు శక్తి యను నాయుధముతో నని స్కందపరమైన యర్థము; అరుదగు తారకాత్మ దర దాత్మసమాఖ్యన్ – అరుదగు =ఆశ్చర్యకరమైన; తారకాత్మ=నక్షత్రదేహములను, దర=శంఖమును, ద=ఖండించెడు, ఆత్మ సమాఖ్యన్=తనకీర్తిని; తారక=తారకాసురునియొక్క, ఆత్మ=చిత్తమునకు, దరద= భయము నిచ్చెడు, ఆత్మసమాఖ్యన్ = తనపేరిని; బుధుల్ = పెద్దలు, దేవతలు అని స్కందపరమైన యర్థము; నుతింపఁగన్ = కొనియాడఁగా; మహికాంతునివెంబడిన్ = సుచంద్రుని వెంబడి; ఏఁగెన్=చనుదెంచెను.
అనఁగా సర్పములకు భయంకర మగు వేగమును వహించి, మనోహరమగు పింఛమును దాల్చిన మయూరము నెక్కి, శక్త్యాయుధముతోఁ గూడి, తారకాసురాత్మభయంకర మగు తన పేరిని దేవతలు నుతించు చుండఁగా స్కందుండు వెడలినట్లు రాజకుమారులు వాయుభయంకరమైన వేగము గల్గి, మనోహరభూషణములు దాల్చి భాసిల్లు నశ్వరత్నముల నెక్కి, యమా నుష మైన బలిమితోఁ గూడి, నక్షత్రశంఖకాంతులను దిరస్కరించు తమకీర్తిని బెద్దలు గొనియాడుచుండఁగా సుచంద్రుని వెంట నేతెంచి రని భావము. ప్రస్తుతాప్రస్తుతోపమాధ్వని యని తెలియునది.
చ. తనుపులకాలిమేలు పయిఁ ◊దార్చిన బంగరుజూలుచాలు చ
క్కనికటిసీమలం దనరు ◊గైరికరేఖలడాలు సాలఁ గ
న్గొన ముద మూన్ప భద్రకరి◊కోటులు వెల్వడె రాజువెంటఁ జ
య్యనఁ బదమేఘగాళితతు ◊లందుకజాలకయుక్తిఁ బూనఁగన్. 158
టీక: భద్రకరికోటులు = భద్రగజసమూహములు; తనుపులకాలిమేలు – తను=శరీరమందలి, పులక = రోమాంచములయొక్క, ఆలి=పంక్తియొక్క, మేలు =అతిశయము; పయిన్=శరీరమందు; తార్చిన బంగరుజూలుచాలు = ఉంచినట్టి బంగరుజూలు యొక్క చాలు; చక్కనికటిసీమలన్ = అందమైన కటిప్రదేశములందు; తనరు గైరికరేఖలడాలు = ఒప్పుచున్న ధాతురేఖల కాంతి; కన్గొనన్ = చూడఁగా; చాలన్=మిక్కిలి; ముదము=సంతసమును; ఊన్పన్=చేయఁగా; చయ్యనన్=వేగముగా; పద = పదములందున్న; మేఘ=మేఘమను మదోదకమును; గాళి(గ+అళి) –గ=పొందినట్టి, అళి=తుమ్మెదలయొక్క; తతులు = గుంపులు; అందుకజాలకయుక్తిన్=నిగళసమూహముయొక్క కూడికను; పూనఁగన్=వహింపఁగా;రాజువెంటన్=సుచంద్రుని వెంబడి; వెల్వడెన్=బయలుదేఱెను.
మ. అమరెం దత్సృతి నేఁగు నీలమయచ◊క్రాంగంబు లింద్రావరో
ధముఁ దప్పించుక ధాత్రిఁ జేరిన సము◊ద్యత్పుష్కలావర్తము
ఖ్యమహామేఘకులంబులో యనఁగఁ జ◊క్కం గాండధారావిశే
షములుం, భూరిమణీశరాసనవిభా◊జాతంబులుం జూడఁగన్. 159
టీక: తత్సృతిన్=ఆ సుచంద్రుఁడు పోవుదారిని; ఏఁగు =పోవుచున్న; నీలమయ=ఇంద్రనీలమణిమయము లగు; చక్రాంగం బులు=రథములు; ఇంద్రావరోధమున్=ఇంద్రుని యడ్డగింతను; తప్పించుక=వదిలించుకొని; ధాత్రిన్=భూమిని; చేరిన = పొందిన; సముద్యత్=ప్రకాశించుచున్న; పుష్కలావర్తముఖ్య =పుష్కలావర్తము మొదలగు; మహామేఘ=గొప్పమేఘముల యొక్క; కులంబులో యనఁగన్=గుంపులోయనునట్లుగా,దీని కమరెన్ అనుక్రియతోనన్వయము; చక్కన్=బాగుగా; కాండ ధారావిశేషములున్ =గుఱ్ఱాలయొక్క గతివిశేషములను, ‘ఆస్కందితం ధౌరితకం రేచితం వల్గితం ప్లుతం గతయోమూః పఞ్చ ధారాః’ అని యమరుఁడు, జలధారల విశేషముల నని మేఘపరమైన యర్థము; భూరిమణీ శరాసన విభా జాతంబులున్ – భూరిమణీ= అధికమణులు గల, శరాసన=ధనువులయొక్క,ఇంద్రధనువులయొక్క, విభా=విశేషకాంతులయొక్క, జాతం బులన్ =సంఘములను; చూడఁగన్ =అవలోకింపఁగా; అమరెన్=ఒప్పెను. ఉత్ప్రేక్షాలంకారము.
చ. అనఘవిసారపాళియుతి, ◊నంచితశుభ్రశరాప్తిఁ, బుండరీ
కనిచయలబ్ధి, నాగవర◊కాండనిషక్తిఁ, గనం బొసంగువా
హిని యల యంశుమత్కులమ◊హీశ్వరు వెంబడి నేఁగఁ జొచ్చె న
భ్రనది భగీరథానుసృతి ◊భవ్యరయస్థితి నేఁగుచాడ్పునన్. 160
టీక: ఈపద్యమున సుచంద్రునివెంటఁ జనుసేన భగీరథునివెంటఁ జనుగంగవలె నున్నదని వర్ణించుటం జేసి సేనాభగీరథుల పర మైన యర్థద్వయము గల్గుచున్నది. అనఘవిసార పాళి యుతిన్ – అనఘ=ఒచ్చెములేని, విసార=ప్రసరణము గల, పాళి=టెక్కెములయొక్క, యుతిన్ = సంబం ధముచేత నని సేనాపరమైన యర్థము, అనఘములైన మత్స్యవిశేషములయొక్కగుంపుల చేత నని గంగాపరమైన యర్థము, ‘విసార శ్శకులార్భకః’ అని యమరుఁడు; అంచిత శుభ్ర శరాప్తిన్ – అంచిత = ఒప్పుచున్న, శుభ్ర=నిర్మలము లైనట్టి, శర= బాణములయొక్క, జలములయొక్కయు,ఆప్తిన్=ప్రాప్తిచేతను; పుండరీకనిచయలబ్ధిన్ = వెల్లగొడుగులగుంపులయొక్క లాభముచేతను, తెల్లతామరల గుంపులయొక్క లాభముచేతను; నాగ వరకాండ నిషక్తిన్ – నాగ=గజములయొక్కయు, వర కాండ= శ్రేష్ఠాశ్వములయొక్కయు, నిషక్తిన్ =సంబంధముచేతను, ‘కాణ్డో స్త్రీ దణ్డ బాణార్వ వర్గావసర వారిషు’ అని యమ రుఁడు; నాగవర=సర్పశ్రేష్ఠములయొక్క, కాండ=సమూహముయొక్క, నిషక్తిన్=సంబంధముచేత నని గంగాపరమైన యర్థము; కనన్=చూచుటకు; పొసంగువాహిని = ఒప్పుచున్న సేన, నది యని యర్థాంతరము దోఁచును; అల యంశుమ త్కుల మహీశ్వరు వెంబడిన్= ఆసూర్యవంశీయుఁడగు సుచంద్రుని వెంబడి; అభ్రనది =ఆకాశగంగ; భగీరథానుసృతి=భగీర థుని ననుసరించినదై; భవ్యరయస్థితిన్=అధికవేగవృత్తిచేత; ఏఁగుచాడ్పునన్ = పోవురీతిగా; ఏఁగఁ జొచ్చెన్=పోవ నారం భించెను; సురనదికి, సేనకు నుపమానోపమేయభావమున నుపమాలంకారము. సుచంద్రునకు, భగీరథునకు బింబప్రతిబింబ భావాదు లూహ్యంబులు. రాజువెంబడి సేన వెడలు చుండఁగా భగీరథచక్రవర్తివెంబడి స్వర్గంగ పోవుచున్నరీతిగా నున్నదని భావము.
చ. కలితమృదంగతుంగరవ◊గర్జ, నటత్త్రిదశీతనుప్రభో
జ్జ్వలచపలాళి యంబుధర◊వర్త్మమునం దగ నాధరేంద్రుపై
నలరెడు మానసంబున మ◊హాశరజాతవినాశ ముర్వరం
దెలుపు ప్రసూనవృష్టి జగ◊తీధరశత్రువు నించె నయ్యెడన్. 161
టీక: కలిత మృదంగ తుంగరవ గర్జ –కలిత=ఒప్పుచున్న, మృదంగ=మృదంగముయొక్క, తుంగరవ= అధికమగు ధ్వని యనెడు, గర్జ=మేఘధ్వనియు; నటత్ త్రిదశీ తనుప్రభోజ్జ్వల చపలాళి – నటత్= నర్తించుచున్న, త్రిదశీ = దేవాంగనలయొక్క, తనుప్రభా=దేహకాంతి యనెడు, ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, చపలా=మెఱుపులయొక్క,ఆళి=పంక్తి; అంబుధర వర్త్మము నన్=ఆకసమునందు; తగన్=ఒప్పఁగా; ఆధరేంద్రుపైన్= ఆ సుచం ద్రునిమీఁద, ఆపర్వతముమీఁద నని యర్థాంతరము స్ఫురిం చును; అలరెడు మానసంబునన్ = ఒప్పుచున్న మనస్సుచేత, అతనిపైఁ బ్రీతిచేత ననుట, మానసమను సరోవరమం దని యర్థాం తరధ్వని; ఉర్వరన్=భూమియందు; మహాశర జాత వినాశము–మహత్=ఉత్కృష్టులైన,ఆశర=రాక్షసులయొక్క, జాత= సంఘముయొక్క, వినాశము=క్షయమును; మహత్=ఉత్కృష్టమగు,శరజాత=పద్మములయొక్క వినాశము నని యర్థాంతర ధ్వని; తెలుపు ప్రసూనవృష్టి= తెలియఁజేయుచున్నపుష్పవృష్టి యను వర్షము; అయ్యెడన్=ఆ సమయమందు; జగతీధర శత్రువు=పర్వతారి యైన యింద్రుఁడు; నించెన్ =పూరించెను. పర్వతములయందు మేఘము జలము వర్షించురీతి నింద్రుఁడు సుచంద్రునిపైఁ బ్రీతితోఁ బుష్పముల వర్షించె నని భావము.
చ. అలయజరాపగన్ రవికు◊లాధిపుపార్శ్వగవాహపాశ్వని
స్తులగతిజైలధూళివిత◊తుల్ విరళోదయ గాఁగ ఘటింపఁ ద
ద్బలవిచరద్గజేశకర◊పాళి నిజామితశీకరాంబుమం
డలిని రసోదయస్థితిఁ బె◊నంగఁగ నెంతయుఁ దార్చెఁ జిత్రతన్. 162
టీక: అల యజరాపగన్ =ఆవిశాలపురి చెంత నున్నగంగను; రవికులాధిపు పార్శ్వ గ వాహపాశ్వ నిస్తులగతి జైల ధూళి వితతుల్– రవికులాధిపు=సుచంద్రునియొక్క, పార్శ్వ=ప్రక్కలను, గ=పొందినట్టి, వాహప = రౌతులయొక్కయు, అశ్వ= గుఱ్ఱములయొక్కయు, నిస్తులగతి =అసమానమైన గమనమువలన, జ= పుట్టిన, ఐల=ఇలాసంబంధ మగు, ఇల యనఁగా భూమి, ‘గౌరిలా కుమ్భినీ క్షమా’ అని యమరుఁడు; ధూళి=పరాగములయొక్క, వితతుల్= గుంపులు; విరళోదయ గాఁగన్ =కొంచ మైన యావిర్భావము గలదానిఁగా, తక్కువగా ననుట; ఘటింపన్ =చేయఁగా; తద్బల విచర ద్గజేశ కరపాళి –తత్= ఆసుచంద్రునియొక్క,బల=సైన్యమందు, విచరత్=సంచరించుచున్న, గజేశ=కరిశ్రేష్ఠములయొక్క,కర=తుండములయొక్క, పాళి=పంక్తి; నిజామిత శీకరాంబు మండలిన్ – నిజ=స్వకీయము లగు, అమిత=అధికము లగు, శీకరాంబు=నీటితుంపరల యొక్క, మండలిన్=సమూహముచేత; రసోదయస్థితిన్—రస=నీటియొక్క, ఉదయ= ఆవిర్భావముయొక్క, స్థితిన్=ఉనికి చేత; పెనంగఁగన్=కూడునట్లు; చిత్రతన్ = ఆశ్చర్యముచేత; ఎంతయున్=మిక్కిలి; తార్చెన్= చేసెను. ఆశ్చర్యకరమగు రీతిగాఁ జేసె ననుట. ఇచట విరళోదయ గాఁగ ఘటింప ననుచోట విగత మైన రేఫము గల లకారము యొక్క యుదయము గల దానిఁగా నని యర్థమువలన అజరాపగ యనుచోట రేఫముపోయి దానిస్థానమందు లకార ముదయించఁగా అజరాపగ అజలాపగ యగు ననియు, అంబుమండలిని రసోదయస్థితి అనుచోట అంబుమండలి నిరసోదయస్థితి యని పదవిభాగము చేసి, నిర్=గతమైన, అ=అకారముగల, స=సకారముయొక్క ఉదయస్థితిచేత నని యర్థము చేయుటవలన అజరాపగశబ్ద ములో అకారము పోయి దాని స్థానమందు సకార ముదయింపఁగా అజరాపగ సజలాపగ అగు ననియు చిత్రత నెఱుంగునది. ఈపద్యమందు ‘శ్లో. రాజం త్సప్తాత్యకూపారా స్త్వత్ప్రతాపాగ్నిశోషితాః, పున స్త్వదరినారీణాం బాష్పపూరేణ పూరితాః’ అను శ్లోకమందుబలె నత్యుక్త్యలంకారము.
చ. అతులితవైజయంతయుతి, ◊నంచితసాగరజాతదంతిసం
గతి, ఘనచక్రిసంభృతి, న◊ఖండితవైభవదేవనాయకా
యతిఁ, దనరారు నానృపబ◊లాళి యెసంగె ధరిత్రి జంగమ
స్థితిఁ జరియించులేఖపురి◊చెల్వునఁ జూపఱ కింపు నింపుచున్. 163
టీక: ఇందు సేనాపరమైన యర్థము, అమరావతీపరమైన యర్థములు గలుగుచున్నవి. అతులితవైజయంతయుతిన్ – అతులిత =సాటిలేని, వైజయంత=టెక్కెములయొక్క, యుతిన్ = సంబంధముచేత నని సేనాపరమైన యర్థము. అతులితమైన యింద్ర నగరుయొక్క సంబంధముచేత నని అమరావతీపరమైన యర్థము. ‘స్యా త్ప్రాసాదో వైజయన్తః’ అని యమరుఁడు; అంచిత సాగరజాత దంతి సంగతిన్ –అంచిత=ఒప్పుచున్న,సాగరజాత=దీవులయందుఁ బుట్టిన,దంతిసంగతిన్=గజసంబంధముచేత, అంచిత మైన సాగరజాతదంతి యనఁగా నైరావతము. దాని సంబంధముచేత నని యర్థాంతరము; ఘనచక్రిసంభృతిన్ – ఘన= గొప్పనైన, చక్రి=రథములయొక్క, సంభృతిన్=భరణముచేతనని సేనాపరమైన యర్థము. ఘనుఁడైన విష్ణువుయొక్క భరణము చేత నని యర్థాంతరము; అఖండితవైభవ దేవ నాయకాయతిన్ – అఖండిత వైభవ=అవిచ్ఛిన్నములైన వైభవములచేత, దేవ= ప్రకాశించుచున్న, ‘దివు క్రీడా వ్యవహార ద్యుతి స్తుతి మోదమద స్వప్న కాన్తి గతిషు’ అని యనుశాసనము, నాయక=రాజుల యొక్క, ఆయతిన్= సమృద్ధిచేత నని సేనాపరమైన యర్థము. అఖండితవైభవము గల సురశ్రేష్ఠుల సమృద్ధిచేత నని యర్థాంత రము; తనరారు = ఒప్పుచున్న; ఆనృపబలాళి = ఆసుచంద్రునియొక్క సేనాకదంబము; ధరిత్రిన్=భూమియందు; జంగమ స్థితిన్ = జంగమవృత్తిచేత; చరియించు=సంచరించుచున్న; లేఖపురిచెల్వునన్ =అమరపురియందమున; చూపఱకున్=అవ లోకించు జనమునకు; ఇంపు నింపుచున్=సుఖముఁజేయుచు; ఎసంగెన్=ఒప్పారెను. శ్లేషభిత్తికాభేదాధ్యవసాయముచేత వైజ యంతికాదిరూపముగా నధ్యవసానము చేయఁబడిన వైజయంతప్రాసాదము మొదలగు వానిచే సేనాకదంబము సురనగరముగా నగపడుచున్నదని తాత్పర్యము. ఉపమాలంకారభేదము.
ఉ. ఆతఱిఁ గాన రాజిలె మ◊హాప్రతికూలభిదానిదానవి
ద్యోతితకాండమండితచ◊మూదధిశేఖరమధ్యవీథి ము
క్తాతివిభాసితం బగు శ◊తాంగవరేణ్యముపైఁ దదుర్వరా
నేత సితాంతరీపమున ◊నీటువహించిన విష్ణుపోలికన్. 164
టీక: తదుర్వరానేత=ఆభూపతి యైన సుచంద్రుఁడు; ఆతఱిన్=ఆసమయమందు; మహా ప్రతికూల భిదా నిదాన విద్యోతిత కాండ మండిత చమూదధి శేఖర మధ్యవీథిన్ – మహాప్రతికూల = మిగులవిరోధులయొక్క, గొప్పలైన యెదురుదరులయొక్క యని యర్థాంతరము, భిదా=భేదనమందు, నిదాన=ఆదికారణమైన, విద్యోతిత=ప్రకాశించునట్టి,కాండ=బాణములచేత, జలముల చేత నని యర్థాంతరము,మండిత=రాజిల్లునట్టి, చమూ=సేన యనెడు, ఉదధి=సముద్రముయొక్క, శేఖర=శిరస్సుయొక్క, మధ్యవీథిన్=మధ్యప్రదేశమునందు; ముక్తాతివిభాసితం బగు శతాంగవరేణ్యముపైన్ – ముక్తా=ముత్యములచేత, ముక్తులగు వారిచేత నని యర్థాంతరము, అతివిభాసితంబు = మిగుల ప్రకాశమానము, అగు =ఐనట్టి, శతాంగవరేణ్యముపైన్=రథశ్రేష్ఠము మీఁద; కానన్=చూడఁగా; సితాంతరీపమునన్ = శ్వేతద్వీపమందు; నీటువహించిన = అందము దాల్చినట్టి; విష్ణుపోలికన్ = శ్రీమహావిష్ణువువలె; రాజిలెన్=ప్రకాశించెను. అనగా సుచంద్రనృపతి సేనామధ్యమున ముత్యపుసరులతో రాజిల్లు రథము నధి ష్ఠించి, సముద్రమధ్యమున ముక్తులతో రాజిల్లు శ్వేతద్వీపములో నున్న విష్ణుమూర్తివలె వెలసె నని భావము.
తే. అపుడుసదనీకమధ్యగుం ◊డగుచు నలధ
రారమణమౌళి నేత్రప◊ర్వంబుఁ గూర్చె
విమలనక్షత్రలోకసం◊వృతి ధరిత్రిఁ
జేరినట్టి సుధాసూతి చెలువుఁ బూని. 165
టీక: అల ధరారమణమౌళి = ఆరాజశేఖరుఁడగు సుచంద్రుఁడు; అపుడు=ఆసమయమందు; సదనీక మధ్యగుం డగుచున్= పండితమండలీమధ్యముననున్నవాఁడగుచు; విమలనక్షత్రలోకసంవృతిన్ = నిర్మలము లగు నక్షత్రములగుంపులయొక్క పరివేష్టనముచేత; ధరిత్రిన్=భూమిని; చేరినట్టి, సుధాసూతి = చంద్రునియొక్క; చెలువున్=అందమును; పూని=వహించి; నేత్రపర్వంబున్=నేత్రోత్సవమును; కూర్చెన్ = ఘటిల్లఁజేసెను. అనఁగా జయమునకు వెడలునపుడు సుచంద్రుఁడు నీతివిద్యాస్త్ర విద్యావేత్తలతోఁ బరివేష్టితుఁ డై నక్షత్రకదంబముతోఁ బరివేష్టితుఁ డైన చంద్రునివలెఁ బ్రకాశించె నని తాత్పర్యము.
క. జననాథుఁడిట్లు సేనా
జనసంవృతుఁడగుచు నరిగె ◊సమ్మిళదళినీ
నినదవనీసునదధునీ
కనదవనీధరవరాళి◊కం గనుఁగొనుచున్. 166
టీక: ఇట్లు=ఈప్రకారముగా; జననాథుఁడు=సుచంద్రుఁడు; సేనాజనసంవృతుఁ డగుచున్=సేనలగుంపులతోఁ గూడినవాఁ డగుచు; సమ్మిళదళినీ నినద వనీ సునదధునీ కన దవనీధరవరాళికన్ – సమ్మిళత్= మిక్కిలి కూడుచున్న, అళినీ=ఆఁడు తుమ్మెదలయొక్క, నినద=ధ్వనిగల, వనీ=వనములయొక్క, సు=సమీచీనములైన, నద=పురుషప్రవాహములయొక్క, ధునీ=స్త్రీప్రవాహములయొక్క, కనత్ = ఒప్పుచున్న, అవనీధరవర=పర్వతశ్రేష్ఠములయొక్క, ఆళికన్ =గుంపును; కనుఁ గొనుచున్ = అవలోకించుచు; అరిగెన్= పోయెను.
చ. అలపతి గాంచెఁ జెంత ఘన◊హైమగుహాగృహవాసికిన్నరీ
కులమణివల్లకీసమను◊కూలమనోహరగీత్యుపాంగదు
జ్జ్వలసురసాలజాలసుమ◊వల్లరికావిచరన్మిళిందని
ర్మలరవభగ్నపాంథజన◊మానకవాటము హేమకూటమున్. 167
టీక: అలపతి=ఆసుచంద్రుఁడు; చెంతన్=సమీపమున; ఘన హైమగుహా గృహ వాసి కిన్నరీకుల మణివల్లకీ సమనుకూల మనో హర గీత్యుపాంగ దుజ్జ్వల సురసాల జాల సుమ వల్లరికా విచర న్మిళింద నిర్మలరవ భగ్న పాంథజన మానకవాటమున్ – ఘన = గొప్పలగు, హైమ=సువర్ణమయములగు, గుహా=గుహలనెడు, గృహ= ఇండ్లయందు, వాసి=వసించియుండు, కిన్నరీకుల =కిన్నరస్త్రీలగుంపులయొక్క, మణివల్లకీ =మణులవీణలయొక్క, సమనుకూల=మిక్కిలి యనుకూలమగు, మనోహర = మనోజ్ఞమైన, గీతి=గానమునకు, ఉపాంగత్ = సుతి యగుచున్న, ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, దీనికిమిళిందనిర్మలరవమం దన్వయము, సురసాల= కల్పతరువులయొక్క, జాల=గుంపుయొక్క, సుమ=పువ్వులయొక్క, వల్లరికా=తీఁగలయందు, విచరత్= సందడించుచున్న, మిళింద=తుమ్మెదలయొక్క,నిర్మల=స్వచ్ఛమగు,రవ=ధ్వనిచేత,భగ్న=బ్రద్దలు చేయఁబడిన, పాంథజన=పథికసంఘముయొక్క, మానకవాటమున్=మాన మనెడు ద్వారము గలదానిని, హేమకూటమున్=హేమకూట మను పర్వతమును; కాంచెన్=చూచెను.
చ. కనుఁగొని తన్మహీభృదుప◊కంఠమునన్ నిజరాజధానిపొ
ల్పున సుమనోనికాయపరి◊భూషిత యై, కలకంఠికామణీ
జనయుత యై, కనత్కనక◊సాలసమన్విత యై పొసంగు చ
క్కనివని వేడ్క వేలము డి◊గన్ ఘటియించె జనేంద్రుఁడయ్యెడన్. 168
టీక: కనుఁగొని =హేమకూటమును జూచి; జనేంద్రుఁడు=సుచంద్రుఁడు; తన్మహీభృదుపకంఠమునన్ = ఆపర్వతసమీపమున; నిజరాజధానిపొల్పునన్=తనవిశాలపురీవిధమున; సుమనోనికాయ పరిభూషిత యై – సుమనోనికాయ=జాజిగుమురులచేత నని వనీపరమైన యర్థము, పండితమండలిచేత నని విశాలాపురీపరమైన యర్థము, పరిభూషిత ఐ= అలంకృత యై; కలకంఠికా మణీ జన యుత ఐ – కలకంఠికామణీ=శ్రేష్ఠమైన యాఁడుగోయిలలయొక్కయని వనీపరమైన యర్థము, స్త్రీరత్నములయొక్క యని పురీపరమైన యర్థము, జన=సమూహముచేత, యుత ఐ =కూడినదై; కన త్కనకసాల సమన్విత ఐ – కనత్=ప్రకాశించు చున్న, కనకసాల=సంపెఁగచెట్లతోడ నని వనీపరమైన యర్థము, బంగరుకోటలతోడ నని పురీపరమైన యర్థము, సమన్విత ఐ =కూడుకొన్నదై; పొసంగు చక్కనివనిన్ = ఒప్పుచున్న మంచివనమందు; అయ్యెడన్= ఆసమయమునందు; వేడ్కన్= ఉత్సా హముతోడ; వేలము =సేనను; డిగన్ ఘటియించెన్ = డిగునట్లు చేసెను.
ఆశ్వాసాంతపద్యములు
మ. తనుభానిర్జితమార, మారరిపుకాం◊తాచిత్తసంసార, సా
రనిరస్తాఘకవార, వారణభిదా◊రాజద్బలోదార, దా
రనివేశాయితసూర, సూరసితభా◊రమ్యాక్షివిస్తార, తా
రనిభఖ్యాతివిసార, సారసభవ◊ప్రస్తుత్యనిత్యోదయా! 169
టీక: తనుభానిర్జితమార = దేహకాంతిచేత గెలువఁబడిన మదనుఁడు గలవాఁడా; మారరిపుకాంతాచిత్త సంసార – మారరిపు= శివునకు, కాంతా=ప్రియ యగు పార్వతియొక్క, చిత్త=హృదయమునందు, సంసార= చరించుచున్నవాఁడా, విష్ణువు పార్వతికిఁ బుత్రుడు గనుక నాతనియం దామెకు వాత్సల్య మున్న దనుట. బ్రహ్మవైవర్త గణేశఖండమునందు విష్ణువు గణేశ రూపముగాఁ బార్వతికిఁ బుత్రుఁడైనట్టు లున్నది; సారనిర స్తాఘకవార= బలముచేత నిరసింపఁబడిన పాపసంఘము గల వాఁడా, అఘశబ్దముపై కప్ప్రత్యయము; వారణ భిదా రాజ ద్బలోదార – వారణ=కువలయాపీడ మను గజముయొక్క, భిదా =భేదనమందు, రాజత్= ప్రకాశించుచున్న, బల=సామర్థ్యముచేత, ఉదార =ఉత్కృష్టుఁడైన వాఁడా; దార నివేశాయిత సూర – దార= భార్య యగు లక్ష్మీదేవికి, నివేశాయిత=గృహముగా నాచరించుచున్న, సూర =మంచి వక్షస్థ్సలముగల వాఁడా; సూర సితభా రమ్యాక్షి విస్తార –సూర =సూర్యుఁడు, సితభా=చంద్రుఁడు అనెడు, రమ్య=చక్కని, అక్షి=నేత్రములయొక్క,విస్తార = విస్తారము గలవాఁడా; తారనిభ ఖ్యాతివిసార=నక్షత్రములతో సమానమైన కీర్తిప్రసారము గలవాఁడా; సారసభవప్రస్తుత్యనిత్యో దయా –సారసభవ=బ్రహ్మచేత, ప్రస్తుత్య=కొనియాడఁదగిన, నిత్యోదయా=నిరంతరాభ్యుదయము గల వాఁడా! ఈసంబోధనలకును ముందు చెప్పబోవు రెండుపద్యములందలి సంబోధనలకును నిది ప్రథమాశ్వాసము అను గద్యముతో నన్వయము. ఇందు ముక్తపదగ్రస్త మను శబ్దాలంకారము.
క. శరణాగతశుభకరణా!
కరణాతీతాత్మవివిధ◊కార్యాచరణా!
చరణానతాసుహరణా!
హరణాయితసత్స్యమంత◊కాభాభరణా! 170
టీక: శరణాగతశుభకరణా = శరణమును బొందినవారికి శుభమును జేయువాఁడా; కరణాతీతాత్మ వివిధ కా ర్యాచరణా – కరణాతీత=ఇంద్రియాతీతములైన, ఆత్మ=స్వీయములైన, వివిధ=అనేకవిధములగు, కార్య=సృష్ట్యాదికార్యములను, ఆచ రణా=ఆచరించునట్టివాఁడా; చరణానతాసు హరణా –చరణ= పాదములయందు, అనత =నమ్రులుగానివారియొక్క, అసు= ప్రాణములను, హరణా=హరించువాఁడా; హరణాయిత సత్స్యమంత కాభాభరణా – హరణాయిత=అరణముగాఁ జేయఁ బడిన, సత్స్యమంతక = మంచి స్యమంతకమణియొక్క, ఆభా=కాంతి, ఆభరణా=భూషణముగాఁ గలవాఁడా! ఇందును ముక్త పదగ్రస్తాలంకారమే.
పృథ్వి. ధరాధరమచర్చికా◊ధర !ధరారిముఖ్యోదయ
ద్దరాపహమహత్తరా◊దర! దరస్వనోత్సేకితా
శరప్రకరనిష్పత◊చ్ఛర! శరప్రభూతాలయా
వరాంకకలనప్రభా◊వర! వరప్రదానుగ్రహా! 171
టీక: ధరాధరమచర్చికాధర=ప్రశస్తపర్వత మగు మందరమును ధరించినవాఁడా; ధరారిము ఖ్యోదయ ద్దరాపహ మహత్త రాదర – ధరారిముఖ్య=ఇంద్రుఁడు మొదలగువారికి, ఉదయత్=పుట్టుచున్న, దర = భయముయొక్క, ఆపహ=పోగొట్టుట యందు, మహత్తర=అధికమగు, ఆదర=ప్రీతి గలవాఁడా; దర స్వనోత్సేకితాశర ప్రకర నిష్పతచ్ఛర–దరస్వన=పాంచజన్య ధ్వనిచేత, ఉత్సేకిత=సంజాతోత్సేకము గలవియు, ఆశర=రాక్షసులయొక్క, ప్రకర=సమూహమందు, నిష్పతత్ =పడుచు న్నవియు నగు, శర =బాణములు గలవాఁడా; శర ప్రభూ తాలయా వరాంక కలన ప్రభా వర – శర=నీటియందు, ప్రభూత= పుట్టినట్టి కమలము, ఆలయా=గృహముగాఁగల లక్ష్మియొక్క, వర=కుంకుమముయొక్క, అంక=గుర్తులయొక్క, కలన= సంబంధముచేత నైన, ప్రభా=కాంతిచేత, వర=శ్రేష్ఠుఁడైనవాఁడా; వరప్రదానుగ్రహా=వరములనిచ్చు ననుగ్రహము గలవాఁడా! ముక్తపదగ్రస్తా లంకారము. ఈకృతిపతి సంబోధనములకు నిది ప్రథమాశ్వాస మను గద్యముతో నన్వయ మని వ్రాయఁబడియె.
గద్యము: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.
గద్యము. ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదితసర్వసౌభాగ్యభాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలు సంస్థానప్రాజ్యసకలసామ్రాజ్య శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయ సత్పుత్ర సత్సంప్రదాయ శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య సరసవైదుష్య తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచిత శరదాగమసమాఖ్యవ్యాఖ్యయందుఁ బ్రథమాశ్వాసము.