(పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీవారు 2001లో పునర్ముద్రించిన 1928 సంవత్సరపు వ్యాఖ్యాయుత చంద్రికాపరిణయమునకు డా. శ్రీరంగాచార్యులు వ్రాసిన పీఠిక)
‘శ్రీవాసజ్జటప్రోలీ
భావుకపత్తనవిహార◊పటుశీలునకున్
గోవర్ధనగోవర్ధన
గోవర్ధనవృష్టిహృతికి ◊గోపాలునకున్’ 1
భారతదేశ స్వాతంత్ర్యలబ్ధికి పూర్వమున ఏర్పాటై, క్రీ.శ.1949 వరకు అనగా భారతదేశపారతంత్ర్యవిముక్తివరకు వర్ధిల్లిన సంస్థా నములయందు ఆంధ్రప్రాంతమునకు చెందినవి పాశ్చాత్యుల పరిపాలనకు లోబడి, తెలంగాణములోనివి నిజాం పరిపాలనకు లోబడి యున్నవి. ఈవిధమైన సంస్థానములలో కొన్ని పెద్దవి – మరికొన్ని చిన్నవి గలవు. ఐనను ఆయా సంస్థానాధిపతులు యథాశక్తి సాహిత్యపోషణము నొనర్చి, దేవాలయప్రతిష్ఠాదులు గావించి, సప్తసంతానప్రతిష్ఠానులైనవారు కలరు. వీరియందు రాజకవు లున్నారు. వారు ప్రౌఢప్రబంధకర్తలుగా ప్రసిద్ధులు. ప్రజోపయోగార్థమై ఆనాడు వీరొనర్చిన పనులు – సాహితీక్షేత్రము నకు జరిపిన ‘అక్షరపూజ’ ఎప్పటికిని మరువరానివి.
ఆనాడు తెలంగాణమున ఏర్పడిన సంస్థానములు నేటి మహబూబ్‌నగరం జిల్లాయందే అధికముగా నుండి, ఈజిల్లాకు సంస్థానముల జిల్లా యను ఖ్యాతిని కల్గించినవి. అట్టి సంస్థానములలో – గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, గోపాలపేట, జటప్రోలు, అలంపురం అనునవి ప్రసిద్ధములు. వీని పరిపాలకులు సహృదయులు, వదాన్యులు, రసికతాచక్రవర్తు లైనందున భారత, భాగ వత, రామాయణానువాదములే గాక వానికి వ్యాఖ్యలు, కావ్యనాటకములు, ఛందోలంకారశాస్త్రములు, సంస్కృతాంధ్రసాహితీ సంబంధ వివిధరీతుల రచనలు ప్రకాశమానము లైనవి. నాడు ఈసంస్థానములయందు జరిగిన కవిపండితసన్మానములు, ప్రౌఢ పండితవర్యుల శాస్త్రచర్చలు, జగదాశ్చర్యావధానకవితాసంపత్తు లైన తిరుపతి వేంకటేశ్వరుల అష్టశతావధానములు, నానా దేశాగత కవిపండితమండలి కొసంగిన ఆదరణ, జరిపిన సత్కారములు – ఈ సంస్థానాధిపతుల చిరయశస్సునకు ప్రతీకలు.
తమ రాజభవనసభాస్థలికి కవులు పండితులు విచ్చేయు మార్గమున తెల్లనివస్త్రమును పరచి, వారందరు లోపలికి వెళ్ళిన తరువాత ఆ వస్త్రమును తీసి అందలి పాదధూళిని ఒకదగ్గరగా చేర్చి, అనునిత్యము రాజులు, రాణులు ధరించు కుంకుమ బర ణిలో ఆపాదధూళిని మిశ్రిత మొనర్చి తిలకధారణము చేసికొనుచు తమ జన్మ ధన్యమైనదని భావించిన సంస్థానాధిపతుల వినయవిధేయతలేగాక, కవిపండితులయందు వారెంత బద్ధాదరులై గౌరవించినారో తెలిసికొనుటకు ఈ సన్నివేశమే ప్రబలోదా హరణము.
జటప్రోలు పద్మనాయకులు
జటప్రోలు ఇట్టి సంస్థానములలో నొకటిగా నున్నది. దీని పరిపాలకులు సురభిగృహనామధేయులైన పద్మనాయకులు. సంస్థానము వర్ధిల్లిన కాలము 20-9-1949 వరకు. మహబూబునగరం జిల్లాలోని సంస్థానములయందు కాలానుపూర్విగా మొట్టమొదటిది గద్వాలసంస్థానము, రెండవది ఆత్మకూరు, మూడవది జటప్రోలు. వీని తర్వాతనే వనపర్తి, అలంపురం, గోపాలుపేట సంస్థానము లేర్పడినవి. ఒక్క జటప్రోలు మాత్రమే పద్మనాయకుల ఏలుబడిలోనిది. మిగిలిన వన్నియు రెడ్లు అధిపతులుగా నున్నట్టివి.
జటప్రోలు సంస్థానము మధ్యయుగమునుండి సంస్థానముల విలినీకరణ జరుగువరకు (20-9-1949) పద్మనాయకులు పరిపాలకులుగా వర్ధిల్లినది. వీరు కాకతీయులకు, తరువాత గోలకొండ సుల్తానులకు సామంతులైన చిన్న రాజులు. జటప్రోలు వారిలో పదితరములు వంశానుగతప్రభువులు, ఐదుతరములు దత్తప్రభువులున్నారు.
ఆనాడు జటప్రోలు సంస్థానము 357 చదరపుమైళ్ళ విస్తీర్ణము కలది. దీనియందు ఒకవంద ఆరు గ్రామము లున్నవి. సంస్థాన ఆదాయం సాలీనా రెండులక్షలు. కృష్ణానదీతీరభూమియందు జటప్రోలు కోట – దాని సమీపముననే వీరి ఆరాధ్యదైవ మైన మదనగోపాలస్వామి ఆలయము వీరిచే నిర్మింపబడినది. సురభి లక్ష్మారావు పరిపాలనాకాలమున, అనగా 1840 క్రీ.శ.లో రాజ ధాని జటప్రోలునుండి కొల్లాపురమునకు మారినది. అప్పటినుండి వీరు కొల్లాపురప్రభువు లైనారు. రాష్ట్రరాజధాని యైన హైద రాబాదు నగరమునకు 160 కి.మీ. దూరమున కొల్లాపురము కలదు.
పద్మనాయకవంశజు లైన జటప్రోలు సంస్థానమువారు దేవరకొండ, రాచకొండ రాజ్యములు పరిపాలించిన రాజవంశము నకు చెందినవారు. వీరియందరికీ మూలమైన గ్రామము నేటి కర్నూలుజిల్లాలోని ‘వెలుగోడు’. వెలుగోటి సర్వజ్ఞసింగభూపా లుడు ప్రసిద్ధుడు. ఇతనిని గూర్చి చంద్రికాపరిణయకృత్యాదియందు వివరముగా నున్నది.
పద్మనాయకు లందరును రేచర్లగోత్రులు (‘రేచడు’ అనువానికి సంబంధించిన కథవలన వీర కీగోత్రనామ మేర్పడినట్లు గలదు). వీరి మూలపురుషుడు బేతాళనాయకునిగా ప్రసిద్ధుడైన చెవ్విరెడ్డి. ఇతడు కాకతి గణపతిదేవుని సేనానిగా ప్రచండభుజ బలవిక్రమాదులచే కాకతిసామ్రాజ్యమునకు ఎనలేని సేవలు చేసినవాడు. ఈయన పౌరుషగాథల గూర్చి కొన్ని కథలు గలవు.
పద్మనాయకుల గోత్రములవారు (76 గోత్రములు) ఇతనిని మూలపురుషునిగా భావింతురు. వేంకటగొరి, బొబ్బిలి, పిఠా పురం, జటప్రోలు, మైలవరము మొదలగు సంస్థానముల వెలమలు బేతాళనాయకుని పేర శరన్నవరాత్రముల సందర్భమందు బలిపూజాదికములు నిర్వర్తింతురు. వీరి గోత్రనామమైన ‘రేచర్ల’ నల్లగొండ జిల్లాలోని ఒక గ్రామము. ఇది బేతాళనాయని జన్మ గ్రామమని ప్రసిద్ధి గాంచినది. రేచర్ల బ్రహ్మనాయడు బేతాళనాయని మనుమడు. రాచకొండ, దేవరకొండ గ్రామములు బేతాళ నాయని రాజధానులు. ఇతని వంశములోనే పదవతరమువాడు ‘సర్వజ్ఞ’బిరుదాభిరాముడైన సింగభూపాలుడు. పద్మనాయ కుల బిరుదములయందు, శాసనములయందు పేర్కొనబడిన ఆమనగల్లు, పిల్లలమఱ్ఱి అను గ్రామములు నల్లగొండ జిల్లాలోనివి. బేతాళనాయనికి – ఈ రెండుగ్రామములకు విడదీయరాని సంబంధము గలదు.
కాకతి గణపతిదేవుడు, రుద్రమదేవి – వీరి పరిపాలనాకాలమున ప్రసిద్ధిలోనికి వచ్చిన పద్మనాయకులలో ప్రసాదిత్యనా యడు, సింగమనీడు, అనపోతానాయకుడు, మాదానేడు, పెదవేదగిరి, సర్వజ్ఞ సింగభూపాలుడు, లింగమనేడు అనువారు కలరు. అనపోతానీడు పద్మనాయకరాజ్యవిస్తృతికి ముఖ్యమైన వ్యక్తి. సురభివంశ పద్మనాయకులకు మూలపురుషుడైన సింగభూపాలుని పరంపరలో జన్మించిన పెద్దమహీపతికి ఐదవతరమున వచ్చిన రాజు- చంద్రికాపరిణయకర్త యైన మాధవ రాయలు. ఈయన అళియ రామరాయలనుండి జటప్రోలు సంస్థానమును కానుకగా పొందినాడు. తరువాత ఇతని కుమారులు క్రీ.శ. 1650 లో అబ్దుల్లా కుతుబ్షానుండి ‘సనదు’రూపముగా నీ సంస్థానమును పొందిరి.
మాధవరాయల తండ్రియైన మాదానాయకుడు (మల్లభూపాలునిగా ప్రసిద్ధుడు) జటప్రోలు మదనగోపాలదేవాలయ నిర్మాత. మాధవరాయల ప్రోత్సాహమున ‘బాలసరస్వతి’ యనుకవి భర్తృహరి సుభాషితముల నాంధ్రీకరించి సురభిమల్లభూ పాలస్మృత్యర్థము అంకిత మొసంగెను. అందలి ప్రతిపద్యమునకు అంత్యమకుటము ‘సురభిమల్లా’ యని కలదు.
మొదట నల్లగొండ, దేవరకొండ ప్రాంతములు పాలించిన మాదానాయడు అనంతరము జటప్రోలును రాజధానిగా చేసికొని బెక్కం, పెంట్లవల్లి, చిన్నమరూరు, వెలటూరు అను గ్రామములయందు కోటలను, ఆలయములను నిర్మాణము చేయించెను. వ్యవసాయనిమిత్తము తటాకములు త్రవ్వి ఖ్యాతుడాయెను.
మహాపరాక్రమవంతుడు, అశ్వరేవంతుడైన పెద్దనృపతిని మాధవరాయలు గొప్పగా వర్ణించినాడు (చంద్రికా…1-25-28). నేటి గోదల్ పట్టీలో గల పెద్దాపురమను గ్రామ మితని పేరనే వెలసినదని ప్రతీతి. 17వ తరమున ‘బింకోలుగండ’ బిరుదఖ్యాతుడైన రెండవమల్లభూపతి లేదా పెదమల్లానాయడు ఇమ్మడి మల్లునిగా ప్రసిద్ధుడు. 18వ తరములోని ముమ్మడి మల్లానాయనికి గలిగిన పుత్రత్రయమునందు తృతీయపుత్రుడు చంద్రికాపరిణయకర్త యైన మాధవరాయలు. ఈవంశమువారు మొదట శైవభక్తులుగా నుండి కాలక్రమమున వేదాంతదేశికులవారి ప్రభావముచే రాచకొండవారితోబాటు వీరును శ్రీవైష్ణవసంప్రదాయమును స్వీకరించి నారు. మల్లనృపతి, లింగభూపాలనామములు శైవపద్ధతికి జెందినవి. మాధవరాయలు మొదలైన పేర్లు శ్రీవైష్ణవసంబంధమైనవి. వీరు ఈరెండుమతములను సమానముగా ఆదరించి, ఆయా దేవతల ప్రతిష్ఠించి, దేవాలయములను కట్టించిన హరిహరభక్తులు.
మాధవరాయల యనంతరము ఈసంస్థానము హైదరాబాదు సంస్థాన ఆధిపత్యమునకు లోనైనది. ఐనను తరువాత వచ్చిన వారు పూర్వులవలెనే సంస్థానమును అనుభవింపవచ్చునని అబుల్‌హసన్ కుతుబ్షా ఒక ఫర్మానా జారీ చేసినాడు. ఈపద్ధతి తర్వాత వచ్చిన సంస్థానపాలకులకును వర్తించినది. వీరియందు 24వ తరమునకు చెందిన జగన్నాథరావునకు సంతానము లేనందున వరంగల్లు జిల్లాలోని గురిజాల గ్రామమున తమ సమీపబంధువులైన ‘రావు’వంశమువారినుండి పిల్లవానిని దత్తుగా పరిగ్రహించి ‘వెంకటలక్ష్మారావు’ అని ఆబాలునకు నామధేయ మిడినారు. లక్ష్మారావు కాలములోనే జటప్రోలుసంస్థానము పేష్కస్ ఏర్పాటుతో బిల్‌మఖ్తాగా (శాశ్వతకౌలు) సంపాదితమైనది. ఈయనకూడా నిస్సంతు కావున తన అభిజనస్థలమునుండి ఒకబాలుని తెచ్చుకొని ఆయనకు వెంకట జగన్నాథరాయనామధేయ మిడినారు. ఈయన గుఱ్ఱపుపందెములయందు ప్రఖ్యా తుడు. బెంగుళూరు, మదరాసునగరములయందు జరుగు అశ్వధావనక్రీడలలో నీయన పలుసార్లు విజయమందినాడు. కాంచీ నగర వరదరాజస్వామికి శాశ్వతముగా బిందెసేవ కైంకర్యమును ఏర్పాటు చేయించిన భక్తశిఖామణి. సింగపట్టణంలో తన పూర్వులు నిర్మాణ మొనర్చిన నృసింహాలయమును అభివృద్ధి పరచి, ఆస్వామిపేర ‘లక్ష్మీనృసింహవిలాస’మను చంపూ గ్రంథమును, జటప్రోలు ‘మదనగోపాలమాహాత్మ్యము’ను రచియింపజేసిన సహృదయుడు. ఈయనకు సైతము సంతానము లేనందున వెంకటగిరి ప్రభువులైన సర్వజ్ఞకుమారయాచమనాయని చతుర్థపుత్రులగు నవనీతకృష్ణయాచేంద్రుని దత్తపుత్రునిగా పరిగ్రహించి, తమతండ్రిగారి నామధేయముగా వెంకటలక్ష్మారావని పేరు పెట్టి 7-3-1879 తేదీనాడు తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధానమున దత్తస్వీకారోత్సవమును జరిపినారు (ఇది ఈశ్వర సం. ఫాల్గుణశుద్ధ తదియ గురువారమునాడు). ఈ స్వీకారమునాటికి వెంకటలక్ష్మారావుగారి వయస్సు 14 సంవత్సరములు. వీరు 6-3-1884 సం. నైజాంప్రభువు ఫర్మానాతో కొల్లాపురం (జటప్రోలు) ప్రభువులై ప్రజాపాలనము జరుపుచు, ధర్మకార్యనిర్వహణబద్ధులై కవిపండితపరిపోషకులై సుమారు 32 సంవత్సరములు పరిపాలించి ఎన్నియో సద్గ్రంథముల ప్రచురణ చేయించిరి. అన్నిటిని మించి వీరి చిరయశస్సునకు మూల కారణము – మాధవరాయభూపాలప్రణీతచంద్రికాపరిణయమును ‘శరదాగమ’వ్యాఖ్యతో ముద్రణము చేయించి తమ పితౄ ణమును తీర్చుకొని 15-4-1928 తేదీన యశఃకాయు లైనారు.
వీరికిద్దరు కూతుర్లుమాత్రమే యుండిరి. వంశోద్ధరణకై బొబ్బిలిసంస్థానాధీశులు – తమ యగ్రజులైన రాజా శ్వేతాచలపతి వెంకటరంగారావుగారి పౌత్రులైన రాజా రాజగోపాలరావుగారిని దత్తపుత్రునిగా పరిగ్రహించి, తండ్రిగారిపేరైన రాజా వెంకట జగ న్నాథరావు అని పేరు పెట్టిరి. కాని వీరి పట్టాభిషేకమును పరిణయమును కావింపక పూర్వమే వీరు పరలోకగతు లైనందున ఈ శుభకార్యము లన్నియు వీరి ధర్మపత్ని వెంకటరత్నమాంబగారి ద్వారా నిర్వహింపబడినవి. వెంకటలక్ష్మారావుగారి ద్వితీయ పుత్రికయైన సరస్వతీదేవిగారి కూతురు ఇందిరాదేవిని వెంకటజగన్నాథరాయ బహదూర్‌నకిచ్చి వివాహము జరిపించినారు. జగన్నాథరావుగారు మాతృశ్రీ అదుపాజ్ఞలకు లోబడి రాజ్యాధికార మొనర్చుచు సంస్థానములు భారతదేశ మున విలీనమగు వరకు (1949) పరిపాలించినారు. రాజ్యభారవిముక్తులైన యనంతరము కూడా వీరు వంశానుగతధర్మమైన ధర్మకార్యనిర్వహ ణము, కవి-పండిత-విద్వద్గాయకపోషణ మొనర్చుచు క్రీ.శ.1980 సం.న స్వర్గలోకవాసు లైనారు. రాజావారికి గల ఏకైకపుత్రులు వెంకటకుమారకృష్ణబాలాదిత్యలక్ష్మారావుగారు. కుమార్తె వెంకటరత్నసుధాబాల యనువారు గలరు. వీరిది 29వ తరము. వెంకట ఆదిత్యలక్ష్మారావుగారి కుమారుడు వెంకట అనిరుద్ధ జగన్నాథరావు. వీరు ప్రస్తుతము సికిందరాబాదులో నివాసముగా నున్నారు. మధ్యమధ్య కొల్లాపురమునకు విచ్చేయుచుందురు (చూ. వంశవృక్షము).
జటప్రోలు రాజపరంపరలో నున్న వెంకటలక్ష్మారావు బహద్దరు ఆఖేటఖేలనమున అమితాసక్తి కలవాడు. తన జీవితకాల మున 31 పులులను వేటాడినాడు. ఒకేవేటలో అయిదుపులులను వేటాడి వేటలో బందీయైన జంతువులను తన రాజప్రాసాదమున బంధించిన ధీరుడు. ఈయన వేటను వంశపారంపర్యము గావించి తన 14సంవత్సరముల కూతురునకు కూడా వేటాడుట నేర్పించిన ఆఖేటవిద్యావైభవుడు. ఇతనికి వేటపై గల అభిలాషకు ప్రతీక వీరి ‘రాజముద్రిక’( Emblem ). దీనియందు రెండు తుపాకుల మధ్యన పులిముఖము చిత్రితమైనది. ‘సత్యమేవ జయతే’ అను అర్థ మొసగు ( Truth Is Victory ) అను వాక్యము ఈముద్రికలో పొందుపరచిరి. ఐదుపులులను పట్టుకొని దిగిన వీరి ఫోటో కొల్లాపురం కోటలో గలదు.
సంస్థానమునకు చెందిన చివరి నాల్గుతరములవారు లండన్ వంటి పాశ్చాత్యనగరములలో విద్యాభ్యాస మొనర్చుటవలన వీరిపై పాశ్చాత్యసంస్కృతీప్రభావ మధికమైనది. అందుకే వీరి పూర్వులకు లేని రాజముద్రికను వీరు సిద్ధము చేయించినారు. సంస్థానమున వీరి హయాములో నిర్మితమైన భవనములుకూడా బ్రిటిష్ వారి భవననిర్మాణములను పోలియున్నవి. ఇవన్నియు ఈనాటికీ దర్శనీయములు.
కొల్లాపురసంస్థానము రద్దయిన తరువాత – సంస్థానకాలమున వివిధకార్యాలయముల కుపయోగించిన భవనములను, వీరి విమానాశ్రయము – దాని భవనములను ఆంధ్రరాష్ట్రప్రభుత్వమువారికి విరాళముగా నొసంగిన ఏతద్వంశీయుల ఔదార్యము కొనియాడదగినది. నేడు కొల్లాపురమునగల ప్రభుత్వ జూనియర్ కళాశాలభవనములు వీరివే. రాణి ఇందిరాదేవిగారి నామధే యము ఆకళాశాల కుంచినారు. కొల్లాపురమున గల ముఖ్యరాజభవనము మాత్రము వీరి అనుభవములో గలదు.
వీరి పూర్వరాజధానియైన జటప్రోలులోని కోట శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగినది. వీరు నిర్మాణ మొనరించిన తమ యిష్టదైవ సన్నిధి యగు మదనగోపాలస్వామి దేవాలయమును తీసి యథాపూర్వముగా ఎత్తైన ప్రదేశమున నిర్మాణ మొనర్చిన రాష్ట్ర పురావస్తుశాఖవారి నైపుణ్యము ప్రతిశిలయందు ప్రతిబింబించుచున్నది. దేవాలయముతోబాటు జటప్రోలుగ్రామముకూడా దీని పరిసరములలోనే నిర్మితమైనది. ఇవియేగాక తరలించి తెచ్చి కొల్లాపురమునందు పునర్నిర్మాణ మొనర్చిన కుంతీమాధవ స్వామివారి దేవళము కూడా దర్శింపతగినది.
కొల్లాపురప్రభువులు కట్టించిన అనేకదేవాలయములు, వేయించిన తటాకములు నేటికీ భక్తిభుక్తులకు ఆకరములుగా నున్నవి. పూర్వమునుండి రాణీరత్నమాంబవరకు కొనసాగిన అనేకప్రజోపయోగకార్యములు శాశ్వతమై ఈనాటికిని కొల్లా పురప్రజల అనుభవములో నుండుట విశేషము.
రాజులు కాలగర్భమున లీనమైనారు. వారొనర్చిన ధర్మకార్యములతోబాటు అక్షరస్వరూపిణియైన సాహితీదేవి వీరి చిర యశస్సును ‘అక్షర’ మొనర్చినది. ఆపరంపరలోనిదే చంద్రికాపరిణయము. ఈగ్రంథవిశేషములు ముందు వివరింపబడును.
గృహనామము
వెలుగోడు, రాచకొండ, దేవరకొండ పరిపాలకులైన పద్మనాయకులు తమ గృహనామ మిదియని ప్రత్యేకముగా తెల్పు కొనలేదు. వీరిని ఆయా గ్రామనామములతో మాత్రమే వ్యవహరించుచున్నాము. కాని వీరినుండి వెలువడి జటప్రోలు రాజ్యము నకు పాలకులైనవారి గృహనామము మాత్రము ‘సురభి’ యని గ్రంథస్థమై వ్యాప్తి చెందినది. చంద్రికాపరిణయమునందు
‘అర్థి సాత్కృత సురభి, పరాళి సురభి,
సుగుణవల్లీ ప్రకాండైక సురభి, కీర్తి
జిత సురభి, శౌర్యసురభి నా సింగనృపతి
పరగఁ దద్వంశమును గాంచె సురభిసంజ్ఞ’ (1-23)
ఇది సర్వజ్ఞ సింగభూపతివర్ణనలోని పద్యము. దీనికి పూర్వాపరములందు ఎచ్చటను ‘సురభి’ప్రసక్తి లేదు. సింగభూపాల కృతులలోను, ఇతరత్ర గల ఈప్రభుప్రసక్తిలోను ‘సురభి’ లేదు. వ్యాఖ్యాపండితులు ‘సురభి’శబ్దమునకు సువర్ణము, సంపెంగ, వసంతుడు, కామధేనువు, పరిమళము అను నర్థముల తెల్పినారు. పైపద్యమునందలి ‘సురభి’పదములకు వరుసగా నీయర్థము లీయబడినవి. ఈపదమును ‘సురభీ’ యని దీర్ఘాంతముగా చేసి ‘దేవతలకు భీతి గొల్పువాడు’ అని, ఇదియే హ్రస్వాంతమున ‘సురభి’ యైనదని వెల్లాలవారు తెల్పిరి.
ఇంతకు ‘సురభి’ అను గృహనామము వీరి కెట్లు గల్గెనో తెల్పినవారు భిన్నరీతులుగా వివరించినారు. నాగరకర్నూలు తాలూకాలో కారువంగ, తాళ్ళపల్లి అను గ్రామముల నడుమ గల ‘గోదలు’గ్రామమే ఒకప్పటి సురభిగ్రామ మనియు, కాలాంతర మున నాగ్రామము హరించుకపోగా అచట నేర్పడినవీ కారువంగ, పులిజాల, తాళ్ళపల్లి, రఘుపతిపేట యను గ్రామములు – ఈప్రాంతమునకు గోదలుపరగణా యని ప్రసిద్ధి. జటప్రోలువారు మొదట సురభిలో నివసించుటవలన అదియే వారి గృహనామ మైనదని ప్రచారము గలదు. గ్రామనామములు గృహనామములుగా నుండుట సాధారణవిషయమే యైనను, జటప్రోలువారు గాని వారి పూర్వులుగాని సురభిగ్రామవాసు లైనట్లు ఎచ్చటను తెల్పుకొనలేదు. అటు వెలుగోడు, ఇటు దేవరకొండరాచకొండలతోనే వీరి యనుబంధబాంధవ్యము లున్నవి. సింగభూపాలుడు భేతాళనాయకుని వరుసలో దగ్గరివాడు. విద్యాబలపరాక్రమ ములచేత ప్రఖ్యాతుడు. ఇట్టివానిచే తమవంశము ప్రఖ్యాతమై యున్న కారణమున అతనిని యాచకవిషయమున సురభిగా తెల్పి, ఇదే పదమును వివిధార్థములలో ఆయనకు సమన్వయపరచిన చంద్రికాపరిణయకారుని శబ్దచమత్కృతి ప్రశంసింప దగినదే కాని, ‘సురభి’గ్రామము వీరి పూర్వనివాస మని ‘భావన’ మాత్రమే! దీనికి ఆధారము లేదు. సింగభూపాలవిషయకమైన ‘సురభి’ వీరికి సంతృప్తి కలిగించినది. యుద్ధమున జటప్రోలువారు ‘సురభీ’కర పరాక్రములుగా సింగభూపతిని పోలినవారు కావున ఎవ్వరును గ్రహింపని గృహనామమును వీరు ‘సురభి’గా నిర్ధారించుకొన్నట్లు భావింప వీలుగలదు. మొదటినుండి ఇదియే వీరి గృహనామ మైనచో పద్మనాయకరాజప్రశంసలోను, వారి గ్రంథములయందును, సమకాలీనకృతులయందును ‘సురభి’ప్రసక్తి వచ్చెడిది.