చంద్రికాపరిణయము – 3. ప్రథమాశ్వాసము

చ. అనుపమమల్లికార్జునయ◊శోంచితుఁ డైన కుమారమల్లనా
వనిపతి డాయఁ బూని రిపు◊వారము లంత నుపాంతవాహినీ
ఘనతరవారులన్ మునిఁగి ◊గ్రక్కునఁ గాంతురు సౌరసుందరీ
జనకుచకుంభకూటతట◊సాంద్రమృగీమదసారసంగతిన్. 64

టీక: అనుపమమల్లికార్జునయశోంచితుఁ డైన కుమారమల్లనావనిపతిన్ – అనుపమ = సాటిలేని, మల్లికా = మల్లికాకుసుమ ములవలె, అర్జున = తెల్లనగు, యశః = కీర్తిచేత, సాటిలేని మల్లికార్జునస్వామియొక్క ఖ్యాతిచేత, అంచితుఁ డైన = ఒప్పిన వాఁడైన (అనఁగా శ్రీశైలములోనున్న సాంబశివునకు మల్లికార్జునస్వామి యని నామంబు గాన ఈ రాజపుంగవుల వంశమున తొల్లింటినుండి యా మహానుభావుని సేవించుటయు, వారి నామంబుతోఁ దమబిడ్డలను బిలుచుటయుఁ గలిగియున్నయవి. దీననే పెదమల్లభూపాలుఁడు, చిన మల్లభూపాలుఁడు, ముమ్మడిమల్లభూపాలుఁడు, కుమారమల్లభూపాలుఁడు, అను నామంబులచే విలసిల్లుట. మఱియు లింగభూపాలుండు, లింగాంబిక లో నైనవియు నిష్టదేవతానామంబులే కాని వేఱు గావు. వెండియు నీ రాజశేఖరులకుఁ గూటస్థుం డగు ననపోతమహారాజు శ్రీశైలమునకు సోపానములు గట్టించినట్లు ‘యశ్చారుసోపాన పథేన చక్రే శ్రీపర్వతం సర్వజనాంఘ్రిగమ్యమ్’ ఇత్యాదిగా సింగభూపాలప్రణీతంబైన రసార్ణవసుధాకరమందు వర్ణింపఁబడినది), కుమారమల్లనావనిపతిన్ = కుమారమల్లభూపాలుని; డాయఁ బూని = చేరఁ గడంగి; రిపువారములు = శత్రుసంఘములు; అంతన్ = అంతట; ఉపాంత వాహినీ ఘన తరవారులన్ – ఉపాంత = సమీపమున నున్న, వాహినీ = సేనలయొక్క, సమీప మున నున్న కృష్ణానదియొక్క, ఘన= గొప్పనైన, తరవారులన్ = ఖడ్గములయందు, ఘనతరవారులన్ = గొప్పనైన జలము లందు; మునిఁగి = క్రుంకి; గ్రక్కునన్ = వేగముగా; సౌరసుందరీ జన కుచకుంభ కూట తట సాంద్ర మృగీమద సార సంగతిన్ – సౌరసుందరీ= సురాంగనలయొక్క, జన = సంఘముయొక్క, కుచకుంభ= కుంభములవంటి కుచములయొక్క, కూట = సమూహముయొక్క, తట = ప్రదేశములయందలి, సాంద్ర = దట్టమగు, మృగీమద = కస్తూరియొక్క, సార = స్థిరాంశము యొక్క, సంగతిన్ = సంబంధమును; కాంతురు = పొందుదురు.

ప్రస్తుతాప్రస్తుతముల కుపమానోపమేయభావము వ్యంగ్యము గాన రాజును సమీపింపఁబూనిన శత్రురాజులు వీరిసేనల ఖడ్గ ములచే నఱకఁబడి సురాంగనాపరిరంభసౌఖ్యమును, మల్లికార్జునస్వామిని జేరఁబూనినవారు కృష్ణానదియందు స్నానము సేసి సురాంగనాసంగసౌఖ్యముఁ బొందినట్లు పొందిరనుట. అలంకారము వ్యంగ్యోపమ.

సీ. శ్రీ నంద దనుచు సా◊మైనమే నూనుఁ జా,యల మెచ్చ దనుచు బ◊ల్వలపు నెఱపుఁ
దనపదంబునఁ జేర◊దనుచు వెల్వెలఁబోవుఁ, జెఱఁగు ముట్టదనుచుఁ ◊జెందు మఱపుఁ
దలముఁ జూడ దనుచుఁ ◊దాఁ గలంగు నిజాప,ఘనము నంట దనుచుఁ ◊గల దొలంగుఁ
గటక మొల్ల దనుచుఁ ◊ఘనదానరతిఁ బూనుఁ, గనుదోయిఁ గప్పుకో◊దనుచు రోఁజు

తే. శూలి సౌరాగ మాశర◊త్కాలఘనము, ముసలి జడధీనుఁ డుగ్రమౌ◊ళి సురవార
ణంబు శేషుండు వారిచం◊దంబుఁ జూచి, గేరు మల్లావనీపాలు◊కీర్తికన్య. 65

టీక: శ్రీ నంద దనుచు నిత్యాదిసీసచరణచతుష్టయమందుఁ జెప్పిన యర్థములకు గీతియందుఁ గ్రమముగా నన్వయంబు. శూలి = శివుఁడు; శ్రీ నంద దనుచు = శ్రీ యనఁగా సంపత్తు, విషము, మల్లావనీనాథుని కీర్తికన్య తన సంపద నొల్లదనుచు; సామైన మే నూనున్ = సగమైన శరీరమును దాల్చినవాఁడు. తన సంపదనె యంగీకరింప నప్పుడు తన్ను వరించుట మిక్కిలి యసంభావనీయమని చింతతో క్షీణించినాఁ డనుట. శివుఁడు తెల్లనివాఁ డైనను విషము నల్లనిది గానఁ దెల్లని స్వభావము గల కీర్తికన్య దానిం జూచి శివునిఁ ద్యజించుననియు, నీశ్వరుండు స్వభావముగా నర్ధాంగుఁ డనియుఁ దెలియవలయు; సౌరాగము = కల్పవృక్షము; చాయలన్ = కాంతులను, నీడలను; మెచ్చ దనుచు = శ్లాఘింపదనుచు; బల్వలపు నెఱపున్ = అధికమైన మోహమును దాల్చును. చాయలనే మెచ్చనిది తన్ను వరించుట దుర్లభ మని వలపు నెఱపు ననుట. కల్పవృక్షము తాను తెల్లనిదైనను దననీడ నల్లనిది గానఁ గీర్తికన్య మెచ్చ దనియు, వలపు అనఁగాఁ బరిమళము నెఱపుట సహజమనియు దెలియవలయు.ఆ శరత్కాలఘనము = ప్రసిద్ధమైన శరన్మేఘము; తనపదంబునఁ జేరదనుచున్ = తనస్థానమునఁ జేర దనుచు; వెల్వెలఁ బోవున్ = వైవర్ణ్యమును దాల్చును, తెల్లఁబోవును; ఘనపద మాకాశము నల్లనిది గావున నచటఁ గీర్తికన్య చేరదనియు, శర త్కాలఘనము తెల్లగా నుండుట సహజమనియుఁ దెలియునది. ముసలి = బలరాముఁడు; చెఱఁగు ముట్టదనుచున్ = వస్త్రమును ముట్టదని; మఱపుఁ జెందున్ = మత్తత నొందును; తన చెఱఁగు ముట్టనిది తన్ను వరించుట దుర్లభ మని మఱపుఁ జెందె ననుట. బలరాముఁడు తెల్లనివాఁడైనను కట్టుగుడ్డ నల్లనిది గానఁ గీర్తి ముట్టదనియు బలరాముఁడు మదిరాపానపరవశచిత్తుం డగుట స్వభావ మనియుఁ దెలియవలయు. ‘ఘూర్ణయన్ మదిరా స్వాదమదపాటలితద్యుతీ| రేవతీవదనోచ్ఛిష్ట పరిపూతపుటేదృశౌ’అని మాఘమందు బలరాముఁడు హాలాపానవివశుఁ డని వర్ణింపఁబడినది.
జడధీనుఁడు = సముద్రశ్రేష్ఠుఁడు; తలముఁ జూడదనుచున్ = అడుగుభాగమును జూడదనుచు; తాన్; కలంగున్ = కలఁగఁ బాఱును. సముద్రతలము పంకమయ మగుటచే నల్లగా నుండుననియు, సముద్రము కలఁగఁబాఱుట సహజ మనియుఁ దెలియునది. ఉగ్రమౌళి = శివుని శిరోలంకార మైన చంద్రుఁడు; నిజాపఘనమున్ = తన శరీరమును, ‘అఙ్గం ప్రతీకోవయవోపఘనోథ కళేబ రమ్’ అని యమరుఁడు; అంటదనుచున్ = ముట్టదనుచు; కల దొలంగున్ = కాంతిహీనుఁ డగును; చంద్రునియందుఁ గలంక మున్నది గాన నతనిశరీరమును ముట్టదనియు, చంద్రుఁడు కలాహీనుఁ డగుట సహజ మనియుఁ దెలియవలయు. సురవారణంబు = ఐరావతము; కటక మొల్లదనుచున్ = తనపురము నొల్లదనుచు; ఘనదానరతిఁ బూనున్= అధికత్యాగరతిని బూనును. ‘కట ఏవ కటః’ అని కటకశబ్దము గండస్థలమును బోధించును గాన నైరావతము గండస్థల మళిమలినమై యుండుట వలనఁ గీర్తి దాని నొల్ల దనియు, దాన మనఁగా మదోదకము దానియందు రతిఁబూనుట స్వభావమనియుఁ దెలియవలయు.శేషుండు = ఆదిశేషుఁడు; కనుదోయిన్ = నేత్రయుగ్మముచేత; కప్పుకోదనుచున్ = ఆదరింపదనుచు; రోఁజున్ = బుసపెట్టును. శేషుని కనుదోయియందు కప్పు అనఁగా నల్లదనము గలదనియు, కోదు అనఁగా నంగీకరింపదనియు, సర్పములకు రోజుట సహజమనియు భావము. శూలి యనఁగా శూలరోగము గలవాఁ డనియు, సౌరాగ మనఁగా సురాసంబంధియైన వృక్ష మనియు, ఆశరత్కాల మనఁగా రాక్షసులవలె నాచరించు కాలమేఘ మనియు, జడధీనుఁ డనఁగా జడమతిగలవారిలో శ్రేష్ఠుఁ డనియు, నుగ్రమౌళి యనఁగా నుగ్రులలో శ్రేష్ఠుఁ డనియు, సురవారణం బనఁగా సురలచే వారింపఁబడిన దనియు, శేషుఁడనఁగా దాసుఁ డనియు నపార్థము తోఁచుచున్నది గాన శివ కల్పతరు శరదంబుద బలభద్ర సముద్ర సురగజ శేషులయొక్క సంపచ్ఛాయాపదాదుల నిరాకరణ మును గీర్తికన్య చేసెననియుఁ దెలియవలయు. వారిచందంబుఁ జూచి = వారిరీతిని జూచి; మల్లావనీపాలు కీర్తికన్య = మల్లభూపా లుని కీర్తి యనెడు కన్య; కేరున్ = హసించును. క్రమాలంకారము. శివాదు లర్ధశరీరము మొదలగువాని నవలంబించుటకు మల్ల మహీపతి కీర్తికన్యాకర్తృకాస్వీకారము నహేతువును హేతువుగాఁ జెప్పుటచే హేతూత్ర్పేక్ష గమ్య మగు.

తే. ఆధరాధీశు పిమ్మట ◊నఖిలభూమి
భరము నీవు ధరించితి ◊కిరికులేంద్ర
కమఠవల్లభకులశైల◊కరటి సంస
దురగనాథులతోడఁ బె◊న్నుద్ది వగుచు. 66

టీక: ఆధరాధీశు పిమ్మటన్ = ఆ కుమారమల్లభూపాలుని పిదప; కిరికులేంద్ర కమఠవల్లభ కులశైల కరటిసంస దురగనాథుల తోడన్ = ఆదివరాహమూర్తి, ఆదికూర్మము, సప్తకులాచలములు, దిగ్గజగణంబు, ఆదిశేషుండు వీరితోడ; పెన్నుద్ది వగుచున్ = పెద్ద యీడగుచు; అఖిలభూమిభరము = సర్వపృథివీభారమును; నీవు; ధరించితి = భరించితివి. ఇందు గుణోత్కృష్టు లగు ఆదివరాహ కమఠనాథ కులశైల దిగ్గజ శేషులతో మాధవరాయలను దుల్యులనుగాఁ జెప్పుటవలనఁ దుల్యయోగితాలంకార భేదము. ‘శ్లో. గుణోత్కృష్టై స్సమీకృత్య వచోన్యా తుల్యయోగితా’ అని తల్లక్షణము.
\
సీ. బంధురవనకదం◊బములపాలుగఁ జేసె, ఘనతరపుండరీ◊కముల నెల్ల,
శిఖరిశిఖాశ్రేణిఁ ◊జేరంగఁ బురికొల్పెఁ, గలితసారంగసం◊ఘముల నెల్ల,
ఘోరమహాబిల◊కోటి నుండఁగఁ జేసెఁ, బ్రబలపరాశుగ◊పటలి నెల్లఁ,
గమలేశ్వరాధీన◊గతిఁ బొసంగఁగఁ జేసెఁ, దతవైజయంతికా◊వితతి నెల్లఁ,

తే. దన్నునవి యెల్ల మఱచినఁ ◊ దాను మఱవ,కాత్మనృపచిహ్నములు దాఁచు ◊నందునందు
శత్రునృపకోటి నీధాటిఁ ◊జకితవృత్తి, పరఁగి చనువేళ మాధవ◊ధరణిపాల. 67

టీక: ఇందు మాధవరాయల శత్రురాజులయొక్క నృపచిహ్నగోపన మర్థద్వయముతోఁ జెప్పఁబడినది. మాధవధరణిపాల = మాధవరాయా; శత్రునృపకోటి = శత్రురాజబృందము; నీధాటిన్ = నీ దండయాత్రయందు, ‘శ్లో. శత్రు సేనావమర్దాయ సద్య స్సుభటఘోటకైః విజిగీషోః ప్రవృత్తి ర్యా సా ధాటీతి నిగద్యతే’ అని ధాటీలక్షణము; చకితవృత్తిన్ = భీత వృత్తితో; పరఁగి = వర్తించి; చనువేళ = పాఱిపోవు నెడ; ఘనతరపుండరీకముల నెల్లన్ = మిక్కిలి గొప్పవైన శ్వేతచ్ఛత్రముల నెల్లను, తెల్లదామరల నెల్ల నని కాని, వ్యాఘ్రముల నెల్ల నని కాని యర్థాంతరము; బంధురవనకదంబముల పాలుగన్ = దట్టము లైన యుదకసంఘముల పాలగునట్లుగా, లేక యరణ్యముల పాలగునట్లుగా; చేసెన్. కలితసారంగసంఘముల నెల్లన్ = ఒప్పుచున్న యేనుఁగుల గుంపుల నన్నింటిని, తుమ్మెదల గుంపుల నన్నింటిని; శిఖరిశిఖా శ్రేణిన్ = పర్వతాగ్రప్రదేశములను, వృక్షాగ్రప్రదేశములను; చేరంగన్ = చేరునట్లు; పురికొల్పెన్ = చేసెను. గజము లడవులు చేరు నట్లు, వానియందున్న తుమ్మెదలు చెట్లు చేరునట్లు చేసెనని భావము.ప్రబలపరాశుగపటలి నెల్లన్ – ప్రబల = మిక్కిలి సామర్థ్యము గల, పర = శ్రేష్ఠములగు, ఆశుగ = బాణములయొక్క, వాయువు యొక్క,పటలి నెల్లన్ = సంఘము నెల్లను; ఘోరమహాబిలకోటిన్ = భయంకర మగు గొప్పబొఱియలగుంపులో, ఘోరమైన మహాబిల యనఁగా నాకాశముయొక్క యగ్రమున, ‘తారాపథోన్త రిక్షంచ మేఘద్వారం మహాబిలమ్’ అని యమరుఁడు; ఉండఁగఁ జేసెన్ = ఉండునట్లు చేసెను. తతవైజయంతికావితతి నెల్లన్ – తత=విస్తృతమగు, వైజయంతికా= టెక్కెములయొక్క , వితతి నెల్లన్ = సముదాయమునెల్లను; కమలేశ్వరాధీనగతిన్ – కమలేశ్వర = సముద్రముయొక్క ( ‘ సలిలం కమలం జలమ్’ అని యమరుఁడు), విష్ణుమూర్తియొక్క, అధీన = స్వాధీనతయొక్క, భావప్రధాననిర్దేశము, గతిన్ = ప్రాప్తిచేత; పొసంగఁగఁ జేసెన్ = ఒప్పునట్లు చేసెను. తన్నున్, అవి యెల్లన్ = ఆ గొడుగులు మున్నగు రాజచిహ్నము లన్నియు; మఱచినన్ = రాజ్యభ్రష్టులై పోవునపుడు తచ్చి హ్నములు తన్ను మఱచుట స్వభావము గాన,అట్లు మఱచినను; తాను మఱవక = తాను మఱచిపోక; ఆత్మనృపచిహ్నములు = తమరాజచిహ్నములు; అందునందు = వానివాని కుచితము లగు నాయా స్థలములయందు; డాఁచున్ = డాఁచిపెట్టును.

అనఁగా మాధవరాయల ధాటియందు భీతులై యరులు పోవునపుడు తమనృపచిహ్నములు యదృచ్ఛగా గొడుగులు నీటిలోను లేక వనములలోను, గజము లడవులలోను, వాని ననుసరించిన తుమ్మెదలు వృక్షాగ్రములలోను, బాణములు బొఱి యలలోను, టెక్కెములు సముద్రములోను వానియంతకు నవి పడిపోయినను శత్రురాజులు బుద్ధిపూర్వకముగాఁ దత్తదుచిత ప్రదేశములయం దుంచిపోయినట్లున్నదని యనుట. పుండరీకములు వనముల నుండుటయు, సారంగములు శిఖరిశిఖా శ్రేణులఁ జేరుటయు, ఆశుగములు గగనముఁ జేరుటయు, వైజయంతులు విష్ణుమూర్తిని జేరుటయు నుచిత మని భావము. ప్రకృతాప్రకృతార్థ ములకు శ్లేషమూలాభేదారోపముఁ జేయఁబడినది. ఇచట పుండరీక సారంగాశుగ వైజయంతులను మాధవ రాయధాటీపలాయితారిమండలి తత్తదుచితస్థానములలో నుంపకపోయినను నుంచిపోయినట్లు చెప్పుట వలన నుత్ప్రేక్షాలంకా రము. మఱియుఁ దత్తదనురూపస్థాననివేశనము శ్లేషమూలముగాఁ దోఁచుచున్నది గాన సమాలంకారము . ‘సమం స్యాద్వ ర్ణనం యత్ర ద్వయో రప్యనురూపయోః’ అని తల్లక్షణము.

చ. అనలమ హీన మై యెసఁగె ◊నౌర త్వదుద్ధతశౌర్యలక్ష్మిచే,
ధనదుఁడు వొందెఁ దా ధర హి◊తస్థితిఁ దావకదానవైఖరిం
గని, యచలవ్రజంబును ము◊ఖస్ఫుటవర్ణవియుక్తిఁ గాంచె నీ
ఘనతరధైర్యవైభవము ◊గన్గొని, మాధవరాయ చిత్రతన్. 68

టీక: మాధవరాయ, త్వదుద్ధతశౌర్యలక్ష్మిచేన్ – త్వత్ = నీయొక్క, ఉద్ధత = అధికమైన, శౌర్యలక్ష్మిచేన్ = ప్రతాపసంపదచేత; అనలమ = అగ్నియే; హీన మై యెసఁగెన్ = హీనమై యొప్పెను; ఔర = ఆశ్చర్యము, శౌర్యలక్ష్మి యగ్నికిని దుస్సహ మగు టచే నాశ్చర్యము; తావకదానవైఖరిన్ =నీదానరీతిని; కని = చూచి;ధనదుఁడు = కుబేరుఁడు; ధరన్ = భూమియందు; తాన్ = తాను; హితస్థితిన్ = హితవృత్తిని; పొందెన్ = పొందెను, ‘శ్లో. భజతే విదేశ మధికేన జిత స్తదనుప్రవేశ మథవా కుశలః’ అను న్యాయము ననుసరించి యీ హితవృత్తి నవలంబించె ననుట; నీ ఘనతరధైర్యవైభవము= ఉత్కృష్టమగు నీ ధైర్యసంపదను; కన్గొని = చూచి; అచలవ్రజంబు = పర్వతసంఘము; ముఖస్ఫుటవర్ణవియుక్తిఁ గాంచెన్ = ముఖమందు స్ఫుటవర్ణ వియోగ మును, అనఁగా కాంతిహీనతను కాదేని గద్గదభాషణమును, కాంచెన్ = పొందెను. చిత్రతన్ అనునది యంతటను సమన్వయిం చును. చిత్ర మెట్లన అనల మహీనమై అనఁగా అకారహీనమై, నలమై అనఁగా గడ్డిపోఁచై యెసఁగెను. ధనదుఁడు ధరహితస్థితిన్, అనఁగా ధకార రహితస్థితిని పొంది నదుఁ డై ‘న దదాతీతి నదః’ అను నిర్వచనప్రకారము ఏమియు నియ్యని వాఁడని పేరు నొందెను. ఇట నశబ్దముతో సమాసము. అచలవ్రజంబు ముఖస్ఫుటవర్ణవియుక్తిన్, అనఁగా ముఖస్ఫుట= ఆదియందు స్ఫుట ముగా నున్న, వర్ణ = ‘అ’వర్ణముయొక్క, వియుక్తిన్ = వియోగముచేత చలవ్రజ మయ్యె నని తాత్పర్యము. మాధవరాయల శౌర్యసంపదకు నగ్ని గడ్డిపోఁచగా నాయె ననఁగా శౌర్యాగ్నిప్రభకు నగ్నితేజ మల్పమై యెసఁగె ననియు, మాధవరాయల త్యాగమునకు విశేషముగ నిచ్చువాఁడై ధనదుఁ డని పేరొందిన కుబేరుండు నియ్యనివాని వలెఁ దోఁచె ననియు, మాధవరాయల ధైర్యసంపదకుఁ గదలకుండి యచల మనిపించుకొన్న పర్వతవ్రజము చలించుదానివలె నాయె ననియు భావము. మాధవరాయ లత్యద్భుతమైన శౌర్యము, దానము, ధైర్యము గలవాఁ డని ఫలితార్థము. అత్యుక్తి యర్థాలంకారము. చిత్రము శబ్దాలంకారము. ‘ఆకారగతిస్వరవ్యంజన స్థాననియమచ్యుతగుప్తాదిభేదై రనేకధా చిత్రమ్’ అని కావ్యానుశాసన మందుఁ జిత్రలక్షణము.

సీ. తాఁ గుంభినీశతఁ ◊దగి ముఖ్యరుచి నెల్లఁ, బరశిలీముఖకోటి◊పాలు చేసెఁ,
దా ధరాధీశతఁ ◊దనరి శృంగము నెల్ల, ఘనగండకాండసం◊కటముఁ జేసెఁ,
దా భోగిరాజతఁ ◊దాల్చి పదం బెల్ల, సాంద్రాహిభీతిజ◊ర్జరముఁ జేసెఁ,
దా భూమిదారత ◊ధరియించి పురమెల్ల, బహుళదుష్కీర్తిదు◊ర్భరముఁ జేసె

తే. ననుచుఁ గరిరాజి గిరిరాజి, నాహరిపతి, గిరిపతి నిరాకరించి యి◊ద్ధరణికాంత
సెందె నరిభేదవైభవాం◊చితు నభీతుఁ, గీర్తిసంపన్నుమాధవ◊క్షితిప నిన్ను. 69

టీక: ఇందు ధరణికాంత దిగ్గజాదుల నిరాకరించి మాధవరాయలను జేరుటకు శ్లేషభంగిచే హేతునిరూపణముఁ జేసి యర్థ ద్వయము గలుగఁ జెప్పఁబడియె. ఏలాగనిన: తాన్ = తాను; కుంభినీశతన్ = భూమీశ్వరత్వము చేత; తగి, ముఖ్యరుచి నెల్లన్ = ప్రధానకాంతి నంతయు; పరశిలీముఖకోటిపాలు చేసెన్ = శత్రువులయొక్క బాణపరంపరలపాలు చేసెను, తాను రాజయ్యుఁ దనరాజశక్తి నంతయు శత్రువుల యధీనము చేసెనని యర్థము. దిగ్గజవర్గము కుంభినీశత ననఁగాఁ గరణీపతిత్వము చేతఁ దనరినదనియు, ముఖ్యరుచి ననఁగా ముఖమందుఁ బుట్టిన చవిని, పరశిలీముఖకోటి యనఁగా శ్రేష్ఠమగు తుమ్మెదల గుంపు, దానియధీనము చేసిన దనియు భావము. తాన్ = తాను; ధరాధీశతన్ = భూపతిత్వముచేత; తనరి, శృంగము నెల్లన్ = దొరతనమునంతయు; ఘనగండకాండసంకట మున్ – ఘన = గొప్పనైన, గండకాండ = ఉపద్రవపరంపరలచేత, సంకటమున్=సమ్మర్ద మైన దానిఁగా; చేసెన్, అని యర్థము. కులాచలవర్గము, ధర = పర్వతములకు, అధీశతన్ = అధిపతిత్వము చేత, తనరి, తనశిఖరము నెల్ల ఘనములయిన (గండ కాండ) స్థూలోపలములయొక్క సంఘములచే సంకటమగు నట్లు చేసె నని భావము. తాన్ = తాను; భోగిరాజతన్ – భోగి = రాజులకు; రాజతన్ = రాజత్వమును, రాజాధీశ్వరత్వము ననుట; తాల్చి, పదం బెల్లన్ = తన నివాసస్థానము నెల్లను; సాంద్రాహిభీతిజర్జరమున్ – సాంద్ర = దట్టమైన, అహిభీతి = శత్రుభీతిచేత, జర్జరమున్ = శిథిల మైనదానిఁగా; చేసెన్ = చేసెను, శేషుండు భోగిరాజతన్ అనఁగా సర్ప రాజతను దాల్చినాఁడనియు, తన పదమైన పాతాళలోక మంతయు అహిభీతిన్ అనఁగా సర్పభీతిచేత జర్జరమైన దనియు భావము. తాన్ = తాను, భూమిదారతన్ = భూపతిత్వమును; ధరియించి = వహించి; పురమెల్లన్ = పట్టణమంతయు; బహుళదు ష్కీర్తిదుర్భరమున్ చేసెన్= అధికమగు నపకీర్తిచేత దుర్భరముగాఁ జేసె నని యర్థము. ఆదివరాహస్వామి భూమిదారమను నామమును వహించినాఁడనియు, తన పురమెల్లన్, అనఁగాఁ దన దేహము నెల్లను బహులమై దుష్టమగు బురదచేత వ్యాప్తము చేసినాఁడనియు భావము. వరాహములు బురదలోఁ దిరుగుట స్వభావము. గీతియందుఁ గ్రమముగా నన్వయము: అనుచున్ = ఇట్లనుచు; ఇద్ధరణికాంత = ఈభూకాంత; కరిరాజిన్ = దిగ్గజసంఘమును; గిరిరాజిన్ = కులాచలసంఘమును; ఆ హరిపతిన్ = ప్రసిద్ధుఁ డగు సర్పరాజైన ఆ యాది శేషుని; కిరిపతిన్ = వరాహాధిపతి యైన యాదివరాహమును; నిరాకరించి=తిరస్కరించి; అరిభేదవైభవాంచితున్ = శత్రువిదారణసంపదచే నొప్పుచున్నవానిని; అభీతున్ = భయరహితుని; కీర్తిసంపన్నున్ = కీర్తి మంతుని; మాధవక్షితిప = మాధవరాయా; నిన్నున్, చెందెన్ = పొందెను. ఇందును గ్రమముగా నన్వయము తెలియం దగినది. ఇందు శ్లేషోత్థాపితవ్యతిరేకాలంకారమును, యథాసంఖ్యాలంకారమును.

మ. భవదీయోగ్రచమూపరాగపటలా◊భ్రశ్రేణి యాదోనిధా
నవిషంబుల్ వడిఁ ద్రావ జన్యవసుధా◊నవ్యోరుడోలాధిరూ
ఢవిపక్షక్షితినాథు నూఁచు బలఝా◊టస్థేమ చిత్రంబు మా
ధవరాయేంద్ర త్వదీయహేతి వెలికిం ◊ దార్చున్ యశఃక్షీరమున్. 70

టీక: మాధవరాయేంద్ర, భవదీయోగ్రచమూ పరాగపటలాభ్రశ్రేణి – భవదీయ = నీకు సంబంధించిన, ఉగ్రచమూ = ఉగ్రమగు సేనయొక్క, పరాగపటల = ధూళీపటల మనెడు, అభ్రశ్రేణి = మేఘపరంపర; యాదోనిధానవిషంబుల్=సముద్రసంబంధి విషములను, జలముల ననుట; వడిన్ = వేగముగా; త్రావన్ = పానము సేయఁగా; బలఝాటస్థేమ = సైన్యసంఘముయొక్క సామర్థ్యము; జన్యవసుధా నవ్యోరు డోలాధిరూఢ విపక్షక్షితినాథున్ – జన్యవసుధా = యుద్ధభూమి యనెడు, నవ్య = నూతన మును, ఉరు = గొప్పదియు నగు, డోలా = ఉయ్యెలను, అధిరూఢ = అధిష్ఠించు, విపక్షక్షితినాథున్ = శత్రురాజును; ఊఁచున్ = ఊఁచును; త్వదీయహేతి = నీఖడ్గము; యశఃక్షీరమున్ = యశస్సనెడు పాలను; వెలికిం దార్చున్ = వమనము చేయును, బయల్పఱచు ననుట; చిత్రంబు = ఆశ్చర్యము. విషము ద్రావినవారిని పాలు ద్రాపి యుయ్యలలోనుంచి యూఁపఁగా వారు విషముతోడి పాలను గ్రక్కుట సహజమై యుండఁగా చమూపరాగము విషము ద్రావుటయు, శత్రురాజు నూఁచుటయు, ఖడ్గము పాలను కక్కుటయు, చిత్రంబని భావము. మాధవ రాయల సేనాపరాగము సముద్రముదాఁక వ్యాపించి జలము నింకు నట్లు చేసిన దనియు, శత్రువు యుద్ధభూమిని బడిపోయినాఁ డనియు, ఖడ్గము మిక్కిలి ఖ్యాతిని ఘటింపఁజేసిన దనియు ఫలితార్థము. అసంగత్యలంకారము. ‘విరుద్ధం భిన్నదేశత్వం కార్య హేత్వో రసంగతిః| విషం జలధరైః పీతం మూర్ఛితాః పథికాఙ్గనాః’ అని చంద్రాలోకలక్ష్యలక్షణంబులు. పరాగ పటలాభ్రశ్రేణి, జన్యవసుధాడోలా, యశఃక్షీరేత్యాదులందు రూపకము.