చంద్రికాపరిణయము – 3. ప్రథమాశ్వాసము

శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము

ప్రథమాశ్వాసము

శా. శ్రీవక్షోజధరస్ఫురద్వర ముర◊స్సీమం బ్రకాశింప శం
పావృత్తిన్ సరసత్వ మొంది సుమనః◊పాళి ప్రియాత్మీయస
ద్భావస్ఫూర్తిఁ దనర్చు శ్రీమదనగో◊పాలాహ్వయోజ్జృంభితాం
భోవాహంబు సమస్తలోకముల కా◊మోదప్రదం బయ్యెడున్. 1

అవతారిక: శ్రీమదనవద్యవిద్యావిశారదులును, శ్రీమద్భాగ్యనగరదేశమధ్య విద్యోతమాన శ్రీజటప్రోలు సంస్థానాధిపతులును, శ్రీమత్సురభికుల కలశార్ణవ పూర్ణనిశానాథులును, నగు శ్రీమాధవరాయ ప్రభుపుంగవులు ‘శ్లో. కావ్యం యశ సేఽర్థకృతే వ్యవ హారవిదే శివేతరక్షతయే| సద్యః పరనిర్వృతయే కాన్తా సమ్మిత తయోపదేశయుజే’ ఇత్యాది కావ్యప్రకాశాద్యాలంకారికవచన ప్రామాణ్యంబునఁ గావ్యం బతుల శ్రేయస్సాధనం బనియు, ‘శ్లో.కావ్యాలాపాంశ్చ వర్జయేత్’ అను నిషేధశాస్త్రం బసత్కావ్య విషయం బనియు నెంచి, పుణ్యపురుషధౌరేయుం డగు సుచంద్రనరేంద్రుని చరితంబు నవలంబించి, చంద్రికాపరిణయం బను లోకోత్తరశృంగారరసాసేచకం బగు కావ్యరత్నంబు వినిర్మింప నుద్యమించి, తదవిఘ్నపరిసమాప్తి ప్రచారాది పరిపంథి ప్రత్యూహనివహప్రశమంబునకై, ‘శ్లో.ఆశీ ర్నమస్క్రియా వస్తునిర్దేశో వాపి తన్ముఖ’ మ్మనుటవలనఁ ద్రిరూపం బగు మంగళ ములలో శ్రీమదనగోపాలరూపస్వేష్టదేవతా పరమానుగ్రహాభ్యర్థనాత్మకం బైన యాశీరాత్మక మంగళమును శ్రీవక్షోజధరే త్యాది పద్యంబుచే నాచరించుచున్నారు. సమస్తలోకప్రమోదాభ్యర్థనంబుచేఁ దదంతర్గతస్వప్రమోదాభ్యర్థన మర్థసిద్ధం బగు నని యాశయము.

ఈ పద్యమందు మదనగోపాలాహ్వయోజ్జృంభితాంభోవాహంబు, అని భగవంతునియం దంభోవాహత్వ మారోపించి నందున యథాసంభవముగ నర్థద్వయము కల్గుచున్నది. ఏలా గనిన –

టీక: శ్రీవక్షోజధరస్ఫురద్వరము—శ్రీ = లక్ష్మీరూప యగు రుక్మిణీదేవియొక్క ‘శ్లో.రాఘవత్వేభవ త్సీతా, రుక్మిణీ కృష్ణ జన్మని, అన్యేషు చావతారేషు విష్ణో రేషానపాయినీ’యను వచనం బిందుఁ బ్రమాణంబు. వక్షోజధర= పర్వతములవలె నున్న తంబు లగు పాలిండ్లయందు, స్ఫురత్ = ప్రకాశించుచున్న; వరము = కుంకుమము ‘కాశ్మీరజన్మాగ్నిశిఖం వరమ్’ – అని యమరము; ఉరస్సీమన్ = వక్షస్థ్సలమందు; శంపావృత్తిన్ = మెఱపుయొక్క యునికివంటి యునికిచేత; ప్రకాశింపన్ = వెలుంగుచుండఁగా; సరసత్వము=రసికత్వము, మేఘపర మైనపుడు జలవత్త్వము. ‘ఆస్వాదనధ్వని సుధామ్బురసాఖ్యధాతు ష్విష్టో రసః’ –అని రత్నమాల; ఒంది = పొంది; సుమనః పాళి ప్రియ ఆత్మీయ సద్భావస్ఫూర్తిన్ – సుమనఃపాళి = దేవసంఘ మునకు, మేఘపరమైనపుడు జాజిగుమురులకు – ‘సుమనాః పుష్ప మాలత్యోః స్త్రియాం దేవే బుధే చ నా’ – యని నానార్థ రత్నమాల; ప్రియ = హితమగు; ఆత్మీయ = స్వీయమగు; సద్భావ = మంచి స్వభావముయొక్క, సత్తయొక్క – ‘భావ స్స్వభావే సత్తాయామ్’ – అని విశ్వము, స్ఫూర్తిన్ = స్ఫురణమును; తనర్చు = అతిశయింపఁజేయునట్టి; శ్రీమదనగోపాలా హ్వయ ఉజ్జృంభిత అంభోవాహంబు – శ్రీ = శోభాశాలి యగు, మదనగోపాలాహ్వయ = మదనగోపాలుం డను నామంబు గల, ఉజ్జృంభిత = ఉప్పొంగిన యట్టి, అంభోవాహంబు = మేఘము; సమస్తలోకములకున్ = ఎల్లజగంబులకు; ఆమోదప్రదంబు = సంతసమిచ్చునది; అయ్యెడున్ = అగుఁగాత.

మెఱపులతోఁ గూడి యుజ్జృంభితమైనయట్టి సజలజలదం బెట్లు సర్వలోకముల కామోదమును జేయునో, యట్లు రుక్మిణీకుచకుంభకుంకుమాంకితవక్షస్కుఁడై యనఁగా నవాప్తమనోరథుండై యుజ్జృంభితుఁడైన భగవంతుఁడు సమస్తలోకం బులకు సంతసంబుఁ జేయు నని తాత్పర్యము. ‘స్వయం తుష్టః పరాన్ తోషయతి’ – అను న్యాయంబున భగవంతుండు స్వాభీష్టరుక్మిణీపరిరంభతుష్టాంతరంగుఁడైన పిదప స్వాశ్రితసర్వలోకానందప్రదుం డగుట సులభ మని కవిహృదయము. లోకోత్తరశృంగారరసభూయిష్ఠం బగు నీ గ్రంథము నాదిని శృంగారరసాధిదేవత యైన శ్రీకృష్ణమూర్తి సంభోగశృంగారాలంబన విభావముగాఁ బ్రశంసింపఁబడియె.

ఇందు వ్యజ్యమానమగు సంభోగశృంగారంబు మదనగోపాలవిషయక కవిరతి యనెడు భావమునుగూర్చి యంగ మగుటం జేసి రసవదలంకారము. ‘శ్లో. అఙ్గభావం రసో యత్ర భావం ప్రత్యథవారసమ్| భజేత తత్ర రసవదలంకార ఉదీరితః’ – అని తల్లక్షణంబు. ఇట్లు కవీష్టదేవతావిషయకరతిభావంబును, ననుగ్రాహ్య సమస్తలోక విషయక కవిరతిభావమునుగూర్చి యంగ మగుటం బ్రేయోలంకారము. ‘శ్లో. ప్రేయోలఙ్కృతిరఙ్గంచే ద్భావో భావాన్తరం ప్రతి’ – అని తల్లక్షణంబు. భావ మనఁగా దేవతామునిపుత్త్రాది విషయకరతియు, వ్యజ్యమాన నిర్వేదాది త్రయస్త్రింశ దన్యతమంబును, దీనిం గూర్చి కావ్యప్రకాశమందు ‘శ్లో. రతిర్దేవాదివిషయా వ్యభిచారీ తథాఞ్జితః, భావః ప్రోక్తః’ – అని చెప్పఁబడినది.

ఇఁక భగవంతుని మేఘముగ రూపించినందున రూపకాలంకారము. అదియుఁ బరంపరిత మగును. పరంపరితరూపక మనఁగా రూపకాంతరమునకు హేతువగు రూపకంబు. ఇట భగవంతునియం దంభోవాహిత్వరూపణము సుమనఃపాళి యనెడు సుమనఃపాళీత్యాదిరూపకాంతర హేతువైనది గావునఁ బరంపరితం బయ్యె. ‘శ్లో. నియతారోపణోపాయ స్స్యాదా రోపః పరస్య యః, తత్పరంపరితం శ్లిష్టాశ్లిష్టభేదా ద్ద్విధా భవేత్’– అని కావ్యదర్పణమందుఁ దల్లక్షణము. మఱియు నారోపాంతర హేతుకా రోపవిషయ సుమన ఆదిపదములు శ్లిష్టంబు లగుటంజేసి శ్లిష్టపరంపరిత మనఁబడును. కొందఱు దీని నేకదేశవివర్తి రూపక భేద మండ్రు. మఱికొందఱు శ్లేషాలంకారమును బార్థక్యమునఁ జెప్పి శ్లేషసంకీర్ణరూపక మని వక్కాణింతురు. సుమన ఆదిశబ్దములు పర్యాయపరివృత్త్యసహములు గాన నిది శబ్దార్థోభయాలంకార మనియుఁ జెప్పుదురు. ఐన శ్లిష్టపరంపరితరూపక మనుటయే ముఖ్యము. దీనికి వక్షోజధర యనుచోటి యుపమతో సంసృష్టియు, శంపావృత్తిన్ అనుచోటి నిదర్శనతో సంకరము నని యెఱుంగునది.

వక్షోజధరస్ఫురద్వర మురస్సీమన్ అనుచో రేఫమునకుఁ బలుమా ఱావృత్తివలన వృత్త్యనుప్రాస మను శబ్దాలంకారము. ‘శ్లో.వర్ణసామ్య మనుప్రాస శ్చేకవృత్తిగతో ద్విధా| సోనేకస్య సకృత్పూర్వ ఏకస్యాప్యసకృత్పరః’ – అని కావ్యప్రకాశము నందుఁ దల్లక్షణము.

పద్యాదియందు భూదేవతాకంబగు మగణము ప్రయుక్తమగుటంజేసి గ్రంథకర్త్రధ్యేతృవ్యాఖ్యాతృ శ్రోతలకు శుభఫలంబు చేకూరును. ‘శ్లో. మో భూమి స్త్రిగురు శ్శ్రియం వితనుతే’ – అని తత్ప్రమాణము. రెండవదగు సగణంబు దుష్టఫలప్రదం బయ్యును ‘శ్లో. సర్వమూలంతు మగణం ప్రాప్య సర్వేగణాశ్శుభాః’– అను వచనమునుబట్టి మగణముతోఁ జేరుటవలన శుభ ఫలప్రదం బగును. ‘శ్లో. క్షం వినా క్రూర సంయుక్త స్సౌమ్య స్త్యాజ్యో విషాన్నవత్, శేషస్తు కషయో శ్శ్రేయాన్ శుచశ్రావణ యో రివ’ – అనుటవలన శ్రీశబ్దమందు శవర్ణము సౌమ్యమైనను గ్రూరంబగు రేఫంబుతోఁ జేరినందున దూష్యంబని తలంపరాదు. ఏలన, ‘శ్లో. దేవతావాచకా శ్శబ్దా యేచ భద్రాదివాచకాః, తే సర్వే నైవ నిన్ద్యాస్స్యు ర్లిపితో గణతోపి వా’ – అనుటవలన దేవతా వాచకం బగు శ్రీశబ్దమున కట్టిదోషంబు ప్రసరింపదు.

సీ. అశ్రాంతభువనవి◊ఖ్యాతసద్గోత్రుఁ డై, కనుపట్టు నేచాన◊కన్నతండ్రి
యలఘుకలాశాలి◊యై సత్ప్రభుత్వంబు,తో మించు నేయింతి ◊తోడఁబుట్టు
విబుధసంత్రాణప్ర◊వీణుఁ డై నిఖిలైక,నుతిఁ గాంచు నే మాన◊వతిధవుండు
రహి నాత్మసరసధ◊ర్మగుణపాళిస్ఫూర్తి, నలరించు నేకొమ్మ ◊యనుఁగుపట్టి

తే. యరయ సత్యాదికీర్తనీ◊యస్వవృత్తి, నెనయుఁ గల్యాణమూర్తి దా◊నేవధూటి
యట్టిసిరి రుక్మిణీరుచి◊రాభిధాన, చిరతరైశ్వర్యములు గృప◊సేయుఁగాత. 2

ఈపద్యగీతిలో సిరి రుక్మిణీరుచిరాభిధాన యనుచోట రుక్మిణీదేవియందు లక్ష్మీత్వము నారోపించుటం జేసి యర్థ ద్వయము దోఁచుచున్నది.

టీక: ఏచానకన్నతండ్రి = ఏ స్త్రీయొక్క కన్నతండ్రి – భీష్ముఁడును, సముద్రుఁడును; అశ్రాంత భువన విఖ్యాత సద్గోత్రుఁ డై – అశ్రాంత=ఎల్లప్పుడును ‘సతతానారతాశ్రాంత సంతతావిరతానిశమ్’ అని యమరము, భువన = లోకములయందు, విఖ్యాత = ప్రసిద్ధమగు, సద్గోత్రుఁ డై = మంచికులముగలవాఁడై – అని రుక్మిణీపర మగు నర్థము; అశ్రాంత = నాశము లేని; భువన = జల మందు; విఖ్యాత = ప్రసిద్ధమగు; సద్గోత్రుఁ డై = శ్రేష్ఠము లైన మైనాకాదిపర్వతములుగలవాఁడై యని లక్ష్మీపరమైన యర్థము, ‘జీవనం భువనం వనమ్’ – అని యమరము; కనుపట్టున్ = చూపట్టునో; ఏయింతి తోడఁబుట్టు = ఏ సతియొక్క సోదరుఁడు, రుక్మియు, చంద్రుఁడును; అలఘుకలాశాలి ఐ = అధికములగు విద్యల చేత, కాంతులచేత, నొప్పుచున్నవాఁడై; సత్ప్రభుత్వంబుతోన్ = మంచిదొరతనముతోడ, నక్షత్రరాజత్వముతోడ ‘సన్నక్షత్రే విద్యమానేభ్యర్హితే’ – అని విశ్వము; మించున్ = అతిశయించునో; ఏ మానవతిధవుండు = ఏ మానవతియొక్క పతి, కృష్ణుఁడును, నారాయణమూర్తియు; విబుధసంత్రాణప్రవీణుఁడై = పండితుల యొక్క, దేవతలయొక్క రక్షణమందు నిపుణుఁడై; నిఖిలైకనుతిఁ గాంచున్ = ఎల్లవారిలో ముఖ్యమౌనట్లుగా పొగడ్త లందునో, ‘ఏకే ముఖ్యాన్యకేవలాః’ అని యమరము; ఏకొమ్మ యనుఁగుపట్టి = ఏ స్త్రీయొక్క కూరిమిపుత్త్రుఁడు, ప్రద్యుమ్నుఁడును, మన్మథుఁడును; రహిన్ = ఆసక్తిచేత; ఆత్మ సరస ధర్మగుణ పాళి స్ఫూర్తిన్ – ఆత్మ = తనయొక్క,సరస = శ్రేష్ఠములగు,ధర్మగుణ = ధర్మగుణములయొక్క, పాళి = పంక్తులయొక్క, స్ఫూర్తిన్ = ప్రకాశమును; ఆత్మ = తనయొక్క, సరసధర్మ= మధురరసయుక్తమగు చెఱకువింటియొక్క, ‘ధర్మః పుణ్యే యమే న్యాయే స్వభావాచారయోః క్రతౌ| ఉపమాయా మహింసాయాం చాపే చాపనిషద్యపి’ అని విశ్వము; గుణప = అల్లెను పోషించుచున్న, అళిస్ఫూర్తిన్ = తుమ్మెదలయొక్క స్ఫురణమును, అలరించున్ = విస్తరింపఁజేయునో; అరయన్ = విచారింపఁగా; ఏ వధూటి = ఏకొమ్మ; సత్యాదికీర్తనీయస్వవృత్తిన్ – సత్యా = సత్యభామ, ఆది = మొదలగువారి చేత; సతీ = పార్వతీదేవి, ఆది = మొదలగువారిచేత; కీర్తనీయ = కొనియాడఁదగు; స్వవృత్తిన్ = తనదైన సద్వృత్తిని; ఎనయున్ = పొందియుండునో; తాన్ = తాను; కల్యాణమూర్తి = మంగళవిగ్రహము గలదో, సువర్ణరూపిణి యైనదో, ‘చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీమ్’ – అని శ్రుతి; రుక్మిణీరుచిరాభిధాన = రుక్మిణి యను మనోజ్ఞనామము గల; అట్టిసిరి = పూర్వోక్త గుణములు గల లక్ష్మీదేవి; ఇందు సిరియే రుక్మిణీనామము గలదనుటకు ‘ రాఘవత్వే భవత్సీతా’ –యను పూర్వోదాహృత వచనము ప్రమాణము; చిరతరైశ్వర్యములు = అత్యంతచిరకాలస్థాయులగు నైశ్వర్యములు, శాశ్వతైశ్వర్యము లనుట, స్థిరతర యను పాఠము సుకరము; కృపసేయుఁగాతన్ = దయసేయుఁగాత నని యాశీర్వచనము.

రూపకాలంకారభేదము. ఇందు రుక్మిణీదేవి విషయకకవిరతి యనెడు భావము వ్యజ్యమానమగుచున్నది గాన భావధ్వని యగును.

మ. పలుకుందొయ్యలిమోవితేనియలు శుం◊భత్ప్రీతిమైఁ గ్రోలి ముం
గలిమోముం బొలయల్కపేర మరలం ◊గావించి, పశ్చాత్తటో
జ్జ్వలవక్త్రంబున నాని తా నధికహ◊ర్షం బూని యిష్టార్థము
ల్దలకొన్ధాత యొసంగుఁ గాత శుభధీ◊లాభంబు మాకెంతయున్. 3

టీక: పలుకుందొయ్యలిమోవితేనియలు= సరస్వతియధరమధువులను; శుంభత్ప్రీతిమైన్ = అధికమైన ప్రేమచేత; క్రోలి = పానముఁ జేసి; పొలయల్కపేరన్ = ప్రణయమానముయొక్కసాకుచేత; ముంగలిమోమున్ = ఎదుట నున్న ముఖమును; మరలంగావించి = మరల్చి; పశ్చాత్తటోజ్జ్వలవక్త్రంబునన్ = వెనుక వెలయుచున్న మోముచేత; ఆని = పానము చేసి; తాన్, అధికహర్షంబు = అధికసంతోషమును; ఊని = వహించి; ఇష్టార్థముల్ = ఇష్టమైన యాలింగనాద్యర్థములను; తలకొన్ధాత = పొందునట్టి బ్రహ్మ; మాకున్; శుభధీలాభంబు = మంచిబుద్ధియొక్క లాభమును; ఎంతయున్ = మిక్కిలి; ఒసంగుఁ గాతన్ = ఇచ్చుఁగాక; ఇచటఁ దలకొన్ధాత యను చోట ‘పదాంతంబులగు ను లు రు ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగా నగు’ నను బాలవ్యాకరణసూత్రముచేఁ దలకొను అనుదాని కడపటి ఉకారమునకు లోపం బైనది.

ఈపద్యమందు వాణీవిధాతల లోకోత్తర సంభోగ శృంగారము వ్యక్తంబగుచున్నది. ‘శ్లో. అనుకూలౌ నిషేవేతే యత్రాన్యోన్యం విలాసినౌ| స్పర్శనాలిఙ్గనాదీని స సంభోగ ఇతీరితః’ – అని తల్లక్షణము. ఇట్టి శృంగారము విధాతృవిషయకకవిరతినిగూర్చి యంగభావమునొందినందున రసవదలంకార మగును. లక్షణము వ్రాయఁ బడియె.

సీ. రమణీయతరపదా◊ర్థప్రకాశనిదాన, భాస్వత్ప్రసాదసం◊పద వహించి
పటుసారసానంద◊ఘటకైకచాతుర్య, ఘనకృతాలంకార◊కలన మెఱసి
యనుకూలకాలకం◊ఠాకుంఠకలనాద, వలమానమంజుల◊ధ్వనుల నలరి
యతివేలకవిజాల◊కామోదనాపాద, కారణరసభావ◊గరిమనెనసి

తే. పరమయతియోగసంస్థాన◊పదమనోజ్ఞ
వైభవోన్నతిఁ దగు సర◊స్వతి మదీయ
మానసాస్థానమందిర◊మధ్యవీథి
నిండు కొలువుండుఁ గాత ని◊ష్ఖండలీల. 4

ఈపద్యము గీతియందు నదీభారతులను బోధించు సరస్వతీశబ్దము కర్తృపదముగాఁ జేసి యర్థద్వయము కల్పింపఁబడియె.

టీక: రమణీయతరపదార్థప్రకాశనిదానభాస్వత్ప్రసాదసంపదన్ – రమణీయతర = అత్యంతమనోహరములగు, పదార్థ = శబ్దార్థములయొక్క, ముక్తాదిద్రవ్యములయొక్క, ప్రకాశ = ప్రకాశమునకు, నిదాన = ఆదికారణమగు ‘నిదానం త్వాదికార ణమ్’ – అని యమరము, భాస్వత్ = ఒప్పుచున్న, ప్రసాద = ప్రసాదమనెడు కావ్యగుణముయొక్క, ‘యశ్చిత్తం హ్యశ్నుతే హ్నాయ శుష్కేన్ధనమివానలః| సప్రసాదో మత స్సర్వరససాధారణస్థితిః’ – అని సాహిత్యరత్నాకరము, నైర్మల్యముయొక్క ‘ప్రసాదస్తు ప్రసన్నతా’ అని యమరము, ‘గఙ్గారోధః పతనకలుషా గృహ్ణతీవ ప్రసాదమ్’ – అని నైర్మల్యమందు విక్రమోర్వ శీయమునఁ గాళిదాసప్రయోగము, సంపదన్ = సమృద్ధిని; వహించి = పొంది;
పటు సార సానందఘట కైక చాతుర్య ఘనకృ తాలంకార కలనన్ – పటు = సమర్థమగు, సారస = రసికసమూహమునకు, సరసశబ్దముమీఁద సమూహార్థమందణ్ప్రత్యయము, బెగ్గురులకు, ఆనందఘటక = ఆనందము గూర్చునట్టి, ఏక =ముఖ్య మగు, చాతుర్య = నేర్పుచేత, నదీపరమైన యర్థమందు నేర్పుగలయని చాతుర్యశబ్దాంతము బహువ్రీహి చేయవలెను, ఘన = అధికమగునట్లుగా, మేఘములచేత, కృత = చేయఁబడిన; అలంకార = ఉపమాదులయొక్క, ఒప్పిదములయొక్క; కలనన్ = ప్రాప్తిచేత; మెఱసి = విలసిల్లి; అనుకూల కాలకం ఠాకుంఠ కలనాద వలమాన మంజుల ధ్వనులన్ – అనుకూల = అనుకూలములగు, కూలానుసృతము లగు; కాలకంఠ = కలకంఠీసంఘముయొక్క, స్త్రీసమూహముయొక్క యనుట, నెమిళ్ళయొక్క, అకుంఠ = అడ్డము లేని, కలనాద = అవ్యక్తమధురశబ్దములభంగి, కలనాదములతోడను, వలమాన = ఒప్పుచున్న, కూడుకొన్న, మంజుల = మనో జ్ఞములగు, ధ్వనులన్ = వ్యంగ్యార్థములచేతను, తరంగధ్వనులచేతను; అలరి = ఒప్పి, ‘శ్లో. కాన్తా సమ్మితయా యయా సరసతా మాపాద్య కావ్యశ్రియా’ – అని ప్రతాపరుద్రీయమునందుఁ జెప్పుటవలనఁ గావ్యధ్వనులకుఁ గాలకంఠాకుంఠకలనాద వలమానత్వము గలుగునని భావము; అతివేల కవిజాల కామోద నాపాద కారణ రసభావ గరిమన్—అతివేల = అధికమగు, కవిజాలక = పండితమండలియొక్క; క= జలమందుండెడు, వి = పక్షులయొక్క, జాలక = సమూహముయొక్క; ఆమోదన = సంతసముయొక్క, ఆపాద = సంపాదనమునకు, కారణ = హేతువైన, రస = శృంగారాదిరసరూపకములగు, భావ = రత్యాదిస్థాయిభావములయొక్క, ‘శ్లో. విభావై రనుభావై శ్చ సాత్త్వికై ర్వ్యభిచారిభిః| ఆనీయమాన స్స్వాదుత్వం స్థాయీభావో రసస్స్మృతః’ – అని స్థాయి భావమే రసరూప మగునని చెప్పఁబడినది గాన రసరూపము లగు రత్యాదిస్థాయిభావములయొక్క యని వ్యాఖ్యాతం బయ్యె, కాదేని, శృంగారాదిరసములయొక్క వ్యజ్యమాన నిర్వేదాది సంచారభావములయొక్క, నదీపరమగు నపుడు – రసభావ = జలసత్తయొక్క ‘భావ స్స్వభావే సత్తాయామ్’ – అని విశ్వము, గరిమన్ = అతిశయమును; ఎనసి = పొంది; పరమ యతి యోగ సంస్థాన పద మనోజ్ఞ వైభవోన్నతిన్ – పరమ = ఉత్కృష్టమగు, యతి = పదవిచ్ఛేదముయొక్క, ‘యతి ర్విచ్ఛేదసంజ్ఞకః’ అని వృత్తరత్నాకరము, మునులయొక్క, యోగ = సంబంధముయొక్క, ధ్యానమునకు, సంస్థాన = సన్ని వేశము గల ఆశ్రయములగు, పద = పద్యచతుర్థభాగములయొక్క,ఆశ్రమస్థానములయొక్క, మనోజ్ఞ = మనోహరమగు; వైభవోన్నతిన్ = విభవాతిశయముచేత; తగు సరస్వతి = ఒప్పుచున్న వాగ్దేవి, ఒక నది; మదీయమానసాస్థాన మందిరమధ్య వీథిన్ – మదీయ=నా సంబంధియైన, మానస = హృదయ మనెడు, ఆస్థానమందిర = సభామందిరముయొక్క, మధ్యవీథిన్= మధ్యప్రదేశమందు; నిష్ఖండలీలన్ = అఖండవిలాసముచేత; నిండుకొలువుండుఁ గాతన్ = నిండుకొలువునొందుఁ గాత.

ఇందు శబ్దశక్తి ప్రకృతార్థమందు ప్రకరణాదినియంత్రితమైనందున నప్రకృతనదీపరమైన యర్థము వ్యంగ్యమని ప్రాచీనులు. అర్థద్వయము వాచ్యమె కావచ్చుఁగావున శ్లేషాలంకారమని కొందఱు నవీనులు చెప్పుచున్నారు. మతద్వయమునందు నుప మాలంకారము వ్యంగ్యము. మఱియు సరస్వతీదేవివిషయకకవిరతి ధ్వనిత మగుచున్నది గాన భావధ్వని.