విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచి పెట్టాడని, రాహువు కపటంగా దేవతల ఆకృతిలో వచ్చి అమృతాన్ని పొందే ప్రయత్నం చేశాడని, ఆ విషయం పసిగట్టి విష్ణువుకు ఆ విషయాన్ని చేరవేశారని తెలుసుకున్న రాహువుకు సూర్యచంద్రుల మీద తీరని పగ కలిగిందనీ వివరించాను. అలా రాహువు పగసాధింపు చర్య నేటికీ కొనసాగుతుందని చెప్పాను. ప్రతీ రోజూ ఈ రాహువు సూర్యచంద్రులను వాళ్ళ సంచలనంలో కొంతసేపు పీడిస్తూ ఉంటాడు. దాన్నే రాహుకాలం అంటారు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: ఎ. ముత్తులింగంఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
ఎ. ముత్తులింగం రచనలు
నాకోసం ఎవరూ పుట్టినరోజులు జరపలేదు. కేక్ కోయలేదు. కేండిల్స్ వెలిగించి పాటలూ పాడలేదు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక అద్దం ముందు నిల్చుని చూసుకున్నాను. నా శరీరంలో మార్పులు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను నేను చూసుకొని మురిసిపోతూ చాలాసేపు నిల్చుని ఉండిపోయాను, ఆ రోజు సాయంత్రం పిన్ని కొట్టిన చెంపదెబ్బ తాలూకు గుర్తు కనిపిస్తూనే ఉన్నా పట్టించుకోకుండా.
వాడు వచ్చేలోపు స్నానం చేద్దాం అనుకుంది. రెడీగా ఉండి వాడిని సర్ప్రైజ్ చెయ్యొచ్చు. ఒక కాలి చెప్పుని మరో కాలి మడమ సాయంతో తీసి దాని పై అంచుని బొటనవేలితో పైకెత్తి పెండ్యులంలా ఊపి నవ్వుకుంది. ఆపైన కాలితోనే గోడవైపుకు విసిరింది. అది గోడకి కొట్టుకొని నేలమీద పడింది. మరో చెప్పునీ కాలితోనే తీసి విసిరింది. ఒంటిమీదున్న దుస్తులు విప్పి స్నానం చేసి వదులుగా ఉన్న బాత్ రోబ్ తొడుక్కుంది.
విమల్‌కు చేతులు కాళ్ళు వణకసాగాయి. మిథున్ సంచి, స్సాక్స్, నీళ్ళ సీసా అన్నీ కారులోనే ఉన్నాయి. విమల్ లేప్‌టాప్, పుస్తకాల సంచీ, ఫైళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మిథున్ మాత్రం లేడు. ఏం జరిగింది? బిడ్డ ఎలా తప్పిపోయాడు? అన్నది వాడి బుర్రకు అందలేదు. బయలుదేరే తొందరలో బిడ్డను కారులో ఎక్కించడం మరిచిపోయాడా? వాడికి నమ్మబుద్ధి కాలేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది.
ఆమె నాకేసి చూడటమూ, నేను రియర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూడటమూగా కాసేపు సాగింది. మరి కాసేపటికి వ్యాను దిగి వచ్చి నా కారు తలుపు తట్టింది. నేను కిటికీ అద్దం దించాను. సోప్స్‌లో వచ్చేలాంటి అందగత్తె ఆమె. అయితే మేకప్ అలవాటు లేని ముఖం; ముఖాన్ని సరిగ్గా కడుక్కుందో లేదో అనిపించేలా ఉంది. జుత్తంతా చెదిరిపోయుంది. మాసిన దుస్తులేమీ కాదు గానీ సాదా సీదాగానే ఉంది. తనకున్న సహజమైన అందాన్ని ఏమేం చేస్తే దాచేయొచ్చో అవన్నీ చేసి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినదానిలా ఉంది.
“నేనెందుకు మరొకరి దగ్గర సాయం అడగాలి? ఇది నా బాధ్యత కదా? చెట్టుకు మధ్య భాగమే బలం. గట్టిబడి ఉక్కులా ఉంటుంది. ఆ చెట్టులో మొట్టమొదటి భాగమూ అదే. అయితే చెట్టుకి కావలసిన ఆహారాన్ని సరఫరా చెయ్యడం ఆ భాగంవల్ల కాదు. చెట్టుయొక్క తాట భాగమే ఆహారాన్నీ నీటినీ సరఫరా చేస్తుంది. ఆ భాగం లేతది, వయసులో చిన్నది. మనుషులూ అంతే. పెద్దలు కుటుంబానికి బలం. కొత్తతరం వాళ్ళే సంపాదనలవీ చూసుకోవాలి.”
నేను కెనడాకు విహార యాత్రికుడిగా రాలేదు. నా దరఖాస్తుల్లోనూ, విచారణల్లోనూ చెప్పినట్టు మా దేశంలో జరుగుతున్న యుద్ధం నుండి ప్రాణాలు కాపాడుకోడానికి కట్టుకున్న భార్యని, దేవతల్లాంటి నా పిల్లల్నీ వదిలేసి తప్పించుకుని వచ్చినవాణ్ణి. నా కుటుంబాన్ని ఎలాగైనా పోషించుకోవచ్చన్న ఆశతో మూడు నెలలపాటు అష్టకష్టాలు పడుతూ ప్రయాణం చేసి వచ్చాను. ఫ్లయిటెక్కి నేరుగా అలా వచ్చి ఇలా దిగలేదు.
కొందరు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకుంటారు, తర్వాత వెతికి పట్టుకుంటారు. కొందరు పెన్ను పోగొట్టుకుంటారు, వెతుక్కుంటారు. కొందరు తాళంచెవి. కొందరు ఇంకేవో. నేను ఒకసారి నా కారుని పోగొట్టుకున్నాను. ఆ రోజు టొరాంటోలో మంచు ఎక్కువగా కురుస్తుందనీ, వాతావరణం తల్లకిందలవుతుందనీ ఎఫ్.ఎమ్. రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంది. నేను తొందరగా హాస్పిటల్‌కి చేరుకున్నాను.
కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటంలేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ‘ఎలా ఉన్నావు?’ అనడిగితే ‘దిట్టంగా ఉన్నాను!’ అంటోంది. ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళు ఇకిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది.
భూమి నిద్రపోదు అంటారు. అయితే ఆకాశం మేలుకునుండదు. రాత్రివేళల్లో మేలుకుని పనిచెయ్యాల్సి వచ్చినప్పుడు చాలా మనోహరంగా ఉంటుంది. దీపాలన్నీ ఆర్పేసి చీకటి మధ్యలో నిశబ్దంగా కూర్చుని చూసేప్పుడు నక్షత్రాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. వర్షాకాలంలో మెరుపులూ, ఉరుముల శబ్దమూ ఆశ్చర్యంగా కిందనుండి పైకొస్తున్నట్టుగా ఉంటుంది.
లాహోర్‌నుండి రప్పించిన అమ్మాయిల ముజ్రా నాట్యం రహస్యంగా జరిగింది. వాకిట ఇద్దరు తుపాకీలు పట్టుకుని రక్షణ ఇస్తున్నారు. పెషావర్‌లో ఇలాంటి డాన్సులకి అనుమతి లేదు. నలుగురు అమ్మాయిలూ ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టే సినిమా పాటలకి డాన్సులు చేశారు. మగవాళ్ళు డబ్బు నోట్లను వాళ్ళమీద చల్లడం మొట్టమొదటసారి చూశాను.
తొలిరోజే నేనామెను గమనించాను. ఆమెది హృదయాన్ని కట్టిపడేసే అందం కాదు. అయితే ఆకర్షణీయంగా ఉంటుంది. చిక్కని ఆకుపచ్చ రంగు కళ్ళు. ఆమె ఒంటి చాయని మంచు దేశపు మనుషులకుండే తెలుపు చాయ అనలేము. ఇలాంటి మేనిచాయ కోసమే ఐరోపా దేశాల ఆడవాళ్ళు తూర్పు దేశాల సముద్రతీరాలకెళ్ళి గుడ్డపేలికలు చుట్టుకుని మండే ఎండలో అష్టకష్టాలు పడుతుంటారు అని చెప్తే మీకు అర్థం అవుతుంది.
అతను మిలిటరీలో పని చేసినవాడన్న సంగతి చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది. దృఢమైన దేహం, తగిన ఎత్తు. ముఖం మాత్రం అప్పుడే ఎవరినో కొరికేసి వచ్చినవాడిలా ఉంటుంది. అయితే ఆ పూట మాత్రం దరహాసాన్ని తెచ్చిపెట్టుకుంటూ ‘తన కొడుకు పెళ్ళి ఏర్పాట్లకని పందిళ్ళవీ వేశామనీ, శ్రమ కలిగించుతున్నందుకు క్షమించమనీ; కారు వీధి చివర్లో పెట్టి ఇంటికి నడిచి రమ్మనీ’ ప్రాధేయపడ్డాడు.
నాకప్పుడు పాకిస్తాన్‌లోని ఈశాన్య మూలనున్న పెషావర్‌లో ఉద్యోగం. ఆరోజుల్లో నాకొక వంటమనిషి కావలసి వచ్చాడు. మనిషంటూ దొరికితే, అతని పని చాలా సులువుగానే ఉంటుంది, సందేహం అక్కరలేదు. వంట చెయ్యాల్సింది నా ఒక్కడికి మాత్రమే. ఉదయం అల్పాహారం నేనే చేసుకుంటాను. టోస్ట్ చేసుకుని బ్రెడ్‌కి వెన్న రాసుకోడానికీ తినడానికీ నాకు సరిగ్గా నాలుగు నిముషాలు సరిపోతుంది. మధ్యాహ్నానికీ, రాత్రి భోజనానికే ఇబ్బంది.
“మేడమ్, మీ తీయని స్వరంలో రిపోర్ట్ అన్న మాట రావచ్చా? ఈ శాఖ మొదలైనప్పట్నుండి నేను బిల్లులన్నీ సరిగ్గానే చెల్లిస్తూ వస్తున్నాను. నాకు దేశభక్తి, భూభక్తి, భూగురుత్వాకర్షణభక్తి మెండుగానే ఉన్నాయి. గురుత్వాకర్షణ గురించి ఒక కవితైనా చదవకుండా ఏ రోజూ నేను నిద్రపోయినవాడిని కాను. మేడమ్, ఎలాగైనా నేను ఈ బిల్లు చెల్లించేస్తాను.”
డాక్టర్ వీళ్ళు లోపలికి నడిచి రావడాన్ని శ్రద్ధగా గమనించాడు. అతని వృత్తిలో పేషంట్ల నడకనీ బాడీ లాంగ్వేజ్‌నీ గమనించడం అతి కీలకమైన విషయం. కొన్ని సార్లు వచ్చినవాళ్ళ సమస్య ఏంటన్నది కూడా అందులోనే అర్థం అయిపోతుంటుంది. భర్తకి నలబైయేళ్ళుంటాయి. భార్య నాలుగేళ్ళు చిన్నదైయుండచ్చు అనిపించింది. వాళ్ళు వేసుకున్న ఓవర్‌కోట్ తియ్యలేదు. వాటిమీద మంచు ఇంకా పూర్తిగా కరిగిపోలేదు.
ఆత్మహత్య గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా వాడికి సోమాలీ గుర్తొస్తాడు. ఇటలీలో మిలానో స్టేషన్‌లో వాడిని ఆకలితో చనిపోనివ్వకుండా కాపాడినది సోమాలీనే. సోమాలీ అన్ని దేశాలూ తిరిగాడు కాబట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆత్మహత్య శ్రేష్టమైనదన్నట్టుగా కొంత పరిశోధన చేసిపెట్టుకున్నాడు. బెల్జియంలో డ్రగ్స్; ఇటలీలో తుపాకీతో కాల్చుకోవడం; ప్యారిస్ అంటే ఇంకేముంటుందీ? ఈఫిల్ టవర్ ఎక్కిదూకడమే!
తన నైట్‌డ్రెస్ ఆ చిన్న వెలుతురులో మరింత పలచగా ఉన్నట్టు కనిపించింది. విరబోసుకున్న తన జుట్టు నుండి వెచ్చదనం, వొంటినుండి వస్తున్న వాసన నాకు కొత్తగా ఉండింది. నా వేళ్ళు తనలోని ఏదో ఒక భాగాన్ని తాకగలిగేంత దగ్గరగా నిల్చునుండింది. తననే చూస్తున్న నన్ను చూసి చూపుడు వేలు పెదవులపై శిలువలా పెట్టి సైగ చేస్తూ మెల్లగా నడిచి తలుపు తీసుకుని వెళ్ళిపోయింది.
తలుపు హేండిల్ మీద చేయి పెట్టింది. షోల్డర్ బ్యాగ్ భుజాన వేలాడుతోంది. తనిప్పుడు ఏమన్నాడని ఇంత కోపం! జవాబిచ్చి వెళ్తే బాగుంటుంది. ఎప్పుడో కొన్న బేగల్ అది. ఒక జిప్‌లాక్ కవర్లో వేసి, దాన్ని మరో జిప్‌లాక్ కవర్లో పెట్టి సీల్ చేసి, మళ్ళీ మరో కవర్లో చుట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టడంలో ప్రయోజనమేంటి? ఈ చిన్న ప్రశ్నకు జవాబివ్వడం ఏం కష్టం? వచ్చే డబ్బే బొటాబొటిగా సరిపోతుంది. జిప్‌లాక్ కంపెనీకి ఏం తక్కువని ఇలా పోషించడం?
పెద్దోడి వయసు పదకొండేళ్ళకంటే ఎక్కువుండదు. చిన్నోడికి ఆరేళ్ళుండచ్చు. ఆ పిల్లలిద్దరూ ఆ జనసముద్రంలో తేలుతున్న రెండు చిన్న ఆకుల్లా అటూ ఇటూ అల్లల్లాడుతున్నారు. ఇంతలో అక్కడికి బాగా బలిసి భీకరంగా ఉన్న ఆకారం ఒకటి వచ్చింది. కిందవాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా అధికారం చెలాయించడానికి అలవాటుపడిన ముఖం. నల్లరంగులో పెద్ద ఓవర్కోటు, బెల్టు, టోపీతో ఉన్నాడు. చేతిలో ఒక కర్ర పట్టుకుని తిప్పుతూ ఉన్నాడు. కరకు గొంతుతో ఏదో అరుస్తున్నాడు అప్పుడప్పుడూ. వాడేం చెప్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అయినా ఆ జనసమూహమంతా వాడి ఆజ్ఞలకి కట్టుబడింది.
పెళ్ళయిన కొత్తల్లో ఆమె కాళ్ళ పట్టీలు రెండూ ఒకదానికొకటి చిక్కుకోవడం తరచూ జరుగుతూ ఉండేది. నడిజాములో ఆమె కాళ్ళు చిక్కుకుని అవస్త పడుతుంటే ఆ పరిస్థితి చూసి నవ్వుతూ ఉడికించేవాడు. ఆమె బేలగా అయ్యో పట్టీలు చిక్కుకున్నాయి విడిపించండి అని బతిమలాడేది. ఆమె ఆరాటాన్నలా కొనసాగించి చూసి ఆనందపడేవాడు. ఆమె పాదాలను సుతిమెత్తగా తడుముతూ పట్టీల చిక్కు విడిపించేవాడు. ఎంత ఆలస్యం చేస్తే అంతసేపు ఆమె పాదాలతో ఆడుకోవచ్చు అన్నట్టు నెమ్మదిగా చిక్కు విడిపించేవాడు.