రాహుకాలం

సోమవారాలు నాకు నచ్చవని కొందరు అనుకుంటుంటారు. అవి వచ్చేప్పుడు వాటి వెనుకే మరో నాలుగు రోజులను వెంట తీసుకురావడం నాకు నచ్చదు అంతే తప్ప నిజం చెప్పాలంటే నాకు సోమవారాలంటే ఎలాంటి కోపతాపాలూ లేవు. పైగా ఈ శని, ఆదివారాలు సోమవారం నుండి చాలా దూరంగా ఉంటాయి. అదే చిక్కు. అంతకంటే సోమవారాలతో నాకు ఎటువంటి వ్యక్తిగత విరోధమూ లేదు.

అలాంటొక సోమవారం పొద్దున నేను ఆఫీసుకు పరుగు తీస్తున్నాను. పరుగు అనటం తప్పు. నైరోబీలో ఎనిమిది వీధులున్న ముఖ్యమైన కిరోమో రోడ్డు మీద పొద్దునపూట వాహనాల రద్దీలో కార్లు నత్తల్లా పాకుతుంటాయి. రేడియోలో ఆ రోజుల్లో ప్రజాదరణ పొందిన ఒక ఆఫ్రికన్ హిట్ పాట తరుచూ ప్రసారం అవుతుండేది.

నా స్తనాలు ముట్టుకోకురా కొత్తవాడా!
అవి ఇంకా పక్వానికి రాలేదు, తాళవేరా!
కలబందలాగా ఒళ్ళు చేవబారనీ
అప్పుడు నీ చేతివాటం నాకు తెలిసొచ్చేను
అప్పటిదాకా నా స్తనాలు ముట్టుకోకురా కొత్తవాడా!

ఈ పాట భావానికి సరిపడేట్టుగా ఒక సంఘటన నా ఆఫీసులో ఆ సమయంలో జరుగుతూ ఉండటం తెలియని నేను సావకాశంగా ఆఫీసు వైపుకు ప్రయాణిస్తున్నాను.

నైరోబీలో ఉద్యోగం చెయ్యడం అంటే అయితే షాహ్ దగ్గర లేకుంటే పటేలు దగ్గర చేస్తుండాల్సిందే. సూటిగా బయోడేటా రాయడం చేతనయుంటే చాలు ఉద్యోగం దొరికేస్తుంది. ఇక్కడ ఉద్యోగం దొరకడం అన్నది ఆ బయోడేటా తయారు చేసేవాడి సమర్థత మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాలు వెలగబెడుతున్న వాళ్ళందరూ ఇట్టే విల్లు వంచి నారి బిగించగలరు, మత్స్యయంత్రాన్ని ఛేదించగలరు. కొండలు ఎత్తగలరు. నేను పెద్ద ప్రయాస లేకుండానే సప్త సముద్రాలను దోసిట్లోకి ముంచుకుని తాగేసినట్టు బయోడేటా రాసుకుని ఈ ఉద్యోగం సంపాయించుకున్నాను.

నా యజమాని ఒక పటేలు. అతనికి ఈ దేశంలో అక్కడక్కడా ఒకదానికొకటి ఆనుకుని వరుసగా ఉండే ఇళ్ళ సముదాయాలు, రో-హౌసులు, కొన్ని ఉన్నాయి. అతని ఒకానొక రో-హౌస్‌లో నేను ఎస్టేట్ మేనేజర్‌గా ఉన్నాను. ఇళ్ళను పర్యవేక్షించడం, అగ్రిమెంట్లను తయారు చెయ్యడం, వాటిని అమలు పరచడం, అద్దెలు వసూలు చెయ్యడం, పద్దులు రాయడం – ఇవీ నా పనులు. ఓటమే గెలుపుకు మొదటి సోపానం అన్న నానుడి మీద నాకు అత్యధికమైన విశ్వాసం ఉండటంచేత ఈ ఉద్యోగం కొనసాగుతోంది. నా దగ్గర ఇప్పటివరకు ఒక స్టేడియం కట్టడానికి సరిపోయినన్ని సదరు సోపానాలు పోగయ్యున్నాయి.

ఆఫీసు తెరిచిన అర్ధగంట తర్వాతే నేను ఎప్పుడూ ఆఫీసుకు చేరుకుంటాను. ఆ రోజు ఏమయిందో నేను పెందలాడే ఆఫీసుకు వచ్చేశాను. నేను ఎలాంటి ప్రయత్నమూ చెయ్యకుండానే జరిగిన చర్య అది. టంచనుగా టైముకు ఆఫీసుకు రావడం వంటి పొరపాట్లు కొన్నిసార్లు జరిగిపోతాయి.

ఆ రో-హౌస్‌ల చుట్టూ ఎత్తుగా ఎలెక్ట్రిక్ కంచె ఉంటుంది. ఒకటే పెద్దగేటు. దానిని ఇద్దరు భటులు కాపలా కాస్తుంటారు. మిమోసా చెట్ల చివర్లో కూర్చుని హడాడా పక్షులు పొద్దుటి కచేరీలు చేస్తున్నాయి. కాంపౌండ్ గోడపక్కనే ఒక వరుసలో మోటారుసైకిళ్ళను పార్క్ చేస్తారు. తెంపుకెళ్ళిపోతాయేమో అన్నట్టు ఆ మోటారుసైకిళ్ళను గొలుసులతో బంధించి ఉంచుతారు. నేను గబగబా నడుచుకుంటా నా ఆఫీసు గదివైపు వెళ్తుంటే నా కంటే వేగంగా ఆ ఇద్దరు భటులూ నన్ను వెంబడించారు. వాళ్ళ ముఖాల్లో తత్తరపాటు. నా గది తలుపులు ఫుర్తిగా మూసిలేవు. ఆలస్యంగా వచ్చే నా అలవాటుమీదున్న మిక్కిలి విశ్వాసంతో అక్కడ ఒక ఘనకార్యం జరిగిపోతోంది. తలుపు తెరిచినప్పడు అలాంటొక దృశ్యాన్ని నేను ఊహించలేదు.

అతని ముఖం నాకు పరిచయమైన ముఖంలా లేదు. ముప్పై ఐదేళ్ళు అనిపించే రీతిలో పుష్టిగా కండలు తిరిగిన దేహంతో ఉన్నాడు. వీపున చెమట చుక్కలు జారుతున్నాయి. చాటింపు లేకుండా వచ్చిన నన్ను నిందితుడిలా చూశాడు. ఆమె ఒక చేత్తో తన బట్టలు పుచ్చుకుని మరో చేత్తో రొమ్ములు కప్పుకుంటూ పరుగు తీసింది. దబ్బున మళ్ళీ వెనక్కొచ్చి తన చెప్పులు పట్టుకెళ్ళింది.

ఆమె ఇక్కడ కసువు ఊడ్చి శుభ్రం చేసే ఉద్యోగం చేస్తుంది. రోజూ తెల్లవారు జామునే డబ్బులిచ్చి మరీ అలంకరించుకున్న జడలతో, చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని ప్రతిరోజూ ఎంతో అందంగా ముస్తాబయ్యి వస్తుంది. అప్పుడే ఓవెన్‌నుండి బయటకు తీసిన బ్రెడ్‌లాగా, కరకరలాడే దుస్తుల్లో, వెచ్చగా కొత్తవాసనతో విలసిల్లే ఆ అమ్మాయిని అతను వచ్చిన రెండురోజుల్లోనే ముగ్గులోకి దింపేశాడు.

కొన్ని రోజుల క్రితం కొత్తగా ఇక్కడికి దిగిన డన్ వాళ్ళ ఇంటి డ్రైవరే ఈ మారియో మ్‌గోమా. సారథ్యమే కాకుండ ఇతర పనులూ చేస్తాడన్నది ఆ రోజు పొద్దునే తెలిసింది నాకు. ఒకప్పుడు హటాంబి ఫుట్‌బాల్ టీమ్‌లో ప్రధాన ఆటగాడని తర్వాత తెలుసుకున్నాను. తొడలు ఒరుసుకుంటూ నాకేసి తిరిగి చూస్తూ నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు. నేను అతనిని క్షమాపణ అడగాలని అతను ఎదురుచూసినట్టు అనిపించింది.

మారియోతో నా తొలి పరిచయం ఇలా జరిగింది.

వారం రోజుల క్రితం మిస్టర్ డన్ నా ఆఫీసుకు వచ్చాడు. ఇల్లు తనకు బాగా నచ్చిందన్నాడు. ఇతను మారీషియన్. పొట్టిగా పుష్టిగా ఉంటాడు. ఏ రకం ఇంట్లోనైనా, ఎలాంటి గడప అయినా తలవంచాల్సిన శ్రమలేకుండా వెళ్ళగల సౌలభ్యం ఉన్నవాడు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రతినిధిగా నైరోబీలో పదవి పుచ్చుకున్నాడు. ఇతనితో కలుపుగోలుగా ఎవరూ మాట్లాడలేరన్నది వెంటనే అర్థం అయిపోయింది. మాటలను నాలుకమీద బంక వేసి అంటించుకున్నవాడిలా మాట్లాడతాడు.

ఇంటి అగ్రిమెంటు తయారుచేసి సంతకం చెయ్యడానికి ఇచ్చాను. తన వృత్తిదోషం కారణంగా నేను తయారుచేసిన ఒప్పందపత్రాన్ని ఇతను చదవటానికి ప్రయత్నించాడు. పక్షపాతమైన ఒప్పందపత్రాలు ఇక్కడ బాగా ప్రసిద్ధం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కొత్తగా ఈ దేశానికి ఉద్యోగిగా నియమించబడి వచ్చిన ఈ మారీషియన్‌కి ఆ విషయం తెలిసుండే అవకాశం లేదు.

చీమ కళ్ళకు మాత్రమే చూడటం సాధ్యం కాగలిగినంత చిన్న అక్షరాలతో మేము ఒప్పందంలో ఫుట్‌నోట్‌లు రాస్తుంటాం. ఎంతో వింత వింత షరతులన్నీ ఇలా పొందుపరిచేస్తుంటాం. ఇతను వాటన్నిట్నీ చదవటానికి ఎంతో ప్రయాసతో ప్రయత్నించాడు. తలగోక్కుంటూ చాలాసేపు ఆలోచించాడు. ఏదో ఐ.ఎమ్.ఎఫ్. పత్రంలో సంతకం చెయ్యమన్నట్టు మనిషి హైరానా పడిపోతున్నాడు.

“అయ్యా, ఇది ఇనుప కొలిమిలో తయారు చేయబడిన పత్రం. ఇందులో ఒక పాదమో, ఒక మాటో, ఒక అక్షరమో, ఆఖరికి ఒక విరామచిహ్నాన్ని కూడా మీరు మార్చలేరు. కావాలంటే మరోరోజు సమయం తీసుకుని నెమ్మదిగా చదవండి” అన్నాను. కాసేపు దీర్ఘంగా ఆలోచించి పెన్ను తీసుకుని Velay Don అని తన పేరును లిఖించాడు.

ఇతని భార్యను చూశాకే ఇతను తమిళుడయుండే అవకాశం ఉందన్న సందేహం కలిగింది. ఆరా తీస్తే తెలిసిందేంటంటే వేలాయుదన్ అన్న అతని అచ్చ తమిళ పేరే వెలే డన్‌గా మారిందని. పరమ చెత్తగా తమిళ పదాలను పలకడంలో ఇతను పరాకాష్టగా ఉన్నాడు. ఇతని తమిళ ఉచ్చారణ వింటే ఒళ్ళు జలదరిస్తుంది.

మారియో మొదటి సారిగా ఒక విదేశీయుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి అతనికి తరచుగా కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి. తన యజమాని అయిన డన్ అలవాట్లు, పోకడ, ఇష్టాయిష్టాలు ఏవీ అతనికి అంతు చిక్కలేదు. అతను తన డ్రైవర్ దగ్గర ఏం కోరుకుంటున్నాడు అన్నది మారియోకి స్పష్టం కాలేదు. అతను నేర్చిన మొదటి పాఠం, పొద్దున కార్ బయటకు తీసేప్పుడు వెనక్కి నడపకూడదని. అంటే రివర్స్ చేసి కార్ తీయడం నిషేధం. కొత్తగా కార్ కొనగానే డన్ చేసిన పని మారియోని ఆశ్చర్యానికి గురిచేసింది. గుమ్మడికాయను గిరిగిర తిప్పి దాన్ని కారు ముందు పగలగొట్టి, కార్ చక్రాలకింద నిమ్మకాయలు ఉంచి స్టార్ట్ చేయించడాన్ని గురించి చెప్పి దానికి గల కారణాలు ఏంటని నన్ను అడిగాడు. నేను నాకు తెలిసిన వివరాలు చెప్పాను. విని ఎంతో విస్మయానికి లోనయ్యి ఆలోచనల్లో పడ్డాడు మారియో.

ఆ ఇంటావిడ రెండు గుర్తులు (బొట్లు) పెట్టుకుని ఉన్నారే! ఒకటి నుదుట, మరోటి నెత్తిన. వాళ్ళ అమ్యాయికి మాత్రం ఒకే గురుతు. ఇవేంటి అన్న ప్రశ్నతో వచ్చాడు మరో రోజు. నేను వాటికి సమాధానం చెప్పాను. ఇలా మారియో సందేహనివృత్తికై మాటిమాటికీ నా ఆఫీసుకు వచ్చి తన చేత్తో గోడను ఆనుకుని దానిమీద మరకలు చేసి వెళ్ళేవాడు.

ఆ ఇంటావిడ ఆచారవ్యవహారాల్లో పరమ నిష్టాపరురాలు. చక్కగా చీర కట్టుకుని చలినుండి రక్షించుకోడానికి అదే రంగులో వర్క్ చేయబడిన శాలువా కప్పుకుని ఉంటుంది. గిన్నెకోడికి లాగా మెడమీద ముడతలు పడి ఉంటాయి. ఒకప్పుడు ఆమెకు కేశపాశాలు సమృద్ధిగా ఉండేవి అని తెలిపేందుకు కావలసినన్ని ఆనవాళ్ళున్నాయి. తలలో అక్కడక్కడా నెరిసిన వెంట్రుకలు ఆమె ఆకారానికి అందాన్ని, హుందాతనాన్నీ ఇచ్చాయి.

మారియోకి ఆమె అంటే అపారమైన గౌరవభావం. ఆమె ఏం చెప్తే అది అతనికి వేదవాక్కు. నవరాత్రి, దీపావళి వంటి పండుగల్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవాడు. వాటి గురించిన వివరాలను ఆసక్తిగా అడిగి శ్రద్ధగా విని తెలుసుకుంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవాడు. వాళ్ళ అలవాట్లు, ఆహారవ్యవహారాలు కూడా అతనికి తొందరగానే వంటపట్టాయి.

కాలక్రమేణా వాళ్ళ సంప్రదాయాలు, పద్ధతులు గురించి మారియో నన్ను అడిగి తెలుసుకోవడం అన్నది తగ్గిపోయింది. నిజానికి మంగళగౌరీ వ్రతాలు, సుమంగళి పూజలు, అట్లతద్దులు ఇలాంటివాటి గురించి నాకేదైనా సందేహం కలిగితే అతనే నాకు సందేహ నివృత్తి చేసిపెట్టేలా తయారయ్యాడు. ఆవిడ అతి కష్టమైన వ్రతాలూ అవీ ఆచరించేటప్పుడు ఇతను కూడా ఉపవాసాలుండేవాడు. వాటి ఫలాఫలాలు కూడా అతనికి కొట్టిన పిండి అయిపోయాయి.

అయితే ఎంత కాలమయినా మారియోకి అంతు చిక్కని ఒక విషయం ఉండింది. అది రాహుకాలం.

ఒక రోజు ఒళ్ళంతా కంగారు పులుముకుని నా దగ్గరకు వచ్చాడు మారియో. డన్ తనని బాగా తిట్టాడని చెప్పాడు. కారణం పది నిముషాలు ఆలస్యంగా రావడమేనన్నాడు. ఆ రోజు డన్ విదేశ ప్రయాణానికి విమానాశ్రయానికి వెళ్ళాలి. ఆ రోజు శుక్రవారం. ప్లేన్ మధ్యాహ్నం రెండింటికి. డన్ మాత్రం పొద్దున పదికి ముందుగానే ఇంటినుండి బయలుదేరడానికి తయారయిపోయాడు. ఆ రోజు మారియో ఆలస్యంగా వచ్చాడు. రాహుకాలం ఘడియ వచ్చేసిందని అతన్ని తిట్టరాని తిట్లన్నీ తిట్టి, డన్ ప్రయాణాన్నే కేన్సిల్ చేసుకున్నాడు.

ఒక ఆఫ్రికన్ డ్రైవర్‌కు రాహుకాలపు ప్రాధాన్యాన్ని, పుట్టుపూర్వోత్తరాలను వివరించడం ఎంత కష్టసాధ్యమోనన్నది ఊహాశక్తి కలవారికే వదిలేస్తున్నాను. అయితే మారియో ముఖం చూస్తుంటే ఎంత కష్టమైనా పరవాలేదు రాహుకాలం గురించిన వృత్తాంతాన్ని వివరంగా చెప్పేయాలని తీర్మానించుకున్నాను.

విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచి పెట్టాడని, అయితే రాహువు కపటంగా దేవతల ఆకృతిలో వచ్చి అమృతాన్ని పొందే ప్రయత్నం చేశాడని, సూర్యచంద్రులు ఆ విషయం పసిగట్టి విష్ణువుకు ఆ విషయాన్ని చేరవేశారని తెలుసుకున్న రాహువుకు వారి మీద తీరని పగ కలిగిందనీ వివరించాను. అలా రాహువు పగసాధింపు చర్య నేటికీ కొనసాగుతుందని చెప్పాను. ప్రతీ రోజూ ఈ రాహువు సూర్యచంద్రులను వాళ్ళ సంచలనంలో కొంతసేపు పీడిస్తూ ఉంటాడు. దాన్నే రాహుకాలం అంటారు. ఆ సమయంలో ఏ పని తలపెట్టినా అది విఫలం అవుతుందని వివరించాను.

ఒక పసిపిల్లవాడి కుతూహలం అప్పుడు మారియో ముఖంలో చూశాను. వివరణ ఇంత సులువుగా ఉంటుందని అతను ఊహించలేదేమో. ఏ రోజుల్లో ఎన్నేసి గంటలకు ఎంతసేపు రాహువు పీడిస్తుంటాడు అని అతను అడిగిన ప్రశ్నకు నా దగ్గర ఒక సూత్రం తయారుగా ఉండింది.

Mother Saw Father Wearing The Turban Surely. ఈ వాక్యాన్ని అతనిని కంఠతా చెయ్యమన్నాను. ఈ ఏడు పదాలూ ఏడు రోజులను సూచిస్తాయి. రోజుకు ఒకటిన్నర గంట రాహుకాలం ఉంటుంది. మొదటి రాహుకాలం పొద్దున 7:30కు మొదలవుతుంది. ఈ వాక్యంలో పదాల అక్షరాలు Mo Mondayని, Sa Saturdayని, F Fridayని, We Wednesdayని, Th Thursdayని, Tu Tuesdayని, Su Sundayని ఈ క్రమంలో సూచిస్తాయి. తొలి రోజు సోమవారం 7:30-9, శనివారం 9-10:30, శుక్రవారం 10:30-12, బుధవారం 12-1:30, గురువారం 1:30-3, మంగళవారం 3-4:30, ఆదివారం 4:30-6. మారియో అర్థం అయిందన్నట్టు తలూపాడు.

అతనికి అది ఎంత వరకు అర్థం అయింది అన్నది నేను చాలా కాలం తర్వాత తెసుకున్నాను గానీ అప్పుడు మాత్రం అర్థం అయుంటుంది అని నేను నమ్మలేదు.

డన్ దంపతులకు ఒక కూతురు. పదమూడు, పద్నాలుగేళ్ళుంటాయి. మంచి అందగత్తెగా తయారయ్యేందుకు ప్రణాళికలు వేసుకున్నట్టు ఉంది. జుట్టు ఒత్తుగా పాపిడి విడదీయకుండా ఉంటుంది. ఆ జుట్టును ఏ రకంగా దువ్వి జడవేసుకున్నా, చిందరవందరగా వదిలేసినా, ఆ ముఖం అందాన్ని తగ్గించలేమన్నట్టు ఉంటుంది. ఎప్పడు చూసినా స్విమ్మింగ్ పూల్‌లో రెండు పీసుల స్విమ్ సూట్‌లో తన ఈడు ఆఫ్రికన్ అమ్మాయిలతో ఆడుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి యామచోమ అనే బొగ్గుల మీద కాల్చిన గొర్రె మాంసాన్ని తన ఆఫ్రికన్ స్నిహితులతో కలిసి తింటూ నా కంటబడింది. నాకు ఆశ్చర్యం కలిగించింది.

నేను మారియోని “ఏంటి మారియో ఈ పిల్ల ఇలా కాల్చిన మాంసాన్ని తింటోంది? వాళ్ళు అచ్చమైన శాకాహారులు కాదా?” అని అడిగాను.

“పావనా, ఆ విషయం నన్నే అడిగారూ! బడికెళ్ళే దార్లో యాయా సెంటర్‌‌లో మటన్ కట్లెట్ కొనుక్కుతింటుంది ఇంట్లో తెలియకుండా. ఈమెను గిల్లితే గొర్రె రక్తం వస్తుంది” అన్నాడు.

“చిన్నపిల్ల కదా! ఏదో ఆశపడి తింటోందిలే” అన్నాను వెంటనే.

“లేదు పావనా, మాంసం తినడం గురించి నాకేంలేదు. ఇంట్లోవాళ్ళకు తెలియకుండా దొంగచాటుగా తినడం గురించే నా బాధంతా.”

డన్ ప్రపంచమే వేరు. అవసరానికంటే ఎక్కువ బటన్‌లు ఉన్న కోటు వేసుకుని అప్పుడప్పుడు నా ఆఫీసుకు ఏవో కంప్లయింట్స్ మోసుకొస్తుంటాడు. స్వయంగా రంగు వేసుకుని పెంచుకుంటున్న జుట్టు కాబట్టి పై సగం ఒక రంగులోను కింది సగం మరో రంగులోనూ ఉంటుంది. ప్రపంచాన్నంతా చూడగలిగే అతని కళ్ళు పక్కనే ఉన్న చెవులను చూడలేకపోతున్నాయి. అతని కూతురు గురించి చెప్పేద్దామా అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను.

ఆ పిల్ల ఆఫ్రికన్ స్నేహితురాళ్ళ సహవాసంతో ఆసాంతం మారిపోతోంటే, మారియో ఏమో తన సహజ లక్షణాలను విడిచి కొత్తగా తయారవుతున్నాడు. ఆ ఇంటామె మీద అతనికి విశ్వాసం మరింతగా పెరిగిపోయింది. వాళ్ళ ఇడ్లీ, సాంబార్, దోశెలకు బానిసైపోయాడు. అంతే కాదు, శివరాత్రి, షష్టి, అమావాస్యలను కూడా తీవ్రంగా పాటించసాగాడు.

ఆ కూతురి ప్రవర్తన గూర్చి ఆమె తల్లికి చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో మారియో కొట్టుమిట్టాడుతున్నాడు. అదృష్టవశాత్తు ఆ సందిగ్ధావస్థలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన నిర్బంధం తనకు కలగలేదు. బలీయమైన విధి అతనికి ఒక సులభతరమైన పరిష్కారాన్ని ఇవ్వాలనుకుంది కాబోలు.

వినాయక చవితి వ్రతంలో వీళ్ళు మునిగిపోయున్న ఒక రోజు డన్‌కు హఠాత్తుగా బదిలీ ఉత్తరవు వచ్చింది. మామూలుగా దొరకాల్సిన నాలుగేళ్ళు డన్‌కు దక్కలేదు. డన్‌ కంటే మారియోకి ఆ బదిలీ ఎక్కువ అసంతృప్తిని, దిగ్భ్రాంతినీ కలిగించింది. ఆ ఇంటివాళ్ళు అంతగా నచ్చేశారు అతనికి. అప్పుడప్పుడే అతని జీవితగమనం ఒక సరైన గాడిన పడుతూ ఉండగా ఇలా జరిగిపోయిందే అని బాధపడిపోయాడు.

డన్ వెళ్ళిపోయే ముందు మారియోకి బోలెడన్ని సిఫారసులు రాసి ఇచ్చి వెళ్ళాడు. అయినప్పటికీ మారియోకి ఒక ఉద్యోగమైనా దొరకలేదు. అతని మనసు విరిగి విరక్తి చెందిపోయిన ఒక శుభఘడియలో స్వీడన్ కాన్సలేట్ వాళ్ళు అర్జెంటుగా ఒక డ్రైవర్ కావాలని ప్రకటించారు. మారియోకి చెప్పి మరుసటి రోజే వెళ్ళి కలవమని ఒక లేఖ రాసి ఇచ్చి పంపించాను. ఆ తర్వాత మారియో నా కంటపడలేదు.

చాలా నెలల తర్వాత ఒక శనివారం నాడు రెండు జడలేసుకున్న నా చిన్న కూతురుని తీసుకుని యాయా సెంటర్‌కు వెళ్ళాను. చుట్టూ ఆకలి వ్యాపించి ఉన్న మధ్యాహ్న సమయం అది. ఎక్కడ చూసినా ఆకలే కంటబడుతోంది. కొందరు కూర్చుని తింటున్నారు. కొదంరు నిల్చుని తింటున్నారు. మరికొందరు ఫుట్‌పాత్ మీద తచ్చాడుతూ తింటున్నారు.

ఎప్పట్లాగే ఐస్‌క్రీమ్ కొట్టును చూడగానే నా కూతురు మొండికేసింది. మిడతను చూసిన కుక్కపిల్లలా కాళ్ళు ఊనుకుని కదలనంటే కదలనంటూ ఆగిపోయింది. ఎన్ని వందల రుచులున్నా వనిలాకి సాటి రాదు! ఆ వాసన ఆ గాలిలో వ్యాపించి ఉంది.

దూరంగా మారియో ఇటుగా నడుస్తూ కనిపించాడు. జిరాఫీలా కాళ్ళను ఎడంగా పెట్టి నడుస్తున్నాడు. వదులుగా వేలాడుతున్న కోటు చొక్కాలా రెండు పక్కలా ఊగుతోంది. నూలు దారంతో కూర్చినట్టు అతని ఒంటిలో భాగాలు విడివిడిగా ఊగుతున్నాయి. నుదుట విభూతి రాసి మధ్యలో కుంకుమ బొట్టు దిద్దుకుని ఉన్నాడు.

అతని వేషాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. నా కూతురు నా వెనక్కి జరిగి నన్ను గట్టిగా పట్టుకుంది.

“మైసా, మైసా సాన్” అని నా కూతుర్ని పలకరించాడు.

“ఏంటి మారియో ఇక్కడ?” అనడిగాను.

“గుడికి వెళ్ళొస్తున్నాను, పావనా. ఇవాళ పురటాసి (భాద్రపద) శనివారం కదా!”

“అయితే ఇవాళ ఉద్యోగానికి వెళ్ళలేదా?”

“ఉద్యోగమా? ఆరు నెలల పాటు దానికోసమే వెతుకుతున్నాను” అన్నాడు.

“ఆరు నెలలా? ఏం ఆ స్వీడన్ కాన్సలేట్ ఉద్యోగం ఏమైంది?”

“అది వదిలేయి, పావనా! పచ్చిదర్భలు ఎంత బాగున్నా అవి ఆరితేనే కదా మనకు ఉపయోగం” అన్నాడు.

“ఏం… ఏమైంది?” అని బిక్కమొఖం పెట్టాను.

“ఇంటర్వ్యూ బుధవారం పన్నెండు గంటలకు పిలిచారు. ఎలా వెళ్ళేది?”

“నువ్వు వెళ్ళలేదా?”

“సరిగ్గా రాహుకాలంలో పెట్టుకున్నారు! వెళ్తే మాత్రం ఉద్యోగం దొరుకుతుందా ఏంటి!”

మోకాళ్ళు విడివిడిగా ఊగుతూ, వేగంగా మారియో తనదారిన తను వెళ్తున్నాడు.

నేను అతన్నే చూస్తూ ఉండిపోయాను. చాలాసేపు.

“పావనా, ఇదిగోండి రెండు వనిలా” అన్నాడు అంగటి వాడు.

(మూలం: రాగుకాలం, ‘మహారాజుగారి రయిలుబండి’ (2001) కథల సంపుటినుండి.)


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్‌గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్‌గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలూ, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.