రేపు

ఆ స్థలమంతా ఒక్క క్షణంలో హడావిడిగా మారిపోయింది. ‘లే, లే’ అని పెద్దోడు తొందరపెట్టాడు. చిన్నోడు అలసిపోయి నిద్రపోతున్నాడు. వాణ్ణి ఆ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళడానికి వీడి మనసొప్పుకోలేదు.

దూరంనుంచి బళ్ళు వస్తున్నాయట వరుసాగ్గా! ఎవరో అరుచుకుంటూ వచ్చాడు. నీక్కనిపించాయా అని అడిగితే తను చూడలేదని, మరెవరో చూశారనీ చెప్పాడు. జనం అన్ని దిక్కులకీ పరుగులు తీశారు. ఎక్కడికక్కడ బారులు కట్టి నిలుచుండిపోయారు. మళ్ళీ కాసేపటికి నిరాశపడి వరుసల్నుండి చెదిరిపోయారు.

మళ్ళీ ఎవరో గొంతెత్తారు. ‘ముందు చూసిందెవరో చెప్పండి. నిజంగానే బళ్ళు వస్తున్నాయా? సరదాలాడుకోడానికి ఇది సమయం కాదు! బళ్ళు ఏ వైపునుండి వస్తున్నాయో కాస్త చూసి చెప్పండి.’

ఒక బక్కపాటి ఆడమనిషి నలుగురు పిల్లల్ని వెనకాలే ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళింది. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. ఆమె అన్నీ ముందుగా ఆలోచించుకుని తగిన ఏర్పాట్లు చేసుకునే వచ్చినట్టుంది.

పెద్ద పటాలం ఏదో వెళ్ళినట్టు ఆమె వెళ్ళగానే వెనుక ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీలోకి చేరుకుందామని పెద్దోడు పరుగెట్టి వెళ్ళేసరికే అది మూసుకుంది.

పైన హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో అమర్చిన తుపాకులు మౌనంగా ఊగుతున్నాయి. హెలికాప్టర్ పంకాల హోరు ‘చావు, చావు‌’ అన్న శబ్దానికి దగ్గరగా ఉన్నట్టు తోచింది. పెద్దోడు తన కన్నవాళ్ళని ఒక క్షణం తలచుకున్నాడు.

ఇప్పుడు బళ్ళు వచ్చేశాయని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది.

పెద్దోడు వేసుకున్న వదులైన ఓవర్‌కోటు పట్టుకుని చిన్నోడు పరుగెట్టాడు. ఎక్కడ పెద్దోడు తనని వదిలేసి వెళ్ళిపోతాడేమోనన్న భయం వాడి ముఖంలో కనిపిస్తోంది. వాడి ముక్కులకింద ఎండిపోయిన చీమిడి, మూడు రోజులుగా అలాగే అంటిపెట్టుకుని ఉంది.

పెద్దోడు తన చేతిలో సొట్టలు పడ్డ డబ్బాని గట్టిగా పట్టుకునున్నాడు. డబ్బాకు పడ్డ చిల్లుల్ని వాడే పూడ్చుకుంటాడు. వాడి వయసు పదకొండేళ్ళకంటే ఎక్కువుండదు. చిన్నోడికి ఆరేళ్ళుండచ్చు. ఆ పిల్లలిద్దరూ ఆ జనసముద్రంలో తేలుతున్న రెండు చిన్న ఆకుల్లా అటూ ఇటూ అల్లల్లాడుతున్నారు.

ఇంతలో అక్కడికి బాగా బలిసివున్న భీకరాకారుడోకడు వచ్చాడు. కిందవాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా అధికారం చెలాయించడానికి అలవాటుపడిన ముఖం. నల్లరంగులో పెద్ద ఓవర్‌కోటు, బెల్టు, టోపీతో ఉన్నాడు. చేతిలో ఒక కర్ర పట్టుకుని తిప్పుతూవున్నాడు. కరకు గొంతుతో ఏదో అరుస్తున్నాడు అప్పుడప్పుడూ. వాడేం చెప్తున్నాడో ఎవరికీ అర్థంకాలేదు. అయినా ఆ జనసమూహమంతా వాడి ఆజ్ఞలకి కట్టుబడింది.

ఇంతలో ఉన్నట్టుండి జనం పోటెత్తినట్టు ఒక వైపుకి నెట్టబడ్డారు. ఆ పెద్ద అలలో పెద్దోడి పట్టు కాస్తా సడలిపోయింది. జనాలు ఒకర్నొకరు తోసుకుంటూ వెళ్ళారు, కొండను కొట్టి తిరిగిపోతున్న అలలా. చిన్నోడు ‘అన్నా, అన్నా…’ అంటున్న అరుపులు వినిపించినా పెద్దోడు వాడిని చేరుకోలేకపోయాడు. ఆగని జనాల తోపుడు వాణ్ణి లాక్కుపోయింది. ఇప్పుడు చిన్నోడి అరుపులు వినిపించట్లేదు.

చిన్నోడు అదే చోట ఉండకుండా ఏడుస్తూ అన్నను వెతుక్కుంటూ నడుస్తున్నాడు. ఇద్దరూ ఒకర్నొకరు వెతుక్కుంటూ వేర్వేరు దిక్కుల్లో వెళ్తున్నారు. అప్పుడు ఒక అధికారి వచ్చి చిన్నోడి చేయి పట్టి లాక్కుపోయి ఒక డేరా ముందు నిలబెట్టాడు. వాడు అక్కడే ఏడుస్తూ ఒక అర్ధగంట నిల్చున్నాడు.

చివరికి ఆ అధికారి వాడి అన్నతో తిరిగివచ్చాడు. వీడు పరుగున వెళ్ళి అన్నను వాటేసుకున్నాడు. పెద్దోడు వాడి జుట్టు దువ్వుతూ అలా కాసేపు ఉండిపోయాడు. తలలో గుండు తగిలిన మచ్చ కనిపించింది. అక్కడ జుట్టు మొలవలేదు, పెద్ద బిళ్ళలా ఉంది. పెద్దోడి కళ్ళలో నీళ్ళుతిరిగాయి. ఎవరూ చూడకుండా మోచేత్తో తుడుచుకున్నాడు.

తీరుతెన్నూ లేకుండా కొత్తగా కొన్ని వరుసల్లో నిలబడున్నారు జనమంతా. పెద్దోడు పరుగున వెళ్ళి ఒక వరుసలో నిలబడ్డాడు. మాటిమాటికీ వెనక్కి తిరిగి చూస్తున్నాడు. వరుసలో తన వెనక జనాలు చేరేకొద్దీ కొంచం కొంచంగా నెమ్మదించాడు. అందరూ పెద్దవాళ్ళే. వీడు వాళ్ళ నడుందాకే ఉన్నాడు. వాళ్ళు హడావిడిలో అటూ ఇటూ తోసుకున్నప్పుడు వరుస నుండి బయటపడకుండానూ నలిగిపోకుండానూ ఉండటానికి ప్రయత్నించాడు.

మాటిమాటికీ చిన్నోడికేసి చూస్తున్నాడు. వాణ్ణి కదలకుండా అక్కడే ఉండమని హెచ్చరించాడు. ముందే చిన్నోణ్ణి వరుసలో నిల్చోబెట్టకుండా కంచె పక్కన కూర్చోబెట్టాడు. అక్కడ కొంతమంది పిల్లలూ ముసలివాళ్ళూ ఉన్నారు. చిన్నోడు పడుకునున్న ముసలోళ్ళని ఆజమాయిషీ చేస్తున్నట్టు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు.

ఒక చిన్నపాప గుడ్డ బొమ్మని చేతిలో పట్టుకుని కూర్చుని వుంది. ఆ బొమ్మకు ఎర్రటి జుత్తూ నల్లటి పెద్దపెద్ద కళ్ళూ ఉన్నాయి. వీడు దగ్గరకెళ్ళి ఆబగా చూశాడు. ఆ పాపకి అది నచ్చలేదు. బొమ్మని తనకేసి అదుముకుని పరుగెత్తి వెళ్ళిపోయింది. వీడికి నిరాశగా అనిపించింది.

వరుస చిన్నగా కదులుతోంది. ఈ రోజు కచ్చితంగా మాంసం దొరుకుతుందని చిన్నోడికి చెప్పాడు. వారం రోజులుగా ఇదే చెప్తూ వస్తున్నాడు. ఇక వాడు తాళలేడనిపించింది. ఈ రోజైనా దొరికితే బాగుండని పెద్దోడు కోరుకున్నాడు.

వరుస తన వెనక ఎంత పొడుగుందో ఓ సారి తిరిగి చూశాడు. వాడికి కనిపించనంత దూరం సాగివుంది. వాడు ఆనందపడ్డాడు. తనకు ముందు కేవలం ఇరవైమందే ఉన్నారు. వాడి వంతు ఇంకాసేపట్లోనే వచ్చేస్తుంది.

చల్లటి గాలి మొదలైంది. అది ఈదురుగాలి కాకుంటే బాగుండనుకున్నాడు. సూర్యుడు ఈరోజు సెలవు తీసుకున్నాడేమో, అసలు కనిపించనేలేదు! కాళ్ళకున్న పాత సాక్సుల నిండా చిల్లులే. అవి చలినాపవు. లాగి కప్పుకున్న ఓవర్‌కోట్‌ను దాటుకుని చలిగాలి పొట్టని తాకుతోంది.

వాళ్ళ అమ్మలా ఉన్న ఒకామె తలకి స్కార్ఫ్ కట్టుకుని పెద్ద పెద్ద బుట్టల్లోనుండి రొట్టెలు పంచుతోంది. ఆమె చేతులూ వేళ్ళ చివరి గోళ్ళరంగూ అమ్మను గుర్తుచేశాయి. ఆమె, తన పక్కన నిల్చున్నవాడితో ఎంతో దర్పంగా, నమ్మకంగా అధికారిలా మాట్లాడుతోంది. ఆమె పెద్దోడికి బాగా నచ్చింది. ఆమె పక్కనున్నోడు, వేడి వేడి సూప్‌లో గరిటె ముంచి పోసే పనిని శ్రద్ధగా చేస్తున్నాడు. జనాలు రొట్టె అందుకున్నాక సూప్‌ను డబ్బాలోనో గిన్నెలోనో పోయించుకుంటున్నారు. కొందరు తీసుకున్న వెంటనే రుచి చూస్తూ కదులుతున్నారక్కణ్ణుంచి.

పెద్దోడు ఒక రొట్టె తీసుకుని కోటు లోపల పెట్టుకుని సూప్ పోసేవాడి వైపుకి అడుగు వేశాడు. వెంటనే ఒక మీసాలోడు రిజిస్ట్రేషన్ కార్డ్ చూపించమని అడిగాడు. పెద్దోడు ఇచ్చాడు. ‘ఏయ్, ఇక్కడ్రా! ఇక్కడ్రా! ఎలా వచ్చావు లోపలికి? ఇది ఇక్కడ చెల్లుబాటు కాదు.’ అన్నాడు. పెద్దోడు సూప్ పోయించుకోడానికి డబ్బాని సిద్ధంగా పట్టుకుని మీసాలోడి వైపు దీనంగా చూశాడు. మీసాలోడు కార్డ్ తిరిగి ఇస్తూ, ‘సరే పో, ఇకనుండి ఇక్కడికి రాకు‌.’ అన్నాడు.

పెద్దోడి ధ్యాసంతా సూప్ పోసేవాడి మీదే ఉంది. వాడు ముంచి పోసేప్పుడు ఏమైనా మాంసం ముక్కలు వస్తాయా అని పరీక్షగా చూశాడు.

వీడికి ముందున్న పెద్దాయన, ‘నీకు పుణ్యముంటుంది, గరిట లోపలికి పోనిచ్చి తియ్యవయ్యా’ అన్నాడు. పోసేవాడు అలానే గరిట లోపలికి తిప్పి ముంచి పోశాడు. పెద్దోడి వంతొచ్చింది. వీడు కూడా, ‘అన్నా! బాగ తిప్పి కింద నుండి ముంచి పొయ్యన్నా!’ అన్నాడు. ఆ మంచి వ్యక్తి, ‘నువ్వెలా అడిగితే అలాగే తమ్ముడూ!’ అని గరిట లోతుగా తిప్పి ముంచి పోశాడు. డబ్బా నిండింది. పెద్దోడు ఉత్సాహంగా ముందుకు కదిలాడు, సూప్ డబ్బా జాగ్రత్తగా పట్టుకొని.

వాడు రొట్టెను మూడు ముక్కలు చేశాడు. ఒక ముక్క కోటులో దాచాడు. రెండో ముక్క తమ్ముడికిచ్చాడు. మూడోది తను తీసుకున్నాడు. ఆత్రంగా సూప్‌లో ముంచుకుని రొట్టెను తిన్నారు. సూప్‌లో ఒక్క మాంసం ముక్కయినా లేదు.

“అన్నా! ఏందే, సూపులో మాంసం లేదూ. నాకపద్దం చెప్నావెందుకూ? ఇయాల మాంసం ముక్క దొర్కుతాదంటివే? అయిదు మైళ్ళు నడిచిండేది ఎందుకూ? నాకు కాళ్ళు నొప్పులు పుడుతా వుండాయి‌.” చిన్నోడు అన్నాడు.

“సద్దుకో తమ్మీ. ఇయాల మన సుడి బాగుండలే. రేపు దొరుకుతాది. నువ్వు మనాది పడకు. నేతెస్తాగా,” అన్నాడు పెద్దోడు.

వెలుతురు ఇంకో రెండు గంటలే ఉంటుంది. ఆ తర్వాత తొందరగా చీకటి పడిపోతుంది. పగలుండగానే వెనక్కెళ్ళిపోవాలి. ముళ్ళకమ్మీల కంచె సందులోనుంచి ముందుగా తమ్ముణ్ణి దాటించాడు. తన ఓవర్‌కోటు విప్పి ఉండ చుట్టి తమ్ముడి చేతికందించాడు. తర్వాత తను సులువుగా దాటాడు.

దారిలో ప్రతి వంద మీటర్లకు ఇద్దరు మిలిటరీ జవాన్లు నిల్చునున్నారు. మెషిన్‌ గన్‌లతో వాళ్ళు నిల్చుండటాన్ని వింతగా చూశారు పిల్లలిద్దరూ. మిలిటరీ జవాన్‌ల బట్టలు, వాళ్ళ పద్ధతి చూసి ఏదో జడుపు కలిగింది ఇద్దరిలో. బెరుకుబెరుగ్గా నడిచారు. ఒక మిలిటరీవాడు తెల్లగా, పొడవుగా ఉన్నాడు. మరోవాడు ఏదో ఆలోచిస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు.

ఆ మిలిటరీ వాళ్ళని సమీపించారు పిల్లలు. వీళ్ళు రావడాన్ని దగ్గరకొచ్చేంత వరకూ చూడలేదు వాళ్ళు. వీళ్ళని చూడగానే ఒకడు తటాలున లేచాడు. పిల్లలు జడుసుకున్నారు. మిలిటరీ జవాను ఏమంటున్నాడో వీళ్ళకర్థం కాలేదు. ఆ భాష ఏంటో కొత్తకొత్తగా, యజమాని అరుస్తున్నట్టుగా ఉంది. మిలటరీ జవాన్‌ల బట్టలకు, పద్ధతికి నప్పనంటుంది ఆ భాష.

పెద్దోడు రెండు వేళ్ళను పెదవుల మీద పెట్టి సిగరెట్ అని సైగ చేసి అడిగాడు, బతిమాలుతున్నట్టు. మిలిటరీ జవాను ఏమనుకున్నాడో, పెట్టె నుండి ఒక సిగరెట్ తీసి విసిరేశాడు. పెద్దోడు ఏరి తెచ్చుకుని మళ్ళీ నడక మొదలుపెట్టాడు.

కాసేపయాక, చిన్నోడు అలుపు తీర్చుకోవాలన్నాడు. ఒక పొద దగ్గర కూర్చున్నారు. పెద్దోడు సిగరెట్ వెలిగించుకుని ఒక దమ్ము లాగాడు. చిన్నోడు తనకూ కావాలన్నాడు. దానికి, “తమ్మీ, ఇది పిల్లల్తాగేదిలే. నువ్వు పెద్దయినాంక తాగుదూలే. ఇప్పుడ్నువు మంచోనివి గదా” అన్నాడు ఓదార్పుగా. చిన్నోడు అందులో ఉన్న న్యాయాన్ని గమనించి సరేనన్నాడు.

ఒక పెద్ద కర్ర తీసుకుని తుపాకీలా పట్టుకుని ఆటలాడుతూ నడిచాడు చిన్నోడు. చీకటి పడుతుండేసరికి గరాజ్ దగ్గరకొచ్చేశారు. చిన్నోడు చేయెత్తి చూపుతూ “అగో అగో!” అన్నాడు. బక్కచిక్కి ఎముకలు బైటకొచ్చిన ఒక కుక్క వీళ్ళకేసి మెల్లగా వచ్చింది. అదీ శరణార్థి కుక్కే. రిజిస్ట్రేషన్ కార్డ్ లేని కుక్క. నేలని వాసన చూస్తూ జంకుతూ నిలుచుంది.

“అన్నా, ఈ కుక్కకి ఒక పేరు పెడదామా?” అన్నాడు చిన్నోడు. “వొద్దురొరే. పేరు పెడితే ఇది కూడ మనుసుల లెక్కలోకొచ్చేను!” కోటు లోపలున్న రొట్టెను తీసి సగం చేసి ఒక ముక్క ఆ కుక్కకిచ్చాడు. అది ఆ రొట్టందుకుని కుంటుకుంటూ పరుగెత్తింది.

గరాజ్ బయట తాళం వేసుంది. పెద్దోడు వెనక వైపుకెళ్ళి బొక్కకు అడ్డం పెట్టిన నాపరాయిని పక్కకు లాగాడు. ఇద్దరూ లోపలికెళ్ళాక రాయి తిరిగి అడ్డం పెట్టాడు.

లోపలకి వెళ్ళగానే ముక్క కంపు, చెమట వాసన. చీకటికి అలవాటుపడటానికి కళ్ళకీ వాసనకి అలవాటుపడటానికి ముక్కుకీ కొన్ని నిముషాలు పట్టాయి. పెద్ద అట్ట పెట్టెలను లాగి వాటిలోని పాత కంబళి తీసి పరిచాడు పెద్దోడు. నడిచి నడిచి అలసిపోయున్న చిన్నోడు దాని మీద పడుకున్నాడు. పెద్దోడు రొట్టె ముక్కని జాగ్రత్తగా దాచిపెట్టాడు; రేప్పొద్దున్నే చిన్నోడు ఆకలితో ఏడ్చినప్పుడు ఇవ్వడానికి.

పెద్దోడు పెట్టెకు ఆనుకుని కూర్చున్నాడు. చిన్నోడు నిద్రపోతున్నాడు. కాసేపటికి చిన్నోడు నిద్దర్లో ఉలిక్కిపడి పాకుతూ వచ్చి పెద్దోడ్ని వాటేసుకున్నాడు. “అన్నా, అన్నా, నువ్వు నన్నొదిలి ఎల్లవు కందా… ఏడికీ యెల్లవు కందా!” అని ఏడ్చాడు.

పెద్దోడు వాడ్ని పొదివి పట్టుకున్నాడు. “లేదు, లేదు, నా తమ్మివయిండ్లా నువ్వు. నిన్నొదిలి యేడికీ పోను. నువ్ యాడవమాక.”

పెద్దోడి మాటలతో ఊరట కలిగింది చిన్నోడికి. చిన్నగా వెక్కుతూ నిద్రలోకి జారుకున్నాడు.

పెద్దోడు అలానే చాలాసేపు నిద్రపోకుండా కూర్చున్నాడు. రేపు వెళ్ళాల్సిన చోటు గురించి ఆలోచనలు చాలానే ఉన్నాయి వాడికి. రేపు గంచ్ క్యాంపుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అది ఇంకా పెద్ద క్యాంప్. పదిమైళ్ళ దూరంలో ఉంది. అక్కడ కచ్చితంగా మాంసం దొరుకుతుంది.

వాడికి అలానే చెప్పారెవరో.

[మూలం: ‘నాళై’ కథ. మహారాజావిన్ రయిల్ వండి (2001). ‘మహారాజుగారి రైలుబండి’ కథల సంపుటి నుండి.]