రిటర్న్ పాలసీ

నిజంగా తెలుసుకుందాం అనే అతనలా అడిగాడు. మైథిలికి అది నచ్చలేదు. ఆమె ఎప్పట్లాగే ఏమీ మాట్లాడలేదు. అయితే ముఖంలో భావాలు మాత్రం మారిపోయాయి. ఓవర్‌కోట్ నాలుగో బటన్ కుడిచేత్తో పెట్టుకుంటూ ఎడమచేత్తో బ్యాగ్ అందుకుంది. ఆమె బయటికెళ్ళిపోతే ఈ గొడవ ఒక కొలిక్కి ఇక రాదు. ఇంకో రెండు రోజులు ఇలానే సాగుతుంది.

అతను ఏదీ అడగకూడదు. ఆమెకు మాత్రం అతని గురించి అన్నీ తెలియాలి. ఒకసారి ‘నువ్వు యూనివర్సిటీలో ఏం చదువుతున్నావు?’ అని అడిగాడు. అతి మామూలు ప్రశ్నే.

గత ఆరు నెలలుగా టొరాంటో సిటీ మధ్యలో ఒక పొడుగాటి అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ఇరవైవొకటో అంతస్తులో 716 నెంబర్ ఫ్లాట్‌లో ఇద్దరూ కలిసి బతుకుతున్నారు. అలాంటప్పుడు, నువ్వేం చదువుతున్నావు అని తను అడగకూడదా?

ఆమె జవాబిచ్చింది. ‘నీళ్ళల్లో చెమ్మ ఎంత తగ్గిందో రిసర్చ్ చేస్తున్నాను‌.’ అతన్ని ఆమె గేలిచేస్తోంది. అతను పై చదువులేమీ చదవకుండా ఒక సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తుండటం ఆమెకు అవమానంగా అనిపిస్తోంది. దాన్ని ఇలా అతనికి తెలియజేస్తూ ఉంటుంది. ఆ ఇంటి అద్దె మొత్తం అతనే కడతాడు. ఇంటి ఖర్చులకీ సరుకులకీ మాత్రం ఆమె సగం డబ్బు ఇస్తుంది.

సరే, వంటపనులైనా ఇద్దరూ సమానంగా పంచుకుంటారా అంటే అదీ లేదు. అతనికి తెలిసినట్టు అతను వండిపెడతాడు. ఆమెకు ఎప్పుడు ఎలాంటి తిండి నచ్చుతుందో అతనికెలా తెలుస్తుంది? రోజూ ఏదో ఒకటి కొత్తగా వండుతాడు. ఏ పూటకాపూట వంట తాజాగా ఉండాలి అతనికి. ముందురోజు వండింది పెట్టిందన్న కారణంతో అమ్మమీద అలిగి ఇంటి నుండి పారిపోయి వచ్చినవాడు. ఒక పందొమ్మిదేళ్ళ కుర్రాడు ఇంటి నుండి అలిగి పారిపోవడానికి అది తగిన కారణం కాదని ఇప్పుడు తెలుస్తోంది.

తలుపు హేండిల్ మీద చేయి పెట్టింది. షోల్డర్ బ్యాగ్ భుజాన వేలాడుతోంది. తనిప్పుడు ఏమన్నాడని ఇంత కోపం! జవాబిచ్చి వెళ్తే బాగుంటుంది. ఎప్పుడో కొన్న బేగల్‌ అది. ఒక జిప్‌లాక్ కవర్లో వేసి, దాన్ని మరో జిప్‌లాక్ కవర్లో పెట్టి సీల్ చేసి, మళ్ళీ మరో కవర్లో చుట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టడంలో ప్రయోజనమేంటి? ఈ చిన్న ప్రశ్నకు జవాబివ్వడం ఏం కష్టం? వచ్చే డబ్బే బొటాబొటిగా సరిపోతుంది. జిప్‌లాక్ కంపెనీకి ఏం తక్కువని ఇలా పోషించడం?

కలిసివున్న ఆ ఆరునెలల్లో మొదటి నెల చాలా ఆనందంగా గడిచింది. ఆమె చేతులెత్తి వళ్ళు విరుచుకున్నప్పుడు, గీరుకున్నప్పుడు, ఆవలించినప్పుడు, చివరికి పళ్ళు తోముకుంటున్నప్పుడు కూడానూ ఎంతో అందంగానే కనిపించేది. రెండో నెలలో మొదటి తగువొచ్చింది. మూడో నెల్లో మూడు. తగువు ముగిసి సమాధానపడినప్పుడు పండగలా అనిపించేది. నాలుగో నెలలో వారానికి రెండు గొడవలుగా పెరిగింది. ఇప్పుడు రోజుకొక గొడవ. అతను ఏం చెప్పినా వెంటనే ఆమె గుచ్చుకునేలాంటి ఏదో ఒక మాట అంటుంది. ఒక గొడవ ముగిసి సర్దుకునేలోపే మరొకటి మొదలవుతుంది.

ఎవరేం పనులు చెయ్యాలో లిస్టు రాసుకున్నారు. అతను వంట చేయాలి. ఆమె అంట్లు తోమాలి. ఇంటి ఖర్చు లెక్కలు చూసేది, సరుకులు కొనేది అతను. లాండ్రీ ఆమె పని. చెత్త తీసుకెళ్ళి పడేయడం అతను. ఇల్లు చిమ్మేది ఆమె. చీపురుకట్టతో పది ప్రయోజనాలు కనుక్కుంది ఆమె. ఇలా పనులు పంచేసుకున్నా గొడవలొస్తున్నాయి. రాత్రి ఎవరు లైట్లు కట్టేయడం? ఫిలమెంట్ పోయిన బల్బులు ఎవరు మార్చాలి? కుండీల్లో మొక్కలకు ఎవరు నీళ్ళు పొయ్యాలి? కాలింగ్ బెల్ మోగితే తలుపెవరు తియ్యాలి?

తలుపు తీసుకుని బయటికెళ్ళే ముందు ఆమె సెల్‌ఫోన్ చూసుకుంటూ అంది.

“నేను వెళ్తున్నాను.”

“ఎక్కడికి?”

“బయటికే.”

“తిరిగి రావా?”

“రాత్రికొస్తాను. నా సామాను తీసుకెళ్ళడానికి.”

“ఎప్పటికీ రాకుండా వెళ్ళిపోదామనే?”

“అవును. పర్మనెంట్‌గా వెళ్ళిపోదామనే.”

“ఒక్క బేగల్ కోసం మూడు జిప్‌లాక్ కవర్లు ఎందుకు అని అడిగినందుకా? ఇదీ ఒక కారణమేనా? చెమ్మ తగ్గింది నీళ్ళలోనేనా, నీ గుండెలో కూడానా?”

“రాత్రికి చెప్తాను. ఎనిమిది గంటలకు నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టాలి.”

“నేనెందుకు తీసుకెళ్ళి వదలాలి? ట్యాక్సీలో వెళ్ళొచ్చుగా?”

“ఓ! ఆ సంగతి నాకు తెలీదులే! నన్ను ఎక్కడ, ఏ చోటునుండి తీసుకొచ్చావో అదే చోటుకి తీసుకెళ్ళి నువ్వే వదిలిపెట్టాలి. అంతే!”

అతను ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. తలపు విసురుగా మూసుకోగానే అతనూ నోరు మూసుకున్నాడు.

సూపర్ మార్కెట్ మేనేజర్ తనకు నచ్చడు. తనూ అతనికి నచ్చడు. మేనేజర్ మాట్లాడటం మొదలుపెడితే ఆపడు. మ్యాజిక్ చేసేవాడు నోటి నుండి రిబ్బన్ తీసినట్టు ఆపకుండా మాటలు వస్తూనే ఉంటాయి. తను ఆశ్చర్యంతో మేనేజర్‌కు ఒక అడుగు దూరంలో వెనక్కేసి చూస్తుంటాడు. ఫుల్‌స్టాప్ ఆయాసపడుతూ మేనేజర్ వెనకాల పరుగెట్టుకుంటూ వస్తోంటుంది. మేనేజర్ ఫైవ్ స్టార్ జనరల్‌ లాగా దర్పం చూపిస్తుంటాడు. ముందుగానే అతని ప్రశ్నలను ఊహించి సరిపోయిన జవాబులు అలోచించి పెట్టుకోవాలి. గంటకి 11.40 డాలర్లు జీతం. మేనేజర్ కోరిక అంతకంటే తక్కువ జీతం ఇద్దామని; కానీ కుదరదు. అంతకంటే తక్కువ ఇవ్వడాన్ని టోరంటో చట్టం ఒప్పుకోదు. తనని మట్టిబుర్ర అని మేనేజర్ అప్పుడప్పుడూ తిడుతుంటాడు. అందుకు చట్టం ఒప్పుకుంటుంది.

పాత ఇంగ్లీషు దయ్యాల సినిమాల్లో పొడవుగా ఒకడుంటాడు, బోరిస్ కార్లొఫ్ అని. ఆ బోరిస్‌కి పంటి నొప్పొచ్చి ఓ పక్క చెంప వాచిపోతే ఎలా ఉంటాడో అలా ఉంటాడు మేనేజర్. తను రెండేళ్ళుగా ఆ మేనేజర్‌తో పనిచేస్తున్నాడు. ఈ రెండేళ్ళలో నాలుగు సార్లు ఇంటినుండి గన్ను తీసుకొచ్చి ఇతణ్ణి కాల్చేయాలని అనిపించింది. అయితే తను ఆ పని చెయ్యలేదు.

ఆ సూపర్ మార్కెట్‌లో 12 కేషియర్లు ఒకే సమయంలో బిల్లింగ్ చెయ్యగలరు. ఒక్కో కేష్ కౌంటర్లోనూ తోపుడుబళ్ళనిండా సరుకులు నింపుకున్న జనాల వరుస ఉంటుంది. చిన్న కన్వేయర్ బెల్ట్‌లో సామాన్లు పెడుతుంటే వాటిమీదున్న బార్‌కోడ్‌లను స్కానర్ మీద చదివించి పక్కన పెట్టాలి. అంతా అయినాక వాటిని పేపర్ బ్యాగుల్లోనో ప్లాస్టిక్ బ్యాగుల్లోనో సర్ది డబ్బులు తీసుకొని, చివరకు రిసీట్ ప్రింట్ చేసి ఇవ్వాలి. కొందరు ఫోన్‌లద్వారా చెల్లిస్తారు, కొందరు క్రెడిట్ కార్డ్‌లిస్తారు. కొందరు చెక్స్ రాస్తారు. మరికొందరు డబ్బులిస్తారు. అక్కడ మొదలవుతుంది ఇతని సమస్య. లెక్కలు సరిగ్గా రావు. కొన్ని సార్లు కౌంటర్ క్లోజ్ చేసి మేనేజర్‌కి లెక్కలు అప్పచెప్పేటప్పుడు డబ్బులు తక్కువయ్యేవి. తగ్గినంతా తన చేతినుంచి కట్టేవాడు.

ఒక రోజు సరుకులు నింపుకుని బండి తోసుకుంటూ ఆకుపచ్చ కళ్ళతో ఒక అందగత్తె వచ్చింది. ఆమెవి ఆ రోజు మాత్రం ఆకుపచ్చ కళ్ళు. కొన్ని సార్లు ఆమె కళ్ళు బూడిద రంగులో ఉండేవి. ఒకరోజు నీలి కళ్ళతో వచ్చింది. అందమంటే అంతా ఇంతా అందం కాదు. చూస్తే కళ్ళు తిప్పుకోవడానికి కొన్ని క్షణాలు పడుతుంది! కళ్ళ రంగుకు మ్యాచింగ్ బట్టలేసుకోవడం ఆమె ప్రత్యేకత. ఆ రోజు కొంచం ఎక్కువ సామానే కొన్నది. తను వాటిని బ్యాగుల్లో సర్దేప్పుడు ఒక పొరపాటు జరిగింది. ఫ్రోజెన్ వస్తువులొక్క బ్యాగులో, వెజిటబుల్స్ ఒక బ్యాగులో, సానిటరీ, డిటర్జెంట్, టాయ్‌లెట్రీస్ వంటివి ఒక బ్యాగులో సర్దాలి. తినే వస్తువుల్ని వాటితో కలపకూడదు. ఇలాంటి కొన్ని పద్ధతులున్నాయి. జాగ్రత్తగా పాటించాలి. కొన్ని సార్లు గుర్తుంటాయి. కొన్ని సార్లు మరిచిపోతాడు. ఆమె ‘థాన్క్‌…యూ’ అని ఒయ్యారంగా చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ ఇంటికెళ్ళి చూసుకుంటే ఒక గుడ్డు పగిలిపోయి వుందట బ్యాగ్‌లో. దాంతో ఆమె ఇరవై మైళ్ళు కార్ నడుపుకుంటూ తిరిగివచ్చి ఒక గుడ్డు పగిలిపోయిందని కంప్లయింట్ చేసింది. పన్ను నొప్పొచ్చిన బోరిస్ దయ్యం మేనేజర్‌గాడు తనని తిట్టాడు. మరుసటి రోజు తనకు పనిష్‌మెంట్ తప్పదని చెప్పాడు.

ముందొకసారి ఇలాంటి తప్పే జరిగింది. అందుకే తను ఇప్పుడు కస్టమర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్లో పనిచెయ్యాల్సి రావడం. అంతకంటే పెద్ద శిక్ష మరోటుండదు. కొన్న వస్తువుల్ని తిరిగి ఇవ్వడానికి పెద్ద క్యూలుంటాయి ఎప్పుడూ. ఎందుకు తిరిగి ఇస్తున్నారో ఆ కారణం కంప్యూటర్‌లో ఎంటర్ చేసుకుని డబ్బులు తిరిగివ్వాలి లేదా మరో వస్తువు తీసుకోడానికి క్రెడిట్ నోట్ ఇవ్వాలి. కస్టమర్లు చెప్పే కారణాలు వింతలు వింతలుగా ఉంటాయి. ‘ఎక్స్‌పైరీ అయిపోయింది.’ ‘పాడైంది.’ ‘విరిగిపోయింది.’ ‘గుమ్మడికాయ పనిచెయ్యటం లేదు.’ ‘చెడిపోయింది.’ ‘వాసనొస్తుంది.’ ‘రుచిలేదు.’ ఒకసారి ఒకడు ‘నా గర్ల్ ఫ్రెండ్‌కి నచ్చలేదు.’ అని సగం కొరికి తినేసిన పీజా క్రస్ట్‌ తీసుకొచ్చాడు. ‘సార్, ఈ రకం వెన్న మా స్టోర్‌లో అమ్మం. మీరు మరెక్కడో కొన్నట్టున్నారు.’ అన్నా వినకుండా, ‘లేదు. ఇక్కడే కొన్నాం.’ అని కొందరు అన్యాయంగా పోట్లాడతారు. ఆవేశంతో బూతులు తిడతారు. అయినా పన్నెత్తు మాటయినా అనకుండా నవ్వుతున్నట్టే నటిస్తుండాలి. స్టోర్ రిటర్న్ పాలసీ అలాంటిది. కస్టమర్లు దేవుళ్ళు. వాళ్ళకి నచ్చకపోతే తిరిగిచ్చే హక్కుంది. అయితే కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తుంటారు. ఇంటినుండి గన్ను తెచ్చి ఈ అబద్ధాలకోరుల్ని కాల్చేయాలనిపిస్తుంది తనకి అప్పుడప్పుడూ. అయితే తన దగ్గర గన్ లేదన్న సంగతి తర్వాత గుర్తొస్తుంది.

సూపర్ మార్కెట్లో ఆరువేల రకాల వస్తువులుంటాయి, ప్రతీదానికీ ఒక బార్‌కోడ్. జనం రాత్రింబవళ్ళూ కొనుక్కెళ్తుంటారు. షెల్ఫుల నిండా రెడీమేడ్ తిళ్ళే ఎక్కువగా ఉంటాయి. రెండు నిముషాలు మైక్రోవేవ్ చేసుకుని తినేయడమే. పదివేల సంవత్సరాల క్రితం మనిషి నిద్ర లేవగానే ఆహారం కోసం వెతుకులాట మొదలుపెడితే సూర్యాస్తమయం అయ్యేంతవరకు వెతుకుతూనే ఉండేవాడు. ఆ రోజు ఆహారం దొరికితే ఆకలి తీరేది, లేదంటే పస్తే. ఇప్పుడు క్షణాల్లో వచ్చి రెడీ టు ఈట్ ప్యాకెట్స్ కొనుక్కెళ్తున్నారు. కాని ఫిర్యాదులూ ఎక్కువయ్యాయే కాని ఏమీ తగ్గలేదు.

మైథిలి రాత్రి ఎనిమిది గంటలకొచ్చి తన సామాను సర్దుకుంది. ఆమె తనతో కలిసి ఉండటానికి వచ్చినప్పుడు ఒక చిన్న సూట్‌కేస్‌తో వచ్చింది. తెగతెంపులు చేసుకుని వెళ్ళేప్పుడు రెండు సూట్‌కేసులు, నాలుగు అట్టపెట్టెల నిండుగా సామాన్లు చేరిపోయాయి. ఆరు నెలల్లో తను ఆమెకు బోలెడన్ని బహుమతులిచ్చాడు. బట్టలు కొనిచ్చాడు. అవన్నీ ఈ పెట్టెల్లో నిండిపోయున్నాయి. పెట్టలను తీసి కార్లో పెట్టడానికి సాయంచేశాడు. ఒక నౌకరుకి దక్కే గౌరవమే తనకీ దక్కింది.

కారెక్కగానే “ఎక్కడికి?” అన్నాడు.

“ఆ రెస్టారెంట్.”

“ఏ రెస్టారెంట్?”

“నేను ఎక్కడ నీ కారెక్కి నీ ఇంటికొచ్చానో ఆ రెస్టారెంట్.”

“రెస్టారెంట్‌లో ఉండబోతున్నావా ఇకనుండి?”

ఆమె జవాబేమీ ఇవ్వలేదు.

రెస్టారెంట్ వచ్చింది. మండే చిచ్చునుండి తప్పించుకు వెళ్ళినట్టు కారు దిగి హ్యాండ్ బ్యాగైనా తీసుకోకుండా కారు తలుపెయ్యకుండా పరుగున వెళ్ళింది. అక్కడ ఒకడు నిల్చుని ఉన్నాడు. మూడు రోజులుగా పస్తున్నవాడిలా ముఖం. తల దువ్వుకోడం చేతకానివాడిలా కూడా ఉన్నాడు. ఒక వారం క్రితం ఉతికినదానిలా చొక్కా. వాడు చాచిన చేతుల్లోకి పరుగెట్టుకుంటూ వెళ్ళి కోడిపిల్లలా ఒదిగిపోయింది. మైథిలి ఒక రోజు కూడా తనకోసం ఇలా పరుగెత్తుకుని రాలేదు. వాటేసుకోనూలేదు. ఆ దృశ్యం చూసి కొన్ని క్షణాలు స్తంభించిపోయాడు. తర్వాత తేరుకుని సామాన్లు దించి తిరిగి వచ్చాడు. ఈ రెండువారాలుగా ఆమె కారు దిగి పరుగెత్తిన దృశ్యం సినిమా రీల్‌లా మళ్ళీ మళ్ళీ మనసు తెరలో కనిపించింది.

ఇంతలో మేనేజర్ పిలిచాడు. తనకు విషయం కొంత అర్థం అయింది. మరో కంప్లయింట్ వచ్చుంటుంది. లేకుంటే ఎందుకు పిలుస్తాడు? నీ అంకితభావానికీ, బుద్ధిచాతుర్యానికీ, పడిన కష్టానికీ గౌరవనీయులైన కెనడాదేశ రాష్ట్రపతి నీకు విందు ఇవ్వదలచారని చెప్తాడా ఏంటి? మేనేజర్ రూమ్ తలుపు పైన అతని పేరు రాసి వుంది. లోపలికి వెళ్ళి హత్యానేరం ఋజువు చేయబడినవాడు తలొంచుకుని తీర్పుకోసం చూస్తున్నట్లుగా నిల్చున్నాడు తను. మేనేజర్ తన ముఖమైనా చూడకుండానే చేతికి దొరికిన వస్తువుని తిప్పుతూ చాలాసేపు ఆపకుండా అరిచాడు. తర్వాత రెండు నిముషాల్లో క్లుప్తంగా విషయం తేల్చాడు. తను ఒక కస్టమర్ బ్యాగులో కింద టొమేటాలు వేసి దాని పైన బరువైన వస్తువులు సర్ది ఇచ్చినందువల్ల ఒక టొమేటా నలిగిపోయిందనీ సూపర్ మార్కెట్‌కి కస్టమర్లే ప్రధానమనీ టొమాటాలూ వీడూ కాదనీ తీర్పిచ్చాడు.

“ఇక నువ్వు ఇంటికెళ్ళొచ్చు.”

“ఇంటికా?”

“అవును.”

“ఇప్పుడా?”

“అవును ఇప్పుడే.”

అతను నమ్మలేకపోయాడు. రెండు డాలర్ల టొమాటాల కోసం తనని ఇంటికి పంపించేస్తున్నారు. తన షర్ట్‌కి గుచ్చివున్న నేమ్ బ్యాడ్జ్ తీసి టేబిల్ మీద పెట్టాడు. ఇకనుండి ఆ బ్యాడ్జ్ లేకుండానే తన పేరు గుర్తుపెట్టుకోవాలి మరి. చెంప వాచిన బోరిస్ కార్లొఫ్ లేచి నిల్చుని చేయి చాపాడు. అతను పట్టించుకోకుండా బయటకు నడిచాడు.

వాళ్ళ అమ్మ చెప్తుండేది, నీ పేరు షర్ట్‌లో గుచ్చుకోకూడదు, మెడలో ట్యాగ్‌లా వేలాడకూడదు. తలపు మీదుండాలి, అని. అమ్మకు ఈ సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం చెయ్యడం ఇష్టంలేదు. నీ తెలివితేటలకి ఒక గదిలో కూర్చుని చేసే ఉద్యోగం చెయ్యాలి, అని ఎప్పుడూ అంటూండేది. ‘ఈ ప్రపంచంలో అందరూ నీ గురించి చేతులెత్తేసినా నిన్ను ఆదరించే ఒకే ఒక జీవి మీ అమ్మేనన్నది మరిచిపోకు.’

కారు వేగంగా పోనిచ్చాడు. ముందొక పెద్ద ట్రక్ వెళ్తోంది. వెనక ఇలా రాసుంది, ‘ఈ అక్షరాలు చదవగలుగుతున్నావంటే నీవు చాలా దగ్గరగా ఉన్నావు. కాస్త దూరంగా ఉండు‌.’ ట్రక్ నత్తనడక నడుస్తోంది. ఓవర్‌టేక్ చెయ్యలేకపోతున్నాడు. చిరాకేసింది. ఉన్నట్టుండి ఓ ఆలోచన. ‘తొందరగా ఇంటికెళ్ళి నేను చేసేదేముంది? ఇంట్లో ఎలానూ మైథిలి లేదుగా? ఆమెకు వంట చేసిపెట్టక్కర్లేదు. మూడు జిప్‌లాక్ కవర్లేసి దాచిన బేగల్‌ తన లవర్‌తో పంచుకు తింటూ ఉంటుందేమో.’

లారన్స్ స్ట్రీట్‌లో తను పుట్టిన హాస్పిటల్ కనిపించింది. ఎప్పుడు ఈ దారిన వెళ్ళినా వాళ్ళ అమ్మ ఆ విషయాన్ని గుర్తు చేసేది. ఎనిమిది అంతస్తులున్న నీలి రంగు భవనం అది. అక్కడికక్కడే కారు తిప్పుకుని హాస్పిటల్లోకి వెళ్ళాడు. రిసెప్షన్‌లో స్క్రబ్స్ వేసుకున్న అమ్మాయిలు కూర్చునున్నారు. ఒక అమ్మాయి కంప్యూటర్‌లో ఏదో టైప్ చేస్తూ ఉంది. ఊరకే కూర్చున్న అమ్మాయి ముందుకెళ్ళి నిల్చున్నాడు. ఆ అమ్మాయి తల పైకెత్తి హాస్పిటల్ మందహాసం ఒకటి రాల్చింది.

“ఏ సహాయం కావాలి?”

‘నన్ను నేను రిటర్న్ చేసుకోడానికి వచ్చాను.”

“క్షమించండి. అర్థంకాలేదు‌.”

“నేనిక్కడే పుట్టాను. నన్ను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను‌.”

“ఏం?”

“చెడిపోయినవి, పని చేయనివి, నచ్చనివీ రిటర్న్ చేయచ్చు కదా?”

ఒక్క క్షణంలో అక్కడున్న అందరూ అతనికేసి ఆశ్చర్యంతో చూశారు. ఏం మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకున్నారు.

“ఇవ్వచ్చు. అయితే మీ అమ్మగారొచ్చి తిరిగివ్వాలి‌.” టైప్ చేస్తున్న అమ్మాయి పని ఆపి అతనికేసి నెమ్మదిగా చూసి, నవ్వునాపుకుంటూ అంది. అమ్మాయిలు రహస్యంగా ఒకరినొకరు చూసుకున్నారు.

తనకేమైంది? ఎందుకిలా ఆవేశం వచ్చినవాడిలా హాస్పిటల్ లోపలికెళ్ళాడు? అక్కడి వాళ్ళలో కొందరి నవ్వులు తనకి వినిపించాయి. అవమానపడినట్టనిపించింది. వాళ్ళ అమ్మ ‘నీకు పిచ్చి పట్టింది‌!’ అని తిట్టడం గుర్తొచ్చింది. అమ్మకు ఫోన్ చేసి ఉద్యోగం ఊడిందని చెప్దామా అనుకున్నాడు. తను ఎప్పుడు అమ్మకి ఫోన్ చేసినా అదేదో ఒక చెడువార్త చెప్పడానికే అయుంటుంది. ఈ సారి ఏదైనా ఒక గుడ్‌న్యూస్ చెప్పడానికి చెయ్యొచ్చు అని ఊరుకున్నాడు. తొందరగా ఒక ఉద్యోగం వెతుక్కుని ఫోన్ చేస్తే సంతోషిస్తుంది. అలా అనుకున్నాడో లేదో అమ్మ దగ్గర్నుండి ఫోన్ వచ్చింది. తను అమ్మని తలచుకుంటే ఆ విషయం ఎలానో అమ్మకు తెలిసిపోతుంది. ఎన్నో సార్లు జరిగింది ఇలా!

“ఏంటమ్మా?”

“చాలారోజులైంది ఫోన్ చెయ్యలేదేం?”

“సెల్‌ఫొన్ నీళ్ళలో పడిపోయింది. నెంబర్లు పోయాయి.”

“నా నెంబర్ నీకు గుర్తులేదా?”

“లేదమ్మా. ఇప్పుడు చేశావుగా? ఇకనుండి వెంటవెంటనే ఫోన్ చేస్తుంటాను.”

అమ్మకి అబద్ధం చెప్పడం ఏదోలా అనిపించింది. తల్లిని తను పెట్టిన హింసలకి ఇదంతా శిక్షేమో అనుకున్నాడు. ఒకసారి ఆమె హాస్పిటల్లో ఉండగా అక్కడికెళ్ళకుండా మైథిలి పుట్టినరోజు పార్టీ ఇస్తూ గడిపాడు. 18వ పుట్టినరోజు ఒకసారే వస్తుందని మైథిలి అన్నది. వెంటనే మనసు మార్చుకుని హాస్పిటల్‌కు పోకుండా ఆగిపోయాడు. అది గుర్తొచ్చి అతణ్ణి దుఃఖం ముంచేసింది. దాన్నుండి బయటపడాలన్నట్టు కారును గుర్రం తోలినట్టు టక్‌టక్ మంటూ గిట్టల చప్పుడు చేస్తూ నడిపాడు. మనసు కొంచం కుదుటపడింది.

ఒక పొడవైన అమ్మాయి కుక్కని పట్టుకుని నడుస్తోంది. అందమైన దృశ్యం. తన బాయ్‌ఫ్రెండ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈరోజు కుక్కని వాకింగ్‌కి తీసుకెళ్ళే పని ఆమె వంతేమో. మైథిలి గుర్తొచ్చింది. ఎక్కడ పొరపాటు జరిగినా అటూ ఇటూ మాటలతో సాధించి అతని నెత్తినే పడేసేది. గొప్ప లాయరయ్యే తెలివి పుష్కలంగా ఆమెకుంది. ఆమె పక్కన నిల్చున్నప్పుడు ఇతని అయోమయం ఇట్టే కనిపించేది. కారు పార్క్ చేసి ఇంట్లోకి నడిచాడు. ఇల్లు నిశబ్దంగా ఉంది. ఓవర్‌కోట్ తీసి హ్యాంగర్‌కి తగిలించాడు. షూస్ విప్పి ర్యాక్‌లో పెట్టాడు. కారు తాళాలు టేబిల్ మీద పెట్టాడు. సెల్‌ఫోన్‌ని చార్జర్‌కి తగిలించాడు. లైట్ వేశాడు. అతని నీడ గోడ మీద పడింది. ఎంత బాగుంది ఈ నీడ! ఏం ఠీవి! చూడటానికే ఎవరూ లేరు.

తలుపుకింద సందులోంచి ఒక ఉత్తరం లోపలికి నెట్టబడి వుంది. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. తనకు లెటర్లు రావు ఎప్పుడూ. బ్రౌన్ కవర్. గవర్నమెంట్ లెటర్ అయుండాలి. కెనడా లీగల్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చింది. చేతులు కాస్త వణికాయి. ఒక్క నేరమూ చెయ్యలేదే అనుకున్నాడు. సూపర్ మార్కెట్‌లో ఓసారి 12 డాలర్లు లెక్క చూపెట్టకుండా వదిలేశాడని వాళ్ళకు తెలిసిపోయిందా?

కంగారుపడుతూ కవర్ విప్పాడు. కళ్ళు పెద్దవయ్యాయి. అతన్ని ఒక కేస్‌లో జూరీగా చెయ్యమని ఆహ్వానించారు. ‘ఒక తలుపు మూసుకుపోతే దేవుడు మరో తలుపు తెరుస్తాడంటారు, నా విషయంలో ఏకంగా నాలుగు తలుపులు తీశాడు’ అనుకున్నాడు. ఆనందించాల్సిన విషయం. కేస్ డీటెయిల్స్ ఏంటో తెలీదు గానీ రెండు వారాల్లో వెళ్ళాలి. జీతం రోజుకి 40 డాలర్లు. కేస్ ఎక్కువ రోజులు సాగితే రోజుకు వంద డాలర్లుగా పెంచేస్తారు.

అతను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఎవరితోనైనా ఈ శుభవార్తను పంచుకుందాం అంటే ఎవరూ లేరు. అమ్మకి చెప్తే గర్వపడుతుంది అనుకున్నాడు. ఏం కేస్ అయుంటుంది? హత్యానేరమా? స్మగ్లింగా? జూరీ మెంబర్‌కి పేరు షర్ట్‌లో గుచ్చుతారా? మెడలో టేగ్‌లా వేస్తారా? ఒకవేళ జూరీ టేబుల్ మీద పేరు పొదిగిన బోర్డ్ పెడతారేమో అనుకున్నాడు. ఒక నెలకంటే ఎక్కువ రోజులు కేస్ సాగితే బాగా డబ్బులొస్తాయి. అమ్మకు ఏదైనా ఖరీదైన బహుమతి ఇవ్వచ్చు.

మాట వరసకు నిందితురాలు మైథిలి అయితే ఎలా ఉంటుందో? బోనులో నిల్చున్నా కత్తి తిప్పినట్టు మాటలటూ యిటూ చేసి మాట్లాడుతుందేమో, ఎవరి మీదకో తప్పు నెట్టేయడానికి. ఆమె మాట్లాడుతుంటే కుక్కలు ఏడుస్తున్నట్టుగా ఉంటుంది. ఒక వేళ ఆమె దొంగతనం చేసుంటే? లేదా ప్రభుత్వాన్ని మోసం చేసుంటే? ఏమో, ఆ మూడు రోజుల పస్తుగాడిని చంపేసి వుండచ్చు. ఇదే నిజమైతే మీ దృష్టిలో ఈమె నేరస్తురాలేనా అని జడ్జ్ జూరీని అడిగినప్పుడు అవునంటూ చేయెత్తే ఆ క్షణాల్లో ఎంత ఆనందంగా ఉంటుందో! కక్ష సాధించుకోవడంలో దొరికే ఆనందానికి సరితూగే మరో ఆనందం ఈ ప్రపంచంలో ఏదీ లేదు.

(మూలం: “ఎన్నై తిరుప్పి ఎడు” కాలచ్చువడు మాస పత్రిక, డిసెంబర్ 2016. రచయిత బ్లాగులో కూడా చదవచ్చు)