టోరాబోరా వంటమనిషి

ఆరోజుల్లో నాకొక వంటమనిషి కావలసి వచ్చాడు. మనిషంటూ దొరికితే, అతని పని చాలా సులువుగానే ఉంటుంది, సందేహం అక్కరలేదు. వంట చెయ్యాల్సింది నా ఒక్కడికి మాత్రమే. ఉదయం అల్పాహారం నేనే చేసుకుంటాను. టోస్ట్ చేసుకుని బ్రెడ్‌కి వెన్న రాసుకోడానికీ తినడానికీ నాకు సరిగ్గా నాలుగు నిముషాలు సరిపోతుంది. మధ్యాహ్నానికీ, రాత్రి భోజనానికే ఇబ్బంది.

నాకప్పుడు పాకిస్తాన్‌లోని ఈశాన్య మూలనున్న పెషావర్‌లో ఉద్యోగం. నా భార్య రావడానికి ఆరు నెలలు పడుతుంది. ఆ ఆరు నెలల కోసం ఒక వంటమనిషిని ఏర్పాటు చేసుకొనే అవసరం వచ్చింది. అక్కడ ‘వంటమనిషి కావలెను’ అని ఎవరూ ప్రకటనలివ్వరు. తెలిసిన వాళ్ళకీ వీళ్ళకీ చెప్పి అలా విచారించి పట్టుకోవాలి.

పెషావర్ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా నేను కొన్ని శతాబ్దాలు వెనకకు వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతుంది. తెల్లవారుజామున గుర్రాల డెక్కల ‘టక్కు టక్కు’ చప్పుళ్ళతోనే రోజూ మెలుకువ వచ్చేది. ఒక్కోసారి నిద్రా మెలకువా కాని స్థితిలో ఉండగా నా పడకగది కిటికీకి బాగా దగ్గరగా గుర్రపు డెక్కల చప్పుడు విని, పొరుగు దేశపు రాజెవరో నాకు లేఖ పంపాడేమో అన్న ఊహతో ఉలిక్కిపడి లేచేవాడిని.

కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు తమ భర్త ఇంటికి పల్లకిలో వచ్చి దిగడాన్ని కూడా నేను మా ఇంటి మేడ మీద నుండి చూస్తుండే వాడిని. బంధువుల సమేతంగా, మంగళ వాద్యాలు మ్రోగుతుండగా, నలుగురు బలమైన బోయీలు పల్లకీని మోసుకొస్తారు. ముందుగా పల్లకినుండి ఒక తెల్లటి పాదం నేలమీద మోపబడుతుంది. తర్వాత జరీ పరదా వేసుకునున్న అమ్మాయి ఆకారం కనిపిస్తుంది. ఆ నాజూకైన నడకలోనే ఆమె ఎంత గొప్ప అందగత్తో తెలిసిపోతుంది!

బళ్ళకూ ఉద్యోగాలకూ వెళ్ళే జనంతో వాహనాలతో రద్దీగా కిటకిటలాడే పొద్దునపూట కూడా, ఒంటి గుర్రపు చెక్కబండి మీద వెళ్ళే కుర్రకారు, బెన్‌హర్ సినిమాలోని గుర్రబ్బళ్ళ రేసుని గుర్తు చేస్తుండేవారు. సరికొత్త మాడల్ కార్లు, రంగురంగుల బొమ్మలు వేయబడిన బస్సులు, ఆటోలు, స్కూటర్లు, సైకిళ్ళతో కిక్కిరిసే రోడ్డు మీద ఈ గుర్రబ్బళ్ళు ఆశ్చర్యంగానే అనిపించేవి. రోడ్ల మీద ఎటువైపు చూసినా షటిల్ కాక్‌ని బోర్లించినట్టు నల్లటి పర్దా వేసుకున్న ఆడవాళ్ళూ, తెల్లటి సల్వార్ కమీజ్ వేసుకునున్న మగవాళ్ళూ తిరుగుతూ వుండేవారు.

అన్ని వసతులూ వున్న నగరమే అయినప్పటికీ ఒక వంటమనిషి దొరకడం మాత్రం ప్రయాసే అయ్యింది. ఆఫీసులో చాలామందికి చెప్పి ఉంచాను. నేనుండే ఇంటి ఓనర్‌కి చెప్పినప్పుడు, రష్యా యుద్ధంనుండి తిరిగివస్తున్న అఫ్గాన్లలో అద్భుతమైన వంటవాళ్ళుంటారు, వాళ్ళలో ఒకర్ని చూసుకోండి–అని సలహా ఇచ్చాడు.

మా యింటికి కొంచం దూరంలో ఒక నీటి కాలువ ఉంది. ఒకరోజు కొందరు పిల్లలు ఆ కాలువలో గేదెల్ని తోముతున్నారు. ఒక పిల్లాడు నల్లటి గేదె మెడ పట్టుకుని వేలాడుతున్నాడు; వీళ్ళు వాడినీ కలిపి కడుగుతున్నారు. పొడవైన ముక్కుల పక్షులు కొన్ని పైకి ఎగురుతూ ఆ కాలవ నీటిలో డైవ్ చేస్తున్నాయి. ఒకరోజు మా ఇంటి మేడమీద నిల్చుని అవన్నీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను.

ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. వచ్చింది మా ఆఫీసులో పని చేసే ముంతాజ్ (ముంతాజ్ అంటే సినీ నటి పేరు కాదు; పెషావర్‌లో ముంతాజ్ మగవాడి పేరు!) వాడు ఉద్యోగం చేసేది మా ఆఫీసులోనే అయినా వాడి మనసు మాత్రం వేయి అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. గద్దలను పట్టి, ప్రతి ఏడూ వచ్చే అరబ్ దేశపు వ్యాపారులకు అమ్మడమే వాడి అసలు ఉద్యోగం. టోపీ వేయడాన్ని అలవాటు చేసిన నల్లరంగు ఆడ గద్ద ఒక్కదాన్ని అమ్మితే, ఆఫీసులో ఏడాది పనిచేస్తే వచ్చే జీతమంత వస్తుందనేవాడు.

ముంతాజ్ పక్కన ఒక మసలాయన తాడిచెట్టులో సగం ఎత్తుతో నిల్చుని ఉన్నాడు. మందపాటి గాడా గుడ్డతో కుట్టించుకున్న సల్వార్ కమీజ్ వేసుకుని, దానికంటే మందమైన శాలువా కప్పుకొని దాని కొంగును వెనక్కి వేసుకునున్నాడు. పండిన జామపండులా పచ్చగా ఉన్నాయి అతని కళ్ళు. చూస్తే వంటమనిషిలా అనిపించలేదు. నన్ను చూడగానే మిలిటరీవాడిలా ఒక కాలుతో నేలను తన్ని స్టిఫ్‌గా నిలబడి సల్యూట్ చేశాడు. సల్యూట్ అవ్వగానే ఎర్రని చిగుర్లు కనిపించేలా నవ్వాడు.

ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. జవాబులన్నీ ఒకటీ రెండు పదాలతో మాత్రమే వచ్చాయి. తనకు తెలిసిన పదిహేను ఆంగ్ల పదాలతో జవాబు చెప్పగలిగే ప్రశ్నలు మాత్రమే నేను అడుగుతున్నాననుకున్నాడేమో. అతనిది అఫ్గాన్‌లో టోరాబోరా గ్రామం. అమెరికా అగ్రరాజ్యపు B-52 బాంబర్లు ఆ గ్రామం మీద వేయికి పైబడిన బాంబులను వేసి నేలకూల్చబోతుందన్నది అప్పటికి ఆ ముసలాయనకి తెలియదు. నాకూ అది ఊహించడానికి అవకాశం లేదు. అతని ఇద్దరు కొడుకులూ రష్యా యుద్ధంలో చనిపోయారట. మిగిలున్న ఒక్క కూతురితో ఉండిపోదాం అని పెషావర్ వచ్చినట్టు చెప్పాడు.

అతను పట్టుకొచ్చిన గోనెసంచి నుండి ఓ పెద్ద సైజు దానిమ్మ పండును తీసి నా చేతికిచ్చాడు. మా ఇంటినుండి రెండు నిముషాల దూరంలోనున్న సంతలో చౌక ధరకే ఇలాంటివి దొరుకుతాయి. అలాంటిది ఎనభై మైళ్ళ దూరంలోనున్న టోరాబోరా నుండి మోసుకొచ్చాడు, మా తోటలో పండినవి అంటూ. అయినా, ఇంత ఎర్రని పళ్ళు సంతలో దొరక్కపోవచ్చుననిపించింది.

“మీకు ఏం వంటలొచ్చు?” అడిగాను.

“అన్నీ వచ్చు!” జవాబిచ్చాడు. ఆ జవాబు నిడివి సరిపోదని అనుకున్నాడో ఏమో, చెప్పక వదిలేసినదాన్ని నవ్వుతో పూరించాడు.

ముంతాజ్ బహుభాషా ప్రావీణ్యుడు. ముసలాయన ఆంగ్లంలో చెప్పలేని వాటిని అనువాదం చేశాడు. అప్పుడప్పుడూ తనవంతుగా ముసలాయన తరఫున కొన్ని విన్నపాలూ పెట్టాడు. ఏవి ముసలాయన చెప్తున్నవో, ఏవి ముంతాజ్ చెప్తున్నవో తెలియని గజిబిజి! ఈ ముసలాయనకి ఉద్యోగం ఇవ్వాల్సిన అవశ్యకతను, అతను పడుతున్న కష్టాలను, కొన్ని రహస్యమైన కుటుంబ పరిస్థితులనూ బహిరంగపరిచాడు. ఆ వివరాలకూ ముసలాయన వంట పరిజ్ఞానానికీ సంబంధం ఏంటో నాకర్థంకాలేదు.

ఇంటర్‌వ్యూ ఒక కొలిక్కి వచ్చింది. అతని జవాబులు క్లుప్తంగానూ, నవ్వులు నిడివిగానూ వున్నాయి. నేనేదో మిలిటరీకి మనుషుల్ని ఎంపిక చేస్తున్నట్టుగా ఎవరో అతనికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా, ఇంకా స్టిఫ్‌గానే నిల్చుని ఉన్నాడు. అతని వంట పనితనం గురించిన సమాచారం మాత్రం ఇంటర్‌వ్యూ మొదలుపెట్టినప్పుడు ఎలాగైతే ఉందో ముగిసేటప్పుడూ అలానే ఉంది. మరోసారి అతణ్ణి, “మీకేం వంటలొచ్చు?” అని అడిగాను. అతను మళ్ళీ, “అన్నీ వచ్చు!” అనే అన్నాడు. టోరాబోరా కొండనుండి పెషావర్ దాకా తాను చేసిన ప్రయాణమంతా ఈ ఒక్క వాక్యాన్నే కంఠతా పట్టినట్టుగా ఉన్నాడు.

ఇతనితో ఎలారా దేవుడా అని నాలో సందిగ్ధం మొదలయ్యిన విషయం నా ముఖం చూసి పసిగట్టేసినట్టున్నాడు ముసలాయన. దీన్ని సుఖాంతం చేసుకోడానికి ఏదో ఒక యుక్తి తన మదిలో మెరిసి ముఖంలో వెలిగింది. ఆరు గంటలు చూపిస్తున్న గడియారపు ముల్లు తొమ్మిదికి తిరిగినట్టుగా, స్టిఫ్‌గా నిల్చుని ఉన్న మనిషి సర్రుమని పక్కకు వంగాడు. తన కమీజ్ అంచు అందుకుని పొట్ట పైదాకా లాగి సల్వార్ జేబులో చేయిపెట్టి ఏదో బయటకు తీశాడు. ఆశ్చర్యపడి పోవడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. నీటిలో, చెమటలో, మరేరకమైన ద్రవంలోనూ తడిసిపోకుండా ఉండాలని చుట్టిపెట్టిన పాలిథిన్ కవర్ విప్పి, అందులోనుండి మరో పేపర్ కవర్ తీశాడు. బాగా పాతబడిపోయున్న ఆ కవర్‌ను నా చేతికిచ్చాడు. జాగ్రత్తగా ఆ కవర్ తెరచి అందులోని ఉత్తరాన్ని బైటికి తీశాను. అది ఎనిమిదిగా మడిచిన కాగితం. ఎప్పుడెప్పుడు ముక్కలుగా విడిపోయి గాలికి ఎగిరిపోతుందా అన్నంత అపాయకర స్థితిలో ఉంది ఆ లేఖ. మడతలని జాగ్రత్తగా సవరించి విప్పాను. తేదీ చూశాను. నేను పుట్టిందదే సంవత్సరంలో. ముసలాయన ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడు అతను చాకిరీ చేసిన తెల్లదొర రాసిన లేఖ అది. తన దగ్గర పనిచేసిన ఒకరి విశ్వాసానికీ పనితనానికీ సాక్ష్యం పడుతూ ఎన్నో ఏళ్ళక్రితం ఒక తెల్లదొర టైపు చేసి ఇచ్చిన లేఖ అది!

“To Who It May Concern” అని మొదలైంది.

‘ఇందుమూలాన చెప్పొచ్చేదేమిటంటే, ఈ లేఖను మీరు చదువుతున్నారంటే గులాం మొహమ్మద్ నజూరుద్దీన్ మీదగ్గర పనికోసం దరఖాస్తు పెట్టుకున్నాడని అర్థం. ఇతను నావద్ద రెండేళ్ళు వంటమనిషిగా పనిచేశాడు. ఇతనికి వంట రాదు. చాలా మంచి వ్యక్తి. మిగిలిన ఏ పని ఇచ్చినా చేస్తాడనే నమ్ముతాను.

విల్‌ఫ్రెడ్ స్మిత్ (సంతకం)’

క్లుప్తమయిన ఆ లేఖను ఎలా ఉన్నదో అలా చిరిగిపోకుండా కవర్లో పెట్టి అతనికందించాను. అతను ప్రపంచంలోని ఏ ఒక్క భాషనీ చదవడం రాయడం చేతకానివాడు అని తెలిసిపోయింది. అందులో ఏం రాసివుందో తెల్సుకోడానికి ఎటువంటీ ప్రయత్నమూ చెయ్యకనే ఇన్నేళ్ళుగా దాచుకున్న ఆ లేఖను రెండు చేతులతో తీసుకున్నాడు. సానుకూలమైన స్పందనకోసం నా ముఖంలోకి చూశాడు. ఇరవై సెకండ్లలో తనకివ్వబోతున్న ఉద్యోగ బాధ్యతలను చేపట్టాలన్న ఉత్సాహం ముసలాయన కళ్ళలో కనిపించింది. ముఖంలో విజయగర్వం. నోరు మరో రెండంగుళాలు పెద్దది చేసుకుని నవ్వాడు. అతను మోసుకొచ్చిన దానిమ్మ పండు రంగులో ఉంది ఆ నవ్వు!

(మూలం:‘టోరాబోరా సమయల్‌కారన్.’.)


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.