బలిసిన మేకను పట్టుకుంటాను

ఓం గణేశాయ నమః!

To:

The Immigration Office
200 St. Catherine Street
Ottawa, ON K2P 2K9.

(Please Translate Sri Lankan Tamil Language)

(దీన్ని అనువాదం చేసేవారు వాక్యాల వరుసను మార్చకుండానూ, నా తరఫు వాదాన్ని యథాతథంగానూ, స్పష్టంగానూ, మా జీవన విధానాల, సాంస్కృతిక తేడాలను వివరించుతూనూ అనువదించమవి వినయంగా కోరుకుంటున్నాను.)

గౌరవనీయులైన అధికారిగారికి,

షణ్ముఖలింగం గణేశరత్నం అనే నేను 1990-03-18 సాయంత్రం టోరంటో ఏర్‌పోర్ట్‌లో దిగాను. నాకు ముందుగానే నేర్పించినట్టు అక్కడ ఉన్న కార్యదర్శికి శరణార్థి పౌరసత్వం కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నాను. నా భార్య చెల్లెలు విజయలక్ష్మి, ఆమె భర్త బాలచంద్రం వచ్చి నన్ను ఏర్‌పోర్ట్‌లో కలిశారు. విజయని ఇదే మొదటిసారి ప్రత్యక్షంగా చూడటం. ఆమె ముఖవైఖరి నా భార్య పోలికలకు దగ్గరగా ఉండటంతో గుర్తుపట్టడం సులువైంది.

నన్నెంతో ఆప్యాయంగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. వాళ్ళకున్న ఆ చిన్న ఇంట్లో నాకంటూ ఓ గదిని కేటాయించారు. నా జీవితంలో నేనెప్పుడూ నాకంటూ ప్రత్యేకంగా ఒక గది అన్న ఆ సౌకర్యాన్ని అనుభవించి ఎరగను. కావున నా తోడల్లుడి మీద నాకున్న గౌరవంతోబాటు కృతజ్ఞతాభావం కూడా పెరిగింది.

నా తోడల్లుడు, విజయ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ నాకన్నీ కొత్తగా, వింతగా అనిపించాయి. పోస్ట్‌మేన్ జాబులను ఇంటికే తెచ్చి ఇస్తాడు. ఎప్పుడైనా ఏ చోటైనా కొళాయిల్లో ఎడంవైపు వేడినీళ్ళూ, కుడివైపు చన్నీళ్ళూ వస్తున్నాయి.

నాకు మావాళ్ళు బస్‌లో ట్రాన్స్‌ఫర్ ఎలా తీసుకోవాలి, టెలిఫోన్ కార్డ్‌లెలా వాడాలి వంటివి నేర్పారు. వచ్చిన నాలుగవ రోజే ఒక రెస్టారెంట్‌లో చేతిఖర్చులకు సరిపోయేలా గిన్నెలూ, కప్పులూ కడిగే ఉద్యోగం దొరికింది.

కొత్త సినిమాల వీడియోలు అద్దెకు తీసుకోవచ్చు. మా దేశంలో దొరకని ఎన్నో కొత్త ఆహారపుదినుసులిక్కడ దొరుకుతున్నాయి, ఇక జీవితం ఇలానే సులువుగా ఉంటుందని మొదట సంతోషించాను. నా జీతం డబ్బుల్లో కొంత నెలనెలా చీటీ కట్టమని సలహా ఇచ్చారు నా తోడల్లుడూ అతని భార్యా. వాళ్ళింటిలో నేను ఉంటున్న రూమ్‌కి అద్దె, చీటీ పాటకు 250 డాలర్లు పోగా మిగిలిన డబ్బు ఊరికి పంపేవాడిని.

నా తోడల్లుడు రెండు ఉద్యోగాలు చేస్తాడు. రాత్రి పదికొస్తాడు. విజయ పేంటూ షర్టూ వేసుకుని, భుజానికి సంచీ తగిలించుకుని డే-కేర్ ఉద్యోగానికి పొద్దున్నే వెళ్ళిపోతుంది. మధ్యాహ్నానికి ఆమె షిఫ్ట్ అయిపోతుంది. నా ఫస్ట్ షిఫ్ట్ ముగించుకుని మూడుగంటలకల్లా వచ్చి కాసేపు కునుకు తీసేవాడిని. తర్వాత ఇంట్లో పనులు ఏదో ఒకటి చేసిపెట్టేవాణ్ణి. మామూలుగా మార్కెట్టుకెళ్ళి సరుకులు తెచ్చేది నా పనిగా ఉండేది.

రాత్రి తోడల్లుడు వచ్చేవరకు కాచుకునుండి అందరం కలిసి తినేవాళ్ళం. విజయ చాలా చక్కగా వంటలు చేస్తుంది. ఆమె వండే రొయ్యల పులుసు రుచి మరిచిపోలేనిది. నేను చివరిగా రొయ్యల పులుసు తిన్నది ఆ రోజే. నన్ను పోలీసులు పట్టుకునిపోయిన రోజు. అప్పట్నుండి రెండేళ్ళుగా నేను అనుభవించని హింసలు లేవు.

ఇక్కడ జైలులో ఇచ్చే ఆహారం తేడాగా ఉంటుంది. ఐదుసార్లు ఒకోసారి రెండేసి గుడ్ల చొప్పున పది గుడ్లు, నాలుగుసార్లు చేపలు, మూడుసార్లు పూటకో కోడికాలు, నాలుగుసార్లు సాలడ్ అనబడే ఉడికించని ఆకుకూరలూ ఇస్తారు. నాకు హై ప్రషరు, సైనస్ సమస్యలున్నాయి. నేనిక్కడ ఈ జబ్బులతోనూ, మనోవేదనతోనూ బాగా ఇబ్బందులు పడుతున్నాను.

నేను కెనడాకు విహార యాత్రికుడిగా రాలేదు. నా దరఖాస్తుల్లోనూ, విచారణల్లోనూ చెప్పినట్టు మా దేశంలో జరుగుతున్న యుద్ధం నుండి ప్రాణాలు కాపాడుకోడానికి కట్టుకున్న భార్యని, దేవతల్లాంటి నా పిల్లల్నీ వదిలేసి తప్పించుకుని వచ్చినవాణ్ణి. నా కుటుంబాన్ని ఎలాగైనా పోషించుకోవచ్చన్న ఆశతో మూడు నెలలపాటు అష్టకష్టాలు పడుతూ ప్రయాణం చేసి వచ్చాను. ఫ్లయిటెక్కి నేరుగా అలా వచ్చి ఇలా దిగలేదు. ఓడలో, రైల్లో, కిక్కిరిసిన రద్దీలో సర్దుకుని కూర్చుని, రాత్రులు మేలుకుని పనసపళ్ళ లారీలోనూ, కంటెయినర్‌లోనూ, చివరిగా ప్లేన్‌లోనూ ఎనబైతొమ్మిది రోజులు ప్రయాణం చేసి వచ్చాను. కొలంబస్ అమెరికా చేరుకోడానికి 71 రోజులే పట్టాయి. నేనిక్కడికి నా కలల మూటలను తప్ప మరే మూటనీ తీసుకుని రాలేదు.

నా పిల్లల్ని ఊర్లో వదిలిపెట్టి వచ్చి నేను ఇక్కడ అంగలారుస్తున్నాను. నా ముఖం వాళ్ళకి గుర్తుంటుందో లేదో కూడా తెలియదు. నన్ను వాళ్ళు మరిచిపోతారేమో. నేను ఊరొదిలి వచ్చేప్పటికి పెద్దవాడికి ఎనిమిదేళ్ళు, రెండోవాడికి ఆరు, పంచలోహపు బొమ్మలాంటి నా కూతురికి నాలుగేళ్ళు, పసిపాపకైతే ఆరు నెలలే!

పెద్దవాడు వాడి తరగతిలో అందరికంటే తెలివైనవాడు. రెండోవాడు నేను బావిలో నీళ్ళు చేది స్నానం చేసుకుంటుంటే నా మీదనుండి జారిపడే ఆ నీళ్ళతో స్నానం చేసేవాడు. తెల్లటి లేసులున్న పూల గౌను వేసుకుని పాప బుల్లి బుల్లి అడుగులతో పరుగులు తీస్తూ నా వెనక తిరుగుతుండేది. చాపమీద పడుకున్న నన్ను వాటేసుకొని పడుకోడానికి నా పిల్లలు పోటీలు పడేవాళ్ళు. ఆ దేవతల్ని ఇక ఎప్పటికి చూడగలనో తెలియదు.

మా దేశంలో పూర్ణచంద్రుడు బంగారు రంగులో వెన్నెల కురిపిస్తాడు. ఇక్కడ నీలం రంగులో చందమామ కనిపించినప్పుడే ఏదో కీడు పొంచి ఉందని తోచింది. పక్క గదిలో ఉన్నోడు ఏ కారణం చేతనో ఉన్నట్టుండి నిన్న రాత్రి చచ్చిపోయాడు. వాడికి నేనొక గుడ్డు బాకీ ఉన్నాను. వాడి పేరు కూడా నాకు తెలియదు. అయితే ఆ చావు అతనికి ఏమాత్రం సమ్మతం కాదులా ఉంది. తెరిచిన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూనే చచ్చిపోయాడు.

నోరు తిరగని పేరుగల ఒక ఆఫ్రికా దేశంనుండి ఇక్కడికి వచ్చాడు వాడు. ఆ దేశపు భాషలో ఎర్ర ఆవుకి ఒక మాట, నల్ల ఆవుకి ఒక మాట ఉన్నాయట. ఎడంకాలి చెప్పుకు ఒక మాట, కుడికాలి చెప్పుకి మరొక మాట అనికూడా చెప్పాడు. ఒక గుడ్డు అప్పియ్యాలంటే ఒక మాట, రెండు గుడ్లు అప్పియ్యాలంటే మరొక్క మాటా ఉండచ్చేమో ఆ భాషలో.

ఈ జెయిల్లో కొన్ని సౌకర్యాలున్నాయి. ఈ సౌకర్యాలకు నేను ముందుగానే అలవాటుపడలేదు కాబట్టి మొదట్లో కష్టపడ్డాను. జెయిలుకు రాకముందు తాళంచెవుల్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా దాచుకోడం అలవాటు చేసుకున్నాను. కెనడాలో ఇంచుమించు అన్ని తలుపులకీ ఆటోమేటిక్ లాకులు. ఈ తలుపులు చాలా ప్రమాదకరం. ఎక్కువభాగం జ్ఞాపకశక్తిని ఇవే ఆక్రమించుకుంటాయి. జెయిలుకొచ్చినప్పట్నుండి ఆ చింతలేదు. తలకి టోపీ పెట్టుకుని నడుంకి లాఠీని వేలాడించుకున్న గార్డులు, పెద్దగా చప్పుడు చేసే ఈ ఇనప తలుపులను మాకోసం తెరుస్తారు, మళ్ళీ మూస్తారు. మేమేమీ చెయ్యనక్కర్లేదు. తలుపులెక్కడ తాళం పడిపోతాయో అని భయపడాల్సిన పనిలేదు. చేతులూపుకుంటూ వేళకి బయటికి వెళ్ళడం, లోపలికి రావడం మాత్రమే మా పని.

నా తోడల్లుడి ఇంట్లో నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను. అక్కడా ఆటోమేటిక్ లాకున్న తలుపే. తాళంచెవిని దగ్గరే ఉంచుకోవాలెప్పుడూ. ఎవరి తాళం చెవులు వాళ్ళు దగ్గరబెట్టుకోవడం తప్పదు. ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళడం, ఉద్యోగం అవ్వగానే ఎవరి టైమ్‌లో వాళ్ళు రావడం.

అధికారిగారూ, నా జీవితంలో ఇదే చెడ్డ కాలం అనొచ్చు. రోజులు గడిచేకొద్ది వాళ్ళు డబ్బు వెనక పరిగెడుతున్నారన్నది గ్రహించాను. ఇంటి వాతావరణమూ సరిగ్గాలేదు. విజయ నాతో నడుచుకునే తీరు నాకు కొంచం భయాన్ని కలిగించింది. నా పౌరసత్వం కేసు కొలిక్కి రాగానే వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంత పెద్ద సాయం చేసిన వీళ్ళని మరిచిపోకుండా, నొప్పించకుండా బయటపడాలి అనికూడా మనసులో తీర్మానించుకుని తగిన సమయం కోసం చూస్తూ ఉన్నాను. అయితే ఆ విషయం ఎలానో దేవుడికి తెలిసిపోయినట్టుంది.

మా మధ్య సమస్య రాత్రుల్లో టీవీ చూసేప్పుడు మొదలైంది. విజయ మాట్లాడే తీరులో కొంచం తేడాకొట్టేది. నాతో మాట్లాడేప్పుడు అవసరానికంటే ఎక్కువగా ఒయ్యారాలు పోయేది. ఆమె వేళ్ళు, కొన్ని హావభావాలూ నా భార్యని తలపించాయి. ఒకరోజు నేను ఉద్యోగంనుండి అలసిపోయి వచ్చి తొందరగానే పడుకుండిపోయాను. విజయ నాకు కోడిగుడ్ల పొరటు చేసి పెట్టింది. మొగుడు వచ్చేసరికి కాయగూరల పులుసు మాత్రమే. లోపల పడుకునున్న నాకు వాళ్ళు వాదులాడుకోవడం స్పష్టంగా వినిపించింది.

మరొక ముఖ్యమైన విషయం. వీళ్ళకు ఒకే ఒక కూతురు. ఆమె పేరు పద్మలోచని. చిన్నప్పుడు పద్మ అని పిలిచేవారట, అది స్టయిల్‌గా లేదని లోచని అని మార్చుకున్నారు. రానురానూ ఇంకాస్త కుదించబడి ఒట్టి లో అయిపోయింది. ఆ కూతురు చదువు విషయంలో కొంచం మందమతి. ఈ పిల్లని విజయ పది దాకా ఏదో ఒక కారణంతో అదిలిస్తూ, తిడుతూ ఉంటుంది. ‘పెదనాన్న అలసిపోయున్నాడు, విసిగించకు,’ అనో, ‘వెళ్ళి చదువుకోపో!’ అనో, ‘కింద ఇంట్లోకి వెళ్ళి పుస్తకం తీసుకురా!’ అనో, ఏదో ఒక రకంగా తరుముతూనే ఉంటుంది.

పద్మలోచని చిన్నపిల్లయినా చమత్కారి. వయసుకు మించిన మాటలు, చేతలు. కుతంత్రాల బుర్రకూడా. ఏ పనినీ తిన్నగా చెయ్యదు. కొంటెతనం, కుట్రలు, గూడుపుఠాణీతనం ఎక్కువ. ఒళ్ళంతా చెవులే. మెట్లమీద వచ్చే చప్పుణ్ణిబట్టి ఎవరొస్తున్నారో చెప్పేయగలదు. ‘ఇప్పుడు మెట్లెక్కేది ఆ పైనింట్లో ఉండే ఫలానా అంకుల్. ఇప్పుడు కిందింటి ఆంటీ, వీడియో కేసెట్‌లు అరువు తీసుకోడానికి వస్తూ ఉంది…’ అని ఇలా సరిగ్గా చెప్పేస్తుంది. వీడియోలో తమిళ సినిమాలు చూసేప్పుడు, ‘ఆ… సరే! ఇక చెట్టాపట్టాలేసుకుని చెట్టుచుట్టూ పాటేసుకోండీ!’ అని అన్నదంటే సినిమాలో ఆ జంట సరిగ్గా అదేపని చేస్తారు.

అందరూ నిద్రపోయేంతవరకూ హాల్‌లో కూర్చుని, హోమ్‌వర్క్ చేస్తున్నాను అన్న నెపంతో మేలుకుని, అడల్ట్ టీవీ చానెల్‌ని మాటలు వినిపించకుండా మ్యూట్ చేసుకుని చూస్తూ ఉంటుంది. ఇలాంటివి చూసి చూసి ఆ పిల్లకి అలాంటి విషయాల్లో ఆసక్తి ఎక్కువైపోయింది.

పెద్దవాళ్ళకంటే ఈ పిల్లకి పదిరెట్లు ఎక్కువ తెలివితేటలు. ఒకరోజు తల్లి మార్కెట్టుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళింది. ఈ పిల్ల టెలిఫోన్‌లో రీడయల్ నొక్కి ‘అమ్మ అబద్దం చెప్పింది. చీటీపాట ఆంటీ దగ్గర చీరలు చూడటానికి వెళ్ళింది,’ అని వాళ్ళ నాన్నకి పట్టిచ్చేసింది. ఈ పిల్లను పెట్టుకుని ఏ పనీ రహస్యంగా చెయ్యలేరు.

ఆటోమేటిక్ లాకులున్న ఆ ఇంట్లో బాత్‌రూమ్ తలుపు గడియ సరిగ్గా పనిచెయ్యదు. ఒకరోజు తెలీక బాత్‌రూమ్ తలుపు తీసినప్పుడు విజయ స్నానం చేస్తూ ఉంది. నేను కల్లోలపడిపోయాను. విజయ మాత్రం ఏమీ జరగనట్టు సన్నగా నవ్వుతూ నిల్చుంది. కొక్కానికున్న టవల్ తీసి కప్పుకోవాలన్న తత్తరపాటుకూడా లేదు తనలో. నేను సారీ చెప్పి వెనుతిరిగాను.

దీన్ని ఆ బొద్దు పిల్ల చూసేసింది. ‘అమ్మని పెద్దనాన్న నేకెడ్‌గా చూసేశాడు!’ అని గట్టిగా అరిచింది. ఆ పిల్ల నోరు మూయించడానికి ఓ పెద్ద లంచమే అవసరపడి ఉంటుంది విజయకి. నా టైమ్ బాగుందేమో మరి, తోడల్లుడు ఇంటికొచ్చినపుడు ఆ పిల్ల ఈ విషయం గురించి నోరు తెరవలేదు.

ఇది నేను తెలీక చేసిన తప్పు. అయితే తెలిసి ఒకరోజు తప్పు చెయ్యడం జరిగింది. ఆ తర్వాత ఆ తప్పు చెయ్యకూడదని గట్టిగా తీర్మానించుకున్నాను. ఆ తీర్మానాన్ని ఎంత విజయవంతంగా ఆచరణలో పెట్టానో చెప్పలేను. ఎందుకంటే అలా తీర్మానించుకున్న కొన్ని రోజులకే నేను పోలీసులకి అప్పగించబడ్డాను.

విజయ మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో, కాలిమీదకాలు వేసుకుని కూర్చుని కొంచంగా పాలు కలుపుకున్న చిక్కటి చాయ్‌ని మెల్లమెల్లగా జుర్రుకుని తాగుతూ విశ్రాంతి తీసుకుంటుంది. నా భార్య కూడా ఇంతే. ఇలా చాయ్ తాగే టైమ్‌ని వాళ్ళు జీవితంలో అతిమధురక్షణాలుగా భావిస్తారు. అలాగే నవ్వే క్షణాలనుకూడా. ఏ చిన్న జోకుకైనా కికికిమని ఊగిపోతూ నవ్వుతుంది.

నా మనసు పరిపరివిధాలుగా ఊగిసలాడుతున్న ఒకరోజు విజయ బట్టలు మార్చుకోడానికి లోపలికెళ్ళింది. తలుపుని చేరవేసుకోలేదన్న విషయం తనకు తెలుసనే అనుకుంటాను. బిగుతుగా వున్న జీన్స్ పేంట్‌లో ఒక కాలు వేసింది, తర్వాత మరో కాలు. పేంట్ వెడల్పయిన ఆమె సీటుభాగంలో ఎక్కలేదు. ఆమె పిర్రలను చక్కగా ఓమారు ఊపి జీన్స్‌ని పైకి లాక్కుంది. ఆమె తొడలు ఆ జీన్స్‌కి ఒక ముడతనైనా కలిగించకుండా నిండిపోయాయి. ఆ రోజు నా మనసు పడిన తపన చెప్పనలవి కాదు. ఆడ స్పర్శ తగిలి ఎంతకాలమైందో. చాలాకాలానికి అలవాటైన ఆ వాసన నా దేహాన్ని దహించింది.

అధికారిగారూ, అలాంటి సందర్భంలోనే ఇది జరిగింది. అది చెప్తే మీకు నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. దేవుడే వచ్చి చెప్తేగానీ ఎవరూ నమ్మరు. ఈ తిక్క పిల్ల లోచని నన్ను విశ్రాంతి తీసుకోనివ్వదు. తలుపేసుకుని పడుకునున్నా తెరుచుకుని లోపలికి వచ్చి ఫ్యాన్ వెయ్యడం, రేడియో ఆన్ చెయ్యడం ఇలా ఏదో ఒకటి చేసి విసిగిస్తుంది. కిటికీలు తెరవడం, తెరిచుంటే ముయ్యడం. ఉన్న సామాన్లు అటు ఇటు మార్చడం. గదంతా పరీక్షగా చూడకుండా పోదు.

నాకిచ్చిన గదిలోని ఈ ముచ్చటైన నాణ్యమైన మంచం వడ్రంగితో చేయించబడినదట. ఈ పిల్ల దాని మీదెక్కి దూకుతూ ఆడుకుంటుంది. నిద్రని భంగం చెయ్యడానికి ఎన్ని మార్గాలుంటాయో అన్నిట్నీ ప్రయోగించి నా నిద్రను చెడగొడుతుంది. ఆ రోజూ అలానే చేసింది. మెత్తటి ఓ పెద్ద బొమ్మను కాలు పట్టుకుని లాక్కొచ్చి,

“ఏదైనా ఆడుకుందాం,” అని నా నిద్ర చెదరగొట్టింది.

“నన్ను విసిగించకుండా వెళ్ళు. మీ అమ్మకి చెప్తాను,” అని తరిమాను.

“అమ్మ లేదు. తను కిందింటి ఆంటీతో కబుర్లు చెప్పడానికి వెళ్ళింది,” అంది.

తర్వాత ‘బలిసిన మేకను పట్టుకుంటా’ ఆటని మొదలుపెట్టింది. (ఇది మా దేశపు ఆట. దీన్ని అనువాదం చేసేవారు వివరించి చెప్పమని కోరుకుంటున్నాను.)

నేను ‘బలిసినమేకను పట్టుకుంటా’ అంటే ఆ పిల్ల ‘కొరివితో కాలుస్తా’ అని అరుస్తూ మంచం చుట్టూ బిత్తరగా ప్రదక్షిణలు చేస్తుంది. ఇలా నేను తనూ వంతులేసుకుని ఆడుతూ ఉన్నాము. ఈ ఆటలో పడిపోయి నిక్కర్ జారిపోయిన సంగతి నేను గమనించలేదు. ఇదివరకే చెప్పాను కదా, ఈ పిల్లకి ఒళ్ళంతా చెవులని. అయితే ఆ రోజు ఎలా వినిపించకుండా పోయిందో తెలీదు.

హఠాత్తుగా తలుపుని బద్దలు కొట్టినట్టుగా ఎవరో తీశారు. చూస్తే నా తోడల్లుడు. చెదిరిన జుట్టుతో బటన్ ఊడిన షర్టుతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. నాకు గుర్తున్నదంతా జుట్టున్న అతని నల్లటి చేతులూ, లావుపాటి వేళ్ళు మాత్రమే. అతని పిడిగుద్దు నా మెడమీద పడింది. ఆ దెబ్బకే నేను గోడకి తలమోదుకుని రక్తం కారుతూ పడివున్నాను. ఈ పిల్ల గుక్కపట్టి ఏడుస్తూ, “నేనేమీ చెయ్యలేదు. అంతా పెద్దనాన్నే చేశాడు!” అని మళ్ళీ మళ్ళీ చెప్తోంది.

అతను 911కి ఎప్పుడు ఫోన్ చేశాడో తెలీదు. నాకు కొంచం స్పృహ వచ్చేసరికి పోలీసోళ్ళు నిల్చున్నారు. మంచం మీద పిల్ల నిక్కర్ పడి ఉంది. వాళ్ళు రాగానే దాన్నే పరీక్షించి చూశారు. నా తలమీద దెబ్బెలా తగిలిందోనని అసలు అడగనేలేదు. రక్తం కారి షర్ట్ అంతా ఒంటికి అంటుకుపోయాకే కట్టుగట్టారు. నన్ను చూడటానికి ఒకరైనా రాలేదు. నా భార్యకి ఏమి రాసి ఆమె మనసుని మార్చారో నాకు తెలీదు. పలచటి కాగితం మీద రెండు వైపులా ఇంక్ కనిపించేలా ఆమె రాసే ఉత్తరాలు తర్వాత నాకు రానేలేదు.

ఈ దేశంలో నాకు విముక్తే లేదు. ఆ పిల్ల అతితెలివిని ఎవరూ లెక్కపెట్టరు. ఆ పిల్ల శరీరమూ, బుద్ధీ రెండూ పెద్దవే. అన్యాయంగా ప్లాన్ చేసి నన్ను ఇరికించింది. నేను కష్టపడి సంపాదించి కట్టిన చీటీ డబ్బులు ఆరువేల డాలర్లను ఇక నేను పొందలేను. అక్కడ జరిగినవేవీ నేను ఎవరికీ చెప్పలేదు. చెప్తే కుటుంబమే నాశనమైపోతుంది.

ఈ జెయిల్ సెల్‌లో నాతోబాటున్నవాడు గే అని చెప్పాలి. ఎప్పుడూ శోకిస్తూ, ఎనిమిదిగా మడిచిన ఒక ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు. ఉత్తరం మడతల్లో అక్కడక్కడా చిరిగిపోయుంది. 27వ నెంబర్ సెల్‌లో ఉన్న డానియల్‌గాడితో వీడికి సంబంధం ఉంది అంటారు. వీడితో నాకున్న ఒకే ఒక సమస్య, నేను ఎప్పుడు ఒంటికి పోసుకోడానికి వెళ్ళినా అదే సమయానికి వీడూ పక్కన నిల్చుని పోసుకుంటాడు. వీడు నిద్రపోగా నేను చూడలేదు. నా మీద కాళ్ళేసుకుని నిద్రపోకుండా అలా పడి ఉంటాడు. ఒక్కోసారి అర్ధరాత్రుల్లో మెలుకువొచ్చినప్పుడు చూస్తే పొడవైన స్టాకింగ్స్‌ని ఉతికి ఆరేసినట్టు మంచం మీద వీడి కాళ్ళు వేలాడుతుంటాయి. మాతోబాటు ఒక బొద్దింక కూడా ఈ సెల్‌లో నివసిస్తుంది. దానికి ఎడంచెయ్యి వాటం అనుకుంటాను. అది ఒకరోజు కనిపించకున్నా మాకు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అది కనిపించేవరకూ వెతుకుతూనే ఉంటాము.

రాత్రవ్వగానే చెట్ల నీడలు సెల్‌లోకి వస్తాయి. ఈ సెల్‌పక్కనే ఉన్న సన్నటి సున్నపు రంగు బిర్చ్ చెట్టే మొట్టమొదట ఆకులు రాల్చుకునేది. తర్వాత మెల్లమెల్లగా మిగిలిన అన్ని చెట్లూ ఆకులు రాలుస్తాయి. జెయిల్ వాకిట్లో గోపురంమీద ఎగిరే జండా మధ్యలో ఉండే ఆ మేపుల్ ఆకు మాత్రం ఏ ఋతువులోనూ రాలదు.

నా దేవతలను నానుండి దూరం చేశారు. బౌద్ధభిక్షువులు వేసుకునే రంగులో షర్టూ పేంటూ ఒకటిగా కుట్టబడిన పొడవాటి డ్రెస్ వేసుకుని నేను 24 గంటలూ వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. 160 ఏళ్ళకు ముందు ఈ జెయిల్లో బంధించిన మొదటి ఐదు ఖైదీల పేర్లూ ఇక్కడ చెక్కబడున్నాయి. నేను పడుకునున్న ఈ మంచం మీద ఇంతవరకూ వేయిమందైనా పడుకుని ఉంటారు. పడుకున్న కొందరు లేవకుండానే గతించిపోయుండవచ్చు. కరెక్షనల్ గోల్స్ దక్కని, ఉత్తరాలే రాని, విజిటర్లే ఎరగని అన్యదేశపు ఖైదీ ఒకడు ఇక్కడ ఉండేవాడు. వాడి పేరు ఇదీ అని ఎప్పుడైనా ఈ జెయిల్లో రాయబడుతుందా అన్నది తెలీదు.

‘జులై 1, 1867లో కొన్ని రాష్ట్రాలు ఏకమై కెనడా అన్న కొత్త దేశాన్ని ఏర్పరిచాయి. అది ప్రస్తుతం పది రాష్ట్రాలనూ, 2 ప్రదేశాలనూ కలిగి ఉంది. కెనడా దేశపు మొదటి ప్రధాని సర్ జోన్ ఏ. మక్డోనాల్డ్. కెనడా రాణిగారైన రెండో ఎలిజెబత్తుకీ, వారి వారసులకీ, వాళ్ళ పిదప పదవికి వచ్చేవాళ్ళకీ, చట్టానికీ, విశ్వాసబద్ధుడనై, దేశభక్తిగలిగిన వాడినై ప్రవర్తిస్తానని సత్యప్రమాణం చేస్తున్నాను.’

ఘనతచెందిన అధికారిగారూ, ఎప్పుడైనా పౌరసత్వం వస్తుందన్న ఆశతో పైన చెప్పినదాన్ని నేను కంఠోపాఠం చేసిపెట్టుకున్నాను. నా రివ్యూ అప్పీల్‌ని తోసిపుచ్చేసి నన్ను మళ్ళీ మా దేశానికే వెనక్కి పంపించేయవలసినదిగా ప్రాధేయపడుతున్నాను. నేను ఇక్కడికి దొంగ మార్గాల్లో వచ్చినట్టే నన్ను కంటెయినర్‌లో వేసి పంపించినా సమ్మతమే.

నా భార్యకు ఐదో బిడ్డ పుట్టినట్టు వర్తమానం అందింది. నా సహకారంలేకుండా ఇది జరిగే అవకాశమే లేదు. ఇది వట్టి అబద్దం.

ఇక్కడ్నుండి సుమారు పదివేల మైళ్ళ దూరంలో, ఇప్పపువ్వులు రాలే రాత్రుల్లో చమురు ఆదా చెయ్యడానికని వత్తిని తగ్గించి సాయంత్రం ఏడుగంటలకే నిద్రపోయే జనాలుండే ఒక చిన్న గ్రామం ఉంది. పరచగానే చుట్టుకుపోయే ఒక ఈతాకు చాపను పరుచుకుని, ఒకపక్కన ఇద్దరు పిల్లలు, మరోపక్కన ఇద్దరు పిల్లలు అని తనను సరిసమానంగా పంచి ఇచ్చి, ఆకాశంలో హెలికాప్టర్లు ఎగరని రాత్రుల్లో, చుక్కలకు మధ్యలో కనిపించే ఎర్రటి గ్రహానికేసి చూస్తూ పడుకుని ఉండే నా భార్య ఉన్న ఆ అద్భుతమైన గ్రామానికి నేను తిరిగి వెళ్ళాలి. అక్కడ రోడ్లు వేసేవాళ్ళకు రాళ్ళు మోసి నా కుటుంబాన్ని పోషించుకోగలను. మళ్ళీ చెప్తున్నాను, ఈ బలిసిన బొద్దు పిల్లకి వయసు పది అనే విషయం నాకు అసలు తెలియదు.

మళ్ళీ చెప్తున్నాను, పౌరసత్వం లభిస్తుందన్న ఆశతో నేను కష్టపడి కంఠోపాఠం చేసుకున్న అన్నింటినీ వీలైనంత తొందరగా మరిచిపోతాను అని వాగ్దానం చేస్తున్నాను. నన్ను ఎలాగైనా తిరిగి మా దేశానికి పంపించేయండి.

ఇట్లు,
మీ విధేయుడు

షణ్ముఖలింగం గణేశరత్నం
జెయిల్ సెల్ నెంబర్ 37
Kingston Penitentiary
555, King Street W.

[మూలం: ‘కొళుత్తాడు పిడిప్పేన్’ 12 జనవరి 2003. కొళుత్తాడు పిడిప్పేన్(2015) (బలిసినమేకను పట్టుకుంటాను) అన్న కథల సంపుటినుండి.]


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.