అమెరికాలో వాడు మొట్టమొదట అద్దెకున్న ఇంటికి ఎదురుగా శ్మశానం ఉండేది. ఆ విషయం వాడికి ఆ ఇంటిలోకి చేరిన మరునాడు తెల్లవారుజామున కిటికీ తీసినప్పుడే తెలిసింది. వెంటనే వాడు అయోనిజను గుర్తు చేసుకున్నాడు. శ్మశానాన్ని దాటి వెళుతున్న ప్రతిసారీ ఆమె వేళ్ళు చప్పరించేది. వాడినీ అలా చప్పరించమని చెప్పేది. వాడికి నవ్వొచ్చేది. అయోనిజ అమెరికాలో ఉంటే చలికాలంలో ఏం చేస్తుంది? గ్లౌజులు తీసి ఒక్కోవేలూ చప్పరించి మళ్ళీ తొడుక్కుంటుందా? చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వింత ప్రవర్తనల్లో ఆమెను జయించడం ఎవరితరమూ కాదు.
వాడికి 22 ఏళ్ళు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. విశ్వవిద్యాలయం ఫెలోషిప్ ఇచ్చి జీతం ఇస్తుంది. ఇక్కడికి వచ్చినపుడు అన్నీ కొత్తగా వింతగా అనిపించేవి. మెల్లగా అలవాటుపడ్డాడు. శ్మశానం శ్మశానంలా కాకుండా ఖాళీ సమయాన్ని గడిపే పార్కులా అనిపించింది. సమాధుల మీద చెక్కిన వాక్యాలు చదువుకుంటూ నడవడం వాడికి చాలా ఇష్టం. ఒకసారి 12 ఏళ్ళ అమ్మాయి తన పుస్తకాల సంచీతో వచ్చి ఒక సమాధి ముందు కూర్చుని ఏడుస్తోంది. సమాధి గట్టుని ఒట్టి చేత్తో తుడిచి, తాను తెచ్చిని పూలగుత్తిని పెట్టి ఏదో జపం చేసింది. ఆ పాప మోకాళ్ళమీద కూర్చుని ఉన్న దృశ్యం వాడి మనసుకి బాధ కలిగించింది. అంత చిన్నతనంలోనే ఎంత పెద్ద కష్టమొచ్చిందో! తర్వాత కళ్ళు తుడుచుకుని సంచీ తీసుకుని వాణ్ణి దాటుకుని వెళ్ళిపోయింది. వాడు వంగి ఆ సమాధి మీదున్న వాక్యం చదివాడు: ‘ఓ ప్రభూ, నేను ఈ భారం మోయలేకున్నాను!’ చచ్చిపోయిన వ్యక్తి ఏ భారం గురించి చెప్తున్నాడో వాడికి అర్థంకాలేదు.
ఇంతకీ వాడి పేరు చెప్పనేలేదు. వాడి పేరు విమల్. విమల్ అద్దెకు తీసుకున్నది ఇల్లు కాదు; ఇంటిలోని ఒకే ఒక గదిని. ఆ కాంప్లెక్స్‌లో అన్ని ఇళ్ళూ ఒకేలా ఉన్నాయి. కిటికీ కర్టెన్‌ల రంగులే వేరు. ఆకుపచ్చ కర్టన్ వేసిన మూడో ఇంటిలో ఓ తల్లీ, బిడ్డా ఉన్నారన్నది గమనించాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అటూయిటూ వెళ్ళేప్పుడు విన్నాడు. ప్రతి వాక్యాన్నీ ఆమె పిల్లాడితో ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ మాటలాడుతుంటుంది. వీడికి ఇంగ్లీషు, అరవం మాత్రమే వచ్చు. ఓ రోజు ఆ ఇంటిలో ఆమె తనవైపుకు వయ్యారంగా నడిచి వచ్చి పలకరించింది. ఓ క్షణం అయోనిజే అనుకున్నాడు. అంత దగ్గర పోలికలున్నాయి. ఇదివరకు అంత దగ్గరగా చూడలేదు ఆమెను. గొప్ప అందగత్తె. ఇతనూ పలకరించి నమస్కరించినపుడు ఆమె జుట్టుని వెనక్కి సవరించుకుంది. జుట్టును ఒక్క చేత్తో లాఘవంగా ఆమె అలా వెనక్కి తోసుకున్న తీరు ఆమెలోని నాజూకుతనానికి ప్రతీక అనిపించింది. అయోనిజ కూడా అలానే నాజూకుగా ఉంటుంది.
ఆ రోజు రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. అయోనిజ జ్ఞాపకాలు సుళ్ళు తిరిగాయి. ఓ సారి అయోనిజ ఎడమచేయి పైకెత్తి కొప్పుకు పెట్టుకున్న క్లిప్ తీసింది. ఆమె చేసింది అదొక్కటే. ఉండ చుట్టిన జుట్టు జలపాతం కిందకు దూకినట్టు భుజాల మీద పడి కిందకు జారింది. అది వాడి మనసులో తీగల్ని మీటింది. వాడి ఒంటిని రెచ్చగొట్టింది. ఓ వేలితో జుట్టుని ఉంగరాలు తిప్పుతూ, చిన్ననవ్వు నవ్వుతూ కదలకుండా వాణ్ణే చూస్తూ నిల్చుంది. తరువాతి కదలిక అతనినుండి రావాలన్నట్టు చూస్తోంది. ఎక్కడ మొదలుపెట్టాలో వాడికి తెలియలేదు. విచ్చుకుంటున్న ఛాతీని ముందుకు తోస్తూ వెనక్కి ముడుచుకుపోతున్న ఆమె తెల్లని భుజాలను పట్టుకున్నాడు, మొదటి పేజీ చిరిగిపోయిన నవలను మొదలుపెట్టినట్టు. కరిగి కారిపోతున్న చాక్‌లెట్ వంటి పెదవులను చూశాడు. ఆ సాయంత్రం ముగిసేసరికి ఒకే ఒక ముద్దు మిగిలింది. దాన్నీ సరిసమానంగా పంచుకున్నారు.
తనుగా వచ్చి పరిచయం చేసుకున్న పక్కింటి ఆమె పేరు సుజాత. వాడికంటే ఒకటి రెండేళ్ళు పెద్దదై ఉంటుంది. ఆమె భర్త ఒక రోజు లెటర్ రాసిపెట్టి, అతనితో పనిచేసే అమ్మాయితో లేచిపోయి పక్క రాష్ట్రంలో కాపురం పెట్టుకున్నాడు. చాలా రోజులపాటు వస్తూ పోతూ అతని వస్తువులొక్కోటీ ఇక్కణ్ణుండి తీసుకెళ్ళిపోయాడు. సుజాతకి అది తెలియలేదు. ఒక్క రాత్రిలో ఆమె జీవితం అల్లకల్లోలం అయింది. ఆమె జీతంతోనే ఇంటి అద్దె, ఖర్చులూ అన్నీ సరిపెట్టుకోవాలి. పిల్లాడిని చూసుకోవాలి. ఈ వివరాలన్నీ తర్వాత ఆమె చెప్పగా తెలుసుకున్నాడు విమల్.
ఒకరోజు శ్మశానంలో నడిచి బయటకొస్తుంటే సుజాత శ్మశానం బయట విమల్ కోసం ఎదురుచూస్తూ నిల్చొని ఉంది. చేతిలో పిల్లవాడి చేయి. చక్కగా నవ్వుతూ, కుశలం అడిగింది. ఆమె పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి. నిగనిగలాడే పొడవైన జుట్టు చక్కగా గాలికెగురుతోంది. ఆమె ముఖంనుండి చూపు మరల్చుకోలేకపోయాడు విమల్.
“నాకో సాయం కావాలి.” విమల్‌కి ఆశ్చర్యం.
“సాయమా… నా దగ్గరా?” అన్నాడు.
ఇదివరకు ఆమె భర్త పొద్దునపూట బిడ్డ మిథున్‌ని డేకేర్‌లో విడిచిపెట్టి వెళ్ళేవాడు. ఆమె పనిచేసే ఫార్మసీ మరో దిక్కులో ఉండటంవల్ల, ఇప్పుడు పిల్లాణ్ణి డేకేర్‌లో తను దిగపెట్టి వెళ్తే గంట ఆలస్యం అవుతుంది.
“మీరు యూనివర్సిటీకి ఆ దారిలోనే వెళ్తారు కదా? నేను మరో ఏర్పాటు చేసుకునేవరకు మిథున్‌ని మీరు డేకేర్‌లో దిగపెట్టగలరా? సాయంత్రం నేను వచ్చేప్పుడు తీసుకొచ్చుకుంటాను.”
విమల్ అసలు ఊహించలేదు. వెంటనే ‘తప్పకుండా,’ అని ఒప్పేసుకున్నాడు. ఆమెకు ఓ సాయం చెయ్యగలుగుతున్నందుకు సంతోషంగా అనిపించింది. రెండేళ్ళ పిల్లవాడు మిథున్ అందరి పిల్లల్లా కాదు. చెప్పింది గమ్మున వింటాడు. అయితే, మాటలాడడు. వాడికి తెలిసింది మొత్తం రెండో మూడో మాటలే ఉంటాయన్నట్టు ఏం చెప్పినా ‘మ్మ మ్మ్ మ్మ్’ అనే జవాబిస్తాడు.
సరిగ్గా 7:10కి మిథున్‌ని తీసుకొచ్చి విమల్ గదిలో విడిచిపెట్టి, సుజాత వెళ్ళిపోతుంది. మిథున్ ఆ గదిలో కూర్చుని టీవి చూస్తుంటే విమల్ రెడీ అవుతాడు. 7:25కు బయలుదేరితే డేకేర్‌కు 7:55కు చేరుకుంటారు.
అమెరికన్స్‌కి నచ్చని రోజు బేస్తవారం అని ఒక రిసర్చ్ చెప్తుంది. విమల్‌కీ ఆ రోజు నచ్చదు. ప్రాజెక్ట్ సమర్పించడానికి గడువు దాటిందని వాణ్ణి ప్రొఫెసర్ హెచ్చరించారు. ముందు రోజు రాతలూ, రిఫరెన్సులూ ముగించి పడుకునేసరికి రాత్రి రెండయింది.
పొద్దున సుజాత వచ్చి తలుపు తట్టినప్పుడు గానీ లేవలేదు. ఆమె మిథున్‌ని వదిలి వెళ్ళిపోయింది. విమల్ గబగబా రెడీ అయ్యి, ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు, డ్రాయింగులు, పుస్తకాలు, లేప్‌టాప్ అన్నీ సర్దుకున్నాడు. బయట సన్నగా మంచు కురుస్తోంది. మిథున్ జాకెట్, చేతి గ్లౌసులు, స్కార్ఫ్ అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూశాడు. మిథున్ షూస్ తీసేసున్నాడు. తొడిగాడు. పిల్లాడి స్నాక్స్, నీళ్ళ సీసా, సంచి అన్నీ అందుకున్నాడు.
గరాజ్ షటర్ తీసి కారు బయటకు తీశాడు. వాడు బయలుదేరిన సమయానికి మంచుపోత కొంచం పెరిగింది. యూనివర్సిటీని ఆనుకుని పారే ఛాల్స్ నది గడ్డకట్టుకుపోయింది. వాడితో చదివే స్నేహితుడొకడు, ‘తాను వేసవిలో 22 మైళ్ళ దూరం ఆ నదిలో బోట్ నడుపుతాననీ, చలికాలంలో అదే 22 మైళ్ళ దూరాన్ని గడ్డకట్టిన నది మీద సైకిల్ తొక్కుతూ చేరుకుంటాననీ’ చెప్పాడు. ఈ విషయం అయోనిజకు రాస్తే… ఆమె ఏం చెప్తుంది? ముందుగా నేనసలు నమ్మను అని కళ్ళు ఎగరేస్తుంది. శ్మశానాన్ని దాటేప్పుడు వేళ్ళు చప్పరించకుంటే దయ్యం పట్టుకుంటుందని నమ్మే వ్యక్తి ఈ విషయం ఎందుకు నమ్మదు? అయోనిజ విమల్‌ని ద్వేషించలేదు, వద్దనుకోలేదు. ఆమె ప్రేమను వీడే వద్దనుకున్నాడు. ఆమె సుఖపడాలని, ఆమె మంచి కోరి బ్రేకప్ చేసుకున్నాడు. వాళ్ళింటిలో ఆమెకు కలిగిన సంబంధం చూశారు. పెద్ద ఉద్యోగంలో ఉన్న అబ్బాయి. అలాంటి జీవితాన్ని అయోనిజకు ఇవ్వడం విమల్ వల్ల ఎప్పటికీ కాదు.
రోడ్డు మీద కార్లు మెల్లగా పాకుతూ వెళ్తున్నాయి. వీడు కూడా ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ డేకేర్ చేరుకున్నాడు. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ డేకేర్‌లో ఎలాగంటే పిల్లల్ని మనం కార్నుండి దించనక్కర్లేదు. కార్ నడుపుతూ ఒకదాని వెనుక తమ టర్న్ వచ్చేవరకు ఆగాలి. టీచర్లే వచ్చి కార్ తలుపు తీసి, సీట్ బెల్ట్ విప్పి పిల్లల్ని, సరంజామానూ తీసుకుని వెళ్తారు.
విమల్ వంతు రాగానే సెంట్రల్ లాకింగ్ బటన్ నొక్కాడు. మంచుకు లెదర్ జాకెట్, స్కార్ఫ్ కట్టుకుని ఉన్న టీచర్ చేయూపి విమల్‌కు విష్ చేసి కారు తలుపు తీసింది. తీసిన మనిషి ఆశ్చర్యపోతూ నిల్చుని ఉండటం చూసిన విమల్ ఏంటన్నట్టు వెనక సీటుకేసి చూసి నివ్వెరబోయాడు. ఒళ్ళు చల్లబడిపోయింది. కంగారుపడుతూ దిగి వెనక్కు వెళ్ళి వెతికాడు. కారు కింద వంగి చూశాడు. బూట్స్ తెరచి చూశాడు. వాడికి నోట మాట రావట్లేదు. టీచర్ వాడిని ఆశ్చర్యంగా చూసింది. ఏం మాట్లాడకుండా గబగబా కారెక్కి ఇంటి వైపుకు తిప్పాడు.
విమల్‌కు చేతులు కాళ్ళు వణకసాగాయి. మిథున్ సంచి, స్సాక్స్, నీళ్ళ సీసా అన్నీ కారులోనే ఉన్నాయి. విమల్ లేప్‌టాప్, పుస్తకాల సంచీ, ఫైళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మిథున్ మాత్రం లేడు. ఏం జరిగింది? బిడ్డ ఎలా తప్పిపోయాడు? అన్నది వాడి బుర్రకు అందలేదు. బయలుదేరే తొందరలో బిడ్డను కారులో ఎక్కించడం మరిచిపోయాడా? వాడికి నమ్మబుద్ధి కాలేదు. కార్ గరాజ్ తలుపు మళ్ళీ బిగించాడా లేదా అన్నది కూడా గుర్తుకురావటంలేదు. ఒకవేళ పిల్లాడు నడుచుకుంటూ వెళ్ళి దారితప్పిపోయి మంచులో గడ్డ కట్టుకుపోతే? లేక మంచులో రోడ్డుమీద వెళ్ళే ఏ వాహనమైనా వాడిని గుద్దేస్తే… ఇలా వాడి ఆలోచనలు పలుపలు విధాలుగా సాగుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. మనసు తపించిపోతూ ఉంది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అప్పటికే మంచు రెండు అంగుళాలు కురిసింది. కారు నడపడం ప్రయాసలా అయిపోతోంది. వైపర్ ఆగిపోయింది. బయటకు వంగి చేత్తో విండ్‌షీల్డ్ తుడుచుకుంటూ నడపసాగేడు. పోలీసు కార్ ఒకటి సైరన్ మోతతో వాడిని దాటుకుని వెళ్ళింది. ఇంటి వైపుకెళ్ళే రోడ్డు రాగానే కారు వేగాన్ని తగ్గించుకుని అతి జాగ్రత్తగా నడిపాడు. మిథున్ ఒకవేళ వీధుల్లో తిరుగుతూ ఉండచ్చు అనుకున్నాడు. గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటోంది. రోడ్డు పక్కనున్న పాండ్ కూడా గడ్డకట్టుకుపోయివుంది.
అప్పుడనగా తన సెల్ ఫోను మోగింది. చూశాడు… ఫోన్ చేసింది సుజాతే. వాడు ఫోన్ తియ్యలేదు. తీస్తే ఏం చెప్పాలి? మూమూలుగా మిథున్‌ని డేకేర్‌లో దిగపెట్టాక సుజాతకి ఫోన్ చేసి విషయం చెప్పడం అలవాటు. అయితే ఈరోజు వాడు ఆమెకు ఫోన్ చెయ్యలేదు. అందుకే ఆమె ఫోన్ చేస్తుంది అనుకున్నాడు. మరో ఆలోచన కూడా వచ్చింది. ఒకవేళ డేకేర్‌వాళ్ళు సుజాతకి ఫోన్ చేశారా? మిథున్ కార్లో లేడన్న విషయం ఎవరైనా ఆమెకు చెప్పారా? ఇప్పుడు వాడికి వణుకు, గుండెదడ పెరిగాయి. గుండె పగిలిపోతుందా అనేంతలా కొట్టుకుంటోంది, ఛాతీపై కనపడేంతగా.
ఇల్లు చేరగానే గరాజ్ బటన్ నొక్కి షటర్ తీశాడు. ఏడుపులు, అరుపులతో మిథున్ పరుగుతీస్తూ బయటికొస్తాడని ఎదురుచూశాడు విమల్. ఎలాంటి చప్పుడూ లేదు. గాభరాగా అటూ ఇటూ వెతికాడు. ఓ మూలన మాసిన బేస్కెట్ బట్టలు చుట్టుకుని ముడుచుకుపోయి స్పృహ తప్పిపోయిన స్థితిలో మిథున్ పడున్నాడు. చేతి గ్లౌజులు, స్కార్ఫ్, జాకెట్ అన్నీ అలానే ఉన్నాయి. అయినప్పటికీ చలిలో గడ్డకట్టుకుని నీలిగిపోయివుంది పిల్లాడి దేహం. పిల్లాణ్ణి జవురుకుని హత్తుకున్నాడు. మిథున్ తల వాలిపోయింది. గదిలోకి తీసుకొచ్చి రూమ్ వార్మర్ ఆన్ చేసి, రగ్గులో చుట్టి పరుపు మీద పడుకోపెట్టాడు.
కొన్ని నిముషాల్లో పిల్లాడు కళ్ళు తెరిచాడు. పాలు కాచి గ్లాసులో పోసి వెచ్చగా తాగడానికి వాడి చేతికిచ్చాడు. పిల్లాడికి తాగడం చేతకాలేదు. ముక్కునీ, ముఖంలో సగాన్నీ గ్లాసులో దూర్చి వాడివల్ల అయినంత తాగాడు. తర్వాత విమల్‌ని చూసి ప్రేమగా నవ్వాడు. విమల్ మనసుని ఆ నవ్వు కదిలించింది. ఇన్ని రోజుల్లో వాడిని చూసి మిథున్ ఎప్పుడూ నవ్వలేదు. ఇదే తొలిసారి! ఆలస్యంగా డేకేర్‌లో దిగబెట్టి యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. జరిగినవేవీ సుజాతకు చెప్పలేదు.
మరుసటి రోజు ఎప్పటికంటే కాస్త తొందరగానే లేచి తయారైపోయాడు. సుజాత వస్తే ఏమడుగుతుంది? ఏం సమాధానం చెప్పాలి? ఎలా చెప్పాలి అని ఆలోచించి పెట్టుకున్నాడు. ఆ చలికి పిల్లవాడి ప్రాణం పోయుంటే, తనేం చేసుండేవాడు? తను హంతకుడు అయ్యుండేవాడు. మనసులో కలుక్కుమంది. అన్ని వస్తువులూ కారులో పెట్టి పిల్లవాణ్ణి కారులో ఎక్కించడం మరిచిపోయాడు. ఆమె ముఖం ఇక ఎలా చూడాలి? ఎన్ని రకాలుగా ఆలోచించినా, మనసుని సర్ది చెప్పుకున్నా వాడు చేసింది క్షమించరాని నేరం.
తలుపు తట్టిన సుజాత సంతోషంగా నవ్వుకుంటూ, తాళ్ళ వంతెన మీద నడుస్తున్నట్టు ఊగుతూ లోపలికొచ్చింది. ఎప్పుడూ లేనివిధంగా ఆమె సన్నటి చీర కట్టుకునుంది. దాని మీద స్వెట్టర్ తొడుక్కుని, బటన్స్ వేసుకోలేదు. మిథున్ పరిగెట్టుకుంటూ వచ్చి విమల్ కాళ్ళను చుట్టుకున్నాడు. సుజాత చేతిలో వెండి గిన్నె. ఘుమఘుమలాడే తీయటి వాసన. ఆ రోజు ఆమె మెరిసే బుగ్గలతో, సంతోషం తొణుకుతున్న ముఖంతో, సన్నగా పొడుగైన నడుముతో మరింత అందంగా ఉంది. అది బయటి అందం మాత్రమే కాదు. లోలోపలనుండి కూడా ప్రసరిస్తున్న అందం. వెండి గిన్నెను అతని ముందు చాచినపుడు క్లింగ్ క్లింగ్ మంటూ ఆమె చేతి గాజులు ముందుకు జరిగాయి.
ఆమె ముఖంకేసి చూడలేక, మంచం మీద కూర్చుని షూజ్ తొడుక్కున్నాడు. తర్వాత, అవి రెండూ ఒకే సైజా కాదా అని పరీక్షించేవాడిలా కళ్ళు పైకెత్తకుండా చూశాడు.
ఆమె చేతులతో అతని చుబుకం పట్టి తల పైకెత్తి “ఏంటి?” అంది. ఆమెకేసి చూసినప్పుడు గుండెలో చివుక్కుమంది. ఎలాగైనా తాను చేసిన పిచ్చిపనిని చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. అంత దగ్గరగా ఉన్న ఆమె ఒంటి పరిమళం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
“ఈ రోజు నా పుట్టిన రోజు. నాకోసం నేనే కేరట్ హల్వా వండుకున్నాను. ఇంత పెద్ద అమెరికాలో నాతోబాటు దీన్ని తినడానికి ఒక్కరూ లేరు!” అంది.
చందమామలా ఉన్న ఆమె ముఖం ఓ క్షణం నల్లబోయింది.
విమల్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
సుజాత వాడిని తదేకంగా చూస్తూ నిలబడింది. విమల్ స్పూన్‌తో హల్వా తీసి నోటిలో వేసుకుని “మీరింత రుచిగా వండుతారా!” అని కళ్ళు మూసుకుని మరీ ఆస్వాదించాడు ఆ హల్వాను.
ఆ మాటలు ఆమెకు మరింత సంతోషాన్ని కలిగించాయి. వాడు చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు.
సుజాత వెళ్ళిపోయాక మిథున్‌ని ఎత్తుకుని వెళ్ళి కార్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ బిగించాడు.
“ఏంట్రా… నేను నిన్న చేసిన పిచ్చి పనిని నువ్వు మీ అమ్మకు చెప్పలేదు?” అని కార్ నడుపుతూ అడిగాడు. మిథున్ దగ్గర్నుండి ఎటువంటి జవాబూ రాలేదు. విమల్ సీటుకు సరిగ్గా వెనకన పిల్లాడి సీటు ఉండటంవలన పిల్లాడిని చూడలేకపోయాడు. డేకేర్‌లో ఎవరూ కూడా సుజాతకి నిన్న జరిగిన సంఘటన గురించి చెప్పలేదు. కానీ విమల్ చెప్పుండాలి కదా? చెప్పకుండా ఉండటం తప్పుకదా? విమల్ మనసు పశ్చాత్తాపంతో నలిగిపోతోంది.
“ఏంట్రా మిథున్, నువ్వు, నువ్వేమంటావ్?” అనడిగాడు.
వాడు “మ్మ్ మ్మ్” అని మాత్రమే బదులిచ్చాడు.
ఇదంతా జరిగి దాదాపు ఎనిమిదేళ్ళు దాటిపోయాయి. ఇన్ని ఏళ్ళయినా సుజాతను ఒక క్షణమైనా మరిచిపోలేదు విమల్. ఎన్నోసార్లు ఆమెకు ఆ సంఘటన గురించి చెప్పాలనుకున్నాడు. కానీ, నవ్వుతూ కనిపించే ఆమె ముఖం చూసి ధైర్యం చెయ్యలేకపోయేవాడు.
ఆ రోజు మిథున్ పుట్టిన రోజు. శ్మశానం వైపు చూస్తూ ఆ ఇంటి వైపు నడుస్తున్నాడు విమల్. సుజాత, మిథున్ ఇంకా ఆ ఇంటిలోనే ఉన్నారు. విమల్ సొంతంగా పెద్ద ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయినా ప్రతి పుట్టినరోజుకూ తప్పక వస్తూనే ఉన్నాడు. బాస్టన్‌లో ఓ పెద్ద ఐటీ కంపెనీలో చేరి చాలా త్వరగా ఎదిగి పెద్ద పదవిలో ఉన్నాడిప్పుడు.
అప్పట్లో చదివిన సమాధి వాక్యం మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. ‘ఓ ప్రభూ, నేను ఈ భారం మోయలేకున్నాను!’ ఇప్పుడు ఆ వాక్యం అర్థం అవుతున్నట్టనిపించింది.
విమల్ ఆ ఇంటిలోకి అడుగుపెట్టినప్పుడు, ఇల్లు ఎనిమిదేళ్ళ క్రితం ఎలా ఉండేదో ఈ ఏడూ అలానే ఉంది. ఏ వస్తువూ మారలేదు. అదే పాత టి.వి. కార్పెట్ చిరిగిపోయి, దారాలు తేలిపోతూ అవసాన దశకు చేరుకుంటోంది. ఆకుపచ్చని కర్టెన్‌లు రంగుని పోగొట్టుకుని వెలిసిపోయున్నాయి. దారిద్ర్యరేఖకి కిందకు జారిపోకుండా ఉండటానికి సుజాత అష్టకష్టాలూ పడుతోందన్నది గ్రహించిన విమల్ మనసు బాధపడింది.
సుజాత వంటగదిలో ఉన్నట్టు తెలిసింది. మనసు తపించింది. అలల్లా ఎగిరే జుట్టు ముందుకేసుకున్న సుజాత తనవైపుకు నడిచొచ్చింది. అదే పొడవైన నడుము. ఆమె నవ్వినపుడు త్రికోణంలా బుగ్గల్లో ఎముకలు కనిపించాయి. ఉన్నట్టుండి ఊపిరితిత్తులను నింపేంత గాలి కూడా ఆ గదిలో లేదనిపించింది. మిథున్ పరుగున వచ్చి విమల్‌ని వాటేసుకున్నాడు. పదేళ్ళ పిల్లవాడి భుజాలను వాత్సల్యంతో తడుముతూ కుదుపుతూ దగ్గరకు హత్తుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. తను తెచ్చిన గిఫ్ట్ వాడి చేతికిచ్చాడు. విప్పి చూసి ‘ఐ-ప్యాడ్!’ అని గట్టిగా కేక వేశాడు. ‘నాకేనా?’ అని అడిగి తాళలేని సంతోషంతో డాన్స్ చేశాడు. గబగబా తల్లికి చూపించి, ఫ్రెండ్స్‌కి చెప్పడానికి బయటకు పరుగుతీశాడు.
సుజాత కాఫీ పట్టుకొచ్చింది. వాడి వేళ్ళు కప్పుని పట్టుకున్నాయని నిశ్చయించుకున్నాక, తన వేళ్ళు కాలిపోతున్నాయన్న భావనతో చేయి వెనక్కి తీసుకుంది. సగం కాఫీ తాగాక కప్పుని గమనించి చూసి ఓ క్షణం తడబడ్డాడు. ఆ కప్పుమీద ఓ ఫోటో ప్రింట్ వుంది. సుజాత, ఆమె భర్త, అప్పుడే పుట్టిన వాళ్ళ పిల్లవాడు మిథున్ ఉన్నారా ఫోటోలో. కప్పుని గభాలున టేబుల్ మీద పెట్టాడు. ఆ భర్తను చూడటానికి అసహ్యమేసింది. వాడు మాటలాడటానికి ఇలాంటొక సమయం కోసమే ఎదురుచూస్తున్నపుడు, ఉన్నట్టుండి సుజాత,
“మీరు గిఫ్టులివ్వడం ఇదే చివరిసారిగా ఉండనివ్వండి. మిథున్ ఎక్స్‌పెక్టేషన్‌ని పెంచకూడదు,” అంది.
“ఏంటి అలా అంటారు? నేను గిఫ్ట్ ఇవ్వడంలో మీకేంటి ఇబ్బంది? సంవత్సరానికి ఒక్కసారేగా నేను వాడిని చూస్తున్నాను?” అనడిగాడు.
“నేను కష్టాల్లో ఉన్నప్పుడు చాలానే చేశారు. మీరు చేసిన సాయం నేనెన్నటికీ మరిచిపోలేను. మీకు ప్రతిఫలంగా నేనేం చెయ్యగలను? మీరు ఇదివరకు చేసిందే చాలు.” అంది.
ఆమె గొంతులో ధ్వనిస్తున్న పరాయితనం కొత్తగా అనిపించింది. ఇలాంటి మాటలు ఆమెనోట వస్తాయని వాడు అనుకోలేదు. ఎన్ని రాత్రులు నిద్రలో ‘మిథున్… మిథున్’ అని ఉలిక్కిపడి లేచుంటాడు తను?
“మీరేం మాట్లాడుతున్నారు? ఈ ఒక్కరోజు కోసమే నేను సంవత్సరంలో 364 రోజులూ కాచుకుని చూస్తుంటాను. నాకు సాయంచేసినవారికి ఎవ్వరికీ నేను తిరిగి ఉపకారం చెయ్యలేదు. ఒన్‌వేలో ఆపోసిట్ డైరెక్షన్లో పరుగెడుతున్నాను. చేసిన ద్రోహానికి పశ్చాత్తాపపడుతూ రోజుల్ని గడుపుతున్నాను. ఏ ప్రాయశ్చిత్తం చేసినా నా భారాన్ని దించుకోడం వీలుకాదు. అంత భారం పెరిగిపోయింది. ఇదొక్కటే నా మనసుకు ఊరటనిచ్చేది.”
వాడు భావావేశానికి లోనై ఇలా మాటలాడటం ఆమె మునుపెప్పడూ ఎరగదు. వాడి కళ్ళు చెమ్మగిల్లాయి. గొంతు వణికింది. గూగుల్‌లో వాడి పేరు వెతికితే క్షణాల్లో వాడి అచీవ్‌మెంట్స్ పేజీలకొద్ది వస్తాయి. ఎన్నో దేశాల్లో ఎన్నో టీమ్స్, ఎందరో అధికారులను గైడ్ చేసేవాడు తలవంచుకుని కళ్ళనీళ్ళతో తన ముందు నిల్చుని ఉండటాన్ని ఆశ్చర్యచకితురాలై చూస్తూ ఉండిపోయింది.
“మీరెంతో పెద్ద పదవిలో ఉన్నారు. ఏంటిది చిన్న పిల్లాడిలా?” అని అంది.
“ఇంతకాలంగా మీ విలువ తెలియలేదు నాకు. అమెరికన్ పెన్నీ విలువ ఒక సెంటు. దాన్ని కరిగిస్తే రెండు సెంట్లు. మీరు అమెరికన్ పెన్నీ!” అన్నాడు.
ఆమెకు అర్థం కాక, “మీరేం చెప్తున్నారూ?” అని అడిగింది.
“మిథున్‌ని చూసుకునే బాధ్యత ఇకపై నాది. ఈరోజూ నిన్నా అనుకుని ఈ నిర్ణయం తీసుకోలేదు నేను. ఎన్నో నెలలుగా దీని గురించే ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని నా జీవిత కాలం మరిచిపోలేను. కాబట్టి నా జీవితాన్ని మీతోనే గడపాలనుకుంటున్నాను. మీకు సమ్మతమేనా?” అని అడిగాడు.
వినగానే విభ్రాంతి చెంది మాటరాక ఉండిపోయింది. మెల్లగా ఆమె పెదవులు కదిలినపుడు, ఆమె ఏదో చెప్తోందన్నది గ్రహించాడు. ఆమె జవాబు కిందున్న వాటిల్లో ఒకటి అయుంటుందనుకున్నాడు.
1) అవును.
2) లేదు.
3) మీకు పిచ్చిగానీ పట్టిందా?
4) కాస్త సమయం కావాలి.
5) మిథున్‌కి సమ్మతమైతే నాకు సమ్మతమే.
అయితే, ఆమె జవాబు పైన ఉన్నవాటిల్లో ఏదీ కాదు.
మూలం: బారం
రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్‌గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్‌గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలూ, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.