ప్రతి రోజూ ఐదు నిముషాలు ఆలస్యంగా వచ్చే సోమబాలాకి ముప్పై ఏళ్ళు దాటివుండవు. మనిషి ఆరుడుగుల పొడవుంటాడు. చేవదేరిన అడుగుమాను దుంగలను సునాయాసంగా భుజాల మీదకెత్తుకుని గాల్లోకి విసిరెయ్యడం చూశాను. అలా ఎత్తుకునేప్పుడు నిక్కపొడుచుకునే వాడి కండరాలు భుజాన్ని చీల్చుకుని బయటకొచ్చేస్తాయేమో అన్నంత భయంకరంగా ఉంటాయి. తన చేతిలో ఉన్న కార్డ్ చాచిపట్టుకొని ప్రస్తుతం చేతులు కట్టుకుని నా ముందు నిల్చున్నాడు. నా ముందు ఎప్పుడూ కుర్చీలో కూర్చోడు. ఐదు నిముషాలు ఆలస్యంగా వచ్చినందుకు కార్డ్ మీద ఇన్-టైమ్ ఎర్ర అక్షరాలతో అచ్చయ్యి ఉంది.
వెయ్యిమంది కార్మికులు పనిచేసే ఈ ఫ్యాక్టరీలో ఆరు నెల్ల క్రితమే టైమ్ స్టాంప్ మెషిన్‌లు రెంటిని పెట్టారు. కార్మికులు రాగానే ముందు కార్డ్ మెషీన్‌లో పెడితే అది ఇన్-టైమ్ స్టాంప్ వేస్తుంది. అలానే వెళ్ళేముందూ చేయాలి. ఐదు నిముషాలు ఆలస్యం అయితే పదిహేను నిముషాల కూలి కత్తిరించబడుతుంది. పది నిముషాలు ఆలస్యం అయితే అర్ధగంట కూలి, అర్ధగంట ఆలస్యం అయితే రెండు గంటల కూలి. ఒక గంట ఆలస్యంగా వస్తే కార్మికుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు.
సోమబాలా రోజూ ఆలస్యంగా వస్తున్నాడు కాబట్టి నా దగ్గరకొచ్చాడు. ఈ ఫ్యాక్టరీ కొలంబోనుండి 125 కిలోమీటర్ల దూరాన ఉండే గింతోట అన్నచోట ఉంది. నూటికి నూరుపాళ్ళు సింహళులు ఉండే ప్రాంతం అది. అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళలో నేనొక్కణ్ణే తమిళుణ్ణి. వంద సింహళ పదాలకు మించి నాకు మాట్లాడటం చేతకాదు. నేను చెప్పదలచుకున్నదేదైనా నా ఈ వంద పదాల పదజ్ఞానంతోనే వ్యక్తపరచాలి.
“అసలు నీ సమస్యేంటి? నువ్వు ఆలస్యంగా రావడంవల్లేగా కూలీ కత్తిరించుకుంటున్నారు? ఇంటినుండి ఐదునిముషాలు ముందు బయల్దేరచ్చు కదా?” అనడిగాను.
సోమబాలా తలవంచుకునే ఉన్నాడు. ఏదో చెప్పదలచుకున్నాడు. వాడివల్ల కాలేదు. అంత బలశాలి అయిన ఒకడు నా ముందు ఇలా తలవంచుకుని నిల్చోవడం నాకే ఇబ్బందిగా అనిపించింది. ‘సరే వెళ్ళు’ అనగానే వెళ్ళిపోయాడు. మరో కార్మికుడు మెడ వంచుకుని తల మాత్రం లేపి చూశాడు. కొలిమిలో కొట్టి సాగదీసినట్టు పొడవుగా ఉన్నాదు. ఎంట్రీ కార్డు చేతబట్టుకుని లోపలికొచ్చాడు.
ప్రభుత్వం నడిపే ఈ ప్లయ్‌వుడ్ కంపెనీ ఇరవై ఏళ్ళుగా నడుస్తోంది. రోజూ పెద్ద పెద్ద లారీల్లో చెట్లు కొట్టేవాళ్ళు వాళ్ళు నరికిన అడవి మానుల దుంగలు తెచ్చి పేర్చిపోతారు. ఆ ప్రాంతమంతా కర్ర వాసన కమ్ముకుని ఉంటుంది. బ్రహ్మాండమైన మెషిన్‌లలోకి కన్వేయర్ల మీద ఇటునుండి వెళ్ళే దుంగలు పలుచని రేకుల్లా అటువైపు వచ్చిపడుతుంటాయి. ఈ రేకులను అడ్డంగా, నిలువుగా పేర్చి 3, 5, 7, 9 అని అంటించి, వొత్తి పలురకాల మందంతో పలకలు తయారు చేస్తారు. అవి నున్నగానూ తేలికగానూ ఉంటాయి. అయితే మామూలు కర్ర పలకలకంటే గట్టిగా ఉంటాయి. కాబట్టి వీటి వ్యాపారం కూడా అమోఘంగానే జరుగుతోంది.
ఫ్యాక్టరీలో పనిచేసే పనివాళ్ళలో అందరికంటే ఎక్కువ చదువుకున్నవాడు సోమబాలా. అయితే వాడు మెషిన్‌ల దగ్గర పని చెయ్యడు. దుంగలను గ్రేడింగ్ చేసే విభాగంలోనో, మెషిన్‌లోకి పంపించే సెక్షన్‌లోనో లేడు. రేకులను పేర్చి అంటించే సెక్షన్‌లోనో పాలీష్ చేసే సెక్షన్‌లోనో కూడా వాడు పని చేయడు. కలప పొట్టునూ చెత్తనూ ఊడ్చే పనో, లారీలు దుంగలను కుప్ప పోసే చోట శుభ్రం చేసే పనో చేస్తుంటాడు. వాడు కేవలం మానులను చూసే వందలాది వృక్షాలను గుర్తుబట్టగలడు. ఏ మాను దేనికి పనికొస్తుంది, వాటి బలం, ప్రత్యేకతలు, చరిత్ర–ఇవి వాడికి వెన్నతో పెట్టిన విద్య. వడ్రంగిపనిలో నైపుణ్యం ఉన్నవాడు. వాడి కులవృత్తి అది. అయినప్పటికీ ఈ ఫ్యాక్టరీలో అందరి వేళాకోళాలనూ భరిస్తూ కిందస్థాయి పనివాడుగా పనిచేస్తున్నాడు.
ఒకరోజు సోమబాలా అర్ధగంట ఆలస్యంగా వచ్చినందుకు అతని మేనేజర్ ఛండాలంగా తిట్టాడు.
“ఆలస్యంగా వచ్చినందుగ్గాను నీ జీతమెలానూ పట్టుకుంటున్నారు. నిన్ను అలా తిట్టడం దేనికి?” అని అడిగాను.
“నేను కిన్నర కులంవాడిని. అంటే తక్కువ కులం. మమ్మల్ని అలానే తిడతారు.” అన్నాడు.
“నీకు అలవాటైపోయిందా?” అనడిగాను.
నా చెవి దగ్గరకొచ్చి “ఫ్యాక్టరీ పెద్ద మేనేజర్‌ది ఏం కులమో తెలుసా?” అనడిగాడు.
“తెలియదు.” అన్నాను.
“దేవ కులం.”
“అంటే?”
“పూర్వకాలంలో రాజులందరూ దేవ కులస్తులే. కాబట్టి పై జాతి,” అన్నాడు. తల అటూ ఇటూ తిప్పి చూసి మెల్లగా “మీకో విషయం తెలుసా? మన జనరల్ మేనేజరు ఒక సింహాసనం చేయిస్తున్నారు,” అన్నాడు.
“సింహాసనమా! దేనికి?”
“కూర్చోడానికే!”
“జనరల్ మేనేజర్‌గారికి ఆయన పూర్వీకులు కూర్చున్నట్టు సింహాసనంలో కూర్చోవాలని మనసులో కోరిక పుట్టినట్టుంది. అడవులనుండి వచ్చి దిగే కర్రల్లో యోగ్యమైనవాటిని ఎంచుకుని మంచి సింహాసనం చెయ్యమని ఆర్డర్ వేశాడు. దానికి నియమించబడ్డవాడు అసమర్థుడు, అబద్ధాలకోరు. పండి రాలిన గుమ్మడికాయ నెత్తిన పడిందని జంకకుండా చెప్పే రకం. వాడికి వడ్రంగి పనీ తెలీదు, శిల్పాలు చెక్కడమూ రాదు. ఎన్నో విలువైన కర్రలను పాడు చేశాడు. సింహాసనపు కోళ్ళు సింహం కాళ్ళలా ఉండాలన్నారు జనరల్ మేనేజరు. వీడికి గాడిద కాళ్ళు చెక్కడం కూడా రాదు.”
“జనరల్ మేనేజర్ కోసం ఒకటి రెండు కర్రలు వృధా అయితే ఫ్యాక్టరీకి పెద్ద నష్టమొచ్చేస్తుందా ఏంటి?”
“మీరే ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు పాడు చేస్తున్నది మామూలు మానులు కాదు. చాలా విలువైనవి, అరుదైనవి. ఈ దేశాన్ని మునుపు పాలించిన ఆంగ్లేయులు కదుబెరియ మానులను వందలాది నౌకల్లో ఇంగ్లాండుకు తీసుకెళ్ళిపోయారు. వందేళ్ళు చేవదేరిన కదుబెరియ చెట్లను వాళ్ళు నరికినప్పుడు, కొత్త చెట్లేమీ నాటలేదు. ఇంగ్లాండులో ఆ మానులతో చేసిన బల్లలమీద, కుర్చీలమీద కూర్చుని భోజనాలు చేస్తున్నారు. అలాంటి మానులు వాళ్ళకు మరెక్కడా దొరకవు. అంత నున్నగా బలంగా ఉంటాయి. మెరుగుపెట్టిస్తే ముఖం చూసుకోవచ్చు. అలా మెరుస్తాయి. వాళ్ళు నాశనం చేసింది చాలదన్నట్టు పని రానివాళ్ళు కూడా నాశనం చేస్తున్నారు. కళానైపుణ్యం ఏ కోశానా లేనివాళ్ళు చెట్లు నరికే పని చెయ్యొచ్చు గానీ, కర్ర వస్తువులు చెయ్యకూడదు. తలలో ఏదైనా ఉంటేనే కాదా అది కర్రమీద కళగా మారేది?”
సోమబాలా ఇంతలా కోప్పడటం నేనెప్పుడూ చూడలేదు.
“సింహాసనానికి ఏ కర్రయితే ఉచితం అని నిన్నడిగితే నువ్వు ఏం చెప్తావు?“
“మునుపొక తెల్లదొర గవర్నర్‌గా ఉండేవాడు. వాడి పేరు సర్ రాబర్ట్ బ్రౌన్రిక్. వాడు కాలమందర్ మానులను కబళించి ఇంగ్లాండుకు తీసుకెళ్ళాడట. వాడి ఇంటికి తలుపులు కూడా ఆ కర్రలతోనే చేయించాడట. ఇప్పుడు జరుగుతున్నది అంతకంటే రోతగా ఉంది. ఇక్కడ చెక్క తరుగు, పొట్టు ఊడ్చే పని చేస్తున్నవాడినే అయినప్పటికీ నేను ఈ దుర్మార్గాలను చూసి ఓర్చుకోలేకపోతున్నాను.”
నేనడిగిన ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పనేలేదు వాడు.
“చెట్లమీద ఇంత ప్రాణం పెట్టుకున్న నువ్వెలా ఈ వృత్తిలోకి వచ్చావు?”
“ఇంకేముంటుంది? మానులమీదున్న ప్రేమవల్లే. ఇలా ప్రతి రోజూ మానులతో గడపగలుగుతున్నాను. వాటి చరిత్రని చదువుతున్నాను. ఎన్ని రకాలు! 60 అడుగులు 70 అడుగులు పొడవున్న మానులు. 20 అడుగుల చుట్టుకొలతున్న మానులు. వందలేళ్ళు జీవించిన మానులు. అయితే వీటిని నాశనం చెయ్యడాన్ని చూస్తూ సహించలేకున్నాను. ఈ వృత్తి నాకు సరైనది కాదు. మీరేమనుకుంటారు?”
“నువ్వు చాలా ప్రశ్నలడుగుతావు.”
“ప్రశ్నలే ప్రధానం. జవాబులు కావు. ప్రపంచం ప్రగతి గతిలో సాగేది ప్రశ్నల వల్లే. ఇలాంటివి చూస్తూ ఊరుకోలేను.”
“మరేం చెయ్యగలవు?”
“నాకు చెట్లను నాశనం చేసి దానిలో దొరికే డబ్బుతో బతకాలని లేదు. ఎప్పుడో ఒకరోజు ఈ ఉద్యోగం వదిలేస్తాను.” అంటూ పనిలోకి వెళ్ళాడు.
నా టైపు మెషిన్‌లో యూ, కే, ఎక్స్ అక్షరాలు కొట్టినప్పుడు పేపర్‌కి అంటుకుంటాయి. ప్రతిసారీ వేలితో అక్షరం అచ్చును లాగి వదలాలి. ఆ అక్షరాలు రాని వాక్యాలను సృష్టించుకుని టైప్ చేసుకుంటూ ఉన్నాను. పని కొలిక్కివచ్చిన సమయాన గడపలో నీడగా కదలిక. తలెత్తి సోమబాలాని చూసి నివ్వెరబోయాను. ముఖము, జుట్టు, చేతులు, కాళ్ళు అంతా కర్ర ధూళితో కప్పుకుపోయుంది. నడుస్తున్న కర్రలా ఉన్నాడు. అడ్డంగా కోసిన ఒక పలక నెత్తిన పెట్టుకునున్నాడు. గుండ్రటి ఆ పలక అంచులను చేతులు చాచినా అందుకోలేము. దాని చుట్టుకొలత ఎంత కాదనుకున్నా ఇరవై అడుగులుండచ్చు. బిగసిన వాడి భుజాల కండరాలను చూస్తేనే తెలుస్తోంది ఆ పలక ఎంత బరువుగా ఉందోనని! దాన్ని జాగ్రత్తగా నేల మీద దించి పెట్టేసి, “ఇదేం మానో తెలుసా?” అన్నాడు.
“తెలియదు.” అన్నాను.
“బేయోబాబ్స్. సింహళంలోనూ అరవలోను దీన్ని పెరుక్కా మాను అంటాము. వేలాది సంవత్సరాల క్రితం ఈ చెట్టు ఆఫ్రికానుండి వచ్చింది. కాండం మీద ఈ రింగులు ఎంచి చూస్తే దాని వయసెంతో తెలుస్తుంది. దీని వయసెంతో తెలుసా? 400 సంవత్సరాలు. నాలుగు వందల సంవత్సరాల చెట్టుని నరికేశారు. ఇలాంటి మాను మనకు ఇంకొకటి కావాలంటే మనం నాలుగు వందల సంవత్సరాలు ఎదురు చూడాలి. ఇదిగోండి, ఈ నడిమధ్యన ఉంది చూశారూ? ఈ చుక్కే ఇది మొలిచిన కాలం. రాజా విమలధర్మ సూర్యా పరిపాలించిన కాలం. 400 ఏళ్ళ క్రితం కండిని పరిపాలించినవాడు. క్రైస్తవ మతం నుండి భౌద్ధమతానికి మారినవాడు. పెద్ద సైన్యంతో వచ్చిన పోర్చుగీసులను తన చిన్న సైన్యంతో అతి చాతుర్యంగా ధ్వంసం చేసినవాడు. వాడి కాలంలో పుట్టిన చెట్టిది. ఇదిగోండి ఈ వలయం దగ్గర లంకాపురి చివరి రాజు సిఱివిక్రమ్‌రాజసింగెను బ్రిటీష్‌వారు వేలూరు చెరశాలకు తీసుకెళ్ళి బంధించారు. ఈ వలయం దగ్గర శ్రీలంకకు స్వాతంత్రం వచ్చింది…” ఇలా చెప్పుకుంటూ పోయాడు.
“అంత కచ్చితంగా చెప్పగలవా?”
“చెప్పగలను. అంతేకాదు. ఈ చెట్టు చాలా అరుదైన వృక్షం. ప్రభుత్వం చివరిగా తీసుకున్న లెక్కల ప్రకారం, ఈ దేశంలో ఇవి కేవలం 40 చెట్లే ఉన్నాయి. దాన్లో ఒకదాన్నిప్పుడు నరికేశారు. నాకు చాలా బాధగా ఉంది. చెట్లను నరికి దానితో వచ్చే డబ్బుతో పొట్టపోసుకోవడం సిగ్గేస్తుంది. నేను ఈ ఉద్యోగం మానేస్తాను.”
“నువ్వు ఉద్యోగం మానేయలేవు. నీకు మానులమీదున్న అపేక్ష నిన్ను వదిలివెళ్ళనివ్వదు. వాటి సాంగత్యం కావాలి నీకు.” అన్నాను.
మళ్ళీ కొన్నాళ్ళకు సోమబాలా కనిపించకపోయేసరికి వాడు చెప్పినట్టు ఉద్యోగం మానేశాడనుకున్నాను. అయితే ఒక రోజు పొద్దున కార్డ్ పట్టుకుని నా ముందు నిలబడ్డాడు.
“ఏంటి? మళ్ళీనా?” అని ముఖం చిట్లించాను.
వాడికి కోపం వచ్చేసింది. వాడెప్పుడూ అలా మాట్లాడిందెరుగను. “నేనేమైనా చిన్నపిల్లాడ్నా? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడంవల్ల ప్రయోజనమేముంది? నాకు తెలుసు నేనెందుకు ఆలస్యంగా వస్తున్నానో. మా ఇంట్లో ఉన్నది నేనూ, మా నాన్న మాత్రమే. నేను ఇంట్లో లేనప్పుడు ఆయన బయటకెళ్ళి తిరిగొచ్చే దారి మరిచిపోయి తప్పిపోతుంటారు. ఆయనకి మతిమరుపు వ్యాధి. మాకు మరెవరి సహాయము లేదు. నేను పొద్దున ఆయనకి స్నానం చేయించి, తినిపించి పడుకోబెట్టి, మోకాలికి ముద్దుపెట్టి, మంచంతోబాటు ఆయన్ని తాడుతో కట్టేసి ఉద్యోగానికి వస్తాను. ఈ పనుల వల్ల కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. సాయంత్రం వెళ్ళి ఆయన కట్లిప్పి వదిలిపెడతాను. మళ్ళీ ఆయనకి స్నానం చేయించి, తినిపించి, మోకాలికి ముద్దుపెట్టి నిద్రపుచ్చుతాను. నేను ఆలస్యంగా వస్తే నా జీతంలో కొంచం పట్టుకుంటారు. దీనివల్ల వచ్చే నష్టమేంటి? నేనేమైనా మెషిన్ నడుపుతున్నానా? ఊడ్చి శుభ్రంచేసే పనేగా? ఆలస్యంగా వచ్చినా పని అవుతోందిగా?”
అప్పుడనగా ప్రియాంక లోపలికి వచ్చింది. జనరల్ మేనేజర్ సెక్రెటరీ. ఇక్కడ పనిచేసే ఏకైక మహిళ. ఆమె ధరించిన వస్త్రం పూర్వకాలపు రాణుల వస్త్రంలాగా కాళ్ళకిందదాకా పొడవుగా నేలమీద జీరాడుతుండటంవల్ల అడుసులో నడుస్తున్నట్టు ఒక్కో అడుగు పైకి ఎత్తిపెట్టి నేలని గట్టిగా తొక్కుతున్నట్టు నడుస్తోంది. నేనెంతో శ్రమపడి టైపు చేసిన ఒక కాగితం తిరిగిచ్చింది. ‘యూ’నో లేక ‘కే’నో సరిగ్గా టైపవ్వలేదని మేనేజర్ చెప్పుంటారు.
“టైపురైటర్ పాతదయిపోయింది, సర్వీస్ చేయించాలి.” అన్నాను.
ఆమె దానికి ఏమీ మాట్లాడకుండా, కళ్ళు పైకి ఎగరేసి, నాటకీయంగా చూసి వెళ్ళిపోయింది.
నేను సోమబాలాతో “ఈ అమ్మాయిని నీ వెంట తీసుకెళ్ళు. ఆమె వేసుకున్న గౌను నువ్వు ఊడవవలసినదంతా ఊడ్చేస్తుంది!” అన్నాను.
సోమబాలా పొట్ట పట్టుకుని మరీ పడిపడి నవ్వాడు. నవ్వేప్పుడు కూడా వాడి కండలు తిరిగిన భుజాలు పొడుచుకునే ఉన్నాయి.
గది సంతోషంతో నిండిపోయాక అడిగాను, “నీకు సాయం చేసేందుకు ఎవరూ లేరా?”
“నేనెందుకు మరొకరి దగ్గర సాయం అడగాలి? ఇది నా బాధ్యత కదా? చెట్టుకు మధ్య భాగమే బలం. గట్టిబడి ఉక్కులా ఉంటుంది. ఆ చెట్టులో మొట్టమొదటి భాగమూ అదే. అయితే చెట్టుకి కావలసిన ఆహారాన్ని సరఫరా చెయ్యడం ఆ భాగంవల్ల కాదు. చెట్టుయొక్క తాట భాగమే ఆహారాన్నీ నీటినీ సరఫరా చేస్తుంది. ఆ భాగం లేతది, వయసులో చిన్నది. మనుషులూ అంతే. పెద్దలు కుటుంబానికి బలం. కొత్తతరం వాళ్ళే సంపాదనలవీ చూసుకోవాలి.”
ఆ తర్వాత వాడు రాత్రి షిఫ్టుకు మారినట్టు తెలిసింది. తర్వాత వాడిని కలిసే సందర్భమే రాలేదు. ఒక రోజు రాత్రివేళ లారీలో వచ్చిన దుంగలు కట్లు తెగి దొర్లిపోసాగాయట. ఆ చోటు వాలుగా ఉండటంతో అవి వేగంగా దొర్లుకుంటూ వెళ్ళడం సోమబాలా చూశాడు. అక్కడ పనిచేస్తున్నవారి మీదకి వెళ్ళుంటే కచ్చితంగా ఒకరిద్దరి ప్రాణాలు పోయేవి. సోమబాలా ఒక్క ఉదుటున దూకి ఓ పెద్ద దుంగను నిలువుగా విసిరేసి దొర్లుతున్న దుంగల్ని ఆపి ప్రమాదం జరగకుండా రక్షించాడు. మరుసటి రోజు ఫ్యాక్టరీ అంతా అదే వార్త.
ఫ్యాక్టరీలో ప్రతి ఏడూ జరిగే వార్షికోత్సవాలలో గుర్తింపు బహుమతి ఈ ఏడు వాడికే వస్తుంది అని మాట్లాడుకున్నారంతా. నేనూ అలానే అనుకున్నాను, మనుషుల ప్రాణాలను కాపాడాడు అని. అయితే ఎటువంటి బహుమతీ ఇవ్వలేదు, గుర్తించనూలేదు. జనరల్ మేనేజర్ అన్నారని బయట జనం చెప్పుకున్న పుకారేంటంటే ‘వాడికి బహుమతి ఇవ్వడంకంటే ఒక తమిళుడికి ఇవ్వచ్చు!’ అని.
“నిన్ను గుర్తించి నీకు బహుమతిస్తారని నువ్వు ఎదురు చూశావా?” అని అడిగాను.
వాడన్నాడు, “దుంగలు దొర్లగానే నేను పరుగున వెళ్ళి ఆపాను. ఏ ఆపదా జరగకూడదని. అప్పుడు బహుమతి వస్తుందా రాదా అనేం ఆలోచించలేదు. ఎవరికి ఏది రాసిపెట్టుందో అదే జరుగుతుంది.”
నేనేం మాట్లాడలేదు.
“నేను ఉద్యోగం మానేస్తున్నాను.” అన్నాడు.
నేనేం చెప్పలేక అక్కడనుండి వెళ్ళిపోయాను.
సోమబాలా ఉద్యోగమేమీ మానలేదు. రెండు వారాల తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. నా పెట్టె సర్దుకుని బస్ కోసం వెళ్తుంటే, సగం దారిలో సోమబాలాని ఒకసారి కలవాలనిపించింది. వాడు నైట్ షిఫ్ట్‌లో ఉన్నాడు. ఫ్యాక్టరీ రాత్రి వేళలో వేరేలా కనిపించింది నాకు. గుమ్మం దగ్గర రెండు పెద్ద టైమ్ పంచింగ్ మెషిన్‌లు. పొద్దున వేళైతే ఆ మెషిన్‌ల ముందు పెద్ద వరుసల్లో కార్మికులు నిల్చున్న దృశ్యం గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు అక్కడ ఒక్కరూ లేరు.
సోమబాలాని వెతుక్కుంటూ వెళ్ళాను. వాడు మామూలుగా ఉండేచోట లేడు. మెషిన్‌లు చెవులకు తూట్లుపెట్టేంత శబ్దం చేస్తున్నాయి. తలెత్తి నన్ను చూసి మళ్ళీ పనిలో పడిపోయాడు.
“నువ్వు మామూలుగా ఉండేచోట వెతికాను.”
తల పైకెత్తకుండానే జవాబు చెప్పాడు. “ఎన్నో నెలల సమయాన్నీ, అపురూపమైన మానులనూ వృధా చేసేశారు. ఇప్పటికి ఆ పని నాకిచ్చారు. ఒకప్పుడు కండిని పాలించిన రాజులు తమ రాజభవనాల్ని అలంకరించడానికి వాడుకున్నది ఈ కర్రనే. దీని పేరు హూలన్‌హిక్. ఇది ఎలానో తెల్లోళ్ళ దృష్టినుండి తప్పించుకుంది. ఈ కర్రనుండి వచ్చే సునాసన సౌధమంతా నిండిపోయేదట. నలుపన్నది రంగే కాదంటారు శాస్త్రవేత్తలు. మెరుగు పెట్టినకొద్దీ దీని వన్నె పెరుగుతూ ఉంటుంది. దీనిలా మెరిసే నల్లటి మాను ప్రపంచంలో మరోటి లేదు!”
కుర్చీ చేతులపై నోరు తెరచిన రెండు సింహాలు తద్రూపంగా చెక్కబడున్నాయి. కాళ్ళు ఉరకడానికి సిద్ధంగా ఉన్న సింహపు కాళ్ళలానే ఉన్నాయి. పాపాయిని హత్తుకున్నంత లాఘవంగా చేయిపిడికి మెరుగు పెడుతున్నాడు. నునుపు దేరుతూ నల్లగా మెరుస్తోంది. వాడు పనిలో నిమగ్నమైపోయున్నాడు. కళల్లో పడితే అన్నీ మరచిపోతారు కాబోలు!
“ఇటువంటి చారలు మరే మానులోనూ చూడలేము. ఈ మానుకు మాత్రమే ఇలాంటి క్రమమైన చారలిచ్చే కణాలుంటాయి. అందుకే దీన్ని కర్రలకల్లా రాజు అంటారు.”
“సింహాసనం చేస్తున్నావా?” మాటలు పొడిగించాలన్నట్టు.
ఎక్కడా కేంద్రీకరించని చూపు చూడటం వాడికి అలవాటయినట్టుంది. “నేను కూర్చోటానికి ఒక ఆసనం చేస్తున్నాను. ఒక రాజు కూర్చుంటే మాత్రమే అది సింహాసనం అవుతుంది.”
“నేను ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. నీతో చెప్పివెళ్దాం అని వచ్చాను.”
వాడేం మాట్లాడలేదు. శ్రద్దగా మెరుగు పెడుతున్నాడు. వాడి బుర్రలో ఏదో మెదలింది. అయితే దాన్ని చెప్పలేకపోతున్నాడు. వాడికి రావాల్సిన జీతాన్ని ఎడాపెడా కోసినవాడితో ఏంటి మాట్లాడేది అని వాడు అనుకుని ఉండచ్చు.
నేను కొలంబో వెళ్ళే చివరి బస్ ఎక్కి కూర్చున్నాను. మూడు గంటల ప్రయాణం. ఒక ముసలాయన మంచానికి కట్టబడి ఉన్న దృశ్యం కళ్ళముందు కదిలింది. ఆరవ జార్జ్ రాజు కూర్చోడానికి యోగ్యమైన నున్నని సింహాసనం తయారుచెయ్యబడుతున్న దృశ్యం కూడా కళ్ళముందు కదిలింది. తర్వాత ఎర్ర ఇంకుతో అచ్చువేయబడిన అట్టలను చేతబట్టుకుని వరుసగా కార్మికులు నిల్చున్న దృశ్యం. బస్సు తనదారిని తానే వెలుగు పరచుకుంటూ చీకటికేసి కాంతిరేఖలా పరుగుతీస్తోంది. ఎప్పుడోగాని దొరకని నడిజాము మెలుకువ ఘడియలు, తన తండ్రికంటే చెట్ల మానులను ఎక్కువగా ఆరాధించే ఒకణ్ణి గురించి ఆలోచించడంలో గడిచాయి.
[మూలం: ‘సిమ్మాసనం’. ఆట్టుప్పాల్ పుట్టు(2017) (మేకపాల పుట్టు) అన్న కథల సంపుటినుండి.]
రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.