ఐదు కాళ్ళ మనిషి

సూపర్ మార్కెట్ బయటున్న ఆ విశాలప్రదేశంలో ఉన్న బెంచీల్లో ఒకదానిమీద ఓ చివర కూర్చుని ఉన్నాను. ఇంతలో జానిటర్ యూనిఫామ్ వేసుకున్న ఒకామె వచ్చి ఆ బెంచీమీదే మరో చివర నిస్త్రాణగా కూలబడింది. ఆమె కూర్చున్న తీరుకు చేతిలో ఉన్న డిస్పోజబుల్ కప్పులోని కాఫీ కాస్త తొణికేవుంటుంది. ఆమె అక్కడ ఒక హౌస్ కీపరని, చేస్తూవున్న పనిని పక్కన పెట్టేసి వచ్చిందనీ చూడగానే చెప్పేయొచ్చు. వయసు యాభైకి పైనే ఉంటుంది. నల్లని జుట్టు, నీలిరంగు కళ్ళు, తెల్లటి మేని చాయ. తూరుపు ఐరోపాకి చెందిన మనిషిలా వుంది. బహుశా రష్యా దేశస్తురాలయుంటుందనుకున్నాను.

చప్పుడు చెయ్యకుండా కాఫీ తాగుతూ దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఆమెకేసి చూశాను. ఆమె కళ్ళల్లో కనిపించినలాంటి విషాదాన్ని నేనింతకుముందు ఎవరి దగ్గరా చూడలేదు. ఆ విషాదమే నన్ను ఆమెతో మాట్లాడేలా చేసింది.

”ఈరోజు పనంతా అయిపోయిందా?” అడిగాను మాటలు కలపాలని.

”లేదు. సగమే అయింది. ఇంకా సగం పనుంది. కాఫీ బ్రేక్‌లో దొరికే ఈ కాస్త విశ్రాంతి స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.”

ఆమె అలంకరణ, మాటలు, నడిచివచ్చిన తీరు, ఆంగ్ల ఉచ్చారణ వీటినిబట్టి చూస్తే ఆమె చాలాకాలంగా టొరాంటోలో ఉంటోందని తెలిసిపోతోంది. అయితే ఈ హౌస్‌కీపింగ్ లాంటి పనులు కొత్తగా వలస వచ్చినవాళ్ళు, శరణార్థి అర్జీ పెట్టుకున్నవాళ్ళు మాత్రమే చేస్తుంటారు. దీర్ఘకాలంగా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు వీలైనంత తొందరగా మరో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతుంటారు. అందుకే ఈమె ఇంకా ఈ క్లీనింగ్ పనిలోనే ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది.

“మీరు కెనడాకి ఎప్పుడు వచ్చారు?” అని అడిగాను.

ఆమె గ్రీస్ దేశస్తురాలట. తనకు పదమూడేళ్ళ వయసప్పుడు ఇక్కడికి ఒంటరిగా వచ్చిందట. ఆమెకు వాళ్ళ నాన్న, హోమర్ ఇతిహాసంలో వచ్చే అందగత్తె హెలెన్ పేరు పెట్టాడట. ఆమె పుట్టినప్పుడు హెలెన్ అంత అందంగా ఉన్నాదట. ఆ ఇతిహాసంలో హెలెన్‌ని పేరిస్‌ అనే వీరుడు సముద్రం దాటొచ్చి తీసుకెళ్తాడు. హెలెన్ అన్న పేరుగల ఈమె కూడా అలా సముద్రాలు దాటించబడింది. ఇక ఆమె గొంతులోనే మిగతా కథ అంతా వినండి.

“మా ఇంటిలో మేం ఏడుగురు పిల్లలం. నేను ఆరోదాన్ని. మా నాన్నకి ఒక కాలు లేదు. ఆయన ఒక రౌతు. ఆయనెప్పుడూ గుర్రం ఎక్కే ఉండేవాడు. పడుకునే సమయంలో తప్ప మిగిలిన సమయమంతా నాన్న గుర్రం మీదే ఉండేవాడు. మా ఊరిలో అందరూ ఆయన్ని ‘ఐదు కాళ్ళ మనిషి’ అనేవాళ్ళు. ఆయన ఉద్యోగం దొరల్ని వేటకు తీసుకెళ్ళడం. మా నాన్న కూడా మంచి వేటగాడు. తుపాకి ఎక్కుపెడితే గురి తప్పేది కాదు. ఎక్కడ, ఎప్పుడు ఏ పక్షులు దొరుకుతాయి, ఏ జంతువులు ఏ చోట ఎప్పుడెప్పుడు తిరుగుతాయి అన్నవి ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నాన్నకోసమని దొరలు వచ్చేవారు.

వేట ఎంత ఎక్కువ దొరికితే నాన్నకు అంత ఎక్కువ డబ్బులొచ్చేవి. అయితే రానురానూ దొరలకి వేట మీద ఆసక్తి పోయింది. నేను పుట్టేసరికే వేట సంప్రదాయం ఇంచుమించుగా మాయమయిపోయింది. మెల్లమెల్లగా రాబడి తగ్గిపోయింది. నాన్నకి వేరే పని చేతకాదు. ఆయనే కొందర్ని జట్టు చేసుకుని వేటకు వెళ్ళేవాడు అప్పుడప్పుడూ. నాకు పదకొండేళ్ళు వచ్చేసరికి రాబడి పూర్తిగా తగ్గిపోయింది. ఇంటిలో తరచూ మేము పస్తులుండాల్సి వచ్చేది. సంసారాన్ని లాక్కురావడం నాన్నకు ఒక ప్రయాసగా మారిపోయింది.

నాకు చిన్నప్పటినుంచీ చదువు బాగా అబ్బేది. బాగా చదువుకోవాలని నా కోరిక. గ్రీకు పురాణాలు, కావ్యాలు చదవడం, వినడం నాకు భలే ఇష్టంగా ఉండేవి. ప్రాచీన గ్రీకు భాషను చదవాలనే నా అపేక్షని ఆపుకోలేకపోయేదాన్ని. సమకాలీన గ్రీకు వేరు, ప్రాచీన గ్రీకు వేరు. అక్షరాలు ఒకటే అయినప్పటికీ ఉచ్చారణ వేరు. అర్థం వేరు. ఇప్పటికీ ప్రాచీన సాహిత్యాన్ని చదవగలను, అయితే అన్నీ పూర్తిగా అర్థంకావు.

మా పిన్ని ఎప్పణ్ణుంచో కెనడాలో స్థిరపడింది. డబ్బు ఇబ్బంది ఏమీ లేని కుటుంబం. అందుకని ఆమె నన్ను కెనడా పిలిపించుకుంది. అంత పేదరికంలో కూడా మా అమ్మని విడిచి వెళ్ళాలంటే నాకు చాలా బాధ కలిగింది. వెళ్ళనన్నాను. కెనడాలో ఏది చదవాలనుకుంటే అది చదువుకోవచ్చు అని పిన్ని ఆశ పెట్టింది. నేను ఎగిరి గంతులేశాను. నాన్న ఆపుకోలేని ఆనందంతో నేను చదువుకోడానికి కెనడాకు వెళ్తున్నానని ఊరంతా నాలుగుసార్లు గుర్రమ్మీద వెళ్ళి చాటించి వచ్చాడు.

1969 డిసెంబర్ నెల చలిలో మాంట్రియాల్ వచ్చి చేరాను. మా పిన్నికి ఇద్దరు పిల్లలు. నేను వచ్చిన రోజు మాత్రమే నన్ను వాళ్ళ గదిలో పడుకోనిచ్చింది. వాళ్ళు మంచం మీద నేను నేల మీద. నేను పనిమనిషిగా ఇక్కడికి వచ్చానని మరుసటి రోజుకే నాకు అర్థమయింది.

మా గ్రీకు పురాణాలలో ఒక కథ ఉంది. ట్రాయ్ రాజు తన నగరం చుట్టూ పెద్ద గోడలు కట్టేందుకు పూనుకుంటాడు. అందుకని మహావీరుడయిన అపాలోని, సముద్ర దేవుడయిన పొసైడన్‌ని పర్యవేక్షణకు నియమిస్తాడు. గోడ కట్టడం పూర్తి కాగానే వారికి తగినంత జీతం ఇస్తానని మాటిస్తాడు. అయితే గోడ కట్టడం పూర్తి చేశాక వాళ్ళకి డబ్బులేమీ ఇవ్వకుండా ఎగ్గొడతాడు. గ్రీకు సాహిత్యంలోనే ఇతనికంటే మోసగాడు మరొకడు లేడు. మా పిన్ని కూడా ఆ రాజు లాంటిదే. చిన్నపిల్లనయిన నన్ను కావాలని మరీ మోసం చేసింది. పొద్దున్నే ఆమె ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. నేను ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వంట చెయ్యాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చెయ్యాలి. బడికి వెళతానని నేను అడిగితే, చలికాలం పోనివ్వు చూద్దాం అంది. చలికాలం గడిచాక అడిగితే, సెప్టెంబర్లో మాత్రమే బడిలో చేర్చుకుంటారు అంది. ఇలా రకరకాల సాకులు చెప్పి చివరివరకూ ఆమె నన్ను బడిలో చేర్చలేదు.

నేను మా ఇంటికి రాసే ఉత్తరాల్ని చదివి చించేసి మళ్ళీ రాయమని చెప్పేది. ఆమెకు నచ్చినట్టుగా రాయించి, ఆమే స్వయంగా దాన్ని కవర్లో పెట్టి స్టాంపు అంటించి పోస్టు చేసేది. ఆ నాలుగు గోడల మధ్యన నాకు తెలిసేదల్లా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. అంతే! నన్ను బయటకెక్కడికీ తీసుకెళ్ళరు. నాకు ఫ్రెంచ్ భాష కూడా రాదు. మొత్తానికి నేనొక బానిస బతుకు బతికాను. అయితే మా నాన్న మాత్రం నేనేదో పెద్ద పెద్ద పైచదువులు చదివేస్తున్నానన్న ఆనందంలో మునిగితేలుతున్నాడని ఆయన రాసే ఉత్తరాలవల్ల తెలిసేది. మా పిన్ని ఉత్తరాల్లో ఇంకా ఏం రాసేదో మరి! నాన్న జాబుల్లో ‘ఇలాగే వచ్చే పరీక్షల్లో కూడా కూడా మంచి స్థానం సంపాయించుకో, బాగా చదువుకో’ అని రాసేవాడు.

పిన్నికి మరో బిడ్డ పుట్టింది. నా ఒక్కదానికే తెలిసిన రహస్యంలా నా పుట్టినరోజులు కొన్ని వచ్చి వెళ్ళిపోయాయి. నాకోసం ఎవరూ పుట్టినరోజులు జరపలేదు. కేక్ కోయలేదు. కేండిల్స్ వెలిగించి పాటలూ పాడలేదు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక అద్దం ముందు నిల్చుని చూసుకున్నాను. నా శరీరంలో మార్పులు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను నేను చూసుకొని మురిసిపోతూ చాలాసేపు నిల్చుని ఉండిపోయాను, ఆ రోజు సాయంత్రం పిన్ని కొట్టిన చెంపదెబ్బ తాలూకు గుర్తు కనిపిస్తూనే ఉన్నా పట్టించుకోకుండా. పరుపు శుభ్రం చేశాక, సగం పరిచి ఇంకో సగాన్ని పరవటం మరచిపోయి చుట్టినట్టే వదిలేసిన నేరానికిగాను నాకు ఆమె ఇచ్చిన శిక్ష అది. ఎందుకోగాని నామీద నాకు జాలివేసింది.

పిన్ని దగ్గర క్రిస్టల్‌తో చేయబడిన ఏడు రెక్కలున్న కొవ్వొత్తి స్టాండ్ ఒకటి ఉండేది. అదంటే ఆమెకు అపురూపం. దాన్ని తుడిచిపెడుతుంటే చెయ్యి జారి కిందపడి ముక్కలయింది. పిన్ని ఎక్కడ ఉండి విన్నదోగాని మరుక్షణం ’విరగ్గొట్టేశావా?’ అని చేయి పైకెత్తి అరుస్తూ నా ముందుకొచ్చి నిలబడింది. ఆరోజు నాకేం అనిపించిందో ఇప్పటికీ అర్థం కాదు. అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు. చేతులను నడుంమీద పెట్టుకుని ఆమెను నేరుగా చూసి ’అవును విరగ్గొట్టాను. అయితే ఏంటట?’ అన్నాను. ఆమె అలా విస్తుపోయి చూస్తూ నిల్చుంది. తొలిసారిగా ఆమె ముఖంలో ఒకరకమయిన భయాన్ని చూశాను. మెల్లగా వెనక్కి జరిగింది. అక్కడే నేలమీద పాకుతున్న పసిపిల్లని గభాల్న ఎత్తి చంకనేసుకుని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.

ఆ విరిగిన గాజుపెంకులను నేను ఊడవలేదు. అలానే వదిలేసి వూరుకున్నాను. ఆ రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు. ఇక ఎప్పటికీ తెల్లవారదేమోననిపించింది. మరుసటిరోజు తెల్లవారకముందే బస్సుకు కావలసినంత డబ్బు దొంగతనం చేసి టొరాంటో వెళ్ళే బస్ ఎక్కాను.

టొరాంటోలో అలా ఒక చలికాలపు ఆఖరిరోజున దిగాను. హాయిగా నీరెండ. నీలంగా ఆకాశం. అప్పుడే పచ్చగా చిగురిస్తున్న చెట్లు చూసి ఎంతో సంతోషంగా అనిపించింది నా మనసుకు. జీవితం అంటే మళ్ళీ ఆశ పుట్టింది. త్వరలోనే ఓ ఫ్యాక్టరీలో బట్టలకు గుండీలు కుట్టే పని దొరికింది. చాలా స్వేచ్ఛగా అనిపించింది. అక్కడ పనిచేస్తున్న ఒకతన్ని పెళ్ళి చేసుకున్నాను. ఒక కొడుకు పుట్టాడు. అంతా హాయిగా సాగిపోతున్న రోజుల్లో ఉన్నట్టుండి మా ఆయనకు రెస్టరెంట్ పెట్టుకుందాం అనిపించింది. దాచుకున్న మొత్తాన్ని పెట్టి గ్రీకు రెస్టరెంట్ ఒకటి తెరిచాం. కొత్తల్లో ఇబ్బంది పడ్డ్డాం కాని ఆపైన అది బానే లాభాల్లో నడిచింది. కొన్నేళ్ళు మళ్ళీ హాయిగా గడిచాయి. అలానే అలా సాఫీగా సాగిపోయుంటే అది నా జీవితం ఎలా అవుతుంది? ఉన్నట్టుండి ఒక రోజు మా ఆయన మాయం అయ్యాడు. ఎక్కడికి పోయాడు, ఏమయ్యాడన్నది ఎంత కాలానికీ తెలియలేదు. ఎంతకీ అతని ఆచూకీ లభించలేదు. బహుశా ఎక్కడో చనిపోయుంటాడని నా మనసుకు అనిపించింది. ఇక ఆ రెస్టరెంట్ నడపలేకపోయాను. వేరే దారిలేక దాన్ని నష్టానికి అమ్మేశాను…”

“తర్వాత మీ పిన్నిని కలుసుకోనేలేదా?” అడిగాను ఆమె కథకు అడ్డం పడుతూ. ఆమె సమాధానం చెప్పలేదు. తను చెప్పాలనుకున్నది చెప్పుకుంటూ పోయింది.

“నేను మొట్టమొదట మాంట్రియాల్‍లో అడుగు పెట్టినప్పుడు మా పిన్ని నా ముఖాన్ని పట్టి అటు ఇటు తిప్పి నన్ను అన్ని వైపులనుంచీ పరిశీలించి చూసింది. పిన్నికి నా మీద ప్రేమ, ఆప్యాయత అనుకున్నాను. విషయం అది కాదు. ఆమె నాకు విలువ కట్టిందని ఇప్పుడు తెలుస్తోంది. నా దగ్గర ఎంత పని చేయించుకోవచ్చు అనే అంచనాకోసమే ఆమె నన్ను అంత పరీక్షగా చూసింది. చిన్నపిల్లనయిన నన్ను ఎంత కర్కశంగా చూసినా, నాచేత గొడ్డుచాకిరీ చేయించుకున్నా ఆమె అనే ఒక్క వాక్యం మాత్రం మరిచిపోలేను.

‘నువ్వెందుకు చదువుకోవాలి, చదువుకోవాలి అని తాపత్రయపడుతున్నావు? చీపురుకర్రతో నిల్చున్నప్పుడు కూడా అందంగానే ఉన్నావుకదా!’ అనేది.

మా నాన్నకి చివరిదాక నేను మోసం చేయబడ్డానని తెలియదు. తప్పించుకుని టొరాంటో వచ్చాక నేను జాబు రాసినప్పుడే అమ్మకు తెలిసింది చిన్నమ్మ గురించి. అప్పటికే నాన్న చనిపోయాడు. అమ్మ పిన్నిని క్షమించలేదు. నేను క్షమించేశాను కానీ ఆ చేదు జ్ఞాపకాల గాయం ఇంకా అలానే ఉంది.

మా దేశంలో ఒక సామెత ఉంది, చెప్పులు అమ్మేవాడు మోకాళ్ళ మీద కూర్చోక తప్పదు అని. పనిమనిషిగా ఆమె నన్ను ఉంచుకున్నాక ఆమెకు నేను ఎదురుతిరగగలనా? పిన్ని తానో గొప్ప అందగత్తెనని అనుకునేది. నిజానికి ఆమె నీళ్ళలో నానబెట్టినట్టు ఉబ్బిపోయుండేది. కానీ ఆమెవి డేగకళ్ళు. అవి చురుకుగా అటూ ఇటూ చూస్తూ నా పనుల్లో లోపాలు వెతుకుతుండేవి. ఆమెకు అదో సరదా. తప్పు చేసినప్పుడల్లా తిట్లు పడేవి నాకు. నాతో మామూలుగా గ్రీకు మాట్లాడేది. తిట్టేప్పుడు మాత్రం ఇంగ్లీషులో తిట్టేది. నేను ఇంగ్లీషు నేర్చుకున్నది ఆ తిట్లమూలానే…

“మీకొక కొడుకున్నాడు కాదా?” అడిగాను.

ఆమె నిట్టూర్చింది. “నేను చదవలేకపోయిన చదువులన్నీ వాడు చదువుతాడనుకున్నాను. వాడేమో స్కూల్ కూడా పూర్తి చెయ్యలేదు. పట్టుమని పది రోజులు కూడా పరిచయం లేని ఓ అమ్మాయిని నాకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాడు. ఆ అమ్మాయి నోట్లోంచి ఎప్పుడూ సిగరెట్ పొగ వస్తూనే ఉంటుంది. తనతో కలిసి అమెరికాలోని ఐడహో స్టేటుకు వెళ్ళిపోయాడు. ఎందుకు అక్కడకే వెళ్ళాడో ఎవరికైనా చెప్తే నవ్వుతారు. అక్కడ మాత్రమే బాతుల్ని వేటాడచ్చుట. రచయిత హెమింగ్వే బాతుల్ని కాల్చిన స్టేట్ అట అది. చూశారా, వాడి దృష్టిలో నేను బాతుకన్నా హీనం. తల్లిని వదిలి ఏ కొడుకైనా ఇలాంటి సాకుతో అంతదూరం వెళ్ళిపోతాడా? పోనీ వెళ్ళాక ఒక్కసారైనా ఫోన్ కానీ ఉత్తరం కానీ లేవు, వాడి దగ్గరనుంచి.

ఇక ఇప్పుడు నాకు జీవితంలో ఎవరూ లేరు. నా జీవితాన్ని ఒంటరిగా, హాయిగా గడిపేస్తున్నాను. అప్పుడప్పుడూ మా నాన్నను గుర్తు చేసుకుంటాను. ఆయన చనిపోయేంతవరకు కాయకష్టం చెయ్యడాన్ని మానుకోలేదు. ఐదు కాళ్ళ మనిషి అని ఊళ్ళోవాళ్ళు గేలిచేసినా పట్టించుకోలేదు. సోలిపోయి కూర్చోలేదు. ఒక రోజు గుర్రంమీదనే హాయిగా కళ్ళు మూశాడట. ఒక్క కాలే ఉన్నప్పటికీ నిర్విరామంగా శ్రమ చేస్తూ బతికాడు. మరి నాకు రెండు కాళ్ళున్నాయి చక్కగా!”

అందంగా నవ్వుతూ హెలెన్ అని చక్కని పేరున్న ఆ గ్రీకు మహిళ లేచింది. తన యూనిఫామ్ సవరించుకుంది. ఆమెను పరికించి చూశాను. ఒకప్పుడు ఆమె గొప్ప అందగత్తెగానే ఉండి ఉండాలి. డిస్పోజబుల్ కప్పుని, తాను ఇందాక శుభ్రం చేసిన చెత్తబుట్టలో పడేసింది. చీపురు కర్ర, నీళ్ళ బకెట్, డిస్‍ఇన్ఫెక్టెంట్ లిక్విడ్, ఇతర క్లీనింగ్ సామాగ్రి నింపిన బండిని తోసుకుంటూ వెళ్ళడానికి సిద్ధమయింది. వెళ్ళే ముందు ఆమె చివరిగా చెప్పిన వాక్యంలో ఒక కథ ముగించడానికి కావలసిన లక్షణం ఉంది.

“నేను 13 ఏళ్ళప్పుడు చీపురుకర్ర చేతబట్టి పాచిపనులు చెయ్యడం మొదలుపెట్టాను. ఇప్పుడు 55 ఏళ్ళొచ్చినా అదే చేస్తున్నాను, ఇంకా అలాగే…” వాక్యాన్ని ఆపి, ఆలోచించింది.

“ఏమైతేనేం, చీపురుకర్రతో నిల్చున్నప్పుడు కూడా నేను అందంగా ఉంటాను కదా!?”


ఇది రాసిన తొమ్మిదేళ్ళ తర్వాత జరిగినది ఇది:

గత వారం మంచు కమ్మేసిన ఒక రోజు, టొరాంటోలో ఒక హాస్పిటల్లో హెలెన్ అనే ఆమెను కలిశాను. పదేళ్ళ క్రితం ఆమెను ఒక సూపర్ మార్కెట్ బయట కలిశాను. అప్పుడు ఆమె కథను రాశాను కూడా. ఆమె ముఖాన్ని నేను మరిచిపోయాను. అయితే ఆమె నన్ను గుర్తుపట్టి మాట్లాడింది.

వెన్నుపూస ఎక్స్‌రే తీసుకోడానికి వచ్చిందిట ఆమె. వెన్నునొప్పితో చాలా బాధ పడుతున్నదట. ఆమె భర్త (తిరిగొచ్చాడు) గత ఐదేళ్ళుగా మంచం పట్టి ఉన్నారట. ఇప్పటికీ ఆ జానిటర్ పనిలోనే ఉన్నారట. ఎప్పుడైనా ఊడిపోగల ఉద్యోగం. అయితే ఆమె ముఖంలో ఆ అందమైన నవ్వు మాత్రం చెక్కుచెదరలేదు. ఇక మర్చిపోకుండా, ఆమెతో ఆ హాస్పిటల్లో ఒక ఫోటో తీసుకున్నాను. తిరిగివస్తుంటే అనిపించింది నాకు.

ఈమె దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి.

[మూలం: ఐందు కాల్ మనిదన్ (2011). ఒండ్రుక్కుం ఉదవాదవన్ (2011) (అప్రయోజకుడు) సంపుటినుండి.]


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్‌గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్‌గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలూ, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.