ఓడిపోయిన యోధుడు

వచ్చే ఆదివారంనుంచి అతని ప్రియురాలిగా ఉండేందుకు ఆమె ఒప్పుకుంది. ఆదివారానికి ఇంకా మూడు రోజులే ఉన్నాయి. అందాకా ఓర్చుకోవడం వాడికి కష్టమైన పనే. ఆ కాబోయే ప్రేయసి వెంటనే దొరకకపోవడంలో ఓ చిక్కుంది. ఆమెకో ప్రియుడున్నాడు. వాడికి బదిలీ కావడంతో 2000మైళ్ళ దూరం వెళ్ళిపోతున్నాడు. మరిక తిరిగిరాడు. దాంతో వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగా విడిపోవాలనుకొని వచ్చే ఆదివారమే వీడ్కోలు చెప్పుకోబోతున్నారు. ఆ తర్వాత ఆమె వీడి ప్రియురాలు అయిపోతుంది.

ఆమె ఒక ఆడకుక్కను తీసుకుని వాకింగ్‌కి వచ్చినప్పుడు వాళ్ళకి తొలిసారి పరిచయమయింది. రోజూ అదే దార్లో, అదే సమయానికి ఆ స్పానియెల్‌ను తీసుకొస్తుంటుంది. ముదురు గోధుమరంగు కాళ్ళు, వేలాడుతున్న పొడవైన చెవులూ ఒత్తుగా బారుగా బొచ్చుతో ఆ కుక్క చూడటానికి చాలా ముద్దుగా ఉంటుంది. బాగా మచ్చిక చేయబడి మంచి ప్రవర్తన నేర్పించబడిన కుక్క. చేతిలోని గొలుసును ఆమె ఎటు లాగితే అటు బుడిబుడి అడుగులేసుకుంటూ నడుస్తుంటుంది. వాడు తీసుకొచ్చే మగకుక్క ఒక జెర్మన్ షెపర్డ్. ఖరీదైన శిక్షణలు పొందిన కుక్క. ఒక గడ్డిపరకక్కూడా హానిచేయదు, మొరగదు. కళ్ళు మూసుకుని ఉన్నా భయానకంగా తోచే గుండ్రటి నల్లటి కనుబొమ్మలు. ఆ కుక్క పేరు జాక్. ముందుగా ఆ కుక్కలే కలుసుకొని ఒక్కదాన్నొకటి వాసన చూసుకుంటూ మొఖాలు రాసుకున్నాయి.

ఆమే ముందుగా ‘హాయ్’ అంది. వీడూ చెప్పాడు.

“మీ కుక్క జుట్టు తళతలా మెరిసిపోతోంది!” అన్నాడు.

“థాంక్యూ!”

“మీ కుక్క పేరేంటి?”

“జెనిఫర్.”

“క్షమించండి, కుక్క పేరడిగాను.”

“దాని పేరే జెనిఫర్.” అందామె నవ్వుతూ.

“మీది చాలా అందమైన నవ్వు. అంత తెల్లటి పళ్ళని అన్యాయంగా పెదాలతో మూసిపెట్టుకున్నారు!” వాడి అబద్దాల తొలి ఇటుక పేర్చడం ఇలా మొదలైంది. ఆ తర్వాత ఇటుకమీద ఇటుకగా పేర్చుకుంటూపోయాడు. అవి కూలిపోకూడదని ఇంకా ఇంకా పేర్చుకుంటూ ఒక భవనమే నిర్మించేశాడు. అది వాడి సొంతకుక్క కాదని, తాను జీతానికి కుక్కల్ని వాకింగ్ చేయించే పని చేస్తున్నాడనీ చెప్పలేదు. ఐదు ఇళ్ళల్లో, ఇంటికో కుక్క చొప్పున ఐదు కుక్కల్ని రోజూ నడకకి తీసుకెళ్ళడమే తన పని అని, అలా వచ్చే జీతం డబ్బులతోనే తన నెలవారీ ఖర్చులు జరుపుకుంటాడని వాడు చెప్పడం మరిచిపోయాడు.

ఆమె కలవారింటి అమ్మాయి. డిగ్రీ పూర్తి చేసింది, కంప్యూటర్లో బొమ్మలు గీస్తుంటుంది. ఒక చిన్నబిడ్డ ఫోటో ఇస్తే ఇరవైయేళ్ళ తర్వాత వాడెలా ఉంటాడనేదాన్ని బొమ్మగీసి ఇస్తుంది. అలాగే జంతువుల్ని ఊహించి బొమ్మలు గీయడంలో కూడా శిక్షణ తీసుకొంటోంది. పిల్లి, కుక్క, గుర్రం పోలికలు మార్చి గీసిచూడటం ఆమెకు నచ్చిన పని. తన కుక్కపిల్ల ఇంకో పదేళ్ళలో ఎలా ఉంటుందో బొమ్మ గీసి ఫ్రేమ్ చేసి ఇంట్లో గోడకి తగిలించుకుంది.

ఆమె వచ్చే సమయాన్ని వాడు బాగా పసిగట్టాడు. మిగిలిన కుక్కల్ని వేరే సమయాల్లో వేరే దారుల్లో నడిపించేవాడు కానీ జెర్మన్ షెపర్డ్‌ జాక్‌ని మాత్రం దానికి తానే యజమాని అన్న రీతిలో రోజూ అదే సమయానికి తీసుకొచ్చి ఆమెను కలుసుకునేవాడు. గొలుసులు విప్పేసి ఆ కుక్కలని ఆటలాడుకోనిచ్చేవాళ్ళు వాళ్ళు. ఆ గొలుసుని మెడలో వేసుకుని వంగి ఓ సారి తన ఒంటిని చూసుకునేది ఆమె. ఆ దృశ్యం వాడి నరనరాల్నీ ఉద్రేకపరిచేది. ఆమె ఒంటిమీద చెమటతడి వున్న ప్రదేశాల్లో తన ముఖాన్ని అదుముకోవాలనిపించేది వాడికి.

వాడి నాన్న రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కొంతకాలం జైల్లో ఉన్నాడు. కుక్కను పెంచుకుందామని వాడు ఎంత బతిమాలినా ఒప్పుకునేవాడు కాదు. ఆయనకి కుక్కల్ని పెంచడమంటే అసహ్యం. టీవీలో స్పోర్ట్స్ చానెల్స్ తప్ప మరో చానెల్ పెట్టేవాడు కాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. ఆయన మౌనానికి రెండింతలుగా వాడూ మౌనం పాటించేవాడు.

వాళ్ళ నాన్న ఎప్పుడైనా నోరు తెరిచాడంటే అది ఆజ్ఞాపించడానికి మాత్రమే. వాడు ఇంట్లోంచి పారిపోయివచ్చింది కూడా అటువంటి ఒక ఆజ్ఞని పాటించని సందర్భంలోనే. ఇప్పుడు మొదటిసారిగా వాడి జీవితం సుడి తిరిగింది. ఒకేసారి రెండు అదృష్టాలు వరించాయి.

వచ్చే ఆదివారం నుండి ఆమె వాడికి ప్రియురాలు కాబోతోంది. రెండోది, జాక్‌ యజమాని కుటుంబం సెలవులకు విహారయాత్రకి వెళ్తోంది. ఆ రెండు వారాలూ వాడు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఇంటిని కూడా చూసుకోవాలి. పైగా ఎక్కువ జీతం కూడాను. అన్ని రకాల వసతులూ ఉన్న ఆ ఇంట్లో ఉండటం అనేది తలచుకుంటేనే వాడిలో సంతోషం పరవళ్ళు తొక్కింది.

రకరకాల చెట్లతో పెద్ద తోట ఉన్న ఆ ఇంటికి తొలిసారిగా ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆ ఇంటిని చూసి ఆమెకు ఎలాంటి అశ్చర్యమూ కలగలేదు. చాలా మామూలుగా సహజంగా ఉంది. ఎత్తుమడమల చెప్పులున్న కాళ్ళతో మెట్లమీద వాలుగా అడుగులేస్తూ ఠక్ ఠక్‍మని శబ్దంచేస్తూ పైకి ఎక్కింది. ఓవర్ కోట్ తీసేసి, వెన్నుకు అతుక్కుపోయినట్టున్న పొట్ట కనిపిస్తున్న పలచని డ్రెస్‌లో ఒయ్యారంగా నడిచింది. ఆమెనుండి వెలువడిన కాంతి ఆ ఇంటికి మరింత వెలుగునిచ్చింది. తన చేతులను హారంలా వాడి మెడలో వేసి ‘నా మూడో ప్రియుడా!’ అని నవ్వుతూ ముద్దు పెట్టింది. తర్వాత వాడి చేయి పట్టుకుని నెమ్మదిగా ఇల్లంతా చుట్టివచ్చింది.

“నువ్వు ఒక్కడివే ఉంటావా?” అడిగింది.

“చెప్పాను కదా? మా అమ్మ నాన్న వెకేషన్‌కి వెళ్ళారు. ఈ రెండు వారాలూ నేనే రాజుని, నువ్వే రాణివి!”

“నువ్వెందుకు వెళ్ళలేదు మైకల్?”

“నా పేరు మైకల్ కాదు,” వాడు తన పేరు చెప్పాడు.

“నువ్వ వంట చెయ్యగలవా?”

“నేనివాళ పొద్దున ఏం తిన్నానో తెలుసా? ఫ్రోజెన్ ఎగ్!”

“ఫ్రోజెన్ ఎగ్గా!”

“బ్రహ్మాండంగా ఉంటుంది,” అంటూ వాడు ఆ పదార్థం తయారీని వివరించసాగాడు. వాడు చెప్పే తీరుని కళ్ళార్పకుండా చూస్తూ విన్నది. మధ్య మధ్యలో తన ఎడమ రొమ్ముని పట్ట్టీ పట్టి సరిచేసుకుంది.

“కొంచం ఆగు, నేను సిగరెట్ కాల్చుకొస్తాను,” అని వాడు వెళ్ళడానికి లేచినప్పడు ఆ తప్పు జరిగుండాలి. జన్మలో వాడికి లభించని ఓ గొప్ప తరుణం కలిసివచ్చింది. ఇలాంటప్పుడు బోడి సిగరెట్ అవసరమా? అని వాడి మనసుకు తోచలేదు. ఇంటి యజమాని వాడికి ఇల్లు అప్పగిస్తూ మోజెస్ ఆజ్ఞల్లాగా మూడు విషయాలు చెప్పివెళ్ళాడు: ఆ పెద్ద బంగ్లాలో ఎక్కడైనా తిరగొచ్చు, కానీ యజమాని బెడ్‌రూమ్ లోకి మాత్రం వెళ్ళకూడదు. రెండవది వాడికున్న సిగరెట్ అలవాటు దృష్ట్యా చెప్పబడినది. ఎన్ని సిగరెట్లయినా కాల్చుకోవచ్చు కాని ఇంటి బయట మాత్రమే. మూడోది ముఖ్యమైనది: ఎంత తలపోయే పనున్నా సరే, సరిగ్గా ఆరు గంటలకి (5:55క్కాదు, 6:05కీ కాదు) జాక్‌కి డిన్నర్ పెట్టాలి.

జాక్‌కి పెట్టవలసిన డ్రై ఫుడ్ ప్యాకెట్లను, కొలత కప్పుని చూపించాడు యజమాని. ఫ్రిడ్జ్‌లో వాడికి కావలసిన ఆహార పదార్థాలున్నాయి. బార్ కౌంటర్‌లో బీర్, రకరకాల వైన్లు ఉన్నాయి. జిమ్, స్విమ్మింగ్ పూల్, వందలాది పుస్తకాలు, 50ఇంచిల టీవీ, హోమ్ థియేటర్–ఇలా వాడిని ఆహ్లాదపరచటానికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆమె కూడా ఉంది.

“బుద్ధిగా ఉండు!” వాడు ఆ మాటని జాక్‌కి చెప్పాడా ఆమెకు చెప్పాడా తెలియదు. వాడు నడిచి వెళుతుంటే నడవాలో ఉన్న లైట్లు వాడి జాడ తెలియగానే వెలిగి, దాటిపోగానే ఆరిపోయాయి.

ఆమె చుట్టూ చూసింది. ఆమెకు నచ్చుతుందని వాడు వండిపెట్టిన జపనీస్ వంటకాలు ఓ గొప్ప నైపుణ్యంతో ఆ టేబిల్ మీద అలంకరించబడి ఉన్నాయి. అందులో ప్రత్యేకమైనది సూషీ. సన్నటి వరియన్నాన్ని రోల్ చేసి ఆల్గే, ముల్లులేని చేపమాంసం పెట్టి తయారు చేసినవి. ఓ పింగాణీ ప్లేట్లో గుండ్రంగా పేర్చబడున్నాయవి. పక్కనే ఓ గిన్నెలో దానితో నంజుకుతినడానికి సాస్.

ఆ ఇల్లు ఆమెకు బాగా నచ్చింది. అది కట్టిన తీరు కొత్తగా, మనుషుల సౌకర్యాలకోసం కట్టినట్టు కాకుండా ప్రత్యేకించి పక్షులకోసం, పెంపుడు జంతువులకోసం, మొక్కలకోసం కట్టినట్టు అనిపిస్తోంది.

ఆమె దృష్టి పడక గది మీదకో, లివింగ్ రూమ్‌ మీదకో, హోమ్ థియేటర్ మీదకో వెళ్ళలేదు. లైబ్రరీ మీద పడింది. రకరకాల ఇండోర్ ప్లాంట్లు, అల్లించిన తీగెలతో అలంకరించబడిన లైబ్రరీ. గాజు కిటీకీల్లోంచి బయట విరగబూసివున్న టూలిప్స్ అన్ని రంగుల్లోనూ. కిటికీకి అంటించిన తేనె గిన్నెల్లోని తేనె తాగిన పిచ్చుకలన్నీ ఒక్కసారిగా లేచి ఎగరడం తిరిగిరావడం–ఎంత అద్భుతమైన దృశ్యమో!

మేజామీద లోహంతో చేయబడిన గుర్రపు యోధుడి శిల్పం ఒకటి ఉంది. ఆ గుర్రం ముందరికాళ్ళు రెండూ గాల్లో ఉన్నాయి. దాని అర్థం ఆ యోధుడు యద్ధంలో మరణించాడని. ఒక కాలు మాత్రమే గాల్లో ఉంటే యోధుడు యుద్ధంలో గాయపడ్డాడని అర్థం. నాలుగు కాళ్ళూ నేలమీదుంటే గుర్రమూ, యోధుడూ ఇద్దరూ కూడా యుద్ధంలో గాయపడలేదు, చావలేదు అని. ఆమె ఎప్పుడో చదివిన ఈ వివరాలు గుర్తొచ్చాయి. వాడు వచ్చాక ఆ యోధుని పేరు అడగాలనుకుంది.

ఒకవైపు గోడమీద ఫ్రేముల్లో ఫ్యామిలీ ఫోటోలున్నాయి. అన్ని ఫోటోల్లోనూ కాళ్ళదగ్గర ఓ కుక్క ఉంది. జాక్ రాక ముందు ఆ కుక్కలు ఉండి ఉండచ్చు. ఫోటోల్లో ఉన్నదల్లా ఓ భర్త, భార్య, ఒక పాప మాత్రమే. ఒక్కో ఫోటోలోనూ ఆ పాప ఎదుగుతూ ఉంది. ఒక్క ఫోటోలోనూ వాడు లేకపోవడం ఆమెకు ఆశ్చర్యంవేసింది. ఫోటోలో ఉన్న కుక్కపిల్లని పెద్దయినట్టు బొమ్మ గీస్తే ఎలా ఉంటుందని మనసులోనే ఊహించింది. అది జాక్ జాడలతో లేదు. వెండితో చేయబడిన రెండు కలశాల వంటివి ఉన్నాయి. దాని మీద చిన్న అక్షరాలతో లిటిల్ ఫ్లవర్ కంపెనీ అని రాసివుంది. ఆమె ఆశ్చర్యం పెరుగుతూ పోయింది.

వాడు వచ్చేలోపు స్నానం చేద్దాం అనుకుంది. రెడీగా ఉండి వాడిని సర్ప్రైజ్ చెయ్యొచ్చు. ఒక కాలి చెప్పుని మరో కాలి మడమ సాయంతో తీసి దాని పై అంచుని బొటనవేలితో పైకెత్తి పెండ్యులంలా ఊపి నవ్వుకుంది. ఆపైన కాలితోనే గోడవైపుకు విసిరింది. అది గోడకి కొట్టుకొని నేలమీద పడింది. మరో చెప్పునీ కాలితోనే తీసి విసిరింది. ఒంటిమీదున్న దుస్తులు విప్పి స్నానం చేసి వదులుగా ఉన్న బాత్ రోబ్ తొడుక్కుంది. వాటి నాడాలను కట్టుకోలేదు. దాచుకోవాల్సిన కనీసభాగాలను మాత్రమే కప్పింది ఆ రోబ్. బాత్రూమ్ నుండి బయటకి వచ్చిన ఆమెను చూస్తున్న వాడి మొహంలో దయ్యాన్ని చూసినవాడిలాంటి కవళికలు కనిపించాయి ఆమెకు.

ఎట్టి పరిస్థితిలోనూ ప్రవేశించకూడదని యజమాని అన్నది ఈ గదిలోకే. అయితే ఈ చిన్న సమస్య గురించి ఇలాంటి మంచి తరుణంలో ఆలోచించనక్కర్లేదనుకున్నాడు. రెండు చేతులూ చాచి రా అని పిలవగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి వాడి కౌగిట్లో ఒదిగిపోయింది.

భోజనాల బల్లమీద రెండు ప్లేట్లు, రెండు ఎర్రటి న్యాప్కిన్లు మడిచిపెట్టి ఉన్నాయి. నీలి రంగు కొవ్వొత్తులు క్రిస్టల్ స్టాండ్స్ మీద అమర్చబడున్నాయి. అవి సువాసనలు వెదజల్లుతూ వెలుగుతున్నాయి. ప్లేట్ల చుట్టూ వెండి కట్లెరీ. ఖరీదైన చల్లటి వైన్, తాగటానికి గ్లాసులు. ఈ మంచి సందర్భాన్ని ఎలాగో అర్థంచేసుకున్న జాక్, జెనిఫర్‌లు ఎలాంటి ఇబ్బందీ కలిగించకుండ గమ్మున ఆడుకుంటున్నాయి.

పరుపుమీద కాళ్ళు చాపుకుని కూర్చున్నాడు వాడు. వాడి మోకాళ్ళమీద తన పిరుదులు ఆన్చి కూర్చుంది ఆమె. తర్వాత వాడి బుగ్గలు చేతుల్లోకి తీసుకుని “ముందుగా ఆ గుర్రపు యోధుడి పేరు చెప్పు,” అన్నది.

“ఏ గుర్రపు యోధుడు?”

“లైబ్రరీ రూములో ఉన్న గుర్రపు యోధుడే!”

“ఓ!”

“ఏంటి ఓ?”

“అదా? నాకు పేరు గుర్తులేదు.”

“సరే జాక్‌కి ముందు ఎన్ని కుక్కలు ఉండేవి?”

“ఎవడికి తెలుసు?”

“జోకులాడకు మైకల్.”

“నా పేరు మైకల్ కాదు.” వాడి పేరు చెప్పాడు.

“సరే పోన్లే. జాక్‌కి ముందుగా ఉన్న కుక్కల పేర్లేంటి?”

“పేర్లా?”

“రెండు కుక్కలున్నాయిగా? ఫోటోలో చూశాను.”

“ఓ!”

“ఏంటి ఓ?”

“గుర్తులేదు.” వాడిలో కంగారు మొదలైంది. ఏంటీ ఈ పిల్ల ఈ సమయంలో ప్రశ్నలడుగుతోంది అని.

“అవి గుర్తొస్తే నీకు బాధేస్తుందా, ఏడుపొస్తుందా?”

“అవును.” వాడు సంతాపసమయంలో అవనతం చేయబడిన దేశపు జండాలా కళ్ళను దించి దుఃఖం నటించాడు.

“అవి ఎలా చనిపోయాయి?”

“ఏవి?”

“నీ కుక్కలు.”

“ఓ!”

“ఏంటి అన్నిటికీ ఓ అంటావు?”

“డార్లింగ్, ఇదేంటి ఈ క్రాస్ ఎగ్జామినేషన్? ఇంత మంచి అవకాశాన్నీ సమయాన్నీ వృధా చేస్తూ? దగ్గరకు రా!” అని కవ్వింతగా చెప్పి ఆమెను పొదుముకునే ప్రయత్నం చేశాడు. ప్రశ్నలు ఒక క్లిష్టమైన దిశలోకి ప్రయాణిస్తుండటమూ, నూలుపోగంతలో తప్పించుకోవడమూ వాడిలో భయాన్ని పెంచుతున్నాయి.

“నేనెక్కడికీ పారిపోను. మొన్నటి ఆదివారంనుండి నువ్వేగా నా ప్రియుడివి? ఈ దేహం, నా అందాలు అన్నీ నీవే. ఈ ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పేయ్. అది తెలుసుకునేంత వరకు నాకు మూడ్ తిరిగి రాదు.”

“సరే, ప్రశ్న ఏంటి?”

“ఇడియట్! ఆ కుక్కలు రెండూ ఎలా చనిపోయాయి? ఒకటి 1980లో చనిపోయింది, మరోటి 1991లో చనిపోయింది. దయచేసి చెప్పు, నాకు ఏడుపొస్తుంది.” ఆమె వెక్కి వెక్కి ఏడ్చేందుకు సిద్ధంగా ఉంది.

“నా బుజ్జివి కదూ ఏడవకు, బుజ్జిముండవి కదూ… ఏడవకు. నువ్వెలా చెప్పగలిగావు, అవి చనిపోయిన సంవత్సరాలు?”

“ఆ సిల్వర్ పాట్స్ చూశాను. వాటిమీద లిటిల్ ఫ్లవర్ కంపెనీ అని పేరు వుంది. అది కుక్కలను క్రిమేట్ చేసే కంపెనీ కదా?”

అబద్దాలు వాటికి విధించబడిన గరిష్ఠపు ఎల్లలను చేరుకున్నాయి. రెండు సైజులు పెద్దదయిన బాత్‌ రోబ్‌లో ఉన్న ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతని పొట్ట ఆమె పొట్ట వ్యతిరేక ధృవాల అయస్కాంతాల్లా అతుక్కున్నాయి. కుడి చేత్తో ఆమె ఒంటిలోని చెమ్మ ప్రదేశాలను వెతుకుతూ అన్ని నిజాలనూ చెప్పేశాడు.

పగటి పూట మెరుపులా ఆమె మంచం మీదనుండి ఒక్కసారి లేచి కిందకు దూకింది. నిల్చున్నచోటనే బాత్‌ రోబ్‌ని కుప్పగా జారవిడిచింది. ఆమె నున్నటి పొడవైన కాళ్ళు అద్భుతమైన ఓ నల్లటి త్రికోణం దగ్గర కలవడాన్ని చూశాడు. వాడు ఊపిరి పీల్చుకోవడం కూడా వీలుకానంత నిస్సహాయుడిలా అయిపోయాడు.

“ప్లీజ్, ప్లీజ్… అన్నిటికి కారణాలున్నాయి” అని బతిమలాడుతూ ఆమె వెనక వెళ్ళాడు. ఈ సమయం కోసం ఈ వారం రోజులుగా ఎంత ఎదురు చూశాడు! ఎన్నో కలలు కన్నాడు, పొద్దున్నుండి ఎంతో శ్రమ తీసుకుని అన్నీ తయారుచేసి ఉంచాడు. అమె అందం వాడికి దగ్గరవుతుంది అనుకుంటున్నప్పుడు ఇలా అయింది.

యజమాని ప్రవేశించకూడదన్న ఆ గది, ఒక్క క్షణంలో నలిగిన దుప్పట్లతో, నిల్చున్నచోటనే కుప్పగా పడివున్న బాత్ ‌రోబ్‌‌తో, పక్కటేబుల్ మీద ఉంచిన వైన్ గ్లాసులతో, విసిరి కొట్టబడినందువల్ల అటొకటి ఇటొకటిగా పడున్న చెప్పులతో వికారంగా ఉంది.

పొడవైన డ్రస్సు కింద నేలమీద నిలవలేని ఆమె తెల్లటి పాదాలు కనిపిస్తున్నాయి. ఆమె వంగి చెప్పులేసుకున్నప్పుడు డ్రెస్‌లో దాగున్న ఎత్తుపల్లాలు దర్శనమిచ్చాయి. ఆమె ముక్కు కోపంవల్ల ఎరుపెక్కి వికారంగా కనిపించింది.

“ఒక లవర్‌గా ఉండటానికంటే ఓ అబద్దాలకోరుగా ఉండటంలోనే నీ తెలివితేటల్ని ప్రదర్శించావు!” అని కోపంగా తిరిగినప్పుడు అర్ధచంద్రాకారమున్న టేబుల్‌కి ఆమె తొడ బలంగా తగిలింది.

‘జెనిఫర్!’ తన కుక్కను గట్టిగా కేకేసింది.

చాలాసేపు అక్కడే ఉందాం అనుకున్న ఆ కుక్క గభాలున లేచింది. ఏదో జరగకూడనిది జరుగుతోందని పసిగట్టి ఆమె కాళ్ళమధ్యలో దూరి ఆమె చెప్పే తరువాయి ఆజ్ఞకోసం చూసింది. ఆమె వెదురుబద్దలాంటి వెన్నుని నేరుగా నిలిపి, చిరాకుగా ముఖంపెట్టి తన రెండు చేతులతో రొమ్మలను సర్దుకుని జుట్టు వెనక్కి తోసుకుని కాళ్ళు వెడల్పుగా పెట్టుకుని నడిచింది. ఇప్పుడు ఆమె నడకలో కూడా కోపం పరవళ్ళు తొక్కుతోంది. తలుపు తీసుకుని నడవాలోకి అడుగుపెట్టింది. ఆమె అడుగుల్లో భూమి గాయపడినా ఆశ్చర్యంలేదు. జాడ తెలియగానే వెలిగే లైట్లు ఆమె వెళుతుంటే ఒక్కోటి వెలిగి ఆమె దాటిపోగానే ఆరిపోయాయి.

వాడు ఆ పెద్ద పరుపుమీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు. ఒడిలో యాష్ ట్రే. ఒంటె బొమ్మ ఉన్న సిగరెట్ పెట్టెనుండి ఒక్కో సిగరెట్ తీసి కాల్చి పీల్చి పీల్చి ఆ ట్రేలో బూడిద నింపుతున్నాడు. వాడు సిగరెట్ తాగే పనిలో ఉన్నట్టుగా అనిపించలేదు. ఆ ట్రేని బూడిదతో నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నవాడిలా కనిపించాడు.

ఇప్పటివరకు వాడి జీవితంలో జరిగిన అతి పెద్ద పతనం ఇది. జాక్ గమ్మున పడుకుని ఉంది. అక్కడ జరిగిన కల్లోలం గురించి అది పట్టించుకున్నట్టులేదు. దానికి వాడే ప్రస్తుత యజమాని. అది నిన్నటి యజమాని గురించి ఆలోచిస్తున్నట్టనిపించట్లేదు. రేపు తనకెవరు యజమాని అన్న చింతకూడా లేదు. పొద్దుటి ఆహారం గురించో, రాత్రి భోజనం ఎక్కణ్ణుండి వస్తుంది అన్న విషయాల గురించో దానికి తెలియదు. ప్రపంచం ఎలాగో తన ఇష్టానుసారమే సాగితీరాలి అన్న ధోరణిలో నింపాదిగా పడుకుని ఉంది.

రెండు చేతులతోనూ కౌగిలించుకునేంత దూరంలో ఆమె పడుకున్న పరుపుమీద ఆమె వదిలి వెళ్ళిన జాడలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆమెకే తెలీయకుండా ఊడిన ఆమె వెంట్రుక ఒకటి ఆమెలో ఒక భాగంలా ఇక్కడే ఉండిపోయింది. ఆమె ఒంటినుండి వచ్చిన సువాసన ఇంకా అక్కడే తిరుగుతోంది.

ప్రపంచంలో ఒక్కొక్కరికీ అవసరమైన, అయితే అతి కొద్దిమందికే తెలిసిన వంటకాలు చెయ్యడమంటే వాడికి చాలా ఇష్టం. మూడు గంటలసేపు నిల్చుని ఆమెకోసం జపనీసు వంటకాలు చేశాడు. వాటిల్లో ఒక్కదాన్ని కూడా ఆమె రుచి చూడలేదు. ఎంతో శ్రద్ధగా సుకుమారంగా చుట్టిన సూషీ ఊరిస్తోంది ఆమె సొగసులాగ. కొవ్వొత్తి, విరబోసిన ఆమె జుట్టులా కరిగి కారిపోయుంది. పాత వైన్ ఇంకా పాతబడి చల్లదనం కోల్పోయి మామూలు స్థితికి చేరుకుంటోంది.

ఉన్నట్టుండి వాడికి గుర్తొచ్చింది, యజమాని విధించిన మూడు ఆజ్ఞలనూ తాను ఉల్లంఘించాడని. ఇక ఉల్లంఘించడానికి ఏమీ మిగల్లేదు. కుక్క డిన్నర్ సమయం సాయంత్రం ఆరు గంటలకి. అది దాటీ చాలా సేపయిపోయింది. శ్రేష్ఠమైన శిక్షణతో మంచి అలవాట్లు నేర్పబడ్డ ఆ నల్ల కుక్క, తన రెండు ముందరి కాళ్ళనూ చాపుకుని చెవులను దాచుకొని ముదురు గోధుమరంగు కళ్ళతో ఇంతసేపూ వాడినే దీనంగా చూస్తూ ఉంది.

మూలం: పోరిల్ తొట్రుప్పోన కుదిరైవీరన్ (2001)


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్‌గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్‌గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలూ, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.