శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము
పంచమాశ్వాసము
క. సుభగంభావుకఘనకౌ
స్తుభ! సాధ్వవనసహకృత్వ◊దుర్దమచక్రా!
ప్రభవాసురసర్వంకష
విభవమ్మన్యప్రతాప◊వృత! గోపాలా! 1
టీక: సుభగంభావుకఘనకౌస్తుభ – సుభగంభావుక=మనోజ్ఞమగు, ఘనకౌస్తుభ=ఉత్కృష్టమగు కౌస్తుభమణిగలవాఁడా! సాధ్వవనసహకృత్వదుర్దమచక్రా – సాధు=సత్పురుషులగు మున్యాదులయొక్క, అవన=రక్షణమందు, సహకృత్వ= సహాయమగు, దుర్దమచక్రా=అడఁపరాని చక్రముగలవాఁడా! ప్రభవాసురసర్వంకష విభవమ్మన్యప్రతాపవృత – ప్రభవ = సమర్థులగు, అసుర=రాక్షసులకు, సర్వంకష=నాశకమగు, విభవమ్మన్య=విభవమునుగాఁ దన్నుఁ దలఁచెడి, ప్రతాప= పరాక్రమముచేత, వృత=కూడుకొన్నవాఁడా! గోపాలా= శ్రీమదనగోపాలస్వామీ!
ఈకృతిపతి సంబోధనమునకు ‘చిత్త గింపు’మను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.
తే. చిత్తగింపుము శౌనకా ◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ◊ర్షణతనూజుఁ
డువిద తద్రాజచంద్రైక◊వివరిషావి
ధానపాణింధమాత్మచేఁ ◊దనరునపుడు. 2
టీక: చిత్తగింపుము = ఆకర్ణింపుము; శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలగు శ్రేష్ఠులగు మునిసంఘమునకు; రోమ హర్షణతనూజుఁడు = సూతుఁడు; ఇట్లనున్=వక్ష్యమాణప్రకారముగాఁ బలుకును; ఉవిద=చంద్రిక; తద్రాజచంద్రైకవివరిషా విధానపాణింధమాత్మచేన్ –తద్రాజచంద్ర=ఆసుచంద్రునియొక్క, ఏక=ముఖ్యమగు, వివరిషా=వరియించు నిచ్ఛయొక్క, విధాన=ప్రకారమునకు, పాణింధమ=జ్ఞాపకమగు, ‘ఉగ్ర మ్పశ్యేరమ్మదపాణింధమాశ్చ’ దీన నీరూపమగు, ఆత్మచేన్=మాన సముచేత; తనరునపుడు = ఒప్పుసమయమునందు; దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.
మ. సుతతారుణ్యశుభోదయస్థితి తద◊స్తోకాశయాలంబితే
హితము న్బోటులచే నెఱింగి, తదమూ◊ల్యేష్టార్థసంసిద్ధికై
చతురత్వంబునఁ దత్స్వయంవరవిధిన్ ◊జాటింపఁ బంచెన్ భట
ప్రతతి న్వే క్షణదోదయేశ్వరుఁ డతి◊ప్రహ్లత్తిలిప్తాత్ముఁడై. 3
టీక: క్షణదోదయేశ్వరుఁడు=క్షణదోదయరాజు; అతిప్రహ్లత్తిలిప్తాత్ముఁడై=అత్యానందముచేఁ బూయఁబడిన చిత్తముగలవాఁడై, సుతతారుణ్యశుభోదయస్థితిన్—సుత=కొమార్తెయగు చంద్రికయొక్క, తారుణ్య=యౌవనముయొక్క, శుభోదయ=శుభ మగు నావిర్భావముయొక్క, స్థితిన్=ఉనికిని; తదస్తోకాశయాలంబితేహితమున్ – తత్=ఆచంద్రికయొక్క, అస్తోక=అధిక మగు, ఆశయ=అభిప్రాయమందు, ‘అభిప్రాశ్ఛన్ద ఆశయః’ అని యమరుఁడు,ఆలంబిత=లగ్నమగు, ఈహితమున్=కోరి కను; బోటులచేన్=స్త్రీలచేత; ఎఱింగి=తెలిసికొని; తదమూల్యేష్టార్థసంసిద్ధికై – తత్=ఆచంద్రికయొక్క, అమూల్య=వెలలేని, ఇష్టార్థ=మనోరథముయొక్క, సంసిద్ధికై=ప్రాప్తికొఱకు; చతురత్వంబునన్=నేర్పుతోడ; తత్స్వయంవరవిధిన్ – తత్= ఆ చంద్రికయొక్క, స్వయంవర=స్వయంవరముయొక్క, విధిన్= విధానమును; చాటింపన్=చాటించుటకై, వే=శీఘ్రముగా; భట=బంట్లయొక్క, ప్రతతిన్=సమూహమును; పంచెన్=ఆజ్ఞాపించెను.
క్షణదోదయరాజు తనకొమార్తె యగు చంద్రికయొక్క యిష్టార్థమును, ఆపెయౌవనావిర్భావమును, స్త్రీలవలనఁ దెలిసికొని స్వయంవరమునకై యత్నించి చాటింప భటులం బంచెనని భావము.
చ. ధరణీనాథభటచ్ఛటాముఖరితో◊ద్యచ్చంద్రికైకస్వయం
వరకర్ణేజపడిండిమాదికమహా◊వాదిత్రనాదంబు దు
స్తరమై యత్తఱిఁ బొల్చె నద్భుతగతి ◊న్సప్తార్ణవీమధ్యభూ
వరకోటీపుటభేదనౌఘవిశిఖా◊వల్గుప్రఘాణంబులన్. 4
టీక: ధరణీనాథ భటచ్ఛటా ముఖరి తోద్య చ్చంద్రి కైక స్వయంవర కర్ణేజప డిండిమాదిక మహావాదిత్ర నాదంబు – ధరణీనాథ= క్షణదోదయునియొక్క, భటచ్ఛటా=బంట్లగుంపుచే, ముఖరిత=మ్రోయింపఁబడినట్టియు, ఉద్యత్=ప్రకాశించుచున్నట్టియు, చంద్రికా=చంద్రికయొక్క, ఏక=ముఖ్యమగు, స్వయంవర=స్వయంవరోత్సవమునకు, కర్ణేజప=సూచకమగు, ఇచట ‘స్తమ్బ కర్ణయోరమిజపోః’ అని యచ్ప్రత్యయము, ‘తత్పురుషే కృతి బహుళ’మని విభక్తిలోపము లేదు, డిండిమాదిక=డిండిమము మొదలుగాఁగల, మహావాదిత్ర=అధికమగు నాతోద్యముయొక్క, ‘వాదిత్రాతోద్యనామక’ మని యమరుఁడు, నాదంబు=ధ్వని; సప్తార్ణవీ మధ్య భూవర కోటీ పుటభేద నౌఘ విశిఖా వల్గు ప్రఘాణంబులన్ – సప్తార్ణవీ=ఏడుసముద్రములయొక్క, సప్తానా మర్ణ వానాం సమాహారః అను విగ్రహమునందు ‘అకారాంతోత్తరపదోద్విగుస్త్రియా మిష్టః’ అను వార్తికమువలన స్త్రీత్వము, టిడ్ఢాణ ఞిత్యాదిసూత్రమువలన స్త్రీప్రత్యయము వచ్చినదని యెఱుంగునది, మధ్య=మధ్యభాగమునందున్న, భూవర=రాజులయొక్క, కోటీ=సమూహముయొక్క, పుటభేదన=పట్టణములయొక్క, ఓఘ=సంఘముయొక్క, విశిఖా=రాజమార్గములందలి, వల్గు =సుందరమగు, ప్రఘాణంబులన్=అళిందములయందు; అద్భుతగతిన్=అత్యాశ్చర్యమగురీతిచేత; దుస్తరమై=అధికమైనదై; అత్తఱిన్=ఆసమయమందు; పొల్చెన్=ఒప్పెను.
క్షణదోదయరాజభటులచే మ్రోయింపఁబడిన స్వయంవరసూచకమగు డిండిమారవము సప్తసముద్రముల మధ్యమున నుండు భూపతుల ప్రఘాణములందు నొప్పె ననిభావము. రాజధానులయం దంతటను డిండిమములు మ్రోయించిరని ముఖ్యా శయము.
మ. శ్రవణాభ్యుత్సవపోషయిత్నుసముదం◊చద్భూరిభేరీసము
ద్భవభాంకారము లప్డు మేల్కన నద◊భ్రప్రావృషేణ్యాంబుదా
రవభంగి న్సుమకాండకోదయసమ◊గ్రత్వంబు చాలం దలం
ప విచిత్రం బొకొ చిత్తవీథి నవనీ◊పశ్రేణికిం జేరుటల్. 5
టీక: శ్రవ ణాభ్యుత్సవ పోషయిత్ను సముదంచ ద్భూరి భేరీ సముద్భవ భాంకారములు – శ్రవణ=వీనులకు, అభ్యుత్సవ=ఆనం దమును, పోషయిత్ను=పోషించునట్టి, సముదంచత్=మిక్కిలి యొప్పుచున్న, భూరి=విశాలమగు, భేరీ=దుందుభులవలన, సముద్భవ=పుట్టినట్టి, భాంకారములు =భాం అనెడు ధ్వనులు; అప్డు=ఆసమయమందు; మేల్కనన్=మేలుకొనఁగా; అదభ్ర ప్రావృషేణ్యాంబుదారవ భంగిన్ – అదభ్ర=అధికమగు, ప్రావృషేణ్య=వర్షాకాలమందుఁ బుట్టిన, ‘ప్రావృష ఏణ్యః’ అని ఏణ్య ప్రత్యయము, అంబుద=మేఘములయొక్క, ఆరవ=ధ్వనులయొక్క, భంగిన్=రీతిచేత; సుమకాండకోదయసమగ్రత్వంబు – సుమకాండక=పుష్పసముదాయముయొక్క, ఉదయ=ఆవిర్భావముయొక్క, సమగ్రత్వంబు=పరిపూర్ణత; నవనీపశ్రేణికిన్—నవ=క్రొత్తనగు, నీప=కడిమిచెట్లయొక్క, శ్రేణికిన్=పంక్తికి; చేరుటల్=పొందుటలు; చిత్తవీథిన్=హృదయమందు; తలంపన్= ఆలోచింపఁగ; చాలన్=మిక్కిలి; విచిత్రం బొకొ=విచిత్రమా? కాదనుట. ఇచట, అవనీపశ్రేణికిన్ – అవనీప=రాజులయొక్క, శ్రేణికిన్=సమూహమునకు; సుమకాండ కోదయ సమగ్రత్వంబు – సుమకాండక=పూఁదూపులుగల వలఱేనియొక్క, ఉదయ =ఆవిర్భావముయొక్క, సమగ్రత్వంబు=పరిపూర్ణత; చేరుటలు చిత్రము గాదని స్వభావార్థము.
అనఁగా వర్షాకాలిక మేఘగర్జితశ్రవణము కాఁగానే కడుములకుఁ గుసుమములు గలిగినట్లు స్వయంవరోత్సవసూచకమగు భేరీనినాదము చెవిసోఁకగానే భూపతులకు మన్మథావేశము గలిగె నని భావము.
చ. కమలశరుండు ప్రాప్తకట◊కాముఖవైఖరి నిక్షుచాపవ
ర్యము గొని కూర్చు భంభరగు◊ణారవ మెంతయు నాత్మనా ద్వితీ
య మయి యెసంగ దేశవసు◊ధాధిపముఖ్యపురీలలామబృం
దములఁ జెలంగెఁ దత్పటహ◊నవ్యగభీరనినాద మత్తఱిన్. 6
టీక: త త్పటహ నవ్య గభీర నినాదము – తత్=ఆస్వయంవరోత్సవసంబంధి యగు, పటహ= భేరియొక్క, నవ్య=నూతన మగు, గభీర=గంభీరమగు, నినాదము=ధ్వని; అత్తఱిన్=ఆసమయమందు; కమలశరుండు=మరుఁడు; ప్రాప్తకటకాముఖ వైఖరిన్ –ప్రాప్త=పొందఁబడిన, కటకాముఖ=నడిమివ్రేళ్ళసందున బొటనవ్రేలు చొప్పించి యఱచేతిచాయ వ్రాల్చి యుంగరపు వ్రేలిని చిటికెనవ్రేలిని నించుకంతవంచి పొడవుగా పట్టిన హస్తవిశేషముయొక్క, వైఖరిన్=రీతిచేత; నిక్షుచాపవర్యము =మేలగు చెఱకువింటిని; కొని=గ్రహించి; కూర్చు భంభరగుణారవము=జతపఱచు తుమ్మెదయల్లెత్రాటి మ్రోఁత; ఎంతయున్=మిక్కిలి; ఆత్మనా ద్వితీయము అయి = తనచేత రెండవదై, ‘ఆత్మనశ్చ పూరణే’ అని తృతీయకు లుక్కు లేదు; ఎసంగన్= అతిశయిం పఁగ; దేశ వసుధాధిప ముఖ్యపురీలలామ బృందములన్ – దేశ=దేశమునందలి, వసుధాధిప=రాజులయొక్క, ముఖ్యపురీ లలామ= రాజధానీశ్రేష్ఠములయొక్క, బృందములన్=సమూహములందు; చెలంగెన్=ఒప్పెను.
మ. మును తాతస్తతలోకవాగమృతసం◊భూతిం గడుం జంద్రికా
వనితామోహముఁ గాంచి మన్మథశర◊జ్వాలావళిం గుందు వి
శ్వనరాధీశ్వరకోటికిం ద్వర యిడె ◊న్స్వాంతప్రియంభావుకా
తనుతద్ఘోషము తత్స్వయంవరముఁ జెం◊దం బోవ నప్పట్టునన్. 7
టీక: మును=పూర్వమందు;తాతస్తతలోకవాగమృతసంభూతిన్ – తాతస్తత=అచ్చటచ్చటనుండి వచ్చిన, ఇచట ‘తత ఆగతః’ అని అణ్ ప్రత్యయము. ‘అవ్యయానాం భమాత్రే టిలోపః’ అని టిలోపము వచ్చినది, లోక=జనులయొక్క, వాగమృత=సుధ వంటి వచనమువలన, సంభూతిన్=పుట్టుకగల; కడున్=అధికమగు; చంద్రికావనితామోహమున్ – చంద్రికావానితా=చంద్రిక యనెడు స్త్రీయందలి, మోహమున్=వలపును; కాంచి=పొంది; మన్మథశరజ్వాలావళిన్ – మన్మథశర=మరుతూపులయొక్క, జ్వాలా=మంటలయొక్క, ఆవళిన్=పంక్తిచే; కుందు విశ్వ ధరాధీశ్వర కోటికిన్ – కుందు=పరితపించు, విశ్వ=ప్రపంచము నందలి, ధరాధీశ్వర=భూపతులయొక్క,కోటికిన్=సమూహమునకు; స్వాంత ప్రియంభావుకాతను తద్ఘోషము – స్వాంత= చిత్తములకు, ప్రియంభావుక=ప్రియమగు, అతను=అధికమగు, తద్ఘోషము=ఆస్వయంవరసూచకమగు భేరీనాదము; తత్స్వ యంవరమున్=ఆచంద్రికాస్వయంవరమును; చెందన్ పోవన్=చేరఁబోవుటకు; అప్పట్టునన్=ఆసమయమందున; త్వర = వేగిరపాటును; ఇడెన్=ఇచ్చెను. అనఁగా నచ్చటచ్చటనుండి వచ్చుచున్నజనులవలన క్షణదోదయరాజకుమారిక యగు చంద్రికయొక్క చక్కఁదన మును విని, వలపు చెందియుండిన రాజు లాచంద్రికాస్వయంవరమహోత్సవసూచకమగు భేరీనాద మును విని సంతసించి, యా స్వయంవరోత్సవమునకుఁ బోవ నుద్యమించి రని భావము.
మ. వరభంభాకులనిస్వనప్రతతి న◊వ్వామావతంసస్వయం
వరభద్రోన్నతి యెయ్యెడ న్దెలిసెనో ◊వైళంబె యవ్వేళ న
వ్యరతిశ్రీగతి నేగఁగాఁ దొడఁగె వి◊శ్వారాట్కులం బౌర యు
ర్వర నేమంచు నుతింపవచ్చు జలజా◊స్త్రస్ఫీతమాయావిధిన్. 8
టీక: వర భంభాకుల నిస్వన ప్రతతిన్ – వర=శ్రేష్ఠమగు, భంభాకుల=భంభ యను ధ్వనిచయముగల, నిస్వన=ధ్వనులయొక్క, ప్రతతిన్=సమూహముచేత; అవ్వామావతంస స్వయంవరభ ద్రోన్నతి – అవ్వామావతంస=నారీశ్రేష్ఠయగు నాచంద్రికయొక్క, స్వయంవరభద్ర=స్వయంవరమంగళముయొక్క, ఉన్నతి=అతిశయము; ఎయ్యెడన్=ఏవేళ; తెలిసెనో; వైళంబె=శీఘ్రముగ; అవ్వేళన్=ఆవేళయందే; నవ్య రతి శ్రీ గతిన్ – నవ్య=నూతనమగు, రతి=అనురాగముయొక్క, శ్రీ=సంపదయొక్క, అనఁగ ననురాగాతిశయముయొక్క యనుట, గతిన్=ప్రాప్తిచేత; విశ్వారాట్కులంబు=నరపతిసమూహము, ‘విశ్వస్య వసురాటోః’ అను సూత్రమువలన విశ్వశబ్దమునకు దీర్ఘమని తెలియునది; ఏగఁగాన్=పోవుటకు; తొడఁగెన్=ప్రయత్నించెను; ఔర=ఆశ్చ ర్యము; జలజాస్త్ర స్ఫీత మాయావిధిన్—జలజాస్త్ర=మన్మథునియొక్క, స్ఫీత=అధికమగు, మాయావిధిన్=మాయావిధాన మును; ఉర్వరన్=భూమియందు; ఏమంచున్=ఏమనుచు; నుతింపవచ్చున్= కొనియాడవచ్చును?
అనఁగా స్వయంవరోత్సవసూచకమగు భేరీనాదము వినినతోడనే నరపతిసంఘము చంద్రికయం దనురాగముఁ బూని యాయుత్సవమునకుఁ బోవ నుపక్రమించెను. అహహ! మన్మథునిమాయ నేమని కొనియాడవచ్చు నని భావము.
చ. నెలఁత వరించుఁ దమ్మిదియె ◊నిక్కమటంచుఁ దలంచి వేడుక
న్గలసి పయోజబాణజయ◊కారణరూపసహాయత న్విరా
జిలు సకలాంతరీపనృప◊శేఖరు లెల్లఁ బ్రయాతుకాములై
వెలలిరి దంతిచక్రపద◊వీతిపదాతిసమూహసంవృతిన్. 9
టీక: నెలఁత=చంద్రిక; తమ్మున్; వరించున్=కోరును; ఇదియె నిక్కము=ఇదియే నిశ్చయము; అటంచున్=అనుచు; తలంచి =ఎంచి; వేడుకన్=సంతసముచేత;పయోజబాణజయ కారణ రూప సహాయతన్ – పయోజబాణజయ=మన్మథజయము నకు, కారణ=హేతువగు, రూప=చెలువముయొక్క, సహాయతన్=తోడ్పాటుచేత; విరాజిలు సక లాంతరీపనృపశేఖరు లెల్లన్ –విరాజిలు =ప్రకాశించుచున్న, సకల=సమస్తమగు, అంతరీపనృపశేఖరులు=ద్వీపాంతరాధిపతులగు రాజశ్రేష్ఠులు, ఎల్లన్= అందఱును; ప్రయాతుకాములై = పోనిచ్ఛగల్గినవారై, ‘తుం కామ మనసోరపి’ అనుదానివలన తుమున్నకారమునకు లోపమని యెఱుఁగునది; దంతి చక్రపద వీతి పదాతి సమూహ సంవృతిన్ – దంతి=ఏనుఁగులయొక్క, చక్రపద=రథములయొక్క, వీతి= గుఱ్ఱములయొక్క, పదాతి=కాల్బ లముయొక్క, సమూహ=గుంపుయొక్క, సంవృతిన్=కూడికచేతను; కలసి=కూడి; వెల లిరి = బయలుదేఱిరి.
అనఁగా నీచంద్రిక తమనే వరించునని నమ్మి సంతసముతో మన్మథుని నిరసించు నందము గల సకలద్వీపాధిపతులగు రాజులు సేనలతోఁ గూడి వెడలి రని భావము.