చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము

వ. అని తెలిపియాయుర్వీశుపై మనంబు పర్వ కునికి నాశర్వప్రేయసి సుపర్వరాజగర్వాపహవైభవ ధూర్వహుం డగు నొక్కరాజకులోద్వహుం జేర నియోగించి యాపర్వేందువదన కతనిం జూపి యిట్లనియె. 89

టీక: అని తెలిపి =ఈప్రకారము తెలియఁజేసి;ఆయుర్వీశుపైన్=ఆరాజుమీఁద; మనంబు=చిత్తము; పర్వకునికిన్=పొసఁగ కుండుటచేత; ఆశర్వప్రేయసి=ఆపార్వతీదేవి; సుపర్వరాజగర్వాపహవైభవధూర్వహుండు – సుపర్వరాజ=ఇంద్రునియొక్క, గర్వ=అహంకారమును, అపహ=పోఁగొట్టునట్టి, వైభవ=విభవముయొక్క, ధూర్వహుండు=భారమును వహించినవాఁడు; అగు నొక్కరాజకులోద్వహున్= ఐనట్టి ఒకానొక రాజశ్రేష్ఠుని; చేరన్=పొందునటులు; నియోగించి =ఆజ్ఞాపించి; ఆపర్వేందు వదనకున్=పున్నమచంద్రునివంటి ముఖముగల యాచంద్రికకు; అతనిం జూపి =ఆరాజును చూపెట్టి; ఇట్లనియెన్=వక్ష్యమాణ ప్రకారముగ వచించెను.

మ. వనితా! కన్గొను కాశరా జితఁడు దై◊వాఱు న్మహిన్ రాజరా
జన నార్యేశ్వరమైత్రి సద్ద్రవిణధు◊ర్యత్వంబు నాత్మాంఘ్రిసే
వనతాత్పర్యయుతాప్తపుణ్యజనశ◊శ్వత్సంపదాపాదకాం
చనధీవృత్తియు సార్వభౌమనిభృతా◊శాగుప్తియుం బూనుచున్. 90

టీక: వనితా=చంద్రికా! ఇతఁడు=ఈభూపతి; కాశరాజు=కాశదేశాధిపతి; మహిన్=భూమియందు; రాజరాజనన్ =కుబేరుఁ డనఁగ, రాజశ్రేష్ఠుఁ డనఁగ; ఆర్యేశ్వరమైత్రిన్—ఆర్యేశ్వర=పార్వతీపతియొక్క, సత్పురుషశ్రేష్ఠులయొక్క, మైత్రిన్= స్నేహ మును; సద్ద్రవిణ ధుర్యత్వంబున్ – సత్=శ్రేష్ఠమగు, ద్రవిణ=ధనముయొక్క,బలముయొక్క,ధుర్యత్వంబున్=ధురీణత్వ మును; ఆత్మాంఘ్రిసేవన తాత్పర్య యుతాప్త పుణ్యజన శశ్వ త్సంప దాపాద కాంచన ధీవృత్తియున్ – ఆత్మ=తనయొక్క, అంఘ్రిసేవన=పాదసేవనమందు, తాత్పర్య=తత్పరత్వముచేత, యుత=కూడుకొన్న, ఆప్త=ఇష్టులగు, పుణ్యజన=పుణ్య పురుషులకును, యక్షులకును, శశ్వత్ =ఎల్లకాలము, సంపదాపాదక=ఐశ్వర్యము నిచ్చునట్టి, అంచన=ప్రకాశించుచున్న, ధీవృత్తి యున్=చిత్తవృత్తిని; సార్వభౌమ నిభృతాశాగుప్తియున్ – సార్వభౌమ=చక్రవర్తిత్వముచేత, నిభృత=పోషింపఁబడిన, ఆశా= దిక్కులయొక్క, గుప్తియున్= పాలనమును; సార్వభౌమ= సార్వభౌమ మను దిగ్గజముచేత, నిభృత=భరింపఁబడిన, ఆశా= ఉత్తరదిక్కుయొక్క, గుప్తియున్= పాలనమును; పూనుచున్=గ్రహించుచు; దైవాఱున్=అతిశయించును; కన్గొను= చూడుము. అనఁగ నీరాజు కుబేరునిపగిది నార్యేశ్వరమైత్రి, సద్ద్రవిణధుర్యత్వమును, పుణ్యజనసంపదాపాదకత్వమును, సార్వభౌమనిభృతాశాగుప్తిని పొంది ప్రకాశించు చున్నాఁడని భావము.

సీ. గురుపద్మినీరాగ◊గుంభితస్వాంతంబుఁ, గని యొప్పుఁ జక్రప◊క్షప్రతాన,
మతివేల మధుపాళి◊కాప్తిచే నెవ్వేళ, నలరారుఁ బారిజా◊తాగమౌళి,
బాడబవర్ధన◊ప్రౌఢిప్రచారంబు, భాసిల్లఁ గడుఁ బొంగుఁ ◊బాలకడలి,
సద్వసుహారియై ◊సంలబ్ధదోషాను,సృతిఁ బొల్చు వాసతే◊యీశ్వరుండు,
తే. తత్సమాసక్తిఁ బంకసం◊తతిఁ గరంబు,ను విరళశ్రీ వహించుఁ గై◊రవచయంబు
ననఘమై మించు నీమేటి◊యశముతోడ, సాటి యగు నెట్లు సారస◊జ్ఞాతినయన! 91

టీక: సారసజ్ఞాతినయన =కమలములవంటి నేత్రములు గల చంద్రికా! చక్రపక్ష ప్రతానము=హంసలగుంపు; గురుపద్మినీరాగ గుంభితస్వాంతంబున్ – గురుపద్మినీ=గురుభార్యయందు, రాగ=అనురాగముచేత, గుంభిత=పూరితమగు,స్వాంతంబున్ = చిత్తమును; కని=పొంది; ఒప్పున్=ఒప్పును; గురు=అధికమగు, పద్మినీ=పద్మలతయందు,రాగ=అనురాగముచేత, గుంభిత = పూరితమైన, స్వాంతంబున్=చిత్తమును అని స్వాభావికార్థము; పారిజాతాగమౌళి=కల్పవృక్షము;అతివేల మధుపాళికాప్తిచేన్ – అతివేల=అధికమగు, మధుపాళికా=మద్యపాయుల గుంపు యొక్క, ఆప్తిచేన్=ప్రాప్తిచేత; ఎవ్వేళన్=ఎల్లకాలము; అలరారున్ =ప్రకాశించును; మధుపాళికా=భృంగసంఘముయొక్క ప్రాప్తిచేత నని స్వభావార్థము; పాలకడలి=పాలసముద్రము;బాడబ=బ్రాహ్మణులయొక్క, వర్ధన=ఛేదనమందలి, ప్రౌఢి=నేర్పుయొక్క,ప్రచారంబు=వ్యాపా రము; భాసిల్లన్=ప్రకాశింపఁగ;కడున్=మిక్కిలి; పొంగున్=ఉబుకును; బాడబ=బడబాగ్నియొక్క, వర్ధన=వృద్ధిఁబొందించుట యందలి, ప్రౌఢి=నేర్పుయొక్క ప్రచారము నని స్వభావార్థము; వాసతేయీశ్వరుండు =చంద్రుఁడు, ‘వసతి ర్వాసతేయీచ శ్యామా రాత్రిశ్చ కథ్యతే’ అని హలాయుధనిఘంటువు; సద్వసు హారియై=సత్పురుషుల ద్రవ్యము నపహరించినవాఁడై, సంలబ్ధదోషానుసృతిన్ – సంలబ్ధ=పొందఁబడిన, దోష=పాపము యొక్క, అనుసృతిన్=అనుసరణముచేత; పొల్చున్=ఒప్పును. సద్వసుహారియై=రిక్కలకాంతిని హరించినవాఁడై, సంలబ్ధ దోషానుసృతిన్=పొందబడిన రాత్రియొక్క, అనుసరణముచేత నని స్వభావార్థము. కైరవచయంబు=తెల్లగలువల గుంపు; తత్సమాసక్తిన్ – తత్=ఆదోషాకరునియొక్క, సమాసక్తిన్=సంబంధముచేతను; పంక సంతతిన్=పాపచయముచేత; కరంబును=మిక్కిలి; విరళశ్రీన్=విరళకాంతిని; వహించున్=పొందును. తత్సమాసక్తిన్=చంద్ర సంబంధమును, పంకసంతతిన్= బురదగుంపును, విరళశ్రీన్=రాత్రియందుకాంతి, నని స్వభావార్థము.అనఘమై=పాపరహితమై; మించు=ప్రకాశించు; ఈమేటియశముతోడన్=ఈఘనుని కీర్తితోడను; సాటి=సమానము; ఎట్లు = ఏరీతిగ; అగున్? కాదనుట.

అనఁగ నోచంద్రికా! గురుపద్మినియం దనురాగము గలిగి రాగవర్తనచే నుండు హంసవితతి, మధుపాయులబృందముచే నావరింపఁబడి మించు వేల్పులమ్రాఁకు, బాడబవర్ధనప్రచారమున మించు పాల్కడలి, సద్వసువులను హరించి దోషాకరుఁడగు చంద్రుఁడు, దోషాకరసంబంధముచేతను, పంకసంకరముచేతను స్వల్పకాంతిని బొందియున్న కైరవచయము, నిర్దుష్టమై, పాప రహితమై, ఎల్లప్పుడును మించు నీఘనునికీర్తికి సాటి కా వని భావము.

చ. వలదొర మీఱురూపు దయి◊వాఱఁగ రాజిలు నిర్జరాధిపో
పలనిభనీలవర్ణు మహి◊పాలకశేఖరు వీనిఁ బెండ్లియై
నెలఁతుక యీమహాత్ము నెద ◊నిచ్చలుఁ బాయక యుండు మంజనా
చలతటభాసమాననవ◊చంపకవల్లి తెఱంగు పూనుచున్. 92

టీక: వలదొర మీఱురూపు – వలదొరన్=మన్మథుని, మీఱు=అతిశయించు, రూపు=చక్కదనమును; దయివాఱఁగన్ =అతిశయింపఁగా; రాజిలు నిర్జరాధిపోపలనిభనీలవర్ణున్ – రాజిలు=ఒప్పునట్టి, నిర్జరాధిపోపల=ఇంద్రనీలమణులకు,నిభ=సమాన మైన, నీలవర్ణున్=నల్లనికాంతిగల; మహిపాలకశేఖరున్=రాజశ్రేష్ఠుఁడగు;వీనిన్=ఈరాజును; పెండ్లియై=వివాహమాడి; నెల తుఁక=చంద్రికా! అంజనాచలతటభాసమాననవచంపకవల్లి తెఱంగు – అంజనాచల=నీలాద్రియొక్క,తట=ప్రదేశమందు, భాస మాన=ప్రకాశించుచున్న, నవ=నూతనమైన,చంపకవల్లి=సంపెఁగతీవయొక్క, తెఱంగు=రీతిని; పూనుచున్=పొందుచు; ఈమహాత్మునెదన్=ఈరాజువక్షస్థలమునందు; నిచ్చలున్=ఎల్లకాలము; పాయక=వీడక; ఉండుము.

ఇంద్రనీలవర్ణము గలిగి మన్మథునిఁ దిరస్కరించు రూపముగల యీరాజును బెండ్లియాడి, వీని యురమునందు, అంజనా చలముమీఁద నున్న చంపకవల్లి తెఱంగునఁ బ్రకాశింపు మని భావము. ఉపమాలంకారము.

తే. అనఁగ నమ్మాట వినియును ◊నలర కున్కి,తెలిసి మఱియొక్కభూపాల◊తిలకుఁ జేరఁ
దార్చి శర్వాణి రాజనం◊దనను బలికెఁ, దద్గుణశ్రేణి యమృతజి◊ద్భవ్యవాణి. 93

టీక: శర్వాణి =పార్వతీదేవి; అనఁగన్=ఇట్లు పలుకఁగా; అమ్మాటన్=ఆవచనమును; వినియును=ఆకర్ణించియు; అలర కున్కి=సంతసింపకుండుటను;తెలిసి=ఎఱింగి; మఱియొక్కభూపాలతిలకున్=మఱియొక రాజశ్రేష్ఠుని; చేరన్=పొందునట్లు;తార్చి=చేసి; రాజనందనను =చంద్రికనుగూర్చి; అమృతజిద్భవ్యవాణిన్ =సుధను తిరస్కరించు మధురవచనముచేత; తద్గుణ శ్రేణిన్=ఆరాజుగుణముల పంక్తిని; పలికెన్=వచించెను.

మ. అనవద్యద్యుతి నంగభూమిపతి నో◊యబ్జాక్షి వీక్షింపు మొ
య్యన నేతన్నృపధాటికానవకథా◊వ్యాఖ్యాతృభేరీకుల
స్వనసంద్రావితనాథవద్రిపుపురీ◊జాతంబు కాంతారత
న్మనఁ జిత్రం బగుఁ గాదె గోత్ర కవనీ◊నామంబు చేకూఱుటల్. 94

టీక: ఓయబ్జాక్షి =ఓచంద్రికా!అనవద్యద్యుతిన్—అనవద్య=నిర్దుష్టమగు, ద్యుతిన్=కాంతిగల; అంగభూమిపతిన్=అంగదేశా ధిపతిని; ఒయ్యనన్=తిన్నగ; వీక్షింపుము=చూడుము; ఏతన్నృప ధాటికా నవ కథా వ్యాఖ్యాతృ భేరీకుల స్వన సంద్రావిత నాథవ ద్రిపుపురీ జాతంబు – ఏతన్నృప=ఈఅంగపతియొక్క, ధాటికా=జైత్రయాత్రయొక్క, నవ=నూతనమగు, కథా= ప్రబం ధమును, వ్యాఖ్యాతృ=వ్యాఖ్యానముచేయుచున్న, భేరీకుల=రణభేరీబృందముయొక్క, స్వన=ధ్వనిచేత, సంద్రావిత=పాఱఁ గొట్టఁబడ్డ, నాథవత్=ప్రభువులుగల, రిపుపురీ=శత్రునగరములయొక్క,జాతంబు=బృందము; కాంతారతన్=అరణ్యత్వము చేత; మనన్ =వృద్ధిఁబొందఁగా; గోత్రకున్=భూమికి; అవనీనామంబు=అవని,అనగా అడవులు లేనిదనెడి పేరు (అవని యను నది భూమికి నామాంతరము); చేకూఱుటల్=సమకూడుటలు; చిత్రం బగుఁగాదె =ఆశ్చర్యకరమగునుగదా!

అనఁగ నంగభూపాలుని రణభేరీనాదమును విని శత్రురాజులు పాఱిపోవుటవలన వారి నగరములు వనమయమైపోయి నను భూమికి అవని (వనములు=అడవులు, లేనిది) అని పేరుండుట చిత్రంబని తాత్పర్యము. అనఁగ శత్రుపురములు అరణ్య ప్రాయము లైనవని ముఖ్యాశయము.

సీ. అభ్రంబు రాయుపు◊ణ్యజనాలయంబులఁ, గమలించి తగుకీలి ◊నమరు శూలి,
సరసచక్రము లాత్మ◊సాధ్వసం బంద వి,షశ్రేణుల నొసంగు◊జలధరంబు,
కడు సదాళుల మోద◊గరిమఁ బెంప నెసంగు, నతనుశస్త్రము లూను◊నమరతరువు,
ఘనబుధద్యుమ్నంబు ◊గొని యజ్ఞహితభావ,మలర ధాత్రి రహించు◊ బలిసురారి,

తే. లలి గురుక్షేత్రము హరించి ◊ చెలఁగు రాజు, నితరరామలరసగతి ◊నెనయు నుదధి
యింతి మదిలో ననాతతా◊యిత వహించు, నివ్విభుని సాటి గా నీగి ◊నెన్నఁ దరమె. 95

టీక: అభ్రంబు రాయుపుణ్యజనాలయంబులన్ – అభ్రంబు రాయు=మిన్నొరయు, పుణ్యజన=పుణ్యాత్ములయొక్క, ఆల యంబులన్=గృహములను; కమలించి=కాల్చి; తగుకీలిన్ =ఒప్పుచున్న వహ్నిచేత; అమరు శూలి=ఒప్పుచున్నశంకరుఁడు; పుణ్యజన=రాక్షసులయొక్క, త్రిపురాసురులయొక్క, ఆలయంబులన్=త్రిపురములను, కాల్చిన యగ్నినేత్రముగలవాఁడని స్వభావార్థము;సరసచక్రములు=రసికబృందములు; ఆత్మన్=మనమునందు;సాధ్వసంబు=భయమును; అందన్= పొందునట్లు;విషశ్రేణులన్ = గరళపంక్తులను; ఒసంగు=ఇచ్చుచున్న; జలధరంబు=మేఘము; శ్రేష్ఠములగు హంసలు మనమున భయమొందునట్లుగా జలధారల నొసంగు మేఘ మని స్వభావార్థము; కడున్=మిక్కిలి;సదాళుల మోదగరిమన్ – సత్=సత్పురుషులయొక్క,ఆళుల=పంక్తులయొక్క,మోద=సంతసముయొక్క, గరిమన్=అతిశయమును; పెంపన్=ఖండించుటకు; ఎసంగు అతనుశస్త్రములు – ఎసంగు=విజృంభించుచున్న, అతను=అధిక ములగు, శస్త్రములు=ఆయుధములను; ఊను అమరతరువు=పొందినట్టి వేల్పులమ్రాఁకు; కడున్=మిక్కిలి, సదా=ఎల్లపుడు, అళుల=తుమ్మెదలయొక్క, మోదగరిమన్=సంతోషాతిశయమును, పెంపన్=వృద్ధిఁబొందించుటకు, ఎసంగు =ఒప్పుచున్న, అతనుశస్త్రములు=పుష్పములను, పొందినట్టి వేల్పులమ్రాఁకు,అని స్వభావార్థము. ఘనబుధద్యుమ్నంబు – ఘన=అధికమగు, బుధ=విద్వాంసులయొక్క,ద్యుమ్నంబు=అర్థమును; కొని=గ్రహించి; అజ్ఞహిత భావము – అజ్ఞ=మూఢులకు,హిత=అనుకూలమగు,భావము=అభిప్రాయము;అలరన్=ఒప్పునట్లు; ధాత్రిన్=భూమియందు; రహించు=ఒప్పుచున్న, బలిసురారి=బలిచక్రవర్తి; దేవతలయొక్క ద్రవ్యమును గొని జన్నమునకు హితమగు భావ మలర నొప్పు చున్నవాఁడని స్వభావార్థము. లలిన్=ఆసక్తిచేత; గురుక్షేత్రము=ఆచార్యుని భూమిని; హరించి=అపహరించి; చెలఁగు రాజు=ప్రకాశించుచున్న చంద్రుఁడు; బృహస్పతిభార్యను హరించి యొప్పినవాఁడని స్వభావార్థము. ఇతరరామలరసగతిన్ – ఇతరరామలన్=పరస్త్రీలను; రసగతిన్=అనురాగరీతిచేత; ఎనయు నుదధి – ఎనయు =పొందు చున్నసముద్రుఁడు; ఇత=పొందఁబడిన, రర=ధ్వనిగల, అమల=స్వచ్ఛమగు, రస=ఉదకముయొక్క, గతిన్=ప్రాప్తిని, పొందినట్టివాఁడని స్వభావార్థము.ఇంతి=చంద్రికా! మదిలోన్=మనమునందు; అనాతతాయితన్=ఆతతాయు లనఁగా ‘అగ్నిదో గరద శ్చైవ శస్త్రపాణి ర్ధనాపహః’ ఇత్యాదివచనమందుఁ జెప్పఁబడినవారు. వీరు గానివాఁడు అనాతతాయి, వీనిధర్మము అనాతతాయిత, ఇట్టిధర్మమును; వహించు నివ్విభునిన్=వహించుచున్న యీరాజుకు, సాటిగా= సమానముగా, ఈగిన్=వితరణమందు; ఎన్నఁ దరమె = లెక్క పెట్టఁదరమా? కాదనుట.

అనఁగా త్యాగశీలుండై, యనాతతాయి యగు నీరాజుతో నీగియందు సజ్జనగృహములనుగాల్చిన శివుండును, సరసబృంద మునకు విషంబిడిన జలధరుండును, అతనుశస్త్రము లూనిన పారిజాతతరువును, పరద్రవ్యమును హరించిన బలియు, గురు క్షేత్రము నపహరించిన చంద్రుఁడును, పరస్త్రీలపొందెనసిన సముద్రుండును ఆతతాయు లగుటచే సాటి గారని భావము.

మ. పరసత్యప్రియభావభావుకలస◊ద్వర్ణాంచితశ్రీద్విజో
త్కరసంరక్షణదక్షిణాశయుని లో◊కస్వామి నిమ్మేటి నం
బురుహమ్మన్యముఖీమచర్చిక! జగం◊బుల్ మే లనం బెండ్లియై
సరసీజాసనుఁ బల్కుచాన యన ని◊చ్చల్ మించు ముత్కంఠతోన్. 96

టీక: పర సత్య ప్రియ భావ భావుక లస ద్వర్ణాంచిత శ్రీ ద్విజోత్కర సంరక్షణ దక్షిణాశయునిన్ – పర=శ్రేష్ఠమగు, సత్య=నిజమందు, ప్రియ=ప్రీతిగల, భావ=భావముచేత,భావుక=భవ్యమగు,లసత్=ప్రకాశించుచున్న, వర్ణ=యశముచేత, అంచిత=ఒప్పు చున్న, శ్రీ=సంపదయును, ద్విజ=బ్రాహ్మణులయొక్క, ఉత్కర=సమూహముయొక్క, సంరక్షణ=పాలించుటయందు, దక్షి ణాశయునిన్=ఉదారమగు నాశయము గలవానిని; శ్రేష్ఠమగు సత్యలోకమందు, ప్రియభావభావుకములై, సత్ వర్ణ=శుక్లవర్ణము చేత, అంచిత=ఒప్పుచున్న, శ్రీ=కాంతితోఁగూడిన,ద్విజోత్కర=హంసబృందముయొక్క,సంరక్షణ=పాలించుటయందు, దక్షి ణాశయుని నని నలువపరమైన యర్థము దోఁచుచున్నది; లోకస్వామిన్=నరపతిని, నలువను, ‘హిరణ్యగర్భో లోకేశః’ అని యమరుఁడు; ఇమ్మేటిన్=ఈఘనుని; అంబురుహమ్మన్యముఖీమచర్చిక = (అమ్బురుహ మాత్మానం మన్యత ఇతి అమ్బు రుహం మన్య ముఖం యస్యా స్సా అమ్బురుహమ్మన్యముఖీ) తన్ను కమలమువలెఁ దలఁచు ముఖముగల స్త్రీలలో ప్రశస్తవగు చంద్రికా! జగంబుల్=లోకములు; మేలనన్=బాగు,బాగనఁగా; సరసీజాసనున్ పల్కుచాన యనన్=నలువను సరస్వతి యను నట్లు; పెండ్లియై=వివాహమాడి; నిచ్చల్=ఎల్లపుడు; ఉత్కంఠతోన్=సంతోషముతో; మించుము=అతిశయించుము. నలువను సరస్వతి పెండ్లియై నిచ్చలు మించుపగిది నీవీలోకస్వామిని వివాహమై యుత్కంఠతో నుండు మని భావము.