చంద్రికాపరిణయము – 1. ఉపోద్ఘాతము

(శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి“శిరోమణి” గారు 1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ ప్రచురించిన మూలప్రతికి వ్రాసినది)

(సువర్ణాక్షతలు)

కవుల ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసములను బట్టియు, వారివారి యభిరుచులు, సంస్కారములు, స్వభావములను బట్టియు కావ్యములు సామాన్యముగాను, ప్రౌఢములుగాను, ప్రౌఢతమములుగాను రూపొందుచుండును. అవి చదువువారి యంతస్తు లను బట్టి యర్థమగుటయు, ఆదరపాత్రము లగుటయు జరుగుచుండును. సుమతి, వేమన శతకములు మొదలుకొని ‘ఆముక్త మాల్యద, వసుచరిత్ర’ల వరకుఁగల కావ్యజాత మంతయు నిట్టి సోపానక్రమములోనే సహృదయుల యాదరమును బొందుచు నాంధ్రసరస్వతి కలంకారప్రాయమై యున్నది. అట్టివానిలో ప్రౌఢతమజాతికిఁ జెందినట్టిది యీ చంద్రికాపరిణయము. దీని యంతస్తును గురించి విద్వత్సార్వభౌములు, పండితకవులు నగు బ్ర||శ్రీ || వేదము వేంకటరాయశాస్త్రులవారు ఈక్రిందివిధముగాఁ దమ యభి ప్రాయము నొసఁగినారు.

“శ్రీమత్కొల్లాపురీ సంస్థానాధీశ్వరులలో ప్రాక్తనులైన శ్రీమాధవరాయనివారు రచించిన చంద్రికాపరిణయంబను ప్రాచీన గ్రంథమును ముద్రాక్షరాంకితముగాఁ గనునట్టి భాగ్యము నేఁటికొదవినది. వసుచరిత్రకన్న శ్లేషగాంభీర్యంబు గలిగి రసనిష్యంద నంబున విజయవిలాసముం బురణించుచు కల్పనాప్రౌఢియందు ఆముక్తమాల్యదం దలఁపించుచు అటనట న్యాయవైశేషికాది శాస్త్రమర్యాదల ననుసంధించుచు నుండు నీయతిప్రౌఢప్రబంధము వ్రాఁతపుస్తకములలో బహుదోషముల పాలయి యుండినది. దీనియర్థమును భేదించుట సామాన్యపండితులకును అశాస్త్రజ్ఞులకును శక్యముగాదు. అట్టి యీ కఠినగ్రంథమును విద్వత్సార్వ భౌములగు శ్రీమద్వెల్లాల సదాశివశాస్త్రి , శేషశాస్త్రులవారలు చేపట్టినందున దీనికి సమంజసమైన వ్యాఖ్య నిష్పన్నంబయి, యిది పండితులకు సుఖముగా నాస్వాదనీయం బయినది. ఇట్టి యీకావ్యమునకు వీరిచే వ్యాఖ్య చేయించి ముద్రింపించిన ప్రభువులకు శాశ్వతకీర్తియు, ఆంధ్రపండితులకు వారింగూర్చి యఖండకృతజ్ఞతయు పృథివియందు నెలకొన్నవి.”

మదరాసు 8-11-04 వేదము వేంకటరాయశాస్త్రి

శ్రీకవిసార్వభౌములగు మ.రా.రాజశ్రీ రావుబహద్దరు కందుకూరి వీరేశలింగం పంతులవారిచ్చిన యభిప్రాయము.

“తాము దయతో నంపిన శ్రీకొల్లాపురాధీశ్వర మాధవరాయకృత చంద్రికాపరిణయమును నే నక్కడక్కడఁ జదివి చూచితిని. మూలము వసుచరిత్రమువలె శ్లేషభూయిష్ఠమయి మృదుపదఘటితమయి యత్యంతప్రౌఢముగా నున్నది. శ్రీమద్వెల్లాల సదా శివశాస్త్రులవారిచేతను, అవధానము శేషశాస్త్రివారిచేతను రచియింపఁబడిన వ్యాఖ్యానము సామాన్యముగఁ బండితులకు సహి తము దురవగాహములుగా నుండు మూలభాగముల యర్థతాత్పర్యములను స్పష్టముగా వివరించునది యయి, వారి యస మానపాండిత్యమును వెల్లడించుచు సర్వవిధముల శ్లాఘాపాత్రమయి లోకోపకారార్థముగాఁ జంద్రికాపరిణయమును ముద్రిం పింపఁ బూనిన వర్తమాన కొల్లాపురాధీశ్వరులగు సురభి రాజా వేంకటలక్ష్మారావు బహద్దరుగారికిఁ గీర్తిదాయకమయి యున్నది. ఈ సవ్యాఖ్యాన చంద్రికాపరిణయ మాంధ్రమండలమునం దంతట వ్యాపించి శాశ్వతముగా నెలకొనుఁగాక!

ఇట్లు విన్నవించు భవద్విధేయాప్తుఁడు
కందుకూరి వీరేశలింగము

పై రెండభిప్రాయములవలన నీకావ్య మెంత ప్రౌఢతమమో స్పష్టమగుచున్నదికదా! కనుకనే కీ.శే. జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాధిపతులగు శ్రీశ్రీ సురభి రాజా వేంకటలక్ష్మారావు బహదర్, రాజానవాజ్‌వంతుగారు, తమ యాస్థానపండితులగు అవ ధానం శేషశాస్త్రులు, వెల్లాల సదాశివశాస్త్రులవారిచేత తమయభీష్టానుసారముగా రచింపఁబడిన శరదాగమసమాఖ్యవ్యాఖ్యా సహితముగాఁ జంద్రికాపరిణయమును క్రీ.శ. 1928లో రాజమహేంద్రవరం లలితాప్రెస్సునందు బ్ర.శ్రీ. చదలువాడ సుందరరామ శాస్త్రులవారి పర్యవేక్షణమున ముద్రింపించిరి. అట్టి చంద్రికాపరిణయప్రతులు ప్రస్తుత మాసంస్థానమువారియొద్దనే యేకొన్ని యో యున్నవి. అందఱికిని అందుబాటులో లేవు.

అందువలన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు ఇట్టి యున్నతస్థాయికి జెందిన మహాకావ్యము బహుళవ్యాప్తినిఁ బొంద వలయునన్నచో ప్రతులు మూలమాత్రములైనను సాహిత్యప్రియుల కరకమలములం దుండుట యావశ్యకమని యెంచి విపుల మగు పీఠికతోఁ గూడ దీని పునర్ముద్రణమునకుఁ బూనుకున్నారు. మూలమునందలి పద్యములను ఆధునికములగు విరామ చిహ్నములతో నందించినచో వ్యాఖ్యానము లేకున్నను విజ్ఞులగువారు పద్యభావములను గ్రహింపఁగలరని యట్లు చేయఁబడి నది. ఇంత కఠినకావ్యము నెవ్వ రర్థము చేసికొనఁగల రన్నది సరియైన ప్రశ్న కాదు. ఇంతకఠినమని తోఁచునట్లు పద్యములు వ్రాయఁగల కవి యున్నప్పు డాపద్యముల నర్థము చేసికొని యానందింపఁగల్గువారును లభింపఁగలరు. ఇంతకు ఉత్కృష్ట భాషాపాండిత్యమర్యాదలు గల్గి సాహిత్యమంజూష లనఁదగిన మహాకావ్యములు లుప్తప్రాయములు గాకుండునట్లు వానిని పౌనఃపున్యముద్రణములచేత రసజ్ఞుల కందించుట సాహిత్యసంస్థలు చేయవలసినపని గదా! సరిగా సాహిత్య అకాడమీ అట్టి యపరిహార్యమగు విధినే నిర్వర్తించుచున్నది.

ఆధునికకాలమున వివిధసంస్కృతులతోను వివిధభాషలతోను సంబంధ మేర్పడియున్నప్పటికిని, కవితారచనలోని వివిధప్రక్రియలలో పద్యమున కున్న ప్రాధాన్యము పద్యముదే. దానివలె స్వతంత్రముగా జిహ్వాగ్రమున నిలిచి మానవుని నైతిక ధార్మిక సాంస్కృతికాద్యనుభూతులను నెమరువేయింపఁ గల శక్తి వచనాదిప్రక్రియలకు లేదు. కనుక పద్యమును వదలుట గాని వ్రాయమానుట గాని వాంఛనీయము గాదు. ఈనాటికిని సుమతి వేమన శతకములకును మరికొన్ని చాటువులకును సంస్కృత శ్లోకములకును గల ప్రాచుర్యము తిరస్కరింపరానిదికదా! అయితే పద్య మెట్టిపదజాలము కలిగియుండవలెను? ఎట్టి భావ సంపద యుండవలెను? యెట్టిశైలి కావలెను? అన్న ప్రశ్నలు రచయితయొక్కయు, అతనిరచన నర్థముఁజేసికొనఁగలిగిన సహృదయుని యొక్కయు శక్తికిని అభిరుచికిని మాత్రము సంబంధించినట్టివే కాని యెవరంటే వారికి సంబంధించినవి కావు.

కనుక ‘ఉత్పత్స్యతే మమతు కోఽపి సమాన ధర్మా, కాలోహ్యయం నిరవధి ర్విపులా చ పృథ్వీ’ అను భవభూతిమహాకవి యభియుక్తోక్తిని పురస్కరించుకొని శ్రీ సురభిమాధవరాయ రాజకవి యీచంద్రికాపరిణయప్రబంధమును రచించెను. ఇందున్న పదప్రయోగవిశేషములను, భావపరీమళమును, రసఝరీమాధుర్యమును, శ్లేషయమకచమత్కృతిని, అలంకారశోభను, ఇంకను తత్తద్గుణవిశేషములను దెలిసికొని సహృదయు లానందింతురుగాతమని యకాడమీవారు దీని పునర్ముద్రణమునకుఁ బూనుకున్నారు. యథాశక్తిగా నీకావ్యశోభను దిఙ్మాత్రముగాఁ జూపు పీఠికను రచించుటకై నన్నాదేశించినారు. ఈ బృహత్తర కార్యమున కల్పజ్ఞుఁడ నగు నన్ను బ్రేరేపించుటకు ముఖ్యకారణము శ్రీ సురభి మాధవరాయల వంశీయులగు రాజులకు భారత స్వాతంత్ర్యలబ్ధికిని, సంస్థానవిలీనములకును అతిసన్నిహితమగు కాలమువరకు రాజధానియై, ఇప్పటికిని మహబూబునగర మండలమునఁ దాలూకాకేంద్రమై యున్న కొల్లాపురముతో నాకు సన్నిహితసంబంధ ముండుటయు, నాజన్మస్థాన మా తాలూ కాయందే యుండుటయు ననుకొందును. కారణ మేది యైనను నేను ధన్యుఁడను. ఈపనికి నియోగించిన సాహిత్య అకాడమీ కార్యదర్శికిని యితరసభ్యులకును గృతజ్ఞఁడను.

రసజ్ఞశేఖరులారా! చంద్రికాపరిణయదర్శనకౌతూహలమనస్కులారా! సహృదయులారా! రండు, ‘కవి-కాలము, కవితావైదుష్యము, కథాసంవిధానము’ అన్న విభాగములతో శ్రీమాధవరాయ కవిమూర్ధన్యుఁడు మనకై సిద్ధపరచియుంచిన పద్యపాత్రలయందలి కావ్యామృతమును మనసారఁ గ్రోలి యానందింతము రండు.

కవి-కాలము

భారతదేశస్వాతంత్ర్యలబ్ధికిఁ బూర్వమునఁ బాశ్చాత్యుల పరిపాలనలో నుండిన యాంధ్రప్రాంతమందును, నిజాం పరి పాలనలో నుండిన తెలంగాణమునందును నిలిచియుండిన సంస్థానములు, జమీందారీలును జేసిన కళాపోషణము, సాహిత్య సేవయు మరువఁదగినవి కావు. తెలుఁగునాట వెలసిన దేవతావిగ్రహ, దేవాలయశిల్పములు, సంస్కృతాంధ్రకావ్యములు మొద లగు సంస్కృతిచిహ్నము లన్నియు శాతవాహన, విష్ణుకుండిన, కాకతీయ, చాళుక్యాదివంశములకుఁ జెందిన రాజులచేతను, రాణులచేతను, శ్రీకృష్ణదేవరాయ, అనవేలమహీపాల, సర్వజ్ఞసింగభూపాలాది ప్రభువులచేతను నిర్మింపఁబడి, ఈనాటి మన ఘనతకును, సంస్కృతికిని వన్నెలుదిద్దుచున్న విషయము సర్వజనవిదితము. వారిలో సర్వజ్ఞసింగభూపాలుని వంశమునకుఁ జెందినరాజు శ్రీ సురభి మాధవరాయలు.

చ. వికలిత పంకజాత నవవిభ్రమమై, ఘన గోధ్ర తాభిభూ
త కమఠనాథమై, యరుణధామ విభాసితమై, ద్విజోత్తమ
ప్రకటిత హార్దయోగభర భావుకమై, ధరయందుఁ ‘బద్మనా
యక కుల’ముద్భవించె నట, నాత్మజనుష్పద తుల్యవైఖరిన్.

అని చంద్రికాపరిణయ పీఠికాభాగమునందలి 18వ పద్యమున వర్ణింపఁబడిన పద్మనాయకకులమున (వెలమవారని ప్రసిద్ధినిఁ గన్న కులమున) వీరికి మూలపురుషుఁడైన పిల్లమఱ్ఱి బేతాళనాయఁ డుద్భవించెను (ఈయన జన్మనామము చెవ్విరెడ్డి). కాక తీయ గణపతిదేవచక్రవర్తివద్ద సేనానాయకుఁడుగా నుండి కాకతీయసామ్రాజ్యమున కెనలేనిసేవఁ జేసిన యీ బేతాళనాయని వారిని, రేచర్లగోత్రమువా రందఱును – అనఁగా వేంకటగిరి, బొబ్బిలి, పిఠాపురం, జటప్రోలు, మైలవరం మొదలగు ముప్పది యాఱు (36) వంశములవారు తమ మూలపురుషునిగా భావించుచున్నారు. నేటికిని జటప్రోలు (కొల్లాపురం) శరన్నవరా త్రోత్సవ సందర్భమున నీ బేతాళనాయనికి బలిని, పూజలను జరిపించుచున్నారు. ‘రేచర్ల’ యనునది బహుశ చెవ్విరెడ్డి జన్మ స్థానమగు గ్రామము. దానినే వీరందఱు గోత్రనామముగా స్వీకరించి యుందురు. పల్నాటియుద్ధమున సుప్రసిద్ధుఁడైన రేచర్ల బ్రహ్మనాయఁడు ఈ బేతాళనాయని మనుమఁడు. బేతాళనాయనికి నల్లగొండ మండలమునందలి రాచకొండ, దేవరకొండ గ్రామములు రాజధానీనగరములై యుండినవి. ఈతని వంశమునందు పదవతరమువాఁడు ‘సర్వజ్ఞ’బిరుదభూషితుఁడై, సాహిత్యక్షేత్రమున సుప్రసిద్ధుఁడై, శ్రీనాథాది మహాకవులను సత్కరించిన సింగభూపాలుఁడు. ‘రసార్ణవసుధాకరము’ (సింగ భూపాలీయమను నామాంతరము గల అలంకారశాస్త్రగ్రంథము), సంగీతరత్నాకరవ్యాఖ్య (దీనికి సంగీతసుధాకరము అని పేరు, ఇది నిశ్శంకశార్ఙ్గదేవుని సంగీతరత్నాకరమునకుఁ గల వ్యాఖ్యలలో నుత్తమ మైనదని విద్వాంసులు మెచ్చుకొనిరి), రత్న పాంచాలిక (ఇది కువలయావలి యను నామాంతరము గల నాలుగంకముల నాటిక) యిప్పటికి లభించిన యితని కృతులు. ఈ రాజేంద్రుని కావ్యలక్షణములను మహామహోపాధ్యాయ మల్లినాథసూరి తన వ్యాఖ్యానములలోఁ బ్రమాణీకరించెను. ఈ సింగభూపాలునిఁ జంద్రికాపరిణయ మిట్లు ప్రశంసించినది.

సీ. అరిపుర భేదనాయత దోర్బల స్ఫూర్తి, నవరాజవర్ధన వితత కీర్తి,
కనదహీనాంగద కలితబాహాలీల, ఖండితాహిత ఘనాఘన విహేల,
సద్గణరక్షణ క్షమ చరణాసక్తిఁ, బటుచంద్రకోటీరభా నిషక్తిఁ,
దత సర్వమంగళాంచిత గాత్ర రుచిపాళి, నచల ధర్మోన్నత ప్రచయకేళిఁ,

తే. బ్రకట దుర్గాధినాయకభావ భూతి, వైరి దర్పకదాంబక వహ్నిహేతి,
నవనిఁ బొగడొందె ‘సర్వజ్ఞుఁ’డనఁగ సింగ,ధరణిభృన్మౌళి తీవ్రప్రతాపహేళి.

సింగభూపాలుఁడు విద్యావిశారదుఁడై రసార్ణవసుధాకరాది గ్రంథప్రణేతయై ‘సర్వజ్ఞుఁ’డను బిరుదమును గాంచియుండఁగా, అరిపురిభేదన, నతరాజవర్ధన, అహీనాంగదకలనాది శ్లిష్టవిశేషణ రూపణాదులచేత నీశ్వరునిఁబోలిన సర్వజ్ఞుఁడని కవి యీ పద్యమున వర్ణించెను. మరియు,

తే. అర్థి సాత్కృత సురభి, పరాళి సురభి,
సుగుణవల్లీ ప్రకాండైక సురభి, కీర్తి
జిత సురభి, శౌర్యసురభి నా సింగనృపతి
పరగఁ దద్వంశమును గాంచె సురభిసంజ్ఞ.

యాచకాధీనముగాఁ జేయఁబడిన సువర్ణముగలవాఁడును, శత్రువులనెడు తుమ్మెదలకు సంపెంగ యైనవాఁడును, సుగుణము లనెడు తీగలకు వసంతుఁడైన వాఁడును, కీర్తిచేత జయింపఁబడిన కామధేనువుగలవాఁడును, శౌర్యపరిమళముగలవాఁడు నగు సింగభూపాలుఁ డుదయించటచేత నతనివంశమునకు ‘సురభి’ యను పేరు ప్రసిద్ధమై యున్నదని చెప్పెను. వస్తుతః సురభి యను గ్రామమునం దీవంశమువా రుండియుండుటచేత వీరి యింటిపేరు ‘సురభివార’ని వచ్చినదని యైతిహాసికులు విశ్వ సించుచున్నారు. ఈరాజకవి పెదకోమటి వేమభూపాలునికి సమకాలికుఁడై గ్రంథరచనయందును విద్వత్పోషణమునందును నతనితో స్పర్థ వహించి యుండెనని విమర్శకులు భావించుచుండుటచేత నితఁడు క్రీ.శ. 1403 మొదలు క్రీ.శ. 1430 వరకును, తరువాత మరికొంత కాలమును జీవించియుండె నని మనము భావింపవచ్చును.

ఇట్లు విస్తరించుచు వచ్చిన రేచర్లగోత్రజులగు జటప్రోలు సురభివారికి, బేతాళనాయనికిఁ బదిమూడవ (13) తరములవాఁ డగు మాదానాయఁడు శాఖామూలపురుషుఁడు. వీరు నల్లగొండ, దేవరకొండ ప్రాంతములందే యేలుబడిని సాగించుచు నుండి తరువాతి కాలమున జటప్రోలును రాజధానిగా నేర్పరచుకొన్నారు. జటప్రోలుకు సమీపమందున్న చిన్నమరూరు, బెక్కెం, పెంట్లవల్లి, వెల్లూరు గ్రామములలోఁ గోటలు గట్టి, తటాకములు వేయించి, దేవాలయములు కట్టించి, దేవతాప్రతిష్ఠలును జేసి, సుమారు రెండువందల సంవత్సరముల క్రింద ప్రస్తుతము రాజధానీనగరముగా నున్న కొల్లాపురమునకుఁ జేరిరి. అయినను వీరికి జటప్రోలు సంస్థానమువారన్న వ్యవహారము నైజాం రికార్డులలోను కొంతవరకు ప్రజలలోను నేటికిని నున్నది. పై మూల పురుషుని గురించి యొక పూర్వకవి యిట్లు వ్రాసెను.

ఉ. శ్రీలలరంగఁ బాండ్యగజసింహుఁడుగా నచలంబు పెంపునన్
లాలిత పట్టభూషణ లలాటము సూరనరేంద్రు మాధవుం
డాలములోన నశ్వమున కాదటఁ బెట్టినఁ జెల్లుఁగాక తా
జాలిని బూని యబ్బిరుదు చయ్యన నన్యులు పెట్టఁ జెల్లునే?

ఈమాధవుఁడే మాదానాయఁడు. ఇతని తండ్రిపేరు ఎఱ్ఱసూరానాయఁడని యీపద్యము తెల్పుచున్నది. (వెలుగోటివారి వంశ చరిత్ర. పుట 75)