చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము

చ. కనకవిమాన మప్డు డిగి ◊కన్గొన సర్వనరేంద్రలోకము
ల్మనమున వేడ్క నిండఁ గయి◊లా గొసఁగం గిరిరాజకన్య యా
ఘననిభవేణి తన్మహిత◊కాంచనమంచక మెక్కి నిల్పె నా
మనుజకులేంద్రుకంఠమున ◊మంజులమంగళపుష్పదామమున్. 126

టీక: కనకవిమానము=సువర్ణవిమానమునుండి; అప్డు=ఆసమయమందు; డిగి =దిగి; సర్వనరేంద్రలోకము = సమస్తరాజులు; కన్గొనన్=చూడఁగా; మనమునన్=హృదయమందు; వేడ్క=సంతసము; నిండన్=నిండఁగా; గిరిరాజకన్య=పార్వతీదేవి; కయిలా గొసఁగన్=కైదండ నొసఁగగా; ఆఘననిభవేణి =మేఘమువంటి జడగల యాచంద్రిక;తన్మహితకాంచనమంచకము – తత్=ఆసుచంద్రునియొక్క, మహిత=పూజితమగు, కాంచనమంచకము=బంగరుమంచమును;ఎక్కి=ఆరోహించి; ఆమనుజ కులేంద్రుకంఠమునన్=ఆరాజశ్రేష్ఠుని గళమునందు; మంజులమంగళపుష్పదామమున్—మంజుల=మనోజ్ఞమగు, మంగళ= శుభప్రదమగు, పుష్పదామమున్=పూదండను; నిల్పెన్=ఉంచెను.

అనఁగ చంద్రిక తనవిమానము దిగి రాజు లెల్లరు చూచుచుం డఁగ సుచంద్రునిమంచము నెక్కి యతనికంఠమందు మంగళప్రద మగు పూదండ నుంచె నని భావము.

ఉ. ఆవనజాక్షి యాతఱి న◊జాంగనయానతిఁ దత్సుచంద్రధా
త్రీవిభుని న్వరించి యల◊రె న్నలు భైమి యనంగ సమ్మద
శ్రీ వెలయంగఁ జిత్తముల ◊జిష్ణువిరోచనసూర్యసంతతీ
రావరు లెల్ల సమ్మతిఁ గ◊రంబు మనంబున సంతసిల్లఁగన్. 127

ఉ. ఆవనజాక్షి =ఆచంద్రిక;ఆతఱిన్=ఆసమయమందు; అజాంగనయానతిన్ – అజ=శంకరునికి, అంగన=కాంతయగు పార్వతీదేవియొక్క, ‘అజా విష్ణు హర చ్ఛాగాః’ అని యమరుఁడు,ఆనతిన్=ఆజ్ఞచేతను; తత్సుచంద్రధాత్రీవిభునిన్= ఆ సుచంద్రభూపతిని; నలున్=నలమహారాజును; భైమి యనంగన్=దమయంతి యన్నట్లు;వరించి; సమ్మదశ్రీ వెలయంగన్ – సమ్మద=సంతసముయొక్క,శ్రీ=అతిశయము, వెలయంగన్=ప్రకాశింపఁగా; చిత్తములన్=మనములందు; జిష్ణు విరోచన సూర్య సంతతీరావరు లెల్లన్ – జిష్ణు=జయశీలురగు,విరోచన=చంద్రునియొక్క,సూర్య=ఆదిత్యునియొక్క, సంతతి= కులముగల, ఇరావరులు=భూపతులు, ఎల్లన్=అందఱును; సమ్మతిన్=అంగీకారముచేత; కరంబు=మిక్కిలి;మనంబునన్ = మనసునందు; సంతసిల్లఁగన్=సంతోషింపఁగా; అలరెన్=ఒప్పెను. ఆ చంద్రిక పార్వతీదేవి యాజ్ఞవలన నలుని దమయంతి వరించినట్లు సుచంద్రుని వరియించి, సూర్యచంద్రవంశపురాజు లెల్ల సంతసింపఁగా నొప్పారె నని భావము.

ఉ. నించిరి వేలుపుల్ ప్రియము◊నిక్కఁగఁ గ్రొవ్విరిసోన చక్క దీ
వించిరి తాపసాధిపు ల◊వేలమృదంగరవాళి మించ సం
ధించిరి నాట్యవృత్తి సుర◊నీరజనేత్రలు చిత్తవీథి మో
దించిరి సర్వదేశజగ◊తీరమణుల్ నిరసూయ మెచ్చఁగన్. 128

టీక: వేలుపుల్=దేవతలు; ప్రియము నిక్కఁగన్=సంతసము పొంగఁగా; క్రొవ్విరిసోనన్=క్రొత్తపుష్పవర్షమును; నించిరి = పూరించిరి; తాపసాధిపులు=మునీశ్వరులు;చక్కన్=బాగుగా; దీవించిరి =ఆశీర్వదించిరి; సురనీరజనేత్రలు=దేవాంగనలు; అవేలమృదంగరవాళి మించన్ – అవేల=మేరలేని, మృదంగ=మురజములయొక్క, రవ=ధ్వనులయొక్క, ఆళి=నివహము, మించన్ =అతిశయింపఁగా; నాట్యవృత్తి న్=నాట్యముయొక్క వ్యాపారమును; సంధించిరి=చేసిరి; సర్వదేశజగతీరమణుల్= అన్నిదేశముల రాజులు; నిరసూయము=అసూయయొక్కఅభావము; ఎచ్చఁగన్=అతిశయింపఁగా; చిత్తవీథిన్=మనస్సు లందు; మోదించిరి =సంతసించిరి.

మ. తనుమధ్యామణి వైచినట్టి సుమనో◊దామంబు వక్షస్థలిన్
గనుపట్టం బొలిచె న్దినేంద్రకులభూ◊కాంతేశుఁ డప్పట్టునన్
ఘనతారావళికాధరుం డయినరా◊కాయామినీకాముకుం
డన శ్యామానయనోత్పలోత్సవకరో◊దారప్రభాసంభృతిన్. 129

టీక: తనుమధ్యామణి=సన్ననినడుముగల స్త్రీలలో శ్రేష్ఠురాలైన చంద్రిక; వైచినట్టి=వేసినట్టి; సుమనోదామంబు=పూదండ; వక్ష స్థలిన్=ఎదయందు; కనుపట్టన్=కానవచ్చుచుండఁగా; దినేంద్రకులభూకాంతేశుఁడు =సూర్యవంశరాజశ్రేష్ఠుఁడైన సుచంద్రుఁడు; అప్పట్టునన్=ఆసమయమందు;ఘనతారావళికాధరుండు – ఘన=గొప్పలైన, తారావళికా=నక్షత్రపంక్తులను, ధరుండు = ధరించినవాఁడు;అయిన=ఐనట్టి; రాకాయామినీకాముకుండు=పూర్ణచంద్రుఁడు; అనన్=అన్నట్లుగా; శ్యామానయనోత్పలో త్సవ కరోదారప్రభాసంభృతిన్ – శ్యామా=చంద్రికయొక్క, రాత్రియొక్క, నయనోత్పల=కలువలవంటి కన్నులకు, కన్నులైన కలువల కని రాత్రిపరమైన యర్థము, ఉత్సవకర=అనందకరమగు, ఉదార=ఉత్కృష్టమగు, ప్రభా=కాంతియొక్క,సంభృతిన్ = భరణముచేతను; పొలిచెన్=ఒప్పెను. చంద్రిక వేసిన పూదండ వక్షస్థలమందుఁ బ్రకాశించుచుండఁగా, సుచంద్రుడు రిక్కల గుంపుతోఁ గూడిన పూర్ణచంద్రునివలె ప్రకాశించె నని తాత్పర్యము. ఉత్ప్రేక్షాలంకారము.

మ. వికసచ్చంద్రకలాపయుక్త యయి ఠీ◊వి న్దేవయోషామణి
ప్రకరంబు ల్గొలువంగఁ జేరి యలగో◊త్రాభృత్కలాధీశక
న్యక తన్నప్డు వరింపఁ దత్కుసుమమా◊లాప్తి న్విరాజిల్లె సూ
ర్యకులోత్తంసము సద్గణోత్సవము లా◊ర న్దక్షిణామూర్తి నాన్. 130

టీక: వికసచ్చంద్రకలాపయుక్తయయి – వికసత్=ప్రకాశించుచున్న, చంద్రకలాప=సువర్ణభూషణములతో,యుక్తయయి= కూడుకొన్నదై; ప్రకాశించుచున్న, చంద్రకలాప=చంద్రుఁడను భూషణముతో, యుక్తయయి అని పార్వతీపరమైన యర్థము; ఠీవిన్=వైభవముతో; దేవయోషామణిప్రకరంబుల్ – దేవయోషామణి=రాజస్త్రీలయొక్క,ప్రకరంబుల్=సమూహములు; దేవ యోషామణి=దివ్యస్త్రీరత్నములయొక్క, ప్రకరంబుల్=సమూహము లని పార్వతీపరమైన యర్థము; కొలువంగన్=సేవించు చుండఁగా; చేరి=సమీపించి; అలగోత్రాభృత్కలాధీశకన్యక – అల=ఆ, గోత్రాభృత్కలాధీశ=భూపాలచంద్రుఁడైన క్షణదోద యునియొక్క, కన్యక=కూతురగు చంద్రిక; ఆప్రసిద్ధహిమవంతునికూఁతు రగు పార్వతీదేవి; తన్ను; అప్డు; వరింపన్=కోరఁగా; తత్కుసుమమాలాప్తిన్ – తత్కుసుమమాలా=ఆపూదండయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; సూర్యకులోత్తంసము =సూర్యవంశజు లందు శ్రేష్ఠుఁడైన సుచంద్రుఁడు;సద్గణోత్సవము – సద్గణ=విద్వత్సంఘమునకు, ప్రమథగణమునకు, ఉత్సవములు=వేడుకలు; ఆరన్=అతిశయింపఁగా; దక్షిణామూర్తి నాన్=శివావతారవిశేషమో యనునట్లు; విరాజిల్లెన్=ప్రకాశించెను.

చంద్రుఁడు భూషణముగాఁ గల పార్వతీదేవిచే దివ్యస్త్రీలు సేవించుచుండఁగా వరియింపఁబడిన దక్షిణామూర్తియో యను నట్టు లీచంద్రికచే వరియింపఁబడిన సుచంద్రుఁడు ప్రకాశించె నని భావము. ఈపద్యమందు నుత్ప్రేక్షాలంకారము.

చ. మగువ దవిల్చినట్టి సుమ◊మాలికతావికిఁ జేరు తేఁటిదం
టగమిరొద ల్సెలంగెఁ బొగ◊డ న్మలినాత్మత మున్ను మన్మథా
నుగుణత నేఁచు మంతువు గ◊నుంగొన కిష్టసుమార్పణంబుచేఁ
దగ మముఁ బ్రోవవే యనుచుఁ ◊దత్పతికై వివరించుపోలికన్. 131

టీక: మగువ దవిల్చినట్టి సుమమాలిక తావికిన్ – మగువ=చంద్రిక; తవిల్చినట్టి=తగిలించినట్టి (వేసినట్టి), సుమమాలిక=పూ దండయొక్క, తావికిన్=పరిమళమునకు; చేరు తేఁటిదంటగమిరొదల్ – చేరు=సమీపించిన, తేఁటిదంట=తుమ్మెదదంటల యొక్క, గమి=సమూహముయొక్క,రొదల్=ధ్వనులు; పొగడన్=పొగడఁగా; మలినాత్మతన్=కుటిలచిత్తముచేత, నల్లని దేహకాంతిచేత నని స్వభావార్థము; మున్ను=పూర్వమందు; మన్మథానుగుణతన్—మన్మథ=మదనునికి, అను=అనుసరిం చిన, గుణతన్=అల్లెత్రాడగుటచేత, మన్మథున కనుకూలము లగుటచేత నని స్వభావార్థము; ఏఁచు మంతువు =శ్రమపెట్టిన యపరాధమును; కనుంగొనక=చూడక, గణింపక యనుట; ఇష్టసుమార్పణంబుచేన్ – ఇష్ట=అనుకూలమగు, సు=లెస్స యగు,మా=సంపదయొక్క, అర్పణంబుచేన్=సమర్పణముచేత, ఇష్టమగు ద్రవ్యమును కానుకగా నిచ్చుటచేత నని తాత్ప ర్యము; అనుకూల సుమార్పణచేత నని స్వభావార్థము;తగన్=తగునట్లుగ; మమున్=మమ్ము; ప్రోవవే యనుచున్=కాపాడవే యనుచు;తత్పతికై =ఆసుచంద్రునకై; వివరించుపోలికన్=చెప్పుచున్నట్లుగా; చెలంగెన్ = ప్రకాశించెను;

చంద్రిక సుచంద్రుని కంఠమందు వైచిన పూదండతావికిఁ జేరియున్న తుమ్మెదలగుంపులరొదలు, పూర్వము సుచంద్రుని విరహకాలమందు మలినాత్మతచే ననఁగఁ గుటిలచిత్తముచేత మన్మథానుగుణతచే బాధించిన యపరాధమును, కానుకగా సుమార్పణము చేసి మన్నింపు మని యానరపతిం బ్రార్థించుచున్నటు లొప్పె నని భావము.

చ. నరపతిదేహదీప్తి సుమ◊నస్సరవల్లరి శోణభాధురం
ధర యయి చూడ రాజిలె నె◊దం దను నేలఁ దలంచుచంద్రికా
తరుణికటాక్షభాస్వదమృ◊తచ్ఛట పర్వఁగ నిల్వ లేక దు
ష్కరమదనాస్త్రపావకశి◊ఖాలత వెల్వడుదారిఁ బూనుచున్. 132

టీక: నరపతిదేహదీప్తిన్—నరపతి=సుచంద్రునియొక్క, దేహదీప్తిన్=శరీరకాంతిచేత; సుమనస్సరవల్లరి=తీవవంటి పూదండ; శోణభాధురంధర యయి – శోణభా=ఎఱ్ఱనికాంతియొక్క,ధురంధర యయి =భారమును వహించినదై;చూడన్=చూడఁగా; ఎదన్=హృదయమందు; తనున్=తన్ను; ఏలన్=పోషింపను; తలంచుచంద్రికాతరుణికటాక్షభాస్వదమృతచ్ఛట – తలంచు = తలంచినట్టి, చంద్రికాతరుణి=చంద్రికయొక్క, కటాక్ష=అపాంగములనెడు,భాస్వత్=ప్రకాశించుచున్న,అమృతచ్ఛట = జల పుంజము;పర్వఁగన్=ప్రసరింపఁగా; నిల్వ లేక=ఉండలేక; దుష్కరమదనాస్త్రపావకశిఖాలత – దుష్కర=అసాధ్యమగు, మదన =స్మరునియొక్క, అస్త్రపావక=బాణాగ్నియొక్క,శిఖాలత=తీవవంటిజ్వాల; వెల్వడుదారిన్=వెళ్ళివచ్చినరీతిని; పూనుచున్ =ఊనుచు; రాజిలెన్=ప్రకాశించెను;

అనఁగా చంద్రిక సుచంద్రుని వక్షస్థలమం దుంచిన సుమనస్సరవల్లరి సుచంద్రుని దేహకాంతిచే నెఱ్ఱనయి , దానిం బోషించు టకై చంద్రికయొక్క కటాక్షము లనెడు జలపుంజములు పర్వఁగా , సుచంద్రుని హృదయమం దుండు మదనాగ్నియొక్క జ్వాల నిలువ లేక వెలువడినదో యనునటులు ప్రకాశించె నని భావము. సుచంద్రవక్షస్థలగతసుమమాలికను చంద్రికాకటాక్షజలసేకము చేత బహిర్గతమగుచున్న మదనాగ్నిశిఖాలతనుగా నుత్ప్రేక్షించుటచేత నిచ్చట వస్తూత్ప్రేక్షాలంకారము.

చ. జనవరసార్వభౌమునెద ◊సామ్యనుబింబితమై నెలంత యుం
చిన సుమదామకంబు గనఁ ◊జేర్చె ముదంబు తదంతరంబునం
దెనసి కలంచునట్టి కుసు◊మేషుశరాళులఁ బట్టి తెత్తుఁ జ
య్యన నిఁక నిల్వఁ జేయుదు న◊టంచు వడిం జొరఁబాఱుకైవడిన్. 133

టీక: జనవరసార్వభౌమునెదన్=సుచంద్రుని వక్షస్థలమునందు; సామ్యనుబింబితమై =అర్ధము ప్రతిఫలించినదై; నెలంత ఉంచిన సుమదామకంబు=చంద్రిక యుంచిన పూదండ; కనన్=చూడఁగా;తదంతరంబునన్=ఆసుచంద్రుని యెదలోపల;ఎనసి=పొంది; కలంచునట్టి కుసుమేషుశరాళులన్ = కలఁతపఱచుచున్న సుమశరునిబాణపంక్తులను; పట్టి తెత్తున్ =పట్టుకొని తేఁగలను; చయ్యనన్=శీఘ్రముగా; ఇఁకన్=ఈమీఁద; నిల్వఁ జేయుదును=నిల్చునట్లు చేయుదును; అటంచున్=ఈరీతిఁ బలుకుచు; వడిన్=వేగముతో; చొరఁబాఱుకైవడిన్=చొరఁబడురీతిగ; ముదంబు=సంతసమును; చేర్చెన్=చేసెను.

అనఁగ సుచంద్రుని వక్షస్థలమందు చంద్రిక వైచినపూసరము సగము ప్రతిఫలించినదై, అతనిహృదయమునందు కలంచు మన్మథబాణములను వెలికిఁ దీసికొని చయ్యన రాఁగలనని హృదయమునందుఁ జొరఁబడురీతిగ ప్రకాశించె నని భావము.

చ. పుడమిమగండుదాలిచిన◊పువ్వులదండ తదంగకాంతిచేఁ
గడుఁ గనకప్రసూనసర◊గౌరవ మూనఁగఁ దుమ్మెద ల్భయం
బడరఁగ జాఱ సాగె నచ◊లాధిపకన్య వరించె నీశునిన్
గడిమికిఁ జేర కింక నని ◊కంతునకు న్వివరింపనో యనన్. 134

టీక: పుడమిమగండు=భూభర్త యగు సుచంద్రుఁడు; తాలిచినపువ్వులదండ =ధరించినపూదండ;తదంగకాంతిచేన్ = ఆ సుచంద్రునియొక్క దేహకాంతిచేత; కడున్=మిక్కిలి; కనకప్రసూనసరగౌరవము – కనకప్రసూన=సంపెఁగపూవులయొక్క, సర=దండయొక్క,గౌరవము=గొప్పతనమును, అనఁగఁ దత్సామ్యము ననుట; ఊనఁగన్=పొందఁగా; తుమ్మెదల్ = భృంగ ములు; భయంబు=భీతి; అడరఁగన్=అతిశయింపఁగా; అచలాధిపకన్య=రాజపుత్రియగు చంద్రిక, హిమాద్రిరాజపుత్రిక యగు పార్వతి యని తోఁచుచున్నది; ఈశునిన్=రాజగు సుచంద్రుని, శంకరుని నని తోఁచుచున్నది; వరించెన్=కోరెను;కడిమికిన్= పరాక్రమమునకు; చేరకు=పోవలదు; ఇంకన్=ఈమీఁద; అని=అనుచు; కంతునకున్=మన్మథునికి; వివరింపనో యనన్ = తెలియఁజేయుటకో యనునట్లు; జాఱసాగెన్=వీడెను. సుచంద్రుఁడు ధరించినపూదండ యతని దేహకాంతిచే సంపెంగపూల దండ యని భయపడి, తుమ్మెదలు జాఱుచుండఁగా నవి సుచంద్రునిఁ జంద్రిక వరియించెఁ గాన నీవు సుచంద్రునిఁ బొడువఁ బోఁ బనిలేదని మదనునకుఁ జెప్పుటకై పోవుచున్నటు లుండె నని భావము. ఈపద్యమందు నుత్ప్రేక్షాలంకారము.

మ. ఘనపంకేరుహరాగహారరుచిరే◊ఖావ్యాప్తమై యింతి వై
చిన యాక్రొవ్విరిదండ భర్తయెదఁ బొ◊ల్చెన్ దన్మృగాక్షీవినూ
తనరాగేందిర చేరి యద్ధరణినే◊త న్గౌఁగిటం దార్చి నం
తనె కన్గో నగుతద్భుజావసులతా◊ద్వంద్వైకబంధం బనన్. 135

టీక: ఘన పంకేరుహరాగ హార రుచి రేఖా వ్యాప్తమై – ఘన=అధికమైన, పంకేరుహరాగ=పద్మరాగములయొక్క, హార= సరముయొక్క, రుచి=కాంతియొక్క,రేఖా=శ్రేణిచేత,వ్యాప్తమై=పొందఁబడినదై; ఇంతి వైచిన యాక్రొవ్విరిదండ = చంద్రిక వేసిన యా పూదండ; భర్తయెదన్=సుచంద్రునివక్షమందు; తన్మృగాక్షీవినూతనరాగేందిర – తన్మృగాక్షీ=ఆచంద్రికయొక్క, వినూతన=మిక్కిలి నూతనమగు, రాగేందిర=అనురాగలక్ష్మి; చేరి=పొంది; అద్ధరణినేతన్=ఆసుచంద్రుని; కౌఁగిటన్ = కౌఁగిలి యందు; తార్చినంతనె =చేర్చికొనినమాత్రముచేతనే; కన్గోనగు తద్భుజావసులతా ద్వంద్వైక బంధంబు అనన్ – కన్గో నగు = కనిపించుచున్న, తత్=ఆరాగేందిరయొక్క, భుజావసులతా=బంగరుదీవలవంటి భుజములయొక్క, ద్వంద్వ=జంట యొక్క, ఏక=ముఖ్యమైన, బంధంబు=బంధమో, అనన్=అనునట్లు; పొల్చెన్=ప్రకాశించెను.

సుచంద్రునికంఠమునందుఁ జంద్రిక వైచినహారము, పద్మరాగమణిసరములకాంతిచే వ్యాప్తమై సుచంద్రునివక్షమునందు, నా చంద్రికరాగలక్ష్మి చేరి సుచంద్రునిఁ గౌఁగిలింపఁగాఁ గానవచ్చు రాగేందిర బాహులతాయుగమో యనం బ్రకాశించెనని భావము. ఈపూసరమును సుచంద్రునిఁ గౌఁగిలించిన రాగేందిర భుజాద్వంద్వము నా నుత్ప్రేక్షించుటచే వస్తూత్ప్రేక్షాలంకారము.