చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము

చ. కువలయసంభ్రమప్రదత◊కు న్నెలవై పరచక్రదర్పవై
భవహరణాఢ్యవర్తనకుఁ ◊బాదయి యీవిభుదోర్మహంబు గో
త్ర వెలయఁ దత్తులావిరహి◊తాజనితోరుమలీమసత్వ మో
యువతి వసద్రమేశతను◊భోపధిఁ బర్వు దినేంద్రుమేనునన్. 79

టీక: ఓయువతి=ఓచంద్రికా! ఈవిభుదోర్మహంబు=ఈరాజు భుజప్రతాపము; కువలయ సంభ్రమప్రదతకున్ – కువలయ=కలు వలకు, భూవలయమునకు, సంభ్రమప్రదతకున్=సంతసము నిచ్చుటకు, తొట్రుపాటు నిచ్చుటకు; నెలవై=నివాసస్థానమై; పర చక్ర దర్పవైభవ హర ణాఢ్య వర్తనకున్ – పర=శ్రేష్ఠములగు, చక్ర=జక్కవలయొక్క,దర్పవైభవ=గర్వాతిశయముయొక్క, హరణ=పోఁగొట్టుటయందు, ఆఢ్య=పూర్ణమగు, వర్తనకున్=వ్యాపారమునకు; పాదయి=ఉనికిపట్టయి; పర=శత్రురాజుల యొక్క, చక్ర=రాష్ట్రములయొక్క,దర్పవైభవ=గర్వాతిశయముయొక్క, హరణ=పోఁగొట్టుటయందు, ఆఢ్య=పూర్ణమగు, వర్తనకున్=వ్యాపారమునకు, పాదయి యని యర్థాంతరము; గోత్రన్=భూమియందు; వెలయన్= ప్రకాశింపఁగా; తత్తులా విరహితా జనితోరు మలీమసత్వము – తత్తులా=తత్సామ్యముయొక్క,విరహితా=రాహిత్యముచేత,జనిత=పుట్టింపఁబడిన, ఉరు=అధికమగు, మలీమసత్వము=మాలిన్యము, నైల్య మనుట; వసద్రమేశతనుభోపధిన్—వసత్=నివసించియున్న, రమేశ =నారాయణమూర్తియొక్క,తనుభా=దేహకాంతి యనెడు, ఉపధిన్=వ్యాజముచేత; దినేంద్రుమేనునన్=సూర్యశరీరమందు; పర్వున్=వ్యాపించును.

అనఁగ నీరాజు ప్రతాపము కువలయసంభ్రమప్రదమును, పరచక్రదర్పము నడఁగించునదియు నగుటచే, గువలయసంతోష మును బోఁగొట్టువాఁడును, బరచక్రదర్పమును నతిశయింపఁజేయువాఁడును నగు సూర్యుఁడు ఏతద్రాజప్రతాపసామ్యము పొందమి నుదయించు నైల్యమును, తనశరీరమందుండు నారాయణమూర్తియొక్క శరీరకాంతి యనెడు నెపముచే ధరించు నని తాత్పర్యము. వాస్తవికమగు సూర్యశరీరగతనారాయణమూర్తిదేహకాంతిని, ప్రచ్ఛాదించి సామ్యాభావప్రయుక్తలోపమువలన జన్మించు నైల్యమునుగాఁ జెప్పుటచేఁ గైతవాపహ్నవాలంకారము.

తే. అని యెఱింగింప నపుడు ప◊క్ష్మాంచలములు, వ్రాల్ప శిబికాధరు ల్తద్వి◊రక్తి నెఱిఁగి
వేఱొకనృపాలుఁ జేర్ప నా◊వెలఁది కగజ, యమ్మహీశునిఁ జూపి యి◊ట్లనుచుఁ బలికె. 80

టీక: అని=ఈప్రకారము; ఎఱింగింపన్=తెలుపఁగా; అపుడు; పక్ష్మాంచలములు – పక్ష్మ=ఱెప్పలయొక్క,అంచలములు=అగ్ర ములు; వ్రాల్పన్=వంపఁగా; శిబికాధరుల్=పల్లకిని మోయువారు; తద్విరక్తిన్—తత్=ఆరాజునందు, విరక్తిన్=విరాగమును; ఎఱిఁగి =తిలిసికొని; వేఱొకనృపాలున్=వేఱొకరాజును; చేర్పన్=పొందింపఁగా; ఆవెలఁదికిన్=ఆచంద్రికకు; అగజ=పార్వతీ దేవి; అమ్మహీశునిన్=ఆరాజును; చూపి=ప్రదర్శించి; ఇట్లు అనుచు=వక్ష్యమాణప్రకారముగ; పలికెన్=వచించెను.

మ. వలజాలోకలలామ గన్గొనవె యీ◊వారాణసీరాజు ను
జ్జ్వలతేజోదినరాజు నిప్పతి భుజా◊వష్టంభరేఖ న్ద్విష
ద్బలకోటి న్మథియించి నిల్పె విజయ◊స్తంభంబు లాశాగజా
వలికి న్నిచ్చలు కట్టుఁగంబముల ఠే◊వ న్దోఁప దిగ్వీథులన్. 81

టీక: వలజాలోకలలామ=సుందరులగు స్త్రీలమండలములో శ్రేష్ఠురాలా! ‘వలజా వల్గుదర్శనా’ అని యమరుఁడు; ఉజ్జ్వలతేజో దినరాజు – ఉజ్జ్వల=ప్రకాశించుచున్న,తేజః=తేజమునందు, దినరాజు=సూర్యునితో సమానుఁడగు; ఈవారాణసీరాజున్=ఈ కాశీరాజును; కన్గొనవె=చూడుమా! ఇప్పతి=ఈకాశీరాజు, ఇది కర్తృపదము; భుజావష్టంభరేఖన్ – భుజావష్టంభ=భుజగర్వ ముయొక్క, రేఖన్=శ్రేణిచేత, ‘దర్పోవలేపోఽవష్టంభః’ అని యమరుఁడు; ద్విషద్బలకోటిన్ – ద్విషద్బల=శత్రుసేనలయొక్క, కోటిన్= సమూహమును; మథియించి=సంహరించి; విజయస్తంభంబులు=జయస్తంభములను; దిగ్వీథులన్=దిక్ప్రదేశము లందు; ఆశాగజావలికి=దిగ్గజముల సమూహమునకు; నిచ్చలు=ఎల్లపుడు; కట్టుఁగంబముల ఠేవన్ = కట్టివేయు కంబముల యొక్క రీతిచే; తోఁపన్=కనిపించునట్లు; నిల్పెన్=నిలువఁబెట్టెను.

అనఁగ నోచంద్రికా! యీకాశీరాజును కనుఁగొనుము. ఈరాజు తనభుజవీర్యముచేతఁ బగతురఁ బరిమార్చి దిక్కులందు దిగ్గజములకు గట్టుకంబములవలెనున్న విజయస్తంభములనునిలిపినాఁ డని భావము.

మ. వరదానంబు ననల్పసౌకరియు శ◊శ్వద్భోగసంపత్తి ని
బ్బరపుంగూటపుమేల్మి యీపతియెడం ◊భాసిల్ల నశ్రాంత ము
ర్వర తాఁ జేరి పయోజలోచన! కరి◊స్వామిం గిరిస్వామి నా
హరిరాజు న్గిరిరాజు నెంచక ప్రమో◊దావాప్తి మించు న్గడున్. 82

టీక: పయోజలోచన =కమలములవంటి కన్నులుగల చంద్రికా! వరదానంబున్ – వర=శ్రేష్ఠమగు, దానంబున్= వితరణమును, మదోదకమును; అనల్పసౌకరియున్ – అనల్ప=అధిక మగు, సౌకరియున్=సుకరత్వమును, సూకరత్వమును; శశ్వద్భోగ సంపత్తి—శశ్వత్=ఎల్లపుడు, భోగసంపత్తి =ఉపభోగసంపద, పడగలయొక్కసంపద; నిబ్బరపుంగూటపుమేల్మి=అధికమగు బాణములయొక్క మేలిమి, శిఖరములయొక్క మేలిమి; ఈపతియెడన్=ఈరాజునొద్ద; భాసిల్లన్=ప్రకాశింపఁగా; అశ్రాంతము= ఎల్లపుడు; ఉర్వర =పుడమి;తాన్=తాను; చేరి =పొంది; కరిస్వామిన్=గజరాజును; కిరిస్వామిన్= ఆదివరాహమును; ఆహరి రాజున్=ఆయాదిశేషుని; గిరిరాజున్=కులాచలమును; ఎంచక=లెక్కపెట్టక; ప్రమోదావాప్తిన్=సంతోషప్రాప్తిచేత;కడున్= మిక్కిలి; మించున్=అతిశయించును.

అనఁగా భూదేవి, కరికిరిహరిగిరిస్వాములయందుండు దాన సౌకర్య భోగకూటములు ఈరాజునందుఁ బ్రకాశింపఁగ, వారిని గణింపక యీభూపతిని జేరె నని భావము. ఇచట కరిస్వామి, గిరిస్వామి, హరిరాజు, గిరి రాజు అని గికారప్రయోగముచే కరిస్వామి ప్రభృతులయందు అపకర్షము దోఁచుచున్నది.

మ. అవనీనాయకపద్మసాయకుని ది◊వ్యానందకాంతారవ
న్యవిహారాన్వితు వీని నీయురముఁ జెం◊దం జూడవే దృష్ట్యలే
హ్యవలగ్నామణి! నీకు గాంగజలఖే◊లాభోగముల్ హస్తిదా
నవవిద్వేషిపదాబ్జసేవనవిధా◊నం బబ్బు నశ్రాంతమున్. 83

టీక: దృష్ట్యలేహ్యవలగ్నామణి =దృష్టి కగోచరమైన మధ్యభాగముగల స్త్రీలయందు నుత్తమురాలవైన చంద్రికా! అవనీనాయక పద్మసాయకునిన్ – అవనీనాయక=రాజులయందు, పద్మసాయకునిన్=మన్మథునివంటివానిని; దివ్యానందకాంతారవన్య విహారాన్వితున్—దివ్య=ప్రశస్తమగు, ఆనందకాంతార=ఆనందవనమందలి, వన్యవిహార=వనవిహారముతోడ, అన్వితున్= కూడినట్టి; వీనిన్=ఈరాజును; నీయురమున్=నీవక్షమును; చెందన్=పొందునట్లు, ఆలింగనము చేసికొను నట్లనుట; చూడవే =చూడుమా! నీకున్; గాంగజలఖేలాభోగముల్=జాహ్నవీజలక్రీడలయొక్కపరిపూర్ణతలును; హస్తిదానవవిద్వేషి పదాబ్జ సేవన విధానంబు – హస్తిదానవవిద్వేషి=గజాసురవైరి యగు విశ్వేశ్వరునియొక్క,పదాబ్జ=పాదకమలములయొక్క, సేవన= పరిచర్యయొక్క,విధానంబు=ప్రకారము; అశ్రాంతమున్=ఎల్లపుడు; అబ్బున్=చేకూఱును.

అనఁగ నోచంద్రికా! ఈరాజును వరించితివేని నీకు గంగానదీజలవిహారములు గల్గుటయె గాక శ్రీవిశ్వేశ్వరస్వామి పాద కమలములసేవయు నెల్లపుడుఁ జేకూఱు నని భావము.

క. అని తెలుప వినియు నలజ,వ్వని విననటు లుండ యాన◊వహు లొక్క నృపా
లునిఁ జేర్ప గౌరి యావిభు, వనజాక్షికిఁ జూపి యిటులు ◊పల్కె న్వేడ్కన్. 84

టీక: అని =ఈప్రకారము;తెలుపన్=తెలియఁజేయఁగా; వినియున్=ఆకర్ణించియు; అలజవ్వని=ఆచంద్రిక; విననటులుండన్ = విననిదానివలె నుండఁగా; యానవహులు=పల్లికి మోయువారు; ఒక్క నృపాలునిన్=ఒకరాజును; చేర్పన్=చేర్పఁగా; గౌరి= పార్వతీదేవి; ఆవిభున్=ఆరాజును; వనజాక్షికిన్=చంద్రికకు; చూపి=ప్రదర్శించి; ఇటులు=ఈవిధముగా; వేడ్కన్=సంతసము చేత; పల్కెన్=వచించెను.

శా. కర్ణాటేశ్వరుఁ డీతఁ డిమ్మనుజలో◊కస్వామి వీక్షింపుమా
కర్ణాంతాయతనేత్ర! వీనిజయజా◊గ్రద్భర్మభంభాకులో
దీర్ణధ్వానము దిక్ప్రభిత్తిపరిభి◊త్తిస్ఫూర్తిఁ జేపట్టఁగాఁ
దూర్ణం బుర్వరఁ ద్రెళ్ళు వైరినృపసం◊దోహంబు చిత్రంబుగన్. 85

టీక: కర్ణాంతాయతనేత్ర =శ్రుత్యంతమువఱకు విశాలములగు నేత్రములుగల చంద్రికా! ఈతఁడు=ఈరాజు;కర్ణాటేశ్వరుఁడు = కర్ణాటభూపతి; ఇమ్మనుజలోకస్వామిన్=ఈనరపతిని; వీక్షింపుమా=చూడుమా! వీని=ఈరాజుయొక్క; జయజాగ్రద్భర్మ భంభాకులోదీర్ణ ధ్వానము – జయ=జయముచేత,జాగ్రత్=మేల్కనిన, భర్మ=సువర్ణమయమగు, భంభాకుల=జయభేరీ బృందముయొక్క, ఉదీర్ణ=ఉత్కటమగు, ధ్వానము=శబ్దము; దిక్ప్రభిత్తిపరిభిత్తిస్ఫూర్తిన్ – దిక్ప్రభిత్తి=దిగ్భిత్తులయొక్క, పరిభిత్తి=భేదనముయొక్క, స్ఫూర్తిన్=అతిశయమును; చేపట్టఁగాన్=గ్రహింపఁగా; వైరినృపసందోహంబు=శత్రురాజుల సమూహము; చిత్రంబుగన్=విచిత్రముగ; తూర్ణంబు=శీఘ్రముగ; ఉర్వరన్=భూమియందు; త్రెళ్ళున్=పడును.

చంద్రికా! కర్ణాటభూమి కధినేత యగు నీరాజును చూడుము, వీని బంగరుజయభేరీనినాదము దిగ్భిత్తులను భేదింపఁగానే వీని శత్రువులు భూమిపైఁ బడుదురని భావము. ఈపద్యమునం దతిశయోక్తిభేదము.

మ. బలభిన్నీలసహోదరచ్చికుర! యీ◊పట్టాభిషిక్తేంద్రు హృ
త్థ్సలి వర్ణింపఁ దరంబె యిప్పతి తను◊చ్ఛాయాగతిన్ మన్మథుం
గలనం గెల్చి తదంకమండలముఁ జ◊క్కం గైకొనెం గానిచోఁ
దలఁప న్వీనికిఁ జెల్ల నేర్చునె సము◊ద్యన్నక్రకేతుచ్ఛటల్. 86

టీక: బలభిన్నీలసహోదరచ్చికుర=ఇంద్రనీలములకు సమానములగు కురులుగల చంద్రికా! ఈపట్టాభిషిక్తేంద్రున్=ఈమూర్ధా భిషిక్తుని; హృత్థ్సలిన్=హృదయప్రదేశమునందు; వర్ణింపన్=నుతించుటకు; తరంబె=శక్యమా? ఇప్పతి=ఈభూనాథుఁడు; తనుచ్ఛాయాగతిన్=దేహకాంతిరీతిచేత; కలనన్=యుద్ధమందు; మన్మథున్=మరుని;గెల్చి=జయించి; తదంకమండలమున్ – తత్= ఆమన్మథునియొక్క, అంక=చిహ్నములయొక్క, మండలమున్=సమూహమును; చక్కన్=చక్కగ; కైకొనెన్ = గ్రహించెను; కానిచోన్=అట్లు గ్రహింపనియెడల; తలఁపన్=విచారింపగ; వీనికిన్=ఈరాజునకు; సముద్యన్నక్రకేతుచ్ఛటల్ – సముద్యత్=మీఁదికిలేచిన, నక్రకేతు=మకరధ్వజములయొక్క, ఛటల్=సమూహములు; చెల్ల నేర్చునె =చెల్లునా? చెల్లవనుట.

అనఁగ నీరాజు తనసొబగుచే మరునిఁ బోరున గెలిచి, వానిమకరధ్వజముల గ్రహించెను. అట్లు కానిచో వీనికి మకరధ్వజ ములు చెల్లునా యని భావము.

చ. ఇనకులనుత్యరాజపర◊మేశ్వరలక్షణశాలి యివ్విభుం
డనిశము చక్రహార్దదమ◊హావసుదాన మొనర్ప నేర్చువాం
ఛ నెనయుచంద్రుఁ డౌఁ జుము ర◊సావలయాతపవారణంబు త
ద్ఘనజవజశ్రమాంబుకణి◊కల్ సుము ముత్తెపుకుచ్చు లెంచఁగన్. 87

టీక: ఇనకులనుత్యరాజపరమేశ్వరలక్షణశాలి – ఇనకుల=నృపసమూహముచేత, నుత్య=పొగడఁదగిన, రాజపరమేశ్వర= రాజరాజులయొక్క, లక్షణ=లక్షణములచేత, అనఁగా భాగ్యచిహ్నములచేత, శాలి=ప్రకాశించుచున్న; ఇవ్విభుండు=ఈ రాజు; అనిశము=ఎల్లపుడు; చక్రహార్దదమహావసుదానము – చక్ర=జక్కవలకు, రాష్ట్రమునకు, హార్దద= ప్రేమము నిచ్చు, మహా వసు దానము=గొప్పకిరణములయొక్క, ధనముయొక్క, యిచ్చుటను; ఒనర్పన్=చేయఁగా; నేర్చువాంఛన్=అభ్యసించు నిచ్ఛ చేత; ఎనయుచంద్రుఁడు=పొందిన చంద్రుఁడే; రసావలయాతపవారణంబు=భూచక్రచ్ఛత్రము; ఔన్ చుము – ఔన్= అగును, చుము= సత్యము; ముత్తెపుకుచ్చులు=మౌక్తికగుచ్ఛములు; ఎంచఁగన్=విచారింపఁగా; తద్ఘనజవజశ్రమాంబు కణికల్–తత్= ఆచంద్రునియొక్క, ఘన=అధికమగు, జవజ=వేగముచేఁ బుట్టిన, శ్రమాంబుకణికల్=శ్రమోదకబిందువులు; చుము= సత్యము.

ఈరాజన్యుని భూచక్రాకారమగు గొడుగు గొడుగుగాదు, మఱి యేమనఁగా చక్రమునకు వసుదాన మీయనేర్చిన యీ నరపతిచెంగట, జక్కవలకు వసుదాన మీయనేరనివాఁడగుటచే చక్రమునకు వసుదాన మియ్య నేర్చుకొను వాంఛతోఁ జేరిన చంద్రుఁడే; ఈముత్యపుగుత్తులు అతివేగముతోఁ జేరినచంద్రునియొక్క వేగశ్రమోదితములైన చెమటబిందువలె యని భావము. ఈపద్యమందు అభేదరూపకాలంకారము.

మ. వరసామ్యంబు ఘటిల్లె నంచు నృపతు◊ల్వర్ణింప రాజాధిరా
జు రవిద్యోతనరూపతేజు నితని ◊న్సోమాస్య! యుద్వాహమై
నిరతం బొప్పుము సర్వభూపహరిణీ◊నేత్రాశిరోరత్నది
వ్యరుచుల్ త్వత్పదవీథి యావకరసా◊న్వాదేశముం బూనఁగన్. 88

టీక: వరసామ్యంబు=వరునియొక్క యనురూపత, అనురూపుఁడైన వరుఁడనుట; ఘటిల్లె నంచున్=చేకూఱె ననుచు; నృప తుల్ = రాజులు; వర్ణింపన్=నుతియింపఁగా; రాజాధిరాజున్=రాజులకు రాజయినట్టి; రవిద్యోతనరూపతేజున్ – రవిద్యోతన రూప=సూర్యకాంతితుల్యమగు, తేజున్=కాంతిగల్గినట్టి; ఇతనిన్=ఈకర్ణాటభూపతిని; సోమాస్య(సోమ+ఆస్య)=చంద్రుని వంటి ముఖముగల చంద్రికా! ఉద్వాహమై =పెండ్లి చేసికొని; నిరతంబు=ఎల్లపుడు; సర్వభూపహరిణీనేత్రాశిరోరత్నదివ్య రుచుల్ – సర్వభూపహరిణీనేత్రా=సమస్తరాజాంగనలయొక్క,శిరోరత్న=చూడామణులయొక్క,దివ్య=మనోహరము లగు, రుచుల్=కాంతులు; త్వత్పదవీథిన్= నీయొక్క పాదప్రదేశమందు; యావకరసాన్వాదేశమున్ – యావకరస = లాక్షా రసమునకు, అన్వాదేశమున్=పౌనరుక్త్యమును, ‘కించి త్కార్యం విధాతు ముపా త్తస్య కార్యాన్తరవిధానాయ పునరుపాదాన మన్వాదేశః’ అని వైయాకరణసంకేతము, ఒకకార్యమును విధించినదానినే మఱలఁ గార్యాంతరమును విధించుటకై గ్రహించుట అన్వాదేశపదమున కర్థము గావున పౌనరుక్త్యము ఫలితార్థము; పూనఁగన్=వహింపఁగా; ఒప్పుము =ప్రకాశింపుము.

చంద్రికా! నీవితనిఁ బెండ్లియై యొప్పఁగా సమస్తరాజాంగనల చూడామణిమరీచులచే నలంకృతంబులగు నీపాదములకు లాక్షారసము పునరుక్తప్రాయమై యుండు నని భావము.