చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము

శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము

పంచమాశ్వాసము

క. సుభగంభావుకఘనకౌ
స్తుభ! సాధ్వవనసహకృత్వ◊దుర్దమచక్రా!
ప్రభవాసురసర్వంకష
విభవమ్మన్యప్రతాప◊వృత! గోపాలా! 1

టీక: సుభగంభావుకఘనకౌస్తుభ – సుభగంభావుక=మనోజ్ఞమగు, ఘనకౌస్తుభ=ఉత్కృష్టమగు కౌస్తుభమణిగలవాఁడా! సాధ్వవనసహకృత్వదుర్దమచక్రా – సాధు=సత్పురుషులగు మున్యాదులయొక్క, అవన=రక్షణమందు, సహకృత్వ= సహాయమగు, దుర్దమచక్రా=అడఁపరాని చక్రముగలవాఁడా! ప్రభవాసురసర్వంకష విభవమ్మన్యప్రతాపవృత – ప్రభవ = సమర్థులగు, అసుర=రాక్షసులకు, సర్వంకష=నాశకమగు, విభవమ్మన్య=విభవమునుగాఁ దన్నుఁ దలఁచెడి, ప్రతాప= పరాక్రమముచేత, వృత=కూడుకొన్నవాఁడా! గోపాలా= శ్రీమదనగోపాలస్వామీ!
ఈకృతిపతి సంబోధనమునకు ‘చిత్త గింపు’మను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

తే. చిత్తగింపుము శౌనకా ◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ◊ర్షణతనూజుఁ
డువిద తద్రాజచంద్రైక◊వివరిషావి
ధానపాణింధమాత్మచేఁ ◊దనరునపుడు. 2

టీక: చిత్తగింపుము = ఆకర్ణింపుము; శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలగు శ్రేష్ఠులగు మునిసంఘమునకు; రోమ హర్షణతనూజుఁడు = సూతుఁడు; ఇట్లనున్=వక్ష్యమాణప్రకారముగాఁ బలుకును; ఉవిద=చంద్రిక; తద్రాజచంద్రైకవివరిషా విధానపాణింధమాత్మచేన్ –తద్రాజచంద్ర=ఆసుచంద్రునియొక్క, ఏక=ముఖ్యమగు, వివరిషా=వరియించు నిచ్ఛయొక్క, విధాన=ప్రకారమునకు, పాణింధమ=జ్ఞాపకమగు, ‘ఉగ్ర మ్పశ్యేరమ్మదపాణింధమాశ్చ’ దీన నీరూపమగు, ఆత్మచేన్=మాన సముచేత; తనరునపుడు = ఒప్పుసమయమునందు; దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

మ. సుతతారుణ్యశుభోదయస్థితి తద◊స్తోకాశయాలంబితే
హితము న్బోటులచే నెఱింగి, తదమూ◊ల్యేష్టార్థసంసిద్ధికై
చతురత్వంబునఁ దత్స్వయంవరవిధిన్ ◊జాటింపఁ బంచెన్ భట
ప్రతతి న్వే క్షణదోదయేశ్వరుఁ డతి◊ప్రహ్లత్తిలిప్తాత్ముఁడై. 3

టీక: క్షణదోదయేశ్వరుఁడు=క్షణదోదయరాజు; అతిప్రహ్లత్తిలిప్తాత్ముఁడై=అత్యానందముచేఁ బూయఁబడిన చిత్తముగలవాఁడై, సుతతారుణ్యశుభోదయస్థితిన్—సుత=కొమార్తెయగు చంద్రికయొక్క, తారుణ్య=యౌవనముయొక్క, శుభోదయ=శుభ మగు నావిర్భావముయొక్క, స్థితిన్=ఉనికిని; తదస్తోకాశయాలంబితేహితమున్ – తత్=ఆచంద్రికయొక్క, అస్తోక=అధిక మగు, ఆశయ=అభిప్రాయమందు, ‘అభిప్రాశ్ఛన్ద ఆశయః’ అని యమరుఁడు,ఆలంబిత=లగ్నమగు, ఈహితమున్=కోరి కను; బోటులచేన్=స్త్రీలచేత; ఎఱింగి=తెలిసికొని; తదమూల్యేష్టార్థసంసిద్ధికై – తత్=ఆచంద్రికయొక్క, అమూల్య=వెలలేని, ఇష్టార్థ=మనోరథముయొక్క, సంసిద్ధికై=ప్రాప్తికొఱకు; చతురత్వంబునన్=నేర్పుతోడ; తత్స్వయంవరవిధిన్ – తత్= ఆ చంద్రికయొక్క, స్వయంవర=స్వయంవరముయొక్క, విధిన్= విధానమును; చాటింపన్=చాటించుటకై, వే=శీఘ్రముగా; భట=బంట్లయొక్క, ప్రతతిన్=సమూహమును; పంచెన్=ఆజ్ఞాపించెను.

క్షణదోదయరాజు తనకొమార్తె యగు చంద్రికయొక్క యిష్టార్థమును, ఆపెయౌవనావిర్భావమును, స్త్రీలవలనఁ దెలిసికొని స్వయంవరమునకై యత్నించి చాటింప భటులం బంచెనని భావము.

చ. ధరణీనాథభటచ్ఛటాముఖరితో◊ద్యచ్చంద్రికైకస్వయం
వరకర్ణేజపడిండిమాదికమహా◊వాదిత్రనాదంబు దు
స్తరమై యత్తఱిఁ బొల్చె నద్భుతగతి ◊న్సప్తార్ణవీమధ్యభూ
వరకోటీపుటభేదనౌఘవిశిఖా◊వల్గుప్రఘాణంబులన్. 4

టీక: ధరణీనాథ భటచ్ఛటా ముఖరి తోద్య చ్చంద్రి కైక స్వయంవర కర్ణేజప డిండిమాదిక మహావాదిత్ర నాదంబు – ధరణీనాథ= క్షణదోదయునియొక్క, భటచ్ఛటా=బంట్లగుంపుచే, ముఖరిత=మ్రోయింపఁబడినట్టియు, ఉద్యత్=ప్రకాశించుచున్నట్టియు, చంద్రికా=చంద్రికయొక్క, ఏక=ముఖ్యమగు, స్వయంవర=స్వయంవరోత్సవమునకు, కర్ణేజప=సూచకమగు, ఇచట ‘స్తమ్బ కర్ణయోరమిజపోః’ అని యచ్ప్రత్యయము, ‘తత్పురుషే కృతి బహుళ’మని విభక్తిలోపము లేదు, డిండిమాదిక=డిండిమము మొదలుగాఁగల, మహావాదిత్ర=అధికమగు నాతోద్యముయొక్క, ‘వాదిత్రాతోద్యనామక’ మని యమరుఁడు, నాదంబు=ధ్వని; సప్తార్ణవీ మధ్య భూవర కోటీ పుటభేద నౌఘ విశిఖా వల్గు ప్రఘాణంబులన్ – సప్తార్ణవీ=ఏడుసముద్రములయొక్క, సప్తానా మర్ణ వానాం సమాహారః అను విగ్రహమునందు ‘అకారాంతోత్తరపదోద్విగుస్త్రియా మిష్టః’ అను వార్తికమువలన స్త్రీత్వము, టిడ్ఢాణ ఞిత్యాదిసూత్రమువలన స్త్రీప్రత్యయము వచ్చినదని యెఱుంగునది, మధ్య=మధ్యభాగమునందున్న, భూవర=రాజులయొక్క, కోటీ=సమూహముయొక్క, పుటభేదన=పట్టణములయొక్క, ఓఘ=సంఘముయొక్క, విశిఖా=రాజమార్గములందలి, వల్గు =సుందరమగు, ప్రఘాణంబులన్=అళిందములయందు; అద్భుతగతిన్=అత్యాశ్చర్యమగురీతిచేత; దుస్తరమై=అధికమైనదై; అత్తఱిన్=ఆసమయమందు; పొల్చెన్=ఒప్పెను.

క్షణదోదయరాజభటులచే మ్రోయింపఁబడిన స్వయంవరసూచకమగు డిండిమారవము సప్తసముద్రముల మధ్యమున నుండు భూపతుల ప్రఘాణములందు నొప్పె ననిభావము. రాజధానులయం దంతటను డిండిమములు మ్రోయించిరని ముఖ్యా శయము.

మ. శ్రవణాభ్యుత్సవపోషయిత్నుసముదం◊చద్భూరిభేరీసము
ద్భవభాంకారము లప్డు మేల్కన నద◊భ్రప్రావృషేణ్యాంబుదా
రవభంగి న్సుమకాండకోదయసమ◊గ్రత్వంబు చాలం దలం
ప విచిత్రం బొకొ చిత్తవీథి నవనీ◊పశ్రేణికిం జేరుటల్. 5

టీక: శ్రవ ణాభ్యుత్సవ పోషయిత్ను సముదంచ ద్భూరి భేరీ సముద్భవ భాంకారములు – శ్రవణ=వీనులకు, అభ్యుత్సవ=ఆనం దమును, పోషయిత్ను=పోషించునట్టి, సముదంచత్=మిక్కిలి యొప్పుచున్న, భూరి=విశాలమగు, భేరీ=దుందుభులవలన, సముద్భవ=పుట్టినట్టి, భాంకారములు =భాం అనెడు ధ్వనులు; అప్డు=ఆసమయమందు; మేల్కనన్=మేలుకొనఁగా; అదభ్ర ప్రావృషేణ్యాంబుదారవ భంగిన్ – అదభ్ర=అధికమగు, ప్రావృషేణ్య=వర్షాకాలమందుఁ బుట్టిన, ‘ప్రావృష ఏణ్యః’ అని ఏణ్య ప్రత్యయము, అంబుద=మేఘములయొక్క, ఆరవ=ధ్వనులయొక్క, భంగిన్=రీతిచేత; సుమకాండకోదయసమగ్రత్వంబు – సుమకాండక=పుష్పసముదాయముయొక్క, ఉదయ=ఆవిర్భావముయొక్క, సమగ్రత్వంబు=పరిపూర్ణత; నవనీపశ్రేణికిన్—నవ=క్రొత్తనగు, నీప=కడిమిచెట్లయొక్క, శ్రేణికిన్=పంక్తికి; చేరుటల్=పొందుటలు; చిత్తవీథిన్=హృదయమందు; తలంపన్= ఆలోచింపఁగ; చాలన్=మిక్కిలి; విచిత్రం బొకొ=విచిత్రమా? కాదనుట. ఇచట, అవనీపశ్రేణికిన్ – అవనీప=రాజులయొక్క, శ్రేణికిన్=సమూహమునకు; సుమకాండ కోదయ సమగ్రత్వంబు – సుమకాండక=పూఁదూపులుగల వలఱేనియొక్క, ఉదయ =ఆవిర్భావముయొక్క, సమగ్రత్వంబు=పరిపూర్ణత; చేరుటలు చిత్రము గాదని స్వభావార్థము.

అనఁగా వర్షాకాలిక మేఘగర్జితశ్రవణము కాఁగానే కడుములకుఁ గుసుమములు గలిగినట్లు స్వయంవరోత్సవసూచకమగు భేరీనినాదము చెవిసోఁకగానే భూపతులకు మన్మథావేశము గలిగె నని భావము.

చ. కమలశరుండు ప్రాప్తకట◊కాముఖవైఖరి నిక్షుచాపవ
ర్యము గొని కూర్చు భంభరగు◊ణారవ మెంతయు నాత్మనా ద్వితీ
య మయి యెసంగ దేశవసు◊ధాధిపముఖ్యపురీలలామబృం
దములఁ జెలంగెఁ దత్పటహ◊నవ్యగభీరనినాద మత్తఱిన్. 6

టీక: త త్పటహ నవ్య గభీర నినాదము – తత్=ఆస్వయంవరోత్సవసంబంధి యగు, పటహ= భేరియొక్క, నవ్య=నూతన మగు, గభీర=గంభీరమగు, నినాదము=ధ్వని; అత్తఱిన్=ఆసమయమందు; కమలశరుండు=మరుఁడు; ప్రాప్తకటకాముఖ వైఖరిన్ –ప్రాప్త=పొందఁబడిన, కటకాముఖ=నడిమివ్రేళ్ళసందున బొటనవ్రేలు చొప్పించి యఱచేతిచాయ వ్రాల్చి యుంగరపు వ్రేలిని చిటికెనవ్రేలిని నించుకంతవంచి పొడవుగా పట్టిన హస్తవిశేషముయొక్క, వైఖరిన్=రీతిచేత; నిక్షుచాపవర్యము =మేలగు చెఱకువింటిని; కొని=గ్రహించి; కూర్చు భంభరగుణారవము=జతపఱచు తుమ్మెదయల్లెత్రాటి మ్రోఁత; ఎంతయున్=మిక్కిలి; ఆత్మనా ద్వితీయము అయి = తనచేత రెండవదై, ‘ఆత్మనశ్చ పూరణే’ అని తృతీయకు లుక్కు లేదు; ఎసంగన్= అతిశయిం పఁగ; దేశ వసుధాధిప ముఖ్యపురీలలామ బృందములన్ – దేశ=దేశమునందలి, వసుధాధిప=రాజులయొక్క, ముఖ్యపురీ లలామ= రాజధానీశ్రేష్ఠములయొక్క, బృందములన్=సమూహములందు; చెలంగెన్=ఒప్పెను.

మ. మును తాతస్తతలోకవాగమృతసం◊భూతిం గడుం జంద్రికా
వనితామోహముఁ గాంచి మన్మథశర◊జ్వాలావళిం గుందు వి
శ్వనరాధీశ్వరకోటికిం ద్వర యిడె ◊న్స్వాంతప్రియంభావుకా
తనుతద్ఘోషము తత్స్వయంవరముఁ జెం◊దం బోవ నప్పట్టునన్. 7

టీక: మును=పూర్వమందు;తాతస్తతలోకవాగమృతసంభూతిన్ – తాతస్తత=అచ్చటచ్చటనుండి వచ్చిన, ఇచట ‘తత ఆగతః’ అని అణ్ ప్రత్యయము. ‘అవ్యయానాం భమాత్రే టిలోపః’ అని టిలోపము వచ్చినది, లోక=జనులయొక్క, వాగమృత=సుధ వంటి వచనమువలన, సంభూతిన్=పుట్టుకగల; కడున్=అధికమగు; చంద్రికావనితామోహమున్ – చంద్రికావానితా=చంద్రిక యనెడు స్త్రీయందలి, మోహమున్=వలపును; కాంచి=పొంది; మన్మథశరజ్వాలావళిన్ – మన్మథశర=మరుతూపులయొక్క, జ్వాలా=మంటలయొక్క, ఆవళిన్=పంక్తిచే; కుందు విశ్వ ధరాధీశ్వర కోటికిన్ – కుందు=పరితపించు, విశ్వ=ప్రపంచము నందలి, ధరాధీశ్వర=భూపతులయొక్క,కోటికిన్=సమూహమునకు; స్వాంత ప్రియంభావుకాతను తద్ఘోషము – స్వాంత= చిత్తములకు, ప్రియంభావుక=ప్రియమగు, అతను=అధికమగు, తద్ఘోషము=ఆస్వయంవరసూచకమగు భేరీనాదము; తత్స్వ యంవరమున్=ఆచంద్రికాస్వయంవరమును; చెందన్ పోవన్=చేరఁబోవుటకు; అప్పట్టునన్=ఆసమయమందున; త్వర = వేగిరపాటును; ఇడెన్=ఇచ్చెను. అనఁగా నచ్చటచ్చటనుండి వచ్చుచున్నజనులవలన క్షణదోదయరాజకుమారిక యగు చంద్రికయొక్క చక్కఁదన మును విని, వలపు చెందియుండిన రాజు లాచంద్రికాస్వయంవరమహోత్సవసూచకమగు భేరీనాద మును విని సంతసించి, యా స్వయంవరోత్సవమునకుఁ బోవ నుద్యమించి రని భావము.

మ. వరభంభాకులనిస్వనప్రతతి న◊వ్వామావతంసస్వయం
వరభద్రోన్నతి యెయ్యెడ న్దెలిసెనో ◊వైళంబె యవ్వేళ న
వ్యరతిశ్రీగతి నేగఁగాఁ దొడఁగె వి◊శ్వారాట్కులం బౌర యు
ర్వర నేమంచు నుతింపవచ్చు జలజా◊స్త్రస్ఫీతమాయావిధిన్. 8

టీక: వర భంభాకుల నిస్వన ప్రతతిన్ – వర=శ్రేష్ఠమగు, భంభాకుల=భంభ యను ధ్వనిచయముగల, నిస్వన=ధ్వనులయొక్క, ప్రతతిన్=సమూహముచేత; అవ్వామావతంస స్వయంవరభ ద్రోన్నతి – అవ్వామావతంస=నారీశ్రేష్ఠయగు నాచంద్రికయొక్క, స్వయంవరభద్ర=స్వయంవరమంగళముయొక్క, ఉన్నతి=అతిశయము; ఎయ్యెడన్=ఏవేళ; తెలిసెనో; వైళంబె=శీఘ్రముగ; అవ్వేళన్=ఆవేళయందే; నవ్య రతి శ్రీ గతిన్ – నవ్య=నూతనమగు, రతి=అనురాగముయొక్క, శ్రీ=సంపదయొక్క, అనఁగ ననురాగాతిశయముయొక్క యనుట, గతిన్=ప్రాప్తిచేత; విశ్వారాట్కులంబు=నరపతిసమూహము, ‘విశ్వస్య వసురాటోః’ అను సూత్రమువలన విశ్వశబ్దమునకు దీర్ఘమని తెలియునది; ఏగఁగాన్=పోవుటకు; తొడఁగెన్=ప్రయత్నించెను; ఔర=ఆశ్చ ర్యము; జలజాస్త్ర స్ఫీత మాయావిధిన్—జలజాస్త్ర=మన్మథునియొక్క, స్ఫీత=అధికమగు, మాయావిధిన్=మాయావిధాన మును; ఉర్వరన్=భూమియందు; ఏమంచున్=ఏమనుచు; నుతింపవచ్చున్= కొనియాడవచ్చును?

అనఁగా స్వయంవరోత్సవసూచకమగు భేరీనాదము వినినతోడనే నరపతిసంఘము చంద్రికయం దనురాగముఁ బూని యాయుత్సవమునకుఁ బోవ నుపక్రమించెను. అహహ! మన్మథునిమాయ నేమని కొనియాడవచ్చు నని భావము.

చ. నెలఁత వరించుఁ దమ్మిదియె ◊నిక్కమటంచుఁ దలంచి వేడుక
న్గలసి పయోజబాణజయ◊కారణరూపసహాయత న్విరా
జిలు సకలాంతరీపనృప◊శేఖరు లెల్లఁ బ్రయాతుకాములై
వెలలిరి దంతిచక్రపద◊వీతిపదాతిసమూహసంవృతిన్. 9

టీక: నెలఁత=చంద్రిక; తమ్మున్; వరించున్=కోరును; ఇదియె నిక్కము=ఇదియే నిశ్చయము; అటంచున్=అనుచు; తలంచి =ఎంచి; వేడుకన్=సంతసముచేత;పయోజబాణజయ కారణ రూప సహాయతన్ – పయోజబాణజయ=మన్మథజయము నకు, కారణ=హేతువగు, రూప=చెలువముయొక్క, సహాయతన్=తోడ్పాటుచేత; విరాజిలు సక లాంతరీపనృపశేఖరు లెల్లన్ –విరాజిలు =ప్రకాశించుచున్న, సకల=సమస్తమగు, అంతరీపనృపశేఖరులు=ద్వీపాంతరాధిపతులగు రాజశ్రేష్ఠులు, ఎల్లన్= అందఱును; ప్రయాతుకాములై = పోనిచ్ఛగల్గినవారై, ‘తుం కామ మనసోరపి’ అనుదానివలన తుమున్నకారమునకు లోపమని యెఱుఁగునది; దంతి చక్రపద వీతి పదాతి సమూహ సంవృతిన్ – దంతి=ఏనుఁగులయొక్క, చక్రపద=రథములయొక్క, వీతి= గుఱ్ఱములయొక్క, పదాతి=కాల్బ లముయొక్క, సమూహ=గుంపుయొక్క, సంవృతిన్=కూడికచేతను; కలసి=కూడి; వెల లిరి = బయలుదేఱిరి.

అనఁగా నీచంద్రిక తమనే వరించునని నమ్మి సంతసముతో మన్మథుని నిరసించు నందము గల సకలద్వీపాధిపతులగు రాజులు సేనలతోఁ గూడి వెడలి రని భావము.

మ. సకి యెవ్వాని వరించిన న్నిజశితా◊స్త్రవ్యాజవాతంధయా
ళికిఁ దజ్జీవసమీరపానమును హా◊ళి న్జేర్చి యాతామ్రకం
జకర న్గైకొని వత్తు మంచుఁ దలఁ పె◊చ్చన్ గొంద ఱుర్వీశపు
త్త్రకు లేతెంచిరి లేఖవర్ణ్యపృతనా◊వ్రాతంబు సేవింపఁగన్. 10

టీక: కొందఱు ఉర్వీశపుత్త్రకులు = కొంతమంది రాజకుమారులు; సకి=చంద్రిక; ఎవ్వానిన్=ఎవనిని; వరించినన్=కోరినను; నిజ శితాస్త్ర వ్యాజ వాతంధయాళికిన్ – నిజ=తమసంబంధులగు,శిత=తీక్ష్ణములైన, అస్త్ర=బాణము లనెడు, వ్యాజ=కపటము గల, వాతంధయ=సర్పములయొక్క, ఆళికిన్=సమూహమునకు; తజ్జీవసమీరపానమును – తత్=వారలయొక్క, జీవసమీర = ప్రాణవాయువుయొక్క, పానమును=త్రాఁగుటను; హాళిన్=ఆసక్తిచే; చేర్చి=కూర్చి; ఆతామ్రకంజకరన్ = ఎఱ్ఱదామరవంటి హస్తముగల యాచంద్రికను; కైకొని=తీసికొని;వత్తు మంచున్=వచ్చెద మని; తలఁపు=కోరిక; ఎచ్చన్=అతిశయింపఁగ; లేఖ వర్ణ్య పృతనా వ్రాతంబు – లేఖ=దేవతలచే, వర్ణ్య=పొగడఁదగిన, పృతనా=సేనయొక్క, ‘పృతనానీకినీ చమూః’ అని యమ రుఁడు, వ్రాతంబు=సమూహము; సేవింపఁగన్=కొలువఁగ; ఏతెంచిరి=వచ్చిరి. అనఁగఁ గొందఱు రాజపుత్త్రులు చంద్రిక యెవని వరించినను, వాని ప్రాణవాయువులను మాబాణము లను సర్పములకుఁ ద్రాగించి, యనఁగా వానిని హింసించి యైనను నామెను దీసికొని వత్తు మని స్వయంవరోత్సవమునకు ననేకసేనలతోఁ గూడి యేతెంచి రని భావము.

చ. సొగసు చెలంగ నప్డు శత◊శోమణిభూషణభూషితాంగులై
యగణితహస్తిరాజవృతి ◊నంచితభద్రగజాధిరూఢులై
ద్విగుణితహర్షయుక్తి నరు◊దెంచిరి కొందఱు దేశవల్లభుల్
నగకుచ నన్యదీయఁగఁ ద◊నర్పదు మద్రమ యంచు నెంచుచున్. 11

టీక: కొందఱు దేశవల్లభుల్ =కొందఱు దేశాధిపతులు; సొగసు=అందము; చెలంగన్=ప్రకాశింపఁగా; అప్డు=ఆసమయమందు; శతశో మణిభూషణ భూషితాంగులు ఐ – శతశః=అనేకప్రకారములగు, మణిభూషణ=రత్నభూషణములచేత, భూషిత = అలంకరింపఁబడిన, అంగులు ఐ =శరీరములు గలవారై; అగణితహస్తిరాజవృతిన్ – అగణిత=లెక్కించుట కలవిగాని; హస్తి రాజ=గజశ్రేష్ఠములయొక్క, వృతిన్=ఆవృతిచేత; అంచిత భద్రగజాధిరూఢులై – అంచిత = ఒప్పుచున్న, భద్రగజ=ఏనుఁగు లను, అధిరూఢులై=ఎక్కినవారై; ద్విగుణిత హర్ష యుక్తిన్ – ద్విగుణిత=రెట్టింపఁబడిన, హర్ష = ఆనందముయొక్క, యుక్తిన్ =సంబంధముచేత; నగకుచన్=గుబ్బలులవంటి పాలిండ్లుగల చంద్రికను; మద్రమ – మత్=నా యొక్క, రమ=సంపద; అన్య దీయఁగన్= ఇతరసంబంధినియైనదానినిఁగ; తనర్పదు=చేయదు; యంచున్=అనుచు;ఎంచుచున్ =తలంచుచు; అరుదెంచిరి = వచ్చిరి. అనఁగఁ గొందఱు దేశాధీశులు బహువిధభూషణాలంకృతులై, అనేకగజములతోఁ గూడి, భద్రగజముల నెక్కి, సంత సముతో మావిభవంబు చంద్రికను మఱియొకనిని గోర నియ్య దని తలంచుచు వచ్చి రని భావము.

మ. మఱియున్ వచ్చిరి దేశనాయకులు భా◊మామంగళస్ఫూర్తి న
త్తఱి వీక్షింప సురేంద్రనీలరథసం◊తానంబుపై నెక్కి శ్రీ
మెఱయ న్వారిధరాళిపైఁ దగుధరా◊మిత్రుల్ బలె న్వేడుకల్
దొఱయ న్సంగరపారదృశ్వబలసం◊దోహంబుతోఁ జయ్యనన్. 12

టీక: దేశనాయకులు=దేశాధిపతులు; సురేంద్రనీల రథ సంతానంబుపైన్ – సురేంద్రనీల=ఇంద్రనీలమణిమయము లగు, రథ =స్యందనములయొక్క, సంతానంబుపైన్=సమూహముమీఁద; ఎక్కి=అధిష్ఠించి; శ్రీ=సంపద; మెఱయన్=ప్రకాశింపఁగ; వారిధరాళిపైన్ – వారిధర=మేఘములయొక్క, ఆళిపైన్=బంతిమీఁద; తగుధరామిత్రుల్ బలెన్ = ఒప్పునట్టి పర్వతవైరు లైన యింద్రులవలెనె; వేడుకల్=సంతోషములు; దొఱయన్=కలుగఁగ; సంగర పారదృశ్వ బల సందోహంబుతోన్ – సంగర = యుద్ధముయొక్క,పారదృశ్వ=అంతమును గన్నవారియొక్క, రణపండితులయొక్క యనుట, బల=సేనలయొక్క, సందో హంబుతోన్ =సమూహముతోడ; చయ్యనన్=శీఘ్రముగ;అత్తఱిన్=ఆసమయమందు; భామా మంగళ స్ఫూర్తిన్ – భామా= చంద్రికయొక్క, మంగళ=స్వయంవరరూపమగు మంగళముయొక్క, స్ఫూర్తిన్=అతిశయమును; వీక్షింపన్=చూచుటకు; మఱియున్ = ఇంకను;వచ్చిరి. అనఁగ మఱియుం గొందఱు నరపతులు ఇంద్రనీలమణిమయము లగురథముల నెక్కి, మేఘ పంక్తిపై నెక్కిన యింద్రులవలెఁ బ్రకాశించుచుఁ జంద్రికాస్వయంవరోత్సవమును జూచుటకై సేనాసమేతముగ వచ్చి రని భావము.

చ. మొనసినయెక్కు చక్కఁదన◊మున్ నెఱనీటును మించ మోదపూ
ర్తి నపుడు వచ్చురాజసుత◊బృందము గన్గొన నయ్యె మారు నొ
క్కనిఁ గని యుబ్బు లచ్చిపయి ◊గాటపుటీసు భజించి ధాత్రి నూ
తనవనజాస్త్రకోటుల ను◊దారమహాత్మతచే సృజించె నాన్. 13

టీక: ధాత్రి =భూమి; మారున్=మన్మథుని; ఒక్కనిన్=ఒకనిని; కని=ప్రసవించి; ఉబ్బు లచ్చిపయి = సంతసించు లక్ష్మీదేవిపై; గాటపుటీసు – గాటపు=గాఢమగు, ఈసు=అసూయను; భజించి=పొంది; నూతనవనజాస్త్రకోటులన్ = అభినవమన్మథకోటు లను; ఉదార మహాత్మతచేన్ – ఉదార=ఉత్కృష్టమగు, మహాత్మతచేన్=మహిమచేత; సృజించెనాన్=సృష్టించెనో యనునట్లు; మొనసినయెక్కుచక్కఁదనమున్ – మొనసిన=కల్గిన, ఎక్కుచక్కఁదనమున్=అధికమైన యందమును; నెఱనీటును =నిండిన మురిపెమును;మించన్=అతిశయింపఁగా; మోదపూర్తిన్—మోద=సంతోషముయొక్క, పూర్తిన్=పరిపూర్ణతచేత; వచ్చు రాజ సుతబృందము =వచ్చునట్టి రాట్కుమారులసమూహము; అపుడు; కన్గొనన్ =చూచుటకు;అయ్యెన్=ఆయెను.

కలిమిజవరా లొకపూవిలుకానిని గని విఱ్ఱవీఁగఁగాఁ బుడమి యాలచ్చిపై నీసున నెన్నికలేని క్రొత్తపూవిలుకాండ్రను గనెనో యను నట్లు చక్కఁదనమున మించు పెక్కురాకొమరు లేతెంచి రని భావము. ఇందు నుత్ప్రేక్షాలంకారము.

మ. జగతీమార్గము లెల్ల నిండి యిసుము ◊ల్చల్లన్ ధరం జేర న
ట్టుగ నేతెంచిరి రాజపుత్త్రకులు నీ◊టు ల్మీర నప్పట్టునన్
జగదంధంకరణాఢ్యసైన్యవిధుత◊క్ష్మాధూళిమేఘాళికిన్
మిగులన్ గర్జలఁ గూర్ప మర్దళజధిం◊ధిమ్యార్భటీపేటికల్. 14

టీక: జగతీమార్గములు=భూమార్గములు; ఎల్లన్=అంతయు; నిండి=కప్పుకొని; ఇసుముల్=ఇసుకలు; చల్లన్=వెదచల్లఁగ; ధరన్=భూమిని; చేరనట్టుగన్ =పొందనట్లుగా; రాజపుత్త్రకులు=రాకొమరులు; అప్పట్టునన్=ఆసమయమందు; నీటుల్ మీఱన్ = మురిపెము లతిశయింపఁగా; జగ దంధంకర ణాఢ్య సైన్య విధుత క్ష్మాధూళి మేఘాళికిన్ – జగత్=లోకమునకు, అంధంకరణ= చీఁకటిని జేసెడి, ఆఢ్య=సంపన్నమగు, సైన్య=సేనలచేత, విధుత=ఎగురఁగొట్టఁబడిన, క్ష్మాధూళి=భూపరాగ మనెడు, మేఘాళికిన్=మబ్బులచాలునకు; మిగులన్=అధికముగా; మర్దళ జ ధింధిమ్యార్భటీ పేటికల్—మర్దళ=మద్దెలల వలన, జ=పుట్టిన, ధింధిమ్యార్భటీ=ధింధిమి యను ధ్వనులయొక్క,పేటికల్=బృందములు; గర్జలన్=గర్జాధ్వనులను; కూర్పన్=జతపఱుపఁగ; ఏతెంచిరి=వచ్చిరి. అనఁగ రాకొమరులు భూమార్గములెల్ల నిసుక చల్లినను గ్రిందఁబడనియటులు నిండుకొని వారల సైన్యపరాగ మను మేఘాళికి మద్దెలధ్వనులు గర్జారవము లగుచుండఁగా నేతెంచి రని భావము.

చ. వనితస్వయంవరోత్సవము ◊వాసిగఁ గన్గొన వచ్చు భూమికాం
తనికర మప్డు దోఁచెఁ గరి◊నాయకపాళులపై నిజైకతై
క్ష్ణ్యనియతి మాని చల్లఁదన◊మంది మహోదయశైలకోటులన్
దినముఖవేళఁ జూడఁ బడు◊దీధితిరాజసమూహవైఖరిన్. 15

టీక: వనితస్వయంవరోత్సవము =చంద్రికయొక్క స్వయంవరోత్సవమును; వాసిగన్=బాగుగ; కన్గొన వచ్చు భూమికాంత నికరము = చూడఁగా నేతెంచెడి రాజుల బృందము; అప్డు=ఆసమయమందు; కరినాయకపాళులపైన్ =గజేంద్రబృందముల మీఁద; ని జైక తైక్ష్ణ్య నియతిన్ – నిజ=తమయొక్క, ఏక=ముఖ్యమగు, తైక్ష్ణ్య=తీక్ష్ణభావముయొక్క,నియతిన్=నియమమును; మాని=విడిచి; చల్లఁదనము=శీతస్వభావమును; అంది=పొంది; మహోదయశైలకోటులన్=ఉదయగిరిశిఖరములందు; దిన ముఖవేళన్=ఉదయకాలమందు; చూడఁబడు దీధితిరాజసమూహవైఖరిన్ – చూడఁబడు =కనఁబడుచున్న, దీధితిరాజ= సూర్యులయొక్క, సమూహ=గుంపుయొక్క, వైఖరిన్=రీతిచేత; తోఁచెన్=కానిపించెను.

అనఁగా నాచంద్రిక స్వయంవరోత్సవమునకు నేనుఁగులపై నెక్కి యేతెంచు పుడమిఱేడు లపుడు తీక్ష్ణభావమును మాని, చల్లఁదనము వహించి పొడుపుకొండకొనలపైఁ జూపట్టు దినముఖసూర్యబింబంబుల పగదిఁ గాన్పించి రని భావము. గజబృంద ముల నధిష్ఠించి యున్న రాజబృందములను ఉదయగిరిశిఖరగతభానుమూర్తులనుగా నుత్ప్రేక్షించుటచే వస్తూత్ప్రేక్షాలం కారము.

మ. నెఱి నంకాంచితమూర్తు లందఱు కలా◊నీకైకరోచిష్ణు లం
దఱు సత్పాలనదక్షు లందఱు దగన్ ◊శ్యామాభిరామాత్ము లం
దఱు గానం బఱతెంచురాసుతులు నే◊త్రప్రీతి చేకూర్చి ర
త్తఱి నౌనా నన విశ్వరూపగతిచే◊తం దోఁచుచంద్రస్థితిన్. 16

టీక: పఱతెంచురాసుతులు =వచ్చుచున్న రాకొమరులు; అందఱు=ఎల్లరును; నెఱిన్=క్రమముగా; అంకాంచితమూర్తులు – అంక=రాజచిహ్నములచేత, అంచిత=ఒప్పుచున్న, మూర్తులు=శరీరములుగలవారు, ‘మూర్తిః కాఠిన్య కాయయోః’ అని అమరుఁడు; అంకాంచితమూర్తులు—అంక=కళంకముచేత, అంచిత=ఒప్పుచున్న, మూర్తులు=దేహములు గలవారని చంద్ర పరమైన యర్థము; అందఱు=ఎల్లరును; కలానీకైక రోచిష్ణులు – కలానీక=విద్యాసమూహముచే, ఏక=ముఖ్యముగా, రోచి ష్ణులు=ప్రకాశించువారు; కలానీకైకరోచిష్ణులు – కలానీక=షోడశకలాసమూహముచే, ఏక=ముఖ్యముగా,రోచిష్ణులు=ప్రకా శించువారని చంద్రపరమైన యర్థము; అందఱు=ఎల్లరును; సత్పాలనదక్షులు – సత్=సత్పురుషులయొక్క, పాలన= పరి పాలనమందు, దక్షులు=సమర్థులు; సత్పాలనదక్షులు – సత్=నక్షత్రములయొక్క, పాలన=పరిపాలనమందు, దక్షులు = సమర్థులు అని చంద్రపరమైన యర్థము;అందఱు=ఎల్లరును; తగన్=ఒప్పునట్లు; శ్యామాభిరామాత్ములు – శ్యామా=స్త్రీలకు, అభిరామ=మనోజ్ఞమగు, ఆత్ములు=దేహములుగలవారు; శ్యామాభిరామాత్ములు – శ్యామా=రాత్రులయందు, అభిరామ = ప్రకాశించుచున్న, ఆత్ములు=శరీరములుగలవారు అని చంద్రపరమైన యర్థము; అందఱు=ఎల్లరును; కానన్=అగుటవలన; అత్తఱిన్=అప్పుడు; విశ్వరూపగతిచేతన్=సమస్తరూపముల నొందుటచే; తోఁచుచంద్రస్థితిన్ – తోఁచు=కనిపించుచున్న, చంద్ర స్థితిన్=చంద్రునియొక్క సత్తచేత; ఔనౌన్ అనన్ = ప్రశంసించునటులు; నేత్రప్రీతి=చక్షుఃప్రీతిని; చేకూర్చిరి=ఒనరించిరి.

అనఁగా స్వయంవరోత్సవమునకై వచ్చుచున్న రాసుతు లెల్లరు బహురూపములను దాల్చిన చంద్రునిరీతిఁ జూపఱకు నయనానందమును పొనరించిరని భావము.

చ. వనజశరు న్హసించుపరు◊వంపువిలాసములేనివాఁడు నూ
తనవరరత్నభూషణవి◊తానము దాల్పనివాఁ డుదారపా
వనబలయుక్తి రాజిలని◊వాఁ డొకఁడైన నయారె దోఁపఁ డ
య్యె నపుడు పన్నిదంబున కి◊లేశసుతావళిలోనఁ గన్గొనన్. 17

టీక: ఇలేశసుతావళిలోనన్ = రాసుతులగుంపునడుమ; అపుడు=ఆసమయమందు; వనజశరున్=మన్మథుని; హసించుపరు వంపు విలాసము – హసించు=నవ్వుచున్న (పరిహసించుచున్న), పరువంపు=నూతనమగు, విలాసము=అందము; లేనివాఁడు =కలుగనియట్టివాఁడు; నూతన వరరత్న భూషణ వితానము – నూతన=క్రొత్తనగు, వరరత్న=శ్రేష్ఠమగు మణులయొక్క, భూషణ =సొమ్ములయొక్క, వితానము=సమూహము; తాల్పనివాఁ డు = ధరింపనివాఁడు; ఉదార పావన బల యుక్తిన్ – ఉదార = ఉత్కృష్టమగు, పావన=వాయుదేవునిసంబంధియగు, బల=సత్త్వముయొక్క, యుక్తిన్=యోగముచేత; రాజిలని వాఁడు=ప్రకాశింపనివాఁడు, వాయువుతో సమానమైన బలములేనివాఁడనుట; పన్నిదంబునకున్= పందెమునకైన; కన్గొనన్ = చూచుటకు; ఒకఁడైనన్= ఒక్కడేనియు; తోఁపఁడయ్యెన్=కనఁబడడయ్యెను; అయారె=ఆశ్చర్యము!

అనఁగా నాస్వయంవరోత్సవమునకు నేతెంచియున్న రాసుతులలో నొకఁడైనను మన్మథుని నిరసించు నందము లేని వాఁడును, మణిభూషణములను దాల్పనివాఁడును, వాయువునకు దీటైన బలములేనివాఁడును బందెమునకైన లేఁడని భావము.

చ. శరజహితాన్వయేంద్రుఁడు సు ◊చంద్రధరాధిపచంద్రుఁ డప్డు త
త్తరుణిస్వయంవరోత్సవవి◊ధానము దా విని త న్వరించుఁ బో
హరిమణివేణి యంచు ముద◊మాంతరవీథికఁ గందళింపఁ గి
న్నరవిభుఁ డాత్మసఖ్యకల◊న న్వెను పాయక కొల్వ వే తగన్. 18

టీక: శరజహితాన్వయేంద్రుఁడు – శరజహితాన్వయ=సూర్యవంశమునకు, ఇంద్రుఁడు=అధిపతి యగు; సుచంద్రధరాధిప చంద్రుఁడు = సుంద్రుఁడను పేరుగల రాజచంద్రుఁడు; అప్డు=ఆసమయమున; తత్తరుణి స్వయంవరోత్సవ విధానము – తత్తరుణి =ఆచంద్రికయొక్క, స్వయంవరోత్సవ=స్వయంవరపు వేడుకయొక్క, విధానము=ప్రకారమును; తాన్; విని=ఆకర్ణించి; తన్ = తనను; హరిమణివేణి = ఇంద్రనీలమణివంటి (దానివలె నల్లనైన) జడగల చంద్రిక; వరించున్ పో= నిజముగ కోరును; అంచున్ = అని తలఁచుచు; ఆంతరవీథికన్=చిత్తప్రదేశమునందు; ముదము=సంతసము; కందళింపన్=అంకురింపఁగా; కిన్నరవిభుఁడు = కిన్నరశ్రేష్ఠుఁడగు కుముదుఁడు; ఆత్మసఖ్యకలనన్ – ఆత్మ=తనయొక్క, సఖ్య=స్నేహముయొక్క, కలనన్=ప్రాప్తిచేత; వే =శీఘ్రముగ; వెను పాయక =వెంబడించి ; కొల్వన్=సేవింపఁగా; తగన్=ఒప్పునట్లు. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

మ. ద్విరదాధీశ్వరు నెక్కి పౌరవసుగా◊త్రీరత్నవారంబు క్రొ
వ్విరిసేసన్ బయి నింప విప్రతతి దీ◊వింప న్నవానేకపాం
డురపట్టాతపవారణావృతముఖుం◊డున్ జారుభూషావిభా
స్వరగాత్రుండును నై పురి న్వెడలి ఠే◊వ న్వచ్చె నప్పట్టునన్. 19

టీక: ద్విరదాధీశ్వరున్=గజశ్రేష్ఠమును; ఎక్కి=అధిష్ఠించి; పౌరవసుగాత్రీరత్నవారంబు =పురస్త్రీరత్నబృందము; క్రొవ్విరిసేసన్ =క్రొత్తపుష్పము లనెడు నక్షతలను; పయిన్=శరీరముమీఁద; నింపన్=నిండింపఁగా; విప్రతతి=బ్రాహ్మణులగుంపు; దీవింపన్ = ఆశీర్వదింపఁగా; నవానేక పాండుర పట్టాతపవారణావృత ముఖుండున్ –నవ=క్రొత్తనగు, అనేక =పెక్కులగు, పాండుర=తెల్ల నైన, పట్టాతపవారణ=పట్టుగొడుగులచేత, ఆవృత=ఆవరింపఁబడిన; ముఖుండున్=ముఖముగలవాఁడును; చారుభూషావిభాస్వరగాత్రుండును – చారు=మనోజ్ఞములగు, భూషా=ఆభరణములచే, విభాస్వర=ప్రకాశించు, గాత్రుండును=శరీరముగల వాఁడును; ఐ=అయినవాఁడై; పురిన్=తనరాజధానినుండి; వెడలి=బైలుదేఱి; అప్పట్టునన్=ఆసమయమున; ఠేవన్=ఒప్పిద ముగను; వచ్చెన్=ఏతెంచెను. అనఁగ సుచంద్రుఁడు పురకాంతలు పుష్పాక్షతలు చల్లుచుండఁగ, విప్రులు దీవించుచుండఁగ, తెల్ల నగు పట్టుగొడుగులచే నావృతమైనముఖము గలవాఁడై, భూషణభూషితాంగుఁడై యేనుఁగు నెక్కి పురము వెడలె నని భావము.

చ. అసురవిదారి కాంచనశ◊తాంగరథాంగపరిభ్రమిప్రకా
రసముదితారవంబు లిభ◊రాట్పటలీఘనబృంహితంబు లు
ల్లసితమహాచమూకలక◊లంబు జగత్త్రితయంబు గప్ప సం
తసమున సర్వదేశజన◊నాథులు గన్గొన వచ్చె నత్తఱిన్. 20

టీక: అసురవిదారి=దానవదళనుఁడైన సుచంద్రుఁడు; కాంచనశతాంగ రథాంగ పరిభ్రమి ప్రకార సముది తారవంబులు – కాంచన శతాంగ = సువర్ణమయరథములయొక్క, రథాంగ = చక్రములయొక్క, పరిభ్రమి = భ్రమణములయొక్క, ప్రకార=రీతిచేత, సముదిత=పుట్టిన, ఆరవంబులు=ధ్వనులు; ఇభరా ట్పటలీ ఘన బృంహితంబులు – ఇభరాట్=గజరాజులయొక్క, పటలీ= బృందముయొక్క, ఘన=అధికములగు, బృంహితంబులు=గర్జాధ్వనులు, ‘బృంహితం కరిగర్జిత’ మని యమరుఁడు; ఉల్ల సిత మహాచమూ కలకలంబు – ఉల్లసిత=ప్రకాశించుచున్న, మహాచమూ=గొప్పసేనలయొక్క, కలక లంబు =కోలాహల ధ్వని; జగత్త్రితయంబు=ముల్లోకములను; కప్పన్=ఆవరింపఁగా; సంతసమునన్=సంతోషముచేత; సర్వదేశజననాథులు = అన్నిదేశములరాజులు; కన్గొనన్=చూచుచుండఁగా; అత్తఱిన్=ఆసమయమున; వచ్చెన్=వచ్చెను.

అనఁగ సుచంద్రుఁడు రథనేమి ధ్వనులు, కరిగర్జితములు, సేనాకలకలంబును ముల్లోకములకు వ్యాపించుచుండఁగా, నరపతు లెల్లరుఁ గనుచుండఁగా స్వయంవరోత్సవమునకు వచ్చె నని భావము.

చ. ఘనకమలేశ్వరాత్మజవి◊కస్వరదీప్తివిలాసహారిపా
వనరుచిజాలలబ్ధి దయి◊వాఱుచుఁ దోఁచినయట్టిలోకబం
ధు నతని విస్మయంబునఁ గ◊నుంగొని రయ్యెడ నప్డు చక్కఁ బ
ద్మిని తదధీనగాఁ దమమ◊తిం దలఁ పుంచిరి రాజు లందఱున్. 21

టీక: ఘన కమలేశ్వరాత్మజ వికస్వర దీప్తి విలాస హారి పావనరుచి జాల లబ్ధిన్ – ఘన=అధికమగు, కమలేశ్వరాత్మజ=విష్ణు సుతుఁడైన మన్మథునియొక్క, వికస్వర=వికసించుచున్న, దీప్తి=కాంతియొక్క, విలాస=విలాసమును, హారి=హరించుచున్న, పావన=పరిశుద్ధమగు,రుచి=కాంతులయొక్క,జాల=పుంజములయొక్క,లబ్ధిన్=ప్రాప్తిచేత; దయివాఱుచున్=ప్రకాశించుచు; ఇట, ఘన=గొప్పనగు, కమలేశ్వరాత్మజ=చంద్రునియొక్క, వికస్వరమగు కాంతివిలాసమును, హారి=హరించు, పావనరుచి జాలప్రాప్తిచేత దైవాఱుచు నని సూర్యపరమైన యర్థము. సూర్యుఁడు తనకాంతులచే చంద్రునిరుచుల గ్రహించుటయును, నిచ్చు టయును ప్రసిద్ధము; తోఁచినయట్టిలోకబంధున్= కనిపించుచున్నట్టి లోకప్రియుఁడగు, కనిపించుచున్నట్టి సూర్యుని నని తోఁచు చున్నది; అతనిన్=ఆసుచంద్రుని, ఆసూర్యుని; ఎయ్యెడన్=ఎప్పుడైతే; విస్మయంబునన్= వింతచేత; కనుంగొనిరి=చూచిరో; అప్డు=అప్పడే; చక్కన్=బాగుగా; పద్మినిన్=చంద్రికను, పద్మలత నని తోఁచును; తదధీనగాన్=ఆ సుచంద్రుని స్వాధీనయైన దానినిఁగ, సూర్యుని స్వాధీనయైనదానినిఁగ; రాజు లందఱున్ =నరపతు లెల్లరు; తమమతిన్ = తమచిత్తములందు; తలఁపు= అభిప్రాయమును; ఉంచిరి=ఉనిచిరి.

స్వయంవరోత్సవమునందుఁ జేరియున్నరాజు లందఱును మన్మథాతిశాయిసౌందర్యము గల యాసుచంద్రునికి చంద్రిక సూర్యునికి పద్మలతయుంబోలె నాయత్త యైనదానిఁగాఁ దలంచి రని భావము.

మ. అతులంబై యనవద్యమై కువలయో◊దారప్రమోదప్రదా
త్మత సంధించి కరంబు రాజిలు సుచం◊ద్రప్రాజ్యతేజోవ్రజం
బతివేలం బగుచున్ వెలుంగఁగ ననంతా◊స్థాని నాక్షత్రసం
తతి చూపట్టె సముజ్ఝితస్వకమహా◊ధామాళిచే నయ్యెడన్. 22

టీక: అతులంబై=అధికమైనదై; అనవద్యమై=నిర్దుష్టమైనదై; కువల యోదార ప్రమోద ప్రదాత్మతన్ – కువలయ=భూవలయ మునకు, ఉదార=ఉత్కృష్టమగు, ప్రమోద=సంతసమును, ప్రద=ఇచ్చుచున్న, ఆత్మతన్=స్వభావము గలవాఁడగుటను, సర్వదా భూమండలమును సంతసింపఁజేయు స్వభావముగలవాఁ డగుట ననుట; కువలయ=కలువలకు, ప్రమోదప్రదమగు స్వభా వము గలవాఁడగుట నని చంద్రపరమైన యర్థము; సంధించి=పొంది; కరంబు=మిక్కిలి; రాజిలు సుచంద్ర ప్రాజ్య తేజో వ్రజంబు – రాజిలు = ప్రకాశించు, సుచంద్ర=సుచంద్రమహారాజుయొక్క, మంచిచంద్రునియొక్క, ప్రాజ్య=అధికమగు, తేజో వ్రజంబు=కాంతిపుంజము, వెన్నెల; అతివేలం బగుచున్=అధికమైన దగుచు, ‘అతివేల భృశాత్యర్థ’ అని యమరుఁడు; వెలుం గఁగన్ =ప్రకాశింపఁగా; అనంతాస్థానిన్ – అనంతా=భూమియనెడు, ఆస్థానిన్=సభయందు; నాక్షత్రసంతతి= రాజబృందము; అనంత=ఆకాశమనెడు, ఆస్థానిన్=సభయందు, నాక్షత్రసంతతి= నక్షత్రసంబంధి యగు గుంపు అని చంద్రపరమైన యర్థము; సముజ్ఝిత స్వక మహాధామాళిచేన్ – సముజ్ఝిత=విడువఁబడిన, స్వక=తమసంబంధియగు, మహత్=అధికమగు, ధామాళిచేన్ =కాంతిసమూహముచే; అయ్యెడన్= ఆసమయమందు; చూపట్టెన్=కనిపించెను.

అనఁగఁ జంద్రునికాంతిపుంజము సన్నిధిఁ దేజోవిహీన మగు రిక్కలగుంపుపగిది సుచంద్రునితేజము సన్నిధిని నితరరాజ బృందము కళఁబాసి కనుపట్టె నని భావము.

తే. ఇట్టు లపు డేగుదెంచిన◊యట్టి సకల, మనుజకాంతులఁ బాంచాల◊జనవిభుండు
రహి నెదుర్కొని యభినవ్య◊రత్నమయమ,హోన్నతనివేశపాళుల◊నునిచె నంత. 23

టీక: ఇట్టులు=ఈరీతిగ; అపుడు=ఆసమయమందు; ఏగుదెంచినయట్టి సకలమనుజకాంతులన్ = వచ్చినట్టి సమస్తనరపతు లను; పాంచాలజనవిభుండు =పాంచాలరాజైన క్షణదోదయుఁడు; రహిన్=ప్రీతితో; ఎదుర్కొని =ఎదురుగా నేగి; అభినవ్య రత్నమయ మహోన్నత నివేశపాళులన్ – అభినవ్య=నూతనమగు,రత్నమయ=మణిమయమగు, మహోన్నత=మిక్కిలి యెత్తుగా నున్న, నివేశపాళులన్=విడుదులపంక్తులయందు; ఉనిచెన్=ఉంచెను.

అనఁగాఁ బాంచాలరాజగు క్షణదోదయుఁడు స్వయంవరమునకై వచ్చిన రాజుల నెదుర్కొని సమ్మానించి వారిని మణి మయమైన యున్నతనివేశములయం దుంచె నని భావము.

చ. అవనితలేంద్రు లెల్లఁ బ్రమ◊దాతిశయంబునఁ దత్స్వయంవరో
త్సవదినవేళ దివ్యమణి◊జాతవినిర్మితమంచమండలిన్
బ్రవిమలచిత్తపద్ము లయి◊బాగుగఁ జేరి వసించి రంగనా
నివహము చామరల్ వలయ◊నిక్వణనంబులు మించ వీవఁగన్. 24

టీక: అవనితలేంద్రు లెల్లన్=రాజులందఱు; ప్రమదాతిశయంబునన్=సంతోషాతిశయముచేత; తత్స్వయంవరోత్సవదినవేళన్ – తత్=ఆచంద్రికయొక్క, స్వయంవరోత్సవ=స్వయంవరపువేడుకయొక్క, దినవేళన్=దివసమునందు; దివ్యమణిజాతవిని ర్మితమంచమండలిన్—దివ్యమణి=శ్రేష్ఠమగు మణులయొక్క, జాత=గణముచేత, వినిర్మిత=రచియింపఁబడిన, మంచ= మంచములయొక్క, మండలిన్=సమూహమందు; ప్రవిమలచిత్తపద్ములయి – ప్రవిమల=మిక్కిలిస్వచ్ఛమగు,చిత్తపద్ములయి=మనఃకమలములుగలవారై; బాగుగన్=రమణీయముగ; చేరి=సమీపించి; అంగనానివహము=స్త్రీసమూహము; వలయనిక్వ ణనంబులు – వలయ=కంకణములయొక్క, నిక్వణనంబులు=ధ్వనులు; మించన్=అతిశయింపఁగ; చామరల్ =వింజామర లను; వీవఁగన్=విసరుచుండఁగా; వసించిరి=కూర్చుండిరి. అనఁగ స్వయంవరోత్సవమునకు వచ్చిన రాజు లందఱు మణి మయమంచాసనములపై నువిదలు కంకణధ్వనులు చెలరేఁగ వీచోపులు వీచుచుండఁగ విమలచిత్తులై నివసించి రని భావము.

మ. అలవేళన్ హరిపుత్త్రహారకమహుం◊డై నిస్తులాహీనహా
రలతాశోభితమూర్తియై తగుసుచం◊ద్రక్ష్మాతలేంద్రుండు ని
ర్మలపాండుద్యుతిమన్మణీమయమహా◊మంచాగ్రభద్రాసన
స్థలిఁ దాఁ జేరి వసించె రూప్యగిరిఁ గా◊త్యాయన్యధీశుం డనన్. 25

టీక: అలవేళన్=ఆసమయమందు; హరిపుత్త్ర హారక మహుండు ఐ – హరిపుత్త్ర=జయంతుని, హారక=హరించిన, మహుండు ఐ =తేజస్సుగలవాఁడై; హరిపుత్త్ర=మన్మథుని, లేదా యముని, హారక=హరించిన, మహుండు ఐ =తేజస్సుగలవాఁడై అని శివ పరమైన యర్థము; నిస్తులాహీన హారలతా శోభిత మూర్తియై – నిస్తుల=సాటిలేని,అహీన=శ్రేష్ఠమగు, శివపరముగ శేషుఁడనెడు, హారలతా=లతలవంటి హారములచే, శోభిత=ప్రకాశించుచున్న, మూర్తియై =తనువుగలవాఁడై; తగుసుచంద్రక్ష్మాతలేంద్రుండు – తగు=ఒప్పుచున్న, సుచంద్రక్ష్మాతలేంద్రుండు=సుచంద్రుఁడను రాజశ్రేష్ఠుఁడు; నిర్మల పాండుద్యుతిమ న్మణీమయ మహామంచా గ్ర భద్రాసనస్థలిన్ – నిర్మల=స్వచ్ఛమగు, పాండుద్యుతిమత్=తెల్లనికాంతిగల, మణీమయ=రత్నమయమగు, మహామంచాగ్ర =గొప్పపర్యంకాగ్ర మనెడు; భద్రాసనస్థలిన్=సింహాసనస్థలమందు; తాన్; చేరి=సమీపించి; రూప్యగిరిన్=వెండికొండయందు; కాత్యాయన్యధీశుండు = కాత్యాయినీ+అధీశుండు=పార్వతీశుఁడైన శివుఁడో; అనన్=అనునట్లుగా; వసించెన్=కూర్చుండెను.

తెల్లనిమణులతో రచియించి యున్నమంచముపైఁ గూర్చుండి యున్న యాసుచంద్రుఁడు వెండికొండపైఁ గూర్చుండి యున్న ముక్కంటిపగిది విలసిల్లె నని భావము. ఇచట సుచంద్రుని శివునిగా నుత్ప్రేక్షించుటచే నుత్ప్రేక్షాలంకారము.

మ. ఘనముక్తామణికాసనంబున సిరిం◊ గన్పట్టు నాదైత్యభే
దనుఁ డౌరౌర నుతింప నయ్యె ఖరరు◊ క్తైక్ష్ణ్యంబుచేత న్విక
ర్తనబింబమ్మున నుండుట న్సడలి శీ◊తచ్ఛాయబింబంబు చే
రిన వారాశిసుతామనోహరునిదా◊రిం బూని యప్పట్టునన్. 26

టీక: ఘనముక్తామణికాసనంబునన్ – ఘన=గొప్పలగు, ముక్తామణికా=ముత్తెములయొక్క, ఆసనంబునన్=సింహాసన మందు; సిరిన్= కాంతిచే; కన్పట్టు నాదైత్యభేదనుఁడు=కనిపించు నాసుచంద్రుఁడు; ఖరరుక్తైక్ష్ణ్యంబుచేతన్=తీక్ష్ణకిరణముల వేఁడిమిచేత; వికర్తనబింబమ్మునన్=సూర్యబింబమునందు;ఉండుటన్=ఉనికిని; సడలి=వదలి; శీతచ్ఛాయబింబంబు= చల్లనికాంతి గల చంద్రబింబమును; చేరిన వారాశిసుతామనోహరునిదారిన్ – చేరిన=పొందిన, వారాశిసుతామనోహరుని= లక్ష్మీభర్తయైన విష్ణువుయొక్క, దారిన్=విధమును; పూని=వహించి; అప్పట్టునన్=ఆసమయమందు; నుతింపనయ్యెన్= స్తుతిపాత్రుఁడయ్యెను; ఔ రౌర=ఆశ్చర్యము! అనఁగా ముక్తామయభద్రాసనంబునఁ గూడియున్న సుచంద్రుఁడు, మిక్కిలి వేఁడిగల సూర్యబింబమును విడిచి, చల్లనిచంద్రబింబంబును జేరినవిష్ణుమూర్తియో యని పొగడఁబడె నని భావము. నారా యణమూర్తి సూర్యబింబమునం దుండుట ప్రసిద్ధము.

సీ. సురగణ్యలావణ్య◊గరిమ రాజులకుఁ బాం,చాలినిరాశ హె◊చ్చంగఁ జేయ,
మణిమంచబింబితా◊త్మచ్ఛాయ తనుఁ గొల్వఁ, దఱియుమన్మథుబుద్ధి◊దనరఁ జేయ,
హీరభూషణవిభా◊వారంబు వెన్నెల, వలగొన్న రేఱేనిఁ ◊దలఁపఁ జేయ,
వందికంఠధ్వనుల్◊వైభవశ్రీ నభ్ర, మెనసి చూచుసురాళి ◊కెఱుక చేయ,

తే. కంకణక్రేంకృతు ల్పర్వఁ ◊బంకజాస్య, లలరువింజామరలు వీవ ◊యక్షనేత
పార్శ్వమునఁ గొల్వ బుధపాళి◊ప్రస్తుతింప, మంచతటి నాసుచంద్రుండు ◊మించె నపుడు. 27

టీక: సురగణ్యలావణ్యగరిమ – సుర=దేవతలచే, గణ్య=పొగడఁదగిన, లావణ్య=అందముయొక్క, గరిమ=అతిశయము; రాజులకున్=ఇతరరాజులకు; పాంచాలినిరాశ =చంద్రికయందు ఆశయొక్క యభావమును; హెచ్చంగఁ జేయన్= మించు నటులుచేయుచుండఁగ;మణిమంచబింబితాత్మచ్ఛాయ – మణిమంచ=మణిమయమగు మంచమునందు, బింబిత=ప్రతిబింబించిన, ఆత్మచ్ఛాయ = తననీడ; తనుఁ గొల్వన్=తన్ను సేవించుటకు; తఱియు మన్మథుబుద్ధిన్ = సమీపించియున్న మన్మథుఁడనెడు తలంపును, తన నీడ మన్మథునిభంగి నున్న దనుట; తనరఁ జేయన్=కలుగఁజేయుచుండఁగ; హీరభూషణవిభావారంబు=వజ్రాల సొమ్ములయొక్క కాంతిపుంజము; వెన్నెల వలగొన్న రేఱేనిన్ = వెన్నెలచేఁ జుట్టఁబడిన చంద్రుని; తలఁపఁ జేయన్=స్మరించునట్లు చేయఁగ; వందికంఠధ్వనుల్ – వంది=పొగడుచుండెడివారియొక్క, ‘వన్దిన స్తుతిపాఠకాః’ అని యమరుఁడు, కంఠధ్వనుల్=గళరవ ములు; వైభవశ్రీన్=విభవముయొక్క అతిశయమును; అభ్రమెనసి =మిన్నంది; చూచుసురాళికిన్=చూచుచున్న దేవతల బృందమునకు; ఎఱుక చేయన్=తెలియఁజేయుచుండఁగ;
కంకణక్రేంకృతుల్=కడియములయొక్క క్రేంకారధ్వనులు; పర్వన్=వ్యాపించునట్లు;పంకజాస్యలు=స్త్రీలు; అలరువింజామ రలు=ప్రకాశించుచున్న చామరములను; వీవన్=విసరుచుండఁగ; యక్షనేత=కుముదుఁడను కిన్నరుఁడు; పార్శ్వమునన్= ప్రక్కన; కొల్వన్=సేవించుచుండఁగ; బుధపాళి = విద్వద్బృందము; ప్రస్తుతింపన్=పొగడుచుండఁగ; మంచతటిన్=మంచ ప్రదేశమందు; అపుడు; ఆసుచంద్రుండు=ఆసుచంద్రమహారాజు; మించెన్=అతిశయించెను. అనఁగ తనసౌందర్యాతిశయము ఇతరరాజులకు చంద్రికమీఁది యాశను పోగొట్టుచున్న దనియు, మణిమయపీఠమందు ప్రతిబింబించిన తననీడ మరుం డను జ్ఞానమును కలుగఁ జేయుచున్న దనియు, మగరాలసొమ్ముల కాంతులు వెన్నెల వల గొన్న కలువలదొరయో యను బుద్ధిని కలుగజేయుచున్న వనియు, స్తుతిపాఠకుల కంఠధ్వనులు తనవైభవమును మింటఁ జూచు వేల్పుల కెఱుకచేయుచున్న వనియు, ఇరుప్రక్కల స్త్రీలు వీచోపులు విసరుచుండ వారి కరకంణధ్వనులు వ్యాపించు చున్నవనియు, కుముదుఁడు కొలుచు చుండఁగ, బుధులు నుతించు చుండఁగ, నట్టి సుచంద్రుఁడు మంచముమీఁదఁ బ్రకాశించుచుండె నని తాత్పర్యము.

క. నరనాయకకులమంచాం
తరముల వలిగాడ్పు మసలెఁ ◊దపనతనయమం
దిరకేళీవనపాళీ
సురసాళీవాసనాభి◊శోభితగతియై. 28

టీక: నరనాయకకులమంచాంతరములన్ – నరనాయకకుల=నరపతిసంఘములయొక్క, మంచాంతరములన్=మంచముల యొక్క మధ్యములందు; వలిగాడ్పు=చల్లనిమందమారుతము; తపనతనయ మందిర కేళీవన పాళీ సురసాళీ వాసనాభిశోభిత గతి యై – తపనతనయ=యమునియొక్క, మందిర=గృహముయొక్క,కేళీవన=క్రీడావనములయొక్క, పాళీ=పంక్తులయం దున్న, సురసాళీ=సర్పాక్షిపుష్పపుంజములయొక్క, వాసనా=పరిమళముచే, అభిశోభిత=ప్రకాశించు, గతియై=గతి గలదై; మసలెన్=విసరెను.

వ. అంత ననంత కాంచన మంచాగ్ర సమంచిత సింహాసన సమాసీన మానవనాయక సేవా సమాగమి తత్త త్సేనాధిప సంఘ పరస్పర సంఘర్షణ సముత్తిష్ఠ చ్చిరత్న రత్నాంగద పరాగపూగ తామ్రపట్ట పటాస్తరణ విభ్రాజితంబును, నంతరీపకాంత శిరోవిభాసి తానంతచరనాథమణిమయ మకుటతట నరీనృత్యమాన వినీలకాంతి ప్రరోహ కుహనా ధూపధూమ పూరితంబును, శంబరాక్షీ కదంబక కరాంబుజ సముద్గచ్ఛదరు ణాంశుక శుభాడంబర కంకేళి కుసుమగుళుచ్ఛ రింఛోళికా వితాన విభూషితంబును నై యొప్పుమీఱు గగనా స్థానంబునఁ బాకారి పావక పద్మాప్తసుత పలాశ పయోధీశ పవమాన పౌలస్త్య పార్వతీపతి పరివృ తుండై తదుత్సవంబు వీక్షింప నిండుపేరోలగం బుండె. గాలవ శాండిల్య కౌశిక వసిష్ఠ ప్రముఖ మహర్షులు హర్షో త్కర్షంబునఁ జూడం దొడంగిరి. గరుడ కిన్నర గంధర్వ సిద్ధ సాధ్యముఖ్యు లంతంతం గాంచి సంతసిల్లిరి. అపుడు రాజసభాస్థలం బపరిమిత వేత్రధర సాహోనినాదవాచాలంబై, అభినవభూషణమరీచికావిహార వాటంబై, యతులితంబై యతిశయిల్లం గనుంగొని యాక్షణదోదయ క్షమాధ్యక్షుండు నెమ్మనంబున నీ స్వయంవరంబునకు వచ్చిన ధరాధిపతుల యన్వయగుణాదికంబులు పేర్కొని కుమారి కెఱింగింప నెవ్వరు చాలుదు రఖిలజగజ్జనని గిరిరాజతనుజ గాక యని తలంచి యప్పుడు. 30

టీక: అంతన్=అటుపిమ్మట; అనంత కాంచన మంచాగ్ర సమంచిత సింహాసన సమాసీన మానవనాయక సేవా సమాగమి తత్త త్సేనాధిప సంఘ పరస్పరసంఘర్షణ సముత్తిష్ఠ చ్చిరత్న రత్నాంగద పరాగపూగ తామ్ర పట్టప టాస్తరణ విభ్రాజితంబును – అనంత = అధికమగు, కాంచన=సువర్ణమయమైన, మంచాగ్ర=మంచాగ్రములయందు, సమంచిత=ఒప్పుచున్న, సింహాసన =భద్రాసనములందు, సమాసీన=కూర్చొన్న, మానవనాయక=నరపతులయొక్క, సేవా=కొలువునకై, సమాగమి=వచ్చు చున్న, తత్తత్సేనాధిప=వారివారి దళవాయులయొక్క, సంఘ=గుంపుయొక్క, పరస్పరసంఘర్షణ =ఒండొరులయొక్క యొరయికలవలన, సముత్తిష్ఠత్=మీఁది కెగయుచున్న, చిరత్న=పురాతనమగు,రత్నాంగద=రత్నమయములగు భుజ కీర్తులయొక్క, పరాగపూగ=రజఃపుంజ మనెడు, తామ్ర=ఎఱ్ఱనగు, పట్టపట=పట్టువస్త్రముయొక్క, ఆస్తరణ=పఱచుటచే, విభ్రాజితంబును = ప్రకాశించుచున్నదియును; అంతరీపకాంత శిరో విభాసి తానంతచరనాథమణిమయ మకుటతట నరీనృత్యమాన వినీల కాంతి ప్రరోహ కుహనా ధూప ధూమ పూరితంబును – అంతరీపకాంత=ద్వీపాధిపతులయొక్క, శిరః=మస్తకములందు, విభాసిత=ప్రకాశించు, అనంతచర నాథమణిమయ = ఇంద్రనీలమణిమయములగు, మకుటతట=కిరీటప్రదేశములందు, నరీనృత్యమాన=మిక్కిలి నాట్యము చేయుచున్న, వినీల= మిక్కిలి నల్లని, కాంతి=తేజములయొక్క, ప్రరోహ=అంకురమనెడు, కుహనా=కపటముగల, ధూప= ధూపముయొక్క, ధూప మనఁగా వాసనకై వేయు నగరువుమొదలగు పరిమళవస్తువులయొక్క పొగ, ధూమ=పొగచేత, పూరి తంబును =నింపఁబడినదియును; శంబరాక్షీకదంబక కరాంబుజ సముద్గచ్ఛ దరుణాంశుకశుభాడంబరకంకేళికుసుమగుళుచ్ఛరింఛోళికావితానవిభూషితంబును – శంబరాక్షీకదంబక=మృగాక్షీసమూహముయొక్క, కరాంబుజ=కేలుదామరలవలన, సముద్గచ్ఛత్=మీఁది కెగయుచున్న, అరుణాంశుక=ఎఱ్ఱనికాంతి యనెడు, శుభాడంబర=మంగళప్రదమగు విజృంభణము గల, కంకేళికుసుమ=అశోకపుష్పముల యొక్క, గుళుచ్ఛ=గుత్తులయొక్క, రింఛోళికా=సమూహములనెడు, వితాన=మేలుకట్లచేత,విభూషితంబును=అలంకరింపఁ బడినదియును; ఐ=అయినదై; ఒప్పుమీఱు గగనాస్థానంబునన్ – ఒప్పు=అందముచేత, మీఱు=అతిశయించు, గగనాస్థానంబునన్=ఆకాశమను సభయందు; పాకారి=ఇంద్రుఁడు, పావక పద్మాప్తసుత పలాశ పయోధీశ పవమాన పౌలస్త్య పార్వతీపతి పరివృతుండై=అగ్ని యమ నిరృతి వరుణ వాయు కుబేర శంకరులతోఁ గూడినవాఁడై; తదుత్స వంబు=ఆస్వయంవరోత్సవమును; వీక్షింపన్=చూచుటకు; నిండు పేరోలగంబు =గొప్పకొలువుదీరి; ఉండెన్=ఉండెను. గాలవ శాండిల్య కౌశిక వసిష్ఠ ప్రముఖ మహర్షులు = గాలవుఁడు, శాండిల్యుఁడు, విశ్వామిత్రుఁడు, వశిష్ఠుఁడు మున్నగు గొప్ప ఋషులు; హర్షోత్కర్షంబునన్=సంతోషాతిశయముచేత; చూడన్=వీక్షించుటకు; తొడంగిరి=ప్రయత్నించిరి.

గరుడ కిన్నర గంధర్వ సిద్ధ సాధ్య ముఖ్యులు = గరుడులు, కిన్నరులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు మున్నగు వారలు; అంతంతం గాంచి =అచ్చటచ్చటఁ జూచి; సంతసిల్లిరి=ఆనందించిరి. అపుడు =ఆసమయమందు; రాజసభాస్థలంబు=రాజసభ యొక్క ప్రదేశము; అపరిమిత వేత్రధర సాహోనినాద వాచాలంబై – అపరిమిత=మితిలేని, వేత్రధర=బెత్తపువారియొక్క, సాహో నినాద=సాహోయను హెచ్చరికమాటల ధ్వనులచేత, వాచాలంబై = ముఖరితమైనదై; అభినవ భూషణ మరీచికా విహార వాటం బై – అభినవ=నూతనమగు, భూషణ=ఆభరణములయొక్క, మరీచికా=కాంతులయొక్క, విహార=క్రీడయొక్క, వాటంబై= ప్రదేశమై, అతులితంబై=సాటిలేనిదై, అతిశయిల్లన్=విజృంభింపఁగ; కనుంగొని =చూచి; ఆక్షణదోదయక్షమాధ్యక్షుండు= ఆ క్షణదోదయుఁడను రాజు; నెమ్మనంబునన్=తన నిండుమనసున; ఈ స్వయంవరంబునకున్=ఈస్వయంవరోత్సవమునకు; వచ్చిన ధరాధిపతుల యన్వయగుణాదికంబులు = వచ్చినట్టి రాజుల గోత్రగుణవిశేషములు; పేర్కొని =నామములు గ్రహించి; కుమారికిన్=చంద్రికకు; ఎఱింగింపన్=తెలుపుటకు; అఖిల జగజ్జనని =సమస్తలోకములకు మాతయగు; గిరిరాజతనుజ గాక =పార్వతీదేవి తప్ప;ఎవ్వరు చాలుదురు=ఎవ్వరు సమర్థు లగుదురు? అని తలంచి=ఇట్లు స్మరించి; అప్పుడు=అక్కాలమున;

మ. పరిపూతాత్మసమన్వితుం డగుచుఁ ద◊త్పాంచాలధాత్రీతలే
శ్వరచంద్రుండు కరాబ్జము ల్మొగిచి శ◊శ్వద్భక్తివైపుల్య మాం
తరవీథిం దళుకొత్త నిల్చి వినయా◊త్మ న్సన్నుతించె న్మహీ
ధరసమ్రాట్సుత నిర్మలామృతధునీ◊ధారాళధారోక్తులన్. 30

టీక: తత్పాంచాలధాత్రీతలేశ్వరచంద్రుండు = పాంచాలరాజశ్రేష్ఠుఁడైన యాక్షణదోదయమహారాజు; పరిపూ తాత్మ సమన్వి తుండు అగుచున్ – పరిపూత=పరిశుద్ధమగు, ఆత్మ=మనస్సుచేత, సమన్వితుండు=కూడుకొన్నవాఁడు, అగుచున్=అయిన వాఁడై; కరాబ్జముల్=కేలుదామరలు; మొగిచి=మోడ్చి; శశ్వ ద్భక్తి వైపుల్యము – శశ్వత్=ప్రకాశించుచున్న, భక్తి=భక్తియొక్క, వైపుల్యము =అతిశయము; ఆంతరవీథిన్=హృదయసీమయందు; తళుకొత్తన్=మిక్కిలి ప్రకాశింపఁగా; నిల్చి=నిలుచుకొని; వినయాత్మన్=వినయముతోఁ గూడుకొన్న మనస్సుచేత; నిర్మ లామృత ధునీ ధారాళ ధా రోక్తులన్ – నిర్మల=స్వచ్ఛమగు, అమృత=సుధయొక్క, ధునీ=ప్రవాహముయొక్క, ధారాళ=అడ్డములేని, ధారా=ఆసారములవంటి, ఉక్తులన్=వాక్యముల చేత; మహీధరసమ్రాట్సుతన్=హిమవంతుని కూఁతురగు పార్వతీదేవిని; సన్నుతించెన్=పొగడెను. అనఁగా క్షణదోదదయ రాజు భక్తిచేఁ గరములు మోడ్చి జగన్మాత యగు నాపార్వతీదేవి నమృతధారాసమంబు లగు నుక్తులచే నుతించె నని భావము.

దండకము. జయ జయ జగతీనాయికే, భక్తలోకేష్టసంధాయికే, నిత్యబిన్దుత్రికోణాష్టకోణాదికోణావళీవిస్ఫు రచ్చక్ర సింహాసనోద్ద్యోతమానాత్మికే, సర్వమన్త్రాత్మికే, సద్వటానోకహోపాన్తసీమావసద్బోధముద్రాన్వితా శామ్బరస్వాన్తనిద్రాళుపఞ్చాశుగోన్మీలనాకారకాపాఙ్గసంచారభఙ్గీసముద్భూతసర్గాదికార్యత్రయీ సక్త వైధాణ్డభాణ్డప్రకాణ్డే, దయాత్రాతయోగిప్రకాణ్డే, వినీలాఙ్కరేఖావృతాబ్జారిబిమ్బోపమాసమ్మిళ త్కుణ్డలీ భూత హీరోపలప్రోత కోదణ్డదణ్డోత్తమోద్వాన్త శైత్యప్రకారోజ్జ్వల ద్గోనికాయోపభుక్తోగ్రధూమ్రాక్ష దర్ప చ్ఛలధ్వాన్తికే, వార్షుకామ్భోదజిత్కాన్తికే, రోచమానాత్మభూమిత్రతారాహితీయుక్త చిత్రక్రియా సంచరన్మ ధ్వవష్టమ్భ విధ్వంసనోదార లక్ష్మీశనిద్రాపహార్యద్భుతక్రీడనాశాలి మాయాఘనప్రక్రమాభ్యఞ్చితే, సత్కు లాళీనిరాకుఞ్చితే, మత్త దన్తీన్ద్రగర్జామృదఙ్గవ్రజధ్వాన దైత్యేన్ద్రసేనావళీ సింహనాదాఖ్య గానాభిరఙ్గన్మహా జన్యరఙ్గస్థలీ నృత్య దుగ్రాసివల్లీ నటీప్రాపితా ప్రత్నపుష్పాఞ్జలీభూతశుమ్భాదిక క్రవ్యభుఙ్మాలికా నిర్గళ న్మౌక్తికశ్రేణికే, పుణ్య మర్త్యోత్కరారోహ్య సౌభాగ్య సౌధార్పితోదార కారుణ్యనిశ్రేణికే, శివగృహిణి నిజౌ పమ్యలీలా నిశోజ్జృమ్భమాణేన్దుజాయా పరివ్యక్తజాగ్రత్క్రుధాఙ్కూర శఙ్కాసమాపాది లాక్షారసోల్లిఙ్గి తాంఘ్ర్యబ్జ దీవ్యన్నఖవ్రాత విభ్రాజితే, దేవతాపూజితే, నిత్యసత్కాన్త సంసేవ్యపాదామ్బుజాతాధరీభూత పద్మాకరోదయాఞ్చితామ్భోజ హైన్యక్రియావాచి శిఞ్జారవోద్భాసిమఞ్జీరభూషానుషఙ్గే, కనజ్జాఙ్ఘికశ్రీజి తోద్యన్మనోభూ నిషఙ్గే, మహాయౌవనాళీకమల్లాదిభూకేళికాస్తమ్భ సంవిత్ప్రదాత్రూరుకాణ్డే, సరోరాజ సౌభాగ్యజిన్నాభికుణ్డే, వలగ్నస్థలీకార్శ్యజిజ్ఞాసుపుష్పేషుబద్ధస్ఫురన్ముష్టికాబన్ధన ప్రోత్థగమ్భీరనాభీ గుహాన్తస్తటధ్వాన్త రేఖామనీషాప్రదశ్యామరోమాళికే, సారశృఙ్గారవారాశిభఙ్గప్రమాకృద్వళీపాళికే, చారు తారుణ్యమాయా మహాకుమ్భికుమ్భద్వయీద్వాపరద్వారవక్షోభవే, పాణిభాత్రాతపాథోభవే, సంతతా సక్తసర్వజ్ఞదృగ్జాత పాతక్రియాజాయమానాత్మలావణ్యకూలఙ్కషాబుద్బుదశ్రేణికారూపముక్తావళీభాస మానే, శుభామోదికాశ్మీరకస్తూరికాపఙ్కచర్చాపరిద్యోతమానే, మనోజ్ఞాస్యపద్మాహితార్చాపరామ్భోజ బాణప్రతిష్ఠాపితామూల్యశఙ్ఖీభవత్కన్ధరే, పాణితప్రాణబన్ధూభవద్భవ్యవాగ్బన్ధురే, సలలితఖగచక్రాఙ్గకాణ్డ ద్విజావిక్షతాఙ్కాన్వితప్రస్ఫురత్పక్వబిమ్బప్రతీకాశరమ్యోష్ఠబిమ్బే, నవాదర్శసద్గర్వనిర్వాపణోద్యుక్త గణ్డద్వయాంచన్మరీచీకదమ్బే, స్వకశ్రీసమఙ్కూరిత త్రాసయోగాటవీ లీన కున్దోపరివ్యక్త నవ్యానుకమ్పా రసోహాకరాశ్రాన్త వీటీరసవ్యాప్త దన్తాళికాద్వైతవా ద్యుజ్జ్వలద్దాడిమీబీజజాలే, సునాసాజితామూల్యసౌవర్ణ జాలే, లసత్కజ్జలాఙ్కోపధిత్రోటికాయుక్తరమ్యాస్యలావణ్యకేళీవనీవీథికా సంచరత్ఖఞ్జరీటాయమానోల్లస ల్లోచనే, భ్రూలతాయుగ్మసంప్రాపితానఙ్గచాపత్విషామోచనే, భవ్యకాశ్మీరభూచిత్రకాకార ఫాలాన్తరభ్రాజ మానానిలాప్తేక్షణే, వక్త్రతేజఃపరిక్షీణపూర్ణక్షపానాథకాన్తిక్షణే, సంతతాభ్యర్ణసీమావసద్వేణికారాహుసంద ర్శనోద్విగ్నచేతస్క చూడామణీభూత శీతాంశురేఖా గళత్పాణ్డురస్వేదపాథః పృషన్మాలికా మోహదా నర్ఘ్యముక్తాలలన్తీలతాలంకృతే,రత్నతాటఙ్కయుగ్మాన్వితే, కాలకణ్ఠాన్తరఙ్గప్రమోదప్రదాప్రత్నచామ్పేయ దామాఖ్య సౌదామినీవల్లికాయుక్తవేణీపయోదాభిరామే, నతాగారిరామే, సతత మగజే త్వమే వాత్మమాతా శివే త్వాం భజే దేవదేవి త్వయా రక్షితోఽహం విశాలాక్షి తుభ్యం మనోభక్తి విత్తం దదా మ్యమ్బికే, నాశ్ర యామి త్వదన్యాం, మహాకాళి దాస్యం తవ ప్రాప యాబ్జావతంసే, త్వదీయే పదాబ్జ ద్వయే సంవసత్వస్మదీ యాశయో, గౌరి రక్షాద్యమాం, దేవి తుభ్యం నమో, యోగిమృగ్యోజ్జ్వలచ్చిత్కళాయై నమో, గోధిభాః కృత్తరాత్రీట్కలాయై నమో, శేషగీర్వాణనిత్యోత్సవాయై నమో, నిత్యపూతామిత ప్రాభవాయై నమో, హస్త సంబద్ధనీరేశయాయై నమో, దేవతారూపశయ్యాశయాయై నమ స్తే, సఖీభూత పద్మాలయాయై నమ స్తే, స్వభక్తాళిచిత్తాలయాయై నమ స్తే, మృగాధీశవాహోత్తమాయై నమ స్తే , పయో జాస్త్రశత్రూత్తమాయై నమః, కాన్తిమత్యై నమః, కాన్తమత్యై నమ, స్సర్వసూత్యై నమ, స్సౌమ్య భూత్యై నమ, శ్శర్మదాయై నమ, శ్శైల జాయై నమః, కామదాయై నమః, కాళికాయై నమ స్తే , నమ స్తే, నమః. 32

టీక: అథేదానీం కవిః ప్రకృతోపయోగిత్వేన సకలపురుషార్థసంపాదినీందేవీం ‘జయ జయ జగతీ’త్యాదినా ప్రస్తౌతి. జయజయ –నిరతిశయేనోత్కర్షేణ వర్తస్వ అత్ర నిత్యవీప్సయోరితి ద్విర్భావః; జగతీనాయికే – జగతః ప్రపంచస్య నాయికే ఈశ్వరి; భక్తలోకేష్టసంధాయికే – భక్తలోకస్య భక్తజనస్య, ఇష్టస్య పురుషార్థచతుష్టయస్య, సంధాయికే సంపాదయిత్రి; నిత్య బిన్దుత్రికోణాష్టకోణాది కోణావళీ విస్ఫుర చ్చక్ర సింహాస నోద్ద్యోతమానాత్మికే – నిత్యం వినాశరహితం, చక్రవిశేషణ మేతత్ బిన్దు స్సుధాబిన్దు స్తత్పరిత స్త్రికోణ న్తదభితోఽష్టకోణ మేతదాదీనాం కోణా స్తత్తద్దేవతాధిష్ఠానరేఖాః తేషా మావళ్యా విస్ఫుర త్ప్రకాశ మానం చక్రం శ్రీచక్రం తదేవ సింహాసనం తత్రోద్ద్యోతమాన ఆత్మా స్వరూపం యస్యా స్సా తథోక్తా – శ్రీచక్రలక్షణంతు, ‘బిన్దు త్రి కోణ వసుకోణ దశారయుగ్మ మన్వశ్ర నాగదళసంయుత షోడశారమ్| వృత్తత్రి భూపురయుతం పరిత శ్చతుర్ధా శ్రీచక్ర మేత దుదితం పరదేవతాయాః’ ఇతి; సర్వమన్త్రాత్మికే – సర్వమన్త్రాణ్యేవ ఆత్మా స్వరూపం యస్యా స్సా తథోక్తా.అథ దేవ్యా మాహాత్మ్య మభివర్ణయతి సదిత్యాదినా – సద్వటానోకహోపాన్తసీమా వస ద్బోధముద్రాన్వితాశామ్బర స్వాన్త నిద్రాళు పఞ్చాశుగోన్మీలనాకార కాపాఙ్గ సంచారభఙ్గీ సముద్భూత సర్గాదికార్యత్రయీ సక్త వైధాణ్డ భాణ్డ ప్రకాణ్డే – సతో వటానోకహస్య ఉపాన్త సీమాయాం సమీపభూమౌ వసన్ యోబోధముద్రయా అన్విత స్సంగత ఆశామ్బరో దక్షిణామూర్తి స్తస్య వటతరుమూలవసతి ర్ఞానముద్రా చాగమప్రసిద్ధా, వట విటపిసమీపే బోధముద్రాం దధాన ఇతి , తస్య స్వాన్తే హృదయే నిద్రాళో రజాగ్రతః ‘నిద్రాతేరాళుచ్’ పఞ్చాశుగస్య కామస్య ఉన్మీలనాయాః వికసనస్య కారకస్య అపాఙ్గస్య కటాక్షస్య సంచారో వలనం తస్య భఙ్గీ ప్రకారః తయా సముద్భూతాని జాతాని సర్గాదీని సృష్టిస్థితిప్రళయా స్తా న్యేవ కార్యాణి తేషాం త్రయీ త్రి తయం తయా సక్త స్సంగతః విధేరిమాని వైధాని తస్యేద మిత్యణ్ తానిచ తా న్యణ్డాని తాని భాణ్డా నీవ తేషాం ప్రకాణ్డ స్సంఘాతో యస్యా స్సా తథోక్తా, ‘ప్రకాణ్డ ముద్ఘ తల్లజా’ ఇత్యమరః. వినీలాఙ్కరేఖా వృతాబ్జారి బిమ్బోపమా సమ్మిళ త్కుణ్డలీభూత హీరోపలప్రోత కోదణ్డదణ్డోత్త మోద్వాన్త శైత్యప్రకా రోజ్జ్వల ద్గోనికాయోపభు క్తోగ్రధూమ్రాక్ష దర్పచ్ఛల ధ్వాన్తికే – విశిష్టానీలా అన్తః ఖచిత నీలమణయో యస్య స తథోక్తః, కోదణ్డోత్తమ విశేషణ మేతత్, అఙ్కస్య కలఙ్కస్య రేఖయా వృత మాక్రాన్త మబ్జారిబిమ్బం చన్ద్రమణ్డలం తేనోపమా సామ్యం తయా సం మిళన్ సంగతః కుణ్డలీభూత శ్చక్రీభూతో హీరోపలైః ప్రోత స్స్యూతః కోదణ్డోత్తమ స్తేనోద్వాన్తై ర్నిర్గమితై శ్శైత్యస్య నిశితత్వస్య అన్యత్ర శీతలత్వస్య ప్రకారేణ విధయా ఉజ్జ్వలన్తో గోనికాయా శ్శరసంఘా అన్యత్ర కిరణనిచయా స్తై రుపభుక్తం భక్షితం వినా శిత మిత్యర్థః ఉగ్రస్య ధూమ్రాక్షస్య రక్షసో దర్పచ్ఛలం ధ్వాన్తం యస్యా స్సా తథోక్తా. వార్షుకా మ్భోదజిత్కాన్తికే – వర్షతీతి వార్షుకః అభనతసదస్థాభూవృషేత్యాదినా ఉకఞ్ ప్రత్యయః తం అమ్భోదం మేఘం జయతీతి జిత్ కాన్తికే తాదృశీ కాన్తి ర్యస్యా స్సా తథోక్తా, దేవ్యాః కృష్ణవర్ణత్వ మాగమప్రసిద్ధమ్, తథాచ నవామ్బురుహలోచనా మభినవామ్బుదశ్యామలాం త్రియమ్బకకుటుమ్బినీం త్రిపురసున్దరీ మాశ్రయే. రోచమానాత్మభూ మిత్రతారాహితీయుక్త చిత్రక్రియా సంచరన్మధ్వష్టమ్భ విధ్వంసనోదార లక్ష్మీశనిద్రాపహా ర్యద్భుతక్రీడనా శాలి మాయాఘన ప్రక్రమాభ్యఞ్చితే – రోచమానః ప్రకాశమాన ఆత్మభువో బ్రహ్మణో మిత్రతా మైత్రీ తస్యా రాహితీ రాహిత్యం తయా యుక్తా సంగతా చిత్రక్రియా అద్భుతచేష్టా తాడనపీడనాదిః తయా సంచరన్ యో మధు ర్దానవ స్తస్య అవష్టమ్భో గర్వం తస్య విధ్వంసనే ఉదారా లక్ష్మీశనిద్రాయా అపహారిణీ నివారికా అద్భుతక్రీడనా తయా శాలత ఇతి తచ్ఛాలినీ యా మాయా తస్యా ఘనప్రక్రమ స్తేనాభ్యఞ్చితే. సత్కలాళీనిరాకుఞ్చితే – సతీనాం కలానాం సౌరాదికలానా మాళీ పఙ్త్కిః తయా నిరాకుఞ్చితే అనల్పే. మత్తదన్తీన్ద్రగర్జా మృదఙ్గవ్రజ ధ్వాన దైత్యేన్ద్రసేనావళీ సింహనాదాఖ్య గానాభిరఙ్గ న్మహాజన్యరఙ్గస్థలీ నృత్యదుగ్రాసివల్లీనటీ ప్రాపితా ప్రత్నపుష్పాఞ్జలీభూత శుమ్భాదిక క్రవ్యభుఙ్మాలికా నిర్గళన్మౌక్తికశ్రేణికే – మత్తాః మదవిశిష్టాః యే దన్తీన్ద్రాః గజశ్రేష్ఠా స్తేషాం గర్జా బృంహితాని తా ఏవ మృదఙ్గవ్రజధ్వానా మర్దలసంఘాతనినదా దైత్యేన్ద్రాణాం రక్షోవరాణాం యా సేనావళీ వాహినీపరంపరా తస్యా స్సింహనాదాః క్ష్వేడనాని తదాఖ్యాని గానాని తైశ్చ అభిరఙ్గత్ శోభమానం మహత్ అధికం జన్యం యుద్ధం తస్య రఙ్గః స్థానం స ఏవరఙ్గో నాట్యశాలా తస్య స్థలీ అకృత్రిమభూమిః, జానపదేత్యాదినాఙీప్, తత్ర నృత్యన్తీ ఉగ్రాయా అసివల్లీ సైవ నటీ నర్తకీ తయా ప్రాపితా అప్రత్నా పుష్పాఞ్జలిః రఙ్గప్రసాధనవిశేషః తద్భూతా శుమ్భ ఏవ ఆది ర్యేషాం తే శుమ్భాదికా స్స్వార్థే కః యే క్రవ్యభుజో రాక్షసా స్తేషాం మాలికా స్తాభ్యో నిర్గళన్తీ మౌక్తికశ్రేణిః యస్యా స్సా తథోక్తా. పుణ్యమర్త్యోత్కరారోహ్య సౌభాగ్య సౌధార్పితోదార కారుణ్యనిశ్రేణికే – పుణ్యాః పవిత్రా మర్త్యోత్కరా మానుషనివహా స్తై రారోహ్యా ఆరోఢుం శక్యా సౌభాగ్య మేవ సౌధ స్తత్ర అర్పితా ఉదారం గమ్భీరం కారుణ్యం కరుణా తదేవ నిశ్రేణికా అధిరోహిణీ యస్యా స్సా తథోక్తా. శివగృహిణి – శివభార్యే. అథ భగవత్యా నఖాదికచాన్తానా మవయవానాం లోకాతిశాయి సౌన్దర్యం వర్ణయతి నిజేత్యాదినా.

నిజౌపమ్యలీలా నిశోజ్జృమ్భమాణేన్దుజాయా పరివ్యక్త జాగ్రత్క్రుధాఙ్కూర శఙ్కాసమాపాది లాక్షారసోల్లిఙ్గితాంఘ్ర్యబ్జదీవ్య న్నఖవ్రాత విభ్రాజితే – నిజం స్వీయ మౌపమ్యం తస్య లీలా క్రియా తయా అనిశం సంతత ముజ్జృమ్భమాణా ఇన్దుజాయా స్తారకా స్తాభిః పరివ్యక్తం స్ఫుటం యథా జాగ్రత్ నిస్తంద్ర శ్చ యః క్రుధాఙ్కూరో రోషప్రరోహ స్సఇతి శఙ్కా మాపాదయతీతి తథోక్తః లాక్షారసో యావకద్రవ స్తేనోల్లిఙ్గితం చిహ్నిత మఙ్ఘ్రి రబ్జమివ అఙ్ఘ్ర్యబ్జం తత్ర దీవ్యన్తః ప్రకాశమానాశ్చ యే నఖా స్తేషాం వ్రాతేన సమూహేన విభ్రాజితే. దేవతాపూజితే. నిత్యసత్కాన్త సంసేవ్యపాదామ్బుజా తాధరీభూతపద్మాకరోదఞ్చితామ్భోజ హైన్యక్రియావాచి శిఞ్జారవోద్భాసిమఞ్జీర భూషానుషఙ్గే – నిత్యం యథాతథా సత్కాన్తైః సజ్జనశేఖరైః చన్ద్రేణేతిచ గమ్యతే సంసేవ్యే భజనీయే పాదా వమ్బుజే ఇవ పాదా మ్బుజాతే తాభ్యా మధరీభూతాని తిరస్కృతాని పద్మాకరోదఞ్చితామ్భోజాని తేషాం హైన్యక్రియాం వక్తీతి తద్వాచీ సచాసౌ శిఞ్జారవో ధ్వనివిశేషః, ‘భూషణానాంతు శిఞ్జిత’మిత్యమరః, తేన ఉద్భాసితౌ యౌ మఞ్జీరౌ నూపురౌ తావేవ భూషే భూషణే తాభ్యా మనుషఙ్గ స్సంబన్ధో యస్యా స్సా తథోక్తా.

కనజ్జాఙ్ఘిక శ్రీజితోద్యన్మనోభూ నిషఙ్గే – కనన్తీ ప్రకాశమానా జాఙ్ఘికా జఙ్ఘామాశ్రిత్య స్థితా యా శ్రీః తయా జితా ఉద్యన్తౌ యౌ మనోభువో మదనస్య నిషఙ్గౌ తూణీరౌ యస్యా స్సా తథోక్తా. మహాయౌవనాళీక మల్లాదిభూకేళికా స్తమ్భసంవి త్ప్రదాత్రూరుకాణ్డే – మహత్ పూర్ణం యౌవన మేవ అళీకమల్లాదిభూ ర్మిథ్యామల్లనాయక , ‘అధిభూర్నాయకోనేతా’ ఇత్యమరః , తస్య కేళికాస్తమ్భః క్రీడార్థదారువిశేషః స ఇతి సంవిదః జ్ఞానస్య ప్రదాతారౌ ఊరుకాణ్డౌ యస్యా స్సా తథోక్తా. సరోరాజసౌభాగ్యజిన్నాభికుణ్డే – సరోరాజస్య కాసారశ్రేష్ఠస్య, ‘రాజాహస్సఖిభ్యష్ట జితి టచ్ ప్రత్యయః’, తస్య సౌభాగ్యం సుభగత్వం తజ్జయ తీతి తజ్జిత్ నాభిః కుణ్డ మివ నాభికుణ్డం యస్యా స్సా తథోక్తా. వలగ్నస్థలీకార్శ్య జిజ్ఞాసుపుష్పేషు బద్ధస్ఫురన్ముష్టికా బన్ధనప్రోత్థగమ్భీరనాభీగుహాన్తస్తట ధ్వాన్తరేఖామనీషాప్రదశ్యామ రోమాళికే –వలగ్నస్థల్యా మధ్యదేశస్య యత్కార్శ్యం సూక్ష్మత్వం తజ్జిజ్ఞాసు ర్జ్ఞాతుమిచ్ఛుః, ‘జానాతే స్సన్నన్తా దుచ్ప్ర త్యయః’, తేన పుష్పేషుణా స్మరేణ బద్ధం గ్రథితం యత్ స్ఫురన్త్యా ముష్టికాయా బన్ధనం నిపీడనం తేన ప్రోత్థా యద్వళీ ముఖేన ప్రసృతా ఇదం రేఖావిశేషణం గమ్భీరాయా అగాధాయా నాభిగుహాయా అన్తస్తట స్తస్య గర్భప్రదేశస్య యా ధ్వాన్త రేఖా తిమిరరాజి స్సేతి మనీషా ధీ స్తత్ప్రదా శ్యామా మేచకా రోమాళికా యస్యా స్సా తథోక్తా. సారశృఙ్గారవారాశిభఙ్గప్రమాకృద్వళీపాళికే – సార శ్శ్రేష్ఠ శ్శృఙ్గార శ్శృఙ్గారరస ఏవ వారాశి రుదధి స్తస్య భఙ్గా స్తరఙ్గా ఇతి ప్రమాం బుద్ధిం కరోతీతి తత్కృత్ తాదృశీ వళీపాళికా యస్యా స్సా తథోక్తా. చారుతారుణ్యమాయా మహాకుమ్భికుమ్భద్వయీద్వాపరద్వారవక్షోభవే – చారు ఉజ్జ్వలం యత్తారుణ్యం యౌవనం తదేవ మాయా మహాకుమ్భీ భద్రగజ స్తత్కుమ్భద్వయీ శిరఃకూటద్వయం సేతి ద్వాపర స్సందేహ స్తస్య ద్వారే నిర్గమనమార్గౌ కారణే ఇతి యావత్ తాదృశౌ వక్షోభవౌ యస్యా స్సా తథోక్తా.

పాణిభాత్రాతపాథోభవే – పాణ్యో ర్హస్తయో ర్భా కాన్తి స్తయా త్రాతాని రక్షితాని పాథోభవాని పద్మాని యస్యా స్సా తథోక్తా. సంతతాసక్తసర్వజ్ఞ దృగ్జాతపాతక్రియా జాయమానాత్మలావణ్యకూలఙ్కషా బుద్బుదశ్రేణికారూప ముక్తావళీ భాసమానే – సంతతం నిరంతర మాసక్తస్య రతస్య సర్వజ్ఞస్య శివస్య దృశాం యజ్జాతం సంఘాత స్తస్య పాతక్రియయా పతనకర్మణా జాయమానా సముత్పద్యమానా శ్రేణికా విశేషణ మేతత్, ఆత్మన స్స్వస్య యల్లావణ్యం సౌన్దర్యం తదేవ కూలఙ్కషా తటినీ తస్యా బుద్బుదానాం శ్రేణికా తద్రూపా యా ముక్తావళీ తయా భాసమానే. శుభామోది కాశ్మీరకస్తూరికా పఙ్కచర్చా పరిద్యోతమానే – శుభో మఙ్గళ ఆమోదః పరిమళః సోస్యాస్తీతి తథోక్తా, కాశ్మీరం కుఙ్కుమం కస్తూరికా మృగమద స్తయోః పఙ్కః యః కర్దమ స్తస్య చర్చా అనులేపనం తేన పరిద్యోతమానే. మనోజ్ఞాస్యపద్మాహితార్చాప రామ్భోజబాణప్రతిష్ఠాపి తామూల్యశఙ్ఖీభవ త్కన్ధరే – మనోజ్ఞం సున్దర మాస్య మాననం తదేవ పద్మాహిత శ్చన్ద్రః విష్ణురితిచ వ్యజ్యతే తస్యార్చా పూజనం తత్ర పర ఆసక్తః అమ్భోజబాణో మదన స్తేన ప్రతిష్ఠాపితః అమూల్యః అనర్ఘ శ్శఙ్ఖః కమ్బు రస స్సంపద్యమానః శఙ్ఖీభవన్, ‘అభూతతద్భావేచ్విః చ్వౌ చేతి దీర్ఘః’, తాదృశీ కన్ధరా శిరోధి ర్యస్యా స్సా తథోక్తా. పాణితప్రాణబన్ధూభవద్భవ్యవాగ్బన్ధురే – పాణితస్య ఖణ్డశర్కరాయాః, ‘మత్స్యండీ పాణితం ఖండ’ ఇత్యమరః, ప్రాణబన్ధుః అతిసుహృత్ తత్త్వేన సంపద్యమానయా భవ్యయా మనోజ్ఞయా వాచా బన్ధురే. సలలితఖగచక్రాఙ్గకాణ్డ ద్విజావిక్షతాఙ్కాన్వితప్రస్ఫుర త్పక్వబిమ్బప్రతీకాశరమ్యోష్ఠబిమ్బే – సలలిత స్సవిలాసః ఖగ స్తార్క్ష్య స్స ఏవ చక్రాఙ్గో రథో యస్య స విష్ణు రిత్యర్థః, స కాణ్డో బాణో యస్యేతి బహువ్రీహిః శివ ఇత్యర్థః, స ఏవ ద్విజ శ్శుక స్తేన ఆవిక్షతాని సమన్తా ద్విద్ధాని అఙ్కాని చిహ్నాని తై రన్వితః ప్రస్ఫురన్ పక్వబిమ్బో బిమ్బఫలం తేన ప్రతీకాశో నిభః రమ్యోష్ఠ బిమ్బో యస్యా స్సా తథోక్తా; అథవా, సలలితః ఖగో వాయు ర్మలయానిల ఇత్యర్థః, స ఏవ చక్రాఙ్గో రథో యస్య స మదన స్తస్య కాణ్డా అశ్వా శ్శుకా స్తేచ తేద్విజాశ్చ తై రావిక్షతాని అఙ్కాని తైరన్వితః ప్రస్ఫురన్ పక్వబిమ్బ స్తస్యశుకముఖావిద్ధపక్వ బిమ్బఫలస్యేతి భావః ప్రతీకాశో రమ్యోష్ఠబిమ్బో యస్యా స్సా తథోక్తా. నవాదర్శసద్గర్వ నిర్వాపణోద్యుక్త గణ్డద్వయాంచన్మరీచీ కదమ్బే – నవాదర్శస్య నూతనదర్పణస్య యో దర్ప స్తస్య సద్గ ర్వస్య నిర్వాపణే నాశనే ఉద్యుక్తం సన్నద్ధం గణ్డద్వయం తేన అఞ్చత్ మరీచీకదమ్బం యస్యా స్సా తథోక్తా.

స్వకశ్రీసమఙ్కూరిత త్రాసయోగాటవీ లీన కున్దోపరివ్యక్త నవ్యానుకమ్పారసోహాకరా శ్రాన్త వీటీరసవ్యాప్త దన్తాళికాద్వైతవాద్యు జ్జ్వలద్దాడిమీబీజజాలే – స్వకశ్రియా స్వీయకాన్త్యా సమఙ్కూరితో జాతో యస్త్రాసః భయం తస్య యోగాత్ సంబంధాత్ అటవ్యాం లీనాని కున్దాని మాఘ్యాని తేషా ముపరి వ్యక్తః పరిస్ఫుటో నవ్యో నూతనః అనుకమ్పారసో దయారస స్స ఇత్యూహాం బుద్ధిం కరోతీతి తత్కరః అశ్రాన్త వీటీరసః నిరన్తరతామ్బూలరస స్తేన వ్యాప్తా ఆక్రాన్తా దన్తాళికా తస్యా అద్వైతం వదతీతి తద్వాది యదుజ్జ్వల త్ప్రకాశమానం దాడిమ్యా బీజజాలం యస్యా స్సా తథోక్తా. సునాసాజితామూల్యసౌవర్ణజాలే – సునాసయా జితా న్యమూల్యా న్యనర్ఘాణి సౌవర్ణాని చమ్పకసంబన్ధీని జాలాని ముకుళాని యస్యా స్సా తథోక్తా. లసత్కజ్జలాఙ్కోపధి త్రోటికాయుక్త రమ్యాస్యలావణ్యకేళీవనీవీథికా సంచర త్ఖఞ్జరీటాయమానోల్లసల్లోచనే – లసతః కజ్జలస్య అఙ్కః చిహ్నం స ఇత్యుపధిః ఛద్మ యస్యా స్సా త్రోటికా చంచూ స్తయా యుక్తౌ ఖంజరీటవిశేషణ మేతత్, రమ్యస్య ఆస్యస్య లావణ్యం సౌన్దర్యం తదేవ కేళీవనం ప్రమదవనం తస్య వీథికా అత్ర సంచరన్తౌ ఖఞ్జరీటా వివాచరన్తీ , కర్తరిక్యఙ్ ఖఞ్జరీటాయమానే, ఉల్లసల్లోచనే యస్యా స్సా తథోక్తా. భ్రూలతాయుగ్మసంప్రాపితానఙ్గచాపత్విషామోచనే – భ్రువౌ లతేవ భ్రూలతే తయోర్ద్వంద్వేన ప్రాపితస్య అనఙ్గస్య చాపః ధను స్తస్య త్విషా కాన్తిః, హలంతలక్షణటాబంతోయం, తస్యా మోచనం నివృత్తి ర్యస్యా స్సా తథోక్తా. భవ్యకాశ్మీరభూచిత్రకాకార ఫాలాన్తరభ్రాజమానానిలా ప్తేక్షణే – భవ్యం మనోజ్ఞం కాశ్మీరభూచిత్రకం కుఙ్కుమతిలకం తస్య ఆకారో ఆకృతి ర్యస్య తత్ ఈక్షణవిశేషణ మేతత్, ఫాలాన్తరే భ్రాజమానం ప్రకాశమానం అనిలా ప్తేక్షణం అగ్నినయనం యస్యా స్సా తథోక్తా. వక్త్రతేజఃపరిక్షీణపూర్ణక్షపానాథకాన్తిక్షణే – వక్త్రతేజసా పరిక్షీణా పూర్ణక్షపానాథస్య పూర్ణచన్ద్రస్య కాన్తిః తస్యాః క్షణో యస్యా స్సా తథోక్తా.

సంత తాభ్యర్ణసీమా వస ద్వేణికారాహు సందర్శనోద్విగ్నచేతస్క చూడామణీభూత శీతాంశురేఖాగళ త్పాణ్డురస్వేదపాథః పృషన్మాలికామోహ దానర్ఘ్య ముక్తాలలన్తీ లతాలంకృతే – సంతత మనారత మభ్యర్ణసీమాయాం వసన్ వేణికైవ రాహుః తస్య సందర్శనేన ఉద్విగ్నం భీతం చేతః యస్యా స్సా ,‘ఉరః ప్రభృతిత్వాత్ కప్’, తాదృశచేతస్క శ్చూడామణీభూత శ్శీతాంశుః తస్య రేఖా శకలం తస్యా గళన్తీ ప్రసరన్తీ పాణ్డురస్వేదపాథః పృషతాం మాలికా పంక్తి స్సేతి మోహం దదాతీతి తథోక్తా తాదృశా నర్ఘ్యయా ముక్తాలలన్తికయా లతయేవ సీమంతాంతర లంబమానహారయష్ట్యా అలంకృతే. రత్నతాటఙ్కయుగ్మాన్వితే – రత్నతాటఙ్కయో ర్యుగ్మం, తేనాన్వితే|.
కాలకణ్ఠాన్తరఙ్గ ప్రమోదప్ర దాప్రత్నచామ్పేయదామాఖ్య సౌదామినీవల్లికా యుక్తవేణీపయోదాభిరామే – కాలకణ్ఠస్య శివస్య అన్తరఙ్గం హృదయం తస్య ప్రమోదప్రదా సంతోషదాయినీ అప్రత్నా నూతనా చామ్పేయదామేతి చంపకమాలికేతి ఆఖ్యా ప్రసిద్ధిః యస్యా స్సా తాదృశీ సౌదామినీవల్లికా తటిల్లతా తయా యుక్తా వేణీ సైవ పయోదః కాలామ్బుద స్తేనాభిరామే. నతాగారిరామే – నతా అగారిరామా శచీ యాం సా తథోక్తా; సతత మగజే – సంతతం నిరంతరం అగజే పార్వతి; త్వమేవాత్మమాతా – త్వమేవ ఆత్మ ఆత్మనో మమ మాతా జననీ; శివే త్వాం భజే; దేవదేవి శివస్య పత్నీత్వయా రక్షితః అహమ్; విశాలాక్షి తుభ్యం భవత్యై మనోభక్తి ర్భజనం తదేవ విత్తం ధనం దదామి అమ్బికే, తుభ్య మిత్యత్ర కర్మణేత్యాదినా సంప్రదానసంజ్ఞయా చతుర్థీ; నాశ్రయామి త్వదన్యాం – త్వత్ భవత్యా అన్యాం దేవతాంతరం అన్యారాదితి పంచమీ నాశ్ర యామి; మహాకాళి దాస్యం తవ ప్రాపయాబ్జావతంసే – దాస్యం కింకరత్వం ప్రాపయ గమయ మామితి శేషః; తుభ్యం నమః –తుభ్యం భవత్యై నమః స్వస్తీతి చతుర్థీ; యోగిమృగ్యోజ్జ్వలచ్చిత్కళాయై – యోగిభిః సంయమిభిః మృగ్యా అన్వేషణీయా ఉజ్జ్వలన్తీ చిత్కళా సంవిత్ప్రకాశః తద్రూపాయై; గోధిభాః కృత్తరాత్రీట్కలాయై –గోధి ర్లలాటం,‘లలాట మలికం గోధీత్యమరః’, తస్య భాసా తేజసా కృత్తా ఖండితా రాత్రీశః చన్ద్రస్య కలా శకలం యయా సా; నిత్యపూతామితప్రాభవాయై – నిత్యం పూతం అమితం అవేలం ప్రాభవం సామర్థ్యం యస్యా స్సా; హస్త సంబద్ధనీరేశయాయై – హస్తే పాణౌ సంబద్ధం సంలగ్నం నీరేశయం కమలం యస్యా స్సా; దేవతారూపశయ్యాశయాయై – దేవతాః బ్రహ్మాదయో మంచతాం ప్రాప్తా ఇత్యాగమప్రసిద్ధిః; పయోజాస్త్రశత్రూత్తమాయై – పయోజాస్త్రశత్రు శ్శివ స్తస్యోత్తమా వరవర్ణినీ తస్యై; కాన్తిమత్యై – కలావత్యై; కాన్తమత్యై – కాన్తా మనోజ్ఞా మతి ర్బుద్ధి ర్యస్యా స్సా; సర్వసూత్యై – సర్వస్య ప్రపంచస్య సూత్యై జనన్యై; సౌమ్యభూత్యై – సౌమ్యా అకరాళా భూతి స్సంపత్ యస్యా స్తస్యై; శర్మదాయై – సుఖదాయై; శైలజాయై – అగజాయై;

‘విద్వాంసు లెల్లన్ హకారంబెకానీ సకారంబెకానీ నకారంబెకానీ వచింపం దగు న్ముందుగా నిందుఁ గాదేని నాదిం దకా రంబుఁ గల్పించి యామీఁద నెల్లం దకారంబులే మెండుగా నిచ్చకు న్వచ్చునందాక నిర్మించి గుర్వంతముం జేసినం దండకం బండ్రు’ అని యప్పకవీయమున దండకలక్షణము.


సీ. ఔదలఁ దళుదళు◊క్కనురిక్కఱేనితోఁ, గూర్మి పైఁ గ్రమ్ముక◊న్గొనలతోడ,
నెమ్మోముతమ్మిపై ◊నిగుడులేనవ్వుతో, నుదుటిచూపున నొప్పు◊నుదుటితోడ,
పాలిండ్ల నొరయుము◊త్యాలసరాలతోఁ, బూలదండఁ దనర్చు◊కేలితోడ,
నడుగుల జీరుపు◊త్తడివలిపెమ్ముతోఁ, దావి గ్రమ్మెడు మేని◊తీవతోడ,

తే. నలరి వలిగట్టుపట్టి త◊న్గొలిచి వేల్పు,టింతితలమిన్న లేతేర ◊నెల్లవారు,
గాంచి యబ్రమ్ము మదిఁ జాల◊నుంచఁ బుడమి,సామిముంగల నపుడు సా◊క్షాత్కరించె. 32

టీక: ఔదలన్=శిరమునందు; తళుతళుక్కను = తళతళయని ప్రకాశించు; రిక్కఱేనితోన్=నక్షత్రేశుఁడైన చంద్రునితో; కూర్మి = కరుణ; పైన్ క్రమ్ముకన్గొనలతోడన్ = పైకొనునట్టి కటాక్షములతోడ;
నెమ్మోముతమ్మిపైన్ = సుందరమగు ముఖపద్మమునందు; నిగుడులేనవ్వుతోన్ = వ్యాపించు చిఱునగవుతోడ; నుదుటిచూపు నన్ = లలాటలోచనముచేత; ఒప్పు నుదుటితోడన్ = ప్రకాశించు నొసటితోడ;
పాలిండ్లన్=కుచములను; ఒరయుముత్యాలసరాలతోన్ – ఒరయు = రాయుచున్న, ముత్యాలసరాలతోన్=ముక్తాహారముల తోడ; పూలదండన్=పూసరముచే; తనర్చుకేలితోడన్ =ప్రకాశించుకరముచేత;
అడుగులన్=పాదములయందు; జీరుపుత్తడివలిపెమ్ముతోన్ = జీరాడు బంగరుమడుగువస్త్రముతోడ;తావి క్రమ్మెడు మేనితీవ తోడన్ = వలపుకొనునట్టి తీవవలె నున్న శరీరముతోడ; అలరి = సంతసించి; వలిగట్టుపట్టి = హిమవంతునకు కూఁతురగు పార్వతీదేవి; తన్గొలిచి = తన్ను సేవించి; వేల్పుటింతితల మిన్నలు = శ్రేష్ఠలగు దేవాంగనలు; ఏతేరన్ = వచ్చుచుండఁగా; ఎల్లవారు=సమస్తజనులు; కాంచి=చూచి; అబ్రమ్మున్=ఆశ్చ ర్యమును; మదిన్=మనమునందు; చాలన్=మిక్కిలి; ఉంచన్=ఉంచుచుండఁగా; పుడమిసామిముంగలన్=క్షణదోదయరాజు నెదుట; అపుడు=ఆసమయమందు; సాక్షాత్కరించెన్ = ప్రత్యక్షమాయెను.

అనఁగా శిరమునందుఁ బ్రకాశించు చంద్రుఁడును, దయారసము నొలుకు కనుతుదలును, చిఱునగవును, ఫాలలోచన మును, చనుఁగవ నొరయు ముత్యపుసరులును, పూసరముచే నొప్పు కేల్దమ్మియును, బంగరువస్త్రమును, పరిమళించు నంగ లతికయు నొప్పార నెల్లరు వింత నొంది చూచుచుండ గట్టురాపట్టి పుడమియొడయనియెదుటఁ బ్రత్యక్షమాయె నని భావము.

ఉ. ఇట్టు లపారతత్పరత ◊హెచ్చఁగ నాసెగకంటివేల్పురా
పట్టపుదేవి తద్ధరణి◊పాలకుముంగలఁ దోఁప వేడుక
ల్మట్టెగయ న్మహీశ్వరులు ◊మంచతలంబుల నిల్చి భక్తిఁ జే
పట్టి లలాటవీథిఁ గర◊పంకరుహాంజలు లుంచి రందఱున్. 33

టీక: ఇట్టులు=ఈవిధముగ; అపారతత్పరత = మిక్కుటమైన ఆసక్తి; హెచ్చఁగన్=అతిశయింపఁగ; ఆసెగకంటివేల్పురాపట్టపుదేవి = వీతిహోత్రుఁడు నేత్రముగాఁ గల దేవదేవునికిఁ బట్టపురాణియగు పార్వతి; తద్ధరణిపాలకుముంగలన్ = ఆపుడమి సామి యెదుట; తోఁపన్=కనుపట్టఁగా; వేడుకల్=వినోదములు; మట్టెగయన్=మితిమీఱఁగా; మహీశ్వరులు=రాజులు; మంచ తలంబులన్=మంచప్రదేశములయందు; నిల్చి =నిలుచుకొని; భక్తిన్=భక్తిని; చేపట్టి=గ్రహించి; లలాటవీథిన్=నొసటిపట్టున; అందఱున్=ఎల్లరును; కరపంకరుహాంజలులు = కేలుదామరమోడ్పులను; ఉంచిరి=ఉనిచిరి. అనఁగా నాక్షణదోదయుని యెదుటఁ బార్వతి ప్రత్యక్షము కాఁగానే రాజులందఱు మంచములపై నిలుచుండి భక్తిచేఁ గేలు మోడ్చి రని భావము.

శ. ఆవేళన్ క్షణదోదయక్షితితలా◊ధ్యక్షుండు తత్పాదరా
జీవద్వంద్వము మౌళిఁ జేర్చి వినయ◊శ్రీఁ జంద్రికం దన్మహా
దేవప్రేయసి కప్పగింప నటఁ దో◊డ్తెప్పించె వేగ న్వయ
స్యావారంబుల నాత్మలోచనకృత◊వ్యాపారము ల్పంపఁగన్. 34

టీక: ఆవేళన్=ఆసమయమందు; క్షణదోదయక్షితితలాధ్యక్షుండు =క్షణదోదయరాజు; తత్పాదరాజీవద్వంద్వము – తత్ = ఆపార్వతీదేవియొక్క, పాదరాజీవద్వంద్వము = పదపద్మయుగమును; మౌళిన్=శిరమునందు; చేర్చి=కదియించి; వినయ శ్రీన్=వినయసంపదతో; చంద్రికన్=చంద్రికను;తన్మహాదేవప్రేయసికిన్ =శంకరునికిఁ బ్రియురాలగు నాపార్వతికి; అప్పగింపన్ =ఒప్పగించుటకై; అటన్=అటు పిమ్మట; వయస్యావారంబులన్ =చెలికత్తెలగుంపులను; ఆత్మలోచనకృతవ్యాపారముల్ – ఆత్మ=తనయొక్క, లోచన=నేత్రములచేత, కృత=చేయఁబడిన, వ్యాపారముల్=పనులు; పంపఁగన్=ఆజ్ఞాపింపఁగ; వేగన్= శీఘ్రముగ; తోడ్తెప్పించెన్=తోడ్కొని రప్పించెను. అనఁగా క్షణదోదదయరాజు ప్రత్యక్షమైన యాపార్వతీదేవికి నమస్కరించి, వినయంబునఁ జంద్రిక నప్పగించుటకై కంటిసైగచేఁ జెలులం బనిచి, చంద్రికను బిలిపించె నని భావము.

సీ. నానావనీపాళి ◊నవ్యరాగోత్సవ,సంధాయకామూల్య◊చైత్రవేళ,
రతిసర్గవిలసనో◊దితచాతురీకనీ,రజసూతికల్పిత◊రత్నపుత్రి,
యద్రికన్యాబ్ధిము◊ఖ్యవిధావినిర్యాత,పాంచాలభూపాల◊భాగ్యలక్ష్మి,
దివ్యాళిపరివార◊దేవతాజనమధ్య,తలరోచమానకం◊దర్పవిద్య,

తే. తనువిభాద్విగుణీభూత◊ధాగధగ్య,సంగతానర్ఘమణిపరి◊ష్కారయుక్త
తన్మహారాజపుత్త్రిక ◊ధరణినాయ,కాజ్ఞ సొగ సెచ్చ నాస్థాని◊ కపుడు వచ్చె. 35

టీక: నానావనీపాళినవ్యరాగోత్సవసంధాయకామూల్యచైత్రవేళ – నానా=అనేకములగు, అవనీపాళి=రాజబృందమునకు, నవ్య =క్రొత్తనగు, రాగ=అనురాగమనెడు, ఉత్సవ=పండుగను, సంధాయక=ఘటిల్లఁజేయు, అమూల్య=వెలలేని, అనఁగ నుత్కృష్ట మగు ననుట, చైత్రవేళ=వసంతకాలము; ఇచట నానా=అనేకవిధములగు, వనీపాళి=కాననబృందమునకు నను నర్థాంతరము దోఁచుచున్నది; రతిసర్గవిలసనోదితచాతురీకనీరజసూతికల్పితరత్నపుత్రి – రతి=మన్మథుని భార్య యగు రతీదేవియొక్క, సర్గ=సృష్టిచేత నైన, విలసన=ప్రకాశముచేత, ఉదిత=పుట్టిన, చాతురీక=చాతుర్యముగల, ఇచట నద్యురుతశ్చేతి కప్రత్యయము, నకపీతినిషే ధముచే హ్రస్వము లేదు , నీరజసూతి=నలువచే, కల్పిత=రచియింపఁబడిన, రత్నపుత్రి=రతనంపుబొమ్మ; అద్రికన్యాబ్ధిముఖ్యవిధావినిర్యాతపాంచాలభూపాలభాగ్యలక్ష్మి – అద్రికన్యా=పార్వతీదేవి యనెడు,అబ్ధిముఖ్య=పాలకడలి యొక్క, విధా=ప్రకారమువలన, వినిర్యాత=వెల్వడిన, పాంచాలభూపాల=క్షణదోదయునియొక్క,భాగ్యలక్ష్మి=సుకృల్లక్ష్మి; చంద్రిక పార్వత్యనుగ్రహమువలన నీక్షణదోదయ రాజునకు జన్మించుటచే పార్వతియను పాలసముద్రమునుండి వెల్వడినదని చెప్పఁబడినది; దివ్యాళిపరివారదేవతాజనమధ్యతలరోచమానకందర్పవిద్య – దివ్య=సుందరులగు, ఆళి=సఖులనెడు, పరివారదేవతాజన= అంగదేవతాజనములయొక్క, మధ్యతల=మధ్యప్రదేశమునందు, రోచమాన=ప్రకాశించుచున్న, కందర్పవిద్య=మన్మథవిద్య; తనువిభాద్విగుణీభూతధాగధగ్యసంగతానర్ఘమణిపరిష్కారయుక్త – తనువిభా=దేహకాంతిచేత, ద్విగుణీభూత=రెట్టింపుగాఁ జేయఁబడిన, ధాగధగ్య=ధగధగయను ప్రకాశముతో, సంగత=కూడుకొన్న, అనర్ఘ=అమూల్యమగు, మణి=మణులయొక్క, పరిష్కార=అలంకారములతో, యుక్త=కూడుకొన్నదగు; తన్మహారాజపుత్త్రిక = క్షణదోదయరాజపుత్త్రిక యగు నాచంద్రిక; ధరణినాయకాజ్ఞన్ = ఆరాజుపంపున; సొగసు=అందము; ఎచ్చన్= అతిశయింపఁగా; ఆస్థానికిన్ = ఆస్థానమునకు; అపుడు= ఆసమయమందు; వచ్చెన్=వచ్చెను.

అనఁగా రాజు లనెడు వనపాళికి నామనివలె, రతిని జేసి జాణతనము నొందిననలువచేఁ గల్పితయగు మణిపుత్రికవలె, గట్టురాపట్టి యనుపాలమున్నీటివలన వెడలినట్టి క్షణదోదయసుకృతలక్ష్మివలె, అంగదేవతల నడుమ ననంగవిద్యవలె చెలి కత్తెలనడుమం బ్రకాశించుచు, తనదేహకాంతిచే రెట్టింపఁబడియున్న కాంతిగల మణిభూషణంబులచే నొప్పు నాచంద్రిక రాజు నాజ్ఞచే నాస్థానమునకు వచ్చె నని భావము.

ఉ. వచ్చుసువర్ణగౌరి జన◊వర్యకుమారి విలోచనంబులం
గ్రచ్చుక పట్టి యచ్చటిధ◊రాపతిసూనునికాయ మయ్యెడ
న్మెచ్చి నుతించె నిశ్చలత ◊మేనులఁ గన్నుల సమ్మదాశ్రువు
ల్మచ్చిక లాత్మ నౌదలఁ జ◊లాచలభావము నివ్వటిల్లఁగన్. 36

టీక: వచ్చుసువర్ణగౌరిన్—వచ్చు=వచ్చుచున్న, సువర్ణగౌరిన్=పసిఁడివన్నెగల; జనవర్యకుమారిన్=రాజపుత్త్రియగు చంద్రి కను; విలోచనంబులన్=కన్నులచే; క్రచ్చుక పట్టి = చుట్టి పట్టుకొని; మేనులఁన్=దేహములయందు; నిశ్చలత=మ్రానుపాటు; కన్నులన్= కనులందు; సమ్మదాశ్రువులు=ఆనందబాష్పములు; ఆత్మలన్=మనములందు; మచ్చికలు=మోహములు; ఔదలన్=శిరములందు; చలాచలభావము =చంచలత్వమును; నివ్వటిల్లఁగన్=అతిశయింపఁగ; అయ్యెడన్=ఆసమయమున; అచ్చటిధరాపతిసూనునికాయము = అచట నున్న రాట్కుమారుల సమూహము;మెచ్చి=మెచ్చుకొని; నుతించెన్=పొగడెను.

సీ. క్రొమ్మించుతీవయో ◊క్రొమ్మించుతీవకు, నిశ్చలాంగద్యుతి ◊నెగడు టెట్లు,
జాళువాబొమ్మయో ◊జాళువాబొమ్మకు, మేనఁ జల్లనితావి ◊మెలఁగు టెట్లు,
మందారవల్లియో ◊మందారవల్లికి, మందయానంబు పెం◊పొందు టెట్లు,
మరుఁ డెక్కుదంతియో ◊ మరుఁ డెక్కుదంతికిఁ, బలువాక్యనైపుణుల్ ◊గలుగు టెట్టు

తే. లౌర యీనారిచారుశృం◊గారభంగి, బళిరె యీచానసౌందర్య◊విలసనంబు,
లహహ యీబోటిబిబ్బోక◊హావగరిమ, మనుచు కొందఱు వర్ణించి ◊రనుపమోక్తి. 37

టీక: క్రొమ్మించుతీవయో=క్రొత్తమెఱపుతీవయా? క్రొమ్మించుతీవకున్=క్రొత్తమెఱపుతీవకు; నిశ్చలాంగద్యుతి – నిశ్చల= చలింపని, అంగ=శరీరముయొక్క,ద్యుతి=కాంతి, నెగడు టెట్లు =పెంపొందుటెట్లు? కనుక మెఱపుతీవ కాదని భావము; జాళువాబొమ్మయో=బంగరుబొమ్మయా? జాళువాబొమ్మకున్=బంగరుబొమ్మకు; మేనన్=శరీరమందు; చల్లనితావి = చల్లనివాసన; మెలఁగుట=కలిసియుండుట; ఎట్లు =ఏరీతి? మందారవల్లియో=పారిజాతలతయో, మందారవల్లికిన్=పారిజాతలతకు;మందయానంబు=తిన్ననినడక; పెంపొందుట = వృద్ధిఁబొందుట; ఎట్లు=ఏవిధము? మరుఁడు=మన్మథుఁడు; ఎక్కుదంతియో = ఎక్కునట్టి గజమో, మరుఁ డెక్కుదంతికిన్ = మన్మథుఁ డెక్కునట్టి గజమునకు; పలువాక్యనైపుణుల్=నానావిధములగు మాటలయందలి చాతుర్యములు; కలుగు టెట్టులు= చేకూరుట యేవిధము? ఈనారిచారుశృంగారభంగి=ఈస్త్రీయొక్క మనోజ్ఞమగు నలంకారపురీతి; ఔర=ఆశ్చర్యము! ఈచానసౌందర్యవిలసనంబు – ఈచాన=ఈచంద్రికయొక్క, సౌందర్య=చక్కఁదనముయొక్క, విలసనంబు=ప్రకాశములు; బళిరె =బళా! ఈబోటిబిబ్బోక హావగరిమ – ఈబోటి=ఈచంద్రికయొక్క, బిబ్బోక=స్త్రీలకు నిష్టవస్తువులయందుఁ గల్గెడి యనాదరము, హావ=కటాక్షభ్రూ విక్షేపాదులచే నంగనలు దెలుపు మనోవికారము, గరిమము = పైరెంటియొక్క యతిశయములు; అహహ=ఆశ్చర్యము!అనుచున్=ఇట్లనుచు; అనుపమోక్తిన్=నిస్సమానమగు మాటలచేత;కొందఱు =కొందఱురాసుతులు; వర్ణించిరి=నుతించిరి. ‘ఇష్టే ప్యనాదరో గర్వా న్మానా ద్బిబ్బోక ఉచ్యతే| భావ ఈషత్ప్రకాశో య స్స హావ ఇతి కథ్యతే’ అని బిబ్బోకహావలక్షణములు.

అనఁగాఁ గొందఱు రాకొమరులు చంద్రికను జూచి మెఱపుఁదీవయా యని సంశయించి మెఱపుఁదీవకుఁ జలింపనిదేహ కాంతు లెక్కడి వనియు, కాదేని బంగరుబొమ్మయో యని దానికి శరీరమందుఁ జల్లనివలపు లెట్లుదయించుననియు, లేదా మందారలతయా యని, మందారలతకు తిన్ననినడక లెట్లు చేకూరు ననియు, మదనునిగజమా, మదనునిగజమునకు పలు విధములగు పలుకు లెట్లుండు ననియు నిట్లు నుతించి రని భావము. ఈ పద్యమునందు సందేహాలంకారము. ‘స్యాత్స్మృతి భ్రాన్తి సందేహై స్తదఙ్కాలంకృతిత్రయమ్’ అని దాని లక్షణము.

చ. పలుచనివారికిం బొడమి ◊భాసురపుణ్యజనాహితాత్మునిం
గలసి చెలంగ నొప్ప దని ◊కల్మివెలంది దలంచి ధాత్రి ని
య్యలఘునకు న్జనించె సము◊దంచితపుణ్యజనాప్తు నొక్కరా
జు లలి వరింపఁగోరి యని ◊సొంపుగ నెంచిరి కొంద ఱాత్మలన్. 38

టీక: కల్మివెలంది =లక్ష్మీదేవి;పలుచనివారికిన్=తక్కువవారికి; పొడమి=పుట్టి; భాసురపుణ్యజనాహితాత్మునిన్ – భాసుర =ప్రకాశించు, పుణ్యజన=సాధుజనమునకు, అహిత=అప్రియమగు, ఆత్మునిన్=మనసుగలవానిని; ఇచట పలుచనివారి కనఁగ పలుచనినీటి కనియు, పుణ్యజనాహితాత్ముని ననఁగా, పుణ్యజన=రాక్షసులకు,‘యాతుధానః పుణ్యజనః’ అని యమరుఁడు, అహిత=అప్రియమగు, ఆత్మునిన్= మనసుగలవాడైన విష్ణుమూర్తి నని స్వభావార్థము; కలసి=పెనఁగి; చెలంగన్=ఒప్పుట; ఒప్పదని=తగదని; తలంచి= భావించి; ధాత్రిన్=భూమియందు; ఇయ్యలఘునకున్=ఈగొప్పకులమందు బుట్టిన ఘనునికి; సముదంచితపుణ్యజనాప్తున్=మిక్కిలి యొప్పుచున్న సాధుజనహితుఁడగు, మిక్కిలి యొప్పుచున్న పుణ్యజనుఁ డనఁగా యక్షుఁడైన కుముదునకు హితుఁడగు నతఁడని తోఁచుచున్నది; ఒక్కరాజున్=ఒకరాజును; లలిన్=ఆసక్తిచేత; వరింపన్ కోరి = వరియింపఁ దలఁచి; జనించెన్ =పుట్టెను; అని=అనుచు; కొందఱు=కొందఱురాకుమారులు; సొంపుగన్=సంతోషముచేత; అత్మలన్=మనస్సులందు; ఎంచిరి=కొనియాడిరి. అనఁగా కొందఱు రాజులు ఈచంద్రికను జూచి లక్ష్మీదేవి తక్కువ యగు కులమువారికిఁ బుట్టి పుణ్యజనవిరోధి యగువానిని జెట్టవట్టి యుండుట కన్నఁ బుడమిలో సాధుజనహితుఁడగు నొకయొడ యని పెండ్లియాడి యుండుట మంచి దని తలఁచి ఈఘనునికి జనించె నని నుతించి రని భావము. కుముదుఁ డను యక్షునకు హితుఁడైన సుచంద్రుని వరింపఁ గోరి పుట్టె నని ధ్వని.

సీ. అఖిలవర్ణితచర్య ◊యగునార్యఁ గర్కశా,కృతికి రాతికిఁ బుట్ట ◊నెనపినసడి,
యసమకళాజాల◊వసతికి రతి కనం,గవిలాససంలబ్ధి ◊గఱపు రట్టు,
ఘనరసోదయయుక్తిఁ ◊దనరునుర్వరఁ బంక,సంకులఁగాఁ దార్పఁ◊జాలు మాట,
సుమనోవనాఢ్యవృ◊త్తి మహేంద్రవనిత స్వ,శ్శ్రీయుక్తగాఁ ఘటిం◊చినకొఱంత,

తే. సత్కులోద్భవ వరవిలా◊సయుత ననఘ,మానితశ్రీవిరాజిత ◊నీనెలంతఁ
గోరి నిర్మించి వారించి◊కొనియె నలువ, యనుచు నెంచిరి కొంద ఱిం◊పెనయువేడ్క. 39

టీక: నలువ=బ్రహ్మదేవుఁడు; అఖిలవర్ణితచర్య – అఖిల=ఎల్లవారిచేత,వర్ణిత=నుతింపఁబడిన,చర్య=చరిత్రగలది; అగునార్యన్ =అగునట్టి పార్వతీదేవిని, పూజ్యురాలి నను నర్థము స్ఫురించుచున్నది; కర్కశాకృతికిన్=కఠినమగు నాకారముగల;రాతికిన్ =చట్టునకు; కర్కశాకృతి కిరాతికిన్= కఠినాకారముగల యొక కిరాతస్త్రీ కని యర్థము దోఁచుచున్నది; పుట్టన్= జనించునట్లు; ఎనపినసడిన్ = పొందించినట్టి యపకీర్తిని;
అసమకళాజాలవసతికిన్ – అసమ=సరిలేని, కళా=కాంతులయొక్క,జాల=సమూహములయొక్క,వసతికిన్=నివాసమైన; రతికిన్=రతీదేవికి; సాటిలేనివిద్యలకు నివాసమైన యువిద కను నర్థము దోఁచుచున్నది; అనంగవిలాససంలబ్ధిన్ – అనంగ= మన్మథునియొక్క, విలాస=లీలయొక్క, సంలబ్ధిన్=ప్రాప్తిని; అనంగవిలాస=అంగములు లేని విలాసములయొక్క యని యర్థము దోఁచుచున్నది; కఱపురట్టున్=అభ్యసింపఁజేయు నిందను; ఘనరసోదయయుక్తిన్ – ఘన=అధికమగు, రస=శృంగారముయొక్క, ఉదయ=ఆవిర్భావముయొక్క,యుక్తిన్ =సంబం ధముచేత; ఘనరస=జలముయొక్క, ‘మేఘపుష్పం ఘనరసమ్’ అని యమరుఁడు, ఉదయ=ఆవిర్భావముయొక్క,యుక్తిన్ =సంబంధముచేత నని స్వభావార్థము; తనరునుర్వరన్=ఒప్పుచున్న భూమిని, ఒకకాంత నని యర్థము దోఁచుచున్నది; పంక =పాపముచేత; సంకులఁగాన్=వ్యాకులమైనదానిఁగా, ఇచట, పంక=బురదచేత నని స్వభావార్థము; తార్పఁజాలుమాటన్ = చేయఁజాలునట్టి యపకీర్తిని; సుమనోవనాఢ్యవృత్తిన్ – సుమనోవన=నందనవనముచేత, లేదా, దేవసంరక్షణముచేత, ఆఢ్య=సంపన్నమైన,వృత్తిన్ = వ్యాపారముగల; మహేంద్రవనితన్=శచీదేవిని; ఇచట, సుమనోవన=విద్వత్సంరక్షణమందు, ఆఢ్య=సంపన్నమైన,వృత్తిన్ = వృత్తిగల, మహేంద్రవనితన్= పరమైశ్వర్యముగల పురుషునియొక్క కాంత నను నర్థము దోఁచుచున్నది; స్వశ్శ్రీయుక్తగాన్ – సు=అధికమగు, అశ్రీ=అలక్ష్మితో, యుక్తఁగాన్=కూడినదానిగా; స్వశ్శ్రీ=స్వర్గసంపదతో,యుక్తగాన్ = కూడినదానిగా నని స్వభావార్థము; ఘటించినకొఱంతన్ = చేసినకొఱఁతను; గీతియందు క్రమముగా నీనాల్గుపాదములయందలి విషయమున కన్వ యము దెలియవలయు;సత్కులోద్భవన్=శ్రేష్ఠమగు కులమునందుఁ బుట్టినదియు; వరవిలాసయుతన్=శ్రేష్ఠమగు విలాసములు గలదియు; అనఘన్ = పాపరహితయు; మానితశ్రీవిరాజితన్ =పూజ్యమగు సంపదచేత ప్రకాశించునదియు నగు; ఈనెలంతన్ = ఈచంద్రికను; కోరి= అభిలషించి; నిర్మించి=చేసి; వారించికొనియెన్=పోగొట్టుకొనెను; అనుచు=ఈవిధముగాఁ దలఁచుచు; కొందఱు= కొందఱు రాకొమరులు; ఇంపెనయువేడ్కన్ = అతిశయించిన సంతసముతో; ఎంచిరి=తలంచిరి.

అనఁగా లోకోత్తరయగు నార్యను కఠినమగు చట్టునకుఁ బుట్టునటులు చేసిన యపకీర్తిని, రతీదేవి కనంగవిలాసము కల్గిం చిన రట్టును, ఉర్వరను పంకమలినమైనదానినిగాఁ జేసిన యపవాదమును, శచీదేవిని సంపదలేనిదానినిఁగాఁ జేసిన కొఱంతను, నలువ చంద్రికను సత్కులప్రసూతత్వాదిగుణములుగలదానినిఁగాఁ జేసి వారించికొనియె నని భావము.

క. అని యీగతి నృపతతి తి,య్యనిపలుకులు వెలయఁ బొగడు ◊నయ్యెడ నాళీ
జనములు చెంతలఁ గొలువఁగఁ, గనకలతాగాత్రి జనకుఁ ◊గదిసె ముదమునన్. 40

టీక: అని ఈగతిన్=ఈరీతిగ; నృపతతి =రాజబృందము; తియ్యనిపలుకులు =మధురమగు మాటలు; వెలయన్=ప్రకాశించు నట్లు; పొగడు అయ్యెడన్=నుతించు నాసమయమందు; ఆళీజనములు=సకియలు; చెంతలన్=ఇరుప్రక్కలయందు; కొలువఁ గన్=సేవింపఁగ; కనకలతాగాత్రి = బంగరుతీఁగవంటి మేనుగల చంద్రిక; ముదమునన్=సంతసముతో; జనకున్=తండ్రిని; కదిసెన్ =చేరెను. ఇట్లు రాజులు నుతించుచుండఁగా, చెలులు చెంతల సేవించుచు రాఁగా, చంద్రిక జనకునిఁ జేరె నని భావము.

మ. తరుణీతల్లజ మిట్లు తన్నృపతిచెం◊తం జేరి యవ్వేళ భ
క్తి రహింపం దదనుజ్ఞఁ గంతురిపుపం◊కేజాక్షికి న్మ్రొక్కె ని
ర్భరవీక్షాగతి మారకాండపరిస ◊ర్గం బూన్చి యుర్వీశదు
ష్కరమానంబు హరించుమంతుఁ గని చ◊క్కన్ బాపు మన్ పోలికన్. 41

టీక: తరుణీతల్లజము=వనితలలోఁ బ్రశస్తయగు చంద్రిక, ‘మతల్లికా మచర్చికా ప్రకాణ్డ ముద్ఘ తల్లజౌ ప్రశస్తవాచకాన్యమూని’ అని యమరుఁడు; ఇట్లు=ఈప్రకారము; తన్నృపతిచెంతన్ = ఆక్షణదోదయరాజుచెంగటను; చేరి=పొంది; అవ్వేళన్=ఆసమ యమందు; భక్తి రహింపన్ = భక్తి యతిశయింపఁగా; తదనుజ్ఞన్=ఆరాజునాజ్ఞచేత; కంతురిపుపంకేజాక్షికిన్ – కంతురిపు= మదనవైరియైన శివునియొక్క, పంకేజాక్షికిన్= కాంతయగు పార్వతీదేవికి; నిర్భరవీక్షాగతిన్ – నిర్భర=పరిపూర్ణమగు, వీక్షా = కటాక్షములయొక్క, గతిన్=ప్రచారముచేత; మారకాండపరిసర్గంబు ఊన్చి – మార=మన్మథులయొక్క, కాండ=సమూ హములయొక్క, పరిసర్గంబు=సృష్టిని, ఊన్చి=చేసి, మన్మథసమూహముయొక్క సృష్టినని భావము; ఉర్వీశదుష్కరమా నంబు – ఉరు=అధికుఁడైన, ఈశ=శంకరునియొక్క, దుష్కర=అనివార్యమైన, మానంబు=మానమును; ఉర్వీశ=రాజుల యొక్క అనివార్యమైన మానము నని స్వభావార్థము; హరించుమంతున్ = అపహరించునట్టి యపరాధమును; కని = చూచి; చక్కన్=చక్కగ; పాపు మన్ పోలికన్ =పోఁగొట్టుమన్నరీతిగ; మ్రొక్కెన్=నమస్కరించెను.

అనఁగఁ జంద్రిక క్షణదోదయునియాజ్ఞచేఁ బార్వతీదేవిని స్వకటాక్షప్రచారములవలనఁ బెక్కండ్రు మన్మథుల సృజించి, ఉర్వీశమానమును హరించునట్టి యపరాధమును బోఁగొట్టుమనియో యన్నట్లు నమస్కరించె నని భావము.

తే. నతి యొనర్చిన చెలువ క◊న్నగతనూజ, యపు డభీష్టార్థసంసిద్ధి◊రస్తటంచు
హాళి దీవించి కౌఁగిట ◊నలమి కనక,మంగళాక్షతపాళికల్◊మౌళిఁ దార్చె. 42

టీక: నతి=నమస్కారమును; ఒనర్చిన చెలువకున్=చేసినట్టిచంద్రికకు; అన్నగతనూజ=ఆపార్వతీదేవి; అపుడు=ఆసమయ మందు; అభీష్టార్థసంసిద్ధిః – అభీష్ట=కోరఁబడిన, అర్థ=ప్రయోజనముయొక్క, ‘అర్థోభిధేయే రై వస్తు ప్రయోజన నివృత్తిషు’ అని యమరుఁడు, సంసిద్ధిః=ప్రాప్తి; అస్తు=అగుఁగాక; అటంచున్=అనుచు; హాళిన్=ప్రీతితో; దీవించి=ఆశీర్వదించి; కౌఁగిటన్ = కౌఁగిలియందు; అలమి=ఆక్రమించి; కనకమంగళాక్షతపాళికల్ =బంగరువర్ణముగల మంగళప్రదములైన యక్షతలయొక్క సమూహములను; మౌళిన్=శిరమునందు; తార్చెన్=ఉంచెను.

వ. అంతఁ జతురంతయానంబున నాకాంతాశిరోమణి నుండ నియోగించి, యంచిత మనోంచలనిరా కుంచితప్రమదసమాజయై, యాగిరిరాజతనూజ సఖీజనంబులు వెనువెంట నడువ నెచ్చెలిచెలు వూని తత్పార్శ్వంబున నడచుచు, రాజసభముఖంబుఁ జేరి, యభంగమేరుశృంగంబులం దోఁచుసింగంపుఁ గొదమలతెఱంగునఁ గాంచనమంచనికాయంబులం జూపట్టు సకలాంతరీపానంతాకాంతలతాంతసాయక సంతానంబులం జూపి క్రమంబున నొక్కొక్కని దేశాదికంబులు దేటపడఁ జాతుర్యంబున నిట్లనియె. 43

టీక: అంతన్=ఆపైని; చతురంతయానంబునన్=ఎనమండ్రు మోయు వాహనవిశేషమందు; ఆకాంతాశిరోమణిన్ = నారీచూడా మణియగు నాచంద్రికను; ఉండన్=ఉండుటకు; నియోగించి=ఆజ్ఞాపించి; అంచిత మనోంచల నిరాకుంచిత ప్రమద సమాజయై – అంచిత=ప్రకాశించుచున్న, మనోంచల=మనోవీథియందు, నిరాకుంచిత=వికసించిన, ప్రమద=సంతసములయొక్క, సమాజ యై = సమూహముగలదియై; ఆగిరిరాజతనూజ =గట్టురాపట్టి యగు నాపార్వతీదేవి; సఖీజనంబులు=సకియలు; వెనువెంట నడువన్=వెంబడి నడచుచుండఁగ; నెచ్చెలిచెలువు ఊని =ప్రియసఖివిధము వహించి;తత్పార్శ్వంబునన్=ఆచంద్రికప్రక్కను; నడచుచున్; రాజసభముఖంబుఁ జేరి = రాజసభయొక్క పూర్వభాగమును చేరి; అభంగమేరుశృంగంబులన్ – అభంగ= అప్రతిహతములగు, మేరుశృంగంబులన్ =సుమేరుశిఖరములయందు; తోఁచుసింగంపుఁగొదమలతెఱంగునన్ = కాన్పించు సింగంపుపిల్లలవలె; కాంచనమంచనికాయంబులన్= బంగరుమంచముల గుంపులమీఁద; చూపట్టు=కనుపించునట్టి; సకలాంత రీపానంతాకాంత లతాంతసాయక సంతానంబులన్ – సకల=ఎల్ల, అంతరీప=ద్వీపములయొక్క, అనంతాకాంతలతాంత సాయక = మన్మథులవంటి ద్వీపాధిపతులయొక్క, సంతానంబులన్=సమూహములను; చూపి=ప్రదర్శించి; క్రమంబునన్= వరుసగా; ఒక్కొక్కనిదేశాదికంబులు =ఒక్కొక్కరాజుయొక్క దేశము మొదలగువానిని; తేటపడన్=తెల్లమగునట్లు; చాతు ర్యంబునన్ = జాణతనముచేత; ఇట్లనియెన్= వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.

మ. కనుఁగొంటే విరిగల్వకంటి మహితో◊త్కంఠాసముద్భూతి నీ
జననాథాగ్రణి నుజ్జ్వలాంఘ్రిసరసీ◊జాతద్వయవ్యాప్తనూ
తనసామంతనృపచ్ఛటామకుటము◊క్తాకాంతిసూనోత్కరు
న్వినుతామర్త్యనికాయుఁ బుష్కరమహా◊ద్వీపావనీపాలకున్. 44

టీక: విరిగల్వకంటి=విరిసిన కలువపూవులవంటికన్నులుగలచంద్రికా! ఉజ్జ్వ లాంఘ్రిసరసీజాత ద్వయ వ్యాప్త నూతన సామంత నృప చ్ఛటా మకుట ముక్తాకాంతి సూ నోత్కరున్ – ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, అంఘ్రిసరసీజాత=పాదకమలములయొక్క, ద్వయ=కవను, వ్యాప్త=ఆవరించిన, నూతన=క్రొత్తనగు, సామంతనృప=ఇరుగుపొరుగురాజులయొక్క, ఛటా=సమూహము యొక్క, మకుట=కిరీటములందున్న, ముక్తాకాంతి=ముత్యపుకాంతులయొక్క, సూన=పుష్పములయొక్క, ఉత్కరున్= సమూహము గలిగినవాఁడును; విను తామర్త్య నికాయున్ – వినుత=పొగడఁబడిన, అమర్త్య=దేవతలయొక్క, నికాయున్ = సమూహముగలవాఁడును; పుష్కరమహాద్వీపావనీపాలకున్=పుష్కరద్వీపము నేలువాఁడునగు; ఈ జననాథాగ్రణిన్= ఈ రాజశ్రేష్ఠుని; మహి తోత్కంఠా సముద్భూతిన్ – మహిత=అధికమగు, ఉత్కంఠా= ‘సర్వేంద్రియ సుఖాస్వాదో యత్రాస్తీత్యభి మన్యతే తత్ప్రాప్తీచ్ఛాం ససంకల్పా ముత్కణ్ఠాం కవయో విదుః’ ఇత్యుక్తలక్షణమగు నుత్కంఠయొక్క, సముద్భూతిన్=అతి శయముచేత; కనుఁగొంటే = చూచితివా?

అనఁగా సామంతరాజమకుటములం దున్న ముత్యములకాంతు లనెడు కుసుమసమూహముచేఁ గప్పఁబడిన పాదకమల ములు గలపుష్కరద్వీపాధిపతియగు నీరాజరత్నమును చూచితివా యని భావము.

మ. పరరాజప్రబలప్రభావహరణ◊ప్రౌఢస్థితిం బొల్చునీ
నరనాథోత్తమదోఃప్రతాపకుహనా◊నాళీకమిత్రుండు దా
ధర నిర్మించుఁ జుమీ యమస్వస, మిళిం◊దద్వేషిధమ్మిల్ల! త
త్పరమారాతివధూసకజ్జలదృగ◊బ్జాతాంబుధారాగతిన్. 45

టీక: మిళిందద్వేషిధమ్మిల్ల =తుమ్మెదలకు శత్రువైన కొప్పుగల చంద్రికా! పరరాజ ప్రబల ప్రభావ హరణ ప్రౌఢస్థితిన్ – పర రాజ=శత్రురాజులయొక్క, ఉత్కృష్టుఁడగు చంద్రునియొక్క, ప్రబల=అధికమగు, ప్రభావ=ప్రతాపముయొక్క, హరణ= హరించుటయందు, ప్రౌఢస్థితిన్= సమర్థమైన స్థితిచే; పొల్చు నీనరనాథోత్తమ దోఃప్రతాప కుహనా నాళీకమిత్రుండు – పొల్చు =ఒప్పుచున్న, ఈనరనాథోత్తమ=ఈరాజశ్రేష్ఠునియొక్క, దోఃప్రతాప=భుజసంబంధియగు ప్రతాపమనెడు, కుహనా = కపటముగల, నాళీకమిత్రుండు=సూర్యుఁడు; త త్పరమారాతి వధూ సకజ్జల దృగబ్జాతాంబుధారా గతిన్ – తత్=ప్రసిద్ధులగు, పరమ=ఉత్కృష్టులగు, అరాతి=శత్రువులయొక్క, వధూ=స్త్రీలయొక్క,సకజ్జల=కాటుకతోఁ గూడియున్న, దృగబ్జాత=నేత్ర కమలములయొక్క, అంబుధార = బాష్పధారయొక్క, గతిన్=ప్రాప్తిచేత; తాన్; ధరన్=భూమియందు; యమస్వసన్= యమునానదిని; నిర్మించున్ = సృజించును; చుమీ =సత్యము!

అనఁగ పుష్కరద్వీపాధిపతి యగునీనరపతియొక్క ప్రతాప మనెడు సూర్యుఁడు శత్రురాజప్రతాపమును హరించి యుద్దామస్థితిని పొంది, శత్రువనితలయొక్క కజ్జలసహితము లగు నేత్రజలములచేఁ బుడమి యమునానదిని నిర్మించు నని భావము.

మ. అతులాంభోరుహపీఠిఁ బొల్పెసఁగు స◊త్యస్వామి కీ వి య్యిలా
పతితోడ న్రహిఁ బెండ్లిమ్రొక్కు ఘటియిం◊పం జేర నీ కూన్చుఁ బో
యతఁ డాత్మేష్టఫలంబు లంతకయ ము ◊న్నబ్జాక్షి యాత్రోవ నూ
ర్జితశాఖావళి సాఁచి వాని వటధా◊త్రీజాత మర్పింపఁగన్. 46

టీక: అబ్జాక్షి=చంద్రికా! అతులాంభోరుహపీఠిన్ – అతుల=అసమానమగు, అంభోరుహపీఠిన్=కమలాసనమునందు; పొల్పెసఁగు సత్యస్వామికిన్ – పొల్పెసఁగు=మిక్కిలి యొప్పుచున్న, సత్యస్వామికిన్=సత్యలోకాధిపతియగు నలువకు; ఈవు=నీవు; ఇయ్యిలాపతితోడన్ =ఈభూపతితోడ; రహిన్=ప్రీతితో; పెండ్లిమ్రొక్కు=వివాహదీక్షాంతమందుఁ జేయు నమ స్కారమును; ఘటియింపన్=చేయుటకు; చేరన్=సమీపింపఁగా; నీకున్; అతఁడు=ఆనలువ; ఆత్మేష్టఫలంబులు – ఆత్మ= తనకు, ఇష్ట=అనుకూలమైన, ఫలంబులు=ఫలములను; ఊన్చున్ పో = ఈయఁగలఁడు; ఆత్రోవన్=ఆబ్రహ్మదేవాలయమార్గ మందు; అంతకయ మున్ను=నలువ ఫలములీయకమునుపే; వానిన్=ఆఫలములను; వటధాత్రీజాతము = వటవృక్షము, ఈ పుష్కరద్వీపమునందు నలువస్థానము త్రోవయందు ఫలము లొసఁగు మఱ్ఱిచెట్టుండుట ప్రసిద్ధము; ఊర్జితశాఖావళిన్ – ఊర్జిత =దృఢమగు, శాఖా=కొమ్మలయొక్క, ఆవళిన్=పంక్తిని; చాఁచి=చాఁగించి; అర్పింపఁగన్ = ఇచ్చుచుండఁగ. దీని కూన్చు నను క్రియతోఁ బై కన్వయము. అనఁగ నీపుష్కరద్వీపాధిపతిని నీవు పెండ్లిచేసికొని యాద్వీపమందున్న నలువకుఁ బెండ్లి మ్రొక్కు లిడుటకై యేగుతఱి నాత్రోవ నున్న మఱ్ఱిచెట్టు నీవు కోరినఫలంబుల నలువకన్న ముందుగానే యొసంగునని భావము.

చ. సరసతపాగమంబున ని◊శాకరసోదరదాస్య! యీమహీ
శ్వరుఁ గవగూడి నీవు విల◊సజ్జలఖేల నొనర్పఁ జేరఁగా
వరసరసీభవద్విమల◊వారిపయోనిధివీచు లారతుల్
కరము ఘటించుఁ గా కరుణ◊కంజకరమ్ముల నాళి పాడఁగన్. 47

టీక: నిశాకరసోదరదాస్య – నిశాకర=చంద్రునకు, సోదరత్=తోబుట్టువువలె నాచరించుచున్న, ఆస్య=ముఖముగల చంద్రికా, చంద్రునిఁ బోలు ముఖముగల చంద్రికా యని తాత్పర్యము. ఇచట సోదరశబ్దము ఇవార్థకము. ‘దేశీయ దేశ్య రిప్వాభ సోదరా ద్యా ఇవార్థకాః’ అని కవికల్పలతయం దున్నది; సరసతపాగమంబునన్ – సరస=మనోజ్ఞమగు, తపాగమంబునన్=గ్రీష్మ కాలమునందు, ‘నిదాఘ ఉష్ణోపగమ ఉష్ణ ఊష్మాగమ స్తపః’ అని యమరుఁడు;ఈమహీశ్వరున్ =ఈపుష్కరద్వీపాధిపతిని; కవగూడి=జతగూడి; నీవు; విలసజ్జలఖేలన్ – విలసత్=ప్రకాశించుచున్న,జలఖేలన్=జలక్రీడను; ఒనర్పన్=చేయుటకు; చేరఁ గాన్=సమీపింపఁగ; వర సరసీభవ ద్విమల వారి పయోనిధి వీచులు –వర=శ్రేష్ఠమగు, సరసీభవత్=కొలనగుచున్న, విమల= స్వచ్ఛమగు, వారి=నీరుగల, పయోనిధి=సముద్రముయొక్క, వీచులు=తరఁగలు; ఇచట స్త్రీత్వనిర్దేశమువల్ల స్త్రీలని యర్థము దోఁచుచున్నది; అరుణకంజ కరమ్ములన్ – అరుణకంజ=ఎఱ్ఱదామరలనెడు, కరంబులన్=హస్తములచేత, ఆళి =అళిబృంద మనెడు చెలి; పాడఁగన్=పాటపాడుచుండఁగా;ఆరతుల్=ఆరతులను;కరము=మిక్కిలి;ఘటించుఁ గాక=ఒనగూర్చుఁగాక;

అనఁగ నీవు గ్రీష్మకాలమునందు నీపుష్కరద్వీపాధిపతిని గూడి స్వాదుసముద్రమందు జలక్రీడ సేయంజనఁగా తరఁగలు కెందామర లనెడు హస్తములచేతఁ దుమ్మెదతండములు పాటలువాడుచుండఁగా నారతు లొసంగునని భావము.

తె. అని తెలిపి హైమవతి యాల◊తాంగి చిత్త,సారసము తజ్జనాధీశ◊చంద్రరక్తి
నలర లే కున్కి తెలిసియు ◊నవ్వలఁ జనఁ,జేసె శిబికాధురంధర◊ శ్రేణి నపుడు. 48

టీక: హైమవతి =పార్వతి; అని=పైవిధముగా; తెలిపి=తెలియఁజేసి; ఆలతాంగిచిత్తసారసము=తీఁగవంటిమేనుగల యాచంద్రిక యొక్క మనఃకమలము; తజ్జనాధీశచంద్రరక్తిన్ – తజ్జనాధీశచంద్ర=ఆరాజచంద్రునియొక్క, రక్తిన్=అనురాగముచేత;అలర లే కున్కిన్=వికసింపకయుండుటను; తెలిసియున్=గుర్తించియు; అపుడు=ఆసమయమున; శిబికాధురంధరశ్రేణిన్=పల్లకిని మోయుచున్నవారల గుంపును; అవ్వలన్=ఆవలకు; చనన్ చేసెన్= పోనిచ్చెను.

అనఁగా పార్వతీదేవి పుష్కరద్వీపాధిపతి యగు నారాజచంద్రునియందలి యనురాగముచేఁ జంద్రిక మనస్సారసము విక సింపకుండుటచేత, నాందోళికను మోయువారిని ముందు చన నియోగించె నని భావము. చంద్రునివల్ల సారసము ముకుళించును గాని వికసించుట లోకమం దప్రసిద్ధ మని సూచించుటకుఁ జంద్రసారసపదంబులఁ గవి యిటఁ బ్రయోగించెను.

వ. చెంత నొక్కమహీకాంతునిం జూపి యక్కంతువిరోధికాంత యాశకుంతరాజయాన కిట్లనియె. 49

టీక: ఆశకుంతరాజయానకున్ =హంసలవంటినడకగల యాచంద్రికకు; అక్కంతువిరోధికాంత =మన్మథవిరోధియగు శివుని యొక్క ప్రియురాలైన యాపార్వతి; చెంతన్=సమీపమందు; ఒక్కమహీకాంతునిన్ = ఒకరాజును; చూపి = కనఁబఱచి; ఇట్లు = వక్ష్యమాణప్రకారము; అనియెన్=పలికెను.

మ. జలజాతచ్ఛదదేశ్యనేత్ర! కనుమీ ◊ శాకాంతరీపేశు ను
జ్జ్వలధామౌఘవృతాశు నీఘను బుధ◊స్వామివ్రజస్తుత్యయై
యలరు న్వీనిసుకీర్తిశీతకిరణా◊స్యామౌళి వేధోండపం
క్తులు మేల్మేలిమి గుండ్లపేరుగతి క◊న్గో నొప్ప నెల్లప్పుడున్. 50

టీక: జలజాతచ్ఛదదేశ్యనేత్ర =తామరఱేకులవంటి కన్నులుగలదానా! ఇట నీషదసమాప్తియందు దేశ్యప్రత్యయము; ఉజ్జ్వల ధామౌఘవృతాశున్ – ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, ధామ=తేజస్సుయొక్క, ఓఘ=సమూహముచేత, వృత=ఆవరింపఁబడిన, ఆశున్=దిశలుగల; శాకాంతరీపేశున్=శాకద్వీపాధిపతియగు; ఈఘనున్=ఈగొప్పవానిని; కనుమీ =చూడుమీ; వీని సుకీర్తి శీతకిరణాస్యామౌళి = వీనియొక్క కీర్త్యంగన; వేధోండపంక్తులు =బ్రహ్మాండసమూహములు; మేల్మేలిమి గుండ్లపేరుగతిన్ = అతి శ్రేష్ఠమగు గుండ్లదండరీతిగ; ఎల్లప్పుడున్=ఎల్లకాలము; కన్గో నొప్పన్= చూచుటకు నొప్పుచుండఁగ; బుధస్వామివ్రజ స్తుత్యయై – బుధస్వామి= దేవతాప్రముఖులయొక్క, వ్రజ=సంఘముచేత, స్తుత్యయై=పొగడఁదగినదై; అలరున్=ఒప్పును.

ఈశాకద్వీపాధిపతి కీర్తికాంతకు బ్రహ్మాండములు గుండ్లహారమువలె నొప్పునని తాత్పర్యము. అత్యుక్త్యలంకారము. ‘అత్యుక్తి రద్భుతాతథ్య శౌర్యౌదార్యాదివర్ణనమ్’ అని తల్లక్షణము.

చ. ధర నేతన్మహిపాలచంద్రకృతని◊త్యస్పర్శనాంభᳲపరం
పర లప్రత్నమహాంబురాశిగతిఁ దోఁ◊పం గొమ్మ! నిచ్చల్ తదం
తరవీథి న్బడబాగ్నికీలతతి యం◊దం బూని భర్మావనీ
ధరము న్మౌక్తికరీతిఁ దాల్చి యుడుసం◊తానంబులుం జూ పడున్. 51

టీక: ధరన్=భూమియందు; ఏతన్మహిపాలచంద్ర కృత నిత్యస్పర్శనాంభᳲ పరంపరలు – ఏతన్మహిపాలచంద్ర=ఈరాజ చంద్రునిచేత, కృత=చేయఁబడిన, నిత్యస్పర్శనాంభః = నిత్యదానోదకముయొక్క, పరంపరలు=సమూహములు; అప్రత్న మహాంబురాశి గతిన్ – అప్రత్న=నూతనమగు, మహాంబురాశిగతిన్=మున్నీటిపగిది; తోఁపన్=తోఁచుచుండఁగా; కొమ్మ= చంద్రికా! నిచ్చల్=ఎల్లపుడు; తదంతరవీథిన్=ఆమున్నీటిమధ్యమందు; భర్మావనీధరమున్=మేరుపర్వతమును; బడబాగ్ని కీలతతి యందంబు =బడబాగ్నిజ్వాలాసమూహమురీతిని; ఊని=పొంది; ఉడుసంతానంబులున్=నక్షత్రసమూహములును; మౌక్తికరీతిన్=ముత్యములయాకృతిని; తాల్చి=ధరించి; పడున్= పడును; చూ=చూడుము.

అనఁగ నీశాకద్వీపాధిపతియొక్క దానోదకములు నూతనసముద్రమువలె భాసిల్లుచుండ, నాసముద్రమధ్యమునం బడిన మేరుపర్వతము బడబాగ్నిగాను, నక్షత్రపుంజములు ముత్యములుగాను జూపట్టునని భావము. ఈరాజు దానోదకము పుడమిఁ గప్పుకొని మిన్నంటిన దని ముఖ్యాశయము.

సీ. పవనాహతోర్మికా◊నవనాదయుతపయో,ర్ణవనాథఖేలనా◊రమ్యగతులు,
కలశాబ్ధిసంశోభి◊బిలశాయిపర్యంక,తలశాయిపురుషసం◊దర్శనములు,
సరసాత్మహితసుమో◊త్కరసారఫలదళా,కరసాలవల్లికా◊పరివిహృతులు,
చరమాన్యనగవనీ◊వరమార్గచారి కి,న్నరమానినీమణి◊పరిచయములు,

తే. తావకపురాణపుణ్యసం◊తానకలనఁ, బారిమాండల్యవన్మధ్య!◊చేరు నీకు
మహితసుమదామకమున నీ◊మానవాధి,కాంతపుంగవుకంఠంబు ◊గట్టు మిపుడు. 52

టీక: పారిమాండల్యవన్మధ్య=పరమాణుపరిమాణముగల నడుముగలదానా! పారిమాండల్యశబ్దమునకు పరమాణు వని యర్థము, పరమాణు వనఁగా, ‘జాలసూర్యమరీచిస్థం సూక్ష్మం యద్దృశ్యతే రజః , తస్య షష్ఠతమోభాగః పరమాణు స్స ఉచ్యతే’ అని దాని లక్షణము. గవాక్షరంధ్రంబునఁ జొరఁబాఱు నెండలోఁ జూపట్టురజముయొక్క షష్ఠతమమగు ఖండము పరమాణు వగునని దాని యర్థము; తావకపురాణపుణ్యసంతానకలనన్ – తావక=నీసంబంధియగు, పురాణపుణ్య= ప్రాచీన పుణ్యములయొక్క, పూర్వజన్మసంచితపుణ్యములయొక్క యనుట, సంతాన=సంచయముయొక్క, కలనన్=ప్రాప్తిచేత; నీకున్;
పవ నాహ తోర్మికా నవ నాద యుత పయోర్ణవనాథ ఖేలనా రమ్యగతులు – పవన=వాయువుచేత, ఆహత=కొట్టఁబడిన, ఊర్మికా=తరఁగలయొక్క, నవ=నూతనమగు, నాద=ధ్వనితోడ, యుత=కూడుకొన్న, పయోర్ణవనాథ=పాలకడలి యొక్క, ఖేలనా = విహారములయొక్క, రమ్యగతులు=మనోజ్ఞమగు రీతులు; కలశాబ్ధి సంశోభి బిలశాయి పర్యంకతల శాయి పురుష సందర్శనములు – కలశాబ్ధి=పాలకడలియందు, సంశోభి=మిక్కిలి వెలయుచున్న, బిలశాయి=ఆదిశేషుఁడనెడు, పర్యంకతల=మంచమునందు, శాయి=పవళించిన, పురుష=పురాణపురుషుని యొక్క, సందర్శనములు=చూపులు; సర సాత్మహిత సుమోత్కర సారఫల దళాకర సాల వల్లికా పరివిహృతులు – సరస=మకరందముతోఁ గూడిన, ఆత్మహిత= మనసునకు హితములగు, సుమోత్కర=పూతండములకు,సారఫల=శ్రేష్ఠమగు ఫలములకు, దళ=ఆకులకు, ఆకర=ఉనికి పట్టగు, సాల=వృక్షములయందు, వల్లికా=తీవలయందు, పరివిహృతులు=వహారములు, క్రీడ లనుట; చరమాన్యనగ వనీవర మార్గ చారి కిన్నరమానినీమణి పరిచయములు – చరమాన్యనగ=పొడుపుకొండయొక్క, వనీవర=శ్రేష్ఠ మగు వనముయొక్క, మార్గ=త్రోవయందు, చారి=సంచరించు, కిన్నరమానినీమణి=కింపురుషస్త్రీరత్నములయొక్క, పరిచ యములు = స్నేహములు; చేరున్=ఘటిల్లును; ఇపుడు=ఈసమయమందు; మహితసుమదామకమునన్ – మహిత=పూజ్యమగు, సుమదామకమునన్= పుష్పమాలికచేత; ఈమానవాధికాంతపుంగవుకంఠంబు = శాకద్వీపాధిపతియైన నీరాజశ్రేష్ఠునియొక్క కంఠమును; కట్టుము = బంధింపుము. అనఁగా నీశాకద్వీపాధిపతిని వరించితివేని పాలకడలియందలి క్రీడలును, అచట శయనించి యుండు శ్రీమహా విష్ణుమూర్తియొక్క దర్శనములును, ఫలపుష్పదళాదులచే నిండియుండు వనంబులయందలి విహారములును, పూర్వపర్వ తమునందుండు కిన్నరస్త్రీరత్నముల స్నేహములును నీకు ఘటిల్లు నని భావము.

మ. అని యాశాంకరి వల్క ముంగలికి వే◊గారూఢిచే నేగున
వ్వనజాస్యామణి దృష్టి తన్నృపతిని◊ర్వాంఛావిధిం దెల్పఁ జ
య్యనఁ దద్యానధురీణు లంద ఱొక గో◊త్రాధీశునిం జేర, న
య్యనఘుం జూపి యపర్ణ యిట్లనియె మ◊త్స్యండీసమానోక్తులన్. 53

టీక: అని=ఈరీతిగా, ఆశాంకరి=ఆపార్వతి; పల్కన్=పలుకఁగా; ముంగలికిన్=ముందుకు; వేగారూఢిచేన్ =వేగిరపాటు యొక్క నిరూఢిచేత; ఏగునవ్వనజాస్యామణిదృష్టి – ఏగు=పోవుచున్న, అవ్వనజాస్యామణి= ఆచంద్రికయొక్క, దృష్టి= చూపు; తన్నృపతినిర్వాంఛావిధిన్ = ఆరాజునందుఁ గోరికలేమియొక్కరీతిని; తెల్పన్=తెలియఁజేయఁగా; చయ్యనన్ = త్వరగా; తద్యానధురీణు లందఱు = ఆవాహనమును మోచు శైబికులెల్లరు; ఒక గోత్రాధీశునిన్=ఒకభూపతిని; చేరన్= పొందఁగా; అయ్యనఘున్=ఆఘనుని; చూపి=ప్రదర్శించి; అపర్ణ =పార్వతి; మత్స్యండీసమానోక్తులన్ – మత్స్యండీ= శర్కరకు, సమాన=తుల్యమగు, ఉక్తులన్=వాక్యములచేత; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగ; అనియెన్= పలికెను.

శా. పాంచాలాత్మజ! గాంచు వీని దధిరూ◊పక్ష్మాపటప్రావృత
క్రౌంచద్వీపధరాధురంధరుని నీ◊రాజన్యుదానాంబు ల
ర్పించున్ వాశ్చరపాళి కెంతయు మహ◊ర్ధిన్ వానిపై నీసుతో
మించన్ బోలె నమూల్యలావణి తదు◊న్మేషంబు గూల్చున్ గడున్. 54

టీక: పాంచాలాత్మజ =చంద్రికా! దధిరూపక్ష్మాపట ప్రావృత క్రౌంచద్వీప ధరాధురంధరునిన్ – దధిరూపక్ష్మాపట=పెరుఁగు మున్నీటిచే, ప్రావృత=ఆవరింపఁబడిన, క్రౌంచద్వీప= క్రౌంచద్వీపముయొక్క, ధరాధురంధరునిన్=భూభర్తయగు; వీనిన్ = ఇతనిని; కాంచు=చూడుము; ఈరాజన్యుదానాంబులు= ఈభూపతియొక్క దానోదకములు; వాశ్చరపాళికిన్=జలచరశ్రేణికి; ఎంతయున్=మిక్కిలి; మహర్ధిన్=అధికమగు వృద్ధిని; అర్పించున్=ఇచ్చును; వానిపైన్=ఆజలచరశ్రేణిపై; ఈసుతోన్=ఈర్ష్య తోడ; మించన్ బోలెన్=అతిశయించుటకువలెనె; అమూల్యలావణి=అధికమగు సౌందర్యము, ఇది కర్త; తదున్మేషంబు= ఆ వాశ్చరపాళియొక్క యభివృద్ధిని; కడున్=మిక్కిలి; కూల్చున్=పోఁగొట్టును. అనఁగ నీపద్యమందు నారాజుదానోదకములు వాశ్చరపాళి కభివృద్ధి నొనరించినను, వానికిఁ దత్సౌందర్యము మిక్కిలి యభివృద్ధిని బోఁగొట్టుట ఘటిల్లదు గావున వాశ్చర పాళి కనఁగ, వాశ్చర=మత్స్యము, పాళి=చిహ్నముగా గల మన్మథున, కున్మేషమును బోగొట్టు ననుట. ‘పాళి స్త్ర్యశ్ర్యఙ్క పఙ్త్కిషు’ అని యమరుఁడు. ఈక్రౌంచద్వీపాధిపతియొక్క దానోదకము జలచరముల కభివృద్ధిఁ జేయు ననియు, నితని సౌంద ర్యము మన్మథుని నిరసించు ననియు నభిప్రాయము.

చ. వరహరిజాత్యఖండరుచి◊వారము నొంచి మహాబ్జమండలి
న్ధరణి నడంగఁ ద్రొక్కి వని◊తామణి! యీవిభుసద్యశోవిభాం
కురహరుఁ డొప్పుఁ గుండలిత◊కుండలినేత పదాంగదంబు నై
శరదపథంబు దంత్యసుర◊చర్మమునై చెలువార నెప్పుడున్. 55

టీక: వనితామణి=చంద్రికా! ఈవిభు సద్యశో విభాంకుర హరుఁడు – ఈవిభు=ఈరాజుయొక్క,సత్=శ్రేష్ఠమగు, యశః=కీర్తి యొక్క, విభా=కాంతియొక్క, అంకుర=మొలకయనెడు, హరుఁడు=ఈశ్వరుఁడు; కుండలిత కుండలినేత – కుండలిత= చుట్టుకొన్న, కుండలినేత=శేషుఁడు; పదాంగదంబు నై =పాదమునకు నందియ యైనవాఁడై; శరదపథంబు=మిన్ను; దంత్య సురచర్మమునై = గజాసురునియొక్క చర్మమైనదై; చెలువారన్=ప్రకాశింపఁగ; ఎప్పుడున్=ఎల్లప్పుడు; వర హరిజాత్యఖండ రుచివారమున్ – వర=శ్రేష్ఠుఁడగు,హరిజ=మన్మథునియొక్క, అత్యఖండ=అఖండమైన,రుచివారమున్=కాంతిపుంజమును; నొంచి=నొప్పించి; వర=శ్రేష్ఠమగు, హరిజాతి=సింహజాతియొక్క, అఖండరుచివారము నొంచి యను నర్థము దోఁచుచున్నది; మహాబ్జమండలిన్ – మహత్=అధికమగు, అబ్జమండలిన్=చంద్రమండలమును, తెల్లదామరగుంపు ననియు దోఁచుచున్నది;ధరణిన్=భూమియందు; అడంగఁ ద్రొక్కి=అడఁగునటులు ద్రొక్కి; ఒప్పున్=ప్రకాశించును.

అనఁగా నీక్రౌంచద్వీపాధిపతియశోంకురము, ఆదిశేషుఁడు పాదకటకముగాను, ఆకాశము గజచర్మముగాను జెలంగఁగా, హరిజాతిరుచిని జయించి అబ్జమండలము ద్రొక్కి శివునివలెఁ బ్రకాశించునని భావము. శివుఁడుదక్షాధ్వరధ్వంసమునందుఁ జంద్రుని త్రొక్కినాఁడనుట పురాణప్రసిద్ధము. ఇతని యశస్సు బ్రహ్మాండ మంతయు వ్యాపించిన దనుట ముఖ్యాశయము.

మ. సరసీజోపమగంధి! సంతతము క్రౌం◊చద్వీపసంవాసి శం
కరపూజాగతి మించెనా నలరు ని◊క్కం బీనృపాలుండు శం
కరభావమ్మున సద్గణావృతియు రం◊గద్భూతియు న్విద్విష
త్పురసంభేదనవృత్తియు న్సమగుణ◊స్ఫూర్తి న్విజృంభింపఁగన్. 56

టీక: సరసీజోపమగంధి=పద్మగంధమువంటి మేనిగంధముగల చంద్రికా! ఈనృపాలుండు=ఈభూపతి;సంతతము=ఎల్లపుడు; క్రౌంచద్వీపసంవాసి శంకర పూజా గతిన్ – క్రౌంచద్వీపసంవాసి=క్రౌంచద్వీపమందు నివసించునట్టి, శంకర=శివునియొక్క, పూజా = అర్చనముయొక్క, గతిన్=ప్రాప్తిచేత; శంకరభావమ్మునన్=శివత్వముచేత, సుఖకరస్వరూపముచేత నని నరపతి పరమగు నర్థము; మించెనాన్=అతిశయించెనో యనునట్లు; సద్గణావృతియున్ – సత్=సత్పురుషులయొక్క,గణ= సమూ హముచేత, ఆవృతియున్ = కూడికయును, ప్రమథగణములయొక్క కూడికయు నని శివపరమైన యర్థము; రంగద్భూతి యున్ – రంగత్=ప్రకాశించుచున్న, భూతియున్=ఐశ్వర్యమును, ప్రకాశించుచున్న భస్మము నని శివపరమగు నర్థము, ‘భూతి ర్భస్మని సంపది’ అని యమరుఁడు; విద్విష త్పుర సంభేదనవృత్తియున్ – విద్విషత్=శత్రువులయొక్క, పుర=శరీర ములయొక్క, సంభేదనవృత్తియున్=వ్రక్కలించునట్టి వ్యాపారమును; విద్విషత్=శత్రువులగుచున్న, పుర=త్రిపురముల యొక్క, సంభేదనవృత్తియు నని శివపరమైన యర్థము; సమగుణస్ఫూర్తిన్ – సమ=సమానమగు, గుణ=గుణముయొక్క, స్ఫూర్తిన్ =అతిశయముచేత; విజృంభింపఁగన్=ప్రకాశింపఁగ; అలరున్=ప్రకాశించును; నిక్కంబు=సత్యము.

అనఁగ క్రౌంచద్వీపాధిపతి యగు నీనృపాలుఁడు శివపూజామహిమవలన శివభావము నొంది సద్గణావృతియు, భూతియు, విద్విషత్పురసంభేదనవృత్తియుఁ బొందెనో యనునట్లు ప్రకాశించు నని భావము.

చ. అవిరళరత్నకూటముల ◊హారిమహాసుమనోవితానవై
భవములఁ బొల్చు క్రౌంచగిరి ◊బంధురనూతనబంధుజీవబాం
ధవరదనాంశుకామణి! య◊నారత మింపగుఁగాక నీకుఁ బ్రో
త్సవకరకేళికాకనక◊సౌధవిధానముఁ దాల్చి యెంతయున్. 57

టీక: అవిరళరత్నకూటములన్ – అవిరళ=సందులేని, రత్న=మణిమయములగు, కూటములన్=శిఖరములచేత; హారిమహా సుమనోవితానవైభవములన్ – హారి=మనోహరమగు, మహత్=అధికమగు, సుమనోవితాన=పూగుంపులయొక్క, వైభవ ములన్=విభవములచేత; పొల్చు క్రౌంచగిరి = ఒప్పుచున్న క్రౌంచపర్వతము; బంధుర నూతన బంధుజీవ బాంధవ రదనాంశుకా మణి – బంధుర=దట్టమగు, నూతన=నవీనమగు, బంధుజీవ=జపాకుసుమమునకు, బాంధవ=సమానమగు, బాంధవ సగోత్ర జ్ఞాతి బంధ్వాదిశబ్దములు ఇవార్థకములని చెప్పఁబడియున్నది, రదనాంశుకా= దంతచ్ఛదములుగల కాంతలలో, మణి=రత్న తుల్యవగు నోచంద్రికా! నీకున్; ప్రోత్సవకర కేళికా కనకసౌధ విధానము – ప్రోత్సవకర=వేడుకను చేయునట్టి, కేళికా=విలాసార్థ మగు, కనకసౌధ=బంగరుమేడయొక్క, విధానము=రీతని; తాల్చి=ధరించి; ఎంతయున్=మిక్కిలి; అనారతము=ఎల్లపుడు; ఇంపగుఁగాక = ఆనందకరమగుఁగాక.

అనఁగ నీక్రౌంచద్వీపమునందుండు క్రౌంచపర్వతము రత్నమయకూటములచే, మనో హరపుష్పకదంబములచే నొప్పినదై నీకుఁ గ్రీడాసౌధమురీతిని ధరించి ప్రకాశించు నని భావము.
వ. అని యయ్యిందుధరసుందరి యెఱింగింప నన్నృపపురందరునిపై నక్కుందరదన డెందంబు పొందు పడ కున్కి తెలిసి, యానధుర్యు లమందరయంబున వేఱొక్కమహీశకందర్పుఁ జేరం జన నందు నతనిం జూపి యాగోత్రధరపుత్త్రి తన్మేచకశతపత్రసగోత్రనేత్ర కిట్లనియె. 58

టీక: అని=ఈప్రకారముగా; అయ్యిందుధరసుందరి= ఆచంద్రశేఖరుని (శివుని) పత్నియగు పార్వతి; ఎఱింగింపన్ =తెల్పఁగా; అన్నృపపురందరునిపైన్= ఆరాజేంద్రునిమీఁద; అక్కుందరదన డెందంబు=మొల్లలవంటి పలువరుస గల యాచంద్రికయొక్క చిత్తము; పొందు పడ కున్కి=పొందకయుండుటను; తెలిసి=తెలిసికొని; యానధుర్యులు=పల్లకిని మోయువారలు; అమంద రయంబునన్=అతివేగముచేత; వేఱొక్కమహీశకందర్పున్= వేఱొక రాజమన్మథుని; చేరన్ చనన్= చేరునట్లు పోఁగా; అందు = ఆస్థలమందు; అతనిం జూపి=ఆరాజును జూపెట్టి; ఆగోత్రధరపుత్త్రి=ఆహిమవంతుని కొమార్తె యగు పార్వతి; తన్మేచకశతపత్ర సగోత్రనేత్రకున్= నల్లదామరలవంటి కన్నులగల యాచంద్రికతో; ఇట్లనియెన్=వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.

చ. నెలఁత! కుశాంతరీపధర◊ణీరమణీంద్రుఁడు వీఁడు వీనియౌ
దలపయి నుంచు మీవు కర◊తామరసార్జితమౌక్తికాళి ని
య్యలఘుఁడు మారవీరవిశి◊ఖౌఘవిలోడితచిత్తధైర్యుఁడై
దలఁచుఁ జుమీ నిరంతరము ◊త్వత్కుచదుర్గము లాశ్రయింపఁగన్. 59

టీక: నెలఁత=చంద్రికా! వీఁడు =ఈరాజు; కుశాంతరీపధరణీరమణీంద్రుఁడు=కుశద్వీపము నేలు భూభర్త; వీనియౌదలపయిన్ = వీనిశిరముమీఁద; ఈవు=నీవు; కరతామర సార్జిత మౌక్తికాళిన్ – కరతామరస=కేలుదామరచే, ఆర్జిత=గ్రహింపఁబడిన, మౌక్తి కాళిన్=ముత్యములపేరును; ఉంచుము=ఉనుచుము; ఇయ్యలఘుఁడు=ఈఘనుఁడు;మారవీర విశిఖౌఘ విలోడిత చిత్త ధైర్యుఁ డై – మారవీర=మన్మథవీరునియొక్క, విశిఖౌఘ=బాణబృందముచేత, విలోడిత=కలఁపఁబడిన, చిత్త=హృదయముయొక్క, ధైర్యుఁడై=ధైర్యముగలవాఁడై; నిరంతరము=ఎల్లపుడు; త్వత్కుచదుర్గములు— త్వత్=నీయొక్క, కుచదుర్గములు= పాలిండ్ల నెడు కొండలను; ఆశ్రయింపఁగన్=చేరుటకు; తలఁచున్=స్మరించును; చుమీ =సత్యము.

అనఁగ చంద్రికా! వీఁడు కుశద్వీపమునకు రాజు. వీనిశిరమునందు నీకేల నుండు మౌక్తికహారము నుంచుము. ఈరాజు ఎల్ల ప్పుడును మన్మథబాణములచేఁ గుంది నీకుచములను పర్వతముల నాశ్రయింపఁగోరుచున్నాడు, నిజమని భావము.

చ. నిరుపమవిశ్రవస్తనయ◊నిగ్రహకృద్ద్రవిణాఢ్యుఁడై మహా
హరిబలసంయుతుండయి బు◊ధార్చితరామసమాఖ్య నొప్పు నీ
నరకులసార్వభౌముని మ◊నం బలర న్వరియింప మేదినీ
వరసుత! నీకు నెంచ నని◊వార్యకుశోదయ మబ్బు టబ్రమే. 60

టీక: నిరుపమ విశ్రవస్తనయ నిగ్రహ కృద్ద్రవి ణాఢ్యుఁడు ఐ – నిరుపమ=సాటిలేని, విశ్రవస్తనయ=కుబేరునియొక్క, నిగ్రహ= నిరసనమును, కృత్=చేయుచున్న, ద్రవిణ=ధనముచేత, ఆఢ్యుఁడు ఐ =ధనికుఁడైనవాఁడై; నిరుపమ=సాటిలేని, విశ్రవస్తనయ =రావణాసురునియొక్క, నిగ్రహకృత్=నిరసనమును జేయు, ద్రవిణాఢ్యుఁడు ఐ = బలముగల్గిన వాఁడయి యని శ్రీరామపర మైన యర్థము, ‘ద్రవిణం కాంచనే విత్తే, ద్రవిణం చ పరాక్రమే’ అని విశ్వము; మహా హరిబల సంయుతుండయి – మహత్=అధిక మగు, హరిబల=సింహబలముతో, సంయుతుండయి=కూడుకొన్నవాఁడై; మహత్=అధికమైన, హరిబల=వానరసేనతో, సంయుతుండయి=కూడుకొన్నవాఁడై యని శ్రీరామపరమైన యర్థము; బుధార్చిత రామసమాఖ్యన్ – బుధ=విద్వాంసులచేత, అర్చిత=మన్నింపఁబడిన, రామ=మనోహరమగు, సమాఖ్యన్=కీర్తిచేత; బుధ=దేవతలచేత, అర్చిత=పూజింపఁబడిన, రామ సమాఖ్యన్= రాముఁడను నామముచేత నని శ్రీరామపరమైన యర్థము; ఒప్పు నీనరకులసార్వభౌమునిన్ = ప్రకాశించు నీమనుజ కులచక్రవర్తిని, శ్రీరాముని; మనంబు=మానసము; అలరన్=సంతసించునటులు; వరియింపన్=కోరఁగా; మేదినీవరసుత – మేదినీవర=భూభర్తయగు క్షణదోదయునియొక్క, సుత=కూఁతురవగు చంద్రికా! భూపుత్త్రియగు సీతాదేవి యను నర్థము దోఁచుచున్నది; నీకున్; ఎంచన్=విచారింపఁగా; అనివార్యకుశోదయము – అనివార్య=నివారించుటకశక్యమగు, కుశ= కుశ ద్వీపముయొక్క, ఉదయము=ఉన్నతి; అబ్బుట=లభించుట; అబ్రమే=ఆశ్చర్యమా? కాదనుట. అనివార్యమగు కుశ=కుశుఁ డను పుత్త్రునియొక్క, ఉదయము=ఆవిర్భావము అబ్బుట చిత్రముగాదని తోఁచుచున్నది.

అనఁగా కుబేరునికన్న నెక్కుడు ధనముగలవాఁడును, సింహబలుడును, పండితశ్లాఘ్యమైనకీర్తి గలవాఁడును నగు నీకుశ ద్వీపాధిపతిని వరియింతువేని నీకు కుశద్వీప మబ్బునని భావము. రావణునిఁ బరాక్రమముచే నిగ్రహించినవాఁడును, వానరసేన గలవాఁడును, రామనామముగలవాఁడును నగు దాశరథిని వరించిన సీతాదేవికిఁ గుశుఁడను పుత్త్రుఁడు గల్గెనని యర్థాంతరము.

మ. బలజూటీమణిదీప్తిదీపకులసం◊భారాప్తయౌ జన్యమం
గళగేహాంగణవీథి వీఁడు గుణటం◊కారాఖ్యమంత్రధ్వనుల్
సెలఁగ న్సాహసలక్ష్మిఁ గూడి కరనా◊ళీకంబుల న్గూర్చుఁ బో
నలిమై నాకబలిన్ ద్విషత్కరిశిరో◊నర్ఘోరుముక్తాతతిన్. 61

టీక: వీఁడు = ఈకుశద్వీపాధిపతి; బల జూటీమణి దీప్తి దీప కుల సంభారాప్తయౌ జన్య మంగళగేహాంగణవీథిన్ – బల=సేనల యొక్క, జూటీమణి=శిరోమణులయొక్క, దీప్తి=కాంతులనెడు, దీప=దీవియలయొక్క, కుల=సమూహమనెడు, సంభార= పదార్థసంచయముచేత, ఆప్త=పొందబడినది, ఔ=అగునట్టి, జన్య=యుద్ధమనెడు, మంగళగేహ=కల్యాణగృహముయొక్క, అంగణవీథిన్=ముంగిటిభూమియందు; గుణ టంకా రాఖ్య మంత్రధ్వనుల్ – గుణ=అల్లెత్రాటియొక్క, టంకార=టంకారధ్వని యనెడు, ఆఖ్య=ప్రసిద్ధి గల, మంత్రధ్వనుల్=మంత్రముల రొదలు; చెలఁగన్=ఒప్పుచుండఁగా; సాహసలక్ష్మిన్=తెగువయనెడు లక్ష్మిని; కూడి=పొంది, వివాహమయి యనుట; నలిమైన్=యోగ్యముగా; ద్విషత్కరి శిరోనర్ఘోరు ముక్తాతతిన్ – ద్విషత్కరి= శత్రుగజములయొక్క, శిరః=తలలయందుండు, అనర్ఘ=అమూల్యములగు, ఉరు=గొప్పలగు, ముక్తా=ముత్యములయొక్క, తతిన్=సమూహముచేత;నాకబలిన్=వివాహాంగభూతమగు నాకబలి యను కృత్యమును; కరనాళీకంబులన్=కరకమలముల చేత, కరమందుండు బాణములచేత ననిగాని యర్థము; కూర్చున్=ఒనరించును; పో=సత్యము.

అనఁగ నీకుశద్వీపాధిపతి యగురాజు సైనికులయొక్క శిరోమణికాంతు లనెడు దీపములచే నలంకరింపఁబడియున్న యుద్ధభూమి యనెడు మంగళగృహమందు అనఁగా వివాహగృహమునందు అల్లెత్రాటిమ్రోత యనెడు మంత్రములు వెలయు చుండఁగ, సాహసలక్ష్మిం బెండ్లియై, శత్రుగజంబుల శిరములయం దుండు ముత్యములచే నాకబలిని జేయునని భావము.

మ. వరభోగాన్వితుఁ డీనృపాలకుఁడు ప్రో◊వన్ నిచ్చలు న్మించు స
ర్పిరపాంపత్యభివేష్టితోర్వర ధరా◊భృద్భేదిసంత్రాతని
ర్జరపుర్యుత్తమలీల నిత్యసుఖవి◊భ్రాజద్బుధశ్రేణికా
పరిషక్తిన్ హితదాయిరాజమణిసం◊ప్రాప్తిం గురంగేక్షణా! 62

టీక: కురంగేక్షణా=లేడికన్నులవంటి కన్నులు గల చంద్రికా! వరభోగాన్వితుఁడు – వర=శ్రేష్ఠమగు, భోగ=గృహము, శయ్య, ఆభరణము, వస్త్రము, పుష్పము, స్త్రీ, గంధము,తాంబూలము అను నీయెనిమిదిభోగములతో, అన్వితుఁడు=కూడినవాఁడు; ఈ నృపాలకుఁడు = కుశద్వీపాధిపతి యగు నీరాజు; ప్రోవన్=రక్షింపఁగా; సర్పిరపాంపత్యభివేష్టితోర్వర – సర్పిరపాంపతి= ఘృతసముద్రముచేత, అభివేష్టిత=చుట్టఁబడిన, ఉర్వర=భూమి; ధరాభృద్భేదిసంత్రాతనిర్జరపుర్యుత్తమలీలన్ – ధరాభృద్భేది =ఇంద్రునిచేత, సంత్రాత=రక్షింపఁబడిన, నిర్జరపురీ=అమరావతియొక్క, ఉత్తమలీలన్=శ్రేష్ఠమగు విలాసముచేత; నిత్య సుఖ విభ్రాజ ద్బుధ శ్రేణికా పరిషక్తిన్ – నిత్య=శాశ్వతమగు, సుఖ=సుఖముచేత, విభ్రాజత్=ప్రకాశించుచున్న, బుధ=విద్వాంసుల యొక్క, దేవతలయొక్క, శ్రేణికా= పంక్తియొక్క, పరిషక్తిన్=సంబంధముచేత; హితదాయి రాజమణి సంప్రాప్తిన్ – హితదాయి = హితము నొసఁగు, హితమగు దాని నొసఁగు, రాజమణి=రాజశ్రేష్ఠులయొక్క, చింతామణియొక్క, సంప్రాప్తిన్=ప్రాప్తిచేత; నిచ్చలున్=ఎల్లపుడు; మించున్=ప్రకాశించును.

అనఁగ నీకుశద్వీపాధిపతిచేఁ బోషింపఁబడుపుడమి యమరావతివలెఁ బ్రకాశించుచున్నదని భావము.

క. అని తెలుప మనం బచ్చట, మొనయమి శిబికాధరాళి ◊ముదిత నొకమహీ
శునిచెంతఁ జేర్ప శివ యి,ట్లను నావిభుఁ జూపి చెలువ ◊కమృతజిదుక్తిన్. 63

టీక: అని=ఈప్రకారము; తెలుపన్=తెలియఁజేయఁగ; మనంబు=డెందము; అచ్చటన్=ఆరాజునందు; మొనయమిన్=పూన కుండుటవలన; శిబికాధరాళి=పల్లకినిమోయువారి గుంపు; ముదితన్=చంద్రికను; ఒకమహీశునిచెంతన్=ఒకభూపాలుని సమీపమును; చేర్పన్=పొందింపఁగ; శివ=పార్వతి; ఆవిభున్=ఆరాజును; చూపి=చూపెట్టి; అమృతజిదుక్తిన్=సుధను జయించిన వచనముల చేత; చెలువకు=చంద్రికకు; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగ; అనున్=పల్కెను.

శా. ఓపద్మానన! గాంచు మీనృపతి ర◊మ్యోత్కంఠమై శాల్మలి
ద్వీపత్రాణచణుం డితం డితనివి◊ద్విట్కాంతకుత్ప్రత్నకే
ళీపిచ్ఛందకవైఖరి న్వలయశై◊లీయోరుకూటంబు లా
ళీపాళీగతి భిల్లరాడ్యువతిమౌ◊ళిశ్రేణి పొల్చున్ గడున్. 64

టీక: ఓపద్మానన=ఓచంద్రికా! ఈనృపతిన్=ఈరాజును; రమ్యోత్కంఠమైన్=మనోహరమగు సంతసముచేత; కాంచుము= చూడుము; ఇతండు=ఈరాజు; శాల్మలిద్వీపత్రాణచణుండు=శాల్మలీద్వీపమును బాలించువాఁడు; ఇతనివిద్విట్కాంతకున్ – ఈరాజుయొక్క శత్రుకాంతకు; వలయశైలీయోరుకూటంబులు – వలయశైలీయ=చక్రవాళపర్వతసంబంధులగు, ఉరు=అధి కములగు, కూటంబులు=శిఖరములు; ఉత్ప్రత్నకేళీపిచ్ఛందకవైఖరిన్ – ఉత్=ఉన్నతమైన, ప్రత్న=పురాతనమగు, కేళీ పిచ్ఛందక=క్రీడాగృహముయొక్క, వైఖరిన్=రీతిని; భిల్లరాడ్యువతిమౌళిశ్రేణి =ఎఱుకుదొరలయొక్క స్త్రీసమూహము; ఆళీ పాళీగతిన్=సకియలగుంపురీతిని; కడున్=మిక్కిలి; పొల్చున్=ఒప్పును. అనఁగ నీశాల్మలీద్వీపాధిపతియొక్క శత్రుస్త్రీలకు మేడలు లోకాలోకపర్వతము లనియు, వారికి సకియలు ఎఱుకుస్త్రీ లనియును భావము.

మ. కలుమున్నీ రనుపెన్కొలంకునడుమ ◊న్గన్పట్టి వీఁ డేలు శా
ల్మలికాద్వీపము శ్రీయుతిం దనరుఁ గొ◊మ్మా! తమ్మి నా మధ్యసం
స్థలి జ్యోతిర్లతికాఖ్యకేసరవృతో◊ద్యత్కర్ణికాస్ఫూర్తి రా
జిల ద్రోణాద్రి తదగ్రగాభ్ర మళిరా◊జిస్థేమఁ జూపట్టఁగన్. 65

టీక: కొమ్మా=చంద్రికా! వీఁ డేలు శాల్మలికాద్వీపము =ఈరాజు పాలించు శాల్మలిద్వీపము; కలుమున్నీరనుపెన్కొలంకు నడుమన్ = సురాసముద్రమనెడు పెద్దమడుఁగునడుమ; కన్పట్టి=కనిపించి; ద్రోణాద్రి=ద్రోణపర్వతము; మధ్యసంస్థలి జ్యోతిర్లతి కాఖ్య కేసర వృతోద్యత్కర్ణికా స్ఫూర్తి న్ – మధ్యసంస్థలి=మధ్యప్రదేశమందలి, జ్యోతిర్లతికా=జ్యోతిర్లత లనెడు, ఆఖ్య=పేరు గల, కేసర=కింజల్కములచేత, వృత=ఆవరింపఁబడిన, ఉద్యత్=ప్రకాశించుచున్న, కర్ణికా=తామరదుద్దుయొక్క,స్ఫూర్తిన్ = అతిశయముచేత; రాజిలన్=ప్రకాశింపఁగ; తదగ్రగాభ్రము = దానిపై నున్నట్టిమబ్బు; అళిరాజిస్థేమన్=భృంగసమూహాకృతి చేత; చూపట్టఁగన్=కనిపింపఁగా; తమ్మి నాన్ = కమలమో యనునట్లు; శ్రీయుతిన్=కాంతితోఁ గూడుటచేతను, లక్ష్మితోఁ గూడుటచేత ననియుఁ దోఁచుచున్నది; తనరున్=ప్రకాశించును.

అనఁగా సురాసముద్ర మనెడుగొప్పకొలనునడుమఁ గాన్పించు నీశాల్మలీద్వీపమునడుమ జ్యోతిర్లతిక లనుకేసరములతోఁ జేరియున్న ద్రోణాద్రి తామరదుద్దువలె నుండఁగ, నాపర్వతముమీఁద నున్న మేఘము భృంగరాజివలె నుండఁగ, గొప్పమడుగు నందు భృంగరాజితోఁ జేరియున్న కమలమువలె నాద్వీపము ప్రకాశించు నని భావము. సముద్రమధ్యగతద్వీపమును హ్రద మధ్యగతకమలముగా నుత్ప్రేక్షించుటచే నుత్ప్రేక్షాలంకారము.

మ. తరుణీ! వీనియశోవదాతశుక ము◊ద్యచ్ఛక్తి మిన్నొంది బం
ధురతారాకులగోస్తనీఫలములం ◊దోడ్తో భుజింప న్విభా
వరి తద్దైన్యముఁ జెంద దేతదతిదీ◊ వ్యజ్జైత్రభేరీరవో
త్కరఫక్కద్ద్రుహిణాండకర్పరగళ◊ద్బాహ్యాంబుబిందుచ్ఛటన్. 66

టీక: తరుణీ=చంద్రికా! వీనియశోవదాతశుకము = ఈశాల్మలీద్వీపాధిపతియొక్క యశస్సనెడు తెల్లని చిలుక; ఉద్యచ్ఛక్తిన్ =మీఁది కెగయుచున్న శక్తిచేత; మిన్నొంది=ఆకాశమును పొంది; బంధురతారాకులగోస్తనీఫలములన్ – బంధుర=ఎడములేని, తారాకుల=రిక్కలగుంపనెడు, గోస్తనీఫలములన్=ద్రాక్షాఫలములను; తోడ్తోన్ =వెంటనె; భుజింపన్=తినఁగా; విభావరి=రాత్రి; ఏత దతిదీవ్య జ్జైత్రభేరీ రవోత్కర ఫక్క ద్ద్రుహిణాండ కర్పర గళ ద్బాహ్యాంబు బిందు చ్ఛటన్ – ఏతత్=ఈశాల్మలీద్వీపాధిపతి యొక్క, అతిదీవ్యత్=మిక్కిలి ప్రకాశించుచున్న, జైత్రభేరీ=జయభేరియొక్క, రవోత్కర=శబ్దబృందముచేత, ఫక్కత్=పగి లిన, ద్రుహిణాండ=బ్రహ్మాండముయొక్క, కర్పర=పుఱ్ఱెవలననుండి, గళత్=జాఱుచున్న, బాహ్యాంబు=బ్రహ్మాండమునకు వెలుపలనుండు జలముయొక్క, బిందు=బిందువులయొక్క, ఛటన్=సమూహముచేత; తద్ధైన్యము—తత్=ఆనక్షత్రముల యొక్క, హైన్యము=శూన్యతను; చెందదు=పొందదు.

అనఁగ నీశాల్మలీద్వీపాధిపతియొక్క యశ మనెడు తెల్లనిచిలుక మిన్నొంది నక్షత్రము లనెడి ద్రాక్షాఫలములను తినినను, రాత్రి వీని జయభేరీనినాదములవలన బ్రహ్మాండకర్పరము పగిలి స్రవించు జలబిందుసందోహముచే రిక్కలయొక్క లేమిని జెందదని భావము. యశమును శుకమునుగా, రిక్కలను ద్రాక్షాఫలములనుగా, జలబిందువులను రిక్కలనుగా వర్ణించుటచేత రూపకాలంకారము.

ఉ. ఈవసుధేశుఁ గూడి హరి◊ణేక్షణ! నీవు ముదంబు నిక్క వే
లావనవాటికావిహృతు◊లం జరియించుచు మించువేళ నీ
మై వలగొన్న సంశ్రమస◊మాజము దూలఁగఁ బొల్చుఁ గాక హా
లావనరాశివాᳲకణకు◊లస్థగితానిలపోతజాతముల్. 67

టీక: హరిణేక్షణ=లేడికన్నులవంటి కన్నులుగల యోచంద్రికా! ఈవసుధేశున్=ఈశాల్మలీద్వీపాధిపతిని; కూడి=కలసికొని; నీవు; ముదంబు=సంతసము; నిక్కన్=అతిశయింపఁగా; వేలా వన వాటికా విహృతులన్ – వేలా=చెలియలికట్టయొక్క, వన= అడవియొక్క, వాటికా=పంక్తులయందు, విహృతులన్=విహారములచేత; చరియించుచున్=క్రుమ్మరుచు; మించువేళన్=అతి శయించుసమయమందు; నీమైన్=నీశరీరమునందు;వలగొన్న సంశ్రమసమాజము – వలగొన్న=చుట్టుకొన్న, సంశ్రమ=శ్రమల యొక్క, సమాజము=సమూహము; తూలఁగన్=పోవునట్లు; హాలావనరాశి వాᳲకణ కుల స్థగి తానిలపోత జాతముల్ – హాలా వనరాశి=సురాసముద్రముయొక్క, వాᳲకణ=నీటిబిందువులయొక్క, కుల=సమూహముచేత, స్థగిత=కప్పఁబడిన,అనిలపోత = మందమారుతములయొక్క, జాతముల్=సమూహములు; పొల్చుఁ గాక=ఒప్పుఁగాక.

ఓచంద్రికా! నీవు శాల్మలీద్వీపాధిపతిని గూడి వేలావనవిహారమును చేయుచుండుతఱి నీశరీరశ్రమను కలుమున్నీటి నీటి తుంపరలతోఁ గూడిన తెమ్మెరలు తొలఁగఁజేయునని భావము.

వ. అని యప్పంచాస్యపంచాస్యమధ్య యెఱింగించిన నాకాంచనాంగినేత్రాంచలం బతనిపైఁ బ్రవర్తింప దయ్యె, నది యెఱింగి వేఱొక్క మహీశపుంగవుఁ జేర నియోగించి యారాజేంద్రుం జూపి యన్నెలఁత కన్నెలతాల్పువేల్పు పట్టపుదేవి యిట్లనియె. 68

టీక: అని=ఈప్రకారముగఁ బలికి; అప్పంచాస్యపంచాస్యమధ్య– పంచాస్య=ఈశ్వరునియొక్క,పంచాస్యమధ్య=సింహము వంటి నడుముగల కాంత, అనఁగా శివకాంతయైన సన్ననినడుముగల పార్వతీదేవి; ఎఱింగించినన్=తెలియఁజేయఁగా; ఆకాంచ నాంగినేత్రాంచలంబు= ఆచంద్రికయొక్క కటాక్షము; అతనిపైన్=ఆశాల్మలిద్వీపాధిపతిమీఁద; ప్రవర్తింప దయ్యెన్=ప్రసరింప దాయెను; అది యెఱింగి = అది తెలిసి; వేఱొక్క మహీశపుంగవున్=మఱొక రాజశ్రేష్ఠుని; చేరన్=సమీపించునటులు; నియో గించి=ఆజ్ఞాపించి; ఆరాజేంద్రుం జూపి; అన్నెలఁతకున్=ఆచంద్రికకు; అన్నెలతాల్పువేల్పు పట్టపుదేవి=చంద్రుని ధరించిన శివునకుఁ బట్టపుదేవి యగు నా పార్వతీదేవి; ఇట్లు=వక్ష్యమాణప్రకారము; అనియెన్=పలికెను.

మ. అరిజన్యాంబుధిసంభవజ్జయరమా◊హాసాంకురత్కీర్తి నీ
శరజాస్త్రోపమమూర్తిఁ గాంచు చెలి! ప్ల◊క్షద్వీపభూభర్త స
ప్తరసాభృద్ధరణీయయై పొదలు గో◊త్రం దాల్చు నీమేటి భా
స్వరదోర్యష్టిభుజాంగదాగ్రఖచితాం◊చచ్ఛక్రనీలోపధిన్. 69

టీక: చెలి=చంద్రికా!అరి జన్యాంబుధి సంభవ జ్జయరమా హాసాంకుర త్కీర్తిన్ – అరి=శత్రువులయొక్క, జన్య=యుద్ధమనెడు, అంబుధి=సముద్రమందు, సంభవత్=జన్మించిన, జయరమా=జయలక్ష్మియొక్క,హాసాంకురత్=చిఱునగవువలెనాచరించు చున్న, కీర్తిన్=యశముగల; ప్లక్షద్వీపభూభర్త న్=ప్లక్షద్వీపాధిపతియగు; ఈశరజాస్త్రోపమమూర్తిన్=జలజాస్త్రుఁడగు మరు నికి సమానమగు దేహముగల వీనిని; కాంచు=చూడుము; ఈమేటి=ఈఘనుఁడు; సప్తరసాభృ ద్ధరణీయయై—సప్తరసాభృత్ =సప్తకులాచలములచేత, ధరణీయయై=ధరింపఁదగినదియై; పొదలు గోత్రన్=వృద్ధిఁబొందుచున్న భూమిని; భాస్వర దోర్యష్టి భుజాంగ దాగ్ర ఖచితాంచ చ్ఛక్రనీలోపధిన్—భాస్వర=ప్రకాశించుచున్న, దోర్యష్టి=భుజదండములయొక్క, భుజాంగద= కేయూరములయొక్క, అగ్ర=చివరయందు,ఖచిత=చెక్కఁబడిన, అంచత్=ప్రకాశించుచున్న,శక్రనీల=ఇంద్రనీలమణియొక్క, ఉపధిన్= వ్యాజముచేత; తాల్చున్=ధరించును. అనఁగ నీప్లక్షద్వీపాధిపతి సప్తకులాచలములు మోయుచున్న భూమిని తన బాహుపురి యందలి చెక్కియున్న యింద్రనీలమణి యను వ్యాజముచే ధరించి యున్నాఁడని భావము. భూమి నల్లని దనుటకు విష్ణుమూర్తి వక్షమునందు ధరియించియున్న కస్తురిని లక్ష్మీదేవి సమీపమందు భూదేవిని బ్రీతితో నుంచెనా యనునటులు మను చరిత్రయం దుత్ప్రేక్షింపఁబడియున్నది.

మ. అనిశంబు న్బుధవర్ణ్యకల్పతరుదీ◊వ్యద్వాసనాలబ్ధిఁ జే
కొని యద్వైతరుచిం గరంబు మను నీ ◊క్షోణీస్థలాధీశవ
ర్యునికీర్తిప్రకరంబు మించ సకి! యో◊హో పూర్వపక్షావలం
బనత న్రాజిలు నట్టిధ్వాంతపరధా◊మం బెచ్చునే యెచ్చటన్. 70

టీక: అనిశంబున్=ఎల్లప్పుడు; బుధ వర్ణ్య కల్పతరు దీవ్య ద్వాసనా లబ్ధిన్ – బుధ=దేవతలచేత, వర్ణ్య=వర్ణింపఁదగిన, కల్ప తరు= కల్పవృక్షములయొక్క, దీవ్యత్=ప్రకాశించుచున్న, వాసనా=వలపుయొక్క,లబ్ధిన్=ప్రాప్తిని; చేకొని=గ్రహించి; అద్వైతరుచిన్ =అద్వితీయమగుకాంతిచేత; కరంబు=మిక్కిలి; మను నీ క్షోణీస్థలాధీశవర్యునికీర్తిప్రకరంబు – మను=వృద్ధిఁ బొందుచున్న, ఈ క్షోణీస్థలాధీశవర్యుని=ఈరాజశ్రేష్ఠునియొక్క, కీర్తిప్రకరంబు=కీర్తిపుంజము; మించన్=అతిశయింపఁగా; ఓహో సకి=ఓహో చంద్రికా! పూర్వపక్షావలంబనతన్=అపసిద్ధాంతము ఆశ్రయముగాఁ గల్గుటచేత; రాజిలు నట్టిధ్వాంతపర ధామంబు – రాజిలునట్టి=ప్రకాశించునట్టి; ధ్వాంతపర=చంద్రునియొక్క, ధామంబు=తేజము; ఎచ్చటన్=ఏప్రదేశమునందైన, ఎచ్చునే=అతిశ యించునా? ఇచట, అనిశంబున్=ఎల్లప్పుడు; బుధ=విద్వాంసులచేత,వర్ణ్య=పొగడఁదగిన, కల్పతరు= కల్ప తరువను వేదాంతగ్రంథముయొక్క, దీవ్యత్=ప్రకాశించుచున్న, వాసనా=అనుభూతస్మృతియొక్క,లబ్ధిన్=ప్రాప్తిని; చేకొని= గ్రహించి; అద్వైతరుచిన్ =బ్రహ్మాత్మైక్యమందలి యాసక్తిచేత; మను=అతిశయించు, కీర్తిప్రకరంబు, పుల్లింగస్వారస్యమువలన నొక పురుషుఁ డని తోఁచుచున్నది; మించన్=అతిశయింపఁగ, పూర్వపక్షావలంబనతన్ –పూర్వపక్ష=అపసిద్ధాంతము, అవ లంబనతన్=ఆశ్రయముగాఁ గల్గుటచేతను; రాజిలు నట్టిధ్వాంతపరధామంబు – రాజిలునట్టి =ప్రకాశించునట్టి, ధ్వాంతపర ధామంబు = ‘ధ్వః అన్తే యస్య సః ధ్వాన్తః’ అనఁగా ధ్వశబ్ద మంతమందుఁగల మాధ్వశబ్ద మర్థము, తద్వాచ్యులు=ద్వైతులు, అట్టి ద్వైతులయొక్క, పరధామంబు=ముఖ్యమగు సిద్ధాంతము; ఎచ్చునే=అతిశయించునా? అతిశయింపదని భావము. ధ్వాంత=అజ్ఞానముయొక్క, ధామం బెచ్చునే అనియు చెప్పఁబడును.

అనఁగ నోచంద్రికా! ప్లక్షద్వీపాధిపతియొక్క కీర్తి పుంజము కల్పతరుకాంతితో నేకీభవించినకాంతి గలదై మించఁగ శుక్లపక్షమందుండు చంద్రునితేజము హెచ్చునా? హెచ్చదని భావము.

అద్వైతసిద్ధాంతపరులగు విద్వాంసులచేఁ బ్రశంసింపఁబడిన కల్పతరువను వేదాంతగ్రంథముయొక్క మననాదులచే నుదయించిన వాసనను చేకొని బ్రహ్మాత్మైక్యానుసంధానముచే విజృంభించు విద్వాంసుఁ డతిశయింపఁగ పూర్వపక్షమతము నవలంబించి యున్న మాధ్వసిద్ధాంతము హెచ్చదని ధ్వని.

చ. సరససితోపమాధర! ర◊సాలపయోనిధిరాజవేష్టితో
ర్వర కధినేత నీపతి న◊వారితవైభవశాలి నీమహీ
శ్వరు నవలాలసాతిలక◊వల్లిక చయ్యనఁ బల్లవింప స
త్వరగతిఁ గాంచవే నయన◊వారిరుహాంతమునం బ్రియంబునన్. 71

టీక: సరససితోపమాధర—సరస=మనోజ్ఞమగు, సిత=చక్కెరతో, ఉపమా=పోల్కిగల, అధర=ఓష్ఠముగల చంద్రికా! రసాలపయోనిధిరాజ వేష్టి తోర్వరకున్ – రసాలపయోనిధిరాజ=ఇక్షుసముద్రరాజుచేతను, వేష్టిత=వలగొనఁబడిన, ఉర్వ రకున్ =భూమికి; అధినేతన్=ఒడయని; ఈపతిన్=ఈరాజును; అవారితవైభవశాలిన్ – అవారిత=అనివార్యమగు, వైభవ= విభవముచేత, శాలిన్=ప్రకాశించుచున్నవాని; ఈమహీశ్వరున్=ఈప్లక్షద్వీపాధిపతిని; నవ లాలసా తిలకవల్లిక – నవ= నూతనమైన, లాలసా=వేడుకయనెడు,తిలకవల్లిక=బొట్టుగుతీఁగ; చయ్యనన్=శీఘ్రముగా; పల్లవింపన్=చిగిరించునటులు; నయనవారిరుహాంతమునన్ – నయనవారిరుహాంతమునన్=కమలములవంటి నేత్రములయొక్కకొనలచేత, అనఁగాఁ దమ్ముల వంటి కన్నులయొక్క కడగంటిచూపులచేత; ప్రియంబునన్ =ప్రేమతో; సత్వరగతిన్=అతిశీఘ్రముగ; కాంచవే =చూడుమా!

ఓచంద్రికా! ఇక్షుసముద్రముచేఁ జుట్టఁబడియున్నట్టి పుడమి కధిపతి యగు నీరాజును వేడుకయను తిలకలత పల్లవించు నటు లతివేగముగా నేత్రాంతముచే నవలోకింపుమని భావము. స్త్రీదృష్టిచే బొట్టుగు చిగిరించునని కవిసమయము.

వ. అని యిట్టు లాగట్టుదొరపట్టి వివరించిన నారాచపట్టి యాదిట్టపై వైరాగ్యంబు దెలుపు చిన్నినవ్వు నవ్వ, నవ్వనిత దరహాసచంద్రిక తదీయసంతాపకారణంబై ప్రవర్తిల్లె నంత యానావలంబకకదంబంబు జంబూద్వీపభూపాలలోకంబుఁ జేర్ప నన్నగాధిరాజకుమారి యోనారి నేరెడుదీవియరాజులు వీరు వీరిలో నొక్కరాజకుమారునిపైఁ జూపు నిలుపు మమ్మహాత్మునిగుణంబులు వర్ణించెద నని యానతిచ్చిన నాకాంత యఖిలదేశనాయకగుణశ్రవణకౌతూహలపూర్యమాణస్వాంతయై శాలీనతాభరంబున నూరకుండెనది యెఱింగి సర్వమంగళ యక్కురంగనేత్ర కందఱం దెలుపునదియై వారిలో నొక్కరాజుం జూపి యిట్లనియె.

టీక: అని యిట్టులు=ఈప్రకారముగ; ఆగట్టుదొరపట్టి=హిమవత్పుత్త్రికయగు నాపార్వతీదేవి; వివరించినన్=వక్కాణింపఁగ; ఆరాచపట్టి=ఆరాజపుత్త్రి(చంద్రిక); ఆదిట్టపైన్=ఆప్లక్షద్వీపాధిపతిమీఁద; వైరాగ్యంబు=అనురాగాభావమును; తెలుపు చిన్ని నవ్వున్= తెలియఁజేయు చిఱునగవును; నవ్వన్=నవ్వఁగా; అవ్వనిత దరహాసచంద్రిక – అవ్వనిత =ఆచంద్రికయొక్క, దర హాసచంద్రిక=చిఱునగవువెన్నెల; తదీయసంతాపకారణంబై – తదీయ=ఆప్లక్షద్వీపాధిపతియొక్క, సంతాప=పరితాపము నకు, కారణంబై=హేతువై; ప్రవర్తిల్లెన్=ప్రవర్తించెను; అంతన్=అటుమీఁద; యానావలంబకకదంబంబు=పల్లకిమోయువారి యొక్కగుంపు; జంబూద్వీపభూపాలలోకంబున్= నేరేడుదీవియందుండు పుడమిఱేడులగుంపును; చేర్పన్=పొందింపఁగ; అన్నగాధిరాజకుమారి=హిమవంతునకు కూఁతురగు నాపార్వతీదేవి; ఓనారి=ఓచంద్రికా! వీరు నేరెడుదీవియరాజులు =వీరు జంబూద్వీపమున నుండు రాజులు; వీరిలోన్=ఈరాజులలో; ఒక్క రాజకుమారునిపైన్= ఒకరాజపుత్త్రునిమీఁద; చూపు = దృష్టిని; నిలుపుము=ఉంచుము; అమ్మహాత్మునిగుణంబులు=ఆమహానుభావుని శౌర్యాదిగుణములను; వర్ణించెదను= నుతిం చెదను; అని=ఇట్లనుచు; ఆనతిచ్చినన్=సెలవీయఁగా; ఆకాంత=ఆచంద్రిక; అఖిలదేశనాయక గుణ శ్రవణ కౌతూహల పూర్య మాణ స్వాంతయై –అఖిలదేశనాయక=సమస్తదేశాధిపతులయొక్క,గుణ=శౌర్యాదిగుణములయొక్క,శ్రవణ=వినుటయందు ,కౌతూహల = సంతసముచేత, పూర్యమాణ=నింపఁబడిన, స్వాంత యై=చిత్తముగలదై; శాలీనతాభరంబునన్=లజ్జాభారము చేత; ఊరకుండెన్=ఏమనకయుండెను; అది యెఱింగి =అది తెలిసికొని; సర్వమంగళ=పార్వతీదేవి; అక్కురంగనేత్రకున్= ఆచంద్రికకు; అందఱం దెలుపునదియై=ఎల్లరను దెలియఁజేయునదియై; వారిలోన్=ఆరాజులలో; ఒక్కరాజున్=ఒకభూభర్తను; చూపి =ప్రదర్శించి; ఇట్లు = వక్ష్యమాణప్రకారముగ; అనియెన్=పలికెను.

చ. పొలఁతుక! గౌడదేశనర◊పుంగవుఁ డీతఁడు, వీనిఁ గాంచు, మి
య్యలఘుఁడు నిత్యసద్గుణచ◊యస్ఫురణన్ శుభకీర్తిపుత్రికా
వలి నటియింపఁ జేయుఁ గడు ◊వాగ్రమణాండము లెల్లఁ గంచుకుం
డలగతిఁ బాయ కూని భ్రమ◊ణక్రమణంబులు చక్కఁ జేకొనన్. 73

టీక: పొలఁతుక=చంద్రికా! ఈతఁడు=ఈరాజు; గౌడదేశనరపుంగవుఁడు=గౌడదేశాధిపతి; వీనిన్=ఈరాజును; కాంచుము= చూడుము; ఇయ్యలఘుఁడు =ఈఘనుఁడు; నిత్య సద్గుణ చయ స్ఫురణన్ – నిత్య=ఎల్లపుడు, సద్గుణ=దానదాక్షిణ్యాది గుణములయొక్క, త్రాళ్ళయొక్క యని యర్థాంతరము, చయ=సమూహముయొక్క, స్ఫురణన్=ప్రకాశముచేతను, చల నముచేత నని యర్థాంతరము; శుభ కీర్తిపుత్రికావలిన్—శుభ=సుందరములైన, కీర్తిపుత్రికా=కీర్తి యనెడు బొమ్మలయొక్క, ఆవలిన్=పంక్తిని; కడున్=మిక్కిలి; వాగ్రమణాండములు=బ్రహ్మాండములను; ఎల్లన్=అన్నిటిని; కంచుకుండలగతిన్= కంచుకుండలరీతిగా; పాయక= విడువక; ఊని=గ్రహించి; అనఁగ నాట్యోపయోగి ఘటములవలె బ్రహ్మాండములను గ్రహించి యని భావము; భ్రమణక్రమణంబులు—భ్రమణ=తిరుగుటవలననైన, క్రమణంబులు=పాదవిన్యాసములను;చక్కన్=చక్కఁగా; చేకొనన్=గ్రహించునటులు; నటియింపఁ జేయున్=నాట్యము నొనరింపఁజేయును.

అనఁగా నీగౌడదేశాధిపతి బ్రహ్మాండములు కంచుకుండలుగా గ్రహించి, తనమంచిగుణము లనెడు త్రాళ్ళయొక్క చలనము చేత తనకీర్తులను బొమ్మలను భ్రమణక్రమణంబులు సేయునటులు నటింపఁజేయునని భావము. లోకములో నాట్యమందు ప్రవీ ణత గలవారు కుండలయందు నాట్య మొనరించుట ప్రసిద్ధము. ఈభూవిభునికీర్తి సమస్తబ్రహ్మాండములను వ్యాపించినదని వ్యంగ్యము. ఈపద్యమందు రూపకాలంకారము.

మ. సమిదుద్ద్యోతితహేతిభృద్దళనవి◊స్ఫారప్రభావాప్తిమై
క్షమఁ బెంపొంది యుదగ్రజిష్ణుయుతి ని◊చ్చల్ బల్ మొన ల్సూపు శం
బముపై ధాటికిఁ జయ్యన న్వెడల నీ◊క్ష్మాభర్తధామాగ్ని క
ర్యమబింబోపధి నారతిచ్చు నహర◊బ్జావాస యాత్రోవలన్. 74

టీక: సమి దుద్ద్యోతిత హేతిభృ ద్దళన విస్ఫార ప్రభా వాప్తిమైన్ – సమిత్=యుద్ధమందు,ఉద్ద్యోతిత=ప్రకాశించుచున్నట్టి, హేతి భృత్ = ఖడ్గధారులయొక్క, దళన=బ్రద్దలుచేయుటచేత, విస్ఫార=అధికమగు, ప్రభావ=మహిమయొక్క, ఆప్తిమైన్= ప్రాప్తి చేతను; సమిత్=ఇంధనములచేత,ఉద్ద్యోతిత=జ్వలించునట్టి, హేతిభృత్= అగ్నియొక్క, దళన=తిరస్కారముచేత, విస్ఫార= అధికమగు, ప్రభావ=మహిమయొక్క,ఆప్తిమైన్=ప్రాప్తి చేత, అని యర్థాంతరము; క్షమన్=భూమియందు; పెంపొంది=వృద్ధిఁ బొంది;ఉదగ్రజిష్ణుయుతిన్ – ఉదగ్ర=ఉత్కృష్టుఁడగు, జిష్ణుయుతిన్=ఇంద్రసంగతిచేతను; ఉత్కృష్టుఁడగు జయశీలునియొక్క సంబంధముచేత నని యర్థాంతరము; నిచ్చల్=ఎల్లపుడు; పల్ మొనల్=నూరంచులను, అనేకసైన్యములను; చూపు శంబము పైన్ = కనఁబఱచు వజ్రాయుధముమీఁదికి; ధాటికిన్=జైత్రయాత్రకు; చయ్యనన్=శీఘ్రముగా; వెడలన్=బయలుదేఱఁగా; ఈ క్ష్మాభర్త ధామాగ్నికిన్=ఈగౌడదేశపురాజుయొక్క ప్రతాపాగ్నికి; అహరబ్జావాస=దినలక్ష్మి; ఆత్రోవలన్=ఆమార్గములందు; అర్యమబింబోపధిన్ = సూర్యబింబమను వ్యాజముచేత; ఆరతిన్=నీరాజనమును; ఇచ్చున్=చేయును.

ఈగౌడదేశాధిపతియొక్క ప్రతాపాగ్ని పుడమి శూరనిబర్హణముచే వృద్ధి నొంది, జయశీలుని గూడి అనేకసేనలను జూపు వజ్రాయుధముమీఁదికి యుద్ధమునకు వెడలఁగా, దినలక్ష్మి మార్గమందు ప్రతాపాగ్నికి సూర్యబింబమను నెప మిడి యారతిచ్చు చున్నదని భావము. సూర్యబింబము ప్రతాపాగ్నికి నీరాజనదీప మున్నటు లున్నదని పద్యమందు వ్యంగ్యము.

చ. వనజగృహంబుల న్విడిచి ◊వారిధిరాజకుమారి యీమహీ
శనయనపద్మసీమముల ◊సంతతము న్వసియింపఁ బాడు గై
కొనిన తదాలయాళి సుమ◊కోమల! బల్ రొద నివ్వటిల్లఁగా
ననిశము మొత్తు లాడు మలి◊నాత్మకబంభరదంభభూతముల్. 75

టీక: సుమకోమల =పూవువలె మృదువైనదానా! వారిధిరాజకుమారి =లక్ష్మీదేవి; వనజగృహంబులన్=పద్మగేహములను; విడిచి=వదలి; ఈమహీశనయనపద్మసీమములన్ = ఈదొరకనుదమ్ములకొనలయందు; సంతతమున్=ఎల్లపుడు; వసి యింపన్=నివసింపఁగా; పాడు గైకొనిన తదాలయాళి = పాడుపడిన యాలక్ష్మీగృహములందు; బల్ రొద=అధికమగు కోలాహలధ్వని; నివ్వటిల్లఁగాన్=అతిశయింపఁగా; అనిశము =ఎల్లపుడు; మలినాత్మకబంభరదంభభూతముల్ – మలినా త్మక=నల్లనిదేహముగల, పాపభూయిష్ఠమగు మనముగల యను నర్థము దోఁచుచున్నది, బంభర=తుమ్మెదలను, దంభ= వ్యాజముగల, భూతముల్=పిశాచములు; మొత్తులాడున్=కొట్లాడును.

ఓచంద్రికా! లక్ష్మీదేవి తనగృహములను విడిచి యీరాజు నపాంగములయందు వసియింపఁగ నామెగృహములు పాడు పడి వానియందు ఘోరధ్వనులను జేయుచు నల్లనిశరీరములు గల తుమ్మెద లనుపిశాచము లెల్లప్పుడును గొట్లాడుచు పడి యుండు ననిభావము. రాజులనేత్రాంతములయందు కలిమినెలంత యునికియు, కమలములు లక్ష్మీనివాసము లనుటయు, నందు భృంగము లుండుటయుఁ బ్రసిద్ధము.

తే. అనిన ద్వైతార్థమునకు వే◊దాంత మనఁగ
వనితస్వాంతం బలజనేంద్రు ◊నెనయ కున్కి
వేఱొకనిచెంతఁ జేర్చి య◊వ్వెలఁది కద్రి
తనయ యారాజుఁ జూపి యి◊ట్లనియె నపుడు. 76

టీక: అనినన్=ఇట్లు చెప్పఁగా; ద్వైతార్థమునకున్=జీవాత్మ పరమాత్మలకు భేదము గలదను నర్థమునకు;వేదాంత మనఁగన్ = అద్వైతార్థప్రతిపాదకము లగు నుపనిషత్తు లనునట్లు; వనితస్వాంతంబు=చంద్రికాచిత్తము; అలజనేంద్రున్=ఆనృపతిని; ఎనయ కున్కిన్=పొందకుండుటచేత; వేఱొకనిచెంతన్=ఇంకొకరాజు సమీపమును; చేర్చి=పొందించి; అవ్వెలఁదికిన్=ఆచంద్రికకు; అద్రితనయ =పార్వతీదేవి;ఆరాజున్=ఆమథురానగరపతిని; చూపి=ప్రదర్శించి; ఇట్లు=వక్ష్యమాణప్రకారము; అనియెన్ = పలికెను; అపుడు=ఆసమయమందు, దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

అనఁగా ద్వైతార్థము అద్వైతార్థప్రతిపాదకము లగు నుపనిషత్తులయందు ఏరీతి సమన్వితము కాదో, ఆరీతిఁ జంద్రికాచిత్త మా రాజునందు లగ్నము కాలేదని భావము.

చ. రతి దళుకొత్తఁ గాంచు మథు◊రానగరీపరిపాలనక్రియో
ర్జితమతి నీమహీపతి వి◊శేషకలక్షణశోభితాస్య సం
భృతతపనీయమేఖలిక ◊నీనరపాలకఖడ్గపుత్రి న
ద్భుతగతిఁ గాంచి శత్రుతతి ◊పూను నని న్నవమోహ మాత్మలన్. 77

టీక: రతి=అనురాగము; తళుకొత్తన్=ప్రకాశించునట్లు; మధురానగరీ పరిపాలనక్రి యోర్జితమతిన్ –మథురానగరీ= మథురా పట్టణముయొక్క, పరిపాలనక్రియా=పాలనమనెడు వ్యాపారమునందు, ఊర్జితమతిన్=దృఢమగు బుద్ధిగల; ఈమహీపతిన్ =ఈరాజును; విశేషకలక్షణశోభితాస్యన్ – విశేషక=విలక్షణమగు,లక్షణ=గుఱిచేత, శోభిత=ప్రకాశించుచున్న, ఆస్యన్=వద నముగల; విశేషక=తిలకముచేతను,లక్షణ=శుభచిహ్నములచేతను, శోభిత=ప్రకాశించుచున్న, ఆస్యన్=ముఖముగల, యని యర్థాంతరము; సంభృత తపనీయ మేఖలికన్ – సంభృత = భరింపఁబడిన, తపనీయ = బంగరుయొక్క, మేఖలికన్=ఖడ్గ బంధము గల, ఒడ్డాణము గల, ‘మేఖలా ఖడ్గబంధే స్యా త్కాంచీ శైల నితమ్బయోః’ అని విశ్వము; ఈనరపాలకఖడ్గపుత్రిన్ – ఈ నరపాలక=ఈరాజుయొక్క, ఖడ్గపుత్రిన్=చూరకత్తిని; లేదా కత్తియనెడు సుతను; అనిన్=యుద్ధమునందు; శత్రుతతి=శత్రు వుల సమూహము; అద్భుతగతిన్=ఆశ్చర్యరీతిచేత; కాంచి=చూచి; ఆత్మలన్=మనములందు; నవమోహము–నవ=నూతన మగు, మోహము=మూర్ఛను, అనురాగమును; పూనున్=పొందును; కాంచు=అవలోకింపుము.
అనఁగా యుద్ధమం దీమథురాపురనరపతి ఖడ్గపుత్త్రిని జూచి శత్రుబృందము మోహమును బొందునని తాత్పర్యము.

సీ. మథురాపురీమణి◊మహనీయసౌవర్ణ,హర్మ్యసందోహవి◊హారములకు,
ననవద్యబృందావ◊నాంతాంతలతికాంత,లతికాంతహరణఖే◊లాగతులకుఁ,
గలితసారసమిత్ర◊కన్యకాకల్లోల,మాలికాపాలికా◊కేలికలకుఁ,
జారుగోవర్ధనా◊చలకందరామంది,రాళినిగూహన◊వ్యాపృతులకుఁ,

తే. దరుణచపలాయమానకై◊తకదళాప్త,కబరికాబంధ! యాకాంక్ష◊గలిగె నేని,
నీధరాధీశకులమౌళి ◊నెనయఁజేయు, మలఘులజ్జావలద్దృష్టి◊విలసనంబు. 78

టీక: తరుణచపలాయమాన కైతకద ళాప్త కబరికాబంధ – తరుణచపలాయమాన=క్రొక్కారుమెఱపువలె నాచరించుచున్న, కైతకదళ=గేదఁగిఱేకుచేత,ఆప్త=పొందఁబడిన,కబరికాబంధ=కొప్పుగల చంద్రికా! మథురాపురీమణిమహనీయసౌవర్ణహర్మ్యసందోహవిహారములకున్ – మథురాపురీ=మథురానగరముయొక్క, మణి= మణులతోఁగూడిన,మహనీయ=శ్లాఘ్యములగు, సౌవర్ణ=సువర్ణవికారములగు, హర్మ్య=మేడలయొక్క, సందోహ=సమూ హమునందలి, విహారములకున్=క్రీడలకు; అనవద్య బృందావనాంతాంత లతి కాంత లతికాంత హరణ ఖేలాగతులకున్ – అనవద్య=నిర్దుష్టములగు, బృందావనాంత =బృందావనమధ్యమందున్న, అంత=మనోహరములగు, లతికా=తీవలయొక్క, అంత=మనోహరములగు, లతికాంత= పుష్పములయొక్క, హరణ= కోయుటయందైన, ఖేలాగతులకున్=క్రీడావిధానములకు;
కలిత సారసమిత్రకన్యకా కల్లోల మాలికా పాలికాకేలికలకున్ – కలిత=ఒప్పుచున్న,సారసమిత్రకన్యకా=యమునానదియొక్క, కల్లోల=తరఁగలయొక్క,మాలికా=పంక్తులయొక్క,పాలికా=పరంపరలయందు, ‘పాళి స్త్ర్యశ్ర్యఙ్కపఙ్త్కిషు’ అని అమరుఁడు, కేలికలకున్=విహారములకు, జలక్రీడల కనుట; చారు గోవర్ధనాచల కందరామందిరాళి నిగూహన వ్యాపృతులకున్ – చారు=సుందరములగు, గోవర్ధనాచల=గోవర్ధనపర్వ తముయొక్క, కందరామందిరా=గృహములవంటి గుహలయొక్క, ఆళి=పంక్తులయందు, నిగూహన=దాఁగిలిమూఁత లనెడు, వ్యాపృతులకున్=వ్యాపారములకు; ఆకాంక్ష=కోరిక;కలిగె నేని=పుట్టినచో;ఈధరాధీశకులమౌళిన్=ఈరాజశ్రేష్ఠుని; అలఘు లజ్జా వల ద్దృష్టి విలసనంబు – అలఘు =అధికమగు, లజ్జా=సిగ్గుచేత, వలత్=చలించుచున్న, దృష్టి=చూపులయొక్క,విలసనంబు=విలాసమును; ఎనయన్ చేయుము = కలయునటులు చేయుము. అనఁగ మథురాపురసౌవర్ణసౌధములయందుఁ గలుగు క్రీడలను, బృందావనపుష్ప హరణములను, యమునానదీజలక్రీడలను, గోవర్ధనపర్వతగుహలయందు డాఁగిలిమూఁతలనెడు క్రీడలను కోరుదువేని నీరాజ మౌళియందుఁగటాక్షముల నెఱపు మని తాత్పర్యము.

చ. కువలయసంభ్రమప్రదత◊కు న్నెలవై పరచక్రదర్పవై
భవహరణాఢ్యవర్తనకుఁ ◊బాదయి యీవిభుదోర్మహంబు గో
త్ర వెలయఁ దత్తులావిరహి◊తాజనితోరుమలీమసత్వ మో
యువతి వసద్రమేశతను◊భోపధిఁ బర్వు దినేంద్రుమేనునన్. 79

టీక: ఓయువతి=ఓచంద్రికా! ఈవిభుదోర్మహంబు=ఈరాజు భుజప్రతాపము; కువలయ సంభ్రమప్రదతకున్ – కువలయ=కలు వలకు, భూవలయమునకు, సంభ్రమప్రదతకున్=సంతసము నిచ్చుటకు, తొట్రుపాటు నిచ్చుటకు; నెలవై=నివాసస్థానమై; పర చక్ర దర్పవైభవ హర ణాఢ్య వర్తనకున్ – పర=శ్రేష్ఠములగు, చక్ర=జక్కవలయొక్క,దర్పవైభవ=గర్వాతిశయముయొక్క, హరణ=పోఁగొట్టుటయందు, ఆఢ్య=పూర్ణమగు, వర్తనకున్=వ్యాపారమునకు; పాదయి=ఉనికిపట్టయి; పర=శత్రురాజుల యొక్క, చక్ర=రాష్ట్రములయొక్క,దర్పవైభవ=గర్వాతిశయముయొక్క, హరణ=పోఁగొట్టుటయందు, ఆఢ్య=పూర్ణమగు, వర్తనకున్=వ్యాపారమునకు, పాదయి యని యర్థాంతరము; గోత్రన్=భూమియందు; వెలయన్= ప్రకాశింపఁగా; తత్తులా విరహితా జనితోరు మలీమసత్వము – తత్తులా=తత్సామ్యముయొక్క,విరహితా=రాహిత్యముచేత,జనిత=పుట్టింపఁబడిన, ఉరు=అధికమగు, మలీమసత్వము=మాలిన్యము, నైల్య మనుట; వసద్రమేశతనుభోపధిన్—వసత్=నివసించియున్న, రమేశ =నారాయణమూర్తియొక్క,తనుభా=దేహకాంతి యనెడు, ఉపధిన్=వ్యాజముచేత; దినేంద్రుమేనునన్=సూర్యశరీరమందు; పర్వున్=వ్యాపించును.

అనఁగ నీరాజు ప్రతాపము కువలయసంభ్రమప్రదమును, పరచక్రదర్పము నడఁగించునదియు నగుటచే, గువలయసంతోష మును బోఁగొట్టువాఁడును, బరచక్రదర్పమును నతిశయింపఁజేయువాఁడును నగు సూర్యుఁడు ఏతద్రాజప్రతాపసామ్యము పొందమి నుదయించు నైల్యమును, తనశరీరమందుండు నారాయణమూర్తియొక్క శరీరకాంతి యనెడు నెపముచే ధరించు నని తాత్పర్యము. వాస్తవికమగు సూర్యశరీరగతనారాయణమూర్తిదేహకాంతిని, ప్రచ్ఛాదించి సామ్యాభావప్రయుక్తలోపమువలన జన్మించు నైల్యమునుగాఁ జెప్పుటచేఁ గైతవాపహ్నవాలంకారము.

తే. అని యెఱింగింప నపుడు ప◊క్ష్మాంచలములు, వ్రాల్ప శిబికాధరు ల్తద్వి◊రక్తి నెఱిఁగి
వేఱొకనృపాలుఁ జేర్ప నా◊వెలఁది కగజ, యమ్మహీశునిఁ జూపి యి◊ట్లనుచుఁ బలికె. 80

టీక: అని=ఈప్రకారము; ఎఱింగింపన్=తెలుపఁగా; అపుడు; పక్ష్మాంచలములు – పక్ష్మ=ఱెప్పలయొక్క,అంచలములు=అగ్ర ములు; వ్రాల్పన్=వంపఁగా; శిబికాధరుల్=పల్లకిని మోయువారు; తద్విరక్తిన్—తత్=ఆరాజునందు, విరక్తిన్=విరాగమును; ఎఱిఁగి =తిలిసికొని; వేఱొకనృపాలున్=వేఱొకరాజును; చేర్పన్=పొందింపఁగా; ఆవెలఁదికిన్=ఆచంద్రికకు; అగజ=పార్వతీ దేవి; అమ్మహీశునిన్=ఆరాజును; చూపి=ప్రదర్శించి; ఇట్లు అనుచు=వక్ష్యమాణప్రకారముగ; పలికెన్=వచించెను.

మ. వలజాలోకలలామ గన్గొనవె యీ◊వారాణసీరాజు ను
జ్జ్వలతేజోదినరాజు నిప్పతి భుజా◊వష్టంభరేఖ న్ద్విష
ద్బలకోటి న్మథియించి నిల్పె విజయ◊స్తంభంబు లాశాగజా
వలికి న్నిచ్చలు కట్టుఁగంబముల ఠే◊వ న్దోఁప దిగ్వీథులన్. 81

టీక: వలజాలోకలలామ=సుందరులగు స్త్రీలమండలములో శ్రేష్ఠురాలా! ‘వలజా వల్గుదర్శనా’ అని యమరుఁడు; ఉజ్జ్వలతేజో దినరాజు – ఉజ్జ్వల=ప్రకాశించుచున్న,తేజః=తేజమునందు, దినరాజు=సూర్యునితో సమానుఁడగు; ఈవారాణసీరాజున్=ఈ కాశీరాజును; కన్గొనవె=చూడుమా! ఇప్పతి=ఈకాశీరాజు, ఇది కర్తృపదము; భుజావష్టంభరేఖన్ – భుజావష్టంభ=భుజగర్వ ముయొక్క, రేఖన్=శ్రేణిచేత, ‘దర్పోవలేపోఽవష్టంభః’ అని యమరుఁడు; ద్విషద్బలకోటిన్ – ద్విషద్బల=శత్రుసేనలయొక్క, కోటిన్= సమూహమును; మథియించి=సంహరించి; విజయస్తంభంబులు=జయస్తంభములను; దిగ్వీథులన్=దిక్ప్రదేశము లందు; ఆశాగజావలికి=దిగ్గజముల సమూహమునకు; నిచ్చలు=ఎల్లపుడు; కట్టుఁగంబముల ఠేవన్ = కట్టివేయు కంబముల యొక్క రీతిచే; తోఁపన్=కనిపించునట్లు; నిల్పెన్=నిలువఁబెట్టెను.

అనఁగ నోచంద్రికా! యీకాశీరాజును కనుఁగొనుము. ఈరాజు తనభుజవీర్యముచేతఁ బగతురఁ బరిమార్చి దిక్కులందు దిగ్గజములకు గట్టుకంబములవలెనున్న విజయస్తంభములనునిలిపినాఁ డని భావము.

మ. వరదానంబు ననల్పసౌకరియు శ◊శ్వద్భోగసంపత్తి ని
బ్బరపుంగూటపుమేల్మి యీపతియెడం ◊భాసిల్ల నశ్రాంత ము
ర్వర తాఁ జేరి పయోజలోచన! కరి◊స్వామిం గిరిస్వామి నా
హరిరాజు న్గిరిరాజు నెంచక ప్రమో◊దావాప్తి మించు న్గడున్. 82

టీక: పయోజలోచన =కమలములవంటి కన్నులుగల చంద్రికా! వరదానంబున్ – వర=శ్రేష్ఠమగు, దానంబున్= వితరణమును, మదోదకమును; అనల్పసౌకరియున్ – అనల్ప=అధిక మగు, సౌకరియున్=సుకరత్వమును, సూకరత్వమును; శశ్వద్భోగ సంపత్తి—శశ్వత్=ఎల్లపుడు, భోగసంపత్తి =ఉపభోగసంపద, పడగలయొక్కసంపద; నిబ్బరపుంగూటపుమేల్మి=అధికమగు బాణములయొక్క మేలిమి, శిఖరములయొక్క మేలిమి; ఈపతియెడన్=ఈరాజునొద్ద; భాసిల్లన్=ప్రకాశింపఁగా; అశ్రాంతము= ఎల్లపుడు; ఉర్వర =పుడమి;తాన్=తాను; చేరి =పొంది; కరిస్వామిన్=గజరాజును; కిరిస్వామిన్= ఆదివరాహమును; ఆహరి రాజున్=ఆయాదిశేషుని; గిరిరాజున్=కులాచలమును; ఎంచక=లెక్కపెట్టక; ప్రమోదావాప్తిన్=సంతోషప్రాప్తిచేత;కడున్= మిక్కిలి; మించున్=అతిశయించును.

అనఁగా భూదేవి, కరికిరిహరిగిరిస్వాములయందుండు దాన సౌకర్య భోగకూటములు ఈరాజునందుఁ బ్రకాశింపఁగ, వారిని గణింపక యీభూపతిని జేరె నని భావము. ఇచట కరిస్వామి, గిరిస్వామి, హరిరాజు, గిరి రాజు అని గికారప్రయోగముచే కరిస్వామి ప్రభృతులయందు అపకర్షము దోఁచుచున్నది.

మ. అవనీనాయకపద్మసాయకుని ది◊వ్యానందకాంతారవ
న్యవిహారాన్వితు వీని నీయురముఁ జెం◊దం జూడవే దృష్ట్యలే
హ్యవలగ్నామణి! నీకు గాంగజలఖే◊లాభోగముల్ హస్తిదా
నవవిద్వేషిపదాబ్జసేవనవిధా◊నం బబ్బు నశ్రాంతమున్. 83

టీక: దృష్ట్యలేహ్యవలగ్నామణి =దృష్టి కగోచరమైన మధ్యభాగముగల స్త్రీలయందు నుత్తమురాలవైన చంద్రికా! అవనీనాయక పద్మసాయకునిన్ – అవనీనాయక=రాజులయందు, పద్మసాయకునిన్=మన్మథునివంటివానిని; దివ్యానందకాంతారవన్య విహారాన్వితున్—దివ్య=ప్రశస్తమగు, ఆనందకాంతార=ఆనందవనమందలి, వన్యవిహార=వనవిహారముతోడ, అన్వితున్= కూడినట్టి; వీనిన్=ఈరాజును; నీయురమున్=నీవక్షమును; చెందన్=పొందునట్లు, ఆలింగనము చేసికొను నట్లనుట; చూడవే =చూడుమా! నీకున్; గాంగజలఖేలాభోగముల్=జాహ్నవీజలక్రీడలయొక్కపరిపూర్ణతలును; హస్తిదానవవిద్వేషి పదాబ్జ సేవన విధానంబు – హస్తిదానవవిద్వేషి=గజాసురవైరి యగు విశ్వేశ్వరునియొక్క,పదాబ్జ=పాదకమలములయొక్క, సేవన= పరిచర్యయొక్క,విధానంబు=ప్రకారము; అశ్రాంతమున్=ఎల్లపుడు; అబ్బున్=చేకూఱును.

అనఁగ నోచంద్రికా! ఈరాజును వరించితివేని నీకు గంగానదీజలవిహారములు గల్గుటయె గాక శ్రీవిశ్వేశ్వరస్వామి పాద కమలములసేవయు నెల్లపుడుఁ జేకూఱు నని భావము.

క. అని తెలుప వినియు నలజ,వ్వని విననటు లుండ యాన◊వహు లొక్క నృపా
లునిఁ జేర్ప గౌరి యావిభు, వనజాక్షికిఁ జూపి యిటులు ◊పల్కె న్వేడ్కన్. 84

టీక: అని =ఈప్రకారము;తెలుపన్=తెలియఁజేయఁగా; వినియున్=ఆకర్ణించియు; అలజవ్వని=ఆచంద్రిక; విననటులుండన్ = విననిదానివలె నుండఁగా; యానవహులు=పల్లికి మోయువారు; ఒక్క నృపాలునిన్=ఒకరాజును; చేర్పన్=చేర్పఁగా; గౌరి= పార్వతీదేవి; ఆవిభున్=ఆరాజును; వనజాక్షికిన్=చంద్రికకు; చూపి=ప్రదర్శించి; ఇటులు=ఈవిధముగా; వేడ్కన్=సంతసము చేత; పల్కెన్=వచించెను.

శా. కర్ణాటేశ్వరుఁ డీతఁ డిమ్మనుజలో◊కస్వామి వీక్షింపుమా
కర్ణాంతాయతనేత్ర! వీనిజయజా◊గ్రద్భర్మభంభాకులో
దీర్ణధ్వానము దిక్ప్రభిత్తిపరిభి◊త్తిస్ఫూర్తిఁ జేపట్టఁగాఁ
దూర్ణం బుర్వరఁ ద్రెళ్ళు వైరినృపసం◊దోహంబు చిత్రంబుగన్. 85

టీక: కర్ణాంతాయతనేత్ర =శ్రుత్యంతమువఱకు విశాలములగు నేత్రములుగల చంద్రికా! ఈతఁడు=ఈరాజు;కర్ణాటేశ్వరుఁడు = కర్ణాటభూపతి; ఇమ్మనుజలోకస్వామిన్=ఈనరపతిని; వీక్షింపుమా=చూడుమా! వీని=ఈరాజుయొక్క; జయజాగ్రద్భర్మ భంభాకులోదీర్ణ ధ్వానము – జయ=జయముచేత,జాగ్రత్=మేల్కనిన, భర్మ=సువర్ణమయమగు, భంభాకుల=జయభేరీ బృందముయొక్క, ఉదీర్ణ=ఉత్కటమగు, ధ్వానము=శబ్దము; దిక్ప్రభిత్తిపరిభిత్తిస్ఫూర్తిన్ – దిక్ప్రభిత్తి=దిగ్భిత్తులయొక్క, పరిభిత్తి=భేదనముయొక్క, స్ఫూర్తిన్=అతిశయమును; చేపట్టఁగాన్=గ్రహింపఁగా; వైరినృపసందోహంబు=శత్రురాజుల సమూహము; చిత్రంబుగన్=విచిత్రముగ; తూర్ణంబు=శీఘ్రముగ; ఉర్వరన్=భూమియందు; త్రెళ్ళున్=పడును.

చంద్రికా! కర్ణాటభూమి కధినేత యగు నీరాజును చూడుము, వీని బంగరుజయభేరీనినాదము దిగ్భిత్తులను భేదింపఁగానే వీని శత్రువులు భూమిపైఁ బడుదురని భావము. ఈపద్యమునం దతిశయోక్తిభేదము.

మ. బలభిన్నీలసహోదరచ్చికుర! యీ◊పట్టాభిషిక్తేంద్రు హృ
త్థ్సలి వర్ణింపఁ దరంబె యిప్పతి తను◊చ్ఛాయాగతిన్ మన్మథుం
గలనం గెల్చి తదంకమండలముఁ జ◊క్కం గైకొనెం గానిచోఁ
దలఁప న్వీనికిఁ జెల్ల నేర్చునె సము◊ద్యన్నక్రకేతుచ్ఛటల్. 86

టీక: బలభిన్నీలసహోదరచ్చికుర=ఇంద్రనీలములకు సమానములగు కురులుగల చంద్రికా! ఈపట్టాభిషిక్తేంద్రున్=ఈమూర్ధా భిషిక్తుని; హృత్థ్సలిన్=హృదయప్రదేశమునందు; వర్ణింపన్=నుతించుటకు; తరంబె=శక్యమా? ఇప్పతి=ఈభూనాథుఁడు; తనుచ్ఛాయాగతిన్=దేహకాంతిరీతిచేత; కలనన్=యుద్ధమందు; మన్మథున్=మరుని;గెల్చి=జయించి; తదంకమండలమున్ – తత్= ఆమన్మథునియొక్క, అంక=చిహ్నములయొక్క, మండలమున్=సమూహమును; చక్కన్=చక్కగ; కైకొనెన్ = గ్రహించెను; కానిచోన్=అట్లు గ్రహింపనియెడల; తలఁపన్=విచారింపగ; వీనికిన్=ఈరాజునకు; సముద్యన్నక్రకేతుచ్ఛటల్ – సముద్యత్=మీఁదికిలేచిన, నక్రకేతు=మకరధ్వజములయొక్క, ఛటల్=సమూహములు; చెల్ల నేర్చునె =చెల్లునా? చెల్లవనుట.

అనఁగ నీరాజు తనసొబగుచే మరునిఁ బోరున గెలిచి, వానిమకరధ్వజముల గ్రహించెను. అట్లు కానిచో వీనికి మకరధ్వజ ములు చెల్లునా యని భావము.

చ. ఇనకులనుత్యరాజపర◊మేశ్వరలక్షణశాలి యివ్విభుం
డనిశము చక్రహార్దదమ◊హావసుదాన మొనర్ప నేర్చువాం
ఛ నెనయుచంద్రుఁ డౌఁ జుము ర◊సావలయాతపవారణంబు త
ద్ఘనజవజశ్రమాంబుకణి◊కల్ సుము ముత్తెపుకుచ్చు లెంచఁగన్. 87

టీక: ఇనకులనుత్యరాజపరమేశ్వరలక్షణశాలి – ఇనకుల=నృపసమూహముచేత, నుత్య=పొగడఁదగిన, రాజపరమేశ్వర= రాజరాజులయొక్క, లక్షణ=లక్షణములచేత, అనఁగా భాగ్యచిహ్నములచేత, శాలి=ప్రకాశించుచున్న; ఇవ్విభుండు=ఈ రాజు; అనిశము=ఎల్లపుడు; చక్రహార్దదమహావసుదానము – చక్ర=జక్కవలకు, రాష్ట్రమునకు, హార్దద= ప్రేమము నిచ్చు, మహా వసు దానము=గొప్పకిరణములయొక్క, ధనముయొక్క, యిచ్చుటను; ఒనర్పన్=చేయఁగా; నేర్చువాంఛన్=అభ్యసించు నిచ్ఛ చేత; ఎనయుచంద్రుఁడు=పొందిన చంద్రుఁడే; రసావలయాతపవారణంబు=భూచక్రచ్ఛత్రము; ఔన్ చుము – ఔన్= అగును, చుము= సత్యము; ముత్తెపుకుచ్చులు=మౌక్తికగుచ్ఛములు; ఎంచఁగన్=విచారింపఁగా; తద్ఘనజవజశ్రమాంబు కణికల్–తత్= ఆచంద్రునియొక్క, ఘన=అధికమగు, జవజ=వేగముచేఁ బుట్టిన, శ్రమాంబుకణికల్=శ్రమోదకబిందువులు; చుము= సత్యము.

ఈరాజన్యుని భూచక్రాకారమగు గొడుగు గొడుగుగాదు, మఱి యేమనఁగా చక్రమునకు వసుదాన మీయనేర్చిన యీ నరపతిచెంగట, జక్కవలకు వసుదాన మీయనేరనివాఁడగుటచే చక్రమునకు వసుదాన మియ్య నేర్చుకొను వాంఛతోఁ జేరిన చంద్రుఁడే; ఈముత్యపుగుత్తులు అతివేగముతోఁ జేరినచంద్రునియొక్క వేగశ్రమోదితములైన చెమటబిందువలె యని భావము. ఈపద్యమందు అభేదరూపకాలంకారము.

మ. వరసామ్యంబు ఘటిల్లె నంచు నృపతు◊ల్వర్ణింప రాజాధిరా
జు రవిద్యోతనరూపతేజు నితని ◊న్సోమాస్య! యుద్వాహమై
నిరతం బొప్పుము సర్వభూపహరిణీ◊నేత్రాశిరోరత్నది
వ్యరుచుల్ త్వత్పదవీథి యావకరసా◊న్వాదేశముం బూనఁగన్. 88

టీక: వరసామ్యంబు=వరునియొక్క యనురూపత, అనురూపుఁడైన వరుఁడనుట; ఘటిల్లె నంచున్=చేకూఱె ననుచు; నృప తుల్ = రాజులు; వర్ణింపన్=నుతియింపఁగా; రాజాధిరాజున్=రాజులకు రాజయినట్టి; రవిద్యోతనరూపతేజున్ – రవిద్యోతన రూప=సూర్యకాంతితుల్యమగు, తేజున్=కాంతిగల్గినట్టి; ఇతనిన్=ఈకర్ణాటభూపతిని; సోమాస్య(సోమ+ఆస్య)=చంద్రుని వంటి ముఖముగల చంద్రికా! ఉద్వాహమై =పెండ్లి చేసికొని; నిరతంబు=ఎల్లపుడు; సర్వభూపహరిణీనేత్రాశిరోరత్నదివ్య రుచుల్ – సర్వభూపహరిణీనేత్రా=సమస్తరాజాంగనలయొక్క,శిరోరత్న=చూడామణులయొక్క,దివ్య=మనోహరము లగు, రుచుల్=కాంతులు; త్వత్పదవీథిన్= నీయొక్క పాదప్రదేశమందు; యావకరసాన్వాదేశమున్ – యావకరస = లాక్షా రసమునకు, అన్వాదేశమున్=పౌనరుక్త్యమును, ‘కించి త్కార్యం విధాతు ముపా త్తస్య కార్యాన్తరవిధానాయ పునరుపాదాన మన్వాదేశః’ అని వైయాకరణసంకేతము, ఒకకార్యమును విధించినదానినే మఱలఁ గార్యాంతరమును విధించుటకై గ్రహించుట అన్వాదేశపదమున కర్థము గావున పౌనరుక్త్యము ఫలితార్థము; పూనఁగన్=వహింపఁగా; ఒప్పుము =ప్రకాశింపుము.

చంద్రికా! నీవితనిఁ బెండ్లియై యొప్పఁగా సమస్తరాజాంగనల చూడామణిమరీచులచే నలంకృతంబులగు నీపాదములకు లాక్షారసము పునరుక్తప్రాయమై యుండు నని భావము.

వ. అని తెలిపియాయుర్వీశుపై మనంబు పర్వ కునికి నాశర్వప్రేయసి సుపర్వరాజగర్వాపహవైభవ ధూర్వహుం డగు నొక్కరాజకులోద్వహుం జేర నియోగించి యాపర్వేందువదన కతనిం జూపి యిట్లనియె. 89

టీక: అని తెలిపి =ఈప్రకారము తెలియఁజేసి;ఆయుర్వీశుపైన్=ఆరాజుమీఁద; మనంబు=చిత్తము; పర్వకునికిన్=పొసఁగ కుండుటచేత; ఆశర్వప్రేయసి=ఆపార్వతీదేవి; సుపర్వరాజగర్వాపహవైభవధూర్వహుండు – సుపర్వరాజ=ఇంద్రునియొక్క, గర్వ=అహంకారమును, అపహ=పోఁగొట్టునట్టి, వైభవ=విభవముయొక్క, ధూర్వహుండు=భారమును వహించినవాఁడు; అగు నొక్కరాజకులోద్వహున్= ఐనట్టి ఒకానొక రాజశ్రేష్ఠుని; చేరన్=పొందునటులు; నియోగించి =ఆజ్ఞాపించి; ఆపర్వేందు వదనకున్=పున్నమచంద్రునివంటి ముఖముగల యాచంద్రికకు; అతనిం జూపి =ఆరాజును చూపెట్టి; ఇట్లనియెన్=వక్ష్యమాణ ప్రకారముగ వచించెను.

మ. వనితా! కన్గొను కాశరా జితఁడు దై◊వాఱు న్మహిన్ రాజరా
జన నార్యేశ్వరమైత్రి సద్ద్రవిణధు◊ర్యత్వంబు నాత్మాంఘ్రిసే
వనతాత్పర్యయుతాప్తపుణ్యజనశ◊శ్వత్సంపదాపాదకాం
చనధీవృత్తియు సార్వభౌమనిభృతా◊శాగుప్తియుం బూనుచున్. 90

టీక: వనితా=చంద్రికా! ఇతఁడు=ఈభూపతి; కాశరాజు=కాశదేశాధిపతి; మహిన్=భూమియందు; రాజరాజనన్ =కుబేరుఁ డనఁగ, రాజశ్రేష్ఠుఁ డనఁగ; ఆర్యేశ్వరమైత్రిన్—ఆర్యేశ్వర=పార్వతీపతియొక్క, సత్పురుషశ్రేష్ఠులయొక్క, మైత్రిన్= స్నేహ మును; సద్ద్రవిణ ధుర్యత్వంబున్ – సత్=శ్రేష్ఠమగు, ద్రవిణ=ధనముయొక్క,బలముయొక్క,ధుర్యత్వంబున్=ధురీణత్వ మును; ఆత్మాంఘ్రిసేవన తాత్పర్య యుతాప్త పుణ్యజన శశ్వ త్సంప దాపాద కాంచన ధీవృత్తియున్ – ఆత్మ=తనయొక్క, అంఘ్రిసేవన=పాదసేవనమందు, తాత్పర్య=తత్పరత్వముచేత, యుత=కూడుకొన్న, ఆప్త=ఇష్టులగు, పుణ్యజన=పుణ్య పురుషులకును, యక్షులకును, శశ్వత్ =ఎల్లకాలము, సంపదాపాదక=ఐశ్వర్యము నిచ్చునట్టి, అంచన=ప్రకాశించుచున్న, ధీవృత్తి యున్=చిత్తవృత్తిని; సార్వభౌమ నిభృతాశాగుప్తియున్ – సార్వభౌమ=చక్రవర్తిత్వముచేత, నిభృత=పోషింపఁబడిన, ఆశా= దిక్కులయొక్క, గుప్తియున్= పాలనమును; సార్వభౌమ= సార్వభౌమ మను దిగ్గజముచేత, నిభృత=భరింపఁబడిన, ఆశా= ఉత్తరదిక్కుయొక్క, గుప్తియున్= పాలనమును; పూనుచున్=గ్రహించుచు; దైవాఱున్=అతిశయించును; కన్గొను= చూడుము. అనఁగ నీరాజు కుబేరునిపగిది నార్యేశ్వరమైత్రి, సద్ద్రవిణధుర్యత్వమును, పుణ్యజనసంపదాపాదకత్వమును, సార్వభౌమనిభృతాశాగుప్తిని పొంది ప్రకాశించు చున్నాఁడని భావము.

సీ. గురుపద్మినీరాగ◊గుంభితస్వాంతంబుఁ, గని యొప్పుఁ జక్రప◊క్షప్రతాన,
మతివేల మధుపాళి◊కాప్తిచే నెవ్వేళ, నలరారుఁ బారిజా◊తాగమౌళి,
బాడబవర్ధన◊ప్రౌఢిప్రచారంబు, భాసిల్లఁ గడుఁ బొంగుఁ ◊బాలకడలి,
సద్వసుహారియై ◊సంలబ్ధదోషాను,సృతిఁ బొల్చు వాసతే◊యీశ్వరుండు,
తే. తత్సమాసక్తిఁ బంకసం◊తతిఁ గరంబు,ను విరళశ్రీ వహించుఁ గై◊రవచయంబు
ననఘమై మించు నీమేటి◊యశముతోడ, సాటి యగు నెట్లు సారస◊జ్ఞాతినయన! 91

టీక: సారసజ్ఞాతినయన =కమలములవంటి నేత్రములు గల చంద్రికా! చక్రపక్ష ప్రతానము=హంసలగుంపు; గురుపద్మినీరాగ గుంభితస్వాంతంబున్ – గురుపద్మినీ=గురుభార్యయందు, రాగ=అనురాగముచేత, గుంభిత=పూరితమగు,స్వాంతంబున్ = చిత్తమును; కని=పొంది; ఒప్పున్=ఒప్పును; గురు=అధికమగు, పద్మినీ=పద్మలతయందు,రాగ=అనురాగముచేత, గుంభిత = పూరితమైన, స్వాంతంబున్=చిత్తమును అని స్వాభావికార్థము; పారిజాతాగమౌళి=కల్పవృక్షము;అతివేల మధుపాళికాప్తిచేన్ – అతివేల=అధికమగు, మధుపాళికా=మద్యపాయుల గుంపు యొక్క, ఆప్తిచేన్=ప్రాప్తిచేత; ఎవ్వేళన్=ఎల్లకాలము; అలరారున్ =ప్రకాశించును; మధుపాళికా=భృంగసంఘముయొక్క ప్రాప్తిచేత నని స్వభావార్థము; పాలకడలి=పాలసముద్రము;బాడబ=బ్రాహ్మణులయొక్క, వర్ధన=ఛేదనమందలి, ప్రౌఢి=నేర్పుయొక్క,ప్రచారంబు=వ్యాపా రము; భాసిల్లన్=ప్రకాశింపఁగ;కడున్=మిక్కిలి; పొంగున్=ఉబుకును; బాడబ=బడబాగ్నియొక్క, వర్ధన=వృద్ధిఁబొందించుట యందలి, ప్రౌఢి=నేర్పుయొక్క ప్రచారము నని స్వభావార్థము; వాసతేయీశ్వరుండు =చంద్రుఁడు, ‘వసతి ర్వాసతేయీచ శ్యామా రాత్రిశ్చ కథ్యతే’ అని హలాయుధనిఘంటువు; సద్వసు హారియై=సత్పురుషుల ద్రవ్యము నపహరించినవాఁడై, సంలబ్ధదోషానుసృతిన్ – సంలబ్ధ=పొందఁబడిన, దోష=పాపము యొక్క, అనుసృతిన్=అనుసరణముచేత; పొల్చున్=ఒప్పును. సద్వసుహారియై=రిక్కలకాంతిని హరించినవాఁడై, సంలబ్ధ దోషానుసృతిన్=పొందబడిన రాత్రియొక్క, అనుసరణముచేత నని స్వభావార్థము. కైరవచయంబు=తెల్లగలువల గుంపు; తత్సమాసక్తిన్ – తత్=ఆదోషాకరునియొక్క, సమాసక్తిన్=సంబంధముచేతను; పంక సంతతిన్=పాపచయముచేత; కరంబును=మిక్కిలి; విరళశ్రీన్=విరళకాంతిని; వహించున్=పొందును. తత్సమాసక్తిన్=చంద్ర సంబంధమును, పంకసంతతిన్= బురదగుంపును, విరళశ్రీన్=రాత్రియందుకాంతి, నని స్వభావార్థము.అనఘమై=పాపరహితమై; మించు=ప్రకాశించు; ఈమేటియశముతోడన్=ఈఘనుని కీర్తితోడను; సాటి=సమానము; ఎట్లు = ఏరీతిగ; అగున్? కాదనుట.

అనఁగ నోచంద్రికా! గురుపద్మినియం దనురాగము గలిగి రాగవర్తనచే నుండు హంసవితతి, మధుపాయులబృందముచే నావరింపఁబడి మించు వేల్పులమ్రాఁకు, బాడబవర్ధనప్రచారమున మించు పాల్కడలి, సద్వసువులను హరించి దోషాకరుఁడగు చంద్రుఁడు, దోషాకరసంబంధముచేతను, పంకసంకరముచేతను స్వల్పకాంతిని బొందియున్న కైరవచయము, నిర్దుష్టమై, పాప రహితమై, ఎల్లప్పుడును మించు నీఘనునికీర్తికి సాటి కా వని భావము.

చ. వలదొర మీఱురూపు దయి◊వాఱఁగ రాజిలు నిర్జరాధిపో
పలనిభనీలవర్ణు మహి◊పాలకశేఖరు వీనిఁ బెండ్లియై
నెలఁతుక యీమహాత్ము నెద ◊నిచ్చలుఁ బాయక యుండు మంజనా
చలతటభాసమాననవ◊చంపకవల్లి తెఱంగు పూనుచున్. 92

టీక: వలదొర మీఱురూపు – వలదొరన్=మన్మథుని, మీఱు=అతిశయించు, రూపు=చక్కదనమును; దయివాఱఁగన్ =అతిశయింపఁగా; రాజిలు నిర్జరాధిపోపలనిభనీలవర్ణున్ – రాజిలు=ఒప్పునట్టి, నిర్జరాధిపోపల=ఇంద్రనీలమణులకు,నిభ=సమాన మైన, నీలవర్ణున్=నల్లనికాంతిగల; మహిపాలకశేఖరున్=రాజశ్రేష్ఠుఁడగు;వీనిన్=ఈరాజును; పెండ్లియై=వివాహమాడి; నెల తుఁక=చంద్రికా! అంజనాచలతటభాసమాననవచంపకవల్లి తెఱంగు – అంజనాచల=నీలాద్రియొక్క,తట=ప్రదేశమందు, భాస మాన=ప్రకాశించుచున్న, నవ=నూతనమైన,చంపకవల్లి=సంపెఁగతీవయొక్క, తెఱంగు=రీతిని; పూనుచున్=పొందుచు; ఈమహాత్మునెదన్=ఈరాజువక్షస్థలమునందు; నిచ్చలున్=ఎల్లకాలము; పాయక=వీడక; ఉండుము.

ఇంద్రనీలవర్ణము గలిగి మన్మథునిఁ దిరస్కరించు రూపముగల యీరాజును బెండ్లియాడి, వీని యురమునందు, అంజనా చలముమీఁద నున్న చంపకవల్లి తెఱంగునఁ బ్రకాశింపు మని భావము. ఉపమాలంకారము.

తే. అనఁగ నమ్మాట వినియును ◊నలర కున్కి,తెలిసి మఱియొక్కభూపాల◊తిలకుఁ జేరఁ
దార్చి శర్వాణి రాజనం◊దనను బలికెఁ, దద్గుణశ్రేణి యమృతజి◊ద్భవ్యవాణి. 93

టీక: శర్వాణి =పార్వతీదేవి; అనఁగన్=ఇట్లు పలుకఁగా; అమ్మాటన్=ఆవచనమును; వినియును=ఆకర్ణించియు; అలర కున్కి=సంతసింపకుండుటను;తెలిసి=ఎఱింగి; మఱియొక్కభూపాలతిలకున్=మఱియొక రాజశ్రేష్ఠుని; చేరన్=పొందునట్లు;తార్చి=చేసి; రాజనందనను =చంద్రికనుగూర్చి; అమృతజిద్భవ్యవాణిన్ =సుధను తిరస్కరించు మధురవచనముచేత; తద్గుణ శ్రేణిన్=ఆరాజుగుణముల పంక్తిని; పలికెన్=వచించెను.

మ. అనవద్యద్యుతి నంగభూమిపతి నో◊యబ్జాక్షి వీక్షింపు మొ
య్యన నేతన్నృపధాటికానవకథా◊వ్యాఖ్యాతృభేరీకుల
స్వనసంద్రావితనాథవద్రిపుపురీ◊జాతంబు కాంతారత
న్మనఁ జిత్రం బగుఁ గాదె గోత్ర కవనీ◊నామంబు చేకూఱుటల్. 94

టీక: ఓయబ్జాక్షి =ఓచంద్రికా!అనవద్యద్యుతిన్—అనవద్య=నిర్దుష్టమగు, ద్యుతిన్=కాంతిగల; అంగభూమిపతిన్=అంగదేశా ధిపతిని; ఒయ్యనన్=తిన్నగ; వీక్షింపుము=చూడుము; ఏతన్నృప ధాటికా నవ కథా వ్యాఖ్యాతృ భేరీకుల స్వన సంద్రావిత నాథవ ద్రిపుపురీ జాతంబు – ఏతన్నృప=ఈఅంగపతియొక్క, ధాటికా=జైత్రయాత్రయొక్క, నవ=నూతనమగు, కథా= ప్రబం ధమును, వ్యాఖ్యాతృ=వ్యాఖ్యానముచేయుచున్న, భేరీకుల=రణభేరీబృందముయొక్క, స్వన=ధ్వనిచేత, సంద్రావిత=పాఱఁ గొట్టఁబడ్డ, నాథవత్=ప్రభువులుగల, రిపుపురీ=శత్రునగరములయొక్క,జాతంబు=బృందము; కాంతారతన్=అరణ్యత్వము చేత; మనన్ =వృద్ధిఁబొందఁగా; గోత్రకున్=భూమికి; అవనీనామంబు=అవని,అనగా అడవులు లేనిదనెడి పేరు (అవని యను నది భూమికి నామాంతరము); చేకూఱుటల్=సమకూడుటలు; చిత్రం బగుఁగాదె =ఆశ్చర్యకరమగునుగదా!

అనఁగ నంగభూపాలుని రణభేరీనాదమును విని శత్రురాజులు పాఱిపోవుటవలన వారి నగరములు వనమయమైపోయి నను భూమికి అవని (వనములు=అడవులు, లేనిది) అని పేరుండుట చిత్రంబని తాత్పర్యము. అనఁగ శత్రుపురములు అరణ్య ప్రాయము లైనవని ముఖ్యాశయము.

సీ. అభ్రంబు రాయుపు◊ణ్యజనాలయంబులఁ, గమలించి తగుకీలి ◊నమరు శూలి,
సరసచక్రము లాత్మ◊సాధ్వసం బంద వి,షశ్రేణుల నొసంగు◊జలధరంబు,
కడు సదాళుల మోద◊గరిమఁ బెంప నెసంగు, నతనుశస్త్రము లూను◊నమరతరువు,
ఘనబుధద్యుమ్నంబు ◊గొని యజ్ఞహితభావ,మలర ధాత్రి రహించు◊ బలిసురారి,

తే. లలి గురుక్షేత్రము హరించి ◊ చెలఁగు రాజు, నితరరామలరసగతి ◊నెనయు నుదధి
యింతి మదిలో ననాతతా◊యిత వహించు, నివ్విభుని సాటి గా నీగి ◊నెన్నఁ దరమె. 95

టీక: అభ్రంబు రాయుపుణ్యజనాలయంబులన్ – అభ్రంబు రాయు=మిన్నొరయు, పుణ్యజన=పుణ్యాత్ములయొక్క, ఆల యంబులన్=గృహములను; కమలించి=కాల్చి; తగుకీలిన్ =ఒప్పుచున్న వహ్నిచేత; అమరు శూలి=ఒప్పుచున్నశంకరుఁడు; పుణ్యజన=రాక్షసులయొక్క, త్రిపురాసురులయొక్క, ఆలయంబులన్=త్రిపురములను, కాల్చిన యగ్నినేత్రముగలవాఁడని స్వభావార్థము;సరసచక్రములు=రసికబృందములు; ఆత్మన్=మనమునందు;సాధ్వసంబు=భయమును; అందన్= పొందునట్లు;విషశ్రేణులన్ = గరళపంక్తులను; ఒసంగు=ఇచ్చుచున్న; జలధరంబు=మేఘము; శ్రేష్ఠములగు హంసలు మనమున భయమొందునట్లుగా జలధారల నొసంగు మేఘ మని స్వభావార్థము; కడున్=మిక్కిలి;సదాళుల మోదగరిమన్ – సత్=సత్పురుషులయొక్క,ఆళుల=పంక్తులయొక్క,మోద=సంతసముయొక్క, గరిమన్=అతిశయమును; పెంపన్=ఖండించుటకు; ఎసంగు అతనుశస్త్రములు – ఎసంగు=విజృంభించుచున్న, అతను=అధిక ములగు, శస్త్రములు=ఆయుధములను; ఊను అమరతరువు=పొందినట్టి వేల్పులమ్రాఁకు; కడున్=మిక్కిలి, సదా=ఎల్లపుడు, అళుల=తుమ్మెదలయొక్క, మోదగరిమన్=సంతోషాతిశయమును, పెంపన్=వృద్ధిఁబొందించుటకు, ఎసంగు =ఒప్పుచున్న, అతనుశస్త్రములు=పుష్పములను, పొందినట్టి వేల్పులమ్రాఁకు,అని స్వభావార్థము. ఘనబుధద్యుమ్నంబు – ఘన=అధికమగు, బుధ=విద్వాంసులయొక్క,ద్యుమ్నంబు=అర్థమును; కొని=గ్రహించి; అజ్ఞహిత భావము – అజ్ఞ=మూఢులకు,హిత=అనుకూలమగు,భావము=అభిప్రాయము;అలరన్=ఒప్పునట్లు; ధాత్రిన్=భూమియందు; రహించు=ఒప్పుచున్న, బలిసురారి=బలిచక్రవర్తి; దేవతలయొక్క ద్రవ్యమును గొని జన్నమునకు హితమగు భావ మలర నొప్పు చున్నవాఁడని స్వభావార్థము. లలిన్=ఆసక్తిచేత; గురుక్షేత్రము=ఆచార్యుని భూమిని; హరించి=అపహరించి; చెలఁగు రాజు=ప్రకాశించుచున్న చంద్రుఁడు; బృహస్పతిభార్యను హరించి యొప్పినవాఁడని స్వభావార్థము. ఇతరరామలరసగతిన్ – ఇతరరామలన్=పరస్త్రీలను; రసగతిన్=అనురాగరీతిచేత; ఎనయు నుదధి – ఎనయు =పొందు చున్నసముద్రుఁడు; ఇత=పొందఁబడిన, రర=ధ్వనిగల, అమల=స్వచ్ఛమగు, రస=ఉదకముయొక్క, గతిన్=ప్రాప్తిని, పొందినట్టివాఁడని స్వభావార్థము.ఇంతి=చంద్రికా! మదిలోన్=మనమునందు; అనాతతాయితన్=ఆతతాయు లనఁగా ‘అగ్నిదో గరద శ్చైవ శస్త్రపాణి ర్ధనాపహః’ ఇత్యాదివచనమందుఁ జెప్పఁబడినవారు. వీరు గానివాఁడు అనాతతాయి, వీనిధర్మము అనాతతాయిత, ఇట్టిధర్మమును; వహించు నివ్విభునిన్=వహించుచున్న యీరాజుకు, సాటిగా= సమానముగా, ఈగిన్=వితరణమందు; ఎన్నఁ దరమె = లెక్క పెట్టఁదరమా? కాదనుట.

అనఁగా త్యాగశీలుండై, యనాతతాయి యగు నీరాజుతో నీగియందు సజ్జనగృహములనుగాల్చిన శివుండును, సరసబృంద మునకు విషంబిడిన జలధరుండును, అతనుశస్త్రము లూనిన పారిజాతతరువును, పరద్రవ్యమును హరించిన బలియు, గురు క్షేత్రము నపహరించిన చంద్రుఁడును, పరస్త్రీలపొందెనసిన సముద్రుండును ఆతతాయు లగుటచే సాటి గారని భావము.

మ. పరసత్యప్రియభావభావుకలస◊ద్వర్ణాంచితశ్రీద్విజో
త్కరసంరక్షణదక్షిణాశయుని లో◊కస్వామి నిమ్మేటి నం
బురుహమ్మన్యముఖీమచర్చిక! జగం◊బుల్ మే లనం బెండ్లియై
సరసీజాసనుఁ బల్కుచాన యన ని◊చ్చల్ మించు ముత్కంఠతోన్. 96

టీక: పర సత్య ప్రియ భావ భావుక లస ద్వర్ణాంచిత శ్రీ ద్విజోత్కర సంరక్షణ దక్షిణాశయునిన్ – పర=శ్రేష్ఠమగు, సత్య=నిజమందు, ప్రియ=ప్రీతిగల, భావ=భావముచేత,భావుక=భవ్యమగు,లసత్=ప్రకాశించుచున్న, వర్ణ=యశముచేత, అంచిత=ఒప్పు చున్న, శ్రీ=సంపదయును, ద్విజ=బ్రాహ్మణులయొక్క, ఉత్కర=సమూహముయొక్క, సంరక్షణ=పాలించుటయందు, దక్షి ణాశయునిన్=ఉదారమగు నాశయము గలవానిని; శ్రేష్ఠమగు సత్యలోకమందు, ప్రియభావభావుకములై, సత్ వర్ణ=శుక్లవర్ణము చేత, అంచిత=ఒప్పుచున్న, శ్రీ=కాంతితోఁగూడిన,ద్విజోత్కర=హంసబృందముయొక్క,సంరక్షణ=పాలించుటయందు, దక్షి ణాశయుని నని నలువపరమైన యర్థము దోఁచుచున్నది; లోకస్వామిన్=నరపతిని, నలువను, ‘హిరణ్యగర్భో లోకేశః’ అని యమరుఁడు; ఇమ్మేటిన్=ఈఘనుని; అంబురుహమ్మన్యముఖీమచర్చిక = (అమ్బురుహ మాత్మానం మన్యత ఇతి అమ్బు రుహం మన్య ముఖం యస్యా స్సా అమ్బురుహమ్మన్యముఖీ) తన్ను కమలమువలెఁ దలఁచు ముఖముగల స్త్రీలలో ప్రశస్తవగు చంద్రికా! జగంబుల్=లోకములు; మేలనన్=బాగు,బాగనఁగా; సరసీజాసనున్ పల్కుచాన యనన్=నలువను సరస్వతి యను నట్లు; పెండ్లియై=వివాహమాడి; నిచ్చల్=ఎల్లపుడు; ఉత్కంఠతోన్=సంతోషముతో; మించుము=అతిశయించుము. నలువను సరస్వతి పెండ్లియై నిచ్చలు మించుపగిది నీవీలోకస్వామిని వివాహమై యుత్కంఠతో నుండు మని భావము.

వ. అని యెఱింగింప ననంగీకారభంగి నయ్యంగనయంతరంగం బెసంగిన నాచెంత నొక్క నరపుంగవుం
జూపి సారంగధారిసారంగయాన తరంగవళీమణిం గుఱించి యిట్లనియె. 97

టీక: అని=ఈప్రకారముగ; ఎఱింగింపన్=తెలియఁజేయఁగా; అనంగీకారభంగిన్=ఒప్పికొనమియొక్కరీతిచేత; అయ్యంగన యంతరంగంబు=ఆచంద్రికయొక్కచిత్తము; ఎసంగినన్=ఒప్పఁగా; ఆచెంతన్ = ఆ సమీపమున; ఒక్క నరపుంగవున్ =ఒక్క నరపతిని; చూపి=ప్రదర్శించి; సారంగధారిసారంగయాన – సారంగధారి=శివునియొక్క, సారంగయాన = పత్ని యగు పార్వతి; తరంగవళీమణిన్ గుఱించి = తరఁ గలవంటి వళులు గల చంద్రికనుగూర్చి; ఇట్లనియెన్=వక్ష్యమాణప్రకార ముగఁ బలికెను.

చ. ఇనకులమౌళి కేరళమ◊హీపతి యీతఁడు గాంచు ప్రీతితో
మనఁగ నపారిజాతమహి◊మంబున రాజిలు నివ్విభుఁ డుర్వరన్
మను ననపారిజాతమహి◊మంబునఁ గుందరదాలలామ! పా
వనసుమనోహృదిష్టఫల◊వారవితీర్ణికలాచమత్కృతిన్. 98

టీక: కుందరదాలలామ =జాజిమొగ్గలవంటి దంతపంక్తిగల స్త్రీలలో శ్రేష్ఠురాలవైన చంద్రికా! ఈతఁడు=ఈరాజు; ఇనకులమౌళి =రాజశ్రేష్ఠుఁడగు; కేరళమహీపతి =కేరళదేశమునకు నధిపతి; ప్రీతితోన్=ప్రేమతో; కాంచు=చూడుము; అపారిజాతమహిమం బునన్ – అపారిజాత=పారిజాతాభావముయొక్క, మహిమంబునన్=సామర్థ్యముచేత;అపగతమైన శత్రుసంఘముయొక్క మహిమచేత నని స్వభావార్థము; మనఁగన్=వర్తించుటచేత; రాజిలు నివ్విభుఁడు = ప్రకాశించుచున్నట్టి యీరాజు; పావన సుమనో హృదిష్ట ఫల వార వితీర్ణి కలా చమత్కృతిన్ – పావన=పరిశుద్ధులైన, సుమనః=విద్వాంసులయొక్క, హృత్= మన మునకు, ఇష్ట=ప్రియములైన, ఫల=లాభ ములయొక్క, వార=సంఘముయొక్క, వితీర్ణి=ఇచ్చుట యనెడు, కలా=విద్య యొక్క, చమత్కృతిన్=చమత్కారముచేత; దేవతలయొక్క మనములకు నిష్టఫలముల నొసంగుట యనెడు విద్యయొక్క చమత్కృతి చేత నని వేల్పుమ్రాఁకు పరమైన యర్థము తోఁచెడి; ఉర్వరన్=భూమియందు; అనపారిజాతమహిమంబునన్ – అనపారిజాత =అపారిజాతభావాభావము యొక్క, పారిజాతముయొక్క యనుట, మహిమంబునన్=మహిమచేత; మనున్= వర్తించును. ఈరాజు అపారిజాతుఁడైనను, దానశౌండతచే అనపారిజాతమహిమంబునఁ బ్రకాశించుచున్నాఁడని భావము.

మ. అనిశం బీఘనుకీర్తిధామయుగళం◊బన్యోన్యవైరాప్తినో
యన నం దొక్కటి ప్రోవ వేఱొకటి వ◊జ్రారూఢిఁ గూల్చున్ విరో
చను వేఱొక్కటి యేఁచ నందొకటి మిం◊చం జేయు హంసోన్నతిన్
మును మున్నొక్కటి నొంప వేఱొకటి మ◊న్పుం గొమ్మ! చిత్రంబుగన్. 99

టీక: కొమ్మ=చంద్రికా! అనిశంబు=ఎల్లపుడు; ఈఘను కీర్తిధామ యుగళంబు =ఈమేటియొక్క కీర్తిప్రతాపముల జంట; అన్యోన్యవైరాప్తినోయనన్ =పరస్పరవైరముచేతనో యనునట్లు; అందున్=కీర్తిప్రతాపములలో; ఒక్కటి=ఒకకీర్తి గాని, ప్రతాపము గాని; ప్రోవన్=పాలింపఁగా; వేఱొకటి=ఇంకొకటి;వజ్రారూఢిన్=వజ్రాయుధముయొక్క రూఢిచేత; కూల్చున్= చంపును; విరోచనున్=సూర్యుని; వేఱొక్కటి=వానిలో నొకటగు ప్రతాపము; ఏఁచన్=బాధింపఁగా; అందొకటి=దానిలో నొక టగు కీర్తి; విరోచనుని మించం జేయును, ఇచట విరోచనుఁ డనఁగా చంద్రుఁడను నర్థమును గ్రహించి విరోధపరిహారము చేయ వలెను, ‘చంద్రాగ్న్యర్కా విరోచనాః’ అని విశ్వము; హంసోన్నతిన్—హంస=సూర్యునియొక్క, ఉన్నతిన్=అతిశయమును; మునుమున్ను=మొట్టమొదట; ఒక్కటి=దానిలో నొకటియగు ప్రతాపము; నొంపన్=నొవ్వఁజేయఁగా; వేఱొకటి=మఱియొకటి యగు కీర్తి; హంసోన్నతిన్=సూర్యోన్నతిని; చిత్రంబుగన్=ఆశ్చర్యముగ; మన్పున్=పోషించును. ఇచట హంసశబ్దమునకు, రాజహంస యర్థము గావున రాజహంసల యున్నతిని, కీర్తి పోషించు నని భావము. అనఁగ నీరాజుకీర్తి చంద్రుని, హంసలను పోషించు ననియు, ప్రతాపము సూర్యునిఁ దిరస్కరించు ననియు భావము.

చ. సలలితచక్రసంభరణ◊సక్తమహాశయు దేవవర్ణితో
జ్జ్వలదయుఁ బూరుషోత్తము ని◊శాచరసాధ్వసకృత్సమాఖ్యు ని
య్యలఘునిఁ జెట్టవట్టి హరి ◊నంబుధిరాజతనూజ వోలె ని
చ్చ లురముఁ బాయ కింపున నె◊సంగుము వాసవనీలకుంతలా! 100

టీక: వాసవనీలకుంతలా =ఇంద్రనీలమణులవంటి కురులుగల చంద్రికా! సలలిత చక్ర సంభరణ సక్త మహాశయున్ – సలలిత= మనోజ్ఞమగు, చక్ర=దండుయొక్క, సంభరణ=భరించుటయందు, సక్త=ఆసక్తిగల, మహాశయున్=అధికమగు నభిప్రాయము గల; సలలిత= మనోజ్ఞమగు, చక్ర=సుదర్శనముయొక్క,సంభరణ=భరించుటయందు,సక్త=ఆసక్తిగల, మహత్=గొప్ప యగు, శయున్= హస్తముగలవాఁడని విష్ణుపరమైన యర్థము; దేవ వర్ణి తోజ్జ్వల దయున్=దేవతలచేఁ గొనియాడఁబడిన కృప గల; పూరుషోత్తమున్=పురుషశ్రేష్ఠుని, విష్ణుమూర్తిని; నిశాచరసాధ్వసకృ త్సమాఖ్యున్ –నిశాచర=రక్కసులకు, సాధ్వస కృత్=భయము గలుగఁజేయు, సమాఖ్యున్=ప్రసిద్ధిగల, నామము గల వానిని; ఇయ్యలఘునిన్=ఈఘనుని; చెట్టవట్టి= వివాహమాడి; హరిన్=విష్ణువును; అంబుధిరాజతనూజ వోలెన్=కలిమినెలంతవలె; నిచ్చలు=ఎల్లపుడు; ఉరముఁ బాయక = ఎదను వదలక; ఇంపునన్=సుఖముచేత; ఎసంగుము=ఒప్పుము. అనఁగ నోచంద్రికా! కరివేల్పు నురముఁ బాయ కెప్పుడు నివ సించి యుండు లచ్చినెలంతవోలె, నీ వీరాజును బెండ్లియై వీనియురముఁ బాయక సుఖముగ నుండు మని భావము.

ఉ. నా విని కొమ్మ యక్షివల◊నంబునఁ దన్నృపచంద్రనిస్పృహ
శ్రీవెలయింప ముంగలికిఁ ◊జేర ఘటించె వయస్య యోర్తు దో
డ్తో వరయానధుర్యతతి◊తో వివరించుచు నప్పు డొక్క పృ
థ్వీవిభుఁ జూపి గౌరి సుద◊తిం బలుకుం బ్రియవాక్యనైపుణిన్. 101

టీక: నాన్=అనఁగా; విని=ఆకర్ణించి; కొమ్మ=చంద్రిక; అక్షివలనంబునన్=నేత్రచలనముచేత; తన్నృపచంద్రనిస్పృహశ్రీన్ – తన్నృపచంద్ర=ఆరాజచంద్రునియందు, నిస్పృహశ్రీన్=నైరాశ్యరచనను; వెలయింపన్=ప్రకాశింపఁజేయఁగా; ముంగలికిన్ = పురోభాగమునకు; చేరన్=పొందునటులు; వయస్య యోర్తు =ఒకచెలికత్తె; ఘటించెన్=చేసెను; తోడ్తోన్=వెంటనే;వరయాన ధుర్యతతితోన్ – వర=శ్రేష్ఠములగు, యానధుర్య=పల్లకిమోయువారియొక్క,తతితోన్=సమూహముతో; వివరించుచున్ = విశదపఱచుచు; అప్పుడు=ఆసమయమందు; ఒక్క పృథ్వీవిభున్=ఒకరాజును; చూపి=ప్రదర్శించి; గౌరి=పార్వతీదేవి; సుదతిన్=చంద్రికతో; ప్రియవాక్యనైపుణిన్—ప్రియవాక్య=ప్రియములగు పలుకులయొక్క, నైపుణిన్=జాణతనముచేత; పలుకున్=వచించెను.

క. నాళీకనయన! పార్థివ,మౌళీమణిఁ గాంచు దహళ◊మహివిభు రతిరా
ట్కేళీనూత్నకళాసౌ,శీలీమన్మనుజలోక◊శేఖరు వీనిన్. 102

టీక: నాళీకనయన=పద్మములవంటి నేత్రములు గల చంద్రికా! పార్థివమౌళీమణిన్=రాజమౌళిరత్నమును; దహళమహి విభున్=దహళభూపాలుఁడును; రతిరాట్కేళీ నూత్నకళా సౌశీలీమ న్మనుజలోకశేఖరున్ – రతిరాట్కేళీ=మదనక్రీడల యొక్క, నూత్నకళా=నూతనవిద్యయును, సౌశీలీమత్=సచ్చరిత్రవత్తయుఁగల, మనుజలోకశేఖరున్=మనుష్యలోకము నందు శ్రేష్ఠుఁ డగు; వీనిన్=ఈరాజును; కాంచు=చూడుము.

చ. నెలఁత గభీరపుష్కరధు◊నీపరిగాహనముల్ సురాగమం
డలఫలభక్షణంబులు క◊నత్సుమనోమహిళానికేతన
స్థలపరివాసముల్ సమతఁ ◊దాల్చు భయాభయయుక్తిఁ బొల్చుని
య్యలఘునిశత్రుకోటి కచ◊లావళిలేఖపురుల్ విచిత్రతన్. 103

టీక: నెలఁత=చంద్రికా! భయాభయయుక్తిన్—భయ=భయముయొక్క, అభయ=భయాభావముయొక్క, యుక్తిన్=సంబం ధముచేత; పొల్చు =ఒప్పుచున్న, ఇయ్యలఘుని శత్రుకోటికిన్=ఈరాజుయొక్క శత్రుబృందమునకు; అచలావళిలేఖపురుల్ – అచలావళి=పర్వతబృందమును, లేఖపురుల్=అమరావతియును; విచిత్రతన్ =చమత్కృతిచేత; గభీరపుష్కరధునీపరిగాహ నముల్ – గభీర=గంభీరమగు, పుష్కరధునీ=మిన్నేటియందు, పరిగాహనముల్=స్నానములను; పుష్కర=కమలములు గల, ధునీ=నదులయందు, పరిగాహనము లని రెండవయర్థము; సురాగమండలఫలభక్షణంబులు – సురాగ=వేల్పుమ్రాఁకుల యొక్క, మండల=గుంపుయొక్క,ఫల =పండ్లయొక్క, భక్షణంబులు = తినుటలు; సురాగ = ఈఁతచెట్లయొక్క, మండల = గుంపుయొక్క, ఫలభక్షణంబుల నని రెండవయర్థము; కనత్సుమనోమహిలానికేతనస్థలపరివాసముల్ – కనత్=ప్రకాశించు చున్న, సుమనోమహిళా=దేవాంగనలయొక్క, నికేతన=గృహములయొక్క,స్థల=ప్రదేశములందు,పరివాసముల్=నివాసము లను; సుమనః=పుష్పములుగల, మహిళా=ప్రేంకణపుచెట్లయొక్క, గృహస్థలపరివాసము లని రెండవయర్థము; సమతన్ = సమత్వముచేత; తాల్చున్= ధరించును. అనఁగ నీరాజునకు భయపడిన శత్రువులు వననివాసముఁ జేసిరనియు, భయపడని శత్రువులు యుద్ధమునందు నిహతులై స్వర్గనివాసముఁ జేసి రనియు భావము.

సీ. దరిసించుచో నెల్లఁ ◊దాఱించుఁ దాప మీ,యవనీంద్రుచూపు చంద్రా◊తపంబొ,
ఎనసినచో నెల్ల ◊మనుపు నామోద మీ,రారాజు చిత్తంబు ◊సారసంబొ,
నెరసినచో నెల్ల ◊దొరపు దేవత్వ మీ,యరిభేదిమాట న◊వ్యామృతంబొ,
యుంచినచో నెల్ల ◊నించు నిష్టంబు లీ,ధీరునిపాణి మం◊దారలతయొ,

తే. యనుచు సత్కవిలోకంబు ◊లభినుతింప, నలరు నీదహళోర్వరా◊ధ్యక్షరత్న
మతివ నీభాగధేయంబు◊కతన నిటకు, వచ్చె వరియింపు మితని భా◊వము చిగుర్ప. 104

టీక: దరిసించుచోన్=చూచినచోట; ఎల్లన్=అంతట; తాపము=సంతాపమును; తాఱించున్=పోఁగొట్టును; ఈయవనీంద్రు చూపు = ఈరాజేంద్రునియొక్కచూపు; చంద్రాతపంబొ=వెన్నెలయో?
ఎనసినచోన్=పొందినచోట; ఎల్లన్=అంతట; ఆమోదము=సంతసమును, పరిమళ మని తోఁచుచున్నది; మనుపున్=వృద్ధిఁ బొందించును; ఈరారాజు=ఈరాజరాజుయొక్క; చిత్తంబు=మనము; సారసంబొ=తమ్మియో?
నెరసినచోన్=వ్యాపించినచోట; ఎల్లన్=అంతట; దేవత్వము=రాజత్వమును, వేల్పుతనమును; దొరపున్=కలుగఁజేయును; ఈయరిభేదిమాట = శత్రుభేదకుఁడైన యీరాజుమాట; నవ్యామృతంబొ=నూతనమైన సుధయో?
ఉంచినచోన్=ఉనిచినచోట; ఎల్లన్=అంతట; ఇష్టంబులు=కోరికలను; నించున్=పూరించును; ఈధీరునిపాణి =ఈరాజు హస్తము; మందారలతయొ = కల్పలతయో? అనుచున్=ఇట్లు వచించుచు; సత్కవిలోకంబులు=విద్వద్బృందములు; అభినుతింపన్=పొగడఁగ; అలరు=ఒప్పును; ఈ దహళోర్వరాధ్యక్షరత్నము=ఈదహళరాజశ్రేష్ఠుఁడు; అతివ=చంద్రికా! నీభాగధేయంబుకతనన్=నీయొక్కభాగ్యవశమున; ఇటకు=ఇచ్చోటికి; వచ్చెన్=వచ్చెను; ఇతనిన్=ఈఱేని; భావము చిగుర్పన్=చిత్తము పల్లవింపఁగా; వరియింపు=వరింపుము.

ఈరాజు చూచెనాయనా సమస్తతాపములను బోఁగొట్టును గాన ఇతనిచూపు వెన్నల యేమో, ఇతనిచిత్తము కలిసెనేని ఆమోదము నిచ్చునుగాన నది కమలమో యేమో, ఇతనిమాట నెరసినచో దేవత్వ మొసగునుగాన నది యమృత మేమో, ఇతని చే యుంచినచో నెల్లకోరికల నిచ్చునుగాన నది కల్పలతయో యేమో, యీరీతి సమస్తవిద్వజ్జనులు నితని నుతింతురు గాన నీరాజును వరింపు మని భావము. సందేహాలంకారము.

వ. అనిన నయ్యొప్పులకుప్ప యప్పతియెడం జిత్తం బొప్పింపకున్కి దెలిసి యాచాయ నొక్కనృపతిం జూపి నొసలిచూపువేల్పుజవరా లాచివురాకుఁబోఁడి కిట్లనియె. 105

టీక: అనినన్=ఈప్రకారము పలుకఁగా; అయ్యొప్పులకుప్ప=అందములకు ప్రోవైన యాచంద్రిక; అప్పతియెడన్=ఆరాజు నందు; చిత్తంబు= మనస్సు; ఒప్పింపకున్కిన్=ఈయకుండుటను; తెలిసి=ఎఱిఁగి; ఆచాయన్=ఆప్రదేశమందు; ఒక్కనృపతిన్ =మఱియొకరాజును; చూపి=ప్రదర్శించి; నొసలిచూపువేల్పుజవరాలు=ఫాలనేత్రుని పత్నియగు పార్వతీదేవి; ఆచివురాకుఁ బోఁడికిన్ = పల్లవగాత్రి యగు నాచంద్రికకు; ఇట్లనియెన్=వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.

చ. కనుఁగొను బోటి! భోటనర◊కాంతశిఖామణి ధామధిక్కృతా
తనుఘృణి వీఁడు జన్యవసు◊ధాస్థలి శింజిని కార్తిపొందు దా
ర్చిన నరి తద్భృతిం గనుఁ బ◊రిస్ఫుటకాండనికాయముల్ నిగి
డ్చిన నవి తద్వధూటి నిగి◊డించుఁ గనుంగవ నద్భుతంబుగన్. 106

టీక: బోటి=చంద్రికా! భోటనరకాంతశిఖామణిన్=భోటదేశరాజశిఖామణిని; ధామధిక్కృతాతనుఘృణిన్ – ధామ=తేజస్సు చేత, ధిక్కృత=తిరస్కరింపఁబడిన, అతనుఘృణిన్=సహస్రకిరణుని; కనుఁగొను=చూడుము; వీఁడు=ఈరాజు; జన్యవసుధా స్థలిన్=యుద్ధభూమియందు; శింజినిన్=అల్లెత్రాటికి; ఆర్తిపొందు దార్చినన్=ధనుష్కోటిసంబంధమును జేయఁగా; అరి= శత్రువు; తద్భృతిన్ =ఆయార్తిభరణమును, పీడాభరణము ననుట; కనున్=పొందును; పరిస్ఫుటకాండనికాయముల్ – పరి స్ఫుట=వ్యక్తమగు, కాండ=బాణములయొక్క, నికాయముల్=సమూహములను; నిగిడ్చినన్=ఎక్కువెట్టఁగా; తద్వధూటి =ఆశత్రుకాంత; కనుంగవన్=కనుదోయియందు; అద్భుతంబుగన్=ఆశ్చర్యముగ; అవి= ఆకాండనికాయములను, నీళ్ళ సమూహముల ననుట, బాష్పముల నని భావము; నిగిడించున్=నించును.

అనఁగ నీరాజు యుద్ధభూమియందు వింటికొప్పున నల్లెత్రాటిని జేర్చుతఱి శత్రుబృందము దుఃఖమును బొందుననియు, అల్లెత్రాటియందు బాణంబుల నిగిడ్చిన వారికాంతలు కనుగవ నీరుంతు రనియు భావము. ఈపద్యమందు శత్రుప్రాణవియోగ కారణం బగు శరసంధానమును తత్కార్యరూప మగుశత్రుకాంతానయనబాష్పముల నొక్కుమ్మడి హేతుకార్యముల వర్ణించు టచే నక్రమాతిశయోక్తి యను నలంకారము. ‘అక్రమాతిశయోక్తి స్స్యా త్సహత్వే హేతుకార్యయోః’ అని దానిలక్షణము.

చ. ఉరగమువక్రవృత్తి నచ◊లోత్తముసత్పథరోధకోన్నతి
స్ఫురణఁ గిరీంద్రుపంకరత◊బుద్ధి ఢులీశుజడప్రచారమున్
కరిపతిదుర్మదక్రమము ◊గన్గొని రోసి ధరిత్రి తద్గుణే
తరగుణశాలి నివ్విభునిఁ ◊దన్వి వరించి చెలంగు నిచ్చలున్. 107

టీక: ఉరగమువక్రవృత్తిన్=శేషుని కుటిలస్వభావమును, శేషుఁడు సర్పము గానఁ గుటిలగతి సహజమని భావము; అచలోత్తము సత్పథరోధకోన్నతిస్ఫురణన్ – అచలోత్తము=కులాచలముయొక్క, సత్పథరోధక=సత్పురుషులమార్గమునకు నిరోధకమగు, ఉన్నతిస్ఫురణన్=ఔన్నత్యస్ఫురణమును; కులాచలమునకు,సత్పథ=ఆకాశమునకు రోధకమగు నున్నతస్ఫుర ణము సహజమని భావము; కిరీంద్రుపంకరతబుద్ధిన్ – కిరీంద్రు=ఆదివరాహముయొక్క, పంక=పాపమునందు,రత=ఆసక్తి గల, బుద్ధిన్=మతిని; పంక=బురదయందు, రతమగు బుద్ధి కరీంద్రునకు సహజమని భావము; ఢులీశుజడప్రచారమున్=ఆది కూర్మముయొక్క మూర్ఖులతోఁ గూడిన ప్రచారమును, ఇచట డలలకు భేదములేమి ఆదికూర్మమునకు జలమందు ప్రచారము సహజమని స్వభావార్థము; కరిపతిదుర్మదక్రమమున్—కరిపతి=గజపతియొక్క, దుర్మదక్రమమున్=దుర్గర్వక్రమమును, గజపతికి దుర్మదక్ర మమనఁగ, మదోదకముతోఁ గూడి యుండుట సహజమని భావము; కన్గొని=చూచి; రోసి=విసిగి; ధరిత్రి= భూమి;తద్గుణేతరగుణశాలిన్ – తత్=ఆయురగాదులయొక్క,గుణేతర=గుణములకన్న భిన్నమైన, గుణ=మంచిగుణముల చేత, శాలిన్=ప్రకాశించుచున్న; ఇవ్విభునిన్=ఈరాజును; తన్వి=చంద్రికా! వరించి=కోరి; నిచ్చలున్=ఎల్లపుడు; చెలంగున్ = ఒప్పును. ఓచంద్రికా! యుర గాచల కిరి ఢులీ కరుల దుర్గుణములకుఁ బుడమి రోసి యీగుణశాలిని జేరె నని భావము.

ఉ. ఇన్నరనాథచంద్రు వరి◊యించి ముదంబున నేగుదెంచునిం
గన్నులపండువై యలరఁ ◊గన్గొని నీపయి నించుఁ గాక యే
తన్నగరీవధూమణివి◊తానము సౌధచయంబు లెక్కి యు
ద్యన్నవమౌక్తికాక్షతసు◊మావళికాకలికాకులంబులన్. 108

టీక: ఇన్నరనాథచంద్రున్=ఈరాజచంద్రుని;వరియించి=కోరి; ముదంబునన్=సంతసముచేత; ఏగుదెంచు నిన్ = వచ్చుచున్న నిన్ను; కన్నులపండువై=కనులకు విందై; అలరన్=ప్రకాశింపఁగ; కన్గొని=చూచి; నీపయిన్=నీమీఁద; ఏతన్నగరీవధూమణి వితానము = ఈతనిపురమునందలి స్త్రీరత్నసమూహము; సౌధచయంబు లెక్కి=మేడలపై నెక్కి; ఉద్యన్నవమౌక్తికాక్షతసుమా వళికాకలికాకులంబులన్–ఉద్యత్=ఎత్తఁబడిన, నవ=నూతనమైన, మౌక్తికాక్షత=ముత్యములయక్షతలయొక్క, సుమావళికా = పుష్పబృందముయొక్క, కలికా=మొగ్గలయొక్క, కులంబులన్=సమూహములను; నించుఁగాక=నిండించునుగాక.

తే. అనఁగ తూష్ణీంస్థితి భజించె ◊నంబుజాక్షి, తన్మనోమోహదుర్విధ◊త్వంబు దెలిసి
యప్పు డాచెంత వేఱొక్క◊యధిపుఁ జూపి, యింతి కమ్మేనకాపుత్రి ◊యిట్టు లనియె. 109

టీక: అనఁగన్=ఇట్లు పలుకఁగ; అంబుజాక్షి=పద్మనేత్ర యగు చంద్రిక; తూష్ణీంస్థితిన్=ఊరకుండుటను;భజించెన్=పొందెను; తన్మనోమోహదుర్విధత్వంబు – తత్=ఆచంద్రికయొక్క, మనః=మనమునందు, మోహ=మోహముయొక్క,దుర్విధత్వంబు = దారిద్ర్యమును; తెలిసి=తెలిసికొని; అప్పుడు=ఆసమయమందు;ఆచెంతన్=ఆసమీపమందు;వేఱొక్కయధిపున్= మఱియొక రాజును; చూపి; యింతికిన్=చంద్రికకు; అమ్మేనకాపుత్రి=ఆపార్వతీదేవి;ఇట్టులు=వక్ష్యమాణప్రకారము; అనియెన్= పలికెను.

మ. తులకింపం బ్రమదంబు కన్గొనుము సిం◊ధుస్వామి నీదంటఁ బ
క్ష్మలనేత్రామణి! పాండుకాండయుతశుం◊భద్వాహినీమద్రణ
స్థలకాశి న్రిపుకోటి చేరి కడు మిం◊చ న్దివ్యరామోపదే
శలసద్వృత్తి ఘటించు వీనియసియ◊జ్ఞధ్వంసి నిక్కంబుగన్. 110

టీక: పక్ష్మలనేత్రామణి=చంద్రికా! ప్రమదంబు=సంతసము; తులకింపన్=ప్రకాశింపఁగా; సింధుస్వామి=సింధుదేశాధిపతియగు; ఈదంటన్=ఈదిట్టతనముగలవానిని; కన్గొనుము=చూడుము; వీనియసియజ్ఞధ్వంసి = వీనియొక్క ఖడ్గమనెడు శంకరుఁడు; పాండుకాండయుతశుంభద్వాహినీమద్రణస్థలకాశిన్ – పాండు=తెల్లనగు,కాండ=గుఱ్ఱములతో, యుత=కూడుకొన్న,శుంభత్ = ప్రకాశించుచున్న, వాహినీమత్=సేనగల, రణస్థల=యుద్ధరంగమనెడు, కాశిన్=వారాణసిని; ఇచట, పాండు=తెల్లనగు, కాండ=జలముతో, యుత=కూడుకొన్న,శుంభత్ = ప్రకాశించుచున్న, వాహినీమత్=గంగగల యని, కాశీపరముగాఁ దోఁచు చున్నది; రిపుకోటి=శత్రుసంఘము; చేరి=పొంది; కడు మించన్=మిక్కిలి యొప్పారఁగా; దివ్యరామోపదేశలసద్వృత్తిన్ – దివ్యరామా= దేవాంగనలయొక్క, ఉపదేశ=సమీపప్రదేశమునందు,లసత్=ప్రకాశించుచున్న, వృత్తిన్=వర్తనను, ఉనికి ననుట; ఇచట, దివ్య=అమోఘమైన, రామ=రామతారకముయొక్క, లేదా పరబ్రహ్మముయొక్క, ఉపదేశముచేత నని తోఁచుచున్నది; నిక్కంబుగన్= నిశ్చయముగ; ఘటించున్=ఘటిల్లఁజేయును.
అనఁగ నోచంద్రికా! ఈసింధుదేశాధిపతియొక్క యసియను శంకరుఁడు రణస్థలమను వారాణసియందుఁ జేరియున్న శత్రువు లకు దివ్యరామోపదేశమును జేయునని భావము. పరంపరిత రూపకము.

చ. అలఘుశరౌఘవృత్తిమహి◊మాభిహతప్రతికూలు సంతతా
తులితగభీరభావభరి◊తు న్సుమనోజనమోదకారిని
ర్మలమణిదాత నియ్యవని◊రాజకులాజరరాజు నాత్మ నో
నెలఁతుక! సింధురా జనుచు◊నిచ్చ నుతింపఁగఁ జెల్లకుండునే. 111

టీక: అలఘుశరౌఘవృత్తిమహిమాభిహతప్రతికూలున్ – అలఘు=అధికమైన,శరౌఘ=బాణసంఘముయొక్క, వృత్తి=వర్త నమువలన నైన, మహిమ=సామర్థ్యముచేత, అభిహత=కొట్టఁబడిన,ప్రతికూలున్=శత్రువులు గల; ఇచట, శరౌఘ=జలప్రవా హముయొక్క, మహిమాభిహతమగు, ప్రతికూలున్=ఎదురుదరిగల యను సముద్రపరమైన యర్థము దోఁచుచున్నది; సంతతాతులితగభీరభావభరితున్ – సంతత=ఎల్లపుడు, అతులిత=నిస్సమానమగు, గభీర=గంభీరమగు, భావ =అభిప్రాయ ముచే, భరితున్=పరిపూర్ణుఁడగు; ఇచట, సంతతము, అతులితమగు, గభీరభావ=లోతుచే పరిపూర్ణుఁడగు నని సముద్రపరమైన యర్థము; సుమనోజనమోదకారినిర్మలమణిదాతన్ – సుమనోజన=విద్వాంసులకు, మోదకారి=సంతసమును జేయు, నిర్మల = స్వచ్ఛమగు, మణి=మణులయొక్క, దాతన్=వదాన్యుఁడగు; దేవతలకు సంతసము నొసఁగు చింతామణి నిచ్చినవాఁడని సముద్రపరమైన యర్థము; రాజకులాజరరాజున్=రాజకులేంద్రుని; ఇయ్యవనిన్=ఈభూమియందు; ఆత్మన్=మనమునందు; ఓనెలఁతుక=ఓచంద్రికా! సింధురాజనుచున్=సింధుదేశపురాజనుచు, సముద్రుఁడనుచు ననితోఁచుచున్నది; నిచ్చన్=ఎల్లపుడు; నుతింపఁగన్=కొనియాడుటకు; చెల్లకుండునే=తగినట్టులుండదా? ఉండునని కాకువు.

ఈసింధురాజు బాణములచేఁ బ్రతికూలులను వధించువాఁడనియు, గంభీరభావమును వహించినవాఁడనియు, విద్వద్గణము లకు పెక్కుమణుల నిచ్చినాఁ డనియు, గావున నితఁడు వరణీయుఁ డనియు భావము.

చ. సకి! రతివేళ నీవు గళ◊సంయుతనిస్వనబృంహితార్భటుల్
రకమయి మీఱఁ గంతుకరి◊రాజనిరూఢి విశృంఖలైకవృ
త్తికఁ దగ నీమహీతలప◊తిచ్ఛలయంత ఘటించుఁ గాక తా
వకకుచకుంభవీథి నని◊వార్యనఖాంకుశఘాతజాతముల్. 112

టీక: సకి=చంద్రికా! రతివేళన్=సురతసమయమందు; గళసంయుతనిస్వనబృంహితార్భటుల్—గళ=కంఠమందు, సంయుత = కూడుకొన్న, నిస్వన=రతికూజితము లనెడు, బృంహితార్భటుల్=గజధ్వనులు; రకమయి=శ్రేష్ఠమై(అధికమై); మీఱన్= మించఁగా; నీవు; కంతుకరిరాజనిరూఢిన్=మదనునిగజముపగిది; విశృంఖలైకవృత్తికన్—విశృంఖల=నిగళములు లేనట్టి, ఏక=ముఖ్యమగు, వృత్తికన్=వ్యాపారముచేత; తగన్=ఒప్పఁగా; ఈమహీతలపతిచ్ఛలయంత – ఈమహీతలపతి=ఈ భూ పతియనెడు, ఛల=వ్యాజముగల, యంత=మావటివాఁడు; తావకకుచకుంభవీథిన్ – తావక=నీసంబంధియగు, కుచకుంభ= స్తనములనెడు కుంభములయొక్క, వీథిన్=ప్రదేశమునందు; అనివార్యనఖాంకుశఘాతజాతముల్—అనివార్య=నివారింప నలవిగాని, నఖ= గోళ్ళనెడు, అంకుశ=అంకుశములయొక్క,ఘాత=పోట్లయొక్క,జాతముల్=సమూహములను; ఘటించుఁ గాక = చేయును గాక. చంద్రికా! నీవు రతివేళ గళసంయుతములగు రతికూజితము లను బృంహితములు విపులముగాఁ జేయుచు విశృంఖల మదగజరాజమువలె నుండఁగా నపుడు నీమహీపతి యను మావటివాఁడు నీస్తనములనెడు కుంభస్థలము లందు గోరు లను నంకుశములచే ఘాతములఁ జేయు నని భావము.

(గమనిక: కొల్లాపురంవారి తొలిముద్రణలో ఈపద్యమునందలి రెండవచరణములో ‘కరమయి’ అని యున్నది. దీనికి కరమయి =అధికమయి అని వ్యాఖ్యాతలు అర్థమిచ్చినారు. ‘క’ ప్రాసాక్షరముగా గల ఈ పద్యమునకు ‘కరమయి’ అని యుండుటచే ప్రాసభంగము కల్గినది. కాని దీనినిగుఱించి వ్యాఖ్యాతలు ప్రస్తావించలేదు. కొల్లాపురంవారి రెండవముద్రణలో దీనిని ‘రకమయి’ అని మార్చి ప్రాసదోషమును సవరించిరి కాని, వ్యాఖ్యానములో కరమయి=అధికమై అను దాని నట్లే ఉంచినారు. కేశవపంతుల వారి మూలముద్రణములోను ‘రకమయి’ అను రూపమునే గ్రహించినారు. రకమయి అనుపదమునకు ‘సుందరమయి’, ‘శ్రేష్ఠ మయి’ అను రెండర్థములను సూర్యరాయాంధ్రనిఘంటు విచ్చుచున్నది. అందుచేత పై వ్యాఖ్యానములో రకమయి= శ్రేష్ఠ మయి అని ఉంచి, బ్రాకెట్లలో మునుపటి వ్యాఖ్యాతల అధికమయి అను అర్థమును గూడ ఉంచినాను – దేశికాచార్యుఁడు.)

తే. అనిన నెమ్మోము మరలిచె ◊వనజవదన, యది కనుంగొని గిరిజ య◊ప్పదవిఁ గుకురు
వరునిఁ జేచాయఁ జూపి య◊వ్వనిత కిట్టు, లనియె మహతీరవామిత్ర◊నినదకలన. 113

టీక: అనినన్=ఇట్లు పలుకఁగా; నెమ్మోము=సుందరమగు ముఖమును; వనజవదన =చంద్రిక; మరలిచెన్=త్రిప్పెను;అది కనుంగొని =అది చూచి; గిరిజ=పార్వతీదేవి; అప్పదవిన్=ఆదారియందు; కుకురువరునిన్=కుకురుదేశాధిపతిని; చేచాయన్ =చెయిజాడచే; చూపి=ప్రదర్శించి; అవ్వనితకున్=ఆచంద్రికకు; మహతీరవామిత్రనినదకలనన్ – మహతీ=నారదునివీణ యొక్క, రవ=స్వనమునకు, అమిత్ర=విరోధియగు,నినద=ధ్వనియొక్క,కలనన్=ప్రాప్తిచేత; ఇట్టులు=వక్ష్యమాణప్రకారము; అనియెన్=పలికెను.

చంద్రిక యానరపతిమీఁద మనంబు పొందకున్కి మోము ద్రిప్పఁగానె గౌరీదేవి యచటఁ గుకురుదేశరాజుం జూపి, నారదుని వీణారవమునకు సాటియగు సుందరవచనములచే వక్ష్యమాణప్రకారముగఁ బలికె నని తాత్పర్యము.

చ. చెలి! కుకురుక్షమారమణ◊శేఖరుఁ డీతఁడు వీనిఁ గాంచు మీ
జలజశరోపమాను నెఱ◊చక్కఁదనంబు జగంబు లెంచ ని
చ్చలు నెదఁ గుందఁజేయుఁ దొవ◊సామి వనావళిఁ దోలు నామనిన్
దలఁచుఁ దృణంబుగా నలజ◊నప్రభుఁ దా నెగఁబట్టు వాసవిన్. 114

టీక: చెలి=చంద్రికా! ఈతఁడు; కుకురుక్షమారమణశేఖరుఁడు=కుకురురాజశ్రేష్ఠుఁడు; వీనిన్=ఈరాజును; కాంచుము = చూడుము; ఈజలజశరోపమాను నెఱచక్కఁదనంబు=ఈ మన్మథతుల్యుఁడగు రాజుయొక్క నిండుసౌందర్యము; జగంబు లెంచన్= లోకములు నుతియింపఁగా; తొవసామిన్=కలువలరాయని; నిచ్చలు=ఎల్లప్పుడు; ఎదన్=హృదయమందు; కుందఁ జేయున్=దుఃఖించు నటులు చేయును, తగ్గునటులు చేయునని స్వభావార్థము, కృష్ణపక్షమందుఁ జంద్రుఁడు తగ్గుట సహజ మని భావము; ఆమనిన్=వసంతుని; వనావళిన్=వనపంక్తినిగూర్చి; తోలున్=పంపును, మిక్కిలి చక్కఁదనము గల వసంతుని నడవికిఁ బాఱిపోవునటులు చేయునని భావము, వసంతుఁడు వనావళియం దుండుట సహజ మని భావము; నలజనప్రభున్= నలచక్రవర్తిని; తృణంబుగాన్=గడ్డిపోచఁగా; తలచున్=ఎంచును, నలుని తిరస్కరించు ననుట, నలశబ్దమునకు తృణ మర్థము గావున తృణముగాఁ దలచుట సహజ మని భావము; వాసవిన్=జయంతుని; తాన్=తాను;ఎగఁబట్టున్=ఎగఁజిమ్మును, తిరస్క రించు ననుట, ఆకాశగమనము జయంతునకు సహజమని భావము;

చ. సరసమహాత్మత న్భువన◊జన్మవినాశనహేతువైన యీ
నరపతికీర్తి దైవము గ◊నం బ్రతికూలతచేఁ జరింప ని
ర్జరతరుపాళి కేపు తన◊చాయ పొసంగునె చుట్టమై కడున్
ఖరదనుజారికిం బగయ ◊గాదొకొ కట్టిన కోఁక యెంచఁగన్. 115

టీక: సరసమహాత్మతన్ – సరస=శ్రేష్ఠమగు, మహాత్మతన్=ప్రభావముచేతను; భువనజన్మవినాశనహేతువైన – భువనజన్మ= జలజములయొక్క, వినాశన=నశింపఁజేయుటయందు, హేతువైన=కారణమైన; ఈనరపతికీర్తి దైవము =ఈరాజుయొక్క కీర్తి యనెడు దైవము; ఇచట, భువ=ప్రపంచముయొక్క, జన్మ=ఉత్పత్తికి, వినాశన=నాశమునకు, హేతువైన యని దైవపక్షమున కర్థము; కనన్=చూడఁగా; ప్రతికూలతచేన్=ప్రాతికూల్యముచేత; చరింపన్=వర్తింపఁగా; అనఁగా కీర్తిదైవము ప్రతికూలము కాఁ గానే యనుట; నిర్జరతరుపాళికిన్=కల్పతరుబృందమునకు; తనచాయ=తననీడ; కడున్=మిక్కిలి;చుట్టమై=బంధువై; ఏపున్ = విజృంభణమును; పొసంగునె=చేయునా? యని కాకువు, కీర్తి ప్రతికూలము కాఁగానే కల్పతరుపాళికి తననీడ యేపుఁజేయక యుండె ననుట, చెట్లు తెల్లనివైనను, నీడ నల్లనిదిగాన ననుకూలము గాకపోయెనని భావము, లోకమందు దైవము ప్రతికూలము కాగానె చుట్టమును ప్రతికూలించునని భావము; ఖరదనుజారికిన్=బలరామునికి; ఎంచఁగన్=విచారింపఁగ; కట్టినకోఁక =కట్టు వస్త్రము; పగయ గాదొకొ =శత్రువె గాదా యని కాకువు, బలరామునికి కట్టువస్త్రము నల్లనిదని భావము. ఏతత్కీర్తిదైవము ప్రతికూ లించుటచేఁ గట్టువస్త్రము సైతము బలరామునకుఁ బ్రతికూలించె ననుట.

క. అని పాంచాలక్షితివర, తనయామణి కద్రిరాజ◊తనయ తెలుపఁగా
నెనయింప దయ్యె నపుడా, ఘనుపైఁ గలకంఠి చిత్త◊గతరాగంబున్. 116

టీక: అని=పూర్వోక్తప్రకారము; పాంచాలక్షితివర తనయామణికిన్=క్షణదోదయరాజపుత్రిక యగు చంద్రికకు; అద్రిరాజత నయ = పార్వతీదేవి;తెలుపఁగాన్=తెలియఁజేయఁగా; అపుడు; ఆఘనుపైన్=ఆరాజుమీఁద; కలకంఠి=చంద్రిక; చిత్తగతరా గంబున్=మనోగతమైన యనురాగమును;ఎనయింప దయ్యెన్=పొందింపదాయెను.

వ. అంత నయ్యనంతజూటనీలకుంతల యక్కాంత కిట్లు సకలదేశకాంతసంతానంబులం గ్రమక్రమంబునం దెలుపుచుం జని చని యారాజసభామధ్యంబున నక్షత్రనికరాంతరద్యోతమానరాకాసుధాకరుండునుం బోలె నమూల్యలక్షణలక్షితగాత్రుండును ననుపమానకలాపాలికాసమన్వితుండును జకోరలోచనానంద సంధాయకతేజస్సాంద్రుండును నగుచుఁ జూపట్టు సుచంద్రమనుజేంద్రుం జూపి తదీయచిత్తంబు తదాయత్తం బగుట దెలిసి యాకనకగౌరి కాగౌరి యిట్లనియె. 117

టీక. అంతన్=అటుపిమ్మట; అయ్యనంతజూటనీలకుంతల =వ్యోమకేశునికాంత యగు పార్వతీదేవి; అక్కాంతకున్=ఆ చంద్రి కకు; ఇట్లు=పూర్వోక్తప్రకారము; సకలదేశకాంతసంతానంబులన్ – సకలదేశకాంత=సమస్తదేశాధిపతులయొక్క, సంతానంబు లన్=సమూహములను; క్రమక్రమంబునన్=వరుసగా; తెలుపుచున్=తెలియఁజేయుచు; చని చని =అరిగియరిగి; ఆరాజసభా మధ్యంబునన్=ఆరాజసభనడుమ; నక్షత్రనికరాంతరద్యోతమానరాకాసుధాకరుండునుంబోలెన్ – నక్షత్రనికర= రిక్కలగుంపు యొక్క, అంతర=మధ్యప్రదేశమందు, ద్యోతమాన=వెలుఁగుచున్న, రాకాసుధాకరుండునుంబోలెన్=పున్నమచందురునివలె; అమూల్యలక్షణలక్షితగాత్రుండును – అమూల్య=వెలలేని,లక్షణ=శుభచిహ్నములతో,లక్షిత=కూడుకొన్న, గాత్రుండును= శరీరముగలవాఁడును; అమూల్యమైన, లక్షణ=కలంకముచేత, నని చంద్రపరమైన యర్థము; అనుపమానకలాపాలికాసమన్వి తుండును – అనుపమాన=సాటిలేని, కలా=విద్యలయొక్క, పాలికా= పంక్తితో, సమన్వితుండును=కూడినవాఁడును; అనుప మానమగు, కలాపాలికా=కాంతిపంక్తులతో, సమన్వితుండని చంద్రపరమైన యర్థము; చకోరలోచనానందసంధాయక తేజ స్సాంద్రుండును – చకోరలోచనా =స్త్రీలకు, ఆనందసంధాయక=సంతసమును ఘటిల్లఁజేయు; తేజః =తేజస్సులచేత, సాంద్రుం డును=నిండినవాఁడును; చకోర =వెన్నెలపుల్గులయొక్క,లోచనములకు, ఆనందసంధాయకమగు తేజముతోఁ గూడినవాఁడని చంద్రపరమైన యర్థము; అగుచున్= ఈప్రకార మయినవాఁడై; చూపట్టు సుచంద్రమనుజేంద్రున్ = కనిపించు సుచంద్రుండను రాజేంద్రుని; చూపి; తదీయచిత్తంబు =చంద్రికసంబంధియైన మనము; తదాయత్తంబు=ఆసుచంద్రు నధీనము; అగుటన్; తెలిసి =ఎఱిఁగి; ఆకనకగౌరికిన్=బంగరు వలె గౌరవర్ణము గల యాచంద్రికకు; ఆగౌరి=ఆపార్వతీదేవి; ఇట్లు=వక్ష్యమాణప్రకారము; అనియెన్=పలికెను.

మ. లలనా! కన్గొనుమీ రవిప్రభు విశా◊లారాజధానీప్రభు
న్లలిమై నీపతి యొప్పుఁగాక యెద వ్రే◊లం ద్వత్కరాంభోరుహ
స్థలి రాజిల్లుప్రసూనదామకము చం◊చద్వైజయంతీభృతిం
జెలువుం బూనురమావిభుం డన సుర◊శ్రేణుల్ ప్రమోదింపఁగన్. 118

టీక: లలనా = చంద్రికా! ఈరవిప్రభున్ = ఈసూర్యకాంతిగల; విశాలారాజధానీప్రభున్= విశాలాపురపతిని; కన్గొనుము = చూడుము; లలిమైన్=ప్రేమచేత; ఈపతి=ఈరాజు; త్వత్కరాంభోరుహస్థలి రాజిల్లుప్రసూనదామకము – త్వత్=నీయొక్క, కరాంభోరుహస్థలిన్=కరకమలప్రదేశమునందు, రాజిల్లు=ప్రకాశించు, ప్రసూనదామకము=పూదండ; ఎదన్=వక్షమునందు; వ్రేలన్=వ్రేలాడఁగా; చంచద్వైజయంతీభృతిన్—చంచత్=ప్రకాశించుచున్న, వైజయంతీ=వనమాలయొక్క,భృతిన్=భరణము చేత; చెలువున్=అందమును; పూనురమావిభుం డనన్=పొందినట్టి నారాయణమూర్తి యనునట్లు; సురశ్రేణుల్=దేవసంఘ ములు; ప్రమోదింపఁగన్=సంతోషింపఁగా; ఒప్పుఁగాక=ప్రకాశించునుగాక. చంద్రికా! వనమాలచే విష్ణువు ప్రకాశించునట్లు నీ చేతిపూదండను వక్షమున ధరించి యీవిశాలాపురాధిపతి ప్రకాశించుఁగాక యని భావము.

చ. నెలఁతుక! యీసుచంద్రధర◊ణీపతి శాతశరచ్ఛటం బలా
ద్బలగళరక్త మర్ఘ్యముగఁ ◊దత్కరికుంభమహామణు ల్సుమాం
జలిగఁ దదాతపత్రములు ◊చక్కనియార్తులుగాఁ దనర్చుచున్
బలి రణచండి కూన్చె ముని◊పాళి నుతింపఁ దమిస్రదానవున్. 119

టీక: నెలఁతుక=చంద్రికా! ఈసుచంద్రధరణీపతి=ఈసుచంద్రభూపాలుఁడు; శాతశరచ్ఛటన్ – శాత=తీక్ష్ణమైన, శరచ్ఛటన్ = బాణసమూహముచేత; పలాద్బలగళరక్తము — పలాద్బల=రాక్షసబలముయొక్క, గళరక్తము =కంఠశోణితము; అర్ఘ్యము గన్ =పూజార్హమైన వస్తువుగా;తత్కరికుంభమహామణుల్ – తత్=ఆదానవులయొక్క, కరికుంభ=గజకుంభములయందున్న, మహామణుల్=అధికమైనమణులు; సుమాంజలిగన్=కుసుమాంజలిగ; తదాతపత్రములు=ఆరాక్షసుల గొడుగులు; చక్కని యార్తులుగాన్=సుందరమగు నారతులుగా; తనర్చుచున్=చేయుచు; రణచండికిన్=రణదుర్గకు; తమిస్రదానవున్=తమిస్రా సురుని; మునిపాళి నుతింపన్=మునిసంఘములు కొనియాడఁగ; బలిన్=బలిగా; ఊన్చెన్=చేసెను.

అనఁగా నోచంద్రికా! ఈసుచంద్రుఁడు రాక్షసులయొక్క కంఠరక్తము నర్ఘ్యముగాను, వారిగజకుంభములనుండి వెడలిన ముత్తెములను కుసుమాంజలిగాను, వారిగొడుగులను హారతులుగను జేయుచు అర్ఘ్యము మొదలగు పూజాద్రవ్యములను జత పఱచి రణదుర్గను పూజించి, తమిస్రాసురుని బలియిచ్చెనని భావము.

మ. అని నేతద్విభుసాయకాభిహతి మి◊న్నంటం బయిం బర్వి శ
త్రునృపాళీమకుటీవలక్షమణిపం◊క్తుల్ ద్రెళ్ళుటల్ పొల్చు వ
ర్ణన సేయం జెలినిర్భరానకరవ◊భ్రశ్యన్మహోడుస్థితిన్
ఘనలేఖోత్కరవర్షితాభ్రతరురం◊గత్కోరకవ్యాపృతిన్. 120

టీక: చెలి=చంద్రికా! అనిన్=యుద్ధమందు; ఏతద్విభుసాయకాభిహతిన్ – ఏతద్విభు=ఈసుచంద్రునియొక్క, సాయక= బాణ ములయొక్క, అభిహతిన్=కొట్టుటచేత;మిన్నంటన్=ఆకసము నంటునటులు; పయిన్=ఊర్ధ్వభాగమందు; పర్వి=వ్యాప్తమై; శత్రునృపాళీ మకుటీ వలక్షమణి పంక్తుల్ – శత్రునృప=శత్రురాజులయొక్క, ఆళీ=పంక్తులయొక్క, మకుటీ=కిరీటములందలి, వలక్షమణి= రవలయొక్క, పంక్తుల్=శ్రేణులు; త్రెళ్ళుటల్=పడుటలు; వర్ణన సేయన్=నుతియింపఁగా; ఘన లే ఖోత్కర వర్షి తాభ్రతరు రంగ త్కోరక వ్యాపృతిన్ – ఘన=గొప్పవారైన, లేఖ=దేవతలయొక్క,ఉత్కర=సమూహముచేత, వర్షిత=వర్షింపఁ జేయఁబడిన, అభ్రతరు=కల్పవృక్షముయొక్క, రంగత్=ప్రకాశించుచున్న,కోరక=మొగ్గలయొక్క, వ్యాపృతిన్=మేళనము చేత; నిర్భ రానక రవ భ్రశ్య న్మహోడు స్థితిన్—నిర్భర=పరిపూర్ణమగు, ఆనక=పటహముయొక్క,రవ=ధ్వనిచేత, భ్రశ్యత్= జాఱుచున్న, మహోడు=గొప్పనక్షత్రములయొక్క,స్థితిన్=భంగిచే; పొల్చున్=ఒప్పును.

ఈసుచంద్రునియొక్క బాణహతిచే శత్రుమకుటతటఘటితమణులు మిన్నంటి యంతట వ్యాపించి, దేవతలు వర్షించు చున్నకల్పతరుకలికలతోఁ గూడి పుడమి వ్రాలుచు, రణభేరీరవమునకుఁ గూలు రిక్కలగుంపులవలె నొప్పిన వని భావము.

చ. జలజదళాక్షి! యీపతి సు◊చంద్రసమాహ్వయ మెట్లు పూనెనో
తెలియఁగ రాదు ధాత్రిఁ బర◊దేవమనఃప్రమదాపహారి ని
శ్చలకరకాండుఁడై, భువన◊జాతనవోత్సవదాయకోదయో
జ్జ్వలుఁడయి, సద్బుధాప్తుఁడయి ◊సంతతము న్నలువారుచుండఁగన్. 121

టీక: జలజదళాక్షి=చంద్రికా! ధాత్రిన్=భూమియందు; పర దేవ మనఃప్రమ దాపహారి – పర=ఉత్కృష్టమగు, దేవ=దేవతల యొక్క, మనఃప్రమద=మనస్సంతోషమును, అపహారి=హరించువాఁడును; పరదేవ=శత్రురాజులయొక్క, మనఃప్రమదాపహారి అని స్వభావార్థము; నిశ్చలకరకాండుఁడై – నిశ్చల=చలింపని,కర=కిరణములయొక్క,కాండుఁడై=సమూహము గలవాఁడై; నిశ్చలమగు, కర=చేతియందున్న, కాండుఁడై=బాణములుగలవాఁడై యని స్వభావార్థము; భువనజాత నవోత్సవ దాయ కోద యోజ్జ్వలుఁ డయి – భువనజాత=కమలములకు, నవ = నూతనమగు, ఉత్సవ = వికాసరూపోత్సవమును, దాయక= ఇచ్చు చున్న, ఉదయ=ఆవిర్భావముచేత, ఉజ్జ్వలుఁడయి =ప్రకాశించుచున్నవాఁడై; భువనజాత=లోకబృందమునకు, నవోత్సవ= నూతనమగు నుత్సవమును, దాయక=ఇచ్చుచున్న, ఉదయ=అభివృద్ధిచేత, ఉజ్జ్వలుఁడయి అని స్వభావార్థము; సద్బుధా ప్తుఁ డయి – సత్=రిక్కలకు, బుధ=బుధునికి,ఆప్తుఁడయి=ఇష్టుఁడయినవాఁడై; బుధునకు ప్రసిద్ధచంద్రుఁడు విరోధి యనుట బృహజ్జాతకమందు ప్రసిద్ధము. ‘శ్లో||మిత్రే సౌరిసితౌ బుధస్య హిమగు శ్శత్రు స్సమా శ్చాపరే’ అని తత్ప్రమాణము; సత్= శ్రేష్ఠు లైన, బుధ=విద్వాంసులకు, ఆప్తుఁడయి=ఇష్టుఁడయినవాఁడై యని స్వభావార్థము; సంతతమున్=ఎల్లపుడు; నలువారుచుండఁ గన్=ఒప్పుచుండఁగ; ఈపతి=ఈరాజు; సుచంద్రసమాహ్వయము=సుచంద్రుఁడను పేరును; ఎట్లు పూనెనో ఏరీతిఁ బొందెనో; తెలియఁగ రాదు =తెలియదు. అనఁగ నీనరపతి పరదేవుల సంతసమును గూల్చియు, నిశ్చలకరకాండుఁడయ్యును, భువనజా తోత్సవప్రదుఁడయ్యును, సద్బుధాప్తుఁడయ్యును, సుచంద్రుఁడను పేరు నెట్లు పొందెనో తెలియ దని భావము.

ఉ. మానిని! యీనృపాలకర◊మాసుతు సుందరతాలవంబు దా
మానుగ నంది చంద్రుఁ డస◊మానమహస్థితి మిన్ను ముట్టఁగా
నౌనన కేలొకో మధు వ◊హంకృతిచే సుమనోవిరోధమున్
బూని ఘనుల్ గరంపఁ గర◊ము న్వని రూపఱుఁ బెంపు వాయఁగన్. 122

టీక:మానిని=చంద్రికా! ఈనృపాలకరమాసుతు సుందరతా లవంబున్ – ఈనృపాలకరమాసుతు=ఈరాజమన్మథునియొక్క, సుందరతా=సౌందర్యముయొక్క, లవంబున్=లేశమును; చంద్రుఁడు=హిమాంశుఁడు; తాన్=తాను; మానుగన్=మనోజ్ఞ ముగ; అంది=పొంది; అసమానమహస్థితిన్ – అసమాన=నిస్సమానమగు,మహస్థితిన్=తేజస్సుయొక్క స్థితిచేత; మిన్ను ముట్టఁగాన్=విఱ్ఱవీగఁగా, ఆకాశము ముట్టఁగా నని స్వభావార్థము; మధువు=వసంతుఁడు; అహంకృతిచేన్=అహంకారముచేత; ఔననక= ఒప్పుకొనక; ఏలొకో=ఎందుకో; సుమనోవిరోధమున్=విద్వద్విరోధమును, సుమన మనఁగా జాజి, వసంతమందు జాతీపుష్పములు లేవనుట కవిసమయము. అందుచే వసంతుడు సుమనోవిరోధి యని స్వభావార్థము; పూని=పొంది; ఘనుల్= పెద్దలు, మేఘములు; కరంపన్ =అహంకారమును పోఁగొట్టఁగా; వర్షాకాలమందు మేఘము లుదయింపఁగానే వసంతకాలము పోవునని భావము; వనిన్=వనమందు; కరము=మిక్కిలి; పెంపు వాయఁగన్=అతిశయము వీడునట్లు;రూపఱున్=నశించును.

సీ. ఏలోకమిత్రుధా◊మాలోక మరిరాజ, సమ్మోదవర్ధన◊చ్ఛాయ వెలయు,
నేరాజు నెమ్మేని◊తోరంపుసిరి పద్మి,నుల మానగతి నెల్లఁ ◊దలఁగఁ జేయు,
నేసద్గుణాంభోధి◊భాసురదానవై,ఖరి బుధావళి మహో◊త్కంఠఁ గూర్చు,
నేధరోద్ధారువి◊శ్వైషణీయసమాఖ్య, భువనమాలిన్యంబు ◊పొడ వడంచు,
తే. నమ్మహాభావుఁ డీతఁ డో◊యబ్జపత్ర, బాంధవన్నేత్ర! సకలభూ◊భరణశాలి
వీనిపై నీమనం బిప్పు◊డూనఁ జేసి, యతనుసామ్రాజ్యసంలబ్ధి ◊నతిశయిలుము. 123

టీక: ఏలోకమిత్రుధామాలోకము – ఏలోకమిత్రు=జగన్మిత్రుఁడగు నే సుచంద్రునియొక్క, ధామాలోకము=ప్రతాపముయొక్క దీప్తి; అరిరాజసమ్మోదవర్ధనచ్ఛాయన్ – అరిరాజ=శత్రురాజులయొక్క, సమ్మోద=సంతసముయొక్క, వర్ధన=ఛేదనము యొక్క, ఛాయన్=రీతిచేత; వెలయున్=ప్రకాశించునో; ఏలోకమిత్రు=ఏ సూర్యునియొక్క, ధామాలోకము=తేజఃప్రకాశము, అరిరాజ=జక్కవలయొక్క,సమ్మోద=సంతసముయొక్క,వర్ధన=అభివృద్ధియొక్క, ఛాయన్=రీతిచేత; వెలయున్= ప్రకా శించునోయను నర్థము దోఁచుచున్నది; ఏరాజు నెమ్మేనితోరంపుసిరి – ఏరాజు=ఏసుచంద్రునియొక్క, నెమ్మేని=సుందరమగు శరీరముయొక్క,తోరంపు=అధికమగు; సిరి=కాంతి; పద్మినుల మానగతిన్=పద్మినీజాతిస్త్రీలయొక్క యభిమానగతిని; ఎల్లన్=సర్వము; తలఁగఁ జేయున్=పోఁ గొట్టు నో; చంద్రునియొక్క తోరంపుసిరి పద్మలతయొక్క గర్వాతిశయమును పోఁగొట్టు నను నర్థము దోఁచుచున్నది;
ఏసద్గుణాంభోధిభాసురదానవైఖరి – ఏసద్గుణాంభోధి=మంచిగుణములకు సముద్రుఁడగు నే సుచంద్రునియొక్క, భాసుర=ప్రకా శించుచున్న, దాన=త్యాగముయొక్క,వైఖరి=రీతి; బుధావళిమహోత్కంఠన్ – బుధావళి=విద్వద్బృందముయొక్క, మహో త్కంఠన్=అధికమైన సంతోషమును; కూర్చున్=కలుఁగఁజేయునో; భాయుక్తమై, అసుర=రక్కసులయొక్క, దాన=ఖండ నముయొక్క, వైఖరి=రీతి, బుధావళి=దేవతాసమూహమునకు, మహోత్కంఠతను గూర్చు నని గాని ప్రథమార్థము; సద్గుణ =మంచిగుణములుగల, అంభోధి=సముద్రునియొక్క,భా=కాంతియుక్తమగు, సురదాన= అమృతదానముయొక్క, వైఖరి= రీతి, బుధావళి=దేవబృందమునకు, మహోత్కంఠను గూర్చు నను ద్వితీయార్థము స్ఫురించుచున్నది; ఏధరోద్ధారువిశ్వైషణీయసమాఖ్య – ఏధరోద్ధారు=ఏరాజుయొక్క,విశ్వ=లోకమునకు, ఏషణీయ=కోరదగిన,సమాఖ్య= కీర్తి; భువనమాలిన్యంబు – భువన=లోకములయొక్క, మాలిన్యంబు=పాపమును, నైల్యమును; పొడవడంచున్=రూపుమాపునో; ఏధరోద్ధారు=ఏయాదికూర్మముయొక్క, విశ్వైషణీయసమాఖ్య, భువనమాలిన్యంబు=జలమాలిన్యమును, పొడవడంచు నను నర్థము దోఁచుచున్నది; అమ్మహాభావుఁడు=అట్టి గొప్పమనసుగలవాఁడు; ఈతఁడు=ఈసుచంద్రుఁడు; ఓయబ్జపత్రబాంధవన్నేత్ర = ఓతామరపత్రము లకు చుట్టమగు నేత్రములుగలదానా! కమలదళములకు సమానములగు నేత్రములుగలదానా యని తాత్పర్యము, సగోత్రజ్ఞాతి బాంధవాదిశబ్దములు ఇవార్థకము లని యిదివఱలో వ్రాయఁబడి యున్నది; సకలభూభరణశాలి – సకల=సమస్తమగు, భూ= భూమియొక్క, భరణ=భరించుటచేత,శాలి=ప్రకాశించువాఁడు; వీనిపైన్=ఈరాజునందు; నీమనంబు=నీయొక్క మనస్సును; ఇప్పుడు=ఈతఱి; ఊనఁ జేసి=పొందునటులు చేసి; అతనుసామ్రాజ్యసంలబ్ధిన్ – అతను=అధికమగు, సామ్రాజ్య=సమ్రాట్టు తనముయొక్క, సంలబ్ధిన్=ప్రాప్తిచేత; అతను=మన్మథునియొక్క, సామ్రాజ్యసంలబ్ధిచే నని యర్థము దోఁచుచున్నది; అతిశ యిలుము = అత్యుత్కర్షముగా నుండుము.

ఏరాజుయొక్క ప్రతాపము శత్రురాజులయొక్క సంతసమును గూల్చుచున్నదో, ఏరాజుయొక్క సౌందర్యాతిశయము పద్మినీజాతిస్త్రీలయొక్క మానమును తొలఁగఁజేయునో, ఏరాజుయొక్క దానవైఖరి పండితులకు నుత్కంఠకరమగుచున్నదో, ఏరాజుకీర్తి జగన్మాలిన్యమును పోనాడునో అట్టి ప్రసిద్ధిని బొందినవాఁడు వీఁడే గాన వీని వరియించి, యతనుసామ్రాజ్యసుఖము నొందుము అని భావము.

తే. సకలనుత్యకళాశాలి ◊సౌరవంశ, మౌళి నిమ్మేటి వరియింపు ◊మామకోక్తి
నీమనఃపద్మ మామోద◊నిభృతి మీఱ, బింబవిమతోష్ఠి! యింక వి◊లంబ మేల. 124

టీక: సకలనుత్యకళాశాలిన్ – సకల=సమస్తజనులచేత,నుత్య=కొనియాడఁదగిన,కళా=విద్యలచేత,శాలిన్=ప్రకాశించువాఁ డగు; సౌరవంశమౌళిన్ =సూర్యవంశశ్రేష్ఠుఁడగు, ఇమ్మేటిన్=ఈయధికుని; మామకోక్తిన్=నావచనముచేత;నీమనఃపద్మము = నీమనోంబుజము; ఆమోదనిభృతిన్=సంతసము వహించుటచే; మీఱన్=అతిశయించునట్లు; వరియింపు=కోరుము; బింబవిమ తోష్ఠి=దొండపండునకు విరోధి యగు నధరముగలదానా! ఇంకన్=ఇంకను; విలంబ మేల= తడవేల?

వ. అని యాలోకజనని యానతిచ్చిన, నాచంద్రిక తత్సుచంద్రరాజచంద్ర సద్గుణగణశ్రవణసంజాయమాన కౌతూహలయును, దన్మహిపవర్య సౌందర్యలహరీపరివర్తమానలోచనమీనయును, దల్లోకరమణాలోక సముజ్జృంభమాణసాత్త్వికభావ సంభావితయును, దజ్జనేంద్రసమీపస్థితిప్రకార సంఫుల్ల్యమానలజ్జాంకుర యును, దన్మనోనాయక సంవరణసముద్వేగవలమానమానసయును నై, యమ్మహాదేవిముఖంబు గన్గొని తదనుజ్ఞాగౌరవంబున.

టీక: అని=పూర్వోక్తప్రకారముగ; ఆలోకజనని=జగన్మాత యగు నాపార్వతీదేవి; ఆనతిచ్చినన్=సెలవీయఁగా; ఆచంద్రిక; తత్సుచంద్రరాజచంద్ర సద్గుణగణ శ్రవణ సంజాయమాన కౌతూహలయును – తత్సుచంద్రరాజచంద్ర =రాజశ్రేష్ఠుఁడగు నా సుచంద్రునియొక్క, సద్గుణగణ=సుగుణబృందముయొక్క, శ్రవణ=వినుటవలన,సంజాయమాన=పుట్టిన, కౌతూహలయును =సంతసము గలదియు; తన్మహిపవర్య సౌందర్యలహరీ పరివర్తమాన లోచనమీనయును – తన్మహిపవర్య=ఆరాజశ్రేష్ఠుని యొక్క, సౌందర్యలహరీ=చక్కఁదనమను ప్రవాహమందు, పరివర్తమాన=తిరుగుచున్న, లోచనమీనయును=కన్నులను చేఁపలు గలదియును; తల్లోకరమ ణాలోక సముజ్జృంభమాణ సాత్త్వికభావ సంభావితయును – తల్లోకరమణ=ఆరాజుయొక్క, ఆలోక=దర్శనముచేత, సముజ్జృంభమాణ=ఉప్పొంగుచున్న,సాత్త్వికభావ=సాత్త్వికభావములచేత,సంభావితయును= సంభా వింపఁబడినదియును, సాత్త్వికభావము లనఁగా నాయికానాయకులయొక్క పరస్పరదర్శన స్పర్శనాదులచే నుదయించు స్తంభాదులు, అవి, ‘శ్లో. తే స్తమ్భ స్వేద రోమాఞ్చా స్స్వరభేద శ్చ వేపథుః| వైవర్ణ్య మశ్రు ప్రళయా వి త్యష్టౌ పరికీర్తితాః’ అని సింగ భూపాలీయములోఁ జెప్పఁబడియున్నవి; తజ్జనేంద్ర సమీపస్థితి ప్రకార సంఫుల్ల్యమాన లజ్జాంకురయును – తజ్జనేంద్ర= ఆరాజేం ద్రునియొక్క, సమీపస్థితి=సమీపమునందుండుటయొక్క, ప్రకార=రీతిచేత, సంఫుల్ల్యమాన=వికసించిన, లజ్జాంకుర యును = సిగ్గుమొలకలు గలిగినదియును; తన్మనోనాయక సంవరణ సముద్వేగ వలమాన మానసయును – తన్మనోనాయక =ఆసుచం ద్రునియొక్క, సంవరణ=వరియించుటవలన నయిన, సముద్వేగ=అవ్యవస్థితచిత్తతచేత, వలమాన=కదలుచున్న, మానసయును=చిత్తము గలదియును; ఐ=అయినదియై; ఆమ్మహాదేవిముఖంబు=ఆపార్వతీదేవిముఖమును; కన్గొని=చూచి; తదనుజ్ఞాగౌరవంబునన్=ఆపార్వతీదేవియొక్క ఆజ్ఞాగౌరవముచేత, దీని కుత్తరపద్యముతో నన్వయము.

చ. కనకవిమాన మప్డు డిగి ◊కన్గొన సర్వనరేంద్రలోకము
ల్మనమున వేడ్క నిండఁ గయి◊లా గొసఁగం గిరిరాజకన్య యా
ఘననిభవేణి తన్మహిత◊కాంచనమంచక మెక్కి నిల్పె నా
మనుజకులేంద్రుకంఠమున ◊మంజులమంగళపుష్పదామమున్. 126

టీక: కనకవిమానము=సువర్ణవిమానమునుండి; అప్డు=ఆసమయమందు; డిగి =దిగి; సర్వనరేంద్రలోకము = సమస్తరాజులు; కన్గొనన్=చూడఁగా; మనమునన్=హృదయమందు; వేడ్క=సంతసము; నిండన్=నిండఁగా; గిరిరాజకన్య=పార్వతీదేవి; కయిలా గొసఁగన్=కైదండ నొసఁగగా; ఆఘననిభవేణి =మేఘమువంటి జడగల యాచంద్రిక;తన్మహితకాంచనమంచకము – తత్=ఆసుచంద్రునియొక్క, మహిత=పూజితమగు, కాంచనమంచకము=బంగరుమంచమును;ఎక్కి=ఆరోహించి; ఆమనుజ కులేంద్రుకంఠమునన్=ఆరాజశ్రేష్ఠుని గళమునందు; మంజులమంగళపుష్పదామమున్—మంజుల=మనోజ్ఞమగు, మంగళ= శుభప్రదమగు, పుష్పదామమున్=పూదండను; నిల్పెన్=ఉంచెను.

అనఁగ చంద్రిక తనవిమానము దిగి రాజు లెల్లరు చూచుచుం డఁగ సుచంద్రునిమంచము నెక్కి యతనికంఠమందు మంగళప్రద మగు పూదండ నుంచె నని భావము.

ఉ. ఆవనజాక్షి యాతఱి న◊జాంగనయానతిఁ దత్సుచంద్రధా
త్రీవిభుని న్వరించి యల◊రె న్నలు భైమి యనంగ సమ్మద
శ్రీ వెలయంగఁ జిత్తముల ◊జిష్ణువిరోచనసూర్యసంతతీ
రావరు లెల్ల సమ్మతిఁ గ◊రంబు మనంబున సంతసిల్లఁగన్. 127

ఉ. ఆవనజాక్షి =ఆచంద్రిక;ఆతఱిన్=ఆసమయమందు; అజాంగనయానతిన్ – అజ=శంకరునికి, అంగన=కాంతయగు పార్వతీదేవియొక్క, ‘అజా విష్ణు హర చ్ఛాగాః’ అని యమరుఁడు,ఆనతిన్=ఆజ్ఞచేతను; తత్సుచంద్రధాత్రీవిభునిన్= ఆ సుచంద్రభూపతిని; నలున్=నలమహారాజును; భైమి యనంగన్=దమయంతి యన్నట్లు;వరించి; సమ్మదశ్రీ వెలయంగన్ – సమ్మద=సంతసముయొక్క,శ్రీ=అతిశయము, వెలయంగన్=ప్రకాశింపఁగా; చిత్తములన్=మనములందు; జిష్ణు విరోచన సూర్య సంతతీరావరు లెల్లన్ – జిష్ణు=జయశీలురగు,విరోచన=చంద్రునియొక్క,సూర్య=ఆదిత్యునియొక్క, సంతతి= కులముగల, ఇరావరులు=భూపతులు, ఎల్లన్=అందఱును; సమ్మతిన్=అంగీకారముచేత; కరంబు=మిక్కిలి;మనంబునన్ = మనసునందు; సంతసిల్లఁగన్=సంతోషింపఁగా; అలరెన్=ఒప్పెను. ఆ చంద్రిక పార్వతీదేవి యాజ్ఞవలన నలుని దమయంతి వరించినట్లు సుచంద్రుని వరియించి, సూర్యచంద్రవంశపురాజు లెల్ల సంతసింపఁగా నొప్పారె నని భావము.

ఉ. నించిరి వేలుపుల్ ప్రియము◊నిక్కఁగఁ గ్రొవ్విరిసోన చక్క దీ
వించిరి తాపసాధిపు ల◊వేలమృదంగరవాళి మించ సం
ధించిరి నాట్యవృత్తి సుర◊నీరజనేత్రలు చిత్తవీథి మో
దించిరి సర్వదేశజగ◊తీరమణుల్ నిరసూయ మెచ్చఁగన్. 128

టీక: వేలుపుల్=దేవతలు; ప్రియము నిక్కఁగన్=సంతసము పొంగఁగా; క్రొవ్విరిసోనన్=క్రొత్తపుష్పవర్షమును; నించిరి = పూరించిరి; తాపసాధిపులు=మునీశ్వరులు;చక్కన్=బాగుగా; దీవించిరి =ఆశీర్వదించిరి; సురనీరజనేత్రలు=దేవాంగనలు; అవేలమృదంగరవాళి మించన్ – అవేల=మేరలేని, మృదంగ=మురజములయొక్క, రవ=ధ్వనులయొక్క, ఆళి=నివహము, మించన్ =అతిశయింపఁగా; నాట్యవృత్తి న్=నాట్యముయొక్క వ్యాపారమును; సంధించిరి=చేసిరి; సర్వదేశజగతీరమణుల్= అన్నిదేశముల రాజులు; నిరసూయము=అసూయయొక్కఅభావము; ఎచ్చఁగన్=అతిశయింపఁగా; చిత్తవీథిన్=మనస్సు లందు; మోదించిరి =సంతసించిరి.

మ. తనుమధ్యామణి వైచినట్టి సుమనో◊దామంబు వక్షస్థలిన్
గనుపట్టం బొలిచె న్దినేంద్రకులభూ◊కాంతేశుఁ డప్పట్టునన్
ఘనతారావళికాధరుం డయినరా◊కాయామినీకాముకుం
డన శ్యామానయనోత్పలోత్సవకరో◊దారప్రభాసంభృతిన్. 129

టీక: తనుమధ్యామణి=సన్ననినడుముగల స్త్రీలలో శ్రేష్ఠురాలైన చంద్రిక; వైచినట్టి=వేసినట్టి; సుమనోదామంబు=పూదండ; వక్ష స్థలిన్=ఎదయందు; కనుపట్టన్=కానవచ్చుచుండఁగా; దినేంద్రకులభూకాంతేశుఁడు =సూర్యవంశరాజశ్రేష్ఠుఁడైన సుచంద్రుఁడు; అప్పట్టునన్=ఆసమయమందు;ఘనతారావళికాధరుండు – ఘన=గొప్పలైన, తారావళికా=నక్షత్రపంక్తులను, ధరుండు = ధరించినవాఁడు;అయిన=ఐనట్టి; రాకాయామినీకాముకుండు=పూర్ణచంద్రుఁడు; అనన్=అన్నట్లుగా; శ్యామానయనోత్పలో త్సవ కరోదారప్రభాసంభృతిన్ – శ్యామా=చంద్రికయొక్క, రాత్రియొక్క, నయనోత్పల=కలువలవంటి కన్నులకు, కన్నులైన కలువల కని రాత్రిపరమైన యర్థము, ఉత్సవకర=అనందకరమగు, ఉదార=ఉత్కృష్టమగు, ప్రభా=కాంతియొక్క,సంభృతిన్ = భరణముచేతను; పొలిచెన్=ఒప్పెను. చంద్రిక వేసిన పూదండ వక్షస్థలమందుఁ బ్రకాశించుచుండఁగా, సుచంద్రుడు రిక్కల గుంపుతోఁ గూడిన పూర్ణచంద్రునివలె ప్రకాశించె నని తాత్పర్యము. ఉత్ప్రేక్షాలంకారము.

మ. వికసచ్చంద్రకలాపయుక్త యయి ఠీ◊వి న్దేవయోషామణి
ప్రకరంబు ల్గొలువంగఁ జేరి యలగో◊త్రాభృత్కలాధీశక
న్యక తన్నప్డు వరింపఁ దత్కుసుమమా◊లాప్తి న్విరాజిల్లె సూ
ర్యకులోత్తంసము సద్గణోత్సవము లా◊ర న్దక్షిణామూర్తి నాన్. 130

టీక: వికసచ్చంద్రకలాపయుక్తయయి – వికసత్=ప్రకాశించుచున్న, చంద్రకలాప=సువర్ణభూషణములతో,యుక్తయయి= కూడుకొన్నదై; ప్రకాశించుచున్న, చంద్రకలాప=చంద్రుఁడను భూషణముతో, యుక్తయయి అని పార్వతీపరమైన యర్థము; ఠీవిన్=వైభవముతో; దేవయోషామణిప్రకరంబుల్ – దేవయోషామణి=రాజస్త్రీలయొక్క,ప్రకరంబుల్=సమూహములు; దేవ యోషామణి=దివ్యస్త్రీరత్నములయొక్క, ప్రకరంబుల్=సమూహము లని పార్వతీపరమైన యర్థము; కొలువంగన్=సేవించు చుండఁగా; చేరి=సమీపించి; అలగోత్రాభృత్కలాధీశకన్యక – అల=ఆ, గోత్రాభృత్కలాధీశ=భూపాలచంద్రుఁడైన క్షణదోద యునియొక్క, కన్యక=కూతురగు చంద్రిక; ఆప్రసిద్ధహిమవంతునికూఁతు రగు పార్వతీదేవి; తన్ను; అప్డు; వరింపన్=కోరఁగా; తత్కుసుమమాలాప్తిన్ – తత్కుసుమమాలా=ఆపూదండయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; సూర్యకులోత్తంసము =సూర్యవంశజు లందు శ్రేష్ఠుఁడైన సుచంద్రుఁడు;సద్గణోత్సవము – సద్గణ=విద్వత్సంఘమునకు, ప్రమథగణమునకు, ఉత్సవములు=వేడుకలు; ఆరన్=అతిశయింపఁగా; దక్షిణామూర్తి నాన్=శివావతారవిశేషమో యనునట్లు; విరాజిల్లెన్=ప్రకాశించెను.

చంద్రుఁడు భూషణముగాఁ గల పార్వతీదేవిచే దివ్యస్త్రీలు సేవించుచుండఁగా వరియింపఁబడిన దక్షిణామూర్తియో యను నట్టు లీచంద్రికచే వరియింపఁబడిన సుచంద్రుఁడు ప్రకాశించె నని భావము. ఈపద్యమందు నుత్ప్రేక్షాలంకారము.

చ. మగువ దవిల్చినట్టి సుమ◊మాలికతావికిఁ జేరు తేఁటిదం
టగమిరొద ల్సెలంగెఁ బొగ◊డ న్మలినాత్మత మున్ను మన్మథా
నుగుణత నేఁచు మంతువు గ◊నుంగొన కిష్టసుమార్పణంబుచేఁ
దగ మముఁ బ్రోవవే యనుచుఁ ◊దత్పతికై వివరించుపోలికన్. 131

టీక: మగువ దవిల్చినట్టి సుమమాలిక తావికిన్ – మగువ=చంద్రిక; తవిల్చినట్టి=తగిలించినట్టి (వేసినట్టి), సుమమాలిక=పూ దండయొక్క, తావికిన్=పరిమళమునకు; చేరు తేఁటిదంటగమిరొదల్ – చేరు=సమీపించిన, తేఁటిదంట=తుమ్మెదదంటల యొక్క, గమి=సమూహముయొక్క,రొదల్=ధ్వనులు; పొగడన్=పొగడఁగా; మలినాత్మతన్=కుటిలచిత్తముచేత, నల్లని దేహకాంతిచేత నని స్వభావార్థము; మున్ను=పూర్వమందు; మన్మథానుగుణతన్—మన్మథ=మదనునికి, అను=అనుసరిం చిన, గుణతన్=అల్లెత్రాడగుటచేత, మన్మథున కనుకూలము లగుటచేత నని స్వభావార్థము; ఏఁచు మంతువు =శ్రమపెట్టిన యపరాధమును; కనుంగొనక=చూడక, గణింపక యనుట; ఇష్టసుమార్పణంబుచేన్ – ఇష్ట=అనుకూలమగు, సు=లెస్స యగు,మా=సంపదయొక్క, అర్పణంబుచేన్=సమర్పణముచేత, ఇష్టమగు ద్రవ్యమును కానుకగా నిచ్చుటచేత నని తాత్ప ర్యము; అనుకూల సుమార్పణచేత నని స్వభావార్థము;తగన్=తగునట్లుగ; మమున్=మమ్ము; ప్రోవవే యనుచున్=కాపాడవే యనుచు;తత్పతికై =ఆసుచంద్రునకై; వివరించుపోలికన్=చెప్పుచున్నట్లుగా; చెలంగెన్ = ప్రకాశించెను;

చంద్రిక సుచంద్రుని కంఠమందు వైచిన పూదండతావికిఁ జేరియున్న తుమ్మెదలగుంపులరొదలు, పూర్వము సుచంద్రుని విరహకాలమందు మలినాత్మతచే ననఁగఁ గుటిలచిత్తముచేత మన్మథానుగుణతచే బాధించిన యపరాధమును, కానుకగా సుమార్పణము చేసి మన్నింపు మని యానరపతిం బ్రార్థించుచున్నటు లొప్పె నని భావము.

చ. నరపతిదేహదీప్తి సుమ◊నస్సరవల్లరి శోణభాధురం
ధర యయి చూడ రాజిలె నె◊దం దను నేలఁ దలంచుచంద్రికా
తరుణికటాక్షభాస్వదమృ◊తచ్ఛట పర్వఁగ నిల్వ లేక దు
ష్కరమదనాస్త్రపావకశి◊ఖాలత వెల్వడుదారిఁ బూనుచున్. 132

టీక: నరపతిదేహదీప్తిన్—నరపతి=సుచంద్రునియొక్క, దేహదీప్తిన్=శరీరకాంతిచేత; సుమనస్సరవల్లరి=తీవవంటి పూదండ; శోణభాధురంధర యయి – శోణభా=ఎఱ్ఱనికాంతియొక్క,ధురంధర యయి =భారమును వహించినదై;చూడన్=చూడఁగా; ఎదన్=హృదయమందు; తనున్=తన్ను; ఏలన్=పోషింపను; తలంచుచంద్రికాతరుణికటాక్షభాస్వదమృతచ్ఛట – తలంచు = తలంచినట్టి, చంద్రికాతరుణి=చంద్రికయొక్క, కటాక్ష=అపాంగములనెడు,భాస్వత్=ప్రకాశించుచున్న,అమృతచ్ఛట = జల పుంజము;పర్వఁగన్=ప్రసరింపఁగా; నిల్వ లేక=ఉండలేక; దుష్కరమదనాస్త్రపావకశిఖాలత – దుష్కర=అసాధ్యమగు, మదన =స్మరునియొక్క, అస్త్రపావక=బాణాగ్నియొక్క,శిఖాలత=తీవవంటిజ్వాల; వెల్వడుదారిన్=వెళ్ళివచ్చినరీతిని; పూనుచున్ =ఊనుచు; రాజిలెన్=ప్రకాశించెను;

అనఁగా చంద్రిక సుచంద్రుని వక్షస్థలమం దుంచిన సుమనస్సరవల్లరి సుచంద్రుని దేహకాంతిచే నెఱ్ఱనయి , దానిం బోషించు టకై చంద్రికయొక్క కటాక్షము లనెడు జలపుంజములు పర్వఁగా , సుచంద్రుని హృదయమం దుండు మదనాగ్నియొక్క జ్వాల నిలువ లేక వెలువడినదో యనునటులు ప్రకాశించె నని భావము. సుచంద్రవక్షస్థలగతసుమమాలికను చంద్రికాకటాక్షజలసేకము చేత బహిర్గతమగుచున్న మదనాగ్నిశిఖాలతనుగా నుత్ప్రేక్షించుటచేత నిచ్చట వస్తూత్ప్రేక్షాలంకారము.

చ. జనవరసార్వభౌమునెద ◊సామ్యనుబింబితమై నెలంత యుం
చిన సుమదామకంబు గనఁ ◊జేర్చె ముదంబు తదంతరంబునం
దెనసి కలంచునట్టి కుసు◊మేషుశరాళులఁ బట్టి తెత్తుఁ జ
య్యన నిఁక నిల్వఁ జేయుదు న◊టంచు వడిం జొరఁబాఱుకైవడిన్. 133

టీక: జనవరసార్వభౌమునెదన్=సుచంద్రుని వక్షస్థలమునందు; సామ్యనుబింబితమై =అర్ధము ప్రతిఫలించినదై; నెలంత ఉంచిన సుమదామకంబు=చంద్రిక యుంచిన పూదండ; కనన్=చూడఁగా;తదంతరంబునన్=ఆసుచంద్రుని యెదలోపల;ఎనసి=పొంది; కలంచునట్టి కుసుమేషుశరాళులన్ = కలఁతపఱచుచున్న సుమశరునిబాణపంక్తులను; పట్టి తెత్తున్ =పట్టుకొని తేఁగలను; చయ్యనన్=శీఘ్రముగా; ఇఁకన్=ఈమీఁద; నిల్వఁ జేయుదును=నిల్చునట్లు చేయుదును; అటంచున్=ఈరీతిఁ బలుకుచు; వడిన్=వేగముతో; చొరఁబాఱుకైవడిన్=చొరఁబడురీతిగ; ముదంబు=సంతసమును; చేర్చెన్=చేసెను.

అనఁగ సుచంద్రుని వక్షస్థలమందు చంద్రిక వైచినపూసరము సగము ప్రతిఫలించినదై, అతనిహృదయమునందు కలంచు మన్మథబాణములను వెలికిఁ దీసికొని చయ్యన రాఁగలనని హృదయమునందుఁ జొరఁబడురీతిగ ప్రకాశించె నని భావము.

చ. పుడమిమగండుదాలిచిన◊పువ్వులదండ తదంగకాంతిచేఁ
గడుఁ గనకప్రసూనసర◊గౌరవ మూనఁగఁ దుమ్మెద ల్భయం
బడరఁగ జాఱ సాగె నచ◊లాధిపకన్య వరించె నీశునిన్
గడిమికిఁ జేర కింక నని ◊కంతునకు న్వివరింపనో యనన్. 134

టీక: పుడమిమగండు=భూభర్త యగు సుచంద్రుఁడు; తాలిచినపువ్వులదండ =ధరించినపూదండ;తదంగకాంతిచేన్ = ఆ సుచంద్రునియొక్క దేహకాంతిచేత; కడున్=మిక్కిలి; కనకప్రసూనసరగౌరవము – కనకప్రసూన=సంపెఁగపూవులయొక్క, సర=దండయొక్క,గౌరవము=గొప్పతనమును, అనఁగఁ దత్సామ్యము ననుట; ఊనఁగన్=పొందఁగా; తుమ్మెదల్ = భృంగ ములు; భయంబు=భీతి; అడరఁగన్=అతిశయింపఁగా; అచలాధిపకన్య=రాజపుత్రియగు చంద్రిక, హిమాద్రిరాజపుత్రిక యగు పార్వతి యని తోఁచుచున్నది; ఈశునిన్=రాజగు సుచంద్రుని, శంకరుని నని తోఁచుచున్నది; వరించెన్=కోరెను;కడిమికిన్= పరాక్రమమునకు; చేరకు=పోవలదు; ఇంకన్=ఈమీఁద; అని=అనుచు; కంతునకున్=మన్మథునికి; వివరింపనో యనన్ = తెలియఁజేయుటకో యనునట్లు; జాఱసాగెన్=వీడెను. సుచంద్రుఁడు ధరించినపూదండ యతని దేహకాంతిచే సంపెంగపూల దండ యని భయపడి, తుమ్మెదలు జాఱుచుండఁగా నవి సుచంద్రునిఁ జంద్రిక వరియించెఁ గాన నీవు సుచంద్రునిఁ బొడువఁ బోఁ బనిలేదని మదనునకుఁ జెప్పుటకై పోవుచున్నటు లుండె నని భావము. ఈపద్యమందు నుత్ప్రేక్షాలంకారము.

మ. ఘనపంకేరుహరాగహారరుచిరే◊ఖావ్యాప్తమై యింతి వై
చిన యాక్రొవ్విరిదండ భర్తయెదఁ బొ◊ల్చెన్ దన్మృగాక్షీవినూ
తనరాగేందిర చేరి యద్ధరణినే◊త న్గౌఁగిటం దార్చి నం
తనె కన్గో నగుతద్భుజావసులతా◊ద్వంద్వైకబంధం బనన్. 135

టీక: ఘన పంకేరుహరాగ హార రుచి రేఖా వ్యాప్తమై – ఘన=అధికమైన, పంకేరుహరాగ=పద్మరాగములయొక్క, హార= సరముయొక్క, రుచి=కాంతియొక్క,రేఖా=శ్రేణిచేత,వ్యాప్తమై=పొందఁబడినదై; ఇంతి వైచిన యాక్రొవ్విరిదండ = చంద్రిక వేసిన యా పూదండ; భర్తయెదన్=సుచంద్రునివక్షమందు; తన్మృగాక్షీవినూతనరాగేందిర – తన్మృగాక్షీ=ఆచంద్రికయొక్క, వినూతన=మిక్కిలి నూతనమగు, రాగేందిర=అనురాగలక్ష్మి; చేరి=పొంది; అద్ధరణినేతన్=ఆసుచంద్రుని; కౌఁగిటన్ = కౌఁగిలి యందు; తార్చినంతనె =చేర్చికొనినమాత్రముచేతనే; కన్గోనగు తద్భుజావసులతా ద్వంద్వైక బంధంబు అనన్ – కన్గో నగు = కనిపించుచున్న, తత్=ఆరాగేందిరయొక్క, భుజావసులతా=బంగరుదీవలవంటి భుజములయొక్క, ద్వంద్వ=జంట యొక్క, ఏక=ముఖ్యమైన, బంధంబు=బంధమో, అనన్=అనునట్లు; పొల్చెన్=ప్రకాశించెను.

సుచంద్రునికంఠమునందుఁ జంద్రిక వైచినహారము, పద్మరాగమణిసరములకాంతిచే వ్యాప్తమై సుచంద్రునివక్షమునందు, నా చంద్రికరాగలక్ష్మి చేరి సుచంద్రునిఁ గౌఁగిలింపఁగాఁ గానవచ్చు రాగేందిర బాహులతాయుగమో యనం బ్రకాశించెనని భావము. ఈపూసరమును సుచంద్రునిఁ గౌఁగిలించిన రాగేందిర భుజాద్వంద్వము నా నుత్ప్రేక్షించుటచే వస్తూత్ప్రేక్షాలంకారము.

చ. అలవిరిదండచాయ కర ◊మయ్యెడఁ బర్వఁగఁ దన్నృపాలహా
రలతలచాయ గాంచఁగ వి◊రాజిల దయ్యెఁ దలంప నౌ విని
ర్మలమహిరాట్సుతాంచితక◊రస్థితి మించుచుఁ జేరువారి మేల్
చెలువముచెంగటన్ ధరణిఁ ◊జిల్లరపేరులవన్నె హెచ్చునే. 136

టీక: అలవిరిదండచాయ=ఆపూదండకాంతి; కరము=మిక్కిలి; అయ్యెడన్=ఆసమయమందు; పర్వఁగన్=వ్యాపింపఁగ; తన్నృపాలహారలతలచాయ – తన్నృపాల=ఆసుచంద్రునియొక్క, హారలతలచాయ=లతలవంటి హారములయొక్క కాంతి; కాంచఁగన్=చూడఁగ; విరాజిల దయ్యెన్=ప్రకాశింపదాయెను; తలంపన్=విచారింపఁగా; ఔన్=యుక్తమే యగును, ప్రకాశింపక యుండ యుక్తమే యనుట, ఏలనన; వినిర్మలమహిరాట్సుతాంచితకరస్థితిన్ – వినిర్మల=స్వచ్ఛమగు,మహి రాట్సుతా=చంద్రికయొక్క, అంచిత=ఒప్పుచున్న, కర=హస్తమందు, స్థితిన్=వాసముచేత; మించుచున్=అతిశయించుచు; చేరువారి మేల్ చెలువముచెంగటన్ – చేరువారి = పొందినవారియొక్క, మేల్=శ్రేష్ఠమగు, చెలువము=కాంతియొక్క,చెంగటన్ =సమీపమందు; ధరణిన్=పుడమియందు; చిల్లరపేరులవన్నె= స్వల్పహారములయొక్క కాంతి; హెచ్చునే=అతిశయించు నా? గొప్పపేరుల చెంగట, చిల్లరపేరుల= చిల్లరనామములయొక్క, వన్నె=కాంతి, హెచ్చునా యని తోఁచుచున్నది.

చంద్రిక సుచంద్రునియం దుంచిన పూదండకాంతిముందర, నితరములగు సరములకాంతి ప్రకాశింపదు. అట్లు ప్రకాశింప కుండుట యుక్తమని ద్వితీయవాక్యముచే సమర్థించుచున్నాడు. ఎటులనఁగా చంద్రికకరమం దునికిచే మించుకాంతి గలవారి యొద్ద చిల్లరపేరులకాంతి యతిశయించునా? అతిశయింప దనుట. సామాన్యముచే విశేషసమర్థనరూపమగు నర్థాంతరన్యాసా లంకారము.

మ. హరిమధ్యార్పితసూనదాముఁడయి గో◊త్రాధీశ్వరుం డత్తఱిన్
జిరకాలేహితకాంక్ష యంతయును దం ◊జేరం బ్రమోదాశ్రుసం
భరితాక్షిద్వయితో గళద్విరహతా◊పశ్రీకచిత్తంబుతో
నురురోమాంచపినద్ధవిగ్రహముతో ◊నొప్పూనెఁ జిత్రంబుగన్. 137

టీక: గోత్రాధీశ్వరుండు=సుచంద్రుఁడు;హరిమధ్యార్పితసూనదాముఁడయి – హరిమధ్యా=సింహమధ్యము గల చంద్రికచేత, అర్పిత=ఉంచఁబడిన,సూనదాముఁడయి=పూదండగలవాఁడయి; అత్తఱిన్=ఆసమయమందు; చిరకాలేహితకాంక్ష యంత యును – చిరకాల=బహుకాలమునుండి, ఈహిత=కోరఁబడిన,కాంక్ష=కోరిక, అంతయును=సమస్తమును; తన్=తనను; చేరన్=పొందఁగా; ప్రమోదాశ్రుసంభరితాక్షిద్వయితోన్=ఆనందబాష్పములతో నిండిన కనుదోయితో; గళద్విరహతాపశ్రీక చిత్తంబుతోన్ – గళత్=జాఱినట్టి,విరహతాప=విరహాగ్నితాపముయొక్క, శ్రీక=అతిశయముగల, చిత్తంబుతోన్=మనస్సుతో; ఉరురోమాంచపినద్ధవిగ్రహముతోన్ – ఉరు=అధికమైన,రోమాంచ=గగుర్పాటుచేత,పినద్ధ=కప్పఁబడిన,విగ్రహముతోన్ = శరీరముతోడ; చిత్రంబుగన్=ఆశ్చర్యముగ; ఒప్పూనెన్=ఒప్పిదమును పొందెను.

వ. అయ్యెడ నయ్యగరాజకుమారి యాసప్తసముద్రమధ్యరాజలోక వర్ణనాసమయోరరీకృత మానుషా కారంబు దూరంబు కావించి, యుదంచిత చంచరీకకులాకర్షణప్రకార భావసంమిళిత పరిమళమిళిత పారి జాతకుసుమమాలికాసంవేష్టితవేణీకలాపయును, జూడావలంబితచూడారత్నాయమానతారావరయును, భుజాచతుష్టయసంభృతపాశాంకుశరసాలశరాసనప్రసవరోపయును, నిజచరణసరసిజ భజనాపరాయణ సకలభువనజనోపబహిర్నిర్గతానురాగమోహద గౌరాంగరాగయును, ఆత్మోపఘన ఘనప్రభాలింగిత దివ్యమణిభూషణపూగయును, సముజ్జ్వలజ్జ్వలనమయనయనకలిత ఫాలభాగయును నగుచు జగద ద్భుతతేజోవిలసనంబున నమ్మహారాజేంద్రుముంగల నిలిచి, మంగళకరంబులగు ననేకవరంబు లొసంగి, వెండియును బావకవిబుధమహౌన్నత్యతంత్రం బగు నొక్కమంత్రంబు దెలుపం దలఁచి యానృపతి కిట్ల నియె. 138

టీక: అయ్యెడన్=ఆసమయమందు; అయ్యగరాజకుమారి=ఆపార్వతీదేవి; ఆసప్తసముద్రమధ్య రాజలోక వర్ణనాసమయోరరీ కృత మానుషాకారంబు – ఆసప్తసముద్రమధ్య=సప్తసముద్రములమధ్యమందున్న, రాజలోక=నృపులయొక్క,వర్ణనాసమయ =స్తుతిసమయమందు, ఉరరీకృత=అంగీకరింపఁబడిన, మానుషాకారంబు=మనుష్యాకృతిని; దూరంబు కావించి =సడలించి; ఉదంచిత చంచరీకకు లాకర్షణప్రకార భావ సంమిళిత పరిమళ మిళిత పారిజాతకుసుమ మాలికా సంవేష్టిత వేణీకలాపయును – ఉదంచిత=ఒప్పుచున్న, చంచరీకకుల=తుమ్మెదగుంపులయొక్క, ఆకర్షణప్రకార=ఆకర్షించురీతిగలదానియొక్క, భావ= ధర్మముచేత, సంమిళిత=కూడుకొన్న, పరిమళ=వలపుచేత,మిళిత=కూడుకొన్న, పారిజాతకుసుమ=పారిజాతపుష్పంబుల యొక్క, మాలికా=దండచేత, సంవేష్టిత=చుట్టఁబడిన, వేణీకలాపయును=వేణీభూషణముగలదియును,
చూడావలంబిత చూడారత్నాయమాన తారావరయును – చూడావలంబిత=కొప్పు నాశ్రయించిన, చూడారత్నాయమాన= చూడామణివలె నాచరించుచున్న, తారావరయును=చంద్రుఁడు గలదియును;
భుజాచతుష్టయ సంభృత పాశాంకుశ రసాలశరాసన ప్రసవరోపయును – భుజాచతుష్టయ=నలుభుజములచేత, సంభృత= భరింపఁబడిన, పాశ=పాశాయుధమును, అంకుశ=అంకుశమును,రసాలశరాసన=చెఱకువిల్లును, ప్రసవరోపయును=పుష్ప బాణములు గలదియును; నిజ చరణసరసిజ భజనా పరాయణ సకలభువన జనోపబహి ర్నిర్గ తానురాగ మోహద గౌరాంగరాగయును – నిజ=స్వకీయ మగు, చరణసరసిజ=పాదకమలములయొక్క, భజనా=సేవయందు, పరాయణ=ఆసక్తులగు, సకలభువన=సమస్తలోకము లందుండు, జన=జనులయొక్క, ఉపబహిః=బాహ్యోపకంఠమందు, నిర్గత=వెడలిన, అనురాగ=ప్రేమయొక్క, మోహద= భ్రాంతి నిచ్చుచున్న, గౌర=ఎఱ్ఱనైన, అంగరాగయును=అనులేపనము గలదియును; ఆత్మోపఘన ఘనప్ర భాలింగిత దివ్య మణిభూషణ పూగయును – ఆత్మ=తనయొక్క, ఉపఘన=శరీరముయొక్క, ఘన ప్రభా =అధికకాంతిచేత, ఆలింగిత=కౌఁగిలింపఁబడిన, దివ్య=శ్రేష్ఠమగు, మణిభూషణ=రత్నమయములగు నాభరణముల యొక్క, పూగయును=సమూహముగలదియును;
సముజ్జ్వల జ్జ్వలనమయ నయన కలిత ఫాలభాగయును – సముజ్జ్వలత్=మిక్కిలి ప్రకాశించుచున్న,జ్వలనమయ = అగ్ని మయమగు, నయన=నేత్రముచేత,కలిత=ఒప్పుచున్న,ఫాలభాగయును=ఫాలస్థలముగలదియును, అగుచున్=అయినదై; జగ దద్భుత తేజో విలసనంబునన్ – జగత్=లోకములకు, అద్భుత=ఆశ్చర్యకరమగు,తేజః=తేజస్సుయొక్క, విలసనంబు నన్ =ప్రకాశము చేత; అమ్మహారాజేంద్రుముంగలన్ =ఆసుచంద్రునియెదుట; నిలిచి=నిలుచుండి; మంగళకరంబులు= శుభ కరంబులు; అగు=అయినట్టి; అనేకవరంబులు=పెక్కువరములను; ఒసంగి=ఇచ్చి; వెండియును=మఱియును; పావకవిబుధ మహౌన్నత్య తంత్రంబు – పావక=పవిత్రమగు, విబుధ=దేవతలయొక్క, మహౌన్నత్య=గొప్ప యతిశయమునకు,తంత్రంబు =ముఖ్యకారణము; అగు=అయినట్టి; ఒక్కమంత్రంబు=ఒక మంత్రమును; తెలుపన్=ఉపదేశించుటకు; తలఁచి=సమకట్టి; ఆ నృపతికిన్=ఆరాజునకు (సుచంద్రునికి) ఇట్లనియె=వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.

మ. నిరవద్యంబయి, నిష్కలంకమహమై, ◊నిర్వాపితాఘౌఘమై,
హరమాయాలవకాంచితాత్మమయి, ని◊త్యంబై, మహేంద్రాదిని
ర్జరసేవ్యంబయి, యిష్టదంబయి, యజ◊స్ర మ్మొక్కమంత్రం బిలన్
అరిసంభేదన మించుఁ జుమ్ము భువనే◊శ్యాఖ్యాసముజ్జృంభియై. 139

టీక: నిరవద్యంబయి=నిర్దుష్టమై, నిష్కలంకమహమై=పాపరహితమగు తేజముగలదై; నిర్వాపితాఘౌఘమై =పోగొట్టఁబడిన పాపబృందముగలదై; హరమాయాలవకాంచితాత్మమయి – హర=గగనముచేత, మాయా=శక్తిచేత, లవక=అంకుశముచేత, బీజత్రయముచేత ననుట, అంచిత=ఒప్పుచున్న,ఆత్మమయి=స్వరూపముగలదియై; నిత్యంబై=అవ్యయమైనదై; మహేంద్రాదినిర్జరసేవ్యంబయి =ఇంద్రుఁడు మొదలుగాఁగల దేవతలచేత సేవింపఁదగినదియై; అజస్రమ్ము=ఎల్లపుడు; ఇష్టదంబయి=కోరఁ బడినట్టిదాని నిచ్చునదియై; భువనేశ్యాఖ్యాసముజ్జృంభియై – భువనేశ్యాఖ్యా=భువనేశ్వరి యను పేరుచేత, సముజ్జృంభియై= అతిశయించినదియై; ఒక్కమంత్రంబు=ఒకమంత్రము; అరిసంభేదన =సుచంద్రుఁడా! ఇలన్=భూమియందు; మించున్=ఒప్పా రును; చుమ్ము=సత్యము.

ఉ. అమ్మహనీయమంత్రము ర◊సాధిప నీ కిపు డిత్తు దానిఁ గై
కొమ్ము త్వదీహితమ్ము లొన◊గూర్చుఁ బఠించినమాత్రఁ దత్ప్రకా
రమ్ములు సద్గురుప్రవర◊రమ్యవచోగతిచే నెఱింగి ని
త్యమ్ము జపింపుమీ దినక◊రాభ్యుదయావసరమ్ములన్ మదిన్. 140

టీక: రసాధిప =సుచంద్రుఁడా! అమ్మహనీయమంత్రము=పూజ్యమగు నామంత్రమును; నీకున్, ఇపుడు, ఇత్తున్=ఒసంగెదను; దానిన్=ఆమంత్రమును; కైకొమ్ము=గ్రహింపుము; త్వదీహితమ్ములు – త్వత్=నీయొక్క, ఈహితమ్ములు=ఇష్టార్థములను; పఠించినమాత్రన్=చదివినమాత్రముననే; ఒనగూర్చున్=కలుఁగఁజేయును; తత్ప్రకారమ్ములు – తత్=ఆమంత్రముయొక్క, ప్రకారమ్ములు=రీతులు; సద్గురుప్రవరరమ్యవచోగతిచే నెఱింగి – సద్గురుప్రవర=సద్గురుశ్రేష్ఠునియొక్క,రమ్య=మనోజ్ఞమగు; వచోగతిచేన్=వాగ్రీతిచే,ఎఱింగి=తెలిసికొని; మదిన్=మనమునందు;నిత్యమ్ము=ప్రతిదినము; దినకరాభ్యుదయావసరమ్ములన్ – దినకర=సూర్యునియొక్క, అభ్యుదయావసరమ్ములన్=ఉదయకాలములందు;జపింపుమీ=జపింపుము. నే నుపదేశించు మంత్రమును, సద్గురువులవలన తద్విధిని జక్కగఁ దెలిసికొని ప్రతిదినమును సూర్యోదయసమయమందు జపింపుమని భావము.

చ. అని భువనేశి యామనుకు◊లాభరణమ్మున కున్నమత్కృప
న్మనుతిలకమ్ము నిచ్చి నృప◊మౌళి లలిన్ ఘటియించుమ్రొక్కు గై
కొని యలచంద్రికావనితఁ ◊గూడి హరిప్రమదాదిలేఖిక
ల్తను భజియింపఁగా నెనసెఁ ◊దత్పురరాజము సంతసంబునన్. 141

టీక: అని=ఈప్రకారము పలికి; భువనేశి=భువనేశ్వరి; ఆమనుకులాభరణమ్మునకున్=వైవస్వతమనుకులాలంకారుఁడగు నాసుచంద్రునికి; ఉన్నమత్కృపన్ – ఉన్నమత్=అతిశయించిన, కృపన్=దయచేత; మనుతిలకమ్మున్=మంత్రశ్రేష్ఠమును; ఇచ్చి =ప్రసాదించి;నృపమౌళి=సుచంద్రుఁడు; లలిన్=ప్రేమచేత; ఘటియించుమ్రొక్కున్=చేయునట్టి నమస్కృతిని; కైకొని= గ్రహించి; అలచంద్రికావనితన్=ఆచంద్రికను;కూడి=కలిసికొని; హరిప్రమదాదిలేఖికల్=హరిప్రియ యగు లక్ష్మీదేవి మున్నగు దేవాంగనలు;తనున్=తన్ను; భజియింపఁగాన్= సేవించుచుండఁగా; తత్పురరాజమున్ = ఆపట్టణశ్రేష్ఠమును; సంతసంబు నన్= కుతూహలముచేత;ఎనసెన్=పొందెను.

చ. అపుడు నిజాత్మలాలసిక ◊యంతయుఁ జేకుఱ నాసుచంద్రభూ
మిపతి నిజాప్తబంధునృప◊మిత్రజనంబులు చేరి రా సువ
ర్ణపటహరావ మెచ్చ శిబి◊రస్థలిఁ జేరె నెలంత లెల్ల న
చ్చపురతనాలయారతులు ◊చక్క నొసంగఁగ నాత్మ నుబ్బుచున్. 142

టీక: అపుడు=ఆసమయమందు; ఆసుచంద్రభూమిపతి=ఆసుచంద్రుఁడను ఱేడు; నిజాత్మలాలసిక – నిజ=తనయొక్క, ఆత్మ =మనసునందుండు, లాలసిక=అధికేచ్ఛ; అంతయున్=సర్వము; చేకుఱన్=సమకూరఁగా; నిజాప్తబంధునృపమిత్రజనంబులు – నిజ=తనసంబంధులగు, ఆప్త=ఇష్టులగు,బంధు=బాంధవులు, నృప=రాజులు,మిత్రజనంబులు=స్నేహితులు; చేరి = సమీ పించి; రాన్=రాఁగా; సువర్ణపటహరావము=స్వర్ణమయమగు పటహముల ధ్వని; ఎచ్చన్=అతిశయింపఁగా; నెలంత లెల్లన్ = వనితలెల్లరును; అచ్చపురతనాలయారతులు=చొక్కమగు రత్నముల హారతులను;చక్కన్=బాగుగా; ఒసంగఁగన్=ఈయఁ గా; ఆత్మన్=మనమునందు; ఉబ్బుచున్=ఉబుకుచు,సంతసించుచు; శిబిరస్థలిన్=పటమండపప్రదేశమును; చేరెన్=పొందెను.

మ. సకలాంభోనిధిమధ్యదేశవసుధే◊శవ్రాత మవ్వేళఁ జం
ద్రిక యామేటి వరించుటల్ గరము ని◊ర్ణిద్రప్రమోదోర్మిదా
యకత న్మించఁ దదీయశోభనదిదృ◊క్షాయత్తచిత్తంబులన్
స్వకరాజచ్ఛిబిరాళిఁ జేరి నిలిచెన్ ◊సైన్యేశ్వరు ల్గొల్వఁగన్. 143

టీక: సక లాంభోనిధి మధ్య దేశ వసుధేశ వ్రాతము – సకల=సమస్తమగు, అంభోనిధి=సముద్రములయొక్క, మధ్య=మధ్య మందలి, దేశ=ప్రదేశములందున్న,వసుధేశ=రాజులయొక్క, వ్రాతము=సమూహము; అవ్వేళన్=ఆసమయమునందు; చంద్రిక; ఆమేటిన్=ఆసుచంద్రుని; వరించుటల్=కోరుటలు; కరము=మిక్కిలి; నిర్ణిద్ర ప్రమోదోర్మిదాయకతన్—నిర్ణిద్ర = మేల్కొన్న, ప్రమోద=సంతసముయొక్క, ఊర్మిదాయకతన్=తరంగముల నిచ్చుటచేత; మించన్=అతిశయింపఁగా; తదీయ శోభన దిదృక్షాయత్త చిత్తంబులన్ – తదీయ=ఆదంపతులసంబంధియగు,శోభన=శుభకరమగు వైవాహికాదులను, దిదృక్షా= చూచుటయందు, ఆయత్త=అధీనమగు,చిత్తంబులన్=హృదయములచేత; స్వక రాజ చ్ఛిబిరాళిన్—స్వక=తమ సంబంధి యగు, రాజత్=ప్రకాశించుచున్న, శిబిర=పటమండపములయొక్క, ఆళిన్=పంక్తిని; చేరి=పొంది; సైన్యేశ్వరుల్ = సేనాధి పతులు; కొల్వఁగన్=సేవించుచుండఁగా; నిలిచెన్ =వసించెను.

మ. జననాథేంద్రు సుచంద్రుఁ జంద్రిక వరిం◊ప న్నేఁడుగా మత్కృతా
తనుపుణ్యంబు ఫలించె నంచు ముద మా◊త్మ న్గాంచి పాంచాలభూ
వనితావల్లభమౌళి వేగ మహిదేవ◊శ్రేణి రావించి శో
భనలగ్నం బలరాత్రివేళ ఘటియిం◊పం జేసె నప్పట్టునన్. 144

టీక: పాంచాలభూవనితావల్లభమౌళి =పాంచాలభూపతిశ్రేష్ఠుఁడగు నాక్షణదోదయుఁడు;జననాథేంద్రున్=రాజశ్రేష్ఠుఁడగు; సుచంద్రున్=సుచంద్రుని; చంద్రిక; వరింపన్=కోరఁగా; నేఁడుగా =ఈదినముగదా; మత్కృతాతనుపుణ్యంబు – మత్=నాచేత, కృత=చేయఁబడిన, అతను=అధికమగు, పుణ్యంబు=సుకృతము; ఫలించె నంచున్=పండె ననుచు; ముదము=సంతసమును; ఆత్మన్=హృదయమునందు; కాంచి=పొంది; వేగ=శీఘ్రముగ;మహిదేవశ్రేణిన్=బ్రాహ్మణబృందమును; రావించి=రప్పించి; శోభనలగ్నంబు=శుభలగ్నమును; అలరాత్రివేళన్=ఆరాత్రియందె; అప్పట్టునన్=ఆసమయమందు; ఘటియింపన్=ఏర్ప ఱచునట్లు; చేసెన్=ఒనరించెను.

ఆశ్వాసాంతపద్యములు

మ. తనుభానారద! నారదాదివినుతో◊ద్దామాహవప్రక్రియా
ఘనతాశారద! శారదాపకృతజా◊గ్రద్గోపవత్సప్రగో
పనభాసారద! సారదానవభిదా◊ప్రాంచద్యశోనిర్జితా
తనుసత్పారద! పారదాత్మచరిత◊ధ్వస్తాఖిలాఘోదయా! 145

టీక: తనుభానారద=దేహకాంతిచేత మేఘమువంటివాఁడా! నారదాది విను తోద్దా మాహవప్రక్రియాఘనతా శారద – నారదాది =నారదుఁడు మొదలుగాఁగలవారిచేత, వినుత=ప్రశంసింపఁబడిన, ఉద్దామ=మిక్కిలిగొప్పయగు, ఆహవ=యుద్ధముయొక్క, ప్రక్రియా=ప్రసంగమందు, ఘనతా=ఆధిక్యముచేత,శారద=నూతనమైనవాఁడా! ‘శారదః పీతమన్దే నాప్రత్యగ్రేఽభినవే త్రిషు’ అని రత్నమాల; పరులతో రణము సలుపుతఱి నితఁడు అపూర్వముగ నగపడునట్టివాఁడని తాత్పర్యము; శార దాపకృత జాగ్ర ద్గోప వత్స ప్రగోపన భా సార ద – శారదాప=నలువచేత,కృత=చేయఁబడిన,జాగ్రత్=నిస్తంద్రమగు,గోప=గొల్లలయొక్క, వత్స= దూడలయొక్క, ప్రగోపన=దాఁచుటయొక్క, భా=సామర్థ్యముయొక్క,సార=సారమును, ద=ఖండించినవాఁడా! గోవులను, గోపులను దాఁచుటకుఁ బూనిన బ్రహ్మకు భంగము కల్గించినవాఁడని భావము; సార దానవ భిదా ప్రాంచ ద్యశోనిర్జి తాతను సత్పా రద – సార=బలిష్ఠులగు, దానవ=రక్కసులయొక్క,భిదా=భేదనమందు,ప్రాంచత్=ఒప్పుచున్న,యశః=కీర్తిచేత, నిర్జిత= జయింపఁబడిన, అతను=అధికమగు,సత్=శ్రేష్ఠమైన, పారద=పాదరసముగలవాఁడా! ఇతని యశము పాదరసముకన్నఁ దెల్లనై యున్నదని భావము; పార దాత్మ చరిత ధ్వస్తాఖి లాఘోదయా – పారద=తరింపఁజేయునట్టి,ఆత్మ=తనయొక్క, చరిత= చరిత్రముచేత, ధ్వస్త=పోఁగొట్టఁబడిన, అఖిల=సమస్తమైన, అఘ=పాపములయొక్క, ఉదయా=ఆవిర్భావము గల వాఁడా! ఇతని చరిత్రలు స్మరించినమాత్రన పాపముల నశింపఁజేయునని భావము. ఈకృతిపతి సంబోధనములకును, ఉత్తర పద్యములందలి తత్సంబోధనములకును, ఆశ్వాసాంతగద్యముతో నన్వయము. ముక్తపదగ్రస్తాలంకారము.

క. శరధీనశరధిఘనభా,స్వరధీవిషయా! నిబద్ధ◊శరధీ! స్వరధీ
శరమావలంబ! శంబర,పరమాకరకరణభరణ!◊పరమాభరణా! 146

టీక: శరధీన శరధి ఘన భాస్వర ధీవిషయా – శరధీన=సముద్రుఁడె,శరధి=తూణీరముగాఁ గల శంకరునియొక్క, ఘన=అధిక మగు, భాస్వర=ప్రకాశించుచున్న,ధీ=బుద్ధికి,విషయా=లక్ష్యమైనవాఁడా! అనఁగా శివునకుఁగేశవుఁడు పత్నీభూతుఁడు గాన ఎల్లపుడు శంకరుని చిత్తమందు మెలఁగుచున్నవాఁడని భావము. ‘ఏకాపి శక్తిః పరమేశ్వరస్య హ్యుపాధిభేదా దభవ చ్చతుర్ధా, భోగే భవానీ సమరేచ దుర్గా, కోపేచ కాళీ త్వవనేచ విష్ణుః’ అను శ్రీభాగవతము ప్రమాణము; శరధీనశరధి=శివుఁడే, ఘనభాస్వర ధీవిషయా = అధికమై ప్రకాశించుచున్న బుద్ధికి విషయముగాఁగలవాఁడా; నిబద్ధశరధీ – నిబద్ధ=కట్టఁబడిన, శరధీ=సముద్రము గలవాఁడా! రామావతారమునందు బంధింపఁబడిన సముద్రము గలవాఁడని భావము; స్వరధీశ రమావలంబ – స్వరధీశ= స్వర్గా ధీశుఁడగు ఇంద్రునియొక్క, రమా=సంపదకు, అవలంబ=ఆధారమైనవాఁడా! శంబరపరమాకరకరణభరణ – శంబరపర= మన్మథునియొక్క,మా=సంపదకు, అనఁగా సౌందర్యమున కనుట, ఆకర=స్థానమగు, కరణ =దేహమును, ‘కరణం సాధక తను క్షేత్ర గాత్రేన్ద్రియేష్వపి’ అని యమరుఁడు, భరణ=వహించినవాఁడా! అనఁగా మన్మథునికి తుల్యమగు చక్కఁదనముగల దేహముగలవాఁడని భావము; పరమాభరణా=ఉత్కృష్టమైన యాభరణములుగలవాఁడా!

పంచచామరము: ధరాధరా! ధరారిమౌళి◊ధామధామసత్పదా!
పరాపరా! పరాగపూత◊భామ! భామహోజ్జ్వల
చ్ఛరాశరాశరాజదస్త్ర◊సార! సారభేదనా!
దరాదరా! దరాన్వితౌఘ◊తార! తారకౌస్తుభా! 147

టీక: ధరాధరా=భూమిని ధరియించినవాఁడా! ధరారి మౌళి ధామ ధామ సత్పదా—ధరారి=ఇంద్రునియొక్క, మౌళి=కిరీటము యొక్క,ధామ=కాంతికి,ధామ=స్థానమగు,సత్పదా=మంచిచరణములుగలవాఁడా! పరాపరా=అవిద్యావ్యతిరిక్తుఁడగువాఁడా! పరాగ పూత భామ – పరాగ=చరణరేణువుచేత, పూత=పవిత్రమగు, భామ=అహల్యగలవాఁడా! భా మహోజ్జ్వల చ్ఛరాశరాశ రాజ దస్త్రసార – భా=కాంతిచేత, మహోజ్జ్వలత్=మిగులవెలుఁగుచున్న, శర=బాణములుగల, ఆశర=రక్కసులను, ఆశ= భక్షించునట్టి, రాజత్=ప్రకాశించుచున్న, అస్త్రసార=అస్త్రములయొక్క బలముగలవాఁడా! సారభేదనా—సాల=సాలవృక్షము లను, ఇచట రలల కభేదమని తెలియవలయును, భేదనా=భేదించినవాఁడా! దరాదరా – దర=పాంచజన్యమునందు, ఆదరా = ఆదరముగలవాఁడా! దరాన్వితౌఘతార – దరాన్విత=భయముపొందినవారియొక్క, ఓఘ=సమూహములను, తార= తరి యింపఁ జేయువాఁడా; తారకౌస్తుభా=ఉత్తమమైన కౌస్తుభరత్నముగలవాఁడా! పంచచామరవృత్తమునకు అప్పకవి లక్షణము:

‘జరజ్రజంబులుం గముం బొ◊సంగి తొమ్మిదింటిపై,
విరామ మొంది సత్కవు ల్స◊విస్తరంబు సేయఁగాఁ
బరాత్పరుండు మాధవుండు ◊బంచచామరంబునన్
బ్రరూఢగుంభనంబులందుఁ ◊బాడ నొప్పు ధాత్రిలోన్’

గద్యము: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము.

గద్యము. ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదితసర్వసౌభాగ్యభాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలుసంస్థానప్రాజ్యసకలసామ్రాజ్య శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయసత్పుత్ర సత్సంప్రదాయ శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య సరసవైదుష్య తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచిత శరదాగమసమాఖ్యవ్యాఖ్యయందుఁ బంచమాశ్వాసము.