చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము

ఉ. ఇన్నరనాథచంద్రు వరి◊యించి ముదంబున నేగుదెంచునిం
గన్నులపండువై యలరఁ ◊గన్గొని నీపయి నించుఁ గాక యే
తన్నగరీవధూమణివి◊తానము సౌధచయంబు లెక్కి యు
ద్యన్నవమౌక్తికాక్షతసు◊మావళికాకలికాకులంబులన్. 108

టీక: ఇన్నరనాథచంద్రున్=ఈరాజచంద్రుని;వరియించి=కోరి; ముదంబునన్=సంతసముచేత; ఏగుదెంచు నిన్ = వచ్చుచున్న నిన్ను; కన్నులపండువై=కనులకు విందై; అలరన్=ప్రకాశింపఁగ; కన్గొని=చూచి; నీపయిన్=నీమీఁద; ఏతన్నగరీవధూమణి వితానము = ఈతనిపురమునందలి స్త్రీరత్నసమూహము; సౌధచయంబు లెక్కి=మేడలపై నెక్కి; ఉద్యన్నవమౌక్తికాక్షతసుమా వళికాకలికాకులంబులన్–ఉద్యత్=ఎత్తఁబడిన, నవ=నూతనమైన, మౌక్తికాక్షత=ముత్యములయక్షతలయొక్క, సుమావళికా = పుష్పబృందముయొక్క, కలికా=మొగ్గలయొక్క, కులంబులన్=సమూహములను; నించుఁగాక=నిండించునుగాక.

తే. అనఁగ తూష్ణీంస్థితి భజించె ◊నంబుజాక్షి, తన్మనోమోహదుర్విధ◊త్వంబు దెలిసి
యప్పు డాచెంత వేఱొక్క◊యధిపుఁ జూపి, యింతి కమ్మేనకాపుత్రి ◊యిట్టు లనియె. 109

టీక: అనఁగన్=ఇట్లు పలుకఁగ; అంబుజాక్షి=పద్మనేత్ర యగు చంద్రిక; తూష్ణీంస్థితిన్=ఊరకుండుటను;భజించెన్=పొందెను; తన్మనోమోహదుర్విధత్వంబు – తత్=ఆచంద్రికయొక్క, మనః=మనమునందు, మోహ=మోహముయొక్క,దుర్విధత్వంబు = దారిద్ర్యమును; తెలిసి=తెలిసికొని; అప్పుడు=ఆసమయమందు;ఆచెంతన్=ఆసమీపమందు;వేఱొక్కయధిపున్= మఱియొక రాజును; చూపి; యింతికిన్=చంద్రికకు; అమ్మేనకాపుత్రి=ఆపార్వతీదేవి;ఇట్టులు=వక్ష్యమాణప్రకారము; అనియెన్= పలికెను.

మ. తులకింపం బ్రమదంబు కన్గొనుము సిం◊ధుస్వామి నీదంటఁ బ
క్ష్మలనేత్రామణి! పాండుకాండయుతశుం◊భద్వాహినీమద్రణ
స్థలకాశి న్రిపుకోటి చేరి కడు మిం◊చ న్దివ్యరామోపదే
శలసద్వృత్తి ఘటించు వీనియసియ◊జ్ఞధ్వంసి నిక్కంబుగన్. 110

టీక: పక్ష్మలనేత్రామణి=చంద్రికా! ప్రమదంబు=సంతసము; తులకింపన్=ప్రకాశింపఁగా; సింధుస్వామి=సింధుదేశాధిపతియగు; ఈదంటన్=ఈదిట్టతనముగలవానిని; కన్గొనుము=చూడుము; వీనియసియజ్ఞధ్వంసి = వీనియొక్క ఖడ్గమనెడు శంకరుఁడు; పాండుకాండయుతశుంభద్వాహినీమద్రణస్థలకాశిన్ – పాండు=తెల్లనగు,కాండ=గుఱ్ఱములతో, యుత=కూడుకొన్న,శుంభత్ = ప్రకాశించుచున్న, వాహినీమత్=సేనగల, రణస్థల=యుద్ధరంగమనెడు, కాశిన్=వారాణసిని; ఇచట, పాండు=తెల్లనగు, కాండ=జలముతో, యుత=కూడుకొన్న,శుంభత్ = ప్రకాశించుచున్న, వాహినీమత్=గంగగల యని, కాశీపరముగాఁ దోఁచు చున్నది; రిపుకోటి=శత్రుసంఘము; చేరి=పొంది; కడు మించన్=మిక్కిలి యొప్పారఁగా; దివ్యరామోపదేశలసద్వృత్తిన్ – దివ్యరామా= దేవాంగనలయొక్క, ఉపదేశ=సమీపప్రదేశమునందు,లసత్=ప్రకాశించుచున్న, వృత్తిన్=వర్తనను, ఉనికి ననుట; ఇచట, దివ్య=అమోఘమైన, రామ=రామతారకముయొక్క, లేదా పరబ్రహ్మముయొక్క, ఉపదేశముచేత నని తోఁచుచున్నది; నిక్కంబుగన్= నిశ్చయముగ; ఘటించున్=ఘటిల్లఁజేయును.
అనఁగ నోచంద్రికా! ఈసింధుదేశాధిపతియొక్క యసియను శంకరుఁడు రణస్థలమను వారాణసియందుఁ జేరియున్న శత్రువు లకు దివ్యరామోపదేశమును జేయునని భావము. పరంపరిత రూపకము.

చ. అలఘుశరౌఘవృత్తిమహి◊మాభిహతప్రతికూలు సంతతా
తులితగభీరభావభరి◊తు న్సుమనోజనమోదకారిని
ర్మలమణిదాత నియ్యవని◊రాజకులాజరరాజు నాత్మ నో
నెలఁతుక! సింధురా జనుచు◊నిచ్చ నుతింపఁగఁ జెల్లకుండునే. 111

టీక: అలఘుశరౌఘవృత్తిమహిమాభిహతప్రతికూలున్ – అలఘు=అధికమైన,శరౌఘ=బాణసంఘముయొక్క, వృత్తి=వర్త నమువలన నైన, మహిమ=సామర్థ్యముచేత, అభిహత=కొట్టఁబడిన,ప్రతికూలున్=శత్రువులు గల; ఇచట, శరౌఘ=జలప్రవా హముయొక్క, మహిమాభిహతమగు, ప్రతికూలున్=ఎదురుదరిగల యను సముద్రపరమైన యర్థము దోఁచుచున్నది; సంతతాతులితగభీరభావభరితున్ – సంతత=ఎల్లపుడు, అతులిత=నిస్సమానమగు, గభీర=గంభీరమగు, భావ =అభిప్రాయ ముచే, భరితున్=పరిపూర్ణుఁడగు; ఇచట, సంతతము, అతులితమగు, గభీరభావ=లోతుచే పరిపూర్ణుఁడగు నని సముద్రపరమైన యర్థము; సుమనోజనమోదకారినిర్మలమణిదాతన్ – సుమనోజన=విద్వాంసులకు, మోదకారి=సంతసమును జేయు, నిర్మల = స్వచ్ఛమగు, మణి=మణులయొక్క, దాతన్=వదాన్యుఁడగు; దేవతలకు సంతసము నొసఁగు చింతామణి నిచ్చినవాఁడని సముద్రపరమైన యర్థము; రాజకులాజరరాజున్=రాజకులేంద్రుని; ఇయ్యవనిన్=ఈభూమియందు; ఆత్మన్=మనమునందు; ఓనెలఁతుక=ఓచంద్రికా! సింధురాజనుచున్=సింధుదేశపురాజనుచు, సముద్రుఁడనుచు ననితోఁచుచున్నది; నిచ్చన్=ఎల్లపుడు; నుతింపఁగన్=కొనియాడుటకు; చెల్లకుండునే=తగినట్టులుండదా? ఉండునని కాకువు.

ఈసింధురాజు బాణములచేఁ బ్రతికూలులను వధించువాఁడనియు, గంభీరభావమును వహించినవాఁడనియు, విద్వద్గణము లకు పెక్కుమణుల నిచ్చినాఁ డనియు, గావున నితఁడు వరణీయుఁ డనియు భావము.

చ. సకి! రతివేళ నీవు గళ◊సంయుతనిస్వనబృంహితార్భటుల్
రకమయి మీఱఁ గంతుకరి◊రాజనిరూఢి విశృంఖలైకవృ
త్తికఁ దగ నీమహీతలప◊తిచ్ఛలయంత ఘటించుఁ గాక తా
వకకుచకుంభవీథి నని◊వార్యనఖాంకుశఘాతజాతముల్. 112

టీక: సకి=చంద్రికా! రతివేళన్=సురతసమయమందు; గళసంయుతనిస్వనబృంహితార్భటుల్—గళ=కంఠమందు, సంయుత = కూడుకొన్న, నిస్వన=రతికూజితము లనెడు, బృంహితార్భటుల్=గజధ్వనులు; రకమయి=శ్రేష్ఠమై(అధికమై); మీఱన్= మించఁగా; నీవు; కంతుకరిరాజనిరూఢిన్=మదనునిగజముపగిది; విశృంఖలైకవృత్తికన్—విశృంఖల=నిగళములు లేనట్టి, ఏక=ముఖ్యమగు, వృత్తికన్=వ్యాపారముచేత; తగన్=ఒప్పఁగా; ఈమహీతలపతిచ్ఛలయంత – ఈమహీతలపతి=ఈ భూ పతియనెడు, ఛల=వ్యాజముగల, యంత=మావటివాఁడు; తావకకుచకుంభవీథిన్ – తావక=నీసంబంధియగు, కుచకుంభ= స్తనములనెడు కుంభములయొక్క, వీథిన్=ప్రదేశమునందు; అనివార్యనఖాంకుశఘాతజాతముల్—అనివార్య=నివారింప నలవిగాని, నఖ= గోళ్ళనెడు, అంకుశ=అంకుశములయొక్క,ఘాత=పోట్లయొక్క,జాతముల్=సమూహములను; ఘటించుఁ గాక = చేయును గాక. చంద్రికా! నీవు రతివేళ గళసంయుతములగు రతికూజితము లను బృంహితములు విపులముగాఁ జేయుచు విశృంఖల మదగజరాజమువలె నుండఁగా నపుడు నీమహీపతి యను మావటివాఁడు నీస్తనములనెడు కుంభస్థలము లందు గోరు లను నంకుశములచే ఘాతములఁ జేయు నని భావము.

(గమనిక: కొల్లాపురంవారి తొలిముద్రణలో ఈపద్యమునందలి రెండవచరణములో ‘కరమయి’ అని యున్నది. దీనికి కరమయి =అధికమయి అని వ్యాఖ్యాతలు అర్థమిచ్చినారు. ‘క’ ప్రాసాక్షరముగా గల ఈ పద్యమునకు ‘కరమయి’ అని యుండుటచే ప్రాసభంగము కల్గినది. కాని దీనినిగుఱించి వ్యాఖ్యాతలు ప్రస్తావించలేదు. కొల్లాపురంవారి రెండవముద్రణలో దీనిని ‘రకమయి’ అని మార్చి ప్రాసదోషమును సవరించిరి కాని, వ్యాఖ్యానములో కరమయి=అధికమై అను దాని నట్లే ఉంచినారు. కేశవపంతుల వారి మూలముద్రణములోను ‘రకమయి’ అను రూపమునే గ్రహించినారు. రకమయి అనుపదమునకు ‘సుందరమయి’, ‘శ్రేష్ఠ మయి’ అను రెండర్థములను సూర్యరాయాంధ్రనిఘంటు విచ్చుచున్నది. అందుచేత పై వ్యాఖ్యానములో రకమయి= శ్రేష్ఠ మయి అని ఉంచి, బ్రాకెట్లలో మునుపటి వ్యాఖ్యాతల అధికమయి అను అర్థమును గూడ ఉంచినాను – దేశికాచార్యుఁడు.)

తే. అనిన నెమ్మోము మరలిచె ◊వనజవదన, యది కనుంగొని గిరిజ య◊ప్పదవిఁ గుకురు
వరునిఁ జేచాయఁ జూపి య◊వ్వనిత కిట్టు, లనియె మహతీరవామిత్ర◊నినదకలన. 113

టీక: అనినన్=ఇట్లు పలుకఁగా; నెమ్మోము=సుందరమగు ముఖమును; వనజవదన =చంద్రిక; మరలిచెన్=త్రిప్పెను;అది కనుంగొని =అది చూచి; గిరిజ=పార్వతీదేవి; అప్పదవిన్=ఆదారియందు; కుకురువరునిన్=కుకురుదేశాధిపతిని; చేచాయన్ =చెయిజాడచే; చూపి=ప్రదర్శించి; అవ్వనితకున్=ఆచంద్రికకు; మహతీరవామిత్రనినదకలనన్ – మహతీ=నారదునివీణ యొక్క, రవ=స్వనమునకు, అమిత్ర=విరోధియగు,నినద=ధ్వనియొక్క,కలనన్=ప్రాప్తిచేత; ఇట్టులు=వక్ష్యమాణప్రకారము; అనియెన్=పలికెను.

చంద్రిక యానరపతిమీఁద మనంబు పొందకున్కి మోము ద్రిప్పఁగానె గౌరీదేవి యచటఁ గుకురుదేశరాజుం జూపి, నారదుని వీణారవమునకు సాటియగు సుందరవచనములచే వక్ష్యమాణప్రకారముగఁ బలికె నని తాత్పర్యము.

చ. చెలి! కుకురుక్షమారమణ◊శేఖరుఁ డీతఁడు వీనిఁ గాంచు మీ
జలజశరోపమాను నెఱ◊చక్కఁదనంబు జగంబు లెంచ ని
చ్చలు నెదఁ గుందఁజేయుఁ దొవ◊సామి వనావళిఁ దోలు నామనిన్
దలఁచుఁ దృణంబుగా నలజ◊నప్రభుఁ దా నెగఁబట్టు వాసవిన్. 114

టీక: చెలి=చంద్రికా! ఈతఁడు; కుకురుక్షమారమణశేఖరుఁడు=కుకురురాజశ్రేష్ఠుఁడు; వీనిన్=ఈరాజును; కాంచుము = చూడుము; ఈజలజశరోపమాను నెఱచక్కఁదనంబు=ఈ మన్మథతుల్యుఁడగు రాజుయొక్క నిండుసౌందర్యము; జగంబు లెంచన్= లోకములు నుతియింపఁగా; తొవసామిన్=కలువలరాయని; నిచ్చలు=ఎల్లప్పుడు; ఎదన్=హృదయమందు; కుందఁ జేయున్=దుఃఖించు నటులు చేయును, తగ్గునటులు చేయునని స్వభావార్థము, కృష్ణపక్షమందుఁ జంద్రుఁడు తగ్గుట సహజ మని భావము; ఆమనిన్=వసంతుని; వనావళిన్=వనపంక్తినిగూర్చి; తోలున్=పంపును, మిక్కిలి చక్కఁదనము గల వసంతుని నడవికిఁ బాఱిపోవునటులు చేయునని భావము, వసంతుఁడు వనావళియం దుండుట సహజ మని భావము; నలజనప్రభున్= నలచక్రవర్తిని; తృణంబుగాన్=గడ్డిపోచఁగా; తలచున్=ఎంచును, నలుని తిరస్కరించు ననుట, నలశబ్దమునకు తృణ మర్థము గావున తృణముగాఁ దలచుట సహజ మని భావము; వాసవిన్=జయంతుని; తాన్=తాను;ఎగఁబట్టున్=ఎగఁజిమ్మును, తిరస్క రించు ననుట, ఆకాశగమనము జయంతునకు సహజమని భావము;

చ. సరసమహాత్మత న్భువన◊జన్మవినాశనహేతువైన యీ
నరపతికీర్తి దైవము గ◊నం బ్రతికూలతచేఁ జరింప ని
ర్జరతరుపాళి కేపు తన◊చాయ పొసంగునె చుట్టమై కడున్
ఖరదనుజారికిం బగయ ◊గాదొకొ కట్టిన కోఁక యెంచఁగన్. 115

టీక: సరసమహాత్మతన్ – సరస=శ్రేష్ఠమగు, మహాత్మతన్=ప్రభావముచేతను; భువనజన్మవినాశనహేతువైన – భువనజన్మ= జలజములయొక్క, వినాశన=నశింపఁజేయుటయందు, హేతువైన=కారణమైన; ఈనరపతికీర్తి దైవము =ఈరాజుయొక్క కీర్తి యనెడు దైవము; ఇచట, భువ=ప్రపంచముయొక్క, జన్మ=ఉత్పత్తికి, వినాశన=నాశమునకు, హేతువైన యని దైవపక్షమున కర్థము; కనన్=చూడఁగా; ప్రతికూలతచేన్=ప్రాతికూల్యముచేత; చరింపన్=వర్తింపఁగా; అనఁగా కీర్తిదైవము ప్రతికూలము కాఁ గానే యనుట; నిర్జరతరుపాళికిన్=కల్పతరుబృందమునకు; తనచాయ=తననీడ; కడున్=మిక్కిలి;చుట్టమై=బంధువై; ఏపున్ = విజృంభణమును; పొసంగునె=చేయునా? యని కాకువు, కీర్తి ప్రతికూలము కాఁగానే కల్పతరుపాళికి తననీడ యేపుఁజేయక యుండె ననుట, చెట్లు తెల్లనివైనను, నీడ నల్లనిదిగాన ననుకూలము గాకపోయెనని భావము, లోకమందు దైవము ప్రతికూలము కాగానె చుట్టమును ప్రతికూలించునని భావము; ఖరదనుజారికిన్=బలరామునికి; ఎంచఁగన్=విచారింపఁగ; కట్టినకోఁక =కట్టు వస్త్రము; పగయ గాదొకొ =శత్రువె గాదా యని కాకువు, బలరామునికి కట్టువస్త్రము నల్లనిదని భావము. ఏతత్కీర్తిదైవము ప్రతికూ లించుటచేఁ గట్టువస్త్రము సైతము బలరామునకుఁ బ్రతికూలించె ననుట.

క. అని పాంచాలక్షితివర, తనయామణి కద్రిరాజ◊తనయ తెలుపఁగా
నెనయింప దయ్యె నపుడా, ఘనుపైఁ గలకంఠి చిత్త◊గతరాగంబున్. 116

టీక: అని=పూర్వోక్తప్రకారము; పాంచాలక్షితివర తనయామణికిన్=క్షణదోదయరాజపుత్రిక యగు చంద్రికకు; అద్రిరాజత నయ = పార్వతీదేవి;తెలుపఁగాన్=తెలియఁజేయఁగా; అపుడు; ఆఘనుపైన్=ఆరాజుమీఁద; కలకంఠి=చంద్రిక; చిత్తగతరా గంబున్=మనోగతమైన యనురాగమును;ఎనయింప దయ్యెన్=పొందింపదాయెను.

వ. అంత నయ్యనంతజూటనీలకుంతల యక్కాంత కిట్లు సకలదేశకాంతసంతానంబులం గ్రమక్రమంబునం దెలుపుచుం జని చని యారాజసభామధ్యంబున నక్షత్రనికరాంతరద్యోతమానరాకాసుధాకరుండునుం బోలె నమూల్యలక్షణలక్షితగాత్రుండును ననుపమానకలాపాలికాసమన్వితుండును జకోరలోచనానంద సంధాయకతేజస్సాంద్రుండును నగుచుఁ జూపట్టు సుచంద్రమనుజేంద్రుం జూపి తదీయచిత్తంబు తదాయత్తం బగుట దెలిసి యాకనకగౌరి కాగౌరి యిట్లనియె. 117

టీక. అంతన్=అటుపిమ్మట; అయ్యనంతజూటనీలకుంతల =వ్యోమకేశునికాంత యగు పార్వతీదేవి; అక్కాంతకున్=ఆ చంద్రి కకు; ఇట్లు=పూర్వోక్తప్రకారము; సకలదేశకాంతసంతానంబులన్ – సకలదేశకాంత=సమస్తదేశాధిపతులయొక్క, సంతానంబు లన్=సమూహములను; క్రమక్రమంబునన్=వరుసగా; తెలుపుచున్=తెలియఁజేయుచు; చని చని =అరిగియరిగి; ఆరాజసభా మధ్యంబునన్=ఆరాజసభనడుమ; నక్షత్రనికరాంతరద్యోతమానరాకాసుధాకరుండునుంబోలెన్ – నక్షత్రనికర= రిక్కలగుంపు యొక్క, అంతర=మధ్యప్రదేశమందు, ద్యోతమాన=వెలుఁగుచున్న, రాకాసుధాకరుండునుంబోలెన్=పున్నమచందురునివలె; అమూల్యలక్షణలక్షితగాత్రుండును – అమూల్య=వెలలేని,లక్షణ=శుభచిహ్నములతో,లక్షిత=కూడుకొన్న, గాత్రుండును= శరీరముగలవాఁడును; అమూల్యమైన, లక్షణ=కలంకముచేత, నని చంద్రపరమైన యర్థము; అనుపమానకలాపాలికాసమన్వి తుండును – అనుపమాన=సాటిలేని, కలా=విద్యలయొక్క, పాలికా= పంక్తితో, సమన్వితుండును=కూడినవాఁడును; అనుప మానమగు, కలాపాలికా=కాంతిపంక్తులతో, సమన్వితుండని చంద్రపరమైన యర్థము; చకోరలోచనానందసంధాయక తేజ స్సాంద్రుండును – చకోరలోచనా =స్త్రీలకు, ఆనందసంధాయక=సంతసమును ఘటిల్లఁజేయు; తేజః =తేజస్సులచేత, సాంద్రుం డును=నిండినవాఁడును; చకోర =వెన్నెలపుల్గులయొక్క,లోచనములకు, ఆనందసంధాయకమగు తేజముతోఁ గూడినవాఁడని చంద్రపరమైన యర్థము; అగుచున్= ఈప్రకార మయినవాఁడై; చూపట్టు సుచంద్రమనుజేంద్రున్ = కనిపించు సుచంద్రుండను రాజేంద్రుని; చూపి; తదీయచిత్తంబు =చంద్రికసంబంధియైన మనము; తదాయత్తంబు=ఆసుచంద్రు నధీనము; అగుటన్; తెలిసి =ఎఱిఁగి; ఆకనకగౌరికిన్=బంగరు వలె గౌరవర్ణము గల యాచంద్రికకు; ఆగౌరి=ఆపార్వతీదేవి; ఇట్లు=వక్ష్యమాణప్రకారము; అనియెన్=పలికెను.