చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము

వ. అని యెఱింగింప ననంగీకారభంగి నయ్యంగనయంతరంగం బెసంగిన నాచెంత నొక్క నరపుంగవుం
జూపి సారంగధారిసారంగయాన తరంగవళీమణిం గుఱించి యిట్లనియె. 97

టీక: అని=ఈప్రకారముగ; ఎఱింగింపన్=తెలియఁజేయఁగా; అనంగీకారభంగిన్=ఒప్పికొనమియొక్కరీతిచేత; అయ్యంగన యంతరంగంబు=ఆచంద్రికయొక్కచిత్తము; ఎసంగినన్=ఒప్పఁగా; ఆచెంతన్ = ఆ సమీపమున; ఒక్క నరపుంగవున్ =ఒక్క నరపతిని; చూపి=ప్రదర్శించి; సారంగధారిసారంగయాన – సారంగధారి=శివునియొక్క, సారంగయాన = పత్ని యగు పార్వతి; తరంగవళీమణిన్ గుఱించి = తరఁ గలవంటి వళులు గల చంద్రికనుగూర్చి; ఇట్లనియెన్=వక్ష్యమాణప్రకార ముగఁ బలికెను.

చ. ఇనకులమౌళి కేరళమ◊హీపతి యీతఁడు గాంచు ప్రీతితో
మనఁగ నపారిజాతమహి◊మంబున రాజిలు నివ్విభుఁ డుర్వరన్
మను ననపారిజాతమహి◊మంబునఁ గుందరదాలలామ! పా
వనసుమనోహృదిష్టఫల◊వారవితీర్ణికలాచమత్కృతిన్. 98

టీక: కుందరదాలలామ =జాజిమొగ్గలవంటి దంతపంక్తిగల స్త్రీలలో శ్రేష్ఠురాలవైన చంద్రికా! ఈతఁడు=ఈరాజు; ఇనకులమౌళి =రాజశ్రేష్ఠుఁడగు; కేరళమహీపతి =కేరళదేశమునకు నధిపతి; ప్రీతితోన్=ప్రేమతో; కాంచు=చూడుము; అపారిజాతమహిమం బునన్ – అపారిజాత=పారిజాతాభావముయొక్క, మహిమంబునన్=సామర్థ్యముచేత;అపగతమైన శత్రుసంఘముయొక్క మహిమచేత నని స్వభావార్థము; మనఁగన్=వర్తించుటచేత; రాజిలు నివ్విభుఁడు = ప్రకాశించుచున్నట్టి యీరాజు; పావన సుమనో హృదిష్ట ఫల వార వితీర్ణి కలా చమత్కృతిన్ – పావన=పరిశుద్ధులైన, సుమనః=విద్వాంసులయొక్క, హృత్= మన మునకు, ఇష్ట=ప్రియములైన, ఫల=లాభ ములయొక్క, వార=సంఘముయొక్క, వితీర్ణి=ఇచ్చుట యనెడు, కలా=విద్య యొక్క, చమత్కృతిన్=చమత్కారముచేత; దేవతలయొక్క మనములకు నిష్టఫలముల నొసంగుట యనెడు విద్యయొక్క చమత్కృతి చేత నని వేల్పుమ్రాఁకు పరమైన యర్థము తోఁచెడి; ఉర్వరన్=భూమియందు; అనపారిజాతమహిమంబునన్ – అనపారిజాత =అపారిజాతభావాభావము యొక్క, పారిజాతముయొక్క యనుట, మహిమంబునన్=మహిమచేత; మనున్= వర్తించును. ఈరాజు అపారిజాతుఁడైనను, దానశౌండతచే అనపారిజాతమహిమంబునఁ బ్రకాశించుచున్నాఁడని భావము.

మ. అనిశం బీఘనుకీర్తిధామయుగళం◊బన్యోన్యవైరాప్తినో
యన నం దొక్కటి ప్రోవ వేఱొకటి వ◊జ్రారూఢిఁ గూల్చున్ విరో
చను వేఱొక్కటి యేఁచ నందొకటి మిం◊చం జేయు హంసోన్నతిన్
మును మున్నొక్కటి నొంప వేఱొకటి మ◊న్పుం గొమ్మ! చిత్రంబుగన్. 99

టీక: కొమ్మ=చంద్రికా! అనిశంబు=ఎల్లపుడు; ఈఘను కీర్తిధామ యుగళంబు =ఈమేటియొక్క కీర్తిప్రతాపముల జంట; అన్యోన్యవైరాప్తినోయనన్ =పరస్పరవైరముచేతనో యనునట్లు; అందున్=కీర్తిప్రతాపములలో; ఒక్కటి=ఒకకీర్తి గాని, ప్రతాపము గాని; ప్రోవన్=పాలింపఁగా; వేఱొకటి=ఇంకొకటి;వజ్రారూఢిన్=వజ్రాయుధముయొక్క రూఢిచేత; కూల్చున్= చంపును; విరోచనున్=సూర్యుని; వేఱొక్కటి=వానిలో నొకటగు ప్రతాపము; ఏఁచన్=బాధింపఁగా; అందొకటి=దానిలో నొక టగు కీర్తి; విరోచనుని మించం జేయును, ఇచట విరోచనుఁ డనఁగా చంద్రుఁడను నర్థమును గ్రహించి విరోధపరిహారము చేయ వలెను, ‘చంద్రాగ్న్యర్కా విరోచనాః’ అని విశ్వము; హంసోన్నతిన్—హంస=సూర్యునియొక్క, ఉన్నతిన్=అతిశయమును; మునుమున్ను=మొట్టమొదట; ఒక్కటి=దానిలో నొకటియగు ప్రతాపము; నొంపన్=నొవ్వఁజేయఁగా; వేఱొకటి=మఱియొకటి యగు కీర్తి; హంసోన్నతిన్=సూర్యోన్నతిని; చిత్రంబుగన్=ఆశ్చర్యముగ; మన్పున్=పోషించును. ఇచట హంసశబ్దమునకు, రాజహంస యర్థము గావున రాజహంసల యున్నతిని, కీర్తి పోషించు నని భావము. అనఁగ నీరాజుకీర్తి చంద్రుని, హంసలను పోషించు ననియు, ప్రతాపము సూర్యునిఁ దిరస్కరించు ననియు భావము.

చ. సలలితచక్రసంభరణ◊సక్తమహాశయు దేవవర్ణితో
జ్జ్వలదయుఁ బూరుషోత్తము ని◊శాచరసాధ్వసకృత్సమాఖ్యు ని
య్యలఘునిఁ జెట్టవట్టి హరి ◊నంబుధిరాజతనూజ వోలె ని
చ్చ లురముఁ బాయ కింపున నె◊సంగుము వాసవనీలకుంతలా! 100

టీక: వాసవనీలకుంతలా =ఇంద్రనీలమణులవంటి కురులుగల చంద్రికా! సలలిత చక్ర సంభరణ సక్త మహాశయున్ – సలలిత= మనోజ్ఞమగు, చక్ర=దండుయొక్క, సంభరణ=భరించుటయందు, సక్త=ఆసక్తిగల, మహాశయున్=అధికమగు నభిప్రాయము గల; సలలిత= మనోజ్ఞమగు, చక్ర=సుదర్శనముయొక్క,సంభరణ=భరించుటయందు,సక్త=ఆసక్తిగల, మహత్=గొప్ప యగు, శయున్= హస్తముగలవాఁడని విష్ణుపరమైన యర్థము; దేవ వర్ణి తోజ్జ్వల దయున్=దేవతలచేఁ గొనియాడఁబడిన కృప గల; పూరుషోత్తమున్=పురుషశ్రేష్ఠుని, విష్ణుమూర్తిని; నిశాచరసాధ్వసకృ త్సమాఖ్యున్ –నిశాచర=రక్కసులకు, సాధ్వస కృత్=భయము గలుగఁజేయు, సమాఖ్యున్=ప్రసిద్ధిగల, నామము గల వానిని; ఇయ్యలఘునిన్=ఈఘనుని; చెట్టవట్టి= వివాహమాడి; హరిన్=విష్ణువును; అంబుధిరాజతనూజ వోలెన్=కలిమినెలంతవలె; నిచ్చలు=ఎల్లపుడు; ఉరముఁ బాయక = ఎదను వదలక; ఇంపునన్=సుఖముచేత; ఎసంగుము=ఒప్పుము. అనఁగ నోచంద్రికా! కరివేల్పు నురముఁ బాయ కెప్పుడు నివ సించి యుండు లచ్చినెలంతవోలె, నీ వీరాజును బెండ్లియై వీనియురముఁ బాయక సుఖముగ నుండు మని భావము.

ఉ. నా విని కొమ్మ యక్షివల◊నంబునఁ దన్నృపచంద్రనిస్పృహ
శ్రీవెలయింప ముంగలికిఁ ◊జేర ఘటించె వయస్య యోర్తు దో
డ్తో వరయానధుర్యతతి◊తో వివరించుచు నప్పు డొక్క పృ
థ్వీవిభుఁ జూపి గౌరి సుద◊తిం బలుకుం బ్రియవాక్యనైపుణిన్. 101

టీక: నాన్=అనఁగా; విని=ఆకర్ణించి; కొమ్మ=చంద్రిక; అక్షివలనంబునన్=నేత్రచలనముచేత; తన్నృపచంద్రనిస్పృహశ్రీన్ – తన్నృపచంద్ర=ఆరాజచంద్రునియందు, నిస్పృహశ్రీన్=నైరాశ్యరచనను; వెలయింపన్=ప్రకాశింపఁజేయఁగా; ముంగలికిన్ = పురోభాగమునకు; చేరన్=పొందునటులు; వయస్య యోర్తు =ఒకచెలికత్తె; ఘటించెన్=చేసెను; తోడ్తోన్=వెంటనే;వరయాన ధుర్యతతితోన్ – వర=శ్రేష్ఠములగు, యానధుర్య=పల్లకిమోయువారియొక్క,తతితోన్=సమూహముతో; వివరించుచున్ = విశదపఱచుచు; అప్పుడు=ఆసమయమందు; ఒక్క పృథ్వీవిభున్=ఒకరాజును; చూపి=ప్రదర్శించి; గౌరి=పార్వతీదేవి; సుదతిన్=చంద్రికతో; ప్రియవాక్యనైపుణిన్—ప్రియవాక్య=ప్రియములగు పలుకులయొక్క, నైపుణిన్=జాణతనముచేత; పలుకున్=వచించెను.

క. నాళీకనయన! పార్థివ,మౌళీమణిఁ గాంచు దహళ◊మహివిభు రతిరా
ట్కేళీనూత్నకళాసౌ,శీలీమన్మనుజలోక◊శేఖరు వీనిన్. 102

టీక: నాళీకనయన=పద్మములవంటి నేత్రములు గల చంద్రికా! పార్థివమౌళీమణిన్=రాజమౌళిరత్నమును; దహళమహి విభున్=దహళభూపాలుఁడును; రతిరాట్కేళీ నూత్నకళా సౌశీలీమ న్మనుజలోకశేఖరున్ – రతిరాట్కేళీ=మదనక్రీడల యొక్క, నూత్నకళా=నూతనవిద్యయును, సౌశీలీమత్=సచ్చరిత్రవత్తయుఁగల, మనుజలోకశేఖరున్=మనుష్యలోకము నందు శ్రేష్ఠుఁ డగు; వీనిన్=ఈరాజును; కాంచు=చూడుము.

చ. నెలఁత గభీరపుష్కరధు◊నీపరిగాహనముల్ సురాగమం
డలఫలభక్షణంబులు క◊నత్సుమనోమహిళానికేతన
స్థలపరివాసముల్ సమతఁ ◊దాల్చు భయాభయయుక్తిఁ బొల్చుని
య్యలఘునిశత్రుకోటి కచ◊లావళిలేఖపురుల్ విచిత్రతన్. 103

టీక: నెలఁత=చంద్రికా! భయాభయయుక్తిన్—భయ=భయముయొక్క, అభయ=భయాభావముయొక్క, యుక్తిన్=సంబం ధముచేత; పొల్చు =ఒప్పుచున్న, ఇయ్యలఘుని శత్రుకోటికిన్=ఈరాజుయొక్క శత్రుబృందమునకు; అచలావళిలేఖపురుల్ – అచలావళి=పర్వతబృందమును, లేఖపురుల్=అమరావతియును; విచిత్రతన్ =చమత్కృతిచేత; గభీరపుష్కరధునీపరిగాహ నముల్ – గభీర=గంభీరమగు, పుష్కరధునీ=మిన్నేటియందు, పరిగాహనముల్=స్నానములను; పుష్కర=కమలములు గల, ధునీ=నదులయందు, పరిగాహనము లని రెండవయర్థము; సురాగమండలఫలభక్షణంబులు – సురాగ=వేల్పుమ్రాఁకుల యొక్క, మండల=గుంపుయొక్క,ఫల =పండ్లయొక్క, భక్షణంబులు = తినుటలు; సురాగ = ఈఁతచెట్లయొక్క, మండల = గుంపుయొక్క, ఫలభక్షణంబుల నని రెండవయర్థము; కనత్సుమనోమహిలానికేతనస్థలపరివాసముల్ – కనత్=ప్రకాశించు చున్న, సుమనోమహిళా=దేవాంగనలయొక్క, నికేతన=గృహములయొక్క,స్థల=ప్రదేశములందు,పరివాసముల్=నివాసము లను; సుమనః=పుష్పములుగల, మహిళా=ప్రేంకణపుచెట్లయొక్క, గృహస్థలపరివాసము లని రెండవయర్థము; సమతన్ = సమత్వముచేత; తాల్చున్= ధరించును. అనఁగ నీరాజునకు భయపడిన శత్రువులు వననివాసముఁ జేసిరనియు, భయపడని శత్రువులు యుద్ధమునందు నిహతులై స్వర్గనివాసముఁ జేసి రనియు భావము.

సీ. దరిసించుచో నెల్లఁ ◊దాఱించుఁ దాప మీ,యవనీంద్రుచూపు చంద్రా◊తపంబొ,
ఎనసినచో నెల్ల ◊మనుపు నామోద మీ,రారాజు చిత్తంబు ◊సారసంబొ,
నెరసినచో నెల్ల ◊దొరపు దేవత్వ మీ,యరిభేదిమాట న◊వ్యామృతంబొ,
యుంచినచో నెల్ల ◊నించు నిష్టంబు లీ,ధీరునిపాణి మం◊దారలతయొ,

తే. యనుచు సత్కవిలోకంబు ◊లభినుతింప, నలరు నీదహళోర్వరా◊ధ్యక్షరత్న
మతివ నీభాగధేయంబు◊కతన నిటకు, వచ్చె వరియింపు మితని భా◊వము చిగుర్ప. 104

టీక: దరిసించుచోన్=చూచినచోట; ఎల్లన్=అంతట; తాపము=సంతాపమును; తాఱించున్=పోఁగొట్టును; ఈయవనీంద్రు చూపు = ఈరాజేంద్రునియొక్కచూపు; చంద్రాతపంబొ=వెన్నెలయో?
ఎనసినచోన్=పొందినచోట; ఎల్లన్=అంతట; ఆమోదము=సంతసమును, పరిమళ మని తోఁచుచున్నది; మనుపున్=వృద్ధిఁ బొందించును; ఈరారాజు=ఈరాజరాజుయొక్క; చిత్తంబు=మనము; సారసంబొ=తమ్మియో?
నెరసినచోన్=వ్యాపించినచోట; ఎల్లన్=అంతట; దేవత్వము=రాజత్వమును, వేల్పుతనమును; దొరపున్=కలుగఁజేయును; ఈయరిభేదిమాట = శత్రుభేదకుఁడైన యీరాజుమాట; నవ్యామృతంబొ=నూతనమైన సుధయో?
ఉంచినచోన్=ఉనిచినచోట; ఎల్లన్=అంతట; ఇష్టంబులు=కోరికలను; నించున్=పూరించును; ఈధీరునిపాణి =ఈరాజు హస్తము; మందారలతయొ = కల్పలతయో? అనుచున్=ఇట్లు వచించుచు; సత్కవిలోకంబులు=విద్వద్బృందములు; అభినుతింపన్=పొగడఁగ; అలరు=ఒప్పును; ఈ దహళోర్వరాధ్యక్షరత్నము=ఈదహళరాజశ్రేష్ఠుఁడు; అతివ=చంద్రికా! నీభాగధేయంబుకతనన్=నీయొక్కభాగ్యవశమున; ఇటకు=ఇచ్చోటికి; వచ్చెన్=వచ్చెను; ఇతనిన్=ఈఱేని; భావము చిగుర్పన్=చిత్తము పల్లవింపఁగా; వరియింపు=వరింపుము.

ఈరాజు చూచెనాయనా సమస్తతాపములను బోఁగొట్టును గాన ఇతనిచూపు వెన్నల యేమో, ఇతనిచిత్తము కలిసెనేని ఆమోదము నిచ్చునుగాన నది కమలమో యేమో, ఇతనిమాట నెరసినచో దేవత్వ మొసగునుగాన నది యమృత మేమో, ఇతని చే యుంచినచో నెల్లకోరికల నిచ్చునుగాన నది కల్పలతయో యేమో, యీరీతి సమస్తవిద్వజ్జనులు నితని నుతింతురు గాన నీరాజును వరింపు మని భావము. సందేహాలంకారము.

వ. అనిన నయ్యొప్పులకుప్ప యప్పతియెడం జిత్తం బొప్పింపకున్కి దెలిసి యాచాయ నొక్కనృపతిం జూపి నొసలిచూపువేల్పుజవరా లాచివురాకుఁబోఁడి కిట్లనియె. 105

టీక: అనినన్=ఈప్రకారము పలుకఁగా; అయ్యొప్పులకుప్ప=అందములకు ప్రోవైన యాచంద్రిక; అప్పతియెడన్=ఆరాజు నందు; చిత్తంబు= మనస్సు; ఒప్పింపకున్కిన్=ఈయకుండుటను; తెలిసి=ఎఱిఁగి; ఆచాయన్=ఆప్రదేశమందు; ఒక్కనృపతిన్ =మఱియొకరాజును; చూపి=ప్రదర్శించి; నొసలిచూపువేల్పుజవరాలు=ఫాలనేత్రుని పత్నియగు పార్వతీదేవి; ఆచివురాకుఁ బోఁడికిన్ = పల్లవగాత్రి యగు నాచంద్రికకు; ఇట్లనియెన్=వక్ష్యమాణప్రకారముగఁ బలికెను.

చ. కనుఁగొను బోటి! భోటనర◊కాంతశిఖామణి ధామధిక్కృతా
తనుఘృణి వీఁడు జన్యవసు◊ధాస్థలి శింజిని కార్తిపొందు దా
ర్చిన నరి తద్భృతిం గనుఁ బ◊రిస్ఫుటకాండనికాయముల్ నిగి
డ్చిన నవి తద్వధూటి నిగి◊డించుఁ గనుంగవ నద్భుతంబుగన్. 106

టీక: బోటి=చంద్రికా! భోటనరకాంతశిఖామణిన్=భోటదేశరాజశిఖామణిని; ధామధిక్కృతాతనుఘృణిన్ – ధామ=తేజస్సు చేత, ధిక్కృత=తిరస్కరింపఁబడిన, అతనుఘృణిన్=సహస్రకిరణుని; కనుఁగొను=చూడుము; వీఁడు=ఈరాజు; జన్యవసుధా స్థలిన్=యుద్ధభూమియందు; శింజినిన్=అల్లెత్రాటికి; ఆర్తిపొందు దార్చినన్=ధనుష్కోటిసంబంధమును జేయఁగా; అరి= శత్రువు; తద్భృతిన్ =ఆయార్తిభరణమును, పీడాభరణము ననుట; కనున్=పొందును; పరిస్ఫుటకాండనికాయముల్ – పరి స్ఫుట=వ్యక్తమగు, కాండ=బాణములయొక్క, నికాయముల్=సమూహములను; నిగిడ్చినన్=ఎక్కువెట్టఁగా; తద్వధూటి =ఆశత్రుకాంత; కనుంగవన్=కనుదోయియందు; అద్భుతంబుగన్=ఆశ్చర్యముగ; అవి= ఆకాండనికాయములను, నీళ్ళ సమూహముల ననుట, బాష్పముల నని భావము; నిగిడించున్=నించును.

అనఁగ నీరాజు యుద్ధభూమియందు వింటికొప్పున నల్లెత్రాటిని జేర్చుతఱి శత్రుబృందము దుఃఖమును బొందుననియు, అల్లెత్రాటియందు బాణంబుల నిగిడ్చిన వారికాంతలు కనుగవ నీరుంతు రనియు భావము. ఈపద్యమందు శత్రుప్రాణవియోగ కారణం బగు శరసంధానమును తత్కార్యరూప మగుశత్రుకాంతానయనబాష్పముల నొక్కుమ్మడి హేతుకార్యముల వర్ణించు టచే నక్రమాతిశయోక్తి యను నలంకారము. ‘అక్రమాతిశయోక్తి స్స్యా త్సహత్వే హేతుకార్యయోః’ అని దానిలక్షణము.

చ. ఉరగమువక్రవృత్తి నచ◊లోత్తముసత్పథరోధకోన్నతి
స్ఫురణఁ గిరీంద్రుపంకరత◊బుద్ధి ఢులీశుజడప్రచారమున్
కరిపతిదుర్మదక్రమము ◊గన్గొని రోసి ధరిత్రి తద్గుణే
తరగుణశాలి నివ్విభునిఁ ◊దన్వి వరించి చెలంగు నిచ్చలున్. 107

టీక: ఉరగమువక్రవృత్తిన్=శేషుని కుటిలస్వభావమును, శేషుఁడు సర్పము గానఁ గుటిలగతి సహజమని భావము; అచలోత్తము సత్పథరోధకోన్నతిస్ఫురణన్ – అచలోత్తము=కులాచలముయొక్క, సత్పథరోధక=సత్పురుషులమార్గమునకు నిరోధకమగు, ఉన్నతిస్ఫురణన్=ఔన్నత్యస్ఫురణమును; కులాచలమునకు,సత్పథ=ఆకాశమునకు రోధకమగు నున్నతస్ఫుర ణము సహజమని భావము; కిరీంద్రుపంకరతబుద్ధిన్ – కిరీంద్రు=ఆదివరాహముయొక్క, పంక=పాపమునందు,రత=ఆసక్తి గల, బుద్ధిన్=మతిని; పంక=బురదయందు, రతమగు బుద్ధి కరీంద్రునకు సహజమని భావము; ఢులీశుజడప్రచారమున్=ఆది కూర్మముయొక్క మూర్ఖులతోఁ గూడిన ప్రచారమును, ఇచట డలలకు భేదములేమి ఆదికూర్మమునకు జలమందు ప్రచారము సహజమని స్వభావార్థము; కరిపతిదుర్మదక్రమమున్—కరిపతి=గజపతియొక్క, దుర్మదక్రమమున్=దుర్గర్వక్రమమును, గజపతికి దుర్మదక్ర మమనఁగ, మదోదకముతోఁ గూడి యుండుట సహజమని భావము; కన్గొని=చూచి; రోసి=విసిగి; ధరిత్రి= భూమి;తద్గుణేతరగుణశాలిన్ – తత్=ఆయురగాదులయొక్క,గుణేతర=గుణములకన్న భిన్నమైన, గుణ=మంచిగుణముల చేత, శాలిన్=ప్రకాశించుచున్న; ఇవ్విభునిన్=ఈరాజును; తన్వి=చంద్రికా! వరించి=కోరి; నిచ్చలున్=ఎల్లపుడు; చెలంగున్ = ఒప్పును. ఓచంద్రికా! యుర గాచల కిరి ఢులీ కరుల దుర్గుణములకుఁ బుడమి రోసి యీగుణశాలిని జేరె నని భావము.