చ. నిరుపమవిశ్రవస్తనయ◊నిగ్రహకృద్ద్రవిణాఢ్యుఁడై మహా
హరిబలసంయుతుండయి బు◊ధార్చితరామసమాఖ్య నొప్పు నీ
నరకులసార్వభౌముని మ◊నం బలర న్వరియింప మేదినీ
వరసుత! నీకు నెంచ నని◊వార్యకుశోదయ మబ్బు టబ్రమే. 60
టీక: నిరుపమ విశ్రవస్తనయ నిగ్రహ కృద్ద్రవి ణాఢ్యుఁడు ఐ – నిరుపమ=సాటిలేని, విశ్రవస్తనయ=కుబేరునియొక్క, నిగ్రహ= నిరసనమును, కృత్=చేయుచున్న, ద్రవిణ=ధనముచేత, ఆఢ్యుఁడు ఐ =ధనికుఁడైనవాఁడై; నిరుపమ=సాటిలేని, విశ్రవస్తనయ =రావణాసురునియొక్క, నిగ్రహకృత్=నిరసనమును జేయు, ద్రవిణాఢ్యుఁడు ఐ = బలముగల్గిన వాఁడయి యని శ్రీరామపర మైన యర్థము, ‘ద్రవిణం కాంచనే విత్తే, ద్రవిణం చ పరాక్రమే’ అని విశ్వము; మహా హరిబల సంయుతుండయి – మహత్=అధిక మగు, హరిబల=సింహబలముతో, సంయుతుండయి=కూడుకొన్నవాఁడై; మహత్=అధికమైన, హరిబల=వానరసేనతో, సంయుతుండయి=కూడుకొన్నవాఁడై యని శ్రీరామపరమైన యర్థము; బుధార్చిత రామసమాఖ్యన్ – బుధ=విద్వాంసులచేత, అర్చిత=మన్నింపఁబడిన, రామ=మనోహరమగు, సమాఖ్యన్=కీర్తిచేత; బుధ=దేవతలచేత, అర్చిత=పూజింపఁబడిన, రామ సమాఖ్యన్= రాముఁడను నామముచేత నని శ్రీరామపరమైన యర్థము; ఒప్పు నీనరకులసార్వభౌమునిన్ = ప్రకాశించు నీమనుజ కులచక్రవర్తిని, శ్రీరాముని; మనంబు=మానసము; అలరన్=సంతసించునటులు; వరియింపన్=కోరఁగా; మేదినీవరసుత – మేదినీవర=భూభర్తయగు క్షణదోదయునియొక్క, సుత=కూఁతురవగు చంద్రికా! భూపుత్త్రియగు సీతాదేవి యను నర్థము దోఁచుచున్నది; నీకున్; ఎంచన్=విచారింపఁగా; అనివార్యకుశోదయము – అనివార్య=నివారించుటకశక్యమగు, కుశ= కుశ ద్వీపముయొక్క, ఉదయము=ఉన్నతి; అబ్బుట=లభించుట; అబ్రమే=ఆశ్చర్యమా? కాదనుట. అనివార్యమగు కుశ=కుశుఁ డను పుత్త్రునియొక్క, ఉదయము=ఆవిర్భావము అబ్బుట చిత్రముగాదని తోఁచుచున్నది.
అనఁగా కుబేరునికన్న నెక్కుడు ధనముగలవాఁడును, సింహబలుడును, పండితశ్లాఘ్యమైనకీర్తి గలవాఁడును నగు నీకుశ ద్వీపాధిపతిని వరియింతువేని నీకు కుశద్వీప మబ్బునని భావము. రావణునిఁ బరాక్రమముచే నిగ్రహించినవాఁడును, వానరసేన గలవాఁడును, రామనామముగలవాఁడును నగు దాశరథిని వరించిన సీతాదేవికిఁ గుశుఁడను పుత్త్రుఁడు గల్గెనని యర్థాంతరము.
మ. బలజూటీమణిదీప్తిదీపకులసం◊భారాప్తయౌ జన్యమం
గళగేహాంగణవీథి వీఁడు గుణటం◊కారాఖ్యమంత్రధ్వనుల్
సెలఁగ న్సాహసలక్ష్మిఁ గూడి కరనా◊ళీకంబుల న్గూర్చుఁ బో
నలిమై నాకబలిన్ ద్విషత్కరిశిరో◊నర్ఘోరుముక్తాతతిన్. 61
టీక: వీఁడు = ఈకుశద్వీపాధిపతి; బల జూటీమణి దీప్తి దీప కుల సంభారాప్తయౌ జన్య మంగళగేహాంగణవీథిన్ – బల=సేనల యొక్క, జూటీమణి=శిరోమణులయొక్క, దీప్తి=కాంతులనెడు, దీప=దీవియలయొక్క, కుల=సమూహమనెడు, సంభార= పదార్థసంచయముచేత, ఆప్త=పొందబడినది, ఔ=అగునట్టి, జన్య=యుద్ధమనెడు, మంగళగేహ=కల్యాణగృహముయొక్క, అంగణవీథిన్=ముంగిటిభూమియందు; గుణ టంకా రాఖ్య మంత్రధ్వనుల్ – గుణ=అల్లెత్రాటియొక్క, టంకార=టంకారధ్వని యనెడు, ఆఖ్య=ప్రసిద్ధి గల, మంత్రధ్వనుల్=మంత్రముల రొదలు; చెలఁగన్=ఒప్పుచుండఁగా; సాహసలక్ష్మిన్=తెగువయనెడు లక్ష్మిని; కూడి=పొంది, వివాహమయి యనుట; నలిమైన్=యోగ్యముగా; ద్విషత్కరి శిరోనర్ఘోరు ముక్తాతతిన్ – ద్విషత్కరి= శత్రుగజములయొక్క, శిరః=తలలయందుండు, అనర్ఘ=అమూల్యములగు, ఉరు=గొప్పలగు, ముక్తా=ముత్యములయొక్క, తతిన్=సమూహముచేత;నాకబలిన్=వివాహాంగభూతమగు నాకబలి యను కృత్యమును; కరనాళీకంబులన్=కరకమలముల చేత, కరమందుండు బాణములచేత ననిగాని యర్థము; కూర్చున్=ఒనరించును; పో=సత్యము.
అనఁగ నీకుశద్వీపాధిపతి యగురాజు సైనికులయొక్క శిరోమణికాంతు లనెడు దీపములచే నలంకరింపఁబడియున్న యుద్ధభూమి యనెడు మంగళగృహమందు అనఁగా వివాహగృహమునందు అల్లెత్రాటిమ్రోత యనెడు మంత్రములు వెలయు చుండఁగ, సాహసలక్ష్మిం బెండ్లియై, శత్రుగజంబుల శిరములయం దుండు ముత్యములచే నాకబలిని జేయునని భావము.
మ. వరభోగాన్వితుఁ డీనృపాలకుఁడు ప్రో◊వన్ నిచ్చలు న్మించు స
ర్పిరపాంపత్యభివేష్టితోర్వర ధరా◊భృద్భేదిసంత్రాతని
ర్జరపుర్యుత్తమలీల నిత్యసుఖవి◊భ్రాజద్బుధశ్రేణికా
పరిషక్తిన్ హితదాయిరాజమణిసం◊ప్రాప్తిం గురంగేక్షణా! 62
టీక: కురంగేక్షణా=లేడికన్నులవంటి కన్నులు గల చంద్రికా! వరభోగాన్వితుఁడు – వర=శ్రేష్ఠమగు, భోగ=గృహము, శయ్య, ఆభరణము, వస్త్రము, పుష్పము, స్త్రీ, గంధము,తాంబూలము అను నీయెనిమిదిభోగములతో, అన్వితుఁడు=కూడినవాఁడు; ఈ నృపాలకుఁడు = కుశద్వీపాధిపతి యగు నీరాజు; ప్రోవన్=రక్షింపఁగా; సర్పిరపాంపత్యభివేష్టితోర్వర – సర్పిరపాంపతి= ఘృతసముద్రముచేత, అభివేష్టిత=చుట్టఁబడిన, ఉర్వర=భూమి; ధరాభృద్భేదిసంత్రాతనిర్జరపుర్యుత్తమలీలన్ – ధరాభృద్భేది =ఇంద్రునిచేత, సంత్రాత=రక్షింపఁబడిన, నిర్జరపురీ=అమరావతియొక్క, ఉత్తమలీలన్=శ్రేష్ఠమగు విలాసముచేత; నిత్య సుఖ విభ్రాజ ద్బుధ శ్రేణికా పరిషక్తిన్ – నిత్య=శాశ్వతమగు, సుఖ=సుఖముచేత, విభ్రాజత్=ప్రకాశించుచున్న, బుధ=విద్వాంసుల యొక్క, దేవతలయొక్క, శ్రేణికా= పంక్తియొక్క, పరిషక్తిన్=సంబంధముచేత; హితదాయి రాజమణి సంప్రాప్తిన్ – హితదాయి = హితము నొసఁగు, హితమగు దాని నొసఁగు, రాజమణి=రాజశ్రేష్ఠులయొక్క, చింతామణియొక్క, సంప్రాప్తిన్=ప్రాప్తిచేత; నిచ్చలున్=ఎల్లపుడు; మించున్=ప్రకాశించును.
అనఁగ నీకుశద్వీపాధిపతిచేఁ బోషింపఁబడుపుడమి యమరావతివలెఁ బ్రకాశించుచున్నదని భావము.
క. అని తెలుప మనం బచ్చట, మొనయమి శిబికాధరాళి ◊ముదిత నొకమహీ
శునిచెంతఁ జేర్ప శివ యి,ట్లను నావిభుఁ జూపి చెలువ ◊కమృతజిదుక్తిన్. 63
టీక: అని=ఈప్రకారము; తెలుపన్=తెలియఁజేయఁగ; మనంబు=డెందము; అచ్చటన్=ఆరాజునందు; మొనయమిన్=పూన కుండుటవలన; శిబికాధరాళి=పల్లకినిమోయువారి గుంపు; ముదితన్=చంద్రికను; ఒకమహీశునిచెంతన్=ఒకభూపాలుని సమీపమును; చేర్పన్=పొందింపఁగ; శివ=పార్వతి; ఆవిభున్=ఆరాజును; చూపి=చూపెట్టి; అమృతజిదుక్తిన్=సుధను జయించిన వచనముల చేత; చెలువకు=చంద్రికకు; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగ; అనున్=పల్కెను.
శా. ఓపద్మానన! గాంచు మీనృపతి ర◊మ్యోత్కంఠమై శాల్మలి
ద్వీపత్రాణచణుం డితం డితనివి◊ద్విట్కాంతకుత్ప్రత్నకే
ళీపిచ్ఛందకవైఖరి న్వలయశై◊లీయోరుకూటంబు లా
ళీపాళీగతి భిల్లరాడ్యువతిమౌ◊ళిశ్రేణి పొల్చున్ గడున్. 64
టీక: ఓపద్మానన=ఓచంద్రికా! ఈనృపతిన్=ఈరాజును; రమ్యోత్కంఠమైన్=మనోహరమగు సంతసముచేత; కాంచుము= చూడుము; ఇతండు=ఈరాజు; శాల్మలిద్వీపత్రాణచణుండు=శాల్మలీద్వీపమును బాలించువాఁడు; ఇతనివిద్విట్కాంతకున్ – ఈరాజుయొక్క శత్రుకాంతకు; వలయశైలీయోరుకూటంబులు – వలయశైలీయ=చక్రవాళపర్వతసంబంధులగు, ఉరు=అధి కములగు, కూటంబులు=శిఖరములు; ఉత్ప్రత్నకేళీపిచ్ఛందకవైఖరిన్ – ఉత్=ఉన్నతమైన, ప్రత్న=పురాతనమగు, కేళీ పిచ్ఛందక=క్రీడాగృహముయొక్క, వైఖరిన్=రీతిని; భిల్లరాడ్యువతిమౌళిశ్రేణి =ఎఱుకుదొరలయొక్క స్త్రీసమూహము; ఆళీ పాళీగతిన్=సకియలగుంపురీతిని; కడున్=మిక్కిలి; పొల్చున్=ఒప్పును. అనఁగ నీశాల్మలీద్వీపాధిపతియొక్క శత్రుస్త్రీలకు మేడలు లోకాలోకపర్వతము లనియు, వారికి సకియలు ఎఱుకుస్త్రీ లనియును భావము.
మ. కలుమున్నీ రనుపెన్కొలంకునడుమ ◊న్గన్పట్టి వీఁ డేలు శా
ల్మలికాద్వీపము శ్రీయుతిం దనరుఁ గొ◊మ్మా! తమ్మి నా మధ్యసం
స్థలి జ్యోతిర్లతికాఖ్యకేసరవృతో◊ద్యత్కర్ణికాస్ఫూర్తి రా
జిల ద్రోణాద్రి తదగ్రగాభ్ర మళిరా◊జిస్థేమఁ జూపట్టఁగన్. 65
టీక: కొమ్మా=చంద్రికా! వీఁ డేలు శాల్మలికాద్వీపము =ఈరాజు పాలించు శాల్మలిద్వీపము; కలుమున్నీరనుపెన్కొలంకు నడుమన్ = సురాసముద్రమనెడు పెద్దమడుఁగునడుమ; కన్పట్టి=కనిపించి; ద్రోణాద్రి=ద్రోణపర్వతము; మధ్యసంస్థలి జ్యోతిర్లతి కాఖ్య కేసర వృతోద్యత్కర్ణికా స్ఫూర్తి న్ – మధ్యసంస్థలి=మధ్యప్రదేశమందలి, జ్యోతిర్లతికా=జ్యోతిర్లత లనెడు, ఆఖ్య=పేరు గల, కేసర=కింజల్కములచేత, వృత=ఆవరింపఁబడిన, ఉద్యత్=ప్రకాశించుచున్న, కర్ణికా=తామరదుద్దుయొక్క,స్ఫూర్తిన్ = అతిశయముచేత; రాజిలన్=ప్రకాశింపఁగ; తదగ్రగాభ్రము = దానిపై నున్నట్టిమబ్బు; అళిరాజిస్థేమన్=భృంగసమూహాకృతి చేత; చూపట్టఁగన్=కనిపింపఁగా; తమ్మి నాన్ = కమలమో యనునట్లు; శ్రీయుతిన్=కాంతితోఁ గూడుటచేతను, లక్ష్మితోఁ గూడుటచేత ననియుఁ దోఁచుచున్నది; తనరున్=ప్రకాశించును.
అనఁగా సురాసముద్ర మనెడుగొప్పకొలనునడుమఁ గాన్పించు నీశాల్మలీద్వీపమునడుమ జ్యోతిర్లతిక లనుకేసరములతోఁ జేరియున్న ద్రోణాద్రి తామరదుద్దువలె నుండఁగ, నాపర్వతముమీఁద నున్న మేఘము భృంగరాజివలె నుండఁగ, గొప్పమడుగు నందు భృంగరాజితోఁ జేరియున్న కమలమువలె నాద్వీపము ప్రకాశించు నని భావము. సముద్రమధ్యగతద్వీపమును హ్రద మధ్యగతకమలముగా నుత్ప్రేక్షించుటచే నుత్ప్రేక్షాలంకారము.
మ. తరుణీ! వీనియశోవదాతశుక ము◊ద్యచ్ఛక్తి మిన్నొంది బం
ధురతారాకులగోస్తనీఫలములం ◊దోడ్తో భుజింప న్విభా
వరి తద్దైన్యముఁ జెంద దేతదతిదీ◊ వ్యజ్జైత్రభేరీరవో
త్కరఫక్కద్ద్రుహిణాండకర్పరగళ◊ద్బాహ్యాంబుబిందుచ్ఛటన్. 66
టీక: తరుణీ=చంద్రికా! వీనియశోవదాతశుకము = ఈశాల్మలీద్వీపాధిపతియొక్క యశస్సనెడు తెల్లని చిలుక; ఉద్యచ్ఛక్తిన్ =మీఁది కెగయుచున్న శక్తిచేత; మిన్నొంది=ఆకాశమును పొంది; బంధురతారాకులగోస్తనీఫలములన్ – బంధుర=ఎడములేని, తారాకుల=రిక్కలగుంపనెడు, గోస్తనీఫలములన్=ద్రాక్షాఫలములను; తోడ్తోన్ =వెంటనె; భుజింపన్=తినఁగా; విభావరి=రాత్రి; ఏత దతిదీవ్య జ్జైత్రభేరీ రవోత్కర ఫక్క ద్ద్రుహిణాండ కర్పర గళ ద్బాహ్యాంబు బిందు చ్ఛటన్ – ఏతత్=ఈశాల్మలీద్వీపాధిపతి యొక్క, అతిదీవ్యత్=మిక్కిలి ప్రకాశించుచున్న, జైత్రభేరీ=జయభేరియొక్క, రవోత్కర=శబ్దబృందముచేత, ఫక్కత్=పగి లిన, ద్రుహిణాండ=బ్రహ్మాండముయొక్క, కర్పర=పుఱ్ఱెవలననుండి, గళత్=జాఱుచున్న, బాహ్యాంబు=బ్రహ్మాండమునకు వెలుపలనుండు జలముయొక్క, బిందు=బిందువులయొక్క, ఛటన్=సమూహముచేత; తద్ధైన్యము—తత్=ఆనక్షత్రముల యొక్క, హైన్యము=శూన్యతను; చెందదు=పొందదు.
అనఁగ నీశాల్మలీద్వీపాధిపతియొక్క యశ మనెడు తెల్లనిచిలుక మిన్నొంది నక్షత్రము లనెడి ద్రాక్షాఫలములను తినినను, రాత్రి వీని జయభేరీనినాదములవలన బ్రహ్మాండకర్పరము పగిలి స్రవించు జలబిందుసందోహముచే రిక్కలయొక్క లేమిని జెందదని భావము. యశమును శుకమునుగా, రిక్కలను ద్రాక్షాఫలములనుగా, జలబిందువులను రిక్కలనుగా వర్ణించుటచేత రూపకాలంకారము.
ఉ. ఈవసుధేశుఁ గూడి హరి◊ణేక్షణ! నీవు ముదంబు నిక్క వే
లావనవాటికావిహృతు◊లం జరియించుచు మించువేళ నీ
మై వలగొన్న సంశ్రమస◊మాజము దూలఁగఁ బొల్చుఁ గాక హా
లావనరాశివాᳲకణకు◊లస్థగితానిలపోతజాతముల్. 67
టీక: హరిణేక్షణ=లేడికన్నులవంటి కన్నులుగల యోచంద్రికా! ఈవసుధేశున్=ఈశాల్మలీద్వీపాధిపతిని; కూడి=కలసికొని; నీవు; ముదంబు=సంతసము; నిక్కన్=అతిశయింపఁగా; వేలా వన వాటికా విహృతులన్ – వేలా=చెలియలికట్టయొక్క, వన= అడవియొక్క, వాటికా=పంక్తులయందు, విహృతులన్=విహారములచేత; చరియించుచున్=క్రుమ్మరుచు; మించువేళన్=అతి శయించుసమయమందు; నీమైన్=నీశరీరమునందు;వలగొన్న సంశ్రమసమాజము – వలగొన్న=చుట్టుకొన్న, సంశ్రమ=శ్రమల యొక్క, సమాజము=సమూహము; తూలఁగన్=పోవునట్లు; హాలావనరాశి వాᳲకణ కుల స్థగి తానిలపోత జాతముల్ – హాలా వనరాశి=సురాసముద్రముయొక్క, వాᳲకణ=నీటిబిందువులయొక్క, కుల=సమూహముచేత, స్థగిత=కప్పఁబడిన,అనిలపోత = మందమారుతములయొక్క, జాతముల్=సమూహములు; పొల్చుఁ గాక=ఒప్పుఁగాక.
ఓచంద్రికా! నీవు శాల్మలీద్వీపాధిపతిని గూడి వేలావనవిహారమును చేయుచుండుతఱి నీశరీరశ్రమను కలుమున్నీటి నీటి తుంపరలతోఁ గూడిన తెమ్మెరలు తొలఁగఁజేయునని భావము.
వ. అని యప్పంచాస్యపంచాస్యమధ్య యెఱింగించిన నాకాంచనాంగినేత్రాంచలం బతనిపైఁ బ్రవర్తింప దయ్యె, నది యెఱింగి వేఱొక్క మహీశపుంగవుఁ జేర నియోగించి యారాజేంద్రుం జూపి యన్నెలఁత కన్నెలతాల్పువేల్పు పట్టపుదేవి యిట్లనియె. 68
టీక: అని=ఈప్రకారముగఁ బలికి; అప్పంచాస్యపంచాస్యమధ్య– పంచాస్య=ఈశ్వరునియొక్క,పంచాస్యమధ్య=సింహము వంటి నడుముగల కాంత, అనఁగా శివకాంతయైన సన్ననినడుముగల పార్వతీదేవి; ఎఱింగించినన్=తెలియఁజేయఁగా; ఆకాంచ నాంగినేత్రాంచలంబు= ఆచంద్రికయొక్క కటాక్షము; అతనిపైన్=ఆశాల్మలిద్వీపాధిపతిమీఁద; ప్రవర్తింప దయ్యెన్=ప్రసరింప దాయెను; అది యెఱింగి = అది తెలిసి; వేఱొక్క మహీశపుంగవున్=మఱొక రాజశ్రేష్ఠుని; చేరన్=సమీపించునటులు; నియో గించి=ఆజ్ఞాపించి; ఆరాజేంద్రుం జూపి; అన్నెలఁతకున్=ఆచంద్రికకు; అన్నెలతాల్పువేల్పు పట్టపుదేవి=చంద్రుని ధరించిన శివునకుఁ బట్టపుదేవి యగు నా పార్వతీదేవి; ఇట్లు=వక్ష్యమాణప్రకారము; అనియెన్=పలికెను.
మ. అరిజన్యాంబుధిసంభవజ్జయరమా◊హాసాంకురత్కీర్తి నీ
శరజాస్త్రోపమమూర్తిఁ గాంచు చెలి! ప్ల◊క్షద్వీపభూభర్త స
ప్తరసాభృద్ధరణీయయై పొదలు గో◊త్రం దాల్చు నీమేటి భా
స్వరదోర్యష్టిభుజాంగదాగ్రఖచితాం◊చచ్ఛక్రనీలోపధిన్. 69
టీక: చెలి=చంద్రికా!అరి జన్యాంబుధి సంభవ జ్జయరమా హాసాంకుర త్కీర్తిన్ – అరి=శత్రువులయొక్క, జన్య=యుద్ధమనెడు, అంబుధి=సముద్రమందు, సంభవత్=జన్మించిన, జయరమా=జయలక్ష్మియొక్క,హాసాంకురత్=చిఱునగవువలెనాచరించు చున్న, కీర్తిన్=యశముగల; ప్లక్షద్వీపభూభర్త న్=ప్లక్షద్వీపాధిపతియగు; ఈశరజాస్త్రోపమమూర్తిన్=జలజాస్త్రుఁడగు మరు నికి సమానమగు దేహముగల వీనిని; కాంచు=చూడుము; ఈమేటి=ఈఘనుఁడు; సప్తరసాభృ ద్ధరణీయయై—సప్తరసాభృత్ =సప్తకులాచలములచేత, ధరణీయయై=ధరింపఁదగినదియై; పొదలు గోత్రన్=వృద్ధిఁబొందుచున్న భూమిని; భాస్వర దోర్యష్టి భుజాంగ దాగ్ర ఖచితాంచ చ్ఛక్రనీలోపధిన్—భాస్వర=ప్రకాశించుచున్న, దోర్యష్టి=భుజదండములయొక్క, భుజాంగద= కేయూరములయొక్క, అగ్ర=చివరయందు,ఖచిత=చెక్కఁబడిన, అంచత్=ప్రకాశించుచున్న,శక్రనీల=ఇంద్రనీలమణియొక్క, ఉపధిన్= వ్యాజముచేత; తాల్చున్=ధరించును. అనఁగ నీప్లక్షద్వీపాధిపతి సప్తకులాచలములు మోయుచున్న భూమిని తన బాహుపురి యందలి చెక్కియున్న యింద్రనీలమణి యను వ్యాజముచే ధరించి యున్నాఁడని భావము. భూమి నల్లని దనుటకు విష్ణుమూర్తి వక్షమునందు ధరియించియున్న కస్తురిని లక్ష్మీదేవి సమీపమందు భూదేవిని బ్రీతితో నుంచెనా యనునటులు మను చరిత్రయం దుత్ప్రేక్షింపఁబడియున్నది.