మ. లలనా! కన్గొనుమీ రవిప్రభు విశా◊లారాజధానీప్రభు
న్లలిమై నీపతి యొప్పుఁగాక యెద వ్రే◊లం ద్వత్కరాంభోరుహ
స్థలి రాజిల్లుప్రసూనదామకము చం◊చద్వైజయంతీభృతిం
జెలువుం బూనురమావిభుం డన సుర◊శ్రేణుల్ ప్రమోదింపఁగన్. 118
టీక: లలనా = చంద్రికా! ఈరవిప్రభున్ = ఈసూర్యకాంతిగల; విశాలారాజధానీప్రభున్= విశాలాపురపతిని; కన్గొనుము = చూడుము; లలిమైన్=ప్రేమచేత; ఈపతి=ఈరాజు; త్వత్కరాంభోరుహస్థలి రాజిల్లుప్రసూనదామకము – త్వత్=నీయొక్క, కరాంభోరుహస్థలిన్=కరకమలప్రదేశమునందు, రాజిల్లు=ప్రకాశించు, ప్రసూనదామకము=పూదండ; ఎదన్=వక్షమునందు; వ్రేలన్=వ్రేలాడఁగా; చంచద్వైజయంతీభృతిన్—చంచత్=ప్రకాశించుచున్న, వైజయంతీ=వనమాలయొక్క,భృతిన్=భరణము చేత; చెలువున్=అందమును; పూనురమావిభుం డనన్=పొందినట్టి నారాయణమూర్తి యనునట్లు; సురశ్రేణుల్=దేవసంఘ ములు; ప్రమోదింపఁగన్=సంతోషింపఁగా; ఒప్పుఁగాక=ప్రకాశించునుగాక. చంద్రికా! వనమాలచే విష్ణువు ప్రకాశించునట్లు నీ చేతిపూదండను వక్షమున ధరించి యీవిశాలాపురాధిపతి ప్రకాశించుఁగాక యని భావము.
చ. నెలఁతుక! యీసుచంద్రధర◊ణీపతి శాతశరచ్ఛటం బలా
ద్బలగళరక్త మర్ఘ్యముగఁ ◊దత్కరికుంభమహామణు ల్సుమాం
జలిగఁ దదాతపత్రములు ◊చక్కనియార్తులుగాఁ దనర్చుచున్
బలి రణచండి కూన్చె ముని◊పాళి నుతింపఁ దమిస్రదానవున్. 119
టీక: నెలఁతుక=చంద్రికా! ఈసుచంద్రధరణీపతి=ఈసుచంద్రభూపాలుఁడు; శాతశరచ్ఛటన్ – శాత=తీక్ష్ణమైన, శరచ్ఛటన్ = బాణసమూహముచేత; పలాద్బలగళరక్తము — పలాద్బల=రాక్షసబలముయొక్క, గళరక్తము =కంఠశోణితము; అర్ఘ్యము గన్ =పూజార్హమైన వస్తువుగా;తత్కరికుంభమహామణుల్ – తత్=ఆదానవులయొక్క, కరికుంభ=గజకుంభములయందున్న, మహామణుల్=అధికమైనమణులు; సుమాంజలిగన్=కుసుమాంజలిగ; తదాతపత్రములు=ఆరాక్షసుల గొడుగులు; చక్కని యార్తులుగాన్=సుందరమగు నారతులుగా; తనర్చుచున్=చేయుచు; రణచండికిన్=రణదుర్గకు; తమిస్రదానవున్=తమిస్రా సురుని; మునిపాళి నుతింపన్=మునిసంఘములు కొనియాడఁగ; బలిన్=బలిగా; ఊన్చెన్=చేసెను.
అనఁగా నోచంద్రికా! ఈసుచంద్రుఁడు రాక్షసులయొక్క కంఠరక్తము నర్ఘ్యముగాను, వారిగజకుంభములనుండి వెడలిన ముత్తెములను కుసుమాంజలిగాను, వారిగొడుగులను హారతులుగను జేయుచు అర్ఘ్యము మొదలగు పూజాద్రవ్యములను జత పఱచి రణదుర్గను పూజించి, తమిస్రాసురుని బలియిచ్చెనని భావము.
మ. అని నేతద్విభుసాయకాభిహతి మి◊న్నంటం బయిం బర్వి శ
త్రునృపాళీమకుటీవలక్షమణిపం◊క్తుల్ ద్రెళ్ళుటల్ పొల్చు వ
ర్ణన సేయం జెలినిర్భరానకరవ◊భ్రశ్యన్మహోడుస్థితిన్
ఘనలేఖోత్కరవర్షితాభ్రతరురం◊గత్కోరకవ్యాపృతిన్. 120
టీక: చెలి=చంద్రికా! అనిన్=యుద్ధమందు; ఏతద్విభుసాయకాభిహతిన్ – ఏతద్విభు=ఈసుచంద్రునియొక్క, సాయక= బాణ ములయొక్క, అభిహతిన్=కొట్టుటచేత;మిన్నంటన్=ఆకసము నంటునటులు; పయిన్=ఊర్ధ్వభాగమందు; పర్వి=వ్యాప్తమై; శత్రునృపాళీ మకుటీ వలక్షమణి పంక్తుల్ – శత్రునృప=శత్రురాజులయొక్క, ఆళీ=పంక్తులయొక్క, మకుటీ=కిరీటములందలి, వలక్షమణి= రవలయొక్క, పంక్తుల్=శ్రేణులు; త్రెళ్ళుటల్=పడుటలు; వర్ణన సేయన్=నుతియింపఁగా; ఘన లే ఖోత్కర వర్షి తాభ్రతరు రంగ త్కోరక వ్యాపృతిన్ – ఘన=గొప్పవారైన, లేఖ=దేవతలయొక్క,ఉత్కర=సమూహముచేత, వర్షిత=వర్షింపఁ జేయఁబడిన, అభ్రతరు=కల్పవృక్షముయొక్క, రంగత్=ప్రకాశించుచున్న,కోరక=మొగ్గలయొక్క, వ్యాపృతిన్=మేళనము చేత; నిర్భ రానక రవ భ్రశ్య న్మహోడు స్థితిన్—నిర్భర=పరిపూర్ణమగు, ఆనక=పటహముయొక్క,రవ=ధ్వనిచేత, భ్రశ్యత్= జాఱుచున్న, మహోడు=గొప్పనక్షత్రములయొక్క,స్థితిన్=భంగిచే; పొల్చున్=ఒప్పును.
ఈసుచంద్రునియొక్క బాణహతిచే శత్రుమకుటతటఘటితమణులు మిన్నంటి యంతట వ్యాపించి, దేవతలు వర్షించు చున్నకల్పతరుకలికలతోఁ గూడి పుడమి వ్రాలుచు, రణభేరీరవమునకుఁ గూలు రిక్కలగుంపులవలె నొప్పిన వని భావము.
చ. జలజదళాక్షి! యీపతి సు◊చంద్రసమాహ్వయ మెట్లు పూనెనో
తెలియఁగ రాదు ధాత్రిఁ బర◊దేవమనఃప్రమదాపహారి ని
శ్చలకరకాండుఁడై, భువన◊జాతనవోత్సవదాయకోదయో
జ్జ్వలుఁడయి, సద్బుధాప్తుఁడయి ◊సంతతము న్నలువారుచుండఁగన్. 121
టీక: జలజదళాక్షి=చంద్రికా! ధాత్రిన్=భూమియందు; పర దేవ మనఃప్రమ దాపహారి – పర=ఉత్కృష్టమగు, దేవ=దేవతల యొక్క, మనఃప్రమద=మనస్సంతోషమును, అపహారి=హరించువాఁడును; పరదేవ=శత్రురాజులయొక్క, మనఃప్రమదాపహారి అని స్వభావార్థము; నిశ్చలకరకాండుఁడై – నిశ్చల=చలింపని,కర=కిరణములయొక్క,కాండుఁడై=సమూహము గలవాఁడై; నిశ్చలమగు, కర=చేతియందున్న, కాండుఁడై=బాణములుగలవాఁడై యని స్వభావార్థము; భువనజాత నవోత్సవ దాయ కోద యోజ్జ్వలుఁ డయి – భువనజాత=కమలములకు, నవ = నూతనమగు, ఉత్సవ = వికాసరూపోత్సవమును, దాయక= ఇచ్చు చున్న, ఉదయ=ఆవిర్భావముచేత, ఉజ్జ్వలుఁడయి =ప్రకాశించుచున్నవాఁడై; భువనజాత=లోకబృందమునకు, నవోత్సవ= నూతనమగు నుత్సవమును, దాయక=ఇచ్చుచున్న, ఉదయ=అభివృద్ధిచేత, ఉజ్జ్వలుఁడయి అని స్వభావార్థము; సద్బుధా ప్తుఁ డయి – సత్=రిక్కలకు, బుధ=బుధునికి,ఆప్తుఁడయి=ఇష్టుఁడయినవాఁడై; బుధునకు ప్రసిద్ధచంద్రుఁడు విరోధి యనుట బృహజ్జాతకమందు ప్రసిద్ధము. ‘శ్లో||మిత్రే సౌరిసితౌ బుధస్య హిమగు శ్శత్రు స్సమా శ్చాపరే’ అని తత్ప్రమాణము; సత్= శ్రేష్ఠు లైన, బుధ=విద్వాంసులకు, ఆప్తుఁడయి=ఇష్టుఁడయినవాఁడై యని స్వభావార్థము; సంతతమున్=ఎల్లపుడు; నలువారుచుండఁ గన్=ఒప్పుచుండఁగ; ఈపతి=ఈరాజు; సుచంద్రసమాహ్వయము=సుచంద్రుఁడను పేరును; ఎట్లు పూనెనో ఏరీతిఁ బొందెనో; తెలియఁగ రాదు =తెలియదు. అనఁగ నీనరపతి పరదేవుల సంతసమును గూల్చియు, నిశ్చలకరకాండుఁడయ్యును, భువనజా తోత్సవప్రదుఁడయ్యును, సద్బుధాప్తుఁడయ్యును, సుచంద్రుఁడను పేరు నెట్లు పొందెనో తెలియ దని భావము.
ఉ. మానిని! యీనృపాలకర◊మాసుతు సుందరతాలవంబు దా
మానుగ నంది చంద్రుఁ డస◊మానమహస్థితి మిన్ను ముట్టఁగా
నౌనన కేలొకో మధు వ◊హంకృతిచే సుమనోవిరోధమున్
బూని ఘనుల్ గరంపఁ గర◊ము న్వని రూపఱుఁ బెంపు వాయఁగన్. 122
టీక:మానిని=చంద్రికా! ఈనృపాలకరమాసుతు సుందరతా లవంబున్ – ఈనృపాలకరమాసుతు=ఈరాజమన్మథునియొక్క, సుందరతా=సౌందర్యముయొక్క, లవంబున్=లేశమును; చంద్రుఁడు=హిమాంశుఁడు; తాన్=తాను; మానుగన్=మనోజ్ఞ ముగ; అంది=పొంది; అసమానమహస్థితిన్ – అసమాన=నిస్సమానమగు,మహస్థితిన్=తేజస్సుయొక్క స్థితిచేత; మిన్ను ముట్టఁగాన్=విఱ్ఱవీగఁగా, ఆకాశము ముట్టఁగా నని స్వభావార్థము; మధువు=వసంతుఁడు; అహంకృతిచేన్=అహంకారముచేత; ఔననక= ఒప్పుకొనక; ఏలొకో=ఎందుకో; సుమనోవిరోధమున్=విద్వద్విరోధమును, సుమన మనఁగా జాజి, వసంతమందు జాతీపుష్పములు లేవనుట కవిసమయము. అందుచే వసంతుడు సుమనోవిరోధి యని స్వభావార్థము; పూని=పొంది; ఘనుల్= పెద్దలు, మేఘములు; కరంపన్ =అహంకారమును పోఁగొట్టఁగా; వర్షాకాలమందు మేఘము లుదయింపఁగానే వసంతకాలము పోవునని భావము; వనిన్=వనమందు; కరము=మిక్కిలి; పెంపు వాయఁగన్=అతిశయము వీడునట్లు;రూపఱున్=నశించును.
సీ. ఏలోకమిత్రుధా◊మాలోక మరిరాజ, సమ్మోదవర్ధన◊చ్ఛాయ వెలయు,
నేరాజు నెమ్మేని◊తోరంపుసిరి పద్మి,నుల మానగతి నెల్లఁ ◊దలఁగఁ జేయు,
నేసద్గుణాంభోధి◊భాసురదానవై,ఖరి బుధావళి మహో◊త్కంఠఁ గూర్చు,
నేధరోద్ధారువి◊శ్వైషణీయసమాఖ్య, భువనమాలిన్యంబు ◊పొడ వడంచు,
తే. నమ్మహాభావుఁ డీతఁ డో◊యబ్జపత్ర, బాంధవన్నేత్ర! సకలభూ◊భరణశాలి
వీనిపై నీమనం బిప్పు◊డూనఁ జేసి, యతనుసామ్రాజ్యసంలబ్ధి ◊నతిశయిలుము. 123
టీక: ఏలోకమిత్రుధామాలోకము – ఏలోకమిత్రు=జగన్మిత్రుఁడగు నే సుచంద్రునియొక్క, ధామాలోకము=ప్రతాపముయొక్క దీప్తి; అరిరాజసమ్మోదవర్ధనచ్ఛాయన్ – అరిరాజ=శత్రురాజులయొక్క, సమ్మోద=సంతసముయొక్క, వర్ధన=ఛేదనము యొక్క, ఛాయన్=రీతిచేత; వెలయున్=ప్రకాశించునో; ఏలోకమిత్రు=ఏ సూర్యునియొక్క, ధామాలోకము=తేజఃప్రకాశము, అరిరాజ=జక్కవలయొక్క,సమ్మోద=సంతసముయొక్క,వర్ధన=అభివృద్ధియొక్క, ఛాయన్=రీతిచేత; వెలయున్= ప్రకా శించునోయను నర్థము దోఁచుచున్నది; ఏరాజు నెమ్మేనితోరంపుసిరి – ఏరాజు=ఏసుచంద్రునియొక్క, నెమ్మేని=సుందరమగు శరీరముయొక్క,తోరంపు=అధికమగు; సిరి=కాంతి; పద్మినుల మానగతిన్=పద్మినీజాతిస్త్రీలయొక్క యభిమానగతిని; ఎల్లన్=సర్వము; తలఁగఁ జేయున్=పోఁ గొట్టు నో; చంద్రునియొక్క తోరంపుసిరి పద్మలతయొక్క గర్వాతిశయమును పోఁగొట్టు నను నర్థము దోఁచుచున్నది;
ఏసద్గుణాంభోధిభాసురదానవైఖరి – ఏసద్గుణాంభోధి=మంచిగుణములకు సముద్రుఁడగు నే సుచంద్రునియొక్క, భాసుర=ప్రకా శించుచున్న, దాన=త్యాగముయొక్క,వైఖరి=రీతి; బుధావళిమహోత్కంఠన్ – బుధావళి=విద్వద్బృందముయొక్క, మహో త్కంఠన్=అధికమైన సంతోషమును; కూర్చున్=కలుఁగఁజేయునో; భాయుక్తమై, అసుర=రక్కసులయొక్క, దాన=ఖండ నముయొక్క, వైఖరి=రీతి, బుధావళి=దేవతాసమూహమునకు, మహోత్కంఠతను గూర్చు నని గాని ప్రథమార్థము; సద్గుణ =మంచిగుణములుగల, అంభోధి=సముద్రునియొక్క,భా=కాంతియుక్తమగు, సురదాన= అమృతదానముయొక్క, వైఖరి= రీతి, బుధావళి=దేవబృందమునకు, మహోత్కంఠను గూర్చు నను ద్వితీయార్థము స్ఫురించుచున్నది; ఏధరోద్ధారువిశ్వైషణీయసమాఖ్య – ఏధరోద్ధారు=ఏరాజుయొక్క,విశ్వ=లోకమునకు, ఏషణీయ=కోరదగిన,సమాఖ్య= కీర్తి; భువనమాలిన్యంబు – భువన=లోకములయొక్క, మాలిన్యంబు=పాపమును, నైల్యమును; పొడవడంచున్=రూపుమాపునో; ఏధరోద్ధారు=ఏయాదికూర్మముయొక్క, విశ్వైషణీయసమాఖ్య, భువనమాలిన్యంబు=జలమాలిన్యమును, పొడవడంచు నను నర్థము దోఁచుచున్నది; అమ్మహాభావుఁడు=అట్టి గొప్పమనసుగలవాఁడు; ఈతఁడు=ఈసుచంద్రుఁడు; ఓయబ్జపత్రబాంధవన్నేత్ర = ఓతామరపత్రము లకు చుట్టమగు నేత్రములుగలదానా! కమలదళములకు సమానములగు నేత్రములుగలదానా యని తాత్పర్యము, సగోత్రజ్ఞాతి బాంధవాదిశబ్దములు ఇవార్థకము లని యిదివఱలో వ్రాయఁబడి యున్నది; సకలభూభరణశాలి – సకల=సమస్తమగు, భూ= భూమియొక్క, భరణ=భరించుటచేత,శాలి=ప్రకాశించువాఁడు; వీనిపైన్=ఈరాజునందు; నీమనంబు=నీయొక్క మనస్సును; ఇప్పుడు=ఈతఱి; ఊనఁ జేసి=పొందునటులు చేసి; అతనుసామ్రాజ్యసంలబ్ధిన్ – అతను=అధికమగు, సామ్రాజ్య=సమ్రాట్టు తనముయొక్క, సంలబ్ధిన్=ప్రాప్తిచేత; అతను=మన్మథునియొక్క, సామ్రాజ్యసంలబ్ధిచే నని యర్థము దోఁచుచున్నది; అతిశ యిలుము = అత్యుత్కర్షముగా నుండుము.
ఏరాజుయొక్క ప్రతాపము శత్రురాజులయొక్క సంతసమును గూల్చుచున్నదో, ఏరాజుయొక్క సౌందర్యాతిశయము పద్మినీజాతిస్త్రీలయొక్క మానమును తొలఁగఁజేయునో, ఏరాజుయొక్క దానవైఖరి పండితులకు నుత్కంఠకరమగుచున్నదో, ఏరాజుకీర్తి జగన్మాలిన్యమును పోనాడునో అట్టి ప్రసిద్ధిని బొందినవాఁడు వీఁడే గాన వీని వరియించి, యతనుసామ్రాజ్యసుఖము నొందుము అని భావము.
తే. సకలనుత్యకళాశాలి ◊సౌరవంశ, మౌళి నిమ్మేటి వరియింపు ◊మామకోక్తి
నీమనఃపద్మ మామోద◊నిభృతి మీఱ, బింబవిమతోష్ఠి! యింక వి◊లంబ మేల. 124
టీక: సకలనుత్యకళాశాలిన్ – సకల=సమస్తజనులచేత,నుత్య=కొనియాడఁదగిన,కళా=విద్యలచేత,శాలిన్=ప్రకాశించువాఁ డగు; సౌరవంశమౌళిన్ =సూర్యవంశశ్రేష్ఠుఁడగు, ఇమ్మేటిన్=ఈయధికుని; మామకోక్తిన్=నావచనముచేత;నీమనఃపద్మము = నీమనోంబుజము; ఆమోదనిభృతిన్=సంతసము వహించుటచే; మీఱన్=అతిశయించునట్లు; వరియింపు=కోరుము; బింబవిమ తోష్ఠి=దొండపండునకు విరోధి యగు నధరముగలదానా! ఇంకన్=ఇంకను; విలంబ మేల= తడవేల?
వ. అని యాలోకజనని యానతిచ్చిన, నాచంద్రిక తత్సుచంద్రరాజచంద్ర సద్గుణగణశ్రవణసంజాయమాన కౌతూహలయును, దన్మహిపవర్య సౌందర్యలహరీపరివర్తమానలోచనమీనయును, దల్లోకరమణాలోక సముజ్జృంభమాణసాత్త్వికభావ సంభావితయును, దజ్జనేంద్రసమీపస్థితిప్రకార సంఫుల్ల్యమానలజ్జాంకుర యును, దన్మనోనాయక సంవరణసముద్వేగవలమానమానసయును నై, యమ్మహాదేవిముఖంబు గన్గొని తదనుజ్ఞాగౌరవంబున.
టీక: అని=పూర్వోక్తప్రకారముగ; ఆలోకజనని=జగన్మాత యగు నాపార్వతీదేవి; ఆనతిచ్చినన్=సెలవీయఁగా; ఆచంద్రిక; తత్సుచంద్రరాజచంద్ర సద్గుణగణ శ్రవణ సంజాయమాన కౌతూహలయును – తత్సుచంద్రరాజచంద్ర =రాజశ్రేష్ఠుఁడగు నా సుచంద్రునియొక్క, సద్గుణగణ=సుగుణబృందముయొక్క, శ్రవణ=వినుటవలన,సంజాయమాన=పుట్టిన, కౌతూహలయును =సంతసము గలదియు; తన్మహిపవర్య సౌందర్యలహరీ పరివర్తమాన లోచనమీనయును – తన్మహిపవర్య=ఆరాజశ్రేష్ఠుని యొక్క, సౌందర్యలహరీ=చక్కఁదనమను ప్రవాహమందు, పరివర్తమాన=తిరుగుచున్న, లోచనమీనయును=కన్నులను చేఁపలు గలదియును; తల్లోకరమ ణాలోక సముజ్జృంభమాణ సాత్త్వికభావ సంభావితయును – తల్లోకరమణ=ఆరాజుయొక్క, ఆలోక=దర్శనముచేత, సముజ్జృంభమాణ=ఉప్పొంగుచున్న,సాత్త్వికభావ=సాత్త్వికభావములచేత,సంభావితయును= సంభా వింపఁబడినదియును, సాత్త్వికభావము లనఁగా నాయికానాయకులయొక్క పరస్పరదర్శన స్పర్శనాదులచే నుదయించు స్తంభాదులు, అవి, ‘శ్లో. తే స్తమ్భ స్వేద రోమాఞ్చా స్స్వరభేద శ్చ వేపథుః| వైవర్ణ్య మశ్రు ప్రళయా వి త్యష్టౌ పరికీర్తితాః’ అని సింగ భూపాలీయములోఁ జెప్పఁబడియున్నవి; తజ్జనేంద్ర సమీపస్థితి ప్రకార సంఫుల్ల్యమాన లజ్జాంకురయును – తజ్జనేంద్ర= ఆరాజేం ద్రునియొక్క, సమీపస్థితి=సమీపమునందుండుటయొక్క, ప్రకార=రీతిచేత, సంఫుల్ల్యమాన=వికసించిన, లజ్జాంకుర యును = సిగ్గుమొలకలు గలిగినదియును; తన్మనోనాయక సంవరణ సముద్వేగ వలమాన మానసయును – తన్మనోనాయక =ఆసుచం ద్రునియొక్క, సంవరణ=వరియించుటవలన నయిన, సముద్వేగ=అవ్యవస్థితచిత్తతచేత, వలమాన=కదలుచున్న, మానసయును=చిత్తము గలదియును; ఐ=అయినదియై; ఆమ్మహాదేవిముఖంబు=ఆపార్వతీదేవిముఖమును; కన్గొని=చూచి; తదనుజ్ఞాగౌరవంబునన్=ఆపార్వతీదేవియొక్క ఆజ్ఞాగౌరవముచేత, దీని కుత్తరపద్యముతో నన్వయము.